10, మార్చి 2010, బుధవారం

గొల్లకావిడి



ఏసవికాలం మొదలైనట్టేవుంది... సాయంత్రం ఆరుదాటగానే
ఎల్లిపోయే పొద్దు ఇంకాసేపు ఉందాంలే.. అన్నట్టుగా ఏడుదాటినాగూడా
అట్టాగేవుంది.. ఎవరో ఆంజనేయసాములోరి గుల్లోంచి..
ఎర్రచందనం బొట్టు తెచ్చి పడమటేపు ఆకాసంమీద రాసారంటావా..
అన్నట్టుగా దగదగా మెరిసిపోతా ఉన్నాడా సూరీడు...

పక్షులన్నీగూటికిసేరుకుంటంకోసం సిన్నపిల్లోడు పలకమీద దిద్దిన
అక్షరాల్లాగా అప్పుడప్పుడూ వొరసగా అప్పుడప్పుడూ వొంకరటింకరగా..
ఎగురుకుంటా ఎల్తావున్నాయు..., ఉమ్ముతడిజేసి చెరిపేత్తావుంటే..
పలకమీద అక్షరాలు మాయమైపోయినట్టుగా కొంతదూరం ఎగిరాకా
అయి ఆకాశంలో కలిసిపోయి మాయమైపోతున్నాయి. గాలింకా ఏడిగా
ఈత్తానే వుంది. గేద్దూడలన్నీ పాలుతీసే ఏలయ్యింది రండ్రాబాబా
అన్నట్టుగా ఆళ్ళరైతులకేసి చూత్తా ఆకల్తో అరుత్తావున్నాయి.

ఎల్లాల్సిన ఊరు రమారమి ఇంకో ఐదు పర్లాంగుల దూరం వుంటంతో,
పొద్దుపోయేలోగా సేరుకొని గుడారాలేసేత్తే.. ఏలకింత వొండుకుని తిని
పొడుకోవచ్చని..ఎరుకులు కంగారు కంగారుగా మేకలమందని..
భుజాలపైనున్న కావిడితో "హే.. హే...", అంటా అదిరిత్తా,
కంగారుపెట్టేసి పరిగెట్టిత్తావున్నాడు. ఎరుకుల్తోబాటే బాటెంబడే..
ఇంకో కావిడి భుజానేసుకుని ఇంటావిడ రత్తమ్మ ఎనకాలే గెలాపెత్తుతాంది.

ఎరుకుల్ది మొగల్తూరు దగ్గరున్న జిల్లేటితిప్ప గ్రామం.., తాతల్నాటినుండీ
వత్తున్న మేకలేపారం తప్ప ఎనకాల పొలాలుగానీ ఆస్తులుగానీలేవు.
ఏ చెడలవాట్లులేకండా.. కష్టపడిపనిజేసి తింటా ఒకరికొకరుతోడుగా
ఉంటారా మొగుడూపెల్లాలు.. పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలులేరు.
ఎరుకులుకి పిల్లలంటే మహాపేనం..కనబడ్డ దేవుల్లందరికీ పిల్లలకోసం
మొక్కులు మొక్కుతుంటాడు.

మామూలు రోజుల్లో ఎరుకులు కూలిపనికెల్తావుంటే..
రత్తమ్మ మేకలమందనేసుకుని మేపుతా సాయంకాలానికి
ఇంటికిచేరుకుంటావుంటాది. ఏసవికాలమొచ్చేసరికి ఊళ్ళో పనులేంలేపోటంతో..
మిగతా జనాలందరిమల్లేనే మేకలమందనేసుకుని గోదావరి లంక గ్రామాల్లో
కొబ్బరితోటల్లోకి మకాం పెట్టేత్తుంటారు. మేకల్తో పొలంపొలం తిరుగుతా..,
కాలీసెలకల్లో గడ్డి మేపిత్తా మేకలెరువుకోసం కొబ్బరితోటల్లో మేకలు తిప్పుతా..
మేక్కింతని తీసుకుంటా సంపాయిస్తావుంటాడు ఎరుకులు.

మేకలెరువు కొబ్బరిమొక్కలకి చాలామంచి బలంకావటంతో మా తోటలోకిరా
అంటే మాదాంట్లోకు తోలు అని ఒక మూన్నాలుగునెల్లు చాలా డిమాండింగా
ఉంటాది మేకలమంద బిగినెస్సు. కొందరైతే తాతలు,తండ్రులనాటి వారసత్తంగా
ఒకే పొలానికి మేకలమందల్ని తోల్తావుంటారు. ఆవూరు, ఈ వూరు మకాంలెట్టి
తిరిగి వానాకాలమొచ్చేసరికి సొంతూరు జేరుకుంటుంటారు ఈ మేకలమందలోల్లు.

