26, ఆగస్టు 2012, ఆదివారం

బిజీ బజ్జీ...


టైటిల్ చూసి ఇదేదో వెరైటీ వంటకం లాగా వుంది... టపా ప్రత్యేకించి రాసాడంటే ఇంకా వెరైటీ అనుకుని.. గబగబా చదివేసి వండుకుని ట్రైచేస్తే పోలా అని మూకుడ్లూ తపేలాలు పట్టుకొచ్చినట్టున్నారు.. ఏదేమైతేనే స్వాగతం.. సుస్వాగతం.  వేడివేడి.. ఖాళీ మూకుడులో నీళ్ళు జల్లి తుస్సుమనిపించినట్టుగా.. మీ ఆశలు తడిఆశలు చేసినందుకు క్షమించేయండి. ఈ మధ్య అసలు ఖాలీలేక రోజుకు నలభైగంటలుంటే బాగుండు దేవుడా.. నాకు ఇరవైనాలుగుగంటలే ఎందుకిచ్చావ్.. అని జపం చేస్తూ బిజీబజీగా వుండి ఏదొకటి రాద్దామని నా బిజీ షెడ్యూలు నుండి కొంత సమయం బయటకు తీసి రాస్తున్న టపా కదా అని పేరలా పెట్టాను.., అంటే బిజీగా వుండేవాడు అరటికాయ బజ్జీ వేస్తే అది పొడుగు పకోడిలా వచ్చిందన్నట్టు అర్ధంచేసుకోండి పోనీ. అయినా టైటిలేముందండీ దాంట్లో మేటరుండాలిగానీ.. అదే వెతుకుతున్నా, ఏంటని అడక్కండి.. మేటర్.. అదే తట్టడంలేదు ఉండండి..

సరే ఇంతకూ ఏం రాద్దాం.. అని ఆఫీసులో డెస్క్ మీద పడి దొర్లుతూ ఆలోచిస్తుండగా.. వెనకే వచ్చాడు మేనేజరు సాబ్. రారా నా రాజా..!, వచ్చావా.. చక్కగా సెంటుకొట్టుకుని కొత్త పెళ్ళికొడుకు లాగా.., నీ గురించే రాస్తా ఈరోజు అనుకుంటుండగా.."హౌ ఈజ్ ఇట్ గోయింగ్", అని తన ఫేవరెట్ డయలాగు వదిలాడు. నేను నా ఫేవరెట్ డయలాగులు రెండు వదిలి పంపించేసాను.

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు.. అన్నట్టు.. మేనేజరు లేని టీమ్ ఉత్తమ్ టీము.. హాయమ్మో.. టీమే లేని మేనేజరు బలవంత్ రామ్ అని నేనంటాను. బలవంత్ రామ్ నా?.. వాడెవడు  అని అడక్కండి. ప్రాసకోసం అంతే.., ఇక ఆ మేనేజరు.. గడ్డం గీసేవాడికి అడ్డంగా నిలబడ్డట్టు.. సెక్యూరిటీకోసం పెట్టుకున్న గార్డు వచ్చేపోయేవాళ్ళకు కాళ్ళడ్డు పెట్టినట్టు వున్నాడనుకోండి.. ఇంక ఆ టీము కష్టాలు ఎలా వుంటాయో నాలాంటోడు చెబితేనే మీకు కరెక్ట్ గా అర్ధం అవుతుంది.

ఆహా..!, అయితే ఏంటి.. మీ మేనేజరు చంఢశాసనుడా? కళ్ళెర్రచేసి కంటిచూపుతో పనిచేయించుకుంటాడా అని కొందరు ప్రశ్నలేసారు. అందరూ ఒకలా వుండరు కదా!. మెగుడు రోజూ తాగొచ్చి కొడితే ఏడవాలి కానీ చేతకానిమొగుడైతే ఎందుకమ్మా ఏడుపూ అని నిష్టూర్చితే, ఏం చెబుతాం చెప్పండి. ఎవరి కష్టాలు వారివి కాదా!

కష్టాలు ఎక్కడనుండి మొదలెట్టాలో తెలియటంలేదు. ఎటునుండి మొదలెడితే ఏముందిలే.. కష్టాలేకదా!. కంపెనీ కష్టపడి ఒక సాఫ్వేరు తయారుచేసింది. ఆ సాఫ్వేరు బాగానే అమ్ముడుపోయింది. ఆ వచ్చిన డబ్బుల్తో పీకల్దాకా తాగుతూ.. ఎవడికో ఒక అయిడియా వచ్చినట్టుంది.. దీన్ని విండోస్ లో అప్లికేషన్లాగా తయారుచేస్తే ఎలా వుంటుంది అని. సరే తాగేటైములో వచ్చినవి గుర్తుపెట్టుకోకూడదు మర్చిపోవాలి కదా!.. కానీ వాడు తరువాత రోజు దిగిపోయిన తరువాత కూడా గుర్తుపెట్టుకుని.. నాకిది కావాలని మారాం చేస్తూ మెయిలు కొట్టాడు.
ఒక మీటింగ్ పెట్టుకుని చెప్పుకున్నారు. వావ్ సూపర్.. అన్నారంతా. ఇంకేముంది చేసేద్దాం అంటే చేసేద్దాం అని భుజాలు చరుచుకున్నారు. ఆ చరుపులు చూసి.. ఇంకేముంది వీళ్ళంతా చేసేస్తారేమోలే మనకేంటి అని మనం కూడా చరుచుకున్నాం. సంబరపడినంతసేపు లేదు తరువాత క్షణం నుండే మనకిచ్చేసారు చేసేయ్ అని. ఎలా చెయ్యాలి.. దీనికో పద్దతంటూ ఏడుస్తుంది కదా!, అదేదో చెప్పవా, నేనసలు ఈ ఐ.టీ ఇండస్ట్రీలో కాపీ-పేస్ట్ కొట్టే పిల్లకాకి ఎక్పీరియన్స్ తప్ప ఇలాంటిది చెయ్యలేదు అంటే మేనేజరు మొహం చాటేసాడు.., తెలిసి చెప్పటంలేదేమో బ్రతిమలాడితే లొంగుతాడులే అనుకుంటే, తరువాత అర్ధమయ్యింది మనోడికీ పొట్ట కోస్తే "నో రిజల్ట్స్ ఫౌండ్" అన్న మెసేజ్ తప్ప.. పేగులు కూడా బయటకు రావు అని. అలా అని చెప్పలేక.. నీకు నచ్చినట్టు, నీ ఐడియాలు వడియాల్లాగ వేపించి చెయ్యి.. మేమంతా చూసి నీకు ఎలావుందో చెబుతాం.. ఇది నీకే మంచిది నీ అవిడియాలన్నీ ఇక్కడ ఎండబెట్టుకోవచ్చు కదా! అన్నాడు.

సరే  అని ఎలాగోలా తంటాలు పడి చేద్దాం అనుకుంటే ఎప్పటికి చేసిస్తామో.., ఏమేమి చేసిస్తామో అని కాకుండా ఇంకా ఏమిచెయ్యొచ్చో అని నాలుగైదు తగిలించి.. తారీఖుతో సహా వేసి ప్లాన్ అందరికీ పంపేసాడు . మళ్ళీ ఇదేంటి?, నువ్వుచెయ్యనన్నావ్.. నన్నుచెయ్యమన్నావ్.. ఈడేట్లేంటి..?, అంటే. మరి అప్పటికల్లా అయిపోవాలి అదే కదా ప్లాన్ అంటే. అయినా ఎందుకంత భయపడతావ్.. నీకెందుకు నువ్వు మొదలుపెట్టు నేనున్నాను కదా!, అని భరోసా ఇచ్చాడు కూడా. హు.. అవును.. తాటిపట్టికి ఎదురు దేకితే ఏమవుతుంది చెప్పు.. నీకేమీ కాదు, దేకేది నేను కదా!.. అని ఒక బ్రహ్మానందం ఎక్ష్ప్రెషన్ ఇచ్చానంతే.
సరేలే.. పాపం అనుకున్నాడో ఏమో.. మీటింగ్ కి పదా అని చెయ్యిపట్టుకుని లాక్కుపోయాడు. ఒక్కడికి ఎంత టైము పడుతుంది అన్నాడు. నాకు తెలుసు ఎందుకడుగుతాడో.. తరువాత ఏం చేస్తాడో.. వీడు కొత్తగా ఏమీ చెయ్యలేడు. చెయ్యలేదుకూడా... అందరూ చేసినట్టే చేసాడు. ఏం చేసాడూ అంటే.
ప్రాజెక్ట్ మేనేజర్లు వేసే ప్లాన్ ఎలావుంటుందీ అంటే. ప్రాజెక్టు మొత్తం 160 గంటలు.. అయితే.., రోజుకు ఎనిమిది గంటలు కాబట్టీ.. 160/8 = 20 రోజులు, అంటే.. ఇదే పని నలుగురు పనిచేస్తే.. 20/4 = 5 రోజులు అంతే సింపుల్ అని వైట్ బోర్డ్ మీద పెద్ద పేద్ద భూచక్రాలు.. విష్ణు చక్రాలు.. చిచ్చుబుడ్లు.. కాకరపువ్వొత్తులు గీసి చూపించాడు. అంటే దానర్ధం... ఏంటంటే..

