4, జులై 2010, ఆదివారం

గిద్దావోళ్ళ గవర్రాజు



గవర్రాజు మీసం మెలెడితే సమిశ్రగూడెం ఊరుజనాలంతా గజగజలాడిపోతారంతే...!!
పరగడుపునే లేచి పందుంపుళ్ళ నోట్లోఎట్టుకుని... పొలంగట్లన్నీ ఓమారు
తిరిగొచ్చేసి... పచ్చికోడిగుడ్లు సితక్కొట్టుకుని నోట్లో ఏసుకుని జుర్రేసి..
ఓ పెద్దలోటాడు పొదుక్కాడి పాలు ఎత్తిందించకుండా గేది కుడిత్తాగినట్టుగా
తాగేసి.. జబ్బమీదేసుకున్న జరీ కండువాతో మూత్తుడుచుకుని.. మళ్ళా
వొన్నమేలకీ కోడిక్కోడీ లాగించేసి... పదిమంది తినే తిండితింటా..
కసరత్తులు చేత్తా.. కండలట్టిన సెరీరంతో.. గొర్రిపోతుమీసాలేసుకుని
సూసినోడికెవడికైనా సరే ఎన్నులోంచి వొనుకుపుట్టేలా ఉంటాడా మనిషి.

ఎపుడో తాతలకాలపు పదెకరాలపొలం పనోల్లనిబెట్టి వెవసాయం చేయిత్తా,
పెట్టుబల్లూ కర్సులూ పోగా మిగిలిన నాలుగింజల ధాన్యం ఇంటెనకాల
పెద్దగాదెలో పోయించేత్తా... అయే ధాన్యం వర్షాకాలమొచ్చేసరికి
బియ్యమాడింతా.. పొలంగట్లమీద కాయగూర్లూ, ఆక్కూర్లూ పండింతా..
ఇంటెనకాలా గెదెల సావిట్లో పాలేర్లన్నెట్టించి రెండు జర్సీ ఆవులూ...
నాలుగు రింగులు తిరిగిన బొబ్బిలి గేదెపెయ్యల్నీమేపిత్తా.. తిండికీ..
వంటకీ.. పాడికీ ఏలోటూరాకండా కాలంగడిపేత్తుంటాడు గవర్రాజు.

సిన్నప్పుడే అమ్మాబాబూ గోదార్లో పడవమునిగిపోయిన పెమాదంలో పోటంతో
కంటికిరెప్పలాగా సూసుకుంటా.. చానా గారంగా పెంచిపెద్దసేసింది ఆళ్ళ నానమ్మ.
ఆ గారంతోనే తినేసి వూరిమీదడి తిరుగుతా.. ఆళ్ళమీదా ఈళ్ళమీదా పందేలుకాత్తా
వుంటాడు గవర్రాజు. డి. ముప్పారం. కోరుమావిడీ.. గోపారం.. కోరుపల్లీ.. పెండేలా..
సుట్టుపక్కలూళ్ళలో ఏడాడికోసారి జరిగే కోడిపందేలు, కర్రసాములు, కుత్తీపోటీలూ..
ఎడ్లపందేలేగాకండా, సీజన్ని బట్టి ఆళ్ళూళ్ళో జనాలందర్నీపోగేసి.. ఎరైటీ..ఎరైటీ పందేలు
కట్టండంలోనూ.. అయి గెలిసి మీసం మెలేసి.. తొడల్సరసడంలోనూ గిద్దావోళ్ళ గవర్రాజుకి
మించినోడు నిడదోలు సుట్టుపక్కలున్న ఊళ్ళలోనేగాదూ.. పచ్చింగోదారిజిల్లాలోనే లేడు..
అని జనాల్లో మాంచిపేరుసంపాయించేడు. పెద్ద గజ్జెనగాడికి తోకలాగా ఎనకే తిరిగే
జనాలుకూడా బాగా గాలికొట్టి వుబ్బేసి గాల్లోకిలేపి గవర్రాజుకి ఫుల్లు సపోర్టింగుగా
వుంటుంటారు.

అదేవూళ్ళో దిబ్మీదున్న రైసుమిల్లు బుల్లెంకడు కొడుకు పెద్దరావుడికీ.. గవర్రాజుకీ
సెనంకూడా పడదూ... వాడెడ్డెం అంటే గవర్రాజు తెడ్డెం అనీ... ఈళ్ళిద్దరూ ఎపుడూ
పందేలుకాసీ.. కొట్టుకుంటా.. పంచాయితీలెడుతుంటారు. ఇద్దరూ బాగా బలిసున్నోళ్ళు
కాటంతో.. ఎవర్నీ ఏమన్లేకా.. సద్దిచెప్పిసి.. సిన్నపిలల్నితిట్టినట్టు ఓ నాలుగు సిలకతిట్లు..
తిట్టీ.. చేతుల్దులుపుకుంటారు వూరి పెసిడెంటు రాంబెమ్మంగారు.

