21, ఫిబ్రవరి 2007, బుధవారం

బిల్ గేట్స్ ఇండియా పర్యటన



బిల్ గేట్స్ ఇండియాలోని టెక్నాలజీ గురించి, సాప్ట్ వేర్ అభివృద్దిని గురించి తెలుసుకోవడం కోసం నాలుగు రోజుల పర్యటనపై ఇండియా బయలుదేరాడు. బెంగుళూరుకి ఫ్లైటులో చేరుకుని కారులో హోటల్ కి బయలుదేరమన్నాడు డ్రైవర్ ని… సెక్రటరీ చిన్న నవ్వు నవ్వి.. సార్ ఇక్కడి నుండి టెక్నాలజీ మీట్ సమావేశానికి వెళిపోతున్నాం అన్నాడు. అదేంటి అది ఇంకా నాలుగు గంటల తరువాత కదా ఇప్పట్నుండి ఎందుకు, ఏంటి అంతదూరం ఉంటుందా మనం వెళ్ళవలసింది ? అన్నాడు అమాయకంగా బిల్ గేట్స్ . బెంగుళూరులో ఇంతే సార్.. ట్రాఫిక్ జామ్ ఇప్పుడు బయలుదేరితే ఆ సమయానికి చేరుకుంటాం అన్నాడు.

డ్రైవర్ మిర్రర్ లో బిల్ గేట్స్ అమాయకపు మొహం చూస్తూ… బెంగుళూరుకి కొత్త అనుకుంట పాపం… అని ముసిముసిగా నవ్వుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. డ్రైవర్. దిగి.. సార్ నేను ఒక అరగంట అలా ఇలా తిరిగి వస్తాను… మీరు వస్తారా? అని అడిగాడు.. హా.. … ఏంటి అంటే అరగంట వరకూ ఇక్కడనుండి కదలలేమా. అని నోరెళ్ళబెట్టాడు. ఇది మాములే సార్ పదండి వెళదాం అక్కడ రోడ్డుప్రక్కన దోశలు వేస్తారు చాలా బాగుంటాయి అని ఆహ్వానించాడు సెక్రటరీ.

అలా నడుస్తూ వెళ్ళి దోశలు ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడ చూసినా జనం రోడ్డు ప్రక్కన లాప్ టాప్ ల్లో మొహాలు పెట్టి సీరియస్ గా ఎదో చేసేస్తున్నారు.. ఏంటిది.. ఇంత డవలెప్ మెంట్ ఉందా ఐటికి అని అడిగాడు సెక్రటరీనీ. అవునుసార్ వీళ్ళంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లు సార్. సాయంత్రం నైట్ షిప్ట్ కోసం పొద్దున్నే బయలుదేరిపోతారిలా ఆఫీసుకు.. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ లా , వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ జామ్స్ అన్న మాట. అని చెప్పాడు సెక్రటరీ.. అవును నిజమే ఎటుచూసినా సాప్ట్ వేర్ ఇంజనీరులే కనిపిస్తున్నారు.. అయితే మన ఈ ఐటి కి ఇక్కడ మంచి పేరుందిలా ఉందే అన్నాడు గర్వంగా.

అవునండీ ఒక సంవత్సరం క్రితం చెప్పుకునేవారు బెంగుళూరులో ఒక రాయి విసిరితే అయితే కుక్కకి లేదా సాప్ట్ వేర్ ఇంజనీరుకి తగులుతుంది అని.. కాని ఇప్పుడు రాయివేస్తే కచ్ఛితంగా సాప్ట్ వేర్ ఇంజనీరుకు తగులుతుంది అంటున్నారు అంతా.. నేనూ ఇప్పుడు అది నిజం అని నమ్ముతాను సార్ అన్నాడు సెక్రటరీ నవ్వుతూ.

