24, నవంబర్ 2009, మంగళవారం

రిషెషన్ ఎఫెక్టు...



అందరూ దిగాలుగా... మీటింగ్ హాల్ నుండి.. బయటకు వచ్చారు..., ఈ సంవత్సరం జరగాల్సిన
appraisals ఇక లేవని... రిషెషన్ వలన తమ బిజినెస్ చాలా దెబ్బతిందని..., త్వరలోనే
cost cutting పేరుతో.. కొంతమందిని తీసే అవకాశం కూడా ఉందని.. డైరెక్టుగా...
HR మీటింగులో చెప్పేయటంతో అందరి మొహాల్లోనూ టెన్సన్ మొదలయ్యింది...
చంటికి ఏమీ తోచడంలేదు..., ఇంకొక వారంలో జీతం పెరుగబోతుందని...,
తరువాత నెలలో ఒక పదిహేనువేలు వరకూ జీతం ఎక్కువ వస్తుందని... ముందుగానే
ఒక మూడు లక్షలకి.. personal loan పెట్టేసి... నిజాంపేట రోడ్డులో ఒక
టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి బుక్ చేసేసాడు..., ఒక రెండువేలు పెట్టి.. కొలీగ్సందరికీ
పార్టీకూడా చేసేసాడు... ఇప్పుడు... ఉద్యోగం అటుఇటుగానీ అయితే...,
ఇంకేమన్నా ఉందా!,తలుచుకుంటేనే... తలనుండి కాళ్ళవరకూ ఒణుకు పుట్టింది...

ఆఫీసు గేటుబయట.. చాయ్ బండి దగ్గర కలిసి ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటున్నారు,
షేర్ మార్కెట్ పతనం గురించి ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా వాళ్ళకు తెలిసినవి చెప్పేసారు..,
ఇలా అయితే... మ్యూచువల్ ఫండ్సంటూ కట్టిన డబ్బు ఇప్పుడు తీసినా...
సగం కూడా రాదన్నమాట అని మనసులో అనుకున్నాడు చంటి...

కాలం గడిచింది...
తన కంపెనీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.., రెస్ట్ రూమ్లో.. చేతులు తుడుచుకునే
పేపర్ టవల్స్ దగ్గరనుండి... ప్రతి డెస్క్ దగ్గర పెట్టే వాటర్ బాటిల్స్ వరకూ అన్ని వసతులు
తీసేసారు.. ఇరవైరూపాయలతో ఇచ్చే లంచ్ కాస్తా తగ్గింపు లేకుండా నలభైరూపాయలు
చేసేసారు..., పదిమందికి నలుగురు అన్నట్లు.. ఖాలీగా బెంచ్ పై మూలుగుతున్న
వాళ్ళందరికీ వాలంటరీ రిటైర్మెంటులాగా.. ఒక నెల జీతం ఇచ్చేసి.. ఇంటికి పంపించేసారు.,
చంటికి అదృష్టం సపోర్ట్ ఫ్రోజెక్ట్ రూపంలో కలిసొచ్చి.. తృటిలో తప్పించుకుని..
హమ్మయ్యా.. కనీసం ఉద్యోగం అన్నా మిగిలింది అనుకున్నాడు...

పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది... పదిమంది చేసే పని ఒక్కడు చేయాల్సొస్తుంది...
పని ఎక్కువ ఉందని ఎదురు తిరిగి అడిగే ధైర్యం ఎవడూ చేయలేదు.. నోరుమూసుకుని..
పనిచేస్తున్నారంతా... ఖాలీ అయితే.. ఎక్కడు బెంచ్ మీదకు వస్తామో...
అని పనిఉంటేనే బాగుణ్ణు అనుకోవటం మొదలుపెట్టారు..

ఏ రోజు ఏ కొత్త షాకింగ్ న్యూస్ వినాస్సొస్తుందో అని.. న్యూస్ ఛానల్సే చూడటం
మానేసి... ఆఫీసు బయట రోజు రోజుకూ.. బక్క చిక్కిపోయిన కుక్కల్ని,
కుప్పలు కుప్పలుగా పోసిన సిగరెట్ ముక్కల్ని... చూసినప్పుడల్లా... ఇంకా
రిషెషన్ ఎఫెక్టు కొనసాగుతూనే ఉందన్నమాట... అని అంచనావేసుకున్నాడు చంటి.

