16, జూన్ 2011, గురువారం

మళ్ళీ ఆడపిల్లే పుట్టింది..!!!


"ఒరే.. ఎంకట్రావో.. మీ ఆవిడకి నొప్పులొత్తన్నాయంటరా.., మీ అమ్మాఆల్లోఆటోలో తీసుకెల్తున్నారో.. నిన్ను వున్నపలంగా పక్కూరు పెద్దాస్పట్టలకి రమ్మన్నారో.. ", అని తాటిసెత్తులో అరపకట్టుకుని బయటేపుగోడకి ప్లాస్టింగు సేత్తున్న ఎంకట్రావుకి తోట్లో బుల్లబ్బులు సైకిలుమీద గడ్డికోత్తానికెళతా కేకేసి ఇషయం సెప్పేడు.
ఆ కేకిన్న ఎంకట్రావు.. తాపీ గమేళాలోకిసిరేసి.. నాలుగడుగుల్లో కర్రలెంబడి కిందికి దిగిపోయి.. సైకిలేసుకుని ఇంటికి బయర్దేరేడు. ఓ పర్లాంగు దూరంఎల్లాకా.. కిళ్ళీకొట్టు రాంబాబుగాడు సైకిలుకు పెద్ద ఐసుగెడ్డ కట్టుకొని ఎదురొత్తా అదే ఇషయం సెప్పేడు... మళ్ళా కొంతదూరం ఎల్లాకా సంతకి గేదెల్ని తోలుకెళ్తున్న సూరయ్యతాతగూడా అదే ఇషయం సెప్పి కంగారెట్టేసేడు.. అలా దారెంబడి.. అదే ఇషయం కనబడ్డోళ్ళంతా సెబుతున్నకొద్దీ ఎంకట్రావు యమా టెన్సన్ తో సైకిలు స్పీడుపెంచేత్తా తొక్కేత్తున్నాడు.. సెమటలట్టేసి మొకంనిండా కారిపోతున్నా పట్టించుకోకుండా.. ఏదో ఆలోచన్లో తొక్కేతూనేవున్నాడు.. అలా కంగారకంగార్గా ఇంటికి సేరుకున్న ఎంకట్రావు.. సైకిలు స్టాండెయ్యకుండా వంటవసారా పాకకి ఆనించేసి.. గెడేసున్న ఇంటితలుపు.. సప్పుడు కాకండా.. నెమ్మదిగా తీసి దొంగోడు దూరినట్టు ఇంట్లోకి దూరాడు... ఆళ్ళావిడ పడుకుంటున్న మంచంమీదున్న బొంతకింద సెయ్యెట్టి.. కుంకంలో ముంచిన నిమ్మకాయలు, తాయత్తూ తీసి జేబులో కుక్కుకున్నాడు.. గుట్టుసప్పుడు కాకండా.. సైకిలు తీసుకుని.. పక్కూరు బయల్దేరేడు..
                                    *** *** *** *** *** ***
ఎంకట్రావు ఆ ఊళ్ళో పెద్ద తాపీమేత్రి... అప్పటి కాలంలో సబ్సిడీ ఇల్లు కాన్నుండి..  మొన్నటి గవర్నమెంటోరి హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ సగ్రుహ వరకూ..  ఊళ్ళో అందరి డాబాలు కాంట్రాట్టుకు తీసుకుని కట్టించిచ్చినోడే.., ఆళ్ళూళ్ళో ఆంజనేయసాములోరి గుడికాన్నుంచి.. పంచాయితీ డ్రైనేజిలు..., వూరినడిమద్దెనున్న రాయిసెట్టుకింద నూతిపల్లెం, దూడల్రేవులో మెట్లు.. ఇలా ఒకటేంటి, ఆ వూళ్ళో  సిమ్మెంటుతో కట్టిన ఏ సిన్న దిమ్మైనా.. ఎంకట్రావు సేయిపడకుండా పనికాలేదు.. ఎవరిదగ్గర తగ్గట్టుగా ఆళ్ళకి పనులుసేసిపెడతా, ఎవరితోనూ గొడవపడకండా.. అందరితల్లోనాలికలా ఉంటావుండే మంచి మనిషి ఎంకట్రావు.

