24, ఏప్రిల్ 2013, బుధవారం

ఇల్లాలి సన్యాసం..


ఇద్దరు పిల్లలతో వేగలేక విసుగు పుట్టిన ఒక ఇల్లాలు సంసారాన్ని త్యజించి.. కాషాయం కట్టి.. హిమాలయాల్లోకి పోయి  సన్యాసంలో కలిసిపోదాం అని నిర్ణయించుకుంది.
ఎంత గట్టి నిర్ణయం తీసుకున్నా సాయంత్రం ఏడింటికి  తన ఫేవరెట్ టి.వి సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించేసరికి మెత్తబడిపోతూ వస్తుంది.. ఇక ఇలా కాదు అని.. శని ఆది వారాల్లో పెద్దగా నచ్చిన సీరియల్స్ లేని సమయంలో ఎగిరిపోవాలని అనుకుని "ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ.. " అన్న పాట పెట్టుకుని వింటూ.. కావాల్సిన వస్తువులు కొనటానికి షాపింగ్ లిస్టు రాసుకోవటం మొదలుపెట్టింది.
ఒక కాషాయం రంగులో ఉన్న కంచి పట్టు చీర.. అప్పుడప్పుడు కట్టుకోటానికి అని నాలుగైదు కాషాయం రంగు కాటన్  చీరలు..  మూడు నాలుగు క్రేప్ చీరలు.. రొండు మూడు అనార్ఖలి డ్రెస్సులు కాషాయం రంగువి.. ఒకటి రొండు నైట్ గౌన్లు.. వాటికీ తగ్గ మాచింగ్ చెప్పులు, వాచ్.., కాషాయం రంగు హ్యాండ్ బ్యాగ్.. మాచింగ్ నెక్లస్.. అన్నీ కొని.. మొన్ననే వారం రోజుల క్రితం కొన్న మేకప్ కిట్ పాతది అనిపించి కొత్తది తీసుకుని.. దాంతో పాటుగా ఒక కమండలం.. వడ్రంగి కొట్టులో ఆర్డర్ ఇచ్చి మరీ తయారుచేయించిన దండం.. పావుకోళ్ళు.., కొన్ని జప మాలలు.. రుద్రాక్ష మాలలు.. విబూధి పళ్ళు.. అన్నీ సర్ది మూటకట్టుకుంది.
అప్పుడప్పుడు బోర్ కొడితే పాటలు వినటానికి ఐపోడ్.., సినిమాలు చూడటానికి స్మార్ట్ ఫోన్ తన హ్యాండ్ బాగ్లో పెట్టుకుంది.
ఒక అర్దరాత్రి ఒంటిగంట దాటిన తరువాత మెల్లగా లేచి.. పడుకున్న భర్త కాళ్ళకు నమస్కారం చేసి వెళ్దామంటే.. అయన లాప్టాప్ ముందు రాత్రనకా పగలనకా కుర్చీకి అంటుకుపోవటం గమనించి.. ఇది ఈ జన్మకు జరిగే పని కాదు అని.. "ఐ యాం గోయింగ్ హిమాలయాస్" అని ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టింది.
వెంటనే భర్త నుండి వచ్చిన మొదటి "లైక్", చూసి కన్నీళ్ళ పర్యంతం అయ్యి.. “ఈ జన్మకిది చాలు స్వామీ” అని.. ఆయనకు నమస్కరించి. అయన.. లాప్టాప్ కు “నువ్వే దిక్కు తల్లి..”, అని స్మరించి బయలుదేరింది.
ఎంతైనా.. కడుపు తీపి.. గడప దాటనియ్యలేదు. చిన్నాడి అల్లరి కొత్తగాని.. పెద్దాడి అల్లరి అలవాటైపోయిందే కదా అని ఒంటిగంటైనా నిద్రపోకుండా.. టాబ్లెట్ లో "ఆంగ్రి బర్డ్స్" గేమ్ ఆడుకుంటున్న వాడిని డిస్టర్బ్ చెయ్యకుండా.. రెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి.. వాడి చేతికి కమండలం-పావుకోళ్ళు బ్యాగ్ తగిలించి.. బయట లోడ్ తో వెయిట్ చేస్తున్న పేకర్స్ & మూవర్స్ వ్యాన్.. ఎక్కేసింది.
అప్పటికే వ్యానులో తట్ట బుట్ట సర్దుకుని ఎక్కిన అత్తగారిని చూసి ఆశ్చర్య పోవటం అటుంచి.. పెరుగు తోడు పెట్టారా.. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వచ్చారా.. ఇల్లు తాళం సరిగ్గా వేసారో లేదో.. అని తన ఎప్పుడూ చెప్పే డైలాగ్స్ చెప్పి తన అనుమానాలు వ్యక్తం చేసింది.
