29, డిసెంబర్ 2011, గురువారం

నా పాస్-పోర్ట్ చచ్చింది..



నా పాస్పోర్ట్ చచ్చింది.. 
అవును.. నిజంగానే నా పాస్ పోర్ట్ చచ్చింది. ఇంగ్లీష్ లో ఎక్ష్పైర్డ్ అనేపదాన్ని తెలుగులో తర్జుమా చేసినా అదే అర్ధం వచ్చి చచ్చింది. ఎప్పుడో భూమి పుట్టకముందు పాస్పోర్టుంటే పడుంటుంది కదా అని ఒక ఆలోచనొచ్చి.. నా ఎమ్మెస్సీ సీటుకోసం కౌన్సలింగ్ పనిలో విశాఖపట్టణం వెళ్ళినప్పుడు పాస్పోర్టాఫీసుకు వెళ్ళి ఒక దరఖాస్తు పడేసుకున్నాను. ఎవరూ చూడలేదు కదా అని సైలెంటుగా అటుఇటూ చూస్తూ వచ్చేస్తుంటే.. ఆ పడేసుకున్న దరఖాస్తు ఎవడికో కనబడి నన్ను పిలిచి.. "బాబూ.. దరఖాస్తు పడేయటం అంటే ఇక్కడిలా ఆఫీసు బయట పారేయడంకాదు.. లోపలికెళ్ళి ఇవ్వాలని చెబితే తెలివొచ్చి.. తెలిసొచ్చి.. ఆఫీసులోపలకెళ్ళి చూస్తే.. ఎవరూలేకపోయినా లైట్లు వెలిగిపోతూ.. ప్యాన్లు తిరుగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సరేలే ఎవడొకడొస్తాడు... అని ఆఫీసులో అలా కుర్చీలో నడుంవాల్చేసరికి ప్రాంత ప్రభావమో.. లేక అయస్కాంత ప్రభావమో.. తెలియదు కునుకు పట్టేసింది. ఒక అరగంటకి లేచి చూస్తే ఇంకా ఎవరూరాలేదు.. ఎటు వెదికినా అదేదో రామ్ గోపాల్ వర్మసినిమాలోలా ఖాలీ గదులు.. కిర్రు కిర్రు తలుపులు.. భయంకరంగా భయపెడుతున్నాయి. ఆఖరికి కాసేపు అటుఇటూ తిరిగి ఎవడూ రాడని నిర్ణయించుకుని.. అక్కడే బల్లపై దరఖాస్తు.. దానికి సరిపడా డబ్బులు పడేసొచ్చాను.


 కొంత కాలం గడిచింది.. నెత్తిమీదబలమైన దెబ్బతగిలిన తెలుగు టీ.వీ సీరియల్ లో క్యారెక్టర్ లాగా ఎప్పుడు ఏ దరఖాస్తు ఎక్కడ పడేసానో మర్చిపోయాకా.. మా వూరికే బి.బి.సి గా చెప్పుకునే ఒకాయన కబురట్టుకొచ్చాడు. మీ ఊర్లో ఫలానా వాళ్ళబ్బాయిని నన్నొచ్చి కలవమను అని పక్కూరి పోలీస్టేషనులో వుండే కానిస్టేబుల్ చెప్పిన కబురంట.. చెప్పింది చెప్పినట్టు కాకుండా ఆ కబురుకు నాలుగు రకాల అత్తర్లు పూసి మా వూరంతా ఊదేసాడు. పోలీసోడు పిలిచాడా!.. అని వూరు వూరంతా నివ్వెరబోయి ఒక్క నిముషం ఆగిపోయింది. అదే విషయం ఎక్కడపడితే అక్కడ గూమిగూడి చెప్పేసుకుంటున్నారు. అలా గాలివార్తలా ఎగిరొచ్చిన వార్తవిని నేనూ కాసేపు నివ్వెరబోయాను.. తేరుకుని కాస్త బయటపడి ఇంటికి బయలుదేరి ఒంటరిగా గదిలోకి వెళ్ళి పోలీసు పిలిచింది ఎందుకా అని.. నటన వారసత్వంగా వచ్చిన హీరోలాగా  ఒక పది టేకులు తీసుకుని అలోచించాను. నాలుగు లాంగ్ షాట్లతో.. మూడు జూమ్ షాట్లలో నా మొహం అద్దంలో చూసుకుంటూ ట్యూబులైటు స్విచ్చ్ అన్ - స్విచ్చ్ ఆఫ్ చెయ్యగా.. ఎప్పటికో గానీ వెలగలేదు.. ట్యూబులైటు కాదు.. నా వెధవ బుర్ర.. అప్పుడెప్పుడో దరఖాస్తు పడేసుకున్న పాస్పోర్టుకైయ్యుంటుంది.. లేకపోతే మనమేం మారణహోమాలు.. మానభంగాలు చేసామని పోలీసోల్లు పిలుస్తారులే అని పోలీసాయన్ని కలుద్దామని వెళ్ళాను. 


ఆయన తీరిగ్గా ఆఫీసులో కూర్చుని.. అప్పుడే టాయ్ లెట్ రూమ్ తుడిచిన.. ఫ్రెష్ కొబ్బరిచీపురు నుండి ఒక పుల్ల విరుచుకుని పళ్ళుకుట్టుకుంటూ తన్మయత్వం పొందుతున్నాడు. ఒక పావుగంటకి తేరుకుని.. ఎదురుగా నిలబడ్డ నన్ను చూసి పేరేంటి అని అడిగాడు. "పాస్పోర్టండి", అని చెప్పగానే.. ఏంట నీపేరే పాస్పోర్టా.. మరి నీకెందుకింక పాస్పోర్టు అన్నాడు వెటకారంగా.. అదికాదండి.. అని నా పేరు చెప్పాను. వచ్చావా.. బాగానేవుంది. నీకు పాస్పోర్టెందుకూ అని అడిగాడు. అదిఅదీ.. విమానం ఎక్కడానికండీ.. అన్నాను కంగార్లో. ఏంటి విమానమే.., పాస్పోర్ట్ లేకపోతే ఎక్కనివ్వరా? సరేలే.. పాస్పోర్టు వెరిఫికేషనంటే చాలా తతంగం వుంది. పక్కనేవున్న పాత చెక్కబీరువాలో బూజుపట్టేసి సగం చెదలు తినేసిన ఫైల్సన్నీ చూపిస్తూ.. ఈ కేసులన్నీ తిరగెయ్యాలి, అన్ని పోలీస్టేషన్లలో నీ పేరుమీద కేసులున్నాయోమో చూడాలి.. అక్కడున్న నోటీసుబోర్టుల్లో మెల్లో ఒక నల్లపలక వేసుకునున్న ఫొటోలతో.. నీ ఫొటో పోల్చిచూసి కనుక్కోవాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తతంగం వుందయ్యా. పోలీసోళ్ళకేపనీ వుండదని అనుకుంటారు జనాలంతా.. ఇవన్నీ చేసి రాత్రికి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాం.. మా బతుకులు ఎవడికీ అర్ధం కావు.. అని తింగరి చూపులు చూస్తున్న నా వంక తింగరన్నర చూపులు చూసాడు పోలీసు. నీ ఎంక్వైరీ నేను చాలా త్వరగా పంపించేస్తాను.. పాస్పోర్టు త్వరగా వచ్చే బాధ్యతకూడానాదే..  కానీ మరి ఖర్చవ్వుద్ది.. ఎంతోకొంత ఇచ్చుకుంటే.. అని చేతులు నలుపుకోటం మొదలెట్టాడు. సర్వీసులో ఎన్ని సార్లు నలిపాడో తెలియదు.. నలిపి నలిపి ఆ చేతులు సన్నగా అయిపోయాయి. ఆ నలిగిపోతున్న సన్న చేతులు చూస్తే..  ఆ పోలీసు ఉద్యోగంలో నలిగిపోతున్న జీవితాన్ని ఊహించుకుంటే.. కన్నీళ్ళొచ్చేసాయి.. సార్!.. ఇక నలపకండి... ఆపండి.. ఆపండి..ఆ..పం..డి. అని ఎకో సౌండు ఎఫెక్టుతో అరిచి. "నలిగిపోతున్న మీ పోలీసు జీవితాన్ని నేనింక చూడలేనండీ..", అని భారీ డైలాగొకటి చెప్పి ఇదిగో వంద.. అని నవ్వుతున్న గాంధీగారిని ఏడుపుకళ్ళతో చూస్తూ వందనోటు చదివించుకున్నాను. 


పాతసినిమాల్లో క్యారెక్టర్ నటి చీరకొంగుతో నోరునొక్కుకుని ఏడ్చివెళ్ళిపోయినట్టుగా చేత్తో నోరునొక్కుకుని వెళ్ళి సైకిలెక్కాను. మళ్ళీ చాలా రోజులు గడిచాకా.. హైద్రాబాద్ సిటీ బస్సులో పొద్దున్న పదింటికి ఆఫీసుకని బయలుదేరిన అమ్మాయి.. దిగే ఎక్కే మగాళ్ళ చేతుల్లో నలిగినట్టుగా.. సర్కారీ తపాలా బంట్రోతు చేతుల్లో నలిగి నలిగి దళసరి..ఖాఖీ రంగు కవరు చుట్టుకుని.. పోస్టులో నా పాస్పోర్టు ఇంటికొచ్చింది. "ఏండే.. అబ్బాయిగారికి పాస్పోర్టొచ్చేసింది.. ఇంక విదేశాలకెళ్ళటమే ఆలస్యం.. మరి పాస్పోర్టొచ్చిన సంతోషంలో నాకేమన్నా..", అని నెత్తిమీద చెయ్యివేసుకుని బుర్రగోక్కుని ఉన్న నాలుగెంట్రుకలూ రాల్చేయబోయాడు తపాలా బంట్రోతు. ఆగు నాయనా ఆగు.. ఇప్పుడే గుమ్మాలు తుడుచుకన్నాం నువ్వు ఆ నాలుగూ రాల్చి ఛండాలం చెయ్యకు అని గోక్కునే వేళ్ళమధ్య ఒక ఇరవై రూపాయలు పెట్టి.. గోకుడు ఆపించి.. పంపించాల్సొచ్చింది.  సరే మనకు ఇప్పట్లో పనున్నా లేకపోయినా.. పాస్పోర్టంటూ ఒకటుంది కదా అని.. అలాగే భద్రంగా ఇనబ్బీరువాలో పెట్టి.. చెదలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుని.. అప్పుడప్పుడూ తీసి కళ్ళకద్దుకుని.. పదేళ్ళయినా ఒక్క పేజీ కూడా నలక్కుండా.. ఒక్క పెన్నుగీతకూడా పడకుండా.. కొత్త వాసన పోకుండా.. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న పాస్పోర్టుకు ఏం రోగం వచ్చిందో మరి చచ్చింది. ఎవడన్నా అడిగితే.. గర్వంగా నాకూ ఉంది పాస్పోర్ట్ అని చెప్పుకోటానికి తప్ప ఏ పనికీ పనికి రాకుండా.. ఏ మార్పూ లేకుండా. ఇన్నాళ్ళూ బీరువాలో.. అదే నలిగిపోయిన ఖాఖీ రంగు కవరులోనే చుట్టబెట్టుకుని నాజుకుగా కనిపించే నా పాస్పోర్టుకు ఏమయ్యిందో తెలియదు.. మరి చచ్చి చచ్చింది.


నాకు ఇక్కడో అనుమానం వచ్చింది.. అప్పటి చీపురు పుళ్ళ పోలీసు.. ఏ వెధవ ముహూర్తంలోనో.. తన ఎడంచేత్తోనో ఛీడ సంతకం పెట్టుంటాడు.. లేక ఆ పాస్పోర్ట్ ఆఫీసోడు.. చూపుడు వేలుకు తొడుక్కోవాళ్సిన రాయి ఉంగరం.. ఏ ఎడంకాలి పిల్లవేలుకో తొడుక్కునుంటాడు.. వాళ్ళందరి చీఢ నాకు పట్టుంటుంది. లేకపోతే.. నేను పనిచేసిన కంపెనీల్లో మన పక్కనున్నోళ్ళూ.. పక్క ప్రాజెక్టోళ్ళూ.. నేనీ ప్రాజెక్టులో చెయ్యను అని ఇచ్చేస్తే నా దగ్గరనుండి నేర్చుకున్నోళ్ళు. అలాగే ఆఫీస్ బాయ్.. టీ బాయ్ తో సహా అందరికీ విదేశం ఆఫర్లొచ్చినా మనకు కంపెనీ తరపునుండి ఒక్కసారికూడా.. ఆఫర్ రాకపోగా.. కనీసం పాకిస్తాన్ ఆఫ్ఞనిస్తాన్ వెళ్ళే ఛాన్సుకూడారాలేదు. సొంత డబ్బుల్తో సింగపూర్.. మలేషియా.. లాంటి ట్రిప్పులూ వేసే చాన్సూ కలిసిరాలేదు. ఇలాక్కాదు. పాస్పోర్టు పై ఒక్క స్టాంపైనా పడాలి అని స్టాంపు ఒకటి తయారుచేయించి.. నేనే రెండు గుద్దులు గుద్దేద్దాం అని డిసైడైపోయి.. అదే అవిడియాతో ఇనబ్బీరువాలో వున్న పాస్పోర్టు తీసి చూసే సరికి.. బ్రేకింగ్ న్యూస్ లాగా పాస్పోర్టుకు కాలంచెల్లిందనే షాకింగ్ న్యూస్ బయటపడింది. లేకపోతే ఇంకొక పదేళ్ళకుగానీ పాస్పోర్ట్ చచ్చిందనే విషయం లోక్పాల్ బిల్లులాగా బయటపడేది కాదు.  అదన్న మాట అసలు విషయం.. 


సరే ఇప్పుడు చచ్చినదాన్ని ఇంట్లో ఏం పెట్టుకుంటాం.. మళ్ళీ అప్లై చెయ్యాలికదా.. మళ్ళీ అప్లైఅంటే  రిన్యూ చెయ్యటమే.. ఆఁ.. ఎంతసేపు మహా అయితే మొబయిల్ లో బ్యాలెన్స్ రీచార్జ్ చేసినంత టైంలో అయిపోవచ్చు.. అప్పుడంటే పదేళ్ళ క్రితం మాట.. ఈ మొబైల్సూ.. కంప్యూటర్లూ ఎరగం కదా.. ఇప్పుడంతా ఆన్లైనే అయ్యింటుంది అని గూగులమ్మతో నాకొచ్చిన సందేశాలు చెప్పిచూద్దునా.. దుమ్ముపట్టేసి.. బూజులు దులపని ఇల్లులాగా ఒక వెబ్బైట్ కనిపించింది. నా కంప్యూటర్ మానిటరేమన్నా సరిగ్గాలేదేమోనని క్లాత్ పెట్టి తుడుద్దునా.. అయినా అలాగే వుంది.. ఆ తరువాత తెలిసింది. ఆ రంగులే అంతని. చఛా!, ఇదైయ్యుండదు.. ఇండియాలో ఎంతమంది పాస్పోర్టులు తీసుకొనుంటారు.. పాస్పోర్టు తీసుకున్నవాడిదగ్గరనుండి.. వెబ్సైట్ ఫండుకింద కనీసం ఒక్కరూపాయి తీసుకున్నా హైక్లాసు వెబ్సైట్ చెయ్యొచ్చుకదా. అలా చేసేవుంటారు.. ఇది ఎవడో తలమాసినోడిదయ్యుంటుంది.. గవర్నమెంటు పేరు పెట్టుకున్నాడు.. అని ఆ పేజీ మూసేద్దామనుకునేలోగా పైనే కనబడింది.. బయట అక్రమసంబధాల మంత్రిత్వశాఖ అని. (Ministry of External Affairs), ఓరినీ..!!, నా అంచనాలన్నీ తారుమారయ్యాయే.. అయితే వీళ్ళు బయట సంభంధభాంధవ్యాలు.. పెత్తనాలూ తప్ప.. ఇంట్లో విత్తనాలు నాటుకోలేని వాళ్ళన్న విషయం ఎవరూ అనక్కర్లేదు.. ఆ వెబ్సైట్ చూస్తేనే తెలిసిపోతుంది. మళ్ళీ అందులో ఏ ఏరియాకు తగ్గట్టు ఆ వెబ్సైటు.. మళ్ళీ దేనికదే సెపరేటు డిజైను.. ఏంటో..!, సరేలే ఇందులో ఎన్ని కోట్లు స్వాహానో.. మనకెందుకొచ్చినగొడవ... మనకెవడన్నాఇస్తాడా చస్తాడా.. మనది నొక్కకుండా వుంటే అదే దస్ హజారూ..!, అనుకుని వూరుకున్నాను. 


అసలు వివరాల్లోకి వెళ్ళీ చూడగా తెలిసిందేంటంటే.. రిన్యూ అన్నా కొత్తది అప్లై చేసినా అన్నిటికీ గవర్నమెంటు ఉద్యోగుల "బాగు" దృష్టిలో పెట్టుకుని ఒకటే స్కీము పెట్టారని తేలిపోయింది. అంటే ఆఖరికి పోలీసు ఎంక్వైరీతో సహా.. అమ్యామ్యా మాములేనని తేటతెల్లమైపోయి.. నా మొహం సూపర్ రిన్ సోపుతో ఉతికినట్టు తెల్లగా అయిపోయింది. ఓరినాయనో.. అసలే తింటానికీ.. తిన్నది అరాయించకోటానికే టైములేక.. కిడ్నీల్లో ఇడ్లీ సైజంత రాళ్ళు పేర్చుకుని కోటలు కట్టుకుని రాజ్యాలేలుతూ.. తిన్న చెయ్యి కూడా కడుక్కోకుండా ఆఫీసులో కీబోర్గ్ మీద ఎంగిలి చేతుల్తో టిక్కూటిక్కూమని టైపుకొట్టుకుంటూ, క్షణం తీరికలేని మా సాఫ్వేర్ బతుకుల్లో ఇన్ని కష్టాలా??. ఇప్పుడు ఆ గవర్నమెంటు ఆఫీసుకెళ్ళి లైన్లలో నిలబడి.. వాడితోనూ వీడితోనూ ముష్టియుద్దం చేసి, ఎవడికో చేతులు ఖాలీగాలేవు కాస్త వీపుగోకిపెడతారా.. అంటే లేని గోళ్ళతో గోకిపెట్టి, వాడెవడికో పెన్నులేకపోతే పక్కోడి జేబులోంచి పెన్ననుకొని సిగరెట్ తీస్తే చెప్పుదెబ్బలుతిని.., వీడెవడో నిశానీ అయితే వాడి అప్లికేషనూ.. ఇంటి ఎడ్రసూ.. పోయిన వాడి బాబు ఎడ్రసూ.. వాడికి నచ్చిన వేటూరివారి పాటలూ వాళ్ళ బాబుకు నచ్చిన ఘంటశాలగారి పాటలన్నీ రాసిపెట్టి, ఇంకొకడెవడికో స్టాంపు అంటించడానికి కాస్త ఉమ్మితడి కావాలంటే అప్పిచ్చి, వేరేవాడు పాటపాడటానికెళ్తే.. వాడి ఫైల్సూ.. నిలబడ్డ ప్లేసు ఎవడూ అక్రమించకుండా కాపలాకాసి, ఇంకొకడెవడో సిగరెట్టు అంటిచడానికి అగ్గిపెట్టడిగితే.. లేదని చెప్పి, మనం సిగరెట్టు కాల్చకపోటం ఒక పెద్దలోపమే అని తెగబాధపడి పోయి, ఈ ఎధవ పనులన్నీ చేసేంత ఓపికలేదుగానీ.. చచ్చిన పాస్పోర్ట్ ని తాటిపాతరేసినట్టుగా పాతరేసేద్దాం అని నిర్ణయించుకున్నాను.


ఈ నిర్ణయాలన్నీ ఆఫీసులో కూర్చుని మానిటర్ ముందున్న సూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుండగా.. సరిగ్గా ఐదునిముషాల్లో మా సీ.టీ.వోతో మీటింగ్ అన్నారని.. కాస్ఫరెన్స్ కాల్ అయ్యింటుందిలే అని మీటింగ్ రూమ్లోకెళ్తున్న మాకు.. బాబూ అటు కాదు ఇటు.. ఆయన ఇక్కడేవున్నాడు ఈ రోజే అమెరికా నుండి దిగాడు అన్నారు.. "అదేంటి మొన్నటికిమొన్నేకదా వెళ్ళొస్తాను బైబై అన్నారోలేదో అప్పుడే ఎలా వచ్చారు..", అని అడిగితే ఆ రోజు పొద్దున్నే దిగాడని తేలింది. ఇదేమన్నా తణుకు-మార్టేరు షెటిల్ బస్సు సర్వీసా.. ఇంత సులువుగా వారానికోసారి అమెరికానుండి ఇండియాకి ఎలా వస్తున్నాడబ్బా.. ఈయనకి పాస్పోర్ట్ అక్కర్లేదంటావా?, అవును..!  ఇంతకీ ఈయన పాస్పోర్ట్ ఎలా రిన్వూ చేయించుంటాడు, మీటింగ్ అయిపోయాకా.. "ఎనీ క్వస్చన్స్",  అన్నప్పుడు అడిగేస్తే పోలా.. అన్న అద్భుతమైన ఆలోచనలల్తో నా బుర్రను రేజ్ చేసిన ఏక్సిలరేటర్ లాగా జుమ్ జుమ్ అనిపిస్తుండగా. మీటింగ్ అయిపోయిందన్నారు.. ఆ మీటింగ్ యొక్క సారం సారాశం.. ఏంటిరా అని పక్కోడినడిగితే... కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి.. మీ అందరికీ నా ధన్యవాదాలు.. ఇదే కృషి పట్టుదలతో మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను. అని చెప్పాడు. 
అయ్యబాబోయ్.. ఇంకేముంది.. కొత్తప్రాజెక్ట్..! స్టడీకోసం..!! ఆన్ సైట్!!! ఆఫరూ!!!!, మరి నేను..!! నా పాస్పోర్ట్ లేకుండా.., ఓరినాయనో!!!!!!. ఈ సారికూడా వచ్చిన ఛాన్స్ మిస్సయ్యి.. నాకు పాస్పోర్ట్ లేదని.. ఏ సెక్యూరిటీవాడినో నా బదులు పంపించేస్తే సాఫ్ట్వేర్ సన్యాసం చేసేసి.. అడవుల్లోకి పోయి.. ఆకులూ అలమలూ చుట్టుకుని కంద-మూలాల్ని పిజ్జా-బర్గర్స్ లా ఊహించుకుని.. ఒక ల్యాప్ టాపు చేత్తో పట్టుకుని.. రిలయన్స్ నెట్ కనెక్ట్ తో ఇంటర్నెట్టుకు కనెక్టయ్యి.. ఫేస్బుక్కులో వున్న ఆన్లైన్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ..  సిగ్నల్ సరిగాలేక సగం సగం సిగ్నల్ తో వెళ్ళిన నా సగం సగం మాటలు అర్ధంకాక.. నా ప్రెండు బండ బూతులు తిడుతుంటే.. యువర్ - అయ్యా అంబానీ.. "కర్ లియా మేరా దునియా.. జంగిల్ మే.." అని నా తలను ఆ పక్కనేవున్న కొండరాయికేసి కొట్టుకున్న సీన్ గుర్తుకొచ్చింది.


