విమర్శనాస్త్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విమర్శనాస్త్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఫేస్బుక్ ఆందోళన

సుబ్బు చెక్డ్ ఇన్ టు ముంబై ఇంటర్నేషనల్ ఏర్పోర్టు.. టూ మినిట్స్ ఎగో.., ఓరినాయనో.. డాలరంటే ఎన్ని రూపాయల్రా.. అని అడిగే మన సుబ్బిగాడు కూడా అమెరికా వెళ్ళిపోతున్నాడు.., టూమచ్!!

ఫీలింగ్ బ్లెస్సెడ్ విత్ మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్ కృష్ణా పుష్కర్ ఘాట్.. తమన్నా ఫోటో అంటించిన మిల్క్ బాటిల్ చేత్తో పట్టుకున్న సెల్ఫీ పెట్టిన శంకరం గాడు.., ఓరీడేషాలో!!

వెనకనుండి పెద్ద కేక.. ఏమండి.. టిఫిన్ రెడీ. మీకు ఇష్టమైన పెసరట్లు.. వేడిగా ఉన్నాయ్ తినండి.., ఆగేహే.. బ్రేకింగ్ న్యూస్.. క్రాకింగ్ కామెంట్సు ను ఇక్కడ.

"మై బ్రేక్ఫాస్ట్ ఐస్ రెడీ.. వేడి వేడి పెసరట్లు..", కిచెన్లోకి వెళ్ళే టైము లేక.. గూగుల్లోంచి పెసరట్టు బొమ్మ డౌన్లోడ్ చేసి పోస్ట్ పెడితే.. అరనిముషంలో అరవై లైక్స్.., వామ్మో!.. షేర్ మార్కెట్ లో కూడా ఇంత జనం లేరన్నమాట.

ఫీలింగ్ చిల్డ్.. సెంటోసా వాటర్ పార్క్ విత్ ఫామిలీ.. నిక్కరేసుకుని నీటిలో దిగిన నూకరాజుగాడి ఫోటో.. నూటఇరవై దాటిన లైకులు, ఆరీడి తస్సాదియ్యా!

మధ్యలో యాడ్.. శివాని తన కారును మూడున్నర లక్షలకు అమ్మేసింది.. నువ్వు కూడా నీకారు అమ్మేయ్.. అమ్మేయ్..అమ్మేయ్య్..,
అమ్మేసి ఏం చెయ్యాలీ.. అడుక్కు తినాలా!!
మీ సిపియు వెన‌కాల ఉండే పోర్టుల గురించి మీకు ఎంత వ‌ర‌కు తెలుసు.....? తెలుసుకోవాలా అయితే క్లిక్ చెయ్యండి..
మా సీటు కిందకు వచ్చిన వయసే మాకు తెలీదు.. పోర్టులు తెలుసుకుని ఏం పీకాలే?

మధ్యలో అరవం లో పోస్టుకి ఎవడో తలమాసినోడు లైక్ కొట్టాడని చూపిస్తుంది..
పొద్దున్నుంచీ మొబైల్ స్క్రీన్ వంక చూసిచూసి తెలుగే అర్ధమయ్యి చావట్లేదు.. మధ్యలో ఆరవ లైకులోకటి మాకు!!

మళ్ళీ యాడ్లు.. ఒక బెడ్రూం ప్లాటు.. 90 లక్షలు మాత్రమే.. ఒక్కరూపాయి పావళా పెట్టి ఇప్పుడే బుక్ చెయ్యండి.. లేదా లైక్ కొట్టండి మేమే మీ ఇంటికొచ్చేస్తాం.., వామ్మో!!

కిందకు స్క్రోల్ చేస్తే.. పైన.. న్యూ స్టోరిస్.. న్యూ స్టోరిస్ అని కేకలు పెట్టింది. ఒక్కటి చదవగానే మళ్ళీ న్యూ స్టోరీస్ స్ స్ అని ఒకటే అరుపులు.. పెడబొబ్బలు.. ఖాళీగా కూర్చుని ఈ కథలు రాస్తున్నోళ్లను చితక్కొట్టేయ్యద్దు మరి!

అప్పుడే వేసిన ఆమ్లెట్ లాగ ఫ్రెష్ వాసన వచ్చింది. అంటే ఎవడో కొత్త పోస్టు పెట్టాడన్నమాట మనమే ముందు లైక్ కొట్టాలి.. కొట్టేయ్యాలి.. ముందు లైక్ కొట్టాకా చదవొచ్చులే. హమ్మయ్యా కొట్టేసా.., మనమే ముందు కామెంట్ రాయాలి.. అయ్ బాబోయ్.. ఎవడో టైపింగ్ అంట.. చుక్కలు గంతులేస్తున్నాయి.. మొదటి కామెంటు ఎలాగైనా నేనే ఇస్తాచూడు.. ఇదిగో ఇచ్చేసా.. "తుస్..", అని కామెంట్, వహ్వా.. నేనే ఇచ్చేసానోచ్.. అని ఎగిరి నాలుగు గంతులు.., అద్గదీ.. ఇప్పుడు ఏం రాశారో చదవటం మొదలుపెడదాం.

"ఇలాంటి ఫోటోలకు లైక్స్ రావు.. అదే... ఒక ఆడపిల్ల ఫొటోనో... హీరోయిన్ ఫొటోనో ఐతే.. లెక్కలేని లైక్ లు.. షేర్ లు చేస్తారు... ఇది పరిస్థితి...", అని ఒక ముసలావిడ రోడ్డు పక్కన పడున్న ఫోటో. ఏంటో.. ఈ ఫొటోకి లైక్ కొట్టడం ఎందుకో.. చేస్తే చేతనైన సాయం చెయ్యాలిగానీ.

షీలా-సుషీలా తొమ్మిదేళ్ల క్రితం ఫ్రెండ్స్ అయ్యారు.. వాళ్ళ వీడియో ఇక్కడ చూడండి.., వాళ్ళేమన్నా ఫేమస్ సింగర్స్ లీలా-సుశీలా నా, మా పాత పని మనుషులే కదా, వీళ్లకో ఎకౌంటు.. ఫ్రెండ్షిప్పు.., వాళ్లకు లైక్ కొట్టమని నాకో సజషన్.
ఒరేయ్ ఫేస్బుక్కోడా, నువ్వు మామూలోడివి కాదురా.. ప్రతిఒక్కరికి బ్యాంకు ఎకౌంటు అన్న ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెయ్యలేకపోతుంది.. నువ్వు ఫేస్బుక్ లోకి భలే లాగేసావ్ అందర్నీ. నువ్వుగానీ కనపడాలి.. అప్పుడు చెప్తా.., డౌన్ డౌన్.. స్క్రోల్ డౌన్.

మధ్యలో ఒక పజిల్... 1+1=2, 2+2=4, 3+3=?.
అరగంట ఆలోచించినా ఆన్సర్ దొరకలేదు..
కామెంట్స్ లో చూస్తే.. ఆరు.. ఆరు.  ఆరు.. అని వున్నాయి. ఓహో.. ఆరా.., అబ్బా చాలా కష్టమైన పజిల్ కదా!

ఎవడో కొత్త ఆవకాయ ఫోటో పెట్టాడు.. వీడి దుంపదెగా.. ఇప్పుడే పెట్టాలీ, అని తిట్టుకుంటూ, ఇప్పుడు లేవాలి.. లేచి కిచెన్లోకి వెళ్లాలి.
టక్ టక్.. ఉమ్మ్.. హా..
"ఏమండీ.. ఆవకాయ జాడీ కదిలిన సౌండొచ్చిందేంటండీ కిచెన్ లో..", ఇంటావిడ అరుపు పక్క గదిలోంచి.
"అబ్బే.. అదేం లేదే.. మంచినీళ్ళు తాగటానికొచ్చాను నేనేలే.."

ఈ వినాయకుడి ఫోటో కి లైక్ కొట్టి కామెంట్స్ లో ఆమెన్ అని టైపు చెయ్యండి.. లేకపోతే మీ మేనేజర్ ఇవాళ మీకన్నా ముందుకు ఆఫీస్ కి వస్తాడు.
ఓర్నాయనో.. ఎందుకైనా మంచిది.. లైక్ కొట్టి.. ఆమెన్ కొట్టి ముందుకు పోతుంటే గుర్తొచ్చింది.. వినాయకుడికి ఆమెన్ ఏంటి?, ఎమోలే.. అందరూకొట్టారు కదా!

"ఆకాలేస్తుంది టిఫిన్ పట్రా..."
"ఇంకా ఇప్పుడు టిఫిన్ ఏంటి.. భోజనం టైమయ్యింది రండి వడ్డిస్తా.."
"సరేలే.. ఏం కూరా.."
"పెసరట్టు కూర.."

హుమ్మ్.. అనుకున్నా.. ఫేస్బుక్ పుణ్యమాని.. పెసరట్టు.. కూరవుతుంది, పప్పు.. సాంబారవుతుంది అని. కనిపెట్టినోడేవడో దొరకాలి చెప్తా వాడి పని.

కిందకు స్క్రోల్ చేస్తే.. "ఫేస్బుక్ మా బాబుగాడి సొత్తు అని తొడకొట్టి చెప్పగలిగే వాడు వీడే", మార్క్ జుకెంబర్గ్ పిల్లవాడిని ఎత్తుకున్న ఫ్యామిలీ ఫోటో..

"ఒరేయ్.., నువ్వక్కడే ఉండ్రా నేనొస్తున్నా.."

"త్వరగా రండి చల్లారిపోతుంది.."

"అబ్బా.. నీ భోజనం గోల ఆపు.. అంటున్నది నిన్ను కాదు.. వాడు అయిపోయాడు నా చేతిలో ఇవాళ.."

7, ఆగస్టు 2015, శుక్రవారం

చూడు మాయ్యా...!


పొద్దున్నే లేచి కంపుకొట్టే కార్పోరేషన్ నీళ్ళతో కడుపు కడుక్కుంటుంటే.. ఒక ఎస్సెమ్మెస్ వచ్చిందండోయ్..
“మీకు అక్కర్లేకపోతే.. మీ ఎల్పీజి సబ్సిడీ వెనక్కు ఇచ్చేయండి.. ఆ సబ్సిడీ తో నాలుగు బండలు కొని.. మేము పేదల పూరిళ్ళలో పంపిణీ చేయించి.. వాళ్ళ కుంపట్లో నిప్పు పెడతాం..”, అని. అది చదివి చదవగానే నవ్వుకూడా వచ్చిందండోయ్..,
 ఛ! ఊరుకో మాయ్యా.., సురుకు.. నువ్వు కుడా చతుర్లే.., నెలకు లచ్చ రూపాయలు సంపాదించుకునే ఉద్యోగస్తుడికన్నా కటిక దరిద్రుడు ఎవడుంటాడు మాయ్యా..!, రోజు కూలీ చేసుకునేవోడికి రోజు మారితే.. జేబులు ఖాలీ ఐపోయి కడుపు కాలుతుంది, అదే మాబోటి ఉద్యోగులకు.. నెల మారితే రోజు గడవక నడుం జారిపోతుంది, అంతే కదా తేడా మాయ్యా. ఆ  లెక్కన మాబోటి ఎధవలకు టాక్స్ లని.. వ్యాటులని.. సెస్సులని.. మామలని.. తాతలని.. అవి ఇవీ వడ్డించి జారిన నడ్డి అని చూడకుండా నడ్డిమీద నడ్డిమీద ఇంకా తన్నుతున్నారుగా.., ఈ లెక్కన రోజుకూలివోడు.. నడ్డిరిగిన నెలకూలివోడు ఒక్కటే కాదా?,  మరి మాకన్నా పేదోడు ఇంకెవడు మాయ్యా..!, మీరు పెట్టే ఆ కొంపలో గ్యాసు కుంపట్లు ఎవరింట్లో మాయ్యా.., నువ్వు చతుర్లే చతుర్లు.
ఎన్ని జన్మల పాపాల పుణ్య ఫలమోగానీ ఇక్కడ పుట్టేసాము.. అనిపిస్తా వుంటాది మాయ్యా అప్పుడప్పుడూ, కష్టపడి రాత్రి పగలూ చెమటలు పట్టేలా చదివేసి.., ఎక్కిన మెట్టు.. దిగిన మెట్టు తెలీకుండా తిరిగి తిరిగి ఉద్యోగం సంపాదించేసాము.. అక్కడితో ఆగిపోయిందా అంటే.. ఆగలేదే..!
పడ్డ కష్టాలకు ఫలితం లేదు.., చదివిన చదువుకు తగ్గ జీతం లేదు.., ఎంత సంపాదించినా ఎనకేసింది లేదు.., పిల్లల  స్కూల్ ఫీజు కట్టడానికి స్తోమతలేదు.., పెళ్లానికి మంచి చీర కొనిపెట్టిందిలేదు.., అలా విహార యాత్రకు తిప్పొద్దామంటే  సమయం లేదు.. ఒక సరదా లేదు పాడూ లేదు. ఇల్లు కొనుక్కోటానికి బ్యాంకు ఋణం తప్ప మార్గం లేదు.., పెంచిన అమ్మానాన్నలకి తిరిగిచ్చిందేమీలేదు.., , రోగమొచ్చినా.. రొచ్చొచ్చినా నేనున్నానని భరోసా లేదు.. ఆఖరికి ఛస్తే వెనుకున్నోళ్ళకి.. చూసే దిక్కేలేదు.., మరెందుకమ్మా అన్ని చెమటలు చిందించింది.. అంత చదువూ చదివింది.. అన్ని మెట్లెక్కింది.. అని మనకు మనం అడుక్కుంటే సమాధానం ఉందా..అంటే!, అదీ లేదు.
మరి ఇన్ని రోజులు నడ్డి జారగోట్టుకుని నువ్వు కట్టిన టాక్స్ లు.. వ్యాటులు.. సెస్సులు.. మామలు.. తాతలు ఏమయ్యారు.. ఎక్కడున్నారు.. ఏమైపోయారో.. వాళ్ళంతా నీవంటున్న పేదోళ్ళ దగ్గరకే పోయారంటావా, మాయ్యా!
ఇంతా కష్టపడి చదువుకుని నానా గడ్డి కరచి.,. మా ఉద్యోగాలు మేము చేసుకుని.., మా నడుం నెప్పులు మేము భరించి.., మా.., మా.., ఈ డబ్బులు మేము సంపాదించుకుంటుంన్నా.., మీకోసం టాక్సులు కట్టి.. మీ పిల్లల్ని మేము పెంచి.. మీ  చదువురాని వేలిముద్రగాల్ని.. వాళ్ళ కొడుకుల్ని పోషించి.. మీ.., మీ.., అన్ని చేస్తే.., ఇంకా ఎదో కావాలి.. ఇంకా ఎదో తీసేసుకోవాలి.. ఇంకేదో దోచేసుకోవాలి.., ఏముంది మాయ్యా తీసుకోటానికి?, ఏముందని విరిగిన దాన్ని ఇంకా విరగ్గొడతారు..  విరిగి విరిగి పాకలేని ఈ ప్రాణికి జోకు ఎసెమ్మెస్లు ఎందుకు మాయ్యా పంపిస్తారు. మళ్ళి నవ్వొస్తుంది మాయ్యా.. నవ్వొస్తుంది.     
చదువుకున్నోడికన్నా షావుకారు మెరుగన్నారు.., ఇప్పుడు వాడి పనేమన్నా బాగుందా అంటే అదీ అంతంత మాత్రంగానే ఉంది.. వాడు కట్టిన మామలు.. తాతలు లేక్కతేలక వాడి తికమకలో వాడున్నాడు..., బిత్తర చూపులు చూస్తూ నేను పేదోడినే బాబయ్యా అంటున్నాడు..,  మరి మాయ్యా.. వాడికీ ఎస్సెమ్మెస్ వచ్చింది గాందా.. ఇంకా నువ్వు చెప్పే పేదోడెవడో.. నువ్వు చెప్పే కుంపట్లో నిప్పు స్కీమేందో.. ఎవరికోసమో అస్సలు సమజైతలేదేంది మాయ్యా.
మళ్ళి నవ్వొచ్చిందండోయ్.. నవ్వొచ్చింది.., ఈ సారి నవ్వెందుకు వచ్చిందంటే.. మొన్న జరిగిందొకటి గుర్తొచ్చింది.
ఏ రోగమన్నా వస్తే సర్కారీ ఆసుపత్రిలో కుక్కకూడా కాలెట్టదు కదా, మరి ఒకవేళ కాలు పెడితే కాలేయం తీసేసి.. కిడ్నీలు కొట్టేసి బాడినే మాయం చేసేస్తారని భయం కదా.., ఆ భయంతో ఒకవేళ ప్రవేటు ఆసుపత్రిలో చేరితే.., లేని గర్భానికి.. సీమంతం చేసి.. పురుడు పోసి.. నామకరణం చేయించుకోవాలి అంటే చాలా డబ్బులు కావాలి కదాని..  వస్తుందో రాదో తెలియని రోగానికి ముందే భయపడి మెడిక్లెయిమ్ పాలసీ కొనుక్కుంటుండగా.. మొత్తం ఫ్యామిలికి పదివేలండి.. ఇది కొంటే మీకు మీ మాయ్య గారు కాస్త ఇన్కంటాక్సులో రాయితీ కూడా ఇస్తారు అన్నారు, తీరా కట్టాకా పదివేల పాలసీకి  ఒక పన్నేండు వందల రూపాయలు ఎక్కువ కట్టించుకుని ఇది మీ మాయ్యగారు తీసుకోమన్నారండి.. దీన్ని సర్వీస్ టాక్సని అంటారండి, అని సెలవిచ్చారు.
అక్కడికక్కడే  నీబొమ్మ కనపడిందిపోయింది మాయ్యా..!, నువ్వు ఇవ్వలేని దానీకోసమే నేను కొనుక్కుంటున్నా.. అందులో నువ్వేమి సర్వీసులు ఇచ్చావని మళ్ళి నా నడ్డిమీద తన్నుతావు మాయ్యా.., నువ్విచ్చిన దాన్ని నమ్ముకోవాలంటే ఇంకా భయంగానే ఉందే..  నాకున్నది ఒకటే కాలేయం.. రెండే కిడ్నీలు కదా!
నువ్వు ఇవ్వనిదానికోసం నేను కట్టుకుంటుంటే.. అదేదో ఇంకా తగ్గించి ఇస్తానని ఆశ పెట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ లాగేసుకుంటావా.., ఇంతకీ నాకు లాభమా నష్టమా.. ఏమోచ్చిందో, అర్ధం కాలేదు., ఏంటో!, గుడ్డోడి పెళ్ళికి మూగ పురోహితుడు మంత్రాలు చదువుతుంటే.. చేయ్యిలేనోడు డోలక్క్ వాయించినట్టు.. నువ్వు చేసేదంతా కన్ఫూజన్ కన్ఫూజనుగుందేంటి మాయ్యా!



