12, డిసెంబర్ 2006, మంగళవారం

మూడురూపాయలు--------------------------------------------------

సిగరెట్ కోసం, పదిరూపాయల నోటుమార్చగా తిరిగి వచ్చిన మూడు రూపాయి కాసులు పైజేబులో వేసుకుని బైక్ స్టార్ట్ చేసాడు ఒక యువకుడు. ఆ మూడు రూపాయి కాసులు స్నేహంగా పలకరించుకున్నాయి. ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని మనమంతా ఒకటే , మనమే ఈ మనుషులకు ఆధారం అని గర్వపడ్డాయి. అంతా ఇలా ఒకే జేబులో కలవడం మన అదృష్టం అని సంబరపడిపోయాయి. ఏమో ఎలా రాసిపెట్టుందో, మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు, ఒకవేళ కలిసినా అప్పటికి మనం ఏ పరిస్ధితిలో ఉంటామో. వయసయ్యినా నిగనిగ తగ్గని వారు కొందరైతే, చిన్న వయసులోనే ఎందరో కష్టాలు తీర్చి అరిగి పోయి గుర్తుపట్టని విధంగా తయారయ్యే వారు కొందరు.. మనల్ని సృష్టించిన ఈ మనిషి ఏం చేస్తాడో చూద్దాం, అని నవ్వుకున్నాయి. బైక్ కుదుపులతో ఊగుతూ ఈలవేస్తూ, పాటలు పాడుకుంటూ శబ్దంచేయసాగాయి. బైక్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఒకరిపై ఒకరు పడి, కళ్ళింతచేసి ఏమయిందో అన్నట్లు చూడసాగాయి. “ఛ!, పెట్రోల్ ఆయిపోయింది, ఇప్పుడెలా!”, అన్న యువకుడి మాటలువిని కాస్త భయపడసాగాయి.. అయితే మనం విడిపోబోతున్నాం, అని అందులో ఒక రూపాయి ఏడ్వసాగింది. ఊరుకో.. అలా ఏం కాదులే.. పెట్రోల్ అంటే మన ముగ్గురితో అయ్యే పనికాదు, కాబట్టి ఏ వందనోటో మారకతప్పదు.. అంటే ఇంకా మన స్నేహితులు కొందరు రావొచ్చేమో చూద్దాం. అని ఓదార్చింది అందులో ఒక రూపాయి.

బైక్ ను కొంతదూరం చెమటలుపట్టేలా తోసుకుంటూ వెళ్ళాడు ఆ యువకుడు. అలసిపోయి అడుగులవేగం తగ్గిందతనిలో, బైక్ ని రోడ్డుపక్కగా పార్క్ చేసి లాక్ చేసాడు.. జేబులో నుండి నిశ్శబ్దంగా యువకుడి గుండె సవ్వడిని గమనిస్తున్న రూపాయి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఏం జరగబోతుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.

దారినపోయేవాళ్ళను లిప్ట్ అడిగి దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపుకు చేరుకున్నాడు ఆ యువకుడు ఏబైరూపాయలకి పెట్రోల్ కావాలి. నా దగ్గర బాటిల్ లాంటిది ఏదీలేదు అన్నాడు ఆ యువకుడు పెట్రోల్ పంపువాడితో. ఏభైరూపాయలు అని వినపడగానే.. హమ్మయ్య, మనకేం పర్వాలేదు అనుకుని కాస్త ఊపిరిపీల్చుకున్నాయి ఆ రూపాయి కాసులు.
అక్కడ బాటిల్ దొరికుతుంది అని ప్రక్కనే కూర్చున్న ఒక చిన్న పిల్లవాడ్ని చూపించాడు ఆ పెట్రోల్ పంపువాడు.

అనుకోనివిధంగా ఒక రూపాయి స్నేహితులని విడిచి వెళ్ళాల్సొచ్చింది. బాటిల్ ఇచ్చిన పిల్లవానికి ఒక రూపాయి ఇచ్చేసాడు ఆ యువకుడు.

సాయంత్రమయ్యేసరికి ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు వీడి బెంగపెట్టుకున్నాయి. కొత్తస్నేహితులను చేరుకున్నా మాట్లాడక మౌనంగానే ఉండిపోయాయి. ఒకవేళ కొత్తవాళ్ళతో స్నేహం చేసుకున్నా అది ఎంతసేపు నిలువనిస్తాడు ఈ మానవుడు అని మనసులో మానుషుల్నందర్ని తిట్టుకున్నాయి.

*******************

కష్టపడి ఎండలో కూర్చుని బాటిల్స్ అమ్ముతూ సాయంత్రానికి పది రూపాయి కాసులు సంపాదించాడు ఆ పిల్లాడు. ఆనందంగా చేతిలో డబ్బులు చూసుకుంటూ ఇంటికి పరుగుతీసాడు. ఆ పరుగుతో ఒకరాయిని తన్నుకుని ఎగిరి కిందపడ్డాడు.. రూపాయి కాసులన్నీ భయంతో కేకలు వేస్తూ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. కారుతున్న రక్తాన్ని, తగిలిన దెబ్బను లెక్కచేయకుండా, కిందపడిన రూపాయి కాసులను కంగారుగా ఏరసాగాడు ఆ పిల్లవాడు.. దొరికిన రూపాయినల్లా ముద్దాడుతూ జేబులోవేసుకోసాగాడు.

రూపాయి తనపై చూపించిన ప్రేమకి పొంగిపోయింది, మళ్ళీ తన మోముపై చిరునవ్వులు చిందించింది. తనని కష్టపడి సంపాదించినందుకు, క్రిందపడిపోతే ప్రేమగా దగ్గరకు తీసుకున్నందుకు… సంతోషపడింది. నన్ను సృష్టించిన నిన్నే తిట్టుకున్నా ఓ మనిషీ, క్షమించు అని చెంపలేసుకుంది. ఈ సారి తన స్నేహితుల్ని సంతోషంగా వదిలి ఆ పిల్లాడి ఆకలిని తీర్చి రుణం తీర్చుకుంది ఆ రూపాయి.

*******************

కాలం గడిచింది. ఒకప్పుడు కలుసుకున్న రూపాయి కాసుల కోరిక తీరనేలేదు. మళ్ళీ ఒకరినొకరు కలుసుకోలేకపోయాయి. ఎవరికైనా నేనిక్కడున్నా అని చెప్పి కబురుపంపే వీలులేని చోట చిక్కుకుపోయాయి.

మనిషిచేత సృష్టించబడి ఆ మనిషికి కష్టంలో సాయపడి అతనిని ఆనందపరచి, అతని మూఢనమ్మకాలకు భలైపోయి మట్టిలో కలిసిపోయిందొక రూపాయి అయితే.

గంగమ్మతల్లీ నన్ను చల్లగా చూడు, ఇదిగో ఈ రూపాయినీకు అర్పిస్తా అని జాలిలేని మనిషిని వదలి, కడలి ఒడిని చేరుకుంది వేరొక రూపాయి.

చిలిపి పనుల చిన్నారుల చేతిలో ఆటవస్తువుగా మారి, కళ్ళను తెరచి భయమును మరచి, రైలుపట్టాపై పవలించి సత్తురేకై, తనరూపాన్ని కోల్పోయింది మరొక రూపాయి.

1, డిసెంబర్ 2006, శుక్రవారం

చిరునవ్వుతో స్నేహం...-------------------------------------------------

చల్లని ప్రదేశం, చుట్టూ గుబురు చెట్లతో నిండి అక్కడక్కడా, ఆకాశంనుండి బంగారు తీగలు నేలకు వేళాడదీసినట్లుగా సూర్యకిరణాలు. నిశ్సబ్దంగా ఉండే ఆ ప్రదేశంలో అప్పుడప్పుడూ పాటకి వెనుక వేణువు ఊదినట్లుగా వినిపించే పక్షుల ధ్వనులు. ఎటుచూసినా పచ్చదనం, మనసుకు ఉల్లాసం. గాలికి రాలిపోయి... నేలను హత్తుకుని ఆటలాడే ఎండుటాకుల్లో కూడా ఎంతో అందం. నాలో ఏదో ఆనందం.

ఇప్పటికీ కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఊహించగానే. ఆ గాలి నన్నుతాకినట్లు అనిపిస్తుంది, చుట్టూ ఉన్న పువ్వుల పరిమళిస్తున్నట్లుగా తోస్తుంది. ఆ పక్షుల కిలకిల ధ్వనుల మధ్య ఒక చిరునవ్వు వినిపిస్తుంది. నా మనసు పులకరిస్తుంది. నా ఒళ్ళు జలదరిస్తుంది.

ఆ నవ్వు అందమా? ఈ ప్రకృతి అందమా? అని మనసులో ఒక ప్రశ్న అంకురిస్తుంది. కానీ మనసును భందించిన ఆ నవ్వు, ఆ అలోచననే కాదు చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్నే మరపింపచేస్తుంది.

ఎందుకో ఆ నవ్వు కోపంగా నన్ను చూస్తూ… కొంటెగా నన్ను దూరంగా తోస్తూండడంలో ఏమి ఆనందం ఉందో తెలియదు కానీ…, అపుడపుడూ ఆటపట్టిస్తూ, ఏదోక చమత్కారంతో ఆ నవ్వుని నవ్విస్తూ … నా రోజు మొదలయ్యేది.

మొదటిరోజు పరిచయంలో మాములుగానే ఉన్నా… రోజులు గడిచే కొద్దీ నాలో ఏదో తెలియని ఆరాధన. ఆ నవ్వుకి కష్టంలో సాయపడుతూ…ఎపుడూ తనకోసమే ఆలోచిస్తూ రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ చిరునవ్వువెంట వచ్చిన "నువ్వంటే నాకిష్టంలే", అన్న మాటలు ఆరోజు నాకు... మాములుగా పెదవులనుండి వచ్చిన మాటల్లానే అనిపించినా… ఈరోజు ఊహిస్తూ నేను పడే వేదన వర్షంలో కన్నీటివంటిది.

ఆ నవ్వు ఒకరోజు భాధతో కన్నీరుకారిస్తే…నా కడుపు ఆకలితో కన్నీరుకార్చింది…నా గుండె బరువెక్కి , వెక్కి వెక్కి ఏడ్చింది.

చుట్టూ పచ్చని చెట్లనుతాకుతూ వచ్చినా!!!, పచ్చలుగా మారక మేఘాల ముత్యాల్లానే నేలనుతాకుతున్న చినుకులతో… జోరున వర్షం. ఆ వర్షంలో వేడివేడి కాఫీ…, కాఫీ కప్పులోనుండి వస్తున్న ఆవిర్లను తాకిన ముత్యాల చినుకులు …కరిగి మా ఒడిలో ఒదిగిపోతుంటుంటే. అది చూసి ఆ నవ్వు చిరునవ్వు విసరగా, నాలోన ఓ నవ్వు మెరుపల్లే మెరవగా…మా ఆనందపు సిరిజల్లులతో కలిసి కురుస్తున్న ఆ వర్షాన్ని నేనెప్పటికీ మరువలేని ఒక తీపిజ్ఞాపకం.

కాలంగడిచింది, నేను గుండెల్లో దాచుకున్నది ప్రేమో, ఆకర్షణో తెలియకుంది. కానీ ఆ నవ్వు నా ఊహల్లో తప్ప, నా కనుల ముందు నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఒక మంచి స్నేహంగా మిగిలిపోయింది. ఒకప్పుడు "నువ్వంటే నాకిష్టంలే" అన్న మాటలు మనసునుండి వచ్చినవే అని ఇపుడు అనుకున్నా నాకు భాధలేదు. ఎందుకంటే…నాలో నిండిపోయిన ఆ ఊహలు, మధుర జ్ఞాపకాల పూమాలలా ఎపుడూ పరిమళాలు చిందిస్తూనేవున్నాయిలా.

27, నవంబర్ 2006, సోమవారం

ఒక కవిత/పాట

మొన్న రోడ్డుపై అలా సడుస్తూ వెళుతుంటే నాకొక పేపరు దొరికింది. ఎవరో వ్రాసుకున్న పాటో/కవితో మరి. కాస్త బాగుంది అనిపిస్తే ఇక్కడ వ్రాస్తున్నా.

ఒక బ్యాచిలర్ అబ్బాయి, చుట్టూ అందరూ జంటలుగా తిరగడం చూసి , మనసురగిలి వ్రాసుకున్న ఒక కవితలా నాకు అనిపించింది , అనుమానం లేదు.. మీరే చదివి చెప్పండి ఏమనిపించిందో మీకు.

-----------------------------------------------------

పట్టణాలలో పల్లెటూర్లలో

బట్టబయలునా పార్కుల్లోనా

ధియేటర్లలో బీచ్ లలోనా

డిస్కోల్లోనా పబ్బులవెంటా

ప్రపంచమంతా గుసగుసరేపుతూ


జంటలు జంటలు జంటలు జంటలు

జంటలు జంటలు

జన జన జన జన జంటలు జంటలు

(ఈ పై లైనులో ఏవో బూతులున్నాయ్, బాగోదని అవి తీసేసి నేను వేరేది మార్చడం జరిగింది)


చిలిపినవ్వుల ఉల్లాసముతో

హంగురంగూ అర్బాటంతో

ఒకమారిచటా ఒకమారచటా


జంటలు జంటలు జంటలు జంటలు

జంటలు జంటలు


దేవుని గుడిలో, బడిలో మడిలో

ప్రాణముమసలే ప్రతీ స్ధలములో

ఉత్తరమందూ, దక్షిణమందూ


జంటలు జంటలు జంటలు జంటలు

జంటలు జంటలు


వెన్నెలలోనూ చీకటిలోనూ

మండుటెండలో జడిలో, చలిలో

కేండిల్ లైట్ల డిన్నర్ తోనూ


జంటలు జంటలు జంటలు జంటలు

జంటలు జంటలు
------------------------------------------

హా ఇదంతా చదివాకా గుర్తొచ్చింది, ఇది శ్రీశ్రీ మహాప్రస్ధానం – గంటలు ఆధారంగావ్రాసినట్లుంది.

(అది చదవనివారు ఈ క్రింది లింకు చూడగలరు)

శ్రీశ్రీ మహాప్రస్ధానం – గంటలు


పాపం చాలా రగిలిపోయి వ్రాసుంటాడు నిజమే..!!!, ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ బహిరంగ ప్రేమలూ.. ప్రదర్శనలు ఎక్కువైపోయాయిలేండి.., ఎంతైనా మనసుపాడవుతుంది కదా..??
బాగానే వ్రాసాడు.

21, నవంబర్ 2006, మంగళవారం

భయం...----------------------------------------------------


అర్ధరాత్రి ఒంటిగంట అవుతుంది. పొలాల మధ్యనుండి సన్నని రహదారిలో నడుస్తూ వస్తున్నా.
వెన్నెలకాంతిలో చుట్టూ చెట్ల నీడ మద్య కనిపిస్తున్న రహదారి వెంబడి, ఒంటరిగా, ఎవరూ తోడులేరు నాకు., నేనెందుకు అక్కడున్నానో కూడా తెలియదు. అపుడపుడూ వస్తున్న ఏవో వింత శబ్ధాలు , నేను నడుస్తున్నప్పుడు నా కాలికింద నలుగుతూ అరిచే ఎండుటాకుల శబ్ధాలు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది.

మేఘం అడ్డొచ్చి వెన్నెల కాస్తా కటిక చీకటిగా మారింది. చుట్టూ పర్వతాల్లాంటి ఆకారాలతో జుట్టు విరబూసి ఊగుతూ నిలబడి ఉన్నట్లుగా చెట్లు తప్ప ఏదీ సరిగా కనపడటంలేదు. నాలో కాస్త భయం మొదలయ్యింది. చెమటలు పడుతున్నాయి.. వడివడిగా అడుగులు పడసాగాయి.
ఎండుటాకుల కేకలు.. ఎక్కవయ్యాయి. చీకట్లో ఎటువైపు వెళుతున్నానో తెలియదు. నా గుండె శబ్దంలో వేగం పెరిగి నాకు వినిపించేలా కొట్టుకుంటుంది కాబట్టి పరుగుతీస్తున్నట్లు మాత్రం తెలుస్తుంది.

మేఘం మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లుంది.. మసక కాస్త తగ్గి వెన్నెల రాసాగింది.. చుట్టూ కొత్తగా ఉంది. నేనెప్పుడూ చూడని ప్రదేశంలా ఉంది. నేను రహదారిపై లేను. తలపైకెత్తి చూసి, పొడవాటి కొబ్బరిచెట్ల మధ్యలో పరుగుపెడుతున్నాననీ తెలుసుకున్నాను. నల్లని నేలపై, అక్కడక్కడా ముగ్గు చల్లినట్టుగా ఉంది వెన్నెల కొబ్బరిచెట్లనీడ వలన. ముగ్గు ఉన్న దారిలో అడుగులేస్తూ వెళుతున్నా. అలసిపోయి పరుగుతీయలేక ఆగిపోయా. ఏదో నా వెనుక వస్తున్నట్లుగా అనిపించింది. వెనక్కితిరిగి చూసా.

ఎదో పెద్ద కోన్ లాంటి ఆకారం నాపై పడుతున్నట్లనిపించి లేచి ప్రక్కకు తప్పుకున్నా. ఆ ఆకారం ఒక్కసారి దూరంగా తిరుగుతూ వెళ్ళి మళ్ళీ నావైపుగా వస్తుంది. దగ్గరకొచ్చేకొద్దీ ఝుమ్మంటూ తిరుగుతున్న శబ్దం ఎక్కువైంది. లేని ఓపిక భయం తీసుకురాగా మళ్ళీ పరుగుతీసా.

దబ్ అని పెద్ద శబ్దం, తరువాత అంతా నిశ్శబ్దం. పదినిముషాలు గడచుంటుంది. చెవులకు ఏదీ వినపడటంలేదు. వెన్నెలకూడా మాయమైంది. కటిక చీకటి అలముకుంది. నేను సగంనీటిలో పడి ఉన్నట్లు అనిపించింది. ఏమైందో తెలియదు. వెనక్కుతిరిగి పరుగెడుతూ చెట్టుని ఢీకొని ప్రక్కనున్న నీటిగుంటలో పడ్డానేమోనని అనుకున్నా. ఓపిక నశించింది.. అలాగే నెమ్మదిగా లేచి పాకుతూ చెట్టుకు జారబడ్డాను. వెంబడిస్తున్న ఆకారం గుర్తొచ్చి నలువైపులా చూసా.