ఎరుకులు ఆళ్ళ తాతలకాలంనుండి ఓ ప్రెసిడెంటుగారి కొబ్బటితోటలో
మందలేత్తావుంటాడు. పెతీ సంత్సరం ఇంతా అంతా అని సెప్పకుండా..
సీజన్లో సగం వొకేసోట కదలకుండా మకాం ఉంటంతో..ఇంటావిడ రత్తమ్మ
ఇంతే అడిగావేంటి, ఈ సంత్సరం కాత్త పెంచడుగు అని పోరుపెట్టినా పట్టుంచుకోకండా
ఆ పెసిడెంటుగారు ఇచ్చింది తీసుకుంటా వుంటుంటాడు.. ఇలా నమ్మకంగా
ఉంటవొళ్ళ.. ఎరుకులు ఆళ్ళకి బాగా దగ్గరైపోయేడు. అందుకే.. ఏసాకాలం
వత్తందంటానే ఎరుకులు వత్తాడని.. సుట్టంకోసం ఎదురుసూత్తా
వున్నట్టు సూత్తావుంటాదా పెసిడెంటుగారి కుటుంబం.

"ఈళ్ళ తాతా.. తండ్రి చాలా నమ్మకమైనోల్లండే.. ఏదీ ఆశించేటోళ్ళుగాదు..,
అలానే ఈడు అంతే..", అని ఆ పెసిడెంటుగారు అప్పుడప్పుడూ ఇంటికొచ్చిన
పెద్దలందరితోనూ సెబుతుండేవోడు. ఆ మాటే ఎపుడూ నిలబెట్టుకోవాలన్నట్టు
ఎరుకులు కూడా చానా కచ్చితంగా ఉండేవోడు.

దీపాలెట్టే ఏలకి పెసిడంటుగారింటికి సేరుకున్నారా ఎరుకులు, రత్తమ్మా..
కొబ్బరిసెట్ల మద్దెనున్న దిబ్బలాగా సదునుచేసున్న సెంటుభూమిలో..
గుడారాలేసేసి కావిడిల్తో మోసుకొచ్చిన సామానంతా గుడారాల్లో సద్దేసేడు.
మిగతానేలంతా దుక్కి ట్రాట్టరుతో తిరగబెట్టేయటంమూలానా అంతా
ఎగుడుదిగుడుగా ఉంది.

పెరట్లోవున్న నుయ్యిలోంచి నీళ్ళుతోడి రత్తమ్మందిత్తే, కల్లాపిజిమ్మినట్టు
ఎగుడుదిగుడునేలపై జిమ్మి..,తడిపేసి..., చెక్కముక్కతో మట్టిబెడ్డలన్నీ
అనగ్గొట్టేసి.. దానిమీద వొట్టిగడ్డేసి.. మేకలు పడుకోటానికనువుగా నేలంతా
సదునుచేసేసేడు..

సెనాల్లో కర్రల్తో కంచేసేసి.. మేకల్నందులోకి తోలేసేడు, మందకి కాపాలాగా
వున్న పెంపుడు కుక్కని కంచెకి కట్టేసేడు. ఇదంతా అయ్యేసరికి
బాగాసిమ్మచీకటైపోయింది. పెసిడెంటుగారి భార్యయిచ్చిన అన్నమూ..
ఎండుచేపలకూరేసుకుని ఆ పూటకి అన్నాలు కానిచ్చేసేరు.

అమావాస్యగావటం వొల్ల.. కారుసీకటిగావుంది.. ఎక్కడో దూరంగావున్న
పంచాయితీ ఈదిలైటుకాంతి కొబ్బరిచెట్లమద్దెనుండి బంగార్దారాల్లాగా గుడారాల
దగ్గరగా అక్కడక్కడా పడతావుంది.., ఆ కాంతి తప్ప సుట్టూరా
కటికసీకటికొట్టులాగుంది. ఎక్కడో దూరాన అరుత్తున్న ఈదికుక్కలరుపులు,
ఆమడ దూరంలోవున్న పంటచెరువు సుట్టురావున్న రుప్పల్లోంచి వొత్తున్న
బాండ్రుకప్పల అరుపులు.. ఇనిపిత్తావున్నాయి.. ఇవేమి ఎరుకులు నిద్రని
ఆపలేపోయాయి.. పొద్దున్నుండీ నడిసి నడిసి అలిసిపోయిన శరీరమోమో..
నడుంవాల్చగానే నిద్రలోకిజారుకున్నాడు. సరిగ్గా నడిరేత్రికాడ..
ఆకాశంలో గొల్లకావిడి నడినెత్తికొచ్చినేల కంచెక్కట్టేసిన కుక్క ఇంతగా
అరవటంమొదలెట్టింది.