ఎంకట్రావు తండ్రి సిన్నప్పుడే చెనిపోటంతో కూలిపనిచేత్తా పెంచుకొచ్చింది ఆళ్ళమ్మ సెంద్ర. దగ్గరసుట్టరీకంలో అమ్మాయైతే చెప్పినట్టుపడుంటుందని.. పట్టుబట్టిమరీ సుబ్బలచ్చిమిని కోడలుగా తెచ్చుకుంది సెంద్ర. ఇంత ముద్దతింటా.. ఓపికున్నప్పుడు కూలిపనికెళతా.. ఎంకట్రావుతోబాటే వుంటుంటుంది సెంద్ర.. మనిషిమంచిదే అయినా.. ఏ ఇషయమైనా.. తన్జెప్పినట్టే నడవాలంటది. మహా మాటకారి.. గడ్డుమనిషి.తేడావత్తే ఎవర్నీలెక్కసేయకుండా నోరేసుకుని పడిపోతుంటది.. వూరి జనాలంతా  సెంద్రనోట్లోనోరెట్టానికి తెగ భయపడిపోతుంటారు.

ఎంకట్రావు, సుబ్బలచ్చిమికి రెండెళ్ళకితమే కవలాడపిల్లలుపుట్టేరు. ఆపరేషను సేయించేద్దాం అంటే ఇనకుండా... ఈ సారి వారసుడుడతాడు నీకేంతెల్దని ఎంకట్రావుమీద నిప్పులుసెరిగేసింది సెంద్ర. అమ్మ మాటకెదురుసెప్పలేని ఎంకట్రావు నోరుమూసేసుకున్నాడు. ఆడపిల్లలంటే పెళ్ళిళ్ళుజేసి.. పురుడ్లు పోసీ జీవితాంతం ఏదో సాకిరేవు సేత్తానేవుండాలని ఎంకట్రావు తెగ బాధపడిపోయేడు. ఈ సారికూడా ఆడపిల్లుడితే తనపరిస్తితేంటని బెంగెట్టేసుకున్నాడు. మంచి మంచి కాంట్రాట్టులొచ్చి సేతులో డబ్బులుకనబడినా.. పిల్లల్ని చూసినప్పుడల్లా ఆళ్ళ పెళ్ళే ఆలోచనలోకొత్తున్న ఎంకట్రావుకి మనశ్శాంతిలేకండా పోయింది. సుబ్బలచ్చిమికి నెలలునిండేకొద్దీ అదే ఆలోచనతో మతిలేనివాడైపోయేడు.

మతిలేని ఎంకట్రావు పక్కూరి మంత్రాల ఈరన్నకి డబ్బులిచ్చి పూజలుచేయింత్తున్నాడు. ఆడపిల్లుడితే పురుట్లోనే పోవాలని చేతబడులు చేత్తున్న ఈరన్న సెప్పినట్టుగా.. మంత్రించిన నిమ్మకాయలు వారానికోసారి అట్టుకొచ్చి సుబ్బలచ్చిమి పడుకునే బొంతకిందెడుతున్నాడు. సరిగ్గా పురుటినొప్పులొచ్చే టయానికి ఆ నిమ్మకాయలట్టుకొత్తే.. ఆటితో పూజలుజేసి పుట్టేది ఆడపిల్లయితే పురుట్లోనే చచ్చిపోయేలా చేత్తానని ఈరన్న చెప్పిన మాటలు ఎంకట్రావు నమ్మేడు. అలాగే చెప్పినిధంగా నిమ్మకాయలట్టుకెళ్ళి ఈరన్నకిచ్చేడు.

                                      *** *** *** *** *** ***
గవర్నమెంటు ఆసుపత్రిలో సుబ్బలచ్చిమిని జాయిను చేసింది సెంద్ర.. కొడుకొత్తాడని తెగెదురుచూసింది. తనక్కనబడ్డ వూరోళ్ళందరికీ కబురెట్టించింది. నొప్పులు తట్టుకోలేని సుబ్బలచ్చిమి సొమ్మసిల్లిపోయింది. అది చూసిన పెద్దడాట్రుగారు.. బిడ్డడ్డంతిరిగింది ఆపరేషను చెయ్యాలని చెప్పేరు. సెంద్రకి సెమటలట్టేసి కాళ్ళాడ్డంలేదు. "దీనిమొగుడింకారాలేదండే.. నాకేమో ఏంసేయాలో తెల్వటంల్లేదండే.. మీరే ఏదోటిచేసి కాపాడాలండే..", అని డాట్రగారు చేతులట్టుకుంది సెంద్ర.. కూడావొచ్చిన వూరోళ్ళంతా ఏంపర్లేదు సెంద్రా  అంతా మంచే జరుగుద్దని ధైర్యంసెప్పేరు.

