3, జనవరి 2007, బుధవారం

‘వార’ఫలంప్రతిరోజూలానే పేపరు తిరగేయటంతో మొదలుపెట్టాడు అతను. త్వరత్వరగా పేపరు పేజీలు తిప్పాడు. వెనుక రజనికాంత్ చేతులు కదిపినప్పుడు వచ్చే సౌండు ఎఫక్ట్సుతో నాలుగవ పేజిలో వేసే దినఫలం కాలమ్ కి కళ్ళు వేగంగా వెళ్ళాయి.

స్నేహితులతో వైరం, అనుకోని సంఘటనలు ఎదురవటం, ప్రమాదం, ధననష్టం, ఎదుటివారి విషయాలలో తలదూర్చడం మంచిది కాదు, పై అధీకారులచేత విమర్శలు, అపనిందలు … అన్నీ వరసపెట్టి చదవటం మొదలుపెట్టాడు. "ఎదో తేడాగా ఉన్నట్లుంది ఈ రోజు", అనుకుని బయలుదేరాడు ఆఫీసుకు టైమవుతుందని స్నానంచేయటానికి.

స్నానం మధ్యలో పోన్ వస్తే రూమ్ మేట్ ఫోను తీసి చేతికిచ్చాడు.. మాట్లాడుతూ.. కంగారులో సబ్బుపై కాలువేసి జారి పడ్డాడు. పోనుకాస్తా పగిలిపోయింది. నడుంనొప్పి పట్టింది. కష్టపడి పదివేలు పెట్టి కొనుకున్న ఫోన్ పోయింది అన్న బాధ ఒకపక్క, దినఫలంలో రాసినట్లుగా అనుకోని సంఘటన జరిగింది అని భయం ఒకప్రక్క..

"అరెరే.. అలా ఎలా పడ్డవ్ రా.. ", అని నడుంపట్టుకుని వస్తున్న అతనిని చూసి కంగారుగా రూమ్ మేట్ జాలిచూపిస్తూ చేయిసాయం అందించాడు. వెనుక విషాద వాయొలిన్ సంగీతం మొదలయ్యింది…

"చీ!!.. నీ…, ఇదంతా నీ వల్లే… ఫోను నువ్వే ఎత్తి స్నానంచేస్తున్నాడు అని చెప్పొచ్చుగా", అని ఏడుపుమొహంతో అన్నాడతను. ధినఫలంలో వ్రాసిన “స్నేహితులతో వైరం”, గుర్తొచ్చి నోరుమూసుకుని నోట్లోనే తిట్లన్ని తిట్టేసుకుంటూ…త్వరత్వరగా పనులు కానిచ్చి , దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. ఈ రోజు అంతా మంచిగా ఉండాలి అని.

బైక్ ని ఆఫీసుకు వేగంగా పరుగెత్తించాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో తిట్టుకుంటూ సడన్ బ్రేక్ కొట్టాడు. కాస్త అందరూ నిలిపినదానికంటే ఒక అంగుళం ముందు బండి ఆగింది.. అది ఈలవేస్తూ ఓరచూపులుచూస్తున్న ట్రాఫిక్ పోలీసు కంట పడింది.

అదిగమనించి, బైక్ ను కాళ్ళ సాయంతో కాస్త వెనక్కు నడిపించి.. ఏమీ ఎరుగనట్లు.. ఆకాశంవైపు చూస్తూ.., జుట్టు సర్దుకుంటూ.. అద్దంలో మొహం చూసుకుంటూ.. అతని చూపులనుండి తప్పించుకున్నాడు కాసేపు. మళ్ళీ పోలీసువైపు చూసేసరికి, లాంగ్ షాట్ కాస్తా క్లోజప్ షాట్ లా జూమ్ అయినట్లు వచ్చి దగ్గరగా నిలబడ్డాడు. సీరియస్ గా చూస్తూ బైక్ పక్కన పెట్టు అన్నట్లు సైగచేసాడు. చేసేదేమీలేక పక్కనపెట్టవలసి వచ్చింది పాపం.

