24, జులై 2010, శనివారం

రాకెట్ లాంచ్...


(పూర్తిగా సాఫ్ట్వేర్ కు సంభందించిన సాంకేతిక పదాలతో నిండిన టపా.. 
అర్ధంకాకపోతే నన్నేమడగొద్దుబాబోయ్..)

"అప్ లోడ్ ఫెయుల్యూర్", ని కూడా ఆటోమేట్ చెయ్యాలి అని ముందురోజు జరిగిన 
రాకెట్ మీటింగ్ లో డిస్కషన్ వల్ల ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు.. ఎలా చెయ్యాలబ్బా.. 
అని రాత్రంతా బుర్రబద్దలుకొట్టుకున్నాఒక్క ఆలోచనా రాలేదు. ఎపుడూలేనిది.. 
తరువాత రోజు తెల్లవారుఝామున పదింటికే లేచి.. ఆఫిసుకు బయలుదేరాను.. 
బయటకురాగానే.. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే.. "పొద్దుపొద్దున్నే లేచి ఇలా 
జనాలంతా ఎక్కడికి పోతార్రాబాబు", అని అనుకుంటూనే.. హెల్మెట్ పైనే బుర్రగోక్కుంటూ..  
నా టూవీలర్ ను ఆఫీసురూట్లోకి దూకించాను..  

ఇంకా నిన్నటి రాకెట్ డిష్కషన్ లో మాట్లాడుకున్నవిషయమే ఎలా చెయ్యాలబ్బా అని 
బుర్రలో ఇన్ఫైనేట్ లూప్లో పడి కొట్టుకున్న వైల్ లూప్ లాగా తిరిగి తిరిగి కొట్టుకుంటుంది.. 

అలా కొట్టుకుంటున్న వైల్ లూప్ ని, బ్రేక్ పాయింట్ పెట్టి డిబగ్ చేస్తూ.. బైక్ 
నడుపుతున్నానేమో..., రోడ్డ్ మీదున్న సిగ్నల్ కనబడనేలేదు.. కొత్త టెస్టర్ పొద్దెరగకుండా 
అక్కడా ఇక్కడా క్లిక్ చేసినట్టుగా.. చూసుకోకుండా సిగ్నల్ బ్రేక్ చేసేసి.., బైక్ ముందు బ్రేకు 
వెనకబ్రేకు నొక్కి.. సరిగ్గా.. నల్లకల్లద్దాలు పెట్టుకుని ఉగ్రస్వరూపంతో నిలబడివున్న 
ఆడకానిస్టేబుల్ ముందు ఆపి.. దొరికిపోయాను.. 

"లైసెన్సు తియ్", అందామె.. "నేను దాటింది సిగ్నల్ కదా.. లైసెన్సెందుకబ్బా", అనుకుంటూనే 
తీసి చూపించాను.. "ఇది డూప్లికేట్ కదా.. ఒరిజినల్ చూపించు.. లేకపోతే బండిక్కడపెట్టేసి 
వెళ్ళిపో", అని మరాఠీ ఫ్లేవర్ కలగలిపిన హిందీలో అందామె.., ఇదెక్కడ గోలరా అనుకని..
 "సారీ మేడమ్ ఏదో రాకెట్ టెన్సన్లో సిగ్నల్ బ్రేక్ చేసా", అని అందామనుకున్నా.. 
" రాకెట్..!! ఏంటి?", అని పోలీసోళ్ళ లాంగ్వేజిలే బై డిఫాల్ట్ గా వుండే ఫేక్ నోట్స్ రాకెట్, 
సెక్స్ రాకెట్ లాంటి రాకెట్లనుకుని అపార్ధంచేసుకుంటుందేమోనని.. భయంవేసింది.., 
నా దృష్టిలో రాకెట్ అంటే ఇది అని చెప్పడానికి మళ్ళీ ఓ పెద్ద డాక్యమెంటేషన్ చేసివ్వాలేమో.., 
ఆ గోలంతా ఎందుకులే", అని.. "ఫైనెంత", అన్నాను ఎంతుంది అన్నట్టు పైనుండి కిందకు
ఒక్కసారి చూసిందామె.., వంద తీచి చేతిలోపెట్టి, టి. ఆర్. ఎస్ జెండా రంగులోవున్న 
రశీదొకటి తీసుకుని.. మళ్ళా నా కోడ్ డీబగ్గ్ చేస్తూ ఆఫీసుకు బయలుదేరాను.

ఇంతకూ ఏదో ఆలోచన్లో పడి రాకెట్ అంటే ఎంటో చెప్పలేదు కదా.. అదే చెప్తా... 
చెవుల్లో దూదిలేదా.. దగ్గర్లో ఏది అందుబాటులోవుంటే అది పెట్టుకుని వినండి.. 

మేం చేస్తున్న కొత్తప్రోజెక్టులో.. రోజువారి లావాదేవీలు అన్నీ వేరే డాటాబేస్ లోకి మైగ్రేట్ 
చేసి.. వాటిమీద రిపోర్టింగ్ అప్లికేషను ఒకటి డిజైన్ చెయ్యాలి.. డాటాబేస్ అంటే ఏంటి అని
చాలా మందికి తెలియకపోవచ్చు.. ఒక చిన్న ఉదాహరణిచ్చి వివరించడానికి ప్రయత్నిస్తాను.. 
మన వంట గదిలో నెలకు సరిపడా కావలిసిన పచారి సరుకులు దాచుకోవటానికి 
ఉపయోగిస్తామే.. బీరువానో లేక షెల్ఫో అదే ఒక డాటాబేస్ లాంటిదన్నమాట.., ఈ 
డాటాబేస్ లో టేబుల్స్ అని వుంటాయి.. అంటే డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ 
లాంటివి కాదు.. ఆ షెల్ఫ్ లో వుండే కందిపప్పు డబ్బా ఒక టేబుల్.. ధనియాల డబ్బా 
ఒక టేబుల్.. అలా అన్నమాట.. రోజువారీ కూర వండటంకోసం ఆ టేబుల్ నుండి  కొంత, 
ఈ టేబుల్ నుండి కొంత తీసుకుంటుంటాం అదే ఒక ట్రాన్సాక్షన్.. (లావాదేవీ...), 
నెలాఖరున సరుకులు ఇన్సర్ట్ చేస్తాం, కొన్ని అప్ డేట్ చేస్తాం.. ఇలా చెప్పుకుంటూ 
పోతే డాటాబేస్ గురించి పెద్ద పుస్తకం రాయొచ్చు, దీనికంతంలేదు కాబట్టీ... ఇక్కడ డాటాబేస్ 
అంటే తెలిస్తే చాలు.. (ఇప్పుడు మొత్తం అర్ధమైపోతే.... ఇంతేనా సింపుల్ అని మా జాబ్స్ కి 
కాంపిటేషన్ వచ్చేస్తారంతా). 

ఇక మా ప్రోజెక్ట్ విషయానికొస్తే.. నేనిచ్చిన ఉదాహరణలాగే పచారిసరుకులు అక్కడివి 
ఇక్కడకు మెయ్యటమే కదా.. చిన్నదే అప్లికేషన్ అనుకుని... తాలింపు పెట్టని టమాటా 
పప్పులోకాలేసేసారు మా కంపెనీ వాళ్ళు.  టెండరువేసి పడ్డ పెద్దచేపను చూసి తెగ 
మురిసిపోయారు.. ఇక్కడవరకూ బాగానేవుంది.. "ఇంతకూ మీకేంకావాలి..", అని క్లైంట్ ని
అడిగినప్పటినుండి మొదలయ్యాయి మా సాఫ్ట్వేర్ కష్టాలు.. 

రోజువారి లావాదేవీలు జరిగే డాటాబేస్, అసలు పేరూవూరు లేని డాటాబేస్ అని, 
ఎవడో తలమాసినవాడు తయారుచేసి ప్రీగా ఇచ్చింది వాడుతున్నారు వాళ్ళని తేలింది..
సరే వాడారనుకుందాం.., డేటాబేస్ ఏదైనా కొన్ని స్టాండర్డ్స్ అన్నాఏడుస్తాయికదా.. 
ఏదొక డ్రైవర్ దొరుకుతుందిలే.. (డ్రైవర్ అంటే.. కారుడ్రైవర్.. బస్సుడ్రైవర్ కాదు.., ఎదన్నా 
సాఫ్వ్టేర్ వేరేదానితో ఇంటరాక్ట్ అవటానికి వాడే చిన్న సాఫ్వ్టేర్) ఎలాగోలాగా అందులో 
జరిగేవన్నీ రోజుకోసారి ఒక స్టేజింగ్ డాటాబేస్ లో (ఒక టెంపెరరీ డాటాబేస్) లోకి మైగ్రేట్ 
చేసేద్దాం.. తరువాత అక్కడ కావలిసిన మార్పులుచేర్పులు.. చేసేసి.. ఫైనల్ రిపోర్టింగ్ కోసం 
తయారుచేసుకున్న డాటాబేస్ లోకి చేసేద్దాం అంతే సింపుల్ అని.. ఒక రెండురోజులు 
ఎక్కడికీ కదలకుండా మీటింగ్ రూమ్లోనే కాలకృత్యాలు తీర్చుకుని.., ఒకడిబుర్ర ఒకడుగోక్కుని.. 
నెత్తిమీద మిగిలిన నాలుగువెంట్రుకలు రాలిపోయేదాకా  పెద్దప్లాను గీసుకున్నాం.. ఆ ప్లానుకు 
ఒక మంచి ముహూర్తంచూసి.., పసుపురాసి కుంకుంబొట్లుపెట్టి.. వివరించి క్లైంట్ కి.. 
హరికధా కాలక్షేపం డీటీయస్ లో వినిపిస్తే ఎలావుంటుందో అలా వినిపించాం.