హమ్మయ్యా లేదులే అనుకున్నంతసేపులేదు, ఈ సారి ముందు నుండి దూసుకొస్తుంది. మళ్ళీ లేచి పరుగు. నా పరుగుతో పాటే అలోచనలు కూడా వస్తున్నాయి. ఎటువైపు తప్పుకోవాలో తెలియటంలేదు. ఈ సారి వెనక్కతిరిగి చూడకుండా పరుగెడుతున్నా. ఏదో గ్రహాంతరవాసులు వేసుకొచ్చిన ఫ్లైయింగ్ సాసర్ లా అనిపించింది. అది తిరుగుతున్న శబ్ధాన్ని బట్టి నా ప్రతిఅడుగు మారుతుంది, వేగంపుంజుకుంటుంది. నాకు ఆయాసం ఎక్కవైంది. ఇక పరుగుతీసే ఓపికలేదు. కానీ భయం నన్ను ఆగనివ్వడంలేదు.

(ఇది నాకు నాలుగేళ్ళప్పుడు వచ్చిన ఒక కల)

--------------------------------------------------------

తోటి ఉద్యోగులతో కలిసి కేంటిన్ లో టీ త్రాగుతూ కబుర్లుచెప్పుకుంటున్నాం. మాలో ఒకతను నిన్న ఎందుకు ఆఫీసుకు రాలేదో వివరిస్తున్నాడు. “పన్నునొప్పిగా ఉందని డాక్టర్ ని కలిసా.. , పన్నుతీసేయాలన్నాడు... నేను సరే అన్నా, మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు... సన్నని స్టీలు పట్టకారు తీసాడు.. నాకు అది చూడగానే భయంవేసింది. చెమటలు పట్టాయి.. గుండెవేగంగా కొట్టుకోసాగింది. ఏం పర్లేదు భయపడకు అంటూనే... డాక్టర్ తన కాలు కుర్చీకి తన్ని గట్టిగా నా పంటిని పట్టకారుతో లాగుతున్నాడు. నేను భయంతో, నొప్పితో కేకలువేసాను… .. .. ..” ఇలా అతను చెప్పుకుంటూపోతున్నాడు.

నాకు అక్కడ జరుగుతున్నదంతా చాలా విచిత్రంగా అనిపించింది. వాళ్ళుమాట్లాడుకునే మాటలు,అదే టాపిక్ , అదే ప్రదేశంలో ఆ మనుషులు, అదే సందర్బం ఇంతకుముందెన్నడో, ఎప్పుడో జరిగినట్లు తోస్తుంది. అతను చెప్పబోయే మాట నాకు ముందుగానే తెలిసినట్లు అనిపించింది. ఎక్కడ జరిగిందా అని నేను ఆలోచనలో పడ్డాను. గుర్తురావడంలేదు. కానీ ఎక్కడో ఇలాంటిదే జరిగిందని మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. ఇది కల కాదు నిజం. కానీ నాకు ఒకప్పుడు వచ్చిన కలకి దీనికీ ఏదో సంబంధం ఉందనిపించింది. గుండె దడ మొదలయ్యింది, చెమటలు పోసాయి. నాలో భయం మొదలయ్యింది. అక్కడనుండి లేచి వెళ్ళిపోయాను.

రెస్ట్ రూమ్ కి వెళ్ళి, చెమటలు పట్టిన మొహం కడుకున్నాను. అద్దంలో చూసుకుంటూ ఇంకా ఆ అలోచనతొనే ఉన్నాను. ఎక్కడ చూశానో అదే సందర్బం అని. బయటకొచ్చి చూసేసరికి కేంటిన్లో ఎవరూలేరు. అఫీసుమొత్తం కాళీగా ఉంది.నేను లోపలికి వెళ్ళి రొండు నిముషాలు కూడా కాలేదే?, ఇప్పటివరకూ ఉన్న వాళ్ళంతా ఏమైపోయారో ఏంటో?, అని వెతికా. ఒక్కరూ లేరు. సెక్కూరిటీ అతను కూడా లేడు అతనుండవలసిన స్ధానంలో. నాకు మళ్ళీ భయం మొదలయ్యింది. వడివడిగా అడుగులేస్తూ అఫీసు బయటపడ్డా.

16, నవంబర్ 2006, గురువారం

అమ్మకిచ్చిన మాట...---------------------------------------------------------------

INT – రాత్రి, అమెరికాలో ఒక ప్రదేశం, నిండుగా జనంతో ఉన్న ఒక బార్

(పార్టీ స్టార్ట్ అయ్యింది.. అందరూ ఉత్సాహంగా ఉన్నారు.. చెవులు దద్దరిల్లే సంగీతం, రంగురంగుల డిస్కోలైట్స్.)

దిలీప్ : “ఒకే కమాన్.. లెట్స్ హేవ్ డ్రింక్స్.., ఒరే.. నేనూ ఈ సారి కొత్త బ్రాండ్ ట్రై చేస్తారా.. “
రవి: “ఒకే.. నాది సేమ్ ఓర్డ్ బ్రాండ్.. స్మిర్న్ ఆప్..”

(అందరూ ఒక్కసారి గట్టిగా నవ్వుకున్నారు.. )

దిలీప్: “నువ్వు అది తప్ప ఏదీ తాగే సీన్ లేదని తెలుసు కానీ కానియ్”
రవి: ( చాలెంజింగా) “ఒరే.. నేను ఏదోకరోజు తాగి చూపిస్తారా”
దిలీప్: “చాల్లే ఆపరా.. వెయిటర్ కి అర్దంకాకపోయినా నవ్వుతున్నాడు నీ చాలెంజ్ చూసి.., మనకి బాటిల్ మూత తీసేసరికి ఎక్కడం మొదలవుతుంది.. ఇక ఆపు.. “

(ఆర్డర్ కోసం వెయిటర్ వచ్చాడు.. అందరూ నచ్చిన ఆర్డర్ చెప్పారు.. )

సతీష్ : “ఒన్ లెమన్ జ్యూస్ “,
దిలీప్: ( వెటకారంగా) “ఏరా మామా.. ఏమైంది లెమన్ వోడ్కా అనబోయి. జ్యూస్ అన్నట్లున్నావ్ “

సతీష్ : (కాస్త సీరియస్ గా) “లేదురా.. ప్రస్తుతం మూడ్ లేదు.. అయినా నేను త్రాగడం మానేసారా..”

దిలీప్: (బిగ్గరగా నవ్వుతూ) “ఇది రేపు హేంగోవర్ అయిన తరువాత చెప్పాల్సిన డైలాగ్ రా..”

(ఆర్డర్ రాసుకున్న వెయిటర్ వెళ్ళిపోయాడు.. , లౌడ్ మ్యూజిక్ , చుట్టూ ఉన్న జనం డ్యాన్సులు)

(సతీష్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు)
**********
DISSOLVE TO EXT – పచ్చని చెట్లు నిండి ఉన్న ప్రదేశం, సమయం ఉదయం 5.00, ఆంధ్రాలో ఒక ప్రదేశం

(జయ జయ రామ్.. శ్రీరామ పరందామా.. జయ రామ….. లవకుశ సినిమాలో పాట బ్యాక్ గ్రవుండ్లో, దగ్గరలో ఉన్న రామాలయం నుండి)

అమ్మ: “నాన్నా సతీష్ లేవరా.. కాలేజ్ తైమౌతుంది.. త్వరగాలేచి స్నానంచేయి..”.

సతీష్: (బద్దకంగా ముసుగులోనుండి) “అప్పుడే ఎందుకే.. అమ్మా!! ఇంకాలేస్తాలే.. నువ్వెళ్ళు..నే లేస్తా!!”

(రడీ అయ్యాకా.. అమ్మ ఇచ్చిన టిఫిన్ బాక్స్ చేత పట్టుకుని సైకిల్ పై బయలుదేరాడు సతీష్

సతీష్ ఆలోచనలు పరుగులు పెడుతున్నాయ్.. సైకిల్ తో పాటుగా వేగంగా… నేను పొద్దున్నే లేవటానికి ఇంత కష్టపడుతున్నా.. అమ్మ నాకంటే.. రెండుగంటల ముందులేచి నాకు కావల్సినవన్నీ చేస్తుంది.. , నాన్న లేని లోటు అనిపించకుండా పెంచింది. ఎంతో కష్టపడుతుంది.. నాకోసం.. , రేపు నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించి అమ్మని కూడా అలా చూసుకోగలనా?. లేదు నేను బాగా చదవాలి.. భాద్యతలు నేర్చుకోవాలి… ఈ ఆలోచనల పరుగులో కాలేజ్ రానే వచ్చేసింది).
**********
CUT TO INT – సతీష్ వాళ్ళ ఇల్లు, ఆంధ్రా.

సతీష్ : (పరుగుపరుగున వస్తూ) “అమ్మా.. ఒక మంచి వార్తే.. నాకు ఉద్యోగం వచ్చింది.. హైద్రాబాద్ లో, పదివేలు జీతం, ఈ నెలాఖరుకి వెళ్ళాలి, తరువాత తరువాత కంపెనీ తరపునుండి అమెరికా కూడా వెళ్ళే అవకాశాలున్నాయంట.”

అమ్మ: (ఆనందంగా) “మంచిదిరా.. చాలా మంచి వార్త చెప్పావ్..”

సతీష్: (ఆయాసపడుతూ) “అవునమ్మా.. ఇక నువ్వు నాకోసం కష్టపడక్కర్లేదు.. రొండునెలలయ్యాకా.. నిన్ను నాతో తీసుకునిపోతా.. ఇది మన అదృష్టం అమ్మా”

(సతీష్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.. రోజూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటాడు. అమ్మ మాటల్లో సగం జాగ్రత్తలే చెబుతుంటుంది. స్నేహితులతో మంచిగా ఉండు, మంచి స్నేహితులతోనే ఉండు.. చెడుఅలవాట్లుచేసుకోవద్దు, పట్నంలో తిరిగితే.. ఈ అలవాట్లు అవుతాయ్. కానీ మనమేంటో తెలుసుకుని మసలుకో అని చెబుతుంటుంది. ఎటువంటి చెడు అలవాట్లు చేసుకోవద్దని మాటతీసుకుంటుంది.
రోజులు గడిచాయి.. సతీష్ కి అమెరికా చాన్స్ వస్తుంది. కొన్ని నెలల ట్రిప్ కోసం వెళ్ళాల్సొస్తుంది. అమ్మకు తెలియదు కానీ అప్పుడప్పుడు అమ్మకిచ్చిన మాట తప్పుతూనే ఉన్నాడు.)
**********
CUT TO INT – అమెరికాలో సతీష్ ఉంటున్న ఇల్లు

(ఫోన్ మ్రోగుతుంది.. కానీ ఫోన్ తీసే పరిస్ధితిలో లేడు సతీష్.. పార్టీనుండి అప్పడే వచ్చి ఒళ్ళుతెలియకుండా నిద్రపోవడంవలన.
అలా పది పదిహేనుసార్లు మ్రోగి మ్రోగి.. మూగబోయింది ఆ ఫోన్

తరువాతరోజు మిస్ కాల్స్ చూసుకున్న సతీష్ ఇంటికి ఫోన్ చేయ్యగా ఒక షాక్ న్యూస్.. అమ్మకి ఒంట్లో బాగాలేదు అని
ఎవరూ చూసుకునేవారు లేరు కూడా. ఇంటిప్రక్కవాళ్ళు ఫోన్ చేసారు రాత్రి అని తెలిసింది.
వెంటనే ఆఫీసుకు వెళ్లి సెలవు అప్లైచేసాడు.. ఇంటికి బయలుదేరడం కోసం.

ఇంటికి వెళ్ళడానికి 15 రోజులతరువాత కుదురుతుంది.. ప్రస్తుతం కుదరదు అని చెప్పారు కంపెనీ వాళ్ళు.

ఆరోజుల్లో చాలా టెన్సన్ పడ్డాడు సతీష్.. ప్రతిగంటకు ఇంటికి ఫోన్ చేయడం ఎలా ఉంది అనడగటం..
రోజురోజుకూ అమ్మ కోలుకోవడంతో సతీష్ కు టెస్సన్ తగ్గేది.)
**********
INT – రాత్రి, అమెరికాలో ఒక ప్రదేశం, నిండుగా జనంతో ఉన్న ఒక బార్

(లెమన్ జ్యూస్ త్రాగడం అయ్యింది… బార్ నుండి బయటకొచ్చి అమ్మకి పోన్ చేసాడు..)

సతీష్: “అమ్మా!, ఇప్పుడెలా ఉంది.. నేనొస్తున్నా రేపు సాయంత్రం బయలుదేరుతున్నా, పర్లేదు.. సెలవుదొరికింది.. ఒక నెలరోజులు ఉంటాలే అక్కడ.”

అమ్మ: ( వాయిస్ ఫోనులో) “ఇప్పుడు బాగుందిరా..!, మామూలు జ్వరమేరా.. నాకేం పర్లేదు కానీ నువ్వుతొందరపడి రాకురా.”

(ఇండియా వచ్చాడు… అమ్మని కలుసుకున్నాడు…
కొన్నిరోజుల గడిచిన తరువాత తనతో అమ్మని హైదరాబాద్ కి తీసుకువెళ్ళిపోయాడు..
అమ్మకిచ్చిన మాట కూడా నిలుపుకున్నాడు.. )

---------------------------------------------------------------

24, అక్టోబర్ 2006, మంగళవారం

నీ స్నేహం....
ట్రైన్ కూత వేస్తూ చిన్న కుదుపుతో బయలుదేరింది బండి. లగేజంతా సర్దిపెట్టుకుని, చిన్నబ్యాగ్ పక్కన పెట్టుకుని చెవిలో హెడ్ ఫొన్స్ పెట్టుకుని పాటలు వినడంమొదలుపెట్టాడు. అతని పేరు శశి సిటీలో ఉద్యోగం. సెలవు దొరకడంతో సొంత వూరుకి బయలుదేరాడు. మంచి ఎమోషనల్ సాంగ్స్ వినడం అతనికి ఇష్టం. అవే పిచ్చిగా వింటుంటాడు. ఒకే పాట పది సార్లు విని వినీ బోర్ కొట్టింది. బ్యాగ్ లో నుండి వాటర్ బాటిల్ తీసి రెండు గుటకలువేసాడు. పక్కనే ఉన్నపుస్తకం చూసి, హెడ్ ఫోన్స్ తీసేసి చదవడం మొదలుపెట్టాడు. కాళీ ఉన్నప్పుడల్లా తన జీవితంలో మరవలేని విషయాలు పుస్తకం లో వ్రాసుకోవడం అతనికి అలవాటు. అప్పుడప్పుడూ అవి చదివ పాత జ్ఞాపకాలతో ఆనందిస్తుంటాడు.

************************************************

నేను మరువలేని నా స్నేహితుడు విజయ్.. వాడిని ముద్దుగా విజ్జిగాడు అని పిలుస్తా. వాడు మావయ్యకొడుకే.. నాకన్నా నెలలుచిన్న, కాబట్టి మాకిద్దరికీ బాగా కుదురుతుంది ఆటాపాటా. ఐదో తరగతిలోకి రాగానే చదువుకి టాటా చెప్పాడు. మొండివాడిలా బడిమానేసి పొలంపనుల్లో పడ్డాడు. వాడిని చూసి నాకు స్కూలుకి వెళ్ళాలని వుండేది కాదు. కొన్నిరోజులు ఏదో వంక పెట్టి మానేసేవాడిని కానీ ఇంట్లో అమ్నానాన్నా భయంతో స్కూలుకెళ్ళక తప్పేది కాదు. ఎప్పుడు ఇంటికి వచ్చిపడిపోదామా విజ్జిగాడితో కలిసి ఆటలాడుకుందామా అని ఉండేది. స్కూలు నుండి ఇంటి సందులోకిరాగానే పరుగెత్తుకుంటూ పుస్తకాలు విసిరేసి, "విజ్జిగా..", అంటూ వెళ్ళిపోయేవాడిని ఆటలకు. రొండు మూడు గంటలు ఆడి ఇంటికి చేరుకునేవాడిని.

రాత్రి తొమ్మిదింటివరకూ సాగేవి మా ఆటలు. మా వూరి రామాలయం వెనుక కొంత ఖాళీ స్ధలంలో కంద మొక్కలు ఉండేవి. అందరం పంటలు వేసుకుని ఓడినవాడు దొంగ, మిగతావాళ్ళు ఆ కంద చెట్లకింద చీకటిలో దాక్కునేవాళ్ళం. కటిక చీకటి భయం అసలుండేది కాదు దొంగపట్టినవాడికి ఎవరూ దొరకక కన్నీళ్ళొచ్చేవి. ఈ రోజు ఎవరూ దొరకకపోతే తరువాత రోజుకూడా అదే ఆట కొనసాగేది.
పంటలు వేయడంలో విజ్జిగాడు కొన్ని మ్యాజిక్కులు చేసేవాడు. ఎలా పంటలు వేయాలో నాకు చెప్పేవాడు. నేను ఎప్పుడూ దొంగ అవకుండా దాటేసేవాడిని.. ఎవడోవొకడిని భలి చేసేసి ఏడిపించేవాళ్ళం.

ఒక్కొక్కసారి మా మ్యాజిక్కు పనిచేయక విజ్జిగాడు దొంగయ్యేవాడు.. అందరూ దాక్కొనేముందు.. "ఒక ఐదునిముషాలు దాక్కొని వచ్చేసెయ్ ఇంటకి పోదాం", అని చెవిలో చెప్పేవాడు.. చక్కగా ఇంటికి పోయేవాళ్ళం ఎవరికీ తెలియకుండా.. పాపం మిగిలినవాళ్ళంతా కంద మొక్కలమధ్య పాకుతుండేవారు.

ఇంటికిరాగానే ఎక్కడ గోక్కుంటే అమ్మ తిడుతుందో అని ఇబ్బంది పడతూ చాటుగా గోక్కునేవాడిని.. అది గమనించండంతో మొదలయ్యేవి అమ్మ అక్షింతలు.. "మళ్ళీ ఆ ..డొంకల్లో తిరిగొచ్చావా..?, ఉండు నాన్నతో చెప్పి చెబుతా నీ పని", అని. నాన్న వచ్చేసరికి ముసుగు తన్నేసేవాడిని, మళ్ళీ నాన్న లెచేసరికి స్కూలుకెళిపోయేవాడిని. ఎప్పుడైనా ఆదివారాల్లో పడేవి తిట్లన్నీ.. అదీ మన టైము బాగోక నాన్నముందు మా ఆటల విషయాలు మా ఇంటకొచ్చిన మావయ్యల పిచ్చాపాటీ మాటల్లోకొచ్చినప్పుడు.

