5, ఆగస్టు 2020, బుధవారం

చేతులు కడిగిన శుభవేళా..

ముప్పై ఏళ్లలో ఎప్పుడూ చెయ్యి సబ్బుతో కడగని శంకర్రావు.. హూ గైడ్ లైన్స్ కి అనుగుణంగా ప్రతి గంటకి ముప్పయి సెకండ్ల పాటు చేతులు కడుగుతున్నాడు.

చేతికున్న వైరస్ల చావు దేవుడెరుగు.. చేతికున్న రేఖలన్నీ. కూడా అరిగిపోయి తెల్ల పుష్పాల్లా తయారయ్యాయి. ఇక నేను కడగలేనే.. చచ్చే చావొచ్చింది.., ఇలా కడుగుతూనే చస్తానేమో.. రేపు పేపర్లో.. చేతులు కడిగి కడిగి అమాయకపు భర్త మృతి అని వేస్తారేమోనే అని అమాయకంగా తన భార్య జానకితో అన్నాడు.

ఎందుకండీ.. అంత చిరాకు, మీరు అంతలా కడగబట్టే కదా తుమ్మ మొద్దుల్లా ఉండే మీ చేతులు.. ఇలా తెల్లపుష్పాల్లా తళతళలాడుతున్నాయి.., ఏది చేసినా మన మంచికే అని చేతులు చూపించి మెచ్చుకుంది భార్య జానకి.

చేతులు తుడుచుకుని వచ్చి టీవీ పెట్టడం కోసం సోఫాలో ఉన్న రిమోట్ అందుకుని కూర్చున్నాడు.

ఇరవై చాలన్నారు.. ఎందుకైనా మంచిదని ముప్పై సెకండ్ల పాటు కడుగుతున్నా. నువ్వు ఎప్పుడూ చేతులు కడిగిన పాపాన లేవు, మళ్ళీ నన్ను వెటకారం చెయ్యడం.. అని చిరాకు పడ్డాడు.

సరే.. ఆ రిమోట్ ఇవ్వండి. నాకు సీరియల్ టైమయ్యింది.. అంది జానకి కోపంగా.

చచ్చినా ఇచ్చేదిలేదు. నేను వార్తలు చూడాలి అని నచ్చిన ఛానల్ మార్చి రిమోట్ సోఫాలో కాళ్ళకింద దాచుకున్నాడు.

ఇలాంటి మొగుడు ఇంట్లో ఎందుకయ్యా.. ఆ క్వరంటీన్ సెంటర్లో పడేస్తే ఒక పద్నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండదా.. అని కయ్యి మంది జానకి.

ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం తరువాత కాసేపు నిశ్శబ్దం...

కాసేపటికి ఏవండోయ్.. ఇది చూసారా.. 
వర్లక్ష్మొదిన వాట్సాప్ పెట్టింది.., చేతులు కనీసం నలభై నుండి తొంభై సెకండ్ల పాటు సబ్బుతో రుద్దాలంట.. లేకపోతే ప్రయోజనం లేదంట.. అంటూ వాట్సాప్ మెస్సేజ్ చూపించింది.

చూసారుకదా.., ఏమయ్యిందో మీ ముప్పై సెకన్ల కడుగుడుల కధ.. అంది నవ్వుతూ జానకి.

విసిగిపోయిన శంకర్రావు వాళ్ళావిడతో గట్టిగా అరుస్తూ 
"కత్తందుకో జానకీ..." అన్నాడు.

మీరే అందుకోండి మీ వెర్రి పుష్పాలతో.. ఇన్నాళ్లూ ఆ కడిగింది మొహమైనా బాగుండేది.. కాస్త తెలుపొచ్చేదేమో.
ముప్పై సెకండ్లే తోమి ఏం వెలగబెట్టేరంట.., నాకు వంట గదిలో బోల్డు పనుంది.. మీరెళ్లి ఆ మిగిలిపోయిన సెకండ్లకు కడుక్కోండి చేతులు అంది వెటకారంగా అక్కడనుండి లేచి వెళ్లిపోతూ.

అప్పటికే తల గోడకేసి బాదుకుందామనుకుంటున్న శంకర్రావు రేడియోలో పాట వస్తుంటే వింటూ ఆగాడు.

మాయాబజార్ లో ఘంటసాలగారి పాటొస్తుంది.

చేతులు కడిగిన శుభవేళా.. 
ఎందుకు నీకీ కలవరము..
ఎందుకు నీకీ కలవరము..

అని పాట ఆగి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా జనహితార్ధం జారీ అని చెప్పింది.

ఛీఛీ.. ఆఖరుకు ఈ రేడియోలో కూడా నన్నే వెటకారం చేస్తున్నారు అని తలగోడకేసి కొట్టుకోటం మొదలెట్టాడు.

ఏవండోయ్.. ఆ పడగ్గదిలో ఉన్న అద్దం మేకు కాస్త బయటకొచ్చి అద్దం కిందకు జారిపోయింది. ఆ తల కొట్టుకునేదేదో ఆ మేక్కేసి కొట్టుకుంటే అద్దమైనా సరవుతుంది కదా.. అని వంటింట్లొంచి అరిచింది జానకి.

ఇక చేసేదేం లేక తలుపు తీసుకుని బయటకు పోదాం అని విసురుగా తలుపులు తీసి గుమ్మంలోకి అడుగుపెట్టగానే పీపీయి కిట్స్ వేసుకుని ఇద్దరు గ్రహాంతరవాసుల్లాగా గుమ్మం ముందు నిలబడి ఉన్నారు.

వాళ్ళను చూసి భయపడ్డ శంకర్రావు అంతే వేగంతో లోపలికి దూరి తలుపు వెనకాల కొక్కేనికి తగిలించిన మాస్క్ తీసి మొహానికి తగిలించుకుని మళ్ళీ గుమ్మంలోకి వచ్చాడు.

ముందు నిలబడిన ఇద్దర్లో ఒకతను జేబులోంచి పెన్ను పేపరు తీసి. శంకర్రావుగారంటే మీరేనా అనడిగాడు.

వణుకుతూ తడబడ్డ గొంతుతో.. నే.. నే.. అన్నాడు శంకర్రావు.

మేం మున్సిపాలిటీ సర్వే డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మాకు అనుమానం వస్తే తీసుకుపోతాం..
మీరురోజుకు చేతులు ఎన్ని సార్లు కడుగుతారు అనడిగాడు.

ఒక ముప్పైసార్లు అన్నాడు.

ఎన్ని సెకండ్ల పాటు.. అనడిగాడు.

ఒక నలభై.. తొంభై.. వంద సెకన్లు పైనే కడుగుతానండి.. అన్నాడు గర్వంగా.

కానీ అన్నిసార్లు కడిగినట్టు లేవు కదా సార్ మీ చేతులు. మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు. ఇది ప్రభుత్వానికి పంపే సర్వే, మీ డీటెయిల్స్ అన్ని వెళతాయి అని బెదిరించాడతను.

అదేంటి.. ఇంత తెల్లగా ఉంటేనూ.. ఇంకా కడిగినట్టు లేవు అంటే ఎలా అని తెల్లపుష్పాలను గాల్లో ఊపుతూ చూపించాడు.

బియ్యం ఏరుతూ.. పళ్లెం చేతిలో పట్టుకుని.. మాస్కు కిందనుంచి నాలుగ్గింజలు నోట్లోవేసుకుని పటపటలాడిస్తూ.. వెనుకే వచ్చింది జానకి.
సార్.. ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ ఈయనెప్పుడూ కడగలేదండీ.. అని చెప్పింది గ్రహాంతరవాసులకు.

అదేసార్.. నేను చేతులు చూసి ఎంత సేపటి క్రితం కడిగినవో చెప్పేయగలను. అలాటిది నన్నే మోసం చెయ్యాలని చూస్తారా.. ఉండండి రిమార్కు రాసేస్తా అని పుస్తకం పేజీలు తిప్పాడు.

బాబ్బాబు.. ఆగవయ్యా, ఏదిపడితే అది రాయకు.
ఇకనుంచి సరిగ్గా కడుగుతా అని అతని చెయ్యి పట్టుకుని శపథం చేసినట్టు.. చేతిలో చెయ్యేసాడు.

ఏంటి.. సోషల్ డిస్టన్సింగ్ కూడా మీరు పాటించడం లేదు. ఇలా మీదకొచ్చేసి నా చెయ్యి ముట్టుకుంటారా. 

మీరు కనీసం ఆరోగ్యంగా అయినా ఉన్నారా లేదా.. 
ఆ వివరాలు చెప్పండి ముందు.. అని అడగటం మొదలుపెట్టాడు.

మీకు దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోటం కష్టంగా ఉండటం, వాసనా రుచి తెలికపోవటం లాంటి లక్షణాలు ఉన్నాయా.. అనడిగాడు.

శంకర్రావు.. అబ్బే అవేం లేవు అన్నాడు.., ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా హాచ్ అని పెద్ద తుమ్మొచ్చింది.

