28, జనవరి 2011, శుక్రవారం

సెల్ ఫోన్ సుబ్బలక్ష్మి...


పిల్లల్ని కాలేజికి, భర్తగారిని ఆఫీసుకు పంపించేసి హాల్లోకొచ్చి కూర్చుని టీ.వీ ఆన్జేస్తుండగా.. సుబ్బలక్ష్మి ఫోన్ మోగింది. “హమ్మయ్యా ఎవరోకరు మాట్లాడటానికి దొరికారు”, అని మనసులోనే ఆనందపడిపోతూ ఫోనెత్తింది సుబ్బలక్ష్మి.
"వదినా.. బావున్నావా.. చాలారోజులయ్యింది నీతో మాట్లాడి", అంది అవతలివైపునుండి ఆడగొంతు.

“హా.. బావున్నానే సుజాతా.. నువ్వెలావున్నావు. చాలారోజులేంటి..అసలు మమ్మల్ని మర్చేపోయావు. ఏంటి, అంతా బాగానేవున్నారు కదా!. తమ్ముడు ఎలావున్నాడు. ఆరోగ్యం అదీ బాగానే వుంటుందా.”, లాంటి కుశలప్రశ్నలు అవీఅయిపోగానే..

"అవును అలా జరిగిందేంటే... ఈశ్వర్ కి, దేవికి పెళ్ళి ఫిక్షయ్యింది కదా!!, మున్నా దేవికోసం ముంబయినుండి తిరిగొచ్చేసాడు కదా!. దేవిప్పుడు ఈశ్వర్ ని పెళ్ళి చేసుకోనంటుంది.. మున్నానే పెళ్ళిచేసుకుంటానని పట్టుబడుతుంది అదేం చోద్యమో... ఇప్పుడేమో ఆ అమ్మాయిని మధురై పంపించేసారు.., మున్నాకి  ఈ విషయం తెలియదు పాపం.. వెతుకుతున్నాడు. చూస్తున్నావా అసలు" అంది సుబ్బలక్ష్మి ఆయాసపడిపోతూ,

"హా..వదినా ఎందుకు చూడను.. మా ఇంటిల్లిపాది తప్పకుండా చూస్తాం మొగలిరేకులు సీరియల్", అని అంది సుజాత అవతలివేపునుండి.

“సుందరాకాండలో ట్విస్టు చూసావా.. ఎంతబాగుందో..  స్నెహ తిరిగొచ్చిందనుకుంటే.. నేను స్నేహను కాదు.. నేత్రా దేవి అని చెబుతుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి చాలా ఇంట్రస్టింగా వుంది నాకు..”, అని వేరే టాపిక్ మొదలుపెట్టి ఒక గంట మాట్లాడుకున్నాకా ఫోన్ కట్ అయిపోయింది. "అయ్యో కట్ అయ్యిందే..", అని మరళా డయల్ చేసి ఈ సారి వంటలు, చీరలు, నగలు లాంటి మాటలుమొదలెట్టింది సుబ్బలక్ష్మి.

“ఏం కూర చేసావూ.. కరివేపాకు పులుసా.. నేనూ మొన్న మాటీవీలో చూసాను అది. నా ఫోనులో వీడియో తీసిపెట్టుకున్నాను కూడా.. రేపొండుదామని అనుకుంటున్నాను. నువ్వు అల్రెడీ చేసేసావా.. ఎలావచ్చింది”, అని ఊపిరికూడా తీసుకోకుండా ప్రశ్నలుమీద ప్రశ్నలేసేసింది సుబ్బలక్ష్మి. అవతలివేపున్న సుజాత, ప్రతీ ప్రశ్న రాసుకున్నట్టుగా మర్చిపోకుండా ఒక్కొక్కదానికీ సమాధానాలు చెప్పేసింది. మళ్ళీ ఓ గంట గడిచింది ఈ టాపిక్క్ అయ్యేసరికి.

కాలింగ్ బెల్ మ్రోగింది.. ఎవరా అని డోర్ సీత్రూనుండి చూస్తే భుజంపై గ్యాస్ బండ పెట్టుకుని కనిపించాడు గ్యాస్ వాడు.. డోర్ తీసి..  అక్కడపెట్టు అన్నట్టుగా సైగచేసి.. కిచెన్ చూపిస్తూ ఫోన్లోనే మాట్లాడుతూనేవుంది సుబ్బలక్ష్మి.

“ఎవరూ గ్యాస్ వాడా.. అవును గ్యాస్ ధరలు ఎంత మండిపోతున్నాయో.. మాకు నెలకోబండ అయిపోతుందొదినా.. “ అంది సుజాతా.
“మీకు నెలన్నా వస్తుంది మాకు పదిహేనురోజులకే అయిపోతుంది..” అంది సుబ్బలక్ష్మి. "హమ్మో.. అవునా..", అని ఆశ్చర్యపోయింది సుజాత.

కిచెన్లోకెళ్ళి గ్యాస్ బండ పైకిఎత్తిచూసి “మేడమ్.. ఈ బండకూడా నిండుగా వుంది.. మీకు కాదా మేడమ్ గ్యాస్?”, అన్నాడు గ్యాస్ పట్టుకొచ్చినబ్బాయి.
“అయ్యో నా మతి మండిపోనూ.. మాకు నిన్నే గ్యాసొచ్చింది బాబూ.., డోర్ నెంబరెంతా!, ఇరవైరొండా.. అయితే.. పక్కింటివాళ్ళకి”, అని నాలిక్కరుచుకుని గ్యాస్ అబ్బాయిని పంపించేసి డోర్ వేసేసి.. మరళా అదే విషయం ఫోన్లో చెప్పుకుని నవ్వుకున్నారిద్దరూ.

“వదినా వదినా.. మాకు ఇక్కడ కరెంటుపోయింది.. మీ ఇంట్లో టీ.వీలో అనుకుంటా... మావూరి వంట కార్యక్రమం పాటినిపిస్తుంది.. కాస్త ఫోను టీ.వీకి దగ్గరగా పెట్టవా.. ఆ పాటంటే నాకెంతో ఇష్టం..”, అంది సుజాత.

