15, మే 2010, శనివారం

హైకొచ్చిందోయ్ మావా...!!


"భలేమంచి రోజు.. పసందైన రోజు.. లచ్చిందేవి నవ్వే నేటిరోజు..", అని
స్టేటస్ మెసేజ్ పెట్టుకుని గూగుల్ టాక్ లో ఆన్లైన్లో కునుకుతుండగాసత్తిగాడు
"హాయ్', అని పంపించాడు మెసేజ్..


"ఒరేయ్.. సత్తిగా ఎలా వున్నావ్ రా..", అని రిప్లై ఇచ్చానేను.
"బాగానే వున్నారా!, ఏంట్రోయ్ లచ్చిందేవి అంటూ మాంచి హుషారుగా
వున్నావ్ ఏంటి కతా?, ఆన్ సైటు ఆఫర్ ఎమన్నాచేసాడా మీ మేనేజర్",
అన్నాడు.. సత్తి.


"హ హా.., అంతలేదులేరా.. ఈ రోజు నా సేలరీ రివ్యూ వుంది..
రేటింగ్ ఇచ్చి.. హైకు లెటరిస్తాడు మా మేనేజరు.. అందుకే రాత్రినుండి
నిద్రేలేదు ఎటుచూసినా లచ్చిందేవే కల్లోకొస్తుందిరా",అన్నానేను.


"నీ పనే బాగుందిరా.. సంవత్సరం నుండీ ఇదిగో.. అదిగో..
ఎం.డి దుబాయ్ సేట్లకు ఖర్జూరం అమ్ముతున్నాడు... అవి అమ్ముడవగానే
మీ అందరికీ ఎభైశాతం హైకు అని ఎదోవొక సోదిచెప్తా మా హెచ్చార్
ఊరిస్తుందిరా, అసలు మా ఎం.డి ఎప్పుడెప్పుడు ఇండియా వస్తాడా..
అని " వస్తాడు మా ఎం.డి. ఈ రోజు.. రానే వస్తాడు దుబాయ్ ఫ్లైట్లో
ఈ రోజు..., ఖర్చూరమమ్మిన డబ్బుతో.. మోయలేక సూట్కేసు మోస్తూ..
రానే వస్తాడు..", అని అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణ కోసం
ఎదురుచూస్తున్న విజయనిర్మలలా పాట పాడుకుంటూ.. మౌసు
చేత్తోపట్టుకుని, సీలింగ్ కి ఉన్న లైట్లో మా ఎం.డి ఫొటో ఇన్ సెట్లో
ఊహించుకుంటూ.. ఎదురుచూస్తున్నాంరా..", అన్నాడు సత్తిగాడు.


"హ హ. హా.., దుబాయ్ లో ఖర్జూరం అమ్మకమా.. అయితే మీకు
వందశాతం ఇస్తాడు హైకు.. నో డౌట్..", అంటూ నవ్వాను నేను..


"అవును నిజమేరా.. దుబాయ్ లో ఎవడుకొంటాడ్రా.., మరెందుకు
హెచ్చార్ అలా చెప్పింది... హమ్మనీ.. మోసంరోయ్..", అని సత్తిగాడు
ఆలోచనలోపడ్డాడు.


నాకు నవ్వాగలేదు.. గట్టిగా నవ్వేసాను..
పక్కసీటువాడు నావైపుతిరిగి
చూసాడు.. Alt+Tab కొట్టి నా వర్కు చేస్తున్న విండోని ఓపెన్ చేసి
ఏమీ తెలియనట్టు ఎలర్ట్ అయిపోయాను.


ఒన్-ఆన్-ఒన్ డిస్ససన్ ఇంకా ఐదునిముషాలువుంది అని ఔట్ లుక్లో
ఎలర్ట్ వచ్చింది.. ఓహో అయితే కాస్త బికారిమోహంపెట్టుకుని వెళ్ళాలి
అని రెస్ట్ రూమ్లోకి దూరి, నీట్ గా దువ్విన తలనంతా చెదరగొట్టేసి,
ఇన్షర్ట్ ని కాస్త అటూఇటూచేసుకుని మేనేజరుదగ్గరకు దిగాలుగా
బయలుదేరాను..