అంతావిన్నాకా.. మొత్తం సీ షార్ప్ కోర్సంతా నేర్చేసుకుని.. ఇఫ్ స్టేట్మెంటంటే ఏంటని 
అడిగినట్టు.. "అంతా బాగానే వుంది.. మరి ఈ రెండు డేటాబేస్ లూ ఒకచోటవుండవనుకో.... 
ఒకటి అమెరికా.. వేరేది ఆముదాలవలస అనుకో ఏంటి పరిస్థితి అని అడిగాడు.. 
"ఐతే ఏముంది.. ఏదొక కనెక్షన్ వుంటుంది కదా కనీసం ఇంటర్నెట్ కనెక్షన్, దాంతో 
ఈ డాటాబేస్ నుండి ఆ డాటాబేస్ కి కనెక్ట్ అవటమే అంతే!!", అని కష్టమైన పజిల్ ని 
సింపుల్ గా సాల్వ్ చేసినట్టుగా.. చెప్పి సెబాష్ సెబాష్ అని మా మేనేజరు నేనూ.. 
ఒకరి భుజాలొకరు చరుచుకున్నాం.

"లేదు అలాంటిదేమీ వుండదన్నాడు.." క్లైంట్.., ఒక్కసారి షాక్ కొట్టిన బొంత కాకిలాగా 
కరెంటుతీగల మీదనుండి సలసలాకాలుతున్న తారు రోడ్డుమీద పడ్డట్టయ్యింది మా పరిస్థితి. 
"అసలు ఈ రెండు వేరువేరుచోట్లవుంటాయనీ తెలియదు.. పోనీ వున్నాచేసేద్దాం.. అనుకుంటే.. 
కనక్షనే వుండదా.. ఇదెక్కడ కొత్త ట్విస్ట్ రా నాయనా..!!, ఏ కనెక్షనూ లేకపోతే ఎలా..  
రోజువారి లావాదేవీలు ప్రింట్ తీసుకుని.. ఒక పెద్ద పద్దులు పుస్తకంలో రాయమంటాడా
ఏంటి..", అని ఫోన్ మ్యూట్ నొక్కి ఒకడితరువాతొకడు తలలు ఫోనుకేసి కొట్టుకున్నాం. 

"సరే ఇంటర్నెట్ లేదు అనుకున్నాం.. ఇక్కడ జరిగినవి అక్కడకి ఎలా వెళతాయి", అని 
అడిగాడు మా మేనేజరు.. "ఇంటర్నెట్ లేకపోతే ఎలా..?,  వుంటుంది, కానీ.. డాటాబేస్ కి 
కనెక్షన్ ఇవ్వం.. ఒక ఎఫ్. టీ. పి ఫోల్డర్ షేర్ చేస్తామంతే (ఇంటర్నెట్ ద్వారా షేర్ చెయ్యబడే 
ఒక ఫోల్డర్). ఇకదానికిమించి ఏమీ ఇవ్వం.. దీనికి ఎలా చేస్తారో ఆలోచించండి.." అని,
ఇంకొక్క ప్రశ్న అడిగారంటే.. ఒక్కొక్కడి తలా పుచ్చకాయల్లెక్క లేచిపోతాయి.. అని 
ఫ్యాక్షన్ మూవీలో హీరో డైలాగులా, తొడకొట్టి.. మొహంలోమొహం పెట్టి ఉమ్ములు పడేలా 
చెప్పేసాడు క్లైంట్..  సరేలే డాలర్లిస్తున్నాడుగా.. అని సర్దిచెప్పుకుని.. మొహంతుడుచుకుని..  
మళ్ళా మేమంతా అలోచనలో పడ్డాం.., తరువాత రోజు సాయత్రం కంపెనీ సీటివో  
(చీప్ టెక్నికల్ ఆఫీసర్ ;-) )తో విషయ విశ్లేషణా ఫోన్ కాల్ ఒకటి షెడ్యూల్ చేసుకుని.. 
మొత్తం కష్టాలు వివరించి చెప్పాం.., మనవాడే మనవాడే అని మీదెక్కించుకుంటే.. 
షర్టంతా తడిపి కంపుచేసాడన్నట్టుగా.. మా సీటివో మాకే ఎదురొచ్చాడు.

"అవును కష్టమర్ కి ఎలాకావాలో అలానే చెయ్యాలి.. ఇదే దానికి ఎలా చెస్తామో 
అలోచించండి అంటూనే, మీరు ఇది చెబుతుంటే నాకు చిన్నప్పుడు నిక్కర్లేసుకునే టైమ్ 
గుర్తొస్తుంది అన్నాడు.. "ఇదేంట్రాబాబూ.., క్లైంట్ వేసిన కుళ్ళుజోక్ కంపు భరించలేక 
ముక్కులుమూసుకుని పనిచేస్తుంటే.. నీకు నిక్కర్లటైము గుర్తుకురావటమేమిటీ!!..",  
అనుకునేంతలోనే అసలు విషయం చెప్పాడు.. 

ఇలాంటిదే ఒకప్పుడు మేం చేసాం.., అదిక్కడ వర్కవుట్ అవుతుంది అని నా నమ్మకం.. 
అది ఏంటంటే,  ఇక్కడ లావాదేవీలు ఒక ఫైల్ లాగా మార్చి ఆ ఫైల్ ని అక్కడున్న 
ఏఫ్. టీ. పి ఫోల్డర్ లోకి పంపించి.., అక్కడ ఆ ఫైలునుండి డాటాను డాటాబేస్ లోకి 
ఇంపోర్ట్ చేసేయ్యటమే.. సింపుల్ అని నాలుగుముక్కల్లో చెప్పేసి.. నాకు వేరేపనుంది 
ఇది ఆలోచించి ప్లాన్ డిజైన్ చేసి పంపండి అని తప్పించుకు పారిపోయాడు సి.టి.వో.

మా మేనేజరుకు ఇది నచ్చినా.. నాకూ... మా టీమ్ మేట్స్ కి నచ్చలేదు.., "ఫైల్స్ అంటేనే 
పాతపద్దతి..కదా!, అవి పంపించడం.. దాన్నుండి డాటాబేస్లోకి ఇంపోర్ట్ చేయటం అంటే 
చాలా యాతనతో కూడుకున్న పని, ఎన్నో కండీషన్స్ మనం సొంతంగా రాసి హేండిల్ 
చేయాలి.. అసలున్న టైమ్ లైన్స్ అంతంతమాత్రమే, ఆఖరిదాకా వచ్చాకా 
చేతులెత్తెయాల్సొస్తుంది మరి..",  అని మొహంమీద చెప్పేసాం.. "అవును నేను మీతో 
ఏకీభవిస్తాను.. కానీ.. ఇది తప్పవేరే దిక్కులేదు..", అని మేనేజరు  కంటతడిపెట్టుకున్నాడు.., 
ఏం చేస్తాం.. నీతోనే మేమంతా అని... కర్చీఫ్ తో అతని కన్నీళ్ళుతుడుస్తున్న మాకు 
తెలియకుండానే కళ్ళళ్ళో నీళ్ళు గిర్రునతిరిగాయి..

వీకెండ్ లేదు.. వీక్ డే లేదు.. రాత్రీలేదు.. పగలూలేదు అన్నట్టుగా కష్టపడి.. క్లైంట్ కి 
సరిపడే విధంగా పనిచేసిపెట్టే రెండు విండోస్ సర్వీసులు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ.. 
అక్కడి ఫైల్స్ ఇక్కడకు పంపిస్తూ... అన్నికాలాల్లోనూ చక్కగా పనిచేసేవిధంగా.. 
ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి పెట్టాము.. (విండోస్ సర్వీస్ అంటే ఏంలేదండీ.. విండోస్ ఆపరేటింగ్ 
సిస్టమ్లో ఎప్పుడూ గేట్ దగ్గర కాపలావుండే కుక్కలాగా నిరంతరం కాపలాకాస్తూ.. చెప్పినపనిచేసే సర్వీసులన్నమాట.).