పెద్దరావుడు ఎన్నిమార్లు గవర్రాజు చేతిలో వాడిపోయినా.. కాసినపందెమేగాసీ..
చేద్దురద తీర్చుకుంటుంటాడు గానీ.. తన బుద్దిమాత్రం మార్సుకోడూ...
అలాని... ఇద్దరూ ఒకల్నొదిలొకరు, ఒకరికంటొకరు పడకుండా తిరుగుతారా! అంటే..
అదీలేదూ.., ఎపుడూ.. కొత్తగా బండికట్టిన జోడెద్దుల్లాగా అటుఇటూ లాక్కుంటా పీక్కుంటా
కలిసే తిరుగుతుంటారు.. పందాలేసుకుని కొట్టుకుంటొంటారు.. ఈళ్ళిద్దరి
పందేలగొడవేమోగానీ.. జనాలకు ఈళ్ళమధ్య పందెముందంటేనే.. తానాలు..
వొన్నాలు.. మానేసి తెగెగబడిబోయి.. ఫ్రీగా ఈదిసినమా సూసినట్టు సూసేత్తా..
ఈళ్ళేసేత్తా తెగ సంబరబడిపోతుంటారు.

ఆకాసమంతా మూసేసి ముసురేసేసిని నల్లమేగాలు... అప్పుడుదాకా ఉగ్గబెట్టుక్కూచ్చున్నట్టు
కూర్సుని.. వొక్కసారిగా కుంబరుష్టి కురిపించేసి.. తెల్లబడిపోయేయి. ఎండిపోయున్న నేల
వానసినుకులకి తడిసి తాటిరొట్టికాలుత్తాకి పైనేసిన.. ఎర్రక్కాలిన పిడకముక్కల్లాగా
పొగలుకక్కేత్తావుంది. వానకు తడిసి.. బీటల్దీసేసిన నల్లరేగడ్నేల్లోంచీ.. వత్తున్న
మట్టివాసన.. తడిసిన సన్నజాజిపూల వాసన్తో కలిసీ ముక్కుపుటాలదిరే సువ్వాసనతో
మత్తేక్కిచ్చాంది.. నిద్రగన్నేరు చెట్లమీద వాలిన కాకులు వానదెబ్బకు వొనుకుతా..
కావుకావుమని కల్దిరుగుతా గోల్చేసేత్తున్నాయి. కలుపుతీతకెళ్తున్న జనాలు
వానదెబ్బకి ఎక్కడ జాగావుంటే అక్కడ నక్కేసి సీరకొంగులూ.. కండువాలు తలపై
ఏసేసుకుని ఆ కాకుల్లాగే మునగలాగేసేరు...

గవర్రాజు వర్సానికి గేదెల్చావిడి పాకలో పంచెగ్గట్టి పచ్చగడ్డిమోపులపక్కనేసున్న
చెక్కకుర్సీపై కూర్సుని... లంగకపొగాకు సుట్ట ఎలిగించి పొగొదుల్తావున్నాడు.
ఎండకేగిపోయున్న తాటాకుపాక చూరుమీదనుంచి పడతావున్న వానసినుకులు...
అప్పుడే కొల్లిసత్తిగాడి కాపీహొటల్లో పెట్టిన టీడికాషను రంగులోనూ.. బంగాళాపెంకుటింటి
మీదనుండి పేడగుట్టమీద పడి పచ్చరంగుతోనూ... ఆపక్కనే గుట్టగాపోసిన
ఎర్రకంకరగుట్టమీదనుండి ఎర్రరంగుతోనూ.. వొకసోట కలిసిపోయి..
పంచరంగుల్లో పల్లవేపు పారతా.. పంటకాల్వలో ఎలిపోతున్నాయి.

ఇటికిబట్టీల్లో అడుసుతొక్కే ఎడ్లు కసక్ కసక్మని సౌండుతో తొక్కినట్టు కయ్య తొక్కుకుంటా
కంగారుకంగారుగా వొచ్చిన పాలేరు ఎంకటేసులు.. "బాబయ్యా.. పెద్దరావుడుగోరో..
మళ్ళా ఏతల పందెంగట్టేరండే... ఈ సారి నడుంకాల్వకే.. అదే పన్నెండేతలిత్తానో
కాస్కోమంట్నారండే. నిమ్మకాయలెసి నెగ్గడంగాదూ... మనూళ్ళో గుడ్డి సూరమ్మేత్తానికి
రెడీగావుందే..., ఈపాలి కోడ్గులేస్కోమనో అన్నారండే", అన్జెప్పి తెచ్చిన కోడిగుడ్లట్టని
గవర్రాజుకి చూపించేడు.

"పదరా.. పన్నెండేంటెహే.. పదిటిల్లోనే ఏద్దాం.., ఆడికి ఎన్నిసార్లు నాసేతిలోవోడినా
సిగ్గుండదెదవకీ..", అని ఎగ్గొట్టిన పంచెకొసల్జోడించి బీసముడేసేసి
పెద్దపెద్దంగలేసుకుంటా... పెద్దీదేపు నడిసేడు గవర్రాజు.. ఎనకాలే కోడిగుడ్లట్ట
అట్టుకుని నడిచేడు పాలేరు ఎంకటేసులు.

వూరినడిబొడ్నున్న రాములోరి గుడికాన్నించి.. నడుంకాలవగట్టుకి రమారమి
రెండుకిలోమీటర్లుంటాది. ఆ వూల్లో అంతకు ముందల చానామంది ఇదే పందెంగట్టి
ఓడిపోయేనోళ్ళేగానీ పదేనేతల్లోగూడా నిమ్మకాయగానీ.. నారింజికాయగానీ
ఏతెయ్యలేకపోయేరు... అదే దూరం నిమ్మకాయతో పన్నెండేతల్లో ఏసీ మీసంమెలెసీ
"సెబాష్.. మగాడంటే ఈడేరా..", అనిపించుకున్నోడు గవర్రాజొక్కడే. అసుమంటిది ఇప్పుడు
కోడిగుడ్డుల్తో పదేతల్లో ఎలాఏత్తాడోనని వూరిజనాలంతా పనులుమానేసి నోల్లోదిలేసి
చూత్తంమొదలెట్టేరు.