కాసేపటికి ట్రాఫిక్ కదలడం మొదలయ్యింది.. హమ్మయ్యా అనుకుంటూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి

వేలమంది జనం లైన్లలో నిలబడి ఉన్నారు ఒకచోట… ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుందయ్యో ఆ జనం అది చూస్తే నాకు భయంగా ఉంది అన్నాడు బిల్ గేట్స్, డ్రైవర్ ని వేరే రూట్ నుండి పోనివ్వమని చెప్పు అన్నాడు సెక్రటరీతో. కాదు సార్ అది జాబ్ ఫేయిర్. వీళ్ళంతా మన రేపటి ఐటి పౌరులు సార్.. అదిగో చూడండి… అక్కడ టెక్నాలజీ కి తగ్గట్టుగా లైను కట్టారు… , సార్ మనలో మన మాట.. జావాలైనుకన్నా మన టెక్నాలజీస్ లైనే పెద్దదిగా ఉంది సార్… ఇక నుండి మనం ఏ కొత్త టెక్నాలజీ రిలీజ్ చేసినా ఆన్ లైన్ ఫోరమ్స్ , ఒపినీయన్ పోల్స్ వేస్ట్ సార్ ఇక్కడ లైను పొడవు చూస్తే చెప్పొచ్చు సార్ హిట్టో ప్లాపో.., అని పొంగిపోతూ చెప్పాడు సెక్రటరీ.

రూటుమార్చి ప్రక్క రోడ్డునుండి ఎలాగైతే టైముకు సమావేశానికి చేరుకున్నారు. బిల్ గేట్స్ భావోద్వేగంతో బెంగుళూరుని... ఇండియాని పొగిడేసి త్వరలో భారతదేశానికి వస్తున్న కొత్త ప్రాజెక్టులు, పధకాల గురించి పెద్ద వ్యాసం చదివేసాడు.

సాయత్రం హైదరాబాదుకు వెళదాం, ఎవరినీ కలిసేది లేదు కానీ, ఒక సామాన్య వ్యక్తిలా తిరుగుదాం.. అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం పద, అని ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు.

హైటెక్ సిటీ ఆ ప్రదేశాలు తిరిగి తిరిగి.. చాలా మారిపోయింది.. అంతా మన ఐటి చలవే అని ఆనందపడిపోయాడు..

సరే అమీర్ పేట్ వెళదాం అక్కడ ఐటి చాలా ఫేమస్ అంట కదా అని బయలుదేరారు.

అమీర్ పేట్ సెంటరుకి చేరుకునేసరికి డ్రైవరు సార్ ఈ సందులోకే మనం వెళ్ళాలి సార్ కానీ కారు వెళ్ళదు అన్నాడు.

ఏ.. ఇరుకు సందా? లేక రోడ్ బాగోదా అని అడిగాడు సెక్రటరీ డ్రైవరును. కాదు సార్ అటు చూడండి అని ఆ సందు దగ్గరగా కారు ఆపి చూపించాడు. రోడ్డంతా పాంపెట్లతోటీ నిండి పోయింది. పైన ఎడ్వర్టైజుమెంట్ బ్యానర్ల తలకి తగిలేలా కట్టేసి ఉన్నాయి ఎటుచూసినా..

