1, జనవరి 2012, ఆదివారం

నా పాస్-పోర్ట్ చచ్చింది - 2


మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాంకదా.. ఆ బ్రేక్ తరువాత ఏం జరిగిందంటే.. రైడింగ్ చేసిన పోలీసులాగా తలుపు తీసి పోలీసుకే జర్క్ ఇచ్చి.. ఎవర్ గ్రీన్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణలాగా నిలబడ్డ.. నా వేపు సీరియస్ గా చూసాడు పులిరాజా. "ఇంత భారీ దుస్తులు వేసుకుంటే సరిపోదు.. పద్ధతులు కూడా నేర్చుకోవాలి.. లోపల ఒకరుండగా రాకూడదని తెలీదా..", అని భారీ డైలాగుతో చెంపఛెల్లుమనిపించాడు పులిరాజా.
"అంటే సార్ అదీ.. పదింటికి సార్ రమ్మన్నారు సార్ లేటయ్యిందని సార్ త్వరగా సార్ వచ్చాను సార్..", అన్నాను ఎక్కువ సార్ లు పెడితే కాస్త కరుగుతాడేమోనని.

"వీళ్ళంతా వెఱ్ఱి వెధవలా.. ముందెందుకొచ్చారు..", అని ముందుకూర్చున్న వాడిని చూపించాడు.. వాడు నిజంగా అలానే కనిపించాడు పాపం.. హీహిహీ హీహీహి.. అని అతన్ని చూసి నవ్వుదామనుకున్నాను.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'హలో' నవ్వు నవ్వినా..'భలేభలే' నవ్వులా నవ్వుల'పాలు'  అబాసు హర్లిక్సూ అవుతుందేమోనని వచ్చిన నవ్వును ఆపుకున్నాను. అమాయకంగా ఫేసుపెట్టి ఏమీ మాట్లాడకుండా నోట్లో చాక్లెట్టుపెట్టుకున్నట్టు వుండిపోయాను. లేకపోతే.. ఆ ముందు గదిలో అలసిపోయి.. నీడచాటు. సేదతీరుతున్న..గేది దూడలాగా.. బల్లపైన పడి అటుఇటూ పొర్లుతూ.. ముందు వైర్లెస్ సెట్టుపెట్టుకుని.. అందులో వస్తున్న మాటలు ఎఫ్-ఎమ్ రేడియోలో పాటల్లావింటూ పరవశించిపోతూ కునుకులాగుతున్న లేడీ కానిస్టేబుల్ ని అసభ్య పదజాలంతో దూషించి హింసించి కవ్వించానని కేసుపెట్టి లాకప్పులో తోసేసినా తోసేస్తాడు పులిరాజా.

"ఈ రోజుకి చాలామందున్నారు.. నీ నెంబరు రాసుకో ముప్పైఆరు.. రేపు పదింటికి ఖచ్చితంగా రా.. ఒక్క నిముషం లేటయినా నీకు జిందగీ కబీ నహీ మిలేగా దుబారా", అన్నాడు సీరియస్ గా.
"సార్ అది ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టాను.. ఎంతసేపయినా వుంటాను.. ఈరోజే కుదరదా సార్", అన్నాను.
"ఏ ఇంకో రోజు సెలవుపెట్టలేవా..", అన్నాడు.. "అవసరమైతే.. మీరుపెట్టమంటే ఇప్పుడే పెట్టేస్తాను సార్", అన్నాను అతివినయం ప్రదర్శించి. అతివినయం అదేదో లక్షణం అని తెలుసుకోలేక కరిగిపోయి సరే అయితే సాయంత్రం నాలుగింటికి రా.. అని ఒక కాగితం ఇచ్చి దానిమీద ముప్ఫైఆరు నెంబరేసాడు.