"బాబయ్యా.. నారింజికాయైతే కాత్తోకూత్తో దొల్లుకుంటా పోతాది.. కోడుగుడ్డేందొల్లుద్దండే..
కాత్త ఆలోసించండే పందెం.., అదీ.. పదేతల్లోఅంటన్నారో సూసుకోండే.. మనపరుపోద్దండే
ఆరిముందో..", అంటా ఎంకటేసులు గవర్రాజు సెవిగొలికేసేడు.

"ఒరే.. దెవాసాలోడా సెవిలో జోరిగలెక్క గొలక్కేహే.. నువ్వే సూద్దువుగానీ ఎలా ఏత్తానో..,
గుడ్డిసూరమ్మేత్తా దంటా ఎగతాళ్జేత్తాడా నన్నూ.., మనమేసే పందెమెలావుంటాదో ఆడికి
సూపించాలియ్యాలా..", అని కసురుకుంటా.. గుడ్డుతీసుకుని ఎంకటేసుల్ని
పక్కకినెట్టేసేడు గవర్రాజు.

ఎనిమిదేతలకే... సూరింగారి దూళ్ళసావిడి దాటేసి... గుబ్బలోళ్ళదిబ్బదగ్గరకొచ్చేసినయ్యి..
ఆడ్నుండి సూత్తే నడుంకాలవ కనుసూపుమేర్లో కనిపిత్తానేవుంటాది...ఇంకారెండేతలంటే
గవర్రాజుఏసేసిలానే వున్నాడని ఎగస్పాట్టీవోళ్ళు గుసగుసలాడేత్తున్నారు.., ఏం
జరుగుద్దోఏంటోనని.. జనాలంతా కంగారడిపోతా ఒకర్నుకరు తొక్కేసుకుంటున్నారు..
కొందరు కుర్రగాళ్ళతే సైకిళ్ళేసుకునిమరీ.. ముందెళ్ళిపోయి.. ఏతకెదురుకాసేత్తున్నారు...
జనాలడావుడీ.. దూరం సూసుకున్న పెద్దరావుడికి సెవటలట్టేసినియ్యి..

"ఒరే తియ్యిరా.. పదేలు.. ఇంకేసూత్తావుగానీ... నాతోనువ్వొక్కపందెంలో గెలువూ
నామీసాలు తీయించుకుంటా..", అని సేలెంజి సేసి... అట్టలోంచి మాంచి వాటమైన డబల్ సొన
గుడ్డోటందుకున్నాడు గవర్రాజు. దున్నపోతు దువ్వినట్టుగా.. తడిసిపోయున్న కంకర్నేలమీద
కాల్దువ్వి.. క్రిక్కెట్టులో బంతేసేటోడు తోంనట్టుగా కోడిగుడ్డు పంచెకొసకేసి రుద్దీ... కిందకంటా
కూర్సునిలేసి.. ఒక్కిసురు ఇసరటంతో పెద్దనిద్రగన్నేరు సెట్టు పైనుండెళ్ళి..
అవతలున్న ఏపచేట్టుపైనుండి అవతలకెళ్ళి పడి.. తపుక్కుమంటా సితికిపోయింది
కోడిగుడ్డు... జనాలంతా కేరింతలు కొట్టేత్తా.. తొమ్మిదేతల్లోనే ఏసేసిన.. గవర్రాజుని
ఆకాశానికెత్తేసేరు.

పదేలుపోగొట్టుకున్న పెద్దరావుడు ఉడుకుమోత్తనంతో కంగార్లో కాలుతొక్కేసిన
పేటలోకుర్రోడ్ని చావబాదేసేడు. అడ్డడి ఆపిన గవర్రాజు సొక్కాకాలరట్టుకుని..
"ఏతలపందేంగాదురా.. వచ్చే సెనివారం కిష్నాష్టమికి... నీ మీసాలమీద నిమ్మకాయల్ని
నిలబెట్టుసూద్దాం.., ఇదీ అసలు సేలంజింగు.. నా పందెం ఇరవయ్యేలు...,
దమ్మున్నమాగాడివైతే కాయి.. అప్పుడు సూస్కుందాం పెతాపం తస్సాదియ్యా.."
అని కస్సుమంటా పంటచేలో తోకమీదడగేసేసిన తాసుపాము లెక్కలేసేడు పెదరావుడు.

"సరే.. కాయిరా... మీసమ్మీద నిమ్మకాయ నిలబెట్టకపోతే.. నా మీసాలేగీసేత్తానేహే..
ఇదే నా సేలంజీ.. కాస్కో", అని పెద్దరావుడి కాలరట్టుకున్నాడు గవర్రాజు.., సరేలే అదీ
సూద్దాం.. అని కాలరొదిలేసి.. కంగార్కంగారుగా ఎళ్ళిపోయేడు పెద్దరావుడు.