అయిదు నిముషాలు గడిచింది. కానీ ఇంకా పోలీసు ట్రాఫిక్ క్లియర్ చేయండంలోనే ఉన్నాడు. "ఇక్కడ వీడు పని వీడు చేసేసుకుంటున్నాడు మన దగ్గరకు ఎప్పడొస్తాడు", అని అనుకుంటూ. ఆఫీసుకు లేటయ్యి బాస్ ముందు చేతులుకట్టుకుని నిలబడే సీన్ , వెనుక ఫాస్ట్ ఫార్వాడ్ చేసినట్లుగా వినిపించే తిట్లు గుర్తొచ్చి. మాకూ పనులున్నాయ్ అని తిట్టుకుంటూ .

"రా.. రా త్వరగా…",అని ఎదో సినిమలో వెంకటేష్ బాబు పళ్ళుకొరుకుతూ అన్నట్లు, వాయిస్ పైకి రాకుండా చేయి ఊపాడు…

కోపంగా పరుగుపరుగున వచ్చాడు పోలీసు. "ఏంటి బాబు.. ఏంటి కంగారేంటి? ఆగాలి. ఇక్కడ మేం ఏమన్నా ఖాళీగా ఉన్నామా.. హీరో వెంకటేష్ లా పళ్లుకొరుకుతూ చేయిఊపుతున్నావేంటి..?", అన్నాడు.


ఒక్కసారి తనని వెంకటేష్ తో పోల్చినందుకు, క్రేన్ పైన కూర్చుని చెట్టు ఎక్కినట్టు చూపించే షాట్ ఒకటి ఊహించుకుని… మళ్ళీ సడెన్ గా క్రేన్ క్రిందకు దిగగా మామూలు మనిషయ్యి …

"లేదండి... నాకు ఆఫీస్ టైమవుతుంది. అందుకే పిలిచానండి", అని నెమ్మదిగా వినయంగా సమాధానంచెప్పాడు పోలిసుకు.

"అయినా నేను ఒక అంగుళమే కదా దాటాను. దానికే ఆగమంటారా.. అందుకే మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయా సార్.. ", "సారీ!! సార్..", అని సర్దిచెప్పుకున్నాడు.

"అది కాదు బాబు నీ హేల్మెట్ ఏది.? ఉద్యోగంచేస్తున్న వాడివిలా ఉన్నావ్, మీకు కూడా మేం ప్రతిరోజు ఎక్కడ గుర్తుచేస్తామండి.", అని గౌరవంతో కూడిన తిట్లు మొదలుపెట్టాడు పోలీస్.

ఒక్కసారిగా ప్రస్తుత సీను నుండి తను నిద్రలేచిన సీనువరకూ, ప్రేములు వెనక్క పరుగుతీసాయి…

పేపరులో వ్రాసిన ధినఫలం ఫ్రేమూ, ధననష్టం అన్న పెద్దపెద్ద అక్షరాలతో ఉన్న ఫ్రేమూ, హెల్మట్ అల్మరాలో పెట్టి మర్చిపోయినట్లున్న ఫ్రేమూ.. కాస్త ఫ్లాషింగ్ ఎఫెక్ట్సుతో కనపడటం మొదలుపెట్టాయి అతనికి.

కట్ చేసి ప్రస్తుత స్ధితికి వస్తే.. తిట్లుతిడుతున్న పోలీసు, తన బాస్ లా కనపడటం మొదలుపెట్టాడు. వెంటనే చేతులు ఆటోమేటిగ్గా కట్టేసుకున్నాడు.

"పదండి…మీకు సినిమా చూపించాల్సిందే.. పదండి!!", అన్నాడు.. పోలీసు…

"వద్దుసార్!!.. మీకు కావాల్సింది ఎంటో నాకు అర్దమయ్యింది నన్ను వదిలేయండి, ఇప్పుటి వరకూ మీరు చూపించిన సినిమా చాలు, దానికి టిక్కెట్టు చార్జీలకింద ఈ వంద ఉంచండి", అని నవ్వుతున్న గాంధీగారి నోటును ఒక్కసారి ప్రేమగా చూసుకుంటూ… "గాంధీగారు..!!, మీపని బెస్టు…సార్..! పదినోటు అనిలేదు, వెయ్యినోటు అనిలేదు.. ప్రతిచోటా.. ప్రతిదానికి కామెడీ సీనులా నవ్వుతుంటారు…,మా పరిస్ధితిచూసారా?? ఏంచేస్తాం బేడ్ టైం సార్..", అని మనసులో అనుకుంటూ…మడతపెట్టి పోలీసుచేతిలో పెట్టాడు.