“అవునవును నాక్కూడా చాలా ఇష్టం.. నేనైతే అది రీకార్టుచేసుకుని మరీ.. నా సెల్ ఫోన్ రింగ్ టోన్లా కూడా పెట్టుకున్నాను తెలుసా”, అని గర్వంగా చెప్పింది సుబ్బలక్ష్మి.

టీ.వీ సౌండు పెంచి సెల్ఫోన్ దగ్గరపెట్టి పాటవినింపించింది. ఆ పాటతో పాటు తనూ పాటందుకుని ఫోన్లో పాడసాగింది సుబ్బలక్ష్మి.

పాటయ్యాకా, మరళా కబుర్లు మొదలుపెట్టారు. “చిట్టెమ్మ పాట, తూరుపు వెళ్లే రైలు పాట, రక్తసంభంధం.. ఇంకా చాలా పాటలు రికార్డు చేసాను.. అవన్నీ ఒక్కొక్కరికి రింగ్ టోన్ గా పెట్టాను.., మావూరి వంటపాట తప్ప నీకేదిస్టమో చెప్పు మరి.. నీ నెంబరుకు ఆ రింగ్ టోన్ పెట్టుకుంటా.., ఆపాట ఆల్రెడీ మా అమ్మాయి నెంబరుకు పెట్టుకున్నా”. అంది సుబ్బలక్ష్మి.

మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది.. కాలక్షేపం కబుర్లుచెప్పుకోటానికొచ్చింది ఎదురింటావిడ. ఇదిగో సుజాతా.. “ఎదురింటక్కయ్యగారు వచ్చారు.. స్పీకర్ అన్ చేస్తున్నాను.. అవిడని పరిచయం చేస్తాను ఈ మధ్యే ఇక్కడ అద్దెకు దిగారు.., నాకు ఈ మధ్య రోజంతా కాలక్షేపం అవుతుంది అంటే అవిడ చలవే.. ప్రతిరోజు ఈ టైములో మేమిద్దరం టీ.వీ చూస్తూ మంచిచెడూ మాట్లాడుకుంటాం.”, అని ఫోన్ స్పీకర్ అన్ చేసి ముగ్గురూ కబుర్లలో పడ్డారు.

కాసేపయ్యాకా ఫోను ఎదురింటావికి వదిలేసి.. ఇంట్లో పనులు చూసుకోవటం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. ఎదురింటావిడా.. సుజాతా మళ్ళీ సీరియల్స్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
పనిచేసుకుంటూనే.. మధ్య మధ్యలో పరుగెత్తుకువచ్చి వాళ్ళతో మాటలు కలుపుతూవుంది సుబ్బలక్ష్మి.

అలా మాట్లాడుకుంటుండగా.. ఏదో గుర్తొచ్చినట్టుగా “పిల్లలు స్కూలుకెలిపోయారా.. మరదలా. మీ బుజ్చిగాడు ఎలా చదువుతున్నాడే.. చాలా కాలమైంది వాళ్ళను చూసి.. ఓసారి అంతా హైద్రాబాదు రాకూడదేంటే..”, అని అడిగింది సుబ్బలక్ష్మి సుజాతని.

“హైద్రాబాదా.. ఎందుకు అక్కడెవరున్నారొదినా?, పిల్లలా.. ఎవరి పిల్లలు? సీరియల్లో ఎవరిపిల్లలు గురించన్నా అడుగుతున్నావా వదినా”, అని ఎదురప్రశ్నేసింది సుజాత.
“అందేంటే.. నీ పిల్లలు గురించే అడుగుతున్నా.., మేమున్నది హైద్రాబాద్ కదా, తెలియనట్టు అడుగుతావే.”, అంది సుబ్బలక్ష్మి.
“ఛా ఊరుకో వదినా.. నాకు పిల్లలెక్కడున్నారు.. వెటకారం చెయ్యటంలేదు కదా నన్నూ, హైద్రాబాదెప్పుడెల్లారు మీరు”, అంది సుజాత.

“అదేంటే నీకిద్దరు పిల్లలు కదా!, అమ్మాయి అబ్బాయీనూ.., వయసు దాచుకోటం కోసం అక్కయ్య దగ్గర అబద్దమాడుతున్నావా ఏంటి.. ”, అని నవ్వుతూ అడిగింది సుబ్బలక్ష్మి.

“అదేంటొదినా.. నువ్వలా అంటున్నావు. ఇంతకూ మీరు మా విజయవాడలో వుంటున్న సుబ్బలక్ష్మొదినేనా.. నేను గుంటూరు సుజాతని”, అంది సుజాత.

“హా.. మాది హైద్రాబాదమ్మా విజయవాడ కాదు.., నా మాటైనా గుర్తుపట్టలేదామ్మా, మాకూ సుజాత అని మరదలుంది.. అందుకే అదే ఫోనుచేసిందేమో అనుకున్నా నీ మాట అచ్చు మా సుజాతలానే వుంది ఇప్పుడు కూడా”, అంది సుబ్బలక్ష్మి.

“అవునా.. నాకు అదే డౌటొచ్చి మిమ్మల్నడిగితే.. జలుబు చేసింది నాకు అన్నారు కదా.., నిజమే అలాగే అయ్యింటుంది అనుకున్నానండి.. సారీ అండీ రాంగ్ నెంబరు”, అంది సుజాత.
“ఇంతసేపు మాట్లాడుకున్నా అనుమానమే రాలేదమ్మా..  అవునమ్మా రాంగ్ నెంబరు.. ఏమీ అనుకోవద్దు.. ఏమీ అనుకోకమ్మా..”, అని నవ్వుతూ నాలుగు సార్లు చెప్పింది సుబ్బలక్ష్మి.

ఫోన్ కట్ చేసిన తరువాత, ఇదేంటో ఇలా కన్ఫూజైపోయామిద్దరమూ, ఇంతసేపు మాట్లాడుకున్నా తెలియనేలేదే.., అని ఎదురింటావిడా సుబ్బలక్ష్మి పగలబడి నవ్వుకున్నారు.

