19, జులై 2006, బుధవారం

ఆచార్యదేవోభవ….





ఏమైనా ఆ రోజులు ఆరోజులే మళ్ళీ తిరిగిరావు. చిన్నప్పటి చదువుకునే రోజులు. మాది చిన్నపల్లెటూరు, మా ఊరికి నాలుగు కిలోమీటర్లదూరంలో స్కూలు. ప్రతిరోజు రిక్షాలో వెళ్ళెవాళ్ళం. సన్నని రోడ్డు, చుట్టూ పంటపొలాలు, ఆ చక్కటి దృశ్యాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. పాటలుపాడుతూ కేరింతలు కొడుతూ అల్లరితో బయలుదేరేవాళ్ళం. కాగితాలను చిన్నముక్కలుగా చించి, చల్లని పైరగాలికి ఎగరవేయడం. గాలి పంకాలు చేసి తిరుగుతుంటే, ఎవరిది వేగంగా తిరుగుతుందో పోటీపడటం. ఇవి చిన్న ఆనందాలే కావచ్చు, ఆ వయసుకు అవే ఎంతో గొప్ప ఆనందాలు.


టైముకి చేరుకోకపోతే గోడకూర్చీయో, స్కూలు బయట నిలబడడమో తప్పేది కాదు. లేటుమాది కాకపోయినా శిక్ష తప్పదు, కాని అదే సరదాగా ఉండేది. క్లాసు ఎగ్గొట్టడానికి ఒక్కొక్కసారి..


రోజూ ఉదయాన్నేరెండు గంటలపాటు, స్కూలుముందున్న ఖాళీ స్ఠలంలో ప్రార్ధనతో మెదలయ్యేది దినచర్య. అదీ ఎండలో, చెమటలు కక్కుతూ, వేడిమి తట్టుకోలేక కళ్ళుతేలేసే వారు కొందరైతే, ఆస్కార్ అవార్డ్ కోసంకాకపోయినా, ప్రార్ధన బారినుండి తప్పించుకోవడానికి కొందరు, పడ్డవాళ్ళని తీసుకెళ్ళే వంకతో కొందరు క్లాసురూమ్లలోకి వెళ్లిపోయేవారు.


ఇక గురువారం వస్తే, అందరూ తెల్లబట్టలు వేసుకుని రావాలి. షూ, సాక్స్ తో సహా అన్నీ తెలుపే. వారానికి ఒకసారే కాబట్టి స్కూలుమెత్తం మిలమిలమెరిసేది. సాయంత్రం కాగానే ఎర్రగా మారేవి మా బట్టలతో పాటు మెహాలు కూడా.., ఆటలతో బట్టలు మాసిపోయాయని అమ్మ తిట్టిన తిట్లకు.



ఐదో తరగతి వరకూ కొన్ని సబ్జక్ట్స్ లో అప్పుడప్పుడూ ఫస్ట్ వచ్చేవాడిని. చిన్న చిన్న ప్రైజులు కూడా వచ్చేవి, క్లాసుకి రెగ్యులర్ అని, ఇంగ్లీషులో ఫస్ట్ అని ఇలా.. మరి ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా చదువులో చురుకుతనం సన్నగిల్లింది. రాని సబ్జక్ట్ పై భయం మొదలయ్యింది. లెక్కల సబ్జక్ట్ అంటే చచ్చేంత భయం పట్టుకుంది. ఆ మాష్టారు పెద్ద పెద్ద కళ్ళతో దెయ్యంలా కనపడేవారు. ఇంటి దగ్గర ఎంత చదివినా, బాగా చేసినా ఆయన్ను చూడగానే అన్నీ హుష్ కాకి. మరి ఏంటో ఆయన్లో ఏముందో.


నన్నే ప్రత్యేకంగా బోర్డుపై లెక్కచేయమనేవారు. మనిషి కాస్త తెల్లగా, సరిపడ ఎత్తు, కోరపళ్ళు, గుబురుమీసాలు, కాస్త గూనిగా వంగి ఉన్నట్లు ఉండేవారు. ప్రత్యేకంగా చెక్కించిన వెదురు బెత్తంతో దిగేవారు క్లాసులోకి.