ఇక వేసవి సెలవుల్లో మాకు పొద్దేతెలిసేది కాదు, ఎండాకొండా తెలియకుండా పొలాల్లో తిరిగేవాళ్ళం. ఎండిపోయిన ఏటిగట్టు ఇసుకల్లో మనుషులు దూరేటంత సొరంగాలు తీసేవాళ్ళం. ఆ గట్టు చాలా ఎత్తుగా ఉండేది. ఒకడు చేయి అందిస్తే కానీ ఎక్కలేం. మా విజ్జిగాడు చుట్టూ తిగిగి ఎక్కి నాకోసం వచ్చి చేయ్యిచ్చేవాడు. ఏరు పొంగితే చాలా వేగంగా నీళ్ళు వస్తాయంట. ఒక్కనిముషంలో ముంచేస్తుంది చిన్నపిల్లలు వెళ్ళకూడదని పెద్దోళ్ళు చెబుతండేవారు.. అది వింటుంటే మాకు భయంవేసేది. "ఒరే.. ఇప్పుడునీళ్ళొచ్చేస్తే..మనం ఏదోలా ఎక్కేస్తాం వీడు ఎక్కలేడు ఎలా రా", అని నన్ను ఏడిపించేవారు విజ్జిగాడు లేని సమయంచూసి మిగతా స్నేహితుల, నాకు భయంతో చెమటలు పట్టేవి. విజ్జిగాడు రావడం చూసి పారిపోయేవాళ్ళు.. లేకపోతే వీవు గుద్దుల తప్పవు వాళ్ళకి, వాడంటే అంత భయం అందరికీ, ఎవరినీ నన్ను ఏమనననిచ్చేవాడు కాదు.

కాస్త సూరీడు నడినెత్తికెక్కేసరికి నిద్రగన్నేరు చెట్టుకింద కూల్ డ్రింక్ మూతలు, సిగరెట్ పెట్టె కాగితాలతో రకరకాల ఆటలు ఆడేవాళ్ళం.

ఆ కాగితాలకి, మూతలకి కంపెనీని బట్టి విలువ ఉండేవి... ఒక గిరి గీసి అందులో పెట్టేవాళ్ళం కాగితాలన్నీ. పలుచని నాపరాయిముక్కతో ఒక పదడుగుల దూరంనుండి కొట్టాలి ఆ కాగితాలని.. గిరిదాటి బయటకొచ్చినవి మనం గెలుచుకున్నట్లు, మళ్ళీఒకసారి కొట్టుకునే చాన్సు వస్తుంది కూడా.., కొట్టే పని నాది.., వచ్చినవి ఏరడం..,పందెం కాయడం... సగం వచ్చినవాటికోసం చెలిగి, దెబ్బలాడి.. సొంతంచేసుకునే పనులన్నీ విజ్జిగాడివి. మా పందాలు లక్షల్లోకూడా ఉండేవి.. , బస్తాలు బస్తాలు పోగుచేసేవాళ్ళం.. అన్నీ మూట కట్టి గెదెల పాక అటకపైకి ఎవరికీ తెలియకుండా రాత్రిసమయంలో దాచేవాళ్ళం.. అరువైనా పెట్టేవాళ్ళం కానీ పాత మూట విప్పడం మాకు ప్రెస్టేజ్ ఫీలింగులాంటిది.


సాయంత్రం అవుతుంటే చెరువులో ఈతకి వెళ్ళేవాళ్ళం. నాకు పెద్దగా ఈతరాదు.. విజ్జిగాడు సాయంతో కాస్త నేర్చుకున్నా., నీళ్ళల్లో కూడా రకరకాల ఆటలు ఆడేవాళ్ళం. చిన్న ఆకు ముక్కని నీటిలోవేసి వెతకాలి. దొరికినవాడు త్వరగా గట్టెక్కేయాలి. లేకపోతే పక్కనున్నవాడు తన్నుతాడు. ఎంత సరదాగా ఉన్నా తన్నులకి కాళ్ళునెప్పిపుట్టేవి తరువాత రోజు. జామకాయలు, మామిడికాయలు పక్కూరి వాళ్ళ తోటల్లో చెట్ల కొమ్మల్లో కూర్చుని తినేవాళ్ళం. మాలో ఎవడొకడు తెలివిగా ముందే ఉప్పుకారం కలిపిన పొట్లం పట్టుకొచ్చేవాడు నంజుకుతినడానికి. ఇక తేగలు బుర్రగుంజు చెప్పనక్కర్లేదు, సీజన్ బట్టి మా తిండి ఉండేది. ముంజికాయల సీజన్లో గెలలు గెలలు తినేవాళ్ళం. విజ్జిగాడు చెట్టు ఎక్కడంలో మంచి నేర్పరి. చింతకాయలు సీజన్లో చెట్లకింద ఉయ్యాలలూగుతూ తినడం. ఈతకాయలైతే పాకలోని ఇనుపడబ్బాలో ముగ్గబెట్టి రోజూ ముగ్గిన పళ్ళు నాకంటే నాకు అని దెబ్బలాడి మరీ తినేవాళ్ళం.


పొలాల్లో గట్లు దాటడం, చెరుకుతోటల్లో కబుర్లు, చెరువుల్లో ఈతలు చేసిన అల్లర్లు భలేగుండేవి.

ఇక షష్టి, శివరాత్రి ఉత్సవాలు మరువలేనివి మాకు. ప్రక్కవూరి పొలాలగట్లంటా రొండు కిలోమీటర్లు నడిచి గుడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ తీర్ధంలోని దుకాణాలలో జీడ్లు, ఖర్జూరం కొనుక్కుని, కావలసినవి తినడం ఒక సరదాయైతే ఆడుకోవడానికి మార్కెట్టులోకి వచ్చిన ఆకర్షించే ఆటవస్తువులు కొనడం ఇంకొక సరదా. ఒకసారైతే నేను వాటర్ గేమ్.. విజ్జిగాడు మెషిన్ గన్ కొనుక్కుని ఇంటిదారి పట్టాం. స్నేహితుడొకడు నేనేంకొన్నానో చూడండ్రోయ్ అంటూ జేబులోంచి పాలక్యాన్ల లారీ బొమ్మ తీసాడు.., “ఏరా!.. ఇక రేపట్నుండి మీ నాన్న సైకిలు మానేసి ఈ లారీపై వెళతాడా”, అని అందరం విరగబడి నవ్వుకున్నాం.., వాళ్ళనాన్న పాలవ్యాపారి మరి.

ఆ నవ్వులాటలో నా వాటర్ గేమ్ కాస్తా.. పక్కనున్న పంట బోదిలో పడిపోయింది.. “అయ్యో “,అన్నానో లేదో.. విజ్జిగాడు దూకి ఈతకొట్టి పట్టేసాడు..

మళ్ళీ అదేరోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం. చక్రంఆట, గుండాట, తెరసినిమాకోసం. చక్రంఆట దగ్గర పిల్లలు ఈగల్లా మూగేవారు. మేం గుండాటలో కాసేవాళ్ళం. ఏ అంకె వస్తే అన్ని రెట్లు ఇచ్చేవారు. సినిమా హీరోల బొమ్మలతో ఒక ఆట ఉండేది. వస్తే ఏబయ్ అరవై వచ్చేవి.. పోతే ఒక్కసారే పోయేవి డబ్బులంతా. ఒక్కోసారి పోలిసులొస్తున్నార్రోయ్ అనగానే బల్లమీద డబ్బులు లాక్కొని కొందరు, చెరువుల్లోకి దూకి కొందరు, కోళ్ళఫారాల్లోకి కొందరు, ఆకుమడులు తొక్కుకుంటూ కొందరు పారిపోయేవారు.

రాత్రి తెరసినిమా చూసి అదే పంట గట్టుపై , వెన్నెల కాంతిలో ఒకడి చొక్కాకొస ఒకడు పట్టుకుని లైనుగా నడుస్తూవచ్చేవాళ్ళం. “ఒరే!.. శ్రీదేవి , జయప్రద మీద ఏబయ్ సంపాదించా..రా!.. ఆ ఏన్టీవోడు మొత్తం పట్టుకుపోయాడ్రా.., లేకపోతేనా ఈ వారం అంతా గొల్లతాత కొట్టులో జీడ్లు పార్టీ నెనే చేసేవాడిని..”, అన్న మాలో ఒకడి మాటలకి నవ్వుకున్నాం. ఇంతలో వెనకాలున్న వాడు , “ఒరే!!.. చెరుకుతోటలో ఏదో చప్పుడైంది.. బాబోయ్ కొరివి దెయ్యమేమో”, అనగానే.. ఎవడికి తోచిన దారిలో వాళ్ళు పరుగులంకించాం.

ఇక మా ఊర్లో వేసే తెరసినిమాకైతే మా హడావుడి చూడాలి. అప్పుడు మా ఫేవరెట్ హీరో కృష్ణ, మిగతావాళ్ళూ, ఎన్టిఆర్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ అలా ఉండేవి. ఎవడి హీరో సినిమా ఐతే వాళ్ళ పక్కవూరెళ్ళి బుడగలు తెచ్చేవాళ్ళం. బుడగల్లో పువ్వులు నింపి… హీరో కనబడినంతసేపూ… తెరమీదకు ఎగరేసేవాళ్ళం ,తెరమీద నీడ పడి సినిమా కనబడడంలేదని పెద్దవాళ్ళు తిట్టినా లెక్కచేసేవాళ్ళంకాదు. ఈ లోపు మా హీరో అంటే పడనివాళ్ళ రబ్బరుబ్యాండుకు కాగితంముక్కలు సంధించి బుడగలు పేల్చేసేవాళ్ళు. “ఎవడ్రా పేల్చింది …”,అని పెద్దగొడవ.., కొట్లాటలతో చెరుకుతోటల్లోకో, బడివెనక్కో పెద్దొళ్ళకి కనబడకుండా వెళ్ళి కొట్టుకునేవాళ్ళం.

రోడ్డుపై తెరకట్టివేసేవారేమో సినిమా.. రోడ్డంతా ధియేటర్ లా ఉండేది.. ముందు వరుసకోసం ముందుగానే, గోనేసంచె లేదా చిన్న పీట వేసి రిజర్వ్ చేసుకోవాలి.. విజ్జగాడు ఇన్ప్లియన్స్ చేసి ముందు వరుసలో పట్టేవాడు సీటు.

కానీ ఒక్కొక్కసారి బాగోని సినిమాకైతే, ప్రొజెక్టర్ ఆపరేటర్ కి టీ తెచ్చి మంచి చేసుకుని, రీలు ఎలాపెడుతున్నాడో, చక్రం ఎలా తిరుగుతుందో లాంటి విషయాలు నోరు వదిలేసి విచిత్రంగా చూసేవాళ్ళం.

“ఒరే.. విజ్జిగా.. ఇందులో గొప్ప టెక్కునిక్కుందిరా..!, ఎప్పటికైనా సినిమాతీయ్యాల్రోయ్..”, అని నేనంటే.. “హా.. తీద్దాం రా.. తీద్దాం.. మన సూపర్ హీరోని పెట్టి తీద్దాం..”, అనేవాడు నాతో.

“ఎల్లి సినిమా చూడండ్రా కూకొని.. , సినిమా తీస్తాడంట.. సినిమా.. తెరకి అడ్డంగా నిలబడి చెబుతున్నాడు పెద్ద…“, అని ఇద్దరికి తలమీద ఒక్కటిచ్చేవాడు.. మా ఊరి మున్సీబు తాత. కాస్తా సీరియస్ గా ఆయన్ని చూసి తిట్లన్నీ మనసులోతిట్టేసుకుని.. కళ్ళనీళ్ళతో.. సినిమా చూసేవాళ్ళం.

వాడికినాకు పెద్ద గొడవలొచ్చిన సందర్బాలు తక్కువ. ఒకేఒకసారి వాడికి నాకు గొడవొచ్చి మాట్లాడుకోలేదు. ఒకరోజు పొద్దున్న నేను మంచంపైనుండిలేచి వంట గదిలోకొచ్చా.. “ఏరా!!.. పొద్దున్న ఎవరైనా ఇంట్లోకొచ్చారా..”, అని అమ్మ అడిగింది నన్ను.. “ఏమోనమ్మా.. తెలియదు.. నేను నిద్రపోతున్నా..”, అన్నానేను..ఆవులిస్తూ. “సరిగ్గా గుర్తుచేసుకో”, అంది అమ్మ మళ్ళీ. “హా.. విజ్జిగాడు పాలుతీసుకొచ్చి బల్లపై పెట్టాడు.. నన్ను లేపాడు కూడా.. ఇంకా నిద్రపోవాలిరా అంటే.. వెళ్ళిపోయాడు.. ఏ ఎందుకమ్మా?”, అని అడిగా అమ్మని.. “ఏమీలేదురా.. “,అని మాటదాటేసింది అమ్మ.


ఆరోజునుండి రెండురోజులు నాకు కనబడకుండా తిరిగాడు విజ్జిగాడు.. ఏమైందో తెలియదు.. అక్కని అడిగా.. కూరగాయలకోసం పెట్టిన పదిరూపాయలనోటు కనబడడంలేదని అమ్మవాడిని నిలదీసిందని.. నాన్న కూడా మావాడితో తిరిగి చెడగొడుతున్నావ్ వాడిని అని తిట్టార్రా, తరువాత పదిరూపాయల నోటు బల్లకింద కనపడిందిరా పాపం అని విషయం చెప్పింది అక్క.


అమ్మానాన్నా వాడిపై కక్ష కట్టారని తెలుసుకున్నా. వాడికోసం వెదికా.. సాయంత్రానికి దొరికాడు.. ఊరిచివర చింతచెట్టుక్రింద బండిపై ఆడుతూ., పలకరించా.. నావైపు కోపంగా చూసాడు.. “ఒరే..! నువ్వునాతో తిరక్కురా చెడిపోతావ్.. వెళ్ళి చదువుకో…, నేను దొంగతనం ఒకటిచేసాను ఈరోజు.. ఆ దొంగబుద్దులన్నీ నీక్కూడా అంటుకుంటాయ్ వెళ్ళరా.. “, అన్నాడు కోపంతో.. నాకు కన్నీళ్ళొచ్చాయి.. ఏడ్చేసాను..

మళ్ళీవాడే నన్ను దగ్గరకు వచ్చి ఊరుకోరా.. అంటూ ఓదార్చాడు.


ఇవన్నీ కాస్త చిన్నప్పుడు. నిక్కర్లు మాని ప్యాంట్లు వేసుకునే వయసులోనైతే చేసిన అల్లర్లు చెప్పనక్కర్లేదు. అంతా కలిసి సైకిళ్ళపై సెకండ్ షో సినిమాలు. అర్ధరాత్రి చెరకుతోటల్లో కూర్చుని చెరకుగడలు తింటూ సినిమా కబుర్లుచెప్పుకోవడం. ప్రక్కవూరి జాతర్లకు, రికార్డంగ్ డ్యాన్సులకు తిరగడం. నన్నైతే ఇంట్లో బయటకు పంపించేవారుకాదు.. వేసవికాలంలో అందరం డాబాపై పడుకునేవాళ్ళం.. కాబట్టి.. అందరూ పడుకున్నాకా నెమ్మదిగా ఎవరికీతెలియకుండా చెక్కేసి ఏటిగట్టువంతెన దగ్గర చీకట్లో ఎదురుచూసేవాళ్ళం మిగతావారికోసం.. అక్కడ అందరం కలుసుకుని.. ఏం చేయాలో ఆరోజు ప్లాన్ చేసేవాళ్ళం.


సంక్రాంతి బోగి పండుగ రేపనగా ముందు రోజు రాత్రి పదకొండింటికి మొదలయ్యేది మా పుల్లలూ, పిడకలూ వేట.. తరువాతరోజు బోగిమంటకోసం.. ఎవడైతే నాది ఇదిపోయింది, అదిపోయింది అని బాగా కేకలేసి తిడతాడో వాడింట్లోవే ఎక్కువ పట్టుకొచ్చేవాళ్ళం. తెల్లవారేసరికి ఏది కనబడకుండా కాల్చేసేవాళ్ళం. మేం ఆరోజు రిలీజుయైన కొత్తసినిమాలు చూడడానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి కనబడేవాళ్ళం.., వచ్చేసరికి తిట్లైపోయి.. అందరూ మర్చిపోయేవారు జరిగినవిషయాలు.

ఇక శ్రీరామనవమి కి ముందురోజు రాత్రి పందిర్లువేయడం, తోరణాలు కట్టడం, కొబ్బరాకులు జండాలతో అలంకరించడం అవీ చాలా పద్దతిగా చేసేవాళ్ళం.. ఈ పండుగల్లో చేసే తాళాల భజన, కోలాటాలు అంటే నాకు చాలా ఇష్టం. కష్టపడి నేర్చుకున్నాం కూడా. రాత్రంతా భజనలు చేసి అలసిపోయి ఆకలేస్తే తోటల్లోకి పోయి తినిరావడమే పని మాకు.

విజ్జగాడు పూర్తిగా వ్యవసాయపనుల్లో పడ్డాడు. వాడు పడినంత కష్టం నేనెప్పుడూ పడలేదు. చాలా కష్టపడేవాడు.. వాడేకాదు మా ఊరిజనమంతా అంతే..వేసవి మండుటెండలో నడుంవొంచి ఐదారుగురు ఒక ఎకరం వరిపొలం కోయడం మాటలా?, నేనలా చేస్తే. కళ్ళుతిరిగి పడటమో లేక ఒక నెలరోజులు వొంగి నడవడమో చెస్తామేమో.. నేను చదువుకోవడం వలన చాలా సున్నితంగా పెరిగా..
ఎండలో అంతలా కష్టపడి పనిచేసినా పంటచేతికొచ్చే సమయంలో వర్షాలు వరదలూ వలన లాభం చేతికందేది కాదు. మామూలు రోజుల్లో విజ్జిగాడు రోజుకూలీ పనులు కూడా చేసేవాడు.

వాడు పొలంపనుల్లో, నేను చదువులో బిజీయై మా తిరగుళ్ళు కాస్త తగ్గాయి. ఇక రాత్రి సమయాల్లో పరిమితమైపోయాయి.

నాకు దూరంగా ఉద్యోగం వచ్చింది అప్పుడప్పుడూ ఇంటికి వెళ్ళేవాడిని.. ఇక వెళ్ళినప్పుడే కలుసుకునేవాళ్ళం. ఫోను వాడు చేసేవాడు కాదు. నేను ఇంటికి చేసినప్పుడు కూడా ఎప్పుడూ దొరికేవాడు కాదు. నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకు ఇష్టమైనవన్నీ తెచ్చి ఇవ్వడంలో బిజీయైపోయేవాడు విజ్జగాడు. కానీ నేను వాడికి ఏమి తీసుకెళ్ళాలా అని అలోచించేవాడిని.., వాడికి ఇష్టమైనవి ఏంటో కూడా సరిగ్గా తెలియదు నాకు, ఒకసారైతే.. వాడికోసం బట్టలు కొని తీసుకెళ్ళిచ్చా.. "ఏరా.. !, నాకూ టీషర్ట్ జీన్స్ తేవొచ్చుగా.. ఏ.. నేనేసుకోకూడదా.. ", అన్నాడు సరదాగా...,

"లేదురా!!.. మన ఊరిలో అవేసుకుంటే నవ్వుతారని ఇవే తెచ్చారా..", అన్నాను నేను. వాడికేది ఇష్టమో కూడా తెలుకులేకపోయా.. కానీ నాకేది ఇష్షమో అన్నీవాడికి తెలుసు.