ఒక గుఱ్ఱాన్ని గంటకు వంద కిలోమీటర్ల వేగంతో స్వారీ చెయ్యాలి. నువ్వు గంటకు ఏభై నడపగలవు.. అయితే నీలాంటోళ్ళను ఒక ఐదుగురిని అదే గుఱ్ఱంపై ఎక్కిస్తా.. ఇక చూడు ఆ గుఱ్ఱం వంద దాటి పరుగెడుతుంది అని.
అయ్యా విన్నారా? ఏ రాయి అయినా ఒకటే పళ్ళూడకొట్టుకోటానికి అంటే.. పావు'రాయి', ఐశ్వర్యా'రాయి'.. కల్పనా'రాయి' కాదు కదా!  పోనీ ఆ ఇచ్చే గుఱ్ఱాలు గట్టివా అంటే.. ఏ ప్రోజెక్టుకూ పనికిరాని పువ్వులనో.. ఓండ్రపెట్టలేని.. గుడ్డిగుఱ్రాలనో మనకు సమర్పిస్తారు. పనిలేనివాడు గుడ్డిగుఱ్ఱానికి పళ్ళుతోమటం అంటే ఇదేనేమో. ఒక తల్లి.. బిడ్డను కనటానికి తొమ్మిదినెలలు ఆగాలయ్యా.. తప్పదు అది సహజం అంటే వినకపోగా.., ఏ మూడునెలల్లో అవదా అంటే?, ఎలా చెప్పేదయ్యా? సగం బ్రెయినుతోనైనా పర్వాలేదా అంటే అదీ కుదరదా?

ఇంకేం చేస్తాం డబ్బులిస్తున్నారు కదా!, చెప్పింది చెయ్యాలి కదా! అని ఎలాగోలా గుడ్డిగుఱ్ఱాలకు ఎండుగడ్డివేసి, గుగ్గిళ్ళు అని నచ్చచెప్పి పని చేసిపెట్టాం.  కొంత వరకూ సక్సెస్ అయ్యినట్టే. ఆ తరువాత అందరికీ నచ్చిందన్నారు. చప్పట్లు కొట్టారు.. ఈలలు వేశారు. లేచి తొడకొట్టమన్నారు.. మీసంలేదురా అంటే పర్లేదు తిప్పమన్నారు, ఇక్కడివరకూ బాగానే వుంది కానీ.. మళ్ళీ కొన్ని మార్పులన్నారు. అలా కొంత కాలం నుండి ఏదొకటి చెప్పుకొస్తున్నారు.., చేయిస్తున్నారు. మేనేజర్ మాత్రం తారీఖులు వేస్తున్నాడు.. మెయిల్ ఫార్వాడ్లు కొడుతున్నాడు. ఏమన్నా అడిగితే ఇంకోక నాలుగు గుడ్డిగుఱ్ఱాలు ఖాలీ అంటున్నాడు. సారీ పళ్ళు తోమితోమీ నా బ్రస్ బ్రిజిల్స్ విజిల్స్.. అన్నాను.

నాదసలే చిట్టి బుర్ర.. స్టీపెన్ హాకింగ్స్ అంత పెద్ద బుర్రకాదు.., మేం పొడిచింది పల్లెటూరి కాలేజీ.. అదికూడా.. పి.జి., అంటే ట్రిపుల్ ఐ.టి, డబుల్ ఐ.టి.., ఐఐఎమ్. ఎమ్మైటీ.. అంత పై చదువులు లేవు. మావన్నీ గూగుల్లో వెతికి పట్టే చావుతెలివితేటలే.. అయినా అంతటోడినైతే ఈ ఐ.టీలో ఎందుకుంటాను.. అందుకే నాకేమన్నా ఐడియా కావాలి.. అదినువ్వే ఇవ్వాలి అనగానే.. ఐ. ఎగ్రీ.. చూద్దాం మీటింగ్ రిక్వెష్ట్ పంపించు అన్నాడు మేనేజరు. అంటే, ఐ ఎగ్రీ అన్నది మీటింగుకా లేక ఇందాక నేను చెప్పుకొచ్చిన లిస్టుకా అని ఆలోచిస్తూ రిక్వెష్టు పెడితే. ఆ రోజు సెలవుపెట్టో నా మెయిల్ డిలీట్ కొట్టో తప్పించుకుంటున్నాడు. మొత్తంమీద ఉన్న గుఱ్ఱాలను దువ్విదువ్వి మా ఐడియాలతో వడియాలు చేసి, వేపించి.. ముందుకు నడిపించాం.

ఇక్కడితో ఆగలేదు.. చేస్తున్నకొద్దీ ఇంకా ఏదో తక్కువవుతూనే వస్తుంది.., ఇంకా ఇంకా ఏదో చెయ్యాలంట.., చూడు.. అన్నయ్యా!.. మనం ఒక ప్రొడెక్టు చేస్తున్నాం, ముందు మనం ఎందుకు చేస్తున్నాం ఎవడికోసం చేస్తున్నామో తెలియాలి కదా!, దాంతో మార్కెట్టులోకు వదలాలి కదా! పురుట్లో వున్న బిడ్డ ట్వింకిల్ ట్వికిల్ లిటిల్ స్టార్ చెప్పాలంటే ఎలాగన్నయ్యా!, అంటే అలా కాదు.. ఇంకా ఇంకా ఇంకా అని గొంతెమ్మ కోరికలు కోరాడు.. కోరికలే గుడ్డి గుఱ్ఱాలైతే అన్నట్టుంది మా పరిస్తితి.., మాకు ప్రతిరోజూ వినపడే ఫేవరెట్ డయలాగుల్లో కొన్ని ఇక్కడ - అదేదో తెలియదు కానీ.. అది మిస్సయ్యింది..., నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తురావటంలేదుకానీ.. అలాచేస్తే బాగుంటుంది, ఏంటో చెప్పలేనుగానీ.. ఎదో ఇంకా తక్కవయ్యినట్టుంది. ఇలా కాదుగానీ ఇంకా బాగా చెయ్యొచ్చు. ఇది వాళ్ళుచెప్పేంత వరకూ కాదు.. మనమే ముందు చేసుండాల్సింది.
మీరు సారాంశాలు నన్ను అడక్కండి.. మీరూ మేనేజరు కావాలంటే ఇప్పుడే రాసిపెట్టుకోండి. అర్ధాలు కష్టంకానీ.. ఒకొక్క లైనుకు పెడర్ధాలు తియ్యాలంటే పెద్ద గ్రంధమే రాయచ్చనుకోండి.

ఒరే. అప్పారావో.. నెలకు రెండులక్షలు జీతం తీసుకునేది మెయిల్ ఫార్వాడ్లు కొట్టాడానికా.. సంవత్సరాలు సంవత్సరాలు ఫారిన్లో వున్నది ఫారిన్ స్కాచులు ఎన్నిరకాలో తాగి రీసెర్చులు చేయటానికా?
ఇన్నేళ్ళు  ఆ బయటకూర్చుంటున్న సెక్యూరిటీ గార్డును లోపల కుర్చోపెట్టినా ఏదోకటి నేర్చుకునేవాడే.. నాకు సాయం చేసేవాడే.. అని గట్టిగా అరవాలనిపిస్తుంది.. కానీ అరవలేను.. అరవసినిమా చూసినట్టు రోజూ ఈ సినిమా నేను చూడలేను. నేనిప్పుడే జంపు.. అందామంటే, బయట జాబ్ మార్కెట్టేమో కంపు.
ఇలాంటివాళ్ళందర్నీ ఎవడు ఇంటర్వూ చేసి తీసుకున్నాడో ఏంటో వాడు దొరికితే.. నా సామిరంగా... 
అదేదో సినిమాలో డయలాగు అన్నట్టు.. నరుక్కుంటూ పోతే ఎవరూ మిగలరు.., హు.. ఇలా వెతుక్కుంటూ పోతే ఐటీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయి పీకల్లోతు దాకా పాతుకుపోయిన దిగ్గజాలు చాలామందే లిస్టులోకి రాకుండా మిగలరు.