 ఏం చెయ్యాలో తోచని సెంద్ర ఆ వూరి పెద్దకొండాలమ్మకి దణ్ణమెట్టుకుంది. అంతా సవ్యంగా జెరిగితే కోడ్నికోసి నైవేద్యమెట్టుకుంటాను తల్లీ అని కన్నీళ్ళెట్టుకుని ఏడుకుంది.
కాసేపటకి ఆపరేషను పూర్తిచేసి బయటకొచ్చిన డాట్రుగారు.. ఆడపిల్లపుట్టిందనీ.. తల్లిబిడ్డా క్షేమమని చెప్పేరు. "నువ్వెయ్యేళ్ళు బతుకు బాబా..", అని డాట్రుగారి కాళ్ళట్టుకుని దణ్ణాలెట్టింది సెంద్ర..

ఓవేపు మళ్ళా ఆడపిల్లేపుట్టిందని బాధగావున్నా మరోఏపు.. తల్లీబిడ్డా గండంనుండి బయటడి బతికిబట్టకట్టేరని ఆనందించింది సెంద్ర.

అంతా అయిపోయేకా ఆసుపత్రికొచ్చి ఇషయం తెలుసుకున్న ఎంకట్రావుకి నోటమాటరాలేదు. మొకంలో నెత్తుటిచుక్కలేదు. మళ్ళా ఆడపిల్లే ఎలాపుట్టిందా, మరిపుట్టినాడపిల్ల ఈరన్నచెప్పినట్టు చావలేదే అనే అలోచన్తో పిచ్చోడిలెక్కయ్యిపోయేడు ఎంకట్రావు.

పెళ్ళాం పిల్లల్తో ఇంట్లో ఎవరితోనూ మాటాడకుండా మసలటం మొదలెట్టేడు ఎంకట్రావు. ఈ పిల్లల్నాకొద్దని పెళ్ళాన్ని పుట్టింటికిపొమ్మని పట్టుపట్టేడు. అడ్డొచ్చిన సెంద్రపై సేయిచేసుకోబోయేడు.
వూర్లో బోర్డస్కూల్లో పనిచేసి రిటేరయిపోయిన ఎంకటరత్నం మాస్టారు దగ్గరకెళ్ళి ఇషయం చెప్పి..  "కాత్తమీరైనా బుద్దిచెప్పండి బాబుగారా", అని ఏడ్చింది సెంద్ర..

ఓ రోజు సైకిలుమీద పన్లోకెల్తున్నఎంకట్రావుని పిలిపించాడు ఎంకటరత్నం మాస్టారు. ఇంటరుగుమీద కూర్చోబెట్టి.. "ఒరే పిల్లలుట్టిన తరువాత ఇయ్యేంపనుల్రా..,నిన్నునమ్ముకొచ్చిన ఆ అమ్మాయి పరిస్థితేంటిరా..  ఉన్నదాంట్లో తింటా అందరూ కలిసుంటే.. పిల్లలు పెళ్ళిల్లొచ్చేటయానికి ఆ భగవంతుడే ఏదో దారిచూపిత్తాడ్రా", అని ఇవరంగా చెప్పేడు ఎంకటరత్నం మాస్టారు. ఎంకటరత్నం మాస్టారుమీదున్న గౌరవంతో ఏమీ మాట్లాడకుండా సెప్పిందంతా ఇన్నాడు ఎంకట్రావు.

సాయంత్రం పనంతా అయిపోయి ఇంటికొచ్చేఏల ఏటిగట్టుదగ్గర సైకిలాపి.. చెట్టుకింద కూర్చున్న ఎంకట్రావుకు ఎంకటరత్నం మాస్టారుచెప్పిన మాటల్లో ఒకేమాట బుర్రలో గిరగిర తిరిగింది.

"నేను రిటేరయిపోయాకా నా ఇద్దరు కొడుకులూ నాదగ్గర డబ్బెంతుందో చూసారుగానీ.. ఒక్కడైనా ఇక్కడికొచ్చి నేనెలగున్నానో చూసారా? రెక్కలొచ్చాయికదా! ఎవడిదారినవాడెగిరిపోయేర్రా.., నేనెక్కడ ఒంటరివాడినైపోతానో అని.. పెళ్ళేచేసుకోనని పట్టుబట్టింది మా అమ్మాయి, అదికాదని మనూరబ్బాయినే ఇచ్చి పెళ్ళిచేసానా.. ఇప్పుడు నాబాగోగులు చూసుకుంటూ రోజు నన్నుపలకరించిపోతుంది. పుట్టబోయే బిడ్డలు వాళ్ళకు కావాల్సిన సిరిసంపదలు కూడా వాళ్ళతోనే తీసుకొస్తారంటారురా.. నా అనుభవంతో చెబుతున్నాను ఆడపిల్లలేనిల్లు ఇల్లుకాదురా",

