22, సెప్టెంబర్ 2010, బుధవారం

బకాసురులు - 3


(రీల్ అతుక్కుంది.. ఈ కధకు బయ్యర్స్ ఎవరూ రాకపోవటంతో.. చిన్న ధియేటర్లవాళ్ళని బ్రతిమలాడి ఇచ్చుకోవటంవళ్ళ ఇలా రీళ్ళు తెగిపోతున్నాయి.. అంతరాయాలకి చింతిస్తున్నాము.. )

అది దగ్గర్లోవున్న బడా కార్పొరేట్ హాస్పిటల్.. ఒక్కసారి.. హాస్పిటల్ ఎంట్రన్సు గేటుపై లాంగ్ షాట్..హాస్పిటల్ పేరుపై ఒక క్లోజప్ షాట్.. కట్ చేస్తే... టోయ్. టోయ్.. టోయ్.. అంటూ వచ్చిన అంబులెస్స్ కూతలు.., జనాల ఆర్తనాదాలు.., హడావిడిగా తిరుగుతున్న డాక్టర్లు.. కొత్తకొత్తబట్టలువేసుకుని స్ట్రెచ్చర్ పై పడుకున్న పేషెంట్లు.., ప్లేట్లో.. ఇడ్లీ..దోశ.. పెసరట్టుప్మా తీసుకెళుతున్నట్టుగా.. ఒక సెలైన్ బాటిల్.. ఒక కాటన్ రోల్.. ఒక బ్లడ్ బాటిల్ .. ఒక సిరంజి పెట్టుకుని.. పరుగులు తీస్తూ పట్టుకెళ్తున్న నర్సులు.. ఇవ్వన్నీ నిజంగా కళ్ళముందులేకపోయినా... తెలుగు సినిమాలు చూసిచూసి.. అదేరకంగా వూహించుకుంటూ.. ఒణికిపోతున్నాడు బొండు భద్రం. అలా ఒణికిపోతూనే కారురివర్స్ గేరువేసినట్టుగా.. వెనక్కెనక్కి వెళ్ళిపోతున్నాడు.

రిసెఫ్సన్ దాకా వచ్చిన చుండ్రు రమణకి... అప్పటిదాకా పదిచెక్రాల లారీ పక్కన నడిచొచ్చిన ఫీలింగ్ ఒక్కసారిగా మిస్సయ్యేసరికి.. "బొండుగాడేడ్రా..", అని నల్లశీనుని అడిగాడు.. ఇద్దరూ వెనక్కు తిరిగి చూసారు.. గుళ్ళోకివెళ్ళకుండానే.. గుడిపైనున్న రాఘవేంద్రరావుగారి సినిమాలో హీరోయిన్ బొమ్మల్లాగా కనిపించిన బొమ్మలను చూసి కళ్ళుతిరిగిపడిపోయిన భక్తుడు.. కిందపడి.. గిలగిలా కొట్టేసుకున్నట్టు.. హాస్పిటల్ గేటు దగ్గర పడిపోయున్నాడు బొండుభద్రం. జేబులోనుండి కఫ్ సిరప్ అంత చిన్న బాటిల్ బయటపడి.. దొర్లుకుంటూ దొర్లుకుంటూ.. సరిగ్గా పాయిజన్ అని ఇంగ్లీషులో రాసున్నఅక్షరాలు కనిపించేవిధంగా ఆగింది.. (సరిగ్గా ఎలా ఆగింది అనే కదా మీ డౌటు.. ఎన్ని టేకులు తీసుకుంటే ఈషాట్ వచ్చిందో మీకేంతెలుసు.., అయినా సినిమా చూసి.. ఛీ ఎధవ సినిమాఅనేస్తారు.. అదే కదా ప్రాబ్లమ్)

అది చూసిన సెక్యూరిటీ గార్డ్.. "పాయిజన్ కేస్..", అని స్ట్రెచ్చర్ పట్టుకున్న బాయ్ ని పిలుస్తూ ఆర్తీ అగర్వాల్ లా ఆర్తనాదం చేసాడు. ఒకపది మంది సాయం అడిగి బొండు భద్రాన్ని అతి కష్టంమీద స్ట్రెచ్చర్ పై ఎక్కించారు. ట్రాలీ తోసుకుంటూ వెళుతున్నారు.. చక్రాలు కిచ్ కిచ్ మని శబ్దంచేస్తున్నాయి... సీలింగ్ పై లైట్లు వెనక్కు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. మిగతా ముగ్గురూ ట్రాలీతోపాటే పరుగెడుతున్నారు.