సిర్రెత్తిపోయున్న గవర్రాజు సిమసిమలాడతా ఇంటికిసేరుకున్నాడు... బుజానున్న
కండువా తీసవతలడేసి.. కోపంగా పడక్కుర్సీలో వాలిపోయేడు..
"ఒరే ఎంకటేసులా.. మంగడికి కబురెట్టరా.. ఇయ్యేలనుండీ ఆడేంసేత్తాడో నాకు తెల్దూ..
నా మీసాలకీ సంపంగినూనే రాత్తాడో.. ఏ సన్నాసినూనే రాత్తాడో.. మొత్తం
గట్టిపడిపోవాలా.. పొద్దున్నుంచీ సాయంత్రందాకా ఇక్కడే ఆడికి పనీ అన్జెప్పు..
గాదిలోయి.. నాలుగు బత్తాలు ఆడింటికి తోలూ.. ఈ పందెంలో ఎలాగైనా
నేనే గెలిసి సూపిత్తా నా తడాకా..", అని రోషంతో మీసాలెగరేసేడు గవర్రాజు.

కబురందుకున్న మంగడు సాయంత్రమేలకి రానేవచ్చేడు.. "గవర్రాజుగోరో.. మీరేం
కంగారడకండే.. మీ మీసాలకేసంపగినూనే అక్కర్లేందండే.. దమ్మున్నమీసాలియ్యే...
శాన్సిత్తే.. నిమ్మాకాయలేంటండే.. గొబ్బిరికాయల్నైనా నిలబెట్టెత్తాయండే బాబో..
అయినా నేనున్నానుగదండే..., గంటకోమారు కలబందగుజ్జు రాత్తా దువ్వుతుంటే.
నాలుగురోజుల్లో నా సామిరంగా.. గుర్రపెంటుకుల్లెక్క నిలబడిపోవో..",
అని నాలుగుబత్తాలధాన్యం అందుకున్న సంతోషంలో గవర్రాజుకు గాలికొట్టేసేడు.

ఆయాల్నించీ మంగడుపొద్దుపొడవకముందే రాటం.. గంటగంటకీ కలబందగుజ్జుతో
మీసాలు సవరచేయటం.. ఆఈది కబురూ ఈ ఈదికబురూ సెప్పటంతో.. గవర్రాజు
ఇంటిపట్టునే వుండిపోవాల్సొచ్చింది.. జనాలంతా ఇంటికొచ్చి పలకరించెల్లిపోతా పెదరావుడి
పార్టీ కబుర్లు మోత్తావున్నారు.

నాలుగురోజుల్లో గవర్రాజుమీసంలో సత్తువకొట్టొచ్చినట్టు కనబడిపోతా, మీసం దగాదగా
మెరిసిపోతావుంది..., తోటలో కోసుకొచ్చిన సిన్న పచ్చనిమ్మకాయల్ని మీసాలమీద
నిలబెట్టి... ఓసారి ట్రైలేసి గవర్రాజుకు అద్దంలో సూపించేడు మంగడు.
అది సూసుకుని మురిసిపోయిన గవర్రాజు.. "ఒరే.. మంగా.. నీ బుర్రేబుర్రరా.. అసలు
నువ్విక్కడుండోల్సినోడివి గాదురా.. మీబాబులాగా నువ్వూ రంగమెల్లి అక్కడే తెల్లోల్ల
దగ్గర సెటిలై పోవాల్సిందెహే..", అని మంగడ్ని పొగడ్తల్తో ముంచేసేడు.

"బాబుగారో.. మాకుర్రోడు సేతికందేసేడండే.., మహా పనోడండోయ్ మావోడో...
బొంబాయిలో నేర్సుకొచ్చేడండే పనే..,నాలుగైదేళ్ళు కట్టబడ్డాడండే.. ఆడే అమితాబస్సన్న్
కీ, మిగతా హిందీ ఏక్టర్లకీ.. ఆళ్ళికీ కటింగేసేటోడంటండే.., అక్కడే బొంబాయిలో
షాపెడతానన్నాడండే.. నేనే ససేమిరా.. అని మనూరులాక్కొచ్చి మనపెద్దీదిలో రేపు
షాపెట్టిత్తిన్నానండే... అందరూ తిడుతుండేవోరండే నన్నో.. మీవోడ్నికూడా ఇదే ఇద్యలోకి
లాక్కొత్తునావేంట్రా,సుబ్బరంగా సదివించి ఉద్దోగం సేయించకా.. అనే..,
నేన్నమ్మిందుకటేనండే.. బాబో.., మా తతలగాలం కానీయ్యండీ.. మాకాలంకానీయండీ..
జనాలమీదసేసే యాపారమే యాపారమండే.., అయినా సేతిరుత్తిని
మించినేపారమేముంటాదండే.., మిగతాయి ఈరోజుంటే రేపుంటాయోలేదో తెల్దో....",
అని ఏదాంతం బలుకుతా.. గవర్రాజు మీసాలు దువ్వేడు మంగడు.

"ఇంతకీ ఇయ్యన్నీ ఎందుకుసెబుతున్నానంటేండే.., మీరేమనుకోకండా.. రేపొపాలి
మా వోడు షాపుకొచ్చి గడ్డంసేయించుకోండే.., ఎపుడూలేనిది సవరానికి షాపుకాడికి
రమ్మంటన్నాడేంటా అనుకోమాంకడే బాబో.., మీలాంటోల్ల బేరంతో మొదలయితే..
మావోడు యాపారం మూడుపూలు ఆరుకాయలైపోతాదాని ఆసెండే..", అని
గవర్రాజుని బ్రతిమలాడతా అడిగేడు మంగడు.