ఆయన క్లాసు వున్నన్ని రోజులూ నాకు యమగండంలా ఉండేది., దెబ్బలు తప్పేవి కావు. ఆ ఉదయం నిద్రలోంచి ఆయనచేత దెబ్బలు తింటున్నట్లు ఉలిక్కిపడి లేచేవాడిని.
బోర్డుపైన ఏ లెక్క ఇచ్చేవారో తెలిసేది కాదు. ఆయన చేతిలో చాక్ పీస్ తీసుకోగానే నా బుర్ర పనిచేయడం మానేసేది.

ఒక్కోసారి అయిదు అయిదులులాంటి చిన్నలెక్క కి కూడా ఆలోచించాల్సి వచ్చేది . రెండు అయిదులు పది, మూడు అయిదులు…ఆగిపోయేది..ఆయన కొట్టేదెబ్బకోసం. హమ్మయ్య ఒకటైపోయింది, ఇప్పుడు ఇంకొకటి పడబోతుంది, మళ్ళీ ఇంకొకటి.. ఇలా తరువాత కొట్టబోయే దెబ్బ ఎక్కడ పడబోతుందో లాంటి పరిజ్ఞానం పెరిగి , దెబ్బలు అలవాటైపోయాయి.

తరువాత తోటి స్నేహితుల ఓదార్పులు, భయాలు, వాళ్ళ వరుసక్రమం కోసం చూసే బెదురుచూపులు మామూలే రోజూ.


అలా ఎప్పుడూ ఒకరేకాకపోయినా మారిన ప్రతి మాష్టార్లతో నాకు తిప్పలు, దెబ్బలు తప్పేవికావు. ఒకాయన మా నాన్నగారికి బాగా తెలుసట, మావాడిని కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పినందుకుగానూ అందరికన్నా రెండు దెబ్బలు ఎక్కువ పడేవి నా ప్రాణానికి. కానీ ఆయన మాములుగా కొట్టేవారుకాదు, కాలర్ పట్టుకుని పైకెత్తి చెంపమీద మాత్రమే కొట్టేవారు.
మా స్కూలు మేడపైన ఉన్న క్లాసురూములు కొన్ని తాటాకు పాకలు ఉండేవి. సరిగా చదవనివాళ్ళు గబ్బిళాల్లా పాక దూలాలకు వేళాడేవారు. కాలర్ పట్టుకుని ఎక్కించేసి వదిలేసేవారు ఆయన. పాపం ఏడుస్తూ ఒక అరగంట వేళాడేవాళ్ళు. నేను వేళాడినట్లు గుర్తులేదుకానీ, ఒకమ్మాయైతే రోజులో సగం వేళాడుతూ ఉండేది.

పోనీ ఇది చిన్నప్పుడు అనుకుందాం, తొమ్మిదో తరగతిలో వేరే మాష్టారుతో కూడా తప్పలేదు నాకు. స్కూలుకు ఒకచోట వెడల్పాటి చెక్కలతో గ్రిల్స్ ఉండేవి. అందులోంచి మంచి చెక్కనొకదానిని తెచ్చేవారు కొట్టడానికి. చేతికి తగిలి .. అంతలావు చెక్కకూడా విరిగిపోయేది.
ఆ చేయికి ఒక నాలుగురోజుల వరకూ స్పర్శ తేలిసేది కాదు, అయినా మా చదువులో మార్పురాలేదు.


మిగతా సబ్జక్ట్స్ లో అంత దిట్ట కాకపోయినా దెబ్బలు తినేవాడిని కాదు. తెలుగు పద్యం చదివి కంఠస్తపట్టడంలో మనకు మంచి పేరుండేది. ఒత్తులు ఉచ్చారణ, వ్రాయటంలో తెలుగుటీచరు నుండి మంచి మెప్పు, ప్రోత్సాహం ఉండేది.
కాని నా చేతివ్రాత ఒకటి బాగుండేది కాదు. చిన్నప్పటి నుండి పెయిటింగ్సు, డ్రాయింగ్సు వేయడం ఇష్టం, మంచి పేరుండేది కూడానూ. అవి చూసి మా తెలుగుటీచరు నన్ను ఆటపట్టించేవారు. డ్రాయింగ్ చేసేవాళ్ళ చేతివ్రాత కూడా బాగుంటుంది, కాని నీ చేతివ్రాత ఛంఢాలం అని అనేవారు.
తెలుగు కాపీ రైటింగు లు ఎన్ని వ్రాసినా లాభంలేకపోయింది.


