18, జనవరి 2011, మంగళవారం

మా ఊరికేమయ్యిందో!

కూఁవ్.. అంటా సుగర్ ప్యాక్టరీ సైరను కూతేసింది. కంభంపాటోరి పొలాల్లో చింతచెట్టుకింద కూచుని పేకాడుతున్న పాలేరు కుర్రోళ్ళు.. పాల్తీతకి గేదిలపాకలకాడికి పరుగులెత్తేరు.

 సీతాకాలం పొద్దు.. సంక్రాతి పండగ నెలట్టేరు.. సూత్తసూత్తుండగానే సీకటడిపోతుంది.. కావుకావుమంటూ కాకులు గూటికిసేరుకుంటున్నాయి.. మొగోళ్ళంతా వరికోతలపనుల్లో పొద్దంతా అలిసిపోయి.. సాయంత్రం ఏల కాల్ళీడ్చుకుంటా ఇళ్ళకుచేరుకుంటున్నారు. ఇంటిముందు నెలముగ్గూ రధంముగ్గులూ.. తులసికోటలూ, తామరాకులు  ఏత్తా.. నీది సరిగ్గారాలేదంటే.. నీదే సరిగ్గారాలేదని.. ఒకల్లనుచూసొకళ్ళు ముసిముసినవ్వులు నవ్వుకుంటా.. ముగ్గులేయటంలో మునిగిపోయేరు ఆడంగులు. పొద్దున్నంతా పనిలోపడి ఎంత ఒళ్ళుహూనమైపోయినా.. ఏడేడి అన్నంలో ఏడేడి కూరేసుకుని కడుపునిండా తినేసి.. రగ్గులు కప్పుకుని..  కొబ్బరీనుప్పుల్లతో పళ్ళుకుట్టుకుంటా.. చలిమంటేసుకోటానికి వొచ్చేత్తుంటారు జనాలు. సాయత్రం ఏడయ్యేసరికి గుడికాడున్న రాయిచెట్టుదగ్గర చలిమంటలు మండుతుంటాయి.

అబ్బులుగారి పొలంలోంచి తెచ్చిన చెరుకు పిప్పీ సచ్చుకర్రలూ మంచుకుతడిసిపోకండా వట్టిగడ్డేసి కప్పెట్టేసి.. చిన్నమేటేసేత్తుంటారు కుర్రోళ్ళు. చలిమంటల్లోకి.. ఆ మేటులోంచి కాసిన్ని కర్రలూ.. కాసింత పిప్పీ ఎలిగించి.. ఊరంతా చలికాగుతుంటాది.

చలిమంటకాగుతా.. ఆ కబురూ ఈ కబురూ సెప్పుకుంటా సుట్టలెలిగించి నోటికి ఐమూలగా పెట్టి కాలుత్తుంటుంటారు కాత్త తలమెరిసిన పెద్దోళ్ళు.

"ఒరే.. బేబికూతురు పయిటేసేసిందిరో..", అని పెద్దలకినపడకుండా పెద్దలకుమాత్రమే కబుర్లు సెప్పుకుంటుంటారు కుర్రోళ్ళు.

"ముంగటేడుకంటే ఈ ఏడు బాగా చలుందండే.. రాత్తిర్లు రెండు దుప్పట్లు కప్పినా.. కడుపులోంచొచ్చేత్తుంది అదేం చలోనండే.. పొద్దున్నే మంచందిగుదామంటే..  కాళ్ళట్టేత్తున్నాయే..", అని సెప్పుకుంటున్నారు తలపండిపోయిన ముసలోళ్ళు.
ఇలా అంతా కలిసిమెలిసి కట్టసుకాలు చెప్పుకుంటుంటే ఎంతో హాయిగా వుంటుంటాది.