ఏంటయ్యా ఇది అని అడిగాడు సెక్రటరీని.. సార్ ఇక్కడ అన్నీ ఐటి ఇన్స్టి ట్యూట్స్ ఉంటాయి, మనం రిలీజ్ చేసిన ఏ ప్రొడక్ట్ , సాఫ్ట్ వేర్ అయినా వారంరోజుల్లో ఇక్కడ కోర్సు చెప్పడం మొదలుపెట్టేస్తారు సార్.. చెప్పాడు సెక్రటరీ.. ఓహో ఐతే మంచిదే కదా.. అంటూనే అక్కడ ఉన్న బ్యానర్ చూసి ఆశ్చర్యపోయాడు.. జావా రెండువేలకే.దానితో సీక్వెల్ సెర్వర్ ఫ్రీ… అని రాసిఉంది.. "హా..!! ఏంటి మన డాటాబేస్ ఫ్రీ నా…!", పోనీలే మన ప్రోడక్ట్ కి ప్రొమోషన్లా ఉంటుంది.. ", అని సరిపెట్టుకుంటుండగా… మైక్రోసాప్ట్ డాట్నెట్ 2.0 ఒక గంటలో.. పదిహేనేళ్ళ అనుభవం గల అప్పారావు చే… లిమిటెడ్ సీట్స్, త్వరపడండి.. ఫిజు.. 20 రూపాయలు మాత్రమే అని రాసున్న మరో బ్యానర్ చూసేసరికి బిల్ గేట్స్ కి కళ్ళుతిరిగినంత పనయ్యింది.. బాబోయ్.. ఏంటి గంటలో చెప్పేస్తారా?, ఇంజక్షన్ లాంటిది ఏమన్నా కనిపెట్టుంటారయ్యా ఈ హైదరాబాద్ వాళ్ళు.. వెళ్ళగానే సిరంజిలో డాట్నెట్ ఎక్కించేసి పొడిచేస్తారేమో… లేకపోతే ఒకగంటలో ఎలా చెప్తారంటావ్.. అయినా అతని అనుభవం చూడు పదిహేనేళ్ళంట.. డాట్నెట్ వచ్చి నాలుగేళ్ళు కూడా అయ్యిండదూ.. పదిహేనేళ్ళంటే అప్పటికి నేను కంప్యూటరు కూడా పట్టుండను.. హ హ అని నవ్వుకున్నాడు బిల్ గేట్స్. సరే సార్ ఒక్కసారి క్లాసుకెళదాం ఎలా చెప్తారో అని క్లాసుకెళ్ళి విని వచ్చారు.


సాయంత్రానికి అంతా తిరిగి తిరిగి ఒక హోటల్ రూమ్ కి చేరుకున్నారు. తరువాత రోజు ప్లాన్స్ ఏంటో అడిగాడు సెక్రటరీని బిల్ గేట్స్. రేపు మళ్ళీ బెంగుళూరు వెళ్ళాల్సిరావొచ్చు సార్. మన విండోస్ విస్టా అఫీషియల్ రిలీజ్ ఇన్ ఇండియా సార్ అన్నాడు.. ఉలిక్కిపడ్డ బిల్ గేట్స్ వద్దులేవయ్యా మళ్ళీ బెంగుళూరు ఎందుకులే ఎవరొకరు అది చేసేస్తారులే ముంబయి నగరాన్ని చూడాలనుంది సరదాగా అలా తిరిగొద్దాం ఇక ఇండియా టెక్నాలజీ చూసుకో అక్కర్లేదు ఎలాగూ ఇప్పటివరకూ చూసాం కదా అని అన్నాడు నవ్వుతూ. సరే అన్నాడు సెక్రటరీ.

తరువాత రోజు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర్లో ఉన్న ప్రాంతాలన్నీ కాలినడకతో తిరుగుతున్నారు.

అలా వెళుతుండగా అక్కడ ఒక చోట సీడీలు అమ్మే దుకాణంలో ఒక సీడీని చూసిన బిల్ గేట్స్ కళ్ళుతిరిగి కిందపడ్డాడు.

అక్కడ ఏం చూసారు సార్ అని సెక్రటరీ చూడగా ఏ సీడీ అయినా ఏభై రూపాయలు అని ఉన్న చోట, విండోస్ విస్టా సీడీని చూసి కళ్ళుతేలేసి నోరు తెరిచాడు సెక్రటరీ.