చార్జింగ్ పెడదామని తీసిన ఫోన్లో.. భర్త ఫోన్ నుండి  ముఫ్ఫైరొండు మిస్డ్ కాల్స్, వేరే నెంబరు నుండి పది మిస్ట్ కాల్స్ ని చూసి ఆశ్ఛర్యపోయింది సుబ్బలక్ష్మి.. అయ్యో.. ఈయనెప్పుడు చేసారు.. అసలు కాల్ వెయిటింగ్ బీప్ సౌండే వినపడలేదు.. ఇప్పుడు వెంటనే ఫోన్ చెయ్యకపోతే చంపేస్తారు.. అని భర్తకు ఫోన్ చేస్తుంది సుబ్బలక్ష్మి.. వాళ్ళాయన తిట్లెక్కడవినాలో అని.. నేను మళ్ళీవస్తానక్కయ్యగారు అంటూ ఎదురింటావిడి ఇదే అదనుగా పారిపోయింది.

భర్తకు ఫోన్చేసిన సుబ్బలక్ష్మి.. నెమ్మదిగా.. “ఏవండీ ఫోన్ చేసారా.. నేను సుజాతతో మాట్లాడుతున్నాను.. మీ కాల్స్ చూడలేదు”, అని కవర్ చేసింది.

“ఫోన్ చెయ్యటమా ఎమన్నానా.. ఒక గంటసేపు అలా ఫోనుపట్టుకుని ట్రై చేస్తూ నీ ఎంగేజ్ సౌండు విని చెవులు నొప్పుపుడుతున్నాయి.. అసలు నువ్వీలోకంలో వుంటేకదా.. , నాకొక ఎకౌంట్ నెంబరు కావల్సొచ్చింది అందుకే అంతలా ట్రై చేసాను.., ఇప్పుడవసరంలేదులే.. దొరికింది. నువ్వు మాట్లాడింది సుజాతతోనా.. మరి ఆ సుజాతేమో నా నెంబరుకుచేసి.. తనఫోన్ నెంబరు మారింది, అది చెబుదామంటే వదిన ఫోన్ బిజీ అని వస్తుంది.. అని చెప్పిందేంటీ.., నాకు తెలుసు నువ్వు ఎవరితోనో సోదేస్తూ వుండుంటావ్.. సుజాతతో అని అబద్దంచెబుతున్నావ్.. నీ కసలు సెల్ఫోన్లో ఎవరన్నా దొరికితే లోకమే తెలియదు కదా!!......”, అని సీరియస్ గా వున్న భర్త తిట్ల పురాణం మొదలుపెట్టేసరికి భయపడి ఫోన్ పెట్టేసి సోఫాలో కూలబడింది సుబ్బలక్ష్మి.

కాసేపటికి తేరుకున్నాకా.. "ఏమీ అనుకోకే.. అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండు.. - ఇట్లు మీ సుబ్బలక్ష్మి వదిన", అని ఒక ఎసెమ్మెస్.. రాంగ్ నెంబరు సుజాతకి పంపించింది సుబ్బలక్ష్మి
.                       ****

-----------------
రచన: శ్రీనివాసరాజు ఇందుకూరి
కాన్సెప్టు: సుధ ఇందుకూరి (నా భార్య) ది

18, జనవరి 2011, మంగళవారం

మా ఊరికేమయ్యిందో!

కూఁవ్.. అంటా సుగర్ ప్యాక్టరీ సైరను కూతేసింది. కంభంపాటోరి పొలాల్లో చింతచెట్టుకింద కూచుని పేకాడుతున్న పాలేరు కుర్రోళ్ళు.. పాల్తీతకి గేదిలపాకలకాడికి పరుగులెత్తేరు.

 సీతాకాలం పొద్దు.. సంక్రాతి పండగ నెలట్టేరు.. సూత్తసూత్తుండగానే సీకటడిపోతుంది.. కావుకావుమంటూ కాకులు గూటికిసేరుకుంటున్నాయి.. మొగోళ్ళంతా వరికోతలపనుల్లో పొద్దంతా అలిసిపోయి.. సాయంత్రం ఏల కాల్ళీడ్చుకుంటా ఇళ్ళకుచేరుకుంటున్నారు. ఇంటిముందు నెలముగ్గూ రధంముగ్గులూ.. తులసికోటలూ, తామరాకులు  ఏత్తా.. నీది సరిగ్గారాలేదంటే.. నీదే సరిగ్గారాలేదని.. ఒకల్లనుచూసొకళ్ళు ముసిముసినవ్వులు నవ్వుకుంటా.. ముగ్గులేయటంలో మునిగిపోయేరు ఆడంగులు. పొద్దున్నంతా పనిలోపడి ఎంత ఒళ్ళుహూనమైపోయినా.. ఏడేడి అన్నంలో ఏడేడి కూరేసుకుని కడుపునిండా తినేసి.. రగ్గులు కప్పుకుని..  కొబ్బరీనుప్పుల్లతో పళ్ళుకుట్టుకుంటా.. చలిమంటేసుకోటానికి వొచ్చేత్తుంటారు జనాలు. సాయత్రం ఏడయ్యేసరికి గుడికాడున్న రాయిచెట్టుదగ్గర చలిమంటలు మండుతుంటాయి.

అబ్బులుగారి పొలంలోంచి తెచ్చిన చెరుకు పిప్పీ సచ్చుకర్రలూ మంచుకుతడిసిపోకండా వట్టిగడ్డేసి కప్పెట్టేసి.. చిన్నమేటేసేత్తుంటారు కుర్రోళ్ళు. చలిమంటల్లోకి.. ఆ మేటులోంచి కాసిన్ని కర్రలూ.. కాసింత పిప్పీ ఎలిగించి.. ఊరంతా చలికాగుతుంటాది.