ఇప్పుడెలా!, ఎలాగైనా పాస్పోర్టును బతికించాలి.. బతికించాలి బతికించాలి అని ఆలోచిస్తుంటే.. పిడికిలి బిగుసుకోవటం మొదలుపెట్టింది.., అదేదో సినిమాలో నరాల నాగార్జునకి.. సారీ..  నాగార్జునకి నరాలు పొంగినట్టు పిడికిలి దగ్గర్నుండి పొంగుకొచ్చాయి.. అలాగే పిడికిలి బిగించి ఆలోచించగా.. ఆర్పీపట్నాయక్ తీసిన "బ్రోకర్" సినిమా గుర్తొచ్చింది.. ఇండియాలో ఈ "బ్రోకర్" అన్న మానవుడు లేకుండా మనకు పనులెక్కడవుతాయిలే.. ఒక బ్రోకర్ గాడిని పట్టుకోవాలి.. అని గూగులమ్మతో చెప్పి వెతికిపెట్టమన్నాను. బడా మార్ట్ లో వారంక్రితపు పుచ్చొంకాయలకి.. కాస్త చెంకీ కవరుతో ప్యాకింగ్ చేసి.. ఏసీలో పెట్టి  కొత్తలేబుల్ అంటించి.. మాంచి లుక్ వుండేలా చేస్తే.. "యా!, ఐనో.. ధీస్ ఆర్ పుచ్చ్ వంకాయ్స్.. బట్ యునో ధీస్ ఆర్ వెరీ హెల్దీ...", అని ఆ పుచ్చుల్లో  కాస్త చిన్నపుచ్చలున్నవి ఏరిమరీ కొనుక్కుంటూ.. లౌక్యం ప్రదర్శించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా.. ఇచ్చేది బ్రోకర్ కే.. కానీ..ఆ బ్రోకర్ గవర్నమెంటు ముద్రవేసిన బ్రోకర్ కావాలని(Authorized Agent), అదీ మనదగ్గర్లో వున్న వాడినొకడిని వెతికి పట్టుకోవాలని కాస్త లౌకిక-అలౌకిక లౌక్యం ప్రదర్శించి.. వివరాలు కనుక్కోగా వాడు ఒక రెండువందల ఏభై మామూలుగా మామూలు తీసుకుని పనికానిస్తానని భరోసాఇవ్వగా వెంటనే పత్రాలన్నీ మూటగట్టుకుని ఇవ్వటానికి బయలుదేరాను.


ఇక్కడే అసలు కష్టాలు పీతల్లా వెంట పడి కరిచాయి.. ఒక సంవత్సరంలో ఎన్నిచోట్ల ఉంటే అన్ని ఎడ్రస్ ప్రూఫ్ లు ఇవ్వాల్సుందని చెప్పాడు.. ఎడ్రసుప్రూఫులుగా ఏమేమి ఇవ్వొచ్చో ఒక పెద్ద లిస్టే ఇచ్చి ఇందులో ఏమన్నా ఒక నాలుగు అన్నాడు. ఏంటివి ఇందులో ఏమన్నా నాలుగా!, అంటే ఏంటి.. ఇదేమన్నా బిగ్ బి నిర్వహించే కౌన్ కిస్కా కరోర్ పత్నినా? అనడిగితే.. కాదుసార్.. ఈ కిందిచ్చిన లిస్టులో ఏవన్నా నాలుగు ఫ్రూపులు అన్నాడు. ఇక్కడొక థియరీ వుంది. ఎవరైనా కనిపెట్టారోలేదో తెలియదు కానీ.. మూడంటే మనదగ్గర రెండు.. నాలుగంటే మనదగ్గర మూడే ఏడుస్తాయి. ఖచ్చితంగా ఆలాగే.. నాదగ్గర మూడే ఏడ్చాయి. అందులోనూ ఒక సంవత్సరంలో నేను రెండుచోట్ల కొంపలు మార్చాను. ఆ పాత ఇంటికి కొత్తప్రూఫ్ లు కూడా కావాలి. సరే మీకు ఒక ఆఫ్సన్ వుంది ఆఫీసునుండి లెటరు.., బ్యాంకు స్టేట్మెంటు.. తీసుకురమ్మన్నాడు. అవి పాతింటి పేరుమీదవైతే మీకు వీజీ సార్ అన్నాడు. ఏం వీజీ.. కొంప కొల్లేరైపోతేనూ.. ఇవన్నీ ఎందుకురా బాబు ఇప్పుడుంటున్న ఇంటిది ఒక్క ఎడ్రస్ ప్రూఫు చాలదా అన్నాను. సార్ రూల్స్ సార్ అన్నాడు.. లేచి వచ్చేద్దామంటే. మా ఆఫీసు సెక్యూరిటీవాడు నా ప్లేసులో ఆన్ సైట్ ఆఫర్ కొట్టేసి.. ప్లైటెక్కుతుంటే మేమంతా సెండాఫ్ ఇస్తున్న సీన్ గుర్తొచ్చింది.. ఇక చేసేదిలేక కుర్చీలోంచి లేవలేక.. "సరే తెస్తాను ఇంకా.. ఏమన్నా కావాలంటే చెప్పు మాటిమాటికీ తిరగలేను" అన్నాను. "అయితే.. ఒక రెండుకేజీల బంగాళాదుంపలు.. ఒక కేజి ఉల్లిపాయలు.. ఒక పత్తాగోబీ  కొని వెళ్తు వెళ్తూ మా ఆవిడకిచ్చేసివెళ్ళండి అని అనబోతున్నట్టు ఫేసుపెట్టి.. ఇంకేమీ అక్కర్లేదు సార్.. ఇవి చాలు", అన్నాడు. ఎలాగైతే.. మొత్తానికి కావాల్సిన డాక్యుమెంట్ల కోసం రెండు మూడు నాలుగైదు ఆరురోజులు తిరిగి తిరిగి ఇవ్వగలిగాను. ఆ తరువాత.. అప్లికేషన్ ఫాం ఆన్లైన్లో పూర్తిచేసేసాడు.. ప్రింట్ తీసి ఇంకా ఏవో నాలుగైదు కాగితాలమీద సంతకాలు అన్నాడు.. అసలే ఆఫీసు టైమైపోతుంది త్వరగా కానియ్.. అంటే.. తరువాత వేలిముద్రలన్నాడు.. ఆ తరువాత కాలిముద్రలు వెయించుకున్నాడు. నాకు మండి... ఇంకా ఎన్ని ముద్రలేయిస్తావయ్యా.. ఇదిగో కావాలంటే.. నా.."...." వేసుకో అనబోతే.. సార్ తిట్టకండి సార్.. ఇవి రూల్సు సార్.. మరి ఏం చేస్తాం అన్నాడు. సరే.. నీకిష్టమొచ్చిన ముద్రలేస్తా.. ఎక్కడెయ్యమంటే అక్కడేస్తా.. ముద్ర నువ్వువెయ్యమన్నా సరే. నేను వేసినా సరే.. నీ ఆఫీసులోవేస్తా.. నీ ఇంటికొచ్చివేస్తా.. నువ్వు మొలతాడుకట్టుకోని మరాఠీవాడివే ఐతే కాసుకో.. అని డయలాగులు చెబుదామంటే వాడికి మన తెలుగర్ధంకాదు.. ఈ డయలాగులు.. లాగులు పైకి లాక్కుంటూ నాకు హిందీలో చెప్పటం రాదని ఆగిపోయి.. ఇంక నువ్వు అవి ఇవీ కావాలి అని అడక్కుండా అన్న టైముకి సబ్మిట్ అయిపొవాలి.. నువ్వేంచేస్తావో నాకు తెలియదు అన్నాను. అందులో తేడావుండదు సార్.. నేను చేస్తాను 'మీరే చూస్తారు' కదా అని భరోసా ఇచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికొచ్చాకా ఆలోచించాను.. "మీరే చూస్తారుకదా" అన్నది వెటకారంగా అనలేదు కదా అని.


మళ్ళీ మనమెక్కడున్నామంటే.. ఫలానా ఫలానా ఘట్టంలో గొట్టంలో ఇరుక్కుపోయిన యువరాజుగారిని చూసీ.. రూపాయిపావళా పెట్టి గొట్టాలు కొనుక్కుని ఐదువేళ్ళకూ పెట్టుకుని తింటూ వెళుతున్న రాణీగారు.. ఫక్కున నవ్వే... అని ఒక్కసారి చెప్పుకున్న కధ గుర్తుచేసుకున్నట్టుగా.. కొన్నాళ్ళుపోయినతరువాత లోకల్ పోలీస్టేషన్నుండి రేపొకసారి పదింటికి స్టేషనుకొచ్చి కలవమని ఫోనొచ్చింది. సరే!.. నేనెళ్ళడమేంటి.. అసలు పోలీసోడికీ నాకు సంబంధమేంటి.. ఆ బ్రోకర్ గాడే చూసుకుంటాడులే అని వాడికి ఫొనుకొడితే.. "సార్.. పోలీస్ ఎంక్వైరీ మీరే చూసుకోవాలి.. మేం అప్లికేషన్ సబ్మిట్ చెయ్యటంవరకే", అన్నాడు. 
అదేంటి?, ఆ పని బ్రోకర్ 'గాడిదే' అని మా ఫ్రెండొకడు చెప్పాడు అన్నాను. 
కాదు సార్.. ఈ విషయంలో 'ఎవడిది వాడిదే' అన్నాడు. 
సరేలే.. ఇంకేంచేస్తాం.. అని నోర్మూసుకుని తరువాతరోజు ఆఫీసుకు సెలవుపెట్టి పోలీస్టేషనుకు వెళ్ళాను. ఏంటి పోలీస్టేషనుకు వెళ్ళటానికే సెలవా అని అడిగారు కొంతమంది.. నీకు భలే సెలవు దొరుకుతుందిరా అన్నారు ఇంకొంతమంది.. మీరూ ఏదోటి అంటారు కదా.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చెబుతా.. మీరిప్పుడు ఎందుకు సెలవుపెట్టానో తెలుసుకోవాలంటే.. చిన్న బ్రేక్ తరువాత.. అని బ్రేకులు బ్రేకుడాన్సులూ అవసరంలేకుండానే చెబుతున్నాను వినండి. 


ఇవసలే.. గవర్నమెంటు పనులు.. అందులోనూ స్టేట్ గవర్నమెంటు పనులూ. కంప్యూటర్ భంద్ ఏం చెయ్యం అని.. ప్రెసిడెంట్ వచ్చి స్విచ్చాన్ చేస్తాడు అన్నట్టు దానిముందే కూర్చుంటాడొకడు. దీని పాస్వార్ట్ ఎవడి దగ్గరుందో తెలియదయ్యా.. సాయంత్రం రా.. అంటాడు ఇంకొకడు.. ఒకవేళ తప్పుచేసి సాయంత్రం వెళితే.. ఎవడైనా గవర్నమెంటు ఆఫీసులో సాయంత్రం వరకూ పనిచేస్తాడా.. నీకు పిచ్చికాకపోతే.. సాయంత్రం రమ్మనగానే ఊపుకుంటూవచ్చేసావ్.. అని నలుగురైదుగురికి మనల్ని చూపించి గేలిచేస్తాడు మరొకడు..  మరి ఇలాంటి పరిస్థితుల్లో.. అనుకున్న టైముకి పనులు అవ్వటం అసాధ్యమైన విషయాలే కదా మరి.. అందుకే సెలవు.
లైబ్రరీలో యోగాసనాలు అనే పుస్తకంలో.. ఆసనం వేయు విధానం అన్నది  కంగారుకంగారుగా చదివేసి ఆసనం వేసేసాకా.. ఆ ఆసనాన్ని ఎలా తియ్యాలో అని వున్న పేజీని.. ఎవడో కక్కుర్తి పడి చింపి పట్టుకుపోయాడని ఆసనం వేసేదాకా తెలుసుకోలేక. ఆ వేసిన ఆసనంలో ఇరుక్కుపోయి బయటపడలేనట్టుంటుంది సాఫ్వేర్ అనే చట్రంలో ఇరుక్కుపోయినోళ్ళ బ్రతుకు... సెలవు పెట్టకపోతే పోలీసోడితో ఒక తలనొప్పి.. సెలవుపెడితే ఆఫీసులో మన సీటుకొచ్చేస్తుంది నడుంనొప్పి.  ఆఫీసులో మనం చేసిన పనిలో వేళుపెట్టి ఆ వేలు ఎలా బయటకు తియ్యాలో తెలియక ఎవడో ఫోనుచేస్తుంటాడు. పనిచేస్తుంది చూడు. ఎందుకు చెయ్యదు.. నేను నిన్న ఇంచక్కా వేలుపెట్టి తియ్యలేదా.. అలాగే చెయ్యాలంతే.., ఇప్పుడు సడెన్ గా ఈ రోజే ఎందుకలా అవుతుంది.. లాంటి సంజాయిషీలతోనూ..  ఇలా సెలవుపెట్టినా సగం రోజు ఫోన్లలోనే సరిపోతుంది.. ఆ ఫోనువేడికి వాచిపోయిన చెవికి కాపడం పెట్టుకోటంలోనూ ఇంకో సగంరోజు సరిపోతుంది. మరి ఇలాంటి గవర్నమెంటు పనులు చెయ్యాలంటే చాలా తీరిక కావాలి.. కానీ ఈరోజుల్లో రిటైరైన వాళ్ళదగ్గరన్నుండి.. పెళ్ళాం ఉద్యోగం చేస్తే ఇంట్లో పిల్లల్ని ఆడిస్తూ.. చాక్లెట్ ఇవ్వలేదన్న కోపంతో ఆ పిల్లలు ఇల్లంతా కంపుచేస్తే.. అవన్నీ కడుక్కునే మగాళ్ళ దగ్గరవరకూ ఈ తీరికనేది నాదగ్గరలేదంటే నాదగ్గరా లేదు బాబూ..లేదూ అని చెప్పేవాళ్ళే.. మరి ఎవరిదగ్గరుందో ఈ 'తీరిక' చెప్పలేం. ఇన్ని గొడవలెందుకులే సెలవుపెడితే కాస్త పోలీసోడైనా సంతోషిస్తాడని మొత్తంమీద సెలవుపెట్టాల్సొచ్చిందన్నమాట.


ఏదో ఆలోచనలో పడి.. అలాగే ఆఫీసుకెళ్ళే బట్టల్తో పోలీస్టేషన్ కి వచ్చేసాను. టైము పదిగంటల పదినిముషాలయ్యింది. పాస్పోర్ట్ సెక్షన్ ఎక్కడో తెలియలేదు.. ఆ పక్కనే పూజకు పనికిరాని పువ్వుల్లా నీరసంగా బల్లలమీద వాలిపోయున్న  ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళను అడిగాను.. అందులో ఒకావిడ.. కాస్త ఓపికచేసుకుని కనురెప్పలను పైకెత్తి..  "క్యా.. క్యా.. అని కొట్టినట్టు నాలుగు సార్లు అడిగింది కానీ నేను పాస్పోర్ట్ అంటున్నానని అర్ధంకాలేదు. నేనునాలుకని రకరకాలుగా మడతలుపెట్టి అర్ధమయ్యేలా "పాస్పోర్ట్ వెరిఫికేషన్...", అంటుండగా..  యమదర్మరాజుకి దగ్గరగా కుర్చీవేసుకుని తలవంచుకుని రాసేసుకునే చిత్రగుప్తుడిలా ఆ రోజు వచ్చిన కలెక్షను తాలూకు పద్దులనుకుంట ఎంతో దీక్షతో రాసుకుంటున్న పోలీసొకడు.. "సీధా జావ్..", అని.. తలెత్తకుండానే చెప్పాడు. "ధ్యాంక్స్.", అని వెళ్ళిపోయాను.. అక్కడ అప్పటికే పదిమంది కుర్చీల్లో కుర్చున్నారు. లోపల పెద్దపులిలా  బట్టల్లేకుండా కుర్చుని ఉన్నాడు ఒక పోలీసు.. అంటే అదే..పోలీసు యూనీఫాం లేకుండా మామూలు డ్రస్సులోనే వున్నాడు. వాడెదురుగానే ఎవడో జింకలాగా ముడుచుకుని కూర్చున్నట్టున్నాడు.. సగం తలుపువేసివుండటంతో కాళ్ళుమాత్రమే కనిపిస్తున్నాయి.


టైము చూస్తే పది ఇరవై.. అసలే నన్ను పదింటికి రమ్మన్నాడు ఇప్పుడెలా.. వెళ్ళకపోతే ఒక తంటా.. వెళితే ఏమవ్వుద్దో. ఒక ఐదునిముషాలాగి ఆఁ.. ఏముందిలే ఏదొకటవ్వుద్ది ఇక తప్పదు అని తలుపునెట్టుకుని లోపలికెళ్ళిపోయాను.. పోలీసురైడింగులో పట్టుపడ్డ పెద్దాపురం పార్టీలాగా నివ్వెరపోయి నా వంక చూసాడు పులిరాజా.. ఆ తర్వాత ఏమైందంటే..


ఇంకా వుంది (వుందనుకుంటే.. వుంది.. అబ్బా ఇక చాలు అనుకుంటే.. గొడవేలేదు. :-) )

23, అక్టోబర్ 2011, ఆదివారం

ఆలోచనా తరంగాలు!


ఈ బుర్ర ఒక మైదానం. అందులోని ఆలోచనలు లేలేత చివురులు.. చిన్నచిన్న మొక్కలు.. మహా వృక్షాలు.. తియ్యని పళ్ళు.. చేదు ఆకులు.. ముళ్ళపొదలు. గడ్డిపరకలు.. కలుపుమొక్కలు.. మెలితిరిగిన వ్రేళ్ళు.

తులసిమొక్కలా.. గంజాయి చెట్లా? ఏం నాటుతావో.. ఎలా నాటుతావో.. ఆ నాటేవి నీడనివ్వాలి.. ఫలాలివ్వాలి.. ఏపుగా ఎదగాలి.. పచ్చగా పండాలి.. ఆకాశాన్నంటాలి.. చుక్కలను తాకాలి.. చందమామను దించి వెండిపూలు పుయ్యాలి.. విరగపూయాలి.. విరగపడి నవ్వాలి.. పండువెన్నెలనివ్వాలి. మదినిండిపోవాలి.. ఆనందం పొంగాలి. పసిపాప  మోముపై చిరునవ్వులవ్వాలి.. సెలయేటి నీటికి కొత్తవన్నెలు తేవాలి. కనువిందు చేయాలి.. వాగులా పారాలి.. దాహాన్ని తీర్చాలి.. వంకలై ఉరకాలి.. వానలా కురవాలి.. మైదానమంతా పచ్చదనం పరుచుకోవాలి. ఏ ఆలోచన కావాలో.. అది నువ్వే తేల్చాలి!.

ముళ్ళ మొక్కలు. అన్నీ ముళ్ళే.. ముళ్ళే ముళ్ళు.. ఆకులన్నీ ముళ్ళే.. కొమ్మలన్నీ ముళ్ళే!.  మెత్తని ఒంటిపైన.. సుతిమెత్తని మేనిపైన.. గుచ్చుకునే ముల్లు.. గట్టిగా హత్తుకుంటూనే.. లోపలికంటూ చొచ్చుకునే ముల్లు.. ఒంటిపైనే గుచ్చుకున్నా! మనసులోతుల్లోకి.. గుండెగూటిలోకి.. నరనరాల్లోకి దూసుకుపోయే ముల్లు. కానీ.. ఆ ముళ్ళక్రిందే వుంటాయి తియ్యని పళ్ళు.. తియతియ్యని పళ్ళు.. నోరూరించే పళ్ళు. అటుపక్కనే వుంటాయి.. అందమైన పువ్వులు.. అందచందాల పువ్వులు. కొన్ని ఆలోచనలూ అంతే.. పైకి ముళ్ళేగానీ.. అవి అందమైన పువ్వులు.. తియ్యనైన పళ్ళు.

అదిగో! ఆ పువ్వుంది చూడు..  చేతితో నలిపేయాలనిపిస్తుంది.. కాలితో తొక్కి చిదిమేయాలనిపిస్తుంది.. నోటితో కొరికి ముక్కలు చేయాలనిపిస్తుంది.. నామరూపాలు లేకుండా చెయ్యాలనిపిస్తుంది.. ఆ కసిలో మునిగి ఆనందించాలనిపిస్తుంది..  వెర్రికేకలేస్తూ వెకిలిగా నవ్వాలనిపిస్తుంది..  ఊహూ..!! కాదు.. కాస్త ఆలోచించు..
ముట్టుకోవాలనిపిస్తుంది.. ముద్దాడాలనిపిస్తుంది.. ఆ సువాసనలను ఆఘ్రాణించాలనిపిస్తుంది.. పూజచేయాలనిపిస్తుంది.. పూజలోవుంచాలనిపిస్తుంది. ఆలోచిస్తే ఇది సాధ్యమే.. ప్రయత్నంతో ఇది సాధ్యమే. ఆలోచనలు మార్చుకోవటం సాధ్యమే.

ఆలోచన ఒక మహావృక్షమవ్వాలి.. ఏపుగా ఎదగాలి.. గుబురుగా పెరగాలి.. ఊడలు వ్రేళ్ళుగా పాతుకుపోవాలి.. ఆ మహావృక్షంలో పక్షలు గూడ్లు కట్టాలి. ఆటలాడాలి.. పాటలుపాడాలి.. కిలకిల నవ్వాలి... చెట్టంతా కళకళలాడాలి.. సేదతీరాలి.  గుడ్లుపెట్టాలి.. సంతతి పెరగాలి.. సంతసమవ్వాలి. అన్నిప్రాణులకు ఆవాసమైనా.. అంతంత భరువులు మోస్తున్నా..ఆ వృక్షం దృఢంగా వుండాలి.. పెనుగాలులకు తట్టుకోవాలి.. ఆలోచనలోనూ అంత బలముండాలి.

చిగురులేసిన చెట్టు ఎదుగుతుంది.. ఆకాశంవైపు ఎగప్రాకుతుంది.. సూర్యుడిని అందుకోవాలనుకుంటుంది.. ఆకులేసి కొమ్మలను అలంకరించుకుంటుంది.. ఎండకు ఎండుతుంది.. వానకు తడుస్తుంది.. చలికి వణుకుతుంది.. ఆకులనే కప్పుకుని నిలబడుతుంది.. అయినా క్షణానికెన్నో ఆకులు రాలుస్తుంది.. రాలిన ఆకులకై కిందకు చూడదు.. వాటిని వాలిపోనీ.. రాలిపోనీ.. వొంగిపోనీ.. రంగుపోనీ.. రంగుపోయి పాలిపోనీ.. వాటికై ఏమాత్రం కృశించదు.. చలించదు.. కొత్త చిగురులతో కొత్త కళ సంతరించుకుంటుంది.. కొత్త ఉత్సాహం మనసంతా నిలుపుకుంటుంది.. ఎప్పటికైనా సూర్యుణ్ని చేరాలన్నట్టు.. తన ప్రయాణం కొనసాగిస్తుంది.. మదిలో నిలవని ఆలోచనని.. పారిపోనీ.. పాలిపోనీ.. రాలిపోనీ.. నిలవనిదానిని చూసి ఆగిపోకు.. రాలినదానిని తిరిగి తీసుకోకు.. ఆశపోనీయకు.. కొత్తదానికోసం వేచిచూడు. వేయి కళ్ళతో ఎదురు చూడు.

ఆలోచన వెదురులా ఎదగాలి... ఎదురులేనిదవ్వాలి. దమ్మున్నదవ్వాలి.. దుమ్మురేగిపోవాలి. దూసుకుంటూ పోవాలి దూరాల్ని చేరాలి. వేగంగా కదలాలి.. వేగులా మారాలి. సూదల్లే గుచ్చుకోవాలి.. సూటిగా వుండాలి. అవును అలోచనలు సూటిగా వుండాలి.

ఆలోచనా తరంగాలు.. అవి ఆకాశంలో తిరుగాడే తరంగాలు.. స్వేచ్ఛగా విహారించే విహంగాలు..  ఈ బుర్ర అనే మైదానంలోకి వీచిన పవనాలు. నిలువెల్లా ప్రవహించే తరంగాలు..  మససులో అకస్మాత్తుగా కలిగిన భావాలు.. మనసును కదిలించే భావావేశాలు. వెచ్చని మదిలో శీతల కెరటాలు.. గుండె సవ్వడులకు అనుగుణంగా మ్రోగే శ్రవణ కంపనాలు.

అవును ఆలోచనలు తరంగాలే.. ఆలోచనలు ఆకాశానికేగే తరంగాలే.. ధ్యానించే మనసులోకి చొచ్చుకుపోయే తరంగాలే.. ఆ తరంగాలు మనసును తాకి మరళా ఆలోచనలుగా మారే తరంగాలే.

అందుకే మనసు ఎపుడూ మంచినే ధ్యానించాలి.. ఆకాశంలో ఎగురుతున్న ఆ విహంగాన్ని ఆకర్షించాలి. ఆ మంచి ఆలోచనకే అది ఆవాసమివ్వాలి. ఎపుడూ మంచే ఆలోచించాలి. అది మరళా ఆకాశానికెగరాలి.. ప్రతి మదిలోనూ అది వాలిపోవాలి.. ప్రతి మదినీ అది దోచుకోవాలి.
ఆలోచనలు. ఆలోచనా తరంగాలు!

18, అక్టోబర్ 2011, మంగళవారం

ఇదో డిఫరెంట్ వెర్షనూ!!