*** *** *** ***

ఇంకా ఎలుగురాకండానే.. గాదిక్కట్టిన వరికంకెల్ని పొడుత్తా పిచ్చుకలన్నీ గోలసేసేయటం
మొదలెట్టేసేయి.. కాసేపటికి.. తెల్లారిపోయి.. పెదరావుడు పందెంకట్టిన సెనివారం రోజు రానే
వచ్చింది. అప్పుడికే గవర్రాజుకి నాలుగైదుమార్లు షాపుదగ్గరికి రమ్మని కుర్రాగాళ్ళసేత
కబుంరంపించేసేడు మంగడు. పెళ్ళికి మగపెళ్ళోరు ముత్తాబయిఎళ్ళినట్టు ఎనకో
పదిమందినేసుకుని బయల్దేరేడు గవర్రాజు. షాపుదగ్గరకొచ్చేసరికి కుర్సీ ఏసేసి
కొబ్బరిబొండం కొట్టిచ్చేసి.. కొడుకుసేత దండాలెట్టించేసి మర్యాదసేయించేసేడు మంగడు.

"మీరొత్తం ఎక్కడ ఆలసమయ్యిపోద్దోని మావోడు గొడవండే.. మళ్ళా కాసేపాగితే ముహుర్తం
దాటేత్తే.. అట్టమి గడియలొచ్చేత్తాయనీ తెక్కంగారుపడిపోతున్నాడండే.., నేనోపాలి
ఇంటికెళ్ళొచ్చేత్తానండే.. మీకోసం ఏదో బహుమానం కట్టుంచేడంటండే.. అదొట్టుకొచ్చేత్తానో
మీరు కానియండే.." అని ఇంటేపు లగెత్తాడు మంగడు..., మంగడుకొడుకు..
"రండే.. గవర్రాజుగారో..", అంటా మహారాజా కుర్సీపై కుర్సోపెట్టినట్టు గవర్రాజుని
కుర్సోపెట్టి మెడసుట్టూ తెల్లగుడ్డేసి గెడ్డంసేయటం మొదలెట్టేడు. గవర్రాజుకుడా వొచ్చిన జనం
బయట కుర్సీల్లొకుర్సుని..బల్లేసి ఎట్టిన సితార, ఆంధ్రజోతి.. సినిమాపత్రికల్లో మొకాలెట్టేసి
సదవటంరాపోయినా బొమ్మల్చూసి సొల్లుకార్చేసుకుంటా పెపంచాన్ని మర్సిపోయెరు.

సెవులదిరిపోయేలా పెద్దసౌండుతో హిందీపాటలెట్టేసి.. లైట్లేసేసి..., ఫ్యానేసి పెనుగాల్లో
ప్రేసెంటుకొట్టి..దగదగామెరిసిపోతావున్న కొత్తసామానుజూపిత్తా.. బొంబాయిలో మేమదిసేసేం
ఇదిసేసేం అంటా కబురుల్లోపెట్టేసి.. నైసుగా గెడ్డంగీత్తావుండగా.. జేబులోఅరుత్తావున్నసెల్లు ఫోన్
తీసి.. కాత్త హిందీ పాటలు సౌండు తగ్గించీ.. "ఏప్పుడొత్తున్నారో.. అద్దాల్లేకండా..
షాపోపినింగు అంటే ఎలాగుంటాదీ.., ఇలాజేత్తేఎలాగా", అని ఎవడిమీదో కోప్పడిపోయేడు
మంగడుకొడుకు..

"సూడండే... ఆడేదో గొప్పోడనీ నిడదోల్దాకా ఎళ్ళి ఆడికిత్తే... అద్దాలుసూడండే..
పిట్టింగ్ సేయకుండా వొదిలేసేడు.. ఎప్పుడుఫోనుసేసినా ఇదిగో గెంటలోవొచ్చేత్తానో
అంటాడండే..", అని కిందెట్టేసిన అద్దాలు సూపిత్తా.. మళ్ళా గెడ్డంసేయటంలో మునిగిపోయేడు..
అలా ఐదునిముషాలకోసారి సెల్లుఫోన్లో అరుత్తా.. మళ్ళా గెడ్డంగీత్తా.. అరగంటసేపు కుర్సీలో
కుర్సోబెట్టి అటూ ఇటూ గిరగిరా గానుగుతిప్పినట్టుతిప్పేసి ఇకారంతెప్పించేసేడు గవర్రాజుకి...
అరగంటయ్యాకా.. సల్లగా ఐసుగెడ్డలాగా లాగుతున్నలోషను మొకానికి రాసేసి.. మొకంపైగుడ్డేసి
తుడవటంమొదలెట్టేడు.. మళ్ళా మోగుతున్న సెల్లుఫోను తీసి ముసుగేసేసిన గుడ్డ అలాగుంచేసి..
ఫోనట్టుకుని.. బయటకెళ్ళిపోయేడు.. మంగడుకొడుకు.

సాయత్రమైపోయింది... కిష్నాష్టమికని కట్టిన పెరుగుముంత ఆడ్డంకన్నా.. గవర్రాజు, పెదరావుడు
కట్టిన నిమ్మకాయల పందెం సూట్టాంకోసం గుంపులుగుంపులుగా.. జనాలు రాములోరిగుడిదగ్గర
సేరుకుంటున్నారు... ఎవడిసేతిలోనూ ఓటమంటే ఎరగని గవర్రాజు ఆయేల పందెం వాడిపోయి..
రెండు.. వందనోట్ల కట్టలు పెదరావుడిసేతిలోపెట్టేసి తలదించుకున్నాడు.