"హే.. హౌఆర్ యు?", అని పలకరించి.. "ఏంటి అలా వున్నావ్!,
ఏనీ ప్రాబ్లమ్..", అన్నాడు మేనేజర్

"ఏంలేదు.., వర్క్ కాస్తెక్కువుంది".. అన్నానేను

"సరే.. లెట్స్ స్టార్ట్ యువర్ ఎవాల్యుయేషన్", అని లేప్ట్ టాప్ లో ఎక్షెల్
షీట్ ఓపెన్ చేసాడు..., అలా ఒక అరగంట మా మధ్య మెగుడూపెళ్ళాలు
కొట్టుకుంటే బయట తలుపుదగ్గర కెమేరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినట్టుగా
డిస్కషన్ అయ్యాకా. చిరాకు మోహం పెట్టుకుని నా డెస్క్ దగ్గరకొచ్చి కుర్చీలో
కూలబడ్డాను.


సత్తిగాడు చూస్తే అన్ లైన్లోలేడు.. సరే ఎవరున్నారా అనివెతుకుతుంటే
సునీల్ దొరికాడు..
"హాయ్..సునీల్!", అని విషయం అంతా చెప్పాను..
"కంగ్రాట్స్..", అన్నాడు.. స్మైలిలా నవ్వుతూ..

"ఏం కంగ్రాట్స్ నా బొంద.. పదమూడుశాతం తో సరిపెట్టాడు", అన్నాను.

"సరేలేండి ఆల్ రెడీ మీకు ఎక్కువేగా".. అన్నాడు సునీల్.
"ఏం ఎక్కువా.. తలపొగరా!! అన్నానేను..
"హి హి.. అదే..అదే.. కాదు.. సేలరీ" అన్నాడు సునీల్
నాలుక్కరుచుకున్న స్మైలీతో


"నేననుకున్న దానికన్నా రెండుశాతం తగ్గించేసాడు.. ఛా..", అని
ఏడుపుమెహం పెట్టాను.
"రెండు శాతమే కదా.., డోంట్ వర్రీ..", అన్నాడు సునీల్..
"రెండుశాతమేనా!!, అంటే ఎంతో తెలుసా.. అని క్యాల్కులేటర్ ఉపయోగించి..
లెక్కకట్టి.. నెలకు వెయ్యినూటపదహార్లు.., అంటే నా గ్రోసరీ ఖర్చుల్లో
సగం, ఇదే మా ఊర్లో ఎవడిపెళ్ళికి చదివించినా బాగానే పెట్టాడ్రా అనేవారు..,
ఎలా వదులుకుంటాం.. నేనొప్పుకోను..", అని సీరియస్గా మొహం పెట్టాను..


"హుమ్మ్.. అడిగి చూడండి, మీవాడిని.. అడక్కపోతే ఎవరు ఇవ్వరు..
అల్ ద బెస్ట్", అని ఏదో పనుంది మళ్ళా కలుస్తా అని లాగవుట్ అయ్యాడు సునీల్.


ఈలోగా సత్తిగాడు.. ఆన్ లైన్లోకొచ్చాడు.., "వా... అని ఏడుపుమొహంపెట్టి..
ఇన్నాళ్ళు చేసిన వర్కంతా పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటే.. అది చెయ్యిజారి
బురదగుంటలో పడ్డట్టయిపోయిందిరా నా బతుకు.. ఛీ.." అన్నానేను.


"సరేలే.. ఇంతకూ కాయా పండా". అన్నాడు.. సత్తిగాడు.
"టెంకరా.., నేనిక్కడ ఏడుస్తుందెదుకురా.. " అన్నా సీరియస్ గా..