ఇంతకూ ఈ ఆర్కిటెక్చర్ ని రాకెట్ అని ఎందుకన్నామంటే... ఆముదాలవలసనుండి వచ్చిన 
లావాదేవీ ఫైల్ ని కట్టగట్టి ఒక పెట్టెలో పెట్టి.. (జిప్ చేసి.. ), దానికి ఎమ్. డి. ఐదు అల్గోరిధమ్ 
ద్వారా ఒక కోడ్ తయారుచేసి (చిన్నప్పుడు వర్షాకాలం చదువుల్లో చదువుకున్నాం.. 
కానీ ఎందుకుపయోగిస్తారో ఇప్పడే తెలిసింది..), కట్టగట్టిన ఫైలును.. కోడ్ ను అవతలివైపు
కుక్కలా ఎదురుచూస్తున్న సర్వీసుకు విసరగానే అది ఎగిరి పట్టుకుని.. డైన్లోడ్ చేసుకుని.. 
మరళా ఎమ్. డి. ఐదు అల్గోరిధమ్ ద్వారా ఒక కోడ్ తయారుచేసి, వచ్చిన కోడ్.. ఇప్పటికోడ్ 
తో సరిచూసి.., సరిగ్గా సరిపోతే.. ఓహో.. బాగానే పంపించాడు అని అనుకుని.. తనపని 
తానుచేసుకుపోతూ అమెరికాలోవున్న డాటాబేస్ లోకి లావాదేవీలు పంపించేస్తుంది.. 
సరిపోలేకపోతే.. ఆముదాలవలసలో వున్న కుక్కకి..., నాకు సరిగ్గా అందలేదని ఒక బిస్కట్ 
ముక్క పడేస్తుంది.. , ఇలా ముందుగా నిర్దేశించిన నూటొక్క విషయాలను పరిగనించుకుని.. 
తనపని తాను చేసుకుపోతాయి ఈ విండోస్ సర్వీసులు.. ఒక్క ముక్క కూడా అర్ధంఅవలేదు 
కదూ.!!,  అందుకే ఈ ప్రాసెస్ అంతటికీ రాకెట్ అని పేరుపెట్టాము.. 

ఈ రాకెట్ ని డిజైన్ చెయ్యటానికే.. ఇన్ని తిప్పలూ పడింది.... ఆడపోలీసుకు తాంబులం 
సమర్పించుకున్నదీనూ. ఓ రోజు కూరగాయల దుకాణంవాడు.. మీరు సాఫ్వేర్ ఇంజనీరు 
కదా.., అంతంత జీతాలిస్తుంటారు.. అంత పెద్ద పెద్ద బిల్డింగుల్లో.. ఏ.సి రూముల్లో కూర్చుని.. 
మీరసలు ఏం చేస్తుంటారు అనడిగాడు.., నీకు ఏ.టి ఎమ్ లోంచి డబ్బులెలా వస్తున్నాయి..
అవి రాగానే వెంటనే ఎసెమ్మెస్ ఎలా వస్తుంది.., ట్రైన్ టికెట్.. ఇంటర్నెట్లో ఎలా కొనగలుగుతున్నావ్..
ఇంకా కరెంట్ బిల్ కూడా నువ్వు ఇంట్లోనుండి ఎలా కట్టగలుగుతున్నావ్.., ఇలా చెప్పుకుంటే 
చాలా వున్నాయి.. అని అవన్నీ నేనే చేసినట్టుగా కాస్త కటింగిచ్చి.., మేమైతే ఒక రాకెట్లు 
తయారుచేస్తున్నాం అని వాడికర్ధమయేలా కొన్ని ఉదాహరణలతో, స్త్రీలింగానికి  పుంలింగమూ 
పుంలింగానికి స్త్రీలింగమూ కలగలిపిన వచ్చీరాని (బూతు) హిందిలో వివరించాను.. 
(ఇంకా నయం హిందీలో నపుంసక లింగం లేదు.., నా దెబ్బకు వాడు పిచ్చోడయిపోదుడు.. ). 

అప్పట్నుండీ కూరగాయల దుకాణం వాడు నాతో.. "అయ్ బాబోయ్ మీరు ఇంత గొప్పోలండే..", 
అన్నట్టు చూడ్డం.. మాట్లాడటం మొదలుపెట్టాడు..., ఆరోజునుండీ పుచ్చొంకాయలమీద కాస్త  
నా కోసం స్పెషల్ డిస్కౌంటులు ప్రకటించి ఇవ్వటం కూడా మొదలెట్టాడు.., ఇంకేముంది 
అప్పటినుండి మొదలయ్యాయి ఆలోచనలు.., అవును ఇస్రోలో రాకెట్ తయారుచేస్తున్న
వాళ్ళకు మాకూ తేడా ఏముంది? ఏమీలేదే..!!, అని గాల్లో తేలుతూ తిరగటం. అప్పటికే 
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా.. పదోసారి బెస్ట్ సాఫ్ట్వేర్ సైంటిస్ట్ గా అవార్డ్ 
అందుకుంటున్నట్టుగా కలలు ఒక పక్క... మా టీమ్ తో కలిసి.., గీసుకున్న 
ఆర్కిటెక్చర్ ప్రకారం రాకెట్ ఇంప్లిమెంటేషన్ ఇంకొకపక్క.. అబ్బో క్షణం ఖాలీలేదు. అలా 
మూడునెలలు గడిచాయి.. మా రాకెట్ కుడా లాంచింగ్ కి సిధ్ధమయ్యింది..

ఇప్పుడు కొత్త కష్టాలు.. "కర్నేమే నహీ..!, సంజానేమే..", అన్నట్టుగా మీదపడ్డాయి. 
మా కంపెనీలో బండమెదడు టెస్టర్లకు అవి ఎలా పనిచేస్తాయో అంతా వివరించి చెప్పేసరికి..
మానిటర్లో ప్రాణం.. మౌసుదాకా పాక్కొచ్చింది. "మన టెస్టర్సేకే అర్ధంఅవటానికి 
ఇంతటైముపట్టిందంటే.. అసలు క్లైంటుకేమర్ధమవుతుంది?, ఇలాక్కాదు.. ఒక డాక్యుమెంట్
తయారుచేద్దాం.. ", అన్నాడు మేనేజరు. చేద్దాం అన్నాడంటే.. ఇన్డైరెక్టుగా నువ్వుచెయ్యరా 
అనే కదా..!, ఏం చేస్తాం.. డాక్యుమెంటు రాయటం మొదలెట్టాను.. తెలుగులో నేనురాసే
బ్లాగులు అందరికీ నచ్చేస్తున్నాయి.. అదే స్టయిల్లో పడగొట్టేద్దాం తెల్లోల్లని.. అనుకుని 
గొప్ప బిల్డప్ ఇస్తూ.. ఇంగ్లీష్ లో డాక్యుమెంటేషన్ చేసి.. టీమ్ అందరికీ చూపించాను.. 

ఆ డాక్యుమెంటును.. ముప్పైనాలుగు సార్లు రివ్యూ అని చెప్పి.. నేనురాసింది మొత్తం 
బండబూతేనని తేల్చి.. దాని షేపులు మొత్తం మార్చేసి... ఎలాగైతే ఒక ఏభై పేజిల కధల
పుస్తకంలాగా.., దాంతో పాటుగా.. పది పదిహేను వెబ్సైట్లకు లింకులతో  సర్వాంగ 
సుందరంగా డాక్కుమెంటుని తీర్చిదిద్దాము.

ఇది ఫలానా రోజు డెమోఇవ్వాలి.. అంతా రడీఅవ్వండి అన్న మెయిల్ చూడగానే.. మా 
టీమ్ మెంబర్లంతా గాల్లోకి ఇంకోఅడుగెత్తుకు లేచి ఒకరినొకరు చూసుకుని మురిసిపోయాం. 
ఆ ఫలానారోజు పొద్దున్నే రడీ అయ్యి.. "ఈ రోజు కాస్త రావటానికి లేటవుతుందేమో.. 
ఫోన్ చేస్తాలే..", అని మా ఆవిడకు చెప్పి.. మాంచి హుషారుగా.. లిఫ్ట్ కూడా ఎక్కుండా 
మెట్లుదిగి.. ఆఫీసుకు బయలుదేరాను.. నెనువెళ్ళవలసిన రోడ్లన్నీ నిండిపోయున్నాయి.. 
జనాలు యాత్రలకెళుతున్నట్టుగా పొలోమంటూ వెళ్ళిపోతున్నారు.. ఎక్కడచూసినా 
తీర్ధంలాగా.. ఎదో సంబరంలాగా ఇసుకేస్తేరాలని జనం... అయ్ బాబోయ్.. ఇదంతా 
నా రాకెట్ లాంచింగ్ సెలబ్రేషనేనా.. అనుకుని ఒక్కసారి.. మళ్ళీ రాష్ట్రపతి అవార్టు 
గుర్తుకుతెచ్చుకుని నడిరోడ్డులో అడ్డంగా బైకుపెట్టి ఆలోచించేస్తున్ననాకు.. ఎవడో
పెద్దగా హారన్ కొట్టి.. ఈ లోకంలోకొచ్చేలాచేసాడు...

 కొంత దూరం వెళ్ళాకా తెలిసింది అవి మహారాష్ట్రాలో ఏదాడికొకసారి జరిగే ఫాల్కీ 
యాత్ర (దేవుడిని పల్లకీలో వేసుకుని మోసుకుంటూ యాత్రచేపట్టే ఒక పండుగ) అని.. 
అంతే కదా.. ఇంకా నయం.. పొరపాటుపడ్డా.., అని ముక్కుకి కట్టుకున్న కర్చీఫ్ 
వెనుకే ఎవరికీ కనబడకుండా ముసిముసి నవ్వులు నవ్వుకున్నా..

