18, అక్టోబర్ 2011, మంగళవారం

ఇదో డిఫరెంట్ వెర్షనూ!!


మీరు బ్యాచిలరా?, అవును మరి ఈ మధ్య కొత్తగా పరిచయమైనవారిని ఇలానే అడగాల్సివస్తుంది. అవతలివాడు పెళ్ళి కానివాడైతే అవునండీ.. అంటాడు.., పెళ్ళయివుంటే సంతూర్ ఏడ్ లో మమ్మీ.. డైలాగ్ లాగా. ఒక్కసారి గాల్లోకి ఎగిరి.. ఆనందపడతాడు.. అసలే ఈ మధ్య అమ్మాయిల కొరత ఎక్కువయ్యి.. బ్రహ్మచారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. బ్యాచిలర్ ని.. మీకు పెళ్ళయ్యిందా అన్నామనుకోండి. వాడు ఆల్రెడీ అదే ప్రశ్న రోజుకు వందసార్లు వినీ వినీ మంటమీదుంటాడేమో.. హా!.. నలుగురు భార్యలూ.. పన్నెండు మంది సంతానం అని చిరాగ్గా సమాధానం చెప్పినా చెబుతాడని భయపడి ఇలా అడగాల్సొస్తుందన్నమాట. ఇదో డిఫరెంట్ వెర్షనూ!.

ఇలా మీరు బ్యాచిలరా! అనే కొత్త వెర్షను ఎప్పటినుండి మొదలుపెట్టాల్సొచ్చిందంటే... ఒకసారి మా కొలీగ్స్ అంతా మాట్లాడుకుంటున్నాం. అప్పుడే కొత్తగా కంపెనీలో చేరాం కాబట్టి ఒకరిగురించి ఒకరికి తెలియదు. అంతా ఒకచోట చేరి మాట్లాడుకుంటుంటే నేను మధ్యలో వెళ్ళాను.  మా టీమ్ లో బొద్దుగా లావుగా.. బట్టతలతో ఉన్నతను ఒకడున్నాడు.. అందరూ తమతమ పిల్లలగురించి పెళ్ళిగురించి మాట్లాడుకుంటుండగా.. నా బుర్రలో ఏదో మెరుపులా ఒక ప్రశ్న వచ్చి బొద్దుగా వున్నాయన్ని అడిగేసా.. మీకెంత మంది పిల్లలు అని. అతని మొహం ఎర్రగా అయిపోయింది.. నా వంక అదోలా చూసి ఇంకా నాకు పెళ్ళే కాలేదు అన్నాడు.. సారీ సారీ.. సారీ.. సా...రీ.. అని నోటికొచ్చిన సారీలు చెప్పేసా.. పాపం ఫీలయ్యాడతను. నేను అడిగినందుకు కాదు.. అన్ని సార్లు సారీ చెప్పినందుకు.
నాకేం తెలుసు.. అందరూ పిల్లలగురించి అడుగుతుంటే.. ఆయన పెద్దాయనలా కనిపించాడు.. మరీ పెద్దాయన్ని పెళ్ళాయ్యిందా అని ఏం అడుగుతాం.. అని పిల్లలెంతమంది అన్నా..

ఆ తరువాతనుండి తెలిసొచ్చింది.. ముసలాడు ఎంగ్ గా కనిపించటానికి ఇష్టపడతాడు.. ఎంగ్ గా వున్న కుర్రాడు ముసలాడిలా అవ్వాలని కోరుకోడు.. కదా అని!, కాబట్టి పైనుండి నరుక్కురావాలన్నమాట. అంటే ఏంలేదు.. సమయానికి తగ్గట్టుగా వెర్షను మార్చటమే.

మొన్నొకాయన కొత్తగా ఇలాంటిదే కొత్త వెర్షన్ ప్రయోగం నా మీద చేసాడు.  మా కొలీగ్ వాళ్ళ స్నేహితుడొకడు నన్ను పరిచయం చేసుకుంటూ "మరాఠీ ఆతీహే", అని అడిగాడు.. సరిగ్గా హిందీలో స్త్రీలింగం పుంలింగం కి తేడాతెలియని నాకు మరాఠీ ఎక్కడొస్తుంది.. అందుకే  "నహీ" అన్నాను. "నహీ ఆతీ".. అని బతికున్నోడికి ఆబ్దికం మాసికం పెట్టినట్టు.. పెద్ద ఆశ్చర్యార్దకం పెట్టాడు. అయితే వీడు నాన్ మరాఠీ అన్నమాట అని మనసులో అనుకున్నాడు. అసలు అతడు తెలుసుకోవాల్సింది అదే విషయం.. నేను మహరాష్ట్రావాడినా కాదా అని. దానికి డిఫెంట్ వెర్షన్ తో నన్ను కొట్టాడన్నమాట. అప్పటికి నా పేరు "శ్రీనివాస్"  అని చెప్పలేదులేండి చెప్పుంటే ఆ వెర్షన్ ప్రయోగం నాపై చేయకుండానే తెలిసిపోయేది సౌత్ నుండి పారిపోయి వచ్చిన శరణార్ది అని.