ఆ అరుపుకు ఉలిక్కిపడి లేసి కూర్సున్నాడు ఎరుకులు..
రత్తమ్మ ఉలక్కపలక్క పడుకునుంది. దగ్గరేవున్న సేతికర్ర తీసుకుని బయటకొచ్చి
సుట్టూరా సూసిన ఎరుకులుకి ఎవరూ ఆనలేదు.. వొక ఐదునిమిషాలలాగే సూసి..
ఏదోఅయ్యింటాదిలే అని ఎనక్కితిరిగి గుడారంలోకి ఎల్లిపోబోతున్నోడే..
మేకల మందమద్దెలో ఎదో సెబ్దం వొత్తన్నట్టుగా వుందేంటాని..
సేతికర్ర సంకనెట్టుకుని ఇలాయిబుడ్డి ఎలిగించి సెబ్దం వత్తున్నేపు నడిచేడు..

మందలోవున్న మచ్చలమేక నిలబడి ఈన్తా కనబడింది. గబగబా సేతికర్ర
కిందడేసేసి.. కంచెగేటు తీసి.. లోపలికెల్లి.. ఇలాయిబుడ్డి పక్కనెట్టి..
ఆ మచ్చలమేకెనకాల వొత్తుగా వొట్టిగడ్డేసేసేడు, అడ్డంగా పడుకున్న మేకల్ని
అదిలించి పక్కకి తోలేసి కాలీచేసేడు. కాసేపటికి ఆ మచ్చలమేక వో
తెల్లమల్లిపువ్వులాంటి తెల్లపిల్లని.. వో నల్లకాకిలాంటి నల్లపిల్లనీ ఈనింది.
ఎరుకులు ఆనందంతో పొంగిపోయేడు.. సర్కస్లో ఆకాసానికి ఏసిన లైటంత
ఎలుగులాగా కొబ్బరిసెట్ల మద్దెన ఎరుకులు మొహం ఎలిగిపోతావుంది. పుట్టిన
మేకపిల్లల్ని గడ్డితో అంతా సుబ్రంచేసేసి.. నీరసంగా పడుకునున్న మచ్చలమేకకి
మూట్లోవున్న పచ్చగడ్డితెచ్చి ఏసేడు.

"ఎమే.. బంగారాలు పుట్టేయే.. లేవ్వే..., ఇంతొరకూ సిన్నమచ్చగూడాలేని మేక
మన మందలోనే లేదే.. అదీగాక ఒల్లంతా మచ్చలున్న మేక్కి.. ఏ మచ్చాలేకండా..
ఇలా తెల్లదొకటీ నల్లదొకటీ పుట్టిందంటే నాకు ఆచ్చర్యంగావుందే.. ఎప్పుడో మా
తాతదగ్గర సూసానే ఈ ఇచిత్రం.. మల్లా మన మందలో సూత్తన్నాను...
ఈటిని మన సొంత పిల్లల్లెక్క చానా పేనంగా పెంచాలే..", అని తెగ మురిసిపోతా
అప్పుడే పుట్టిన మేకపిల్లల్ని గడ్డితట్టలో అట్టుకొచ్చి నిద్రమత్తులోవున్న
రత్తమ్మకి సూపించేడు.

తెల్లార్లు నిద్దర్లేకున్నా ఎరుకులు మొహం ఇంకా ఆనందంతో ఎలిగిపోతానేవుంది..,
ఆ ఎలుగులోనే ఎలుగొచ్చేసి తెల్లారిపోయింది.

"రాత్రి గొల్లకావిడి నడినెత్తికొచ్చినేల పుట్టాయి బాబయ్యా... నల్లబంగారం.. తెల్లబంగారం
అని పేర్లెట్టేను బాబయ్యా..., ఆ దేవుడిచ్చిన బిడ్డల్లెక్క అనిపిత్తాందండే మాకు..,
ఈ సంత్సరం ఈడకొచ్చిన మొదట్రోజే బాగున్నట్టుందండే.. ఈటిని మాత్రం
పోలేరమ్మమొక్కుకి పెంచమని ఎవరడిగినా ఇయ్యనండే... మీక్కూడా జెప్తున్నానండే..,
ఈసారడక్కండే బాబా" , అంటా పెసిడెంటుగారికి పొంగిపోతా సెప్పేడు ఎరుకులు.

"ఏంట్రో.. అంత ఇచిత్రమేముందీటిల్లోనో", అంటా చమత్కరించాడు పెసిడెంటుగారు.

"రాతిర్నుండీ సూత్తన్నానండే బాబా ఈడి గోలెంటో.. ఇలానే పిచ్చిపిచ్చిగా
మాటాడేతున్నాడండే... మచ్చల్లేకండా పుట్టమే గొప్పంటాడండే.." అని రత్తమ్మ
ఎరుకులొంక కొరికేసినట్టు సూత్తా పెసిడెంటుగారికి సెప్పింది..

"సరేలేరా.. అంతపేనంగావుంటే నువ్వేపెంచుకో.., నేనేమడగను.., సర్లేగానీ ఎల్లి
ఆమందని కాలవేపు తోటలోకి తోలు ఈరోజు..", అని ఎరుకులుకి పనొప్పజెప్పేడు
పెసిడెంటుగారు.