మనమెన్ని అనుకున్నా వాడి కష్టాలు వాడికుంటాయిగా పాపం.. అంటారా!, పొద్దున్నేఒంటిగంటకు ఆఫీసుకొచ్చి మెయిల్సు చెక్ చేసుకుని... ఒంటిగంటన్నరకు ఆఫీసు ప్రహారీ గోడకే అనుకునున్న ఇంటికి భోజనానికెళ్ళొచ్చి.. మళ్ళీ సాయంత్రం నాలుగింటికి ఆఫిసుకొచ్చి రాత్రి ఆరింటికి వెళ్ళాలంటే ఎంత కష్టం. ఈ మధ్య మధ్యలో ఎన్ని పనులు చక్కబెట్టాలి.. ఇంట్లో అంట్లుతోమాలో.. బట్టలుతకాలో.. తెలియదు కానీ.. మేమిచ్చిన మెయిల్సుకి మాత్రం రిప్లైలు ఇవ్వాలి.. కింద సెండ్ ఫ్రమ్ బ్లాక్ బెర్రీ.. బురదలో పడిదొర్లిన బఱ్ఱె.. ఇవన్నీ ఎంత కష్టమో కదా!

కాసే చెట్టుకు రాళ్ళదెబ్బలన్నట్టు.. చేసేవాడికే కొత్త టాస్కులు అంటగడతారు ఈ కార్పొరేటోళ్ళు. నీ అంతటోడు లేడురా అని పైకెక్కించినంతసేపు ఉండదు. కిందకు పడేలోపే కుర్చీలో దబ్బళం పెడతారు. అలా అని రోజుకు ఎన్నిసార్లు పైకెగురుతాం.. దబ్బళం నెప్పులు ఎన్నని భరిస్తాం. దేనికైనా కొంత లిమిట్ వుంటుంది కదా... చెబుతున్నాడు కదా అని ఏదిపడితే అది చేసేస్తే.. "ఒరే కిందకెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తీసుకురారా!", అన్నా అంటాడు. పని చెబితే తప్పించుకు తిరిగే లౌక్యం అన్నా తెలియాలి లేక తలవొంచుకుని పనిచెయ్యగలిగైనా వుండాలి.. అదేమీ లేదా అయితే నాలుక మడతపెట్టి ఇండియన్ ఇంగ్లీషునే.. ఫారిన్ ఇంగ్లీషులాగా మాట్లాడి మాటల-మేకప్పేయాలి..

ఆలోచనలతో.. నల్లరంగు వేసుకున్న వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి..,రిలీజు డేటు రానేవచ్చింది.. ఏమిచ్చామో మాకే తెలియదు అన్నట్టు మేం ఇస్తే... ఏం తీసుకున్నారో వాళ్ళకే తెలియదు అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు.
తరువాతరోజునుండి ఏంటి అంటే ఏముంది. మీటింగు.. అందులో కొత్తగా వచ్చిన విండోస్ 8 కి సపోర్ట్ చేసేలా కొత్త ప్లాన్. మళ్ళీ డేట్లతో సహా మా వాడి మెయిలు. బాగానే వుంది వ్యాపారం. ఇలా చేసుకుంటూపోతే ఏముంది నాకు బిల్ గేట్స్ దర్శనమే కదా!, మైక్రోసాప్ట్ గురించి తెలియనిదేముంది. సంవత్సరానికో కొత్త ఓ.యస్ ప్రోడెక్టు. నెలకో కొత్త ప్యాచ్ రిలీజూ, ప్యాంటు చిరిగింది కదా అని ఇలా ప్యాచీలేసుకుంటూ పోతే కొన్నాళ్ళకు మొత్తం ప్యాంటునిండా ప్యాచిలే కనిపిస్తాయికానీ  క్లాత్ కనపడనట్టు మా బ్రతుకులు కూడా ఒకరోజు ప్యాచ్ బతుకులు అవుతాయి.

ఈ ఇండస్ట్రీ తప్ప ఏదన్నా వెతకాలి.. ఈ ఉద్యోగానికి నామం పెట్టాలి.. ఈ బిజీ లైఫుకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. అని ఆలోచిస్తుంటేనే భయంవేసింది. ఇది వదిలేస్తే ఎవడిస్తాడు ఉద్యోగం.. ఇంతంత జీతాలు?, ఎవడుకడతాడు ఈ ఇ.ఎమ్మైలు.., ఇంకెకక్కడుంటాయి ఈ కుర్చీనరకాలు?  దొరుకుతాయా ఈ నడుంనొప్పులు.., హై బీ.పీలు.., ఏమైపోతారు మనల్నే నమ్ముకున్న కార్పొరేట్ డాక్టర్లూ.. ఇన్సూరెన్స్ కంపెనీలు.. బోసిపోవా హైవే రోడ్లు.. కొత్తకార్లకు వచ్చే బేరాలు.. షాపింగ్ మాల్లు.. సినిమా హాల్లు.. తలచుకుంటేనే చెమటలు పడుతున్నాయి కదా!

ఇదిలా ఆలోచిస్తుండగా ఒక చిరకాల మిత్రుడి నుండి అకాల-ఫోను కాల్.. మమ్మల్ని మర్చిపోయారు.. ఈ మధ్య అసలు ఫోనుచెయటంలేదు అని. ఏంటో.. ఫోనున్నవాడు ప్రతివాడికీలోకువేనని. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికీ అంతే దూరం కదా!. మరి నీ ఫోను ఎక్కడపెట్టుకున్నావ్.. నువ్వే నాకు చెయ్యొచ్చుకదా? అందామంటే అసలే అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లుంటుందని వదిలేసాను. అందులోనూ చాలాకాలం తరువాత ఫోన్ రీచార్చ్ చేసి ఔట్ గోయింగ్ వాడుతున్నవాడిని డిస్కరేజ్ చెయ్యటం ఎందుకులే అని ఏమీ అనకుండా మాట్లాడాల్సొచ్చింది. మన కష్టాలు కధగాచెబితే భోరున ఏడుస్తాడనుకుంటే.. అంతే మరి పరుగెత్తి పెప్సీ తాగేకంటే..కంటే నిలబడి నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు కదా! అంతా మనం చేసుకున్నదే కదా! అంటాడు.
ఆ సామెతలన్నీ వినటానికి బాగుంటాయిరా పర్సనల్ లోన్ తీర్చలేవురా, కోరుకున్నదే అంటే.. ఏరికోరి ఈ ఇండస్ట్రీలో పడలేదురా బాబూ.. ఏ దిక్కూలేకా.. ఏ లక్కూ పట్టకా.., అసలు మా తాత ఆరోజు అలా చేసుండకపోతేనా.. ఇప్పుడు ఎన్ననుకుని లాభంలే.. ఇలా ఐటి కుడితిలో పడి గిలగిల కొట్టుకుంటున్నాం...
లేనిరోజుల్లో తింటానికి డబ్బులులేవు.. డబ్బులున్నరోజున తింటానికి లేదు.., అని టాపిక్కు కాస్త డైవర్టు చేస్తే.. అయితే నీ వయసు ఎంత.. బ్యాంక్ జాబ్స్ పడ్డాయి రాయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు...
అయ్యా!,  బిజీ 'షెడ్యూల్' లో పడి 'తెగ' నలిగినలిగి కొట్టుకుంటున్నంత మాత్రాన.. 'షెడ్యూల్ తెగ' రిజర్వేషను వర్తించదు తండ్రీ.. నా వయసుకు.. నా రిజర్వేషను క్యాటగిరీకీ గవర్నమెంటు వాళ్ళలెక్కల్లోంచి నేను ఎప్పుడో రిటేరయ్యిపోయాను.. అన్నాను. సరేలే బాధపడకు.. ఇప్పుడేడ్చి ఏం లాభం.. హ్ము.. అని నవ్వలేని నవ్వు.

ఇది రాస్తుంటే వెనుకే వచ్చాడు కొత్త పెళ్ళికొడుకు.. మళ్ళీ "హౌ ఈజ్. ఇట్ గోయింగ్", అంటూ.. సేమ్ ఫేవరెట్ డయలాగుతో. "హా.. ఏంలేదు కోడింగ్", అన్నాను. ఇదేంటిది ఇలా వుంది జిలేబి లాంగ్వేజ్ అన్నాడు.. ఇదా.. మైక్రోసాఫ్ట్ కొత్తప్రొడెక్ట్ వచ్చింది.. మన రీజినల్ లాంగ్వేజీలో కూడా  ప్రోగ్రాములు రాసుకోవచ్చు అదే కాస్త రీసెర్చ్ చేస్తున్నాను అన్నాను.. "వావ్.. వాట్ ఏ గ్రేట్ టెక్నాలజీ", "అది సరేగానీ.. మన ప్రోడెక్ట్ ఐ.ప్యాడ్ కి సఫోర్ట్ చెయ్యగలమా?, ఇప్పుడే కాల్ లో మాట్లాడి వస్తున్నాను. ఎన్నాళ్ళు పట్టొచ్చో కనుక్కోమన్నాడు. ఐ.ప్యాడ్ అంటే ఈ రోజుల్లో సులువే కదా!.. రేపు పొద్దున్నే మీటింగ్ పెట్టుకుని మాట్లాడదాం..", అని చక్కగా వెళ్ళిపోయాడు..., అవునండీ ఐ.ప్యాడ్ ఉపయోగించడం.. అంటే ఈ రోజుల్లో సులువే కదా!, మెయిలు ఫార్వార్డ్ తో ప్రోగ్రాములు రాసే టెక్నాలజీ వస్తే ఇంకా సులువు కదా!. అయ్యా ఇదండీ పరిస్థితి..