17, జూన్ 2015, బుధవారం

వాట్సాప్.. టింగ్ టిటింగ్

టింగ్ టిటింగ్ అని మోగింది ఫోను.. వాట్సాప్ నుండి ఎవడో ఎదో పంపించినట్టున్నాడు అని తెరచి చూస్తే.. పొలో మంటూ నాలుగు గ్రూపుల్లో నన్ను ఇరికించేసి, మెసేజ్ మీద మెసేజ్ లు పంపించేసి నా నెంబర్ వాడేసుకుంటున్నారు.., సార్.. కిలో ఇరవై మాత్రమే.. ఇప్పుడే వస్తే కిలో పదిహేను.., మావి ఫ్రెష్.., మావి సూపర్ ఫ్రెష్.., మీకు మాత్రమే సూపర్ ఆఫర్, అని నాలుగైదు ఫోటోలు కూడా పంపించేసారు.. అవి డౌన్లోడ్ ఐపోతున్నాయి..., జస్ట్ ఒక్క లైక్ పంపించండి చాలు.. మీ ఇంటికి ఒక కిలో పంపిస్తా టమాటాలు అన్నాడు, టమాటాలా...!!, ఏంట్రా ఇదంతా అని చూస్తే ఇంకేముంది.. మా సందు చివర కూరగాయలోల్లు కొత్తగా వాట్సాప్ గ్రూపు తయారు చేసారంట.. అందులో నా నెంబర్ ని.. నన్నూ అడ్డంగా వాడేస్తూ.. మార్కెటింగ్ చేసేస్తూ.. కొత్త కొత్త ఆఫేర్లు పంపించేస్తున్నారు. చస్స్.. కూరగాయలోడు కూడా నా నంబరు వాడేసాడు.. అని తలపట్టుకుని ఫోను పక్కన పెట్టేసాను..
మళ్ళి టింగ్ టిటింగ్.. టింగ్ టిటింగ్.., ఛ వీళ్ళు వదిలేలా లేరు అని ఫోను తీసిచూస్తే.. మోగింది ఫోను కాదు.. కాలింగ్ బెల్లు.., ఇప్పుడెవడు మళ్ళి.. అనుకుని తలుపు తీసి చుస్తే.. బుట్టతో నిలబడి వున్నాడు సందు చివరి కూరగాయల హీరో.., ఇదేంటి నేను లైక్ పంపలేదు కదా.. నాకొద్దు.. అన్నాను.., మీరు కాదు సర్ మేడం గారు ఎప్పుడో నాలుగు లైక్ లు పంపారు సర్ అందుకే నాలుగు కిలోలు తెచ్చాను.. అని బుట్ట సోఫా ఫై పెట్టేసి వెళ్లిపోతున్నవాడిని ఆపి.. తీసి చూపించు.. ఎలా ఉన్నాయో చూడొద్దా.., అని అడిగితే బుట్ట విప్పి చూపించాడు.., అందులో సంగం పైగా బాగాలేదు.. అదేంటి.. ఫ్రెష్ అని మంచి మంచి ఇమేజ్ లు పంపావు.. అవి ఇవి కాదా అన్నాను సీరియస్ గా.., అదేంటి సార్ అన్నీ తెలిసినోళ్ళు  మీరు కూడా అలాగంటారు.. వాట్సాప్ డిస్ప్లే పిక్చర్ లో ఉన్నంత అందంగా బయట జనాలు ఉంటున్నారా చెప్పండి.., లేదు కదా!.., అలాగే ఇదీను.. అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.  ఓరి.. నీ.. వాట్సాప్ గ్రూపులో కుళ్ళిన తమాటాలు పడా అని తిట్టుకుని వదిలేసాను.
మళ్ళి టింగ్ టిటింగ్.. సార్.. సీట్ ఖాళీ అయ్యింది.. త్వరగా వచ్చేయండి.. అని బిల్డింగ్ కింద ఉన్న కటింగ్ షాప్ వాడు మెసేజ్ చేసాడు.. ఖాలిగా ఉన్న సీట్ ఫోటో.. ఇంతకు ముందు వాడికి కటింగు చెయ్యగా మిగిలిన వెంట్రుకలు జూమ్ చేసి తీసిన ఫోటో పంపించాడు.. అవి డౌన్లోడ్ అయ్యేలోపు నేను వెళ్ళాలి అని త్వర త్వరగా పరుగుపెట్టి.. నేను నా రన్నింగ్ సెల్ఫీ ఒకటి రిప్లై పంపించి, హెయిర్ కట్ కోసం కుర్చీలో కూర్చున్నాను.. ఈయన ఎవరు??, ఫోటోలు తీస్తున్నాడు అని.. పక్కనే కింద పడుతున్న వెంట్రుకల్ని కూడా వదలకుండా ఫోటోలు తీస్తున్న వాడిని చూపించి.. అడిగాను. వాడు నా సండే స్పెషల్ ఎంప్లాయ్ సార్.. తరువాత క్యు లో ఉన్నవాళ్ళకు స్టేటస్ పంపించటానికి పెట్టుకున్నా.. సండే ఎక్కువ మంది వస్తారు కదా సార్.. స్టేటస్ పంపిస్తూ ఉండిపొతే.. ఇక్కడ అసలు పని అవ్వటంలేదు అని.. ఇలా చేశా అని గర్వంగా కాలర్ ఎగరేసాడు కటింగ్ మాస్టర్.., ఓహో.. ఇందాకా జూమ్ వెంట్రుకలు క్రియేటివిటీ వీడిదేనన్న మాట అనుకుని నోరుమూసుకుని కూర్చున్నాను.
అరగంట కటింగ్ తరువాత బయటకు వచ్చేటప్పటికి వేయ్యా నాలుగువందల నలభై మెసేజ్ లు వాట్సాప్ లో నా గురించి ఎదురు చూస్తున్నాయి.. అవన్నీ చదివి రిప్లై ఇచ్చేసరికి ఇంకొక అరగంట పట్టేసింది..
ఇంటికి చేరి స్నానం చేసి, హమ్మయ్యా అని కాసేపు నడుం వాలుస్తుండగా.. మళ్ళి టింగ్ టిటింగ్.. టింగ్ టిటింగ్.., సార్ మీ బైక్ సర్వీసింగ్ ఐపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని మెసేజ్.. శుబ్రంగా కడిగేసున్న నా బైక్ ఫోటో పంపించాడు బైక్ సర్విసింగ్ వాడు.., నాలుగు లైక్ లు రిప్లై కొట్టి వాడు చూసాడు అని కన్ఫర్మేషన్ టిక్ లు.. నీలం రంగులోకి మారాక.. బైక్ తెచ్చుకోటానికి బయలుదేరాను.
ఈ పనులన్నీ అయిపోయేసరికి .. సాయంత్రం ఐదు అవుతుంది.. మళ్ళి టింగ్ టిటింగ్.., సండే సండే అని పేరుకే గానీ ఈ రోజే ఎక్కువ పనులు.. అని మనసులో అనుకుంటుంటే.. ఇదేదో స్టేటస్ కి బాగుంటుంది అని.., “ఓ, అప్పుడే ఐదు.. ఇంకేముంది సండే.. అయిపోయింది రోజు..”, అని వాట్సాప్ స్టేటస్ మార్చాను..,ఛీఛీ.., ఇవ్వేళ ఏమి చెయ్యలేదు.. వాట్సాప్ తప్ప.. అనుకుంటూ, వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే.. గుడ్ మార్నింగ్.. ఇట్స్ సండే.. అని ఒక పది మెసేజ్ లు.. ఇప్పుడే పొద్దు పొడిచినట్టుంది వీళ్ళంతా ఎవరబ్బా అని చూస్తే.. వాట్సాప్ అమెరికోల్ల గ్రూప్ లో పొద్దున్నే లేచి కాఫీ కప్పులు పట్టుకున్న సెల్ఫీ పంపించారు జనాలు.. బాగానే ఉంది సంబడం.. మాకు ఇక్కడ ఇప్పుడే “మండే”.. అని రిప్లై కొట్టి.. వాడిపోయిన నా డిప్ప కటింగ్ మొహం పంపించాను.. టింగ్ టిటింగ్ అంటూ వంద లైకులు పడ్డాయి.., “ఓరినాయనో.. ఏసాలో.. డిప్ప కటింగు కి వంద లైక్ లు..” అని మళ్ళి స్టేటస్ మార్చాను..
కొత్తగా ఎదో గ్రూప్లో మళ్ళి నా నెంబర్ వాడేసారు.. నర్సరీ చదువుతున్న మా పిల్లాడి ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ అంట.. వాళ్ళకు ఫోన్ లేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ పిల్లాడి సెల్ఫీ పంపిస్తే మనం మన పిల్లాడి సెల్ఫీ రిప్లై ఇవ్వాలి.. దే...వుడా..
ఎప్పుడో రైల్లో కలిసిన వాళ్ళంతా ఒక గ్రూపు.., అందులో చిన్న గేమ్ ఆడుతున్నారు.. అప్పుడు మనం ఏ బెర్తులో ఎవరు కూర్చున్నామో చెప్పుకోండి చూద్దాం.. వారి.. దే...వుడా.., చిన్నప్పటి క్లాస్సులో ఫస్ట్ బెంచ్ వాళ్ళంతా ఒక గ్రూపు.. లాస్ట్ వాళ్ళంతా ఒక గ్రూపు.. అన్నిట్లోనూ నా నంబరు వాడేసారు.. అన్నిట్లోనూ నేనా.. ఎదుకలా అంటే.. మేమేం మాట్లాడుకుంటున్నామో నీకు తెలియాలీ  కా...దా...
జువేలరి షాప్ వాడినుండి మెసేజ్ మేడం మీకు ఈ డిజైన్లు పంపించామన్నరండి.. లైక్ కొడితే డెలివరీ చేసేస్తా.. అని.. చేసేస్తావు బాబు నీకేంటి.., రేపు క్రెడిట్ కార్డు వాడు బిల్లు పంపిస్తే .. కట్టడం మానేసి వాడికి కూడా లైక్ పంపించనా... అని వాడికి రిప్లై కొట్టి వాడిని డిలీట్ కొట్టాను..
రాత్రి ఎనిమిదింటి వరకు గుడ్ ఈవెనింగ్ మెసేజ్ లు.. ఆ తరువాత ఒంటిగంట వరకూ గుడ్ నైట్ మెసేజ్ లు.. వీడియోలు.. అన్ని అయిపోయి దుకాణం మూసేసి పడుకుంటే.. మళ్ళి పొద్దున్నే.. టింగ్ టిటింగ్, టింగ్ టిటింగ్..

గుడ్ మార్నింగ్.. ఇట్స్ మండే.., చిచ్చీ... నా వాట్సాప్, నాక్కూడా ఎక్కడో “మండే”.

1, డిసెంబర్ 2014, సోమవారం

వెజ్జోల్లు-నానువెజ్జోల్లు

మన చుట్టూ రకరకాల ప్రాణాలు చూస్తూ ఉంటాం.., ఎడ్డెం అంటే.. కాదు తెడ్డెం అని.., రైస్టు అంటే.. కాదు రాంగు అని..,  పేస్టు అంటే.. కాదు బ్రస్సు అనే.. ఈ తేడాగాళ్ళు మాడా గాళ్ళు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంటే..  అలాగే.. మగపురుగులు-ఆడంగిలు, ఉన్నోళ్ళు-లేనోళ్ళు.. అమెరికాలో తుడుచుకునే వాళ్ళు-ఇండియాలో కడుక్కునే వాళ్ళు.. మతానికి  ఎదురు-మంచానికి అడ్డం గాళ్ళు ఉన్నట్టే.. వెజ్జు గాళ్ళు-నానువెజ్జుగాళ్ళు.. అందులో ఒక రకమైన.. అలగ్ అలగ్ వెరైటీ మాట..
వీళ్ళు ఒకొక్కసారి మాటల మధ్యలో సలహాలకు దిగుతారు... ఒకరికొకరు పనికిరాని సలహాలు ఇచ్చుకుంటారు.., అవి అవతలి వ్యక్తికి పనికిరావని తెలిసినా నేత్తిమీద వేసి రుద్దుతుంటారు.. వాడు వినటంలేదని తెలిసి మరీ.. దగ్గరగా వచ్చి చెవిలో శంఖం పెట్టి ఊదుతుంటారు.. అవతలి వాడు గోక్కుంటే.. వీడికి సమ్మగా ఉంటుంది.. అవతలివాడు కక్కుకుంటే.. వీడికి కడుపు నిండుతుంటుంది.
సరదాగా ఆ నలుగురూ కలిస్తే ఇలా మాట్లాడుకుంటుంటారు.. మొన్న మా ఫ్రెండ్ కొడుకు ఒకడు.. నాలుగో అంతస్తు బాల్కనీలో నిలబడి.. ఐపాడ్లో స్పైడర్ మాన్  సినిమా చూస్తూ.., ఆనదంలో మునిగిపోయి.. జంపింగ్ జపాంగ్ అంటూ కిందకు దూకేసాడు.. వాడిచేతిలో ఉన్న ఐపాడ్.. ముక్కముక్కలయ్యిందిగానీ.. వాడికి చిన్న వెంట్రుక ముక్క కూడా ఊడలేదు తెలుసా.. ఆశ్చర్య పడ్డ వాళ్ళ అపార్ట్ మెంట్ వాళ్ళంతా వాడిని డాక్టర్ కి చూపిస్తే.. వాడు వెజిటేరియన్ అని బ్లడ్ టెస్ట్ లో తేలిందట.. అదే నాన్-వేజిటేరియన్ ఐతే.. నాలుగు నుండి మూడో అంతస్తులోకోచ్చెసరికే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అని కూడా డాక్టర్ చెప్పారంట.. అని ఒకడు వక్కాణించాడు.
అలా జరిగిందా.. మొన్న దురంతో ఎక్షుప్రెస్.. సూపర్ ఫాస్ట్ లో వెళుతూ వెళుతూ.. స్పీడ్ బ్రేకర్ అడ్డుపడినట్టు.. ఎగిరి పట్టాల మీద పడి ఆగిపోతే.. అందరు ఎం జరిగిందా అని ఎంక్వయిరీ చేస్తే.. ఒక నాలుగేళ్ల పిల్లాడు పట్టాలపైన అడ్డంగా పడుకుని ఉన్నాడంట.. ఎందుకిలా చేసావ్ రా అబ్బాయ్ అని ఆ అబ్బాయిని అడిగితే.. ఇప్పుడే చికెన్ బిర్యానీ తిని వచ్చి అలా  నడుం వాల్చాను అన్నాడంటా.. అని ఇంకొకడు చెప్పాడు.
అవునా.. అయితే మొన్న.. అని ఇంకొకడు మొదలుపెట్టబోతుండగా.. నువ్వు ఎగ్గు-టేరియన్ వి కదా.., ఛిచ్చీ.. ఎటూ కానివాడివి.. అవతలికి పోవెహే.. అని అంతా కలిసి వాడిని బయటకు మోసుకు పోయారు..
ఎవడి తిండి వాడు తిని.. ఎవడిది వాడు కడుక్కుంటే ఎంత హాయిగా ఉంటుంది.., పక్కవాడు ఏమైపోతున్నాడో.. పక్కవాడు ఎం తింటున్నాడో.., అని ఒక పక్క జుట్టు ఊడిపోయేలా.. పక్కవాడి గురించే ఆలోచిస్తూ.. పక్కింటి గోడవైపు తిరిగి పక్కకు పడుకుని.. పక్కా ప్లాన్ రచిస్తూ.. పక్కవాడి ఇంట్లో విషయాల గురించే తన సగం జీవితం పక్కన పెట్టేసే.. తన ఇంట్లో ఏం కూర వండారో పక్కవాడు చెబితేగాని తెలియనివాళ్ళతోనే వచ్చిన సమస్యల్లా.. 
ఆ మర్నాడు ఆ నలుగురి సలహాలు ఎలావున్నాయంటే.. ఈ నాను-వెజ్జుగాళ్ళు వున్నారు చూడండి.. మన వినాశానానికే పుట్టారు అంటే వినండి.. నీటిలో చేపలు బతకనివ్వరు.. అవి లేక మన పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందని మొన్న డిస్కవరీ లో చూపిస్తున్నాడు.. అలాగే కోళ్ళు మేకలు ఊదేస్తుంటే మనకు త్వరలో ప్రళయం ఖాయం అని చెప్తున్నాడు, చక్కగా కూరగాయలు వండుకు తింటే ఎంత చెక్కగా ఉంటుంది.. ఆరోగ్యం కూడాను.. అని గట్టిగ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఒకాయన చెప్తుంటే..
ఒరే నువ్వు ఇది విన్నావా.. సముద్రంలో చేపలు పట్టకపోతేనంట.. అవి పెరిగి పెరిగి.. ఇక పుట్టడానికి ఖాళి లేక.. చేపలు గుడ్లు పెట్టడానికి ఖాళి దొరక్క.. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయి.. వినాశనమేనంట.. అందుకే దేవుడు చేపలు తినేవాడిని సృష్టించాడని మొన్న నేషనల్ జియోగ్రఫీ లో చూపించాడు తెలుసా.. అలాగే.. కోళ్ళు మేకలు మనం తినటానికి పెంచుకుంటున్నవి కనుక.. అవి కూడా మన కూరగాయలు.. మొక్కలు.. లాంటివే అని ఒక అద్యయనం లో తేలిందంట.. ఎవరో చెప్పిన థియరీ ప్రకారం.. మొక్కలకు ప్రాణం ఎలాగైతే మనం తీసేస్తూ వాటిని వండుకు తింటున్నామో.. కోళ్ళు మేకలు కూడా అంతేనని.. వీటి బాధ పైకి కనిపిస్తే.. వాటి బాధ కనపడదు అదే తేడా అని చెప్తున్నారు.. అప్డేట్ అవ్వండ్రా.. అలా ఉండిపోకండి.. అని వెటకరించాడు ఇంకో పక్కాయన.
అటు పక్క టివిలో.. మాంసాహారం తినటం వలన గుండె నొప్పి రాదనీ ఒక డాక్టర్ వివరించి చెప్తున్నది వస్తుంది..
ఛానల్ మారిస్తే.. అందులో శాకాహారం పై పరిశోధన చేసాక.. గుండె నొప్పి రాకుండా ఆపటంలో తోడ్పడిందని చెప్తున్నాడు.. వీళ్ళ రీసెర్చి మీద పెట్రోలు పొయ్య.. ఏదని నమ్మాలి.. ఏదని తినాలి.. ఒకడు ఇది మంచిదంటాడు.. ఒకడు అది మంచిదంటాడు.. అది చూసి ఇక్కడిద్దరు కొట్టుకు చస్తున్నారు..
ఒక చోట అపార్ట్ మెంట్ మీటింగ్ జరుగుతుంది.. విషయం.. పగిలిన సీవేజ్ పైప్ రిపేర్..
అబ్బబ్బ.. దుర్వాసన.. దుర్వాసన.. ఎంత దారుణం మాస్టారు.. మనుషులు ఉండే కొంపల్లా లేవు. ఇంట్లో ముక్కులు మూసుకుని చచ్చిపోతున్నాం అంటే నమ్మండి.., కడుపుకి ఎం తింటున్నారో తెలియక్కర్లా.. అని చిరాకు పడ్డాడు ఒక పెద్దాయన..
అదేంటి మాస్టారు అలా అంటారు.. పగిలింది మీ ఇంటిది.. మా ఇంటిది కాదు.. అది కామన్ పైప్.. అయినా అది దుర్వాసన రాక సెంట్ వాసనా ఎలా వస్తుందండీ.., రిపేరు చేయించటానికే కదా ఈ మీటింగు .. అని మందలించాడు..
ఊరుకోవయ్యా.. మా బాత్రుం చూడు సెంట్ వాసనే వస్తుంది.. పగిలింది అదిగో ఆయన ఇంటి పక్కన.. ఆ పెద్ద మనిషినే అడగండి.. ఎం తింటున్నాడో.. వాళ్ళింట్లో కిచెన్ కూడా అదే కంపు.. అని మళ్ళి ముక్కు పట్టుకున్నాడు..
అవతలాయన ముందుకొచ్చి.. మాటలు జాగ్రత్త.. మీ బాత్రుమ్లో లేని కంపు నీ నోట్లో నుండి వస్తుంది.. అందుకే ఏం తింటున్నావో నువ్వే చూసుకో అని ఇద్దరు యుద్దానికి కాలు దువ్వితే మిగతా వాళ్ళు నీళ్ళు చల్లి దుర్వాసన పాలద్రోలారు..
ఆఫీసు కేఫ్ లో.. బర్త్ డే  పార్టీ కి సగం మంది ఎగ్గోట్టేసి సీట్లకు అతుక్కుపోయారు.. అదేంటిరా వాళ్ళంతా రాలేదేంటి  అంటే.. కేకు మనం పట్టుకొస్తే అది ఎగ్ లెస్ అని నమ్మకం లేదంట.. అందుకే వాళ్ళు రాలేదు అన్నాడు ఒకడు.. కేకు మీద రాసాడు కదా క్లియర్ గా మళ్ళి అనుమానమేంటి.. అంటే ఆ కేకు ప్యాక్ చేసేవాడు... తీసుకోచ్చెవాడు కూడా వెజ్ అయ్యుండాలా.. ఖర్మరా నాయన.. అని తలపట్టుకున్నాడు వేరేవాడు..
అవును కొన్ని కొన్ని కాప్షన్ చూసి నమ్మేసినట్టే.. కే ఎఫ్ సిలో..  వెజ్.. అని రాస్తే వెజ్ అని.. లిప్స్టిక్ లో పంది కొవ్వు వాడం అంటే వాడరని.. బయట కొన్న మంచినీళ్ళు.. పూరా వెజ్ అంటే.. అవును వెజ్జే అని.. నమ్మేస్తే పోదా..  నమ్మేయ్యాలి డ్యూడ్
ఇంతకీ చెప్పోచ్చెది ఏంటంటే.. పులికి చిన్నప్పటి నుండి ఎండుగడ్డి పెట్టాము అనుకోండి.. అది అదే తింటుంది.. జింక మాంసం పెడితే అది దానికే రుచి మరుగుతుంది.. ఎవరు ఎలాగా పెరిగితే అలంటి అలవాట్లు వస్తాయి.. వాటితో మనకేంటి సమస్య.. వాళ్ళ అలవాట్లను బట్టి మనుషుల్ని అంచనా వేయటం ఎంతవరకు మంచిది.. పులి వెనకాలే  తిరిగి వాసన చూసి.. ఛి ఛి.. నాకు ఇది నచ్చలేదు  అంటే.. మనకు నచ్చింది అది తింటుందా అంటే తినదు కదా.. అందుకే వెనకాల వెళ్ళకపోవటమే  కరెస్టు కాదా..
ప్రతి వంద కిలోమీటర్లకి.. భాష.. యాస.. కట్టుబాటు.. తిండి అన్ని మారిపోతుంటే.. అదిగో వాడు అలా ఉన్నాడు ఇదిగో వీడు ఇది తింటున్నాడు అనుకుంటే మనం ఈ భూమ్మీద బతకలేం మాష్టారు..
చిన్నప్పటి నుండి వెజ్ తిన్నవాడికి షుగర్ వ్యాది, గుండెపోటు రావటం లేదా..,  అలాగే మాంసం తిన్నోడిని ఈ జబ్బులు వదిలి పెడుతున్నాయా.. లేదు కదా..
ఎవరో అన్నట్టు ఈత కొట్టడం మంచి వ్యాయామం అయితే.. మరి తిమింగలాలు ఇలియానా లాగా కాకుండా అంత   లావుగా ఎందుకున్నాయి.. చెవులపిల్లి రోజూ కూరగాయలు తిన్నా ఐదేళ్లకు మించి బతకతంలేదే.. నాచు పీచు తిన్నా నలుగొందలేళ్ళు తాబేలు ఎలా బతుకుతుందబ్బా.. అంటే ఎం చెప్తాం.. 
అందుకే ఎవడికి నచ్చింది వాడిని తిననివ్వండి.. మీకు నచ్చకపోతే పక్కకు తప్పుకోండి.. 


