29, డిసెంబర్ 2011, గురువారం

నా పాస్-పోర్ట్ చచ్చింది..



నా పాస్పోర్ట్ చచ్చింది.. 
అవును.. నిజంగానే నా పాస్ పోర్ట్ చచ్చింది. ఇంగ్లీష్ లో ఎక్ష్పైర్డ్ అనేపదాన్ని తెలుగులో తర్జుమా చేసినా అదే అర్ధం వచ్చి చచ్చింది. ఎప్పుడో భూమి పుట్టకముందు పాస్పోర్టుంటే పడుంటుంది కదా అని ఒక ఆలోచనొచ్చి.. నా ఎమ్మెస్సీ సీటుకోసం కౌన్సలింగ్ పనిలో విశాఖపట్టణం వెళ్ళినప్పుడు పాస్పోర్టాఫీసుకు వెళ్ళి ఒక దరఖాస్తు పడేసుకున్నాను. ఎవరూ చూడలేదు కదా అని సైలెంటుగా అటుఇటూ చూస్తూ వచ్చేస్తుంటే.. ఆ పడేసుకున్న దరఖాస్తు ఎవడికో కనబడి నన్ను పిలిచి.. "బాబూ.. దరఖాస్తు పడేయటం అంటే ఇక్కడిలా ఆఫీసు బయట పారేయడంకాదు.. లోపలికెళ్ళి ఇవ్వాలని చెబితే తెలివొచ్చి.. తెలిసొచ్చి.. ఆఫీసులోపలకెళ్ళి చూస్తే.. ఎవరూలేకపోయినా లైట్లు వెలిగిపోతూ.. ప్యాన్లు తిరుగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సరేలే ఎవడొకడొస్తాడు... అని ఆఫీసులో అలా కుర్చీలో నడుంవాల్చేసరికి ప్రాంత ప్రభావమో.. లేక అయస్కాంత ప్రభావమో.. తెలియదు కునుకు పట్టేసింది. ఒక అరగంటకి లేచి చూస్తే ఇంకా ఎవరూరాలేదు.. ఎటు వెదికినా అదేదో రామ్ గోపాల్ వర్మసినిమాలోలా ఖాలీ గదులు.. కిర్రు కిర్రు తలుపులు.. భయంకరంగా భయపెడుతున్నాయి. ఆఖరికి కాసేపు అటుఇటూ తిరిగి ఎవడూ రాడని నిర్ణయించుకుని.. అక్కడే బల్లపై దరఖాస్తు.. దానికి సరిపడా డబ్బులు పడేసొచ్చాను.


 కొంత కాలం గడిచింది.. నెత్తిమీదబలమైన దెబ్బతగిలిన తెలుగు టీ.వీ సీరియల్ లో క్యారెక్టర్ లాగా ఎప్పుడు ఏ దరఖాస్తు ఎక్కడ పడేసానో మర్చిపోయాకా.. మా వూరికే బి.బి.సి గా చెప్పుకునే ఒకాయన కబురట్టుకొచ్చాడు. మీ ఊర్లో ఫలానా వాళ్ళబ్బాయిని నన్నొచ్చి కలవమను అని పక్కూరి పోలీస్టేషనులో వుండే కానిస్టేబుల్ చెప్పిన కబురంట.. చెప్పింది చెప్పినట్టు కాకుండా ఆ కబురుకు నాలుగు రకాల అత్తర్లు పూసి మా వూరంతా ఊదేసాడు. పోలీసోడు పిలిచాడా!.. అని వూరు వూరంతా నివ్వెరబోయి ఒక్క నిముషం ఆగిపోయింది. అదే విషయం ఎక్కడపడితే అక్కడ గూమిగూడి చెప్పేసుకుంటున్నారు. అలా గాలివార్తలా ఎగిరొచ్చిన వార్తవిని నేనూ కాసేపు నివ్వెరబోయాను.. తేరుకుని కాస్త బయటపడి ఇంటికి బయలుదేరి ఒంటరిగా గదిలోకి వెళ్ళి పోలీసు పిలిచింది ఎందుకా అని.. నటన వారసత్వంగా వచ్చిన హీరోలాగా  ఒక పది టేకులు తీసుకుని అలోచించాను. నాలుగు లాంగ్ షాట్లతో.. మూడు జూమ్ షాట్లలో నా మొహం అద్దంలో చూసుకుంటూ ట్యూబులైటు స్విచ్చ్ అన్ - స్విచ్చ్ ఆఫ్ చెయ్యగా.. ఎప్పటికో గానీ వెలగలేదు.. ట్యూబులైటు కాదు.. నా వెధవ బుర్ర.. అప్పుడెప్పుడో దరఖాస్తు పడేసుకున్న పాస్పోర్టుకైయ్యుంటుంది.. లేకపోతే మనమేం మారణహోమాలు.. మానభంగాలు చేసామని పోలీసోల్లు పిలుస్తారులే అని పోలీసాయన్ని కలుద్దామని వెళ్ళాను. 