ఆ కాగితంలో మరళా ఈ కింది ఏమైనా నాలుగు ఫ్రూపులతోపాటు.. ఒక నిమ్మకాయ.. కుంకుమ-పసుపు.. దొరక్కపోతే మరాఠీ-సింధూరం.. ఎవరివైనా నాలుగు తలవెంట్రుకలూ.. చేతబడిచేయటానికి వాడే పుర్రే లేదా తొడఎముక అన్న లిస్టు ప్రకారం అన్నీ తీసుకుని మధ్యాన్నం మూడున్నరకే చేరుకుని స్మశానంలో ఒంటరిగావున్న కాశ్మోరాలా రడీగావున్నాను. కానీ ఈసారి ఆఫీసుకెళ్ళే డ్రస్సుకాదు. సాగిపోయిన టీ-షర్టు.. షైనింగు తో మెరిసిపోతున్న కొత్త జీన్స్( చీకిపోయిన జీన్సు.. అయితే కాస్ట్ ఎక్కవ కదా అందుకని..) సగం తెగిపోయిన చెప్పులేసుకుని వచ్చి కూర్చున్నాను. అక్కడనేను తప్ప ఎవరూలేరు. టైమెలా కదులుతుందో వాచీలో ముల్లు ఎలా తయారుచేస్తారు లాంటి యక్షప్రశ్నలేసుకుంటూ.. ఆలోచిస్తూ చూసుకుంటుండగా.. బుర్రలో ఒక విషయం వెలిగింది.. నా వాచీ చాలా కాస్ట్లీగా కనిపిస్తుందని.. ఎవడూ చూడకుండా తీసి జేబులో పెట్టేసుకున్నాను. నా అవతారం చూసి చైన్ స్నాచింగ్ టీమ్ లా వున్నాడని ఏ పోలీసోడన్నా పట్టుకుంటాడేమోనని అనుమానమొచ్చి నా పాత పాస్పోర్టు.. డాక్యుమెంట్లూ బయటకు తీసి కనబడేలా చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాను. ఇంతలో కొంతమంది నాలాగే పులిరాజాను కలవటానికే వచ్చి కూర్చున్నారు. హమ్మయ్యా కాస్త బలమొచ్చిందన్నట్టు నేనూ కూర్చుని వాళ్ళతో మాటలు కలిపాను. నాలుగయ్యింది.. నాలుగున్నరయ్యింది.. ఐదింటికి తాపీగా వచ్చాడు పులిరాజా.. ఇంకా నా తర్వాత ఒక ఐదుగురు వచ్చున్నారు.

నాది ముఫ్ఫై ఆరైతే.. నా తరువాత నెంబరోడిని ముందు పిలిచాడు.. సార్ నాది ముఫ్పయ్యారు అన్నాను.. ఆగు.. ఇది వేరే కేస్ లే అని నన్నుకుర్చోమన్నాడు. వాడితో మంతనాలు అయిపోయాకా ఆఖరులో తలుపు కాస్త దగ్గరకు పడింది.. ఎవో గుసగుసలు అయ్యాకా.. కాసేపటికి.. చెమటలు తుడుచుకుంటూ వాడు బయటకెళ్ళిపోయాకా నన్ను పిలిచాడు. లిస్టులో వున్న డాక్యుమెంట్లన్నీ తెచ్చానని చెప్పాను. పేరు... ఊరు.. వయసు.. ఎత్తూ భరువూ.. నడుం చుట్టుకొలత.. కాళ్ళమీద వెంట్రుకల లెక్క... ఇంట్లో ఎంతమందుంటారు.. పక్కింట్లో.. ఆ ఎదురింట్లో ఎవరెవరు ఉంటారు.. మీ పక్కవీధిలో ఎన్ని ఇల్లున్నాయి.. లాంటి ప్రశ్నలన్నీ వేసాకా.. డాక్యుమెంట్లన్నీ చూపించమన్నాడు.. ఇంకేముంది.. అయిపోయింది.. ఇక్కడ ఏదో లిటిగేషన్ పెడతాడు, ఇప్పుడు.. ఏదడిగినా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలని అనుకుంటుండగా.. డైరెక్టు పాయింటుకొచ్చేసి.. చేతులుపైకెత్తి బద్దకం తీర్చుకుంటూ.. ఎంతో కొంత ఇవ్వుమరి.. అన్నాడు. "సార్.. ఎంతొ కొంత అంటే.. ఎంత?", అన్నాను. ఐదొందలు నుండి రెండువేలు వరకూ ఇస్తారు.. ఎవరిష్టం వారిది.. అని పిచ్చినవ్వు మనసులో నవ్వుకునుంటాడుగానీ పులిరాజామొహంపై అదికనబడలేదు. "ఎవరిష్టంవారిదా.. నువ్వుచేసేది ఏ వ్యాపారం రా?, అసలు పోలీసుద్యోగమేనా నీది..?", అనిపించింది మనసులో. మనసులో అనుకున్నవి కనిపెట్టే టెక్నాలజీ రాలేదు కాబట్టి బతికిపోయాను. చాలా శాంతంగా.. ప్రశాంతంగా మొహం పెట్టి.. అంతిచ్చుకోలేను సార్ అన్నాను. "ఏఁ.. సాఫ్ట్వేర్ అంటున్నావ్.. ఐదంకెల జీతం వుండుంటుంది.. కనీసం మంచి బట్టలుకూడా వేసుకోలేదు.. మెరిసిపోయే నూటేభై ప్యాంటు.. సాగిన టీ-షర్టు.. మిగతా డబ్బులన్నీ సేవింగ్సే కదా.. సరేలే.. ఎంతిస్తావ్", అన్నాడు తలుపు దగ్గరేయమని సైగ చేస్తూ. "ఓరినీ.. మంచి బట్టలేసుకుంటే.. అలా అన్నావా.. ఇప్పుడిలావచ్చావా.. సరేకానియ్ నీ టైము", అనుకుని తలుపు దగ్గరగా జరిపాను. "సార్ ఇవే వున్నాయని", మూడొందలు చేతిలో పెట్టాను.. అందులో రెండు వందనోట్లు. ఒక ఏభై నోటు.. మిగతాది పదుల కాయితాలు.. చిల్లర తీసి చేతులో పెట్టి.. వందలూ ఏభై నోటు తీసుకున్నాడు.. తరువాత మారు మాట్లాడకుండా అసలు ఏమిచ్చానో చూడకుండా నా డాక్యుమెంట్లు స్టేపిల్ చేసేసాడు.. ఇది పూర్తిచెయ్యి.. నేనిప్పుడే వస్తాను.. పొద్దున్నుండి సీట్లో కూర్చుని నడుంపట్టేస్తుంది.. మా తిప్పలు ఎవడికీ తెలియవు అని ఏదేదో నసుక్కుంటూ.. పులి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.. ఎన్నాళ్ళకు నవ్వావురా నాయనా.. పులిని కూడా నవ్వించాలంటే.. గాంధీగారు నవ్వాలని అప్పుడే అర్ధమయ్యింది.

