1, మార్చి 2007, గురువారం

ఈనాటి రామాయణం




ఆఫీసులో కాస్త పని తగలడంవలన, ఇంటికి కాస్త లేటుగా వెళ్ళాల్సిరావొచ్చునని శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఫొన్ చేయసాగాడు.. చాలాసేపటివరకూ నెట్వర్క్ బిజీ అని వచ్చేసరికి.. శ్రీరామచంద్రులవారికి ఓపిక నశించింది.. "ఛ.. ఆ బిఎస్ ఎన్ ఎల్ తీస్కోవద్దూ.. సరిగా సిగ్నల్ ఉండదు అని చెప్పినా వినిపించుకోకుండా.. అదే కావాలని మారాంచేసి మరీ తీసుకుంది సీత.. ఇప్పుడు అవసరమైనప్పుడు ఈ నెట్వర్క్ బిజీ అవుతుంది", అని చిరాకు పడ్డారు. కాసేపటికి కనెక్ట్ అయ్యింది.. కానీ ఎంతసేపు రింగ్ అవుతున్నా సీతాదేవి ఫోన్ లిప్ట్ చేయకపోయేసరికి, శ్రీరాముడు మనసు కాస్త శంకించింది.. ఎదన్నా ప్రోబ్లమ్ ఏమోనని.. కాస్త భయమేసింది.

కొంతసేపటికి ఫోన్ లిప్ట్ చేసారు కానీ సీతాదేవి మృదువైన పలుకులు కాక.. కేకలు వినిపిస్తున్నాయి.. ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. చుట్టూ పెద్ద హెలీకాప్టర్ సౌండులాగా.. గోలగోలగా ఉంది.. ఆ భయంకర నవ్వు నవ్వుతున్న వ్యక్తి..
“మాట్లాడు ఇదిగో మీ శ్రీరామచంద్రుడితో.. నిన్ను నా లంకకు తీసుకెళ్తున్నానని చెప్పు.. కావాలంటే ఎడ్రసు చెప్తాను నోట్ చేసుకోమను.. గ్రేట్ లంకా ఎవెన్యూ, ఫేస్ సెవెన్.. అక్కడ దిగి టాక్సీ ఎక్కి.. రావణ్ మహల్.. అంటే ఎవడికైనా తెలుస్తుందని చెప్పు.. “, అని గర్జిస్తూ డైలాగులు వినపడ్డాయి.
ఏదో పెద్దశబ్దంతో ఫోన్ కట్టయ్యింది. శ్రీరాములవారికి కంగారు మొదలయ్యింది. ఎదో అనుకోని ప్రమాదంలో సీత చిక్కుకుంది అని లక్ష్మణునికి ఫోన్ చేసాడు.

“జయ జయ రామ్.. శ్రీరామ పరంధామా.. జయరామ పరంధామా.. రఘురామ రామ రణరంగ భీమ… జగదేక సార్వభౌమా……”, (లవకుశ సినిమాలోని పాట) అని వస్తున్న లక్ష్మణుడి ఫోన్ కాలర్ ట్యూన్ ని టెన్సన్ తో వింటున్నారు శ్రీరాములవారు.
లక్ష్మణుడు ఫోన్ తీసి "అన్నయ్యగారు.. నేను బయట ఉన్నాను ఇంటికి వెళుతున్నాను.. చెప్పండి" అని వినయంగా అడుగగా.. శ్రీరాములవారు అంతా వివరంగా చెప్పారు.

కంగారుపడ్డ లక్ష్మణులవారు.. "అవునా? అన్నగారు.. !! నన్ను బజారుకు వెళ్ళమన్నారు వదినగారు.. నేను అన్నయ్యగారు వచ్చాక వెళ్తాను అంటే కాస్త కోప్పడ్డారు. సరే కదా అని ఒంటరిగా విడిచి వెళ్ళాను”.