మీకు డయాబెటిస్, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా.

లేవు అన్న దానికి అడ్డుపడి.. వీళ్ళకుటుంబంలో అందరికీ ఉన్నాయండి.. అంది జానకి.

మీరు ఒక పదిరోజుల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళారా.. అనడిగాడు.

మొన్న వద్దంటే కరివేపాకు లేకుండా కూరలేంటి.. ముద్ద దిగట్లేదు అని పక్కూరెళ్లి మరీ తెచ్చారండి.. చెప్పరేమండి.. అలా నసుగుతారే అంది జానకి శంకర్రావు వంక ఉరిమి ఉరిమి చూస్తూ.

ఇక ఆఖరి ప్రశ్న.. కోవిడ్ పేషంట్ తో ఈ మధ్య ఎవరినన్నా కలిసారా.. అనడిగాడు.

మొన్నే వీళ్ళ ఫ్రెండ్ కి వచ్చి హోమ్ క్వరంటీన్లో ఉంటే వెళ్లి పళ్లు, బాదం పప్పు, జీడిపప్పు, అవిఇవీ కొనిచ్చి కలిసొచ్చారు కదా.. అంది కోపంగా జానకి.

అయితే.. ఈయన్ని మేం క్వరంటీన్ కి తీసుకెళుతున్నాం మేడం.. అని శంకర్రావుని బుజాలమీద చేతులువేసి బలవంతంగా నడిపించుకుంటూ తీసుకెళ్లి అంబులెన్సెక్కించారు. 

అంబులెన్స్ వెనుక అద్దంలోంచి బయటకు చూస్తున్న శంకర్రావుకి రిమోట్ చూపించి వెక్కిరించింది జానకి.

20, నవంబర్ 2019, బుధవారం

గడ్డం అడ్డమొచ్చేత్తాది!!

ఈ మధ్య గడ్డం పెంచుతున్నారా  సినిమా స్టోరీ రాద్దామనీ, రైటర్ అవుదామనీ.., కొత్త కొత్త రచనలు చేద్దామని.. ఎలా ఉందిరా నా గడ్డం!!

అరే.. నీకు ఎగస్ట్రాలు కాకపోతే.. గడ్డం పెంచితే స్టొరీలొచ్చేత్తాయా. 

మరీ, నిదంతా హాఫ్ నాలెడ్జ్ రా బాబూ.., నమ్మకపోతే చెబుతా.. విన్నువ్వే చెప్పు.
మన సినిమా రైటర్స్ ని గమనించు.. అంతా గడ్డాలు పెంచారు చూడు. కొత్తగా వత్తున్న డైరెట్టర్ కమ్ రైటర్స్ కూడా. ఆలా పెంచబట్టే స్టోరీలు రాత్తన్నారు.

నాకు తెలుసు, నువ్వెంతుకునవ్వుతున్నావో..,గడ్డం లెనోళ్ళని చూపించి.. మరీళ్లు.., అంటావ్.. అంతేనా,
ఆళ్ళు కూడా ఫ్యూచర్లో పెంచి తీరతారు.. లేపోతే కొత్త స్టోరీ ఐడియాలు రావు. మొన్న అన్నావ్ కదా.. ఆ ఫలానా స్టోరీ ఎక్కడో ఇన్నట్టుందనీ.. అదేనేహే.. మొన్న ఆఫీస్లో డిబేటెట్టుకున్నాం.. మరాయనకి గడ్డంలేదు.. అందుకే స్టోరీ రిపీటయ్యింది.

ఏడిచావ్.. గడ్డం పెరిగితే దురదొత్తాదిగానీ ఐడియాలు ఎక్కడొత్తాయిరా..., పిచ్చినా బట్టలా మట్టాడతావేంటి.. ఏమైందిరా ఈడీకి.., కోడింగ్ చేస్చ్చేసి బుర్ర దొబ్బిందా నీకు.. మరీ ఎగస్ట్రాల్రా నీకు.

అదేరా మరి..., నువ్వెప్పుడు పూర్తిగా ఇని దొబ్బించుకున్నావ్ గనకా... ఏదో టెస్టింగ్ అనే  ఫీల్డ్ ఒకటేడిసిందిగాబట్టి నీకు జాబొచ్చిందిగానీ.. లేపోతే నువ్వు దున్నపోతులకి కటింగ్లేత్తా ఉండేవోడివి..
మన బ్రెయిన్ లో ఆలోచనలు చాలా వేగంగా పుడతాయి. అవి అలా వేగంగా వచ్చి అలా వేగంగా పోతుంటాయ్.. గడ్డం ఉన్నోడికి దురద పుడద్ది.. నీకు తెలిసిందే కదా.., ఆ దురద ఆలోచనలకు స్పీడ్ బ్రేకర్స్ లాంటిదన్నమాట.. సరిగ్గా ఆ ఆలోచనలొచ్చే టైమ్లో దురదపెట్టడం..,  ఆ ఆలోచన మీదనుండి దృష్టి దురద మీదకెళ్లి.. ఆలోచన వేగం తగ్గటం.  అప్పుడు మళ్ళీ దురతగ్గాకా ఆలోచన మీదకి దృష్టి మళ్లటం. ఈ కొద్దిక్షణాలు ఏవైతే ఉన్నాయో అయి చాలా ముఖ్యం. అప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర జాంపళ్ళ బండ్లోనుండి.. ఓ నాలుగు జాంకాయలు కిందడ్డట్టు.. ఆ ఆలోచనలు రాలి కిందడి  దొరికిపోతాయ్. అప్పుడు లటుక్కున ఆటిని పట్టేసి రాసి పారేస్తారు.. అదే మరి టెక్నిక్.

అందుకే నేనూ గడ్డం పెంచుతా.. పడ్డ జాంపళ్ళు ఏరుతా, కాస్కో!

ఓహో.. సరేగాని నీకున్న ఈ ఎధవ తెలివితేటలు, నీ జాబులోపెట్టి.., మీ మ్యానేజర్ గాడిని కాకాపట్టి.. ఆడు చెప్పిన పనేదో సరిగ్గా తగలెట్టుంటే.., ఈపాటికి మీ మ్యానేజర్ కి తాతలాంటి ప్రమోషన్ కొట్టేవాడివి కదా.. 
ఇప్పుడిలా నువ్వన్నీ  రచించి, మా జనాల మీదకివొదిలి, మా బుర్రలతో ఫుట్బాల్ గేమ్స్  ఆడేది తప్పేది కదరా..

 ఏడిచావ్!!, మనకి ఇంట్రెస్ట్ లేదేహే ఇయన్నీ.., ఎన్ని చేసాం.. ఆడెప్పుడన్నా.. పోస్టర్ కట్టాడా నాకు. ఎన్ని రిలీజ్లు చేయించాడాడు.. ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ గానీ.. పోస్ట్ రిలీజ్ ఫంక్షన్ గానీ చేశాడా..
ఎన్ని సక్సెస్ లు ఇచ్చామాడికి.. ఒక్క సక్సెస్ మీట్ అన్నా పెట్టాడా.. 
ఒక్క ఐటమ్ గర్ల్ ని తెప్పించాడా.. ఎప్పుడూ మనమే సగం గుడ్డలేసుకున్న ఐటెం గర్ల్ లాగా వాడి ముందు ఆడటమే తప్ప.. మనకి ఒక్కటి చేసేడవలేదాడు.
అర్ధరాత్రుళ్ళు, అపరాత్తుళ్ళు ఇంటినుండి ఆఫీసుకు పిలిపించుకుని పని చేయించుకున్నాడాడు.. ఒక్కసారి కూడా అవార్డు ఇవ్వలేదు.. ఒక్క సన్మానం లేదు.., ఈడెబ్బా రెండొందలెట్టి ఒక్క బొకే కూడా పెట్టలేదు నా చేతిలో.. మనం ఏమన్నా తెత్తేమాత్రం.. చెతుల్లోంచి లాక్కుని మరీ బొక్కుతాడాడు. 

అందుకే ఇంట్రెస్ట్ పోయిందేహే.. ఇయన్ని ఇంక చెయ్యం. ఆడి చెప్పింది ఇనేదేంటిరా నా బగ్గు..

సరేరా.. నువ్వన్నదే కరక్టనుకో కాసేపు.. నువ్వు స్టొరీ రాసి.. ఎవడో ప్రొడ్యూసర్ని ఎప్రోచయ్యి.. ఆఫర్ కొట్టి. మరీ అంత ఈజీ కాదేమోరా..

ఒరేయ్.. క్లయింట్ ని కన్వీన్స్ చెయ్యట్లా.., నేనేమో.. సూపర్ నువ్వడిగిన ఫీచర్స్ అన్నీ ఇత్తున్నాం అని చెప్పట్లా.., ఆడ్ని నువ్వు.. అంతా సూపర్ బగ్స్ లేవని ఎధవని చెయ్యట్లా.., ఇంతకన్నా గొప్పగా ఏముంటాదిరా అక్కడా. ఆళ్ళని కన్వీన్స్ చెయ్యటం ఇంకా ఈజీ..