కావిడికి కట్టుకెల్లాల్సిన మంచీల్లు గిన్నె, వొన్నందాకా పక్కనడేసి... కావిడికి
వోఏపు నల్లబంగారాన్ని.. వేరెఏపు తెల్లబంగారాన్నికట్టి భుజానేసుకుని
మెకలమందెనకాల బయల్దేరేడు ఎరుకులు..

"అదేంటయ్యో..!, ఇయ్యెవడు.. అట్టుకొత్తాడు.., ఆ రెంటినీ ఎదరగట్టి..
ఎనకియ్యిగట్టొచ్చుగాదా..?, మద్దేనం ఏం తింటావేంటీ.. గడ్డీ?", అని రత్తమ్మ
సిరాకుపడిపోతా తిట్టేసింది ఎరుకులు సేత్తున్న పన్జూసి.

"నువ్వేరే కావిడిక్కట్టుకోఏహే..!, ఇది.. గొల్లకావిడే.., ముందో సుక్క.. ఎనకో సుక్క..
మద్దెన నేనో పెద్ద సుక్క.. మేం ఈపాల్నుండీ.. ఏడకెల్లినా.. ఇట్టానే ఎల్తామే..
నీఎదగ్గోలాపి ఎనక రాఎహే.." అంటా చిర్రుబుర్రులాడిపోయాడు రత్తమ్మపై.

నాలుగు నెల్లు గడిసేయి.. ఆ మేకపిల్లల్ని రాత్రుల్లు పక్కలోనే పడుకోబెట్టుకుంటా..
బూమ్మీదస్సలు కాలెట్టనియ్యకుండా.. పగటేల కావిడిగట్టి.. మోత్తా.., మేకలకిష్టమని
ఎవరెవర్నో బతిమాలి పనసాకులు కోసుకొచ్చి మరీ మేపిత్తా.., బంగారాలూ.. అంటూ
ముద్దుముద్దుగా పిలుత్తా.. పేనానికి పేనంగా పెంచుకుంటన్నాడు ఎరుకులు.

వోరోజు పెసిడెంటుగారు పనోళ్ళురాపోతే.. కొబ్బరితీత లారితోపాటెల్లి పక్కూర్లో
లోడుదించేసేకా లెక్కట్టుకొచ్చే పన్చెప్పే రు ఎరుకులుకి, ఎప్పుడూ ఆ పిల్లల్ని
ఇడిచిపెట్టనోడు.. ఇడిచిపెట్టి ఎల్లాల్సొచ్చింది. పొద్దున్నెల్లినోడు.. సాయెంత్రమేలకి
సేరుకున్నాడు...

ఇంటి దగ్గర తోటకో పర్లాంగు దూరంలోవున్న పంటకాల్వ తూము
దగ్గరకొచ్చేసరికి.. ఆల్ల గుడారాల దిబ్బదగ్గర జెనంపోగడ్డట్టు అనిపించి
వొక్కసారే లగెత్తుకుంటా నాలుగంగల్లో ఇల్లుసేరుకున్నాడు.. అక్కడ రత్తమ్మ
సోకండాలుపెడతా ఎడుత్తావుంది... ఎదురుగ్గా కదలకుండా మెదలకుండా
నాలుకలు బైట్టెట్టేసి అటొకటీ ఇటొకటీ పడున్నాయి మేకపిల్లలు..

అదిసూసిన ఎరుకులు.. నోటమాటపడిపోయినట్టైపోయి.. తలట్టుకుని
నేలపై కూలిపోయేడు... అప్పుడే మందుకొట్టిన మినపసేనులో రొట్టతినేసాయంటా..
పేనంగా సూసుకుంటున్న బంగారంలాంటి రెండుమేకలు సచ్చిపోయినియ్యని..
అక్కడ గుంపులో జనాలు సెప్పుకుంటున్నారు.

సీకటిపడింది... రత్తమ్మని వోదార్సి వోదార్సి ఎక్కడజనాలక్కడికెల్లిపోయేరు...
సత్తుగిన్నెలో అన్నంపెట్టుకొచ్చి.. తినొయ్యా అంటా చానాసేపు ఎరుకుల్ని
బతిమలాడింది.. రత్తమ్మ. ఎంత కదిపినా మాటాడకుండా అలానే కూర్చుండిపోయేడు..,
ఇకబతిమాల్లేక.. కంచం అక్కడేపడేసి తానూఏమీ తినకుండా ఎల్లి పడుకుంది రత్తమ్మ.
రోజూలాగే ఆకాశంవైపుచూత్తా పడుకున్నాడు ఎరుకులు..

