20, జూన్ 2009, శనివారం

నాన్నమ్మ...



ఇంటికి.. ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుతూ ఉంటా."అమ్మా.. మామ ఎలా ఉందే!!",
అని., మామ అంటె మా నాన్నమ్మ..., ఏడుగురు సంతానం మా నానమ్మకి...
నలుగురు మగవాళ్ళు.. ముగ్గురు ఆడపిల్లలూ... అంతా మాఊరిలోనే ఉంటారు...,
మాదొక అరవై కుటుంబాలుండే ఒక చిన్నఊరు... అందులో సగం మా నానమ్మ
కుటుంబం వాళ్ళే కాబట్టి... ఊరంతా మా చుట్టాలే... మా నాన్నగారు మా నానమ్మకి
ఆఖరు సంతానం... నాకు తెలిసినప్పుడు నుండి నానమ్మ మాతొనే ఉంటుంది.
నానమ్మకి మా నాన్న, అమ్మఅంటే.. చాలా ఇష్టం... నేనంటే ఇంకా ఇష్టం..

నా చిన్నప్పటినుండి నన్ను బాగా చూసుకునేది. అమ్మకొట్టినా.. తిట్టినా అడ్డొచ్చి
గారాభంచేసేది, ఇప్పుడంటే వందేళ్ళు దాటిపోయి ఒంగిపోయింది.. పనులేమి
చెయ్యటంలేదు.. కానీ...నా చిన్నప్పుడైతే బోలెడు పనులు చేసేది...
పొద్దున్నే ఆరింటికల్లా అరుగు చివర ఒక పీటవేసుకుని...మజ్జిగ చిలకడం మొదలుపెట్టేది...
నేను నా చిన్నపీట వేసుకుని కూర్చుని... చూస్తూ ఉండేవాడిని..."నెనూ చిలుకుతా",
అని చేతిలోంచి లాక్కుని ప్రయత్నించేవాడిని కానీ.. నాకు కుదిరేది కాదు...,
మజ్జిగ చిలకగా వచ్చిన వెన్నను ముద్దగా చేసి నాకు తినిపించేది..

నాకు వెన్నంటే ఇష్టమేకానీ ఎందుకో తినను.. అని మారాం చేసేవాడిని...
చేతికి అంటిన వెన్నను.. కాళ్ళకు చేతులుకూ బలవంతంగా రాసేది...,
మా నాన్నమ్మచేసే పనులన్నిటినీ దగ్గరగా పరిక్షించేవాడిని..., ప్రశ్నలువేసి
తినేసేవాడిని... ఏమడిగినా విసుక్కోకుండా... చాలా ఓపికగా వివరించి చెప్పేది..,
ఉగాది పండుగ వస్తే వేపకొమ్మలనుండి వేపపువ్వుకోయ్యటం...,
దీపావళికి దీపాలలో వేసేందుకు ఒత్తులు చెయ్యటం...,

ఆడపిల్లలందరికీ గోరింటాకు రుబ్బి.. పంచిపెట్టడం, గోంగూర కాడలకు ఒత్తులు కట్టి
వెలిగించడంలాంటి పద్దతులన్నీ ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యలో అందరికీ
వివరంగా చెప్పేది... అంతేకాదు...మా ఊరందరికీ మానాన్నమ్మ అంటే చాలా గౌరవం.
ఊళ్ళో ఎవరికి పిల్లలు పుట్టినా మామ్మ దగ్గరకు తీసుకొచ్చి చూపించి వెళ్ళేవారు...,
దీవించమని అడిగేవారు... దిష్టి తగలకుండా తలవెంట్రుకలతో చేసిన తాడు..
స్వయంగా దగ్గరుండి చేయించుకుని కట్టి, పిల్లల్ని తీసుకెళ్ళేవారు...

వేసవికాలం వస్తే..., మా చుట్టాలంతా... ఆవకాయ పెట్టే పనుల్లో మునిగిపోయేవారు...
మాకు సెలవులు కావడంతో మేం పరిక్షగా ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తుండే వాళ్ళం...