ఏంటి ఈ టపాకు కూడా క్లైమాక్స్, గొప్ప ఎండింగ్ కోరుకుంటున్నారా!!.. ఎంత దారుణం ఎంత అన్యాయం..., మీరందరూ ఊహించినట్టుగా ఈ ఐ.టి బ్రతుకులకు అంతంలేదు. ప్రపంచ ఐ.టి కార్మికుల్లారా ఏకంకండి. ఛలో అమెరికా!. అలా అటునుండి అటే.. అన్నీ వదిలి.. ఛలో ఆఫ్రికా..

18, ఫిబ్రవరి 2012, శనివారం

కన్ఫ్యూజన్లో...


పొద్దున్నే లేచినదగ్గర్నుండి మొదలయ్యింది ఎంటో ఈ కన్ఫ్యూజన్. టూత్ పేస్టు బ్రష్ కి పెట్టుకుని నిద్రమత్తుతో కళ్ళుతెరవకుండానే సింక్ దగ్గరున్న మిర్రర్ ముందు కునుకులాగుతూ పల్లు తోమేస్తున్నాను. తోమటంఅయ్యాకా అద్దంలోకి చూద్దునా మొత్తం తెల్లగా కనిపించింది.. ఏంటి నా పల్లేనా ఇంత తెల్లగా మొహం అంతా అయిపోయాయ్ అని మొహం వెతికితే కనబడలేదు.. పేస్టు నురగలో మొత్తం మొహం అంతా తెల్లగా కప్పేసుంది. ఇదేంటి ఇంతనురగొచ్చింది అని మొహంకడుక్కుని చూసాకా అర్ధం అయ్యింది నేను పెట్టుకున్నది పేస్టుకాదని షేవింగ్ క్రీమని.

ఇదెక్కడిగోలో ఏంటో ఎందుకో ఈ కన్ఫ్యూజన్ అని టూత్ పేస్టుతో మళ్ళీ పల్లు తోముకుని.. అలానే అలోచిస్తూ గ్యాస్ స్టౌ వెలిగించి టీ పెట్టుకున్నాను. మరుగుతున్న టీ డికాషను వంకచూస్తూ నాలుగు చెంచాల పంచదార ఎక్కువేసి దించేసి.. టీ.వీ పెట్టి పొద్దున్నే ఈరోజు చావువార్తలేమయ్యుంటాయబ్బా అని న్యూస్ ఛానల్స్ లో మొహం పెట్టి సోఫాలో కూలబడి టీ తాగుతున్నాను.

ఎక్కడో పది మంది సజీవ దహనం.. ఇంకెక్కడో లారీని ఆటో ఢీ నలుగురు మరణం ఇలా వార్తలన్నీ కళ్ళార్పకుండా పొద్దుపొద్దున్నే చూస్తేగానీ టీ.వీ పెట్టినందుకు మనసుకి సంతృప్తి కలగలేదు. హెడ్లైన్స్ అయిపోయి.. అసలు వార్తల్లోకొచ్చేసరికి అప్పటిదాగా రుచిగా అనిపించిన  టీ చేదుగా అదేదోలా వుంది. ఇదేంటి సగం దాకా బాగానేవుంది దీనికేం రోగమొచ్చిదబ్బా అని ఆ సగం టీ కిచెన్ సింక్ లో పారబోసి నోరుకడుక్కున్నాకా.. పేస్టుకు బదులు షేవింగ్ క్రీమ్ లాగా ఇక్కడ పంచదారకి బదులు టేస్టింగ్ సాల్ట్ వాడేసానని అదీగాక నాలుగు చెంచాలు ఎక్కువే వేసేసాననీ తేలిపోయింది. బాగానే వుంది ఈ కన్ఫ్యూజన్ సంబడం. ఇలా మొదలయ్యిదేంటిరా ఈ రోజు ఇంకా ఎన్నిఅఘాయిత్యాలు చూడాలో ఏంటో అని తల గోడనుకుని కర్టెన్ కేసి కొట్టుకుని మళ్ళీ కన్ఫ్యూజయిపోయాను.

టేస్టింగ్ సాల్ట్ ఎఫెక్టు వల్ల అనుకుంట కాలకృత్యాలు మాములుకంటే కాస్త ఎక్కువ టైము సీతాకాల సమావేశాల్లా సమయం పట్టేసింది. ఇప్పుడు కూల్ వాటరనుకుని ఏ హాట్ వాటరో నెత్తిమీదోసుకుంటే ఈకలు పీకేసిన బ్రాయిలర్ కోడిలా తయారయిపోతాననుకుని భయమేసి చన్నీళ్ళతో త్వరత్వరగా మొలతాడు తడిపేసుకుని స్నానం ముగించేసాను. షర్టనుకుని ప్యాంటు.. ప్యాంటనుకుని షర్టు ఎక్కడ తికమకపడిపోతానో అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వేసేసుకుని ఇన్షర్ట్ చేసేసుకున్నాకా అక్కడే తీసి పెట్టుకున్న బనియన్ కనిపించింది..ఛీ..నా జీవితం.. అని మళ్ళీ అన్నీ విప్పి మొదట్నుండి మొదలెట్టాను.

కాసేపటికి ఎలాగైతే త్వరగా పనులు కానిచ్చి.. లిఫ్ట్ ఎక్కేసి డోర్ వేసి బటన్ నొక్కాననుకుని ఒక పదినిముషాలు వెయిట్ చేసి తరువాత బటన్ని నొక్కి పార్కింగ్ ఏరియాలోకొచ్చేసరికి  ఫోన్ రింగయ్యింది. కుడనుకుని ఎడమ వేపు ప్యాంటుజేబులో చెయ్యి పెట్టివెతికితే ఫోను కనబడలేదు. అయ్యో ఫోను మర్చిపోయినట్టున్నాను. నా మతిమరుపుమీద మా మేనేజరు ప్రజెంటేషనివ్వా.. అనుకుంటూ వెనక్కు బయలుదేరేలోగా వెలిగింది బుర్ర.

ఫోన్ మర్చిపోతే రింగ్ ఎలా అవుతుంది..? అదే కదా, అయితే ఈ జేబులో వుందా అని ఫోన్ ఎత్తేసరికి
"రమేష్ బోల్ రహా హూ", అన్నాడు అవతలి వ్యక్తి.. ఓ రమేష్.. నేను సురేష్.. అని 5-స్టార్ చాక్లెట్ట్ ఏడ్ గుర్తొచ్చింది గానీ ఆ రమేష్ ఎవడో గుర్తురాలేదు.
ఎవరు మీరు అనకుండా "హాజీ బోలియే...",అని నటించేసాకా. మీదనుకుని మా ఇంటికి తాళం వేసేసారు. నేను బయట్నుండి ఇప్పుడే వచ్చాను మా ఆవిడ ఇంట్లోనే వుండిపోయింది అన్నాడు అతను. అప్పుడు ఏ  కన్ఫ్యూజన్ లేకుండా మా ఎదురింటి ప్లాటులో వుండే రమేషే ఫోన్ చేసాడని కన్ఫామ్ అయిపోయింది.