ఇక హిందీ, నాకు బాగానే వచ్చు. టీచర్ కి భయపడైనా చదవటం, వ్రాయటం బాగానే నేర్చుకున్నా. సొంతంగా ఊహంచి వ్రాయలేకపోయినా, బట్టీకొట్టయినా మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. హిందీ కాపీరైటింగు వ్రాయటం ప్రతిరోజూ చాలా పెద్దపని.


నాకు బాగా గుర్తు. ఒకరోజు కాపీరైటింగు వ్రాయలేదు . కానీ టీచర్ రాకముందే బల్లమీద పుస్తకాలు పెట్టుంచాలి. వ్రాయని వాళ్ళు బయటకు వెళ్ళి నిలబడాలి ,అది రూలు. ఎవరూ తప్పేవాళ్ళుకాదు. మా హిందీ టీచరు అంటే అంత భయం అందరికీ. ఆవిడరాగానే బయట నిలబడి ఉన్నవాళ్ళని కోపంగాచూసి, రెండు మూడు తిట్లు తిట్టాకే పాఠం మెదలుపెట్టేవారు. కాని నేను ఎందుకో వ్రాయలేదు. బయటకు వెళ్ళలేదు కూడానూ. మరి అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు.

ఆ రోజు నా టైము బాగాలేక, ఒకమ్మాయిని పిలిచి బల్లపై ఉన్నపుస్తకాల లెక్కసరిగా ఉన్నాయోలేదో చూడమని చెప్పారు. మధ్యలో ఒక వార్నింగు కూడా ఇచ్చారు. వ్రాయని వాళ్ళు ఇంకా వుంటే బయటకు వెళ్ళిపొండి, నేనేమీ అననని. ఇద్దరు లేచివెళ్ళిపోయారు. నేనే అనుకున్నా ఇంకా తోడుదొంగలున్నారన్నమాట అనిపించింది.
నేను లేవలేదు. వాళ్ళను ఏమీఅననన్నారుకానీ అవమానాలు తప్పలేదు పాపంవాళ్ళకి. రెండు, మూడు సార్లు అయ్యింది వార్నింగు ఇవ్వడం. కాళ్ళదగ్గరనుండి మెదలయ్యింది ఒణుకు నాకు, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మెదటి వార్నింగుకే లేవవలసింది అనిపించింది. టెన్సన్ తో మెహం ఎర్రగా కందిపోయింది.
టీచర్ నా వంక చూస్తే చాలు పుస్తకాల లెక్కకూడా అవసరంలేకుండా నేను వ్రాయలేదని చెప్పోచ్చు, అంతలా ఒణుకుతున్నా. పుస్తకాలూ, కుర్చున్నవాళ్ళనూ లెక్కపెట్టడం అయిపోయింది.. సరిపోయాయ్ టీచర్ అని చెప్పింది ఆ అమ్మాయి.


లెక్కపొరపాటు కానేకాదు, ఆ అమ్మాయి చాలా ఇంటలిజెంట్, నేననుకోవటం ఎంటంటే లెక్క తక్కువొచ్చినా సరిపోయిందని చెప్పుండొచ్చు. ఏదేతేనేమి ఆ అమ్మాయి సాయం మరిచిపోలేనిది, బ్రతికి తప్పించుకున్నా. నేను తరువాత ఎప్పుడూ కూడా అంత టెన్సన్ అనుభవించలేదు, ఆఖరికి ఇంటర్వూలో, జాబ్ లేకపోయినపుడు, సెలక్సన్ రిజల్ట్స్ వచ్చినప్పుడూ కూడా. ఆ వయసులో అదే పెద్ద టెన్సన్ పడే సమస్య మరి.