------------------------------------------------------------

ఒక కల్పిత వ్యంగ్య రచన. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యముతో కాదు (కులదైవం బిల్ గేట్స్ ని అసలే కాదు)

12, ఫిబ్రవరి 2007, సోమవారం

తేనెలొలుకు తెలుగు… మా పాట

ఇంటర్నెట్ విప్లవంతో నా కలలు కొన్ని నిజంచేసుకోగలిగాను. ఒకప్పుడు.. ఇంగ్లీషులో రాసి రాసి.. చిరాకు పుట్టి.. తెలుగులో రాసే అవకాశం ఈ ఇంటర్నెట్ కి ఎప్పుడొస్తుందా అనుకున్న నాకు అది ఇప్పుడు చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా బ్లాగులో కధలు, నా అనుభవాలు రాసి.. స్నేహితులకు పంచుకున్న తీపిగురుతులు నిజంగా చాలా ఆనందాన్నిస్తున్నాయి. ఆర్కుట్ పుణ్యమా అని పరిచయమైన ఒక స్నేహితుని సహాయంతో నాకున్న పాటలు రాసే అభిరుచిని కూడా మెరుగుపర్చుకున్నాను.

మేమే నమ్మలేని విధంగా ఇప్పటికి 20 తెలుగు పాటలు చేయగలిగాము. అదీ ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా.. అంతా చాటింగ్లో మాట్లాడుకుంటూ.. మార్పులూ చేర్పులూ చేస్తూ.., కొంతమంది దగ్గర అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నాము.

ఈ పాటలు ఎవరికోసము కాదు.. మాకుమేం విని ఆనందిస్తున్నాము ప్రస్తుతానికి. కొన్ని ఆశయాలు ఉన్నా అవి అచరనలోకి వచ్చే సరికి కాస్త సమయం పట్టవచ్చు.

ఈ తెలుగు బ్లాగరుల గుంపులో సభ్యత్వం, మిత్రుల అభిప్రాయాలు చదువుతూ ఉంటుంటే నాకు ఈ హిందీ రాజ్యంలో ఉన్నా తెలుగుదేశంలోనే ఉన్నట్లనిపిస్తుంది. ఈ మహత్కార్యాన్ని అంకురార్పన చేసిన మిత్రులకు.. దానిని విజయవంతం చేసిన వారికీ నా కృతఘ్ఞతలు.

నా ఇరవయ్యో పాటగా.. తెలుగు భాషపై చూపుతున్న చిన్నచూపుపై వేదనను వ్యక్తంచేస్తూ చెయ్యడం జరిగింది. ఈ పాటను మన తెలుగు బ్లాగరుల గుంపుకు అంకితమిస్తున్నాను. ఈ పాటవిని దీనిపై అభిప్రాయమును తెలియపరుచగలరు.

సాహిత్య పరంగా ఆభిప్రాయమును తెలియపరిచినచో నేను అవి మెరుగుపర్చుకొనుటకు ప్రయత్నించగలను. సంగీతపరంగా తెలిసినవారు కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు.

ఇక పాట గురించి:

సాహిత్యం : నా సొంతము
కూర్పు, సంగీతం, గానం: శ్రవణ్ కుమార్.

ఇది గానం పరంగా అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పాటలు పాడే కళ వేరు. కానీ పాట ఇలా ఉంటుంది అని చెప్పడంకోసం ఎవరొకరు పాడాలి కాబట్టి.. శ్రవణ్ పాడిన పాట ఇది. ఎవరైనా మంచి గాయకులు దొరికితే.. తప్పకుండా మళ్ళీ పాడించడానికి ప్రయత్నిస్తాము. ఆశక్తి కలవారు నాకు తెలుపగలరు.

మా ఈ మహత్కార్యంలో పాలుపంచుకుని సహకరించిన (సహకరిస్తున్న) శ్రీనివాసరాజు దాట్ల గారికి, రామనాధరెడ్డి గారికి

ప్రత్యేకంగా కృతఘ్ఞతలు చెప్పుకుంటున్నాము.


ఈ పాటను ఇక్కడ వినగలరు.(డౌన్ లోడ్ సౌకర్యం కలదు)

Telugu Lessa.mp3



ఇక్కడ నుండి డౌనులోడ్ చేసుకోండి

మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి.

Related Posts Plugin for WordPress, Blogger...