మీరు బ్యాచిలరా?, అవును మరి ఈ మధ్య కొత్తగా పరిచయమైనవారిని ఇలానే అడగాల్సివస్తుంది. అవతలివాడు పెళ్ళి కానివాడైతే అవునండీ.. అంటాడు.., పెళ్ళయివుంటే సంతూర్ ఏడ్ లో మమ్మీ.. డైలాగ్ లాగా. ఒక్కసారి గాల్లోకి ఎగిరి.. ఆనందపడతాడు.. అసలే ఈ మధ్య అమ్మాయిల కొరత ఎక్కువయ్యి.. బ్రహ్మచారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. బ్యాచిలర్ ని.. మీకు పెళ్ళయ్యిందా అన్నామనుకోండి. వాడు ఆల్రెడీ అదే ప్రశ్న రోజుకు వందసార్లు వినీ వినీ మంటమీదుంటాడేమో.. హా!.. నలుగురు భార్యలూ.. పన్నెండు మంది సంతానం అని చిరాగ్గా సమాధానం చెప్పినా చెబుతాడని భయపడి ఇలా అడగాల్సొస్తుందన్నమాట. ఇదో డిఫరెంట్ వెర్షనూ!.

ఇలా మీరు బ్యాచిలరా! అనే కొత్త వెర్షను ఎప్పటినుండి మొదలుపెట్టాల్సొచ్చిందంటే... ఒకసారి మా కొలీగ్స్ అంతా మాట్లాడుకుంటున్నాం. అప్పుడే కొత్తగా కంపెనీలో చేరాం కాబట్టి ఒకరిగురించి ఒకరికి తెలియదు. అంతా ఒకచోట చేరి మాట్లాడుకుంటుంటే నేను మధ్యలో వెళ్ళాను.  మా టీమ్ లో బొద్దుగా లావుగా.. బట్టతలతో ఉన్నతను ఒకడున్నాడు.. అందరూ తమతమ పిల్లలగురించి పెళ్ళిగురించి మాట్లాడుకుంటుండగా.. నా బుర్రలో ఏదో మెరుపులా ఒక ప్రశ్న వచ్చి బొద్దుగా వున్నాయన్ని అడిగేసా.. మీకెంత మంది పిల్లలు అని. అతని మొహం ఎర్రగా అయిపోయింది.. నా వంక అదోలా చూసి ఇంకా నాకు పెళ్ళే కాలేదు అన్నాడు.. సారీ సారీ.. సారీ.. సా...రీ.. అని నోటికొచ్చిన సారీలు చెప్పేసా.. పాపం ఫీలయ్యాడతను. నేను అడిగినందుకు కాదు.. అన్ని సార్లు సారీ చెప్పినందుకు.
నాకేం తెలుసు.. అందరూ పిల్లలగురించి అడుగుతుంటే.. ఆయన పెద్దాయనలా కనిపించాడు.. మరీ పెద్దాయన్ని పెళ్ళాయ్యిందా అని ఏం అడుగుతాం.. అని పిల్లలెంతమంది అన్నా..

ఆ తరువాతనుండి తెలిసొచ్చింది.. ముసలాడు ఎంగ్ గా కనిపించటానికి ఇష్టపడతాడు.. ఎంగ్ గా వున్న కుర్రాడు ముసలాడిలా అవ్వాలని కోరుకోడు.. కదా అని!, కాబట్టి పైనుండి నరుక్కురావాలన్నమాట. అంటే ఏంలేదు.. సమయానికి తగ్గట్టుగా వెర్షను మార్చటమే.

మొన్నొకాయన కొత్తగా ఇలాంటిదే కొత్త వెర్షన్ ప్రయోగం నా మీద చేసాడు.  మా కొలీగ్ వాళ్ళ స్నేహితుడొకడు నన్ను పరిచయం చేసుకుంటూ "మరాఠీ ఆతీహే", అని అడిగాడు.. సరిగ్గా హిందీలో స్త్రీలింగం పుంలింగం కి తేడాతెలియని నాకు మరాఠీ ఎక్కడొస్తుంది.. అందుకే  "నహీ" అన్నాను. "నహీ ఆతీ".. అని బతికున్నోడికి ఆబ్దికం మాసికం పెట్టినట్టు.. పెద్ద ఆశ్చర్యార్దకం పెట్టాడు. అయితే వీడు నాన్ మరాఠీ అన్నమాట అని మనసులో అనుకున్నాడు. అసలు అతడు తెలుసుకోవాల్సింది అదే విషయం.. నేను మహరాష్ట్రావాడినా కాదా అని. దానికి డిఫెంట్ వెర్షన్ తో నన్ను కొట్టాడన్నమాట. అప్పటికి నా పేరు "శ్రీనివాస్"  అని చెప్పలేదులేండి చెప్పుంటే ఆ వెర్షన్ ప్రయోగం నాపై చేయకుండానే తెలిసిపోయేది సౌత్ నుండి పారిపోయి వచ్చిన శరణార్ది అని.

ఇంకొక విషయం ఏంటంటే.. మహారాష్ట్రాలో సౌత్ ఇండియన్ అంటే డిఫరెంట్ వెర్షనే వుందందడోయ్.. మలయాళీ/మల్లు.. లేదా మదరాసీ/తమిళా అని అడుగుతారు కానీ ఆంధ్రా వాడిని అందులో చేర్చరు.. మనం ఆంధ్రా అని చెప్పేలోపలే.. డోస(దోసను అలాగే పిలుస్తారు) సాంబార్, రజనీకాంత్ ఈ మధ్య 2జి రాజా, పద్మనాభస్వామీ... ఇవన్నీ టీ.వీ సీరియల్ లాగా ఎదుటివాడికి  గుర్తొచ్చేసి ఏదేదో చెప్పేస్తుంటాడు అడిగేస్తుంటాడు. అదికాదు వెర్షనూ.. మాది ఆంధ్రా అనగానే.. కేసీఆర్, చిరంజీవి, రాజశేఖర్రెడ్డి.. చంద్రబాబునైడూ(అలాగే పిలుస్తారు.. :-) ), తెలంగాణా రైల్ రోఖో.. ఇలా ఆరోజు న్యూసు బట్టి ప్రముఖులంతా.. ప్రముఖ సంఘటనలతో సహా.. గుర్తొచ్చేస్తారు. అలాగే మరాఠీ.. అంటే.. నాకు మనవైపు 'మాయల-మరాఠీ' అనే పదం గుర్తుకొస్తుందిలేండి. ఎవడి వెర్షను వాడిది మరీ!

ఈ వెర్షనుకు ఇంకా చాలా అర్ధాలు.. అపార్ధాలూ ఉన్నాయండోయ్. ఇప్పుడు వెర్షన్లో కొత్తకోణం గురించి మాట్లాడుకుందాం. మచ్చుకు ఒక మచ్చుతునక తీసుకుంటే.. తెలుగు సినిమా వెర్షను. ఇది చాలాఁ డిఫరెంట్ వెర్షనే.
సినిమా మొదలవగానే ఓఁ.. తెగ ప్రేమగా రాసుకు పూసుకుని రెండు క్యారెక్టర్లు తిరిగేస్తున్నాయంటే.. ఇంకేముంది.. సెంకడాఫ్ లో వాళ్ళిద్దరూ రక్తాలొచ్చేలాగా.. బట్టలుచించుకుని డిష్క్షూ డిష్షూ.. కొట్టుకుంటారని అర్ధం.

భర్త ఆఫీసునుండి చేతిలో చిన్న ఎర్రబ్రీఫ్ కేసుతో.., మెడకు కట్టుకున్న టైని ష్.. అంటూ లూజుచేసుకుంటూ.. ఇంటికొస్తాడు. ఇంటిలో భార్య ఒక మూలకూర్చుని స్వెటర్ అల్లేస్తుంటుంది.. అంతే ఏముంది.. బుల్లి క్యారెక్టర్ రాబోతున్నాడని హీరోకి అర్ధం అయిపోతుంది..

ఇదే సీనుకు డిఫరెంట్ వెర్షన్ ఏంటంటే.. అమ్మాయి మాట్లాడుతున్నదల్లా.. ఒక్కసారిగా పరుగెత్తుకెళ్ళి.. సింక్ లో రెండు ఆమ్లెట్లు వేసేస్తుంది.. తరువాతి సీన్లో డాక్టరొచ్చి చెయ్యి నాడి పట్టుకుని మీరు తాతకాబోతున్నారని ఇంటి పెద్దాయన్ని చూసి.. చెప్పేస్తాడు.. అప్పటి వరకూ కెమేరా వెనుకనుండి సీనంతా చూస్తున్న హీరో.. ఎగిరి గంతేసి.. వెంటనే హీరోయిన్ని ఎత్తుకుని.. గిరగిరా మూడు నాలుగు రౌండులు తిప్పేస్తాడు. ఆ తర్వాత.. అయ్యో మర్చే పోయాను.. నువ్వసలే ఒట్టి మనిషివికాదు.. ఆగు..  ఈ క్షణం నుండి నీ పనంతా నేనే చేస్తా అని.. కిచెన్లోకి వెళతాడు..అక్కడో పాట.

అంతేనా!... అంటారా.. వీలయితే చిన్న డ్యూయెట్.. కుదిరితే ప్యామిలో సాంగ్.. ఫ్యామిలో సాంగ్ లో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే.. కుటుంబం అంతా పౌర్ణమి రోజు దీపావళి టపాసులు కాల్చేస్తుంటారు.

ఇక చెప్పుకోదగ్గది.. హీరోగారి వాయిస్..
ఎక్కడో కొండలు అవతలవున్నవాడిని కూడా మన హీరో తన వాయిస్ తో మాట్లాడేస్తుంటాడు..., వెనుక టేప్ రికార్డర్ లో పాట ప్లే చేసేస్తుంటె.. అబ్బా హీరో గొంతు అచ్చం మన బాలసుబ్రహ్మణ్యమే అని తెగ ఫీలైపోతుంటుంది హీరోయిన్.., చెట్టుపై కూర్చుని పాటపాడేస్తుంటె.. హీరోయిన్ పిచ్చిదానిలా కెమేరాను చూడకుండా వెతికేసుకుంటుంది.. ఏంటో ఈ వెర్షన్లు.. మరి.

మారువేషం వెయ్యటమంటే.. బుగ్గమీద చిన్న ఉలిపిరికాయలాగా పెట్టుకోవటం.. పెద్దపెద్ద మీసాలు అంటించుకోవటం.. ష్...

ఇలాంటివే ఇంకొన్ని.
హీరోని హత్య చెయ్యాలని విలన్లు ప్లాన్ చేస్తారు.. తరువాతి సీన్లో ఒక ఎర్రలారీ సెంటర్లో రడీగా కాసుకుని ఉంటుంది.. హీరో దాని ముందుకు రాగానే.. డండండం.. అంటూ మీదకొచ్చేస్తుంది.. హీరో రోడ్డుపట్టుకునే లారీ ముందు పరుగెత్తుతాడు కానీ.. రోడ్డు మార్చిన్ దిగి పారిపోడు.. ఎందుకంటే లారీ మార్జిన్ దిగి రాలేదు కదా..!

ఐ.సి.యు లో పడుకోబెట్టిన పేషెంట్ క్యారెక్టరు కి పేమెంట్ ఇచ్చి పంపించేయాలని డైరెక్టరుకి అనిపించిందనుకోండి.. లైటు ఆరిపోతుంది.. డాక్టర్.. దిగాలుగా వస్తాడు.. కళ్ళజోడు తీస్తాడు.. ఐ.యామ్ వెరీ సారీ.. మేం చాలా ప్రయత్నించాం అంటాడు.

ఇక ఫ్యాక్షన్ సినిమాలో ఫస్టాఫ్ సెంకడాఫ్ అని ఆపులేకుండా కత్తులతో కసకసలాడించేసిన హీరో.. ఆఖరిసీన్లో చంపడానికో చావటానికో అయితే పుట్టడం ఎందుకంటాడు.. వెనుకున్నవాళ్ళందరినీ కత్తులు కిందపడేయమంటాడు.. ఏం చేస్తారు.. నోర్లు వదిలేసి.. కత్తులు జారవిడుస్తారు.

ఎక్కడపడితే అక్కడ ఆకాశంలో రాబందులు కీ కీ కీ అని తిరిగేస్తున్నాయనుకోండి.. అక్కడ  హీరో ఇంకొక రెండు శవాలు లేపుతాడని అర్ధం అన్నమాట..

హీరోని ఎలాగైనా అరెస్టు చేసి తీరాలని నిర్ణయించుకున్న పోలీసు అధికారి.. హీరో ఎదురుపడగానే.. స్లోమోషన్లో దణ్ణం పెట్టాడనుకోండి.. బయటకెళ్ళి మనం సమోసాలు.. పాప్ కార్న్ ప్యాకెట్టు తెచ్చుకోవాలని అర్ధం.. ఎందుకంటే.. చెక్రం తిప్పకపోయినా అక్కడ పేద్ద ప్లాష్ బ్యాక్ ఉంటుంది మరి.

సుమోలు.. టవేరాలు.. డబ్ అని హీరో వెనుక పేలిపోయి.. హీరోగారి ఫేవరెట్టు గొడ్డలికత్తి రక్తంతో చీకిపోయి కనిపించిందనుకోండి.... మనం సైకిల్ టికెట్టో.. లేక కారు పార్కింగ్ తిక్కెట్టో జేబులో వెతుక్కోవాలని అర్ధం అన్న మాట.
ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ అధ్బుతమైన వెర్షన్లే.

ఇక సాఫ్వేర్లో తీసుకుంటే ఈ వెర్షన్ కి వెర్షనే వేరు. ముందుగా మన సాఫ్వేర్ ఇద్దరు ముగ్గురు బక్రాలు కొంటారన్నమాట.. కొన్నాకా.. వాటిని బాగా వాడాకా.. అందులో వున్న తప్పులు పట్టుకుని.. ఏంటిదని బండబూతులు తిడితే.. వాటిని సరిచేసి.. న్వూ  వెర్షన్ 2.0 అని రిలీజ్ చేసి.. ఇదిగో.. చూడు.. చాలా సరికొత్త విషయాలు పొందుపరచాం.. సరికొత్త డిజైన్ కూడా చేసాం.. అని ఇంకో రెండు డాలర్లు నొక్కుతారన్న మాట. కొన్నాకా తెలుస్తుంది.. అందులో సరికొత్త లోపాలున్నాయని.. అదే మరి కొత్తవెర్షన్ అంటే.

ఇక్కడ కొన్ని ఆఫీసు వెర్షన్లు.
మేనేజరు నుండి.. ఏక్ష్సెలెంట్.. డ్యూడ్ అని మెయిలొచ్చిందంటే.. కింద లైనులో ఖచ్చితంగా కొత్త పని ఇస్తున్నాడనీ.. తన ఎలకలు పట్టిన ఎక్పీరియన్స్ ఉపయోగించి ఒక బోను కొత్తగా పెట్టాడనీ అర్ధం అన్నమాట.
ఎప్రైజల్ మీటింగ్లో కంపెనీ లాసులో వుందన్న మాటతో మొదలుపెట్టాడంటే.. ఈసారి కూడా మనకొచ్చేది మళ్ళీ ఆ ముష్టి మూడు శాతమే నని చెప్పకనే చెప్పే.. చెవిలో పెట్టకనే పెట్టే పువ్వన్నమాట.

ఎక్కడో సుదూరంగా కూర్చునే తలమాసినోడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి.. హాయ్.. అన్నాడంటే. బుడబుక్కల డౌటు వెర్షనేదే మొదలుపెడతాడనీ అర్ధం...

ఎప్పుడూ మేనేజరుకి ఎదురుపడని మనం.. ఎదురుగా వెళ్ళి పలకరించామంటే.. లీవుకోసమో. బోనస్ కోసమో.. కొత్తవెర్షన్ డైలాగులు రాసుకొచ్చామని మేనేజరుకు అర్ధం అవుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టపాకీ ఎన్నో వెర్షన్లు కావాలి...
కంగారుపడకండి.. అలాంటివేవీ లేవులేండి. :-)

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కాంక్రీటు మనసులు...


ఇల్లు ఎంత ఇరుగ్గావుంటే మనసులంత దగ్గరగావుతాయి అంటారు.ఇది చాలా నిజం.. చిన్న ఇంటిలోవున్న ఆనందం పెద్ద మహల్ లో బిక్కుబిక్కుమంటూ గడిపితే వుండనేవుండదు. ఇరుకు ఇల్లే లేవు అంటే.. కలివిడిగా కలిసిమెలిసి ఉండే ఉమ్మడికుటుంబాలు అసలే లేవు కాబట్టి, నాలుగువేపులా కాంక్రీటుతో కట్టిపడేసిన జైలులాంటి గోడలమధ్య వుంటూ మాది అపార్మెంటు కల్చర్.. ఎదుటివాడి గోల మనకు అవసరం లేదు, అనుకుంటూ చక్కగా హాల్లో కూర్చుని కాళ్ళుచాపుకుని కాలం గడుపుతున్నాం. తల్లిదండ్రులను అత్తమామలను దూరంగా నెట్టి.. హనీమూన్ లైఫులాగా గడుపుతుంటారు కొత్తజంటలు. ఎప్పుడో చుట్టంచూపుగా వచ్చే అత్తగారు కోడలికి.. దైవంలాగా తోస్తుంది. కోడలు అత్తగారికి.. మహాలక్ష్మిలాగా అనిపిస్తుంది. వున్న నాలుగురోజులూ అడుగులకు మడుగులెత్తుతూ ఒకరికొకరు సేవలు చేసుకుంటారు. అదే దగ్గరగా వుంటే తినగా తినగా బెల్లంముక్క కూడా చేదైనట్టుగా.. ఒకరిమొహాలు ఒకరు చూసుకుని.. విరక్తికలిగి.. నువ్వెంత అంటే.. నీ బతుకెంతా!, అనుకును జుట్టూజుట్టూ పట్టుకునే వరకూ వస్తుంది విషయం. అందుకే అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వస్తేనే గౌరవమని ఆరోగ్యానికి మంచిదని అందరూ ఈ అపార్ట్మెంటు కల్చర్కి జేజేలు కొడుతున్నారు.

కోటలూ మేడలూ వదిలి.. కాంక్రీటు గదుల్లోకి చెరిన మన మనసులు కూడా కాంక్రీటు రాళ్ళలాగా మారిపోతున్నాయి. ఆప్యాయతలు.. అనురాగాలు మరిచిపోతున్నాం.. డబ్బు తప్ప కంటికేది కనపడక చూపు మసకబారుతుంది. ఆ మసకబారిన చూపుతో చూస్తే మన అన్నవాళ్ళెవరూ కనీసం మసకగా కూడా కనబడరు. పెళ్ళైన కొత్తలో అడ్డు అనుకున్న అత్తమామలూ.. తల్లిదండ్రులు.. పిల్లలుపుట్టాకా వస్తేబాగుండుననిపిస్తుంది. మనింట్లో ఓనాలుగు రోజులుంటే పిల్లాడికి కావలసిన చాకిరీ అంతా చేయించవచ్చు అన్నది ఈ కాంక్రీటు మనసుల ఆలోచన. పాపం మనవడినో మనవరాలినో చూద్దామని వచ్చినవారికి నడుంనెప్పులూ కీళ్ళనొప్పులూ తప్ప ఏమీ మిగలవు. కనీసం వారిని బయటకు కూడా తీసుకెళ్ళకుండా ఆ కాంక్రీటు మహల్లో కట్టిపడేసి చక్కగా మళ్ళీహనీమూన్ జంటలాగా ఊర్లు పట్టుకుని తిరుగుతుంటారు జంటలు. నెమ్మదిగా పిల్లలెదుగుతారు. ఇక నాన్నమ్మ- అమ్మమ్మలు.. తాతయ్యలు భరువవుతారు. పిల్లవాడిని గారాభం చేసి చెడగొట్టి చెడుబుద్దులు నేర్పే లిస్టులోకి వారూ చేరిపోతారు. ఇప్పటిదాకా పిల్లాడిని అంటిపెట్టుకునివుండి..వాడి ఉచ్చగుడ్డలు ఉతికిన ఆ ప్రాణులకి ఎన్నో ఆంక్షలు.. అపనిందలు. మొత్తం ప్రపంచం అంతా ఫలానా వారు.. తమ కొడుకు దగ్గరో అల్లుడు దగ్గరో వుంటున్నారు వాళ్ళకేంటి ఎంత రాజభోగమో.. వాళ్ళపనేహాయి అనుకుంటుంది. కానీ వారి బాధలు ఎవరికీ అర్దం కావు. ఎవరికీ చెప్పుకోలేరు కూడానూ. మరి గ్రాండ్ పా,గ్రాండ్ మా ని కూడా మనతో తీసుకెళదాం..అని నడకొచ్చి.. అప్పుడప్పుడే నడవడిక నేర్చుకుంటున్న ఆబుడతడి మాట కూడా పట్టించుకోకుండా వాళ్ళదారిన వారు మళ్ళీ ప్యామీలీ ట్రిప్పులేసుకుని.. హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తారు.. ముసలాళ్ళను మళ్ళీ మళ్ళీ  ఆ మహల్లో పడేసి..  ఇంటికో.. ఇంట్లో వున్న కుక్కకో.. లేక గాజుతొట్టెలో రంగుచేపకో.. పంజరాన రామచిలుకకో కాపలాగా వుండండని వదిలిపడేస్తారు.

సరే ఇక్కడివరకూ కధ మొత్తం మన టీవీ సీరియల్లో చూపించినట్టు మొదలుపెట్టిన నాలుగు వారాలు ప్రేమలే  కానీ పెద్దగాదోమలు కుట్టిన దద్దుర్లు లేకుండా గడిచిపోతుంది. అసలు విషయం ఎక్కడొస్తుందంటే ఆ ముసలాళ్ళు మనమీద ఆధారపడటం మొదలయ్యినప్పుడు.
నాకు తెలిసిన ఒకాయనది ప్రేమవివాహం. వాళ్ళతల్లిదండ్రులు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే కాలనీలో వుండేవారంట. అలా చిన్నప్పటి కుటుంబాల మధ్య పరిచయంతో అతనికి ఆ అమ్మాయితో ప్రేమగా మారింది.తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పెళ్ళి జరిపించారు. ఆ అమ్మాయి ఒకతే కూతురు. వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోతే వాళ్ళమ్మగారికి అదే కంపెనీలో టీచరు ఉద్యోగం వచ్చింది. అలాగే ఆవిడ రిటైరయ్యారు. ఈ జంటకి పిల్లలులేనంతవరకూ ఆవిడ విడిగానే వుంటూ వస్తున్న పెన్సన్ తీసుకుంటూ ఒంటరిగానే ఉన్నారు. ఈజంటకి పిల్లలు పుట్టాకా  ఆవిడని ప్రేమగా రప్పించారు. ఆ పిల్లాడి ఆలనా పాలనా చూస్తూ ఆవిడ వాళ్ళతో కలిసే వున్నారు.ఆవిడకి ఈమధ్య కిడ్నీలో ఏదో సమస్య మొదలైంది. దాంతో ఆపరేషను అదీఇదీ చాలా హడావిడయ్యింది. ఆపరేషనుకు ఆమెకున్న డిపాజిట్లు.. సేవింగ్సూ ఖాలీ అయిపోయాయి. ఈస్టోరీ ఇలా నడుస్తుంది.