పరుగెత్తుకుంటూ వెళ్ళి తాళం చెప్పి సారీతీసాను. చిచ్చిచీ.. సారీ చెప్పి తాళంతీసాను.. ఆ తాళం మా ఇంటి తలుపుకు వేసుకుని ఉరుకులూ పరుగుల్తో పడుతూలేస్తూ ఆఫీసులో అడుగుపెట్టేసాను. నా డెస్క్ దగ్గరకు వచ్చి చూసేసరికి ఎవడో కూర్చునున్నాడు. అర్య-2 సినిమాలోలాగా నైన్త్ ప్లోరు టైపు వాడిలా నేనువేరే ప్లోరులోకిరాలేదు కదా అని ఒక్కసారి మా మేనేజరు క్యాబిన్.., మా క్యాంటినుకు దారి.. నా దగ్గర్లోవున్న అమ్మాయిల్నీ.. అవిఇవీ సరిచూసుకుని అదిమా ఆఫీసే అని కన్ఫమ్ చేసుకున్నాకా.
"హలో, మీరు కన్ఫ్యూజన్లో నాడెస్క్ దగ్గర కూర్చున్నట్టున్నారు ఇదినాదీ..", అని చిన్నపిల్లాడు కారుబొమ్మని చూపించి నాదీ.. అన్నట్టు నా డెస్క్ చూపించి అన్నాను..
వాడు నవ్వుతూ.. "అవునుమీదే..నేను సిస్టమ్ సపోర్ట్ టీమ్.. మీరు ఫలానా సాఫ్వేర్ ఇస్టాల్ చెయ్యమని టికెట్ రైజ్ చేసారు కదా అది చేద్దామని వచ్చాను", అన్నాడు.
"అవునా!.. సారీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అందుకే అలా అన్నానని", అన్నాను.
"హా పర్వాలేదు నేను సిటీనిద్రపోతున్నప్పుడు మేలుకుని పనిచేస్తుంటానులేండి", అని  పెద్ద డెకాయట్.. గజదొంగ స్టైల్లో ఇంట్రడక్షన్ ఇచ్చాడు.
"ఓ నైట్ షిప్పుల్లో ఉంటారా!", అని అర్ధమయ్యినట్టు తలూపాను.
"హహా.. అవును", అని నవ్వి సాఫ్వ్టేర్ ఇన్స్టాల్ చేసివెళ్ళిపోయాడు.

అక్కడితో ఆగలేదు నా కన్ఫ్యూజన్.. డాట్-నెట్ అనుకుని జావా ప్రోగ్రాములో కెలికేసి.. కామెంట్లు రాసేసాను. ఆ ప్రోగామ్ గలవాడొచ్చి గొలగోలచేసేసాడు.. ఎవడు చేసాడో తెలియక తికమక పడిపోయాడు. నేను సైలెంటుగా ఆ సిస్టమ్ రిమోట్ సెషన్ ఆపేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాను.

టెస్టింగ్ సెర్వర్ అనుకుని ప్రొడక్షన్ సెర్వర్లో వేలుపెట్టి నాలుగు రికార్డుల డాటాబేస్ నుండి డిలీట్ కొట్టాను. అయ్యబాబోయ్ అని నాలుక్కరుచుకున్నాను. అదంతా చెమటలు కక్కుతూఎవడూచూడకుండా రివర్ట్ చేస్తూ మధ్యమద్యలో ఫోననుకుని పక్కనేవున్నమౌసు చెవిదగ్గరపెట్టుకుని కన్ఫ్యూజయిపోయి పక్కోళ్ళందరిదగ్గరా ఇస్సల్ట్ అయిపోయాను.

ఇలాక్కాదు ఈరోజు ఏదో తేడావుంది. ఏంటో తేల్చేయాలని రెస్ట్ రూమ్లో కెళ్ళి హ్యాండ్ వాష్ సోపుతో తలంటేసుకుని చల్లబడి టెన్సన్ లేకుండా బయటకొచ్చి కళ్ళుమూసుకుని మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాను.

పదినిముషాలు పోయాకా ఎవడో ఎదురుగా వచ్చి ఎలకగోకినట్టి చేతిపైన తట్టిలేపి మీటింగ్ కి రమ్మన్నారు అన్నాడు. డ్రాలో వున్నపస్తకం పెన్నూపట్టుకని మీటింగ్ రూమ్లోకి పరుగుపెట్టాను. అందరూ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. ఫలానే డేట్ లో అయిపోవాలి.. అయిపోతుందా అన్నాడు.
అయిపోతుంది ఏంపర్వాలేదు అంటున్నారు అంతా. నాకుమెడిటేషన్ మత్తు దిగినట్టులేదు..ఏమీ అర్ధంకావటంలేదు. అలాగే తింగరి చూపులుచూస్తున్నాను.
వాడెవడో లేచివెళ్ళి వైట్ బోర్ట్ పై. పెద్దలిస్ట్ ఎక్కించేసాడు. సరేలే పడుంటుంది కదా అని ఆ లిస్ట్ నేనూ నా పుస్తకంపై ఎక్కించేసాను.
పక్కన ఒక్క నిలువు గీత గీసాడు...నేనూ నిలువుగా గీతగీసేసాను. కాస్త పొడవైందని చేత్తో చెరిపేసాడు. నేను పెన్ను గీతను చెరపలేను కాబట్టి కాస్త గీత చివరని కొట్టేసాను. సరే ఎవరెవరు ఎన్నిచేసారో చెప్పండి అని ఒకొక్కడిని అడుగుతున్నాడు. అవి పది..ఇవి నాలుగూ అని ఎవో లెక్కలు ప్రతివారుచెబుతున్నారు.. వాడు బోర్టుమీద వారి పేరు తిన్నగా రాస్తున్నాడు. అది చూసి నేనూరాసేస్తున్నాను. కొంత మంది త్వరత్వరగా చెప్పేస్తున్నారు. నేనూ త్వరత్వరగా రాసేస్తున్నాను.

కాసేపటికి అంతా నిశ్సబ్దం అయిపోయింది. స్పీడుగా రాస్తున్న నా పెన్ను.. సర్ర్...మని గీతగీసుకుంటూ బ్రేకేసేసింది. నేను తలవంచుకుని రాసేవాడిని తలెత్తి పైకి చూసాను. అందరూ చెప్పటం అయిపోయిదనుకుంట... ఇక నావంతేనని అందరూ నా వంక చూస్తున్నారు.
"నీవి ఎన్ని?", అని నన్నడిగాడు, నాకు అర్ధం కాక ఏంటి అని అడిగాను.
"అవే రిపోర్టులు ఎన్ని చెసావ్", అన్నాడు.
"ఏ రిపోర్టులు??", అన్నాను.
"అదేంటి నువ్వు ఈప్రాజెక్టుకి కొత్తా?", అని ఇంకో ప్రశ్నవేసాడు.
అన్నిటికీ నేను పెట్టే బ్లాంక్ ఫేస్ చూసేసరికి వాడికి అర్ధమయ్యినట్టుంది..
"హే.. నువ్వు వేరే టీమ్ కదా ఈమీటింగ్లో కి ఎందుకొచ్చావ్", అన్నాడు.

"నాకేం తెలుసు వాడు పిలిస్తే వచ్చాను", అన్నాను నన్నుపిలిచినవాడిని చూపిస్తూ.
వాడు నా వంక చూస్తూ "కన్ఫ్యూజ్ అయ్యాను సారీ.. ఆ కార్నర్లో పిల్లర్ దగ్గరున్నవాడిని పిలవమంటే నిన్ను పిలిచినట్టున్నాను..సో సారీ..", అని పిచ్చినవ్వు నవ్వాడు.

"ఇట్సోకే..నో ప్రాబ్లమ్..", అని నెమ్మదిగా లేచి నడుచుకుంటూ వచ్చి డోర్ మెల్లిగా తీసుకుని బయటపడ్డాకా.. వాళ్ళు నవ్వుకుంటున్న నవ్వులు వినిపించుకోనట్టుగా మొహంపెట్టి విజిలేసుకుంటూ వచ్చేసాను.

జరిగిన అవమానం తలచుకుంటూ కుమిలిపోతూ.. పైకేమీ ఎరగనట్టు సిస్టమ్లో అలా రిఫ్రెష్లు కొడుతుంటే.. వెనక వచ్చి నిలబడి..లంచ్ కి పోదాం పద అని అన్నాడు మా కొలీగొకడు. "అప్పుడే లంచ్ టైమా.. మెడిటేషన్ చేస్తున్నా సారీ..సారి.. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా.. అందుకే టైము తెలియలేదని వాడికి కన్ఫ్యూజన్ పై కవరింగులిచ్చి.. వాడితోపాటు క్యాంటిన్ కి బయలుదేరాను.

లంచ్ తీసుకోటానికి లైన్లో నిలబడితే.. ఎవడో బూటుకాలితో నాబూటుకాలుపైవేసి పసపసా తొక్కేస్తున్నాడు..
"హే.. కాలుతియ్య్  బే..", అని హిందీలో అరిచేసరికి...
"నువ్వు హిందీలో అరిచి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు.. కన్ఫ్యూజన్లో ఇంకా ఎక్కువ తొక్కేస్తాను", అని తెలుగు డయలాగు చెప్పి క్షమించేసి కాలుతీసేసాడు.
వీడేంటి హిందీవాడు తెలుగుడయలాగ్ చెప్పాడని అనుకుని ఆశ్చర్యపోబోయేంతలో వాడి ఫేసు చూసి వీడా వీడు..మన తెలుగోడే కదా కన్ఫ్యూజ్ అయిపోయానే అనుకున్నాను.
అదే కన్ఫ్యూజన్లో సాంబార్ చపాతీతోనూ.. ఆలూ-మేతీకూర రైస్ లోనూ కలుపుకుని త్వరత్వరగా తినేసి తిరిగి వర్కుకొచ్చేసాను.