“బజారునుండి బయలుదేరేటప్పుడు ఎదో మర్చిపోయి అడుగుదాం అని వదినగారికి కాల్ చేస్తుంటే ఈ నెంబరు మనుగడలో లేదు మీరు కాల్ చేసిన నెంబరు సరిచూసుకోండి అని చెప్తుంది.. నాకర్దంకాలేదు.. సరేలే అని లేండ్ నెంబరుకు ట్రైచేసాను.. అది కూడా లిప్ట్ చెయ్యలేదు.. అసలే అది చక్రవాకం సీరియల్ వచ్చే సమయం.. వదినగారు ఇల్లువిడిచి ఎక్కడకూ వెళ్ళరు కూడా.. అందుకే కంగారుగా ఇంటికి చేరుకుంటున్నా”, అని.. చెప్పాడు లక్ష్మణుడు..

జరిగిందానికి శ్రీరాములవారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. లక్ష్మణుడు ఎలా జరిగుంటుంది అంతా విచిత్రంగా ఉందే.. అని విశ్లేషణ చేయసాగాడు.
“ఎలాగైనా ఆ లంకా ఎవెన్యూ ఎంతదూరమో కనుక్కొని వాడి పని చెబుదాం మీరేమీ టెన్సన్ పడొద్దు.. మా స్నేహితులందరికీ ఈ విషయం ఎసెమ్మెస్ చేసాను.. ఎవరో హనుమంతులవారని మంచి మేధావి మహాబలుడు ఉన్నారని రిప్లై వచ్చింది. వివరాలు అన్నీ కనుక్కున్నాను. అతను ఎటువంటి ఎడ్రసునైనా గూగుల్ లో వెతికి పట్టేస్తాడంట.. ఎలాంటి చోటకైనా వెళ్ళి చెప్పిన పనిని సునాయసంగా చేయగలడంట.. అందుకే ఆయనని తీసుకురమ్మని నా స్నేహితునికి చెప్పాను. ఇప్పటికి వాళ్ళు బయలుదేరి ఉంటారు.. మీరేమీ చింతించవద్దు. మనకంతా మంచే జరుగుతుంది అన్నయ్యా “, అని.. శ్రీరాములవారిని ఓదార్చాడు లక్ష్మణుడు.

హనుమంతులవారు హడావుడిగా శ్రీరాములవారిని చేరుకుని నమస్కరించారు. “నేను మీకు చాలా అభిమానిని సార్.. ఎప్పట్నండో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. కానీ ఇలా కలవాల్సొస్తుంది అని అనుకోలేదు.. మీరేమీ భాదపడొద్దు. ఇప్పటి టెక్నాలజీతో సాధ్యంకానిది ఏదీలేదు.. నేను మీకు తప్పనిసరిగా సాయపడతాను”, అని హామీ ఇచ్చి తన దగ్గర ఉన్న లాప్ టాప్ ని ఓపెన్ చేయసాగారు హనుమంతులవారు.

“ఇది ఇంటెల్ వారి సెంట్రినో డ్యూయో తో బలపర్చబడినది.. చాలా వేగవంతమైనది..”, అంటూనే గూగుల్ ఎర్త్ స్టార్ట్ చేసి.. సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. లంక మొత్తం డెక్కటాప్ పై లోడ్ అయ్యింది.. జూమ్ చేయసాగారు.. హనుమంతులవారు.

బిల్డింగ్స్ తో సహా అన్ని కనపడేసరికి శ్రీరాములవారిని ఆశ్చర్యచకితులను చేసింది. “ఇది ఓపెన్ సోర్సా అని అడిగారు కుతూహలంగా.. కాదు స్వామీ, ఫ్రీవేర్ అంతె అన్నారు.. “, హనుమంతులవారు..
“సరేసరే.. మనం ఉన్న చోటు చూపించండి.. తరువాత, సీత ఉన్న లంక సంగతి చూద్దాం అన్నమాటలు నోటిదగ్గరవరకూ వచ్చేసాయి. మళ్ళీ ఎందుకులే.. సీతకన్నా ఈ గూగుల్ ఎర్తే ఇంట్రస్టింగా ఉంది”, అని అందరూ అనుకునేరు అని కుతూహలాన్ని దాచేసుకుని.. ఆగిపోయారు శ్రీరామచంద్రులవారు.