ఒక నాలుగు గంటలుపట్టింది ఆ జనాలనుండి తప్పించుకుని ఆఫీసుచేరుకునే సరికి.. 
సరేలే ఎలాగైతే చేరుకున్నాం అనుకుని సరిపెట్టుకున్నాను. క్లైంట్ కాల్ కన్నా 
ముందుగానే మాకు ఇంటర్నల్ మీటింగని టెస్ట్ డ్రైవ్ లాగా ఒకటి పెట్టుకున్నాం.. 
అంతా ఆత్రుతగా మా టీమ్ మేట్ చెప్పింది వింటున్నారు.. నేను టెన్సన్ టెస్సన్ గా 
అందరివంకా నోరువదిలేసి చూస్తున్నాను, ఎవడన్నా ఏమన్నా లాస్ట్ మినిట్లో 
పేల్చుతాడేమోనని... ఇంతలో మా ఆవిడ దగ్గరనుండి ఫోను వస్తుంది.. కట్ చేసి.. 
నా ఫోన్ మెసేజ్ టెంప్లేట్స్ లో సేవ్ చేసిపెట్టుకున్న.. "నేను మీటింగ్లోవున్నాను.. 
ఎదన్నా ముఖ్యమైనవిషయం అయితే... మెసేజ్ పెట్టు", అన్న మెసేజ్ పంపాను. 
"వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి..", అని రిప్లై ఇచ్చింది మా అవిడ.., 
"ఇక్కడ కంపెనీలు మునిగిపోయేంత టెన్సల్లో మేం చస్తుంటే.. ఇదొక పెద్ద 
ముఖ్యమైనవిషయం మరి..", అని మనసులో అనుకుని ఫోన్ జేబులో పెట్టేసుకుని..
మళ్ళీ నోరు తెరిచి అందరివంకా చూడటంమొదలుపెట్టాను.. 

ఎవడూ మాట్లాడలేదు.. అంతాబాగానేవుందని వూపిరిపీల్చుకున్నాం. ఆమీటింగ్ 
నుండి బయటకురాకుండానే క్లైంట్ మీటింగ్ కి టైమయ్యింది..

ఏ.సీ రూమ్లో మా గుండెదడలే పెద్ద సౌండులావినపడుతున్నాయి.. అంతా నిశ్శబ్దం..., 
మా మేనేజరు మొహంలో కూడా ఆ రోజు కాస్త టెన్సనుకనిపించింది.., అన్లైన్లో 
వాళ్ళకు స్ర్కీన్ చూపిస్తు అంతా వివరించి చెబుతున్నాడు మా టీమ్ మేట్... 
అరగంటైపోయినా ఏమీ మాటలు రావటంలేదు అవతలినుండి.. అసలున్నారా లేదా..
అని మాటిమాటికి కావాలనే ఆపుతున్నాడు... చెప్పేవాడు. నలభై నిముషాల్లో 
మొత్తం అంతా ఉదాహరణలతో సహా వివరించేసాడు మా టీమ్ మేట్..

ఎనీ క్వస్చన్స్.. అనగానే తెల్లోడు రెస్పాన్స్ అయ్యాడు.. "ఇటీజ్ రియల్లీ ఎక్సెలెంట్...
బట్ బట్.. రైట్ నౌ వు ఆర్ నాట్ గోయింగ్ విత్ టూ సెర్వర్స్....", అన్నాడు..

అంటే ఏంటో మాకెవ్వరికీ అర్ధంకాలేదు.. ఫోన్ మ్యూట్ నొక్కి.. మా మేనేజరు అందరికీ 
వివరించిచెప్పాడు. అప్పుడు తెలిసింది అసలువిషయం.. ప్రస్తుతానికి.. రెండుచోట్ల అంటే 
ఆముదాలవలస, అమెరికా అక్కర్లేదు.. అమెరికాలోవున్నదాన్లోనే రెండు డాటాబేస్లుంటాయి..
అంటే ఏముంది డైరెక్ట్ కనెక్షన్ అన్నాడు.. "మరి ఈ మూడునెలలు కష్టపడి తయారుచేసిన 
రాకెట్...", అన్నాను నేను.., ఇంకేముంది.. అని పైనుండి కిందదాకా చూసాడు మేనేజరు..

"వా.. అని మా టీమ్ అంతా కుర్చీలమీంచి నేలమీదపడి.. గిలగిలా కొట్టేసుకున్నాం.. 
కాసేపటికి తేరుకుని టైముచూస్తే పదవుతుంది.. అమ్మో త్వరగావెళ్ళాలి.. ఈ టైములో కూరగాయలెక్కడదొరుకుతాయి..., ఆ కూరగాయలోడిదగ్గరకెళ్ళి రాకెట్ సంగతితెలిస్తే 
పరువుపోతుంది..  ఛా.. కనీసం మేం చేసిన రాకెట్.. మార్కెట్ కెళ్ళి కూరగాయలుతేవటానికైనా 
ఉపయోగపడుండినా బాగుండేది.. అనుకుని.. పెదవివిరుచుకుంటూ ఆఫీసు బయటపడ్డాను..



13, జులై 2010, మంగళవారం

కమాన్ గుసగుసా...


గుస గుస... గుస గుస.. కమాన్ గుసగుసా...

"ష్.. త్వరగా తినెయ్యాలమ్మా.. లేకపోతే అదిగో.. బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతాడు"
అని అమ్మ గోరుముద్దలు పెడుతూ పిల్లాడిని ఏమార్చుతూ నేర్పుతుంది
తొలి లాలింపు గుసగుస.

కాస్త పెద్దయ్యాకా "నేను చాక్లెట్ తిన్నానని మా నాన్నకు చెప్పకే.. నీకూ
ఒక చాక్లెట్ ఇస్తా", అని.. తోటి స్నేహితుడికి లంచం ఇస్తూ తాయిళం గుసగుస.
"మీ మమ్మీలేదుగా.. పద పార్క్లో ఉయ్యాల ఊగుదాం..", అని పక్కింటబ్బాయిని
లాక్కుపోతూ దొంగాటల గుసగుస.

"ఒరే.. హర్షాగాడి పెన్సిల్ బాక్సూ.. నెమలికన్నూ దాచేసాను చెప్పకండే", అని
అమాయకుడిని ఆటపట్టించే గుసగుస.

పక్కూరోళ్ళ తోటల్లో మామిడికాయలో ఉసిరికాయలో దొంగచాటుగా కోసి..
"ఒరే.. త్వరగా ఉప్పూకారం పొట్లం విప్పరా, మళ్ళీ ఎవరొకరొచ్చేస్తారు..", అనే
దొంగ గుసగుస.

"ఆ అమ్మాయి పళ్ళుచూడు.. అన్నీ పుచ్చుపోయాయి.. హి హీ..", అని
క్లాస్ మేట్ ని ఏడిపిస్తూ చిలిపి గుసగుస.

స్కూలుకెళ్ళే వయసులో ఇలా రకరకాల గుసగుసలు నేర్చుకుని మనతోపాటే
అవీ ఎదుగుతాయి.

"డాడీ పడుకున్నారు.. గొడవచేయకుండా ఆడుకోండి.., లేచాడంటే.. చెబుతాడు మీ
పని", అని ఇంట్లో ఆడుకోనీకుండా నానమ్మో అమ్మమ్మో చేసే వార్నింగ్ గుసగుస..
"ఏ పిల్లలూ ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు..ష్.. సైలెంట్..", అని స్కూల్లో
టీచర్ బెదిరింపు గుసగుస

"నువ్వు ఆ పక్కింటి చైతూతో తిరిగావంటే వీపు పగులుతుంది.. వాడు చెడిందికాక
నిన్నూ చెడగొడతాడు..", అని డాడీ రుసరుసల్తో పక్కఫ్లాటులోకి వినపడకుండా
తిట్టే తిట్ల గుసగుస.

ఇలా గుసగుసలు మొదలుపెట్టి మనకు అలవాటు చేసిన పెద్దోల్లే.. తమ పిల్లల్ని
అదిచెయ్యొద్దూ ఇది చెయ్యొద్దూ అని చెప్పే రిస్ట్రిక్షన్ గుసగుస.

ఇక మూతిమీద మొలిచిన నూనూగుమీసాల అబ్బాయిలూ... వయ్యారాలుపోతూ
అమ్మాయిలూ.. టీనేజ్ వయసులో చేసే చిలిపి గుసగుసలేవేరు..

"క్రికెట్ ఆడదాం రారా.., సిన్మాకెళదాం పదరా..", అని స్నేహితుడు ఫోన్ చేసి
చెప్పే జంప్ గుసగుస.

"శైలూ నావంక చూస్తుందోలేదో చూడరా..", అని పక్కవాడిని గోకి అడిగే
పోకిరీ గుసగుస.

"హే.. ఆ అమ్మాయి డ్రస్ చూడవే.. మా ఇంట్లో అలావేస్తే చంపేస్తారే..",
అని టీషర్ట్ జీన్చ్ వేసుకున్న పక్కమ్మాయిని చూసి చెయ్యడ్డుపెట్టుకుని చేసుకునే
ఈర్ష్యా గుసగుస.

"నిన్ను అంతలా ఇష్టపడుతుంటే.. పాపం ఎందుకు అలా ఎవైడ్ చేస్తావే..",
అని తోటి అమ్మాయి ప్రేమవిషయంలో ఇచ్చే చచ్చుసలహా గుసగుస.