సెల్లు ఫోను మాటాడతా.. షాపు బయటకెళ్ళిన మంగడుకొడుకు మళ్ళా ఆవూళ్ళో అడుగెట్టలేదు..
రొండేపులా సమానంగా వొత్తేసి పాతసినిమాలో నాగేసర్రావు మీసంలా సన్నగాకాశీతాడులా
తయారయ్యున్న మీసాన్ని మొత్తం గీయించేసుకుని.. బోడిమూతిని అద్దంలో సూసుకున్న
గవర్రాజు.. ఒక్కసారిగా సల్లబడిపోయేడు..

మీసంతోపాటు పౌరుషంకూడా పోగొట్టుకుని.. ఆఏల్నుండీ.. పందేలు జోలికెళ్ళటమే మానేసేడు..

20 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గవర్రాజు మీసాలు తీసేయడం బాగోలేదు !!

మంచు చెప్పారు...

"" కొందరు కుర్రగాళ్ళతే సైకిళ్ళేసుకునిమరీ.. ముందెళ్ళిపోయి.. ఏతకెదురుకాసేత్తున్నారు.. "" మా ఊరు నిమ్మకాయ పందాల్లొ నేను ఆ కుర్రగాళ్ళలొ ఒకడిని...

చదువుతున్నంత సేపు హాయిగా ఫ్లాష్‌బాక్ లొకి వెళ్ళిపొయి , ఆఖరుకొచ్చెసరికి ...అప్పుడే కథయిపొయినదా, మళ్ళీ రొజువారీ జీవితం లొకి వచ్చెయ్యాలా అని బాధపడుతున్నట్టు అనిపించింది...

కౌటిల్య చెప్పారు...

చాలా రోజుల తర్వాత భలే కథ....మరీ వంశీ గార్ని ఫుల్లుగా ఫాలో ఐతున్నట్టున్నాది..కాస్తంత మెలికబెట్టి రాద్దురూ...

శ్రీనివాసరాజు చెప్పారు...

@గురువుగారు
కధ మీకు అంతగా నచ్చకపోయినందుకు బాధగానే వున్నా.. మీరువున్నది వున్నట్టు చెప్పారు చూడండి అది బాగుంది.. :)

ఇక కధలో ఒక ఉద్దేశ్యమే అదండీ.. "ఎంతటి..(మహా)రాజుగారి మీసమైనా మంగళి కత్తికి లోకువేనని", అదే మీసం కొందరికి పౌరుషం.. రోషం.. పరువూ అన్నీను.. అలానే గవర్రాజు
పందేం పిచ్చి ఆ పౌరుషంతోనే.. రోషంతోనే.. ఆ మీసంపోతేనే గాని గవర్రాజు పిచ్చివదల్లేదు. (అందుకే మీసం తీసేయాల్సొచ్చింది :) )
ఇదంతా కధలో మరీ డైరెక్టుగా చెబితే బాగోదండి.. అందుకే ఎక్కడా ప్రస్తావించలేదు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు పల్లకీ గారు
నేనూ ఆ కుర్రగాళ్ళబ్యాచ్లో ఉన్నవాళ్ళమేనండే.. :)

ఫ్లాస్బాక్ వున్నదే మళ్ళా తిరిగి రియాలిటీలోకి రావటానికి కదా!.. తప్పదు మరి..:-)
కధ నచ్చినందుకు సంతోషం.

@కౌటిల్య గారు
వంశీగారి కధలే ఇలాంటి శైలివుండటం వలన ప్రతీదీ ఆ శైలితోనే పోలుస్తున్నారేమో అనిపిస్తుంది.
ఇంతకుముందు చెప్పిన విధంగానే.. శైలిలో వుంటే పర్వాలేదు.. మొత్తం స్టాంపుగుద్దినట్టు కాఫీకొడితేనే బాగోదని..
ఇదే కధనాన్ని.. ఇదే కధని మామూలు మాండలికంలో రాస్తే బాగుంటుందంటారా?

మంచు చెప్పారు...

వద్దు వద్దు.. మాములు మాండలికం లొకి రావద్దు... మాలాంటి అభిమానుల్ని నిరాశపరచొద్దు... ప్లీజ్

Ram Krish Reddy Kotla చెప్పారు...

చాలా బాగుంది శ్రీనివాసరాజు గారు.. పాపం గవర్రాజు మీసం అలా గోరిగేసినప్పుడు పాపం ఎంత బాధ అనుభవించి ఉంటాడో.. అందులోనుంచే ఒక వైరాగ్యం వచ్చి ఇక పందేలు మానేసి ఉంటాడేమో .. :-)

రాధిక(నాని ) చెప్పారు...