1, జనవరి 2012, ఆదివారం

నా పాస్-పోర్ట్ చచ్చింది - 2


మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాంకదా.. ఆ బ్రేక్ తరువాత ఏం జరిగిందంటే.. రైడింగ్ చేసిన పోలీసులాగా తలుపు తీసి పోలీసుకే జర్క్ ఇచ్చి.. ఎవర్ గ్రీన్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణలాగా నిలబడ్డ.. నా వేపు సీరియస్ గా చూసాడు పులిరాజా. "ఇంత భారీ దుస్తులు వేసుకుంటే సరిపోదు.. పద్ధతులు కూడా నేర్చుకోవాలి.. లోపల ఒకరుండగా రాకూడదని తెలీదా..", అని భారీ డైలాగుతో చెంపఛెల్లుమనిపించాడు పులిరాజా.
"అంటే సార్ అదీ.. పదింటికి సార్ రమ్మన్నారు సార్ లేటయ్యిందని సార్ త్వరగా సార్ వచ్చాను సార్..", అన్నాను ఎక్కువ సార్ లు పెడితే కాస్త కరుగుతాడేమోనని.

"వీళ్ళంతా వెఱ్ఱి వెధవలా.. ముందెందుకొచ్చారు..", అని ముందుకూర్చున్న వాడిని చూపించాడు.. వాడు నిజంగా అలానే కనిపించాడు పాపం.. హీహిహీ హీహీహి.. అని అతన్ని చూసి నవ్వుదామనుకున్నాను.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'హలో' నవ్వు నవ్వినా..'భలేభలే' నవ్వులా నవ్వుల'పాలు'  అబాసు హర్లిక్సూ అవుతుందేమోనని వచ్చిన నవ్వును ఆపుకున్నాను. అమాయకంగా ఫేసుపెట్టి ఏమీ మాట్లాడకుండా నోట్లో చాక్లెట్టుపెట్టుకున్నట్టు వుండిపోయాను. లేకపోతే.. ఆ ముందు గదిలో అలసిపోయి.. నీడచాటు. సేదతీరుతున్న..గేది దూడలాగా.. బల్లపైన పడి అటుఇటూ పొర్లుతూ.. ముందు వైర్లెస్ సెట్టుపెట్టుకుని.. అందులో వస్తున్న మాటలు ఎఫ్-ఎమ్ రేడియోలో పాటల్లావింటూ పరవశించిపోతూ కునుకులాగుతున్న లేడీ కానిస్టేబుల్ ని అసభ్య పదజాలంతో దూషించి హింసించి కవ్వించానని కేసుపెట్టి లాకప్పులో తోసేసినా తోసేస్తాడు పులిరాజా.

"ఈ రోజుకి చాలామందున్నారు.. నీ నెంబరు రాసుకో ముప్పైఆరు.. రేపు పదింటికి ఖచ్చితంగా రా.. ఒక్క నిముషం లేటయినా నీకు జిందగీ కబీ నహీ మిలేగా దుబారా", అన్నాడు సీరియస్ గా.
"సార్ అది ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టాను.. ఎంతసేపయినా వుంటాను.. ఈరోజే కుదరదా సార్", అన్నాను.
"ఏ ఇంకో రోజు సెలవుపెట్టలేవా..", అన్నాడు.. "అవసరమైతే.. మీరుపెట్టమంటే ఇప్పుడే పెట్టేస్తాను సార్", అన్నాను అతివినయం ప్రదర్శించి. అతివినయం అదేదో లక్షణం అని తెలుసుకోలేక కరిగిపోయి సరే అయితే సాయంత్రం నాలుగింటికి రా.. అని ఒక కాగితం ఇచ్చి దానిమీద ముప్ఫైఆరు నెంబరేసాడు.

ఆ కాగితంలో మరళా ఈ కింది ఏమైనా నాలుగు ఫ్రూపులతోపాటు.. ఒక నిమ్మకాయ.. కుంకుమ-పసుపు.. దొరక్కపోతే మరాఠీ-సింధూరం.. ఎవరివైనా నాలుగు తలవెంట్రుకలూ.. చేతబడిచేయటానికి వాడే పుర్రే లేదా తొడఎముక అన్న లిస్టు ప్రకారం అన్నీ తీసుకుని మధ్యాన్నం మూడున్నరకే చేరుకుని స్మశానంలో ఒంటరిగావున్న కాశ్మోరాలా రడీగావున్నాను. కానీ ఈసారి ఆఫీసుకెళ్ళే డ్రస్సుకాదు. సాగిపోయిన టీ-షర్టు.. షైనింగు తో మెరిసిపోతున్న కొత్త జీన్స్( చీకిపోయిన జీన్సు.. అయితే కాస్ట్ ఎక్కవ కదా అందుకని..) సగం తెగిపోయిన చెప్పులేసుకుని వచ్చి కూర్చున్నాను. అక్కడనేను తప్ప ఎవరూలేరు. టైమెలా కదులుతుందో వాచీలో ముల్లు ఎలా తయారుచేస్తారు లాంటి యక్షప్రశ్నలేసుకుంటూ.. ఆలోచిస్తూ చూసుకుంటుండగా.. బుర్రలో ఒక విషయం వెలిగింది.. నా వాచీ చాలా కాస్ట్లీగా కనిపిస్తుందని.. ఎవడూ చూడకుండా తీసి జేబులో పెట్టేసుకున్నాను. నా అవతారం చూసి చైన్ స్నాచింగ్ టీమ్ లా వున్నాడని ఏ పోలీసోడన్నా పట్టుకుంటాడేమోనని అనుమానమొచ్చి నా పాత పాస్పోర్టు.. డాక్యుమెంట్లూ బయటకు తీసి కనబడేలా చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాను. ఇంతలో కొంతమంది నాలాగే పులిరాజాను కలవటానికే వచ్చి కూర్చున్నారు. హమ్మయ్యా కాస్త బలమొచ్చిందన్నట్టు నేనూ కూర్చుని వాళ్ళతో మాటలు కలిపాను. నాలుగయ్యింది.. నాలుగున్నరయ్యింది.. ఐదింటికి తాపీగా వచ్చాడు పులిరాజా.. ఇంకా నా తర్వాత ఒక ఐదుగురు వచ్చున్నారు.

నాది ముఫ్ఫై ఆరైతే.. నా తరువాత నెంబరోడిని ముందు పిలిచాడు.. సార్ నాది ముఫ్పయ్యారు అన్నాను.. ఆగు.. ఇది వేరే కేస్ లే అని నన్నుకుర్చోమన్నాడు. వాడితో మంతనాలు అయిపోయాకా ఆఖరులో తలుపు కాస్త దగ్గరకు పడింది.. ఎవో గుసగుసలు అయ్యాకా.. కాసేపటికి.. చెమటలు తుడుచుకుంటూ వాడు బయటకెళ్ళిపోయాకా నన్ను పిలిచాడు. లిస్టులో వున్న డాక్యుమెంట్లన్నీ తెచ్చానని చెప్పాను. పేరు... ఊరు.. వయసు.. ఎత్తూ భరువూ.. నడుం చుట్టుకొలత.. కాళ్ళమీద వెంట్రుకల లెక్క... ఇంట్లో ఎంతమందుంటారు.. పక్కింట్లో.. ఆ ఎదురింట్లో ఎవరెవరు ఉంటారు.. మీ పక్కవీధిలో ఎన్ని ఇల్లున్నాయి.. లాంటి ప్రశ్నలన్నీ వేసాకా.. డాక్యుమెంట్లన్నీ చూపించమన్నాడు.. ఇంకేముంది.. అయిపోయింది.. ఇక్కడ ఏదో లిటిగేషన్ పెడతాడు, ఇప్పుడు.. ఏదడిగినా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలని అనుకుంటుండగా.. డైరెక్టు పాయింటుకొచ్చేసి.. చేతులుపైకెత్తి బద్దకం తీర్చుకుంటూ.. ఎంతో కొంత ఇవ్వుమరి.. అన్నాడు. "సార్.. ఎంతొ కొంత అంటే.. ఎంత?", అన్నాను. ఐదొందలు నుండి రెండువేలు వరకూ ఇస్తారు.. ఎవరిష్టం వారిది.. అని పిచ్చినవ్వు మనసులో నవ్వుకునుంటాడుగానీ పులిరాజామొహంపై అదికనబడలేదు. "ఎవరిష్టంవారిదా.. నువ్వుచేసేది ఏ వ్యాపారం రా?, అసలు పోలీసుద్యోగమేనా నీది..?", అనిపించింది మనసులో. మనసులో అనుకున్నవి కనిపెట్టే టెక్నాలజీ రాలేదు కాబట్టి బతికిపోయాను. చాలా శాంతంగా.. ప్రశాంతంగా మొహం పెట్టి.. అంతిచ్చుకోలేను సార్ అన్నాను. "ఏఁ.. సాఫ్ట్వేర్ అంటున్నావ్.. ఐదంకెల జీతం వుండుంటుంది.. కనీసం మంచి బట్టలుకూడా వేసుకోలేదు.. మెరిసిపోయే నూటేభై ప్యాంటు.. సాగిన టీ-షర్టు.. మిగతా డబ్బులన్నీ సేవింగ్సే కదా.. సరేలే.. ఎంతిస్తావ్", అన్నాడు తలుపు దగ్గరేయమని సైగ చేస్తూ. "ఓరినీ.. మంచి బట్టలేసుకుంటే.. అలా అన్నావా.. ఇప్పుడిలావచ్చావా.. సరేకానియ్ నీ టైము", అనుకుని తలుపు దగ్గరగా జరిపాను. "సార్ ఇవే వున్నాయని", మూడొందలు చేతిలో పెట్టాను.. అందులో రెండు వందనోట్లు. ఒక ఏభై నోటు.. మిగతాది పదుల కాయితాలు.. చిల్లర తీసి చేతులో పెట్టి.. వందలూ ఏభై నోటు తీసుకున్నాడు.. తరువాత మారు మాట్లాడకుండా అసలు ఏమిచ్చానో చూడకుండా నా డాక్యుమెంట్లు స్టేపిల్ చేసేసాడు.. ఇది పూర్తిచెయ్యి.. నేనిప్పుడే వస్తాను.. పొద్దున్నుండి సీట్లో కూర్చుని నడుంపట్టేస్తుంది.. మా తిప్పలు ఎవడికీ తెలియవు అని ఏదేదో నసుక్కుంటూ.. పులి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.. ఎన్నాళ్ళకు నవ్వావురా నాయనా.. పులిని కూడా నవ్వించాలంటే.. గాంధీగారు నవ్వాలని అప్పుడే అర్ధమయ్యింది.