చలిమంటకాగుతా.. ఆ కబురూ ఈ కబురూ సెప్పుకుంటా సుట్టలెలిగించి నోటికి ఐమూలగా పెట్టి కాలుత్తుంటుంటారు కాత్త తలమెరిసిన పెద్దోళ్ళు.

"ఒరే.. బేబికూతురు పయిటేసేసిందిరో..", అని పెద్దలకినపడకుండా పెద్దలకుమాత్రమే కబుర్లు సెప్పుకుంటుంటారు కుర్రోళ్ళు.

"ముంగటేడుకంటే ఈ ఏడు బాగా చలుందండే.. రాత్తిర్లు రెండు దుప్పట్లు కప్పినా.. కడుపులోంచొచ్చేత్తుంది అదేం చలోనండే.. పొద్దున్నే మంచందిగుదామంటే..  కాళ్ళట్టేత్తున్నాయే..", అని సెప్పుకుంటున్నారు తలపండిపోయిన ముసలోళ్ళు.
ఇలా అంతా కలిసిమెలిసి కట్టసుకాలు చెప్పుకుంటుంటే ఎంతో హాయిగా వుంటుంటాది.

అగ్గిదేవుడే చలికాచుకుంటానికి ఇలా అందర్నీ ఒకచోటకు చేర్చేడేమో అనిపిత్తుంటాది.
రాత్రి పదింటికేసే సుగర్ ఫ్యాక్టరీ కూతినబడేసరికి.. ఎవరిల్లకాళ్ళు ఎల్లిపోయారు. చలిమంట కాత్తా ఆరిపోయింది. చింతనిప్పుల్లాంటి సెగొక్కటే మిగులుందక్కడ. కాసేపటికి సెగపోయిన బూడిదలో ఎచ్చగా ముడుచుకుని పొడుకోటానిక్కొచ్చింది వారంరోజులకితమే ఎనిదిమి పిల్లల్నీనిన ఈది కుక్క. కుక్కపిల్లలు ఒకదాంతోఒకటి సెలగాటాలాడుకుంటా తల్లెనకాలొత్తున్నాయి.

పన్నెండయ్యింటది. పొలాల్లో ఇలకోళ్ళకూతలినిపిత్తున్నాయి. బోదిల్లో కప్పలరుపులతో ఆ పెదేశం అంతా భయం భయంగా అయిపోయింది.  తణుకులో సెంకడ్సో సినిమాచూసొచ్చి జతలుగా సైకిల్లేసుకుని ఎలుతున్నారు కుర్రగాళ్ళు. "లాస్ట్ ఫైటు ఇరగదీసేసిందిరా..", అంటా చెబుతున్నాడొకడు. "ఆడు భలేచేసేడ్రా..",అంటా కామెడీ బిట్టు చెప్పుకుంటా పకపకనవ్వుకుంటా పోతున్నారు ఇంకొందరు కుర్రగాళ్ళు. ఆ మాటలు నవ్వులూ ఇని ఆపేసిన ఇలకోళ్ళు, కప్పలూ ఆళ్ళెల్లిపోగానే మళ్ళీమొదలెట్టాయి.

సుబ్బారావుకి నిద్రట్టడంలేదు. నాలుగైదుమార్లు బయటకెళ్ళొచ్చేడు. మంచంమీదడి దొర్లుతున్నాడు. అయినా చేసిన అప్పే గేపకమొత్తుంది. పొద్దున్న పెదరెడ్డోళ్ళ కొడుకుచేసిన రబసంతా కళ్ళముందాడతుంది. ఎలాగైనా ఆడప్పుతీర్చేయ్యాలి.. ఆడితో నేనుమాటడటమేంటి.  రేపట్నుండైనా పన్లోకెళ్ళాలి.. అని మంచంమీద పడుకునే పతిగ్నలుచేసుకుంటున్నాడు.

ఎల్లకిలాపడుకుని ఆలోచిత్తా ఇంటికప్పొంక చూత్తావున్న సుబ్బారావుకి... అక్కడేదో మెరుత్తా ఎలుగు కనబడింది. చూత్తునంతలోనే ఇల్లంతా ఎలుగు.. పైకప్పంతా మంటలు. గబాల్నలేచి నిద్దర్లోవున్న పెళ్ళాంపిల్లల్ని బయటకులాగేసేడు. బయటకొచ్చి పెద్దపెద్ద పొలికేకలేసేసేడు.

కాసేపటికి జనాలంతా మూగి బిందెల్తో, తెపాలల్తో, చెంబుల్తో..  నీళ్ళట్టుకొచ్చి మంటలపై జిమ్మేరు. మంచుకు తడిసిపోయున్నాగానీ తాటాకులు తురతురమంటా కాలిపోతున్నాయి. కళ్ళముందే కాలిపోతున్న ఇల్లు,ఇంట్లో వస్తువులూ చూత్తున్న సుబ్బారావు ఏమీ చెయ్యలేక తలకొట్టుకుంటా ఏడుత్తున్నాడు. పెళ్ళాం నోటమాటాడక పడిపోయింది. పిల్లలు బెంబేలెత్తిపోయేరు.

ఆ ఏడికి ఎవరూదగ్గరకెళ్ళలేకపోతున్నారు. "తప్పుకోండెహే.. అలా సూత్తారేంట్రా..", అని.. వద్దువద్దన్నా ఇనకుండా..  మెరకీదిలోవుండే ఎంకట్రాజుగారు ఒంటిమీద దలసరి రగ్గుకప్పుకుని ఇంట్లోకి దూరేసేడు. చేతికందిన వస్తువుకాత్తా బయటకిసిరేత్తున్నాడు.  బయటడ్డ వత్తువుల్ని దూరంగా చేర్చేత్తున్నారు కుర్రోళ్ళు. ఒక అరగంటలో ఇంట్లో తేలికైన సామాను దొరికినకాడికి ఎంకట్రాజుగారు బయటకేసేసేడు.