 ఇచ్చిన అప్లికేషన్ ఫాం పూర్తిచేసేసి.. హమ్మయ్యా అయిపోయింది ఎంక్వైరీ అనుకున్నాను. నోటినిండా పాన్ పరాగ్ వేసుకుని మూతికి ఒక సెల్లోటేపువేసుకొచ్చిన పులిరాజా.. పూర్తిచేసిన ఫాంలు తీసుకుని ఏమీ చూడకుండా... సెల్లోటేపులోంచి.. ఊ..ఊఁ.. మాత్రమే మాట్లాడుతూ.. ఇంకొక రెండు కాగితాలిచ్చి జిరాక్స్ తీసుకురమ్మన్నాడు. దాంతోపాటు ఒక ఫాం ఇచ్చి అది ముప్పై కాపీలు తీయించమన్నాడు. అవన్నీ తీయించిస్తే నాకు కావాల్సిన రెండు ఫాంలు ఇచ్చి.. మిగతా ముప్ఫైకాపీలు ఫైలులోపెట్టుకున్నాడు.. అది చూసి నాకు జీవితంమీద.. భవభంధాలమీద విరక్తి కలిగిన వాడిలా గిలగిలాకొట్టుకున్నంత పనయ్యింది.. "ఛీ నీ..కక్కుర్తి మీద కాకిరెట్టెయ్య...", అన్న తిట్టుగుర్తొచ్చి.. అది హిందీలో ట్రాన్సలేషన్ చెయ్యటంరాక.. నిట్టూర్చుతూ బయటకొచ్చాను. పోలీస్టేషనుపక్కనే చెట్టుకింద పార్కుచేసిన నా బండితీస్తుంటే ఎవడో పైనుండి చిన్నసైజు బంతిచ్చుకుని నెత్తిమీదకొట్టినట్టు అనిపించి తలెత్తి పైకిచూసాను.. "కావ్ కావ్..", అని మరాఠీలో అరిచింది నల్లకాకొకటి.. నెత్తిమీదపడ్డడి బంతికాదని తెలిసి.. "ఛీ.. నా ఎధవ బతుకు..", అని అలాగే తల తుడుచుకోకుండా పాతబట్టలు చించుకుంటూ ఇంటికొచ్చేసాను.