ఆయన తీరిగ్గా ఆఫీసులో కూర్చుని.. అప్పుడే టాయ్ లెట్ రూమ్ తుడిచిన.. ఫ్రెష్ కొబ్బరిచీపురు నుండి ఒక పుల్ల విరుచుకుని పళ్ళుకుట్టుకుంటూ తన్మయత్వం పొందుతున్నాడు. ఒక పావుగంటకి తేరుకుని.. ఎదురుగా నిలబడ్డ నన్ను చూసి పేరేంటి అని అడిగాడు. "పాస్పోర్టండి", అని చెప్పగానే.. ఏంట నీపేరే పాస్పోర్టా.. మరి నీకెందుకింక పాస్పోర్టు అన్నాడు వెటకారంగా.. అదికాదండి.. అని నా పేరు చెప్పాను. వచ్చావా.. బాగానేవుంది. నీకు పాస్పోర్టెందుకూ అని అడిగాడు. అదిఅదీ.. విమానం ఎక్కడానికండీ.. అన్నాను కంగార్లో. ఏంటి విమానమే.., పాస్పోర్ట్ లేకపోతే ఎక్కనివ్వరా? సరేలే.. పాస్పోర్టు వెరిఫికేషనంటే చాలా తతంగం వుంది. పక్కనేవున్న పాత చెక్కబీరువాలో బూజుపట్టేసి సగం చెదలు తినేసిన ఫైల్సన్నీ చూపిస్తూ.. ఈ కేసులన్నీ తిరగెయ్యాలి, అన్ని పోలీస్టేషన్లలో నీ పేరుమీద కేసులున్నాయోమో చూడాలి.. అక్కడున్న నోటీసుబోర్టుల్లో మెల్లో ఒక నల్లపలక వేసుకునున్న ఫొటోలతో.. నీ ఫొటో పోల్చిచూసి కనుక్కోవాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తతంగం వుందయ్యా. పోలీసోళ్ళకేపనీ వుండదని అనుకుంటారు జనాలంతా.. ఇవన్నీ చేసి రాత్రికి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాం.. మా బతుకులు ఎవడికీ అర్ధం కావు.. అని తింగరి చూపులు చూస్తున్న నా వంక తింగరన్నర చూపులు చూసాడు పోలీసు. నీ ఎంక్వైరీ నేను చాలా త్వరగా పంపించేస్తాను.. పాస్పోర్టు త్వరగా వచ్చే బాధ్యతకూడానాదే..  కానీ మరి ఖర్చవ్వుద్ది.. ఎంతోకొంత ఇచ్చుకుంటే.. అని చేతులు నలుపుకోటం మొదలెట్టాడు. సర్వీసులో ఎన్ని సార్లు నలిపాడో తెలియదు.. నలిపి నలిపి ఆ చేతులు సన్నగా అయిపోయాయి. ఆ నలిగిపోతున్న సన్న చేతులు చూస్తే..  ఆ పోలీసు ఉద్యోగంలో నలిగిపోతున్న జీవితాన్ని ఊహించుకుంటే.. కన్నీళ్ళొచ్చేసాయి.. సార్!.. ఇక నలపకండి... ఆపండి.. ఆపండి..ఆ..పం..డి. అని ఎకో సౌండు ఎఫెక్టుతో అరిచి. "నలిగిపోతున్న మీ పోలీసు జీవితాన్ని నేనింక చూడలేనండీ..", అని భారీ డైలాగొకటి చెప్పి ఇదిగో వంద.. అని నవ్వుతున్న గాంధీగారిని ఏడుపుకళ్ళతో చూస్తూ వందనోటు చదివించుకున్నాను. 


పాతసినిమాల్లో క్యారెక్టర్ నటి చీరకొంగుతో నోరునొక్కుకుని ఏడ్చివెళ్ళిపోయినట్టుగా చేత్తో నోరునొక్కుకుని వెళ్ళి సైకిలెక్కాను. మళ్ళీ చాలా రోజులు గడిచాకా.. హైద్రాబాద్ సిటీ బస్సులో పొద్దున్న పదింటికి ఆఫీసుకని బయలుదేరిన అమ్మాయి.. దిగే ఎక్కే మగాళ్ళ చేతుల్లో నలిగినట్టుగా.. సర్కారీ తపాలా బంట్రోతు చేతుల్లో నలిగి నలిగి దళసరి..ఖాఖీ రంగు కవరు చుట్టుకుని.. పోస్టులో నా పాస్పోర్టు ఇంటికొచ్చింది. "ఏండే.. అబ్బాయిగారికి పాస్పోర్టొచ్చేసింది.. ఇంక విదేశాలకెళ్ళటమే ఆలస్యం.. మరి పాస్పోర్టొచ్చిన సంతోషంలో నాకేమన్నా..", అని నెత్తిమీద చెయ్యివేసుకుని బుర్రగోక్కుని ఉన్న నాలుగెంట్రుకలూ రాల్చేయబోయాడు తపాలా బంట్రోతు. ఆగు నాయనా ఆగు.. ఇప్పుడే గుమ్మాలు తుడుచుకన్నాం నువ్వు ఆ నాలుగూ రాల్చి ఛండాలం చెయ్యకు అని గోక్కునే వేళ్ళమధ్య ఒక ఇరవై రూపాయలు పెట్టి.. గోకుడు ఆపించి.. పంపించాల్సొచ్చింది.  సరే మనకు ఇప్పట్లో పనున్నా లేకపోయినా.. పాస్పోర్టంటూ ఒకటుంది కదా అని.. అలాగే భద్రంగా ఇనబ్బీరువాలో పెట్టి.. చెదలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుని.. అప్పుడప్పుడూ తీసి కళ్ళకద్దుకుని.. పదేళ్ళయినా ఒక్క పేజీ కూడా నలక్కుండా.. ఒక్క పెన్నుగీతకూడా పడకుండా.. కొత్త వాసన పోకుండా.. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న పాస్పోర్టుకు ఏం రోగం వచ్చిందో మరి చచ్చింది. ఎవడన్నా అడిగితే.. గర్వంగా నాకూ ఉంది పాస్పోర్ట్ అని చెప్పుకోటానికి తప్ప ఏ పనికీ పనికి రాకుండా.. ఏ మార్పూ లేకుండా. ఇన్నాళ్ళూ బీరువాలో.. అదే నలిగిపోయిన ఖాఖీ రంగు కవరులోనే చుట్టబెట్టుకుని నాజుకుగా కనిపించే నా పాస్పోర్టుకు ఏమయ్యిందో తెలియదు.. మరి చచ్చి చచ్చింది.