కోళ్ళఫారంకాడ్నించి ఎవరో గంటలకారోళ్ళకి ఫోనుకొట్టించి ఇషయం చెప్పేరు. ఒక గంటగడిచేసరికి గంటలకారు మోతగా వచ్చి రోడ్డుమీదాగింది. రేవులోకి దించిన గేదిల్లాగా.. టకటకలాడతా.. ఒకర్నొకరు తొక్కుకుంటా కారులోంచి దిగిపోయేరు కాకీబట్టలోళ్ళు. మంటలన్నీ ఆరిపోయి. బూడిదే మిగిలిందక్కడ. కేసనీ సంతకాలనీ ఏదో చెప్పి అక్కడున్నోళ్ళదగ్గర సంతకాలెట్టించుకున్నారు గంటలకారోళ్ళు.

"మీ పల్లేటూర్లలో  మా అవసరంవుండదయ్యా.. మనిషికి మనిషి మీకు సాయంవుంటారుకదా.. మేమొచ్చేలోగానే మీరే ఆర్పేత్తుంటారో మంటలు..", అని ఎంకట్రాజుగారిని పొగిడేసి ధ్యాంక్సుచెప్పి ఎల్లిపోయేరు గంటలకారోళ్ళు.

ఓ నాలుగు రోజులు సుబ్బారావుని మాఇంట్లోవుండంటే మాఇంట్లోవుండమని పూటకొకరు చొప్పున వొండిపెట్టేరు. అందరూ తలోచెయ్యేసి సాయంచేసి ఇల్లుకట్టిపెట్టేరు.

ఒకరికొకరు సాయంగావుండండిరా అని చెప్పటానికి ఇక్కడకూడా అందర్నీ అగ్గిదేవుడే కలిపేడనిపిత్తుంది.

సరిగ్గా వారం తరువాత అప్పన్నగారు మంచంమీదే పోయేడు. ఊరువూరంతా పనులుమానేసి ఆయనింటిదగ్గరకు చేరుకుంది. తనింట్లో మనిషి, సొంతమనిషి పోయినంతలా ఏడ్చేరు వూరి జనం. అడక్కపోయినా తలోచెయ్యేసి సాయంచేసి దహనకార్యక్రమాలు చేసేరు . కాష్టం మంటలు చల్లారి బూడిదయ్యేదాకా చుక్కమంచినీళ్ళుకూడా ముట్టుకోకుండా ఊరువూరంతా అక్కడే కూర్చుంది.

ఎక్కెక్కి ఏడుత్తున్న అప్పన్నగారి కొడుకుని ఓదార్చేరు పెద్దోళ్ళు. మీమున్నామని ధైర్యంచెప్పేరు.
మళ్ళీ ఇక్కడా అగ్గిదేవుడే కలిపేడు. అవును ఆ అగ్గిదేవుడే కలిపేడందర్నీ.

అగ్గిదేవుడేకాదు... వరుణదేవుడికి కోపమొచ్చి వూరంతా ముంచేసినప్పుడు కూడా అంతా కలిసేవున్నారు. తుఫానుతెప్పించిన వాయిదేవుడికి గుళ్ళో పూజలుచేయించి.. దణ్ణాలెట్టుకుని శాంతింపజేసేరు.

ఇదంతా ఒక పదిపదేనేళ్ళ క్రితం...

కష్టాల్లోను.. కన్నీళ్ళలోను.. నేనున్నాను నీకు సాయం అని భుజంతట్టి చెప్పుకునే మా వూరి జనం.

పండగలొత్తే మీ ఇల్లూ మాఇల్లూ అని లేకుండా.. మీది మాది అని లేకుండా సంతోషంగా ఆడిపాడే వూరిజనం.

నీదీ కులం.. నాదాకులం అని కొట్టుకుచావకుండా ఒకర్నొకరు ఏరా అంటే ఏరా అని పిలుచుకునే మా వూరిజనం.
వినాయకచవితొచ్చినా, దసరావొచ్చినా, శ్రీరామనవమొచ్చినా.. ఒకేచోట పెద్ద విగ్రహం పెట్టి.. మేళాలుకట్టి సంబరాలుచేసే మా ఊరి జనాలకి ఏమయ్యిందో మరి! ఇలామారిపోయేరు!.

ఆడంగులు టీవీల్లో మొకాలుపెట్టి ముగ్గులేయటం మానేసేరు.
చలికాలమొత్తే ఏసుకునే చలిమంటలు మానేసి ఒకడిమీదొకడు కడుపుమంటలు పెంచుకుంటున్నారు.
తాటాకిళ్ళలోంచి డాబాల్లోకొచ్చేరనేమో...ఒకరిసాయమొకరికక్కరలేదనేమో, ఒకరితోఒకరు మాటాడుకోటంలేదు. మొకాలు పక్కెట్టుకుని ముసుగులేసుకుని తిరుగుతున్నారు.

తమకులపు హీరో బ్యానర్లు కట్టి.. కుర్రగాళ్ళు ఒకల్నొకళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంట్లోని గొడవల్ని ఈదిల్నెట్టుకుని బతుకుతున్నారు.

వినాయకచవితొచ్చినా, దసరావొచ్చినా, శ్రీరామనవమొచ్చినా.. ఈదికో విగ్రహం పెట్టి విడిగావిడిగా పండగలు చేసుకుంటున్నారు. పండగొత్తే కళేవుంటంలేదు.. పిల్లాపాపలకి సంబరేముటంలేదు.
అసలది పల్లెటూరిలానే వుంటంలేదు.

అసలిప్పుడు అగ్గిదేవుడుకాదు.. వరుణదేవుడు కాదు.. వాయుదేవుడు కాదు.. ఆ బెమ్మదేవుడొచ్చినా ఈళ్ళని కలపలేడేమో. మళ్ళీ ఆ వైభోగం తీసుకురాలేరేమో!

నే పదిపదేనేళ్ళక్రితం చూసిన మావూరికేమయ్యిందో!

5, జనవరి 2011, బుధవారం

జెక్కంశెట్టి సూర్రావు - ఎకరం పొలం...