ఓకే.. కన్వీన్స్ చేశావ్.. ఆఫర్ కొట్టావ్.. సినిమా తీసావ్ అనుకుందాం.., ఒక్క సక్సెస్ చాలదు కదా.. ఇండెస్ట్రీ అంతా సక్సెస్ వలయం అంట.. హిట్ వస్తే నిన్ను పైకెత్తుతారు.. లేకపోతే కిందడేస్తారు.. మరెలా.., నువ్వు సక్సెస్ మీద సక్సెస్లు ఇచ్చేయ్యాలి. అంటే గడ్డం మొత్తం స్వామిజీలా పెంచేత్తావేమో..

ఏడిసావ్.. లే, మనకిక్కడేం ఏడ్చింది మరి.. అదే కదా.. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అందరూ పామేసుకుంటారు.. లేకపోతే సెక్యూరిటీ వాడు కూడా వేల్యూ ఇవ్వడు నీకు.. నిన్నసలు మనిషిలాగే చూడరెవరూ...
ఎక్కడైనా ఒకటేనేహే కుక్క బతుకు.

అంటే నువ్వు ఏమంటావ్.. అక్కడా ఆ కుక్కబతుకు తప్పదంటావ్. మరి నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పోతుందేమో. మళ్ళీ నువ్వక్కడ ఫ్రెషర్ అవుతావు..

పోతే పోనియెహే.. ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నెత్తిమీద బరువులెట్టేత్తున్నారు. మొన్నటికి మొన్న పెద్ద కంపెనీ కదాని ఇంటర్వ్యూ కి ఎలితే.. సిటీవో పొజిషన్ ఇస్తానన్నాడు. సరే పొజిషన్ బాగుందని అనుకుని ప్యాకేజి తగ్గించి చెప్పా.., ఆడేమో కంపెనీ మొత్తం నీదే, తాళాలు ఇవిగో.. పొద్దున్నే వచ్చి ఆఫీసు షటర్స్ తీయడం కూడా నీ పనే అన్నాడు. ఎవడు తీత్తాడు ఆడబ్బా షటర్స్.. మొత్తం పది బ్రాంచులున్నాయి ఆళ్ళవి.. అన్నిటికీ తాళాలు తీసుకుంటా పోతే మధ్యాన్నం అవ్వుద్ది. మరిక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎక్కడేడ్చింది . మహేష్బాబు అన్నట్టు ఆడిచ్చే లచ్చకి ఎలాక్కావాలంటే అలాగ నవ్వమంటన్నారీళ్లు.., ఎవడు నవ్వుతాడ్రా కితకితలెట్టుకుని.., కష్టమేహె.. ఈ ఇండస్ట్రీకి ఆఖర్రోజులొచ్చేసాయి... చూస్తూ ఉండు.

ఏ ఎందుకూ.., నువ్వెలిపోతున్నావనా... ఆఖర్రోజులంటున్నావా..

మరీ.., నేను పోతే, ఎవడూ దిక్కులేడీళ్ళకి.., మొత్తం మా ప్రాజెక్టు.., మా అకౌంట్.. అన్నీ దొబ్బేత్తాయి. మొత్తం కంపెనీకి.. మా మ్యానేజర్ గాడికి అన్నీ స్తంభించిపోతాయి. నన్ను అంత ఈజీగా వదుల్తారనుకుంటున్నావా ఈళ్ళు.. వదల్రీళ్లు.. వాయగొట్టి అయింట్మెంట్ రాసేత్తారీళ్లు.

ఓకే.. అయితే డిసైడ్ అయిపోయావ్ అన్నమాట.., ఏది చెప్పినా ఇనేలా లేవింక. గడ్డం బాగానే ఉంది.. మరి ఎప్పుడు పెడతావ్ రెసిగ్నేషన్.. 

అదే పన్లో ఉన్నా.. కాస్త వేచి చూడు మరీ.

అదిగో.. నిన్ను మీ మ్యానేజర్ రమ్మంటున్నాడు. ఎందుకో ఎల్లిరా.

***********

ఈడెబ్బా.. వచ్చేవారం రిలీజ్ ని ఈరోజు సాయంత్రమే చెయ్యాలంటన్నాడాడు. ఈడెల్లి మీటింగ్లో గంగిరెద్దు ఊపినట్టు తలూపి కమిట్ చేసొచ్చేసాడంటా.., ప్రశాంతంగా ఒక్క నిముషం బతకనివ్వడీడు మనల్ని.
సరే సెలూన్ కి ఎల్లొత్తాను.. ఎవడన్నా వచ్చడిగితే పావుగంటలో వచ్చేత్తానని చెప్పు.

సెలూన్ కా ఎందుకూ..!!

గడ్డం తీయించేత్తానెహే.. లేపోతే ఇయిగో.. ఇలాటి ఆలోచనలే ఒత్తాయి.., ఇంక డెలివరీ ఎక్కడ చేత్తామ్.. 
సాయంత్రంలోగా చెయ్యాలంటే కష్టం మరి. గడ్డం అడ్డమొచ్చేత్తాది!!

బై..27, అక్టోబర్ 2019, ఆదివారం

మారోజుల్లో దీపావళి

ఒకప్పుడు దీపావళి అంటే దసరా సెలవుల నుండీ మొదలయ్యేది హడావుడి.

బొగ్గుపొడి, సూరేకారం, గంధకం, ఐదు రెండు ఒకటి పాళ్లలో కొబ్బరి చిప్పలతో చేసిన తక్కెడతో కొలిచి, అంతా కలిపి మందు తయారు చేసేవాళ్లు.

పేక కట్టలో ముక్కల్ని కర్రకు చుట్టి, ట్వైన్ దారంతో లాగి తారాజువ్వల గొట్టాలు చేసి, దానికి జనపనారని, ఉడకబెట్టిన మైదాపిండితో అంటించి చుట్టి ఆరబెట్టి, అవి బాగా ఎండలో ఆరాకా.. ఆ మందు ఆ గొట్టాల్లో కూరేవాళ్ళు. ఎంతగట్టిగా అంటే పైన సుత్తిపెట్టి కొట్టి మరీ కూరితే అదొక రాయిముక్కలాగా ఉండేది. 

దానికి కొబ్బరీనుపుల్ల దారంతో కట్టి, చేతివేలు మీద జువ్వ పెట్టి బ్యాలన్స్ చేసి చూసి, ఒకపక్కకు వొంగిపోతే దాని పుల్ల కాస్త విరిచి బాలన్స్ చేస్తే, తారాజువ్వ రెడీ అయ్యేది.
అవి యాభైకాడికి కట్టకట్టి, కాగితంలో చుట్టి ఒకచోట దాచేవాళ్ళం.. 

ఆ రోజు పని పూర్తయ్యాక, ఒక పది పదిహేను టెస్టింగ్ కోసం జువ్వలు వెలిగించేవారు..

మొండి జువ్వ(పుల్ల కట్టకుండా) వదిలితే, జనాలందరిని ఒక నాలుగు నిముషాల పాటు జుంబా డ్యాన్సు ఆడించేసేది.. 
నెలబారున జువ్వలు వదిలి కాసేపు జువ్వలు పరుగుపందెం జరిగేది.. 

కొన్ని పైకంటా పోయి శభాష్ అనిపించుకుంటే.. కొన్ని పక్కనున్న తాటాకింటిమీద పడి భగ్గుమనేవి, మళ్ళీ నూతులో నీళ్లు తోడి గబగబా మంటలు ఆర్పే పని తగిలేది.

కొన్ని చేతుల్లో చీదేసి కాలిపోతే.. కొన్ని లుంగీల్లో దూరి తొడలు కాల్చేసేవి. కాలినోడిని ఓదార్చి, ఆకుపసరేసి కాసేపుకి మంట తగ్గి మంద అంతా ఇళ్లకుపోయేవారు. ఇది తారాజువ్వ గొడవ!

వెదురుపుల్లని పెన్సిల్ చెక్కినట్టు చెక్కి, కాగితం ముక్కల్ని చిన్నచిన్న స్క్వేర్ లాగా కత్తిరించి, ఆ పుల్లకు చుట్టి చిన్న మితాయిపొట్లంలా చుట్టేవారం, దానికి ఉడకబెట్టిన మైదాపిండిలో అలా వేలుముంచిరాసి లాగి పక్కనడేయటం. అది సీసింద్రి గొట్టం. సోవియట్ అట్టలని మంచి దళసరి కాగితంలో వచ్చేవి. వాటితో గొట్టాలు చేస్తే సిసింద్రీ మొత్తం వెలిగిపోయినా కాగితం కాలేది కాదు. అందుకని ఆ పేపర్లు సంవత్సరం పొడుగునా ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేసి దాచేసేవాళ్ళం.