"ఏరా.. ఇప్పటిదాకా బాగానేవున్నావుగా.. అంత సడెన్ గా ఎలా పడ్డావ్",అని ట్రాలీ తో పాటే పరుగుతీస్తూ బొండుభద్రం చెవిలో గుసగుసలాడాడు కుక్కల సతీష్.
"నాకు చిన్నప్పటినుండి హాస్పిటల్ అంటే చాలా భయంరా.. చిరంజీవిని చూడగానే కాళ్ళువొణికిపోయేవి..", అన్నాడు బొండుభద్రం.
"చిరంజీవి కాదెహే...సిరంజి.., సరేలే కానీ.. గీతాంజలి సినిమా చూసావా?", అనడిగాడు చుండ్రు రమణ.
"ఒరే.. ఆ సినిమాలు.. స్టోరీలు అవసరమా ఇప్పుడు?", అనడిగాడు బొండుభద్రం.
"మరదే.. అందులో హీరోయిన్ కి కేన్సర్ అని తెలిసాకా.. హాస్పిటల్ కి తీసుకెళుతున్నప్పుడు సీన్లో ఆమె ఎలా ఏక్ట్ చేసిందో.. ఫ్రేమ్ టుప్రేమ్ అలానే ఏక్టింగ్ చెయ్యి.., నువ్వేం భయపడకు.. మేమున్నాం.. నువ్వు కుమ్మేయ్.., సిరంజి లేకుండానే.. ఇంజక్షన్ సెలైన్ ద్వారా ఇవ్వమని నర్సుకి చెబుతాంలే.. ", అని సలహా ఇస్తూ  ధైర్యం (తేజ సినిమా  ధైర్యం కాదు) చెప్పాడు చుండ్రు రమణ.

ట్రాలీ చక్రాల కీచ్ కీచ్ శబ్దాలు వింటూ.. సీలింగ్ పై వెనక్కు పరుగెడుతున్న లైట్లు చూస్తూ.. బొండుభద్రం ఒక పదిసెకన్లు.. ప్లాస్బాక్ లోకి వెళ్ళాడు. గీతాంజలి సినిమాలో ఆ సీన్ ఒక్కసారి ఊహించుకున్నాడు.. ఇరగదీసేసి ఏక్ట్ చేసేసాడు. ట్రాలీని నడుపుతున్న బాయ్స్ ఇంకా ఫాస్ట్ గా తోసుకుంటూ.. ఐ.సి.యు వైపు తోసుకు వెళుతున్నారు. ఆ ముగ్గరూ ఇంకాఫాస్ట్ గా ట్రాలీతోపాటే పరుగెడుతున్నారు.

"ఒరేయ్..మరీ ఎక్కువ ఏక్ట్ చెయ్యకు.. ఆ హీరోయిన్లాగా నీకు క్యాన్సర్ అని ట్రీట్మెంటిచ్చేయగలరు.. పాయిజన్ కేసులా చెయ్యి చాలు", అని చెప్పాడు నల్లశీను.

ట్రాలీ ఐ.సి.యు లోపలికెళిపోయింది.. గోడమీదనున్న రెడ్ లైట్ వెలిగింది.

రిసెఫ్సన్ దగ్గరకెళ్ళి.. హెల్త్ కార్ట్ చూపించి.. వివరాలు కనుక్కున్న చుండ్రురమణ.. టామ్ అండ్ జర్రీ షోలో.. జర్రీని పట్టుకోలేక.. అలసిపోయి.. చేతులు వేళాడేసుకుని.. చెమటలు తుడుచుకుంటూ దిగాలుగా వున్న టామ్ లాగా.. నడుస్తూ వచ్చాడు.
"ఒరే.., ఈ ఎమర్జెన్సీలో ఇన్సూరెన్స్ కంపెనీవాళ్ళని కాంటాక్ట్ చేసి.. వారిదగ్గరనుండి రిప్లైవచ్చేదాకా వెయిట్ చేయలేమండి. ముందు కేష్ కట్టేయండి.. తరువాత ఈ బిల్లులన్నీ పంపిస్తే.. ఆ డబ్బులు మీకు అన్నీ వచ్చేస్తాయని.. చెబుతుందిరా రిషెఫ్సనిస్టు..", అన్నాడు చుండ్రు రమణ.

"అంతే కదా.. నా క్రెడిట్ కార్డుతో కట్టేస్తా.. తరువాత డబ్బులొస్తాయి.., దీనికే టెన్సనెందుకురా.. ", అని చెప్పాడు నల్లశీను.