మేస్టారు కొడుకులు పట్నంపోయి పెద్దుజ్జోగాల్లో స్తిరపడిపోయినిషయం నిజమే. ఆళ్ళు తండ్రిదగ్గరకు రాకండా మొకాలుచాటేత్తున్నఇషయమూ నిజమే. ఆళ్ళకూతురు దగ్గరుండి చూసుకోటమూ నిజమే. ఇయన్నీ కళ్ళముందు కనిపిత్తున్న ఎంకట్రావుకి.. కొడుక్కంటే కూతురుకే పేమెక్కువంటాదేమో.. అనిపించింది. ఆరోజునుండి పిల్లల్ని పేమతో ముద్దులెట్టుకుని చంకనేసుకుని తిరక్కపోయినా..ఆళ్ళక్కావాల్సింది అట్టుకొచ్చి కలిసిమెలిసుంటా.. సంసారంనెట్టుకొత్తున్నాడు.

                                     *** *** *** *** *** ***
కాలగమనంలో.. ఎంకట్రావుమాస్టారు.. ఎంకట్రావు ఆళ్ళమ్మ సెంద్ర గాల్లోకలిసిపోయేరు. కాంట్రాట్టుల్లో బాగా సంపాయించిన ఎంకట్రావు.. ముగ్గురాడపిల్లలకీ పెళ్ళిళ్ళుచేయగలిగేడు సొంతిల్లుకట్టకోగలిగేడు.

ఓ సంక్రాంతి పండక్కి పిల్లల్నెత్తుకొచ్చేరు ముగ్గురాడపిల్లలూ, కూతుళ్ళూ.. మనవలూ మనవరాళ్ళతో నిండిపోయి మా సందడిగా తయారయ్యిందా ఇల్లు. మనవరాళ్ళు పట్టుపరికిణీలేసుకుని ఇల్లంతా తిరుగుతుంటే.. ఆ ఇంటికి కొత్తమెరుపొచ్చినట్టయ్యింది.

అది చూసిన ఎంకట్రావు తాను ఆ రోజు చేసిన తప్పే తలుచుకుని కళ్ళెంబట నీళ్ళెట్టుకున్నాడు.

"పుట్టినబిడ్డలు ఆళ్ళక్కావాల్సిన సిరిసంపదలు ఆళ్ళతోబాటే తీసుకొస్తారు..." అన్న ఎంకటరత్నం మాస్టారి మాటే చెవుల్లో మారుమోగింది.. చచ్చి ఏ లోకానున్నాడో మాస్టారుగారు.. "మహానుభావుడు.." అని దణ్నమెట్టుకున్నాడు ఎంకట్రావు.

5, జూన్ 2011, ఆదివారం

వర్షం...


ఆకాశంలోనుండి చినుకులు చిటపటమంటూ నేలపై రాలటం ఒక అద్బుతం. ఎండవేడికి కొలిమిలా కాగికాగివున్న నేలపై ఆ చినుకులు రాలి.. అప్పుడు వచ్చే మట్టివాసన ఇంకా మహాద్బుతం. పొద్దున్నుండీ ఎండవేడికి తట్టుకోలేక చలిమర గదుల్లో దాక్కుని.. బయట టీ తాగుదామని ఆఫీసునుండి బయటపడ్డ మాకు వర్షం దర్శనమిచ్చి మంచి ఊరటకలిగించింది.

ఒక్కసారిగా వర్షాన్ని చూసి బయటకొచ్చి చినుకుల్లో తడవాలనిపించలేదు.. ఆఫీసు బిల్డింగ్ కింద నిలబడి.. వెళదామా వద్దా అని ఆకాశంవైపు దొంగచూపులు చూస్తున్నప్పుడు.. మేఘంనుండి విడివడి.. గాలిలో జారుడు బల్లమీదజారినట్టు జారుకుంటూ.. నేలను తాకటానికి తహతహలాడుతూ.. వేగంగా దూసుకొస్తున్న ఓ చినుకు. అప్పటిదాకా వర్కుతో వేడెక్కిపోయివున్న నా బుర్రమీద టప్ అని పడి.. పెనంమీద పడిన నీటిబొట్టులాగా బుస్ అని శబ్దంచేస్తూ వేడికి ఆవిరైపోయింది. ఆవిరైపోయిన చినుకు.. నాబుర్రలోవేడిని ఆవిరిచేసేసింది. మెదడు చల్లబడింది.. తనువు జలదరించింది.. నరనరాల్లోకి చలి చేరి పులకరించింది.