సిస్టమ్ దగ్గరకొచ్చి ఆన్లైన్లో పేస్లిప్ చూస్తుండగా గుర్తొచ్చింది నేను పెట్టిన లీవులు నాలుగే కదా ఆరు లీవ్ బ్యాలన్స్ లోంచి ఎలా కట్ అయ్యాయి.. అని ఎడ్మిన్ డిపార్ట్మెంటులో వుండే అమ్మాయికి మెయిల్ కొట్టాను. కాసేపటికి రిప్లైవచ్చింది సారీ నేను ఆ అమ్మాయిని కాదు అమిత్ ని అని. సరేలే 'ఏ' అని కొట్టగానే ముందు నీ మెయిల్-ఐడి వొచ్చింది, నేనేంచేసేది కన్ఫ్యూజ్ అయ్యాలే పో..అని అసలు అమ్మాయికి మెయిలు కొట్టాను.
"సారీ.. వేరే శ్రీనివాస్ వి.. నీవనుకుని నీ ఎకౌంట్లోంచి వెళ్ళిపోయాయి కన్ఫ్యూజ్ అయిపోయాను వెరీ సారీ, వచ్చే నెల్లో సరిచేయిస్తా", అని చల్లగా చెప్పింది.. మాతల్లే.. మనదీ కన్ఫ్యూజనేనా అనుకున్నాను మనసులో.

సాయంత్రం చాయ్ టైముకు రోడ్డుమీదకొచ్చేసరికి టాపాసులూ తారాజువ్వల్తో సందడి సందడిగా వుంది. పూణే కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్సీపీ గెలిచేసింది.. అన్నాడు మా కొలీగ్. ఏదో పెద్ద నాకూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రవున్నట్టు.. అయితే మనమావ.. శరత్ పవార్ జీ పార్టీ ఇంటికెళ్ళిపోయిందా అన్నానునేను.. గెలిచింది అదేకదా ఇంటికెందుకెళుతుంది అనిమాట తిరగేసాడు వేరే కొలీగ్.

అదేంటి వాడిది రాష్టవాదీ కాంగ్రెస్ పార్టీకదా... ఎన్పీపి అంటే.. నేష్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కదా.. అదివేరు ఇదివేరే.. అని నేనూ నాలుగుసార్లు మాట తిరగేసేసాను. జస్ట్ హిందీ-ఇంగ్లీష్ తేడా అంతే.. రెండూ ఒకటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అని వాళ్ళంతా గొల్లుమని నవ్వుకున్నారు.

హూ.. ఎలాగైనానాకూ పార్టీలగురించి తెలుసు అని.. నేను కస్ఫ్యూజ్ కాలేదని నిరూపించాలి , ఆంధ్రా రాజకీయాలైతే వీళ్ళకంత తెలియదులే అని..
"మా ఆంధ్రాలో ఈసారి.. బీజూ జనతాధల్ కి నిలబడే కేసీఆర్ కీ.. బీజేపీలో చంద్రబాబు నాయుడికీ.. చిరంజీవి నిలబడే కమ్యూనిస్ట్ పార్టీకీ పోటీ వుంటాది చూడూ.. నా సామిరంగా.. అని కన్ఫ్యూజన్లో ఏదేదో అనేసాను. అలా అని నా చుట్టూ చూసే సరికి, ఎవడూలేడు. అంతా వెళ్ళిపోయారు. నేనొక్కడినే అక్కడ ఎటువెళ్ళాలో అని కన్ఫ్యూజన్లో చూస్తు నిలబడిపోయాను.
-------------
ఒక యధార్థ కల్పిత కధ.
ఒక కల్పిత యధార్ధ కధ.. ఏంటో ఈ కన్ఫ్యూజన్.. :-)

1, జనవరి 2012, ఆదివారం

నా పాస్-పోర్ట్ చచ్చింది - 2


మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాంకదా.. ఆ బ్రేక్ తరువాత ఏం జరిగిందంటే.. రైడింగ్ చేసిన పోలీసులాగా తలుపు తీసి పోలీసుకే జర్క్ ఇచ్చి.. ఎవర్ గ్రీన్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణలాగా నిలబడ్డ.. నా వేపు సీరియస్ గా చూసాడు పులిరాజా. "ఇంత భారీ దుస్తులు వేసుకుంటే సరిపోదు.. పద్ధతులు కూడా నేర్చుకోవాలి.. లోపల ఒకరుండగా రాకూడదని తెలీదా..", అని భారీ డైలాగుతో చెంపఛెల్లుమనిపించాడు పులిరాజా.
"అంటే సార్ అదీ.. పదింటికి సార్ రమ్మన్నారు సార్ లేటయ్యిందని సార్ త్వరగా సార్ వచ్చాను సార్..", అన్నాను ఎక్కువ సార్ లు పెడితే కాస్త కరుగుతాడేమోనని.

"వీళ్ళంతా వెఱ్ఱి వెధవలా.. ముందెందుకొచ్చారు..", అని ముందుకూర్చున్న వాడిని చూపించాడు.. వాడు నిజంగా అలానే కనిపించాడు పాపం.. హీహిహీ హీహీహి.. అని అతన్ని చూసి నవ్వుదామనుకున్నాను.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'హలో' నవ్వు నవ్వినా..'భలేభలే' నవ్వులా నవ్వుల'పాలు'  అబాసు హర్లిక్సూ అవుతుందేమోనని వచ్చిన నవ్వును ఆపుకున్నాను. అమాయకంగా ఫేసుపెట్టి ఏమీ మాట్లాడకుండా నోట్లో చాక్లెట్టుపెట్టుకున్నట్టు వుండిపోయాను. లేకపోతే.. ఆ ముందు గదిలో అలసిపోయి.. నీడచాటు. సేదతీరుతున్న..గేది దూడలాగా.. బల్లపైన పడి అటుఇటూ పొర్లుతూ.. ముందు వైర్లెస్ సెట్టుపెట్టుకుని.. అందులో వస్తున్న మాటలు ఎఫ్-ఎమ్ రేడియోలో పాటల్లావింటూ పరవశించిపోతూ కునుకులాగుతున్న లేడీ కానిస్టేబుల్ ని అసభ్య పదజాలంతో దూషించి హింసించి కవ్వించానని కేసుపెట్టి లాకప్పులో తోసేసినా తోసేస్తాడు పులిరాజా.

"ఈ రోజుకి చాలామందున్నారు.. నీ నెంబరు రాసుకో ముప్పైఆరు.. రేపు పదింటికి ఖచ్చితంగా రా.. ఒక్క నిముషం లేటయినా నీకు జిందగీ కబీ నహీ మిలేగా దుబారా", అన్నాడు సీరియస్ గా.
"సార్ అది ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టాను.. ఎంతసేపయినా వుంటాను.. ఈరోజే కుదరదా సార్", అన్నాను.
"ఏ ఇంకో రోజు సెలవుపెట్టలేవా..", అన్నాడు.. "అవసరమైతే.. మీరుపెట్టమంటే ఇప్పుడే పెట్టేస్తాను సార్", అన్నాను అతివినయం ప్రదర్శించి. అతివినయం అదేదో లక్షణం అని తెలుసుకోలేక కరిగిపోయి సరే అయితే సాయంత్రం నాలుగింటికి రా.. అని ఒక కాగితం ఇచ్చి దానిమీద ముప్ఫైఆరు నెంబరేసాడు.

ఆ కాగితంలో మరళా ఈ కింది ఏమైనా నాలుగు ఫ్రూపులతోపాటు.. ఒక నిమ్మకాయ.. కుంకుమ-పసుపు.. దొరక్కపోతే మరాఠీ-సింధూరం.. ఎవరివైనా నాలుగు తలవెంట్రుకలూ.. చేతబడిచేయటానికి వాడే పుర్రే లేదా తొడఎముక అన్న లిస్టు ప్రకారం అన్నీ తీసుకుని మధ్యాన్నం మూడున్నరకే చేరుకుని స్మశానంలో ఒంటరిగావున్న కాశ్మోరాలా రడీగావున్నాను. కానీ ఈసారి ఆఫీసుకెళ్ళే డ్రస్సుకాదు. సాగిపోయిన టీ-షర్టు.. షైనింగు తో మెరిసిపోతున్న కొత్త జీన్స్( చీకిపోయిన జీన్సు.. అయితే కాస్ట్ ఎక్కవ కదా అందుకని..) సగం తెగిపోయిన చెప్పులేసుకుని వచ్చి కూర్చున్నాను. అక్కడనేను తప్ప ఎవరూలేరు. టైమెలా కదులుతుందో వాచీలో ముల్లు ఎలా తయారుచేస్తారు లాంటి యక్షప్రశ్నలేసుకుంటూ.. ఆలోచిస్తూ చూసుకుంటుండగా.. బుర్రలో ఒక విషయం వెలిగింది.. నా వాచీ చాలా కాస్ట్లీగా కనిపిస్తుందని.. ఎవడూ చూడకుండా తీసి జేబులో పెట్టేసుకున్నాను. నా అవతారం చూసి చైన్ స్నాచింగ్ టీమ్ లా వున్నాడని ఏ పోలీసోడన్నా పట్టుకుంటాడేమోనని అనుమానమొచ్చి నా పాత పాస్పోర్టు.. డాక్యుమెంట్లూ బయటకు తీసి కనబడేలా చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాను. ఇంతలో కొంతమంది నాలాగే పులిరాజాను కలవటానికే వచ్చి కూర్చున్నారు. హమ్మయ్యా కాస్త బలమొచ్చిందన్నట్టు నేనూ కూర్చుని వాళ్ళతో మాటలు కలిపాను. నాలుగయ్యింది.. నాలుగున్నరయ్యింది.. ఐదింటికి తాపీగా వచ్చాడు పులిరాజా.. ఇంకా నా తర్వాత ఒక ఐదుగురు వచ్చున్నారు.