 ఇచ్చిన అప్లికేషన్ ఫాం పూర్తిచేసేసి.. హమ్మయ్యా అయిపోయింది ఎంక్వైరీ అనుకున్నాను. నోటినిండా పాన్ పరాగ్ వేసుకుని మూతికి ఒక సెల్లోటేపువేసుకొచ్చిన పులిరాజా.. పూర్తిచేసిన ఫాంలు తీసుకుని ఏమీ చూడకుండా... సెల్లోటేపులోంచి.. ఊ..ఊఁ.. మాత్రమే మాట్లాడుతూ.. ఇంకొక రెండు కాగితాలిచ్చి జిరాక్స్ తీసుకురమ్మన్నాడు. దాంతోపాటు ఒక ఫాం ఇచ్చి అది ముప్పై కాపీలు తీయించమన్నాడు. అవన్నీ తీయించిస్తే నాకు కావాల్సిన రెండు ఫాంలు ఇచ్చి.. మిగతా ముప్ఫైకాపీలు ఫైలులోపెట్టుకున్నాడు.. అది చూసి నాకు జీవితంమీద.. భవభంధాలమీద విరక్తి కలిగిన వాడిలా గిలగిలాకొట్టుకున్నంత పనయ్యింది.. "ఛీ నీ..కక్కుర్తి మీద కాకిరెట్టెయ్య...", అన్న తిట్టుగుర్తొచ్చి.. అది హిందీలో ట్రాన్సలేషన్ చెయ్యటంరాక.. నిట్టూర్చుతూ బయటకొచ్చాను. పోలీస్టేషనుపక్కనే చెట్టుకింద పార్కుచేసిన నా బండితీస్తుంటే ఎవడో పైనుండి చిన్నసైజు బంతిచ్చుకుని నెత్తిమీదకొట్టినట్టు అనిపించి తలెత్తి పైకిచూసాను.. "కావ్ కావ్..", అని మరాఠీలో అరిచింది నల్లకాకొకటి.. నెత్తిమీదపడ్డడి బంతికాదని తెలిసి.. "ఛీ.. నా ఎధవ బతుకు..", అని అలాగే తల తుడుచుకోకుండా పాతబట్టలు చించుకుంటూ ఇంటికొచ్చేసాను.

ఇంతకూ పులిరాజా ఇచ్చిన ఆ రెండు ఫాంలు ఎంటంటే.. నేను మీ ఇంటి పక్కింటిలోనే వుంటాను. నేను మంచివాడినే.. ఎప్పుడూ సిగరెట్లు.. మందూ.. పేకముక్కా.. చికెన్ టిక్కాలాంటి అలవాట్లులేవు. ఒకవేళ వున్నా మిమ్మల్ని పిలవకుండా నేనొక్కడినే ఎంజాయ్ చెయ్యలేదు. కొలెస్ట్రాల్ ఎక్కువుండటంవలన.. ఎప్పుడూ చిన్నపిల్లల దగ్గరనుండి ఐస్కీములు అవీ దొంగిలించలేదు. పొద్దున్నే మీ ఇంటిముందున్న పేపరూ.. పాలప్యాకెట్లూ పోతే నాకు సంబంధలేదు.. అని అన్నీ రాసి పక్కింటాయనచేతో ఎదురింటాయనచేతో లేక కిందింటాయనచేతో సంతకం చేయించాలి.. అది సరిపోదు మళ్ళీ ఆ సంతకంపెట్టినవాడి ఎడ్రస్ ఫ్రూపు.. ఐ.డి ఫ్రూఫు జిరాక్సులూ.. పుట్టుమచ్చలు.. చేతిరేఖలూ ఫొటోలుతీసి ల్యామినేషన్ చేయించి పంపాలి.., అలాగే వాటితోపాటుగా వాళ్ళ తలవెంట్రుకలు.. చేతి లేదా కాలిగోళ్ళు డి.యన్.ఏ టెస్ట్ కోసం పంపినట్టు సేంపుల్ కూడా పంపాలి... ఇవన్నీ అడిగితే వాడిస్తాడా.. ఇదెక్కడి రూలు.. ఇంతకుముందులేదే.. ఉండు మన్మోహన్ సింగ్ తో ఇప్పుడే మాట్లాడతాను నేను... వాడు నాకు బాగా తెలుసు అని ఫోన్ డయల్ చేసేస్తున్నాడు మా కిందింటాయన.. అబ్బే అంత 'పేద్ద' రికమెండేషను ఎందుకండీ.. మీరు మాట్లాడినా ఆయన ఇప్పుడూ ఎప్పుడూ మాట్లాడలేడుసార్.. మొహమాటం ఎక్కువా, వదిలెయ్యండి.. నన్ను నమ్మి ఇచ్చేయండి, గొడవొదిలిపోతుంది.. అని  వాడిని బ్రతిమలాడి వసుదేవుడిలా మారితే.. కాస్తకరిగి.. "సరేగానీ.. ఎన్నాళ్ళుగానో నేనూ పాస్పోర్టు అప్లై చేద్దామనుకుంటున్నా నాకూ కాస్త అప్లైచెయ్యటంలో హెల్ప్ చెయ్యాలి..", అని వాళ్ళావిడ ఫొటోమీద ఒట్టేయించుకుని.. నన్ను ఒప్పించాడు. "బాబోయ్.. పాస్పోర్టా అని అరవలేక.., సరే చేస్తా" అని చెప్పాను. మళ్ళీ తరువాత రోజు డాక్యుమెంట్లు తెచ్చుకుని సర్వం సమర్పయామి.

మళ్ళీ చెట్లు చిగురించాయి..అన్నట్టు నా జుట్టుకు నాలుగైదు కటింగులయ్యి.. బుర్రలో ఉన్న మెమొరీ కాస్తా రిఫ్రెష్ అయిపోయి.. అన్నీ మర్చిపోయిన కొన్నాళ్ళకు.. వేరే పోలీస్టేషన్నుండి మరో కాల్. నువ్వు రేపొద్దున్నే పదింటికి రా.. నీపాస్పోర్ట్ వెరిఫికేషన్కి అని. ఎందుకండీ.. మొన్న ఫలానా పోలీస్టేషన్లో  అన్నీ సమర్పించుకున్నాం అంటే.. నీవు మార్చిన కొంపలు ఎన్నుంటే అన్నిసార్లు తప్పవు నీకీ ఎంక్వైరీలు అన్నాడు. "భలేభలే సెహభాష్ నారాజా.. నక్కతోక తొక్కబోయి.. ఏ కుక్కతోకో తొక్కుంటాను.. సరే కానీయ్.." అని భుజంపై తట్టుకుని..చంకలుగుద్దుకుంటూ తరువాత రోజు ఆఫీసుకి సెలవు పెట్టకండానే వెళ్ళాను. ఎందుకంటే ఆరోజు శనివారం ఆల్రెడీ సెలవు కాబట్టి.

మళ్ళీ మొత్తం డాక్యుమెంట్లన్నీ జిరాక్స్ కాఫీలు తీయించుకోటానికి.. దిగిన ఫొటోలు ప్రింటులు తీయించటానికీ.. పెర్సనల్ లోన్ ఒకటి తీసుకుని జాగ్రత్తగా అన్నీ ఇచ్చుకున్నాను. మళ్ళీ ఈ పోలీసూ చేతులు పైకెత్తి బద్దకంగా విరుచుకుంటూ.. ఐదొందలివ్వు అన్నాడు.
ఈసారి.. అన్నా హజారే గుర్తుకొచ్చాడు.. ముసలాయన అంత కష్టపడుతుంటే మనమిక్కడ అడిగిన వాడికల్లా లంచాలిచ్చి తప్పుచేస్తున్నామని అనిపించింది.. పొంగుతున్న ఆవేశంతో.. ఇదెక్కడి గోల మొన్న అక్కడ అన్నీ ఇచ్చేసాను.. ఈ ఎంక్వైరీ వుంటుదని తెలియదుకూడా.., ఇంకా ఎన్నిసార్లివ్వాలండీ  అని నసుగుతుంటే "ఠీక్ హే..బేజ్ దేంగే..", అన్నాడు. ఏంటి మళ్ళీ అడిగ కాస్త మెత్తబడతాడు అనుకుంటే... అంత పెద్ద బూతు తిడతాడా.. సరేలే అని పౌరుషంతో లేనిమీసం తిప్పుకుంటూ నెత్తిమీద పేపర్ ని గొడుగులా  పెట్టుకుని ఏ కాకులూ పాడుపనిచెయ్యకుండా తప్పించుకొచ్చేసాను.

పదిరోజులయ్యింది.. ఇరవైరోజులయ్యింది.. ఆన్లైన్లో స్టేటస్ మాత్రం పోలీసులు ఇంకా వెరిఫైచేస్తూనేవున్నారు. నీపై కేసులు ఇంకా గాలిస్తూనే వున్నారు వెళ్ళివాళ్ళను బ్రతిమలాడుకొని తొందరగా కేసులన్నీమాఫీచేయించుకుని వెంటనే మాకు పంపు అనే వుంది.
నెలైంది.. కేసులేమీ మాఫీలైనట్టులేవు. ఇక లాభంలేదు.. ఒక్క హజారే కాదు.. హజార్ అన్నాహజారేలు ఉన్నా ఈ దేశాన్ని ఎవడూ బాగుచేయలేడు.. వెళ్ళి మళ్ళీ వసుదేవుడు అవతారమెత్తాల్సిందే.. అని మళ్ళీ పెర్సనల్ లోన్ తీసుకుని డాక్యుమెంట్లతోపాట.. స్టేటస్ అడగటానికెళ్ళాను.. అదేంటి ఇంకా వెళ్ళలేదా.. అలా జరగదే.. చూస్తానుండు అని అన్నీతిరగేసాడు..,గంట ఆగమన్నాడు.. వాడెవడికో ఫోన్చేసి అడిగాడు.. వాడు పాస్వార్ట్ తెలిసిన వాడు ఈరోజు సెలవు రేపుచెబుతాన్నాడు. సరేలే.. ఎక్కడో మిస్ అయ్యింటుంది.. మిసెస్ అయ్యివచ్చాకా.. మళ్ళీ పూర్తిచేద్దాం, ఒకవేళ పాతది ఉంటే పంపించేద్దాం లేకపోతే కొత్తది అని మొత్తం డాక్యుమెంట్లు మళ్ళీ తీసుకున్నాడు. ఈ సారి డబ్బులు అడగలేదు.. ఇచ్చానని అనుకుని వాడున్నాడు.. అడగలేదు పర్వాలేదు అని నేనున్నాను.. అక్కడ అన్నాహజారే నీరసపడి జైల్ భరో అంటున్నాడు.

ఇంకా ఏ కబురూలేదు.. ఆన్లైన్లో స్టేటస్ మాత్రం ఇంకా అదే. ఎన్నాళ్ళకు నా చచ్చిన పాస్పోర్టు బతుకుతుందో తెలీదుకానీ.. పోలీసుబట్టలుకాకుండా మామూలు బట్టలేసుకుని వెళ్ళేవచ్చేవాళ్ళను బావొచ్చాడు బావొచ్చాడు అని చూసినట్టుగా.. మనల్ని చూసే ఆ ఖైదీలూ.. ఆ ఖైదీకి కేరేజి పట్టుకెళ్ళేవాడిలాగా వారానికోసారి పోలీస్టేషనుకెళ్ళిరావటాలు భలేభలేమజాగావుంది.
ఇన్ని అద్భుతమైన అనుభవాలను పంచుతున్న మన సర్కారీవారికి శతకోటి వందనాలతో.. ఈ టపా అంకితం.

---------------------------------------------------------
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవకుండా.. అన్నీ తీపి అనుభవాలతో.. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను. :-)


29, డిసెంబర్ 2011, గురువారం

నా పాస్-పోర్ట్ చచ్చింది..



నా పాస్పోర్ట్ చచ్చింది.. 
అవును.. నిజంగానే నా పాస్ పోర్ట్ చచ్చింది. ఇంగ్లీష్ లో ఎక్ష్పైర్డ్ అనేపదాన్ని తెలుగులో తర్జుమా చేసినా అదే అర్ధం వచ్చి చచ్చింది. ఎప్పుడో భూమి పుట్టకముందు పాస్పోర్టుంటే పడుంటుంది కదా అని ఒక ఆలోచనొచ్చి.. నా ఎమ్మెస్సీ సీటుకోసం కౌన్సలింగ్ పనిలో విశాఖపట్టణం వెళ్ళినప్పుడు పాస్పోర్టాఫీసుకు వెళ్ళి ఒక దరఖాస్తు పడేసుకున్నాను. ఎవరూ చూడలేదు కదా అని సైలెంటుగా అటుఇటూ చూస్తూ వచ్చేస్తుంటే.. ఆ పడేసుకున్న దరఖాస్తు ఎవడికో కనబడి నన్ను పిలిచి.. "బాబూ.. దరఖాస్తు పడేయటం అంటే ఇక్కడిలా ఆఫీసు బయట పారేయడంకాదు.. లోపలికెళ్ళి ఇవ్వాలని చెబితే తెలివొచ్చి.. తెలిసొచ్చి.. ఆఫీసులోపలకెళ్ళి చూస్తే.. ఎవరూలేకపోయినా లైట్లు వెలిగిపోతూ.. ప్యాన్లు తిరుగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సరేలే ఎవడొకడొస్తాడు... అని ఆఫీసులో అలా కుర్చీలో నడుంవాల్చేసరికి ప్రాంత ప్రభావమో.. లేక అయస్కాంత ప్రభావమో.. తెలియదు కునుకు పట్టేసింది. ఒక అరగంటకి లేచి చూస్తే ఇంకా ఎవరూరాలేదు.. ఎటు వెదికినా అదేదో రామ్ గోపాల్ వర్మసినిమాలోలా ఖాలీ గదులు.. కిర్రు కిర్రు తలుపులు.. భయంకరంగా భయపెడుతున్నాయి. ఆఖరికి కాసేపు అటుఇటూ తిరిగి ఎవడూ రాడని నిర్ణయించుకుని.. అక్కడే బల్లపై దరఖాస్తు.. దానికి సరిపడా డబ్బులు పడేసొచ్చాను.


 కొంత కాలం గడిచింది.. నెత్తిమీదబలమైన దెబ్బతగిలిన తెలుగు టీ.వీ సీరియల్ లో క్యారెక్టర్ లాగా ఎప్పుడు ఏ దరఖాస్తు ఎక్కడ పడేసానో మర్చిపోయాకా.. మా వూరికే బి.బి.సి గా చెప్పుకునే ఒకాయన కబురట్టుకొచ్చాడు. మీ ఊర్లో ఫలానా వాళ్ళబ్బాయిని నన్నొచ్చి కలవమను అని పక్కూరి పోలీస్టేషనులో వుండే కానిస్టేబుల్ చెప్పిన కబురంట.. చెప్పింది చెప్పినట్టు కాకుండా ఆ కబురుకు నాలుగు రకాల అత్తర్లు పూసి మా వూరంతా ఊదేసాడు. పోలీసోడు పిలిచాడా!.. అని వూరు వూరంతా నివ్వెరబోయి ఒక్క నిముషం ఆగిపోయింది. అదే విషయం ఎక్కడపడితే అక్కడ గూమిగూడి చెప్పేసుకుంటున్నారు. అలా గాలివార్తలా ఎగిరొచ్చిన వార్తవిని నేనూ కాసేపు నివ్వెరబోయాను.. తేరుకుని కాస్త బయటపడి ఇంటికి బయలుదేరి ఒంటరిగా గదిలోకి వెళ్ళి పోలీసు పిలిచింది ఎందుకా అని.. నటన వారసత్వంగా వచ్చిన హీరోలాగా  ఒక పది టేకులు తీసుకుని అలోచించాను. నాలుగు లాంగ్ షాట్లతో.. మూడు జూమ్ షాట్లలో నా మొహం అద్దంలో చూసుకుంటూ ట్యూబులైటు స్విచ్చ్ అన్ - స్విచ్చ్ ఆఫ్ చెయ్యగా.. ఎప్పటికో గానీ వెలగలేదు.. ట్యూబులైటు కాదు.. నా వెధవ బుర్ర.. అప్పుడెప్పుడో దరఖాస్తు పడేసుకున్న పాస్పోర్టుకైయ్యుంటుంది.. లేకపోతే మనమేం మారణహోమాలు.. మానభంగాలు చేసామని పోలీసోల్లు పిలుస్తారులే అని పోలీసాయన్ని కలుద్దామని వెళ్ళాను. 


ఆయన తీరిగ్గా ఆఫీసులో కూర్చుని.. అప్పుడే టాయ్ లెట్ రూమ్ తుడిచిన.. ఫ్రెష్ కొబ్బరిచీపురు నుండి ఒక పుల్ల విరుచుకుని పళ్ళుకుట్టుకుంటూ తన్మయత్వం పొందుతున్నాడు. ఒక పావుగంటకి తేరుకుని.. ఎదురుగా నిలబడ్డ నన్ను చూసి పేరేంటి అని అడిగాడు. "పాస్పోర్టండి", అని చెప్పగానే.. ఏంట నీపేరే పాస్పోర్టా.. మరి నీకెందుకింక పాస్పోర్టు అన్నాడు వెటకారంగా.. అదికాదండి.. అని నా పేరు చెప్పాను. వచ్చావా.. బాగానేవుంది. నీకు పాస్పోర్టెందుకూ అని అడిగాడు. అదిఅదీ.. విమానం ఎక్కడానికండీ.. అన్నాను కంగార్లో. ఏంటి విమానమే.., పాస్పోర్ట్ లేకపోతే ఎక్కనివ్వరా? సరేలే.. పాస్పోర్టు వెరిఫికేషనంటే చాలా తతంగం వుంది. పక్కనేవున్న పాత చెక్కబీరువాలో బూజుపట్టేసి సగం చెదలు తినేసిన ఫైల్సన్నీ చూపిస్తూ.. ఈ కేసులన్నీ తిరగెయ్యాలి, అన్ని పోలీస్టేషన్లలో నీ పేరుమీద కేసులున్నాయోమో చూడాలి.. అక్కడున్న నోటీసుబోర్టుల్లో మెల్లో ఒక నల్లపలక వేసుకునున్న ఫొటోలతో.. నీ ఫొటో పోల్చిచూసి కనుక్కోవాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తతంగం వుందయ్యా. పోలీసోళ్ళకేపనీ వుండదని అనుకుంటారు జనాలంతా.. ఇవన్నీ చేసి రాత్రికి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాం.. మా బతుకులు ఎవడికీ అర్ధం కావు.. అని తింగరి చూపులు చూస్తున్న నా వంక తింగరన్నర చూపులు చూసాడు పోలీసు. నీ ఎంక్వైరీ నేను చాలా త్వరగా పంపించేస్తాను.. పాస్పోర్టు త్వరగా వచ్చే బాధ్యతకూడానాదే..  కానీ మరి ఖర్చవ్వుద్ది.. ఎంతోకొంత ఇచ్చుకుంటే.. అని చేతులు నలుపుకోటం మొదలెట్టాడు. సర్వీసులో ఎన్ని సార్లు నలిపాడో తెలియదు.. నలిపి నలిపి ఆ చేతులు సన్నగా అయిపోయాయి. ఆ నలిగిపోతున్న సన్న చేతులు చూస్తే..  ఆ పోలీసు ఉద్యోగంలో నలిగిపోతున్న జీవితాన్ని ఊహించుకుంటే.. కన్నీళ్ళొచ్చేసాయి.. సార్!.. ఇక నలపకండి... ఆపండి.. ఆపండి..ఆ..పం..డి. అని ఎకో సౌండు ఎఫెక్టుతో అరిచి. "నలిగిపోతున్న మీ పోలీసు జీవితాన్ని నేనింక చూడలేనండీ..", అని భారీ డైలాగొకటి చెప్పి ఇదిగో వంద.. అని నవ్వుతున్న గాంధీగారిని ఏడుపుకళ్ళతో చూస్తూ వందనోటు చదివించుకున్నాను. 