మళ్ళీ ఆ గొట్టాలు ఎవడెక్కువ చేస్తాడు అని పోటీ. 
నేనైతే గంటకు వంద గొట్టాలు చేసినట్టు గుర్తు. 
అవి ఎండకు బాగా ఆరి,  కదిపితే గలగల శబ్దం వచ్చింది అంటే ఆరిపోయినట్టు, ఇంతకు ముందే జువ్వకు కలిపినట్టు కలుపుకున్న మందుని, కాకపోతే ఈసారి ఐదు రెండు అర పాళ్లు కలిపేవాళ్ళం.

చిన్న పుల్ల పెట్టి ఆ మందు ఒకొక్క గొట్టంలోకి కూరటం. మందు మొత్తం కూరాకా అదే పుల్లతో మూతలాగా నొక్కేసి పక్కనడేయటం.
కాళ్ళునెప్పి పుట్టినా లెక్కచేయకుండా, సరదాగా రాత్రంతా కూర్చుని సిసింద్రీలు కూరిన రోజులున్నాయి. 

అన్నెందుకురా అని పెద్దోళ్లు తిట్టినా లెక్కచేయకుండా, వేలల్లో సిసింద్రీలు కూరేవాళ్ళం. 

ఇక సాయంత్రం అయ్యాకా ఆ సిసింద్రీల యుద్ధం జరిగేది. ఒరే వెధవల్లారా, తాటాకిళ్ళ దగ్గరే ఏడుస్తారే, అని ఒకొక్క ఇంట్లో తిట్లు తింటూ, అలా ఊరి బయటకు పోయి.. రెండు గ్రూపులుగా చేరి వెలిగించి అవతల గ్రూపుపైపడేస్తే, అది సర్ర్ మని ఏటో దూరేసేది. మళ్ళీ వాళ్ళు వేసింది సర్ర్మంటూ ఇటువైపు దూరేది. అలా వేసుకుంటూ రాత్రంతా సంబరాలు జరిగేవి. ఇది సిసింద్రీ గొడవ..!

మంచి తాడిచెట్టు ఎక్కి ఒక పదిపదిహేను వాటమైన ఆకులు కొట్టి, ఒక రోజు ఎండలో ఎండబెట్టేవారం.. అకుల్లో ఉన్న పచ్చంతా పోయి, ఆకు కాస్త పసుపు రంగులోకి వచ్చాకా కత్తిరించి, ఈనులు తీసి వరసగా పేర్చేవాళ్ళం.

ఆకు మధ్యలో చిన్న పొట్లం చేసి అందులో చిన్న చెంచాడు పటాస్ పోసి, ముందుగా కత్తిరించుకున్న ఎలక్ట్రిక్ ఒత్తుల్లోంచి ఒక ఒత్తి తీసి అందులో పెట్టు పొట్లం కట్టినట్టు ఆకు అలా దోపి నాలుగైదుసార్లు చుట్టేస్తే టపాకాయ రెడీ అయ్యేది. దాన్ని మేం పెటేబుగాయ అని ముద్దుపేరు పెట్టుకున్నాం. తాటాకుతో చేసాం కాబట్టి తాటాకు పెటేబుగాయ.

ఒక్కటి వెలిగించి వేస్తే, ఊరంతా రీసౌండే.. అంత సౌండ్ వచ్చేది. ఎలక్ట్రిక్ ఒత్తి అంటే జమ్మని అంటుకునేది. చాలావరకూ చేతిలోనే పేలిపోవటం, లేదా విసిరింది కిందపడకుండా గాల్లోనే పేలేది.

అలాగే మతాబు మందు తెచ్చి, మతాబులు.
అదే మందు కుమ్మరి ఇటుకల బట్టి దగ్గర కొన్న మట్టి చిచ్చుబుడ్డిలలో కూరి రాత్రి అయ్యేక వెలిగిస్తే ఒకొక్కటి పదిహేను నిముషాలపాటు కాలేది.

ఇప్పుడు ఈ హడావుడి లేదు. అసలు దీపావళి రోజునే హడావుడి కనబడటంలేదు. ఈరోజుల్లో పిల్లలకు ఇవన్నీ తెలిసే చాన్సు కూడా లేదు అంటే చాలా బాధగా ఉంది.

రైతుకు టపాసులు కొనే స్తోమత లేక.. పొలంలో వానకు పడిపోయిన పంటను చూసుకుంటూ కూర్చున్నాడు.
చేతిలో నాలుగు డబ్బులున్నోడు కొట్లో అమ్మే నాలుగు టపాసులు అంటించి ఏదో కానిచ్చేస్తున్నాడు.

ఇలా ఏ హడావుడి లేని.. గ్రీన్ దీపావళి జరుపుకుంటున్నారు పల్లెల్లో..

23, అక్టోబర్ 2019, బుధవారం

స్థలం

సన్నాయిమేళాల మోత మోగింది. పనోళ్లు ఆవుని తీసుకొచ్చి మెట్లు ఎక్కించారు. హాలులో గదుల్లో అన్నింటిలోనూ ఆవుని తిప్పారు. ప్రతీ గడప దగ్గరా గుమ్మడికాయ పగిలింది. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు రెపరెపలాడాయి. వేద పండితులు హోమాలు చేశారు.. ఏక కంఠంతో మంత్రాలు చదివారు. వెయ్యికి పైగా విస్తర్లు లేచాయి. అందరికీ దక్షిణ తాంబూలాలు అందాయి, సంభావనలు భారీగా ముట్టాయి. వచ్చిన అతిధులందరూ సంతోషంగా వెనుదిరిగారు. వైభవంగా గృహప్రవేశం ముగిసింది.

ఆ ఊరికి కొత్తగా బదిలీ మీద వచ్చారు ఇంజనీరుగారు. ఆయనకు సుమారు ముప్పైయేళ్ళ వయసు.
ఆయన దర్జాగా కోటువేసుకుని ఆమె భార్య చేయిపట్టుకుని జీపులోంచి దిగారు. ఆయనతోపాటుగా తమ్ముడూ, చెల్లెలూ, వాళ్ళ అమ్మగారు దిగారు. ఆమెకు సుమారు యాభైయేళ్ళ వయసున్నా సన్నగా చలాకీగా ఉందామె. అందరూ చాలా సంబరంగా కొత్త ఇంట్లోకి పరుగులు పెట్టారు.

ఏడేళ్ళుగా మొండిగోడలూ ముళ్ళమొక్కలతో నిండిపోయుండేది ఆ స్థలం. ఇప్పుడు  అక్కడ రెండస్థుల ఇంద్రభవనం కట్టారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనంత అందమయిన ఇల్లు. ఆ ప్రదేశానికి వన్నె తెచ్చేలా రాత్రి విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోయింది. ఆ స్థలానికి ఇప్పుడు వైభవం వచ్చింది.

వసారాలో పొయ్యివెలిగింది, పెరట్లో తులసిమొక్క చిగురులువేసింది. ఇల్లంతా ఎప్పుడూ పండుగ వాతావరణంలా కలకళలాడింది. 
ఇంజనీరుగారి చెల్లెలు ఆ ఊరి కాలేజీలో చేరింది. తమ్ముడు డాక్టర్ గా ఆ ఊర్లోనే హాస్పిటల్ ప్రారంభించాడు. అమ్మగారు పూజలనీ పునస్కారాలనీ వీధిలో అందర్నీ పిలిచి ప్రతిరోజూ పండుగలా జరిపించేది. ఆ వీధికి ఇంజనీరుగారివీధి అని పేరు రావటానికి ఎంతో సమయం పట్టలేదు. 

వసారాలో పొయ్యికి అలుపన్నది లేకుండాపోయింది. రోజుకు ఒక ఇరవై మందికి తక్కువకాకుండా విస్తర్లు లేస్తున్నాయి. తులసిమొక్క వృక్షంలా అల్లుకుపోయి, చుట్టూ పెద్ద పెరటి తోటను సాయం తీసుకొచ్చుకుంది. చిక్కుడు, బెండ, ఆనప, గుమ్మడి, ఇలా ఇంట్లోకి కావాల్సిన కూరలన్నీ అక్కడే పండేవి. పెద్దావిడ పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంజనీరుగారు బయటవూరి పనుల్లో ఎక్కువ మునిగిపోయారు. నెలకొకసారి ఇంటిపట్టున కనిపించేవారు. మిగతారోజుల్లో దేశాలుపట్టుకుని తిరిగేవారు. అలా కాలం గడిచిపోతుంది.

ఒకరోజు ఇంజనీరుగారి చెల్లెలు కాలేజీలో ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుని చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. అన్ని ఊర్లు తిరిగి వెతికించారుగానీ, ఆమె జాడ తెలియరాలేదు. కూతురు మీద బెంగపెట్టుకుని మనోవ్యధతో పెద్దావిడ గదిలోంచి బయటకు రావటం మానేశారు. 

కోడలు కొన్నిరోజులు ఇంటిపనులు చక్కబెట్టింది. ఒకరోజు ఇంజనీరుగారి తమ్ముడు శవంగా మారి రైలుపట్టాల మీద పడున్నాడు. ఎలా జరిగిందో ఏం జరిగిందో ఎవరికీ తెలియరాలేదు. 