"అబ్బా ఈయన చెప్పిందే చెబుతాడేంటే.., ఈ రోజు.. ఒకే పేజి
చదువుకొచ్చినట్టున్నాడు ", అని హిస్టరీ క్లాసులో మాస్టారు బ్లాక్బోర్టువైపు
తిరగగానే స్టూడంట్స్ చేసుకునే కామెంట్ గుసగుస.

ఇలా చెప్పుకుంటూపోతే.. మాటల్లో ఎనభైశాతం గుసగుసలే ఈ వయసులో...

ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వూలకోసం క్యూలు కట్టి.. అప్పుడే ఇంటర్వూ గదిలోనుండి
వస్తున్నవాడిని చాటుగా పిలిచి.. "ఏమేం అడుగుతున్నారో చెప్తారా కాస్త", అని
అడిగే ఆత్రుత గుసగుస.

"మన సుబ్బారావుగారి అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదంటా.., పాపం లక్షలక్షలు
డొనేషన్సు పోసి చదివించాడాయన... వాడు సరిగ్గా చదవడం మానేసి ఆ బిజినెస్ చేస్తా
ఈ.. బిజినెస్ చేస్తా అని ఎగిరేవాడంటా..ఇప్పుడు వాళ్ళతోటివారందరికీ ఉద్యోగాలు
రావటం చూసి వాడూ ఉద్యోగం వెతుకుతున్నాడంటా..", అని పనిలేని నైబర్ గుసగుస.

ఇవ్వన్నీ నిరుద్యోగ గుసగుసలు కాగా..

కొత్తగా ఉద్యోగంలో జాయినయినవాడిని చూసి.. "చూస్తే చాలా అమాయకుడిలావున్నాడు...
రేపు వీడే మన కొత్త బాస్ అని చెప్పినా చెబుతారు.. అమ్మో జర భద్రం", అని కొలీగ్స్
వణుకు గుసగుస.

"ఎమే.. ఫలానా అమ్మాయి ఈ మధ్యే ఐ.ట్వంటీ కార్ కొందే..., ఎవరికీ
తెలియకుండా ఎమన్నా జీతం పెంచారేమోనే..", అని సహోద్యోగినిల
టైమ్ పాస్ గుసగుస.

ఇవన్నీ చిరుద్యోగ.. ఆఫీసు గుసగుసలు.. ఇప్పుడు వీటిగురించి ఎంత తక్కువచెప్పుకుంటే
అంత ఆరోగ్యం.

"ఆ అబ్బాయి చాలా బాగున్నాడు.. పెళ్ళయినట్టులేదు.. కాస్త వివరం కనుక్కోండి..
మా తమ్ముడుగారి కూతురుకి అయితే చక్కగా సరిపోతాడు.. ", అని ఫ్రెండ్
పెళ్ళికొచ్చి.. చెంగుచెంగునెగురుతున్న కుర్రోడిని చూసి చెప్పుకునే పెద్దరికపు గుసగుస.

"ఏమ్మా.. అబ్బాయి నచ్చాడా..!, పర్వాలేదులే నాతో చెప్పు", అని పెళ్ళిచూపుల్లో
అమ్మాయిని వాళ్ళ మేనత్త అడిగే.. పేరంటాళ్ళ గుసగుస.

"అమ్మాయి.. కాస్త సిగ్గునటించమ్మా.. తలమరీ అంతలా ఎత్తెయ్యకూ..
చూసేవారంతా.. మరీ ఫాస్ట్ ఈ పిల్ల అనుకుంటారమ్మా..", అని పెళ్ళిపీటలమీద
కూర్చున్న పెళ్ళికూతురి చెవిలో అమ్మలక్కల గుసగుస.

శోభనం గదిలో.. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి చెవిలో.. ఏమడగాలో.. ఏంమాట్లాడాలో
తెలియక.. "నువ్వేం చదువుకున్నావు..", అని కంగారు అడిగే కన్ఫ్యూజ్ గుసగుస.

"ఏమే..., పొద్దున భోజనంలో పప్పూ ఆకుకూరతోనే సరిపెట్టారు... మాఇంటికిరండీ..
అన్నిట్లోనూ ముంచి తేల్చేస్తాం అన్నావుకదా!.. ఏదీ.. ముంచటంలేదూ!! తేల్చడంలేదూ!!
సాయంత్రం భోజనంలో ఏంచేస్తున్నారో వెళ్ళి కనుక్కో..", అని కొత్తల్లుడు అత్తవారింటిలో
తన భార్యతో ఎగతాళి గుసగుస.

"ఈసారి కూడా అల్లుడుగారు బిజీగా వుండి రారనుకున్నాం.. పోయినసారి
పండక్కికూడా ఏమీ పెట్టలేదు, బాగోదండీ.. ఏం పెట్టాలంటారు..", అని పండక్కి వచ్చిన
అల్లుడికి సేవలు చేస్తున్న భర్తని తలుపు పక్కకు పిలిచి అడిగే భార్య గౌరవపు గుసగుస.

ఇవ్వన్నీ బాధ్యతా గుసగుసలు.. ఎంతచెప్పినా.. వీటికీ అంతంలేదు..


"ఏవమ్మా.. అంతలా సౌండు చేస్తే.. పిల్లాడు లేచిపోతాడు.. కాస్త నెమ్మదిగా కడగమన్నా
కదా.. వంటసామాను..", అని పనిమనిషి మీద ఎగిరి సౌండు తగ్గించి వాయించే
ఫిడేలు గుసగుస.

"ఏవండీ ఆ కాలింగ్ బెల్ కి కాస్త ఏదన్నా అతికించి పుణ్యంకట్టుకోండి.. అది ఎవడోకడు
నొక్కడం.. వీడు ఉలిక్కిపడిలేచి కేర్ మనటం..", అని ఇంటావిడ.. చిన్న పిల్లాడితో వేగలేక
విసుగు గుసగుస.

"చింటూ చదువుకుంటున్నాడు.. కాస్త ఏమనుకోకుండా టీవీ ఆఫ్ చేస్తారా.. మావయ్యా!",
అని మనవడి చదువుకోసం తాతయ్యకు ఎగిరిపోయిన ఫ్రీడమ్ గుసగుస.

"అమ్మా!.. నీకెన్ని సార్లు చెప్పానే.. నువ్వన్నా చెప్పినమాటవినవేంటే.. అది తిక్కదే..
చెప్పినా వినదు.. నువ్వేందుకు దాన్ని కదుపుతావు..?", అని పక్కగదిలోవున్న పెళ్ళాంకి
వినపడకుండా తల్లికి కొడుకు పీకే క్లాస్ గుసగుస.

"మీ అమ్మానాన్నలతో పడలేకపోతున్నానండీ.., వాళ్ళకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది,
రామా అంటే బూతులావినిపిస్తుంది.., పిల్లాడిని గారాభంతో ఏం చేస్తారో అని భయంగావుంది",
అని భర్తకు భార్య చెప్పే పితూరీ గుసగుస.

ఇవన్నీ సంతాన, కుటుంబ, కలహాల గుసగుసలు.. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోటైపుగుసగుసలు.

"కాసేపు నుంచుంటే కీళ్ళనొప్పులు.. నడిస్తే ఆయాసమమ్మా.. ఏం చెప్పనూ.. మావారికి
చెబితే.. నువ్వేమన్నా ఇంకా పదహారేళ్ళ బాలాకుమారివా, ఈ వయసులో నెప్పులురాక..
యవ్వనం పొడుచుకొస్తుందేంటీ.. అంటారమ్మా...., మా అబ్బాయికి చెబితే..
డాక్టర్ చెప్పినట్టు వాకింగ్ చేస్తే ఇవ్వన్నీ వుండవు.. నాలుగురోజులు నడువు అంటాడమ్మా..
ఇలా.. ఇద్దరూ కస్సున ఇంతెత్తున లేస్తారమ్మా...., అసలు నిడబడితేనే నొప్పులు అని
నేనేవరికి చెప్పుకోనమ్మా..", అని వాకింగ్ కి వచ్చి పార్కులో కుర్చుని పక్కింటావిడకు
బాధలుచెప్పుకుంటున్న బామ్మగారి ఆపసోపాల గుసగుస

"ఇక వయసైపోయింది.. ఈ రోజో రేపో అన్నట్టుంది ఇక ఎప్పుడో హరీ.. అంటాను..",
అని ఖళ్ళూ ఖళ్ళూ దగ్గుతున్న తాతగారు ఇంటికొచ్చిన చుట్టానితో నోటినుండి మాటరాక
చేసే నీరసపు గుసగుస.

ఇవన్నీ. వృద్ధాప్య.. ఆరోగ్య.. అనారోగ్య.. గుసగుసలు..

ఇలా ఇక్కడితో అయిపోలేదండీ ఈ గుసగుసలు...,చక్రంతిరిగినట్టు .. కాలచక్రంతో పాటు ..
అలా తిరుగుతూనే వుంటాయి.. మరళా మొదటినుండి చదవటంమొదలుపెట్టండి మరి..
కమాన్ గుసగుసా..