మా ఇంగ్లీష్ మాష్టారు కేరళనుండి వచ్చారు. తెలుగు అసలు వచ్చేది కాదు ఆయనకి. చాలా పొడవుగా ఉండేవారు. మాములుగా నిలబడి చేయిచాచి ఉంచితే ఆయన పొడవైన వేళ్ళమధ్య సరిపడమెడ అంత హైటులో ఉండేవాళ్ళంమేము.
ఏదైనా సరిగ్గా చెప్పకపోతే మెడచుట్టూ చెతితో పట్టుకుని, ముందుకూ, వెనకకూ ఊపుతూ ఇంగ్లీషులో ఉన్న తిట్లన్నీ వరుసపెట్టి తిట్టేవారు. తిట్టడం అవగానె చెయ్యి వదిలేసేవారు, అంతే మోకాళ్ళు కొట్టుకుపోయేలా అంత దూరానా క్రింద పడేవాళ్ళం.
ఇక సేడిస్టు పనులు చేసే సోషల్ టీచర్ ఒకరుండేవారు. ఆయనదీ కెరళనే. సూదుళ్ళా ఉండే డ్రాయింగు పరికరాలతో గుచ్చడానికి తీసి బెదిరించడం, మనిషిని ఒంగోమని ..వాడిపై కూర్చుని ..ఏడి వీడు .. ఎక్కడికి పోయాడు అని వెదుకుతూ కామెడీ చేయటం, బరువైన బ్యాగ్ ను మెడలో వేసుకోమని.. హార్మోనియంలా వాయిస్తూ క్లాసులో తిరగమని బెదరించడం. టేబుల్ క్రిందనుండి ప్రాక్కుంటూ రమ్మని చెప్పి...కర్రకు అందగానే.. వీపుపై ఒక్కటివ్వడం.. , నేను ఎప్పుడూ ఆయనకు దొరకలేదు .
అమ్మో.. ఆయన పిచ్చి చేష్టలతో హడలిపోయేది క్లాసంతా.. ఒక్కడు నవ్వేవాడు కాదు. కాని ఇప్పుటికీ మా ఫ్రెండ్స్ ని కలిసి నప్పుడు ఆ సన్నివేశాలు గుర్తొచ్చి పగలబడి నవ్వుకుంటాం.


ఇక సంస్కృతం మాష్టారు గురించి చెప్పాలి. ఆయన చెప్పిన పాఠాలు, ఇచ్చిన ప్రోత్సాహం.. చాలా ఉపయోగపడేవి. చదువును ఏవిధంగా చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. పిల్లలకు బోర్ కొడుతుందనగానే టాపిక్ మార్చి ఎక్కడికో తీసుకెళ్ళేవారు.

ప్రత్యేకంగా శోభన్ బాబులా మిమిక్రీ చేస్తూ ఆయన చెప్పే జోకులకి భలే నవ్వుకునేవాళ్ళం. ఆయనంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం, ఎందరికోలాగా నాక్కూడా ఫేవరట్ టీచర్ ఆయన. అందులోనూ సంస్కృత పాఠాలన్నీ పురాణకధలేమో, అవి జనరల్ గా మన సినిమా కధలలాగా చెప్పి బుర్రలోకి ఎక్కించేవారు. ఒక్కసారి క్లాసు వింటే.. ఇక సొంతవాక్యాలతో పరీక్షలో వ్రాయటమే, బట్టీకొట్టేపనే ఉండేది కాదు.



నిజంగా ఈ ఉపాద్యాయులు, వాళ్ళ కాఠిన్యంతోనైనా, మంచితనంతోనైనా, వాళ్ళు చెప్పన మంచిమాటలు, ఇచ్చిన ప్రోత్సాహం ఇవన్నీ ఇప్పుడు ప్రతి నిముషం మనకు ఉపయోగపడుతున్నాయి. తెలుగు టీచరు అలా ఆ రోజు మా చేత చదివించి ఉండకపోయుంటే, నా మనసులో ఉన్నది నేను ఇలా పేపరుపై పెట్టి మీతో పంచుకోగలిగేవాడినా?. హిందీ టీచరు కఠినంగా ఉండకపోయుంటే, నాకు హిందీ చదవడం, వ్రాయడం రాక ఎంత ఇబ్బంది పడేవాడినో . ఎవరి భోధనా పద్దతులు వాళ్ళవైనా, వాళ్ళ చదువు అనే దీపాలతో మన జీవిత దీపాల్ని వెలిగించిన వాళ్ళకి ఏమిస్తే ఋణం తీరుతుంది చెప్పండి. తల్లిదండ్రుల తరువాత అంతటి వాళ్ళకు ఏమిచ్చినా తక్కువే.