ఇంకొక విషయం ఏంటంటే.. మహారాష్ట్రాలో సౌత్ ఇండియన్ అంటే డిఫరెంట్ వెర్షనే వుందందడోయ్.. మలయాళీ/మల్లు.. లేదా మదరాసీ/తమిళా అని అడుగుతారు కానీ ఆంధ్రా వాడిని అందులో చేర్చరు.. మనం ఆంధ్రా అని చెప్పేలోపలే.. డోస(దోసను అలాగే పిలుస్తారు) సాంబార్, రజనీకాంత్ ఈ మధ్య 2జి రాజా, పద్మనాభస్వామీ... ఇవన్నీ టీ.వీ సీరియల్ లాగా ఎదుటివాడికి  గుర్తొచ్చేసి ఏదేదో చెప్పేస్తుంటాడు అడిగేస్తుంటాడు. అదికాదు వెర్షనూ.. మాది ఆంధ్రా అనగానే.. కేసీఆర్, చిరంజీవి, రాజశేఖర్రెడ్డి.. చంద్రబాబునైడూ(అలాగే పిలుస్తారు.. :-) ), తెలంగాణా రైల్ రోఖో.. ఇలా ఆరోజు న్యూసు బట్టి ప్రముఖులంతా.. ప్రముఖ సంఘటనలతో సహా.. గుర్తొచ్చేస్తారు. అలాగే మరాఠీ.. అంటే.. నాకు మనవైపు 'మాయల-మరాఠీ' అనే పదం గుర్తుకొస్తుందిలేండి. ఎవడి వెర్షను వాడిది మరీ!

ఈ వెర్షనుకు ఇంకా చాలా అర్ధాలు.. అపార్ధాలూ ఉన్నాయండోయ్. ఇప్పుడు వెర్షన్లో కొత్తకోణం గురించి మాట్లాడుకుందాం. మచ్చుకు ఒక మచ్చుతునక తీసుకుంటే.. తెలుగు సినిమా వెర్షను. ఇది చాలాఁ డిఫరెంట్ వెర్షనే.
సినిమా మొదలవగానే ఓఁ.. తెగ ప్రేమగా రాసుకు పూసుకుని రెండు క్యారెక్టర్లు తిరిగేస్తున్నాయంటే.. ఇంకేముంది.. సెంకడాఫ్ లో వాళ్ళిద్దరూ రక్తాలొచ్చేలాగా.. బట్టలుచించుకుని డిష్క్షూ డిష్షూ.. కొట్టుకుంటారని అర్ధం.

భర్త ఆఫీసునుండి చేతిలో చిన్న ఎర్రబ్రీఫ్ కేసుతో.., మెడకు కట్టుకున్న టైని ష్.. అంటూ లూజుచేసుకుంటూ.. ఇంటికొస్తాడు. ఇంటిలో భార్య ఒక మూలకూర్చుని స్వెటర్ అల్లేస్తుంటుంది.. అంతే ఏముంది.. బుల్లి క్యారెక్టర్ రాబోతున్నాడని హీరోకి అర్ధం అయిపోతుంది..

ఇదే సీనుకు డిఫరెంట్ వెర్షన్ ఏంటంటే.. అమ్మాయి మాట్లాడుతున్నదల్లా.. ఒక్కసారిగా పరుగెత్తుకెళ్ళి.. సింక్ లో రెండు ఆమ్లెట్లు వేసేస్తుంది.. తరువాతి సీన్లో డాక్టరొచ్చి చెయ్యి నాడి పట్టుకుని మీరు తాతకాబోతున్నారని ఇంటి పెద్దాయన్ని చూసి.. చెప్పేస్తాడు.. అప్పటి వరకూ కెమేరా వెనుకనుండి సీనంతా చూస్తున్న హీరో.. ఎగిరి గంతేసి.. వెంటనే హీరోయిన్ని ఎత్తుకుని.. గిరగిరా మూడు నాలుగు రౌండులు తిప్పేస్తాడు. ఆ తర్వాత.. అయ్యో మర్చే పోయాను.. నువ్వసలే ఒట్టి మనిషివికాదు.. ఆగు..  ఈ క్షణం నుండి నీ పనంతా నేనే చేస్తా అని.. కిచెన్లోకి వెళతాడు..అక్కడో పాట.