మిట్టమద్యాన్నం... ఎండు కొబ్బరాకులు మంటేసినట్టు ఎండ భగభగలాడిపోతుంది. రోహిణీ కార్తి కావటంవల్లేమో.. ఏడి గాలి ఈస్తావుంది.., ఆ గాలికి.. కాలిన పెనం మీద నీళ్ళు జిమ్మితే బుస్సుమన్నట్టు ఒంటిమీద చెమటకూడా  బుస్ మని ఆవిరైపోతుంది. మినువులూ పెసలూ కలిపిజల్లిన ఎకరంచెక్కలో.. చిన్న చిన్న మొలకలు లేచినియ్యి.., బోదికి అడ్డంగట్టి.. చేలోకి నీళ్ళెక్కించి.. యూరియా జల్లుతున్నాడు జక్కంశెట్టి సూర్రావు..

"ఏదోటిపడతాం.. ఏరెట్టెయ్యండీ.., ఆడితో నేను పల్లేను..", అన్న చిన్నకొడుకు ఈరాసామి మాటలే.. ఇంకా చెవుల్లో గింగిరీలు కొడతా తిరుగుతున్నాయి..., "ఇన్నాళ్ళు కలిసున్నాంగదరా.., నేను పోయేకా ఏరడండి.. అప్పటిదాకా ఈ మాటెత్తితే నా మీదొట్టే", అని ఒట్టెట్టుకుని సర్దిచెప్పి ఇద్దరి కొడుకులనోళ్ళూ మూయించేసాడు సూర్రావు. ఏదో పెద్దోడని మాటిని ఎళ్ళిపోయేరుగానీ.. ఇద్దరూ కలిసుంటారని నమ్మకం సూర్రావుకి కలగటంలేదు .

సూర్రావుకి ఇద్దరు కొడుకులు... పిల్లలు చేతికందే టైముకే ఇంటావిడ ఫుటో గోడెక్కేసింది. సూర్రావు చిన్నప్పట్నుండీ ఉల్లిపాయలు, కూరగాయలూ పక్కూళ్ళల్లో రైతుల్దగ్గర టోకు ధరక్కొనేసి.. ఊరిసంతలో అమ్మి ఏపారం చేత్తుండేవోడు. అలాగే సంపాయించి, ఓ ఎకరం పొలంగొన్నాడు. ఇద్దరుకొడుకులకూ పెళ్ళిళ్ళుచేసి.. ఓ రెండువాటాల ఇల్లుకట్టిచ్చేడు.
ఇంటరుగుమీదే మంచమేసుకుని పడుకుంటా.. ఓపికున్నప్పుడు పొలంపనులూ.. ఏపారం చేత్తా కాలగడిపేత్తుంటాడు సూర్రావు.

కొడుకులిద్దరికీ అదే ఏపారం నేర్పించేడు.. అతనికున్న పలుకుబడి.. నమ్మకంమూలానా ఆళ్ళిద్దరి బిజినెస్సూ బాగానే సాగింది.. ఇద్దరూ బాగా సంపాయించడం మొదలెట్టేరు. లచ్చిందేవి తాడవమాడింది.. పట్టిందంతా బంగారమయ్యింది. ఆ ఇంటి గడప బంగారంరంగులో మెరిసిపోయింది.

డబ్బుచేతులో ఆడ్డంతో... ఇదినాదీ.. ఇదినీదీ.. అని ఇద్దరిమద్దెనా తేడాలొచ్చేయటం మొదలెట్టేయి. అప్పుడుదాకా ఉమ్మడికుటంబంగానే కలిసున్నోళ్ళ మద్దెన చిన్న చిన్న గొడవలు మొదలయ్యేయి. ఓరోజు  పొద్దున్న, కొడుకులిద్దరికీ మాటతేడాలొచ్చి.. ఇంట్లో మెడామెడాఏసుకున్నారు. ఎలాగోలా సర్దిచెప్పిన  సూర్రావు, ఆ గొడవగురించే ఆలోచిత్తా ఏదీకానేల పొలానికొచ్చి ఎండకొండా తెలీకుండా చేనుకు మందేయటం మొదలెట్టేడు

రిసౌండుతో బుర్రలో తిరుగుతున్నమాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి... కళ్ళుభైర్లుగమ్మేత్తున్నాయి.. సుట్టూ సిమ్మసీకటైపోయింది.. సేతులూ కాళ్ళు పట్టొదిలేత్తున్నాయి.. సేత్తోఅట్టుకున్న యూరియాబుట్ట జారికిందడిపోయింది...,  ఎండదెబ్బతగిలేసి.. చెట్టుమీదనుండి రాలిపోయిన పిట్టలాగా, గట్టుమీదనుండి పంటబోదిలో దబ్బుమని కూలబడిపోయేడు సూర్రావు. అరిటిబొంత కాల్లోకి గిట్టేసినట్టుగా ధుభ్మని ఇనిపించిన సౌండుకు.. పక్కచేళ్ళో రాలిపోయిన వరిగింజల్ని పొడుచుకు తింటా సరసాలాడుకుంటున్న చిలకలూ.. గోరింకలూ.. పంటపిచ్చుకలూ బెదిరిపోయి పైకెగిరిపోయేయి.

పంగిడి రావుడి గారి పల్లంచేనులో.. కొబ్బరిసెట్లనీడన కూర్చుని పచ్చగడ్డికోత్తున్న మద్దాలి ఈర్రాజుకు ఇనపడిందా దబ్బుమన్న సౌండు. గడ్డికోయటం ఆపేసి లేచినిలబడి సూసేడు... ర్రాజు., ఏమీ కనబల్లేదు.. అప్పుడుదాకా మందేత్తాకనిపించిన సూర్రావు కనబడకపోయేసరికి అనుమామొచ్చింది. సూర్రావుపొలంకాడికి రొండడుగులేసేడు ఈర్రాజు. పంటబోదెలో పడున్న సూర్రావుని పైకిలేపి.. పెద్దపొలికేకేసి.. వూరి జనాందరినీ పోగేసేసేడు.