పాతసినిమాల్లో క్యారెక్టర్ నటి చీరకొంగుతో నోరునొక్కుకుని ఏడ్చివెళ్ళిపోయినట్టుగా చేత్తో నోరునొక్కుకుని వెళ్ళి సైకిలెక్కాను. మళ్ళీ చాలా రోజులు గడిచాకా.. హైద్రాబాద్ సిటీ బస్సులో పొద్దున్న పదింటికి ఆఫీసుకని బయలుదేరిన అమ్మాయి.. దిగే ఎక్కే మగాళ్ళ చేతుల్లో నలిగినట్టుగా.. సర్కారీ తపాలా బంట్రోతు చేతుల్లో నలిగి నలిగి దళసరి..ఖాఖీ రంగు కవరు చుట్టుకుని.. పోస్టులో నా పాస్పోర్టు ఇంటికొచ్చింది. "ఏండే.. అబ్బాయిగారికి పాస్పోర్టొచ్చేసింది.. ఇంక విదేశాలకెళ్ళటమే ఆలస్యం.. మరి పాస్పోర్టొచ్చిన సంతోషంలో నాకేమన్నా..", అని నెత్తిమీద చెయ్యివేసుకుని బుర్రగోక్కుని ఉన్న నాలుగెంట్రుకలూ రాల్చేయబోయాడు తపాలా బంట్రోతు. ఆగు నాయనా ఆగు.. ఇప్పుడే గుమ్మాలు తుడుచుకన్నాం నువ్వు ఆ నాలుగూ రాల్చి ఛండాలం చెయ్యకు అని గోక్కునే వేళ్ళమధ్య ఒక ఇరవై రూపాయలు పెట్టి.. గోకుడు ఆపించి.. పంపించాల్సొచ్చింది.  సరే మనకు ఇప్పట్లో పనున్నా లేకపోయినా.. పాస్పోర్టంటూ ఒకటుంది కదా అని.. అలాగే భద్రంగా ఇనబ్బీరువాలో పెట్టి.. చెదలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుని.. అప్పుడప్పుడూ తీసి కళ్ళకద్దుకుని.. పదేళ్ళయినా ఒక్క పేజీ కూడా నలక్కుండా.. ఒక్క పెన్నుగీతకూడా పడకుండా.. కొత్త వాసన పోకుండా.. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న పాస్పోర్టుకు ఏం రోగం వచ్చిందో మరి చచ్చింది. ఎవడన్నా అడిగితే.. గర్వంగా నాకూ ఉంది పాస్పోర్ట్ అని చెప్పుకోటానికి తప్ప ఏ పనికీ పనికి రాకుండా.. ఏ మార్పూ లేకుండా. ఇన్నాళ్ళూ బీరువాలో.. అదే నలిగిపోయిన ఖాఖీ రంగు కవరులోనే చుట్టబెట్టుకుని నాజుకుగా కనిపించే నా పాస్పోర్టుకు ఏమయ్యిందో తెలియదు.. మరి చచ్చి చచ్చింది.


నాకు ఇక్కడో అనుమానం వచ్చింది.. అప్పటి చీపురు పుళ్ళ పోలీసు.. ఏ వెధవ ముహూర్తంలోనో.. తన ఎడంచేత్తోనో ఛీడ సంతకం పెట్టుంటాడు.. లేక ఆ పాస్పోర్ట్ ఆఫీసోడు.. చూపుడు వేలుకు తొడుక్కోవాళ్సిన రాయి ఉంగరం.. ఏ ఎడంకాలి పిల్లవేలుకో తొడుక్కునుంటాడు.. వాళ్ళందరి చీఢ నాకు పట్టుంటుంది. లేకపోతే.. నేను పనిచేసిన కంపెనీల్లో మన పక్కనున్నోళ్ళూ.. పక్క ప్రాజెక్టోళ్ళూ.. నేనీ ప్రాజెక్టులో చెయ్యను అని ఇచ్చేస్తే నా దగ్గరనుండి నేర్చుకున్నోళ్ళు. అలాగే ఆఫీస్ బాయ్.. టీ బాయ్ తో సహా అందరికీ విదేశం ఆఫర్లొచ్చినా మనకు కంపెనీ తరపునుండి ఒక్కసారికూడా.. ఆఫర్ రాకపోగా.. కనీసం పాకిస్తాన్ ఆఫ్ఞనిస్తాన్ వెళ్ళే ఛాన్సుకూడారాలేదు. సొంత డబ్బుల్తో సింగపూర్.. మలేషియా.. లాంటి ట్రిప్పులూ వేసే చాన్సూ కలిసిరాలేదు. ఇలాక్కాదు. పాస్పోర్టు పై ఒక్క స్టాంపైనా పడాలి అని స్టాంపు ఒకటి తయారుచేయించి.. నేనే రెండు గుద్దులు గుద్దేద్దాం అని డిసైడైపోయి.. అదే అవిడియాతో ఇనబ్బీరువాలో వున్న పాస్పోర్టు తీసి చూసే సరికి.. బ్రేకింగ్ న్యూస్ లాగా పాస్పోర్టుకు కాలంచెల్లిందనే షాకింగ్ న్యూస్ బయటపడింది. లేకపోతే ఇంకొక పదేళ్ళకుగానీ పాస్పోర్ట్ చచ్చిందనే విషయం లోక్పాల్ బిల్లులాగా బయటపడేది కాదు.  అదన్న మాట అసలు విషయం.. 


సరే ఇప్పుడు చచ్చినదాన్ని ఇంట్లో ఏం పెట్టుకుంటాం.. మళ్ళీ అప్లై చెయ్యాలికదా.. మళ్ళీ అప్లైఅంటే  రిన్యూ చెయ్యటమే.. ఆఁ.. ఎంతసేపు మహా అయితే మొబయిల్ లో బ్యాలెన్స్ రీచార్జ్ చేసినంత టైంలో అయిపోవచ్చు.. అప్పుడంటే పదేళ్ళ క్రితం మాట.. ఈ మొబైల్సూ.. కంప్యూటర్లూ ఎరగం కదా.. ఇప్పుడంతా ఆన్లైనే అయ్యింటుంది అని గూగులమ్మతో నాకొచ్చిన సందేశాలు చెప్పిచూద్దునా.. దుమ్ముపట్టేసి.. బూజులు దులపని ఇల్లులాగా ఒక వెబ్బైట్ కనిపించింది. నా కంప్యూటర్ మానిటరేమన్నా సరిగ్గాలేదేమోనని క్లాత్ పెట్టి తుడుద్దునా.. అయినా అలాగే వుంది.. ఆ తరువాత తెలిసింది. ఆ రంగులే అంతని. చఛా!, ఇదైయ్యుండదు.. ఇండియాలో ఎంతమంది పాస్పోర్టులు తీసుకొనుంటారు.. పాస్పోర్టు తీసుకున్నవాడిదగ్గరనుండి.. వెబ్సైట్ ఫండుకింద కనీసం ఒక్కరూపాయి తీసుకున్నా హైక్లాసు వెబ్సైట్ చెయ్యొచ్చుకదా. అలా చేసేవుంటారు.. ఇది ఎవడో తలమాసినోడిదయ్యుంటుంది.. గవర్నమెంటు పేరు పెట్టుకున్నాడు.. అని ఆ పేజీ మూసేద్దామనుకునేలోగా పైనే కనబడింది.. బయట అక్రమసంబధాల మంత్రిత్వశాఖ అని. (Ministry of External Affairs), ఓరినీ..!!, నా అంచనాలన్నీ తారుమారయ్యాయే.. అయితే వీళ్ళు బయట సంభంధభాంధవ్యాలు.. పెత్తనాలూ తప్ప.. ఇంట్లో విత్తనాలు నాటుకోలేని వాళ్ళన్న విషయం ఎవరూ అనక్కర్లేదు.. ఆ వెబ్సైట్ చూస్తేనే తెలిసిపోతుంది. మళ్ళీ అందులో ఏ ఏరియాకు తగ్గట్టు ఆ వెబ్సైటు.. మళ్ళీ దేనికదే సెపరేటు డిజైను.. ఏంటో..!, సరేలే ఇందులో ఎన్ని కోట్లు స్వాహానో.. మనకెందుకొచ్చినగొడవ... మనకెవడన్నాఇస్తాడా చస్తాడా.. మనది నొక్కకుండా వుంటే అదే దస్ హజారూ..!, అనుకుని వూరుకున్నాను. 


అసలు వివరాల్లోకి వెళ్ళీ చూడగా తెలిసిందేంటంటే.. రిన్యూ అన్నా కొత్తది అప్లై చేసినా అన్నిటికీ గవర్నమెంటు ఉద్యోగుల "బాగు" దృష్టిలో పెట్టుకుని ఒకటే స్కీము పెట్టారని తేలిపోయింది. అంటే ఆఖరికి పోలీసు ఎంక్వైరీతో సహా.. అమ్యామ్యా మాములేనని తేటతెల్లమైపోయి.. నా మొహం సూపర్ రిన్ సోపుతో ఉతికినట్టు తెల్లగా అయిపోయింది. ఓరినాయనో.. అసలే తింటానికీ.. తిన్నది అరాయించకోటానికే టైములేక.. కిడ్నీల్లో ఇడ్లీ సైజంత రాళ్ళు పేర్చుకుని కోటలు కట్టుకుని రాజ్యాలేలుతూ.. తిన్న చెయ్యి కూడా కడుక్కోకుండా ఆఫీసులో కీబోర్గ్ మీద ఎంగిలి చేతుల్తో టిక్కూటిక్కూమని టైపుకొట్టుకుంటూ, క్షణం తీరికలేని మా సాఫ్వేర్ బతుకుల్లో ఇన్ని కష్టాలా??. ఇప్పుడు ఆ గవర్నమెంటు ఆఫీసుకెళ్ళి లైన్లలో నిలబడి.. వాడితోనూ వీడితోనూ ముష్టియుద్దం చేసి, ఎవడికో చేతులు ఖాలీగాలేవు కాస్త వీపుగోకిపెడతారా.. అంటే లేని గోళ్ళతో గోకిపెట్టి, వాడెవడికో పెన్నులేకపోతే పక్కోడి జేబులోంచి పెన్ననుకొని సిగరెట్ తీస్తే చెప్పుదెబ్బలుతిని.., వీడెవడో నిశానీ అయితే వాడి అప్లికేషనూ.. ఇంటి ఎడ్రసూ.. పోయిన వాడి బాబు ఎడ్రసూ.. వాడికి నచ్చిన వేటూరివారి పాటలూ వాళ్ళ బాబుకు నచ్చిన ఘంటశాలగారి పాటలన్నీ రాసిపెట్టి, ఇంకొకడెవడికో స్టాంపు అంటించడానికి కాస్త ఉమ్మితడి కావాలంటే అప్పిచ్చి, వేరేవాడు పాటపాడటానికెళ్తే.. వాడి ఫైల్సూ.. నిలబడ్డ ప్లేసు ఎవడూ అక్రమించకుండా కాపలాకాసి, ఇంకొకడెవడో సిగరెట్టు అంటిచడానికి అగ్గిపెట్టడిగితే.. లేదని చెప్పి, మనం సిగరెట్టు కాల్చకపోటం ఒక పెద్దలోపమే అని తెగబాధపడి పోయి, ఈ ఎధవ పనులన్నీ చేసేంత ఓపికలేదుగానీ.. చచ్చిన పాస్పోర్ట్ ని తాటిపాతరేసినట్టుగా పాతరేసేద్దాం అని నిర్ణయించుకున్నాను.


ఈ నిర్ణయాలన్నీ ఆఫీసులో కూర్చుని మానిటర్ ముందున్న సూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుండగా.. సరిగ్గా ఐదునిముషాల్లో మా సీ.టీ.వోతో మీటింగ్ అన్నారని.. కాస్ఫరెన్స్ కాల్ అయ్యింటుందిలే అని మీటింగ్ రూమ్లోకెళ్తున్న మాకు.. బాబూ అటు కాదు ఇటు.. ఆయన ఇక్కడేవున్నాడు ఈ రోజే అమెరికా నుండి దిగాడు అన్నారు.. "అదేంటి మొన్నటికిమొన్నేకదా వెళ్ళొస్తాను బైబై అన్నారోలేదో అప్పుడే ఎలా వచ్చారు..", అని అడిగితే ఆ రోజు పొద్దున్నే దిగాడని తేలింది. ఇదేమన్నా తణుకు-మార్టేరు షెటిల్ బస్సు సర్వీసా.. ఇంత సులువుగా వారానికోసారి అమెరికానుండి ఇండియాకి ఎలా వస్తున్నాడబ్బా.. ఈయనకి పాస్పోర్ట్ అక్కర్లేదంటావా?, అవును..!  ఇంతకీ ఈయన పాస్పోర్ట్ ఎలా రిన్వూ చేయించుంటాడు, మీటింగ్ అయిపోయాకా.. "ఎనీ క్వస్చన్స్",  అన్నప్పుడు అడిగేస్తే పోలా.. అన్న అద్భుతమైన ఆలోచనలల్తో నా బుర్రను రేజ్ చేసిన ఏక్సిలరేటర్ లాగా జుమ్ జుమ్ అనిపిస్తుండగా. మీటింగ్ అయిపోయిందన్నారు.. ఆ మీటింగ్ యొక్క సారం సారాశం.. ఏంటిరా అని పక్కోడినడిగితే... కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి.. మీ అందరికీ నా ధన్యవాదాలు.. ఇదే కృషి పట్టుదలతో మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను. అని చెప్పాడు. 
అయ్యబాబోయ్.. ఇంకేముంది.. కొత్తప్రాజెక్ట్..! స్టడీకోసం..!! ఆన్ సైట్!!! ఆఫరూ!!!!, మరి నేను..!! నా పాస్పోర్ట్ లేకుండా.., ఓరినాయనో!!!!!!. ఈ సారికూడా వచ్చిన ఛాన్స్ మిస్సయ్యి.. నాకు పాస్పోర్ట్ లేదని.. ఏ సెక్యూరిటీవాడినో నా బదులు పంపించేస్తే సాఫ్ట్వేర్ సన్యాసం చేసేసి.. అడవుల్లోకి పోయి.. ఆకులూ అలమలూ చుట్టుకుని కంద-మూలాల్ని పిజ్జా-బర్గర్స్ లా ఊహించుకుని.. ఒక ల్యాప్ టాపు చేత్తో పట్టుకుని.. రిలయన్స్ నెట్ కనెక్ట్ తో ఇంటర్నెట్టుకు కనెక్టయ్యి.. ఫేస్బుక్కులో వున్న ఆన్లైన్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ..  సిగ్నల్ సరిగాలేక సగం సగం సిగ్నల్ తో వెళ్ళిన నా సగం సగం మాటలు అర్ధంకాక.. నా ప్రెండు బండ బూతులు తిడుతుంటే.. యువర్ - అయ్యా అంబానీ.. "కర్ లియా మేరా దునియా.. జంగిల్ మే.." అని నా తలను ఆ పక్కనేవున్న కొండరాయికేసి కొట్టుకున్న సీన్ గుర్తుకొచ్చింది.


ఇప్పుడెలా!, ఎలాగైనా పాస్పోర్టును బతికించాలి.. బతికించాలి బతికించాలి అని ఆలోచిస్తుంటే.. పిడికిలి బిగుసుకోవటం మొదలుపెట్టింది.., అదేదో సినిమాలో నరాల నాగార్జునకి.. సారీ..  నాగార్జునకి నరాలు పొంగినట్టు పిడికిలి దగ్గర్నుండి పొంగుకొచ్చాయి.. అలాగే పిడికిలి బిగించి ఆలోచించగా.. ఆర్పీపట్నాయక్ తీసిన "బ్రోకర్" సినిమా గుర్తొచ్చింది.. ఇండియాలో ఈ "బ్రోకర్" అన్న మానవుడు లేకుండా మనకు పనులెక్కడవుతాయిలే.. ఒక బ్రోకర్ గాడిని పట్టుకోవాలి.. అని గూగులమ్మతో చెప్పి వెతికిపెట్టమన్నాను. బడా మార్ట్ లో వారంక్రితపు పుచ్చొంకాయలకి.. కాస్త చెంకీ కవరుతో ప్యాకింగ్ చేసి.. ఏసీలో పెట్టి  కొత్తలేబుల్ అంటించి.. మాంచి లుక్ వుండేలా చేస్తే.. "యా!, ఐనో.. ధీస్ ఆర్ పుచ్చ్ వంకాయ్స్.. బట్ యునో ధీస్ ఆర్ వెరీ హెల్దీ...", అని ఆ పుచ్చుల్లో  కాస్త చిన్నపుచ్చలున్నవి ఏరిమరీ కొనుక్కుంటూ.. లౌక్యం ప్రదర్శించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా.. ఇచ్చేది బ్రోకర్ కే.. కానీ..ఆ బ్రోకర్ గవర్నమెంటు ముద్రవేసిన బ్రోకర్ కావాలని(Authorized Agent), అదీ మనదగ్గర్లో వున్న వాడినొకడిని వెతికి పట్టుకోవాలని కాస్త లౌకిక-అలౌకిక లౌక్యం ప్రదర్శించి.. వివరాలు కనుక్కోగా వాడు ఒక రెండువందల ఏభై మామూలుగా మామూలు తీసుకుని పనికానిస్తానని భరోసాఇవ్వగా వెంటనే పత్రాలన్నీ మూటగట్టుకుని ఇవ్వటానికి బయలుదేరాను.