వాడిదగ్గరున్నన్ని రోజులూ టీషర్ట్స్, జీన్స్, షూష్.. అవి వేయడం మానేసి సింపుల్ గా ఇంతకు ముందు ఎలా ఉండేవాడినో అలాగే ఉండేవాడిని వాడితో .. వాడెదురుగుండా సెల్ పోన్లో మాట్లేడేవాడిని కాదు.. ఇంగ్లీషులో మాట్లాడి కటింగులిస్తున్నట్లుంటుందని, కొలీగ్స్ ఫోన్ చేస్తారేమోనని సెల్ స్విచ్చాఫ్ చేసి ఇంటిలో పెట్టేసేవాడిని. ఎక్కడ తేడాగా ఉన్నావాడు నువ్వుమారిపోయావ్ రా అని అంటాడేమోనని, బాధపడతాడేమోనని మరి భయమేమోనాకు?.

సెలవులు ఎక్కువ దొరకక ఎన్నోరోజులుండేవాడిని కాదు ఇంట్లో, ఒకవేళ ఉన్నా ఒకటి రొండు రోజులు వాడితో కలిసినా, మిగతారోజులు చుట్లాలిల్లకి వెళ్ళడమే సరిపోయేది.

ఏదైనా ఇంతకుముందులా వాడితో మనసువిప్పిమాట్లాడలేకపోతున్నందుకు బాధగానే ఉంది..

*************************************************

ఎవరో తట్టినట్లు అనిపించి.. ఉలిక్కిపడి పుస్తకం మూసి చూసేసరికి పక్కన ఒక పెద్దాయన..."బాబూ.. నీది ఏ బెర్తు", అని అడిగారు శశిని. "మిడిల్ బెర్తండి", అన్నాడు శశి. "కాస్తా పై బెర్తులో సర్దుకుంటావా.. లేడీసు ఉన్నారు.. ", అని పెద్దాయని రిక్వెస్ట్ చేసాడు.. సరేనని.. పైబెర్తు ఎక్కి పడుకున్నాడు శశి.

ఇంటికి చేరుకున్నాడు.. స్టేషన్ నుండి ఆటోలో ప్రయాణించి. బ్యాగ్ మూలపడేసి.. బట్టలుమార్చుకున్నాడు స్నానంకోసం రడీఅవుతూ. "విజ్జిగాడేడమ్మా??", అని అమ్మని అడిగాడు శశి.

"అదేరా.. నువ్వొస్తున్నావని.. నీకిష్టమని చింతకాయ చిన్నచేపలు కూర చేయండి.. చేపలు తెస్తా.. అని వెళ్ళాడు.. మరి ఇంకా రాలేదు.. ఇప్పుడు ఆ నాగన్నచేత బలవంతంగా వల వేయించైనా చేపలు పట్టించి మరి తెస్తాడు నీ కోసం", అని నవ్వుతూ చెప్పింది అమ్మ. స్నానంచేసి రడీ అయ్యే సరికి విజ్జగాడు చేపల బుట్టతో వచ్చాడు.. శశిని చూసి, "ఏరా!.. ఎలా ఉన్నావ్, ప్రయాణం బాగా జరిగిందా.. ",అని పలకరిస్తూ చేపల బుట్ట అమ్మకి అందించాడు. బాగానే ఉన్నాన్రా.. నువ్వెలా ఉన్నావ్ రా.. అని కాసేపు కబుర్లు చెప్పుకున్నారిద్దరూ..

విజ్జిగాడికోసం తెచ్చిన టీషర్ట్ , జీన్చ్ ఇచ్చాడు శశి. టీ త్రాగి కాసేపు ఉన్నాకా.. బయటకు బయలుదేరారిద్దరూ.

"పనులెలా నడుస్తున్నాయ్ రా.. మనవాళ్ళంతా ఎలా ఉన్నారు.. నిన్ను నాతో తీసుకెళదామంటే.. అక్కడేముందిరా.. నువ్ చెయ్యడానికి.. నేను దగ్గరికొచ్చి సెటిలైపోయాకా.. ఏదైనా బిజినెస్ పెడదాం", అన్నాడు శశి..

"అవునురా.. చూడాలి.. వ్యవసాయం పనులు అసలు బాగోడంలేదు. కలిసిరావడంలేదురా.. మనోళ్ళంతా దుబాయ్.. పోతున్నారు. నేను కూడా చూస్తున్నా మరి ఏమైతుందో చూడాలి", అన్నాడు విజ్జగాడు.

"అదీ.. మంచిదేరా.. ప్రయత్నించు..", అని సలహా ఇచ్చాడు శశి.

వారంరోజులు ఒక్కరోజులా గడిచిపోయాయి.. ఒకేఒక్క సినిమాకి వెళ్లారు ఇద్దరూ కలిసి.

తిరుగుప్రయాణంతో బయలుదేరాడు శశి.. జోరున వర్షం మొదలయ్యింది.. తోడుగా వస్తాన్నాడు విజ్జగాడు స్టేషన్ వరకూ.. వద్దు వర్షం నేను ఆటోలో వెళ్ళిపోతా అన్నా వినకుండా కూడా వచ్చాడు.. గొడుగు చిన్నది కావడంతో విజ్జగాడు మొత్తం తడిసిపోయాడు..
స్టేషన్లో నిలబడ్డారిద్దరూ.. "మొత్తం తడిసిపోయావురా...", అని శశి అంటే.. "పర్లేదురా.. ఇంటికి వెళ్ళిపోతాగా.. పర్లేదు", అన్నాడు విజ్జిగాడు.

"ఎలా వెళతావ్ ఇంటికి.., వర్షంబాగా ఎక్కువగా ఉంది..?", అని అడిగాడు శశి
"ఆటోలో వెళతారా.. ", అన్నాడు విజ్జగాడు, "ఐతే.. ఇది ఉంచరా..", అని జేబులోనుండి.. ఒక వందనోటు తీసిచ్చాడు.. "వద్దురా.. వద్దు.. నాదగ్గరున్నాయ్.. ", అని ఎంత ప్రయత్నించినా తీసుకోలేదు డబ్బులు.. విజ్జిగాడు.. ఇంకా ఎక్కువ బలవంతపెడితే.. వాడెమైనా అనుకుంటాడేమోనని శశి ఏమీ మాట్లాడకుండా.. వందనోటు జేబులో పెట్టేసుకున్నాడు.

ట్రైన్ వచ్చింది.. విజ్జిగాడు.. గబగబా.. లగేజి లాక్కుని.. ఎక్కి అంతా సర్దేసాడు.. "జాగ్రత్తరా.. జాగ్రత్తగా ఉండు..", అని చెప్పాడు శశికి..

ట్రైన్ కదిలింది.. టాటా చెబుతూ ఫ్లాట్ ఫాం పై నిలబడ్డాడు విజ్జగాడు.., అలా టాటా చెబుతూనే.. విజ్జగాడికి దూరంగావెళుతున్నకొద్దీ శశి కంటినిండా కన్నీళ్ళు రాసాగాయి...

ఇప్పటికే.. నీకు నేను చాలా ఋణపడిపోయా..వచ్చిన ప్రతీసారి ఇంకా ఋణపడుతున్నా.. నేనేలా నీ ఋణంతీర్చుకోనురా.. , నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం...అని మనసులో అనుకున్నాడు శశి.

18, అక్టోబర్ 2006, బుధవారం

పెళ్ళి గోల

పేరు శెఖర్ వ్వవసాయశాఖలో సీనియర్ ఇంజనీర్ , వయసు 30, మంచి జీతం, పెద్దగా బాధలు లేని జీవితం.
ఖాళీ దొరికినప్పుడల్లా పాపం తలపైన చెయ్యివేసి, పోయిన నాలుగెకరాల జుట్టుగురించి బాధ, ఇంకా పెళ్ళి కాలేదని.. అందరూ ఏడిపిస్తున్నారని బాధతప్ప.

**************
“అబ్బే అప్పుడే పెళ్ళేంటండీ మావాడికి. ఇంకా 21 వాడికి.. చదువు పూర్తికావాలి, సెటిల్ అవ్వాలి.. ఇంకొక రెండుమూడేళ్ళవరకూ ఆ ఆలోచనలేదండీ మాకు.”, అన్నఅమ్మ మాటలు చాటుగా వింటూ, అద్దంలో ఒకసారి మొహంచూసుకుని, మీసాలు దువ్వుకున్నాడు శేఖర్. ఓ మనకు సంభంధాలు రావడం మొదలుపెట్టాయి అని మనసులో తెగ మురిసిపోయాడు. శేఖర్ అప్పుడు ఇంజనీరీంగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు లోకల్ కాలేజీలో.

**************
“ఛా.. చెప్పేయాల్సిందిరా! శేఖర్ నువ్వంటే ఇష్టం అని.., పెళ్ళి చేసుకుంటా అని, అంతలా ఆ అమ్మాయి వచ్చి అడిగినా నువ్వు మాట్లాడవే?. , మీ ఇంట్లో ఎదిరించి పెళ్ళి చేసుకోవచ్చుగా. కొంతకాలం గడిస్తే మీ అమ్మా నాన్నా ,వాళ్ళే అన్నీ మర్చిపోతార్రా, ఖచ్చితంగా అంగీకరిస్తార్రా.. ఇలా ఎన్ని ప్రేమకధలు చూడలేదురా…”, ప్రేమించిన అమ్మాయికి పెళ్ళిసంభందాలు చూస్తున్నారని వచ్చి చెప్పినప్పుడు. శేఖర్ ఏమిమాట్లాడకుండా ఉన్నందుకు తన ఫ్రండ్ సుందర్..అన్న మాటలు

ఇంజనీరింగ్ అయ్యి సంవత్సరమైనా ఇంకా ఉద్యోగలేక, ప్రయత్నాల్లో ఉన్న శేఖర్ ఇంట్లో వాళ్ళను నొప్పించలేక, శేఖర్ మంచి బాలుడు అని ఊరిలో ఉన్న పేరు చెడగొట్టుకోలేక, ప్రేమించిన అమ్మాయి దగ్గర మౌనం వహించాడు. ఆ అమ్మాయికి తరువాత పెళ్ళైపోయింది.

**************
చదువు పూర్తియిన ఐదవ సంవత్సరానికి వచ్చింది ఉద్యోగం, జూనియర్ ఇంజనీరుగా, అందరూ "మనవాడు సాధించాడ్రా" అంటుంటే. శేఖర్ కి పట్టలేని ఆనందం. 'ఇంకేంటి ఇక పెళ్ళే. త్వరలో పిలుస్తాడు అందర్నీ", అని ఫ్రండ్సంతా అంటుంటే. అవును ఇప్పటికే బాగా ఆలస్యమైంది ఇక పెళ్ళిప్రయత్నాలు మొదలుపెట్టాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.

సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఇంట్లో వాళ్ళు పెళ్ళిమాట ఎత్తడంలేదు. ఇంట్లో డైరెక్టుగా అడగలేడు.. కారణం ఏంటని. ఒక స్నేహితుని ద్వారా తెలిసిందేంటంటే. వచ్చిన ప్రతిసంభందానికి ఏదో వంకలు పెట్టి పంపించేస్తున్నారని , ఎవరైనా అడుగుతుంటే.. అప్పుడే కంగారేముందివాడికి అన్న సమాధానమొస్తుందని తెలిసింది.

బయట జనాల గోల పడలేకపోతున్నాడు శేఖర్. సెలవుపై ఊరు వెళ్ళినపుడు ప్రతివాడు చేసిన వెటకారం తలచుకుంటే ఒళ్ళుమండింది. ఇక పెళ్ళయ్యేవరకూ మళ్ళీ రాకూడదు అని నిర్ణయించుకున్నాడు.

************
ఫ్రండ్స్ అంతా అంకుల్ అనడం మొదలుపెట్టారు.. "బాబాయ్ అని పిలవండ్రా", అని చిరాకు పడ్డాడు వాళ్ళపై శేఖర్. "మరి ఇరవైతొమ్మిది వచ్చాయ్ ఏమనాలమ్మా అంత చిరాకు పడుతున్నావ్", అని వెటకారంచేసారు.. 'ఒరే మీ ఏజ్ కూడా అంతేరా.. కానీ మీలో ఎవడూ నిజం డేటాఫ్ బర్త్ చెప్పడు.. నేనే చెప్పుకున్న వెధవని ",అని కవర్ చేసుకున్నాడు.

ఈ మధ్య ఒక కొత్త విషయం ఒకటి కనిపెట్టాడు శేఖర్.. ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా పెళ్ళికి సంభందించిన పాటలు పెట్టడం మొదలుపెట్టాడు.

“ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి..”

“శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం.. ఇక ఆకారం….”, ఈ పాటలు గమనించిన శేఖర్ వాళ్ళమ్మ.. "అదేంటిరా కొత్తపాటలు వినక అవేంపాటలురా..", అంటే.. "అవా.. ఇక్కడ లోకల్ రేడియోలో అమ్మా", అని మాటదాటేసాడు.., "మరి ఎప్పుడూ అవే వరసలో వినిపిస్తున్నాయి.. దీనితరువాత.", “ఏడడుగుల సంభంధం.. ఏనాడో వేసిన భందం” ఆ పాట వస్తుంది కదా??, అని అనేసరికి శేఖర్ నాలుక్కరుచుకుని "నేను తరువాత మాట్లాడతా.." అని పెట్టేసాడు ఫోను.

"ఛీ.. ఈ పాట తరువాత ఏ పాటో తెలుసు కానీ, ఈ పాటలు ఎందుకు పెడుతున్నాడో కొడుకు అని అర్ధంకాదా… వీళ్ళకి..", అని ఒక్కసారి తలగోడకేసి కొట్టుకున్నాడు..

"ఉద్యోగం ఎలా ఉందిరా", అని వాళ్ళ నాన్న అన్నప్పుడు, 'ఉద్యోంగ పర్లేదు నాన్నా వంట అది చేసుకోలేక చేతులు కాల్చుకుంటున్నా. బయట హోటల్ భొజనం తినలేక ఆరోగ్యం పాడవుతుంది", అని చెప్పడం మొదలు పెట్టాడు.

"ఐతే వంటమనిషిని ఒకడిని కుదర్చనా పోనీ.. మన ప్రసిడెంటు గారి అబ్బాయిక్కూడా మొన్నే ఒకతన్ని వంటకు కుదిర్చా..", అని సలహా ఇచ్చిన నాన్నని ఏమనాలో అర్ధం కాక.. ఫోను "హలో!. హలో!!.. వినపడడం లేదు", అని కట్ చేసేసాడు.

"ఛీ.. ఇంక సిగ్గు విడిచి పెళ్ళివిషయం అడిగినందుకు నాకు సిగ్గుండాలి.. ఇక ఈ విషయం వీళ్ళముందెత్తను.. నాకు బుద్దొచ్చింది..", అని ఒక వారంరోజులు ఫోను చేయడం మానేసాడు ఇంటికి.

************

కాలం గడిచింది…ఆధ్యాత్త్మికం అబ్బింది శేఖర్ కి.. బ్రహ్మచర్యమే బెస్ట్ అని నిర్ణయించుకుని. దానికి సంభందించిన పుస్తకాలు చదవడం, సత్సంగాలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. సంసారం సాగరం.. అది అంటని మనిషి మహామనిషి అవుతాడు అని అందరికి చెప్పడం, పెళ్ళైన తరువాత ఫ్రీడం ఉండదు అని చెప్పే వాళ్ళతో కలిసి సై అంటే సై అని లెక్చర్లు కొట్టడం, కనపడ్డ ఫ్రండ్స్ కి క్లాసులు పీకడంతో ఎవడూ దగ్గరకు రావడానికి.., పెళ్ళిగురించి ఎత్తడానికి సాహసించడంలేదు.

అదే సమయంలో ఇంట్లో వాళ్ళు ఏవో సంభందాలు వచ్చాయి.. చూడడానికి రమ్మని పిలుపు.

నేను రానంటే రాను.. పెళ్ళే చేసుకోనని మొండి పట్టు.. , మావయ్వ నుండి, అన్నయ్యలనుండి బ్రతిమలాట కాల్స్ లా ఫోన్స్ రావడం మొదలయ్యాయి. గోల భరించలేక పోను కట్ చేసేసాడు.

************

ఎలాగైతే బలవంతంగా ఒప్పించారు పెళ్ళికి ఇంట్లోవాళ్ళు.. వచ్చినవాటిలో ఒకమ్మాయి ఒకే చేసాడు..
పెద్దాళ్ళంతా పెళ్ళి హడావుడిలో పడ్డారు.

ఇప్పుడు శేఖర్ కి వచ్చిన పెద్ద చిక్కల్లా ఇక్కడే ఉంది..ఆధ్యాత్త్మికం క్లాసులు పీకినవాళ్ళను పెళ్ళికెలా పిలవాలా అని…

30, ఆగస్టు 2006, బుధవారం

CRY

ఒకప్పుడు వెయ్యి రూపాయల్లోనే అన్ని ఖర్చులూ పోగా ఇంకా కొంత డబ్బు దాచుకునేవాడిని.. ఇప్పుడు ఎంత వస్తే అంత ఖర్చు అన్నట్లుంది.. అసలు చేతిలో పైసా ఉండడంలేదు. ఒక్కొక్కసారి అనుకునేవాళ్ళం ఫలానా అతనికి నెలకు ఇంత సంపాదిస్తున్నాడంట..!, అంత డబ్బు ఎలా దాస్తాడో అని.. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.. ఎంత సంపాదించాం, ఎలా సంపాదించాం అని కాదు.. సంపాదించినది ఎంత తెలివిగా ఖర్చుచేస్తున్నాం అన్నది ముఖ్యం అని.