ఆహా! ఆకాశంలోంచి నీళ్ళు.. చినుకులుగా రాలటమేమిటి. రాలిన చినుకులు మనల్ని తాకటమేమిటి.. మనసును తనువును చల్లబరచడమేమిటి.. ఇది నిజంగా అద్బుతమే.

కాసేపటికి ఏదోవంకతో మళ్ళీ వర్షంలో తడిచాను. వాతావరణం చల్లబడగానే నాలుకకు ఏదోకటి కారంకారంగా వేడివేడిగా తగిలితే కాస్తబాగున్ననిపించింది. ఆ ఊహ మనసులోకొచ్చేసరికి ఆత్మారాముడు ఆకలి కేకవేసాడు. మావూళ్ళో వర్షంవస్తే చెట్టుకింద తోపుడుబండిపై బజ్జీలేస్తున్న దుకాణం పక్కనే సైకిలు ఆపి. అప్పుడే వేడివేడిగా వేసిన మిరపకాయబజ్జీలు ఎప్పుడు వాయ దింపుతాడా.. పేపరుపైపెట్టిన విస్తరాకుమీద ఎప్పుడేస్తాడా.. పొగలుకక్కుతున్న వాటిని.. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఎప్పుడుతిందామా అని ఎదురుచూడటం గుర్తుకొచ్చింది.

కానీ ఇక్కడ మిరపకాయబజ్జీలు లేవే.. సరేలే అలావెళ్ళి వేడివేడి వడాపావ్ నే మిరపకాయబజ్జీ అనుకుని తినేద్దామని ఆ బండివైపు అడుగేసాను.. అక్కడున్న జాగాలో వేడివేడి పొగలుకక్కుతుంటే బజ్జీ గరమ్ గరమ్ గా వేస్తున్నాడేమో అనుకున్నాను. ఎండాకొండా వానాగీనా ఏదొచ్చినా ఆనందిస్తూ.. ఎప్పుడూ రడీమేడ్ గా జేబులో దొరికే సిగరెట్టుముక్కలెలిగించేసి.. పొగతో రింగులు సృష్టిస్తూ  మూసేసివున్న వడాపావ్ దుకాణంముందు కాల్చి కాల్చి.. చీల్చిచండాడేస్తున్నారు పొగరాయుళ్ళు.

అంతేలే!!, వానలో గెంతటం కప్పకానందం అయితే.. ఆ వానలో కాగితంపడవలేసి ఆడుకోవటం పిల్లలకానందం. మనకేమో వేడివేడిగా తినటం ఆనందం.  వీళ్ళకు కాల్చిబూడిదచేయటం ఆనందం. ఎవడానందం వాడిది.

ఏదొకటిలే వేడివేడిగా అని.. బాగాటోస్ట్ చేసిన సాండ్విచ్ తిని ఆనందించి.. ఆత్మారాముడ్ని సంతృప్తి పరచాల్సొచ్చింది.

చీకటిపడినా వదలలేదు వర్షం. సందెకాడొచ్చిన చుట్టం.. వర్షం త్వరగా వెళ్ళరని సామెత. అవును మరి సాయంత్రం వచ్చిన చుట్టం ఎలావెళతాడు పాపం. ఇంత రాత్రివేళేం వెళతారులేండి ఇక్కడేవుండండి అని మనమెప్పుడంటామా అని ఎదురుచూస్తుంటాడు. అలా మనం అనగానే మొహమాటపడి.. భోజనానికి కాళ్ళుకడుక్కుంటాడు.

మరి చుట్టం సంగతి సరే సరి.. వర్షం సంగతో..!!, సాయంత్రం వచ్చే వర్షం ఎందుకు త్వరగా వెళ్ళదో నాకు తెలియదుగానీ.. నిజంగా!!, సాయంత్రం కురిసిన వర్షం కాస్త జోరుగానూ హుషారుగానే కురుస్తుంది, పగటివెలుగులో కనిపించడానికి సిగ్గుపడేమో?, రాత్రి చీకటిలో దోబుచులాడటానికేమో? ఏమో.. ఏమోమరి. ఎందుకో ఆ వర్షపుజోరు.