“అవన్నీ చేసానుగానీ.. నువ్వు సరైన తిండి లేక ఎక్కడ ఇబ్బంది పడతావోని మన వూరి నుండి తెచిన పప్పులు-ఉప్పులు.. పచ్చళ్ళు-పచారి సరుకులు అన్నీ మూట గట్టాను.. అన్నట్లు మొన్నే ఊరినుండి తెప్పించిన.. కొబ్బరి నూనె.. పాత చింతపండు.. అక్కడ దొరకవని ముందే ఊహించి సర్దించానమ్మా.., ఎప్పటినుండో నాకూ తీర్థయాత్రలకు వెళ్ళాలన్న కోరిక అలానే ఉండిపోయింది.. నా కొడుకు ఎలాగూ తీర్చటం లేదూ.. నువ్వు హిమాలయాలు అని అప్డేట్ పెట్టగానే.. నా మనసుకు ఏంటో ఊరట కలిగినదమ్మా.. అక్కడైనా కాస్త ప్రశాంతత ఉంటుంది అని నేనూ మూట-ముళ్ళు సర్దేసానమ్మా.., చంటాడిని కాస్త చూస్తుండమని పక్కింటి లీలకు చెప్పానులే.. దానిగురించేం బెంగ లేదు.. అయినా ఎంత కష్టమొచ్చి పడిందే నీకు నా యమ్మ..”, అని గగ్గోలు పెట్టింది అత్తగారు.
అత్తయ్య మీరు మాత్రం ఆ సీరియల్స్ అవి వదిలి నాకోసం ఎలా వచ్చారండీ..!, సరేలే.. అయ్యిందేదో అయ్యింది.. కష్టాలేవో ఇద్దరం పడదాం అని ఒకరికొకరు ఓదార్చుకుని సర్ది చెప్పుకున్నారు.
హిమాలయాలు చేరుకున్న తరువాత.. అక్కడ ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని.. పొద్దున్న మధ్యానం. సాయంత్రం అని లేకుండా ఘోర తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది ఆ ఇల్లాలు.. దానికి నేను అన్ని విధాల సహకరిస్తాను.. ఇంటిపనులన్నీ చూసుకుంటాను.. నీకేది కావాలంటే అది టైం కి వండి వార్చుతాను.., నేనుండగా ఏ లోటు రానీయను.., మీ పిల్లాడి పనులు తక్క.. అని అత్తగారు శపథం చేసారు.
మొదలు పెట్టిన మొదటి తపస్సుకు భంగం కలగనే కలిగింది.. పక్క ఆశ్రమం లోని మునులందరూ దండాలతో దండెత్తారు.. కమండలాలు పట్టుకుని కాలు దువ్వారు.. పెద్ద పిల్లోడు చేసిన అల్లరి అంతా సంస్కృత పద్యాలుగా వర్ణించి.. సాగదీసి రాగాలతో.. బండ బూతులు తిట్టిపోశారు.. ఆ పద్యాల సారంశం ఏమిటీ అంటే.., ఆ పిల్లాడు.. తపస్సు చేస్తున్న ఒక ముని గడ్డానికి తాడుకట్టి “టెంపుల్ రన్” అని పరుగుపెట్టాడంటా.. వేరే ముని పంచే పట్టుకుని లాగి “నింజా టెక్నిక్” అన్నాడంట.. ఇంకొక ముని.. ఘోర తపస్సులో ఉండి మేనక డాన్స్ ను అనుభవిస్తూ ఆనందిస్తున్న సమయంలో.. ముక్కులో మామిడాకు పెట్టి గిరగిరా తిప్పాడంటా. ఇవన్ని విని నవ్వపుకోలేని ఆ తల్లి అటువైపు తిరిగి.. రాగం తీసింది.. ఆ రాగానికి కరిగిన మునులంతా వెనుతిరిగి వెళ్ళిపోయారు.
తరువాత రోజు ఆంగ్రి బర్డ్స్ కొత్త లెవెల్ ఫెయిల్ అయిన కోపంలో పక్క ఆశ్రమం లోని ముని కుమారుడిని పట్టుకుని చితక్కొట్టి వచ్చేసిన పెద్ద పిల్లోడిని చెట్టుకు కట్టేశారు మునులంతా.., మునుల భార్యలకు మంచి చేసుకుని.. కొత్త సీరియల్ కథ ని చెప్పి వాళ్ళను మెప్పించి.. బ్రతిమలాడి.. ఏదోలా విడిపించేగొడవలో.. ఆ రోజు తపస్సు గొడవ మర్చిపోయిందా ఇల్లాలు.