వచ్చే డబ్బును బట్టి మన ఆలోచనలు కోరికలు ఉంటాయి. ఒకప్పటి రెండు రూపాయల బ్లేడు.. ఇప్పుడు రెండువందల రూపాయల జిల్లెట్ మ్యాక్ త్రీ షేవర్ అవుతుంది. మాములుగా తినే తిండి కాస్తా అనారోగ్యకరమైనదిగా తోస్తుంది.. చిన్న హొటల్స్ లో తిండి మాని కాస్ట్లీ రెస్టరెంట్ల మీద పడతాం. అందరూ త్రాగే మంచినీళ్ళు మంచివి కాదన్న అనుమానం మొలకెత్తి ఫిల్టర్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుని త్రాగుతాం. కాస్త దూరానికే.. “ఆటో.. !”,అని చక్కగా.. కడుపులో చల్ల కదలకుండా.. పనులు కానిస్తాం. నాలుగేసి జతల బూట్లు, రకరకాల దుస్తులు.. నైట్ డ్రస్సులు, పార్టీ వేర్. షాపింగ్ వేర్.. మార్నింగ్ వేర్ ఇలా అన్నీ బ్రాండడ్ వాటిపై కన్ను పడుతుంది. చీప్ వాటిపై చీప్ లుక్స్ వేస్తాం.

అనవసరమైన షాపింగులు.. అవసరంలేకున్నా వస్తువులు వచ్చిపడతాయి ఇంటికి. మనకి ఇష్టముండక పోవచ్చు కానీ చూసే వాళ్ళకోసం ఈ ఖర్చులు అవీనూ.

ఇదే టాపిక్ వచ్చింది నా కొలీగ్ కి నాకు ఒకసారి.. అతని పుట్టిన రోజుకని బట్టలు తీసుకోవడానికి బయలుదేరాం. వెళ్ళి చూసాకా అన్నీ రెండువేలు మూడువేలూనూ.. నేనన్నా “నాకు ఊరికే డబ్బులు వచ్చినా ఇంత ఖరీదైనవి కొనబుద్దికాదు బాబు.. ”,అని..

“నేనూ అంతే…అలాగే అలోచిస్తా.. ఎంతైనా మిడిల్ క్లాసు మనస్తత్వాలుకదా!! “,అన్నాడు.. నవ్వుకున్నాం ఇద్దరూ. “కానీ ఆఫీసులో అందరూ కాస్ట్లీగా ఉంటున్నారు. నేను ఈసారి ట్రై చేద్దామని చూస్తున్నా ”,అని నాలుగువేలు పెట్టి కొనుక్కున్నాడు బట్టలు.

ఆరోజు చూసిన ఒక జీన్స్ భలే నచ్చింది నాకు.. ఒకసారి వేసి చూసుకున్నా.. చాలా బాగుంది.

ఎలాగైనా తరువాత సారి కొనుక్కోవాలని నిర్ణయించా. కానీ ఖరీదు ఆలోచిస్తే పదిహేనువందలు.. బ్రాండెడ్ మరి. అమ్మో అనిపించింది.. మనసుకి సర్ది చెప్పి ఈ సారికి ట్రై చేద్దాం అనిపించింది.

తరువాతనెల ఇంటికి పంపగా..., అన్ని ఖర్చులూ పోగా.. ఇంత, అనవసరపు ఖర్చులు మానేయాలి, మొత్తం ఇంత మిగల్చాలి అని లెక్కవ్రాసుకున్నా. మళ్ళీ ఒకసారి ఆలోచించా.. అంత డబ్బు ఎందుకూ అని.. మాములివి ఐతే.. అటువంటి జీన్స్.. రెండు ,మూడు దాకా కొనుక్కోవచ్చు.. వట్టి బ్రాండు కోసం అంత అవసరమా అనిపించింది. సరే ఈసారి ట్రై చేద్దాం ఇప్పుడు ఖర్చుచేయకపోతే మరి ఎప్పుడు చేస్తాం అని నిర్ణయం చేసేసా.తరువాత రోజు ఉదయం ఆఫీసుకురాగానే చెప్పేసా కొలీగ్ కి.. ఈ రోజు సాయంత్రం నేరుగా షాపింగ్ కి వెళుతున్నాం అని. సరే అన్నాడు. సాయంత్రం అయ్యింది. అతనికి ఏదో పనితగిలింది.. నేను పోన్ చేస్తా అప్పుడు బయలుదేరదాం అన్నాడని నేను వెయిట్ చేస్తున్నా. ఫోన్ మ్రోగుతుంది.. హెడ్ పోన్స్ పెట్టుకుని లౌడ్ సౌండుతో పాటలు వినడం వలన నా ఫోన్ రింగు వినపడలేదు నాకు. నా ప్రక్క సీటతను నన్ను తట్టి , ఫోను అని సైగ చేసేసరికి ,తేరుకుని రిసీవర్ తీసా. ఏదో బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం అట నాకు వద్దు అని చిరాకుగా పెట్టేసా. మళ్ళీ కొంతసేపటికి ఇంకొక పోను. గోవా ట్రిప్ లక్కీ డ్రా తగిలింది మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం. కానీ కండీషన్ ఐతే మీరు మ్యారీడ్ అయ్యివుండాలి అని.. ఫ్రీ గోవా ట్రిప్ కోసం నేనెక్కడ పెళ్ళిచేసుకునేది అని, నో ,అన్నా. మళ్ళీ ఐదునిముషాల తరువాత మరొక ఫోను.. ఈ సారి చిరాకుగా తీసా రిసీవర్… “కెన్ ఐ స్పీక్ టు శ్రీనివాస్ ప్లీజ్ ”,అంది అవతలివైపు ఆడగొంతు. “యా స్పీకింగ్ ..”,అన్నా కాస్త సీరియస్ గా.. “సార్ వి ఆర్ ప్రమ్ CRY ”,అని అన్నది ఆమె. “నో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ..”, అని.. పోన్ పెట్టేయబోతున్నా.

“నో సార్..”, అంటూ మొత్తం వివరంగా చెప్పింది. CRY అంటే "CHILD RIGHTS AND YOU" అని, డొనేషన్స్ కోసం ఫోన్ చేసాను అని. ఎనిమిది వందలు డొనేట్ చేస్తే.. ఒక పిల్లాడికి సంవత్సరం పాటు విద్యకోసం ఉపయోగిస్తారు అని.. ఇంకా రకరకాల విరాళాల వివరాలు చెప్పిందామె.
నేను సైట్ అడ్రస్, ఎలా పే చేయాలి.. అది కరెక్టుగా CRYకి చేరుతుందని నేను ఎలా నమ్మగలను లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నా. కొద్దిరోజుల్లో మా ఏజంట్ వస్తాడు కంపెనీకి.. చెక్ ఇవ్వండి ఇంట్రస్ట్ ఉంటే అని అంది. సరే అని ఫోన్ పెట్టేసా.

షాపింగ్ కి బయలుదేరా.. ఆ కాస్ట్లీ షాప్ కి వెళ్ళలేదు.. వేరే దాంట్లో ట్రై చెద్దామన్నా.. “ఏ.. ఎదైనా ఖర్చులు తగిలాయా మళ్ళీ ”,అని నవ్వుతూ సరే! అన్నాడు మా కొలీగ్…

ఇక్కడ కూడా బ్రాండెడ్ లాంటి జీన్సే కొన్నా.. అదే పదిహేనువందలు పెట్టి.

కానీ ప్యాంటు ఖరీదు ఏడువందలు.. CRYకి ఎనిమిదివందలు చెక్ వ్రాసిచ్చా. నేను బ్రాండడ్ జీన్స్ వేసుకోకపోతే ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదనిపించింది. కానీ ఆ డబ్బులు చిల్డ్రన్ ఫండ్ కి ఇచ్చి నేను CRY అనే బ్రాండడ్ కంపెనీ జీన్స్ వేసుకున్నట్లే ఫీలయ్యా.

వెల కట్టలేనిది విద్య అంటారు. చదువుకున్నవాడికి ఖచ్ఛితంగా చదువు విలువ తెలుసుంటుంది. దేశానికి ఎంతో చేయాలనుకుంటాం.. ఈ బిజీ జీవితంలో మనకు కావలసినవి కొన్ని మనం చేసుకోలేకే నలిగి పోతుంటాం. మన దగ్గరున్న విద్యను వేరొకనికి మనం ప్రత్యక్షంగా బోధించే సమయమూ వుండదు కూడా. అలా చేస్తున్న సంస్ధలకైనా చేయూతనిద్దాం. పరోక్షంగా చేస్తున్నందుకు తృప్తి పడదాం.

------------------------------------------------------------------------------------

ఇది చదివినవాళ్ళలో ఒక్కరైనా ఈ CRY బ్రాండు( ఆ పేరుమీద ఏ కంపెనీ లేదని మనవి, ఉన్నా దానికి ప్రమోషన్ మాత్రంకాదు) వస్తువులను వినియోగిస్తారని ఆశిస్తూ

పూర్తి వివరాలకు ఈ లింకు చూడండి.. Cry Donation

9, ఆగస్టు 2006, బుధవారం

ఒక Project Manager

ఒక Project Manager పాటలు వింటుంటే...ఎలా ఉంటుందో తెలుసా?

(ప్రేమనగర్ సినిమాలో.. ఎవరికోసం ఎవరికోసం పాట వింటూ.. అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు)

(Suggestion: Listen to the song while reading this...)

-----------------------------------------------


ఎవరికోసం.... ఎవరికోసం......

(ఛ... ఆపెహే..!, ఎదవ గోల.. ఎవరికోసమో తెలియకుండానే పాడెస్తున్నాడు వీడు..)

ఈ ప్రేమ మందిరం....
ఈ సూన్య నందనం... (ప్చ్..)
ఈ భగ్న హృదయం...
ఈ అగ్ని గుండం.... (ష్....,ACలో చెమట తుడుచుకుంటూ...),

ఎవరికోసం.. . ఎవరికోసం..... ఎవరికోసం... (మళ్ళీ Echo ఒకటి వీడికి.. )

ప్రేమ భిక్ష నువ్వే పెట్టి...
ఈ పేద హృదయం పగులగొట్టి... (హ .. హ .. పగిలిందా.. బాగా??)
పిచ్చివాడ్ని.. పాత్రలేని
బిచ్చగాడ్ని చేసావు...(మరి..!,లేకపోతే.. Bill Gates ని చేసుంటే.. ఈ పాట పాడేవాడివా?)

నువ్వివనిదీ దాచలేవు.. . (ఏంటబ్బా అది???)
ఇంకెవ్వరినీ అడుగలేను... (హా!!, అడుగు.. లాగి.. ఒకటిస్తారు..)

బ్రతుకు నీకు ఇచ్చాను... (ఎవడివ్వమన్నాడు. నిన్ను?)
చితిని నాకు పేర్చావు... ( పేర్చదేంటి..!,అన్నీ ఇచ్చేసి.. లోకువైపోతే.. ?)

ఎవరికోసం.... ఎవరికోసం......

ఈ ప్రేమ మందిరం....
ఈ సూన్య నందనం...
ఈ భగ్న హృదయం...
ఈ అగ్ని గుండం....

ఎవరికోసం.. . ఎవరికోసం..... ఎవరికోసం...(బాబోయ్.. మళ్ళీ Echo Effect)

ఓర్వలేని ఈ బ్రతుకే ప్రలయంగా మారనీ...
నా దేవి లేని ఈ కోవెల
తునాతునకలైపోనీ.... (ఛా!..., నీకు దక్కకపోతే.. మాకేంటి.. ,మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నావే?)

కూలిపోయి.. ధూళిలో కలిసిపోనీ....
సోలిపోయి... బూడిదే.. మిగలనీ... (కంగారు పడకు బాబూ.. చివరికి నీకు మిగిలేది అదే.. అడగక్కర్లేదు..!!)

ఎవరికోసం.... ఎవరికోసం......

ఈ ప్రేమ మందిరం....
ఈ సూన్య నందనం...
ఈ భగ్న హృదయం...
ఈ అగ్ని గుండం....

ఎవరికోసం.. . ఎవరికోసం..... ఎవరికోసం... (ఓయ్... ! ఇదే లాస్ట్ సారి నీకు.. ఇంకొకసారి.. ఈ ముక్క మళ్ళీ పాడితే.. ఆ బిల్డింగ్ పడకముందే..నిన్నునెనే ..చంపేస్తా!!)

మమత నింపమన్నాను... (అబ్బో!!)
మససు చంపుకున్నాను.. (ఇవన్నీ.. నాకు చెబుతాడేంట్రా??)

మధువు తాగనన్నాను...
విషం తాగమన్నావు... (హమ్మయ్య.... )

నీకు ప్రేమంటే.. నిజంకాదు.... (అది.. ప్రేమించక ముందు తెలియదా బాబూ..?)
నాకు చావంటే భయంలేదు.. (ఈ ఆవేశంలో ఇప్పుడిలాగే..అంటాడు!)

నీ విరహంలో బ్రతికాను...
ఈ విషం త్రాగి మరణిస్తాను.. ( త్వరగా కానియ్.. బాబు.. ఈ Echo Effectలు వినలేంకానీ)

హు హు.. హుహ్.. హు..... (హి హి హీ... ఐపోయాడు.. )

ఎవరికోసం.. . ఎవరికోసం..... (ష్....)

(హమ్మయ్యా!. చచ్చడ్రా.. దరిద్రం వదిలింది.. )

-----------------------------------------------

(అవును.. వీడికి ఇచ్చిన Work ఏం చేసాడో?, బాబోయ్.. ఇంకెంతో టైమ్ లేదు.. మళ్ళీ.. Client నుండి Call వచ్చేస్తుంది.. వాడొకడు.. వీడిలాంటివాడే.. )

Hello!!, what is the status..
(on phone.. “Sir!, Actually.. what happend.. is... “)

SStop!, I dont want any Actually sort of things..
I want Acutal result.. right now..************************************************************

3, ఆగస్టు 2006, గురువారం

విలన్ మనోగతం

నమస్కారమండీ... నా పేరు తాజ్ బికారి..., అదేంటి!! పేరు అంత ఛండాలంగా ఉందీ అనుకుంటున్నారా.. అది అసలు పేరు కాదులేండి.. నా అసలు పేరు రామ్ పూజారి.. నా మొదటి సినిమా క్యారక్టర్ పేరే అసలు పేరుగా స్ధిరపడిపోయింది.

హిందీ సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారక్టర్లు చేసేవాడిని. నేను మంచి హైటు, కండలు తిరిగిన శరీరం, దొంగకోళ్ళు పట్టే వాడిలా మొహంతో.. విలన్ లా ఉండటం వలన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాన్సులొస్తున్నాయి.

కానీ తెలుగు సినిమాలకి రావటానికి ఎంతో కష్టపడ్డాను... అన్నిరకాల వాహనాలు నడపడం నేర్చుకోవాలి.... చివరికి విమానం.. హెలికాప్టర్ కూడా... !!, అదే హీరోగారికి రాదంటే.. కెమేరా ట్రిక్కో..లేక గ్రాఫిక్కో పెట్టి కానిచ్చేస్తారు షాట్.. మరి మాకలా కాదు.. మీరు చెబితే నమ్మరు. . తెలుగు కష్టపడి నేర్చుకున్నా తెలుసా?, హీరో గారు స్టైలిష్ ఇంగ్లీష్ లో మాట్లాడినా.. మేం మాత్రం తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పాలి... ఎందుకంటే.. మా తెలుగు డైలాగుల్లో విలనిజం పలుకుతుందంట ఏంటో మరది.. !!

జనరల్ గా హీరోని ఎన్నో కష్టాలు పెడతాం అవన్నీ తెరమీదే... తెరవెనుక మా కష్టాలు లైట్ బాయ్ కూడా చూడడు అంటే నమ్మరు.. మీరు నమ్ముతానంటే.. చెబుతా నిజాలు వినండి..హీరోకి సినిమా సగంలో , గుండెల్లో..! బుల్లెట్ తగిలినా... అదే దెబ్బతో రక్తం కారేలా సినిమా లాస్ట్ వరకూ పోరాడతాడు..లేదా ఎవరొకరు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు.. కొంత సేపటికి బయట రెడ్ బల్బ్ వెలగడం.. ఆపరేషన్ సక్సస్ అంటాడు డాక్టరు.. మళ్ళీ వెంటనే మామీదకి యుద్దానికి పరుగెత్తుకు వస్తాడు... అదే మేమైతే... చిటికెన వేలికి బుల్లెట్ తగిలినా... ఒక్క డైలాగ్ కూడా లేకుండా చంపేస్తారు... మా క్యారెక్టర్ ని. ఒక్కడు కూడా జాలి చూపించి హాస్పిటల్ కి తీసుకువెళ్ళరు.

ఒక్క సినిమాలోనైనా హీరో చచ్చిపోవడం చూసారా?, మా విలన్లని ఎంతమందిని అర్ధాంతరంగా చంపేస్తాడు హీరో... !, మళ్ళీ ఆఖరున హింసంటే నాకు పడదు అని డైలాగులు చెప్పి హీరో మంచివాడైపోతాడు.. ఏదో హింసతోనే మా విలన్లు పుట్టినట్లు!.హీరోలని వదిలేయండి.. హీరోయిన్లకు కూడా మేమంటే చిన్న చూపే... నలుగురు, ఐదుగురు ఉంటారు హీరోయిన్లు కొన్ని సినిమాల్లో.. అందరూ హీరోగారినే ప్రేమిస్తారు... ఒక్కరు విలన్ని ప్రేమించరు... హీరోగారు నాకన్నా ముసలివాళ్ళయినా మా వంక చూడనే చూడరు.., ఎంత దారుణం..!! అదీ కరెక్టేలేండి..!, మేమెప్పుడూ చిరిగిన, నలిగిపోయిన బట్టలు వేసుకుని వికారంగా వుంటాం.. ఆయనేమో.. చక్కగా ఫైట్ సీన్లలోనైనా, హాస్పిటల్ లో బెడ్ సీన్లలో నైనా కూడా నలగని తెల్ల బట్టలువేసుకుని, రక్తపు మరకలు అద్దుకుని, కాస్ట్లీ ఇంపోర్టెడ్ విగ్గు దరించి స్మార్ట్గ్ గా కనిపిస్తుంటారు.

ఫైట్ సీన్లలో మాకష్టం ఎంతుంటుందో తెలుసామీకు?, హీరో సార్ ఇలా చెయ్యి అంటే చాలు పదడుగులదూరం ఎగిరిపడాలి మేము. మేం వందమంది ఆయుధాలతో వున్నా ఒక్కొక్కళ్ళే వెళ్ళాలి..!, మళ్ళీ సార్ కి పొరపాటున చేయి తగిలినా.. ఇండస్ట్రీలో ఉండవ్ అంటారు. అసలు మేమేలేకపోతే.. వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరన్నవిషయం తెలియదు పాపం వాళ్ళకి.