ఇంతలో డి.టి.యస్ ఎఫెక్టుతో పెద్ద పెద్ద పొలికేకలు.. పెడబొబ్బలు.. ఐ.సి.యు రూమ్ నుండి వినిపించడం మొదలుపెట్టాయి.., పైనున్న రెడ్ లైట్ ఆరిపోయింది.. ఐ.సి.యు రూమ్.. తల్లకిందులైపోయింది. (నిజంగా తల్లకిందుకాదు.. కెమోరా ఉల్టా తిప్పాం.. :-) )

అదంతా చూస్తున్న ఆ ముగ్గురికీ చెమటలు పట్టేసాయి.., సినిమాళ్లలో విలన్ వేసుకొచ్చిన కార్లు. వరుసగా వచ్చి.. వరుసగా ఆగి.. టఫ్ టఫ్ టఫ్.. అని ఒక్ససారిగా డోర్లు తీసినట్టుగా.. ఆ ముగ్గురూ ఒక్కసారిగా టఫ్ టఫ్ టఫ్ అని.. కూలబడిపోయారు... వాళ్ళ జేబుల్లోంచి.. అవే.. కఫ్ సిరప్ బాటిల్లంత బాటిల్లు కింద పడ్డాయి.. మళ్ళీ అలాగే దొర్లకుంటూ పాయిజన్ అని రాసున్న ఇంగ్లీష్ అక్షరాలు దగ్గరే ఆగాయి. ఒక్కసారిగా సీన్ చీకటైపోయింది.

***

అది రాత్రి.. కానీ డిస్కో లైట్లకాంతిలో పగల్లావుంది.. ఒకడి మాట ఒకడికి వినపడనంతగా ధుబ్ ధుబ్మని బీట్ తో వస్తున్న రాక్ సాంగ్స్.. చుట్టూ పార్టీ వాతావరణం.
ఆ నలుగురూ.. తినటం మొదలుపెట్టారు.. తింటూనే నోట్లో మాటవచ్చేటంత కాలీ చేసుకుని.. "ఏరా.., ఐ.సి.యులోంచి.. అంతలా అరిచావ్.. ఏంచూసావ్ రా లోపలా.. ", అనడిగాడు నల్లశీను.. ప్లేటుతో సహా చికెన్ చిల్లీ.. తినేస్తున్న బొండుభద్రాన్ని.

"నర్సు చేతులోవున్న చిరంజీవిరా..", అన్నాడు బొండుభద్రం.

హహాహా.. "కరెంటు పోయి లైటాగిపోతే.. మేమంతా నువ్వు జెండా.. అనుకున్నాంరా", అన్నాడు చుండ్రు రమణ.

కాలం గడిచింది... (ఈ ఊత పదానికి ఇదే ఆఖరులేండి.. తిట్టుకోకండి..)

హాస్పిటల్ బిల్లు పేరు చెప్పి.. చుండ్రు రమణకి పదివేలు.. కుక్కలసతీష్ కి పదివేలు.. బొండు భద్రానికి పదిహేనువేలు.. నల్లశీనుకి.. ఇరవైవేలు ఖర్చయ్యింది. అదే చూపిస్తూ క్రెడిట్ కార్డు బిల్లొచ్చింది నల్లశీనుకి. "ఎంతొస్తే ఏంటిలే..", అని ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసాడు బొండు భద్రం.

"పాయిజన్ కేసు.. సుసైడ్ ఎటంప్ట్ కిందకు వస్తాయి సార్.. మా పాలసీ అది కవర్ చెయ్యదు... ఇది.. మా బుక్ లెట్.. నూటముఫ్ఫైమూడోపేజిలో.. నాలుగోలైన్లో రాసాము.. అది చదువుకొని.., అందులో ఏమన్నా సహాయం కావాలంటే.. మా కాల్ సెంటర్ కి కాల్ చేయండి.. మీరు మాట్లాడుతున్నది సిల్క్ స్మితతో... శుభోధయం.. ధన్యవాదాలు", అని చిలకలా నవ్వుతూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది.. కాల్ సెంటర్ అమ్మాయి.

ఆ న్యూస్ విన్న నలుగురికీ కడుపులో దేవేసి.. అప్పుడెప్పుడో పార్టీలో తిన్నదంతా.. ఇప్పుడు బయటకొచ్చినంత పనైంది.