ఇక్కడే అసలు కష్టాలు పీతల్లా వెంట పడి కరిచాయి.. ఒక సంవత్సరంలో ఎన్నిచోట్ల ఉంటే అన్ని ఎడ్రస్ ప్రూఫ్ లు ఇవ్వాల్సుందని చెప్పాడు.. ఎడ్రసుప్రూఫులుగా ఏమేమి ఇవ్వొచ్చో ఒక పెద్ద లిస్టే ఇచ్చి ఇందులో ఏమన్నా ఒక నాలుగు అన్నాడు. ఏంటివి ఇందులో ఏమన్నా నాలుగా!, అంటే ఏంటి.. ఇదేమన్నా బిగ్ బి నిర్వహించే కౌన్ కిస్కా కరోర్ పత్నినా? అనడిగితే.. కాదుసార్.. ఈ కిందిచ్చిన లిస్టులో ఏవన్నా నాలుగు ఫ్రూపులు అన్నాడు. ఇక్కడొక థియరీ వుంది. ఎవరైనా కనిపెట్టారోలేదో తెలియదు కానీ.. మూడంటే మనదగ్గర రెండు.. నాలుగంటే మనదగ్గర మూడే ఏడుస్తాయి. ఖచ్చితంగా ఆలాగే.. నాదగ్గర మూడే ఏడ్చాయి. అందులోనూ ఒక సంవత్సరంలో నేను రెండుచోట్ల కొంపలు మార్చాను. ఆ పాత ఇంటికి కొత్తప్రూఫ్ లు కూడా కావాలి. సరే మీకు ఒక ఆఫ్సన్ వుంది ఆఫీసునుండి లెటరు.., బ్యాంకు స్టేట్మెంటు.. తీసుకురమ్మన్నాడు. అవి పాతింటి పేరుమీదవైతే మీకు వీజీ సార్ అన్నాడు. ఏం వీజీ.. కొంప కొల్లేరైపోతేనూ.. ఇవన్నీ ఎందుకురా బాబు ఇప్పుడుంటున్న ఇంటిది ఒక్క ఎడ్రస్ ప్రూఫు చాలదా అన్నాను. సార్ రూల్స్ సార్ అన్నాడు.. లేచి వచ్చేద్దామంటే. మా ఆఫీసు సెక్యూరిటీవాడు నా ప్లేసులో ఆన్ సైట్ ఆఫర్ కొట్టేసి.. ప్లైటెక్కుతుంటే మేమంతా సెండాఫ్ ఇస్తున్న సీన్ గుర్తొచ్చింది.. ఇక చేసేదిలేక కుర్చీలోంచి లేవలేక.. "సరే తెస్తాను ఇంకా.. ఏమన్నా కావాలంటే చెప్పు మాటిమాటికీ తిరగలేను" అన్నాను. "అయితే.. ఒక రెండుకేజీల బంగాళాదుంపలు.. ఒక కేజి ఉల్లిపాయలు.. ఒక పత్తాగోబీ  కొని వెళ్తు వెళ్తూ మా ఆవిడకిచ్చేసివెళ్ళండి అని అనబోతున్నట్టు ఫేసుపెట్టి.. ఇంకేమీ అక్కర్లేదు సార్.. ఇవి చాలు", అన్నాడు. ఎలాగైతే.. మొత్తానికి కావాల్సిన డాక్యుమెంట్ల కోసం రెండు మూడు నాలుగైదు ఆరురోజులు తిరిగి తిరిగి ఇవ్వగలిగాను. ఆ తరువాత.. అప్లికేషన్ ఫాం ఆన్లైన్లో పూర్తిచేసేసాడు.. ప్రింట్ తీసి ఇంకా ఏవో నాలుగైదు కాగితాలమీద సంతకాలు అన్నాడు.. అసలే ఆఫీసు టైమైపోతుంది త్వరగా కానియ్.. అంటే.. తరువాత వేలిముద్రలన్నాడు.. ఆ తరువాత కాలిముద్రలు వెయించుకున్నాడు. నాకు మండి... ఇంకా ఎన్ని ముద్రలేయిస్తావయ్యా.. ఇదిగో కావాలంటే.. నా.."...." వేసుకో అనబోతే.. సార్ తిట్టకండి సార్.. ఇవి రూల్సు సార్.. మరి ఏం చేస్తాం అన్నాడు. సరే.. నీకిష్టమొచ్చిన ముద్రలేస్తా.. ఎక్కడెయ్యమంటే అక్కడేస్తా.. ముద్ర నువ్వువెయ్యమన్నా సరే. నేను వేసినా సరే.. నీ ఆఫీసులోవేస్తా.. నీ ఇంటికొచ్చివేస్తా.. నువ్వు మొలతాడుకట్టుకోని మరాఠీవాడివే ఐతే కాసుకో.. అని డయలాగులు చెబుదామంటే వాడికి మన తెలుగర్ధంకాదు.. ఈ డయలాగులు.. లాగులు పైకి లాక్కుంటూ నాకు హిందీలో చెప్పటం రాదని ఆగిపోయి.. ఇంక నువ్వు అవి ఇవీ కావాలి అని అడక్కుండా అన్న టైముకి సబ్మిట్ అయిపొవాలి.. నువ్వేంచేస్తావో నాకు తెలియదు అన్నాను. అందులో తేడావుండదు సార్.. నేను చేస్తాను 'మీరే చూస్తారు' కదా అని భరోసా ఇచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికొచ్చాకా ఆలోచించాను.. "మీరే చూస్తారుకదా" అన్నది వెటకారంగా అనలేదు కదా అని.


మళ్ళీ మనమెక్కడున్నామంటే.. ఫలానా ఫలానా ఘట్టంలో గొట్టంలో ఇరుక్కుపోయిన యువరాజుగారిని చూసీ.. రూపాయిపావళా పెట్టి గొట్టాలు కొనుక్కుని ఐదువేళ్ళకూ పెట్టుకుని తింటూ వెళుతున్న రాణీగారు.. ఫక్కున నవ్వే... అని ఒక్కసారి చెప్పుకున్న కధ గుర్తుచేసుకున్నట్టుగా.. కొన్నాళ్ళుపోయినతరువాత లోకల్ పోలీస్టేషన్నుండి రేపొకసారి పదింటికి స్టేషనుకొచ్చి కలవమని ఫోనొచ్చింది. సరే!.. నేనెళ్ళడమేంటి.. అసలు పోలీసోడికీ నాకు సంబంధమేంటి.. ఆ బ్రోకర్ గాడే చూసుకుంటాడులే అని వాడికి ఫొనుకొడితే.. "సార్.. పోలీస్ ఎంక్వైరీ మీరే చూసుకోవాలి.. మేం అప్లికేషన్ సబ్మిట్ చెయ్యటంవరకే", అన్నాడు. 
అదేంటి?, ఆ పని బ్రోకర్ 'గాడిదే' అని మా ఫ్రెండొకడు చెప్పాడు అన్నాను. 
కాదు సార్.. ఈ విషయంలో 'ఎవడిది వాడిదే' అన్నాడు. 
సరేలే.. ఇంకేంచేస్తాం.. అని నోర్మూసుకుని తరువాతరోజు ఆఫీసుకు సెలవుపెట్టి పోలీస్టేషనుకు వెళ్ళాను. ఏంటి పోలీస్టేషనుకు వెళ్ళటానికే సెలవా అని అడిగారు కొంతమంది.. నీకు భలే సెలవు దొరుకుతుందిరా అన్నారు ఇంకొంతమంది.. మీరూ ఏదోటి అంటారు కదా.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చెబుతా.. మీరిప్పుడు ఎందుకు సెలవుపెట్టానో తెలుసుకోవాలంటే.. చిన్న బ్రేక్ తరువాత.. అని బ్రేకులు బ్రేకుడాన్సులూ అవసరంలేకుండానే చెబుతున్నాను వినండి. 


ఇవసలే.. గవర్నమెంటు పనులు.. అందులోనూ స్టేట్ గవర్నమెంటు పనులూ. కంప్యూటర్ భంద్ ఏం చెయ్యం అని.. ప్రెసిడెంట్ వచ్చి స్విచ్చాన్ చేస్తాడు అన్నట్టు దానిముందే కూర్చుంటాడొకడు. దీని పాస్వార్ట్ ఎవడి దగ్గరుందో తెలియదయ్యా.. సాయంత్రం రా.. అంటాడు ఇంకొకడు.. ఒకవేళ తప్పుచేసి సాయంత్రం వెళితే.. ఎవడైనా గవర్నమెంటు ఆఫీసులో సాయంత్రం వరకూ పనిచేస్తాడా.. నీకు పిచ్చికాకపోతే.. సాయంత్రం రమ్మనగానే ఊపుకుంటూవచ్చేసావ్.. అని నలుగురైదుగురికి మనల్ని చూపించి గేలిచేస్తాడు మరొకడు..  మరి ఇలాంటి పరిస్థితుల్లో.. అనుకున్న టైముకి పనులు అవ్వటం అసాధ్యమైన విషయాలే కదా మరి.. అందుకే సెలవు.
లైబ్రరీలో యోగాసనాలు అనే పుస్తకంలో.. ఆసనం వేయు విధానం అన్నది  కంగారుకంగారుగా చదివేసి ఆసనం వేసేసాకా.. ఆ ఆసనాన్ని ఎలా తియ్యాలో అని వున్న పేజీని.. ఎవడో కక్కుర్తి పడి చింపి పట్టుకుపోయాడని ఆసనం వేసేదాకా తెలుసుకోలేక. ఆ వేసిన ఆసనంలో ఇరుక్కుపోయి బయటపడలేనట్టుంటుంది సాఫ్వేర్ అనే చట్రంలో ఇరుక్కుపోయినోళ్ళ బ్రతుకు... సెలవు పెట్టకపోతే పోలీసోడితో ఒక తలనొప్పి.. సెలవుపెడితే ఆఫీసులో మన సీటుకొచ్చేస్తుంది నడుంనొప్పి.  ఆఫీసులో మనం చేసిన పనిలో వేళుపెట్టి ఆ వేలు ఎలా బయటకు తియ్యాలో తెలియక ఎవడో ఫోనుచేస్తుంటాడు. పనిచేస్తుంది చూడు. ఎందుకు చెయ్యదు.. నేను నిన్న ఇంచక్కా వేలుపెట్టి తియ్యలేదా.. అలాగే చెయ్యాలంతే.., ఇప్పుడు సడెన్ గా ఈ రోజే ఎందుకలా అవుతుంది.. లాంటి సంజాయిషీలతోనూ..  ఇలా సెలవుపెట్టినా సగం రోజు ఫోన్లలోనే సరిపోతుంది.. ఆ ఫోనువేడికి వాచిపోయిన చెవికి కాపడం పెట్టుకోటంలోనూ ఇంకో సగంరోజు సరిపోతుంది. మరి ఇలాంటి గవర్నమెంటు పనులు చెయ్యాలంటే చాలా తీరిక కావాలి.. కానీ ఈరోజుల్లో రిటైరైన వాళ్ళదగ్గరన్నుండి.. పెళ్ళాం ఉద్యోగం చేస్తే ఇంట్లో పిల్లల్ని ఆడిస్తూ.. చాక్లెట్ ఇవ్వలేదన్న కోపంతో ఆ పిల్లలు ఇల్లంతా కంపుచేస్తే.. అవన్నీ కడుక్కునే మగాళ్ళ దగ్గరవరకూ ఈ తీరికనేది నాదగ్గరలేదంటే నాదగ్గరా లేదు బాబూ..లేదూ అని చెప్పేవాళ్ళే.. మరి ఎవరిదగ్గరుందో ఈ 'తీరిక' చెప్పలేం. ఇన్ని గొడవలెందుకులే సెలవుపెడితే కాస్త పోలీసోడైనా సంతోషిస్తాడని మొత్తంమీద సెలవుపెట్టాల్సొచ్చిందన్నమాట.


ఏదో ఆలోచనలో పడి.. అలాగే ఆఫీసుకెళ్ళే బట్టల్తో పోలీస్టేషన్ కి వచ్చేసాను. టైము పదిగంటల పదినిముషాలయ్యింది. పాస్పోర్ట్ సెక్షన్ ఎక్కడో తెలియలేదు.. ఆ పక్కనే పూజకు పనికిరాని పువ్వుల్లా నీరసంగా బల్లలమీద వాలిపోయున్న  ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళను అడిగాను.. అందులో ఒకావిడ.. కాస్త ఓపికచేసుకుని కనురెప్పలను పైకెత్తి..  "క్యా.. క్యా.. అని కొట్టినట్టు నాలుగు సార్లు అడిగింది కానీ నేను పాస్పోర్ట్ అంటున్నానని అర్ధంకాలేదు. నేనునాలుకని రకరకాలుగా మడతలుపెట్టి అర్ధమయ్యేలా "పాస్పోర్ట్ వెరిఫికేషన్...", అంటుండగా..  యమదర్మరాజుకి దగ్గరగా కుర్చీవేసుకుని తలవంచుకుని రాసేసుకునే చిత్రగుప్తుడిలా ఆ రోజు వచ్చిన కలెక్షను తాలూకు పద్దులనుకుంట ఎంతో దీక్షతో రాసుకుంటున్న పోలీసొకడు.. "సీధా జావ్..", అని.. తలెత్తకుండానే చెప్పాడు. "ధ్యాంక్స్.", అని వెళ్ళిపోయాను.. అక్కడ అప్పటికే పదిమంది కుర్చీల్లో కుర్చున్నారు. లోపల పెద్దపులిలా  బట్టల్లేకుండా కుర్చుని ఉన్నాడు ఒక పోలీసు.. అంటే అదే..పోలీసు యూనీఫాం లేకుండా మామూలు డ్రస్సులోనే వున్నాడు. వాడెదురుగానే ఎవడో జింకలాగా ముడుచుకుని కూర్చున్నట్టున్నాడు.. సగం తలుపువేసివుండటంతో కాళ్ళుమాత్రమే కనిపిస్తున్నాయి.


టైము చూస్తే పది ఇరవై.. అసలే నన్ను పదింటికి రమ్మన్నాడు ఇప్పుడెలా.. వెళ్ళకపోతే ఒక తంటా.. వెళితే ఏమవ్వుద్దో. ఒక ఐదునిముషాలాగి ఆఁ.. ఏముందిలే ఏదొకటవ్వుద్ది ఇక తప్పదు అని తలుపునెట్టుకుని లోపలికెళ్ళిపోయాను.. పోలీసురైడింగులో పట్టుపడ్డ పెద్దాపురం పార్టీలాగా నివ్వెరపోయి నా వంక చూసాడు పులిరాజా.. ఆ తర్వాత ఏమైందంటే..


ఇంకా వుంది (వుందనుకుంటే.. వుంది.. అబ్బా ఇక చాలు అనుకుంటే.. గొడవేలేదు. :-) )

23, జులై 2011, శనివారం

బజ్జొచ్చి.. బ్లాగర్ ని...


బజ్జొచ్చి బ్లాగర్ ని ఎక్కిరించటం అంటే ఇదే.. యువరానర్. ముందొచ్చిన బ్లాగర్ కన్నా వెనుకొచ్చిన బజ్జే వాడి అని నమ్మిన జనాలు..ఇలా మానిటర్లకు అంటుకుపోయి.. వారాలు వారాలు స్నానాలు చేయకుండా ముక్కులుమూసుకుని.. కుళ్ళు కామెంట్లిచ్చుకోవటం నాకేం నచ్చలేదని.. నా కీ బోర్డ్ లో 'కంట్రోల్ కీ' ని నొక్కి వక్కానిస్తూ..ఆవేశాన్ని 'కంట్రోల్' చేసుకుంటున్నాను యవరానర్.

ట్విట్టర్ ని చూసి గూగుల్ అట్లకాడ మైక్రోవేవ్ వోవెన్లో పెట్టి వేడిచేసి వాతపెట్టుకున్న చందాన.. ఒకరిద్దరు ఖాలీగా ఉంటున్న ప్రోగ్రామర్ల చేత పనిచేయించడం కోసం గూగుల్ పన్నిన వ్యూహంలో భాగంగా బజ్జుపుట్టిందనీ..అది తెలియక మన కుర్రాళ్ళు భలేవుందని.. చంకల్లో చేతులుపెట్టుకుని గుద్దుకుని.. ఇలా సగం బగ్గులతో మార్కెట్టుమీదకు వదిలేసిన ఈ బజ్జుని పెంచి పోషించడం.. మన బ్లాగ్ యువతను తప్పుదారిన పట్టించడానికి పక్కదేశాలు పన్నిన కుట్రేనని.. ఇది చాలా చాలా అన్యాయమని.. నేను సవినయంగా కోర్టువారికి మనవి చేసుకుంటున్నాను యువరానర్.

తండ్రి టూర్లలో నడిచినప్పడు కనీసం చెప్పులుకొనుక్కోటానికికూడా డబ్బులు లేక.. ఒక్కసారిగా.. తెరచించుకొని తెరమీదకొచ్చిన మన యువ నేత గగన్ లాగా.. ఓదార్పు వెకేషన్లని.. అందమైన మార్నింగులనీ.. రోబోటిక్ టెక్నాలజీలనీ.. ఈ మధ్య సి.బి.ఐ రైడింగులనీ.. వార్తల్లో సెలబ్రిటీ లెవల్ కి ఎదిగినట్టుగానే.. అతి తక్కువకాలంలోనే ఎదిగిపోయేలా చేసి.. ఎక్కడో బోన్లో నిలబడాల్సిన ఈ బజ్జును ఇలా BMW కార్లలో తిరిగేలా చేసింది ఎవరనీ.. నేను కోర్టువారిని ప్రశ్నిస్తున్నాను యువరానర్.