అమ్మో! వచ్చిన కొత్తలో ఐతే..!, తెలయక వందమంది ఒక్కొక్కరే వెళుతున్నా అవేశపడి పైట్ కి వెళ్ళిపోయి తిట్లు తినేవాడిని.. ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం అలవాటయిపోయింది.. మేం వెళతామన్నా డైరెక్టరు సార్ వెళ్ళనివ్వరులేండి!.

హీరో సార్ చేతిలో ఆయుధాలుండవ్.. పొరపాటున మేము ఇచ్చినా తీసుకోరు కూడా.... మేం మాత్రం ఆయిధాల భరువును మోస్తూ.. వెర్రివాళ్ళలాగా కొట్టండిసార్ అన్నట్లు నిలబడి చూస్తుండాలి,.. తప్పదు మరి.

మేం ఎంత ఎగిరి క్రింద పడి నడుములు విరగ్గొట్టుకున్నా.. అది తెరపైన కొన్ని సెకనుల పాటు చూపిస్తారు.. అదే ఆయన పొరపాటుగా ఏదైనా దుమ్మురేగేలా చేస్తే చాలు.., పది కెమేరాలు పెట్టి పదినిముషాలపాటు స్లో మోషన్లో మరీ చూపిస్తారు. జనాలు అంతేలెండి..!!, "అయ్య బాబోయ్! హీరో..నిజంగా చేసాడ్రా", అని చెప్పట్లు కొడతారు... అదే సినిమాలో అటువంటి ఫీట్లు మావి వందలకొద్దీ ఉంటాయ్ . ఒక్కరు నమ్మరు మా టాలెంటుని.

ఈ మధ్య నాకు వెధవ బీపీ ఎక్కవైపోయింది.. హీరోగారు చూస్తే.. నా మీద ఒక అడుగు పొట్టి..మీద ఉమ్ములు పడేలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి తొడలు కొడుతున్నా.. మేమేమో.. కండలుతిరిగి కొట్టగలిగినా.. ఏమీ మాట్లాడకుండా.. మిడిగుడ్లేసుకుని చూస్తూనిలబడాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది.. పొట్టి హీరోని లాగి ఒక్కటివ్వాలని... కానీ తప్పదు కంట్రోల్ చేసుకోవాలి.. అలా కంట్రోల్ చేసుకుని.. ఈ బీపీ నాకు.

డైరెక్టర్ క్లోజప్ షాట్ అన్నాడంటే చాలు మాకు గుండెల్లో రాయి పడ్డట్లే... ఎందుకంటే.. క్లోజప్ లు అంటే ఖచ్ఛితంగా మామీదే వుంటాయి. హీరోగారిపై తీయరు.. తీస్తే ఆయన మొహంపై మడతలు, మేకప్ ట్రిక్కులు తెలిసిపోతాయని!. అందుకు ఆ క్లోజప్ లు అన్నీ మా పై తోసేస్తారు.. ఇంకా బాగారావాలి... ఇంకా బాగా రావాలి... అని చంపుతారు..., హీరో గారు ప్రక్కనుండి చిరాకుపడుతుంటారు.. "ఏక్టింగ్ సరిగా రానివాళ్ళందరినీ ఎక్కడినుండితెస్తారయ్యా", అంటూ అందరిన్నీ తిడుతుంటారు...ఆయనకి బాగోదని అవన్నీ మాపై తీస్తున్నారని తెలియదు పాపం.

ఆయనకన్నీ ఈజీ షాట్సే... కాళ్ళమధ్య, కాళ్ళక్రింద కెమేరాలు పెట్టడం.., వెనుకనుండి సడెన్ గా పైకి క్రిందికి కెమెరా తిప్పి మొహం కనబడనివ్వకుండా.. కాళ్ళదాకా తెచ్చి అప్పుడు మొహం చూపించే షాట్స్ తీసి... ఈ మధ్య టెక్నికల్ డైరెక్టర్స్ అని అనిపించేసుకుంటున్నారు డైరెక్టర్లు కూడా.. , ఏంటి సార్.. అని మా భాదలు డైరక్టర్లతో మొరపెట్టుకున్నాపోనీలేవయ్యా పెద్దాయన అని అంటున్నారు.. ఏంచేస్తాం!!.

ఈ తప్పంతా అసలు మా కూతుర్లది... ఎవడూ దొరకనట్లు ఈ హీరోలవెంట తిరగటం, ప్రేమించడం, మమ్మల్ని విలన్లను చేయడం...అదే లేకపోతే మాకు హీరోలతో గొడవలెందుకు పెట్టుకుంటాం.

హిందీ సినిమాలు వదిలేసి ఇక్కడికి రావడానికి చాలా కారణాలున్నాయి.. మా వాళ్ళు నా చిన్నప్పటి కధలనే పట్టుకుని వేళాడుతుంటారు.. లేదా ఏ తెలుగు కధో, తమిళకధో రీమేక్ చేస్తుంటారు.. అని తెలిసి ఇక్కడి కొచ్చా.. , అక్కడ ఇక్కడా కూడా చాన్సులుంటాయని ఆశతో... అదొక కారణమైతే.. ఇంకొకటి.. మంచి టేలెంటెడ్ టెక్నీషియన్స్ అంతా సౌత్ వాళ్ళే... వాళ్ళు మన టాలెంటుకి పదును పెట్టేస్తారని పరుగెత్తుకుంటూ వచ్చా తెలుగిండస్ట్రీకి.. వచ్చాకా చాలా తెలిసాయి. ఇక్కడ హీరోల డామినేషన్.. మాకు అక్కడ ప్రొడ్యూసర్ల డామినేషన్ అని.

మొన్నెవరో చెప్పుకుంటుంటే విన్నాను..ఎవరో హీరో గారంట కధ చూశాకా.. సంతకాలు పెట్టే సమయంలో.. డాన్సులుంటాయా? అని అడిగారంట.. "లేవు సార్.. అసలుండవ్... హీరోయిన్, మిస్ ఇండియాని తీసుకొస్తున్నాం.., డాన్సునేర్పించి... ఆవిడే చేస్తుంది..డాన్సులన్నీ.. మీరు చుట్టూ చేతులూపుకుంటూ తిరిగితే చాలు", అన్నాకా సంతకం చేసారంట.. అది ఇప్పుడు షూటింగ్.. అందులో కూడా నేనే విలన్.

ఇంకో హీరోగారికి.. కనీసం రెండయినా హీరోయిన్ కో, లేక చెల్లి కేరెక్టర్ కో జడలు వేసే సీన్ కావాలన్నారంట.. అంతే.. కధలో ఇరింకిచేసారు.. అది ప్యామిలీ డ్రామాలేండి !,మా ప్యాక్షన్ విలన్స్ కి చాన్సులుండవులేండి అటువంటి కధలలోకి.

ఇవన్నీ ఏదో కడుపు రగిలి చెప్పేస్తున్నా.. ఇవన్నీ వ్రాయకండి సార్.. ఏదో మొట్టమొదటి సారిగా ఒక విలన్ తో ఇంటర్వుకి వచ్చారని.. అనందంలో నా భాదలు చెప్పుకున్నా.. ఇవి బయట తెలిస్తే నాకు కేరెక్టర్లుండవ్.. అప్పుడు నేను బటానీలు కూడా అమ్ముకోలేను... అందిరికీ తెలిసిన విలన్ ఫేసు కదా??, ఉద్యోగం కూడా దొరకదు..!సరే! సార్.. ధ్యాంక్స్ ఫర్ ఇంటర్వూ..., .. నా షాట్ రడీ అంట..!, నేను వెళుతున్నా మరి...

--------

ఏమయ్యా!, డైరెక్టరు.. క్లోజప్ షాట్ కాదు కదా??,..... హమ్మయ్య.!!!,

ఛీ!, వెధవ బ్రతుకు వీళ్ల తాతకి నేనే విలన్.. వీళ్ళ నాన్నకి ఒకప్పుడు నేనే., ఇప్పుడు మనవడికి.. అంటే.. మూడోతరం.., నిక్కర్లేసుకోక ముందు తెలుసు.. ఈ హీరో... ఎన్ని తరాలు మారినా వాళ్ళు పిడికిళ్ళు బిగించి ఉమ్ములేస్తూ డైలాగులు చెబుతుంటే.. మేం అలా చూస్తూనే ఉండాలి... ఛీ.. జీవితం..!!!,

పద మొదలు పెట్టవయ్యా డైరెక్టరూ.. షాట్ మొదలు పెట్టు.. ఇంకా ఏంటి ఆలస్యం.?

19, జులై 2006, బుధవారం

ఆచార్యదేవోభవ….

ఏమైనా ఆ రోజులు ఆరోజులే మళ్ళీ తిరిగిరావు. చిన్నప్పటి చదువుకునే రోజులు. మాది చిన్నపల్లెటూరు, మా ఊరికి నాలుగు కిలోమీటర్లదూరంలో స్కూలు. ప్రతిరోజు రిక్షాలో వెళ్ళెవాళ్ళం. సన్నని రోడ్డు, చుట్టూ పంటపొలాలు, ఆ చక్కటి దృశ్యాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. పాటలుపాడుతూ కేరింతలు కొడుతూ అల్లరితో బయలుదేరేవాళ్ళం. కాగితాలను చిన్నముక్కలుగా చించి, చల్లని పైరగాలికి ఎగరవేయడం. గాలి పంకాలు చేసి తిరుగుతుంటే, ఎవరిది వేగంగా తిరుగుతుందో పోటీపడటం. ఇవి చిన్న ఆనందాలే కావచ్చు, ఆ వయసుకు అవే ఎంతో గొప్ప ఆనందాలు.


టైముకి చేరుకోకపోతే గోడకూర్చీయో, స్కూలు బయట నిలబడడమో తప్పేది కాదు. లేటుమాది కాకపోయినా శిక్ష తప్పదు, కాని అదే సరదాగా ఉండేది. క్లాసు ఎగ్గొట్టడానికి ఒక్కొక్కసారి..


రోజూ ఉదయాన్నేరెండు గంటలపాటు, స్కూలుముందున్న ఖాళీ స్ఠలంలో ప్రార్ధనతో మెదలయ్యేది దినచర్య. అదీ ఎండలో, చెమటలు కక్కుతూ, వేడిమి తట్టుకోలేక కళ్ళుతేలేసే వారు కొందరైతే, ఆస్కార్ అవార్డ్ కోసంకాకపోయినా, ప్రార్ధన బారినుండి తప్పించుకోవడానికి కొందరు, పడ్డవాళ్ళని తీసుకెళ్ళే వంకతో కొందరు క్లాసురూమ్లలోకి వెళ్లిపోయేవారు.


ఇక గురువారం వస్తే, అందరూ తెల్లబట్టలు వేసుకుని రావాలి. షూ, సాక్స్ తో సహా అన్నీ తెలుపే. వారానికి ఒకసారే కాబట్టి స్కూలుమెత్తం మిలమిలమెరిసేది. సాయంత్రం కాగానే ఎర్రగా మారేవి మా బట్టలతో పాటు మెహాలు కూడా.., ఆటలతో బట్టలు మాసిపోయాయని అమ్మ తిట్టిన తిట్లకు.ఐదో తరగతి వరకూ కొన్ని సబ్జక్ట్స్ లో అప్పుడప్పుడూ ఫస్ట్ వచ్చేవాడిని. చిన్న చిన్న ప్రైజులు కూడా వచ్చేవి, క్లాసుకి రెగ్యులర్ అని, ఇంగ్లీషులో ఫస్ట్ అని ఇలా.. మరి ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా చదువులో చురుకుతనం సన్నగిల్లింది. రాని సబ్జక్ట్ పై భయం మొదలయ్యింది. లెక్కల సబ్జక్ట్ అంటే చచ్చేంత భయం పట్టుకుంది. ఆ మాష్టారు పెద్ద పెద్ద కళ్ళతో దెయ్యంలా కనపడేవారు. ఇంటి దగ్గర ఎంత చదివినా, బాగా చేసినా ఆయన్ను చూడగానే అన్నీ హుష్ కాకి. మరి ఏంటో ఆయన్లో ఏముందో.


నన్నే ప్రత్యేకంగా బోర్డుపై లెక్కచేయమనేవారు. మనిషి కాస్త తెల్లగా, సరిపడ ఎత్తు, కోరపళ్ళు, గుబురుమీసాలు, కాస్త గూనిగా వంగి ఉన్నట్లు ఉండేవారు. ప్రత్యేకంగా చెక్కించిన వెదురు బెత్తంతో దిగేవారు క్లాసులోకి.

ఆయన క్లాసు వున్నన్ని రోజులూ నాకు యమగండంలా ఉండేది., దెబ్బలు తప్పేవి కావు. ఆ ఉదయం నిద్రలోంచి ఆయనచేత దెబ్బలు తింటున్నట్లు ఉలిక్కిపడి లేచేవాడిని.
బోర్డుపైన ఏ లెక్క ఇచ్చేవారో తెలిసేది కాదు. ఆయన చేతిలో చాక్ పీస్ తీసుకోగానే నా బుర్ర పనిచేయడం మానేసేది.

ఒక్కోసారి అయిదు అయిదులులాంటి చిన్నలెక్క కి కూడా ఆలోచించాల్సి వచ్చేది . రెండు అయిదులు పది, మూడు అయిదులు…ఆగిపోయేది..ఆయన కొట్టేదెబ్బకోసం. హమ్మయ్య ఒకటైపోయింది, ఇప్పుడు ఇంకొకటి పడబోతుంది, మళ్ళీ ఇంకొకటి.. ఇలా తరువాత కొట్టబోయే దెబ్బ ఎక్కడ పడబోతుందో లాంటి పరిజ్ఞానం పెరిగి , దెబ్బలు అలవాటైపోయాయి.

తరువాత తోటి స్నేహితుల ఓదార్పులు, భయాలు, వాళ్ళ వరుసక్రమం కోసం చూసే బెదురుచూపులు మామూలే రోజూ.


అలా ఎప్పుడూ ఒకరేకాకపోయినా మారిన ప్రతి మాష్టార్లతో నాకు తిప్పలు, దెబ్బలు తప్పేవికావు. ఒకాయన మా నాన్నగారికి బాగా తెలుసట, మావాడిని కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పినందుకుగానూ అందరికన్నా రెండు దెబ్బలు ఎక్కువ పడేవి నా ప్రాణానికి. కానీ ఆయన మాములుగా కొట్టేవారుకాదు, కాలర్ పట్టుకుని పైకెత్తి చెంపమీద మాత్రమే కొట్టేవారు.
మా స్కూలు మేడపైన ఉన్న క్లాసురూములు కొన్ని తాటాకు పాకలు ఉండేవి. సరిగా చదవనివాళ్ళు గబ్బిళాల్లా పాక దూలాలకు వేళాడేవారు. కాలర్ పట్టుకుని ఎక్కించేసి వదిలేసేవారు ఆయన. పాపం ఏడుస్తూ ఒక అరగంట వేళాడేవాళ్ళు. నేను వేళాడినట్లు గుర్తులేదుకానీ, ఒకమ్మాయైతే రోజులో సగం వేళాడుతూ ఉండేది.

పోనీ ఇది చిన్నప్పుడు అనుకుందాం, తొమ్మిదో తరగతిలో వేరే మాష్టారుతో కూడా తప్పలేదు నాకు. స్కూలుకు ఒకచోట వెడల్పాటి చెక్కలతో గ్రిల్స్ ఉండేవి. అందులోంచి మంచి చెక్కనొకదానిని తెచ్చేవారు కొట్టడానికి. చేతికి తగిలి .. అంతలావు చెక్కకూడా విరిగిపోయేది.
ఆ చేయికి ఒక నాలుగురోజుల వరకూ స్పర్శ తేలిసేది కాదు, అయినా మా చదువులో మార్పురాలేదు.


మిగతా సబ్జక్ట్స్ లో అంత దిట్ట కాకపోయినా దెబ్బలు తినేవాడిని కాదు. తెలుగు పద్యం చదివి కంఠస్తపట్టడంలో మనకు మంచి పేరుండేది. ఒత్తులు ఉచ్చారణ, వ్రాయటంలో తెలుగుటీచరు నుండి మంచి మెప్పు, ప్రోత్సాహం ఉండేది.
కాని నా చేతివ్రాత ఒకటి బాగుండేది కాదు. చిన్నప్పటి నుండి పెయిటింగ్సు, డ్రాయింగ్సు వేయడం ఇష్టం, మంచి పేరుండేది కూడానూ. అవి చూసి మా తెలుగుటీచరు నన్ను ఆటపట్టించేవారు. డ్రాయింగ్ చేసేవాళ్ళ చేతివ్రాత కూడా బాగుంటుంది, కాని నీ చేతివ్రాత ఛంఢాలం అని అనేవారు.
తెలుగు కాపీ రైటింగు లు ఎన్ని వ్రాసినా లాభంలేకపోయింది.


ఇక హిందీ, నాకు బాగానే వచ్చు. టీచర్ కి భయపడైనా చదవటం, వ్రాయటం బాగానే నేర్చుకున్నా. సొంతంగా ఊహంచి వ్రాయలేకపోయినా, బట్టీకొట్టయినా మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. హిందీ కాపీరైటింగు వ్రాయటం ప్రతిరోజూ చాలా పెద్దపని.


నాకు బాగా గుర్తు. ఒకరోజు కాపీరైటింగు వ్రాయలేదు . కానీ టీచర్ రాకముందే బల్లమీద పుస్తకాలు పెట్టుంచాలి. వ్రాయని వాళ్ళు బయటకు వెళ్ళి నిలబడాలి ,అది రూలు. ఎవరూ తప్పేవాళ్ళుకాదు. మా హిందీ టీచరు అంటే అంత భయం అందరికీ. ఆవిడరాగానే బయట నిలబడి ఉన్నవాళ్ళని కోపంగాచూసి, రెండు మూడు తిట్లు తిట్టాకే పాఠం మెదలుపెట్టేవారు. కాని నేను ఎందుకో వ్రాయలేదు. బయటకు వెళ్ళలేదు కూడానూ. మరి అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు.

ఆ రోజు నా టైము బాగాలేక, ఒకమ్మాయిని పిలిచి బల్లపై ఉన్నపుస్తకాల లెక్కసరిగా ఉన్నాయోలేదో చూడమని చెప్పారు. మధ్యలో ఒక వార్నింగు కూడా ఇచ్చారు. వ్రాయని వాళ్ళు ఇంకా వుంటే బయటకు వెళ్ళిపొండి, నేనేమీ అననని. ఇద్దరు లేచివెళ్ళిపోయారు. నేనే అనుకున్నా ఇంకా తోడుదొంగలున్నారన్నమాట అనిపించింది.
నేను లేవలేదు. వాళ్ళను ఏమీఅననన్నారుకానీ అవమానాలు తప్పలేదు పాపంవాళ్ళకి. రెండు, మూడు సార్లు అయ్యింది వార్నింగు ఇవ్వడం. కాళ్ళదగ్గరనుండి మెదలయ్యింది ఒణుకు నాకు, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మెదటి వార్నింగుకే లేవవలసింది అనిపించింది. టెన్సన్ తో మెహం ఎర్రగా కందిపోయింది.
టీచర్ నా వంక చూస్తే చాలు పుస్తకాల లెక్కకూడా అవసరంలేకుండా నేను వ్రాయలేదని చెప్పోచ్చు, అంతలా ఒణుకుతున్నా. పుస్తకాలూ, కుర్చున్నవాళ్ళనూ లెక్కపెట్టడం అయిపోయింది.. సరిపోయాయ్ టీచర్ అని చెప్పింది ఆ అమ్మాయి.


