18, ఆగస్టు 2013, ఆదివారం

మరో రోజు...

నీ జీవితంలో ఒక రోజు మళ్ళి ఈ ఐ.టి. మట్టిలో తోక్కేసారు అన్నయ్యా.. తోక్కేసారు..!
పొద్దున్నే లేచి ఇవాళ ఏదోకటి చేసెయ్యాలి అని ఒక స్ట్రాంగ్ టీ పట్టుకుని బాల్కనీ లోకి వచ్చి చల్లటి గాలిలో వెచ్చటి టీ తాగుతూ.. ఆస్వాదిస్తుంటే.. మదిలోతులో ఎక్కడో.. నులివెచ్చటి స్పర్శలాగా తాకిన నీ ఆలోచనలన్ని కట్టగట్టి.. ఒక సుతిమెత్తని కాగితం పై పెట్టాలనుకుని మొదలుపెట్టిన నీ రోజు.. టిక్కు మని ఆండ్రాయిడ్ ఫోనులో మోగిన చిన్న శబ్దం తో.. మొత్తం తారు మారు అయిపోయింది కదా అన్నయ్యా!
ఎక్కడో ఆబోతు కట్లు తెంచుకుని వూరి మీద పడింది.. నువ్వే దిక్కు నారాయణ వచ్చి కాపాడు,
ఇంకెక్కడో.. ఎవడో కాల్చిన చుట్టముక్క విసిరితే కొంపలు అంటుకున్నాయి.. నీ ఫైర్ ఇంజిన్లో నీళ్ళు నింపకపోయినా పర్లేదు త్వరగా తీసుకురావయ్యా.. తండ్రీ,..!, అట్లాంటిక్ మహా సముద్రం అవతలి ఒడ్డున ఎగురుతున్న పేద్ద విమానాన్ని ఎవడో బాగా.. సాగదీసి వదిలిన అంగ్రీ బర్డ్ ఒకటి డికోట్టటంతో రెక్క విరిగి కింద పడిపోతుంది.. నువ్వే మాకున్న స్పైడర్ మాన్ వి బాసూ..!, అని ఆ శబ్దం చేసుకుంటూ వచ్చిన ఆ మెయిల్ సారాంశం చూసాక నీకు తప్పదుగా అన్నయ్యా..!
ఇంకేముంది.. ఈ వీకెండ్ అని చెప్పుకునే.. నీ ఈ రోజును కూడా తోక్కేసారు అన్నయ్యా.. తుంగలో తోక్కేసారు..
ఇలా ఎన్ని వీకులు ఎన్ని ఎండులు.. ఎండు లేని ఈ బతుకులు.. వారానికి ఐదు రోజులే కదా.. చావు అన్నారు.. మరి ఇదేంటి చచ్చిన వాడిని ఇంకొక రొండురోజులు మళ్ళి ఎందుకన్నయ్యా చంపుతున్నారు.
అసలు ఈ వీకెండు నీది ఎంత మంచి ప్లానో కదా!, ఈ జైలు నుండి విడులయ్యి.. ఎక్కడికైనా దూరంగా.. రెక్కలు కట్టుకుని పైకి ఎగిరిపోయి.. ఏ రెస్టారెంట్ లోనో వాలిపోయి.. నాన్-రోట్టిలో.. ఆకులు.. అలమలు.. గడ్డిపరకలు పెట్టిస్తే నమిలేసి.. కాసేపు మొబైల్ ఫోనులో ఫేస్బుక్ అప్డేట్ లు చూసేసుకుంటూ.., ఫైశాఛికంగా కనపడ్డ పోస్టునల్లా లైక్ చేసి.. షేర్ కొట్టేసుకుంటూ.. తిన్నది నెమరు వేసేసుకుంటూ.. కుడితిలాంటి కాఫీ లో నాలుగు ఐస్ ముక్కలు వేసిస్తే తాగేసి.. ఊహాలోకంలో విహరిస్తూ.. ఈ లోకాన్ని కాసేపు మర్చిపోయి.., వెయిటర్ వేడి వేడి బిల్లు పట్టుకోచ్చి లాగి చెంపదెబ్బ కొడితే.., బిల్లుతో పాటుగా.. ఆ వాచిన వాపుకు.. వ్యాట్ కట్టి.. సగం ఆస్తిగా సర్వీస్ టాక్స్ కట్టి.., నరకానికి మల్లి రి-ఎంట్రీ ఇస్తే.. ఎంత రిఫ్రెషింగ్ గా ఉండేదో కదా!.. ప్లానులన్ని పాడయ్యేనే.. ఆఫీసులోనే.. చావయ్యేనే.. కుర్చిలే పాడే-అయ్యేనే.. ఇదేమన్నా భావ్యమా అని అడుగుతున్నా అన్నయ్యా..
నెలనెలా ఎకౌంటులో పెద్ద అంకెల జీతం.. చూసేసుకుని..,  ఇఎమ్మైలు కట్టేసుకుని.. చస్తే ఇస్తాడో లేదో తెలియని ఇన్సూరెన్స్ కి వాటాలు తీసేసుకుని.. మెడిక్లైమ్ కి నో-క్లైమ్ బోనసు అని ఒక వెయ్యి తగ్గిస్తే చంకలు గుద్దేసుకుని.. కారులోనుకు డిస్కౌంట్ అని మేయిలోస్తే.. గంతులు వేసేసుకుని.., ప్రీ-ఎప్ప్రోవ్ద్ లోన్ ఇస్తాం అంటే.. చిల్లు జేబుల ప్యాంటులో చేతులు పెట్టేసుకుని.., పార్టీలు చేసేసుకుని.. ఫేస్బుక్ లో మళ్ళి రాసేసుకుని.. లైక్ లు కొట్టేసుకునే.. ఈ జీవితానికి  ఈ అనందాలు చాలా ఎక్కువంటావా అన్నయ్యా..!