ఒకరోజు ఎవరికీ తెలియకుండా పొద్దున్నే లేచి చెట్ల చాటుగా తప్పస్సు మొదలుపెడితే.. పెద్ద పిల్లాడు టాబ్లెట్ లో ఛార్జింగ్ అయిపోయిందని అలా బయటకు వచ్చి షికార్లు చేస్తూ చెట్టుమీద ఉన్న తెనేపట్టుని కొట్టి.. అమ్మ వంక చూసి పారిపోతే ఆ ఈగలన్నీ ఆ తల్లి చుట్టూ ముసిరి.. మొహం మీద కుడితే.. ఇలియానా మొహం లా ఉండే ఆ తల్లి మొహం వాచి జయలలిత మొహం అంత తయారయ్యి.. మళ్ళి తపోభంగం అయ్యింది.  ఏమీ తోచని ఆ ఇల్లాలు ఫేస్బుక్ లో “ఐ యాం లైక్ జయలలిత నౌ” అని అప్డేట్ చేస్తే.. వెయ్యి లైక్ లు వచ్చి ఆశ్చర్య పరిచాయి.
ఇలా రోజులు గడుస్తున్నాయి కానీ తపస్సు భాగ్యం కలగటం లేదు అని ఆ ఇల్లాలు చాలా బాధపడిపోతున్న సమయంలో దూరంగా చెట్ల మధ్యలోంచి ఎదో పులి ఘర్జించినట్లుగా శబ్దం వచ్చింది.. ఏంటని అని చూస్తే.. పేకర్స్ & మూవర్స్ వ్యాన్ వేసుకుని వాళ్ళమ్మగారు దిగారు.. దిగుతూనే.. ఎలాగున్నవే.. మొహం తప్ప అంతా ఇలా చిక్కిపోయిందేంటే  అని చాలా బాధపడిపోయి సామానంతా దించి సర్దుకున్నాకా.., నీ ఒకొక్క ఫేస్బుక్ అప్డేట్స్ చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేసాయనుకో.. అన్నీ చదువుతూనే.. ఉన్నానమ్మా.., మొన్నటి అప్డేట్ స్ లో..,  హిమాలయాలు.. మామిడిచెట్లు అన్నావ్ కదా.. ఈ సారీ ఊరగాయ సీజన్లో లో.. మన వూరిలో కూడా మంచి మామిడికాయలు దొరక లేదు.. ఇక్కడికొస్తే అవన్నా మంచివి చూసుకుని ప్రశాంతంగా పట్టుకోవచ్చు అని నేనుకూడా వచ్చేసానమ్మా.. అని చల్లగా చెప్పిందావిడ.
సాయంత్రం ఏం కూర వండాలో.. ఎలా వండాలో.. మిట్ట మధ్యాహ్నం నుండే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు తల్లి.. అత్తగారు.  