అగ్గిదేవుడే చలికాచుకుంటానికి ఇలా అందర్నీ ఒకచోటకు చేర్చేడేమో అనిపిత్తుంటాది.
రాత్రి పదింటికేసే సుగర్ ఫ్యాక్టరీ కూతినబడేసరికి.. ఎవరిల్లకాళ్ళు ఎల్లిపోయారు. చలిమంట కాత్తా ఆరిపోయింది. చింతనిప్పుల్లాంటి సెగొక్కటే మిగులుందక్కడ. కాసేపటికి సెగపోయిన బూడిదలో ఎచ్చగా ముడుచుకుని పొడుకోటానిక్కొచ్చింది వారంరోజులకితమే ఎనిదిమి పిల్లల్నీనిన ఈది కుక్క. కుక్కపిల్లలు ఒకదాంతోఒకటి సెలగాటాలాడుకుంటా తల్లెనకాలొత్తున్నాయి.

పన్నెండయ్యింటది. పొలాల్లో ఇలకోళ్ళకూతలినిపిత్తున్నాయి. బోదిల్లో కప్పలరుపులతో ఆ పెదేశం అంతా భయం భయంగా అయిపోయింది.  తణుకులో సెంకడ్సో సినిమాచూసొచ్చి జతలుగా సైకిల్లేసుకుని ఎలుతున్నారు కుర్రగాళ్ళు. "లాస్ట్ ఫైటు ఇరగదీసేసిందిరా..", అంటా చెబుతున్నాడొకడు. "ఆడు భలేచేసేడ్రా..",అంటా కామెడీ బిట్టు చెప్పుకుంటా పకపకనవ్వుకుంటా పోతున్నారు ఇంకొందరు కుర్రగాళ్ళు. ఆ మాటలు నవ్వులూ ఇని ఆపేసిన ఇలకోళ్ళు, కప్పలూ ఆళ్ళెల్లిపోగానే మళ్ళీమొదలెట్టాయి.

సుబ్బారావుకి నిద్రట్టడంలేదు. నాలుగైదుమార్లు బయటకెళ్ళొచ్చేడు. మంచంమీదడి దొర్లుతున్నాడు. అయినా చేసిన అప్పే గేపకమొత్తుంది. పొద్దున్న పెదరెడ్డోళ్ళ కొడుకుచేసిన రబసంతా కళ్ళముందాడతుంది. ఎలాగైనా ఆడప్పుతీర్చేయ్యాలి.. ఆడితో నేనుమాటడటమేంటి.  రేపట్నుండైనా పన్లోకెళ్ళాలి.. అని మంచంమీద పడుకునే పతిగ్నలుచేసుకుంటున్నాడు.

ఎల్లకిలాపడుకుని ఆలోచిత్తా ఇంటికప్పొంక చూత్తావున్న సుబ్బారావుకి... అక్కడేదో మెరుత్తా ఎలుగు కనబడింది. చూత్తునంతలోనే ఇల్లంతా ఎలుగు.. పైకప్పంతా మంటలు. గబాల్నలేచి నిద్దర్లోవున్న పెళ్ళాంపిల్లల్ని బయటకులాగేసేడు. బయటకొచ్చి పెద్దపెద్ద పొలికేకలేసేసేడు.

కాసేపటికి జనాలంతా మూగి బిందెల్తో, తెపాలల్తో, చెంబుల్తో..  నీళ్ళట్టుకొచ్చి మంటలపై జిమ్మేరు. మంచుకు తడిసిపోయున్నాగానీ తాటాకులు తురతురమంటా కాలిపోతున్నాయి. కళ్ళముందే కాలిపోతున్న ఇల్లు,ఇంట్లో వస్తువులూ చూత్తున్న సుబ్బారావు ఏమీ చెయ్యలేక తలకొట్టుకుంటా ఏడుత్తున్నాడు. పెళ్ళాం నోటమాటాడక పడిపోయింది. పిల్లలు బెంబేలెత్తిపోయేరు.