నడిరేత్తిరైంది... ఆ రోజూ అమావాస్యే అయ్యుంటుంది.. మళ్ళా కటికసీకటికొట్టు..
అయే.. పంచాయితీ ఈదిదీపాలకాంతి..
అయే కుక్కలరుపులు..
అయే.. బాండ్రుకప్పల గాండ్రింపులు.. అలా ఇనపడతానేవున్నాయి..
గొల్లకావిడి నడినెత్తికొచ్చేసింది..
ఎరుకులు అలానే కళ్ళుతెరిచీ చూత్తానేవున్నాడు.. చూత్తానేవుండిపోయేడు..
ఆ కళ్ళలోంచి సూత్తానే పేనాలొదిలేసేడు...

32 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హాయిగా తెలుగు చలన చిత్ర రంగానికి వెళ్ళకూడదూ? ఇప్పుడు వస్తూన్న సినిమాల భాషేనా మారుతుందీ? ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో డయలాగ్గులు భరించలేకున్నాము.నీలాటివాడి చేతిలోనే ఉంది, దాన్ని బాగుచేయడం!

sathibabu akella చెప్పారు...

మంచి కథ.
-సత్తిబాబు.

Sravya V చెప్పారు...

మరీ ఇంతా గా పసలపూడి కధల ప్రభావం ఉంటే ఎలాగండి :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఫణిబాబు గారు
వెళ్ళాలని ఉందండీ.. కానీ పిలిచిఎవరిస్తారు చెప్పండి.
ఒకవేళ వెళ్ళినా.. ఇలాంటి సినిమాలొస్తాయనుకుంటున్నారా? రానేరావు..
కధ డైరెక్టరుకి నచ్చాలి.. నిర్మాతకి నచ్చాలి.. వాళ్ళబావకి బామ్మర్దికి.. ఆఖరికి సిద్దాంతులకి కూడా నచ్చాలి గురువుగారు.. :)

@సత్తిబాబు గారు
కధ మీకు నచ్చినందుకు సంతోషం.

@శ్రావ్య గారు
పసలపూడి కధలు నేను చదవనేలేదండి.. నేను మా దిగువగోదారి కధలు ఒక నాలుగైదు చదివుంటాను అదికూడా స్వాతి వారపత్రికలో.. కాస్త ఆ ప్రభావం వుండుండొచ్చు కానీ, వాటికి నకలు కాఫీ కానంతవరకు కొంత ప్రభావం తప్పులేదని నా భావన

కౌటిల్య చెప్పారు...

కథనం చాలా బాగుంది....ప్రకృతి వర్ణనైతే మరీను...అలా కళ్ళముందు కనబడుతోంది... కాని చివర్లోనే మరీ ఏడిపించేశారు....

Padmarpita చెప్పారు...

చాలా బాగుంది...కథనంతో చివర్లోనే ఏడిపించేశారు!

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు
నా శైలి, కధనం నచ్చినందుకు చాలా సంతోషం

@పద్మర్పిత గారు
కధ నచ్చినందకు సంతోషం
---

చివర్లో ట్విస్ట్ లేకపోతే బాగోదండీ.., కాస్త మనసుకి తగిలినట్టుగా వుంటేనే టైటిల్ కి అర్ధం వస్తుందని అలా రాయాల్సొచ్చింది. :)

Unknown చెప్పారు...

chaala baagundi...telugu slang vareity gaa undi.

enni visual effects, HD cameras, 3D technologies unna..ila telugu kathalu chadivithe vachhe imagination, satisfaction raadu..

శ్రీనివాసరాజు చెప్పారు...

@శ్రవణ్ కుమార్ గారు
అవును మీరన్నట్లు, 3D, గ్రాఫిక్స్ లాంటి ఎన్ని సాంకేతిక పద్ధతులు వచ్చినా కధ చదువుతున్నప్పుడు మన ఊహల్ని మించిన చిత్రాన్ని మన కళ్ళకు ఏ టెక్నాలజీ చూపించలేదు. ఈ బిజీ బిజీకాలంలో పస్తకం కొని చదవటం కాస్త కష్టమైనదే.. అందుకే మనలాంటి వారంతా కలిసి ఈ ఈ-తెలుగుకు ఊతమివ్వాలి.

అలానే మీరుకూడా మంచి మంచి స్వచ్ఛమైన.. తెలుగుపాటలు చెయ్యాలని, మనది పాతపద్దతి అని అందరూ అనుకున్నాపర్వాలేదు.. కానీ మోడ్రన్ మోడ్రన్ అంటూ తెలుగును ఖూనీ చెయ్యకుండా.. తేనెలొలుకు తెలుగుపాటలు మాకు అందించాలని కోరుకుంటున్నా. నా వంతు సాయం నేనందిస్తా :)

PaRaDoX చెప్పారు...