క్రితం ఏడు మీరు పెట్టిన ఆవకాయలో కాస్త ఉప్పు ఎక్కువైందండి అని ఆవిడ అంటే.., నిలవ ఉంటుంది అని ఉప్పు ఎక్కువ వేసానండి.., ఉప్పు ఎక్కువగా ఉందాండి!.. అని ఈవిడ సమాధానం చెప్పింది... మధ్యలో పిల్లాడు తగులుకుని.. ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువే ఉంటుంది కదా.. అని సెటైర్లు వేసాడు.
ఒక పక్క తపస్సుకు కుదరక.. మరో పక్క  పెద్ద పిల్లాడి అల్లరి భరించలేకుండా ఉంటే వాటితో పాటు.. తల్లి.. అత్తగారి కబుర్లు.. ఇంకా మంటపుట్టించటం మొదలుపెట్టాయి ఆమెకి.
ఒకరోజు మునులంతా మళ్ళి కట్టకట్టుకుని ఆశ్రమం పై పడ్డారు.. అందులో ఒక ముసలి ముని ముందుకు వచ్చి.. “ముక్కుపచ్చలారని.. ముని కుమారులను..., ముక్కుపచ్చలారని ముని కుమారులను.... ఊఉ..”, అని రాగం అందుకున్నాడు.
“ఆగండి.. అర్ధం అయ్యింది.. మీ మునికుమారులను మా వాడు చితక్కొట్టేసుంటాడు.. మీరు పద్యం మొదలుపెట్టకముందే నాకు తెలిసిపోయింది.. నన్ను క్షమించండి.. ఇప్పుటి నుండి ఇలా జరగదని నేను హామీ ఇస్తున్నాను.. నేను వాడి సంగతి చూస్తాను.. మీరు దయచేసి ఈసారికి క్షమిచేయండి అని ఆవిడ మునులందరికీ నమస్కారం చేసింది.
“అది కాదమ్మా.. మేము ఎన్నాళ్ళుగానో నేర్పుతున్న విలు విద్య.. శస్త్ర విద్య.. అస్త్ర విద్యలు అన్నీ, మీ వాడు ఆ టాబ్లెట్ లో మూడు రోజుల్లో మా వాళ్ళందరికీ నేర్పించి నిరూపించాడు.., ఆ ముక్కుపచ్చలారని మునికుమారులను ధీరులుగా తీర్చిదిద్దాడు అని చెప్పటానికే వాచ్చాం”, అని అందరు కృతఙ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు..
ఇక్కడ ప్రశాంతంగా ఆడుకునే వాళ్ళను కూడా వీడి టాబ్లెట్ స్కిల్ల్స్ తో చెడగొడుతున్నాడు.. వీడిని వెంటనే మన వూరు తీసుకుపోకపోతేగాని లాభంలేదు, ఇక్కడ సర్వ నాశనం చేసేలా ఉన్నాడు అని.. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఫోన్ తీసుకుని..
 మళ్ళి మూట-ముళ్ళు సర్దటానికని  పేకర్స్ & మూవర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ డయల్ చేసింది.