“ఛ.. !! కష్టం అని నిట్టూర్చారు..”, హనుమంతులవారు.. శ్రీరామచంద్రులవారితో సహా లక్ష్మణులవారుకూడా కనుబొమలు చిట్లించి “ఏమైనది”, అని అడిగారు ఆశ్చర్యంతో.. “ఇది ఇంకా బీటా వెర్షన్ స్వామీ.. సరిగ్గా ఆ లంకలో మనకు కావలిసిన ఇమేజస్ దగ్గరకొచ్చేసరికి.. రావటంలేదు.. ఇంకా కనస్ట్రక్సన్ లో ఉంది.. ఇమేజస్ గేదర్ చేస్తున్నాం అని వస్తుంది.. ఇపుడు.. మనకు కాస్త కష్టమే స్వామి”, అని బాధపడ్డారు. హనుమంతులవారు.

“సరే నేను లంకకు బయలుదేరతాను.. ఎలాగూ కాస్త ఆచూకీ తెలిసింది కాబట్టి.. దానితో అక్కడికి చేరుకుని వెతికి అసలు చోటు పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు స్వామి.. మీరు చింతించవద్దు.”, అని శ్రీరామచంద్రులవారి దగ్గర సెలవు తీసుకుని హనుమంతులవారు లంకకు బయలుదేరారు.

ఇంకా ఇతర మార్గాలగురించి వెతుకుతూ.. లక్ష్మణుడు, శ్రీరాముడు.. అలోచిస్తూ.. ఉద్యానవనంలో తిరుగుతుంటే.. పరిచారిక వచ్చి.. “స్వామీ!! మన సీతమ్మగారిని టీవీలో చూపిస్తున్నారు..”, అని చెప్పేసరికి.. ఇద్దరూ టీవీ చూడటానికి పరుగుపరుగున లోపలికెళ్ళారు.

Tv 99 అనే చానల్ లో చెట్టుకింద కూర్చుని ఉన్న సీతాదేవిపై ఇంటర్వూ జరుగుతుంది.. “అసలు మీరెవరో.. ఇక్కడికి ఎందుకు వచ్చారో.. మాప్రేక్షకలోకానికి వివరంగా చెప్పండి”, అంటూ ఒక ఏంకర్ చేతిలో మైకును కత్తి తిప్పినట్లుగా తిప్పుతూ ప్రశ్నల యుద్ధంచేస్తున్నాడు.. సీతాదేవి ఏమీ మాట్లాడక మౌనం వహించి.. ఉంది.

సీతాదేవి ఎక్కడుందో ఎలా ఉందో తెలియక సతమతమైన సమయంలో.. టీవీలో చూసి కాస్త మనసుకుదుటపడినా.. ఆమె పరిస్తితి చూసి శ్రీరాములవారికి, లక్ష్మణునికి కళ్ళవెంబడి నీళ్ళుకారాయి.. అమెను చూస్తున్నా ఎమీ చేయలేని పరిస్ధితిలా తోచింది శ్రీరాములవారికి.

కాసేపటికి సీతాదేవి పెదవివిప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. జరిగినదంతా చెప్పింది.. తనని ఎలా ఆ రావణాసురుడు వలలో చిక్కుకుని.. అతను లంకకు తీసుకొచ్చాడో వివరించింది. ఎలాగైనా ఈ విషయాన్ని మా శ్రీరామచంద్రులవారికి చేర్చమని వేడుకుంది. ఏంకర్ కెమేరామేన్ ని కాస్త సీతాదేవి.. కళ్ళవెంబడి నీళ్ళను. క్లోజప్ అన్నట్లు సైగచేయగా.. కెమేరామేన్ జూమ్ చేసి చూపించసాగాడు.. మధ్యలో ఒక్కసారిగా ఏంకర్ కెమేరాకు అడ్డొచ్చి.. “ఇప్పుడు కాసేపట్లో మీకు ఈ కిడ్నాపింగ్ కి కారణాలు.. ఎలా జరిగిందో విశ్లేషిస్తూ.. ఒక డాక్కుమెంటరీ చూపిస్తాం అప్పటివరకూ ఓ చిన్న బ్రేక్.. “, అని ఎడ్వర్టైజ్ మెంట్స్ వేయసాగారు.