నాకు ఇక్కడో అనుమానం వచ్చింది.. అప్పటి చీపురు పుళ్ళ పోలీసు.. ఏ వెధవ ముహూర్తంలోనో.. తన ఎడంచేత్తోనో ఛీడ సంతకం పెట్టుంటాడు.. లేక ఆ పాస్పోర్ట్ ఆఫీసోడు.. చూపుడు వేలుకు తొడుక్కోవాళ్సిన రాయి ఉంగరం.. ఏ ఎడంకాలి పిల్లవేలుకో తొడుక్కునుంటాడు.. వాళ్ళందరి చీఢ నాకు పట్టుంటుంది. లేకపోతే.. నేను పనిచేసిన కంపెనీల్లో మన పక్కనున్నోళ్ళూ.. పక్క ప్రాజెక్టోళ్ళూ.. నేనీ ప్రాజెక్టులో చెయ్యను అని ఇచ్చేస్తే నా దగ్గరనుండి నేర్చుకున్నోళ్ళు. అలాగే ఆఫీస్ బాయ్.. టీ బాయ్ తో సహా అందరికీ విదేశం ఆఫర్లొచ్చినా మనకు కంపెనీ తరపునుండి ఒక్కసారికూడా.. ఆఫర్ రాకపోగా.. కనీసం పాకిస్తాన్ ఆఫ్ఞనిస్తాన్ వెళ్ళే ఛాన్సుకూడారాలేదు. సొంత డబ్బుల్తో సింగపూర్.. మలేషియా.. లాంటి ట్రిప్పులూ వేసే చాన్సూ కలిసిరాలేదు. ఇలాక్కాదు. పాస్పోర్టు పై ఒక్క స్టాంపైనా పడాలి అని స్టాంపు ఒకటి తయారుచేయించి.. నేనే రెండు గుద్దులు గుద్దేద్దాం అని డిసైడైపోయి.. అదే అవిడియాతో ఇనబ్బీరువాలో వున్న పాస్పోర్టు తీసి చూసే సరికి.. బ్రేకింగ్ న్యూస్ లాగా పాస్పోర్టుకు కాలంచెల్లిందనే షాకింగ్ న్యూస్ బయటపడింది. లేకపోతే ఇంకొక పదేళ్ళకుగానీ పాస్పోర్ట్ చచ్చిందనే విషయం లోక్పాల్ బిల్లులాగా బయటపడేది కాదు.  అదన్న మాట అసలు విషయం.. 


సరే ఇప్పుడు చచ్చినదాన్ని ఇంట్లో ఏం పెట్టుకుంటాం.. మళ్ళీ అప్లై చెయ్యాలికదా.. మళ్ళీ అప్లైఅంటే  రిన్యూ చెయ్యటమే.. ఆఁ.. ఎంతసేపు మహా అయితే మొబయిల్ లో బ్యాలెన్స్ రీచార్జ్ చేసినంత టైంలో అయిపోవచ్చు.. అప్పుడంటే పదేళ్ళ క్రితం మాట.. ఈ మొబైల్సూ.. కంప్యూటర్లూ ఎరగం కదా.. ఇప్పుడంతా ఆన్లైనే అయ్యింటుంది అని గూగులమ్మతో నాకొచ్చిన సందేశాలు చెప్పిచూద్దునా.. దుమ్ముపట్టేసి.. బూజులు దులపని ఇల్లులాగా ఒక వెబ్బైట్ కనిపించింది. నా కంప్యూటర్ మానిటరేమన్నా సరిగ్గాలేదేమోనని క్లాత్ పెట్టి తుడుద్దునా.. అయినా అలాగే వుంది.. ఆ తరువాత తెలిసింది. ఆ రంగులే అంతని. చఛా!, ఇదైయ్యుండదు.. ఇండియాలో ఎంతమంది పాస్పోర్టులు తీసుకొనుంటారు.. పాస్పోర్టు తీసుకున్నవాడిదగ్గరనుండి.. వెబ్సైట్ ఫండుకింద కనీసం ఒక్కరూపాయి తీసుకున్నా హైక్లాసు వెబ్సైట్ చెయ్యొచ్చుకదా. అలా చేసేవుంటారు.. ఇది ఎవడో తలమాసినోడిదయ్యుంటుంది.. గవర్నమెంటు పేరు పెట్టుకున్నాడు.. అని ఆ పేజీ మూసేద్దామనుకునేలోగా పైనే కనబడింది.. బయట అక్రమసంబధాల మంత్రిత్వశాఖ అని. (Ministry of External Affairs), ఓరినీ..!!, నా అంచనాలన్నీ తారుమారయ్యాయే.. అయితే వీళ్ళు బయట సంభంధభాంధవ్యాలు.. పెత్తనాలూ తప్ప.. ఇంట్లో విత్తనాలు నాటుకోలేని వాళ్ళన్న విషయం ఎవరూ అనక్కర్లేదు.. ఆ వెబ్సైట్ చూస్తేనే తెలిసిపోతుంది. మళ్ళీ అందులో ఏ ఏరియాకు తగ్గట్టు ఆ వెబ్సైటు.. మళ్ళీ దేనికదే సెపరేటు డిజైను.. ఏంటో..!, సరేలే ఇందులో ఎన్ని కోట్లు స్వాహానో.. మనకెందుకొచ్చినగొడవ... మనకెవడన్నాఇస్తాడా చస్తాడా.. మనది నొక్కకుండా వుంటే అదే దస్ హజారూ..!, అనుకుని వూరుకున్నాను. 