ఒక్కవారంలోనే ఎటుచూసినా.. టూలెట్ బోర్డులు కనపడసాగాయి..., ఏడువేలు
అద్దెకట్టలేక దుకాణం సర్దేసి... ఇరుకిళ్ళే సరి అనుకుని... మూడువేల ఇంటిలోకి
చేరిపోయాడు..., మాట్లాడితే మెక్ డొనేల్డ్స్ కు పోయేది మానేసి... రోడ్డుప్రక్కన
సమోసానే తినటం మొదలుపెట్టాడు..., వీకెండు పార్టీలు, సినిమాలు..
అన్నీ మానేసి.. కాళ్ళమీదకాళ్ళు వేసుకుని.. చక్కగా ఇంట్లో కూర్చుని..
FMలో పాటలు.. TVలో సినిమాలతో టైమ్ పాస్ చేయటం అలవాటయ్యింది..

పోస్ట్ పెయిడ్ మొబయిల్ కనెక్షన్ కాస్తా ప్రీపెయిడ్ అయ్యింది..., ఏ గడ్డి కనపడితే
ఆ గడ్డి కొనటానికి ఉపయోగపడతాయి.. అనుకునే.. sodexho pass కి కూడా
ఎక్ష్పైరీ డేట్ ఉంటుందని.. అవి కూడా డబ్బులేనని, అవి కింద పడిపోతే..
జాగ్రత్తగా తీసుకొని కళ్ళకద్దుకోవాలని తెలిసొచ్చింది...

ఒకప్పుడు.. భరించి బిల్స్ కట్టిన బరిస్తా.., కాఫీషాప్ లు ముందునుండు వెళ్ళేటప్పుడు...
ఖర్చుపెట్టిన డబ్బులు గుర్తొచ్చి.. తలవంచుకోవాల్సొచ్చింది..., కారుకి పెద్ద పరదా
కప్పేసి.. ఆఫీసుకు.. టూ వీలర్ పై వేరే ఫ్రండును వేసుకుని.. పెట్రోలుకు అయిన
ఖర్చును.. సగం సగం చేసుకోవడం మొదలుపెట్టాడు.. ఇలా తెలిసిన ప్రతి ఖర్చుకు..
కటింగు వేసి.. ఎంతో కొంత మిగల్చడం మొదతలుపెట్టాడు.. చంటి..

కొత్తగా ఆచి తూచి చేస్తున్న ఖర్చులకు.. బడ్జెట్ ప్లాన్ వేసి చూస్తే.. తన జీతం మొత్తం
ఇంటి అద్దెకు..లోనుకు.., కారు లోనుకు... ఇలా.. అన్ని ఖర్చులకు పోగా..
నెలకు రెండువేలు అప్పుచేయ్యాల్సుంటుంది అని తేలింది.., సిటీలో బ్రతకడం కష్టం కష్టం
అంటుంటే.. ఏంటో అనుకున్నా.. కష్టాలు ఇప్పుడే తెలుస్తున్నాయి..
అని మనసులో అనుకున్నాడు చంటి.

సరేలే.. కష్టాలు సాఫ్వేర్ ఇంజనీర్లకు రాక.. గవర్నమెంటు ఉద్యోగులకొస్తాయా...
అనుకుని..దేవుడికైనా మొక్కితే.. సమస్యలు తీరుతాయోమో.. చూద్ధాం.. అని
ఒకరోజు చిలుకూరి బాలాజి గుడికి బయలుదేరాడు... బస్సులోనే వెళ్ళి
బస్సులోనే వద్దాం.. సాదాసీదాగా మొదలుపెడదాం.. కనీసం ఆ దేవుడైనా మొర
వింటాడేమో అని అనుకుని... బస్సుకోసం చూస్తున్న చంటికి... స్నేహితుడు
నుండి ఫోన్ వచ్చింది.., బాలాజి గుడికి వస్తున్న విషయం చెప్పాడు.. చంటి..
"ఒరే... నేను అక్కడే ఉన్నా..ఇక్కడ IBM, Accenture రెండూ..
ఒకేసారి.. ఒకేచోట ఇంటర్వూ పెడితే వచ్చినంత జనం ఉన్నార్రా... చాలా కష్టంగా ఉంది...
రిషెషన్ స్పెషల్ బస్సులు కూడా RTC వారు మెహదీపట్నం నుండి.. నడుపుతున్నారు...
అసలు టిక్కెట్టురేటుకి సగమే తీసుకుంటారంటరా.., నువ్వు త్వరగా అందులోనే వచ్చేయి...
నా మొబైల్ లో బ్యాలన్స్ లేదు.. పెట్ఠేస్తున్నా అని కట్ చేసేసాడు...", "ఓహో.. వీడు అల్రెడీ
వెళ్ళిపోయాడా.., ఇలా అందరూ వెళ్ళి ఆయన చెవిలో గుసగుసలాడితే.. ఆయనమాత్రం
ఏంచేస్తాడు.. తప్పదు మరి.. ఎంత జనం ఉన్నా.. ఎంత టైమైనా..
దేవుడిదగ్గరకు వెళ్ళేటప్పుడు.. అనుకుని వెళ్ళి దేవునికి మొక్కులు మొక్కి...
సాయంత్రానికి తిరిగొచ్చాడు ఇంటికి...