సూర్రావును పక్కూరి పెద్దాస్పటల్లో జాయినుచేసేరు. పరీచ్చలన్నీ సేసిన డాక్టరుగారు..  మనిషికేం పెమాదంలేదుగానీ పచ్చవాతంమొచ్చి ఒక సెయ్యికాలు లాగేసినియ్యి.. లేచేదాకా మాటుంటాదోలేదో తెలీదు అని సెప్పటంతో బెంబేలుపడిపోయేరు కొడుకులిద్దరూ.

వారంరోజులు ఆసుపత్రిలోవుంచి సూసినా కాలుచేయ్యిరాలేదు. ఇహలాభంలేదని ఇంటికితీసుకొచ్చేసేరు సూర్రావుని. ఇంటరుగుమీద ఓ నులకమంచమేసి దానిమీదపడేసేరు.  జనాల్నిగుర్తుపట్టి అటూ ఇటూ చూడగలుగుతున్నాడు సూర్రావు.. ఏదో చెప్పాలనుకుంటున్నాడుగానీ గొంతుదాకా వచ్చిన మాటలు అక్కడే ఏదో అడ్డబడిపోయినట్టు ఆగిపోతున్నాయి. అన్నం జావలాగాచేసి నోట్లోపోత్తున్నారు... ఒకటీ..రోండూ..అన్నీమంచంమీదే..  చిన్నపిల్లోడికన్నా ఎక్కువసేవలజేయాల్సొత్తుంది.

నాలుగురోజులు బాగానే సేవలుచేసిన కోడల్లిద్దరూ, తరువాత మొహాలుపక్కెట్టేసేరు.
"సత్తే సచ్చేడు...ఈ దరిద్రాన్ని ఎన్నాళ్ళునెత్తీమీదెట్టుకంటామమ్మా..", అని ఇంట్లోంచి బయటికిరావటమే మానేసేరు..,ఆళ్ళపిల్లల్నిగూడా ఈదిగుమ్మంఏపు రానీకుండా కట్టడిచేసేసేరు.
కొడుకులిద్దరూ.. ఆడుసూత్తాడని ఈడు..ఈడుసూత్తాడని ఆడు, దొడ్డిగుమ్మంలోంచే తండ్రిఏపు కన్నెత్తిసూడకుండా మసులుతున్నారు.

ఇదంతా చూత్తా.. ఎదురింట్లోవున్నకమలకి పేనం నీరయిపోయింది.. ఆడపిల్లలేకపోటంతో కమలని చానా పేనంగా.. కన్నకూతుర్లా చూసుకునేటోడు సూర్రావు. ఏదన్నా పండగొత్తే పక్కూరెల్లి కొడళ్ళకి తెలీకండా చీర కొనిచ్చేవోడు.., అదిచూసి అంతా అనేవోరు.. "ఏరా సూర్రావా..అంతంత ఖరిదేట్టి దీనికే చీరకొంటన్నావో..మీ కోడళ్ళకు కొనియ్యరాదేంటిరా", అని.. "చాల్లేండే.. ఆళ్ళకు నాకొడుకులే కొనిత్తారు.. కమలకెవరిత్తారే.., మా అల్లుడా.. పొట్టకోసం అని బెల్లవొంటవొండుతా ఊళ్ళెంబడి తిరుగుతాడు.. ఆర్నెళ్ళకోసారొత్తాడు.. పాపం దీనికి మాత్రం సరదాలుండవేంటే.. నాకూతుర్లాంటిదే ఇదా..", అని నవ్వుతా కమల తలనిమిరేవోడు సూర్రావు.

అలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టమొచ్చేసిందేంటి దేవుడా అని కన్నీలెట్టేసుకుంది కమల. "ఇలాటి కష్టం పగోడిక్కూడా రాకుడదమ్మా", అని ఆ వూరి కొండాలమ్మకి దణ్ణమెట్టుకుంది. మొహాలు పక్కెట్టేసి.. కొడుకులూ కోడళ్ళు వదిలేసిన సూర్రావుని.. తనకున్నదాంట్లోనే వండిపెడతా.. కంటికిరెప్పలాగా సూసుకుంటా సేవలుచేత్తంది కమల.

ఆరోజు సోమవారం, ఏకాదశి, పొద్దున్న ఐదుగంటలకి.. రామకధనువినరయ్యా.. అంటా.. రాములోరి గుడిమీద లవకుశ పాటలొత్తున్నాయి.., సూర్రావు మంచమట్టి సరిగ్గా ఆరోజుకు నెల్ల్రోజులయ్యింది.., కమల సూర్రావుని పేనంగా చూసుకుంటానేవుంది.. సేవలుచేత్తానేవుంది..
ఆ సెనంతో కమలరుణం తీరిపోయింది కాబోలు.. అలా రామకధ ఇంటానే.. సూర్రావు పేనం గాల్లోకలిసిపోయింది.

ఒక్కసారిగా ఆ ఈది ఈదంతా గొల్లుమంది. గుండెలు బాదుకుంటా పైకి ఏడుత్తున్నట్టు నటిత్తానే దహన కార్ర్యక్రమాలు చేసేసేరు కొడుకులిద్దరూ. దినంరోజు ఊరందరికీ ఆకులేసేసేరు. ముసలోడి దరిద్రమొదిలిందిరా నాయనా అని మనసులో అనుకుంటానే  మా గొప్పగా కార్యక్రమం జరిపించేసేరు.

ఎంగిలిచేతులు కడుక్కుని.. జనాల్నలా ఎళ్ళేదాకా ఆగి, బూతులపురాణం మొదలెట్టేడు పెద్దకొడుకు రంగారావు. "ఎంటనే ఈ ఇల్లుకాలీ చేసేయ్యి! ఇది నా ఇల్లెహే.." అంటా ఈరాసామింట్లో సామానంతా బయటడేటం మొదలెట్టేడు.., కోపంతో వూగిపోతున్న ఈరాసామెళ్ళి రంగారావుని మెడేసేసుకున్నాడు.  పొలం..ఇళ్ళూ  మొత్తం ఆస్తంతా తనపేరే రాసున్నట్టుగా వున్న దత్తావేదులు చూపించి..అంతా నాదేనన్నాడు రంగారావు. అప్పుడుదాకా వూగిపోయి.. తాండవంచేసేసిన ఈరాసామికి దత్తావేదులు చూసేసరికి నోటమాటపడిపోయింది.