ఆగండాగండి.. అప్పుడే పార్కింగ్ టికెట్ట్ వెతుక్కుంటూ.. సీట్లోంచి లేచిపోతున్నారా?, మరదే.. ఇక్కడో చిన్న ట్విస్టుంది.. అదికూడా చూసి(చదివి) వెళ్ళండి.

బిల్లెలాగూ తప్పేట్టులేదని తెలుసుకున్న ఆ నలుగురూ.. హాస్పిటల్ కి వెళ్ళి.. అందరివీ ఒకటే కేసులు కదా.. మరి బిల్లెందుకు వేరువేరుగా వచ్చిందని గొడవపెట్టారు.

బొండు భద్రం టాంక్ కాస్త పెద్దదనీ.. అది క్లీన్ చెయ్యటానికి స్పెషల్ గా మున్సిపాలిటీవాళ్ళను తీసుకురావల్సొచ్చిందనీ.. అందుకే పదిహేనువేలన్నారు.

నల్లశీను జేబులోనుండి రెండు కఫ్ సిరప్ బాటిల్లంత బాటిల్లు పడ్డాయని.. ఒకదానిమీద పాయిజన్ అని రాసుండగా.. వేరేదానిపై ఏమీ రాసిలేని తెల్లకాగితం అంటించి వుండటంతో.. ఏదో తెలియని విషం తాగుంటాడు అని.. ఆ తెలియని క్లీనింగ్ కి.. ఇరవైవేలయ్యిందని తేల్చిచెప్పి.., నలుగుర్నీ మెడపట్టి బయటకు గెంటేసారు హాస్పిటల్ వాళ్ళు.

20, సెప్టెంబర్ 2010, సోమవారం

బకాసురులు - 2

(ఇది ఇంటర్వెల్ తరువాత భాగం.. ముందు భాగం చదివి సమోసాలు తిన్నాకా ఇది చదవండి.. )

పెళ్ళాన్ని ఊరి బస్సెక్కించి.. పక్కనేవున్న బీరుషాపులో.. ఒక చిన్నలారీడు బీరుకాయలు కొని.. మనుషుల్నిపెట్టి ఇంటికి పంపించమని ఎడ్రసు రాసి షాపువాడికిచ్చాడు చందు. వచ్చిన మనుషులు.. పేకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళలాగా.. ఫ్రిజ్ నిండా.. బీరువానిండా.. మంచంనిండా.. సోఫానిండా.. సింక్ నిండా.. లెట్రిన్ సీట్ నిండా... ఎక్కడ పెట్టమంటే అక్కడ బీరుకాయలు సర్దేసి.. నెలరోజులకు సరిపడా స్టాక్ పెట్టి.. నడవడానికి చోటులేకుండా ఇంటినిండా నింపేసి వెళ్ళిపోయారు. "ఎక్సూజ్ మి..", అని అలవాట్లోపొరపాటుగా అడ్డంగా పడివున్న బాటిల్సుతో అంటూ.. తప్పించుకుంటూ.. తనటీమ్లోనేవున్న నలుగురు కుర్రాళ్ళకు ఫోను చేసి ( ఆ నలుగురు కుర్రోళ్ళకి.. మళ్ళీ రీ ఇంట్రో. కావాలంటే.. ముందు చెప్పిన రాయలసీమ ఎపిసోడ్.. డి.వి.డిని ఇక్కడ ప్లేచేసుకున్నట్టు ఊహించుకోండి..) , "సాయంత్రం పార్టీకి మీరు తప్పకుండా రావాలి.. కొత్త అని అసలేమీ సిగ్గుపడొద్దు.. ఇది అందరం కలవాలనే గెట్ టూగెదర్..", అని మరీ మరీ రమ్మని పిలిచాడు.

చీకటిపడటంతో ఇంటి వాతావరణం మారిపోయింది. బొండుభద్రం.. నల్లశీను.. కుక్కల సతీష్.. చుండ్రురమణ..ఇంకా మరో ఇద్దరితో.. ఇల్లు బార్ లాగా కలకలలాడిపోయింది కాదు కాదు.. కలకలలాడే బార్ లాగా అయిపోయింది.. అబ్బాఇదీ కాదు.. ఇల్లులో కలకలలు బార్ లాగా అయిపోయాయి.. (ష్.ష్.. మీకు అర్ధమయ్యిందనే అనుకుంటున్నా!!.., అదే సినిమా అయితేనా ఈ సీనుకు.. గుణశేఖర్ లా నాలుగుకోట్లుపెట్టి పెద్దసెట్ వేయించి చూపించేవాడిని.., అఫ్ కోర్స్.. నిర్మాత వెఱ్ఱిబుజ్జి అయితే)