ఆ ఏడికి ఎవరూదగ్గరకెళ్ళలేకపోతున్నారు. "తప్పుకోండెహే.. అలా సూత్తారేంట్రా..", అని.. వద్దువద్దన్నా ఇనకుండా..  మెరకీదిలోవుండే ఎంకట్రాజుగారు ఒంటిమీద దలసరి రగ్గుకప్పుకుని ఇంట్లోకి దూరేసేడు. చేతికందిన వస్తువుకాత్తా బయటకిసిరేత్తున్నాడు.  బయటడ్డ వత్తువుల్ని దూరంగా చేర్చేత్తున్నారు కుర్రోళ్ళు. ఒక అరగంటలో ఇంట్లో తేలికైన సామాను దొరికినకాడికి ఎంకట్రాజుగారు బయటకేసేసేడు.

కోళ్ళఫారంకాడ్నించి ఎవరో గంటలకారోళ్ళకి ఫోనుకొట్టించి ఇషయం చెప్పేరు. ఒక గంటగడిచేసరికి గంటలకారు మోతగా వచ్చి రోడ్డుమీదాగింది. రేవులోకి దించిన గేదిల్లాగా.. టకటకలాడతా.. ఒకర్నొకరు తొక్కుకుంటా కారులోంచి దిగిపోయేరు కాకీబట్టలోళ్ళు. మంటలన్నీ ఆరిపోయి. బూడిదే మిగిలిందక్కడ. కేసనీ సంతకాలనీ ఏదో చెప్పి అక్కడున్నోళ్ళదగ్గర సంతకాలెట్టించుకున్నారు గంటలకారోళ్ళు.

"మీ పల్లేటూర్లలో  మా అవసరంవుండదయ్యా.. మనిషికి మనిషి మీకు సాయంవుంటారుకదా.. మేమొచ్చేలోగానే మీరే ఆర్పేత్తుంటారో మంటలు..", అని ఎంకట్రాజుగారిని పొగిడేసి ధ్యాంక్సుచెప్పి ఎల్లిపోయేరు గంటలకారోళ్ళు.

ఓ నాలుగు రోజులు సుబ్బారావుని మాఇంట్లోవుండంటే మాఇంట్లోవుండమని పూటకొకరు చొప్పున వొండిపెట్టేరు. అందరూ తలోచెయ్యేసి సాయంచేసి ఇల్లుకట్టిపెట్టేరు.

ఒకరికొకరు సాయంగావుండండిరా అని చెప్పటానికి ఇక్కడకూడా అందర్నీ అగ్గిదేవుడే కలిపేడనిపిత్తుంది.

సరిగ్గా వారం తరువాత అప్పన్నగారు మంచంమీదే పోయేడు. ఊరువూరంతా పనులుమానేసి ఆయనింటిదగ్గరకు చేరుకుంది. తనింట్లో మనిషి, సొంతమనిషి పోయినంతలా ఏడ్చేరు వూరి జనం. అడక్కపోయినా తలోచెయ్యేసి సాయంచేసి దహనకార్యక్రమాలు చేసేరు . కాష్టం మంటలు చల్లారి బూడిదయ్యేదాకా చుక్కమంచినీళ్ళుకూడా ముట్టుకోకుండా ఊరువూరంతా అక్కడే కూర్చుంది.

ఎక్కెక్కి ఏడుత్తున్న అప్పన్నగారి కొడుకుని ఓదార్చేరు పెద్దోళ్ళు. మీమున్నామని ధైర్యంచెప్పేరు.
మళ్ళీ ఇక్కడా అగ్గిదేవుడే కలిపేడు. అవును ఆ అగ్గిదేవుడే కలిపేడందర్నీ.

అగ్గిదేవుడేకాదు... వరుణదేవుడికి కోపమొచ్చి వూరంతా ముంచేసినప్పుడు కూడా అంతా కలిసేవున్నారు. తుఫానుతెప్పించిన వాయిదేవుడికి గుళ్ళో పూజలుచేయించి.. దణ్ణాలెట్టుకుని శాంతింపజేసేరు.