"ఒరే.. ఎలాగైతే కష్టపడి మేనేజర్ ని.. రెండురోజులు సెలవు ఇవ్వటానికి ఒప్పింగలిగాన్రా...",
అని బండిపై తనవెనకు కూర్చున్న స్నేహితునితో ఆనందంగా చెప్పాడు చంటి.. ఏంటిరా,
"మళ్ళీ.. పెళ్ళా ఎవరదన్నా?, ఇప్పుడు ఇంటికి ఏంటి?" అని అడిగాడు వెనుక
కూర్చున్న స్నేహితుడు..

"పెళ్ళా పాడా.,.ఇప్పటికే.. ఖర్చులు భరించలేకున్నా..., క్రితం వారం.. నా క్లోజ్ ఫ్రండ్సందరి
పెళ్ళిల్లకూ చాలా వర్కుంది.., అసలు ఖాళీలేదు..అని చెప్పి.. వెళ్ళటం మానేసా...
ఒక్క పెళ్ళికి వెళ్ళొస్తే.. కనీసం మూడువేలు వదులుతున్నాయి రా బాబు..",
ఇంటికి వెళ్తున్నారా.. మళ్ళీ పెళ్ళిచూపులంట.. ఇంటికెళ్ళి కూడా.. చాలా రోజులయ్యింది..!!,
రమ్మని ఒకటే పోరు పెడుతున్నారు..", అని అన్నాడు చంటి...

ఒరే.. అది చూడు.. అక్కడ.. కటింగు వేయించుకుంటే.. గడ్డం ఫ్రీ అంటరా..
పద వెళ్ళొద్దాం... నువ్వు కటింగు వేయించుకో.. నేను గెడ్డంచేయించుకుంటా..
"ఒకప్పుడు.. అమీర్ పెట ఎలా ఉండేదిరా.. ఎలా అయిపోయింది.. ఇక్కడ institutes
అన్నీ ఖాళీ చేసేసి.. హాస్టల్లనుండి ఇంటికి.. చెక్కేసారు జనాలు.. ఇక ఇలాంటి షాపువాళ్ళకు
బేరాల్లేక ఇలా డిస్కౌంటులు పెడుతున్నారన్నమాట.. బాగానే ఉందిరా..
మనకు కలిసొచ్చింది అని నవ్వుకుంటూ కటింగ్ షాప్ లోకి వెళ్ళారిద్దరూ...
నువ్వెళ్ళరా.. నేను ఏమన్నా.. చందనా బ్రదర్ర్స్.. బొమ్మనా బ్రదర్స్ వాళ్ళ రిషెషన్
తగ్గింపు ధరలు అని ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను, ఎలాగూ బట్టలు కొనుక్కోవాలి...
అని పేపర్ తిరగేసాడు.. చంటి...