ఇక్కడ ఇంకేం పాపాలు చూడాలో అనుకుంటూ ఆఫీసుకి చేరుకున్నాడు. "ఇక మిగిలిందేముంది.. బాస్ చేత.. ఫుల్ @#$, అని రాసివుంది కదా ధినఫలంలో అదే తరువాత సీన్", అనుకుని చెమటలు తుడుచుకుంటూ లోపలికెళ్ళాడు.

"బాస్ పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని..", అని చెయ్యిఅడ్డుపెట్టుకుని నవ్వుతూ పిలిచాడు ప్యూను.

"అనుకున్నా ఈ గొర్రె మొహంగాడు ఇంకా రాలేదేంటా", అని మనసులో అనుకుని…
"సరే వస్తున్నా!!!", అని టెన్సన్ గా బాస్ రూమ్లోకి వెళ్ళాడు…

నిజం చెబితే ఎలాగూ ఆయన నమ్మడు తెలిసిందే కదా!!, ఎవరికో ఏక్సిడెంటు అయితే రక్షించా అని ఎదో కధచెప్పి సీన్ సీరియస్ చేద్దామా?, లేక డబ్బులుపోయాయి అని ట్రాజెడీ చేద్దామా? ఎలాచెప్పాలి.. ఏం చెప్పాలి అని కధ అలోచిస్తూనే కేబిన్ డోర్ తట్టి లోపలికి వెళ్ళాడు.

వెళ్ళడంతోనే బాస్ మొహంలో చిరునవ్వు కనపడే సరికి. వెంకటెశా.... శ్రీనివాసా.. ప్రభో..... అన్న బ్యాక్ గ్రవుండ్ సాంగ్ తో... వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్లు ఒక్కసారి ఆయన్ని చూసి మనసులో దణ్ణంపెట్టుకున్నాడు.

"ఇదిగో తాగవయ్యా!", అంటూ రడీచేసిన పెట్టిన వేడి వేడి కాఫీ చేతికిచ్చి.. "నీకో గుడ్ న్యూస్!!, మనకు ఆ కాంట్రాక్ట్ దక్కింది…, అంతా నీ కష్టానికి ఫలితమే", అన్న బాస్ మాటలు నమ్మలేకపోయాడతను. వేడి వేడి కాఫీ నెత్తిమీదపోసి కలో నిజమో టెస్ట్ చేద్దామనుకున్నాడు కానీ, కల కాకపోతే… గుడ్ న్యూస్ చెప్పినాయన నెత్తిమీద వేడి కాఫీ పోయటం బాగోదేమోనని కాస్త ఆలోచించాల్సి వచ్చింది, అసలే బాస్ ది బట్టతల పాపం.

నవ్వుతూ.. "ధ్యాంక్స్ సార్!", అని షేక్ హ్యాండిచ్చాడు.

బాస్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి, ఆనందం తట్టుకోలేక, కాళ్ళుతేలిపోగా, వెనుక జాతర డప్పులశబ్ధంతో పులివేషంవేసి డ్యాన్స్ చేసినంత పనిచేసాడు.

"ధినఫలంలో వ్రాయనేలేదు ఇది.. ఎలా జరిగింది", అని మనసులో ఎదో పీకుతున్నా.. ఆనందం అవదులు దాటి…కవర్ చేసేసింది. "అయినా మనమంచికే జరిగిందిలే", అనుకున్నాడు. ఇక ఆ రోజంతా త్వరత్వరగా గడిచిపోయింది.

తరువాతరోజు పేపర్ చదవడంకోసం పొద్దున్నే లేచాడు. తలుపుతీసి పేపరు చేత్తో అందుకుని, ఆవులిస్తూ పేజీలు తిరగేసాడు.