ఇదంతా ఒక పదిపదేనేళ్ళ క్రితం...

కష్టాల్లోను.. కన్నీళ్ళలోను.. నేనున్నాను నీకు సాయం అని భుజంతట్టి చెప్పుకునే మా వూరి జనం.

పండగలొత్తే మీ ఇల్లూ మాఇల్లూ అని లేకుండా.. మీది మాది అని లేకుండా సంతోషంగా ఆడిపాడే వూరిజనం.

నీదీ కులం.. నాదాకులం అని కొట్టుకుచావకుండా ఒకర్నొకరు ఏరా అంటే ఏరా అని పిలుచుకునే మా వూరిజనం.
వినాయకచవితొచ్చినా, దసరావొచ్చినా, శ్రీరామనవమొచ్చినా.. ఒకేచోట పెద్ద విగ్రహం పెట్టి.. మేళాలుకట్టి సంబరాలుచేసే మా ఊరి జనాలకి ఏమయ్యిందో మరి! ఇలామారిపోయేరు!.

ఆడంగులు టీవీల్లో మొకాలుపెట్టి ముగ్గులేయటం మానేసేరు.
చలికాలమొత్తే ఏసుకునే చలిమంటలు మానేసి ఒకడిమీదొకడు కడుపుమంటలు పెంచుకుంటున్నారు.
తాటాకిళ్ళలోంచి డాబాల్లోకొచ్చేరనేమో...ఒకరిసాయమొకరికక్కరలేదనేమో, ఒకరితోఒకరు మాటాడుకోటంలేదు. మొకాలు పక్కెట్టుకుని ముసుగులేసుకుని తిరుగుతున్నారు.

తమకులపు హీరో బ్యానర్లు కట్టి.. కుర్రగాళ్ళు ఒకల్నొకళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంట్లోని గొడవల్ని ఈదిల్నెట్టుకుని బతుకుతున్నారు.

వినాయకచవితొచ్చినా, దసరావొచ్చినా, శ్రీరామనవమొచ్చినా.. ఈదికో విగ్రహం పెట్టి విడిగావిడిగా పండగలు చేసుకుంటున్నారు. పండగొత్తే కళేవుంటంలేదు.. పిల్లాపాపలకి సంబరేముటంలేదు.
అసలది పల్లెటూరిలానే వుంటంలేదు.

అసలిప్పుడు అగ్గిదేవుడుకాదు.. వరుణదేవుడు కాదు.. వాయుదేవుడు కాదు.. ఆ బెమ్మదేవుడొచ్చినా ఈళ్ళని కలపలేడేమో. మళ్ళీ ఆ వైభోగం తీసుకురాలేరేమో!

నే పదిపదేనేళ్ళక్రితం చూసిన మావూరికేమయ్యిందో!

15 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

రాజు గారూ! సంక్రాంతి కథ సూపరు....మనసుల్ని అలా తడిమేస్తాయి మీ అచ్చతెలుగు మాటలు,తెలితెలి భావాలు...

నాక్కొన్ని అనుమానాలొచ్చేశాయ్...అర్థాలు చెప్పాలి మరి!

సచ్చు కఱ్రలు, ఇలకోళ్ళు...

Tejaswi చెప్పారు...

పెరిగిపోతున్న వస్తు(materialistic) వ్యామోహమే దీనికి కారణమేమోనని నాకనిపిస్తుంటుంది. మనిషి వెనకున్న ఆస్తులు, అప్పులను బట్టి అతని విలువను అంచనా కట్టడం వంటి పోకడలు పల్లెటూళ్ళకు కూడా వ్యాపించాయా...?