ఆకాసమంతా మూసేసి ముసురేసేసిని నల్లమేగాలు... అప్పుడుదాకా ఉగ్గబెట్టుక్కూచ్చున్నట్టు
కూర్సుని.. వొక్కసారిగా కుంబరుష్టి కురిపించేసి.. తెల్లబడిపోయేయి. ఎండిపోయున్న నేల
వానసినుకులకి తడిసి తాటిరొట్టికాలుత్తాకి పైనేసిన.. ఎర్రక్కాలిన పిడకముక్కల్లాగా
పొగలుకక్కేత్తావుంది. వానకు తడిసి.. బీటల్దీసేసిన నల్లరేగడ్నేల్లోంచీ.. వత్తున్న
మట్టివాసన.. తడిసిన సన్నజాజిపూల వాసన్తో కలిసీ ముక్కుపుటాలదిరే సువ్వాసనతో
మత్తేక్కిచ్చాంది...చాలా బాగా రాసారు. నాకు కూడా చదువుతుంటే వంశీ గారి కథలు లా అనిపించింది కానీ , ఇది మన పచ్చిమ్మగోదారి కథ కదా చాలానచ్చింది.ఆ కోరుమామిడికి 20 కిలోమీటర్లే మాఊరు...

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు పల్లకీగారు..
మీరు మరీ మొహమాటపెట్టేస్తున్నారు.. :)
ఎవరాపినా ఆగదండే ఇదా.. ఇన్నేళ్ళనుండీ నా మాటల్లో
యాసే మార్చుకోలేకపోతున్నానండే.. ఆయ్.. :)

@రామకృష్ణా రెడ్డిగారు..
మీ కామెంటుకు ధన్యవాదములు.
మీ బ్లాగు కూడా చూసాను.. అరవోడి మిక్సింగ్ చదివాను.. బాగుంది.. వీలున్నప్పుడు మొత్తం చదువుతా.. :)

@రాధిక గారు.
కధ నచ్చినందుకు సంతోషమండీ..
కోరుమామిడిదగ్గరండే మీదే.. అయ్యబాబోయ్ చెప్పరేటండే మరే.. :-)

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది.
కానీ ఒక్క మాట - ఒక సలహా, విన్నపం వేడికోలు - ఏదికావాలంటే అదనుకోండి. మీదైన శైలి మీకుంది, దయచేసి, వంశీని ఇమిటేట్ చెయ్యొద్దు. మీర్రాసిన బెంజికారు కథ, చాలా మంది పాఠకులు వంశి కథలాగా ఉండి అన్నా, అందులో మీ స్వంతముద్ర బలంగా ఉన్నది. ఈ మీసాల కథ మరీ పనిగట్టుకుని పసలపూడి కతల ఇష్టయిల్లో రాసినట్టు కనిపిస్తోంది నా అలసిన కళ్ళకి. మీ స్వంతగొంతు నాలుక్కాలాలపాటు స్వంతగా బలంగా వినబడాలని మనసారా కోరుకుంటూ ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్తపాళీ గారు.
మీది చక్కటి సలహాగానే తీసుకున్నా..

నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే పసలపూడి కధలు చదవలేదు..(ఇది నమ్మలేని నిజం.. నిజం..) మా దిగువగోదారి కధలు చదివాను. నాకు బాగా నచ్చాయి.. కాస్త ఆ ప్రభావం పడుంటుందేమో అనిపిస్తుంది. నా సొంతగొంతునే వినిపించమని చెప్పిన మీ చక్కటి సలహా పాటిస్తా.. కానీ ఇప్పటికీ నాకర్ధం కానిదొకటుంది.. అందరూ అన్నట్టు, అనుకున్నట్టు ఈ కధాశైలి.. అంటే వంశీగారి కధల్లో కధ సుఖాంతం అవుతున్నప్పుడు మనం ఊహించినట్టుగాకాకుండా సింపుల్ గా ఎండ్ చేస్తారు.. అదొక్కటే నేనూ చేసాను.. (నాకు తెలిసి). ఇక విషయ వర్ణన నా సొంతమే.. పదాలు అన్నీ నాకు తెలిసినవే.. (మా పల్లెటూరి బ్యాక్డ్రాప్ ఇక్కడ బాగా సహకరించింది :) ). కధా వస్తువు నా సొంతమే..
ఇంకా ఎక్కడా ఇది ఇలానే చెయ్యాలి అన్నట్టుగా కాకుండా నా పూర్తి స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుని రాసాను.., ఇవి కాకుండా ఇంకేమన్నా పొంతనలు వుంటే చెప్పగలరు..

నాకున్న వీక్ నెస్ ఏంటి అంటే.. ఇతరులకధలు.., నవల్స్ లాంటివి చదవకపోవటం.. నాకున్న పుస్తక జ్ఞానం సూన్యం అనే చెప్పుకోవాలి.. అవి కాస్త చదివితే.. ఏది కాఫీకొట్టాలో ఏది కొట్టకూడదో అన్నా తెలుసుండేదేమో.. :-)

సదా మీ ఆభిప్రాయాలకు, విమర్శలు ఏదైనా ఆహ్వానం.. కడిగేయండి అంతే.. :-), ఎవరినన్నా కడిగేయడంలో నేను దిట్టనేనండోయ్.. అందుకే చెంపదెబ్బ కొట్టేటప్పుడు అవతలివాడు తిరిగికొడితే ఎలావుంటుందో తెలిసినవాడినేలేండి.. ఉన్నదివున్నట్టు చెప్పే సలహాలకోసమే ఎదురుచూస్తున్నా.
ధన్యవాదములు

కొత్త పాళీ చెప్పారు...

శ్రీనివాస్, కథ మళ్ళీ చదివా. కామెంట్లన్నీ చదివా. ఆ ప్రాంతపు కథల్ని ఆ ప్రాంతపు గొంతుతో చెప్పడం వల్ల వంశీతో ఈ పోలిక తప్పదేమో. ఆయన మరి ఈ పగోజీ బస్సు సీటు మీద రుమాలు ముందుగా వేసేసుకున్నారు! నేనూ ఆ పోలిక అనే తప్పులోనే కాలేశా ఇందాకటి కామెంటుతో. మీ స్టైలు మీదే, ఈ కథలో కూడా. ప్రొసీడైపోండి.