దొరికిందే పట్టు అని.. పట్టుకు పది బాటిల్ల చొప్పున తాగటం మొదలెట్టారు నలుగురు కుర్రాళ్ళూ.. ఒక్కరోజులోనే మొత్తం లోడు లోడంతా ఖాలీచేసేసి.. తినటానికి తెచ్చుకున్న స్టఫ్ అయిపోవటంతో.. చందూ ఇంట్లో నెలకు సరిపడా తెచ్చిపెట్టుకున్న ఉప్పూ.. కందిపప్పూ.. చింతపండూ.. ఆవాలు.. మెంతులు.. గసగసాలు లాంటి పచారీ సరుకులన్నీ.. ఇది బాగుందంటే.. టేస్టు ఇది బాగుందని.. ఎలకలు కొట్టినట్టు డబ్బాలన్నిటికీ పళ్ళతోటి గాట్లుపెట్టేసి.. తిరగబోసేసి తినేసారు.

ఇదంతా చూసిన పక్కింటివాళ్ళు... ఎడ్వటైజ్మెంటుల్లేని సీరియల్లాగా సీనుకు సీను డడండ్.. డడండ్.. అని మ్యూజిక్కుతో.. ఫ్లాష్ ప్లాష్.. ఎడిటింగ్ ఎఫెక్టులతో.., 3డి సినిమా కళ్ళజోడులాగా కళ్ళకుకట్టినట్టు.. చందూవాళ్ళావిడకి ఫోనులోనే బుల్లితెరపై చూపించేసారు. అవతలవైపు ఫోనులోమాట్లాడుతున్న చందువాళ్ళావిడ మొహం.. బ్లాక్ &వైట్లోకి మారిపోయింది. అదే బ్లాక్ & వైట్ మొహమేసుకుని.. తరువాత రోజునే ఊరునుండి తిరిగొచ్చేసినావిడ. లిప్ట్ ఎక్కకుండా..., మెట్లెక్కి రాకుండా.., మేడమీదకొచ్చేసింది.

(ఇదే సీరియల్ అయితే.. ఇక్కడే మిగతాది వచ్చేవారం అని టైటిల్స్ వేసేస్తూ.. టైటిల్ సాంగ్ వేసేద్దుం). ఇంతకూ ఆమె లిప్ప్టు ఎక్కుండా.. మెట్లమీదనుండి రాకుండా ఎలా వచ్చిందబ్బా అనుకుంటున్నారా!!, తాగిపడేసిన బీరుబాటిల్లపై అడుగులో అడుగులేసుకుంటూ స్లోమోషన్లో.. నడుచుకుంటూ (ఇదే మోషన్.. నాలుగు ఎపిసోడ్స్ చూపించొచ్చు), నాలుగో ఫ్లోర్లోవున్న వాళ్ళ అపార్ట్మెంటులోకొచ్చేసరికి..., స్వైన్ ఫ్లూ వచ్చిన పందులకి.. టామీ ఫ్లూ టాబ్లెట్టు ఇస్తే మత్తుగా పడిదొర్లుతున్నట్టుగా దొర్లుతున్న చందు.. అండ్ నాదస్వర బృందాన్ని చూసి "హె.. కృష్ణా.. ముకుందా.", అన్నపాట అర్తిగా బ్యాక్ గ్రౌండలో వింటూ.. జన్మధన్యమైపోయిన ఆవిడకి కళ్ళుతిరిగిపోయి.. పోకిరి సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టు దిమ్మతిరిగి మైండ్ బ్లాకయిపోయింది.

తలనుండి రాలిన చుండ్రులో కప్పుకుపోయిన్న చండ్రురమణ మొహాం కనపడటంలేదు. పీతకి తాతలాగా తాగిన బొండుభద్రం.. ఒక రూములో మొత్తం బెడ్ కిందనుండి.. కుర్చీలకిందనుండి.. గోడలదగ్గరనుండి.. కార్పట్ పైనుండి.. కార్పెట్ ఏరియా అంతా కవర్ చేసేసి గదికి సరిపడా పడుకున్నాడు. కుక్కలు చించిన కర్టెన్లాగా చిందరవందరగా పడివున్నాడు కుక్కలసతీష్. అసలు కేండెట్టు నల్లశీనేలావున్నాడనే కదామీ కంగారు.., టెన్సన్ పడకండి.. గోర్లుకొరుక్కోకండి.. మిగిలిన ఇద్దరికిందా నలిగిపోయి నల్లపూసైపోయాడుగానీ.. బాగానేవున్నాడు.