అక్కడ మా నాన్నమ్మే, ఆవకాయలో... ఏ వస్తువు ఎంత కలపాలో.., ఎలా కలపాలో
దగ్గరుండి చేసేది..., మొత్తం చుట్టాలందరికీ ఆవకాయ పెట్టడం అయ్యేసరికి...
మాకు మా నానమ్మకి ఒక పదిహేనురోజులు కాలయాపన సరిపోయేది...

ఇప్పుడు పరిస్ధితి వేరు...,
మనవలు... మునిమనవలు.. మనవరాళ్ళు అందరి పెళ్ళిళ్ళూ..
చూసిన కళ్ళు కనిపించడం మానేసాయి..., పదిమంది పనులలో వెన్నుదన్నుగా ఉన్న
నానమ్మ... ఒంగిపోయి..నడవలేక మంచానపడింది... వయసుతో పాటు చాదస్తం,
భయం వచ్చాయి...

ఎవరన్నా ఏదైనా తినటానికి పెడితే పొట్లాలు కట్టి దాచిపెడుతుంది...
మా అక్క,అన్నయ్య వాళ్ళ పిల్లలొస్తే..., ప్రక్కన కూర్చోబెట్టుకుని...
దాచిన పొట్లాలుతీసి పెడుతుంది..., ఆ వీధివిషయాలు.. ఈ వీధి విషయాలు
అడుగుతుంది..., వాళ్ళెలా ఉన్నారు.. వీళ్ళేంచేస్తున్నారు...
అని చాదస్తంగా నాలుగైదుసార్లు అడిగేసరికి... పిల్లలు... "ఈ ముసలిదానికి
చెప్పలేక చస్తున్నాం... బుర్రతినేస్తుంది...", అని అంటే..., వాళ్ళ మద్దుమాటలకు
నవ్వేస్తుంది..., కోపమొస్తే... "వెళ్ళు అవతలికి... చెప్తే అరిగిపోతావా!",
అని మాట్లాడటం మానేస్తుంది...

అది చూస్తే నాకు అనిపించేది... మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు..
అడిగే ప్రశ్నలకు పెద్దవాళ్ళు ఓపికగా... సమాధానాలు చెబుతారు..
వయసు పైబడ్డాకా వాళ్ళు చిన్నవాళ్ళయ్యి...,అడిగే ప్రశ్నలకు...
పిల్లలేకాదు..., పెద్దలకే... విసుగుపుట్టిస్తాయి అని...,

వయసు పెరిగి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినవాళ్ళు చిన్నపిల్లలే అవుతారు...
వాళ్ళచేష్టలు.., అలవాట్లు... భయాలు అన్నీ చిన్నపిల్లలకంటే...
ఎక్కువగా అనిపిస్తాయి...

నేను చదువు పూర్తిచేసి.. ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాననుకుంట...
ఒక పదిరోజులు ఇంటికి వెళ్ళాను... కాసేపు అవి ఇవి అడిగింది నానమ్మ...
చెప్పాను ఇలా ఉంటుంది అక్కడ.. నలుగురు కలిసి ఉంటాం..
వంటచేసుకుని తింటాం... అని.., "జాగ్రత్తమ్మా... రాత్రిళ్ళు...
తలుపులు అవి గడియపెట్టుకోవాలి.. దొంగలు అవి వస్తారంట అక్కడ...
టీవీలో చెప్తుంటాడు..", అని అంది.. నేను మనసులో నవ్వుకుని..
"మేం జాగ్రత్తగానే ఉంటాం మామా.. నువ్వేం కంగారుపడకు... నలుగురం క
లిసే ఉంటాం కదా!!, పర్వాలేదు..", అని చెప్పాను...,

మరి నీకు డబ్బులు అవి నాన్న పంపిస్తున్నాడా!, సరిపోతున్నాయా?,
ఒక వందరూపాయలు సరిపోవమ్మా నెలకు??", అని అడిగింది...,
నేను నవ్వుకుని.. "వంద ఎక్కడ సరిపోతాయే... ఒక పదిహేనువందలు దాకా
అవుతాయి నెలకు", అన్నాను...

అమ్మో..., పదిహేనొందలే...!, అవునులే.. రేట్లు అన్ని పెరిగిపోయాయి
కదా..., అయినా పర్లేదు..., కావాలంటే నాన్నను అడుగు...,
నాన్న అప్పుచేసైనా ఇస్తాడు..., ఉద్యోగం కోసం తప్పదు మరి..., తిండి సరిగా తిను...,
ఆరోగ్యం పాడవుతుంది లేకపోతే...", అని సలహా చెప్పింది..., సరే అన్నాను...