కొడుకుపోయిన వార్తవిన్న పెద్దావిడకు పిచ్చిపట్టింది. డాక్టర్లకు చూపించినా లాభంలేకపోయింది. ఆమె గదిలోనుండే కేకలుపెట్టేది. పనివాళ్ళుకూడా ఆ దొడ్లోకి వెళ్ళటానికి భయపడేవారు. కోడలు పుట్టింటికి వెళ్లి మళ్ళీ తిరిగిరాలేదు. 

ఆ ఇంట్లో పూజలు ఆగిపోయాయి. తులసిమొక్కకి నీళ్లు పొసేవాళ్ళే లేక కొండెక్కిపోయి బూజుపట్టింది.  ఇంద్రభవనం కాస్తా పాడుబడిపోయింది. కొన్నాళ్ళకు వాళ్లేటెళ్ళిపోయారో ఎవరికీ తెలీలేదు.

ఆ స్థలానికి మళ్ళీ వెనకటి గతే పట్టింది. ఇంటిచుట్టూ ముళ్లమొక్కలు పుట్టుకొచ్చాయి. బిక్కుబిక్కుమంటూ నాచుపట్టిన గొడలతో భవనం వెలవెలబోయింది.

కొన్నాళ్ళకు ఎవరో ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. ఇల్లు బద్దలుగొట్టే బాధ్యత ఒక కాంట్రాక్టరుకిచ్చారు. రెండురోజుల్లో ఆ ఇళ్లుకూలగొట్టి, ముళ్ళమొక్కలు పెకళించి, ఒక ఖాళీ స్థలంలా చదనుచేసిచ్చాడు కాంట్రాక్టర్. అక్కడ మరొక పెద్ద ఇల్లు వెలిసింది. ఒక నడివయసు జంట అక్కడ కాపురమెట్టారు. పెరటివైపు పెద్ద తులసిమొక్కనాటి పూజలు మొదలుపెట్టారు. కాలంగడచినా అది ఇప్పటికీ ఇంజనీరుగారి ఇల్లుగానే అందరికీ పరిచయం.

అతనొక బట్టలు వ్యాపారి. ఊరిలో చిన్న దుకాణం ఒకటి మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నా వాళ్ళకి పిల్లలు కలుగలేదు, పూజలు చేశారు, దానాలు చేశారు. సంతానంకోసం చాలా తాపత్రయపడ్డారు, కానీ సంపద రెట్టింపవుతూనే వస్తుంది. ఒక్క దుకాణంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టాడు. ఊర్లో ఒక నాలుగు దుకాణాలకు యజమాని అయ్యాడు.

కొంతకాలం గడిచింది. అకస్మాత్తుగా ఆ వ్యాపారిని ఏక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది. ఇల్లు బోసిపోయింది. నెమ్మదిగా పాడుబడిపోయింది. 
మళ్ళీ వెనకటి స్థితికి చేరుకుంది. ముళ్ల మొక్కలు పుట్టుకొచ్చాయి.

రెండేళ్లు ఆ ఇల్లు అలాగే ఉంది. ఒకరోజు ఒక స్కూలు టీచరు ఆ స్థలాన్ని కొనుకున్నాడు. ముళ్ళమొక్కలు కొట్టించి అంతా శుభ్రం చేయించాడు. అదే ఇంటికి రంగులు వేయించాడు. తనకు అనువుగా ఇంటిలో మార్పులు చేయించాడు.

కాలం గడుస్తున్న కొద్దీ అతని కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. తన మూడేళ్ళ కూతురికి అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో తల్లడిల్లిపోయాడు. ఆ స్థలానికి ఉన్న పూర్వ చరిత్ర తెలుసుకుని, ఏదో వాస్తు దోషమే ఈ సమస్యలకు కారణం అని తెలుసుకున్నాడు. ఎందరో వాస్తుపండితుల్ని కలిసాడు. సలహాలు తీసుకున్నాడు. వాస్తుశాంతి పూజలు చేయించాడు. ఒక పండితుడు నైరుతి లోపలికి పొడిచింది అందుకే ఈ దోషాలు అని గోడలు బద్దలుకొట్టించి కొత్తగా కట్టించాడు. వేరొక పండితుడు ఈశాన్యంలో ఎత్తు ఎక్కువ ఉంది అని పెద్దగొయ్యి తవ్వించాడు. 

ఇంటిలోనూ స్థలంలోనూ చాలా మార్పులు జరిగాయి. అప్పులు చేసి మరీ పండితులు చెప్పింది చేయించాడు.
కుటుంబ ఆరోగ్యంలో అతనికి ఏమీ మెరుగనిపించలేదు. ఒకరోజు తెల్లవారుజామున లేచి నిద్రమత్తులో ఇంటి బయటకొచ్చాడు. పెరట్లో ఉన్న తులసిమొక్కకి ముళ్ళు రావటం చూసి ఆశ్చర్యపోయాడు. కాసేపు అతనికి ఏమీ అర్ధం కాలేదు.  మతిలేనివాడిలా ఆ స్థలమంతా కలియతిరిగాడు. ఈశాన్యంలో ఉన్న గోతిలో కాలుజారి పడి, తలకు పెద్ద దెబ్బతగిలి ప్రాణం విడిచాడు.

కాలం గడిచింది.. మళ్ళీ ఇల్లు పూర్వ స్థితికి వచ్చింది. 
ఎందరినో పొట్టనపెట్టుకున్న ఆ స్థలం ఆనందంతో ఉప్పొంగినట్టుగా ముళ్లపొదలు పుట్టుకొచ్చాయి. గోడలు నాచుపట్టాయి. 

ఒకరోజు తుప్పుపట్టిన గేటు తీసిన చప్పుడయ్యింది. 
ఇంకా ఎంతమందిని మింగుతుందో తెలియదు. ఆ స్థలం ఆశగా ఎదురుచూస్తుంది, తరువాత ఎవరొస్తున్నారా అన్నట్టు ఎదురుచూస్తుంది. 

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఫేస్బుక్ ఆందోళన

సుబ్బు చెక్డ్ ఇన్ టు ముంబై ఇంటర్నేషనల్ ఏర్పోర్టు.. టూ మినిట్స్ ఎగో.., ఓరినాయనో.. డాలరంటే ఎన్ని రూపాయల్రా.. అని అడిగే మన సుబ్బిగాడు కూడా అమెరికా వెళ్ళిపోతున్నాడు.., టూమచ్!!

ఫీలింగ్ బ్లెస్సెడ్ విత్ మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్ కృష్ణా పుష్కర్ ఘాట్.. తమన్నా ఫోటో అంటించిన మిల్క్ బాటిల్ చేత్తో పట్టుకున్న సెల్ఫీ పెట్టిన శంకరం గాడు.., ఓరీడేషాలో!!

వెనకనుండి పెద్ద కేక.. ఏమండి.. టిఫిన్ రెడీ. మీకు ఇష్టమైన పెసరట్లు.. వేడిగా ఉన్నాయ్ తినండి.., ఆగేహే.. బ్రేకింగ్ న్యూస్.. క్రాకింగ్ కామెంట్సు ను ఇక్కడ.

"మై బ్రేక్ఫాస్ట్ ఐస్ రెడీ.. వేడి వేడి పెసరట్లు..", కిచెన్లోకి వెళ్ళే టైము లేక.. గూగుల్లోంచి పెసరట్టు బొమ్మ డౌన్లోడ్ చేసి పోస్ట్ పెడితే.. అరనిముషంలో అరవై లైక్స్.., వామ్మో!.. షేర్ మార్కెట్ లో కూడా ఇంత జనం లేరన్నమాట.

ఫీలింగ్ చిల్డ్.. సెంటోసా వాటర్ పార్క్ విత్ ఫామిలీ.. నిక్కరేసుకుని నీటిలో దిగిన నూకరాజుగాడి ఫోటో.. నూటఇరవై దాటిన లైకులు, ఆరీడి తస్సాదియ్యా!

మధ్యలో యాడ్.. శివాని తన కారును మూడున్నర లక్షలకు అమ్మేసింది.. నువ్వు కూడా నీకారు అమ్మేయ్.. అమ్మేయ్..అమ్మేయ్య్..,
అమ్మేసి ఏం చెయ్యాలీ.. అడుక్కు తినాలా!!
మీ సిపియు వెన‌కాల ఉండే పోర్టుల గురించి మీకు ఎంత వ‌ర‌కు తెలుసు.....? తెలుసుకోవాలా అయితే క్లిక్ చెయ్యండి..
మా సీటు కిందకు వచ్చిన వయసే మాకు తెలీదు.. పోర్టులు తెలుసుకుని ఏం పీకాలే?

మధ్యలో అరవం లో పోస్టుకి ఎవడో తలమాసినోడు లైక్ కొట్టాడని చూపిస్తుంది..
పొద్దున్నుంచీ మొబైల్ స్క్రీన్ వంక చూసిచూసి తెలుగే అర్ధమయ్యి చావట్లేదు.. మధ్యలో ఆరవ లైకులోకటి మాకు!!