ఏదేమైనా మీ కథ మాత్రం చాలా బాగుంది...ఆలోచించేవిధంగా ఉంది. అసలు ఏ కథ ప్రయోజనమైనా ఇలా ఉండాలి. మనిషిని స్పందింపచేయాలి పాజిటివ్ గా. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా రాశారు. ఉదా:కు కుక్కపిల్ల, దానిపిల్లలు ఆరిపోయిన మంట తాలూకు బూడిదలో పడుకోవడం.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

బాగా రాస్తారండీ మీరు.
మనుష్యుల మధ్య ఉండే లంకేదో తెగిపోవటానికి కారణం చిన్నతెర,బుల్లితెర ఇళ్ళల్లో పొద్దస్తమానం వెలగటమే అనిపిస్తుంది. కుటుంబాల మధ్యనే కాదు, కుటుంబంలోపలే ఈ స్థితి.

3g చెప్పారు...

సూపర్...సూపర్...సూపర్ గా రాసారు.

మీ కథ చదివాకా మా ఊళ్ళో వచ్చిన మార్పులన్నీ గుర్తుచేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడెక్కడైనా పరిస్థితిలాగే ఉందనుకుంట. కులాల వారీగా హీరోల కటౌట్లు, దేవుడివిగ్రహాలు.......అంతా అంతే.

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యా
కధ నచ్చినందుకు సంతోషం.
చెఱుకు గెడల్లో చచ్చు పుచ్చు తీసి రసం ఆడకుండా పక్కనపడేస్తారు, అవి ఎండిపోయాక చచ్చుకర్రలంటారు. అవే వంటచెఱుకులా ఉపయోగిస్తారు.
ఇలకోళ్ళు అంటే.. బీటిల్స్. రాత్రిల్లు కీచ్ కీచ్ మని అరుస్తాయో అవి. :-)

@తేజస్వి గారు
పట్నం వాసనలు పల్లెటూర్లకు వ్యాపించాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అంతా కలిసిమెలిసి ఉండటంలో ఆనందం వుందనేవిషయం వాళ్ళమళ్ళీ ఎప్పుడుతెలుసుకుంటారో.

నా కధనచ్చినందుకు సంతోషం. కామెంటుకు ధన్యవాదములు.

@మందాకిని గారు
బుల్లితెర బాగోతాలు అన్నీ ఇన్నీకాదండి. అదిరాసుకుంటూ పోతే పెద్ద చరిత్రే అవుతుంది.
మీ కామెంటుకు ధన్యవాదములు.

@3g గారు
అన్ని పల్లెటూర్లు అంతేనండి. ఒకర్నిచూసొకరు మారొద్దుమరి. అదే కదా అభివృద్ది అంటే. సిరబ్బకపోయినా చీడబ్బిందంటారు చూసారా. ఇదీ అంతే.. చెడు చాలా త్వరగా అలవాటవుతుంది.
మీ కామెంటుకు ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఇలకోళ్ళు, కీచురాళ్ళు ఒకటేనా? వేర్వేఱా?
చిన్నతెర అని టీవీని, బుల్లితెర అని కంప్యూటర్ (నెట్ తో) నీ అన్నానండీ.
నేనూ మినహాయింపు కాదు లెండి.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు అన్ని ఊళ్ళలో ఇదే కతండీ :( :(
మాత్తణుకండీ మీది ఏ వూరండీ ????

శ్రీనివాసరాజు చెప్పారు...

@మందాకిని గారు
కీచ్ కీచ్ అని కూసేప్రతీదీ ఇలకోడే అంటారు మరి మా వూరిలో. అంత వివరంగా నాకూ తెలియదు.
మీ డిక్షనరీ నాకేం తెలుసండీ మరి. నేనన్నది మాత్రం టీ.వీ. నే. :-)

@ఆహ్లాద గారు
అవునండీ మరి.
మీత్తణుకంటున్నారు తణుకు సిటీయేనండీ. మాది పల్లెటూరు. మాదికూడా ఇలామారిపోతే ఎలాఅనేదే నా బాధ.