అలా మాట్లాడుతూ... అలవాటు ప్రకారం... ఏడింటికే నిద్రపోయింది...,
నాకూ నిద్రపట్టేసింది..., పదకొండు అయ్యిందనుకుంట.. నన్ను ఎవరో
తట్టిలేపుతున్నట్లు అనిపించి లేచాను..., నానమ్మ నాపక్కగా వచ్చి కూర్చుంది...,
ఒరే... నన్ను చంపేస్తావా??, అని అమాయకంగా అడిగింది..
నిద్రలో ఉన్ననాకు ఆ మాటలు సరిగా అర్ధంకాలేదు... ఏంటే.. అని మళ్ళీ అడిగాను..

నన్ను చంపేయకురా..., మీ నాన్న దగ్గర ఉంటూ... భరువైపోయానురా...,
నీ డబ్బులు తింటూ ఉన్నాను..., నన్ను మీ నాన్న చూస్తున్నందుకు నన్ను చంపేస్తావా!,
అని అమాయకంగా అడిగింది..

నాకు మాటలు రాలేదు.. చాలా బాధకలిగింది... ఏంటి ఇలా ఆలోచిస్తుంది అని...,
ఆమె.. అమాయకత్వాన్ని అర్ధంచేసుకున్నాను...

ఏమీ లేదు మామా... , నువ్వంటే నాకూ ఇష్టమేనే... మా నాన్న బాధ్యతగా నిన్ను
చూస్తున్నారు.. నేనేమి నా డబ్బులతోనిన్ను పోషించడంలేదు కదా!,
అలా ఎందుకు అనుకుంటున్నావు..?, నువ్వు ఎవ్వరికీ భరువుకాదే...,
నీకేదికావాలన్నా అడిగి తిను..., ఎవరూ నిన్ను చూడకపోవటం ఉండదు...,
అలా ఏమీ అనుకోకు... పడుకో.. అని సర్దిచెప్పాను...,మళ్ళీ చిన్నపిల్లలకు సర్దిచెబితే...
చెప్పినమాట వని పడుకున్నట్లు... వెళ్ళి పడుకుంది...

తరువాత రోజు మా అమ్మకు ఈ విషయం చెప్పాను... అవిడ అంతే ఈ మధ్య
ఎదేదో మాట్లాడుతున్నారు.. నువ్వవి పట్టించుకుని ఏమీ అనుకోకు...
నన్ను అలానే అంటున్నారు..., అని ఆరోజు కాస్తవివరంగా ఇద్దరం
మా నానమ్మకి చెప్పాం... అలాంటి అలోచనలు ఏమీ పెట్టుకోకూడదు...,
ఈ వయసులో.. ఏమీ అలోచించకుండా... చక్కగా దేవుణ్ని తలచుకుంటూ...
ప్రార్ధనచేసుకుంటూ,అన్నీ మరచిపోవాలని.. సరే అంది నానమ్మ...


అత్తా కోడళ్ళంటే.. ఇలానే ఉంటారు... పైకొకటి.. లోపలొకటి... మాట్లాడుతూ,
ఎప్పడూ తిట్టుకుంటూ...ఒకరినొకరు.. ధ్వేషించుకుంటూ ఉంటారు..
అనేది నేను సినిమాల్లోనూ, కధల్లోనూ, బయటకూడా చాలా చూసాను...

మా ఇంట్లో మా అమ్మా.. నానమ్మా... అలాకాదు..., ఒక తల్లీ కూతుల్లా ఉంటారు...
మా అమ్మ ఎప్పుడు మా నానమ్మని గౌరవించేది.. ఆమె మాట వినేది...,
మా నానమ్మకూడా అంతే.. ఎప్పుడూ సాధించేది కాదు... అత్తగారిని నేను చెప్పినట్లు వినాలి
అని అన్నట్లు ప్రవర్తించేది కాదు... , మంచాన పడిన తరువాత కూడా...
మా నానమ్మ చాదస్తం చూసి.. సెలవులకో.. కాళీదొరికినపుడో...
ఊరికి వెళ్ళేవాడిని నాకే.. కాస్త విసుగు పుట్టేది... పోనీలే ఆవిడను ఏమీ అనకు
అని.. మా అమ్మ నాకు చెప్పేది...