లెక్కపొరపాటు కానేకాదు, ఆ అమ్మాయి చాలా ఇంటలిజెంట్, నేననుకోవటం ఎంటంటే లెక్క తక్కువొచ్చినా సరిపోయిందని చెప్పుండొచ్చు. ఏదేతేనేమి ఆ అమ్మాయి సాయం మరిచిపోలేనిది, బ్రతికి తప్పించుకున్నా. నేను తరువాత ఎప్పుడూ కూడా అంత టెన్సన్ అనుభవించలేదు, ఆఖరికి ఇంటర్వూలో, జాబ్ లేకపోయినపుడు, సెలక్సన్ రిజల్ట్స్ వచ్చినప్పుడూ కూడా. ఆ వయసులో అదే పెద్ద టెన్సన్ పడే సమస్య మరి.


మా ఇంగ్లీష్ మాష్టారు కేరళనుండి వచ్చారు. తెలుగు అసలు వచ్చేది కాదు ఆయనకి. చాలా పొడవుగా ఉండేవారు. మాములుగా నిలబడి చేయిచాచి ఉంచితే ఆయన పొడవైన వేళ్ళమధ్య సరిపడమెడ అంత హైటులో ఉండేవాళ్ళంమేము.
ఏదైనా సరిగ్గా చెప్పకపోతే మెడచుట్టూ చెతితో పట్టుకుని, ముందుకూ, వెనకకూ ఊపుతూ ఇంగ్లీషులో ఉన్న తిట్లన్నీ వరుసపెట్టి తిట్టేవారు. తిట్టడం అవగానె చెయ్యి వదిలేసేవారు, అంతే మోకాళ్ళు కొట్టుకుపోయేలా అంత దూరానా క్రింద పడేవాళ్ళం.
ఇక సేడిస్టు పనులు చేసే సోషల్ టీచర్ ఒకరుండేవారు. ఆయనదీ కెరళనే. సూదుళ్ళా ఉండే డ్రాయింగు పరికరాలతో గుచ్చడానికి తీసి బెదిరించడం, మనిషిని ఒంగోమని ..వాడిపై కూర్చుని ..ఏడి వీడు .. ఎక్కడికి పోయాడు అని వెదుకుతూ కామెడీ చేయటం, బరువైన బ్యాగ్ ను మెడలో వేసుకోమని.. హార్మోనియంలా వాయిస్తూ క్లాసులో తిరగమని బెదరించడం. టేబుల్ క్రిందనుండి ప్రాక్కుంటూ రమ్మని చెప్పి...కర్రకు అందగానే.. వీపుపై ఒక్కటివ్వడం.. , నేను ఎప్పుడూ ఆయనకు దొరకలేదు .
అమ్మో.. ఆయన పిచ్చి చేష్టలతో హడలిపోయేది క్లాసంతా.. ఒక్కడు నవ్వేవాడు కాదు. కాని ఇప్పుటికీ మా ఫ్రెండ్స్ ని కలిసి నప్పుడు ఆ సన్నివేశాలు గుర్తొచ్చి పగలబడి నవ్వుకుంటాం.


ఇక సంస్కృతం మాష్టారు గురించి చెప్పాలి. ఆయన చెప్పిన పాఠాలు, ఇచ్చిన ప్రోత్సాహం.. చాలా ఉపయోగపడేవి. చదువును ఏవిధంగా చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. పిల్లలకు బోర్ కొడుతుందనగానే టాపిక్ మార్చి ఎక్కడికో తీసుకెళ్ళేవారు.

ప్రత్యేకంగా శోభన్ బాబులా మిమిక్రీ చేస్తూ ఆయన చెప్పే జోకులకి భలే నవ్వుకునేవాళ్ళం. ఆయనంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం, ఎందరికోలాగా నాక్కూడా ఫేవరట్ టీచర్ ఆయన. అందులోనూ సంస్కృత పాఠాలన్నీ పురాణకధలేమో, అవి జనరల్ గా మన సినిమా కధలలాగా చెప్పి బుర్రలోకి ఎక్కించేవారు. ఒక్కసారి క్లాసు వింటే.. ఇక సొంతవాక్యాలతో పరీక్షలో వ్రాయటమే, బట్టీకొట్టేపనే ఉండేది కాదు.నిజంగా ఈ ఉపాద్యాయులు, వాళ్ళ కాఠిన్యంతోనైనా, మంచితనంతోనైనా, వాళ్ళు చెప్పన మంచిమాటలు, ఇచ్చిన ప్రోత్సాహం ఇవన్నీ ఇప్పుడు ప్రతి నిముషం మనకు ఉపయోగపడుతున్నాయి. తెలుగు టీచరు అలా ఆ రోజు మా చేత చదివించి ఉండకపోయుంటే, నా మనసులో ఉన్నది నేను ఇలా పేపరుపై పెట్టి మీతో పంచుకోగలిగేవాడినా?. హిందీ టీచరు కఠినంగా ఉండకపోయుంటే, నాకు హిందీ చదవడం, వ్రాయడం రాక ఎంత ఇబ్బంది పడేవాడినో . ఎవరి భోధనా పద్దతులు వాళ్ళవైనా, వాళ్ళ చదువు అనే దీపాలతో మన జీవిత దీపాల్ని వెలిగించిన వాళ్ళకి ఏమిస్తే ఋణం తీరుతుంది చెప్పండి. తల్లిదండ్రుల తరువాత అంతటి వాళ్ళకు ఏమిచ్చినా తక్కువే.


కానీ ఒక్కటి నిజం, వాళ్ళని సంతోష పెట్టేది గురుదక్షిణ కాకపోయినా, మనం ఒక మంచి విజయాన్ని సాధించినపుడు మనం వాళ్ళను కలిసి ఆ ఆనందాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళకళ్ళలో కి చేరిన ఆనందం కంటే మించిన గురుదక్షిణ ఏదీ మనం ఇవ్వలేం...


ఆచార్యదేవోభవ....

29, జూన్ 2006, గురువారం

దయచేసి మన (తెలుగు) పరువు తీయకండి…------------------------------------------------------------------


పద్దతులు పద్దతులు బాబు… పాటించాలి… తప్పదు.. అందులోనూ మనం చదువుకున్నవాళ్ళం.


ఈమాత్రం ఓర్పు నహనం లేకపోతే ఎలా?? మన రాజధని నగరంలో ఎలాగూ పాటించలేం…ఇంతకీ ఏంటంటారా..? అదే చెప్తా..

ముంబయి మహానగరంలో.. అన్నిటికి పద్దతులే… బస్సుఎక్కేటప్పుడు వరుసక్రమం… తప్పారో,

డైవరుతో సహా ఎవరూ వదలరు మిమ్మల్ని తిట్టకుండా…


బస్సులో 50 మంది పడితే..అంతే… ఇంక ఎక్కనివ్వరు… తరువాతబస్సు ఎక్కవలసిందే..!!!


అబ్బే!!! మనమెక్కడ పాటించగలం నిలబడగానే చేతులకి పనిచెప్తాం…
చెమటలు తుడుచుకోవడానికో..లేక, ఎదుటివాడిని


తొయ్యడానికో…


ఇక పది నిముషాలైతే…నోటికి పని.. తిట్లు.. వినలేకచావాలి.. పక్కవాళ్ళు..


అవును తిట్లు గురించి చెప్పాలి… ఇక్కడ…
డ్రైవర్ ని..కండక్టర్ ని..హోటల్ లో సర్వర్ ని.., ఆటోవాడిని.., రోడ్డుపై
నడిచేవాడిని.. అందరినీ తిట్టే..హక్కంది.. (తెలుగులో) ఇక్కడ..
అది మన తెలుగోడి పవరు..


ఇంకొకటి…చోద్యంలా అనిపంచవచ్చు… ఆటోకోసంకూడా.. వరుసక్రమమండోయ్… బాగుంది…కదా..
చక్కగా ఇలాఉంటే.. అందరికీ సీటు దొరుకుతుంది… పనులుకూడా సక్రమంగా జరుగుతాయి..


ఎవడైనా ఈ లైన్లు దగ్గర గొడవపెట్టుకున్నాడంటే… కచ్చితంగా.. తెలుగోడో.. తమిళోడో.. నో.. డవుట్..


బస్సులో వెనుకనుండి. ఎక్కడం ముందునుండి దిగడం.. రన్నింగ్ , జంపింగ్,హేంగింగ్.. బస్సులు లేవు… త్వరలో రాబోతున్నాయి..


కండక్టరుతో గొడవపెట్టుకుని మరీ.. మనవాళ్ళు కొత్తగా అలవాటు చేస్తున్నారులేండి..


ఈ మధ్య పాలిథీన్ కవర్లు నిషేధించడం జరిగింది… ఇక్కడివాళ్ళు చక్కగా పాటిస్తున్నారు.
ఎంత క్లాసుగా ఉన్నా.. పేపరులో

చుట్టుకునిమరీ తీసుకెళ్తున్నారు…
కావలసిన వస్తువు చేతితో తీసుకెళ్ళడానికి సిగ్గేంటండీ..??, వాడెవడో గంట దెబ్బలాడాడు..,

సరుకుకొంటే కవరు ఎందుకివ్వవని…
తీరాచూస్తే అతనూ తెలుగోడే.., ఆఖరికి సరుకుకొనలేదనుకోండి అది వేరే విషయం. పాపం

ప్లాస్టిక్ ఎందుకు నిషేధమొ తెలియకో లేక హిందీ అర్ధంకాకో…మరి.


ఇంక ఆఫీసులో ఎవడిస్టంవాడిది… అమ్మాయిలపై పచ్చి కామెంట్లు.
అబ్బాయిలు అమ్మాయిలూ పచ్చిబూతులు గట్టిగా

మాట్లాడుతుంటారు.. ఫోనులో.. ఎవడికీ తెలుగర్ధం కాదని ధైర్యం.


మీరు చెబితే నమ్మరు.. ఒక తెలుగువాడు సైలెంటుగా ఉన్నాడంటే… పక్కన ఎవడో పరిచయంలేని తెలుగోడు ఉన్నట్లు లెక్క.


ఒక విషయం చెప్పడం మరిచా… అచ్చతెలుగులో మట్లాడటం చాలా కష్టమండోయ్. మనం మాట్లాడే పదాల్లో నలబైశాతం ఆంగ్లపదాలే…!!


అవి రాకుండా, పక్కవాడికి అర్ధంకాకుండా.. మేనేజ్ చేయడం చాలా కష్టం సుమండీ…!!!, అది ఒక కళ కూడానూ..!! కొన్నిటికి

తెలుగుపదాలేలేవు మన వాడుకభాషలో..
ఈ పాపం ఎవరిది చెప్పండి. ఆ విషయానికే వద్దాం.


మొన్న మన ఆంధ్రరాజధాని నగరం వచ్చా…


తెలుగు దేశంలో ,తెలుగు రాష్ట్రంలో,తెలుగు నగరంలో, తెలుగు రాజధానిలో…తెలుగేలేదు..!!!
భలే విచిత్రం అంతా పోష్ ఇంగ్లీష్..

ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా..
ఎంత అవమానకరం, ఎంత విచారకరం, మన మాతృభాషలో మాట్లాడటం.. నాకే సిగ్గేసింది..!!!

ఎక్కడ తెలుగు పేపర్ చదివితే తెలుగువాళ్ళమని తెలిసిపోతుందో అని, రాని ఇంగ్లీషు పేపరులో తలపెట్టి దాక్కుంటూ దొంగ చూపులు

చూసేవాళ్ళని ఎంతమందిని చూసానో..!!!


కానీ గవర్నమెంటు.. కొంత తెలుగును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషపడ్డానండోయ్..
ఒక RTC బస్సులో చదివా…”ఈ బుస్సు

మనిందిరిదీ దీనిని పరింశుభ్రముగా ఉంచుందాం”,
ఏదో విషయం అర్ధంమయ్యిందిలేండి… అదేకదా భాష

ముఖ్యోద్దేశ్యం.
పాపం..!! ఈ అచ్చుతప్పుల్లో గవర్నమెంటును ఎలాతప్పుపట్టగలం చెప్పండి..


నాకు ఒక భయం పట్టుకుంది… మన తరంతోనే తెలుగుకి అంతం అని..


రేపు మా అబ్బాయొ, అమ్మాయొ.. “డాడీ.. వాటీజ్ టెల్గు… అంటే.. ఐ డోంట్ నో సన్” అనాలేమో అని…ఇంకా భాషమీద అభిమానం పోకపోతే.. పిల్లలకి ట్యూషన్ చెప్పించైనా.. తెలుగు నేర్పిస్తామేమో… దానికన్నా అవమానం ఇంకేదీ

ఉండదేమో…???-------------------------------------------------------------------


ఇందులోని పాత్రలూ నన్నివేశాలు…అందరినీ (నాతో కలుపుకుని) ఉద్దేశించి రాసినవే…


సాటి తెలుగువాడినై తెలుగువాళ్ళగురించి ఇలా రాయడం తప్పేనేమో…కూడా..


మన చెత్త, మన చెత్త అని ఇంట్లో పెట్టుకంటే… ఆ చేత్తతోపాటు మనం కూడా… కుళ్ళిపోవలసివస్తుంది.


పరాయి భాషలాగా, మాతృభాష బ్రతుకు తెరువుని చూపించలేక పోవచ్చుకాని… మాట్లాడటానికి… కూడా… అర్హతలేనిది కాదే..??


ఏ భాష నేర్చుకున్నా ,అన్ని భావాల్ని పలికించగలిగేది…మాతృభాషద్వారానే కదా..?,


ఏరుదాటినాకా తెప్పతగులపెట్టే చందాన, మరి అంత చులకన అవసరంలేదేమో అని నా ఉద్దేశ్యం..


ఇది రాస్తూ కూడా…ఎన్నో ఇంగ్లీషు పదాలు తెలుగులో తర్జుమా చేయవలసి వచ్చింది…
ఈ పాపం ఎవరిదంటారు..???

19, జూన్ 2006, సోమవారం

నా డైరీలో ఒక పేజీ...ఎందుకో!! ఒక ప్రశ్న మనసులో వచ్చింది?,


నేను బ్రతకవలసిన విధంగానే బ్రతుకుతున్నానా? అని.
భారతీయుడినని…హిందువునని…చదువుకున్నవాడినని…సంస్కారముందని గర్వపడ్డానుకానీ!!...

మనిషి ఈలోకానికి రావడానికి కారణం “కర్తవ్యం నిర్వహిండడానికి”, అని అంటారు..? ఆ కర్తవ్యం నేను చేసానా?, ఇంకా చెయ్యాలా?? లేక ఎవరైనావచ్చి చెబుతారా చెయ్యమని?...


ఊహు!!.. సమాధానం దొరకలేదు…మళ్ళీ ఆలొచించాను…!!!


ఎవరినైనా అడుగుదామంటే, “వేదాంతం” అని ఎగతాళి చేస్తారని భయం వేసింది.

25-30 ఏళ్ళు వచ్చేవరకూ లోకమే తెలియదు…చదువుకే అంకితం…

తరువాత ఉద్యగం, ఆ తరువాత పెళ్ళి, భార్య,పిల్లలు.. తల్లిదండ్రుల బాగు…

అమ్మో!!!... ఇంకా ఎన్నో బాద్యతలు..


మరి నాకు సమయం ఎక్కడ దొరుకుతుంది.. కర్తవ్యం సాదిండానికి…

నా పిల్లలు, నా వాళ్ళు…నాజీవితం, నా కుటుంబం… నా…నా… ఏమిటి. ఈ “నా”?.. ఇదే’నా’ కర్తవ్యం లేకపోతే??...

‘నా’ కోసమేనా!!!


ఒక్కరే నా ప్రశ్నకు నమాధానం ఇవ్వగలరు అనిపించింది… ఆ భగవంతుడు!


అడిగాను, సూటిగా కాక పోయినా, అదే అర్దం వచ్చేలా…
”మనిషికి జంతువుకి తేడా ఏంటని?...”


"జంతువులు తమ బ్రతుకు బ్రతుకుతాయి, మనిషి అందరి మేలు కోరి బ్రతకాలని…,బ్రతుకునివ్వాలని” నమాధానం వచ్చింది.


మరి నేను అలా బ్రతుకుతున్నానా?... అని ఆలోచిస్తే నవ్వొచ్చింది కూడా?ఒకరోజు నేను అలారోడ్డుపై వెళ్తున్నాను. దారిలో ఒక కుక్కకి దెబ్బతగిలి పడుంది.

నాకు పెంపుడు జంతువులు అంటే ఇష్టమే!.. అది చాలా బాధతో అరుస్తుంది.
నాకు జాలికలిగింది. అందరూ చూస్తున్నారు, కొందరు జాలి పడుతున్నారు. కాని ఎవరూ పట్టించుకోవడంలేదు!.


హాస్పిటల్ కి తిసుకెళదామని అనిపించింది.. అడుగు ముందుకు వేసాను.

ఎవరైనా, ఎమైనా అనుకుంటారెమోనని అనిపించింది…

నా బిజి లైఫ్ గుర్తుకు వచ్చింది…

నా నమయం వృధా చేసుకుంటున్నానేమొ అని అనిపించింది.

అడుగు వెనక్కి పడింది….తరువాత ఏం జరిగిందో తెలియది?? …నేను దాటి వెళ్ళిపోయాను.
కాని రొండురోజులు మనసులో ఏదో వెలితి, తప్పుచేసానన్న భావన… చాలా డల్ గా అయిపోయా!!.

చాలా బాధ కలిగింది… ఇప్పుడు బాధపడడమేనా నేను చేయగలిగేది?.

అదే మనిషికి జరిగిఉంటే చేసేవాడినా??, …ఏమో తెలియదు?.


అక్కడే, అప్పుడే వస్తున్న పాట నన్ను ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది….!!!"కరుణను మరపించేదా.. చదువూ సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా..? సాంప్రదాయమంటే… చుట్టూ పక్కల చూడరా.. చిన్నవాడా.."