ఇంతకూ పులిరాజా ఇచ్చిన ఆ రెండు ఫాంలు ఎంటంటే.. నేను మీ ఇంటి పక్కింటిలోనే వుంటాను. నేను మంచివాడినే.. ఎప్పుడూ సిగరెట్లు.. మందూ.. పేకముక్కా.. చికెన్ టిక్కాలాంటి అలవాట్లులేవు. ఒకవేళ వున్నా మిమ్మల్ని పిలవకుండా నేనొక్కడినే ఎంజాయ్ చెయ్యలేదు. కొలెస్ట్రాల్ ఎక్కువుండటంవలన.. ఎప్పుడూ చిన్నపిల్లల దగ్గరనుండి ఐస్కీములు అవీ దొంగిలించలేదు. పొద్దున్నే మీ ఇంటిముందున్న పేపరూ.. పాలప్యాకెట్లూ పోతే నాకు సంబంధలేదు.. అని అన్నీ రాసి పక్కింటాయనచేతో ఎదురింటాయనచేతో లేక కిందింటాయనచేతో సంతకం చేయించాలి.. అది సరిపోదు మళ్ళీ ఆ సంతకంపెట్టినవాడి ఎడ్రస్ ఫ్రూపు.. ఐ.డి ఫ్రూఫు జిరాక్సులూ.. పుట్టుమచ్చలు.. చేతిరేఖలూ ఫొటోలుతీసి ల్యామినేషన్ చేయించి పంపాలి.., అలాగే వాటితోపాటుగా వాళ్ళ తలవెంట్రుకలు.. చేతి లేదా కాలిగోళ్ళు డి.యన్.ఏ టెస్ట్ కోసం పంపినట్టు సేంపుల్ కూడా పంపాలి... ఇవన్నీ అడిగితే వాడిస్తాడా.. ఇదెక్కడి రూలు.. ఇంతకుముందులేదే.. ఉండు మన్మోహన్ సింగ్ తో ఇప్పుడే మాట్లాడతాను నేను... వాడు నాకు బాగా తెలుసు అని ఫోన్ డయల్ చేసేస్తున్నాడు మా కిందింటాయన.. అబ్బే అంత 'పేద్ద' రికమెండేషను ఎందుకండీ.. మీరు మాట్లాడినా ఆయన ఇప్పుడూ ఎప్పుడూ మాట్లాడలేడుసార్.. మొహమాటం ఎక్కువా, వదిలెయ్యండి.. నన్ను నమ్మి ఇచ్చేయండి, గొడవొదిలిపోతుంది.. అని  వాడిని బ్రతిమలాడి వసుదేవుడిలా మారితే.. కాస్తకరిగి.. "సరేగానీ.. ఎన్నాళ్ళుగానో నేనూ పాస్పోర్టు అప్లై చేద్దామనుకుంటున్నా నాకూ కాస్త అప్లైచెయ్యటంలో హెల్ప్ చెయ్యాలి..", అని వాళ్ళావిడ ఫొటోమీద ఒట్టేయించుకుని.. నన్ను ఒప్పించాడు. "బాబోయ్.. పాస్పోర్టా అని అరవలేక.., సరే చేస్తా" అని చెప్పాను. మళ్ళీ తరువాత రోజు డాక్యుమెంట్లు తెచ్చుకుని సర్వం సమర్పయామి.

మళ్ళీ చెట్లు చిగురించాయి..అన్నట్టు నా జుట్టుకు నాలుగైదు కటింగులయ్యి.. బుర్రలో ఉన్న మెమొరీ కాస్తా రిఫ్రెష్ అయిపోయి.. అన్నీ మర్చిపోయిన కొన్నాళ్ళకు.. వేరే పోలీస్టేషన్నుండి మరో కాల్. నువ్వు రేపొద్దున్నే పదింటికి రా.. నీపాస్పోర్ట్ వెరిఫికేషన్కి అని. ఎందుకండీ.. మొన్న ఫలానా పోలీస్టేషన్లో  అన్నీ సమర్పించుకున్నాం అంటే.. నీవు మార్చిన కొంపలు ఎన్నుంటే అన్నిసార్లు తప్పవు నీకీ ఎంక్వైరీలు అన్నాడు. "భలేభలే సెహభాష్ నారాజా.. నక్కతోక తొక్కబోయి.. ఏ కుక్కతోకో తొక్కుంటాను.. సరే కానీయ్.." అని భుజంపై తట్టుకుని..చంకలుగుద్దుకుంటూ తరువాత రోజు ఆఫీసుకి సెలవు పెట్టకండానే వెళ్ళాను. ఎందుకంటే ఆరోజు శనివారం ఆల్రెడీ సెలవు కాబట్టి.