మళ్ళీ యాడ్లు.. ఒక బెడ్రూం ప్లాటు.. 90 లక్షలు మాత్రమే.. ఒక్కరూపాయి పావళా పెట్టి ఇప్పుడే బుక్ చెయ్యండి.. లేదా లైక్ కొట్టండి మేమే మీ ఇంటికొచ్చేస్తాం.., వామ్మో!!

కిందకు స్క్రోల్ చేస్తే.. పైన.. న్యూ స్టోరిస్.. న్యూ స్టోరిస్ అని కేకలు పెట్టింది. ఒక్కటి చదవగానే మళ్ళీ న్యూ స్టోరీస్ స్ స్ అని ఒకటే అరుపులు.. పెడబొబ్బలు.. ఖాళీగా కూర్చుని ఈ కథలు రాస్తున్నోళ్లను చితక్కొట్టేయ్యద్దు మరి!

అప్పుడే వేసిన ఆమ్లెట్ లాగ ఫ్రెష్ వాసన వచ్చింది. అంటే ఎవడో కొత్త పోస్టు పెట్టాడన్నమాట మనమే ముందు లైక్ కొట్టాలి.. కొట్టేయ్యాలి.. ముందు లైక్ కొట్టాకా చదవొచ్చులే. హమ్మయ్యా కొట్టేసా.., మనమే ముందు కామెంట్ రాయాలి.. అయ్ బాబోయ్.. ఎవడో టైపింగ్ అంట.. చుక్కలు గంతులేస్తున్నాయి.. మొదటి కామెంటు ఎలాగైనా నేనే ఇస్తాచూడు.. ఇదిగో ఇచ్చేసా.. "తుస్..", అని కామెంట్, వహ్వా.. నేనే ఇచ్చేసానోచ్.. అని ఎగిరి నాలుగు గంతులు.., అద్గదీ.. ఇప్పుడు ఏం రాశారో చదవటం మొదలుపెడదాం.

"ఇలాంటి ఫోటోలకు లైక్స్ రావు.. అదే... ఒక ఆడపిల్ల ఫొటోనో... హీరోయిన్ ఫొటోనో ఐతే.. లెక్కలేని లైక్ లు.. షేర్ లు చేస్తారు... ఇది పరిస్థితి...", అని ఒక ముసలావిడ రోడ్డు పక్కన పడున్న ఫోటో. ఏంటో.. ఈ ఫొటోకి లైక్ కొట్టడం ఎందుకో.. చేస్తే చేతనైన సాయం చెయ్యాలిగానీ.

షీలా-సుషీలా తొమ్మిదేళ్ల క్రితం ఫ్రెండ్స్ అయ్యారు.. వాళ్ళ వీడియో ఇక్కడ చూడండి.., వాళ్ళేమన్నా ఫేమస్ సింగర్స్ లీలా-సుశీలా నా, మా పాత పని మనుషులే కదా, వీళ్లకో ఎకౌంటు.. ఫ్రెండ్షిప్పు.., వాళ్లకు లైక్ కొట్టమని నాకో సజషన్.
ఒరేయ్ ఫేస్బుక్కోడా, నువ్వు మామూలోడివి కాదురా.. ప్రతిఒక్కరికి బ్యాంకు ఎకౌంటు అన్న ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెయ్యలేకపోతుంది.. నువ్వు ఫేస్బుక్ లోకి భలే లాగేసావ్ అందర్నీ. నువ్వుగానీ కనపడాలి.. అప్పుడు చెప్తా.., డౌన్ డౌన్.. స్క్రోల్ డౌన్.

మధ్యలో ఒక పజిల్... 1+1=2, 2+2=4, 3+3=?.
అరగంట ఆలోచించినా ఆన్సర్ దొరకలేదు..
కామెంట్స్ లో చూస్తే.. ఆరు.. ఆరు.  ఆరు.. అని వున్నాయి. ఓహో.. ఆరా.., అబ్బా చాలా కష్టమైన పజిల్ కదా!

ఎవడో కొత్త ఆవకాయ ఫోటో పెట్టాడు.. వీడి దుంపదెగా.. ఇప్పుడే పెట్టాలీ, అని తిట్టుకుంటూ, ఇప్పుడు లేవాలి.. లేచి కిచెన్లోకి వెళ్లాలి.
టక్ టక్.. ఉమ్మ్.. హా..
"ఏమండీ.. ఆవకాయ జాడీ కదిలిన సౌండొచ్చిందేంటండీ కిచెన్ లో..", ఇంటావిడ అరుపు పక్క గదిలోంచి.
"అబ్బే.. అదేం లేదే.. మంచినీళ్ళు తాగటానికొచ్చాను నేనేలే.."

ఈ వినాయకుడి ఫోటో కి లైక్ కొట్టి కామెంట్స్ లో ఆమెన్ అని టైపు చెయ్యండి.. లేకపోతే మీ మేనేజర్ ఇవాళ మీకన్నా ముందుకు ఆఫీస్ కి వస్తాడు.
ఓర్నాయనో.. ఎందుకైనా మంచిది.. లైక్ కొట్టి.. ఆమెన్ కొట్టి ముందుకు పోతుంటే గుర్తొచ్చింది.. వినాయకుడికి ఆమెన్ ఏంటి?, ఎమోలే.. అందరూకొట్టారు కదా!

"ఆకాలేస్తుంది టిఫిన్ పట్రా..."
"ఇంకా ఇప్పుడు టిఫిన్ ఏంటి.. భోజనం టైమయ్యింది రండి వడ్డిస్తా.."
"సరేలే.. ఏం కూరా.."
"పెసరట్టు కూర.."

హుమ్మ్.. అనుకున్నా.. ఫేస్బుక్ పుణ్యమాని.. పెసరట్టు.. కూరవుతుంది, పప్పు.. సాంబారవుతుంది అని. కనిపెట్టినోడేవడో దొరకాలి చెప్తా వాడి పని.

కిందకు స్క్రోల్ చేస్తే.. "ఫేస్బుక్ మా బాబుగాడి సొత్తు అని తొడకొట్టి చెప్పగలిగే వాడు వీడే", మార్క్ జుకెంబర్గ్ పిల్లవాడిని ఎత్తుకున్న ఫ్యామిలీ ఫోటో..

"ఒరేయ్.., నువ్వక్కడే ఉండ్రా నేనొస్తున్నా.."

"త్వరగా రండి చల్లారిపోతుంది.."

"అబ్బా.. నీ భోజనం గోల ఆపు.. అంటున్నది నిన్ను కాదు.. వాడు అయిపోయాడు నా చేతిలో ఇవాళ.."

7, ఆగస్టు 2015, శుక్రవారం

చూడు మాయ్యా...!