ఒకరోజు ఎవరో ఏదో మంచి సందర్బంవస్తే స్వీట్లు పంచుతుండగా అతన్ని ఎవరో అడిగారు.. నువ్వెప్పుడు స్వీట్లిస్తావు, మీ అబ్బాయి పుట్టినరోజు రాబోతుంది అని. దానికన్నా ముందే ఇద్దామనివుంది.. మా అత్తగారు టపా కట్టాకా అన్నాడు. అప్పుడు సరదాగానే అనిపించిన ఆ మాట.. తరువాత మాకేదోలా అనిపించింది. పిల్లాడి పుట్టినరోజుకని వాళ్ళవూరికి బయలుదేరారు. అత్తగారికి ఆపరేషను అయ్యి రెండురోజులు కూడా కాలేదు. ఆమెను రైల్లో బలవంతంగా ఎక్కించారు. సగం దూరం ప్రయాణం చేసాకా ఆవిడకు నొప్పి అని రాత్రికి రాత్రే ఎక్కడోమారుమూల స్టేషన్లో దిగి వెనక్కు రావాల్సొచ్చింది. ట్రిప్పు క్యాన్సిల్ అయ్యింది. తరువాత దిగాలుగా మొహంపెట్టి.. కనిపించినతను..మొత్తం ప్లానంతా పాడుచేసింది మా అత్త అన్నాడు. అదేంటి మరీరెండు రోజులే కదా అయ్యింది ఆపరేషన్ అయ్యి. రెస్ట్ అవసరం కదా అలా ఎలా తీసుకెళ్ళావు.. అన్నాంమేమంతా. లేదుడాక్టర్ పర్వాలేదన్నాడు. ఆవిడని అడిగితే బాగుంది వెళదాం అంది..అందుకే వెళ్ళాం అని చిరాకు పడ్డాడు. అలా రెండుమూడు నెలలు గడిచాయి.. ఆవిడ కోలుకుంది.. వాళ్ళఅన్నయ్యవాళ్ళింటికి చూడాలనివుంటే పంపించారు..

మళ్ళీ కొన్నాళ్ళకు అతను దిగాలుగా కనిపించాడు ఏంటని వివరం అడిగితే.. చెప్పాడు.. మా అత్తగారు మొత్తం దుకాణం సర్దేసి మా దగ్గరకొచ్చేసింది. వాళ్ళ అన్నయ్యలున్నారు వారి దగ్గరకెళ్ళొచ్చు కదా..మేమే దొరికాం లోకువగా అన్నాడు. అదేంటయ్యా  ఆవిడకి ఒకతేకూతురు ఎక్కడకెళుతుంది. కూతురు చూడకపోతే వాళ్ళ అన్నయ్య ఎలా చూస్తాడు.. వారి ప్యామిలీ వేరు కదా అన్నాం.. ఏ ఎందుకు చూడరు.. అన్నాడు. ఎందుకొచ్చిన గొడవని మేం ఏమీ మాట్లాడలేదు.

పెళ్ళికిముందే అతనికి తెలుసు.. ఒకతే కూతురు కనుక ఆవిడకి వీళ్ళే సపోర్ట్ అని.. అలా అని అతనిది చాలీచాలని జీతం కాదు. ఆవిడని చూసే స్తోమత లేనివాడుకూడా కాదు. అయినా ఇంట్లోవున్న మనిషి ఏం తినేస్తుంది.. మామూలుకన్నా ఒక రెండు రోటిలెక్కువ అంతే కదా!, పోనీ వారికేమన్నా వీకెండు షాపింగులు చేసి అదీ ఇదీ కావాలనే ఓపికుంటుందా.. అదీలేదు కదా!, మరెందుకో అలా.. మాకైతే అర్ధంకాలేదు. తల్లిదండ్రుల తరువాత అంతటివారు ఎవరూ అంటే అత్తమామలే కదా. వాళ్ళకు మనం గౌరవమివ్వకపోతే.. మనల్ని పెళ్లిచేసుకుని అన్నీ వదిలి వచ్చిన ఆ అమ్మాయి.. రేపు మన తల్లిదండ్రులకు విలువనిస్తుందా?, ఇవన్నీ చూసిన మన పిల్లల మనకు విలువనిస్తారా? విలువనిస్తే ఎంత ఇవ్వకపోతే ఎంతంటారా!, ఏమో ఎవరి వాదనలు వారివి. ఏంటో జీవితం అసలు అర్ధంకాదు. మన బాధలే మనకు అర్ధంకానప్పుడు ఎదుటివాడివి అసలుఅర్దంకావులేండి.

ఇంటికీ, ఇంటిలోని ఫర్నీచరుకీ లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడనివాళ్ళు. చిన్న చిన్న విషయాలదగ్గర కక్కుర్తి చూపింస్తుంటారు. మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాడు.. ఎంతో సాధించాడు.. అని అనిపించినవెంటనే మనకు ఇలాంటివి వినగానే ఇంతలా ఎదిగిన మనిషి  బుర్రలోనుండి ఇంకా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.. అంటే నిజంగానే మనిషి అంతలా ఎదిగాడా..అంత సాధించాడా అనిపిస్తుంది.



23, జులై 2011, శనివారం

బజ్జొచ్చి.. బ్లాగర్ ని...


బజ్జొచ్చి బ్లాగర్ ని ఎక్కిరించటం అంటే ఇదే.. యువరానర్. ముందొచ్చిన బ్లాగర్ కన్నా వెనుకొచ్చిన బజ్జే వాడి అని నమ్మిన జనాలు..ఇలా మానిటర్లకు అంటుకుపోయి.. వారాలు వారాలు స్నానాలు చేయకుండా ముక్కులుమూసుకుని.. కుళ్ళు కామెంట్లిచ్చుకోవటం నాకేం నచ్చలేదని.. నా కీ బోర్డ్ లో 'కంట్రోల్ కీ' ని నొక్కి వక్కానిస్తూ..ఆవేశాన్ని 'కంట్రోల్' చేసుకుంటున్నాను యవరానర్.

ట్విట్టర్ ని చూసి గూగుల్ అట్లకాడ మైక్రోవేవ్ వోవెన్లో పెట్టి వేడిచేసి వాతపెట్టుకున్న చందాన.. ఒకరిద్దరు ఖాలీగా ఉంటున్న ప్రోగ్రామర్ల చేత పనిచేయించడం కోసం గూగుల్ పన్నిన వ్యూహంలో భాగంగా బజ్జుపుట్టిందనీ..అది తెలియక మన కుర్రాళ్ళు భలేవుందని.. చంకల్లో చేతులుపెట్టుకుని గుద్దుకుని.. ఇలా సగం బగ్గులతో మార్కెట్టుమీదకు వదిలేసిన ఈ బజ్జుని పెంచి పోషించడం.. మన బ్లాగ్ యువతను తప్పుదారిన పట్టించడానికి పక్కదేశాలు పన్నిన కుట్రేనని.. ఇది చాలా చాలా అన్యాయమని.. నేను సవినయంగా కోర్టువారికి మనవి చేసుకుంటున్నాను యువరానర్.

తండ్రి టూర్లలో నడిచినప్పడు కనీసం చెప్పులుకొనుక్కోటానికికూడా డబ్బులు లేక.. ఒక్కసారిగా.. తెరచించుకొని తెరమీదకొచ్చిన మన యువ నేత గగన్ లాగా.. ఓదార్పు వెకేషన్లని.. అందమైన మార్నింగులనీ.. రోబోటిక్ టెక్నాలజీలనీ.. ఈ మధ్య సి.బి.ఐ రైడింగులనీ.. వార్తల్లో సెలబ్రిటీ లెవల్ కి ఎదిగినట్టుగానే.. అతి తక్కువకాలంలోనే ఎదిగిపోయేలా చేసి.. ఎక్కడో బోన్లో నిలబడాల్సిన ఈ బజ్జును ఇలా BMW కార్లలో తిరిగేలా చేసింది ఎవరనీ.. నేను కోర్టువారిని ప్రశ్నిస్తున్నాను యువరానర్.

నడమంత్రపుసిరిలాగా ఎదిగిన ఈ బజ్జు వల్ల.. బ్లాగర్ల్ లో ఎంతో శ్రమకోర్చి రాసిన టపాలకు రెండువందలు మూడువందలు హిట్లున్నా కనీసం రొండుకూడా కామెంట్లు రాలక... నిరాశతో.. నిస్పృహతో.. కొరుక్కోటానికి కూడా గోళ్ళు లేక.. వేళ్ళుకొరుక్కుంటుంటే.. ఆ వేళ్ళు రాయటానికి సహకరించక.. ఖాలీగా వుంటూ.. ఎవరికీ చెప్పుకోలేక... బాధను సోడా కలపని విస్కీలాగా దిగమింగుతున్న మా క్లైంట్ల పొట్టకొట్టడం...ఒక దేశద్రోహం అని..  దీనిని మనం కండకండాలుగా.. ఖండించి.. కేశఖండనం చేయాలని కోరుతున్నాను యువరానర్.
ఈ విషయం మీద ప్రతిపక్షమైన బజ్జును తయారుచేసిన గూగుల్ వారు వచ్చి క్షమాపన కోరి.. బజ్బును త్వరలోనే టుజి-రాజాలాగా.. కనిమొజి-రాణీలాగా..తీహార్ జైలుకు పంపించే  విధంగా కోర్టువారు చర్యలు తీసుకోవాలని ప్రార్దిస్తున్నాను.

ఈ పాతవస్తువులను రోడ్డుమీద పడేసే సంస్కృతి పోవాలని మన బ్లాగ్ నేతలను నేనంతగానో వేడుకుంటున్నాను యువరానర్. ముందొచ్చిన సికింద్రాబాదుకన్నా వెనకొచ్చిన హైద్రాబాదే ముద్దన్నది.. వాస్తవమనీ.. ఈ మధ్య వేర్పాటు గొడవల్లో ఎక్కడా కూడా.. ఎవరూ మాకు సికింద్రాబాద్ కావాలని అనకపోవటంతో తేలిపోయింది.. యువరానర్.
ఇది చాలా బాధాకరమైన విషయంగా పరిగణించి మా పాతవైభవం మళ్ళా వచ్చేలా చూసి.. ఎప్పుడూ చెప్పినట్టుగా చట్టం తనపని చేసుకుపోతుందని రికార్డు చేసిన తీర్పు ఇవ్వకుండా... ఈ కేసులో కాస్త కొత్త డయలాగులు రాయించేలా కోర్టు తనవంతు సాయం చేస్తుందన్న ఆశతో వాదిస్తున్నాను యువరానర్.

మొన్న ముంబయిలో బాంబులు పేలిన తరువాత ఎవరూవచ్చి "మేమే బాంబులు పెట్టాం", అని చెప్పకపోవటం వలన.. మన హోం మినిష్టరుగారు ఎవరుపెట్టారో తెలుసుకోలేకపోయారు.. అలాగే.. ఎవరొకరు ముందుకొచ్చి.. బజ్జులోవున్నదేంటి.. బ్లాగర్లో లేనిదేంటిని చెప్పకపోవటం వలన మాకూ ఏమీ తెలియక ఇలా ఓపెన్ గా ఖండించడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నామని మనవి చేసుకుంటున్నాం యువరానర్.

చాలా విషయాలు పరిశీలించాకా తెలిసిందేంటంటే.. కొత్తగా ఏ టెక్నాలజీ వొచ్చినా.. అప్పుడెప్పుడో రాజమండ్రిలో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేసినట్టుగా.. వెబ్ విహారం చేసి.. మన బ్లాగ్ యువత ఎగబడిపోతూ.. ఉర్రూతలూరుతుందని.. తేలింది యువరానర్. అలాంటి విహారమే ఇప్పుడు గూగుల్ ప్లస్సులో చేస్తున్నారని తెలుస్తుంది యువరానర్.

బ్లాగర్ పాతది.. పనికిరానిది  బజ్జుకొత్తదీ..అని ఒకే కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పొద్దని నేను విన్నవించుకుంటున్నాను యువరానర్. పాతది అనే మాటైతే.. కాటుమొహానికి.. మేకప్పేసి.. పౌడర్ పూసి.. మన రాష్ట్ర హోంమంత్రిని చేస్తే.. ఏం మాట్లాడకుండా ఎలా ఒప్పుకున్నారు ఈ జనం అని ప్రశ్నిస్తున్నాను యువరానర్.

రాష్ట్రం మంటల్లో మండిపోతున్నప్పుడు కూడా.. ఫ్రెష్ గా మొహం కడుక్కుని.. మీడియా ముందుకొచ్చి.. "ఎలా జరిగిందో మేం చర్యలు తీసుకుంటాం. ఏం జరుగుతుందో మేం చర్యలు తీసుకుంటాం.. ఏదోలా మేం ప్రయత్నించి చర్యలు తీసుకుంటామని.. "చర్యలు" అనే పదాన్నిఎలా వాడాలో తెలియక ఎదో ఆవిడ మాట్లాడేస్తే..ఎలా ఒప్పుకున్నారు ఈ జనం.. అని అడుగుతున్నాను.  "ఆవిడకే మాట్లాడటం రాదు.. ఇక మనమేం మాట్లాడతాం...", అని వూరుకున్నారుగానీ ఈ జనం.. వేలేత్తి ఎప్పుడూ చూపించలేదు యువరానర్.

అలాంటి ఈ జనం.. పాతది.. పనికిరానిదీ అని బ్లాగర్ ని నిందించడం ఏమన్నా భావ్యమాఁ.. అని అడుగుతున్నాను యువరానర్.

మొన్న ఇదే విషయం మనం ముఖ్యమంత్రిగారి దాకా తీసుకెళదామని వెళితే ఆయన డిల్లీ వెళ్ళారని తెలిసింది యువరానర్.. సరే కదా అని డిల్లీ దాగా వెళ్ళి గల్లీ గల్లీ తిరిగితే ప్రతీ గల్లీలోనూ మన సీమాంధ్ర.. మన తెలంగాణా ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారుగానీ.. అయన దొరకలేదు.. చేసేదిలేక మళ్ళీ హైద్రాబాదొచ్చేసి.. ఎప్పటికో ఆయన్ని పట్టుకుని ఈ బ్లాగ్ బాధలు విన్నవించుకుంటే.. మేం చెప్పిందంతా విని.. ఆయనకూడా "తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అన్న ఒక్కమాటని మూడు భాషల్లోఖూనీ చేసి చెప్పారుకానీ.. ఇప్పటివరకూ ఏ "చర్యలు" తీసుకోలేకపోయేసరికి.. ఈ "చర్యలు" అన్న పదానికి కొత్తగా ఏమన్నా తెలియని అర్ధాలున్నాయేమోనని అన్ని భాషల నిఘంటువులు తిరగేసుకోవాల్సొచ్చింది యువరానర్.

ఇంకొక్క విషయం నేను కోర్టువారి దృష్టిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను..., అదేంటంటే.. "కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్", "కేక","సూపరో-డూపర్", "గుర్ర్ర్ ర్ ర్", అని బాగా వాడుకలో వున్న సరికొత్త పదాలకు.. పేటెంట్లను సంపాదించి.. అంతర్జాతీయ గుర్తింపువచ్చేలా చేసి.. ఇవి బ్లాగర్లలో కామెంటిచ్చే చోట 'లైక్' బటన్ లాగా వచ్చేలా చేసి.. మౌసుక్లిక్కుచెయ్యకుండానే..కంటిచూపుతో కామెంటిచ్చే టక్నాలజీ తీసుకొస్తే....
బజ్జుల్లో ఇవి వాడుకుని.. "కికికికికికి" అని నవ్వుకుంటున్న వాళ్ళంతా.. బ్లాగ్లుల్లో కూడా "కికికికికి కికికికి కికికికి" అని నవ్వుతూ వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాను యువరానర్.

ఈ విషయాలన్నీ చూస్తూ.. "అమ్మ ఏది చెబితే అదే..", అన్న మన ఫ్రధానమంత్రిగారిలా నోట్లో బెల్లంముక్క పెట్టుకున్నట్టుగా నవ్వుతూ వుండిపోలేక.. అవేశంతో కోర్టుకెక్కాల్సొచ్చిందని నా బాధను వెళ్ళగక్కుతున్నాను యవరానర్.

ఈ పైన పేర్కొన్నవిషయంపై.. వెంటనే తమతమ వివరణ ఇస్తూ కామెంట్లివ్వాలని.. కామెంటివ్వని వారిని.. కోర్టువారు కటినంగా శిక్షించాలని.. ఈ టపాకు కూడా బజ్జులో కామెంటిచ్చినవారిని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటూ.. ఇక్కడితో సెలవుతీసుకోకుండా ఈ పోస్టుకు రెండో భాగంలో ఎవరెవరు దీనికి
బాధ్యత వహించాలో పేరుపేరునా రాస్తుంటాననీ మనవి చేసుకుంటు సెలవు తీసుకుంటున్నాను యువరానర్. జైహింద్.. జై తెలుగు బ్లాగింగ్.

22, జులై 2011, శుక్రవారం

నేల మాళిగలో...


అన్ని న్యూస్ చానళ్ళలోనూ ఫ్లాస్ న్యూసులొస్తున్నాయి. ఐదవ నేలమాళిగలో అంతులేని ధనరాశులు లభ్యం. పుట్టపర్తిలో నేలమాళిగలున్నట్టు అనుమానం. అన్ని గుళ్ళలో నిధినిక్షేపాలకోసం తవ్వకాలు...పొద్దున్నుండీ.. అదే న్యూసు.  వీళ్ళ డి.వి.డి లు అరిగిపోనూ.. ఎన్ని సార్లు వేసిందే వేస్తారు.. వినివినీ బోర్ కొట్టింది..

తమిళోడు తెలుగు నేర్చుకొచ్చాకా.. మాలికా అనరా.. అంటే.. మాళిగా..అన్నట్టు..ఇంతకీ ఈ నెలమాళిగంటే ఏంటో.., ఏదైతే ఏంటిలే..ఎన్ని దొరికితె ఏంటిలే.. మనకేమన్నా ఇస్తారా చస్తారా.
మ్చె.. దేవుడా.. నాకూ ఒక బంగారునాణేల మూట దొరికినా బాగున్ను..  హోమ్ లోన్ అంతా ఒక్క దెబ్బతో తీర్చేద్దును అనుకుంటూ.. చానల్ మార్చాను. ఏ చానల్ చూసినా ఇదే గోల. ఛా.. ఎఫ్ టీవీ పెడదాం. అని పెట్టానోలేదో.. సైజ్ జీరోనో ఎంటో అంట ఖర్మకాకపోతె ఈ మధ్య అమ్మాయిలంతా ఫేషెంట్లలాగా సన్నగా అయిపోయి.. గెడకర్రలకు గుడ్డలేసినట్టుగా.. కర్రముక్కకు కర్చీఫ్ వేలాడేసినట్టుగా తయారయ్యిన లేడీసు టిక్కుటక్కుమంటా నడుస్తుంటే.. అసలు మజాయే అనిపించలేదు అందుకే మార్చేసి.. అలా అలా చానల్లు మారుస్తూనేవున్నాను.

కరెంటు పోయినట్టుగా చుట్టూ చీకటైపోయింది.. కాసేపు నిశ్శబ్దం. నేనెక్కడున్నానో నాకు అర్దంకావటంలేదు. అటు ఇటూ చూస్తే.. నేను సోఫామీదే వున్నాను.. ఎదురుగా టీ.వీ ఆడుతుంది... అంటే కరెంటుపోలేదన్నమాట..!, మరి ఏమైంది..?, ఏమో నాకు తెలియటంలేదు. ఉన్నది మాఇంట్లోనే.. కాకపోతే.. మొత్తం ఇల్లంతా ఖాలీగావుంది. ఇదేంటి అనుకునేంతలోనే దూరంగా ఏదో మెరుపు. లైటు కాంతిలేకపోయినా చీకట్లో దగదగా మెరిసిపోతున్న నగలు ఒంటినిండా దిగేసుకుని కనిపించింది ఒక మానవాతీత రూపం.

అమ్మో దెయ్యమా..!, చఛా.. దెయ్యం అయ్యిండదు.. లేక ఆ ఎఫ్ టీవీలో అమ్మాయెవరన్నానా?.. అనుకునేంతలో, "ఒరే!, పాపికొండలరావ్", అన్న మాట ఎకో ఎఫెక్టులో వినిపించింది. ఇదేంటిది.. ఈ కొండలరావ్ ఎవరున్నారబ్బా అని అనుకునేంతలో.. "నేనురా!.. నువ్వు పిలిచిన దేవుణ్ని", అని మళ్ళీ ఎకో ఏఫెక్టులో వినిపించింది వాయిస్.

"అయ్యబాబోయ్.. మీరా!.. దేవుడుగారూ.., మా తెలుగుసినిమాల్లో చూపించినట్టుగా స్పెషలెఫెక్టులు లేకుండా మీరు సైలెంటుగా వచ్చి ఇక్కడ కూర్చొంటేనూ.. ఎవరో అనుకున్నా తప్పైపోయింది క్షమించేయండి", అని  చేతిలోవున్న రిమోట్ పక్కనపెట్టేసి.. రెండుచేతులూ జోడించి వేడుకున్నాను..

"నేను పిలిస్తే వచ్చారా.. స్వామీ. అవును మీరు తెలుగులో మాట్లాడుతున్నారు.. అంటే మనది ఆంధ్రాయేనా.. ఏవూరు స్వామీ.. ఏ ఏరియా.. తెలంగాణానా.. రాయలసీమా.", అని ఇక్కడ తెలుగుమాట వినగానే అడిగే ప్రశ్నలు అలవాట్లో పొరపాటుగా అడిగేసరికి..దేవుడుగారికి మంటెక్కిపోయింది... "ఆపండ్రా.. ఆపండ్రా..", అని పెదరాయుడు సినిమాలో మోహన్ బాబులా గర్జించారు దేవుడుగారు.

"అయ్ బాబోయ్.. క్షమించేయండి దేవుడుగారు.. మిమ్మల్ని ఎప్పుడుపిలిచానో.. గుర్తురావటంలేదు.. ఎందుకొచ్చారో అదీ మీరే చెప్పేస్తే...", అని నెమ్మదిగా గొనిగినట్టు అడిగాను.

"మూట కావాలని అడిగి మళ్ళీ ఎందుకొచ్చావంటావా... నీ మొర విని అనవసరంగా మిగతా ఎసైన్మెంటులు వదిలేసి వచ్చానుకదరా.. మూటాముళ్ళూ సర్దుకుని వెంటనే వెళ్ళిపోతున్నా", అని ప్రక్కనున్న ల్యాప్ టాపు బ్యాగ్ వేసుకుని లేవబోయారు దేవుడు గారు.

"వద్దు స్వామీ వద్దు మళ్ళీ క్షమించెయ్యండి..", అంటూ.. ఆ ల్యాప్ టాప్ బ్యాగేంటీ..దేవుళ్ళు కూడా ఇది వాడతారా...అని అడుగుదామని నోటిదాకా వచ్చినమాట వెనక్కుమింగేసి. రాక రాక ఇంటికొచ్చారు.. ఏదన్నా తినటానికిపెడదాం.. అని మిగిలిన చికెన్ బిర్యాణీ తీసుకొద్దామనుకున్నాను., అయ్ బాబోయ్.. ఇంకా నయం ఏమన్నావుందా.. అది పెట్టానంటే ఇప్పుడు ఈ హాల్లోనే నన్ను భస్మంచేసేసి... అని నీళ్ళునమిలి..
"మంచినీళ్ళు కావాలా స్వామీ... ప్యూర్ గా ప్యూరిట్ తో ఫిల్టర్ చేసినవి స్వామీ", అన్నాను.

"అక్కర్లేదు.. మూటిస్తాను అనగానే.. నీ మర్యాదలు ఎక్కువైయ్యాయేమిటిరా భక్తా", అంటూ దేవుడుగారు కూర్చున్నారు.

అదేంలేదు స్వామీ.. "చిత్తం మహాప్రభో.. మూట ఎక్కడున్నదో..ఆ చిత్రవిచిత్రమును నాకు చిత్తరువేసి చూపించుడు... ఇప్పుడే.. ఇక్కడే.. పలాయనం చిత్తగించుడి", అని ఏవేవో  పాత పౌరాణిక డైలాగులు ప్రాసలోకొచ్చినవి గుర్తుచేసుకుని చెప్పేసాను.

నా డయలాగు పూర్తికాకుండానే.. దేవుడుగారు లేచి వెళ్ళిపోవటానికి మళ్ళీ ల్యాప్ టాపు బ్యాగు సర్దుకుంటున్నారు.. అదేంటి స్వామీ నేనేదో అర్దం అడగరు కదా అని ఏవేవో డయలాగులు చెప్పాను, ఏమన్నా తప్పుగా అనుంటే.. క్షమించేసి ఆ మూట విషయం చెప్పి వెళ్ళిపొమ్మని కళ్ళనీళ్ళుపెట్టుకున్నాను.

"ఏడవకు భక్తా.. నీకు మూట ఇవ్వటానికి రాలేదురా, ఆ మూట దొరికే మార్గం ఎక్కడుందో చెప్పటానికే వచ్చానురా.", అని చిరునవ్వునవ్వారు దేవుడు గారు.
"చెప్పండి స్యామీ... అంతకన్నా మహాభాగ్యమా ", అని మిస్ అవకూడదని మొబయిల్లో రికార్డింగ్ చేయటం మొదలుపెట్టి.. కళ్ళుమూసుకుని చాలా ఆశక్తిగావినటం మొదలుపెట్టాను.