4, జులై 2010, ఆదివారం

గిద్దావోళ్ళ గవర్రాజు



గవర్రాజు మీసం మెలెడితే సమిశ్రగూడెం ఊరుజనాలంతా గజగజలాడిపోతారంతే...!!
పరగడుపునే లేచి పందుంపుళ్ళ నోట్లోఎట్టుకుని... పొలంగట్లన్నీ ఓమారు
తిరిగొచ్చేసి... పచ్చికోడిగుడ్లు సితక్కొట్టుకుని నోట్లో ఏసుకుని జుర్రేసి..
ఓ పెద్దలోటాడు పొదుక్కాడి పాలు ఎత్తిందించకుండా గేది కుడిత్తాగినట్టుగా
తాగేసి.. జబ్బమీదేసుకున్న జరీ కండువాతో మూత్తుడుచుకుని.. మళ్ళా
వొన్నమేలకీ కోడిక్కోడీ లాగించేసి... పదిమంది తినే తిండితింటా..
కసరత్తులు చేత్తా.. కండలట్టిన సెరీరంతో.. గొర్రిపోతుమీసాలేసుకుని
సూసినోడికెవడికైనా సరే ఎన్నులోంచి వొనుకుపుట్టేలా ఉంటాడా మనిషి.

ఎపుడో తాతలకాలపు పదెకరాలపొలం పనోల్లనిబెట్టి వెవసాయం చేయిత్తా,
పెట్టుబల్లూ కర్సులూ పోగా మిగిలిన నాలుగింజల ధాన్యం ఇంటెనకాల
పెద్దగాదెలో పోయించేత్తా... అయే ధాన్యం వర్షాకాలమొచ్చేసరికి
బియ్యమాడింతా.. పొలంగట్లమీద కాయగూర్లూ, ఆక్కూర్లూ పండింతా..
ఇంటెనకాలా గెదెల సావిట్లో పాలేర్లన్నెట్టించి రెండు జర్సీ ఆవులూ...
నాలుగు రింగులు తిరిగిన బొబ్బిలి గేదెపెయ్యల్నీమేపిత్తా.. తిండికీ..
వంటకీ.. పాడికీ ఏలోటూరాకండా కాలంగడిపేత్తుంటాడు గవర్రాజు.

సిన్నప్పుడే అమ్మాబాబూ గోదార్లో పడవమునిగిపోయిన పెమాదంలో పోటంతో
కంటికిరెప్పలాగా సూసుకుంటా.. చానా గారంగా పెంచిపెద్దసేసింది ఆళ్ళ నానమ్మ.
ఆ గారంతోనే తినేసి వూరిమీదడి తిరుగుతా.. ఆళ్ళమీదా ఈళ్ళమీదా పందేలుకాత్తా
వుంటాడు గవర్రాజు. డి. ముప్పారం. కోరుమావిడీ.. గోపారం.. కోరుపల్లీ.. పెండేలా..
సుట్టుపక్కలూళ్ళలో ఏడాడికోసారి జరిగే కోడిపందేలు, కర్రసాములు, కుత్తీపోటీలూ..
ఎడ్లపందేలేగాకండా, సీజన్ని బట్టి ఆళ్ళూళ్ళో జనాలందర్నీపోగేసి.. ఎరైటీ..ఎరైటీ పందేలు
కట్టండంలోనూ.. అయి గెలిసి మీసం మెలేసి.. తొడల్సరసడంలోనూ గిద్దావోళ్ళ గవర్రాజుకి
మించినోడు నిడదోలు సుట్టుపక్కలున్న ఊళ్ళలోనేగాదూ.. పచ్చింగోదారిజిల్లాలోనే లేడు..
అని జనాల్లో మాంచిపేరుసంపాయించేడు. పెద్ద గజ్జెనగాడికి తోకలాగా ఎనకే తిరిగే
జనాలుకూడా బాగా గాలికొట్టి వుబ్బేసి గాల్లోకిలేపి గవర్రాజుకి ఫుల్లు సపోర్టింగుగా
వుంటుంటారు.

అదేవూళ్ళో దిబ్మీదున్న రైసుమిల్లు బుల్లెంకడు కొడుకు పెద్దరావుడికీ.. గవర్రాజుకీ
సెనంకూడా పడదూ... వాడెడ్డెం అంటే గవర్రాజు తెడ్డెం అనీ... ఈళ్ళిద్దరూ ఎపుడూ
పందేలుకాసీ.. కొట్టుకుంటా.. పంచాయితీలెడుతుంటారు. ఇద్దరూ బాగా బలిసున్నోళ్ళు
కాటంతో.. ఎవర్నీ ఏమన్లేకా.. సద్దిచెప్పిసి.. సిన్నపిలల్నితిట్టినట్టు ఓ నాలుగు సిలకతిట్లు..
తిట్టీ.. చేతుల్దులుపుకుంటారు వూరి పెసిడెంటు రాంబెమ్మంగారు.

పెద్దరావుడు ఎన్నిమార్లు గవర్రాజు చేతిలో వాడిపోయినా.. కాసినపందెమేగాసీ..
చేద్దురద తీర్చుకుంటుంటాడు గానీ.. తన బుద్దిమాత్రం మార్సుకోడూ...
అలాని... ఇద్దరూ ఒకల్నొదిలొకరు, ఒకరికంటొకరు పడకుండా తిరుగుతారా! అంటే..
అదీలేదూ.., ఎపుడూ.. కొత్తగా బండికట్టిన జోడెద్దుల్లాగా అటుఇటూ లాక్కుంటా పీక్కుంటా
కలిసే తిరుగుతుంటారు.. పందాలేసుకుని కొట్టుకుంటొంటారు.. ఈళ్ళిద్దరి
పందేలగొడవేమోగానీ.. జనాలకు ఈళ్ళమధ్య పందెముందంటేనే.. తానాలు..
వొన్నాలు.. మానేసి తెగెగబడిబోయి.. ఫ్రీగా ఈదిసినమా సూసినట్టు సూసేత్తా..
ఈళ్ళేసేత్తా తెగ సంబరబడిపోతుంటారు.

ఆకాసమంతా మూసేసి ముసురేసేసిని నల్లమేగాలు... అప్పుడుదాకా ఉగ్గబెట్టుక్కూచ్చున్నట్టు
కూర్సుని.. వొక్కసారిగా కుంబరుష్టి కురిపించేసి.. తెల్లబడిపోయేయి. ఎండిపోయున్న నేల
వానసినుకులకి తడిసి తాటిరొట్టికాలుత్తాకి పైనేసిన.. ఎర్రక్కాలిన పిడకముక్కల్లాగా
పొగలుకక్కేత్తావుంది. వానకు తడిసి.. బీటల్దీసేసిన నల్లరేగడ్నేల్లోంచీ.. వత్తున్న
మట్టివాసన.. తడిసిన సన్నజాజిపూల వాసన్తో కలిసీ ముక్కుపుటాలదిరే సువ్వాసనతో
మత్తేక్కిచ్చాంది.. నిద్రగన్నేరు చెట్లమీద వాలిన కాకులు వానదెబ్బకు వొనుకుతా..
కావుకావుమని కల్దిరుగుతా గోల్చేసేత్తున్నాయి. కలుపుతీతకెళ్తున్న జనాలు
వానదెబ్బకి ఎక్కడ జాగావుంటే అక్కడ నక్కేసి సీరకొంగులూ.. కండువాలు తలపై
ఏసేసుకుని ఆ కాకుల్లాగే మునగలాగేసేరు...

గవర్రాజు వర్సానికి గేదెల్చావిడి పాకలో పంచెగ్గట్టి పచ్చగడ్డిమోపులపక్కనేసున్న
చెక్కకుర్సీపై కూర్సుని... లంగకపొగాకు సుట్ట ఎలిగించి పొగొదుల్తావున్నాడు.
ఎండకేగిపోయున్న తాటాకుపాక చూరుమీదనుంచి పడతావున్న వానసినుకులు...
అప్పుడే కొల్లిసత్తిగాడి కాపీహొటల్లో పెట్టిన టీడికాషను రంగులోనూ.. బంగాళాపెంకుటింటి
మీదనుండి పేడగుట్టమీద పడి పచ్చరంగుతోనూ... ఆపక్కనే గుట్టగాపోసిన
ఎర్రకంకరగుట్టమీదనుండి ఎర్రరంగుతోనూ.. వొకసోట కలిసిపోయి..
పంచరంగుల్లో పల్లవేపు పారతా.. పంటకాల్వలో ఎలిపోతున్నాయి.

ఇటికిబట్టీల్లో అడుసుతొక్కే ఎడ్లు కసక్ కసక్మని సౌండుతో తొక్కినట్టు కయ్య తొక్కుకుంటా
కంగారుకంగారుగా వొచ్చిన పాలేరు ఎంకటేసులు.. "బాబయ్యా.. పెద్దరావుడుగోరో..
మళ్ళా ఏతల పందెంగట్టేరండే... ఈ సారి నడుంకాల్వకే.. అదే పన్నెండేతలిత్తానో
కాస్కోమంట్నారండే. నిమ్మకాయలెసి నెగ్గడంగాదూ... మనూళ్ళో గుడ్డి సూరమ్మేత్తానికి
రెడీగావుందే..., ఈపాలి కోడ్గులేస్కోమనో అన్నారండే", అన్జెప్పి తెచ్చిన కోడిగుడ్లట్టని
గవర్రాజుకి చూపించేడు.