@srinivas garu

paina andaru cheppinattu gane adhyantham kada chaduvuthunnanta sepu edo oka palle lo unatte antha naa kallatoh chusthunatte undi!! rasina vidhanam varnana lo ne mee shaili kanipisthundi!! erukulu ane patra lo meeru bhoota prema ni kallaki kattinatte chupincharu kada asalu . chirava lo erukulu chanipoyadu ani telsi okintha badesindi kuda.

PaRaDoX చెప్పారు...

Oka comment rayatam adi kuda intha manchi post ki enduko anyayam anipinchindi andi srinivas garu !! anduke ee rendo post kuda :) btw meeru inka enno enno paatalu raayali ani avanni sravan manchi music ivvalani korukuntunna!! koncham patalu rayatam lo melakuvalu nerpisthe naa vanthu ga nenu kuda kurshi chestha ani manavi . india osthe tappakunda mee darshana bhagyam maaku kaliginchandi :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ అశ్విన్ గారు
ఈ కధ నచ్చినందుకు చాలా సంతోషం.. మీరు రెండు కామెంట్లు రాసినందుకు ధన్యవాదములు.

ఇండియా వస్తే దర్శనం కోసం వెయిట్ చేయించేంత పెద్దవాళ్ళంకాదుగానీ.. వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం.

శ్రీనివాస చెప్పారు...

కథ బాగుంది బావోయ్! నాకయితే యాసలో పసలపూడి ఊసులో అమరావతీ కథలు మెదిలాయ్! అయినా చోద్యంగానీ బావా; బ్రహ్మీ సాఫ్ట్‌వేరేంటి, ఇలాంటి కథలు రాయడమేంటి! టూ మచ్‌చ్‌చ్ ;-) (ఏదో సరదాకి)

బాటసారి చెప్పారు...

katha, kathanam chaala chaala bagunnayi sir.
katha chaduvutunnanta sepu "pasalapudi kathalu" chaduvutunnattuga anipinchindi.

keep blogging !

శ్రీనివాసరాజు చెప్పారు...

@బాటసారి గారు

కధ నచ్చినందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు..

rākeśvara చెప్పారు...

మీ బ్లాగు మొదటి సారి చదవడం। మాదీ పచ్చింగోదారే। నేనైతే ఇక్కడే నివాసం వుంటున్నాను కూడా।
కథా కథనం చాలా బాగున్నాయి గానీ, చుక్కల విషయంలో లెక్కలు చాలా తప్పయ్యాయి।

చుక్కల మీద కథ వ్రాసేటప్పుడు జోతిష్యం కాస్త తెలుసుకోవాలి। ఏ మాసంలో ఏ చుక్కలు ఎన్నింటికి పొడుస్తాయన్నది।

సరిగ్గా అర్థరాత్రికి సరిగ్గా నడినెత్తికి గొల్లకావిడి చేరుకునేది ఉత్త మార్గశిరమాసంలో అంటే దశంబరంలో (డిసెంబరు)। కానీ మీ కద వేసాకాలం కద అంటున్నారు। కాబట్టి కుదరలేదు।
పైపెచ్చు పిల్లలు చచ్చేసరికి నాలుగు నెలలయిందన్నారు। నాలుగు నెలల తరువాత అదే యేళకి అయ్యే సుక్కలు అక్కడికే రావడం జరిగిందంటే, ప్రళయం సంభవించినట్లే।

కావాలంటే ఈవాళ సాయంత్రం సూడండి, పొద్దుతోబాటు వాలిపోతుంది గొల్లకావిడి। కృత్తికా కార్తె కాబట్టి। వేసవి కాలంలో కనబడే ఆస్కారం లేదు।
వికీపీడియా నుండి - "In the northern hemisphere it(Orion) is a winter constellation".

ఈ చిన్న విషయం తప్పించి మిగిలిన కథ బాగుంది। ఈసారి మన గోదారిసీమకు వత్తే నాకు తెలపండి। కలుద్దాం।

రాకేశ్వర
౯౫౫౦౧౭౦౪౭౧

అన్నట్టు జల్లిసీమ మీదఁ నా కవితఁ జూడండి।

శ్రీనివాసరాజు చెప్పారు...

@రాకేశ్వరావుగారు
చాలా మంచి అభిప్రాయం రాసారు. సంతోషం
మీరన్నట్లు కాస్సెప్టు అనుకున్నప్పుడు అంతలా నేను ఆలోచించలేదు. జోతిష్యం అంటే అదొక పెద్ద సముద్రంలాంటిది.. అదంతా నాకు తెలియదులేండి. అసలు ఆలోచనవచ్చివుంటే కాస్త పరిశోధన చేసేవాడిని.

ఇలాంటి అభిప్రాయాలకోసమే ఎప్పట్నుండో ఎదురుచూస్తున్నాను. ఇకపై ఏదిరాసినా కాస్తఅలోచించి రాయటానికి మీ ఈ సలహా నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మీరిలానే నా బ్లాగుచదువుతూ మంచిమంచి అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. :)
ధన్యవాదములు.