మళ్ళీ మొత్తం డాక్యుమెంట్లన్నీ జిరాక్స్ కాఫీలు తీయించుకోటానికి.. దిగిన ఫొటోలు ప్రింటులు తీయించటానికీ.. పెర్సనల్ లోన్ ఒకటి తీసుకుని జాగ్రత్తగా అన్నీ ఇచ్చుకున్నాను. మళ్ళీ ఈ పోలీసూ చేతులు పైకెత్తి బద్దకంగా విరుచుకుంటూ.. ఐదొందలివ్వు అన్నాడు.
ఈసారి.. అన్నా హజారే గుర్తుకొచ్చాడు.. ముసలాయన అంత కష్టపడుతుంటే మనమిక్కడ అడిగిన వాడికల్లా లంచాలిచ్చి తప్పుచేస్తున్నామని అనిపించింది.. పొంగుతున్న ఆవేశంతో.. ఇదెక్కడి గోల మొన్న అక్కడ అన్నీ ఇచ్చేసాను.. ఈ ఎంక్వైరీ వుంటుదని తెలియదుకూడా.., ఇంకా ఎన్నిసార్లివ్వాలండీ  అని నసుగుతుంటే "ఠీక్ హే..బేజ్ దేంగే..", అన్నాడు. ఏంటి మళ్ళీ అడిగ కాస్త మెత్తబడతాడు అనుకుంటే... అంత పెద్ద బూతు తిడతాడా.. సరేలే అని పౌరుషంతో లేనిమీసం తిప్పుకుంటూ నెత్తిమీద పేపర్ ని గొడుగులా  పెట్టుకుని ఏ కాకులూ పాడుపనిచెయ్యకుండా తప్పించుకొచ్చేసాను.

పదిరోజులయ్యింది.. ఇరవైరోజులయ్యింది.. ఆన్లైన్లో స్టేటస్ మాత్రం పోలీసులు ఇంకా వెరిఫైచేస్తూనేవున్నారు. నీపై కేసులు ఇంకా గాలిస్తూనే వున్నారు వెళ్ళివాళ్ళను బ్రతిమలాడుకొని తొందరగా కేసులన్నీమాఫీచేయించుకుని వెంటనే మాకు పంపు అనే వుంది.
నెలైంది.. కేసులేమీ మాఫీలైనట్టులేవు. ఇక లాభంలేదు.. ఒక్క హజారే కాదు.. హజార్ అన్నాహజారేలు ఉన్నా ఈ దేశాన్ని ఎవడూ బాగుచేయలేడు.. వెళ్ళి మళ్ళీ వసుదేవుడు అవతారమెత్తాల్సిందే.. అని మళ్ళీ పెర్సనల్ లోన్ తీసుకుని డాక్యుమెంట్లతోపాట.. స్టేటస్ అడగటానికెళ్ళాను.. అదేంటి ఇంకా వెళ్ళలేదా.. అలా జరగదే.. చూస్తానుండు అని అన్నీతిరగేసాడు..,గంట ఆగమన్నాడు.. వాడెవడికో ఫోన్చేసి అడిగాడు.. వాడు పాస్వార్ట్ తెలిసిన వాడు ఈరోజు సెలవు రేపుచెబుతాన్నాడు. సరేలే.. ఎక్కడో మిస్ అయ్యింటుంది.. మిసెస్ అయ్యివచ్చాకా.. మళ్ళీ పూర్తిచేద్దాం, ఒకవేళ పాతది ఉంటే పంపించేద్దాం లేకపోతే కొత్తది అని మొత్తం డాక్యుమెంట్లు మళ్ళీ తీసుకున్నాడు. ఈ సారి డబ్బులు అడగలేదు.. ఇచ్చానని అనుకుని వాడున్నాడు.. అడగలేదు పర్వాలేదు అని నేనున్నాను.. అక్కడ అన్నాహజారే నీరసపడి జైల్ భరో అంటున్నాడు.

ఇంకా ఏ కబురూలేదు.. ఆన్లైన్లో స్టేటస్ మాత్రం ఇంకా అదే. ఎన్నాళ్ళకు నా చచ్చిన పాస్పోర్టు బతుకుతుందో తెలీదుకానీ.. పోలీసుబట్టలుకాకుండా మామూలు బట్టలేసుకుని వెళ్ళేవచ్చేవాళ్ళను బావొచ్చాడు బావొచ్చాడు అని చూసినట్టుగా.. మనల్ని చూసే ఆ ఖైదీలూ.. ఆ ఖైదీకి కేరేజి పట్టుకెళ్ళేవాడిలాగా వారానికోసారి పోలీస్టేషనుకెళ్ళిరావటాలు భలేభలేమజాగావుంది.
ఇన్ని అద్భుతమైన అనుభవాలను పంచుతున్న మన సర్కారీవారికి శతకోటి వందనాలతో.. ఈ టపా అంకితం.

---------------------------------------------------------
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవకుండా.. అన్నీ తీపి అనుభవాలతో.. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను. :-)


Related Posts Plugin for WordPress, Blogger...