"హ..హా..అనుకున్నా ఈ మేనేజర్లంతా టెంకలే చూపిస్తారు అని..
ఇంతకూ ఎంత", అన్నాడు సత్తి. మొత్తం విషయం చెప్పాను.

"ఎనకటికెవడో పెళ్ళిభోజనం పీకల్దాకా తిని.. ఇచ్చిన ఖిల్లీ వేసుకుంటూ,
అసలు ఈ ఖిల్లీకి పుల్లెవడు గుచ్చమన్నాడు అని నానా రభస రభసచేసాడంట
అలా వుందిరా నీ పనీ.. రెండుశాతమే కదా తగ్గించింది.", అని వెటకారంగా
అన్నాడు సత్తి.


"ఇక్కడ పనిచెయ్యలేని పంకజానికి ఇరవైశాతం.. దున్నపోతు బాబిగాడికి
ఇరవైశాతం..., నిద్రమోహం నీరజకు ఇరవైశాతం ఇచ్చి, నాకెందుకురా
పదమూడుశాతం.. నేనకుంది పదిహేనే కదా.. అదన్నా ఇవ్వొద్దా.. ",
అన్నానేను ఏడుస్తా..

"నువ్వేచెప్తున్నావుగా వాళ్ళుపనిచేయరని.. అందుకే అంత తక్కువిచ్చారు",
అన్నాడు సత్తి..

"ఒరేయ్.. ఇరవైశాతం అంటే నాకన్నా ఎక్కువరా.. నేనొకటంటే.. నువ్వొకటంటున్నావ్..
సరిగ్గా వినపడటంలేదా,చెవిలో మౌసుగానీ పెట్టుకున్నావా ", అన్నానేను..

లేదు హెడ్ఫోన్స్.. ఈ రోజు వర్క్ లేదు.. అందుకే పాటలువింటున్నా",
అన్నాడు సత్తి.

"ఓహో.. మీకంపెనీలో పాటలైనా వినొచ్చు కదూ.. మాకు ఆ
దౌర్భాగ్యంకూడా ఇవ్వలేదు.. ఛీ నా బతుకు చెడా... పైకి చూసి
ఉమ్మోసుకుంటున్నా", అన్నానేను..

"మొహంపై పడుంటుంది, తుడుచుకో.." అన్నాడు..సత్తి నవ్వుతూ..

"లేదులే పక్క క్యూబికల్ లోకి పోయింది.. అక్కడొకడు ఈ టైములో
నిద్రపోతూవుంటాడు.. ఏంపడినా పట్టించుకోడులే..", అన్నానేను
నాలుక్కరుచుకుంటూ..

"ఒరే.. నువ్వు రెండుశాతానికే ఏడుస్తున్నావ్.. నీ సేలరీ నా సేలరీ
చూసుకుంటే.. చాలా తేడా వుందిరా.. నేనెవడితో చెప్పుకోనూ..
నేనెవడిపై ఉమ్మేయను..", అన్నాడు సత్తి.

"అసలే ఐదున్నరేళ్ళు డెస్క్ కిందకు వచ్చేసాయిరా.. నాదే తక్కువుంది
అనుకుంటుంటే.. నన్నే అడుగుతున్నావా", అన్నానేను.

"ఏమోరా.. నెలక్రితం ఇద్దరుజాయనయ్యారు.. అంతే అన్ సైట్ పోయారు",
అన్నాడు సత్తి..

"మరదే.. చెవిలో మౌసులుపెట్టుక్కుర్చుంటే.. ఊరికే.. ఎవడిస్తాడు ఆన్ సైట్.. ,
వర్కుచెయ్యాలిబాబు", అన్నావెటకారంగా..

"అంతలేదులే.. ఆన్ సైట్ నాకిష్టంలేదులే, అక్కడ ఎక్స్ట్రా డబ్బులేమి ఇవ్వడంట..
దానికోసం ఊపించుకుంటా.. అంతదూరం.. ఇక్కడందర్నీవదిలేసి ఏం వెళతాంలే
అని వద్దనుకున్నా, మంచి ఆఫర్ వస్తే చూడాలి..", అన్నాడు సత్తి..