ఆస్తినాదంటే నాదని.. ఇద్దరూ వూరిపెద్దలమద్దెన పంచాయితీ పెట్టేరు. రంగారావు చూపిత్తావున్న సాక్ష్యానికి.. పెసిడెంటుగారే కాదు.. పెద్దలెవ్వరూ ఏమీ మాటాడలేకపోయేరు. ఇక కోర్టుకెళ్లటమే దిక్కని అంతా తేల్చిసెప్పేసేరు.

పక్కూరు శంకరంమాస్టారుగారి తమ్ముడు కొడుకు మహ పేరున్న లాయరు. అతన్నట్టుకుని జరిగిందంతా చెప్పి.. కోర్టులో కేసేయించేడు ఈరాసామి.
రంగారావు తక్కువోడేంకాదు, ఆడిని తలతన్నే.. బాబులాంటి లాయర్నట్టుకుని ఈరాసామికి దెబ్బకొట్టేడు..

కోర్టు బయటీళ్ళు.. కోర్టులోపల ఆళ్ళలాయర్లు కొట్టుకుంటా.. కేసులు వాయిదాపడతున్నాయి.. కాలం గడుత్తుంది. ఏరు కాపురం పెట్టేసి.. రెండువాటలమద్దెనా కొబ్బరాకు దడికట్టేసుకుని.. ఒకరిమొహాలొకరికి కనబడకుండా.. ఏపారాలు చేసుకుంటా, నెలకోసారి.. కోర్టుమెట్లేక్కొత్తున్నారు అన్నదమ్ములిద్దరూ.

రోజులు గడుత్తున్నకొద్దీ కేసు సాగుతానేవుందిగానీ.. తేలటంలేదు. బజార్లో అందరి నోట్లో ఈళ్ళగొడవలే నాస్తా అందరికీ లోకువైపోయేరు అన్నదమ్ములిద్దరూ. జెక్కశెట్టి సూర్రావు కొడుకులుగా ఇన్నాళ్ళు నమ్మకంగానడిచిని ఏపారం నత్తనడకనడవటం మొదలెట్టింది. ఈళ్ళతో ఏపారం కలిసి చేసేటోళ్ళంతా ఆడిమాటలీడికి ఈడిమాటలాడికి మోసేసి... ఇద్దర్నీఇంకా రెచ్చగొట్టేసేరు. ఇద్దరిదగ్గర్నుండీ లొసుగులులాగి.. దొరకినకాడికి నొక్కేత్తా.. పలుకుబడిపెంచేసుకున్నారు.

పిల్లలా పెళ్ళిళ్ళకెదుగుతున్నారు. చదువులనీ అయ్యనీ ఇయ్యనీ కర్చులకోసం, అప్పులుచేయటంమొదలెట్టేరు.. కొంతకాలానికి బాగా అప్పులపాలయిపోయేరు. ఇల్లువాకిలీ అమ్ముదామంటే.. అయింకా కోర్టుకేసుల్లో నలుగుతానేవున్నాయి.

ఓ రోజు సంతనుండి ఇంటికొత్తున్న ఈరాసామికిఆళ్ళ లాయరు పొంగిపోతా ఎదురొచ్చేడు.
"కేసుమనమే గెలిచేం.. వీరాస్వామీ.., ఆస్తి సగం సగం పంచుకోవాలనీ కోర్టుతీర్పిచ్చింది", అని సంతోషపడిపోతా చెప్పేడు. అదిన్న ఈరాసామికి పేనం లేచొచ్చినట్టయ్యింది.., అప్పులన్నీతీర్చేసి గట్టెక్కొచ్చనుకున్నాడు.

ఎవరివాటా ఆళ్ళు పంచేసుకుందామని అనుకుంటుండగా.. ఇన్నాళ్ళు మేం మీకోసం వాదించినందుకు ఇంతయ్యిందని లెక్కరాసిచ్చేరు ఇద్దరి లాయర్లు..
ఆ లాయరు ఫీజులకి వచ్చినట్టేవచ్చిన ఎకరంపొలం పోయి.. ఇల్లుమాత్రం మిగిలింది.

ఇన్నాళ్ళు గొడవలత్తో ఏంపోగొట్టుకున్నారో తెలుసుకుని ఒకర్నట్టుకొకరు ఏడిచేరు ఇద్దరన్నదమ్ములూ.
కొబ్బరాకు దడులు పడగొట్టేసి.. ఆ రోజునుండే మళ్ళీ ఉమ్ముడికాపురం పెట్టేసేరు. కలిసిమెలిసుంటా కలిసి ఏపారాలు చేత్తా..ఆ ఇంటికి పూర్వవైభవం పట్టుకొచ్చేరు.

ఇంటి గడప పచ్చరంగులో బంగారంలాగా మెరిసిపోయింది. మళ్ళీ లచ్చిందేవితో తాడవమాడేసిందా ఇంటిలో.

సేతుల్లో డబ్బులాడేసినియ్యి.., ఇది మాదీ.. ఇది మీదీ.. అని ఆళ్ళపిల్లలమద్దెన తేడాలు రావటం మొదలయ్యేయి.
ఆ తేడాలు పెద్దగొడవలయ్యేయి. "ఇదంతా మనదిరా.. మీది మాదీ ఏంటి..", అని.. రంగారావు.. ఈరాసామి పిల్లలందరికీ సద్దిసెప్పేరు.

రెండుగుమ్మాల మద్దెన, చెంకీదండలేసి.. గోడకి తగిలించుంది సూర్రావు నిలువెత్తు ఫుటో.. ఆ ఫుటోలోంచి ఓ చిన్న చిరునవ్వునవ్వుకుని, శాంతపడింది సూర్రావు ఆత్మ.

Related Posts Plugin for WordPress, Blogger...