వీలున్నప్పుడు తప్పకుండా కలుద్దాం

కొత్త పాళీ చెప్పారు...

గుండెలు పిండేశావ్ బాస్

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్త పాళీ

మొత్తానికి గుండెలు పిండగలిగానన్న మాట.. :-)
మీకు నచ్చినందుకు సంతోషం.
ధన్యవాదములు

స్వామి ( కేశవ ) చెప్పారు...

ఎరుకులు అలానే కళ్ళుతెరిచీ చూత్తానేవున్నాడు.. చూత్తానేవుండిపోయేడు..
ఆ కళ్ళలోంచి సూత్తానే పేనాలొదిలేసేడు.

పేనానికి పేనంగా పెంచుకున్నబంగారాల్లాంటి పిల్లలు ఆడు లేకుండా ఉండలేవనుకున్నాడో ఏమో ఆటికి తోడుగా ఎల్లిపోయేడు ఎరుకులు.


పిల్లల్ని పేనం పెట్టి పెంచేడు, పేనం గా పేమించేడు, అందుకే ఆటి కోసం పేనాలొదిలేసేడు



సేన బాగ రాసేవన్న ,
గుండెని అత్తుకుంది , అందుకే నేమో ఎరుకులు మన దగ్గరి బొందువై పోయేడు , తెలియకుండానే కళ్ళు వర్షిత్తున్నాయి .నాకు తుడవాలనికూడా అనిపించట్లేదు .

ఇట్టాంటి కతలు సేనా రాయాలని నేను కోరుకుంటున్నాను,

శ్రీనివాసరాజు చెప్పారు...

@నీకోసమే నా అన్వేషణ గారు
హుమ్మ్.. నేను సింపుల్ గా ముగించినదానికి... మొత్తానికి ఒక కొత్త శుభంకార్డు డిజైన్ చేసారు..బాగుందండీ :-)

ఇక స్పందన చూస్తుంటే.. కధబాగా గుండెలకు హత్తుకుంది అని స్పష్టంగాతెలుస్తుంది. నాకు చాలా ఆనందంగావుంది.
ఇలాంటివే ఇంకా రాయటానికి ప్రయత్నిస్తాను.
మీరిలానే స్పందిస్తూ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు

ఆ.సౌమ్య చెప్పారు...

చివరికి నాకేడుపొచ్చిందంతే నమ్మండి. ఏమిటొ ఆ మేకపిల్లలు నా కళ్లల్లో తిరుగుతున్నాయి ఇంకా. సూపరండీ. మనసుకి హత్తుకుపోయింది. మీరు నిజంగా సినిమాలలోకి రావచ్చు కదా. కథలు, భాష రెండూ బాగుపడతాయి. మీకా ఉద్దేశ్యం ఉంటే చెప్పండి. నాకు చేతనైన సాయం చేస్తాను.

హరే కృష్ణ చెప్పారు...

Excellent
చాలా బావుంది

శ్రీనివాసరాజు చెప్పారు...

@సౌమ్యగారు
కధనచ్చినందుకు చాలా సంతోషమండీ..

సినిమాలలోకి రావాలనేవుందండీ.. కానీ అది ఆషామాషీ ఫీల్డ్ కాదండీ.. దానికి ముందుగా చాలా కసరత్తుఅవసరం. అదే ప్రస్తుతానికి మేం చేస్తున్నది. మేం అన్నామంటే ఒక టీమ్.. నేను కధలు రాసేవాడిగా కాదు.మరో సరికొత్త కోణం.. పాటలు రాయటంలో ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాను. మీరు కధలు.. పాటలూ రాస్తారా అయితే ఎక్పీరియన్స్ ఉందా అని ఎవరిని కలిసినా అడిగే మొదటి ప్రశ్న కదా.. ఆ ఎక్పోరియన్స్ కోసమే కొన్ని ట్రాక్స్ తయారు చేసుకుంటున్నాం. ఎవరిదగ్గరికీ వెళ్ళి అడగాలని లేదు.. ఎవరోకరు మా దగ్గరకు రాకపోతారా అని సమయంకోసం ఎదురుచూస్తున్నాం. ఈలోపు మేం కూడా కాస్త కాన్పిడెన్సు బిల్డ్ చేసుకోవచ్చుకదాని.. అంతే.