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్తపాళీ గారు
నేను ముందిచ్చిన కామెంటు చదవకుండానే ఈ కామెంటిచ్చినట్టున్నారు.. ఒక్కసారి అదికూడా చదివి చెబ్దురూ.. :-)

కౌటిల్య చెప్పారు...

హమ్మయ్యో!మామూలు గానే...వద్దనే వద్దండీ.....మీ కథల్లో మిఠాయంతా మరి గోదారి గొంతే కదండీ..అది లేపోతే ఏం ఉంటది? మా నోర్లు మరీ చప్పబడి పోవూ....మొదట బెంజికారు కథలో అలా అనిపించలా!కానీ ఇక్కడ ఒక పేరా మొత్తం ప్రకృతి వర్ణన,తర్వాత కథ.. అలా నడిపించేసరికి వంశీగారిలా అనిపించింది....అలా అన్నందుకు మన్నించండి..మీ స్టైలులో మీరు రాసెయ్యండి...

teresa చెప్పారు...

అబ్బ, తూగోజి యాసకి ప్రాణం లేచొచ్చినట్టుంది.
ఏమీ కామెంటకుండా ఊరుకోనీటం లేదు మీ టపా. అలాగని ఏ మెచ్చుకోలు మాట రాయాలో తెలీటమూ లేదు :(
Just cherishing the moment!! BRAVO!

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు

వంశీగారితో పోల్చేటంత పెద్దవాడిని కాదండోయ్.. అలా పోల్చినందుకు సంతోషిస్తానేగానీ.. వేరేలా ఎందుకనుకుంటాను చెప్పండి.. ఎదో మీ అభిప్రాయాల ద్వారా మంచిచెడులు తెలుసుకుందామని ఆత్రుత అంతే.. మీ కామెంటులే నాకు రివార్టులు అవార్డులు.. అలాగే నాలో పొరపాట్లను సరిచేసుకునే అవకాశాలు కూడా..

అదే అడుగుతుంటే.. ఒక్కరూ అర్ధంచేసుకోరూ.. :-)

మీ స్పందనకు ధన్యవాదములు.

@తెరిసా గారు
మీకు నచ్చినందుకు సంతోషం.
ఏమివ్వాలోఅంటూనే కామెంటిచ్చారుగా.. అదిచాలండి :-)
ధన్యవాదములు

మరువం ఉష చెప్పారు...

"సమిశ్రగూడెం", "ఇకారంతెప్పించేసేడు గవర్రాజుకి.." వింటుంటే ప్రాణం లేచివచ్చినట్లుగా ఉంది. నిజానికి మాండలీకం మూలాన అలా అనిపించినా నాకు వంశీ కన్నా, బి.వి.రామారావు గారివి, పూసపాటి కృష్ణంరాజు గారివీ కథలు గుర్తుకొచ్చాయి. అలాగే అసలు మా వూరుల్లోని మాటలే విన్నట్లూను. ఏమీ అనుకోనంటే ఒక సలహా అండి [అడగకుండానే అయినా గానీ..] మీరు కథారచన కొనసాగించాలంటే, మంచి రచనలు చెయ్యాలంటే - మంచి రచనలు చదవాలి, వాటిలోని మెళకువలు గ్రహించాలి. దానికి మీకు చాలా సాధన కావాలి. ఇది నాకు ఒకరిచ్చిన సూచన. నాకు క్రమేణా అందులోని విలువ తెలుస్తున్నదీను. కనుక మీ విరామ సమయంలో కొంత అటుగా మళ్ళిస్తే మాకు మరిన్ని కథలు కళ్ల నిండుగా ఇవ్వగలరని ఆశిస్తూ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఉషగారు.

మీ చక్కటి సలహకు సంతోషం.
నా బ్లాగు వారి కధలను గుర్తుచేసినందుకు ఆనందంగా వుంది.

నాకూ చదవాలనే వుంది.. ఈ సారి తప్పకుండా చేస్తాను.. అవునండీ అలాంటి మెళకువలు తెలుసుకోవటం చాలా అవసరమే..

ఒక జీవితాన్ని చదవాలంటే ఒక జీవితమంతా అనుభవించాలి.. అదే ఆ జీవితాన్ని అనుభవించి, ఆ సారాన్ని రాసిన ఒక పుస్తకం చదివితే జీవితాన్నే చదివినంత ఫలితం కదండీ.. ఏమంటారు.. :-)

ఇక వేటితో మొదలుపెడితే బాగుంటుందో చెబితే ఈసారి ఆంధ్రావెళ్ళినపుడు.. ఒక గంపెడు పుస్తకాలు మూటకట్టుకొస్తాను..

Sirisha చెప్పారు...

very nice....pasalapudi kadhalu, ma godavari kadhalu, toorpu godavari kadhalu...anni varasapetti chadivinatlu undi....

శ్రీనివాసరాజు చెప్పారు...

@శిరీష గారు
కధ నచ్చినందుకు సంతోషం. మీ కామెంటుకు ధన్యవాదములు.
చాలా కధలతో పోల్చేసినట్టున్నారు. :-)

Related Posts Plugin for WordPress, Blogger...