కానీ ఒక్కటి నిజం, వాళ్ళని సంతోష పెట్టేది గురుదక్షిణ కాకపోయినా, మనం ఒక మంచి విజయాన్ని సాధించినపుడు మనం వాళ్ళను కలిసి ఆ ఆనందాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళకళ్ళలో కి చేరిన ఆనందం కంటే మించిన గురుదక్షిణ ఏదీ మనం ఇవ్వలేం...


ఆచార్యదేవోభవ....

7 కామెంట్‌లు:

శ్రీనివాసరాజు చెప్పారు...

thanks you "Anonymous", i dont know who gave this.. but thanks for ur comment.. i wish you will definitely enjoy my future posts also.. but my suggestion is plz give ur name and details while sending ur comments. becoz i want to refer ur name atleast while sending my thanks.. :-). keep watching my blog.

రానారె చెప్పారు...

శ్రీనివాసరాజుగారూ, చాలా బాగుందండీ మీ బ్లాగు.
నేను కూడా పల్లెలో పుట్టి పెరిగినవాణ్ణే కాబట్టి మీ "ఆచార్య దేవోభవ" నా చిన్ననాటి గతం గుర్తు చేసింది.
"తెలుగు పరువు తీయకండి" అని మీ సెటైర్ కొరడా భలే విసిరారు.
నేనూ ఈ రోజే ఒక తెలుగు బ్లాగు మొదలు పెట్టాను.
ఖాళీగా ఉంచటం ఎందుకని నా ప్రస్తుత మనస్థితినే ఒక చిన్న కవిత లాంటి ప్రయత్నంలో ఇరికించాను.
అలా... చూడండి ఒకసారి.

oremuna చెప్పారు...

బాగుంది.

అభినందనలు ఈనాదులో వచ్చినందుకు.

మొత్తంగా చదవడం ఇంకా బాగుంది.

ఆ అనామకుడు ఓ స్పాము వీరుడు అని అనుకుంటున్నాను.

spandana చెప్పారు...

మీ వ్యాసం ఈనాడులో వచ్చినందుకు అభినందనలు.
అప్పటి దెబ్బలు ఇప్పుడు తీపిగానే వుంటాయిగానీ, అప్పుడు దెబ్బలు తినలేక బడి ఎగ్గొట్టిన వారి జీవితాలు ఇప్పుడు దుర్భరంగా వుంటాయి. ఇలా విపరీతమైన శిక్షలు వేసే మాష్టార్ల ఉద్దేశ్యం మంచిదైనా వారి పద్దతుల్ని మాత్రం వెనకేసుకు రాకండి!

-- ప్రసాద్
http://charasala.wordpress.com

spandana చెప్పారు...

ఆ అనానిమస్ స్పాము వీరుని చొమెంట్లు దయచేసి తొలగించండి లేకుండే ఆ లంకెల మీద క్లిఖ్ చేసే నిజమైన చదువరులు బంగ పడతారు.

-- ప్రసాద్
http://charasala.wordpress.com

రాధిక చెప్పారు...

baagunnayandi mee chinnanaati samgatulu.naaku kuda chaalaa varaku ilanti anubhavale..

Unknown చెప్పారు...

చాలా బాగా రాశారండి.మన సొంత భాషలొ మన ముచ్చట్లు ఇలా విశదీకరించటం చాలా బాగుంది.ఇలా రాయాలని చాలా మంది అనుకొంటారు కాని మీరు రాసి మమ్మల్ని సంతొషపెట్టారు.

Related Posts Plugin for WordPress, Blogger...