"మీ ఇంటిలో నువ్వు నడుస్తుండగా ఎక్కడైతే గల్లుగల్లని గజ్జెల శబ్దం వినిపిస్తుందో.. ఆ తరువాత లక్ష్మీదేవి నవ్వినట్టు వినబడుతుందో అక్కడ తవ్వితే.. ఒక నేలమాళిగ వుంటొంది.. అందులో నీ హోమ్ లోన్ కి సరిపడా సిరులు ఒక మూటగట్టివుంటాయి.. వెతుక్కో పో", అని దేవుడుగారు.. మాయమైపోయారు.

"అయ్యయ్యో.. ఒక్క హోమ్ లోనుకు సరిపడానేవుంటాయా... స్వామీ అనవసరంగా తక్కువే కోరానే..", అని కళ్ళుతెరిచి చూసేటప్పుడుకి.. సోఫాలో నిద్రపోతున్న నాకు మెలుకువ వచ్చేసింది. ఓహో.. ఇదంతా కలా అని అనుకోలేదు.. ఎందుకంటే అది కలే.. లేకపోతే. నేను చేసే ప్రార్ధనలకి దేవుడు రావటమేంటి.

కానీ కలలాగా అనిపించటంలేదు.. ఎక్కడో అదే విషయం మనసులో మెదులుతూనేవుంది. లచ్చిందేవి ఎక్కడ నవ్వుతుందా అని అనుమానంతో  నడుస్తున్నప్పుడు ఆగి ఆగి.. గమనిస్తూనేవున్నాను.
అలా నడుస్తూ.. ఇల్లంతా తిరుగుతూనే వున్నాను.. సోఫాకి డైనింగ్ టేబుల్ కి మధ్యకి వచ్చేసరికి వినిపించింది గల్ గల్ గల్ అని గజ్జెల శబ్దం. ఆ తర్వాతే..హహహహా.. అని నవ్వు.., ఆ.. అదేనవ్వు.. లచ్చిందేవినవ్వు అనుకునేంతలో..మళ్ళీ గజ్జెల శబ్దం..మళ్ళీ నవ్వు.. తరువాత.. "జిలిబిలి పలుకుల. చిలిపిగ పలికిన", అని సితార సినిమాలోని పాట జెమినీ మ్యూజిక్లో వస్తుంది..

ఓహో..ఇది భానుప్రియ నవ్వా..ఇంకాలచ్చిందేవి నవ్వనుకున్నానే అనుకుని కూర్చుందాంలే...అని ఇంకో రెండడుగలు వేసానో లేదో.. కాలికింద టైలు కాస్త టక్ మంది.. మళ్ళీ ఒకడుగు వెనక్కేసి.. మళ్ళీ తొక్కాను..మళ్ళా టక్.. లచ్చిందేవి నవ్వటం అంటే.. భానుప్రియ నవ్వినట్టే నవ్వక్కర్లేదు.. ఏదో శబ్దంవస్తే చాల్లే..ఇక్కడే వుండుంటుంది..అనిఎవరూచూడకుండా.. వెళ్ళి స్క్రూడైవర్ తో చిన్న రంధ్రం చేసి టైలు పైకిలేపేసాను.. టైలు కింద సిమెంట్ లేకుండా ఇసుక దొలిచేకొద్దీ వస్తుంది.. సులువుగా గొయ్యి పడిపోతుంది. అయితే ఇదే.. ఇక్కడె నేలమాళిగుందని నాకు నమ్మకం కుదిరింది. ఎవరికీ తెలియకుండా కార్పట్ కాస్త అటు లాగి.. పైన కప్పేసి ఆ రోజు ఆఫీసుకెళ్ళిపోయాను .

సాయంత్రం వచ్చి చూసేసరికి నేను చేసిన దానికన్నా రెండింతలుంది గొయ్యి. ఇదేంటబ్బా ఇంట్లో ఎవరికన్నా తెలిసిపోయిందంటావా అని గోతిలో వెతికి చూసేసరికి ఒక కాలువిరగ్గొట్టేసిన ఏనుగుబొమ్మ కనబడింది.. అప్పుడర్దమయ్యింది.. ఈ పని మా బుడ్డోడిదేనని.

పర్లెధు తండ్రికి తగ్గ కొడుకేనని కాస్త గర్వంతో కూడిన చిరునవ్వునవ్వుకుని భుజాలు చరుచుకున్నాను.  ఆ రోజు నేనుకాస్తా.. తరువాత రోజు మావాడు కాస్తా.. అలా ఒక వారం రోజులయ్యేసరికి చెయ్యిదూరేంత కన్నం పడింది నేలకి.. అందులోంచి చూస్తే వెలుగు కనబడుతుంది..ఇదేంటిది నేలలో వెలుగా.. అయితే ఇది నేలమాళిగే..త్వరగా తవ్వేయాలి... అదే న్యూసు మరాఠీ చానళ్ళలో చూపిస్తే.. పక్కింటోడికీ ఈ అయిడియా వస్తే... వాడూ తవ్వేస్తే.. నా మూట నొక్కేస్తే.. అమ్మో.. ఈ రాత్రంతా అదే పనిలోవుండాలి అని కావలసిన సరంజామా అంతా చేసుకోవటం మొదలెట్టాను.

అందరూ పడుకున్న సమయం చూసి... నేను లేచివెళ్ళి.. ముందుగా రడీచేసుకున్న వస్తువులు పట్టుకెళ్ళాను.. మొబైల్లో టార్చ్ లైట్ వేసి.. పనిమొదలుపెట్టాను.. కన్నం పెద్దదిచేస్తూ.. అడ్డుగా వస్తున్న ఇనపరాడ్లను కోస్తూ మనిషిదూరేంత చేసేసరికి తెల్లవారిపోతుంది. నెమ్మదిగా కిందకు దూకి చూసేసరికి ఒక చిన్నగదిలావుంది.. అందులో ఒక చెక్క పెట్టివుంది.. ఆ పెట్టిపై ఒక పెద్ద మూట.. మూట సైజును బట్టి చూస్తే చాలా నాణేలుండేటట్టే అనిపించాయి... మరి పెట్టెలో ఏముందో.., అవన్నీ తరువాతచూడొచ్చు..ముందు మూటవిప్పెయ్యాలి అని మూటను లాగాను.. భరువుగా ధబ్బ్ అని కింద పడింది.. కంగారుకంగారుగా విప్పతున్నాను.. టెన్సన్లో.. చెమటలు పట్టి కారిపోతున్నాయి. సగం.. విప్పాను.. విప్పుతూనేవున్నాను..ఎంత విప్పినా పాతగుడ్డలే వస్తున్నాయి.. ఇంకా లోపలేదోవుంటుందని విప్పుతున్నాను.. మళ్ళీ పాత గడ్డలే..ఆఖరి గుడ్డ చూసేంతవరకూ నమ్మకం కుదరలేదు.. నేననుకున్న నాణేలు అందులో లేవు.. అది పాతగుడ్డలమూటేనని..

అదేంటి!!..మోసం.. దగా..అని దేవుణ్ని మళ్ళీ పిలుద్దామనుకున్నాను.. కానీ దేవుడు చెప్పినట్లే నేలమాళిగ వుంది అంటే మూటావుంటుంది. దొరికిన మూట పాతగుడ్డలమూట అయ్యిందంటే ఇంకా ఇక్కడే ఎక్కడో వుంటాయి చూద్దాం... అనుకుంటుండగా.. పక్కనేవున్న పెట్టి నా దృష్టిలో పడింది. అయితే ఈ పెట్టెలో వున్నాయోమో చూద్దాం అని  పాతగుడ్డలన్నీపక్కకుతోసి..నిలబడేసరికి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి..  కాస్త గోడదగ్గరకు నక్కి ఆ మాటలు వినసాగాను.. కాసేపటికి స్పష్టంగా మనుషుల మాటల్లా వినపడ్డాయి.. కానీ అర్ధం అవటంలేదు..ఏంటివి దేవతలబాషా.. కానీఎక్కడో విన్నట్టుందే..ఆ గొంతుకూడా.. అని అలోచించంగా  చించగా అర్ధం అయ్యింది.. ఆ మాటలు... తెలుగు కాదనీ.. మరాఠీలో వున్నాయని.

అప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది... ఆ మాటలు మా కింద ప్లోర్లో వుంటున్న పాటిల్ గారివనీ.

దేవుడా ఎంత పనిచేసావు.. నేను గొయ్యితవ్వింది ఫోర్త్ ఫ్లోర్లోవున్న నా ప్లాటుకా!, వెతుకుతున్నది మరాఠీ వాళ్ళ పాతగుడ్డలా.. చిచిఛీ.. అని తలపట్టుకున్నాను... పట్టుకున్న ఆ తలని గోడకేసి కొట్టుకున్నాను.. నన్ను ఎవరో తట్టినట్టుగా అనిపించి లేచాను.., లేవండి ఆఫీసుకి టైమవుతుందని మా అవిడనన్ను తట్టి లేపింది. ఏంటి మూడో ఫ్లోర్ పాటిల్ గారొచ్చారా అన్నాను.. ఆయనెందుకొస్తారు.. కలగన్నారా..అంది.

ఏంటి ప్లాష్ బ్యాక్లో ఇంకొక ప్ల్యాష్ బ్యాకులాగా.. ఇదీ కలేనా.. అంటే కలలోని కలా! అన్నా.


16, జులై 2011, శనివారం

ప్రతీ డెవలపర్ కీ ఒక రోజు...

ఆఫీసులోకి ఎంటరయ్యి సిస్టమ్ లాగిన్ చేసి.. మెయిల్ బాక్స్ లోకి తొంగిచూడగానే ఒక మెయిల్ నా కోసం ఎదురుచూస్తుంది. అది చదవగానే పొద్దున్నే ఎక్కడలేని బీపీ తన్నుకొచ్చింది.

ఈ మధ్యనే జాయిన్ అయిన కొత్త మేనేజర్ నుండి వచ్చిందా మెయిల్... వేరే ప్రోజక్ట్లో చాలా క్రిటికల్ ఇష్యూలు నడుస్తున్నాయి.. వాటిని చూడటానికి నువ్వు ఆ ప్రాజెక్ట్లోకి కొన్ని రోజులు రావాలి.
అని రాసాడు.  అక్కడవరకూ.. బాగానే వుంది.. కానీ ఆఖరు లైన్లో.. నీకు ప్రస్తుతం పనిఏమిలేదని.. నువ్వు ఖాలీగానే వున్నావని అనుకుంటున్నాను అని రాసివున్నలైనే.. పౌరుషం పొడుచుకొచ్చి.. ఆవేశం తన్నుకొచ్చేలా చేసింది. తన్నుకొస్తున్న ఆవేశాన్ని ఆపుకోలేక.. రెస్ట్ రూమ్లోకి దూరాను.  కోపంతో ఎర్రగా.. ఆర్ నారాయణమూర్తిలా.. అయిపోయిన కళ్ళను నీళ్ళతో కడుక్కున్నాను... కళ్ళకు తగిలిన నీళ్ళూ వేడిగా పొగలుకక్కి చేతిలోపడగానే చెయ్యి కాలిపోయింది. కాలిన చేతుల్ని చన్నీళ్ళతో కడుక్కుని.. ఏ డిషా.. ఏ.. త్రిషా.. అని కోపంతో పేపర్ హోల్డర్ని రెండు పిడిగుద్దులు గుద్దాను.. హోల్డర్ లోంచి రెండుపేపర్లు రాలాయి... వాటితో మెహం తుడుచుకుని.. ఎవరూ చూడలేదు కదా అని అటూ ఇటూ చూసాకా డెస్క్ దగ్గరకొచ్చాను. అదే ఆవేశంతో మెయిల్ కి రిప్లై రాయటం మొదలుపెట్టాను.

నేను పొద్దున్నే నాలుగున్నరకి లేచి..,మొహం కడుక్కోకుండా.. టీ తాగకుండానే ప్రొడక్షన్ సెర్వర్ లో రన్ అవుతున్న ప్రోసెస్ లు మానిటర్ చేస్తాను.. అది అయ్యాకా నాపక్కలో పడుకున్న మా అబ్బాయిని కాస్త పక్కకు నెట్టి.. నా లాప్టాప్ పెట్టుకుని రెండు గంటలు నిద్రపోతాను.. మళ్ళీఎనిమిదింటికి..మళ్ళీ పదింటికి అలా ప్రతీ రెండుగంటలకోసారి లాగిన్ అయ్యి ఏం జరుగుతుందోనని చూస్తుంటాను.. ఏ ఎర్రర్ రాకపోతే.. తాపీగా ఆఫీసుకు పన్నెండింటికి వస్తాను.. వచ్చాకా.. ప్రోసెస్ ఎలా నడిచిందోనని.. ఎన్నో చెక్స్ చెయ్యాల్సొస్తుంది. అసలు నేను ఇలా చెయ్యకపోతే క్లైంట్ బిజిజెస్ కోట్లలో నష్టం వచ్చేస్తుంది..అందుకేనేను ఈ ప్రాజెక్ట్లో చాలా విలువైన వాడని. నేనొక్కరోజు ఇది చూడకపోతే అంతే... అమెరికా మార్కెట్లు టపటపామంటు షాక్కొట్టిన కాకుల్లా పడిపోతాయి. మనకంపెనీకి రెవెన్యూతెచ్చే ప్రోజెక్టుల్లో ఇది అతి పెద్దది, నేనొక్కడినే ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నానన్న విషయంమీకు తెలియదనుకుంటాను.. నా ఒక్కడిద్వారావచ్చే రెవెన్యూ.. మన కంపెనీ అంతా బతకుతున్నట్టే కదా!... అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి.. నేను చెబుతున్నది అబద్దంకాదని అనిపించేలా వుండటానికి.. గూగుల్ లో వెతికి పెద్ద పెద్ద చార్టులు.. గ్రాపులు అన్నీకాపీపేస్ట్ కొట్టి, ప్రింట్ చేస్తే పదిహేనుపేజీలకు తగ్గకుండా వచ్చేలా.. పెద్ద మెయిల్ రాసి సెండ్ బటన్ నొక్కాను.

నేను నాలుగున్నరకి లేవటమేమిటి.., అసలు సపోర్ట్ ఎగ్రిమెంటే రాయకుండా రెండునెలలనుండి ఫ్రీగా చేయించుకుంటున్నాడు క్లైంటు.. అలాంటిది మన కంపెనీకి రెవెన్యూ వచ్చే ప్రాజెక్టులలో ఈ బేవార్స్ ప్రాజెక్ట్ వుంటమేంటి.., ఏదో ఒక వారంరోజులునుండి పనిలేదు కాస్త ఎంజాయ్ చేద్దాం అనేసరికి తగలడతారు.. అందులోకి రా..ఇందులోకి దూరు అని.., ప్రతీ ఒక్కడికీ లోకువే.. కొత్తగా వచ్చినోడి దగ్గరకూడా మనం లోకువైపోతే ఎలాగా.. హిహీ..పిచ్చి మేనేజర్ నమ్మేసుంటాడు.. అని నాలో నేనే.. డెస్క్ కిందకి దూరి నవ్వుకుంటుంటే.. వెనుకెవరో వచ్చినట్టు నీడపడింది. బలవంతంగా నవ్వాపుకుని దగ్గినట్టు నటిస్తూ.. సిపియు.. వైర్లు లూజయితే కదిపినట్టుగా ఏక్టింగ్ చేసి పైకి లేచి చూస్తే కొత్తమేనేజరు నిలబడున్నాడు. హాయ్ అన్నాను.. అలా మీటింగ్ రూమ్లోకి  వెళ్దామా.. మాట్లాడాలి అన్నాడు. సరే పద అని ఇద్దరం మీటింగ్ రూమ్లోకెళ్ళాము.

అవునా! నువ్వు అంత బిజీగావుంటావా.. సారీ.. నాకు తెలిసిన దానిబట్టి అలా రాసాను. వేరే ప్రాజెక్ట్ చాలా క్రిటికల్ స్టేజ్ లో వుంది. క్లైంట్ నుండి చాలా ప్రెజర్ వస్తుంది. డెవలెపర్స్ ఎవరూ దొరకటంలేదు.. అంతా వేరువేరు ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోయారు. షార్ట్ టెర్మ్ కోసం కొత్తవాళ్ళనీ తీసుకోలేం. అవును నువ్వు టీమ్ లీడ్ అంటకదా.. నువ్వొక్కడివే ఆ ప్రాజెక్ట్ చూసుకుంటున్నావంట కదా!  అన్నాడు మేనేజరు.

చాలా రోజులతరువాత నన్నొకడు టీమ్ లీడ్ అన్నాడనే సరికి ఆనందం పొంగి పొరలిపోయి మీటింగ్ రూమంతా నిండిపోయింది. కుర్చీతోపాటుగా ఒక్కసారి పైకిలేచి సీలింగ్ కి తగులుకుని కింద పడ్డాను..., కింద పడ్డాకూడా నొప్పి తెలియలేదు. గోవిందరాజుల స్వామి కాళ్ళుమీద కాళ్ళు వేసుకుని పడకున్నట్టు పడుకుని..అవును నేను టీమ్ లీడ్ అన్నాను. సరేలే టీమేలేదు.. లీడ్ అయితే ఏంటి.. సియీవో..అయితే ఏంటట అన్న మేనేజర్ గాడి వెటకారం చూపు చూసి.. కాస్త తేరుకున్నాకా.. ఇక్కడ రెండు ప్రాజెక్టులు విజయవంతంగా 365 రోజులు ఆడించాం.. ఈమధ్యే ఈ ప్రాజెక్ట్ కి టైటానియమ్ బ్రోమియమ్ డిస్క్ ఫంక్షన్లో రాఖీ సావంత్ ని పిలిచీ.... అని చెబుతున్న నాకే కాస్త ఎక్కువైనట్టు అనిపించి టాపిక్ కట్ చేసి చెప్పాను.
ప్రాజెక్ట్ అయిపోవచ్చింది.. ప్రొడక్షన్ సపోర్ట్ లో వుంది. అందుకే ఎవరూ ఇందులోకి రాలేదు. నేనొక్కడినే సింగిల్ హేండుతో.. అని నా షర్ట్ చేతులు పైకి జరిపి.. కండలు చూపించాను..

చాల్లే చూసాం నీకండలు.. ఇక దించు అన్నట్టుగా చూసి... సరే.. పెద్దాయనతో మాట్లాడతా అన్నాడు కొత్త మేనేజరు.

నాకు ప్రాజెక్టుకు పురుడ్లు పోసే మేనేజర్ అదే.. డెలివరీ మేనేజరు.., ఇంకా మనకు ఒక్క డాలర్ కి.. వెయ్యిరూపాయలు పనిచేయించుకునే  క్లైంట్.. వీరితోనే కాంటాక్టు తప్ప... పెద్దాయన్లు.. ముసలాయన్లు ఎవరూతెలియదన్నాను.. ఏదన్నా మాట్లాడాలంటే.. వారితోనే డైరెక్ట్ గా మాట్లాడుతుంటాను అన్నాను. అసలీ పెద్దాయన ఎవడు!, ఆయన్ని ఆ కొత్త ప్రాజెక్ట్లో కి తీసుకోండి ఖాలీగావుండుంటాడు కదా! అన్నాను.

పెద్దాయనంటే సీ.టి.వో అన్నాడు మేనేజరు.. రక్తం వచ్చేలా నాలుక్కరుచుకుని.. తెగిన ముక్క మేనేజరుకి కనపడకుండా నోట్లోనేపెట్టుకుని.. బబుల్ గమ్ములా నములుతూ.. ఆయన ప్రాజెక్ట్ మొదలయినప్పుడు ఇందులో వున్నాడు అంతే ఆయనకుపెద్దగా ఏం తెలియదు.. అప్పుడప్పుడు కొత్త సినిమాలు అమెరికాలో రిలీజ్ అయినప్పుడు గ్రేట్ ఆంధ్రాలోనో.. ఐడియల్ బ్రైన్ లోనో రేటింగ్ చదివి కాల్ చేస్తుంటాడు.. ఇండియాలో టాక్ ఎలావుంది అని అడుగుతుంటాడు. అంతేగానీ ఆయనకు ఈప్రాజక్ట్ అంటే ఫ్రెంచ్ మూవీనే అన్నాను.

అయ్యబాబోయ్ పెద్దాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాడంటే.. వీడు మేనేజ్మెంటుకి బాగా కావలిసిన వ్యక్తి అనుకున్నాడో ఏమో.. భయపడిపోయాడు మేనేజరు.. పట్టిన చెమటలు తుడుచుకుంటూ.. సరే.. ధ్యాంక్యూ అని బయటకు వెళ్ళిపోయాడు.

వీడిప్పుడు పెద్దాయనతో మాట్లాడతాడా..అమ్మో వాడు చెప్పేస్తాడుగా నేను ఖాలీగా కండలు నలుపుకోటం తప్ప పనిలేదని.. అయినా సరే.. తగ్గకూడదు.. ఎలాగైనా పోరాడాలి అని నిర్ణయించుకున్నాను.

సాయత్రం నేను త్వరగా ఇంటికి జంపుకొట్టి బాలకృష్ణ సినిమా క్లిప్పింగులు యు.ట్యూబ్లో.. చూస్తూ డయలాగులన్నీ భట్టిపట్టడం మొదలుపెట్టాను. అంత పెద్ద పెద్ద డయలాగులు బాలకృష్ణ ఎలా చెప్పాడో ఏంటో అని ఆశ్చర్యంవేసింది.. నేను చెబుతుంటే.. ఎక్కడి ఎక్కడినుండో గాలొస్తుందిగానీ  మాటలు రావటంలేదు.. నోట్లోంచొస్తున్న ఉమ్మితుపర్లతో ల్యాప్ టాపు స్ర్కీన్ ని కారు అద్దాన్ని వైపర్ అన్ చేస్తే తుడిచినట్టుగా గుడ్డపెట్టి అరనిముషానికోసారి తుడవాల్సొస్తుంది.. సినిమాలో కెమెరామ్యాన్లు ఈ డ్రాప్స్ పడకుండా ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో!, అనిఒక్కసారి ఆశ్చర్యంతో కూడిన ఆలోచన బుర్రలో మెదిలింది... ఏంటింతలా మెదిలింది.. ఆలోచనేనా అని చూస్తే నా తలపై దరువేస్తున్నాడు మా బుడ్డోడు.

కొత్త మేనేజరు.. పెద్దాయనకి, మా పురుడ్ల మేనేజర్ కి అందరికీ ఫోన్లుచేసి.. ఇలా ఇలా, మన కంపెనీ బిల్డింగ్ పిల్లర్స్ ఊగుతుంటే.. శ్రీనినే దాన్ని పట్టుకుని నిలబెట్టాడంటా.. చాలా బిజీ బిజీగా వున్నాడంట, నేను ప్రస్తుతానికి ఏం చెయ్యాలంట అని అడిగినట్లున్నాడు. ఆ
తర్వాత రోజు పొద్దున్నే వచ్చిన మీటింగ్ రిక్వెస్ట్, దానితోపాటుగా మా పురుడ్ల మేనేజర్ దగ్గరనుండి వచ్చిన వేడి వేడి మెయిలు చూడగానే అర్ధం అయిపోయింది.. ఇక ఆ కొత్త ప్రాజెక్ట్ లోకి వెళ్ళకతప్పదేమోనని. అనవసరంగా ల్యాఫ్టాప్ స్క్రీన్ పాడయ్యేలా డయలాగుల బట్టీపట్టానే అవన్నీ వేస్టయిపోతాయా అనిపించాయి.

సరే.. చూద్దాం ఏదో సీన్లో అవి ఉపయోగపడతాయిలే.. అని అనుకుని.. సాయంత్రం మీటింగ్లో మనమసలు దొరక్కూడదూ.. తాడో పేడోతేలిపోవాలి అని రడీగా అన్నిటికి ప్రిపేరయ్యి కూర్చున్నాను. మీటింగ్ మొదలయ్యింది కానీ... కొత్తమేనేజరు భయంతో ఏం తేడాచేసిందో మీటింగ్ కి రాలేదు.. ఇంకేముంది.. నాదే హీరో రోల్..