ఎవడో చెప్పిన సలహాతో... రెండొందలు తక్కువ అని... RTC బస్సు లో ప్రయాణం చేసి...
ఏడింటికళ్ళా చేరాల్సిన వాడు.. పదకొండింటికి.. చేరుకున్నాడు..., సీట్లనిండా నల్లులు చేరి..
రాత్రంతా.. కుట్టినచోట కుట్టకుండా.. కుట్టి.. నిద్రలేక.. మొహం వాచిపోయింది..., ఆ అవతారంలో
ఉన్న చంటిని బస్సు దగ్గరకు రిసీవ్ చేసుకోడానికొచ్చిన వాళ్ళ అన్నయ్య... నవ్వాపుకోలేక
నవ్వుతూ స్వాగతం పలికాడు..., ఏంట్రా చంటి.. ఎలా ఉన్నావు.. అని అన్నివిషయాలు
మాట్లాడుకున్నాకా.. "ఆ సంభంధం వాళ్ళు వద్దనుకున్నారంటరా.. మొన్నటి వరకూ
సాఫ్వేర్ ఇంజనీరే కావాలని పట్టుపట్టిన ఆ అమ్మాయి.. ఇప్పుడు గవర్నమెంటు ఉద్యోగి
కావాలందంట... అందుకే రావటం లేదని ఫోన్ చేసి చెప్పారు.. నీకు చెబుదాం అంటే...
అప్పటికే నువ్వు బస్సెక్కినట్లున్నావు.. ఫోను దొరకలేదు.. అని..
అసలు షాకింగ్ న్యూస్ అప్పుడు చెప్పాడు..

చంటికి.. బుర్ర గిర గిర మని తిరిగింది...ఈ రిషెషను నా పెళ్ళిమీదకూడా దెబ్బకొట్టిందన్నమాట
అని మనసులోనే కుమిలిపోయాడు..., చంటి ఊరికి వస్తున్నాడంటేనే.. పులిడ్యాన్సులతో
బ్రహ్మరధం పట్టినట్లుగా.. ఎదురుగా.. వచ్చి పలకరించే జనాలంతా ఎవరూ కనపడకపోయేసరికి..
మనకు ఇక్కడ కూడా విలువ పోయింది ఛీ.. అని మనసులో అనుకున్నాడు...
కొంతసేపటికి... చుట్టుప్రక్కల చుట్టాలంతా ఒకరొక్కరుగా.. రావటం,ఎదో..
ఆర్దిక మందం అంట కదా... రోజూ టీవిలో చూపిస్తున్నారు.. అని ఒకరు..,
ఉద్యోగాలు తీసేస్తున్నారంట.. కదా.. అని ఒకరు...., అంతే.. పెరుగుట విరుగుట
కొరకే.. అంతెంత జీతాలిస్తున్నప్పుడు అప్పుడే అనుకున్నా నేను. ఎప్పుడో బోర్లా పడతారని..
అని ఒకరు.., ఆఖరుకి... పెళ్ళిసంభంధం కూడా కాదనుకున్నారా..
అయ్యయ్యో.. అని ముక్కున వేలేసేవారొకరు... ఇలా ఎవరికి తోచినవి వారు మాట్లాడుతుంటే..
చంటికి.. బీపీ రేజయ్యిపోసాగింది... ఒకేఒక్కరోజుండి... పెట్టుకున్న సెలవు క్యాన్సిల్
చేసేసి.. ఒక రోజు ముందే... తిరుగు ప్రయాణం కట్టాడు.

మరలా ఎధావిధిగా.. తరువాత రోజు.. అఫీసుకు..చేరుకున్నాడు.. అదేంటి త్వరగా వచ్చేసావు..
అని మేనేజరు వెకిలిగా నవ్వి వేసిన ప్రశ్నకు.. పిచ్చినవ్వు ఒకటి విసిరి సమాధానంగా ఊరుకున్నాడు...

సరే ఇక సీరియస్ గా పనన్నా చేసి ఉన్న ఉద్యోమైనా కాపాడుకుందాం అనుకుని మెయిల్స్
చెక్ చేసుకున్నాడు.. రిషెషన్ అని చైన్ మెయిల్ ఎదో చూసి.. ఏంటిది..?
అన్నట్లు ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు...

ఒక కంపెనీలో సాయత్రం ఆరుఅవగానే.. పైర్ అలార్మ్..మ్రోగింది...
అందరూ పరుగులు తీసి ఒక చోట గూమిగూడారు..
సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి.. ఇలా చెప్తాడు..