అసలు వివరాల్లోకి వెళ్ళీ చూడగా తెలిసిందేంటంటే.. రిన్యూ అన్నా కొత్తది అప్లై చేసినా అన్నిటికీ గవర్నమెంటు ఉద్యోగుల "బాగు" దృష్టిలో పెట్టుకుని ఒకటే స్కీము పెట్టారని తేలిపోయింది. అంటే ఆఖరికి పోలీసు ఎంక్వైరీతో సహా.. అమ్యామ్యా మాములేనని తేటతెల్లమైపోయి.. నా మొహం సూపర్ రిన్ సోపుతో ఉతికినట్టు తెల్లగా అయిపోయింది. ఓరినాయనో.. అసలే తింటానికీ.. తిన్నది అరాయించకోటానికే టైములేక.. కిడ్నీల్లో ఇడ్లీ సైజంత రాళ్ళు పేర్చుకుని కోటలు కట్టుకుని రాజ్యాలేలుతూ.. తిన్న చెయ్యి కూడా కడుక్కోకుండా ఆఫీసులో కీబోర్గ్ మీద ఎంగిలి చేతుల్తో టిక్కూటిక్కూమని టైపుకొట్టుకుంటూ, క్షణం తీరికలేని మా సాఫ్వేర్ బతుకుల్లో ఇన్ని కష్టాలా??. ఇప్పుడు ఆ గవర్నమెంటు ఆఫీసుకెళ్ళి లైన్లలో నిలబడి.. వాడితోనూ వీడితోనూ ముష్టియుద్దం చేసి, ఎవడికో చేతులు ఖాలీగాలేవు కాస్త వీపుగోకిపెడతారా.. అంటే లేని గోళ్ళతో గోకిపెట్టి, వాడెవడికో పెన్నులేకపోతే పక్కోడి జేబులోంచి పెన్ననుకొని సిగరెట్ తీస్తే చెప్పుదెబ్బలుతిని.., వీడెవడో నిశానీ అయితే వాడి అప్లికేషనూ.. ఇంటి ఎడ్రసూ.. పోయిన వాడి బాబు ఎడ్రసూ.. వాడికి నచ్చిన వేటూరివారి పాటలూ వాళ్ళ బాబుకు నచ్చిన ఘంటశాలగారి పాటలన్నీ రాసిపెట్టి, ఇంకొకడెవడికో స్టాంపు అంటించడానికి కాస్త ఉమ్మితడి కావాలంటే అప్పిచ్చి, వేరేవాడు పాటపాడటానికెళ్తే.. వాడి ఫైల్సూ.. నిలబడ్డ ప్లేసు ఎవడూ అక్రమించకుండా కాపలాకాసి, ఇంకొకడెవడో సిగరెట్టు అంటిచడానికి అగ్గిపెట్టడిగితే.. లేదని చెప్పి, మనం సిగరెట్టు కాల్చకపోటం ఒక పెద్దలోపమే అని తెగబాధపడి పోయి, ఈ ఎధవ పనులన్నీ చేసేంత ఓపికలేదుగానీ.. చచ్చిన పాస్పోర్ట్ ని తాటిపాతరేసినట్టుగా పాతరేసేద్దాం అని నిర్ణయించుకున్నాను.