అయ్యో అన్నయ్యా.. మళ్ళి మొదలయ్యిందే.. సోమవారం!,  ఆడిన దొమ్మర ఆటే.. మళ్ళి ఆడి.. మేనేజర్ కొట్టే డప్పులో.. రిథం లేకపోయినా.. తీగ మీద కళ్ళుమూసుకుని నడిచి.. పడకుండా కిందకు దిగోస్తే.. శాబాష్ అని.. జబ్బలు చరుచుకుని.., పడిపోతే.. తప్పంతా నీమీదేసుకుని.. ఇలా ఎన్ని వీకులు.. ఎండు లేని బతుకులు..
వీళ్ళు చాల తెలివిగలోళ్ళు అన్నయ్యో.. అదుగో పులి అన్నారు.. ఇదిగో పామన్నారు.. నీకెందుకు భయమన్నారు.. మేమున్నాం పద అన్నారు.. పర్లేదు ఒక అడుగే.. ఏముంది వెయ్యన్నారు.., వేసాక.., పడిపోతే.. నువ్వే కదా వేసింది.. మా తప్పు లేదన్నారు..,  పులి వస్తుందేమో..  కాటేస్తుందేమో.. అంటే.  ఊహాలెందుకు నాయనా.. ఇంకాస్త వేచి చూడన్నారు..
పులోచ్చిం దన్నా.. మింగేసిదన్నా.., పామోచ్చిందన్నా.. కాటేసిందన్నా.. అంటే..!,  ఐతే ఇది.. అదే.., అంటే అది.. ఇదే.., ప్రాజెక్ట్ లో రిస్క్ అన్నారు.. నట్టేట ముంచేశారు.. నడిరోడ్డుకు లాగేశారు.. నీ వీకెండ్ కు మంటేసారు.. నిన్నందులో మండిచారు.. సరదాగా చలి కాగారు.
ఇంత మండిన నీకూ.. ఐదు శాతమేనా హైకూ.. క్రితం సారి ఇస్తానన్నది ఇంకా వెక్కిరిస్తూనే వుంది ఎందుకూ?
అయిన నువ్వు శేభాషన్నా.. సప్త సముద్రాలూ దాటి వెళ్ళొచ్చి బిల్ గేట్స్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నావంటగా నువ్వు సూపర్ అన్నా..  మొన్న ఆ అవార్డు పట్టుకుని.. అపార్ట్ మెంట్ లోకి ఎంటర్ ది డ్రాగన్ అవుతుండగా.. సెక్యూరిటీ వాడు నిన్నెప్పుడు చూడలేదని కాలరు పట్టుకుని చితక్కోట్టాడంట కదన్నా!.., బిల్ గేట్లు.. అవార్ద్లూ..., వాడికేం తెలుసన్నా వాటి విలువా.., అప్పుడప్పుడు అపార్ట్మెంట్లో  హెల్మేట్ తీసి.. అందర్నీ పలకరిస్తే.. విలువుంతుందన్నా మరి!.., నీ ఫేస్ కు హెల్మెట్ లేకపోతే గుర్తు పట్టని సెక్యూరిటీ లాగ.. విలువంత నీ హేల్మేట్టులో ఉండిపోతే చాల కష్టమేమో అన్నా!.
అయినా నువ్వేమి చేస్తావులే అన్నా.. నీ మండిన వీకెండులు  ఇంట గెలవనివ్వకుండే..
నువుచేసిన సాహసాలు.. నీ భార్య మనసు దోచకుండే..  నీవెక్కిన అందలాలు.. నీ పిల్లలకే తెలియకుండే..
ఎల్లలు దాటిన నీ యశస్సు.. నీ పక్కింటికి ప్రాకకుండే.. అయ్యో అయ్యయ్యో ఓ అన్నయ్యో...!!
అయినా ఒక్కసారి నువ్వు ఆలోచించన్నో..
పగలు లేదు రాత్రి లేదు.. తిన్నదేమో అరగలేదు.. ఇరుగులేదు పోరుగులేదు.. ఇరుకు సందు క్యూబ్ లోన పరుగులేదు.. అలుపురాదు.. చెమట బొట్టు చిందలేదు.. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు గడిచిపోయినా.. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు.. ఈ  నరక యాతన..
బ్రతుకు తెరువు కాన రాదు.. బయట నీకు విలువలేదు.. ఒంటి నిండా విషము నిండి విషము మింగి చావులేదు..
కంటి నిండా కునుకు ఎండి కలలకింక చోటు లేదు..  ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు గడిచిపోయినా.. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు..  ఈ  నరక యాతన..

ఇంకోక్కసారి ఆలోచించన్నో!!

Related Posts Plugin for WordPress, Blogger...