మా చిన్నప్పుడు ఎవరినైనా.. నువ్వు అని పిలిస్తే... తప్పు అలా పిలవకూడదు
పెద్దవాళ్ళను.. మీరు అనాలి, అని మా అమ్మచెప్పేది... అలానే నేర్పించింది...,
తరువాత... అందరినీ మీరు అని పిలవటమే నాకు అలవాటయ్యింది...,
మా నాన్నమ్మను అమ్మ గౌరవంగా చూడబట్టే నాకూ పెద్దలను గౌరవించాలి అనే విషయం
బోధపడి ఉంటుంది..., ఇవన్నీ మనకు మనం చేసుకుంటేనే...
మనకూ అలానే జరుగుతుంది!, నేనైనా రేపు అంతే... నా తల్లిదండ్రులను బాగా
చూసుకుంటేనే... నా పిల్లలు కూడా నన్ను చూసేది...?

నాకు ఉద్యోగం లేక... డబ్బులులేని టైములో... నా చేతికి వందో
రెండొందలో ఇచ్చి నానమ్మకు ఇవ్వమనేది... మా అమ్మ, అది చూసి నానమ్మ పొంగిపోయేది...
మా మనవడు నాకు డబ్బులిచ్చాడు అని అదరికీ చెప్పుకునేది...,

అలానే నాకు తెలియకుండా కూడా మా అమ్మ బట్టలు కొని నేను కొన్నట్లుగా
ఇచ్చేది నానమ్మకి... అపుడు అర్ధంఅయ్యేది... వాళ్ళకున్నఅన్యోన్యత...,
మా నాన్నకూడా అంతే... మాకు ఎంత చేసినా... ఆరోగ్యాలు ఎలాగూ నీలా అవ్వవులే...
నీ అరోగ్యం, నీ ఆయుష్షు మంచివి..., అని మా నానమ్మకు ఆరోగ్య విషయంలో
చాలా జాగ్రత్తగా చూసుకున్నారు...

కనిపించడం మానేసిన కళ్ళు.. సూన్యంలో కలిసిపోయాయి...
అందరి బాగోగులు తెలుసుకుంటూ...,అందరి బాగు కోరుకుంటూనే...,
ఎవరికీ భారం కాకుండా... ఎవరిచేత మాట పడకుండా...,
కల్ముషమెరుగని మనసుతో.. ఎలాగైతే... పుట్టిందో.. ఆఖరి క్షణాలలో...
మరలా.. చిన్నపిల్లగా మారి... అలానే ఆనందంగా... నానమ్మ వెళ్ళిపోయింది...

మాలో చిరకాలం ఉండిపోయేలా..., మంచి బుద్దులనూ,సంస్కారాలను... నేర్పి..
మాలో.. అవి తీయని జ్ఞాపకాలుగా విడిచిపెట్టింది...

ఎటువంటివారికైనా తప్పనిది... వృద్దాప్యం... మిగతా జీవితంమంతా ఎంత దర్జాగా...,
ఎంత హొదాతో...అడుగులకు మడుగులెత్తించుకుని.. ఎలా బ్రతికామన్నదానికన్నా..
చివరిక్షణాలలో ఏ బాధలూ తెలియకుండా నా అన్నవాళ్ళ నలుగురి చేతులమీదుగా...
ఆనందంగా వెళ్ళిపోతే.. దానికన్నా జీవితానికి ఇంకేంకావాలి?

నానమ్మలు.. అమ్మమ్మలు.. తాతయ్యలూ... వీళ్ళంతా ఒకప్పుడు మనలాంటివాళ్ళే...
పాతతరపు పద్దతులూ..., మంచిచెడులను.. మన రాబోయే తరాలకు పరిచయంచేస్తూ...,
మన వెన్నంటే ఉంటూ.. మనమేలుకోరే... గురువులు...

వాళ్ళు మనకెప్పుడు భారం కారు..., కాకూడదు...!!

Related Posts Plugin for WordPress, Blogger...