నాది ముఫ్ఫై ఆరైతే.. నా తరువాత నెంబరోడిని ముందు పిలిచాడు.. సార్ నాది ముఫ్పయ్యారు అన్నాను.. ఆగు.. ఇది వేరే కేస్ లే అని నన్నుకుర్చోమన్నాడు. వాడితో మంతనాలు అయిపోయాకా ఆఖరులో తలుపు కాస్త దగ్గరకు పడింది.. ఎవో గుసగుసలు అయ్యాకా.. కాసేపటికి.. చెమటలు తుడుచుకుంటూ వాడు బయటకెళ్ళిపోయాకా నన్ను పిలిచాడు. లిస్టులో వున్న డాక్యుమెంట్లన్నీ తెచ్చానని చెప్పాను. పేరు... ఊరు.. వయసు.. ఎత్తూ భరువూ.. నడుం చుట్టుకొలత.. కాళ్ళమీద వెంట్రుకల లెక్క... ఇంట్లో ఎంతమందుంటారు.. పక్కింట్లో.. ఆ ఎదురింట్లో ఎవరెవరు ఉంటారు.. మీ పక్కవీధిలో ఎన్ని ఇల్లున్నాయి.. లాంటి ప్రశ్నలన్నీ వేసాకా.. డాక్యుమెంట్లన్నీ చూపించమన్నాడు.. ఇంకేముంది.. అయిపోయింది.. ఇక్కడ ఏదో లిటిగేషన్ పెడతాడు, ఇప్పుడు.. ఏదడిగినా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలని అనుకుంటుండగా.. డైరెక్టు పాయింటుకొచ్చేసి.. చేతులుపైకెత్తి బద్దకం తీర్చుకుంటూ.. ఎంతో కొంత ఇవ్వుమరి.. అన్నాడు. "సార్.. ఎంతొ కొంత అంటే.. ఎంత?", అన్నాను. ఐదొందలు నుండి రెండువేలు వరకూ ఇస్తారు.. ఎవరిష్టం వారిది.. అని పిచ్చినవ్వు మనసులో నవ్వుకునుంటాడుగానీ పులిరాజామొహంపై అదికనబడలేదు. "ఎవరిష్టంవారిదా.. నువ్వుచేసేది ఏ వ్యాపారం రా?, అసలు పోలీసుద్యోగమేనా నీది..?", అనిపించింది మనసులో. మనసులో అనుకున్నవి కనిపెట్టే టెక్నాలజీ రాలేదు కాబట్టి బతికిపోయాను. చాలా శాంతంగా.. ప్రశాంతంగా మొహం పెట్టి.. అంతిచ్చుకోలేను సార్ అన్నాను. "ఏఁ.. సాఫ్ట్వేర్ అంటున్నావ్.. ఐదంకెల జీతం వుండుంటుంది.. కనీసం మంచి బట్టలుకూడా వేసుకోలేదు.. మెరిసిపోయే నూటేభై ప్యాంటు.. సాగిన టీ-షర్టు.. మిగతా డబ్బులన్నీ సేవింగ్సే కదా.. సరేలే.. ఎంతిస్తావ్", అన్నాడు తలుపు దగ్గరేయమని సైగ చేస్తూ. "ఓరినీ.. మంచి బట్టలేసుకుంటే.. అలా అన్నావా.. ఇప్పుడిలావచ్చావా.. సరేకానియ్ నీ టైము", అనుకుని తలుపు దగ్గరగా జరిపాను. "సార్ ఇవే వున్నాయని", మూడొందలు చేతిలో పెట్టాను.. అందులో రెండు వందనోట్లు. ఒక ఏభై నోటు.. మిగతాది పదుల కాయితాలు.. చిల్లర తీసి చేతులో పెట్టి.. వందలూ ఏభై నోటు తీసుకున్నాడు.. తరువాత మారు మాట్లాడకుండా అసలు ఏమిచ్చానో చూడకుండా నా డాక్యుమెంట్లు స్టేపిల్ చేసేసాడు.. ఇది పూర్తిచెయ్యి.. నేనిప్పుడే వస్తాను.. పొద్దున్నుండి సీట్లో కూర్చుని నడుంపట్టేస్తుంది.. మా తిప్పలు ఎవడికీ తెలియవు అని ఏదేదో నసుక్కుంటూ.. పులి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.. ఎన్నాళ్ళకు నవ్వావురా నాయనా.. పులిని కూడా నవ్వించాలంటే.. గాంధీగారు నవ్వాలని అప్పుడే అర్ధమయ్యింది.

 ఇచ్చిన అప్లికేషన్ ఫాం పూర్తిచేసేసి.. హమ్మయ్యా అయిపోయింది ఎంక్వైరీ అనుకున్నాను. నోటినిండా పాన్ పరాగ్ వేసుకుని మూతికి ఒక సెల్లోటేపువేసుకొచ్చిన పులిరాజా.. పూర్తిచేసిన ఫాంలు తీసుకుని ఏమీ చూడకుండా... సెల్లోటేపులోంచి.. ఊ..ఊఁ.. మాత్రమే మాట్లాడుతూ.. ఇంకొక రెండు కాగితాలిచ్చి జిరాక్స్ తీసుకురమ్మన్నాడు. దాంతోపాటు ఒక ఫాం ఇచ్చి అది ముప్పై కాపీలు తీయించమన్నాడు. అవన్నీ తీయించిస్తే నాకు కావాల్సిన రెండు ఫాంలు ఇచ్చి.. మిగతా ముప్ఫైకాపీలు ఫైలులోపెట్టుకున్నాడు.. అది చూసి నాకు జీవితంమీద.. భవభంధాలమీద విరక్తి కలిగిన వాడిలా గిలగిలాకొట్టుకున్నంత పనయ్యింది.. "ఛీ నీ..కక్కుర్తి మీద కాకిరెట్టెయ్య...", అన్న తిట్టుగుర్తొచ్చి.. అది హిందీలో ట్రాన్సలేషన్ చెయ్యటంరాక.. నిట్టూర్చుతూ బయటకొచ్చాను. పోలీస్టేషనుపక్కనే చెట్టుకింద పార్కుచేసిన నా బండితీస్తుంటే ఎవడో పైనుండి చిన్నసైజు బంతిచ్చుకుని నెత్తిమీదకొట్టినట్టు అనిపించి తలెత్తి పైకిచూసాను.. "కావ్ కావ్..", అని మరాఠీలో అరిచింది నల్లకాకొకటి.. నెత్తిమీదపడ్డడి బంతికాదని తెలిసి.. "ఛీ.. నా ఎధవ బతుకు..", అని అలాగే తల తుడుచుకోకుండా పాతబట్టలు చించుకుంటూ ఇంటికొచ్చేసాను.