అంతేనా!... అంటారా.. వీలయితే చిన్న డ్యూయెట్.. కుదిరితే ప్యామిలో సాంగ్.. ఫ్యామిలో సాంగ్ లో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే.. కుటుంబం అంతా పౌర్ణమి రోజు దీపావళి టపాసులు కాల్చేస్తుంటారు.

ఇక చెప్పుకోదగ్గది.. హీరోగారి వాయిస్..
ఎక్కడో కొండలు అవతలవున్నవాడిని కూడా మన హీరో తన వాయిస్ తో మాట్లాడేస్తుంటాడు..., వెనుక టేప్ రికార్డర్ లో పాట ప్లే చేసేస్తుంటె.. అబ్బా హీరో గొంతు అచ్చం మన బాలసుబ్రహ్మణ్యమే అని తెగ ఫీలైపోతుంటుంది హీరోయిన్.., చెట్టుపై కూర్చుని పాటపాడేస్తుంటె.. హీరోయిన్ పిచ్చిదానిలా కెమేరాను చూడకుండా వెతికేసుకుంటుంది.. ఏంటో ఈ వెర్షన్లు.. మరి.

మారువేషం వెయ్యటమంటే.. బుగ్గమీద చిన్న ఉలిపిరికాయలాగా పెట్టుకోవటం.. పెద్దపెద్ద మీసాలు అంటించుకోవటం.. ష్...

ఇలాంటివే ఇంకొన్ని.
హీరోని హత్య చెయ్యాలని విలన్లు ప్లాన్ చేస్తారు.. తరువాతి సీన్లో ఒక ఎర్రలారీ సెంటర్లో రడీగా కాసుకుని ఉంటుంది.. హీరో దాని ముందుకు రాగానే.. డండండం.. అంటూ మీదకొచ్చేస్తుంది.. హీరో రోడ్డుపట్టుకునే లారీ ముందు పరుగెత్తుతాడు కానీ.. రోడ్డు మార్చిన్ దిగి పారిపోడు.. ఎందుకంటే లారీ మార్జిన్ దిగి రాలేదు కదా..!

ఐ.సి.యు లో పడుకోబెట్టిన పేషెంట్ క్యారెక్టరు కి పేమెంట్ ఇచ్చి పంపించేయాలని డైరెక్టరుకి అనిపించిందనుకోండి.. లైటు ఆరిపోతుంది.. డాక్టర్.. దిగాలుగా వస్తాడు.. కళ్ళజోడు తీస్తాడు.. ఐ.యామ్ వెరీ సారీ.. మేం చాలా ప్రయత్నించాం అంటాడు.

ఇక ఫ్యాక్షన్ సినిమాలో ఫస్టాఫ్ సెంకడాఫ్ అని ఆపులేకుండా కత్తులతో కసకసలాడించేసిన హీరో.. ఆఖరిసీన్లో చంపడానికో చావటానికో అయితే పుట్టడం ఎందుకంటాడు.. వెనుకున్నవాళ్ళందరినీ కత్తులు కిందపడేయమంటాడు.. ఏం చేస్తారు.. నోర్లు వదిలేసి.. కత్తులు జారవిడుస్తారు.

ఎక్కడపడితే అక్కడ ఆకాశంలో రాబందులు కీ కీ కీ అని తిరిగేస్తున్నాయనుకోండి.. అక్కడ  హీరో ఇంకొక రెండు శవాలు లేపుతాడని అర్ధం అన్నమాట..

హీరోని ఎలాగైనా అరెస్టు చేసి తీరాలని నిర్ణయించుకున్న పోలీసు అధికారి.. హీరో ఎదురుపడగానే.. స్లోమోషన్లో దణ్ణం పెట్టాడనుకోండి.. బయటకెళ్ళి మనం సమోసాలు.. పాప్ కార్న్ ప్యాకెట్టు తెచ్చుకోవాలని అర్ధం.. ఎందుకంటే.. చెక్రం తిప్పకపోయినా అక్కడ పేద్ద ప్లాష్ బ్యాక్ ఉంటుంది మరి.