ఆ దెబ్బతో కంపెనీలో అందరికీ ఆ నలుగురి గురించీ తెలిసిపోయింది.. పార్టీ ఏదన్నావుంటే... ఎన్నికలముందు దొంగచాటుగా.. మీడియాకి దూరంగా పారిపోయి.. పొత్తులు (మొక్కజొన్న పొత్తులు కాదు) కలుపుకుంటున్న రాజకీయనాయకుల్లాగా.. వాళ్ళకు తెలియకుండా పార్టీలు జరుపుకుంటున్నారే తప్ప.. ఒక్కడుకూడా వీళ్ళముందు పార్టీమాటెత్తటంలేదు.. తినేసి వచ్చి.. వాళ్ళముందు.. బ్రేవ్.. మని గౌడుగేదే త్రేన్చినట్టు పొరపాటున త్రేన్చినా.. గ్యాస్ట్రిక్ ప్రోబ్లమ్ వచ్చేసింది అంటున్నారేగానీ అసలు విషయమే పెద్ద గోబర్ గ్యాస్ అని చెప్పటంలేదు.

లంచ్.. డిన్నర్ ఫ్రీగా ఇచ్చే కంపెనీవాళ్ళు.., అన్నీ మానేసారు. ఆఫీసు ఎంప్లాయిస్ వాహనాలకన్నా.. కేంటిన్ వాడు వండిన వస్తువులు పట్టుకొచ్చే వాహనాలు ఎక్కువైపోయాయని జనాలు గొడవపెడుతున్నారని.. చిన్న సాకును సాగదీసి.. వంగదీసి.. లొంగదీసుకుని.. కార్పొరేట్ స్టైల్లో చెప్పి.. అసలు ఇలా ఇండియా టైము.. యు.యస్ టైము రెండూ చూసుకుని.. ఆప్పొద్దులా ఆంబోతులా తింటున్న("ముప్పొద్దులా దున్నపోతు" కి కొత్త ప్రయోగం.., "ఆరుపొద్దులా ఆంబోతులా" అని అర్ధం),

"ఆం-బోతులు" ఎవరని.. బండబూతులు తిట్టి.. లేనినీతులు చెప్పి.. కొంగబాతుల చంపుట.. నేరమెగదరా సుమతీ.. అని చక్కగా నవ్వుతూ అర్ధంకాకుండా చెప్పిన హెచ్చార్ టీమ్... శ్రీకృష్ణకమిటీలాంటి.. శ్రీరామకమిటీ.. శ్రీదుర్యోధనకమిటీ.. శ్రీబకాసురకమిటీ (టైటిల్ కి జస్టిఫికేషన్ కాదు.).. లాంటి తొమ్మిది కమిటీలు వేసి..ఇకనుండి. తొమ్మిదిదాటాకావుండేవాళ్ళకే డిన్నర్ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పారు.

అయినా.. ఆ నలుగురి ప్రస్థానం ఆగలేదు.. పనున్నాలేకపోయినా.. పన్నున్నా లేకపోయినా.. అన్ లిమిటెడ్ భోజనంకోసం లేనిపనిని.. అన్ లిమిటెడ్ గా కల్పించుకుని చేస్తూ తినేస్తున్నారు.

కాలంగడిచింది.. కంపెనీ కేంటిన్ మూతపడింది... అన్ లిమిటెడ్ కి అలవాటు పడ్డ ఆ నాలుగు నాలుకలూ చప్పబడి.. చప్పలించబడి.. మెత్తబడి.. ఒత్తబడి.. చిత్తుచిత్తుచేయబడి.. చేతబడిచేసిన నక్కలవలె.. బక్కచిక్కిపోయినవి.