పొద్దున్నే లేచి కంపుకొట్టే కార్పోరేషన్ నీళ్ళతో కడుపు కడుక్కుంటుంటే.. ఒక ఎస్సెమ్మెస్ వచ్చిందండోయ్..
“మీకు అక్కర్లేకపోతే.. మీ ఎల్పీజి సబ్సిడీ వెనక్కు ఇచ్చేయండి.. ఆ సబ్సిడీ తో నాలుగు బండలు కొని.. మేము పేదల పూరిళ్ళలో పంపిణీ చేయించి.. వాళ్ళ కుంపట్లో నిప్పు పెడతాం..”, అని. అది చదివి చదవగానే నవ్వుకూడా వచ్చిందండోయ్..,
 ఛ! ఊరుకో మాయ్యా.., సురుకు.. నువ్వు కుడా చతుర్లే.., నెలకు లచ్చ రూపాయలు సంపాదించుకునే ఉద్యోగస్తుడికన్నా కటిక దరిద్రుడు ఎవడుంటాడు మాయ్యా..!, రోజు కూలీ చేసుకునేవోడికి రోజు మారితే.. జేబులు ఖాలీ ఐపోయి కడుపు కాలుతుంది, అదే మాబోటి ఉద్యోగులకు.. నెల మారితే రోజు గడవక నడుం జారిపోతుంది, అంతే కదా తేడా మాయ్యా. ఆ  లెక్కన మాబోటి ఎధవలకు టాక్స్ లని.. వ్యాటులని.. సెస్సులని.. మామలని.. తాతలని.. అవి ఇవీ వడ్డించి జారిన నడ్డి అని చూడకుండా నడ్డిమీద నడ్డిమీద ఇంకా తన్నుతున్నారుగా.., ఈ లెక్కన రోజుకూలివోడు.. నడ్డిరిగిన నెలకూలివోడు ఒక్కటే కాదా?,  మరి మాకన్నా పేదోడు ఇంకెవడు మాయ్యా..!, మీరు పెట్టే ఆ కొంపలో గ్యాసు కుంపట్లు ఎవరింట్లో మాయ్యా.., నువ్వు చతుర్లే చతుర్లు.
ఎన్ని జన్మల పాపాల పుణ్య ఫలమోగానీ ఇక్కడ పుట్టేసాము.. అనిపిస్తా వుంటాది మాయ్యా అప్పుడప్పుడూ, కష్టపడి రాత్రి పగలూ చెమటలు పట్టేలా చదివేసి.., ఎక్కిన మెట్టు.. దిగిన మెట్టు తెలీకుండా తిరిగి తిరిగి ఉద్యోగం సంపాదించేసాము.. అక్కడితో ఆగిపోయిందా అంటే.. ఆగలేదే..!
పడ్డ కష్టాలకు ఫలితం లేదు.., చదివిన చదువుకు తగ్గ జీతం లేదు.., ఎంత సంపాదించినా ఎనకేసింది లేదు.., పిల్లల  స్కూల్ ఫీజు కట్టడానికి స్తోమతలేదు.., పెళ్లానికి మంచి చీర కొనిపెట్టిందిలేదు.., అలా విహార యాత్రకు తిప్పొద్దామంటే  సమయం లేదు.. ఒక సరదా లేదు పాడూ లేదు. ఇల్లు కొనుక్కోటానికి బ్యాంకు ఋణం తప్ప మార్గం లేదు.., పెంచిన అమ్మానాన్నలకి తిరిగిచ్చిందేమీలేదు.., , రోగమొచ్చినా.. రొచ్చొచ్చినా నేనున్నానని భరోసా లేదు.. ఆఖరికి ఛస్తే వెనుకున్నోళ్ళకి.. చూసే దిక్కేలేదు.., మరెందుకమ్మా అన్ని చెమటలు చిందించింది.. అంత చదువూ చదివింది.. అన్ని మెట్లెక్కింది.. అని మనకు మనం అడుక్కుంటే సమాధానం ఉందా..అంటే!, అదీ లేదు.
మరి ఇన్ని రోజులు నడ్డి జారగోట్టుకుని నువ్వు కట్టిన టాక్స్ లు.. వ్యాటులు.. సెస్సులు.. మామలు.. తాతలు ఏమయ్యారు.. ఎక్కడున్నారు.. ఏమైపోయారో.. వాళ్ళంతా నీవంటున్న పేదోళ్ళ దగ్గరకే పోయారంటావా, మాయ్యా!
ఇంతా కష్టపడి చదువుకుని నానా గడ్డి కరచి.,. మా ఉద్యోగాలు మేము చేసుకుని.., మా నడుం నెప్పులు మేము భరించి.., మా.., మా.., ఈ డబ్బులు మేము సంపాదించుకుంటుంన్నా.., మీకోసం టాక్సులు కట్టి.. మీ పిల్లల్ని మేము పెంచి.. మీ  చదువురాని వేలిముద్రగాల్ని.. వాళ్ళ కొడుకుల్ని పోషించి.. మీ.., మీ.., అన్ని చేస్తే.., ఇంకా ఎదో కావాలి.. ఇంకా ఎదో తీసేసుకోవాలి.. ఇంకేదో దోచేసుకోవాలి.., ఏముంది మాయ్యా తీసుకోటానికి?, ఏముందని విరిగిన దాన్ని ఇంకా విరగ్గొడతారు..  విరిగి విరిగి పాకలేని ఈ ప్రాణికి జోకు ఎసెమ్మెస్లు ఎందుకు మాయ్యా పంపిస్తారు. మళ్ళి నవ్వొస్తుంది మాయ్యా.. నవ్వొస్తుంది.     
చదువుకున్నోడికన్నా షావుకారు మెరుగన్నారు.., ఇప్పుడు వాడి పనేమన్నా బాగుందా అంటే అదీ అంతంత మాత్రంగానే ఉంది.. వాడు కట్టిన మామలు.. తాతలు లేక్కతేలక వాడి తికమకలో వాడున్నాడు..., బిత్తర చూపులు చూస్తూ నేను పేదోడినే బాబయ్యా అంటున్నాడు..,  మరి మాయ్యా.. వాడికీ ఎస్సెమ్మెస్ వచ్చింది గాందా.. ఇంకా నువ్వు చెప్పే పేదోడెవడో.. నువ్వు చెప్పే కుంపట్లో నిప్పు స్కీమేందో.. ఎవరికోసమో అస్సలు సమజైతలేదేంది మాయ్యా.
మళ్ళి నవ్వొచ్చిందండోయ్.. నవ్వొచ్చింది.., ఈ సారి నవ్వెందుకు వచ్చిందంటే.. మొన్న జరిగిందొకటి గుర్తొచ్చింది.
ఏ రోగమన్నా వస్తే సర్కారీ ఆసుపత్రిలో కుక్కకూడా కాలెట్టదు కదా, మరి ఒకవేళ కాలు పెడితే కాలేయం తీసేసి.. కిడ్నీలు కొట్టేసి బాడినే మాయం చేసేస్తారని భయం కదా.., ఆ భయంతో ఒకవేళ ప్రవేటు ఆసుపత్రిలో చేరితే.., లేని గర్భానికి.. సీమంతం చేసి.. పురుడు పోసి.. నామకరణం చేయించుకోవాలి అంటే చాలా డబ్బులు కావాలి కదాని..  వస్తుందో రాదో తెలియని రోగానికి ముందే భయపడి మెడిక్లెయిమ్ పాలసీ కొనుక్కుంటుండగా.. మొత్తం ఫ్యామిలికి పదివేలండి.. ఇది కొంటే మీకు మీ మాయ్య గారు కాస్త ఇన్కంటాక్సులో రాయితీ కూడా ఇస్తారు అన్నారు, తీరా కట్టాకా పదివేల పాలసీకి  ఒక పన్నేండు వందల రూపాయలు ఎక్కువ కట్టించుకుని ఇది మీ మాయ్యగారు తీసుకోమన్నారండి.. దీన్ని సర్వీస్ టాక్సని అంటారండి, అని సెలవిచ్చారు.
అక్కడికక్కడే  నీబొమ్మ కనపడిందిపోయింది మాయ్యా..!, నువ్వు ఇవ్వలేని దానీకోసమే నేను కొనుక్కుంటున్నా.. అందులో నువ్వేమి సర్వీసులు ఇచ్చావని మళ్ళి నా నడ్డిమీద తన్నుతావు మాయ్యా.., నువ్విచ్చిన దాన్ని నమ్ముకోవాలంటే ఇంకా భయంగానే ఉందే..  నాకున్నది ఒకటే కాలేయం.. రెండే కిడ్నీలు కదా!
నువ్వు ఇవ్వనిదానికోసం నేను కట్టుకుంటుంటే.. అదేదో ఇంకా తగ్గించి ఇస్తానని ఆశ పెట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ లాగేసుకుంటావా.., ఇంతకీ నాకు లాభమా నష్టమా.. ఏమోచ్చిందో, అర్ధం కాలేదు., ఏంటో!, గుడ్డోడి పెళ్ళికి మూగ పురోహితుడు మంత్రాలు చదువుతుంటే.. చేయ్యిలేనోడు డోలక్క్ వాయించినట్టు.. నువ్వు చేసేదంతా కన్ఫూజన్ కన్ఫూజనుగుందేంటి మాయ్యా!17, జూన్ 2015, బుధవారం