"యా. యా.. నేనుఅంతే.. మొన్న మావాడు ఆఫర్ చేసాడు.. మా ఆవిడ నన్ను
తీసుకెళ్ళకుండా మీరు వెళితే.. నేను హిమాలయాలకు వెళ్ళిపోతా అని బెదిరించింది..
సరేలే ఇద్దరూ వెళ్ళేవీలున్నప్పుడు వెళ్దాంలే అని ఆఫర్ ని ఎడంకాలితో ఒక్కతన్ను
తన్ని వద్దన్నా", అని చెప్పాను నేను..

సత్తి:(నాకే ఛాన్సూ రాలేదు.. కవరింగులు చేస్తున్నానని వీడు బాగానే కనిపెట్టేసాడు ..
అందుకే రివర్స్ కౌంటరేస్తున్నాడు)

"ఒరే.. నేనూ నీ బడిలోనే చదివానురోయ్.. ఒకే ఇండస్ట్రీ కూడా.., టైపుచేస్తే చెప్పేయగలను
ఏ కంపెనీ కీబోర్డ్ తో టైపుచేసావో.. నాతో పెట్టుకుంటే.. మడతడిపోద్దీ.. చెవిలో తుప్పంతా
కిందడిపోద్దీ.. హోయ్.. " అని టైపుచేసి.. నేను లంచ్ కి వెళ్ళొస్తా అని అన్నానేను..
నవ్వుతూ..


"సరేలేరా.. మళ్ళీ కలుద్దాం", అని నవ్వాడు సత్తి..

start + L బటన్స్ నొక్కి సిస్టమ్ లాక్ చేసి, వీడుకాదు మనబాధలు చెప్పుకోటానికి రైట్ పెర్సన్..
వేరేవాడ్నిపట్టుకోవాలి..అనుకుంటూ.. కేంటిన్ వైపు బయలుదేరాను నేను.

10, మే 2010, సోమవారం

సాక్షిపత్రికలో నా బ్లాగు

మే 5వ తారీఖు(బుధవారం) సాక్షి దినపత్రిక, హైద్రాబాద్ ఎడిషన్లో.. స్ధానికం కాలమ్లో, బ్లాగు బాగు అనే శీర్షికలో నా బ్లాగు పేరు ప్రస్తావించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నాకు ఈమెయిలు ద్వారా తెలియచేసిన జ్యోతి వొలబోజు గారికి ధన్యవాదములు..

ఈ బ్లాగులో రాస్తున్న ప్రతి అక్షరం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. చదువుతున్న వారు కూడా ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను.

సరదాగా మొదలుపెట్టిన ఈ బ్లాగింగ్.. బాధ్యతగా.. వ్యసనంగా మారి నాచేత ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేయిస్తూ నాలో ఎక్కడో దాగివున్న కొత్త ఆలోచనలను బయటకు తీస్తుంది.. ఈ బ్లాగ్ ప్రపంచమే లేకపోతే అవన్నీ నా మనసులో ఆలోచనలుగానూ, ఆశలుగానే ఉండిపోయేవేమో!!

ఈ ఈ-తెలుగుకు ఊతమిచ్చి మనందరినీ ఒకచోట కలుకునే అవకాశం కలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ బ్లాగుభంధం ఎలాంటిందంటే.. నాకు ఇప్పుడు ఉన్న స్నేహితులలో సగంమంది బ్లాగుద్వారా పరిచయమైనవారే వున్నారు. సరదాగా చాటింగ్లో పలకరిస్తూ వుంటుంటారు.. , కొందరిని కలిసి ఆనందాలను పంచుకున్న సమయాలూవున్నాయి.. ఇది ఒక కుటుంబంలా మారిపోయింది.. 

ఇలానే ఇంకా ముందుముందు మీ విలువైన అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి

Related Posts Plugin for WordPress, Blogger...