మా పురుడ్ల మేనేజర్ అడగటం మొదలుపెట్టాడు.. శ్రీని.. నువ్వు ప్రస్తుత ప్రాజెక్టులో చాలా మ్యానువల్ చెక్స్ చేస్తున్నావని చెప్పావంట కదా.. నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా వుంది.. ఆ ప్రాజెక్ట్ మనం చాలా ఆటోమేట్ చేసేసాం.. ఇంకేమి మ్యానువల్ వుంటుంది అన్నాడు.

అదా.. ఈ మధ్య చాలా ఇష్యూలు వచ్చాయి కదా.. అవి రాకుండా ముందు జాగ్రత్తగా చేస్తున్నానంతె.. ఒక వారం నుండి చేస్తున్నా.. ఇంతకు ముందు ఎప్పుడూ అవసరంరాలేదు.. ఇప్పుడూ అవసరంలేదనుకో అని బట్టీబట్టిన బాలకృష్ణ బయటకు రాకుండా కవర్ చేసి తప్పించుకున్నాను.

ఓహో అంతే కదా.. నేనింకా ఏదో అనుకున్నా.. సరే మరి ఆ కొత్త దాంట్లోకి నువ్వు వెళతావా అన్నాడు.

దొరికాడు బాగా అనుకుని.. వెళతాను.. కానీ మళ్ళీ దీంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు.. కాసేపు ఎత్తుకో.. వాడి ముక్కుకారుతుంది వచ్చి తుడువు.. అంటే చాలా కష్టం.. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చాలా క్లిష్టపరిస్థితుల్లోవుంది అంటున్నారు..నీకు తెలిసిందే కదా!
అలాంటప్పుడు రెండిటి మీద కాళ్ళుపెడితే.. రెండూ అటొకటి ఇటొకటి దూరంగా జరిగాయనుకో.. పంగ జారి.. ఏం జరిగినా జరగొచ్చు.. అని నా మనసులోవున్నది చెప్పేసాను.

అవును నిజమే, కానీ మన ప్రొడక్షన్ సపోర్ట్ కాంట్రాక్ట్ సైన్ చెయ్యలేదు తెలిసిందే కదా! నువ్విలా ఫ్రీగా చేసేస్తుంటే వాళ్ళు మన మాట వినటంలేదు. రెండు నెలలనుండి మనం ప్రీగానే చేస్తున్నాం నీకు తెలియనిది కాదు.. అన్నాడు.

అవును ఆ విషయం చెప్పి ఇన్నాళ్ళు కంగారుపెడుతుంది నేనేకదా.. కానీ నువ్వు ఇప్పుడు అవసరం కాబట్టి ఆ వంక చూపిస్తున్నావా అన్నాను నేను.

లేదు లేదు శ్రీని.. ప్రస్తుతానికి అక్కడ కూడా సీరియస్ నెస్ క్రియేట్ చేద్దాం అని వుద్దేశ్యంతో చెబుతున్నా. అందులో ఏదొచ్చినా, అంటే... ఆంజిలీనా జోలీ వచ్చినా అసలు దానిజోలికే వెళ్ళొద్దు. ఏవరొచ్చినా నాకు మెయిల్ కొట్టు. నేను చూసుకుంటాను.. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి నేనేం చెప్పను.. నువ్వు ఆలోచించుకో అన్నాడు పురుడ్ల మేనేజరు.

ఇంక ఆలోచించేదేముంది.. ఇది చెయ్యొద్దు అంటే నేను ఖాలీనే కదా.. ఇంకచేసేదేముందు.. అందులోకే వెళ్ళాలి.. అందుకే నువ్వు పురుడ్లు పోసే పొజిషన్లోవున్నావురా, బాస్ ఎప్పుడూ రైటే మరి.. అనుకున్నాను.

తరువాతరోజు నుండి తప్పలేదు కొత్త ప్రాజెక్టులో పనిచెయ్యటం. ప్రాజెక్టుకన్నాకష్టమైన పని టైముకి ఆఫీసుకెళటం... టైముకు రావటం. తప్పవు మరి.. కష్టాలు డెవలపర్ కి రాకా ఎవరికొస్తాయిలే అనుకుని డయలాగులన్నీ దిగమింగి పనిచేస్తున్నాను.

ఆ ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్టులో ఏమన్నా రావాలి అప్పుడు చూసుకుందాం రా.. వీరరాఘవరెడ్డి నీ పెతాపమూ నా పెతాపమూ అని మర్చిపోకుండా ఆ డయలాగు రడీ రిఫరెన్సుకోసం రాసిపెట్టుకుని ఎదురుచూస్తున్నా.. ఎప్పడూ రెండురోజులకు మించి పనిచేయని ప్రాసెస్  ఏకంగా వారం రోజులు ఏ ప్రాబ్లమూ రాకుండా బాగా పనిచెయ్యటం మొదలుపెట్టింది. వారం రోజులు పనిచేసిందంటే మాటలా.. ఎలాగన్నా దీన్ని ఆపాలి.. ఈ రాత్రికిరాత్రే అమెరికా సెర్వర్లో ప్రాసెసర్ పైన తిరుగుతున్నఫ్యాన్ని ఇండియానుండి చీపురు పుల్ల పెట్టైనా అపేయ్యాలి అని నిర్ణయించుకున్నాను.

తర్వాతరోజు మామూలుగా ఆఫీసుకొచ్చాను. కొత్త ప్రాజెక్ట్ లో ఏం చెయ్యాలి..ఏం చెయ్యాలి.. ఏం చెయ్యాలి.. అని  పుస్తకంలో "ఏం చేయాలి కోటి" రాసుకుంటుండగా.. కమ్యూనిస్టు కార్యకర్తలాగా ఎర్రగా ఇన్ బాక్సులో మెరిసిపోయింది ఒక ఎర్రర్ మెయిల్. అదేంటిరాత్రి చీపురు పుళ్ళ ఎంత వెతికినా దొరక్క ఫ్యానుఆపలేదు కదా.. మరి ఎలా వచ్చిందబ్బా ఈ ఎర్రర్..సరేలే ఎలాగైతే ఏంటిలే.. దొరికింది పో అని..మొత్తం అందరినీ టూ ఎడ్రస్ లో పెట్టి.. భలే భలే అయ్యింది ఇక్కడ..,సంబరాలు..అంబరాలనంటిన సంబరాలు అని సబ్జక్టులో రాసి... మనం ముందుగా నిర్ణయించుకున్నట్టుగానే ఈ ప్రాజెక్టులో పనిచెయ్యటంలేదు అని రాసి మెయిల్ కొట్టాను.

వారం రోజులు గడిచాయి.. ఆ ప్రాజెక్ట్లో చెయ్యివెయ్యలేదు.. నా మానాన నేను కొత్త ప్రాజెక్టులో ఏం చేయాలి కోటి రాసుకుంటూ కాలగడుపుతున్నాను.
ప్రతిరోజూ వస్తున్నఎర్ర ఎర్ర ఎర్రర్ మెయిల్స్ చూస్తూ ఈలేసుకుని ఎగిరి గంతేసుకుంటున్నా..

ఆ వారం రోజులు ఆ క్లైంట్ గాడి ప్రోసెస్ ఆగిపోయేసరికి.. వాడుదిగొచ్చి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను అని చెప్పాడు.. ఆ విషయాలన్నీ సైలెంట్ గా సీ.సీలో వున్న మెయిల్స్ లో చూస్తున్నా. భలేగయ్యింది... భలేగయ్యిందని చంకలు గుద్దుకున్నాను.

ప్రతీ డెవలపర్ కి ఒక రోజు.. అంటే ఇదేరా.. ఒక్కరుగా వస్తారో.. అందరూ కలిసే వస్తారో.. ఎలావచ్చినా వేటుకో పది తలలు తెగిపడతాయి.. లెక్కపెట్టుకోండి.. లెక్కలురాకపోతే.. సిస్టమ్లో క్యాలుకులేటర్ ఉపయోగించుకోండి..రండిరా.. రండి అని ఎగిరి తొడకొట్టుకుంటూ.., కొత్త మేనేజరు, పురుడ్లమేనేజర్ తో మీటింగ్ కోసం మరళా బాలకృష్ణ డయలాగులు ప్రాక్టీస్ చేస్తున్నా...

16, జూన్ 2011, గురువారం

మళ్ళీ ఆడపిల్లే పుట్టింది..!!!


"ఒరే.. ఎంకట్రావో.. మీ ఆవిడకి నొప్పులొత్తన్నాయంటరా.., మీ అమ్మాఆల్లోఆటోలో తీసుకెల్తున్నారో.. నిన్ను వున్నపలంగా పక్కూరు పెద్దాస్పట్టలకి రమ్మన్నారో.. ", అని తాటిసెత్తులో అరపకట్టుకుని బయటేపుగోడకి ప్లాస్టింగు సేత్తున్న ఎంకట్రావుకి తోట్లో బుల్లబ్బులు సైకిలుమీద గడ్డికోత్తానికెళతా కేకేసి ఇషయం సెప్పేడు.
ఆ కేకిన్న ఎంకట్రావు.. తాపీ గమేళాలోకిసిరేసి.. నాలుగడుగుల్లో కర్రలెంబడి కిందికి దిగిపోయి.. సైకిలేసుకుని ఇంటికి బయర్దేరేడు. ఓ పర్లాంగు దూరంఎల్లాకా.. కిళ్ళీకొట్టు రాంబాబుగాడు సైకిలుకు పెద్ద ఐసుగెడ్డ కట్టుకొని ఎదురొత్తా అదే ఇషయం సెప్పేడు... మళ్ళా కొంతదూరం ఎల్లాకా సంతకి గేదెల్ని తోలుకెళ్తున్న సూరయ్యతాతగూడా అదే ఇషయం సెప్పి కంగారెట్టేసేడు.. అలా దారెంబడి.. అదే ఇషయం కనబడ్డోళ్ళంతా సెబుతున్నకొద్దీ ఎంకట్రావు యమా టెన్సన్ తో సైకిలు స్పీడుపెంచేత్తా తొక్కేత్తున్నాడు.. సెమటలట్టేసి మొకంనిండా కారిపోతున్నా పట్టించుకోకుండా.. ఏదో ఆలోచన్లో తొక్కేతూనేవున్నాడు.. అలా కంగారకంగార్గా ఇంటికి సేరుకున్న ఎంకట్రావు.. సైకిలు స్టాండెయ్యకుండా వంటవసారా పాకకి ఆనించేసి.. గెడేసున్న ఇంటితలుపు.. సప్పుడు కాకండా.. నెమ్మదిగా తీసి దొంగోడు దూరినట్టు ఇంట్లోకి దూరాడు... ఆళ్ళావిడ పడుకుంటున్న మంచంమీదున్న బొంతకింద సెయ్యెట్టి.. కుంకంలో ముంచిన నిమ్మకాయలు, తాయత్తూ తీసి జేబులో కుక్కుకున్నాడు.. గుట్టుసప్పుడు కాకండా.. సైకిలు తీసుకుని.. పక్కూరు బయల్దేరేడు..
                                    *** *** *** *** *** ***
ఎంకట్రావు ఆ ఊళ్ళో పెద్ద తాపీమేత్రి... అప్పటి కాలంలో సబ్సిడీ ఇల్లు కాన్నుండి..  మొన్నటి గవర్నమెంటోరి హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ సగ్రుహ వరకూ..  ఊళ్ళో అందరి డాబాలు కాంట్రాట్టుకు తీసుకుని కట్టించిచ్చినోడే.., ఆళ్ళూళ్ళో ఆంజనేయసాములోరి గుడికాన్నుంచి.. పంచాయితీ డ్రైనేజిలు..., వూరినడిమద్దెనున్న రాయిసెట్టుకింద నూతిపల్లెం, దూడల్రేవులో మెట్లు.. ఇలా ఒకటేంటి, ఆ వూళ్ళో  సిమ్మెంటుతో కట్టిన ఏ సిన్న దిమ్మైనా.. ఎంకట్రావు సేయిపడకుండా పనికాలేదు.. ఎవరిదగ్గర తగ్గట్టుగా ఆళ్ళకి పనులుసేసిపెడతా, ఎవరితోనూ గొడవపడకండా.. అందరితల్లోనాలికలా ఉంటావుండే మంచి మనిషి ఎంకట్రావు.

ఎంకట్రావు తండ్రి సిన్నప్పుడే చెనిపోటంతో కూలిపనిచేత్తా పెంచుకొచ్చింది ఆళ్ళమ్మ సెంద్ర. దగ్గరసుట్టరీకంలో అమ్మాయైతే చెప్పినట్టుపడుంటుందని.. పట్టుబట్టిమరీ సుబ్బలచ్చిమిని కోడలుగా తెచ్చుకుంది సెంద్ర. ఇంత ముద్దతింటా.. ఓపికున్నప్పుడు కూలిపనికెళతా.. ఎంకట్రావుతోబాటే వుంటుంటుంది సెంద్ర.. మనిషిమంచిదే అయినా.. ఏ ఇషయమైనా.. తన్జెప్పినట్టే నడవాలంటది. మహా మాటకారి.. గడ్డుమనిషి.తేడావత్తే ఎవర్నీలెక్కసేయకుండా నోరేసుకుని పడిపోతుంటది.. వూరి జనాలంతా  సెంద్రనోట్లోనోరెట్టానికి తెగ భయపడిపోతుంటారు.

ఎంకట్రావు, సుబ్బలచ్చిమికి రెండెళ్ళకితమే కవలాడపిల్లలుపుట్టేరు. ఆపరేషను సేయించేద్దాం అంటే ఇనకుండా... ఈ సారి వారసుడుడతాడు నీకేంతెల్దని ఎంకట్రావుమీద నిప్పులుసెరిగేసింది సెంద్ర. అమ్మ మాటకెదురుసెప్పలేని ఎంకట్రావు నోరుమూసేసుకున్నాడు. ఆడపిల్లలంటే పెళ్ళిళ్ళుజేసి.. పురుడ్లు పోసీ జీవితాంతం ఏదో సాకిరేవు సేత్తానేవుండాలని ఎంకట్రావు తెగ బాధపడిపోయేడు. ఈ సారికూడా ఆడపిల్లుడితే తనపరిస్తితేంటని బెంగెట్టేసుకున్నాడు. మంచి మంచి కాంట్రాట్టులొచ్చి సేతులో డబ్బులుకనబడినా.. పిల్లల్ని చూసినప్పుడల్లా ఆళ్ళ పెళ్ళే ఆలోచనలోకొత్తున్న ఎంకట్రావుకి మనశ్శాంతిలేకండా పోయింది. సుబ్బలచ్చిమికి నెలలునిండేకొద్దీ అదే ఆలోచనతో మతిలేనివాడైపోయేడు.

మతిలేని ఎంకట్రావు పక్కూరి మంత్రాల ఈరన్నకి డబ్బులిచ్చి పూజలుచేయింత్తున్నాడు. ఆడపిల్లుడితే పురుట్లోనే పోవాలని చేతబడులు చేత్తున్న ఈరన్న సెప్పినట్టుగా.. మంత్రించిన నిమ్మకాయలు వారానికోసారి అట్టుకొచ్చి సుబ్బలచ్చిమి పడుకునే బొంతకిందెడుతున్నాడు. సరిగ్గా పురుటినొప్పులొచ్చే టయానికి ఆ నిమ్మకాయలట్టుకొత్తే.. ఆటితో పూజలుజేసి పుట్టేది ఆడపిల్లయితే పురుట్లోనే చచ్చిపోయేలా చేత్తానని ఈరన్న చెప్పిన మాటలు ఎంకట్రావు నమ్మేడు. అలాగే చెప్పినిధంగా నిమ్మకాయలట్టుకెళ్ళి ఈరన్నకిచ్చేడు.

                                      *** *** *** *** *** ***
గవర్నమెంటు ఆసుపత్రిలో సుబ్బలచ్చిమిని జాయిను చేసింది సెంద్ర.. కొడుకొత్తాడని తెగెదురుచూసింది. తనక్కనబడ్డ వూరోళ్ళందరికీ కబురెట్టించింది. నొప్పులు తట్టుకోలేని సుబ్బలచ్చిమి సొమ్మసిల్లిపోయింది. అది చూసిన పెద్దడాట్రుగారు.. బిడ్డడ్డంతిరిగింది ఆపరేషను చెయ్యాలని చెప్పేరు. సెంద్రకి సెమటలట్టేసి కాళ్ళాడ్డంలేదు. "దీనిమొగుడింకారాలేదండే.. నాకేమో ఏంసేయాలో తెల్వటంల్లేదండే.. మీరే ఏదోటిచేసి కాపాడాలండే..", అని డాట్రగారు చేతులట్టుకుంది సెంద్ర.. కూడావొచ్చిన వూరోళ్ళంతా ఏంపర్లేదు సెంద్రా  అంతా మంచే జరుగుద్దని ధైర్యంసెప్పేరు.

 ఏం చెయ్యాలో తోచని సెంద్ర ఆ వూరి పెద్దకొండాలమ్మకి దణ్ణమెట్టుకుంది. అంతా సవ్యంగా జెరిగితే కోడ్నికోసి నైవేద్యమెట్టుకుంటాను తల్లీ అని కన్నీళ్ళెట్టుకుని ఏడుకుంది.
కాసేపటకి ఆపరేషను పూర్తిచేసి బయటకొచ్చిన డాట్రుగారు.. ఆడపిల్లపుట్టిందనీ.. తల్లిబిడ్డా క్షేమమని చెప్పేరు. "నువ్వెయ్యేళ్ళు బతుకు బాబా..", అని డాట్రుగారి కాళ్ళట్టుకుని దణ్ణాలెట్టింది సెంద్ర..

ఓవేపు మళ్ళా ఆడపిల్లేపుట్టిందని బాధగావున్నా మరోఏపు.. తల్లీబిడ్డా గండంనుండి బయటడి బతికిబట్టకట్టేరని ఆనందించింది సెంద్ర.

అంతా అయిపోయేకా ఆసుపత్రికొచ్చి ఇషయం తెలుసుకున్న ఎంకట్రావుకి నోటమాటరాలేదు. మొకంలో నెత్తుటిచుక్కలేదు. మళ్ళా ఆడపిల్లే ఎలాపుట్టిందా, మరిపుట్టినాడపిల్ల ఈరన్నచెప్పినట్టు చావలేదే అనే అలోచన్తో పిచ్చోడిలెక్కయ్యిపోయేడు ఎంకట్రావు.

పెళ్ళాం పిల్లల్తో ఇంట్లో ఎవరితోనూ మాటాడకుండా మసలటం మొదలెట్టేడు ఎంకట్రావు. ఈ పిల్లల్నాకొద్దని పెళ్ళాన్ని పుట్టింటికిపొమ్మని పట్టుపట్టేడు. అడ్డొచ్చిన సెంద్రపై సేయిచేసుకోబోయేడు.
వూర్లో బోర్డస్కూల్లో పనిచేసి రిటేరయిపోయిన ఎంకటరత్నం మాస్టారు దగ్గరకెళ్ళి ఇషయం చెప్పి..  "కాత్తమీరైనా బుద్దిచెప్పండి బాబుగారా", అని ఏడ్చింది సెంద్ర..

ఓ రోజు సైకిలుమీద పన్లోకెల్తున్నఎంకట్రావుని పిలిపించాడు ఎంకటరత్నం మాస్టారు. ఇంటరుగుమీద కూర్చోబెట్టి.. "ఒరే పిల్లలుట్టిన తరువాత ఇయ్యేంపనుల్రా..,నిన్నునమ్ముకొచ్చిన ఆ అమ్మాయి పరిస్థితేంటిరా..  ఉన్నదాంట్లో తింటా అందరూ కలిసుంటే.. పిల్లలు పెళ్ళిల్లొచ్చేటయానికి ఆ భగవంతుడే ఏదో దారిచూపిత్తాడ్రా", అని ఇవరంగా చెప్పేడు ఎంకటరత్నం మాస్టారు. ఎంకటరత్నం మాస్టారుమీదున్న గౌరవంతో ఏమీ మాట్లాడకుండా సెప్పిందంతా ఇన్నాడు ఎంకట్రావు.

సాయంత్రం పనంతా అయిపోయి ఇంటికొచ్చేఏల ఏటిగట్టుదగ్గర సైకిలాపి.. చెట్టుకింద కూర్చున్న ఎంకట్రావుకు ఎంకటరత్నం మాస్టారుచెప్పిన మాటల్లో ఒకేమాట బుర్రలో గిరగిర తిరిగింది.

"నేను రిటేరయిపోయాకా నా ఇద్దరు కొడుకులూ నాదగ్గర డబ్బెంతుందో చూసారుగానీ.. ఒక్కడైనా ఇక్కడికొచ్చి నేనెలగున్నానో చూసారా? రెక్కలొచ్చాయికదా! ఎవడిదారినవాడెగిరిపోయేర్రా.., నేనెక్కడ ఒంటరివాడినైపోతానో అని.. పెళ్ళేచేసుకోనని పట్టుబట్టింది మా అమ్మాయి, అదికాదని మనూరబ్బాయినే ఇచ్చి పెళ్ళిచేసానా.. ఇప్పుడు నాబాగోగులు చూసుకుంటూ రోజు నన్నుపలకరించిపోతుంది. పుట్టబోయే బిడ్డలు వాళ్ళకు కావాల్సిన సిరిసంపదలు కూడా వాళ్ళతోనే తీసుకొస్తారంటారురా.. నా అనుభవంతో చెబుతున్నాను ఆడపిల్లలేనిల్లు ఇల్లుకాదురా",

మేస్టారు కొడుకులు పట్నంపోయి పెద్దుజ్జోగాల్లో స్తిరపడిపోయినిషయం నిజమే. ఆళ్ళు తండ్రిదగ్గరకు రాకండా మొకాలుచాటేత్తున్నఇషయమూ నిజమే. ఆళ్ళకూతురు దగ్గరుండి చూసుకోటమూ నిజమే. ఇయన్నీ కళ్ళముందు కనిపిత్తున్న ఎంకట్రావుకి.. కొడుక్కంటే కూతురుకే పేమెక్కువంటాదేమో.. అనిపించింది. ఆరోజునుండి పిల్లల్ని పేమతో ముద్దులెట్టుకుని చంకనేసుకుని తిరక్కపోయినా..ఆళ్ళక్కావాల్సింది అట్టుకొచ్చి కలిసిమెలిసుంటా.. సంసారంనెట్టుకొత్తున్నాడు.

                                     *** *** *** *** *** ***
కాలగమనంలో.. ఎంకట్రావుమాస్టారు.. ఎంకట్రావు ఆళ్ళమ్మ సెంద్ర గాల్లోకలిసిపోయేరు. కాంట్రాట్టుల్లో బాగా సంపాయించిన ఎంకట్రావు.. ముగ్గురాడపిల్లలకీ పెళ్ళిళ్ళుచేయగలిగేడు సొంతిల్లుకట్టకోగలిగేడు.

ఓ సంక్రాంతి పండక్కి పిల్లల్నెత్తుకొచ్చేరు ముగ్గురాడపిల్లలూ, కూతుళ్ళూ.. మనవలూ మనవరాళ్ళతో నిండిపోయి మా సందడిగా తయారయ్యిందా ఇల్లు. మనవరాళ్ళు పట్టుపరికిణీలేసుకుని ఇల్లంతా తిరుగుతుంటే.. ఆ ఇంటికి కొత్తమెరుపొచ్చినట్టయ్యింది.

అది చూసిన ఎంకట్రావు తాను ఆ రోజు చేసిన తప్పే తలుచుకుని కళ్ళెంబట నీళ్ళెట్టుకున్నాడు.

"పుట్టినబిడ్డలు ఆళ్ళక్కావాల్సిన సిరిసంపదలు ఆళ్ళతోబాటే తీసుకొస్తారు..." అన్న ఎంకటరత్నం మాస్టారి మాటే చెవుల్లో మారుమోగింది.. చచ్చి ఏ లోకానున్నాడో మాస్టారుగారు.. "మహానుభావుడు.." అని దణ్నమెట్టుకున్నాడు ఎంకట్రావు.

5, జూన్ 2011, ఆదివారం

వర్షం...


ఆకాశంలోనుండి చినుకులు చిటపటమంటూ నేలపై రాలటం ఒక అద్బుతం. ఎండవేడికి కొలిమిలా కాగికాగివున్న నేలపై ఆ చినుకులు రాలి.. అప్పుడు వచ్చే మట్టివాసన ఇంకా మహాద్బుతం. పొద్దున్నుండీ ఎండవేడికి తట్టుకోలేక చలిమర గదుల్లో దాక్కుని.. బయట టీ తాగుదామని ఆఫీసునుండి బయటపడ్డ మాకు వర్షం దర్శనమిచ్చి మంచి ఊరటకలిగించింది.