వాట్సాప్.. టింగ్ టిటింగ్

టింగ్ టిటింగ్ అని మోగింది ఫోను.. వాట్సాప్ నుండి ఎవడో ఎదో పంపించినట్టున్నాడు అని తెరచి చూస్తే.. పొలో మంటూ నాలుగు గ్రూపుల్లో నన్ను ఇరికించేసి, మెసేజ్ మీద మెసేజ్ లు పంపించేసి నా నెంబర్ వాడేసుకుంటున్నారు.., సార్.. కిలో ఇరవై మాత్రమే.. ఇప్పుడే వస్తే కిలో పదిహేను.., మావి ఫ్రెష్.., మావి సూపర్ ఫ్రెష్.., మీకు మాత్రమే సూపర్ ఆఫర్, అని నాలుగైదు ఫోటోలు కూడా పంపించేసారు.. అవి డౌన్లోడ్ ఐపోతున్నాయి..., జస్ట్ ఒక్క లైక్ పంపించండి చాలు.. మీ ఇంటికి ఒక కిలో పంపిస్తా టమాటాలు అన్నాడు, టమాటాలా...!!, ఏంట్రా ఇదంతా అని చూస్తే ఇంకేముంది.. మా సందు చివర కూరగాయలోల్లు కొత్తగా వాట్సాప్ గ్రూపు తయారు చేసారంట.. అందులో నా నెంబర్ ని.. నన్నూ అడ్డంగా వాడేస్తూ.. మార్కెటింగ్ చేసేస్తూ.. కొత్త కొత్త ఆఫేర్లు పంపించేస్తున్నారు. చస్స్.. కూరగాయలోడు కూడా నా నంబరు వాడేసాడు.. అని తలపట్టుకుని ఫోను పక్కన పెట్టేసాను..
మళ్ళి టింగ్ టిటింగ్.. టింగ్ టిటింగ్.., ఛ వీళ్ళు వదిలేలా లేరు అని ఫోను తీసిచూస్తే.. మోగింది ఫోను కాదు.. కాలింగ్ బెల్లు.., ఇప్పుడెవడు మళ్ళి.. అనుకుని తలుపు తీసి చుస్తే.. బుట్టతో నిలబడి వున్నాడు సందు చివరి కూరగాయల హీరో.., ఇదేంటి నేను లైక్ పంపలేదు కదా.. నాకొద్దు.. అన్నాను.., మీరు కాదు సర్ మేడం గారు ఎప్పుడో నాలుగు లైక్ లు పంపారు సర్ అందుకే నాలుగు కిలోలు తెచ్చాను.. అని బుట్ట సోఫా ఫై పెట్టేసి వెళ్లిపోతున్నవాడిని ఆపి.. తీసి చూపించు.. ఎలా ఉన్నాయో చూడొద్దా.., అని అడిగితే బుట్ట విప్పి చూపించాడు.., అందులో సంగం పైగా బాగాలేదు.. అదేంటి.. ఫ్రెష్ అని మంచి మంచి ఇమేజ్ లు పంపావు.. అవి ఇవి కాదా అన్నాను సీరియస్ గా.., అదేంటి సార్ అన్నీ తెలిసినోళ్ళు  మీరు కూడా అలాగంటారు.. వాట్సాప్ డిస్ప్లే పిక్చర్ లో ఉన్నంత అందంగా బయట జనాలు ఉంటున్నారా చెప్పండి.., లేదు కదా!.., అలాగే ఇదీను.. అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.  ఓరి.. నీ.. వాట్సాప్ గ్రూపులో కుళ్ళిన తమాటాలు పడా అని తిట్టుకుని వదిలేసాను.
మళ్ళి టింగ్ టిటింగ్.. సార్.. సీట్ ఖాళీ అయ్యింది.. త్వరగా వచ్చేయండి.. అని బిల్డింగ్ కింద ఉన్న కటింగ్ షాప్ వాడు మెసేజ్ చేసాడు.. ఖాలిగా ఉన్న సీట్ ఫోటో.. ఇంతకు ముందు వాడికి కటింగు చెయ్యగా మిగిలిన వెంట్రుకలు జూమ్ చేసి తీసిన ఫోటో పంపించాడు.. అవి డౌన్లోడ్ అయ్యేలోపు నేను వెళ్ళాలి అని త్వర త్వరగా పరుగుపెట్టి.. నేను నా రన్నింగ్ సెల్ఫీ ఒకటి రిప్లై పంపించి, హెయిర్ కట్ కోసం కుర్చీలో కూర్చున్నాను.. ఈయన ఎవరు??, ఫోటోలు తీస్తున్నాడు అని.. పక్కనే కింద పడుతున్న వెంట్రుకల్ని కూడా వదలకుండా ఫోటోలు తీస్తున్న వాడిని చూపించి.. అడిగాను. వాడు నా సండే స్పెషల్ ఎంప్లాయ్ సార్.. తరువాత క్యు లో ఉన్నవాళ్ళకు స్టేటస్ పంపించటానికి పెట్టుకున్నా.. సండే ఎక్కువ మంది వస్తారు కదా సార్.. స్టేటస్ పంపిస్తూ ఉండిపొతే.. ఇక్కడ అసలు పని అవ్వటంలేదు అని.. ఇలా చేశా అని గర్వంగా కాలర్ ఎగరేసాడు కటింగ్ మాస్టర్.., ఓహో.. ఇందాకా జూమ్ వెంట్రుకలు క్రియేటివిటీ వీడిదేనన్న మాట అనుకుని నోరుమూసుకుని కూర్చున్నాను.
అరగంట కటింగ్ తరువాత బయటకు వచ్చేటప్పటికి వేయ్యా నాలుగువందల నలభై మెసేజ్ లు వాట్సాప్ లో నా గురించి ఎదురు చూస్తున్నాయి.. అవన్నీ చదివి రిప్లై ఇచ్చేసరికి ఇంకొక అరగంట పట్టేసింది..
ఇంటికి చేరి స్నానం చేసి, హమ్మయ్యా అని కాసేపు నడుం వాలుస్తుండగా.. మళ్ళి టింగ్ టిటింగ్.. టింగ్ టిటింగ్.., సార్ మీ బైక్ సర్వీసింగ్ ఐపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని మెసేజ్.. శుబ్రంగా కడిగేసున్న నా బైక్ ఫోటో పంపించాడు బైక్ సర్విసింగ్ వాడు.., నాలుగు లైక్ లు రిప్లై కొట్టి వాడు చూసాడు అని కన్ఫర్మేషన్ టిక్ లు.. నీలం రంగులోకి మారాక.. బైక్ తెచ్చుకోటానికి బయలుదేరాను.
ఈ పనులన్నీ అయిపోయేసరికి .. సాయంత్రం ఐదు అవుతుంది.. మళ్ళి టింగ్ టిటింగ్.., సండే సండే అని పేరుకే గానీ ఈ రోజే ఎక్కువ పనులు.. అని మనసులో అనుకుంటుంటే.. ఇదేదో స్టేటస్ కి బాగుంటుంది అని.., “ఓ, అప్పుడే ఐదు.. ఇంకేముంది సండే.. అయిపోయింది రోజు..”, అని వాట్సాప్ స్టేటస్ మార్చాను..,ఛీఛీ.., ఇవ్వేళ ఏమి చెయ్యలేదు.. వాట్సాప్ తప్ప.. అనుకుంటూ, వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే.. గుడ్ మార్నింగ్.. ఇట్స్ సండే.. అని ఒక పది మెసేజ్ లు.. ఇప్పుడే పొద్దు పొడిచినట్టుంది వీళ్ళంతా ఎవరబ్బా అని చూస్తే.. వాట్సాప్ అమెరికోల్ల గ్రూప్ లో పొద్దున్నే లేచి కాఫీ కప్పులు పట్టుకున్న సెల్ఫీ పంపించారు జనాలు.. బాగానే ఉంది సంబడం.. మాకు ఇక్కడ ఇప్పుడే “మండే”.. అని రిప్లై కొట్టి.. వాడిపోయిన నా డిప్ప కటింగ్ మొహం పంపించాను.. టింగ్ టిటింగ్ అంటూ వంద లైకులు పడ్డాయి.., “ఓరినాయనో.. ఏసాలో.. డిప్ప కటింగు కి వంద లైక్ లు..” అని మళ్ళి స్టేటస్ మార్చాను..
కొత్తగా ఎదో గ్రూప్లో మళ్ళి నా నెంబర్ వాడేసారు.. నర్సరీ చదువుతున్న మా పిల్లాడి ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ అంట.. వాళ్ళకు ఫోన్ లేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ పిల్లాడి సెల్ఫీ పంపిస్తే మనం మన పిల్లాడి సెల్ఫీ రిప్లై ఇవ్వాలి.. దే...వుడా..
ఎప్పుడో రైల్లో కలిసిన వాళ్ళంతా ఒక గ్రూపు.., అందులో చిన్న గేమ్ ఆడుతున్నారు.. అప్పుడు మనం ఏ బెర్తులో ఎవరు కూర్చున్నామో చెప్పుకోండి చూద్దాం.. వారి.. దే...వుడా.., చిన్నప్పటి క్లాస్సులో ఫస్ట్ బెంచ్ వాళ్ళంతా ఒక గ్రూపు.. లాస్ట్ వాళ్ళంతా ఒక గ్రూపు.. అన్నిట్లోనూ నా నంబరు వాడేసారు.. అన్నిట్లోనూ నేనా.. ఎదుకలా అంటే.. మేమేం మాట్లాడుకుంటున్నామో నీకు తెలియాలీ  కా...దా...
జువేలరి షాప్ వాడినుండి మెసేజ్ మేడం మీకు ఈ డిజైన్లు పంపించామన్నరండి.. లైక్ కొడితే డెలివరీ చేసేస్తా.. అని.. చేసేస్తావు బాబు నీకేంటి.., రేపు క్రెడిట్ కార్డు వాడు బిల్లు పంపిస్తే .. కట్టడం మానేసి వాడికి కూడా లైక్ పంపించనా... అని వాడికి రిప్లై కొట్టి వాడిని డిలీట్ కొట్టాను..
రాత్రి ఎనిమిదింటి వరకు గుడ్ ఈవెనింగ్ మెసేజ్ లు.. ఆ తరువాత ఒంటిగంట వరకూ గుడ్ నైట్ మెసేజ్ లు.. వీడియోలు.. అన్ని అయిపోయి దుకాణం మూసేసి పడుకుంటే.. మళ్ళి పొద్దున్నే.. టింగ్ టిటింగ్, టింగ్ టిటింగ్..

గుడ్ మార్నింగ్.. ఇట్స్ మండే.., చిచ్చీ... నా వాట్సాప్, నాక్కూడా ఎక్కడో “మండే”.

Related Posts Plugin for WordPress, Blogger...