సుమోలు.. టవేరాలు.. డబ్ అని హీరో వెనుక పేలిపోయి.. హీరోగారి ఫేవరెట్టు గొడ్డలికత్తి రక్తంతో చీకిపోయి కనిపించిందనుకోండి.... మనం సైకిల్ టికెట్టో.. లేక కారు పార్కింగ్ తిక్కెట్టో జేబులో వెతుక్కోవాలని అర్ధం అన్న మాట.
ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ అధ్బుతమైన వెర్షన్లే.

ఇక సాఫ్వేర్లో తీసుకుంటే ఈ వెర్షన్ కి వెర్షనే వేరు. ముందుగా మన సాఫ్వేర్ ఇద్దరు ముగ్గురు బక్రాలు కొంటారన్నమాట.. కొన్నాకా.. వాటిని బాగా వాడాకా.. అందులో వున్న తప్పులు పట్టుకుని.. ఏంటిదని బండబూతులు తిడితే.. వాటిని సరిచేసి.. న్వూ  వెర్షన్ 2.0 అని రిలీజ్ చేసి.. ఇదిగో.. చూడు.. చాలా సరికొత్త విషయాలు పొందుపరచాం.. సరికొత్త డిజైన్ కూడా చేసాం.. అని ఇంకో రెండు డాలర్లు నొక్కుతారన్న మాట. కొన్నాకా తెలుస్తుంది.. అందులో సరికొత్త లోపాలున్నాయని.. అదే మరి కొత్తవెర్షన్ అంటే.

ఇక్కడ కొన్ని ఆఫీసు వెర్షన్లు.
మేనేజరు నుండి.. ఏక్ష్సెలెంట్.. డ్యూడ్ అని మెయిలొచ్చిందంటే.. కింద లైనులో ఖచ్చితంగా కొత్త పని ఇస్తున్నాడనీ.. తన ఎలకలు పట్టిన ఎక్పీరియన్స్ ఉపయోగించి ఒక బోను కొత్తగా పెట్టాడనీ అర్ధం అన్నమాట.
ఎప్రైజల్ మీటింగ్లో కంపెనీ లాసులో వుందన్న మాటతో మొదలుపెట్టాడంటే.. ఈసారి కూడా మనకొచ్చేది మళ్ళీ ఆ ముష్టి మూడు శాతమే నని చెప్పకనే చెప్పే.. చెవిలో పెట్టకనే పెట్టే పువ్వన్నమాట.

ఎక్కడో సుదూరంగా కూర్చునే తలమాసినోడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి.. హాయ్.. అన్నాడంటే. బుడబుక్కల డౌటు వెర్షనేదే మొదలుపెడతాడనీ అర్ధం...

ఎప్పుడూ మేనేజరుకి ఎదురుపడని మనం.. ఎదురుగా వెళ్ళి పలకరించామంటే.. లీవుకోసమో. బోనస్ కోసమో.. కొత్తవెర్షన్ డైలాగులు రాసుకొచ్చామని మేనేజరుకు అర్ధం అవుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టపాకీ ఎన్నో వెర్షన్లు కావాలి...
కంగారుపడకండి.. అలాంటివేవీ లేవులేండి. :-)

14 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఆ డైలాగ్ బాక్స్‌ని VBతో డిజైన్ చేసి స్క్రీన్‌షాట్ తీశారా?

అజ్ఞాత చెప్పారు...

మీరెంత లక్కీ అండీ బుల్రాజుగారూ. ఈ పోస్టుకి ఇంక మా వ్యాఖ్యలు అక్కరలేదు .( ఇందులోనూ సెకండ్ వెర్షన్ వుంది )

అజ్ఞాత చెప్పారు...

తొందరలో ఓ సినేమా కి దర్శకత్వం చేసేయకూడదూ ? ఇప్పుడున్నవాళ్ళకంటే చాలా నయం !!

రాజ్ కుమార్ చెప్పారు...

nice post :)

కృష్ణప్రియ చెప్పారు...

చాలా సరదాగా బాగుంది :)

..nagarjuna.. చెప్పారు...

గత పదేళ్ల తెలుగు సినిమా స్టోరీలను గుంపగత్తుగా చెప్పేశారు :)

రసజ్ఞ చెప్పారు...