ఈ నిర్ణయాలన్నీ ఆఫీసులో కూర్చుని మానిటర్ ముందున్న సూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుండగా.. సరిగ్గా ఐదునిముషాల్లో మా సీ.టీ.వోతో మీటింగ్ అన్నారని.. కాస్ఫరెన్స్ కాల్ అయ్యింటుందిలే అని మీటింగ్ రూమ్లోకెళ్తున్న మాకు.. బాబూ అటు కాదు ఇటు.. ఆయన ఇక్కడేవున్నాడు ఈ రోజే అమెరికా నుండి దిగాడు అన్నారు.. "అదేంటి మొన్నటికిమొన్నేకదా వెళ్ళొస్తాను బైబై అన్నారోలేదో అప్పుడే ఎలా వచ్చారు..", అని అడిగితే ఆ రోజు పొద్దున్నే దిగాడని తేలింది. ఇదేమన్నా తణుకు-మార్టేరు షెటిల్ బస్సు సర్వీసా.. ఇంత సులువుగా వారానికోసారి అమెరికానుండి ఇండియాకి ఎలా వస్తున్నాడబ్బా.. ఈయనకి పాస్పోర్ట్ అక్కర్లేదంటావా?, అవును..!  ఇంతకీ ఈయన పాస్పోర్ట్ ఎలా రిన్వూ చేయించుంటాడు, మీటింగ్ అయిపోయాకా.. "ఎనీ క్వస్చన్స్",  అన్నప్పుడు అడిగేస్తే పోలా.. అన్న అద్భుతమైన ఆలోచనలల్తో నా బుర్రను రేజ్ చేసిన ఏక్సిలరేటర్ లాగా జుమ్ జుమ్ అనిపిస్తుండగా. మీటింగ్ అయిపోయిందన్నారు.. ఆ మీటింగ్ యొక్క సారం సారాశం.. ఏంటిరా అని పక్కోడినడిగితే... కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి.. మీ అందరికీ నా ధన్యవాదాలు.. ఇదే కృషి పట్టుదలతో మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను. అని చెప్పాడు. 
అయ్యబాబోయ్.. ఇంకేముంది.. కొత్తప్రాజెక్ట్..! స్టడీకోసం..!! ఆన్ సైట్!!! ఆఫరూ!!!!, మరి నేను..!! నా పాస్పోర్ట్ లేకుండా.., ఓరినాయనో!!!!!!. ఈ సారికూడా వచ్చిన ఛాన్స్ మిస్సయ్యి.. నాకు పాస్పోర్ట్ లేదని.. ఏ సెక్యూరిటీవాడినో నా బదులు పంపించేస్తే సాఫ్ట్వేర్ సన్యాసం చేసేసి.. అడవుల్లోకి పోయి.. ఆకులూ అలమలూ చుట్టుకుని కంద-మూలాల్ని పిజ్జా-బర్గర్స్ లా ఊహించుకుని.. ఒక ల్యాప్ టాపు చేత్తో పట్టుకుని.. రిలయన్స్ నెట్ కనెక్ట్ తో ఇంటర్నెట్టుకు కనెక్టయ్యి.. ఫేస్బుక్కులో వున్న ఆన్లైన్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ..  సిగ్నల్ సరిగాలేక సగం సగం సిగ్నల్ తో వెళ్ళిన నా సగం సగం మాటలు అర్ధంకాక.. నా ప్రెండు బండ బూతులు తిడుతుంటే.. యువర్ - అయ్యా అంబానీ.. "కర్ లియా మేరా దునియా.. జంగిల్ మే.." అని నా తలను ఆ పక్కనేవున్న కొండరాయికేసి కొట్టుకున్న సీన్ గుర్తుకొచ్చింది.


ఇప్పుడెలా!, ఎలాగైనా పాస్పోర్టును బతికించాలి.. బతికించాలి బతికించాలి అని ఆలోచిస్తుంటే.. పిడికిలి బిగుసుకోవటం మొదలుపెట్టింది.., అదేదో సినిమాలో నరాల నాగార్జునకి.. సారీ..  నాగార్జునకి నరాలు పొంగినట్టు పిడికిలి దగ్గర్నుండి పొంగుకొచ్చాయి.. అలాగే పిడికిలి బిగించి ఆలోచించగా.. ఆర్పీపట్నాయక్ తీసిన "బ్రోకర్" సినిమా గుర్తొచ్చింది.. ఇండియాలో ఈ "బ్రోకర్" అన్న మానవుడు లేకుండా మనకు పనులెక్కడవుతాయిలే.. ఒక బ్రోకర్ గాడిని పట్టుకోవాలి.. అని గూగులమ్మతో చెప్పి వెతికిపెట్టమన్నాను. బడా మార్ట్ లో వారంక్రితపు పుచ్చొంకాయలకి.. కాస్త చెంకీ కవరుతో ప్యాకింగ్ చేసి.. ఏసీలో పెట్టి  కొత్తలేబుల్ అంటించి.. మాంచి లుక్ వుండేలా చేస్తే.. "యా!, ఐనో.. ధీస్ ఆర్ పుచ్చ్ వంకాయ్స్.. బట్ యునో ధీస్ ఆర్ వెరీ హెల్దీ...", అని ఆ పుచ్చుల్లో  కాస్త చిన్నపుచ్చలున్నవి ఏరిమరీ కొనుక్కుంటూ.. లౌక్యం ప్రదర్శించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా.. ఇచ్చేది బ్రోకర్ కే.. కానీ..ఆ బ్రోకర్ గవర్నమెంటు ముద్రవేసిన బ్రోకర్ కావాలని(Authorized Agent), అదీ మనదగ్గర్లో వున్న వాడినొకడిని వెతికి పట్టుకోవాలని కాస్త లౌకిక-అలౌకిక లౌక్యం ప్రదర్శించి.. వివరాలు కనుక్కోగా వాడు ఒక రెండువందల ఏభై మామూలుగా మామూలు తీసుకుని పనికానిస్తానని భరోసాఇవ్వగా వెంటనే పత్రాలన్నీ మూటగట్టుకుని ఇవ్వటానికి బయలుదేరాను.