ఉదాహరణకి ఇక్కడచూడండి.
ఒక తొంబైనిముషాల డివిడి మూవీ ఒకస్నేహితుడు తీసాడు.. ఆ సినిమాకు నేను నాలుగు పాటలు రాయటం జరిగింది. శ్రవణ్ కుమార్ అని మంచి మ్యూజిక్ చేస్తాడతను.. నన్ను పాటలరచయితగా చూస్తారోలేదోగానీ.. అతన్నిమాత్రం ఖచ్చితంగా తెలుగిండస్ట్రీలో మీరే చూస్తారు త్వరలో. మేమంతా ఇప్పుడు ఒక వీడియో సాంగ్ కూడా చేస్తున్నాం.
http://weekendcreations.com/telugu_short_film.php?film_id=10

మీ మెయిల్ ఐడికోసం వెతికాను దొరకలేదు. కాస్త నా మెయులుకు ఒక మెయిలు పంపించండి మీకు చేతనైన సాయం ఏంటో వివరంగా మాట్లాడదాం.. :)


@హరే కృష్ణగారు
ఈ టపా మీకు నచ్చినందుకు సంతోషం
మీ స్పందనకు ధన్యవాదములు

శ్రీనివాసరాజు చెప్పారు...

నా పాటలలింకులను ఇక్కడిస్తున్నాను
డౌన్లోడు చేసుకుని.. విని.. మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.


http://www.weekendcreations.com/downloads/audio/needa/Needa-TheTheme.mp3

http://www.weekendcreations.com/downloads/audio/needa/Needa-Edaariga.mp3

http://www.weekendcreations.com/downloads/audio/needa/Needa-EdoEdoDooram.mp3

http://www.weekendcreations.com/downloads/audio/needa/Needa-ChalRe.mp3


పాటలు ప్రత్యోకంగా ఆ కధకు సరిపోయేటట్టు రాయటం జరిగింది.. వీలుంటే పైన ఇచ్చిన లింకులో (నీడ) సినిమా కూడా చూడగలరు.

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

చాలా బాగుందండి.

ఆ.సౌమ్య చెప్పారు...

ఇప్పుడే పాటలనీ విన్నాను...మీకు నిజంగానే మంచి భవిష్యత్తు ఉందండీ.

"ఎపుడూలేని భయమే ఎదురై పీడకలగా
ఎవరూలేని క్షణమే ఎరగా మర్చుకోగా"....చాలా బావుంది.

మీకు మైల్ చేస్తాను.

బ్లాగులో ఏ.వి.యెస్ గారున్నారు. మీకు తెలుసో లేదో? ఆయనకీ ఓ మారు మీ టపాలు చూపించండి.
http://avsfilm.blogspot.com/

శ్రీనివాసరాజు చెప్పారు...

@సాయికిరణ్ గారు
ఈ టపా నచ్చినందుకు సంతోషమండీ..
ఇలానే చదివి మీ అభిప్రాయం చెబుతారని ఆశిస్తున్నాను.

@సౌమ్యగారు
పాటలు నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. :)

ఏవియస్ గారి బ్లాగు చూసాను.., చాలా మందికి అది ఆయన బ్లాగు కాదు అని అనుమానాలు కూడా కలిగాయి.. అయినా బ్లాగులో పోస్టుచేస్తే అసందర్బంగా వుంటుందండి..

భావన చెప్పారు...

రాజు గారు, బాగా రాసేరండి కధ. పాపం అనిపించింది ఆ అరుకులు ను తలచుకుంటే. పాటలు కూడా బలే రాసేరండి. ఇప్పుడు వింటున్నా.
"ఏదో ఏదో దూరం" ఇంకోంచం ట్యూన్ మారిస్తే బాగు అనిపించింది. సాహిత్యం చాలా బాగుంది. హింది పాట కూడా సాహిత్యం బాగుంది కాని ట్యూన్ గొప్ప గా లేదు. మిగతా రెండూ పాటలు బాగున్నాయి.
ఐతే తొందరలో సూపర్ సింగర్ లో చంద్ర బోస్ గారిలా మిమ్ములను చూసి ఈ పాటల రచయత మాకు తెలుసు అని చెప్పుకోవచ్చు అన్నమాట. Good luck.

శ్రీనివాసరాజు చెప్పారు...

@భావన గారుర
కధనచ్చినందుకు చాలా సంతోషం.

పాటలు ఓపికగా విని మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు.

ట్యూన్ల విషయం శ్రవణ్ కు తెలిజేస్తాను... సాహిత్యం నచ్చినందుకు సంతోషం...
:-) ప్రస్తుతానికి అంత పెద్దపోలికలెందుకులేండి.
ధన్యవాదములు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@భావన గారుర
కధనచ్చినందుకు చాలా సంతోషం.

పాటలు ఓపికగా విని మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు.

ట్యూన్ల విషయం శ్రవణ్ కు తెలిజేస్తాను... సాహిత్యం నచ్చినందుకు సంతోషం...
:-) ప్రస్తుతానికి అంత పెద్దపోలికలెందుకులేండి.
ధన్యవాదములు.

Ennela చెప్పారు...

అపర్ణ పుణ్యమాని,పగోజి మాండలికంలో కథ చదివే అవకాశం వచ్చింది...చాలా బాగా వ్రాసారండీ...

Related Posts Plugin for WordPress, Blogger...