"పదరా.. పన్నెండేంటెహే.. పదిటిల్లోనే ఏద్దాం.., ఆడికి ఎన్నిసార్లు నాసేతిలోవోడినా
సిగ్గుండదెదవకీ..", అని ఎగ్గొట్టిన పంచెకొసల్జోడించి బీసముడేసేసి
పెద్దపెద్దంగలేసుకుంటా... పెద్దీదేపు నడిసేడు గవర్రాజు.. ఎనకాలే కోడిగుడ్లట్ట
అట్టుకుని నడిచేడు పాలేరు ఎంకటేసులు.

వూరినడిబొడ్నున్న రాములోరి గుడికాన్నించి.. నడుంకాలవగట్టుకి రమారమి
రెండుకిలోమీటర్లుంటాది. ఆ వూల్లో అంతకు ముందల చానామంది ఇదే పందెంగట్టి
ఓడిపోయేనోళ్ళేగానీ పదేనేతల్లోగూడా నిమ్మకాయగానీ.. నారింజికాయగానీ
ఏతెయ్యలేకపోయేరు... అదే దూరం నిమ్మకాయతో పన్నెండేతల్లో ఏసీ మీసంమెలెసీ
"సెబాష్.. మగాడంటే ఈడేరా..", అనిపించుకున్నోడు గవర్రాజొక్కడే. అసుమంటిది ఇప్పుడు
కోడిగుడ్డుల్తో పదేతల్లో ఎలాఏత్తాడోనని వూరిజనాలంతా పనులుమానేసి నోల్లోదిలేసి
చూత్తంమొదలెట్టేరు.

"బాబయ్యా.. నారింజికాయైతే కాత్తోకూత్తో దొల్లుకుంటా పోతాది.. కోడుగుడ్డేందొల్లుద్దండే..
కాత్త ఆలోసించండే పందెం.., అదీ.. పదేతల్లోఅంటన్నారో సూసుకోండే.. మనపరుపోద్దండే
ఆరిముందో..", అంటా ఎంకటేసులు గవర్రాజు సెవిగొలికేసేడు.

"ఒరే.. దెవాసాలోడా సెవిలో జోరిగలెక్క గొలక్కేహే.. నువ్వే సూద్దువుగానీ ఎలా ఏత్తానో..,
గుడ్డిసూరమ్మేత్తా దంటా ఎగతాళ్జేత్తాడా నన్నూ.., మనమేసే పందెమెలావుంటాదో ఆడికి
సూపించాలియ్యాలా..", అని కసురుకుంటా.. గుడ్డుతీసుకుని ఎంకటేసుల్ని
పక్కకినెట్టేసేడు గవర్రాజు.

ఎనిమిదేతలకే... సూరింగారి దూళ్ళసావిడి దాటేసి... గుబ్బలోళ్ళదిబ్బదగ్గరకొచ్చేసినయ్యి..
ఆడ్నుండి సూత్తే నడుంకాలవ కనుసూపుమేర్లో కనిపిత్తానేవుంటాది...ఇంకారెండేతలంటే
గవర్రాజుఏసేసిలానే వున్నాడని ఎగస్పాట్టీవోళ్ళు గుసగుసలాడేత్తున్నారు.., ఏం
జరుగుద్దోఏంటోనని.. జనాలంతా కంగారడిపోతా ఒకర్నుకరు తొక్కేసుకుంటున్నారు..
కొందరు కుర్రగాళ్ళతే సైకిళ్ళేసుకునిమరీ.. ముందెళ్ళిపోయి.. ఏతకెదురుకాసేత్తున్నారు...
జనాలడావుడీ.. దూరం సూసుకున్న పెద్దరావుడికి సెవటలట్టేసినియ్యి..

"ఒరే తియ్యిరా.. పదేలు.. ఇంకేసూత్తావుగానీ... నాతోనువ్వొక్కపందెంలో గెలువూ
నామీసాలు తీయించుకుంటా..", అని సేలెంజి సేసి... అట్టలోంచి మాంచి వాటమైన డబల్ సొన
గుడ్డోటందుకున్నాడు గవర్రాజు. దున్నపోతు దువ్వినట్టుగా.. తడిసిపోయున్న కంకర్నేలమీద
కాల్దువ్వి.. క్రిక్కెట్టులో బంతేసేటోడు తోంనట్టుగా కోడిగుడ్డు పంచెకొసకేసి రుద్దీ... కిందకంటా
కూర్సునిలేసి.. ఒక్కిసురు ఇసరటంతో పెద్దనిద్రగన్నేరు సెట్టు పైనుండెళ్ళి..
అవతలున్న ఏపచేట్టుపైనుండి అవతలకెళ్ళి పడి.. తపుక్కుమంటా సితికిపోయింది
కోడిగుడ్డు... జనాలంతా కేరింతలు కొట్టేత్తా.. తొమ్మిదేతల్లోనే ఏసేసిన.. గవర్రాజుని
ఆకాశానికెత్తేసేరు.

పదేలుపోగొట్టుకున్న పెద్దరావుడు ఉడుకుమోత్తనంతో కంగార్లో కాలుతొక్కేసిన
పేటలోకుర్రోడ్ని చావబాదేసేడు. అడ్డడి ఆపిన గవర్రాజు సొక్కాకాలరట్టుకుని..
"ఏతలపందేంగాదురా.. వచ్చే సెనివారం కిష్నాష్టమికి... నీ మీసాలమీద నిమ్మకాయల్ని
నిలబెట్టుసూద్దాం.., ఇదీ అసలు సేలంజింగు.. నా పందెం ఇరవయ్యేలు...,
దమ్మున్నమాగాడివైతే కాయి.. అప్పుడు సూస్కుందాం పెతాపం తస్సాదియ్యా.."
అని కస్సుమంటా పంటచేలో తోకమీదడగేసేసిన తాసుపాము లెక్కలేసేడు పెదరావుడు.

"సరే.. కాయిరా... మీసమ్మీద నిమ్మకాయ నిలబెట్టకపోతే.. నా మీసాలేగీసేత్తానేహే..
ఇదే నా సేలంజీ.. కాస్కో", అని పెద్దరావుడి కాలరట్టుకున్నాడు గవర్రాజు.., సరేలే అదీ
సూద్దాం.. అని కాలరొదిలేసి.. కంగార్కంగారుగా ఎళ్ళిపోయేడు పెద్దరావుడు.

సిర్రెత్తిపోయున్న గవర్రాజు సిమసిమలాడతా ఇంటికిసేరుకున్నాడు... బుజానున్న
కండువా తీసవతలడేసి.. కోపంగా పడక్కుర్సీలో వాలిపోయేడు..
"ఒరే ఎంకటేసులా.. మంగడికి కబురెట్టరా.. ఇయ్యేలనుండీ ఆడేంసేత్తాడో నాకు తెల్దూ..
నా మీసాలకీ సంపంగినూనే రాత్తాడో.. ఏ సన్నాసినూనే రాత్తాడో.. మొత్తం
గట్టిపడిపోవాలా.. పొద్దున్నుంచీ సాయంత్రందాకా ఇక్కడే ఆడికి పనీ అన్జెప్పు..
గాదిలోయి.. నాలుగు బత్తాలు ఆడింటికి తోలూ.. ఈ పందెంలో ఎలాగైనా
నేనే గెలిసి సూపిత్తా నా తడాకా..", అని రోషంతో మీసాలెగరేసేడు గవర్రాజు.

కబురందుకున్న మంగడు సాయంత్రమేలకి రానేవచ్చేడు.. "గవర్రాజుగోరో.. మీరేం
కంగారడకండే.. మీ మీసాలకేసంపగినూనే అక్కర్లేందండే.. దమ్మున్నమీసాలియ్యే...
శాన్సిత్తే.. నిమ్మాకాయలేంటండే.. గొబ్బిరికాయల్నైనా నిలబెట్టెత్తాయండే బాబో..
అయినా నేనున్నానుగదండే..., గంటకోమారు కలబందగుజ్జు రాత్తా దువ్వుతుంటే.
నాలుగురోజుల్లో నా సామిరంగా.. గుర్రపెంటుకుల్లెక్క నిలబడిపోవో..",
అని నాలుగుబత్తాలధాన్యం అందుకున్న సంతోషంలో గవర్రాజుకు గాలికొట్టేసేడు.

ఆయాల్నించీ మంగడుపొద్దుపొడవకముందే రాటం.. గంటగంటకీ కలబందగుజ్జుతో
మీసాలు సవరచేయటం.. ఆఈది కబురూ ఈ ఈదికబురూ సెప్పటంతో.. గవర్రాజు
ఇంటిపట్టునే వుండిపోవాల్సొచ్చింది.. జనాలంతా ఇంటికొచ్చి పలకరించెల్లిపోతా పెదరావుడి
పార్టీ కబుర్లు మోత్తావున్నారు.