ఇక్కడే అసలు కష్టాలు పీతల్లా వెంట పడి కరిచాయి.. ఒక సంవత్సరంలో ఎన్నిచోట్ల ఉంటే అన్ని ఎడ్రస్ ప్రూఫ్ లు ఇవ్వాల్సుందని చెప్పాడు.. ఎడ్రసుప్రూఫులుగా ఏమేమి ఇవ్వొచ్చో ఒక పెద్ద లిస్టే ఇచ్చి ఇందులో ఏమన్నా ఒక నాలుగు అన్నాడు. ఏంటివి ఇందులో ఏమన్నా నాలుగా!, అంటే ఏంటి.. ఇదేమన్నా బిగ్ బి నిర్వహించే కౌన్ కిస్కా కరోర్ పత్నినా? అనడిగితే.. కాదుసార్.. ఈ కిందిచ్చిన లిస్టులో ఏవన్నా నాలుగు ఫ్రూపులు అన్నాడు. ఇక్కడొక థియరీ వుంది. ఎవరైనా కనిపెట్టారోలేదో తెలియదు కానీ.. మూడంటే మనదగ్గర రెండు.. నాలుగంటే మనదగ్గర మూడే ఏడుస్తాయి. ఖచ్చితంగా ఆలాగే.. నాదగ్గర మూడే ఏడ్చాయి. అందులోనూ ఒక సంవత్సరంలో నేను రెండుచోట్ల కొంపలు మార్చాను. ఆ పాత ఇంటికి కొత్తప్రూఫ్ లు కూడా కావాలి. సరే మీకు ఒక ఆఫ్సన్ వుంది ఆఫీసునుండి లెటరు.., బ్యాంకు స్టేట్మెంటు.. తీసుకురమ్మన్నాడు. అవి పాతింటి పేరుమీదవైతే మీకు వీజీ సార్ అన్నాడు. ఏం వీజీ.. కొంప కొల్లేరైపోతేనూ.. ఇవన్నీ ఎందుకురా బాబు ఇప్పుడుంటున్న ఇంటిది ఒక్క ఎడ్రస్ ప్రూఫు చాలదా అన్నాను. సార్ రూల్స్ సార్ అన్నాడు.. లేచి వచ్చేద్దామంటే. మా ఆఫీసు సెక్యూరిటీవాడు నా ప్లేసులో ఆన్ సైట్ ఆఫర్ కొట్టేసి.. ప్లైటెక్కుతుంటే మేమంతా సెండాఫ్ ఇస్తున్న సీన్ గుర్తొచ్చింది.. ఇక చేసేదిలేక కుర్చీలోంచి లేవలేక.. "సరే తెస్తాను ఇంకా.. ఏమన్నా కావాలంటే చెప్పు మాటిమాటికీ తిరగలేను" అన్నాను. "అయితే.. ఒక రెండుకేజీల బంగాళాదుంపలు.. ఒక కేజి ఉల్లిపాయలు.. ఒక పత్తాగోబీ  కొని వెళ్తు వెళ్తూ మా ఆవిడకిచ్చేసివెళ్ళండి అని అనబోతున్నట్టు ఫేసుపెట్టి.. ఇంకేమీ అక్కర్లేదు సార్.. ఇవి చాలు", అన్నాడు. ఎలాగైతే.. మొత్తానికి కావాల్సిన డాక్యుమెంట్ల కోసం రెండు మూడు నాలుగైదు ఆరురోజులు తిరిగి తిరిగి ఇవ్వగలిగాను. ఆ తరువాత.. అప్లికేషన్ ఫాం ఆన్లైన్లో పూర్తిచేసేసాడు.. ప్రింట్ తీసి ఇంకా ఏవో నాలుగైదు కాగితాలమీద సంతకాలు అన్నాడు.. అసలే ఆఫీసు టైమైపోతుంది త్వరగా కానియ్.. అంటే.. తరువాత వేలిముద్రలన్నాడు.. ఆ తరువాత కాలిముద్రలు వెయించుకున్నాడు. నాకు మండి... ఇంకా ఎన్ని ముద్రలేయిస్తావయ్యా.. ఇదిగో కావాలంటే.. నా.."...." వేసుకో అనబోతే.. సార్ తిట్టకండి సార్.. ఇవి రూల్సు సార్.. మరి ఏం చేస్తాం అన్నాడు. సరే.. నీకిష్టమొచ్చిన ముద్రలేస్తా.. ఎక్కడెయ్యమంటే అక్కడేస్తా.. ముద్ర నువ్వువెయ్యమన్నా సరే. నేను వేసినా సరే.. నీ ఆఫీసులోవేస్తా.. నీ ఇంటికొచ్చివేస్తా.. నువ్వు మొలతాడుకట్టుకోని మరాఠీవాడివే ఐతే కాసుకో.. అని డయలాగులు చెబుదామంటే వాడికి మన తెలుగర్ధంకాదు.. ఈ డయలాగులు.. లాగులు పైకి లాక్కుంటూ నాకు హిందీలో చెప్పటం రాదని ఆగిపోయి.. ఇంక నువ్వు అవి ఇవీ కావాలి అని అడక్కుండా అన్న టైముకి సబ్మిట్ అయిపొవాలి.. నువ్వేంచేస్తావో నాకు తెలియదు అన్నాను. అందులో తేడావుండదు సార్.. నేను చేస్తాను 'మీరే చూస్తారు' కదా అని భరోసా ఇచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికొచ్చాకా ఆలోచించాను.. "మీరే చూస్తారుకదా" అన్నది వెటకారంగా అనలేదు కదా అని.