తొమ్మిదయ్యింది.. ఇంకా వర్షం. అసలే రెయిన్ కోట్ పెట్టుకోలేదు.. ఊహించని తొలకరి జల్లుకదా!. ఎలాగా అని ఆలోచించాను. ఏదోలా లాగించేద్దాం అనిపించింది.. బండి స్టార్ట్ చేసాను. చలిగావుంది. వణుకొస్తుంది. అయినా ఆగాలనిపించలేదు. ఆఁ.. తడిచేదాకా అంతేలే.. అనిపించింది. వర్షంలో ఒక్కసారి తడిస్తే చలీవుండదూ వణుకూవుండదు. జుమ్మని బండి లాగించి వర్షంలోకి వచ్చాను. నిట్టనిలువుగా పడుతున్న చినుకులు కాస్త నాకెదురొస్తున్నట్టుగా వంపుతిరిగాయి.

ముత్యాలు గాలిలో ఎగురుతున్నట్టున్నాయి. ఆ ఎగుతున్న ముత్యాలు నన్నుముద్దాడుతున్నట్టున్నాయి. చిన్న చిన్న నీటి ముద్దలు.. అవి పెడుతున్న చల్లచల్లనీటి ముద్దులు. అందమైన ముత్యాలు.. అవిచ్చే చల్లటి ముద్దులు. ఆహా!..మరళా అద్భుతం. మహాద్బుతం.

వర్షంలో నేను వెళుతున్నప్పుడు టప్ టప్ అని చినుకుచేసే శబ్దం. ఆగినప్పుడు చెవులు హోరెత్తించేలా.. హోరున శబ్దం. రోడ్డుపైన గుంటలో ఆ చినుకుపడి డుబుక్కున నీటిలోమునిగి అది చేసే సంగీతం. ఆ సంగీతానికి అనువుగా ఆ నీరు తరంగాలుగా కదిలి చేసే నాట్యం. ఆ సంగీతాన్ని వినటానికనినా బైక్ ఇంజను కాసేపు ఆపుచేసాను. నా ముందే ఇంకో బైకొచ్చి ఆగింది. ఆ బైకు వెనకాలవున్న డేంజర్ లైటు ఆ గుంటనీటిలో కుంకుమ జల్లింది. సిగ్నల్ ఇండికేటర్ అప్పుడప్పుడూ వెలుగుతూ పసుపురంగు జల్లుతుంది. సిగ్నల్ పడ్డాకా బైకులన్నీరోడ్డుపై కుంకుమ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వెనుకకు తిరిగి చూసుకున్నాను గానీ కనబడలేదు. నా బైకూ వెనుక కుంకుమ రాస్తున్నట్టేవుంది. భలేగున్నాయి ఈ రంగులు. రాత్రిలో వర్షంతీసుకొచ్చిన రంగులు. ఇదో అద్భుతం.

అన్నీ రెండుగా.. కనిపిస్తున్నాయి. పైనున్నవీదిలైటు రోడ్డుమీదకూడా వెలుగుతుంది. ఎదురుగావస్తున్న కారుకున్న లైటు.. రోడ్డుపై ఇంకో లైటు. రెండూ మీదకి దూసుకొస్తున్నాయి. రోడ్డు అద్దంలా మెరుస్తుంది.  చెత్తాచెదారం అన్నీ మెరుస్తున్నాయి.. మురికినీళ్ళుకూడా తళతళమెరుస్తున్నాయి. ఎటుచూసినా అద్దమే. అంతా అద్దమే. అద్దంమీద బండినడుపుతుంటే జారుతుందేమో అనిపిస్తుంది. పగిలిపోతుందేమోనని అప్పుడప్పుడూ ఆగిపోతున్నాను. కానీ అన్నిబైకులూ దూసుకుపోతున్నాయి. అదిచూసి నేనూమళ్ళీ ముందుకుసాగుతున్నాను.

అద్దంపై చినుకులు.. మసకబారిన అద్దంపై చినుకులు.. ఎటుచూసినా చినుకులు. టైమెంతయ్యిందో చూద్దామంటే నా వాచ్ అద్దంపైనా చినుకులు. ఆ చినుకులతో మసకబారింది.. తుడిచి టైముచూడాలనికూడా అనిపించటంలేదు. ఎంతసేపైనా ఇలానే తడవాలనిపిస్తుంది.

Related Posts Plugin for WordPress, Blogger...