"డియర్ ఎంప్లాయూస్... ఈ రోజు చాలా భాధాకర విషయం చెప్పబోతున్నాను...
మన కంపెనీ నుండి.. ఒక 80% మందిని తీసేయల్సోచ్చింది...
ఈ విషయం ఒక్కసారే చెబితే మీరంతా షాక్ అవుతారని మాకు తెలుసు..
అందుకే ఇలా ఫైర్ అలార్మ్ ఆన్ చేసి.. అందరినీ బయటకు పిలిపించడం జరిగింది..,
ఇప్పుడు అందరూ లోపలికి మీ ID card swipe చేసి వెళ్ళండి.. డోర్ ఓపెన్
అయినవాళ్ళు రేపు రావచ్చు.. ఓపెన్ కానివాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు...
మీ వస్తువులు ఏమన్నా ఉంటే.. రేపు కొరియర్లో పంపించేస్తాం..
ఆల్ ది బెస్ట్.. అని ఆ మెయిలు సారాంశం...

మెయిల చదివి... నవ్వలేని నవ్వు వచ్చింది చంటికి... ఆ తరువాత పనికి సంభంధించిన
మెయిల్ ఓపెన్ చేసాడు.. సడెన్ గా ఫైర్ అలార్మ్ మ్రోగటం మొదలుపెట్టింది... జనం అంతా
పరుగులు తీయటం మానేసి.. గుండెల్లో రాయిపడ్డట్టయ్యి... లేచి నిలబడిపోయారు...,
ఏంటి.. ఏంటి.. అని చుట్టూ చూసుకున్నారు... తరువాత కొంతసేపటికి... తెలిసిందేంటంటే..
ఎవరో పరధ్యానంగా బయటకు వెళ్ళబోతూ ఫైర్ ఎక్సిట్ ఓపెన్ చేసాడని తెలిసింది.. హమ్మయ్యా...
మెయిల్ లో జరిగినట్లుగా కాదన్న మాట, మన ఉద్యోగాలు పరవాలేదన్నమాట..
అని మనసు స్ధిరం చేసుకున్నారందరూ...

రోజూ భయం భయంగా ఇంటికిపోవటం.. భయం భయంగా ఆఫీసుకు రావటం...
దొరికిన కాఫీ బ్రేక్ లంచ్ బ్రేక్లో ఒకరి భాధలు ఒకరు చెప్పుకోవటం.. జరుగుతుంది...

ఒరే.. మా ఆవిడ దగ్గరకూడా నా పరువుపోయిందిరా... సాఫ్వేర్ ఇంజనీరునని..
పాతిక లక్షలు కట్నం తీసుకున్నాననేమో.. "ఈ రోజు. నేను త్వరగా వెళ్ళాలి లంచ్ బాక్స్ పెట్టు"
ని కాస్త చిరాగ్గా అంటే.. "ఉంటుందో ఊడుతుందో తెలియని ఉద్యోగానికి...
అంత కంగారుపడిపోతారెందుకు", అని వెటకారంగా అంటొందిరా..
అని ఒకడు చెప్పుకుని.. ఎడ్చాడు..

ఒరే.. ఆటోవాడు.. మీటరుపై ఏభై ఇవ్వమన్నాడు.. ఎందుకులే ఎధవ ఖర్చు..
అని నడిచొస్తుంటే.. వెళ్ళు బాబూ వెళ్ళు.. .లేటుగా వెళ్ళు పింక్ స్లిప్ రడీ చేస్తారు
అని అంటున్నాడ్రా.. నాకైతే డెస్క్ దగ్గరకు వచ్చి చూసుకునేవరకూ చెమటలు
పట్టాయిరా.. అని ఇంకొకడు తన భాధను చెప్పుకున్నాడు...

మరి అందరూ తమ భాధలు చెప్పుకుంటున్నారు.. మరి చంటిగాడేంట్రా అసలేం
మాట్లడటంలేదు... అని ఫ్రండ్సంతా అడిగితే... ఒరే.. రేపు నా లోన్ EMI
పే చెయ్యటానికి లాస్ట్ డేట్ రా... ఎవడిని అప్పుఅడుగుదామా అని అలోచిస్తున్నారా..
సలహా ఇవ్వండ్రా.. అనగానే.. అందరూ అక్కడనుండి.. మాయం అయిపోయారు..

Related Posts Plugin for WordPress, Blogger...