మళ్ళీ మనమెక్కడున్నామంటే.. ఫలానా ఫలానా ఘట్టంలో గొట్టంలో ఇరుక్కుపోయిన యువరాజుగారిని చూసీ.. రూపాయిపావళా పెట్టి గొట్టాలు కొనుక్కుని ఐదువేళ్ళకూ పెట్టుకుని తింటూ వెళుతున్న రాణీగారు.. ఫక్కున నవ్వే... అని ఒక్కసారి చెప్పుకున్న కధ గుర్తుచేసుకున్నట్టుగా.. కొన్నాళ్ళుపోయినతరువాత లోకల్ పోలీస్టేషన్నుండి రేపొకసారి పదింటికి స్టేషనుకొచ్చి కలవమని ఫోనొచ్చింది. సరే!.. నేనెళ్ళడమేంటి.. అసలు పోలీసోడికీ నాకు సంబంధమేంటి.. ఆ బ్రోకర్ గాడే చూసుకుంటాడులే అని వాడికి ఫొనుకొడితే.. "సార్.. పోలీస్ ఎంక్వైరీ మీరే చూసుకోవాలి.. మేం అప్లికేషన్ సబ్మిట్ చెయ్యటంవరకే", అన్నాడు. 
అదేంటి?, ఆ పని బ్రోకర్ 'గాడిదే' అని మా ఫ్రెండొకడు చెప్పాడు అన్నాను. 
కాదు సార్.. ఈ విషయంలో 'ఎవడిది వాడిదే' అన్నాడు. 
సరేలే.. ఇంకేంచేస్తాం.. అని నోర్మూసుకుని తరువాతరోజు ఆఫీసుకు సెలవుపెట్టి పోలీస్టేషనుకు వెళ్ళాను. ఏంటి పోలీస్టేషనుకు వెళ్ళటానికే సెలవా అని అడిగారు కొంతమంది.. నీకు భలే సెలవు దొరుకుతుందిరా అన్నారు ఇంకొంతమంది.. మీరూ ఏదోటి అంటారు కదా.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చెబుతా.. మీరిప్పుడు ఎందుకు సెలవుపెట్టానో తెలుసుకోవాలంటే.. చిన్న బ్రేక్ తరువాత.. అని బ్రేకులు బ్రేకుడాన్సులూ అవసరంలేకుండానే చెబుతున్నాను వినండి. 