నాలుగురోజుల్లో గవర్రాజుమీసంలో సత్తువకొట్టొచ్చినట్టు కనబడిపోతా, మీసం దగాదగా
మెరిసిపోతావుంది..., తోటలో కోసుకొచ్చిన సిన్న పచ్చనిమ్మకాయల్ని మీసాలమీద
నిలబెట్టి... ఓసారి ట్రైలేసి గవర్రాజుకు అద్దంలో సూపించేడు మంగడు.
అది సూసుకుని మురిసిపోయిన గవర్రాజు.. "ఒరే.. మంగా.. నీ బుర్రేబుర్రరా.. అసలు
నువ్విక్కడుండోల్సినోడివి గాదురా.. మీబాబులాగా నువ్వూ రంగమెల్లి అక్కడే తెల్లోల్ల
దగ్గర సెటిలై పోవాల్సిందెహే..", అని మంగడ్ని పొగడ్తల్తో ముంచేసేడు.

"బాబుగారో.. మాకుర్రోడు సేతికందేసేడండే.., మహా పనోడండోయ్ మావోడో...
బొంబాయిలో నేర్సుకొచ్చేడండే పనే..,నాలుగైదేళ్ళు కట్టబడ్డాడండే.. ఆడే అమితాబస్సన్న్
కీ, మిగతా హిందీ ఏక్టర్లకీ.. ఆళ్ళికీ కటింగేసేటోడంటండే.., అక్కడే బొంబాయిలో
షాపెడతానన్నాడండే.. నేనే ససేమిరా.. అని మనూరులాక్కొచ్చి మనపెద్దీదిలో రేపు
షాపెట్టిత్తిన్నానండే... అందరూ తిడుతుండేవోరండే నన్నో.. మీవోడ్నికూడా ఇదే ఇద్యలోకి
లాక్కొత్తునావేంట్రా,సుబ్బరంగా సదివించి ఉద్దోగం సేయించకా.. అనే..,
నేన్నమ్మిందుకటేనండే.. బాబో.., మా తతలగాలం కానీయ్యండీ.. మాకాలంకానీయండీ..
జనాలమీదసేసే యాపారమే యాపారమండే.., అయినా సేతిరుత్తిని
మించినేపారమేముంటాదండే.., మిగతాయి ఈరోజుంటే రేపుంటాయోలేదో తెల్దో....",
అని ఏదాంతం బలుకుతా.. గవర్రాజు మీసాలు దువ్వేడు మంగడు.

"ఇంతకీ ఇయ్యన్నీ ఎందుకుసెబుతున్నానంటేండే.., మీరేమనుకోకండా.. రేపొపాలి
మా వోడు షాపుకొచ్చి గడ్డంసేయించుకోండే.., ఎపుడూలేనిది సవరానికి షాపుకాడికి
రమ్మంటన్నాడేంటా అనుకోమాంకడే బాబో.., మీలాంటోల్ల బేరంతో మొదలయితే..
మావోడు యాపారం మూడుపూలు ఆరుకాయలైపోతాదాని ఆసెండే..", అని
గవర్రాజుని బ్రతిమలాడతా అడిగేడు మంగడు.

*** *** *** ***

ఇంకా ఎలుగురాకండానే.. గాదిక్కట్టిన వరికంకెల్ని పొడుత్తా పిచ్చుకలన్నీ గోలసేసేయటం
మొదలెట్టేసేయి.. కాసేపటికి.. తెల్లారిపోయి.. పెదరావుడు పందెంకట్టిన సెనివారం రోజు రానే
వచ్చింది. అప్పుడికే గవర్రాజుకి నాలుగైదుమార్లు షాపుదగ్గరికి రమ్మని కుర్రాగాళ్ళసేత
కబుంరంపించేసేడు మంగడు. పెళ్ళికి మగపెళ్ళోరు ముత్తాబయిఎళ్ళినట్టు ఎనకో
పదిమందినేసుకుని బయల్దేరేడు గవర్రాజు. షాపుదగ్గరకొచ్చేసరికి కుర్సీ ఏసేసి
కొబ్బరిబొండం కొట్టిచ్చేసి.. కొడుకుసేత దండాలెట్టించేసి మర్యాదసేయించేసేడు మంగడు.

"మీరొత్తం ఎక్కడ ఆలసమయ్యిపోద్దోని మావోడు గొడవండే.. మళ్ళా కాసేపాగితే ముహుర్తం
దాటేత్తే.. అట్టమి గడియలొచ్చేత్తాయనీ తెక్కంగారుపడిపోతున్నాడండే.., నేనోపాలి
ఇంటికెళ్ళొచ్చేత్తానండే.. మీకోసం ఏదో బహుమానం కట్టుంచేడంటండే.. అదొట్టుకొచ్చేత్తానో
మీరు కానియండే.." అని ఇంటేపు లగెత్తాడు మంగడు..., మంగడుకొడుకు..
"రండే.. గవర్రాజుగారో..", అంటా మహారాజా కుర్సీపై కుర్సోపెట్టినట్టు గవర్రాజుని
కుర్సోపెట్టి మెడసుట్టూ తెల్లగుడ్డేసి గెడ్డంసేయటం మొదలెట్టేడు. గవర్రాజుకుడా వొచ్చిన జనం
బయట కుర్సీల్లొకుర్సుని..బల్లేసి ఎట్టిన సితార, ఆంధ్రజోతి.. సినిమాపత్రికల్లో మొకాలెట్టేసి
సదవటంరాపోయినా బొమ్మల్చూసి సొల్లుకార్చేసుకుంటా పెపంచాన్ని మర్సిపోయెరు.

సెవులదిరిపోయేలా పెద్దసౌండుతో హిందీపాటలెట్టేసి.. లైట్లేసేసి..., ఫ్యానేసి పెనుగాల్లో
ప్రేసెంటుకొట్టి..దగదగామెరిసిపోతావున్న కొత్తసామానుజూపిత్తా.. బొంబాయిలో మేమదిసేసేం
ఇదిసేసేం అంటా కబురుల్లోపెట్టేసి.. నైసుగా గెడ్డంగీత్తావుండగా.. జేబులోఅరుత్తావున్నసెల్లు ఫోన్
తీసి.. కాత్త హిందీ పాటలు సౌండు తగ్గించీ.. "ఏప్పుడొత్తున్నారో.. అద్దాల్లేకండా..
షాపోపినింగు అంటే ఎలాగుంటాదీ.., ఇలాజేత్తేఎలాగా", అని ఎవడిమీదో కోప్పడిపోయేడు
మంగడుకొడుకు..

"సూడండే... ఆడేదో గొప్పోడనీ నిడదోల్దాకా ఎళ్ళి ఆడికిత్తే... అద్దాలుసూడండే..
పిట్టింగ్ సేయకుండా వొదిలేసేడు.. ఎప్పుడుఫోనుసేసినా ఇదిగో గెంటలోవొచ్చేత్తానో
అంటాడండే..", అని కిందెట్టేసిన అద్దాలు సూపిత్తా.. మళ్ళా గెడ్డంసేయటంలో మునిగిపోయేడు..
అలా ఐదునిముషాలకోసారి సెల్లుఫోన్లో అరుత్తా.. మళ్ళా గెడ్డంగీత్తా.. అరగంటసేపు కుర్సీలో
కుర్సోబెట్టి అటూ ఇటూ గిరగిరా గానుగుతిప్పినట్టుతిప్పేసి ఇకారంతెప్పించేసేడు గవర్రాజుకి...
అరగంటయ్యాకా.. సల్లగా ఐసుగెడ్డలాగా లాగుతున్నలోషను మొకానికి రాసేసి.. మొకంపైగుడ్డేసి
తుడవటంమొదలెట్టేడు.. మళ్ళా మోగుతున్న సెల్లుఫోను తీసి ముసుగేసేసిన గుడ్డ అలాగుంచేసి..
ఫోనట్టుకుని.. బయటకెళ్ళిపోయేడు.. మంగడుకొడుకు.

సాయత్రమైపోయింది... కిష్నాష్టమికని కట్టిన పెరుగుముంత ఆడ్డంకన్నా.. గవర్రాజు, పెదరావుడు
కట్టిన నిమ్మకాయల పందెం సూట్టాంకోసం గుంపులుగుంపులుగా.. జనాలు రాములోరిగుడిదగ్గర
సేరుకుంటున్నారు... ఎవడిసేతిలోనూ ఓటమంటే ఎరగని గవర్రాజు ఆయేల పందెం వాడిపోయి..
రెండు.. వందనోట్ల కట్టలు పెదరావుడిసేతిలోపెట్టేసి తలదించుకున్నాడు.

సెల్లు ఫోను మాటాడతా.. షాపు బయటకెళ్ళిన మంగడుకొడుకు మళ్ళా ఆవూళ్ళో అడుగెట్టలేదు..
రొండేపులా సమానంగా వొత్తేసి పాతసినిమాలో నాగేసర్రావు మీసంలా సన్నగాకాశీతాడులా
తయారయ్యున్న మీసాన్ని మొత్తం గీయించేసుకుని.. బోడిమూతిని అద్దంలో సూసుకున్న
గవర్రాజు.. ఒక్కసారిగా సల్లబడిపోయేడు..

మీసంతోపాటు పౌరుషంకూడా పోగొట్టుకుని.. ఆఏల్నుండీ.. పందేలు జోలికెళ్ళటమే మానేసేడు..

Related Posts Plugin for WordPress, Blogger...