ఒక్కసారిగా వర్షాన్ని చూసి బయటకొచ్చి చినుకుల్లో తడవాలనిపించలేదు.. ఆఫీసు బిల్డింగ్ కింద నిలబడి.. వెళదామా వద్దా అని ఆకాశంవైపు దొంగచూపులు చూస్తున్నప్పుడు.. మేఘంనుండి విడివడి.. గాలిలో జారుడు బల్లమీదజారినట్టు జారుకుంటూ.. నేలను తాకటానికి తహతహలాడుతూ.. వేగంగా దూసుకొస్తున్న ఓ చినుకు. అప్పటిదాకా వర్కుతో వేడెక్కిపోయివున్న నా బుర్రమీద టప్ అని పడి.. పెనంమీద పడిన నీటిబొట్టులాగా బుస్ అని శబ్దంచేస్తూ వేడికి ఆవిరైపోయింది. ఆవిరైపోయిన చినుకు.. నాబుర్రలోవేడిని ఆవిరిచేసేసింది. మెదడు చల్లబడింది.. తనువు జలదరించింది.. నరనరాల్లోకి చలి చేరి పులకరించింది.

ఆహా! ఆకాశంలోంచి నీళ్ళు.. చినుకులుగా రాలటమేమిటి. రాలిన చినుకులు మనల్ని తాకటమేమిటి.. మనసును తనువును చల్లబరచడమేమిటి.. ఇది నిజంగా అద్బుతమే.

కాసేపటికి ఏదోవంకతో మళ్ళీ వర్షంలో తడిచాను. వాతావరణం చల్లబడగానే నాలుకకు ఏదోకటి కారంకారంగా వేడివేడిగా తగిలితే కాస్తబాగున్ననిపించింది. ఆ ఊహ మనసులోకొచ్చేసరికి ఆత్మారాముడు ఆకలి కేకవేసాడు. మావూళ్ళో వర్షంవస్తే చెట్టుకింద తోపుడుబండిపై బజ్జీలేస్తున్న దుకాణం పక్కనే సైకిలు ఆపి. అప్పుడే వేడివేడిగా వేసిన మిరపకాయబజ్జీలు ఎప్పుడు వాయ దింపుతాడా.. పేపరుపైపెట్టిన విస్తరాకుమీద ఎప్పుడేస్తాడా.. పొగలుకక్కుతున్న వాటిని.. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఎప్పుడుతిందామా అని ఎదురుచూడటం గుర్తుకొచ్చింది.

కానీ ఇక్కడ మిరపకాయబజ్జీలు లేవే.. సరేలే అలావెళ్ళి వేడివేడి వడాపావ్ నే మిరపకాయబజ్జీ అనుకుని తినేద్దామని ఆ బండివైపు అడుగేసాను.. అక్కడున్న జాగాలో వేడివేడి పొగలుకక్కుతుంటే బజ్జీ గరమ్ గరమ్ గా వేస్తున్నాడేమో అనుకున్నాను. ఎండాకొండా వానాగీనా ఏదొచ్చినా ఆనందిస్తూ.. ఎప్పుడూ రడీమేడ్ గా జేబులో దొరికే సిగరెట్టుముక్కలెలిగించేసి.. పొగతో రింగులు సృష్టిస్తూ  మూసేసివున్న వడాపావ్ దుకాణంముందు కాల్చి కాల్చి.. చీల్చిచండాడేస్తున్నారు పొగరాయుళ్ళు.

అంతేలే!!, వానలో గెంతటం కప్పకానందం అయితే.. ఆ వానలో కాగితంపడవలేసి ఆడుకోవటం పిల్లలకానందం. మనకేమో వేడివేడిగా తినటం ఆనందం.  వీళ్ళకు కాల్చిబూడిదచేయటం ఆనందం. ఎవడానందం వాడిది.

ఏదొకటిలే వేడివేడిగా అని.. బాగాటోస్ట్ చేసిన సాండ్విచ్ తిని ఆనందించి.. ఆత్మారాముడ్ని సంతృప్తి పరచాల్సొచ్చింది.

చీకటిపడినా వదలలేదు వర్షం. సందెకాడొచ్చిన చుట్టం.. వర్షం త్వరగా వెళ్ళరని సామెత. అవును మరి సాయంత్రం వచ్చిన చుట్టం ఎలావెళతాడు పాపం. ఇంత రాత్రివేళేం వెళతారులేండి ఇక్కడేవుండండి అని మనమెప్పుడంటామా అని ఎదురుచూస్తుంటాడు. అలా మనం అనగానే మొహమాటపడి.. భోజనానికి కాళ్ళుకడుక్కుంటాడు.

మరి చుట్టం సంగతి సరే సరి.. వర్షం సంగతో..!!, సాయంత్రం వచ్చే వర్షం ఎందుకు త్వరగా వెళ్ళదో నాకు తెలియదుగానీ.. నిజంగా!!, సాయంత్రం కురిసిన వర్షం కాస్త జోరుగానూ హుషారుగానే కురుస్తుంది, పగటివెలుగులో కనిపించడానికి సిగ్గుపడేమో?, రాత్రి చీకటిలో దోబుచులాడటానికేమో? ఏమో.. ఏమోమరి. ఎందుకో ఆ వర్షపుజోరు.

తొమ్మిదయ్యింది.. ఇంకా వర్షం. అసలే రెయిన్ కోట్ పెట్టుకోలేదు.. ఊహించని తొలకరి జల్లుకదా!. ఎలాగా అని ఆలోచించాను. ఏదోలా లాగించేద్దాం అనిపించింది.. బండి స్టార్ట్ చేసాను. చలిగావుంది. వణుకొస్తుంది. అయినా ఆగాలనిపించలేదు. ఆఁ.. తడిచేదాకా అంతేలే.. అనిపించింది. వర్షంలో ఒక్కసారి తడిస్తే చలీవుండదూ వణుకూవుండదు. జుమ్మని బండి లాగించి వర్షంలోకి వచ్చాను. నిట్టనిలువుగా పడుతున్న చినుకులు కాస్త నాకెదురొస్తున్నట్టుగా వంపుతిరిగాయి.

ముత్యాలు గాలిలో ఎగురుతున్నట్టున్నాయి. ఆ ఎగుతున్న ముత్యాలు నన్నుముద్దాడుతున్నట్టున్నాయి. చిన్న చిన్న నీటి ముద్దలు.. అవి పెడుతున్న చల్లచల్లనీటి ముద్దులు. అందమైన ముత్యాలు.. అవిచ్చే చల్లటి ముద్దులు. ఆహా!..మరళా అద్భుతం. మహాద్బుతం.

వర్షంలో నేను వెళుతున్నప్పుడు టప్ టప్ అని చినుకుచేసే శబ్దం. ఆగినప్పుడు చెవులు హోరెత్తించేలా.. హోరున శబ్దం. రోడ్డుపైన గుంటలో ఆ చినుకుపడి డుబుక్కున నీటిలోమునిగి అది చేసే సంగీతం. ఆ సంగీతానికి అనువుగా ఆ నీరు తరంగాలుగా కదిలి చేసే నాట్యం. ఆ సంగీతాన్ని వినటానికనినా బైక్ ఇంజను కాసేపు ఆపుచేసాను. నా ముందే ఇంకో బైకొచ్చి ఆగింది. ఆ బైకు వెనకాలవున్న డేంజర్ లైటు ఆ గుంటనీటిలో కుంకుమ జల్లింది. సిగ్నల్ ఇండికేటర్ అప్పుడప్పుడూ వెలుగుతూ పసుపురంగు జల్లుతుంది. సిగ్నల్ పడ్డాకా బైకులన్నీరోడ్డుపై కుంకుమ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వెనుకకు తిరిగి చూసుకున్నాను గానీ కనబడలేదు. నా బైకూ వెనుక కుంకుమ రాస్తున్నట్టేవుంది. భలేగున్నాయి ఈ రంగులు. రాత్రిలో వర్షంతీసుకొచ్చిన రంగులు. ఇదో అద్భుతం.

అన్నీ రెండుగా.. కనిపిస్తున్నాయి. పైనున్నవీదిలైటు రోడ్డుమీదకూడా వెలుగుతుంది. ఎదురుగావస్తున్న కారుకున్న లైటు.. రోడ్డుపై ఇంకో లైటు. రెండూ మీదకి దూసుకొస్తున్నాయి. రోడ్డు అద్దంలా మెరుస్తుంది.  చెత్తాచెదారం అన్నీ మెరుస్తున్నాయి.. మురికినీళ్ళుకూడా తళతళమెరుస్తున్నాయి. ఎటుచూసినా అద్దమే. అంతా అద్దమే. అద్దంమీద బండినడుపుతుంటే జారుతుందేమో అనిపిస్తుంది. పగిలిపోతుందేమోనని అప్పుడప్పుడూ ఆగిపోతున్నాను. కానీ అన్నిబైకులూ దూసుకుపోతున్నాయి. అదిచూసి నేనూమళ్ళీ ముందుకుసాగుతున్నాను.

అద్దంపై చినుకులు.. మసకబారిన అద్దంపై చినుకులు.. ఎటుచూసినా చినుకులు. టైమెంతయ్యిందో చూద్దామంటే నా వాచ్ అద్దంపైనా చినుకులు. ఆ చినుకులతో మసకబారింది.. తుడిచి టైముచూడాలనికూడా అనిపించటంలేదు. ఎంతసేపైనా ఇలానే తడవాలనిపిస్తుంది.

9, ఏప్రిల్ 2011, శనివారం

కోణార్క్ ఎక్స్ ప్రెస్

జనప్రవాహంతో కొట్టుకుపోతుందా ఈ ఫుట్ వోవర్ బ్రిడ్జ్ అన్నట్ట్టుగా కిక్కిరిసిపోయివుంది ముంబయి దాదర్ స్టేషన్. తనువెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ నెంబరు ఐదు వైపు ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోతున్నాడు కిరణ్. ఆ జనాల మధ్యలోనే పెద్ద సంచిని.. చిన్నపిల్లాడు స్కూలుబ్యాగులా వెనుక తగిలించుకున్నట్టు వేసుకుని ముందు నడుస్తున్నాడు ఒక వ్యక్తి.  ఏం కుక్కాడో బ్యాగులోపల తెలియదుగానీ.. అది చూస్తే వాళ్ళవూరిలో ఊకలారీ గుర్తుకొచ్చింది కిరణ్ కి. అలా నడుస్తూ నడుస్తూ ఒకచోట ఆగి సంచిని దించేసి.. అందులోంచి క్షణాల్లో చిన్నపిల్లల బట్టలు, గౌన్లు గుట్టగా పోసాడు.. "హే పంద్రహ్.. పంద్రహ్", అని అరవటం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. అక్కడే ఆగి చూస్తున్న కిరణ్ కి  అతను అలా అమ్మటం కొత్తగా అనిపించలేదుకానీ.. ఎప్పుడూ కొత్తకొత్తవస్తువులు.. ఊహించని రేట్లు అతన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి... "పదిహేనురూపాయలకేమొస్తుందిరా నాయనా..", అనుకున్నాడు.. కిరణ్. అలాంటి విచిత్రాలు చాలా ఆ దాదర్ స్టేషన్లో మాత్రమే చూస్తుంటాడు. చూస్తుండగానే అక్కడ ఒక పెద్దసైజు బట్టలషాపే ఓపెన్ అయినంత సందడిలో జనాలు గూమిగూడి గుట్టంతా తిరగేసేసి నచ్చినవి కొనేస్తున్నారు.. తను ఎక్కాల్సిన ట్రైన్ కి ఇంకా అరగంట టైముండటంతో అక్కడ జరిగే వ్యాపారం అంతా పరీక్షిస్తున్నాడు కిరణ్..  సరిగ్గా ఇరవైనిముషాల్లో మొత్తం సంచి ఖాలీచేసేసి.. ఎవరి దారినవాళ్ళు వెళ్ళిపోయారు.., అబ్బో ఇరవైనిముషాల్లో చాలా చెయ్యొచ్చైతే... ఇది టైమ్లీ బిజినెస్ అన్నమాట... అనుకుంటుండగా.. అప్పుడే గట్టుపైపడిన చేపపిల్లలా వైబ్రేట్ మోడ్లో  గిలగిలాకొట్టుకుంటున్న.. ఫోనుని జేబులోంచి తీసి పీకనొక్కినట్టు ఆన్సర్ బటన్ నొక్కి  చెవిదగ్గర పెట్టుకుని "హలో.. అక్కా చెప్పు..", అన్నాడు కిరణ్.

"సరే.. అక్కా.. బాగానే నిద్రపోతాలే.. ఇవేమన్నా తెలుగుసినిమా హీరో ఆడిషన్సా.. పెళ్ళిచూపులేకదా!! అసలే మనది స్టాండర్డ్ కలర్, ఒక్కరోజు నిద్రతో తెల్లని తెలుపు ఎలావచ్చేస్తుందిలే.. అదేదో బట్టలసబ్బు ఏడ్ లోలా నేను తెల్లషర్టు.. తెల్లప్యాంటువేసుకుంటా.. నా ఒక్కడిపైనే లైటువేసి చూపించండిచాలు.. ఆ తెల్లటి గ్లో తట్టుకోలేక అమ్మాయి ఓకే అనేస్తుంది", అని.. సెటైర్ వేసి.. "సరే సరే.. నా ట్రైన్ వచ్చేసింది.. దిగాకా ఫోన్ చేస్తా.. నాన్నని స్టేషన్ కి రమ్మను", అని ఫోన్ పెట్టేసాడు కిరణ్... 

ముంబయిలో సాఫ్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న కిరణ్ ది అసలు వూరు విశాఖపట్టణం, ఇదిగో ఈవారం.., అదిగో ఆనెల్లో.. అంటూ సెలవుదొరక్క, బుక్ చేసిన టిక్కెట్లన్నీ క్యాన్సిల్ చేస్తూ..  ఎప్పట్నుండో పోస్టుపోన్ చేసుకుంటూ వచ్చిన పెళ్ళిచూపులు ఆఖరికి..  ఆగస్టుపదిహేను సోమవారం వచ్చినంత లక్కీగా.. ఏదో యుఎస్ హాలిడేతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది, మూడునెల్లముందు కోణార్క్ ఎక్స్ ప్రెస్ కి  టికెట్ బుక్ చేసుకున్నరోజు కూడా ఆ లాంగ్ వీకెండ్లో రావటం.. మేనేజరు మూడ్ బాగుండి సెలవు దొరకటంతో. ఒకటో తారీఖున జరగబోయే పెళ్ళిచూపులకని ఇంటికి బయలుదేరాడు.

"ముంబయ్ ఛెత్రపతి శివాజీ టెర్మినస్ సే భువనేశ్వర్ జానారి..... .." అంటూ మరాఠీలో చెబుతున్న ఎనౌన్స్ మెంటు వింటూ ఎస్ ఫోర్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు కిరణ్.. ఇరవైమూడోనెంబరు సైడ్ లోయర్ బెర్తు వెతుక్కుంటూ.. లగేజీ సీటుపై పడేసి సీటుపైకూలబడి.. ఊపిరిపీల్చుకున్నాడు. అక్కడ అప్పటికే.. ఎర్ర ముప్పావుప్యాంటు, నల్ల స్లీవ్ లెస్ టీషర్ట్ , ఫ్రెంచికట్టు గడ్డం.. నాపరాయిముక్కలా వున్న ఫాస్ట్ ట్రాక్ వాచ్.. చెవిలో ఐపోడ్ హెడ్ఫోన్స్ పెట్టుకుని సగం సీటు ఆక్రమించేసి కనిపించాడు ఒక సాఫ్ట్వేర్ వీరుడు.., నాది సైడప్పర్.. అన్నట్టు సైగచేసి చూపించాడు తేడాగా చూస్తున్న కిరణ్ వంకచూసి.. 

"ఒకే ఒకే..., నో ప్రోబ్లమ్..", అన్నట్టు చిరునవ్వునవ్వి... తన చేతికున్ననాపరాయిముక్క వాచీని కనబడేలా అతని మొహంమీదకుపెట్టి టైముచూస్తూ ఆ వాచీకొన్నప్పుడు ఫ్రీగా ఇచ్చిన బ్యాగ్ ని అతనివైపు తిప్పి అందులోనుండి కాస్ట్లీ నోకియా  ఫోన్.. హేడ్ఫోన్స్ తీసుకుని పాటలు వింటూ.. కాళ్ళకున్న రీబాక్ షూస్ విప్పి ఒకసారి అతనికి చూపించి సీటుకుందకు తోసేస్తూ.... తన సాఫ్ట్వేర్ వీరత్వాన్నికూడా రుచిచూపించాడు కిరణ్.

ఒకచేత్తో.. ఏడుస్తున్న పిల్లోడిని బరబరా ఈడ్చుకుంటూ, వేరేచేత్తో ట్రాలీబ్యాగును  లాక్కుపోతున్నాడొకడు.  "కాకా.. ఇదర్ నహీ.. ", అంటూ అటూ ఇటూ కలదిరిగి సీటుకోసం వెతుక్కునేవాళ్ళూ.., మల్లెపూల సెంటుకొట్టుకుని.. చెమటకంపుకొడుతూ.. గందరగోళం చేస్తూ పెళ్ళిజంటతో పాటు ఎక్కిన ఓ మరాఠీ పెళ్ళిమంద. 
తీర్ధయాత్రలకు బయలుదేరినట్టుగా తట్టాబుట్టా సర్దుకుని ఇల్లంతా భుజానేసుకున్నంత లగేజితో.., కప్పుకోవాల్సినవి మాత్రం వొదిలేసి తలంతా చీరకొంగుతో కప్పుకుని.. చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్ లో, ఆకుపచ్చలిప్స్టిక్కు.. ఆకుపచ్చబొట్టు పెట్టుకొచ్చిన రాజస్ధానీ అంటీతో పాటు వచ్చిన గుంపు.

"ఏరా.. ఇప్పుడే ఎక్కాన్రా", అంటూ జనాలమధ్యలోనుండి సీటు వెతుక్కుంటూ.. ఫోను మాట్లాడుతూ ఎక్కిన ఒక తెలుగు కుర్రోడు. "ఇదే నా బెర్త్ కావాలంటే మీరే చూడండి, వాట్ నాన్సెస్స్ హీ ఈజ్ టాకింగ్..", అంటూ అప్పుడప్పుడూ ఇంగ్లీష్.. హిందీ.. మరాఠీ.. లాంటి తనకు వచ్చిన సహస్రభాషల్నీ ప్రయోగిస్తూ.. జనాలందరినీ పోగుచేసి పెద్ద పంచాయితీ పెట్టి, తన టిక్కెట్ అందరికీ చూపిస్తున్న ఒక సీనియర్ సిటిజన్.. ఆయనకి దొరికిపోయి వాదించలేక తింగరి చూపులు చూస్తున్న ఓ కుర్రోడు... 

జారిపోతున్నట్టుండే జీన్స్ ఫ్యాంటులూ.... బయటకు కనబడేలాగా ఎర్రబోర్డర్ వున్న జాకీ అండర్ వేర్లూ.. లేని కండలు కనిపించేలా రంగుల బనియన్లువేసుకుని,  రౌడీ గెటప్పుల్లో, పనున్నా లేకపోయినా ఆ డోర్ నుంది ఈ డోర్ వైపు నడుస్తూ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి ట్రైచేస్తూ తిరిగే ఒరిస్సా కుర్రాళ్ళ బ్యాచ్..  ఇలా రకరకాల జనం తోసుకుంటూ తొక్కుకుంటూ ఎక్కుతుంటుంటే..  "హే.. గరమ్ గరమ్ వడా పావ్..", అంటూ ఒకడు.. "ఠండా కూల్ డ్రింక్స్, ఐస్క్రీమ్.. ", అంటూ ఇంకొకడు.. అదే ఇరుకులో తోసుకుపోతూ అమ్ముతున్నారు.

"ఇంకా కూలింగ్ వున్నది కావాలి..", అని మొత్తం బాటిల్స్ అన్నీ తిరగేయించి జానాలందరినీ వెళ్ళనియ్యకుండా అడ్డుగా దుకాణం పెట్టించి, ఆఖరికి ఓ రెండు థమ్సప్ బాటిల్లు కొంటున్న ఒకపెద్దాయన..!!, ఇలా ఇవ్వన్నీ ఎంటర్టైన్ మెంట్ చేస్తుంటే పాటలేం సరిపోతాయిలే అని హెడ్ఫోన్స్ తీసేసి అన్నీ గమనిస్తు ఎంజాయ్ చేస్తున్నాడు కిరణ్.

ట్రైన్ కదిలి అరగంటైనా.. ఇంకా అందరూ సర్దుకునే సందడి కొనసాగుతూనేవుంది. పెళ్ళిమందని ఇన్స్ర్టక్ట్ చేస్తూ టికెట్లు చేత్తో పట్టుకుని ఎవరు ఎక్కడ కూర్చోవాలో వాళ్ళని అక్కడ పడేస్తూ చికెన్ దుకాణం వాడు కోళ్ళను సర్దినట్టు సర్దుతున్నాడు బ్యాచ్ లో ఒక పెద్దాయన. ఆ సర్దుకున్నవాళ్ళు.. కిటికీలుతెరిచి. ఫ్యాన్లు ఆన్ చేసేసరికి కాస్త సెంటువాసన పోయి ప్రశాంతతనెలకొంది. పక్కోళ్ళ క్యాబిన్లు ఆక్రమించి కనబడ్డ సందులో లగేజీని తోసి సర్దేసిన రాజస్థానీ బ్యాచ్ కుదురుగా కూర్చోవటం వలన బోగీ కాస్త ఖాలీ ఏర్పడి బయటగాలి వీచి ఊపిరిసలిపింది. తనెక్కాల్సిన బోగీ అదికాదని ఆఖరికి ఎలాగైతే నలుగురైదుగురు సర్దిచెప్పి సీనియర్ సిటిజన్ గారిని పంపించే సరికి కాస్త గోల తగ్గి నిశ్శబ్దంగావుంది. తెలుగు కుర్రాడు అటూ ఇటూ తిరుగుతూ ఇంకా ఫోను మాట్లాడుతానే వున్నాడు, వాళ్ళవెనుకే కండలవీరులు ఆ డోరు ఈ డోరూ నడుస్తూనేవున్నారు. పెద్దాయన సగం తాగేసిన థమ్సప్ బాటిల్ ఫ్యాంటుజేబులో పెట్టుకుని అటుఇటూ బెదురుచూపులు చూస్తున్నాడు.

చేతిలో పెద్ద పేపర్లకట్టపట్టుకుని కళ్ళజోడు సర్దుకుంటూ నల్లకోటేసుకుని వచ్చాడు టి.టి.ఇ. అందరిదగ్గరా టిక్కెట్లు చూసి పిచ్చిగీతలాంటి సంతకమొకటిపెట్టి వెనుకే సతాయిస్తున్న వాళ్ళని "వస్తానయ్యా అక్కడుండు", అని చెప్పి తనకీరోజు రాబోయే లెక్కెంతో మనసులో లెక్కపెట్టుకుంటూ ముందుకు సాగిపోయాడు. 
అప్పటికే టి.టి.ఇ కి తాయిళాలు సమర్పించుకున్నవాళ్ళు వాష్ బేసిన్ వున్న చోట ఒక డోరు లాక్ చేసేసి, తెచ్చుకున్న న్యూస్ పేపర్లు బ్యాగులోనుండి తీసి కింద పరచేసుకుని.. బ్యాగుపై తలపెట్టుకుని.. పడకేసేసి కాళ్ళుచాపేసారు. అదే మంచి అదనుగా.. దొంగచూపులు చూస్తూ బాత్రూమ్లోకి దూరి... పెద్దాయన సగం ఖాలిగా వున్న థమ్సప్ బాటిల్ని ఫుల్ బాటిల్ చేసేసి.. వచ్చి సీట్లో కూర్చుని ఎదురుగా వున్న వేరేపెద్దాయన తెచ్చిన కారపుజంతికలు.. వేరుశెనగగుళ్ళూ తింటూ సిట్టింగ్ వేసేసి థమ్సప్ తాగటంమొదలుపెట్టారు.