ఇవసలే.. గవర్నమెంటు పనులు.. అందులోనూ స్టేట్ గవర్నమెంటు పనులూ. కంప్యూటర్ భంద్ ఏం చెయ్యం అని.. ప్రెసిడెంట్ వచ్చి స్విచ్చాన్ చేస్తాడు అన్నట్టు దానిముందే కూర్చుంటాడొకడు. దీని పాస్వార్ట్ ఎవడి దగ్గరుందో తెలియదయ్యా.. సాయంత్రం రా.. అంటాడు ఇంకొకడు.. ఒకవేళ తప్పుచేసి సాయంత్రం వెళితే.. ఎవడైనా గవర్నమెంటు ఆఫీసులో సాయంత్రం వరకూ పనిచేస్తాడా.. నీకు పిచ్చికాకపోతే.. సాయంత్రం రమ్మనగానే ఊపుకుంటూవచ్చేసావ్.. అని నలుగురైదుగురికి మనల్ని చూపించి గేలిచేస్తాడు మరొకడు..  మరి ఇలాంటి పరిస్థితుల్లో.. అనుకున్న టైముకి పనులు అవ్వటం అసాధ్యమైన విషయాలే కదా మరి.. అందుకే సెలవు.
లైబ్రరీలో యోగాసనాలు అనే పుస్తకంలో.. ఆసనం వేయు విధానం అన్నది  కంగారుకంగారుగా చదివేసి ఆసనం వేసేసాకా.. ఆ ఆసనాన్ని ఎలా తియ్యాలో అని వున్న పేజీని.. ఎవడో కక్కుర్తి పడి చింపి పట్టుకుపోయాడని ఆసనం వేసేదాకా తెలుసుకోలేక. ఆ వేసిన ఆసనంలో ఇరుక్కుపోయి బయటపడలేనట్టుంటుంది సాఫ్వేర్ అనే చట్రంలో ఇరుక్కుపోయినోళ్ళ బ్రతుకు... సెలవు పెట్టకపోతే పోలీసోడితో ఒక తలనొప్పి.. సెలవుపెడితే ఆఫీసులో మన సీటుకొచ్చేస్తుంది నడుంనొప్పి.  ఆఫీసులో మనం చేసిన పనిలో వేళుపెట్టి ఆ వేలు ఎలా బయటకు తియ్యాలో తెలియక ఎవడో ఫోనుచేస్తుంటాడు. పనిచేస్తుంది చూడు. ఎందుకు చెయ్యదు.. నేను నిన్న ఇంచక్కా వేలుపెట్టి తియ్యలేదా.. అలాగే చెయ్యాలంతే.., ఇప్పుడు సడెన్ గా ఈ రోజే ఎందుకలా అవుతుంది.. లాంటి సంజాయిషీలతోనూ..  ఇలా సెలవుపెట్టినా సగం రోజు ఫోన్లలోనే సరిపోతుంది.. ఆ ఫోనువేడికి వాచిపోయిన చెవికి కాపడం పెట్టుకోటంలోనూ ఇంకో సగంరోజు సరిపోతుంది. మరి ఇలాంటి గవర్నమెంటు పనులు చెయ్యాలంటే చాలా తీరిక కావాలి.. కానీ ఈరోజుల్లో రిటైరైన వాళ్ళదగ్గరన్నుండి.. పెళ్ళాం ఉద్యోగం చేస్తే ఇంట్లో పిల్లల్ని ఆడిస్తూ.. చాక్లెట్ ఇవ్వలేదన్న కోపంతో ఆ పిల్లలు ఇల్లంతా కంపుచేస్తే.. అవన్నీ కడుక్కునే మగాళ్ళ దగ్గరవరకూ ఈ తీరికనేది నాదగ్గరలేదంటే నాదగ్గరా లేదు బాబూ..లేదూ అని చెప్పేవాళ్ళే.. మరి ఎవరిదగ్గరుందో ఈ 'తీరిక' చెప్పలేం. ఇన్ని గొడవలెందుకులే సెలవుపెడితే కాస్త పోలీసోడైనా సంతోషిస్తాడని మొత్తంమీద సెలవుపెట్టాల్సొచ్చిందన్నమాట.


ఏదో ఆలోచనలో పడి.. అలాగే ఆఫీసుకెళ్ళే బట్టల్తో పోలీస్టేషన్ కి వచ్చేసాను. టైము పదిగంటల పదినిముషాలయ్యింది. పాస్పోర్ట్ సెక్షన్ ఎక్కడో తెలియలేదు.. ఆ పక్కనే పూజకు పనికిరాని పువ్వుల్లా నీరసంగా బల్లలమీద వాలిపోయున్న  ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళను అడిగాను.. అందులో ఒకావిడ.. కాస్త ఓపికచేసుకుని కనురెప్పలను పైకెత్తి..  "క్యా.. క్యా.. అని కొట్టినట్టు నాలుగు సార్లు అడిగింది కానీ నేను పాస్పోర్ట్ అంటున్నానని అర్ధంకాలేదు. నేనునాలుకని రకరకాలుగా మడతలుపెట్టి అర్ధమయ్యేలా "పాస్పోర్ట్ వెరిఫికేషన్...", అంటుండగా..  యమదర్మరాజుకి దగ్గరగా కుర్చీవేసుకుని తలవంచుకుని రాసేసుకునే చిత్రగుప్తుడిలా ఆ రోజు వచ్చిన కలెక్షను తాలూకు పద్దులనుకుంట ఎంతో దీక్షతో రాసుకుంటున్న పోలీసొకడు.. "సీధా జావ్..", అని.. తలెత్తకుండానే చెప్పాడు. "ధ్యాంక్స్.", అని వెళ్ళిపోయాను.. అక్కడ అప్పటికే పదిమంది కుర్చీల్లో కుర్చున్నారు. లోపల పెద్దపులిలా  బట్టల్లేకుండా కుర్చుని ఉన్నాడు ఒక పోలీసు.. అంటే అదే..పోలీసు యూనీఫాం లేకుండా మామూలు డ్రస్సులోనే వున్నాడు. వాడెదురుగానే ఎవడో జింకలాగా ముడుచుకుని కూర్చున్నట్టున్నాడు.. సగం తలుపువేసివుండటంతో కాళ్ళుమాత్రమే కనిపిస్తున్నాయి.


టైము చూస్తే పది ఇరవై.. అసలే నన్ను పదింటికి రమ్మన్నాడు ఇప్పుడెలా.. వెళ్ళకపోతే ఒక తంటా.. వెళితే ఏమవ్వుద్దో. ఒక ఐదునిముషాలాగి ఆఁ.. ఏముందిలే ఏదొకటవ్వుద్ది ఇక తప్పదు అని తలుపునెట్టుకుని లోపలికెళ్ళిపోయాను.. పోలీసురైడింగులో పట్టుపడ్డ పెద్దాపురం పార్టీలాగా నివ్వెరపోయి నా వంక చూసాడు పులిరాజా.. ఆ తర్వాత ఏమైందంటే..


ఇంకా వుంది (వుందనుకుంటే.. వుంది.. అబ్బా ఇక చాలు అనుకుంటే.. గొడవేలేదు. :-) )

Related Posts Plugin for WordPress, Blogger...