ఇన్నాళ్ళూ మీ బ్లాగు ఎలా మిస్ అయ్యానబ్బా? ఎంత బాగుందండీ బాగా రాశారు! కుటుంబం అంతా పౌర్ణమి రోజు దీపావళి టపాసులు కాల్చేస్తుంటారు. హహహ కార్తీక పౌర్ణమి ఏమో అండి! తమిళంలో ఒక సినిమా ఉంది కేవలం తమిళ్ సినిమాలలో తీసిన ఇలాంటి వెర్షన్ల మీద అందులో నాకు బాగా నచ్చినది ఏమిటంటే, హీరో గారిని డబ్బు సంపాదించి తీసుకుని రమ్మంటారు హీరోయీన్ వల్ల నాన్నగారు. ఆయన గుక్కెడు టీ తాగుతుండగా హీరో గారు పేపర్లు, పాల పాకెట్లు వేసి ఆ ఊరిని మొత్తం కొనేసి ఈయన టీ గ్లాసు కింద పెట్టేలోపు ఊరిలో ప్రతీదీ హీరో పేరు మీదే ఉంటుంది!

శ్రీనివాసరాజు చెప్పారు...

@ప్రవీణ్ గారూ.
స్క్రీన్ షాట్ ని PSలో ఎడిట్ చెశానండి.

@లలితగారూ.
మీరంతా కామెంటకపోతే నేనెలా లక్కీ అవుతానండీ.

@బాబాయ్ గారూ
నిర్మాతలుంటే కాస్త చెప్పండి బాబూ..

@వేణూరాం గారూ.
సంతోషమండీ.

@కృష్ణప్రియ గారు
నచ్చినందుకు సంతోషం :)

@నాగార్జున గారు
;-) తెలుగుసినిమా వీరాభిమానినండోయ్.. అందుకే అలా.

@రసజ్ఞ గారు
అవునండీ ఇన్నాళ్ళూ ఎలా మిస్సయ్యారు చెప్పండి.. ఇది చాలా అన్యాయం కదూ.
పాట దీపావళిమీదే వుంటుందండీ అదే కదా స్పెషలెఫెక్టు.
మీ తమిళవెర్షనూ బాగానేవుందండోయ్..

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ మీరు కేవలం రచయితేనా?
ఇంకేదైనా వెర్షన్ ఉందా?
(ఈ టపా వెనక అర్థమేంటబ్బా?)

శ్రీనివాసరాజు చెప్పారు...

@బోనగిరి గారు
ఒక్క రచనలే కాదండీ చాలా వెర్షన్లున్నాయి. :)
వినే ఓపికవుంటే చెబుతా వినండి.
కోడింగు రాని బ్రహ్మీనీ... టీమే లేని టీమ్ లీడ్ ని.. క్షణం తీరికలేని సాఫ్వ్టేర్ బడుగు జీవిని.. జీతం చాలని ఉద్యోగిని.. పాటలు రాయటం రాని లిరిసిస్ట్ ని.. పాడలేని గొంతుని.. మీటలేని వీణని.. చిల్లులేని ప్లూటుని.. ఎదగలేని మెదడుని.. ఏళ్ళొచ్చిన పెద్దోడ్ని.. డ్రైవింగు రాని డ్రైవర్ ని.. ఎంతో సాధించానని తెగ ఫీలయ్యే ఒక సగటు జీవిని.. కానీ ఏమీ సాధించలేదని తెలుసుకోలేని తోటి బ్లాగర్ని..
నా ఇల్లు, నా ఒళ్ళు, నా పిల్లలూ అని గర్వపడే దేశభక్తుణ్ణి..

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.. ఈ టపాకి అసలు వెర్షనేంటంటే.. పిచ్చిగాఆలోచించే పిచ్చోణ్ణి. వెఱ్రి చూపులు చూసే వెఱ్ఱోణ్ణి. :-)

కొత్త పాళీ చెప్పారు...

మధ్యలో సినిమా వెర్షన్లు పెద్దగా నప్పలేదుగానీ మొత్తానికి మీ వెర్షను బాగుంది - డిఫరెంట్‌గా

అజ్ఞాత చెప్పారు...

Hilarious. There is absolute ease in your comedy. Congrats!

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్త పాళీ గారు
గేదెను, ఆవును ఒకటే రాటకు కట్టక తప్పలేదు మరి. ఇదో డిఫరెంటు వెర్షను అవుతుందని.. :)

@ teluguanuvaadaalu గారు
నా శైలి నచ్చినందుకు సంతోషం. మీ కామెంటుకు ధన్యవాదములు.

sri చెప్పారు...

chaalaa baagunnay mi rachanalu

Related Posts Plugin for WordPress, Blogger...