అప్పటిదాకా ఐపోడ్ లో పాటలువింటూ తన సీట్లో కుర్చున్నవ్యక్తి  ఫోనుపట్టుకున్నాడు..  అవతల గాళ్ ఫ్రండనుకుంట.. బ్రతిమలాడుతూ ఎదో గుసగుసలాడేస్తున్నాడు. వాడు మాట్లాడేది ఏ బాషో తెలుసుకుందామని పాటలువింటున్నట్టు హెడ్ఫోన్సు పెట్టుకుని ఏక్ట్ చేస్తూ అతని మాటలువినటానికి ప్రయత్నించాడు కిరణ్. 
పావుగంట ప్రయత్నించినా ఒక్కమాటకూడా వినపడలేదు..  అంత నెమ్మదిగా మాట్లాడుతూ కాసేపు నవ్వేసుకుంటున్నాడు.. కాసేపు కన్నీళ్ళుపెట్టేసుకుంటున్నాడు.. అదేంరోగమో అర్ధంఅవలేదు కిరణ్ కి. బహుశా మనోడు ప్రేమలో పడ్డాడేమోలే మనకెందుకు అని మళ్ళీ పాటలు స్టార్ట్ చేసి వింటున్నాడు కిరణ్.

అలా ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంటుతో... అటుఇటూ కదుపుతూ.. కుదుపుతూ.. కడుపులో ఉన్న పెద్దప్రేగుల్ని.. చిన్నప్రేగుల్తో మడతపెట్టేస్తూ ముందుకుసాగిపోతొంది కోణార్క్ ఎక్స్ ప్రెస్.

పై బెర్తులో పడుకున్న కుర్రోడికి పీడకలవచ్చినట్టుగా ఉలిక్కిపడిలేచి.. జేబులోవున్న చైనా సెల్ పోన్లో పెద్దసౌండుతో పాటలు పెట్టాడు.. ఎప్పుడో హిమేష్ రెషెమ్యా బాగా బ్రతికిన రోజుల్లో పాడిన "ఏక్ బార్.. ఆజా ఆజా..".. పాట పెట్టి.. తెగమురిసిపోతున్నాడు.. జనాలంతా తననే చూస్తున్నారని తెలిసి.. ఇంకా సౌండుపెంచేస్తున్నాడు.. "ఎన్నిరోజులు ఎన్నిసార్లు వింటాంరా ఈ గోల.. అయినా సగంనిద్రలోలేచి ఇలాంటి పాటలుపెట్టుకుంటేగానీ మన:శాంతి వుండదాఏంటి..", అనుకుంటూ తలపట్టుకుని తన హెడ్ఫోన్స్ చెవిలోపలికంటూ నొక్కుకుని పాతపాటలు పెట్టుకున్నాడు కిరణ్. ఎంత కాస్ట్లీ నోకియాఫోనైనా.. నాలుగువేలకు మించని.. చైనా ఫోనుముందు దిగదుడుపేనన్నట్టు... చెవిలోకి ఎంత హెడ్ఫోన్స్ కుక్కుకున్నా.. "ఏక్ బార్.. ఆజా ఆజా.." పాట.. పాతపాటల్తో మిక్స్ అయిపోతూ ఇంకాచంఢాలంగా వినిపిస్తూనేవుంది..

ఇంతలో ఒకడు.. సంవత్సరంనుండి నిద్రకు మొహంవాచిపోయి... నాలుగురోజుల నిద్రనుండి.. అప్పుడేలేచినట్టు ఉబ్బిపోయిన మొహంతో నడుచుకుంటూ వెళుతూ.. కడుక్కుని తుడుచుకోకుండా వచ్చినచేతులతో నీళ్ళుకార్చుకుంటూ.. ఆ తడిచేతులు.. కిరణ్ మెడమీదవేసి షర్టంతా తడిపేసాడు.. సీరియస్ గా చూసిన కిరణ్ వైపు చూసి.. తనకేమీ తెలియదన్నట్టు ఒక చూపుచూసి.. తనదారిన తను వెళ్ళిపోయాడు.. 
చేసేదేమీలేక.. జేబులోవున్న కర్చీప్ తీసుకుని తుడుచుకుంటూ.. "ఛీ ఎదవ..!, వాష్ బేసిన్ దగ్గరే స్నానంచేసేసినట్టున్నాడు.., కనీసం సారీ చెప్పడంకూడా తెలియదు ఎదవకి.. ముద్దముక్కోడి దగ్గర ఒరిస్సా వాటం కనిపిస్తుంది..,. ఎక్కడెక్కడనుండొస్తారో ఏంటో ", అని చేసేదేమీలేక చిరాగ్గా మొహంపెట్టి తిట్టుకున్నాడు.

"దిగిన వెంటనే ఫోనుచేస్తాగా", అంటూ ఈ సారి ఇటువైపు నడుస్తూ ఫోన్లో మాట్లాడుతునే వున్నాడు తెలుగుకుర్రోడు..దిగినతరువాతెక్కడచేస్తావులే.. దిగేదాకా ఫోన్లోమాట్లాడేలాగే వున్నావుగా అని మనసులో అనుకున్నాడు కిరణ్. సరిగ్గా ఏడు ఆ ప్రాంతంలో ట్రైను ఫూణే స్టేషన్లో ఆగింది..., "ముంబయి మంద ఇప్పటికి సర్దుకున్నారనుకుంటే.. ఇక్కడెక్కుతార్రా దేవుడో!!",  అని పాటల సౌండు పెంచేసుకున్నాడు కిరణ్. అక్కడోక పెద్దాయన.. వాళ్ళావిడా ఎక్కారు.. చూస్తే తెలుగోళ్ళవాటమే అనిపించింది.. ఆవిడ చేతిలో వున్న కర్రలసంచిపై కుకట్ పల్లి చందనాబ్రదర్స్ అని చూసేసరికి తెలుగోళ్ళేనని కన్ఫామ్ అయ్యింది... కానీ ఆవిడ.. "ఏ ఉదర్ రఖో.. ఏ.. సీట్ కా నీచే..", అంటూ అయనకు లగేజి సర్దటంలో.. హిందిలోనే డైరెక్షన్స్ ఇస్తుంది.. ఆయన. "టీక్.. హే..", అంటూ అవిడ చెప్పింది చేస్తున్నాడు. ఈ అప్పర్ బెర్త్ మాదీ.. అంటూ పైన అప్పటికే ఒళ్ళుతెలియకుండా పడుకున్న వాడినిలేపి కర్చీప్ వేసి ఈ సీటు మాది అని రిజర్వ్ చేసినట్లు.. అక్కడ కుకట్ పల్లి కర్రలసంచిని నామకహా.. సీట్లోపెట్టి రిజర్వ్ చేసేసింది ఆవిడ. ఈ బెర్త్లో వున్న స్పాంజితో సహా సర్వహక్కులూ నావీ.. అన్నట్టుగా రైల్వే మినిష్టర్ మనవడు కూడా ఫీలవనంతగా ఫీలయ్యి సీటుపై పడి దొర్లేస్తూ.. ఆవిడ అడిగేసరికి నిద్రలోంచితేరుకుని  సీట్లోంచి దిగిన వాడు, నిద్రలో నడిచినట్టుగా నడుచుకుంటూ.. బాత్రుమ్ వైపు వెళ్ళిపోయాడు..  ఏ మూల నక్కేసాడో మళ్లీ కనపడనేలేదు..

కిరణ్ ఎదురు సీట్లోవాడు ఇంకా నవ్వూ..ఏడుపూ కలిపే గుసగుసలాడుతున్నాడు.. మళ్ళా ఆ తెలుగు కుర్రోడు ఫోనులో..  "సరేలేరా.. అంతా మనమంచికే అనుకో", అని ఎవడికో ఎదో హితబోధచేసేస్తూ ఈ సారి ఇటువైపు నడిచాడు..  వీడు ఈ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లన్నీ ఒక్కరౌండు కొట్టివస్తాడేమో అన్నట్టుగా వెళ్తున్న వాడివంక చూసాడు కిరణ్. 

ఇంటిదగ్గరనుండి తెచ్చిన రోటీ సబ్బీ వేసి రాజస్థానీ అంటీ వాళ్ళవాళ్ళందరికీ ప్లేట్లు అందిస్తుంది.. పెద్దాయన థమ్సప్ బాటిల్ మూతలోవున్న నాలుగుచుక్కలూ నాకేసి తెచ్చుకున్న చపాతిలు లాగించేస్తున్నాడు. భోజనాన్ని ప్లేట్లో అరచేయంతా ఆన్చేసి కలుపుతూ చంఢాలంగా తినటంలాంటి అరవసినిమాలు చాలా సార్లుచూశాం.. ఇలా చపాతీని కూడా అంతకంటే భయంకరంగా తినొచ్చన్నమాట అని.. ధమ్సప్ పెద్దాయన్ని చూస్తే అనిపించింది కిరణ్ కి.

పెళ్ళిమంద ఒకొక్కరూ భోజనాలు కానిచ్చేస్తూ పడకలేసేస్తున్నారు. కిరణ్ తను తెచ్చుకున్న బిర్యానీ పార్సిల్ బ్యాగులోంచి బయటకు తీయటం చూసేసరికి ముందుకూర్చున్నవాడు.. సైడప్పర్ లోకి ఎక్కేసాడు.  హమ్మయ్యా అనుకుంటూ కాళ్ళుచాపుకుని హైదరాబాదీ బిర్యానీ అని చెప్పుకునే.. కనీసం తాలింపు పెట్టని పులిహోర  టేస్ట్ కూడాలేని ముంబయి బిర్యానీ తినటంమొదలుపెట్టాడు కిరణ్.

హైద్రాబాద్ నుండి బాస్కర్ ఫోన్ చేస్తే మాట్లాడుతూనే తింటూ.. కాసేపటికి బిర్యానీ ఖాలీచేసేసాడు.. "ఈ బాస్కర్ గాడు ఫోనుచేసి మంచిపనిచేసాడు.. టేస్ట్ తెలియకుండానే బిర్యానీ ఖాలీ అయ్యింది", అని ఫోనుజేబులో పెట్టుకుని బాటిల్ వాటర్ తో చేతులు కడుక్కున్నాడు. ఇక పడకేసేద్దాం అనుకునేంతలోనే.. ఫూణే పెద్దాయన వచ్చి.. "మీరేమనుకోకపోతే కాస్త అప్పర్ బెర్త్ లో ఎడ్జస్ట్ అవుతారా ఆంటీ పైకి ఎక్కలేరు..., మోకాళ్ళనొప్పి.. అతి కష్టంమీద ట్రైన్ ఎక్కించాను.. సరిగ్గానడవలేదు కూడాను.., నాకేమో నడుంనొప్పి అంత పైకి ఎక్కితే ఎక్కువవుతుంది బాబూ..", అని రిక్వెష్ట్ చేసాడు... 

ఓహో.. ఈ బాస్కర్ గాడి ఫోను బిర్యానీతినిపించింది అనుకున్నాగానీ.. ఇంతపనీచేసిందన్నమాట.. నేను తెలుగోడినని ఈ పెద్దాయన పట్టేసాడు.. ఇప్పుడు ఇవ్వకపోతే తెలుగులో నానా బూతులూ తిడతాడు.. అదే ఏ హిందీ, ఒరియా వాడయితే మనకర్ధంకాదుకాబట్టీ నహీ అనేద్దును.., అని.. అనుకుంటూ.. "సరేలేండి తీసుకోండి..", అని ఇష్టంలేకుండానే సీటిచ్చేసి అప్పర్ బెర్త్ పై లగేజి సర్దుకుని.. నడుంవాల్చాడు కిరణ్. సీటుదొరికిన కంగార్లో మోకాళ్ళనొప్పి ఏక్టింగ్ మర్చిపోయి చంగుచంగున ఎగురుకుంటూ నాలుగంగల్లో బాత్రుమ్ వైపు పరుగుతీసింది హెద్రాబాద్ ఆంటీ.. అది గమనించిన కిరణ్.. ఇచ్చేసాకా ఏం చేస్తాం అనుకుని తలసీటుకేసి నాలుగుసార్లు కొట్టుకున్నాడు.

పక్క క్యాబిన్లో ఒక అంకుల్ వెనుకే నడిచి వస్తున్న ఒకమ్మాయిని చూస్తూ.. "ఆహా.. నేనురేపు పెళ్ళిచూపుల్లో చూడబోయే అమ్మాయి ఇలావుంటేచాలు.., పంపించిన ఫొటోలో ఫొటోషాప్ ఎఫెక్టులు ఏమీ ఇవ్వకపోతే.. ఇలానేవుండొచ్చేమోలే..., ఏమో! కళ్ళతో చూస్తేనేగానీ ఏదీనమ్మలేం..అంతా వర్చువల్ మాయ..", అని అనుకుంటూ పెదవివిరిచాడు కిరణ్.

"బాబూ మా అమ్మాయికి రేపు ఎగ్జామ్ వుంది నిద్రసరిపోకపోతే సరిగ్గారాయలేదు..., వెయిటింగ్ లిస్ట్ కూడా కన్ఫామ్ అవలేదు.. మీ సీటిస్తే హైదరాబాద్ వరకూ.. ఎడ్జస్ట్ అవుతుంది..", అని.. అమ్మాయితో వచ్చిన అంకుల్.. కిందవున్న కుర్రాడిని హిందీలో అడుగుతున్నాడు.., ఓరినాయనో.. ఈయన అసలు సీటేలేకుండా..మొత్తం సీటే దారాదత్తంచేసేయ్యమని అడగటానికొచ్చాడా.. బాబోయ్.. హైద్రాబాద్ అంటున్నాడు.. తెలుగోచ్చేవుంటుంది.. నేనిప్పుడు వీడికికూడా వెధవలా దొరికినా దొరుకుతాను అని.. బలవంతంగా కళ్ళుమూసేసుకుని నిద్రనటించాడు.. కిరణ్. అలానటనలోనే నిద్రలోకిజారుకున్నాడు.
                                                         ************
"ఛాయే.. గరమ్..", అంటూ టీ అమ్మేవాడు పెట్టిన గావుకేకకి కళ్ళునలుపుకుంటూ లేచాడు కిరణ్. వాచ్లో టైముచూస్తే ఎనిమిదయ్యింది.. ఏస్టేషనయ్యుటుందబ్బా అని ఆలోచిస్తూ కిందకు చూస్తుండగా.. ఇడ్లీవడా.. అంటూ ఒకడు అమ్ముకుంటూ పోతున్నాడు.. వాడిచేతిలోవున్న చెట్నీని కాస్త పరిక్షగా చూస్తే.. చిక్కటి నీళ్ళల్లో చెట్నీ వేసినట్టుగా... వాసన కాస్త ఏవరేజిగా అనిపించి.. చెట్నీలో ప్యూర్ హైద్రాబాదీ వాటం కనబడేసరికి.. సికింద్రాబాద్ వచ్చినట్టుంది.. ఏదన్నా తినాలి ఆకలేస్తుందని కిందకు దిగి.. రిబాక్ షూస్ వేసుకుని వాష్ బేషిన్ దగ్గరకు నడిచాడు...

అటు ఇటూ ఎటుచూసినా చెత్త..  ఆ చెత్తను కెలుకుతున్నకుక్కలూ తప్ప స్టేషన్ కనబడనేలేదు.. సిగ్నల్ కోసం ఆపినట్టున్నాడులే అనుకుని.. వాష్ బేషిన్ దగ్గర చూస్తే, పెద్దపులి బొమ్మవున్న తెల్లటీచొక్కా వేసుకుని.. పావుగంటయినా లేవకుండా బేషిన్లో  మొత్తం మొహం పెట్టేసి ఎదో కడుగుతున్నాడు ఒక కుర్రోడు.  బయటకు ట్యాప్ విప్పిన సౌండుతప్ప ఎమీ వినపడటంలేదు కనపడటంలేదు.. అలా ఒక అరగంటఅయ్యాకా "నోవాటర్..", అని కిరణ్ వైపు తిరిగి పెదవివిరిచాడు... అతని వెనుక టీచొక్కాపై పెద్దఅక్షరాలతో రాసున్న "సేవ్ టైగర్" అన్నది చదివి... మనసులో.. ముందు సేవ్ వాటర్.. తరువాత టైగర్.. అని మోహాంలో అష్టవంకర్లతో ఎక్స్పెషన్ పలికించి.. అతనివంక.. చూసాడు కిరణ్, ఆ ఎక్స్పెషన్లో వున్న తిట్లన్నీ అర్ధంచేసుకుని.. ఏమీ మాట్లాడకుండా తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు.

ఎలాగైతే పక్కబోగీలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ద్రాక్షతోటలకు పెట్టిన పైపునుండి వస్తున్నట్టుగా వస్తున్న నీటిబొట్టులన్నీపోగుచేసి మెహం కడుక్కుని అరగంట తర్వాత బయటపడ్డాడు. సెల్ ఫోన్ చూస్తే బేటరీ చార్చ్ అయిపోయేలావుంది.. ఇక్కడో సెల్ చార్జర్ పెట్టుకునే ప్లగ్ ఇస్తాడే ఏదబ్బా అని వెతగ్గా ఆ బోగీకి లేదు కానీ వేరే బోగీలో అది వున్న చోట తీర్ధంలో బెల్లంజీళ్ళదుకాణం దగ్గర మూగినట్టుగా మూగి సెల్ చార్జింగ్ చేసేసుకుంటున్నారు. ఫ్రీగా వస్తే ఏదివదలరన్నమాట జనాలు అనిపించింది కిరణ్ కి. ఏం చేస్తాం, ఫోన్ డెడ్ అయిపోతే కష్టం అని అనుకుంటూ అక్కడికివెళ్ళి వెయిట్ చేసాడు. 

ఎవడో మల్టీపిన్ ప్లగ్ సాకెట్ తీసుకొచ్చినట్టున్నాడు. ఒకేదాన్లో ఐదు చార్జర్లు పెట్టేసి చార్చింగ్ ఒకపక్క జరుగుతుంది. ఒకడు చార్జింగ్ పెడుతూనే ఫోన్ మాట్లాడుకుంటూ నవ్వేసుకుంటున్నాడు, అన్నీ వెతగ్గా ఒక చార్జర్ కి తోకలాగా వైరు వుంది కానీ.. దానికి వేళాడుతూ ఫోను కనబడలేకపోయేసరికి ఆశ్చర్యంవేసింది కిరణ్ కి.. చార్జరుకున్న వైరును కళ్ళతో వెంబండించి చూడగా తెలిసిందేంటంటే.. ఎవడో మహానుభావుడు నార్మల్ చార్జర్ కి ఒక వైరుముక్క అతికి ఎక్స్టెండ్ చేసుకుని ఫోను చేత్తో పట్టుకుని బాత్రూంలోకి పట్టుకువెళ్ళి డోరు వేసేసుకున్నాడని. ఆహా.. ఏమి ఐడియారా.. ఇలాంటి చావు తెలివితేటలు ఎలా వస్తాయో.. అది కూడా ఒక కళే.. అనుకున్నాడు కిరణ్.

ఆఖరికి చాలాసేపటికి చార్జింగ్ చేసుకునే అదృష్టం దొరికింది.. దొరికినది కాస్తా.. చార్జింగ్ పెట్టింది మొదలు.. ఎప్పుడవుతుంది మీది అని ఒకడు అడిగి అడిగి పీక్కుతినటంతో కాసేపుపెట్టుకుని వాడి పోరుపడలేక ఇచ్చేసి, ఇక్కడకొట్టేసిన పవరుతో ఇంట్లో ఎమన్నా పవర్ ప్రాజెక్టులు కడతారా లేక ఏ రాష్ట్రానికైనా అమ్ముకుంటారా.. అనుకుని  తలకొట్టుకుంటూ తనసీటువైపు బయలుదేరాడు కిరణ్.

రకరకాల జనాలు వారి చేష్టలూ చూస్తుంటే.. వికారమొచ్చింది..., కిందకూర్చునే మూడ్ లేక.. మరళా పైబెర్తు ఎక్కేసి కర్చీఫ్ తో మొహం కప్పేసుకుని పడుకున్నాడు కిరణ్. "అవు కెత్తె సమయో లగెవూ బుబనేస్వర్ పహుంచి బకు", అని ఎవడో ఒరియాలో పూణేలో ఎక్కిన తెలుగాయన్ని అడిగాడు.. తెలుగాయన హిందీలో చెప్పాడేదో.. అది అర్ధంగాకా ఏంటీ అని అడుగుతున్నాడు ఒరియావాడు.. బాగానేవుందిరా బాబూ మీ భాషల గోల అనుకుని.. చెవిలోకి హెడ్ఫోన్స్ పెట్టుకుని గుర్రుపెట్టి నిద్రపోయాడు..
                                               ***************
ట్రైన్లోవున్నామన్న విషయమే మర్చిపోయేంత మొద్దునిద్రనుండి లేచాడు కిరణ్. కిందకు తొంగి చూస్తే సీట్లలో ఎవరూలేరు.. ఇదేంటి అంతా ఎక్కడకుపోయారు.. ఏస్టేషనైవుంటుంది.. అనుకుని కిందకు దిగి చూస్తే ఫ్లాట్ఫాం కూడా దగ్గరలో కనబడలేదు.. అటు ఇటూ రైళ్ళు ఆగివున్నాయి.. మధ్యలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఆపాడు.. టైము చూస్తే  ఆరయ్యింది.. అలా ముందుకు నడుచుకుంటూ ఫ్లాట్ఫాం వైపు నడిచాడు కిరణ్.. అక్కడ ఎదురుగా వున్న స్టేషన్ బోర్డు చూసి.. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. ఇదేంటి ఇది భువనేశ్వర్ స్టేషనా?. అప్పుడే ఎలా వచ్చేసాను ఇక్కడికి.. మరి నిన్న వాచ్ చూసుకుంటే ముప్పయొకటో తారీఖూకదా చూపించింది.. అవును కదా!. మరి ఇంత త్వరగా ఎలాగబ్బా.. అని బుర్రగోక్కున్నాడు.. అయినా ఏప్రిల్ నెలలో ముప్పయొకటో తారీఖేంటీ... నా వాచ్ నన్నే ఫూల్ ని చేసిందే.. అని ట్యూబ్ లైట్లా వెలిగిన బుర్రకి అప్పటికి అర్ధమయ్యింది.. నిజం తెలుసుకున్న కిరణ్ అక్కడే వున్న బెంచి పైన కూలబడిపోయాడు. 

సెల్ ఫోన్ మ్రోగింది.. తీసిచూసేసరికి.. అక్కనుండి ఫోన్.. ఏమని చెప్పాలో అర్ధంకాలేదు కిరణ్ కి. మర్చిపోయి భువనేశ్వర్ వెళ్ళిపోయానని చెబితే పరవుపోదూ.. అమ్మాయి తరపువాళ్ళకి ఇంత తింగరోడా కుర్రోడు అనుకోరూ.. బాబోయ్..,ఇప్పుడెలా కవర్ చెయ్యాలి.." అని ఆలోచనలో పడ్డాడు కిరణ్.. ఇంకా మ్రోగతూనే ఫోన్ ఆన్సర్ బటన్ నొక్కి.. తటపటాయించకుండా.. "హలో అక్కా చెప్పు", అన్నాడు కిరణ్. 

"లేదక్కా.. బయలుదేరలేదు.. మరళా వర్కుందని మా మేనేజరు ఫోన్ చెస్తే కళ్యాణ్ స్టేషన్లోనే దిగిపోయి వెనక్కువెళ్ళిపోయాను.. నిన్నంతా ఆఫీసులో బిజీ బిజీగావుండి మీకు ఫోన్ చెయ్యలేకపోయాను.. మళ్ళీ ఎప్పుడొచ్చేది ఫోన్ చేసి చెప్తాలే", అని దిగాలుగా మొహంపెట్టి.. ఫోన్ కట్ చేసాడు కిరణ్. "ఛ.., కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎంతపని చేసింది..", అని తలపట్టుకన్నాడు.. "ఏంచేస్తాం మళ్ళా చచ్చినట్టు.. తిరుగుప్రయాణమే..  ఇక్కన్నుండి మళ్ళీముంబయి పోవాలి.. అంటే మళ్ళీ కోణార్క్ ఎక్స్ ప్రెస్సే గతి.. ఓరిదేవుడో... ", అని నీరసంగా ఫ్లాట్ఫామ్ నుండి ఎంక్వైరీ కౌంటర్ వైపు నడిచాడు కిరణ్.


Related Posts Plugin for WordPress, Blogger...