నడమంత్రపుసిరిలాగా ఎదిగిన ఈ బజ్జు వల్ల.. బ్లాగర్ల్ లో ఎంతో శ్రమకోర్చి రాసిన టపాలకు రెండువందలు మూడువందలు హిట్లున్నా కనీసం రొండుకూడా కామెంట్లు రాలక... నిరాశతో.. నిస్పృహతో.. కొరుక్కోటానికి కూడా గోళ్ళు లేక.. వేళ్ళుకొరుక్కుంటుంటే.. ఆ వేళ్ళు రాయటానికి సహకరించక.. ఖాలీగా వుంటూ.. ఎవరికీ చెప్పుకోలేక... బాధను సోడా కలపని విస్కీలాగా దిగమింగుతున్న మా క్లైంట్ల పొట్టకొట్టడం...ఒక దేశద్రోహం అని..  దీనిని మనం కండకండాలుగా.. ఖండించి.. కేశఖండనం చేయాలని కోరుతున్నాను యువరానర్.
ఈ విషయం మీద ప్రతిపక్షమైన బజ్జును తయారుచేసిన గూగుల్ వారు వచ్చి క్షమాపన కోరి.. బజ్బును త్వరలోనే టుజి-రాజాలాగా.. కనిమొజి-రాణీలాగా..తీహార్ జైలుకు పంపించే  విధంగా కోర్టువారు చర్యలు తీసుకోవాలని ప్రార్దిస్తున్నాను.

ఈ పాతవస్తువులను రోడ్డుమీద పడేసే సంస్కృతి పోవాలని మన బ్లాగ్ నేతలను నేనంతగానో వేడుకుంటున్నాను యువరానర్. ముందొచ్చిన సికింద్రాబాదుకన్నా వెనకొచ్చిన హైద్రాబాదే ముద్దన్నది.. వాస్తవమనీ.. ఈ మధ్య వేర్పాటు గొడవల్లో ఎక్కడా కూడా.. ఎవరూ మాకు సికింద్రాబాద్ కావాలని అనకపోవటంతో తేలిపోయింది.. యువరానర్.
ఇది చాలా బాధాకరమైన విషయంగా పరిగణించి మా పాతవైభవం మళ్ళా వచ్చేలా చూసి.. ఎప్పుడూ చెప్పినట్టుగా చట్టం తనపని చేసుకుపోతుందని రికార్డు చేసిన తీర్పు ఇవ్వకుండా... ఈ కేసులో కాస్త కొత్త డయలాగులు రాయించేలా కోర్టు తనవంతు సాయం చేస్తుందన్న ఆశతో వాదిస్తున్నాను యువరానర్.

మొన్న ముంబయిలో బాంబులు పేలిన తరువాత ఎవరూవచ్చి "మేమే బాంబులు పెట్టాం", అని చెప్పకపోవటం వలన.. మన హోం మినిష్టరుగారు ఎవరుపెట్టారో తెలుసుకోలేకపోయారు.. అలాగే.. ఎవరొకరు ముందుకొచ్చి.. బజ్జులోవున్నదేంటి.. బ్లాగర్లో లేనిదేంటిని చెప్పకపోవటం వలన మాకూ ఏమీ తెలియక ఇలా ఓపెన్ గా ఖండించడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నామని మనవి చేసుకుంటున్నాం యువరానర్.

చాలా విషయాలు పరిశీలించాకా తెలిసిందేంటంటే.. కొత్తగా ఏ టెక్నాలజీ వొచ్చినా.. అప్పుడెప్పుడో రాజమండ్రిలో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేసినట్టుగా.. వెబ్ విహారం చేసి.. మన బ్లాగ్ యువత ఎగబడిపోతూ.. ఉర్రూతలూరుతుందని.. తేలింది యువరానర్. అలాంటి విహారమే ఇప్పుడు గూగుల్ ప్లస్సులో చేస్తున్నారని తెలుస్తుంది యువరానర్.

బ్లాగర్ పాతది.. పనికిరానిది  బజ్జుకొత్తదీ..అని ఒకే కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పొద్దని నేను విన్నవించుకుంటున్నాను యువరానర్. పాతది అనే మాటైతే.. కాటుమొహానికి.. మేకప్పేసి.. పౌడర్ పూసి.. మన రాష్ట్ర హోంమంత్రిని చేస్తే.. ఏం మాట్లాడకుండా ఎలా ఒప్పుకున్నారు ఈ జనం అని ప్రశ్నిస్తున్నాను యువరానర్.

రాష్ట్రం మంటల్లో మండిపోతున్నప్పుడు కూడా.. ఫ్రెష్ గా మొహం కడుక్కుని.. మీడియా ముందుకొచ్చి.. "ఎలా జరిగిందో మేం చర్యలు తీసుకుంటాం. ఏం జరుగుతుందో మేం చర్యలు తీసుకుంటాం.. ఏదోలా మేం ప్రయత్నించి చర్యలు తీసుకుంటామని.. "చర్యలు" అనే పదాన్నిఎలా వాడాలో తెలియక ఎదో ఆవిడ మాట్లాడేస్తే..ఎలా ఒప్పుకున్నారు ఈ జనం.. అని అడుగుతున్నాను.  "ఆవిడకే మాట్లాడటం రాదు.. ఇక మనమేం మాట్లాడతాం...", అని వూరుకున్నారుగానీ ఈ జనం.. వేలేత్తి ఎప్పుడూ చూపించలేదు యువరానర్.

అలాంటి ఈ జనం.. పాతది.. పనికిరానిదీ అని బ్లాగర్ ని నిందించడం ఏమన్నా భావ్యమాఁ.. అని అడుగుతున్నాను యువరానర్.

మొన్న ఇదే విషయం మనం ముఖ్యమంత్రిగారి దాకా తీసుకెళదామని వెళితే ఆయన డిల్లీ వెళ్ళారని తెలిసింది యువరానర్.. సరే కదా అని డిల్లీ దాగా వెళ్ళి గల్లీ గల్లీ తిరిగితే ప్రతీ గల్లీలోనూ మన సీమాంధ్ర.. మన తెలంగాణా ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారుగానీ.. అయన దొరకలేదు.. చేసేదిలేక మళ్ళీ హైద్రాబాదొచ్చేసి.. ఎప్పటికో ఆయన్ని పట్టుకుని ఈ బ్లాగ్ బాధలు విన్నవించుకుంటే.. మేం చెప్పిందంతా విని.. ఆయనకూడా "తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అన్న ఒక్కమాటని మూడు భాషల్లోఖూనీ చేసి చెప్పారుకానీ.. ఇప్పటివరకూ ఏ "చర్యలు" తీసుకోలేకపోయేసరికి.. ఈ "చర్యలు" అన్న పదానికి కొత్తగా ఏమన్నా తెలియని అర్ధాలున్నాయేమోనని అన్ని భాషల నిఘంటువులు తిరగేసుకోవాల్సొచ్చింది యువరానర్.

ఇంకొక్క విషయం నేను కోర్టువారి దృష్టిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను..., అదేంటంటే.. "కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్", "కేక","సూపరో-డూపర్", "గుర్ర్ర్ ర్ ర్", అని బాగా వాడుకలో వున్న సరికొత్త పదాలకు.. పేటెంట్లను సంపాదించి.. అంతర్జాతీయ గుర్తింపువచ్చేలా చేసి.. ఇవి బ్లాగర్లలో కామెంటిచ్చే చోట 'లైక్' బటన్ లాగా వచ్చేలా చేసి.. మౌసుక్లిక్కుచెయ్యకుండానే..కంటిచూపుతో కామెంటిచ్చే టక్నాలజీ తీసుకొస్తే....
బజ్జుల్లో ఇవి వాడుకుని.. "కికికికికికి" అని నవ్వుకుంటున్న వాళ్ళంతా.. బ్లాగ్లుల్లో కూడా "కికికికికి కికికికి కికికికి" అని నవ్వుతూ వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాను యువరానర్.

ఈ విషయాలన్నీ చూస్తూ.. "అమ్మ ఏది చెబితే అదే..", అన్న మన ఫ్రధానమంత్రిగారిలా నోట్లో బెల్లంముక్క పెట్టుకున్నట్టుగా నవ్వుతూ వుండిపోలేక.. అవేశంతో కోర్టుకెక్కాల్సొచ్చిందని నా బాధను వెళ్ళగక్కుతున్నాను యవరానర్.

ఈ పైన పేర్కొన్నవిషయంపై.. వెంటనే తమతమ వివరణ ఇస్తూ కామెంట్లివ్వాలని.. కామెంటివ్వని వారిని.. కోర్టువారు కటినంగా శిక్షించాలని.. ఈ టపాకు కూడా బజ్జులో కామెంటిచ్చినవారిని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటూ.. ఇక్కడితో సెలవుతీసుకోకుండా ఈ పోస్టుకు రెండో భాగంలో ఎవరెవరు దీనికి
బాధ్యత వహించాలో పేరుపేరునా రాస్తుంటాననీ మనవి చేసుకుంటు సెలవు తీసుకుంటున్నాను యువరానర్. జైహింద్.. జై తెలుగు బ్లాగింగ్.

26, నవంబర్ 2010, శుక్రవారం

కార్ల బజారు...

అబ్బా నా "మారుతీ 800" కారు.. అదిరిపోయే గాడీ..
బూజుపట్టినా తగ్గని వేడి.. భలేవుందిలే దీని బాడీ.
దీనికెవ్వరూ సరిరారు జోడీ...
హమ్మో పదకొండయ్యిందా..  అయితే ఈ రోజు ఆఫీసుకు కార్లోకన్నా టూవీలర్ పైనే బెటర్.

ఇదేకదా.. "స్కార్పియో.." గున్నేనుగు లాంగుదిది.. హా.. మన సినిమాల్లో ఫ్యాక్షనిస్టులు వాడేదిది...
ఇంట్లో పెళ్ళాన్ని భయపెట్టలేనివాళ్ళు వీధిలో ప్రతాపం చూపించటానికి వాడేదీ ఇదేనా..!


హ హా.. "టాటా ఇండికా.." నాకెప్పుడూ కన్ఫ్యూజనే "టాటా ఇండీకాకీ - ఇండీకామ్" కీ.
ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి.. కారు పేరు "ఇండికా.." ఫోనుపేరు "ఇండీకామ్" కదా.
ఇది చూడగానే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. లక్షలు పోసి కొన్నాడంట మాఫ్రెండు ఫ్రెండు ఫ్రెండొకడు..
ఎక్కడకెళ్ళినా జనాలు చేతులూపేసి ఆపేస్తున్నారంట.. ఏంట్రాబాబు ఇలా ఆపేస్తున్నారు..
కారుకేమన్నా అయ్యిందా అని ఆగిచూసుకుంటే ఏమీలేదు..
ఇంతలో వాడేవడో కారు దగ్గరకొచ్చి. కిలోమీటర్ కి ఎంత.., ఏ.సీ తో ఎంతా నాన్ ఏ.సీ ఎంతా..
ఫలనా చోటికొస్తావా.. ట్యాక్సీ అన్నాడంటా..
హి హిహీ. కొన్ని బ్రాండులలా స్థిరపడిపాతాయి మరి.

ఒరే "సాంత్రో" కాస్త చూసుకుని వెళ్ళరో..  నీకంత పొగరేంట్రో.. తగ్గు తగ్గు తగ్గరో...
హత్తెరి.. దీనివెనకే.. "ఐ. టెన్.."
బిత్తెరి.. వెనకే.. "ఐ. ట్వంటీ.."
ఛత్.. "ఐ. తర్టీ..."
ఫ్లో లో అనేసా ఇంకా రిలీజ్ కాలేదుకదా.
"డేవూ మ్యాటిజ్" గాడా.. అనగ్గొట్టేసిన మూతిలావుండే మొహమూ వీడూను
ఎందుకురా "ఐ. ట్వంటీ.." వెనక అంత స్పీడుగా పోతావ్
వాడు బ్రేకేస్తే "దుబాయ్ శీను" రవితేజ అన్నట్టు నీ మూతింకా అప్పడమైపోద్దీ.

ఇదేంటిది.. "మహీంద్రా గ్జయిలో.." కొత్తగావచ్చిందనీ దీనికెంత స్టయిలో...
చూసాంలే.. ఇకచాలు ఛలో..

ఒర్నాయనో "ఇన్నోవా.." పక్కింట్లోవాళ్ళ పక్కింటొళ్ళని.. వాళ్ళవాళ్ళ ఎదురింటోళ్ళనీ
ఎక్కించినా ఇంకా ఖాలీగావుందా?
మరెందుకంటా అంత పెద్ద కారు నీకు.. స్పీడెల్తుందని అలా తెగతొక్కెయ్యమాకు...
కాస్త నెమ్మదిగా పోనీయ్యి బాబు.

హార్నీ "టవేరా.." అలా మీదమీదకొస్తావేరా... బ్రతకాలనిలేదురా?... మరెందుకంత కంగారురా?...

అరెరే.. "బెంజి.." మాంచి హైక్లాసు బెంజి.. ఎవడ్రా ఇక్కడ దార్లో పోసాడు గెంజి.
ఆ బెంజినీ ఈ గెంజినీ చూడగానే ఏదో రిలేషను గుర్తొస్తుందబ్బా.. హా...

 "గెంజి నుండి బెంజి దాకా చూసాను.. దేనినీ మర్చిపోలేను"..
 అన్న పద్మభూషణ్ చిరంజీవి గుర్తోచ్చాడేంటి చెప్మా!!.

హెల్మెట్ కారు.. హెల్మెట్ కారు.. "వేగన్ ఆరు.." చూడ్డానికలావున్నా దీనిది భలే జోరు...
ఒబెసిటీ వచ్చినవాడిలా.. నడుముకు కండపట్టినట్టుంది ఇదేం కారబ్బా..
ఓహో.. "మారుతీ స్విఫ్టా!!"
దీనికి వెనకో లగేజీ బాక్స్ కడితే  అదే "స్విఫ్ట్ డిజైర్.." శెభాష్ శెభాష్.. బాగానేవుంది.

ఈ లక్కపిడతలేంటి..
"ఆల్టో..." "జెన్" కీ నీకు తేడాఏంటో!
ఏమో నిజం చెప్తే ఎవరూనమ్మరు.. అదేంటో.

అర్రెర్రే.. ఇదింకా లక్కపిడతగాదే.. "చెవ్రల్లెట్ స్పార్కా!.."
దీనీ ఎనక కళ్ళద్దాలు రౌండు రౌండు ఎందుకో... అబ్బా పాత ఇస్టయిలు గాదే!!

ఓర్నీ "నానో..." ఇదేంటన్నో... ఇలాగుందేంటన్నో.. లచ్చకారా.. లచ్చల్లో కారా?
త్రీ-సీటర్ ఆటోకి రంగేసెయ్యలేదుగాందా??
"ఫియట్ యునో..", సారీ.. ఐ డోంట్ నో..!!

ఇదేంటి సిటీ అంతా తిరిగొచ్చిన కారులాగుంది.. "హోండా సిటీనా..."?
బాబూ డ్రైవరూ.. కాళ్ళుచాపుకునే ఖాళీవుందికదాని.. పడుకుని నడపబాకయ్యో!!

"ఫియట్ పేలియో...", వెనక్కినడపాలంటే బయటతలపెట్టి చూడాలయో..
"స్కోడా ఆక్టావియా..." నోరేతిరగట్లేదు ఇదేం పేరయా!!
"హోండా సివిక్.." మరీపడవలాగుంది లుక్... నడపటానికి డ్రైవరే దిక్కు.

"వోక్సేవేగన్ జెట్టా.."? మార్టిన్.. గుడ్ నైటేంకాదు..

"బి. ఎమ్. డబ్ల్యూ.." అయ్ బాబోయ్.. దూరం దూరం.. గీతడితే.. నా ఒకనెల సేలరీ.. దొబ్ల్యూ...
"ఆడీ.." మాతాతకేలేదు బాబూ గాడీ...!!
"స్కోడా ఫేబియా.." చిన్నకారుకెందుకంత ప్రైసియా...

"టా.. టా.. సఫారీ....", బానేవుంది జడముడేసుకెళ్తున్న ఆంటీలాగా ఎనకాలీ టైరెందుకో..
"హోండా ఏకోర్డ్..", సారీ ఐ కెన్నాట్ ఏఫోర్డ్..

"మారుతీ ఏ-స్టారు.." ఆ మిడిగుడ్ల హెడ్లైట్లేంటి మాష్టారూ??

వీడెవడుపాపం ఎనకెవడిచేతో నొక్కునొక్కించుకున్నటుంన్నాడు...
ఇది డాషిచ్చింది కాదా!!.. ఆహా.. ఇదే మోడలా..
ఓహో.. ఇది "మారుతీ రిట్జా..!!"

అంతలా హారన్ కొట్టకయా.. "ఫియట్ లీనియా".. కారుకొన్నది నీ బాబు మనీయా?

అప్పుడే.. ఆఫీసొచ్చేసిందే.. మిగతామోడల్స్ మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడేఁ.. ఏఁ..

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

వైధ్యోనారాయణో 'హరీ:'..!!



ఆ వారమంతా చాలా వర్కు వచ్చింది.. తల తిప్పలేనంత పని...,
"వీకెండ్ ఇక ఎక్కడికీ వెళ్ళేది లేదు...", అనుకుని ఇంట్లోనే పడకేసి..
చక్కగా టీవిలో సినిమాలు చూస్తున్నాను.. ఎపుడూలేనిది..
సడెన్ గా నడుంనొప్పి..రావటం మొదలుపెట్టింది...,
"అబ్బా.. ఏంటీ నొప్పి...", అని కాసేపు బాధపడి తరువాత
పట్టించుకోవటం మానేసాను..., రెండురోజులు అలా టైమ్ పాస్
చేసేసాను...

నొప్పి.. అటుతిరిగి ఇటు తిరిగి... రకరకాల అవతారాలెత్తింది...
నడుం నొప్పి కాస్తా... కడుపునొప్పిగా అనిపించసాగింది...,
ఆఫీసులో ఎవరికి చెప్పినా.. ఇది.. "IT నొప్పే ..IT నొప్పే..",
అనటం మొదలుపెట్టారు..
"ఇదెక్కడి కొత్త నొప్పిరా బాబూ ఎప్పుడూ వినలేదు", అనుకుంటే...,
అప్పుడు వాళ్ళు చేసిన ఎగతాళి అర్ధమైంది...

మంచినీళ్ళు ఎక్కువత్రాగాలి..., అయిదునిమిషాలకొకసారి.. లేచి నడవాలి...,
మషాళా, నూనె వస్తువులు తగ్గించి తినాలి, ఎక్షర్సైజ్ చెయ్యాలి లాంటి...
జనాలు ఇచ్చిన మంచి సలహాల దగ్గర్నుండి...