బ్రేక్ తరువాత డాక్యుమెంటరీ.. వేయడం మొదలుపెట్టారు , ఊహా చిత్రం.. లాగా కొన్ని కేరెక్టర్స్ తో.. కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. క్రింద అప్పుడే స్క్రోలింగ్ మొదలుపెట్టారు..
సీతాదేవి శ్రీరాముడిని చేరుకుంటుందా..?? ఎ) లేదు బి) అవును సి) చేరుకోవడం చాలా కష్టం డి) చెప్పలేం.. వెంటనే 1233 కి ఎసెమ్మెస్ చేయండి.. బహుమతులు గెలుచుకోండి.

అక్కడే తరువాత రాబోయే కార్యక్రమం గురించి కూడా రాసారు.. సీతాదేవితో మాట్లాడాలంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయండి అని.. కొన్ని నెంబర్లు ఇచ్చారు.

తరువాత కార్యక్రమానికి Tv 99 కి ఫోన్ చేద్దాం అని నిర్ణయించారు. లక్ష్మణుడు ఫోన్ ట్రైచేసాడు.. చాలా సేపటికి దొరికింది.. లైవ్ షో అయినప్పటికీ చాలామంది కాలర్స్ ఉండటం వలన.. ఎవరో అమ్మాయి మాట్లాడి లైనులో ఉండమన్నారు.. అపుడు శ్రీరామచంద్రులవారు.. సీతాదేవి తన భార్య అని.. అమె ఉన్న ప్రదేశం ఎక్కడో చెప్పమని వాళ్ళని అడిగారు. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ.. “అది ఇంకా రెండురోజులవరకూ చెప్పలేంసార్.. అదే మా బిజినెస్ వ్యూహం.. సార్.. ఏ టీవీ చానల్ కి తెలియని విధంగా మా రిపోర్టర్స్ కష్టపడి సంపాదించిన కొత్త వార్త ఇలా అందరికీ చెప్పకూడదు.. మీరు భర్తఅయినా మా లైవ్ షో చాలా రసపట్టులో ఉంది.. ఎసెమ్మెస్ లు రావడం మొదలుపెట్టాయి.. ఒక ఎనిమిదిగంటలు ఆగాక అపుడు చెప్తాం”, అని నవ్వుతూ సమాధానమిచ్చిందామె.

ఫోన్ కట్ అయిపోయింది. తరువాత ఎన్నిసార్లు ప్రయత్నించినా మరలా కాల్ కలవలేదు.. ఆగ్రహంచెందిన లక్ష్మణుడు.. Tv 99 ని మట్టుపెట్టాలని ఆవేశంగా కదిలాడు.. “అన్నగారు.. ఆ రావణుడికన్నా ఈ మీడియా రావణులను.. ముందు మీరు వధించాలి”, అని.. అస్త్రశస్త్రములు తీసుకొచ్చి శ్రీరామునికిచ్చి.. నమస్కరించెను.

శ్రీరాముడు.. యుద్దానికి సన్నద్దమయ్యెను..

శ్రీరాఘవం ధశరధాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవిందదలాయ దాక్షం
రామం నిశాచర వినాశకరం.. నమామి…

-------------------------------------------------------------------------
ఎక్కడ అన్యాయాలకూ, అక్రమాలకూ, అవినీతులకూ హద్దూ అదుపూ ఉండదో, ఆ అన్యాయాలపై కూడా ఆధారపడి ఎవరు వ్యాపారాలు చేస్తుంటారో.. అవి చోద్యంలా చూస్తూ.. పట్టించుకోని ప్రజలూ, ప్రభుత్వాలు.. ఉంటాయో... అక్కడ మరో శ్రీరాముడో.. మరో శ్రీకృష్ణుడో అవతరించాలని ఆశిద్దాం.
ఇలా ఆశించడమైనా మన కర్తవ్యంగా భావిద్దాం.