(రుద్రవీణ సినిమాలోనిది.)దేవుడినే అడిగా…”ఏమిటి స్వామీ!!, నేను నిజంగా సాయపడలేనా.." అని.


“ఈ జగమంతా, నీ కుటుంబమే అనుకో, సాయపడగలవు”, అని సమాధానం వచ్చింది.


అమ్మో!!!... ఈ జగమంతా నా కుటుంబమా?, కష్టం కదా?, నా కుటుంబం పోషించే స్థానానికి చేరే సరికి ఈ 25-30 ఏళ్ళు అయిపోయాయ్!

మరి ఈ జగమంతా?, అంత డబ్బు నేను సంపాదించగలనా?,

సంపాదించినా!, మనసు…, మనవాళ్ళు… అందరూ.. నాకు సాయపడాలి.. మరి ఎలా???“సహాయం అంటే డబ్బే కదా!!”, అని చాలా పొరపాటు పడ్డా, తరువాత బాగా ఆలోచిస్తే తెలిసింది.

ఈ కుక్కకు దెబ్బ తగిలిన విషయంలో, నేను స్వయంగా వెళ్ళి సహాయపడకపోయినా,
ఒక ఫోను చేస్తే ఏ Blue Cross వాళ్ళో చేసుండే వాళ్ళు.


“సాయం అంటే, మాట కూడా అన్నమాట”.*  “మనం చేసే ప్రతిపనిలోనూ.. న్యాయంగా ఉంటూ… ఏదైనా తెలియని వాళ్ళకు, విషయాన్ని తెలియచేస్తూ….”
ఉదాహరణకి..నేను ఉద్యోగం ప్రయత్నంలో పడ్డ కష్టాలు.. వేరొకరు ఉద్యోగ వేటలో..సమస్యకి పరిస్కారం కావచ్చు కదా!!.. ఇక్కడ నాకు ఏం పోతుంది… ఒక చిన్నమాట తప్ప.

*  “ప్రతిపనిలోనూ, ప్రతి మనిషిలోనూ…ఆ దేవుడున్నాడని నమ్మితే.. సాయపడడం కష్టంకాదు"


నెనొక్కడినే “జగమంత కుటుంబం నాది”, అని అనుకుంటే కష్టంకానీ!!

మనమంతా అలా అనుకుంటే కష్టమేమికాదు కదా!!!?.
14, జూన్ 2006, బుధవారం

యాంత్రిక తంత్రం...తాంత్రిక మంత్రం...
Life technical అయిపోయింది..అనటానికి ఇంకేంకావాలి చెప్పండి.

ఈ మధ్యనాలో మార్పు అలా అనిపించేలా చేస్తుంది.

Early morning news చదువుతున్నా, ఒక మంచి news కనబడితే, suddenగా ఏదో search చేయడం మొదలుపెట్టా. కొంత సేపటికి… ఏం వెతుకుతున్నానా?... అని ఆలోచిస్తే,

news paper లో matter ని copy చేసి save చేయడానికి Mouse కోసం వెదుకుతున్నా!!!, అని అర్ధమయ్యి నవ్వొచ్చింది.. సరే!!... అది వదిలేయండి.Officeకి Auto పై బయలుదేరా.

వాడికి చిల్లర Purseలోంచి తీయబోతూ, “Wait Your Transaction is Being Processed,… 10% complete, …55% complete,.. 100% complete”, అని కొంత సేపు ఆగి డబ్బులిచ్చా!!!.

వాడు నన్ను పిచ్చివాడిని చూస్తున్నట్లు చూసాడు.
“అబ్బా!!.. ఈ రోజు Work Submission రా దేవుడా”, అని ఏడుపుమొహంతో, chatting start చేసా.


Collegue system నుండి కొంత data copy కావాల్సొచ్చింది. వాడేమో ఇంకా రాలేదు. Phone చేసి system password తీసుకున్నా కాని రెండుగంటలు కష్టపడినా Data copy చేయలేకపోయా. Collegue రానే వచ్చాడు. “ఒరే! PLవచ్చే time అయ్యిందిరా, ఇది నా systemకి copy చేసి పెట్టు “, అని అడిగా. నా desk దగ్గరకు వెళ్ళి మళ్ళి chatting మొదలుపెట్టా.


కొంతసేపటికి Mail వచ్చింది కావలసిన data తో. అది చూసి Yahoo messenger login అయ్యినప్పుడు smiley icon లా నా మొహం వెలిగిపోయింది. నేను ఎందుకు copy చేయలేకపోయానా, అని ఆలోచిస్తే. వాడి system లో copy అని నా system లో paste అంటున్నానని అప్పుడు తెలిసింది.
Collegue వచ్చి lunch అన్నాడు. అదేంటి one hour కూడా chat చేసినట్లు లేదు అప్పుడే lunch time అని నవ్వుకుంటూ canteenకి బయలుదేరాం. అక్కడ చిల్లర లెక్కకోసంకూడా Mobileలో calculator ఉపయెగించవలసి వచ్చింది.కబుర్లు చెప్పుకుంటూ భోజనం మొదలుపెట్టాం. చండాలంగా ఉంది భోజనం, నాకు మండింది, canteen వాడిని పిలిచా. ఏంటీ భోజనం?, అప్పడంలో sound drivers install చెయ్యలేదు, ఈ colors ఏంటి, ఈ sweet size చూడు 12 pt కదా ఉండాలి, 10 pt కూడా లేదు. Alignments బాగాలేవు. ఎవడయ్యా coding చేసింది. పెద్దగా కేకలు పెట్టి తిట్టేసా. Canteen లో ఉన్న జనం అంతా pause button నొక్కినట్లు ఆగిపోయి నా వంకే చూస్తున్నారు. నాకు సిగ్గేసింది, కూర్చున్నాకా మళ్ళీ start button నొక్కనట్లు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. నేనేం మాట్లాడానో నాకే తెలియలేదు.భోజనం అయ్యింది. బయట Gardenలో కూర్చున్నాం. Suddenగా phone vibrate అయ్యింది pant pokect లో, తీసి Hello!! అన్నా. ఎవరూ మాట్లాడటంలేదు. Hello!! Hello!! అని అరిచా…ఆశ్చర్యం!!! ఇంకా pant pokect లో vibrations వస్తూనే ఉంది.

కెవ్వున పెద్దకేకపెట్టి పరుగుతీసా.

Pant మీద బల్లి పాకుతుంది. అసలే భయంనాకు బల్లంటే.


ఇలా వింతచేష్టలు ఎక్కువైనాయి ఈమధ్య…మళ్ళీ work, time చూస్తే నాలుగయ్యింది. ఆకలేస్తుంది...Domino’s కి phone చేసి Pizza order చేసా.

వాడు Address అడిగాడు. నా E-Mail Id చెప్పి… Time పట్టినా zip చేయకుండా Attachment పంపు, లేకపోతే Taste పోతుంది..అన్నా!!.

వాడు What!!! అనగానే నాలుక్కరుచుకుని ( System లో రెండుసార్లు Refresh button కొట్టి) Office address చెప్పా.నాకు ఇప్పుడు Tension మొదలయ్యింది. రేపు Client Meeting ఉంది. అక్కడ ఏంచేస్తానో అని భయం.

వాళ్ళ Dress colors బాగాలేదని Right click > Apply New Theme అని ఏమైనా చేసానా…
అమ్మో!!.. వాళ్ళు లాగి ఒక్కటిస్తారు చెంపమీద , చుక్కలు కనిపించేలా… అమ్మో!!!.. చుక్కలు అంటే?? Flying stars Screensaver
                       (ఒక కల్పిత, వ్యంగ్య రచన)

6, జూన్ 2006, మంగళవారం

చినుకు
చినుకు చినుకు చినుకులో.. ఎన్నివేళ చినుకులో..
తళుకు తళుకు మెరుపులో.. వజ్రమంటి తునకలో..

        గగనతలమునుండి రాలి...
        పుడమితల్లి ఎదను తాకి...
        స్వాతిముత్యమల్లె మారి...

చిలిపి నవ్వులో..
వాన చినుకులో..

        నేలపరిమళాల నీటిపువ్వులో..
        పరవశానపొంగే చిన్ని గువ్వలో..

కళ్ళలో తారలై ఈ సందేవేళలో..ఇష్టమైన ఇసుకఇంటి గూటిలోన సూదిగుచ్చె చినుకులంటే కోపముందిలే

తనువుపైన మత్తుజల్లి తాపమంత ఎదనురేపు జల్లులిపుడు ఇష్టమాయలే

కాగితాల పడవతోటి నీటిబుడగలన్ని పేల్చి మరువలేని కేరింతలే

నేలపైన చెవినిఆన్చి చినుకు చేయు సవ్వడుల్ని విన్నక్షణము తీపిగురుతులే


నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే

                    చినుకు చినుకు చినుకులో..

చల్లగాలితోటి వచ్చి నింగివైపు చూడనీని వర్షమంటె చిన్నచూపులే

మనసులోన దాగివున్న ఆశకేమొ రెక్కలొచ్చి రివ్వుమంటు ఎగురుతుందిలే

బాధలోన నవ్వులోన కనులవెంట చుక్కలోన భేదమిపుడులేనెలేదులే

కళ్ళలోన కడలినుండి బాధలన్ని నవ్వులయ్యి చిలిపిజల్లులీవానలే


నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే

                    చినుకు చినుకు చినుకులో..

2, జూన్ 2006, శుక్రవారం

మనసులో..మాట.


“ఓ.. దేవుడా!!, అందరికి జాబ్స్ వస్తున్నాయి, మరి నాకెందుకు రావడం లేదు??


PG చేసాను, above average student ని.. బాగా చదువుతానని అందరూ అంటారు!!, మరి నాకెందుకు జాబ్ రావడం లేదు??”


(అని ఒక నిరుద్యోగి దేవునికి మెరపెట్టుకున్నాడు , వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు)


“దేవుడా!! నాకు జాబ్ రావడంలేదు.. ఎన్నో ఇంటర్వూలకి వెళ్ళా, కష్టపడుతున్నా!! అయినా..ఏమిటి..పరీక్ష. నువ్వే ఏదోలా రికమెండేషన్ చేసి వచ్చేటట్లు చేయి…

చిన్నదైనా పర్వాలేదు.. ఒక 5000 ఇస్తె చాలు (అమ్మో ఇంత తక్కువ అడిగేసానేంటి!!..) కాదు కాదు… ఒక 10…15…18…20 వేలు వచ్చేటట్లు చూడు… నీకు కొంత కమీషన్ ఇచ్చుకుంటాలే!!!”


“ఆ… *#$$@”!!!!. , అని ఆశ్చర్యపడ్డ..దేవుడిలా..అన్నాడు


“సరే! జాబ్ ఎక్కడ వచ్చినా చేస్తావా?, ఎంత దూరమైనా వెళ్తావా?, ఎన్నికష్టాలొచ్చినా భరించాలి మరి… అలా ఐతే, ఇప్పిస్తాను”
“తరువాత, ఓరి దేవుడో!!!, ఎంత పని చేసావ్… అన్నావంటే..నన్ను తిట్టినట్లే”, అని మాట తీసుకున్నాడు..దేవుడు.


(ఎలాగైతేనె, నిరుద్యోగి, చిరుద్యోగి అయ్యాడు… ముంబయి రావాలన్నారు…ఆనందంతో, ముంబయి బయలుదేరాడు… అక్కడ అందమైన అమ్మాయిలు, సిటీ… చూసి…ఉబ్బితబ్బిబ్బై పోయాడు..)


“ఏంటి!!.. దేవుడు కష్టం అన్నాడు?, భలేగా ఎంజాయ్ చెయ్యోచ్చు.. 9-7, తరువాత, కాళీ, మిగిలిన టైము అంతా…ఓ.. భలే..”,అని నిరుద్యోగి (సారీ!!.. ఇప్పుడు ఉద్యోగి కదా?)చాలా ఆనందపడిపోయాడు..


(మొదటి రోజు ఆఫీసుకి బయలుదేరాడు… లోకల్ ట్రైన్ లో)


తోసుకుంటూ ఎక్కేసారు.., అసలు ఆ ట్రైనో కాదో.. తెలియదు…తోసిమరీ ఎక్కించేసారు..!! పాపం,

“ఆహా.. ఏమి స్పీడు”, అనేలోపే.. “ఏ చలో, భాయ్..ఆగే!!, ఉతరో జల్దీ.. “అని కేక పెట్టాడు..(అంటే, ఎంటో, మరి).
అంతే, ప్రవాహంలా.. దిగారు..జనం..

“అబ్బా, నాకాలురో..నీయబ్బా!! రే! “(వీడికి తెలుగర్దంకాదు, నాకు హిందీ రాదు.)

“అమ్మో.. బాబో.. చచ్చిపోయాన్రో.. “(ఇవన్నీ మనసులోనే, బయటకురావు, భాష ప్రోబ్లమ్.. హి.హి.)


హమ్మయ్య..ఒక స్టేషన్ వచ్చింది… బాబోయ్..ఇది చాలా పెద్ద స్టేషన్

“ఓరి దేవుడో..”(మనసులో)..
ఈ సారి ప్రత్యక్షం కాలేదు దేవుడు, కనిపించాడు..


(“ఏ, అప్పుడే ఓరి దేవుడో అంటున్నావ్..ఇంకా చాలా ఉంది…చూడు..!!”)


“సారీ, పైకి అనలేదుగా, మనసులోనే అనుకుంటున్నా, వదిలెయ్..ప్లీజ్…”,అని..దణ్ణం పెట్టుకున్నాడు..

స్టెషన్ నుండి బయటకు రాగానే వర్షం… అమ్మో.. వర్షం గురించి చెప్పడం నావల్లకాదు… ( TV9,Etv, Geminiలొ చూపించినంత కాదు కాని.. కొంచెం ఎక్కువే..).

ఇంత నీరు ఆకాశంలో ఎక్కడుందో..? అని డవుటు…


లైఫ్ లో కష్టాలు మాములే.. మరి తప్పవ్.. వాటిని కూడా ఆనందించాలి… అందరికి పంచుకుని.. ఇలా!!

23, మే 2006, మంగళవారం

స్నేహితం...

పరిమళాలనవ్వులు చల్లే పువ్వులతో…
పసిడి వన్నెకాంతుల చిందే ఆకులతో…

వయ్యారి వంపులున్న కొమ్మలతో…
ఒక అందమైన వృక్షం లాంటిది.. మన స్నేహం.

నవ్వేపువ్వుని కావాలని అడిగితే…
కోస్తున్నప్పుడు.. బాధను మరచి నవ్వుతూ..ఇస్తుంది.

ఒక ఎండుకొమ్మను అడిగితే…
జీవాన్ని వెలికి తీసి.. ఎండు కొమ్మగా. మార్చి.. ఇస్తుంది.

లోపలున్న వేరుని అడిగితే..;
తన స్థానం కదులునని తెలిసినా.. నీ కోసం తీసిస్తుంది.

నీకేం కావాలో నువ్వే కోరుకున్నావు.
నీతో ఎలా ఉండాలో నువ్వే చెప్పావు…నేస్తమా.!!

మన స్నేహమనే.. ఈ వృక్షాన్ని నిలుపుకోవడానికి..
నే..చేసే ప్రయత్నం.. తప్పా???

1, ఏప్రిల్ 2006, శనివారం

మువ్వల సవ్వడి..

మువ్వల చాటున సవ్వడి...
సవ్వడిలోన సందడి...
ఆ సందడి రేపే అలజడి...

అలజడి అలలజడి..

ఈ సంద్రం ఒడ్డున నువ్వోక అలలాకదులుతుంటే..

నా ఊపిరిని ఆపి..

నా హ్రుదయం చేసే సవ్వడిని..
ఈ సంద్రపు ఘోషతో పోలికను గమనిస్తున్నాను..

--- శ్రీ

స్నేహమైనా ఇంతే..

చంద్రునిలో మచ్చను చూసాను..
అసహ్యించుకున్నాను...

చండ్రుడే మచ్చ అన్నాను.. మచ్చే చంద్రుడు అన్నాను..

మచ్చని విడిచి మిగతా భాగం చూసా..
అందంగానే ఉంది అనిపించింది..

అంతా కలిపి చూస్తే.. మచ్చ కూడా అందం.. అనితోచింది.

అలా చూస్తూ వుంటే.. అసలు మచ్చే లేదనిపిస్తుంది..

ఎంత అందంగా ఉంది..

ఈ మార్పు చంద్రునిలోనా.. నా కళ్ళలోనా?

-- శ్రీ

నా చెలికి అందించనా..

కధలాగా నీ రూపం మిగిలినా..
కలలో రోజూ నిన్ను చూస్తూనే ఉన్నాను.
నీకు చెప్పాలనుకున్నప్పుడు మాటలు రాకపోయినా..
మదిలో ఉప్పొంగే భావాల్ని కవితలా వ్రాస్తూనే ఉన్నాను..

నన్ను విడిచి వెళ్ళావని బాధగా ఉన్నా..
నా ఊహల్లో.. ఇంకా దగ్గరయ్యావని మురిసిపొతున్నాను.


ఏమో! మరి ఏమైందో.. నేస్తం
నిన్న కలలో, మదిలో, ఊహల్లో ఎక్కడా నిన్ను కలవలేకపోయాను..
అందుకే ఇది చదువుతున్నాను.

-- శ్రీ

ఏమిటిది.?

ఏంటిది.? నేను నవ్వితే నవ్వుతుంది..
నా బాధను స్పష్టంగా చూపిస్తుంది..
నా లాగే.. నాపోలికనే కలిగి ఉంది..

ఇదివరలా లేదే ఇదీ.. అంతా వ్యతిరేకంగా ఉండేది..

ఓ నేను చూసేది అద్దంలోనా..? ఇది అద్దమా.. అర్దంకావడంలేదు!!
లేదు..!!
ఆలోచనలు కనిపిస్తున్నాయి.. మాటలు వినిపిస్తున్నాయి

ఆ..!! ఇప్పుడు అర్దమైంది.. ఇది నా మనస్సు అని.--- శ్రీ

21, మార్చి 2006, మంగళవారం

Intresting

Hi.. Friends.. Hope everyone is doing fine.

We have lot of Memorable events in our life.. When we share with our friends they become Happy moments.. I am requesting you to post the most memorable/Most enjoyable event in your life..

Thanks

1, మార్చి 2006, బుధవారం

West Godavari Walla..

Hi Friends.. I'm Srinivas.. I created my blog recently.. I'm basically from WestGodavari District.. which is a green bowl of Andhra pradesh..

Mana west godavari gurinchi.. ikkada manusulu, pradeshalu.. inka edaina.. Andhra gurinci.. everything can be invited..

with Best Regards..

Related Posts Plugin for WordPress, Blogger...