తూర్పువైపుకు తిరిగి పడుకోవాలి, తూరుపు తిరిగి దణ్ణం పెట్టాలి...,
ముక్కుమూసుకుని... గాలి పీల్చాలి..., నొప్పి వచ్చినప్పుడు..
ఆఫీసైనా ఇళ్ళైనా పట్టించుకోకుండా గట్టిగా నవ్వాలి..
క్రింద పడి.. దొర్లాలి.. లాంటి చావు సలహాలవరకూ
పాటించడం మొదలుపెట్టాను...

మళ్ళీ ఊపిరితీసుకోలేని వర్కు రావటంతో నొప్పి మర్చిపోయాను...
తరువాత వారం ఆఫీసు పనిమీద చెన్నై వెళ్ళాల్సొచ్చింది..
అసలే ఒక్కడినే ఉండాలి... ఈ నొప్పి ఎక్కువైతే ఎవరూ చూసేవాళ్ళుండరు
అని ముందు భయం వేసినా, తరువాత తప్పక వెళ్ళాళ్సొచ్చింది.
ఎక్కడో గాలివార్తలాగా కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఇలానే నొప్పిరావచ్చు
అని తెలిసింది..., అంతే అప్పట్నుండి, అసలు చిన్నగా ఉన్న నొప్పి కాస్త
అనుమానం నొప్పిలా పెద్దగా మారి... బుర్రలోనో కడుపులోను తిరగసాగింది.

చెన్నై ప్రయాణం త్వరత్వరగా ముగించుకుని... హైద్రాబాద్ వచ్చి పడ్డాను...
"కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది", అని అడిగిన మా ఆవిడ మాటలకి
ఏదో ఉందిలే అన్న సమాధానం చెప్పగలిగానంతే.. వెంటనే రడీ అయ్యి ఆఫీసు
మానేసి హాస్పటల్ కి పరుగుతీసాను. అల్ రెడీ మా కొలీగ్స్ హాస్పిటల్స్ పై కాస్త
రీసెర్చ్ చేసి స్టడీ చేసారు...వాళ్ళ సలహా మేరకు అమీర్ పేటలోని మైత్రీవనం
దగ్గర్లో ఉన్న ఒక పేరుమోసిన హాస్పిటల్ కి వెళ్ళాను...

చూడగానే మంచి కార్పొరేట్ ఆఫీస్ లా ఉంది.. రిషెప్షన్ లో వివరాలు రాసుకుని...
రెండొందలు.. తీసుకుని... గ్రీన్ ఆపిల్ లోగోతో..., కార్పోరేట్.. బ్రోచర్ లాగా..
పెద్ద ఫైలులాంటి కార్ట్ ఒకటి ఇచ్చారు..., "అబ్బా భలే ఉంది బ్రోచర్...
కలర్స్ బాగున్నాయి ఎక్కడచేయించుంటాడో...", అని ఎడ్రసు వెతకబోతూ..
"ఎంతయ్యింటుందో అడిగేస్తే పోలా", అనుకుని అడగబోతూ..
"ఓహో..!, నేను హాస్పిటల్ కి వచ్చిన ఫేషెంటును కదూ!!",
అనుకుని క్యాసువల్ వార్డుకు వెళ్ళమని రిషెప్షనిస్టు చెప్పగా... అటువైపుగా
అడుగులువేసాను.

క్యాసువల్ వార్డ్ లో ఉన్న డాక్టరు Fresh గా, smart గా కనిపించాడు...
Fresher అయ్యుంటాడులే అనుకున్నాను , "ఏంటండీ మీ ప్రాబ్లమ్",
అని.. టెన్సన్ పడుతూ అడిగాడు.., నొప్పిసంగతి మొత్తం జరిగిన కధంతా...
చెప్పాను.... బెడ్ పై పడుకోమని.. ఊపిరి పీల్చి వదులుతూ ఉండమని..
వెన్నుపై నొక్కుతూ, పరీక్ష చేసాడు..., నొప్పి ఏమీ లేదని చెప్పాను,
"సరే..!, Ortho దగ్గరకు వెళ్ళండి", అని ఎదో రాసిచ్చాడు..
"అదేంటి.. Ortho ఎందుకు..?, నాకు వచ్చింది ఎదో Gastric trouble
లాగా ఉంది.." అన్నాను.. "అదే సార్ ఆయన చూసి చెప్తారు." అని
గాంభీర్యం ప్రదర్శించి చెప్పాడు. "సరేలే", అని Ortho Cabin దగ్గర
వెయిట్ చేసాను.

అరగంట వెయిట్ చెసాకా బెల్ కొట్టి పిలిచారు డాక్టరు సారు...
పేషెంటు ఎవరూ బయటకు రాలేదు..,"ఈ అరగంట ఈయన లోపల ఏం
చేసాడు...??", అని చూస్తే అప్పుడే మాట్లాడి పెట్టిన ఫోనును.. చూస్కుంటూ...
ప్రక్కన ఉన్న స్టెతోస్కోప్ ని... మెడలో వేసుకుని... "కూర్చోండి!,", అని
ఆహ్వానం పలికారు.. "ఓహో.. ఈయనకు కేసులు లేవన్నమాట...
అందుకే ఇక్కడికి పంపారు..", అని మనసులో అనుకున్నా.

"ఏంటి ప్రోబ్లమ్.!", అని అడిగారు జరిగిన కధ అని వేసి... మొత్తం కధంతా
కాస్త బ్లాకండ్ వైట్లో... టీవి సీరియల్ లో చూపించినట్లు...
బాధలన్నీ ఏకరువు పెట్టి కధంతా చూపించాను...
"ఏం చేస్తుంటారు..", అని అడిగారు.. సారుగారు...
"(బ్రహ్మీ) సాఫ్వేర్ ఇంజనీరు..", అని చెప్పాను.. (నాకేం తెలుసు వృత్తి అడగటం
డయాగ్నసిస్ లో భాగం అనుకుని చెప్పాను.) "సరే అయితే", అని...
నాలుగైదురకాల టెస్టులు రాసేసారు పేపరుపై.., ఇంకా ఏం రాయాలా అని
అలోచిస్తుండగా.. ఫోన్ మోగింది.. "హలో!!, సరే..., ఎవరు తక్కువ కోట్
చేస్తున్నారు?, ఒకే..! క్వాలిటీ ఎలా ఉంటుంది?, హా.. సరే..! అయితే.. తీసేస్కో..
ఆ ఇంటీరియర్స్ విషయం కనుక్కున్నావా?, త్వరగా కావాలి మనకు...
మళ్ళీ కనుక్కున్నాకా చెప్పు...", అని.. ఎవేవో మాట్లాడుతున్నారు..,
నానొప్పి బెంగలో ఉన్నానేమో నాకేం సరిగా అర్ధంకాలేదు.
"part time civil contractor ఎమోలే", అని.. అనుకున్నాను...

ఫోన్ మాట్లాడటం అయిపోయాకా... "సరే ఈ టెస్టులు చేయించుకుని రండి...
చూద్దాం...", అన్నారు.. "పర్వాలేదంటారా??", అని అమాయకపు మొహం
పెట్టి అడిగాను... కనీసం అలా అయినా మెడలో ఉన్న స్టెతోస్కోపుతో చూసైనా
చెప్తాడేమోనని.. "టెస్టులు చేయించుకున్నాకా చెప్పగలమమ్మా ఏంటీ అనేది...",
అని చెప్పారు..., మళ్ళీ సారుగారి..పోన్ మోగింది..., అది వింటూనే నేను రెసెప్సెన్
వైపు నడిచాను..., అక్కడ పేమెంట్ చేసి... "డయగ్నాసిస్ కి వెళ్ళండి..", అంది
రిసెప్సనిస్ట్...
prescription కౌంటరులో చూపించి... "ఎంత!", అని అడిగాను...
"మొత్తం అయిదువేలు అవుతుంది సార్..", అన్నాడు..
"ఏంటీ అయిదువేలా??", అని ఆశ్చర్యపోయాను...
"అవునండీ... ఈ టెస్టుకింత.. ఈ టెస్టుకింత...", అని.. వివరంగా రాసిచ్చాడు..
"అదేంటి.. ఈ టెస్టుకు రెండువేలా?.. ఏంటిది??", అని అడిగాను... ఇది..
urinary infection diagnosis test సార్.. అన్నాడు..
"అదేంటయ్యా.. stethoscope కూడా పెట్టి.. చూడకుండా.., నా చేయి కూడా
పట్టుకుని చెక్ చెయ్యకుండా ఇవేం టెస్టులు..", అని కాస్త సీరియస్ గా అడిగా...

"అంతే సార్.. హాస్పిటల్ కి మంచి బట్టలు వేసుకొస్తే.., మమ్మల్నడిగితే మేమేం
చెబుతాం..", అన్నాడు వెటకారంగా..., ఒక్కసారి నన్ను నేను పైనుండి క్రిందకు...
చూసుకున్నాను...
"సరేలే.. ఆ రెండువేలవి అవి వద్దుకానీ.. ఇందులో రాసిఉన్న ultrasound
చేయించుకుంటాలే..", అని దానికే బిల్ చెయ్యమని చెప్పాను...
ultrasound report వచ్చేవరకూ... రిలీజయిన ప్రోజెక్టుకు
ఏం ఫీడ్ బ్యాక్ వస్తుందో అని టెన్సన్ పడినట్టు.., రిపోర్ట్ లో అన్నీ నార్మల్
అన్నట్లుగా చదివి.. కాస్త చెమటలు తుడుచుకున్నాను...,
"మరి ఏదీ లేకపోతే... ఈ నొప్పేంటబ్బా", అని మరలా అనుమానంతో...
ఆ రిపోర్ట్ తీసుకుని... డాక్టరు సారుగారి దగ్గరకు వెళ్ళాను..
"పేపర్లన్నీ తిరగేసి.. అదేంటి..!, మిగతా రిపోర్టులేవి..?", అని అడిగారు...
"ఇంకా చేయించలేదండి.. ఇదే చేయించాను ముందు.. అవన్నీ మరీ costly గా
ఉన్నాయి, నాకసలే... Mediclaim Card కూడాలేదు..", అని డైరెక్టుగా చెప్పాను..
కాస్త డైట్ కంట్రోల్ చెయ్యండి.. spicyfoods.. oilyfoods తినడం తగ్గించండి",
అని... చెప్పి, ఇంకా ఎవో రాయాలి అన్నట్లు అలోచిస్తుండగా.. బాయ్ వచ్చి..
"సార్.. ఎవరో మిమ్మల్ని కలవాలంట", అని బిజినెస్ కార్టు చూపించాడు..,
లోపలికి పంపించమని చెప్పారు సారుగారు...

ఎవడో laptop bag లాగా మెడలో వేసుకొచ్చి నాప్రక్కనున్న సీటులో కూర్చున్నాడు...,
ఎవో మెడిసిన్ సేంపుల్స్ చూపించాడు.. ఎదో కొటేషన్ కాగితం కూడా చూపించాడు...
అది చూసి... "నేను కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం... అది ఒక టూ మంత్స్ లో
అయిపోవచ్చు... అది నా ఓన్... అక్కడకూడా మీరే ఇవ్వాలి..", అని సైన్ చేసి తిరిగిచ్చి...
పంపేసాడు.. అప్పుడు అర్ధం అయ్యింది.. ఈయన పార్టైమ్ సివిల్ ఇంనీరు కాదని...
"భలే కనిపెట్టేసానోచ్..!", అని.. కాస్త ఆనందపడ్డాను మనసులో...

మళ్ళీ నారిపోర్ట్ చూసి... "కనీసం ఇవి చేయించండి..", అని ఏవేవో మళ్ళీ రాసిచ్చారు...
(మళ్ళా...చేయి పట్టుకోకుండా.. స్టెతోస్కోపు పెట్టకుండా... ), టెస్టులకు కావాల్సిన
బ్లడ్ సాంపుల్స్ ఇచ్చాను.., చేతికి చిన్న ఇంజక్షన్ ఒకటి.. చేసి..మార్కర్ తో ఒక
సర్కిల్ గీసి... అది తడవకుండా.. ఒక రోజు ఉంచమని చెప్పింది.. నర్స్....,
తరువాత.. రాసిచ్చిన మెడిసిన్స్ కొనుక్కుని ఇంటికి బయలుదేరాను...

అప్పటివరకూ ఒంట్లో బాగాలేదని.. ఎవరికీ తెలినివ్వకుండా దాచాను..
ఇలా వెర్రి వెర్రి టెస్టులు చేస్తుంటే భయం వేసి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను..
ఆయనకు మెడికల్ గా కాస్త తెలియటంతో.. అలా చేతికి వేసి సర్కిల్ చేసేది..
T.B లాంటి ఇన్ఫెక్షన్స్ చెక్ చెయ్యటానికి చేస్తారు... "నీకు కడుపులో నొప్పి అయితే
చెయ్యటం ఏంటి..", అన్నారు.. "ఏమో మరి.. చూద్దాం..", అనుకుని తరువాత రోజు
కూడా పొద్దున్నే బయలుదేరాను రిపోర్ట్ తీసుకోవటానికి..., అవి తీసుకుని మళ్ళీ
సారుగారికి చూపించాను.. అన్నీ నార్మలే...

"ఎంటోమరి ఇంకా చూడాలి.. రాసిచ్చిన ట్యాబ్లట్సే.. వాడి..తరువాత కనపడండి...
అప్పటికీ తగ్గక పోతే.. ఫర్దర్ డయాగ్నసిస్ చేద్దాం", అన్నారు...
"అబ్బా బాగానే వదిలేసారు.. అంటే.. ఏమీ లేదన్నమాటే..", అని.. బయటకొచ్చి..
"ఇప్పటివరకూ ఎంతయ్యిందీ", అని పార్కింగ్ ఏరియాలో నిలబడి.. బండి తీస్తూ
లెక్కపెట్టాను... మొత్తం... మూడున్నరవేలు లెక్కకు వచ్చింది..

డాక్టరు నాకోసం ఎంత సమయం వెచ్చించాడో... (ఫోన్లో సొంత హాస్పిటల్ బేరాలు
తీసివేయగా..) చూస్తే... సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రోజెక్ట్ లీడ్ కన్నా
భారీగా ఉంది సంపాదన.. "హమ్మో... ఇలా అయితే... డాక్టరు చదివినా
బాగుండేదేమో?", అనిపించింది.

రోజులు గడిచాయి.. నొప్పి కాస్త తగ్గింది.., దాని.. గురించి అలోచించడం మానేసాను.
కానీ ఖర్చయిన మూడున్నరవేలు ఇంకా మర్చిపోలేకపోయాను...

ఇంటికి వెళ్ళినప్పుడు.. మా ఊరిలో ఫ్యామిలీ డాక్టరుకు.. ఒకసారి... పెద్ద పెద్ద రిపోర్టులు
చూపించాను.. ఆయన అవి చూసి నవ్వి...., "కొద్దిగా గ్యాస్క్టిక్ ప్రోబ్బమ్ వచ్చింది...
మెడిసిన్స్ అన్నీ మానెయ్... తిండి టైముకు తిని.. డైట్ కంట్రోల్ చెయ్యి...", అని..
చెప్పారు..., "ఇలా ఎక్కడ పడితే అక్కడ చూపించుకోవద్దు... ప్రతీదీ... బిజినెస్ చేసి..
డాక్టర్ వృత్తికే.. చెడ్డపేరు తెస్తున్నారు...", అని నవ్వి ఊరుకున్నారు... తరువాత...
నొప్పి పూర్తిగా తగ్గిపోయింది...కాస్త మనసు కుదుటపడింది...

ఒక సామాన్య మానవుడుకి రోగానికే... ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంటే..
ఇక.. బ్రతికేదేలా? డాక్టర్ వృత్తి.. ఒక వ్యాపారం కావడం చాలా సిగ్గుచేటు...,
ఈ రోజుల్లో మనిషిని చూసి... స్టెతస్కోపుతో పరీక్షచేసి రోగమేమిటో చెప్పే డాక్టర్లు
ఎంతమంది ఉన్నారంటారు?, సిజేరియన్ కాకుండా.. నార్మల్ డెలివరీ వచ్చేలా
చేసే డాక్టర్లు.. ఎంతమంది ఉన్నారంటారు?, ఇలా లెక్కెస్తే...
నూటికి ఒక పదిమంది ఉంటారేమో...
మిగిలిన ఆ తొంబైమందీ!!, వీళ్ళంతా డోనేషన్లు కట్టి డాక్టరుపట్టా
సంపాదించినవారే!

మనం కూడా ఇచ్చిన ప్రతి టెస్టు చేయించుకోనక్కరలేదు..., ఇంటర్నెట్లో
దీనిపై చాలా సమాచారం ఉంది..., గూగుల్ ద్వారా వెతికి.. ఏ టెస్టు
దేనికోసం చేస్తారు.. దాని నార్మల్ వ్యాల్యూస్ ఎంత అని తెలుసుకోవచ్చు.
అలాంటివాటిలో ఇవి కొన్ని...
http://www.wrongdiagnosis.com
http://www.labtestsonline.org
http://www.medicallabtests.com
http://www.ecureme.com/index.asp

బడా కార్పొరేట్... హాస్పిటల్ లోగోలు చూసి వెళ్ళేకన్నా..., చిన్నతెలుసున్న
డాక్టరుసలహాను పాటించడం మంచిది.., హాస్పిటల్ కి వెళ్ళగానే.. మీ వృత్తి..,
మీ దర్జా.. దర్పం.. మీదగ్గరున్న మెడిక్లైమ్ కార్టు చూపించేకన్నా..
ముందు మీకు ఉన్న సమస్యలను వివరించడం మంచిది...

కొన్ని తప్పులు చేస్తే.. నరహంతక పాపం చుట్టుకుంటుంది అంటుంటారు..
మరి ఇలా జబ్బులతో భయపెట్టి... డబ్బులు దండుకుంటూ..
నరహంతంకమే చేస్తున్న డాక్టర్లకు...
ఏపాపం చుట్టుకుంటుందంటారు?

-----------------------------------------
ఎప్పడో రాసిపెట్టుకున్న టపా ఇది.. ఇప్పటికి పోస్టు చెయ్యగలిగాను.

Related Posts Plugin for WordPress, Blogger...