16 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Baaga raasarandi......Ramayanam ni Technology tho mudipettaru..ha ah ah baagundi baagundi.....a,b,c,d maathram highlight...ha ha ah ah.....last lo quatation chaala baagundi....

రాధిక చెప్పారు...

చాలా బాగ రాసారు.బాగా నవ్వుతెప్పించింది.చివరిలో ఇచ్చిన మెస్సేజి కూడా బాగుంది.

Unknown చెప్పారు...

బాగుందండీ మీ టెక్ రామాయణం...
మరి తరవాత భాగంలో గూగుల్ మాప్స్ ఉపయోగించి రాముడు లంక చేరుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

Mouni Mounamlo చెప్పారు...

చాల బాగా రాసారు.మన పురోగతి ఈ విధంగా కూడ ఉపయోగ పడ్తోందని వ్యంగధోరనిలో రాసారు.సమాజం దేనికి చర్య అవసరమొ దానిమీదా శ్రద్ధ లేదు,అక్కరలేని publicityమీద కుతూహలం.

రానారె చెప్పారు...

భలే సృజన. నిన్న మా నాన్నతో మాట్లాడినపుడు ఇలాంటి విషయమే చర్చకొచ్చింది. మీడియా గాడి తప్పింది. లక్ష్మణుడి రింగ్‌టోన్, ఆంజనేయుని తొలిపలుకులు బ్రహ్మాండం. శ్లోకంలో చిన్న అచ్చుతప్పులున్నాయి - చిత్తగించండి:

శ్రీరాఘవం ధశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవిందదళాయ దాక్షం
రామం నిశాచర వినాశకరం.. నమామి…

అభినందనలతో,
-రానారె.

తెలు'గోడు' unique speck చెప్పారు...

బాగా రాసారు.చెప్పాలనుకొన్నది వ్యంగ్యంగా అయినా అర్థమయ్యేలా చెప్పారు.

అజ్ఞాత చెప్పారు...

Superb!!

ఉదయ్ భాస్కర్ చెప్పారు...

మాట రాని మౌనమిది...అంత బాగ రాశారు..

Unknown చెప్పారు...

చాలా బాగారాశారు!! మీడియా వాళ్ళు తమ ప్రయోజనాల కోసం, పరిస్థితులను ఏవిధంగా ఉపయోగించు కుంటున్నారో బాగా తెలిపారు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగారాశారు!! మీడియా వాళ్ళు తమ ప్రయోజనాల కోసం, పరిస్థితులను ఏవిధంగా ఉపయోగించు కుంటున్నారో బాగా తెలిపారు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

భలే ఉందిరా నీ కవిత్యం. నీకు ఆ ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తున్నాయి రా బాబు... ఇంకా ఎలాగె నీ రచనలు కొనసాగించు. నా ఫూల్ సపోర్ట్ నీకే......

Unknown చెప్పారు...

Simply good..full of humuor.a,b,c,d matram picha comedy..u made me to laugh myself just by reading this..

అజ్ఞాత చెప్పారు...

I like play online game, I also buy knight gold and knight noah, the knight online gold is very cheap, and use the knight online noah can buy many things, I like cheap knight gold, thanks, it is very good.

I like play online game, I also buy last chaos gold and last chaos gold, the lastchaos gold is very cheap, and use the lastchaos money can buy many things, I like cheap lastchaos gold, thanks, it is very good.

కౌటిల్య చెప్పారు...

ముగింపు భలే ఉందే! మీడియా మీద అరుపులు సెటైరు.........

శ్రీనివాసరాజు చెప్పారు...

కౌటిల్యగారు
ఇది నచ్చినందుకు సంతోషంగా వుంది. కానీ ఇప్పటికీ.. శ్రీరాముడో శ్రీకృష్ణుడో అవతరించలేదే??

Related Posts Plugin for WordPress, Blogger...