14, ఏప్రిల్ 2013, ఆదివారం

కాలక్షేపం


గూగుల్ లో ఎదో వెతుకుతుంటే.. ఓక లింకు ప్రత్యక్షమై  నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.. ఒక్క సారిగా అనువాద టీవీ సీరియల్ లో షాకింగ్ సన్నివేశం  లాగ మొహం బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోయింది.. ఇంతకూ ఆ లింక్ ఏమిటి అంటే.. నా పడమటి గోదావరి బ్లాగ్ లింక్.. మర్చిపోయి ఒక సంవత్సరం పైనే అవుతుంది.. మళ్ళి పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ పురాతన వస్తువు లాగ.. నా గూగుల్ వెతుకులాటలో బయటపడి నన్ను భయ భ్రాంతుడిని చేసింది..

అయ్యో ఇదెలా మర్చిపోయాను ఇన్నాళ్ళు.. అని  గ్లిసరిన్ వాడకుండా కన్నీళ్ళు తెచుకున్న టీవీ నటిలాగా.. బోరుబోరున కన్నీళ్ళు కార్చాను.. ఆ కన్నీటి వరదలో నా కీ బోర్డు కొట్టుకుపోసాగింది.. ఇది కొట్టుకుపోతే అసలు రాయలేనే.. అని కన్నీళ్ళకు అడ్డుకట్ట వేసాను.

ఫుడ్డు..  బెడ్డు.. లేకుండా..  మూడు నెలలు జైలు శిక్ష అనుభవించిన ఖైది లాగ.. వారంతం.. ఏకాంతం.. లేకుండా..  అజ్ఞాతవాసం లో ఉన్న ఫేస్బుక్ యూసర్ లాగ.. చంద్రయాన్ యాత్రలో.. కాళ్ళ నొప్పులు కొని తెచుకున్న చంద్రబాబులాగా.. ప్రతి క్షణం ప్రపంచ వీక్షణం అన్నట్లు కంప్యూటర్ ముందు కునుకుపాట్లు పడుతూ పనిచేసి చేసి.. ఆఖరుకి కాస్త విరామం తీసుకుని.. ఏం చేద్దాం అని గూగుల్ లో హౌ టు అని కొట్టబోతే.. "హౌ టు కిస్ " అని చూపించింది..

చీ.. నా జీవితం.. ఇది ఎలా చెయ్యాలో కూడా గూగుల్ లోనే నేర్చుకోవాలా అని ఆలోచిస్తుండగా.. ఇంతకూ హౌ టు అని తరువాత నేను ఏమి  వెతకాలనుకున్నానో అసలు విషయం మర్చిపోయానని తెలిసింది.., నాకు "కిస్సాశ" చూపించి.. నా మైండ్ బ్లాక్ చేస్తావా అని..  గూగుల్ పై కోపంతో.. కీ బోర్డు పై మద్దెల దరువు వేసి.. ఏదేదో పిచ్చి పిచ్చిగా తెలుగులో బూతులు టైపు చేస్తే..  నా బ్లాగ్  లింక్ ప్రత్యక్షం అయ్యింది..

సరేలే గూగుల్ మంచి పని చేసింది.. నా బాధ్యత ని గుర్తుచేసింది.. అని క్షమించేసి.. ఇది రాయటం మొదలుపెట్టాను..
సగం వరకు రాసాను కాని.. ఇంకా మేటర్ లేదు..

విషయాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయ్.. కాని అవన్నీ విని విని చెవులు రోత పెడుతున్నాయి.. ఏదన్నా సరదాగా మాట్లాడుకుందాం అనుకుంటే ఏదొక రోత అందులోకి దూరి మరీ వస్తుంది..
సరే ఏమి తట్టనప్పుడు ఎవోటి మాట్లాడుకోవాలి కదా మరి.. !

కరెంట్ పొదుపుగా వాడుకోవాలి.. - సీ.యం
కిటికీ తలుపులు తీసుకుని.. తడిగుడ్డ వేసుకుని.. పడుకుంటే.. గాలి చక్కగా వేస్తుంది.., చల్లగా ఉంటుంది.. కరెంటు తో పనిలేదు.. - నేను

చేవేళ్ల చెల్లెమ్మ అమాయకురాలు.. - కొందరు నాయకులు..
ఆ అమాయకత్వం చేతుల్లోనే.. ఇన్నాళ్ళు రాష్ట్ర భద్రతను పెట్టిన ప్రజలే అమాయకులు - నేను.