వరదల్లో కట్టుకున్న గోచీవూడిపోబోతూ.. నీటిలోప్రయాణానికి టిక్కెట్టుతీసుకున్న.. సరిసమయంలో.. హెలీకాప్టర్లోంచి పులిహోర పొట్లం పైనుండి కిందకిందకు జారి. మీదమీదకి చేరి.. చేతిదాకావస్తుంటే.. "ఒకటోసారి.. అన్నమా.. మానమా..?, రెండోసారి.. అన్నమా.. మానమా..?", అనుకుంటూ చీటీపాటలా పాటపాడుకుంటున్న ఒక పేద జీవికి.. ఫైటింగ్ సీన్లో గాల్లోగిరగిరగిరమంటూ.. తిరుగుతూవచ్చే మన తెలుగుహీరోలాగా.. ఒక ఎండుటాకు.. గోచీప్లేస్ ని రీప్లేస్ చేస్తే.. "అన్నమే..", అని చిరునవ్వునవ్వుకుని అంటిపెట్టుకున్న ఆకును ఎగరనీయకుండా పులిహోరప్యాకెట్టుని ఎగిరి పట్టుకుని.. బాలీవుడ్ కింగ్ కిస్సర్ ఇమ్రాన్ హస్మీలాగా ఆ పేకెట్టుకు లిప్ కిస్ ఇచ్చి.. పులిహోర తిన్నంత హాయిగా.. తియ్యటి వార్త మోసుకొచ్చింది ఒక ఈ-మెయిల్.

ఆ వారం కంపెనీ మూడవ పుట్టినరోజుని.. సరిగ్గా ఈరోజుకు మూడురోజుల తరువాత.. సెలబ్రేట్ చేసుకోవటానికి మీరంతా మాంచి మూడ్లో.. మూడోనెంబరు రోడ్లోవున్న "మిడ్ టవున్ మూడ్స్" రెస్టారెంటు మూడోప్లోర్కి రావాలని సరిగ్గా మధ్యాన్నం మూడింటికి.. ఇన్ బాక్సులోనవ్వింది ఆరోజొచ్చిన ముప్పైమూడోమెయిల్.. (మూడంకెని ఎక్కువ వాడానని..దీనికి తరువాత స్టోరిలో ఎక్కడో గొప్ప ఇంపార్టెన్సు వుంటుదని.. ఇంగ్లీష్ ఫిక్షన్ సినిమా ప్రేక్షకుడిలాగా ఎక్కువాలోచించి బర్గర్.. సేండ్విచ్ మీద కాలేసేయకండే..)

ఆ మెయిల్ చూసి.. చేతబడిచేయబడిన నక్కలవలెనున్న నలుగురి నాలుకలూ.. సత్తువను పొంది.. సుఖముగానుండెను. (కధసుఖాంతానికి వాడేపదం కాదు)

కాలం గడిచింది.... (నో కామెంట్స్.. ఈ కధలో ఇదే నా ఊతపదం).

కాస్త వెరైటీగా.. పార్టీకి ముందురోజు రానేవచ్చింది.. వెరైటీగా.. ముందురోజు రావటం కాదు.. కధల్లో ఎప్పుడులాగా.. పార్టీరోజు రావటం కాకుండా.. పార్టీముందురోజు వెరైటీగావచ్చిందని.

"రేపటి పార్టీకి ఎలారా.. అసలు ప్రిపేర్ కాలేదు.. కడుపంతా నిండిపోయింది.., అసలు తినలేమేమోరా..", అన్నాడు కుక్కలసతీష్.

"అవున్రా.. నాదీ అంతే.., మరీ ఇంత మూడురోజులముందు సడెన్ గా చెబుతారేంట్రా మనోళ్ళు, కనీసం ఒక పదిరోజులైనా ముందు చెబితే.. పార్టీకి.. సామాజిక న్యాయం చేద్దుం కదా!!", అన్నాడు బొండుభద్రం.

"ఏదొకటి రా బాబూ.., పొద్దున్నే టీ.వీలో మంతెన సత్యన్నారాయణరాజు ఫ్రీగా సలహాలు చెబుతున్నారుకదా అని టీ.వీ పెడితే...,రోజంతా నిమ్మరసం తేనె.. నిమ్మరసం తేనే మాత్రమే పుచ్చుకుంటే.. దానివల్ల కడుపుఅంతా డెట్టాల్ వేసి క్లీన్ చేసినంతలా అయిపోతుందని చెప్పారు.., మొత్తం క్లీన్ అవ్వాలని.. ఒక నాలుగు బాటిల్లు కానిచ్చేసా.. కానీ ఈ తేనే నిమ్మరసం మాత్రమే వుంది చూసారూ.. మొత్తం మంట మంట.. భగభగలాడే పెట్రోల్లాగా బయటకొస్తుంది..., ఇదేంటి మాస్టారు.. డెట్టాల్ లా క్లీనింగ్ అంటే మంట కూడా అలాగేవుంటుందా.. అని ఆయన్నే అడుగదామంటే మళ్ళీ రేపొద్దుటదాకా టీ.వీలో రాడే..", అన్నాడు నల్లశీను.