రెండు పేపర్లు కనబడేసరికి చికాకుగా మొహంపెట్టి చూసాడు.


ఒకటి నిన్నటిది, ఇంకొకటి ఆ రోజుది. ఇదేంటి నిన్నటి పేపరు మళ్ళీ ఇచ్చాడు. వీడికి మతిపోయినట్టుంది, అని అనుకుని

నిన్నటి పేపర్ ప్రక్కన పడేసి, ఈ రోజు పేపర్ చదవడం మొదలుపెట్టాడు.

చదవడం పూర్తిచేసి బెడ్ పై పడి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఆరోజు సెలవురోజు కావడం వలన ఆఫీసు టెన్సన్ లేదతనికి.

సడెన్ గా గుర్తొచ్చింది…, "నిన్నటి పేపర్ ఎందుకిచ్చాడు?, ఒకవేళ నిన్న తీసుకురాలేదా?, అలా ఐతే.. నిన్న చదివిన పేపర్ ఎక్కడిది???", అని…, బెడ్ పైనుండి క్రిందపడి మరీ పరుగుతీసాడు.

పేపర్లు చూసి నిద్రమత్తుఎగిరేలా నవ్వుకున్నాడు, నిన్న అతను చదివింది క్రిందటి వారంపేపర్…అని తెలిసుకుని.

7 కామెంట్‌లు:

spandana చెప్పారు...

అయ్య బాబోయ్!
ఈ వార ఫలాల చాదస్తం గురించి ఇంతకంటే బాగా ఎవరూ రాయలేరని నా సవాల్.
అదిరిందండీ. అదంతా ఒట్టి చాదస్తమనీ, రాసిందాంతో జరిగిందాన్ని పోల్చి చూసుకొని బాదపడి వాటిని నమ్మడ..ఇంకా అన్నీ చిన్న కథతో అద్భుతంగా సెలవిచ్చారు.
--ఫ్రసాద్
http://blog.charasala.com

రాధిక చెప్పారు...

miiru raasea cinni cinni kadhalu adbhutam gaa vuntaayi.konni touching gaa vendevi ayite,konni haassyam toanu...ilaa anni caalaa baaga raastaru.

రానారె చెప్పారు...

కథ అద్దిరిపోయింది!!
ఆద్యంతం హాస్యాన్ని పండిస్తూ ఒక నీతి కథను చెప్పడం కష్టమైనపని అంటారు. మీరాపనిని చక్కగా చేశారు.

వీవెన్ చెప్పారు...

చాలా బాగుంది!

spandana చెప్పారు...

ఇక ఈ సంఖ్యా శాస్త్రం కాకరకాయ కూడా అలాంటిదే! అసలు ఇలాంతి విచిత్రాలన్నిటినీ శాస్త్రాల్ని ఎవర్రా బాబూ అన్నారు!
అభిషేక 2007 లో మొత్తం కలిపితే 9 వస్తుందని పెళ్ళి చేసుకుంటాడట! అసలు ఈ 2007 అన్నది ఎలా పుట్టింది? అదేదో గుడ్డీగా ఒక స్థానం నుండీ లెక్కించడం వల్ల గదా .. మరి శక సంవత్సరంలో మొత్తం 9 అవదే! శాలి వాహన, విక్రమార్క శకాల్లో!! ఇదంతా ఒట్టి చెత్త!
--ఫ్రసాద్
http://blog.charasala.com

అజ్ఞాత చెప్పారు...

I like play online game, I also Buy metin2 gold and Metin2 gold, the Metin2 yang is very cheap, and use the Cheap metin2 yang can buy many things, I like Cheap metin2 gold, thanks, it is very good.

I like play online game, I also Buy Perfect World Gold and Perfect World Gold, the Perfect World Silver is very cheap, and use the Perfect World money can buy many things, I like cheap Perfect World Gold, thanks, it is very good.

no చెప్పారు...

mee blog vaaraphalam 28-7-13 aadivaaram andhrajyothi anubandham lo prachuristunnam.
editor
andhrajyothy

Related Posts Plugin for WordPress, Blogger...