ఇదే అసలు సిసలు ఐ.పి.యల్.. చాలా ఎంటర్టైన్మెంట్ .. అద్భుతః.. - ఒక ఫేస్బుక్ మిత్రుడు.
డబ్బులు ఖర్చుపెట్టి ఆటలు ఆడిస్తే.. అవును మరి.. అద్భుతః నే ,అది సినిమాలాగా ఎంటర్టైన్మెంట్  కాదా! - నేను

.. ఇవన్నీ రోత అన్నది అందుకే.. సరదా మాటల్లో కూడా ఈ రోత తప్పటం లేదు.
సరే టాపిక్ మార్చెయ్యాలి..

సమ్మర్ స్పెషల్ సినిమాలు దూసుకొస్తున్నాయి..
బాద్ షా సూపర్ హిట్ అంట కదా!.. - అవును సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ఉండటం వల్లే..
అయినా శ్రీను వైట్ల సినిమా అంటేనే కామెడీ.. అందరికి తెలిసిందే కదా! - అవును.. గత కొన్నేళ్ళుగా అదే కామెడీ.. తిరిగేసి మరగేసి.. రంగు పూసి..

రామ్ చరణ్ తేజ్ సినిమా వస్తుంది చూడు.., కేక..! - ఆ సంబరం కూడా చూసేద్దాం..
ఏంటో ఈ జనరేషన్ లో పోలీస్ క్యారెక్టర్ కి ఎవరూ నప్పి నట్లు నాకు అనిపించటం లేదు..

అటు జూనియర్.. ఇటు రామ్ చరణ్.. మరి.. నాగ చైతన్య..?
కనీసం విలన్లని నాసిగా ఉన్న వాళ్ళను తీసుకుంటే.. పిడికిలి బిగించి కొడితే.. ఆమడ దూరం ఎగిరిపడ్డాడు అంటే.. నమ్మేట్లు అయినా  అనిపిస్తుంది..
ఏ మాటకు ఆ మాటే. ప్రిన్సు సూపర్.. పోలీస్ డ్రెస్ వేస్తే తిరుగులేదు..

నిన్నో మొన్నో.. టి.వి.లో వస్తే.. రెబెల్ సినిమా చూసాను.. ఆహ.. ఏమి సినిమా.. ఆస్కారుకు ఆస్కారం లేదా.. అద్భుతః.. వెంటనే లారెన్స్ కి ఫోన్ కొట్టి.. అన్నయ్యా.. గాడిద చేసే పని.. గుర్రం.. అని ఎదో సామెత ఉంది కదా!.. అది చెప్పాలని అనిపించింది.. ఏంటో ఈ సినిమాలు..

ఏదేమనుకున్న.. ఎవరేమనుకున్నా.. మా నాగ్.. కి తిరుగులేదు.. ఎప్పటికి గ్రీకు వీరుడే .
చిన్న సినిమాలు బాగుంటున్నాయి అనుకుందామా!.., ఎన్ని వస్తున్నాయో ఎన్ని వెళ్తున్నాయో అర్ధం కావటం లేదు..

మళ్ళి తేజ లాంటి దర్శకులు తెరపైకి వచ్చి.. సగం పండిన లవ్వు స్టోరీలు.. తెరపైకే తెచ్చి..  సినిమాలు తియ్యాలని నేను కోరుకుంటున్నా.

ఎదో సరదాకి లెండి.. ఏ టాపిక్ తీసుకున్నా ఇలానే ఉన్నట్లుంది..

అవును అన్నట్టు.. చెప్పటం మర్చేపోయా..
అందరికి శ్రీ  విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. అందరికి అన్నిటిలో విజయాలు చేకూరాలని కోరుకుంటూ... :-)

Related Posts Plugin for WordPress, Blogger...