మావూరాండీ.. ఆయ్.. తణుకు పక్కనేనండీ.
"గోపాల్రాజు గెదెల బేరం" అన్నటపాలో మావూరి గురించి డిస్కషన్ జరిగింది ఓ మారు లుక్కేయండి. :-)

అజ్ఞాత చెప్పారు...

కథ చాలా బాగుందండీ. మీ పోస్ట్లు చాలావరకు ఇంతకు ముందు చదివాను కానీ, ఈ కథలో మాత్రం నాకు వంశీ శైలి బాగా కనిపించింది.
మా అమ్మమ్మ ఊరు/ నేను పుట్టినదీ కూడా ప. గో నర్సాపురం. మీ కథలు చదువుతుంటే మా అత్తా, మామయ్య, వాళ్ళ పిల్లలు, మాట్లాడేది గుర్తొచ్చిందండీ. ఆయ్...
పద్మవల్లి

అజ్ఞాత చెప్పారు...

అయ్యబాబోయ్! మీ ఊరికి ఏమయిందండి?
టివి, సినిమా, రాజకీయాల తెగుళ్ళు పోవడానికి ఏదయినా మందు కొట్టపోయారా?

శ్రీనివాసరాజు చెప్పారు...

@పద్మవల్లి గారు
నా కథలు ఒక్కొక్కరికీ ఒక్కోవిధంగా అనిపిస్తున్నాయి.
నర్సాపురం మన ప.గోనే మరండే ఆయ్.. :-)
ధన్యవాదములు

@బోనగిరి గారు
క్లోరో ఫైరీఫాస్..,కాంటఫ్.. లాఁటి మందులు పొలాలిక్కానీ ఈ తెగుళ్ళకి పనికిరావండే.. ఆ మందేదో కాత్తచెప్పండే.. ఓపాలి కొట్టిచూత్తానో. :-)

అజ్ఞాత చెప్పారు...

నా మనసులో ఆవేదనంతా మీ కధలో కనిపిస్తుందండీ!
కధలోని ప్రతీ వాక్యం ఎంతో శ్రద్ధగా రాసినట్టున్నారు ఆ యాస ఎక్కడా మిస్స్ కాలేదు . మళ్ళీ పూర్వవైభోగం రావటం అన్నది కలేనండీ! అంతా మామూలుగా అనుకుని బాధపడే విషయాన్నే మీరు కధగా మలిచిన తీరు బావుంది . ఆ ఊసు ఈ ఊసు చెపుతూ ఇక్కడే ( మీ బ్లాగులోనే) వుండిపోవాలనుంది. ఇంకా చదవాల్సిన బ్లాగులు చాలా వున్నాయండి . మరిక సెలవిప్పించండి

vasu చెప్పారు...

srinivas garu
maa vuruki emayyindo ani manasuloni vedana anta kadha rupam lo rasaru.chala bagundi.kani ippudu maa vallaki emayindo ani kuda rayalanipistondi.marutunna manasula lo manushulu madhya mamatalu levu ,mundu taraniki rabovu anipistondi.

శ్రీనివాసరాజు చెప్పారు...

@లలిత గారు
నా అవేధనే కాదండీ మా మిత్రులందరి ఆవేదనా ఇదే.. చదివి ఆనందిస్తున్న కామెంటు ఇస్తున్న మీ అందరి ఆవేదనా. పూర్వవైభవం రావాలనే కోరుకుందాం.
నా కథలన్నీ చదువుతున్నందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు

@వాసు గారు
ఉద్యోగాలకోసం ఊర్లు పట్టుకుని తిరుగుతూ.. మనుషుల మధ్య దూరంతో పాటుగా మమతలు కూడా కరువయ్యాయి మీరన్నట్టు.

మీ కామెంటుకు ధన్యవాదములు

Ghanta Siva Rajesh చెప్పారు...

సూపర్ గా రాసారు

Related Posts Plugin for WordPress, Blogger...