ఇంతకూ పులిరాజా ఇచ్చిన ఆ రెండు ఫాంలు ఎంటంటే.. నేను మీ ఇంటి పక్కింటిలోనే వుంటాను. నేను మంచివాడినే.. ఎప్పుడూ సిగరెట్లు.. మందూ.. పేకముక్కా.. చికెన్ టిక్కాలాంటి అలవాట్లులేవు. ఒకవేళ వున్నా మిమ్మల్ని పిలవకుండా నేనొక్కడినే ఎంజాయ్ చెయ్యలేదు. కొలెస్ట్రాల్ ఎక్కువుండటంవలన.. ఎప్పుడూ చిన్నపిల్లల దగ్గరనుండి ఐస్కీములు అవీ దొంగిలించలేదు. పొద్దున్నే మీ ఇంటిముందున్న పేపరూ.. పాలప్యాకెట్లూ పోతే నాకు సంబంధలేదు.. అని అన్నీ రాసి పక్కింటాయనచేతో ఎదురింటాయనచేతో లేక కిందింటాయనచేతో సంతకం చేయించాలి.. అది సరిపోదు మళ్ళీ ఆ సంతకంపెట్టినవాడి ఎడ్రస్ ఫ్రూపు.. ఐ.డి ఫ్రూఫు జిరాక్సులూ.. పుట్టుమచ్చలు.. చేతిరేఖలూ ఫొటోలుతీసి ల్యామినేషన్ చేయించి పంపాలి.., అలాగే వాటితోపాటుగా వాళ్ళ తలవెంట్రుకలు.. చేతి లేదా కాలిగోళ్ళు డి.యన్.ఏ టెస్ట్ కోసం పంపినట్టు సేంపుల్ కూడా పంపాలి... ఇవన్నీ అడిగితే వాడిస్తాడా.. ఇదెక్కడి రూలు.. ఇంతకుముందులేదే.. ఉండు మన్మోహన్ సింగ్ తో ఇప్పుడే మాట్లాడతాను నేను... వాడు నాకు బాగా తెలుసు అని ఫోన్ డయల్ చేసేస్తున్నాడు మా కిందింటాయన.. అబ్బే అంత 'పేద్ద' రికమెండేషను ఎందుకండీ.. మీరు మాట్లాడినా ఆయన ఇప్పుడూ ఎప్పుడూ మాట్లాడలేడుసార్.. మొహమాటం ఎక్కువా, వదిలెయ్యండి.. నన్ను నమ్మి ఇచ్చేయండి, గొడవొదిలిపోతుంది.. అని  వాడిని బ్రతిమలాడి వసుదేవుడిలా మారితే.. కాస్తకరిగి.. "సరేగానీ.. ఎన్నాళ్ళుగానో నేనూ పాస్పోర్టు అప్లై చేద్దామనుకుంటున్నా నాకూ కాస్త అప్లైచెయ్యటంలో హెల్ప్ చెయ్యాలి..", అని వాళ్ళావిడ ఫొటోమీద ఒట్టేయించుకుని.. నన్ను ఒప్పించాడు. "బాబోయ్.. పాస్పోర్టా అని అరవలేక.., సరే చేస్తా" అని చెప్పాను. మళ్ళీ తరువాత రోజు డాక్యుమెంట్లు తెచ్చుకుని సర్వం సమర్పయామి.

మళ్ళీ చెట్లు చిగురించాయి..అన్నట్టు నా జుట్టుకు నాలుగైదు కటింగులయ్యి.. బుర్రలో ఉన్న మెమొరీ కాస్తా రిఫ్రెష్ అయిపోయి.. అన్నీ మర్చిపోయిన కొన్నాళ్ళకు.. వేరే పోలీస్టేషన్నుండి మరో కాల్. నువ్వు రేపొద్దున్నే పదింటికి రా.. నీపాస్పోర్ట్ వెరిఫికేషన్కి అని. ఎందుకండీ.. మొన్న ఫలానా పోలీస్టేషన్లో  అన్నీ సమర్పించుకున్నాం అంటే.. నీవు మార్చిన కొంపలు ఎన్నుంటే అన్నిసార్లు తప్పవు నీకీ ఎంక్వైరీలు అన్నాడు. "భలేభలే సెహభాష్ నారాజా.. నక్కతోక తొక్కబోయి.. ఏ కుక్కతోకో తొక్కుంటాను.. సరే కానీయ్.." అని భుజంపై తట్టుకుని..చంకలుగుద్దుకుంటూ తరువాత రోజు ఆఫీసుకి సెలవు పెట్టకండానే వెళ్ళాను. ఎందుకంటే ఆరోజు శనివారం ఆల్రెడీ సెలవు కాబట్టి.

మళ్ళీ మొత్తం డాక్యుమెంట్లన్నీ జిరాక్స్ కాఫీలు తీయించుకోటానికి.. దిగిన ఫొటోలు ప్రింటులు తీయించటానికీ.. పెర్సనల్ లోన్ ఒకటి తీసుకుని జాగ్రత్తగా అన్నీ ఇచ్చుకున్నాను. మళ్ళీ ఈ పోలీసూ చేతులు పైకెత్తి బద్దకంగా విరుచుకుంటూ.. ఐదొందలివ్వు అన్నాడు.
ఈసారి.. అన్నా హజారే గుర్తుకొచ్చాడు.. ముసలాయన అంత కష్టపడుతుంటే మనమిక్కడ అడిగిన వాడికల్లా లంచాలిచ్చి తప్పుచేస్తున్నామని అనిపించింది.. పొంగుతున్న ఆవేశంతో.. ఇదెక్కడి గోల మొన్న అక్కడ అన్నీ ఇచ్చేసాను.. ఈ ఎంక్వైరీ వుంటుదని తెలియదుకూడా.., ఇంకా ఎన్నిసార్లివ్వాలండీ  అని నసుగుతుంటే "ఠీక్ హే..బేజ్ దేంగే..", అన్నాడు. ఏంటి మళ్ళీ అడిగ కాస్త మెత్తబడతాడు అనుకుంటే... అంత పెద్ద బూతు తిడతాడా.. సరేలే అని పౌరుషంతో లేనిమీసం తిప్పుకుంటూ నెత్తిమీద పేపర్ ని గొడుగులా  పెట్టుకుని ఏ కాకులూ పాడుపనిచెయ్యకుండా తప్పించుకొచ్చేసాను.

పదిరోజులయ్యింది.. ఇరవైరోజులయ్యింది.. ఆన్లైన్లో స్టేటస్ మాత్రం పోలీసులు ఇంకా వెరిఫైచేస్తూనేవున్నారు. నీపై కేసులు ఇంకా గాలిస్తూనే వున్నారు వెళ్ళివాళ్ళను బ్రతిమలాడుకొని తొందరగా కేసులన్నీమాఫీచేయించుకుని వెంటనే మాకు పంపు అనే వుంది.
నెలైంది.. కేసులేమీ మాఫీలైనట్టులేవు. ఇక లాభంలేదు.. ఒక్క హజారే కాదు.. హజార్ అన్నాహజారేలు ఉన్నా ఈ దేశాన్ని ఎవడూ బాగుచేయలేడు.. వెళ్ళి మళ్ళీ వసుదేవుడు అవతారమెత్తాల్సిందే.. అని మళ్ళీ పెర్సనల్ లోన్ తీసుకుని డాక్యుమెంట్లతోపాట.. స్టేటస్ అడగటానికెళ్ళాను.. అదేంటి ఇంకా వెళ్ళలేదా.. అలా జరగదే.. చూస్తానుండు అని అన్నీతిరగేసాడు..,గంట ఆగమన్నాడు.. వాడెవడికో ఫోన్చేసి అడిగాడు.. వాడు పాస్వార్ట్ తెలిసిన వాడు ఈరోజు సెలవు రేపుచెబుతాన్నాడు. సరేలే.. ఎక్కడో మిస్ అయ్యింటుంది.. మిసెస్ అయ్యివచ్చాకా.. మళ్ళీ పూర్తిచేద్దాం, ఒకవేళ పాతది ఉంటే పంపించేద్దాం లేకపోతే కొత్తది అని మొత్తం డాక్యుమెంట్లు మళ్ళీ తీసుకున్నాడు. ఈ సారి డబ్బులు అడగలేదు.. ఇచ్చానని అనుకుని వాడున్నాడు.. అడగలేదు పర్వాలేదు అని నేనున్నాను.. అక్కడ అన్నాహజారే నీరసపడి జైల్ భరో అంటున్నాడు.

ఇంకా ఏ కబురూలేదు.. ఆన్లైన్లో స్టేటస్ మాత్రం ఇంకా అదే. ఎన్నాళ్ళకు నా చచ్చిన పాస్పోర్టు బతుకుతుందో తెలీదుకానీ.. పోలీసుబట్టలుకాకుండా మామూలు బట్టలేసుకుని వెళ్ళేవచ్చేవాళ్ళను బావొచ్చాడు బావొచ్చాడు అని చూసినట్టుగా.. మనల్ని చూసే ఆ ఖైదీలూ.. ఆ ఖైదీకి కేరేజి పట్టుకెళ్ళేవాడిలాగా వారానికోసారి పోలీస్టేషనుకెళ్ళిరావటాలు భలేభలేమజాగావుంది.
ఇన్ని అద్భుతమైన అనుభవాలను పంచుతున్న మన సర్కారీవారికి శతకోటి వందనాలతో.. ఈ టపా అంకితం.

---------------------------------------------------------
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవకుండా.. అన్నీ తీపి అనుభవాలతో.. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను. :-)


Related Posts Plugin for WordPress, Blogger...