"ఒరే.. శుభమా అని భోజనాలుపెడుతుంటే.., గురువుగారు.. కడుపులో దేవుతుంది.. వాంతిచేసుకోవాలి.. కొత్త ఆకు ఒకటి తెచ్చివేస్తారా, అన్నాడంట వెనకటికెవడో.., అంత తేడాగా వున్నవాడు అక్కడికి రావటమెందుకూ.. వచ్చివడ్డించే వాడిని పిలిచి మరీ ఆకువేయించుకుని.. ఫుల్ గా కక్కటమెందుకూ.., ఛస్.. ఆపండెహే!!, కడుపు నిండుగా వున్నవాళ్ళూ... మంటతో బాధపడేవాళ్ళూ రానక్కర్లేదు... మీ కడుపులు క్లీన్ చేయించుకోవాలంటే నాదగ్గర ఒక ఐడియావుంది.. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది..", అని చిరాకుపడుతూనే సలహాచెప్పాడు చుండ్రురమణ.

ఏంట్రాఏంటది.. అని ముగ్గురూ.. చుండ్రురమణ చుట్టూచేరి గుసగుసలాడటం మొదలుపెట్టేరు.

"పాయిజన్ తాగామని చెప్పి ఏ కార్పొరేట్ హాస్పటల్ కి అయినా వెళ్ళామంటే.., ఏ టెస్టూ చేయకుండానే.., కడుపులో పేగులుమెత్తం బయటకు తీసేసి.. పక్కనున్న బేసిన్లోవేసి సుబ్బరంగా కడిగేసి.., ఆఁ.. అనమని.. నోరుతెరిచాకా.. ఆ పేగులు మొత్తం నోట్లోకి తోసేసి.., అరగంటలో సర్దేస్తారు.. అంతే కడుపు మొత్తం క్లీన్..", అన్నాడు చుండ్రురమణ.

"సర్దేసిన తరువాత.. ఫీజు చెబితే.. అన్నీ మళ్ళీ బయటకొస్తాయి..", అని కోపంగా అన్నాడు బొండు భద్రం.

ఎవరుమీరు.. అసలెందుకొచ్చారిక్కడికి.. అని చెమటలు తుడుచుకంటూ అడిగిన ఒక బక్కప్రాణికి.. జేబులోంచి.. ఒక సిగరెట్టు పెట్టెనుండి.. ఒకపక్కనుండి చింపిన.. అట్టముక్కలాంటి కార్టుముక్కొకటి చూపించి.. "వు. ఆర్ ఫ్రమ్.. సి.బి.ఐ..", అని సినిమాల్లో అన్నట్టుగా.. జేబులోంచి.. కంపెనీ ఇచ్చిన హెల్త్ కార్ట్ చూపిస్తూ.. "ఇవిచ్చింది ఎందుకు మనకూ..., ఈ కార్టు ఎంత పవర్ ఫుల్ అంటే.. దీన్ని నువ్వు హాస్పిటల్ బయటున్న సెక్యూరిటీ వాడికి చూపించినా చాలు.., వాడే డాక్టరయిపోయి.. నీకు వేసెక్టమీ ఆపరేషన్ చేసేయ్యటాకైనా రడీ అయిపోతాడు", అన్నాడు చుండ్రు రమణ.

"సరే పద.., ఆ ఆపరేషన్ తో కడుపుక్లీన్ అవుతుందంటే.. సెక్యూరిటీ వాడు చేస్తే ఎంటి.. జనరేటర్ రూమ్లో వాడు చేస్తేఎంటి.. నేను చేయించేసుకుంటా..మీరూ వస్తున్నారా", అని కార్టుతీసుకుని చేత్తో పట్టుకుని రడీ అయిపోయి నడుచుకంటూ వెళ్ళిపోయాడు.. నల్లశీను.

"ఒరే..ఆగు.. ఆ ఆపరేషన్ కడుపు క్లీన్ చేయించుకోటానికి కాదురా.. బాబూ.., నీకెలా చెప్పేది..", అని వాడివెనకే పరిగెత్తుతూ.. అంతా దగ్గర్లోవున్న బడా కార్పొరేట్ హాస్పిటల్ కి చేరుకున్నారు.

అయ్యో రీల్ తెగిపోయింది.. (కధలో కాదు.. బయట..)

కాసేపు విరామం.. (విరామం అన్నప్పుడు ఏడ్స్ చూడటం అలవాటయ్యిపోతే.. కుడిపక్కకిందనున్న ఏడ్స్ పై క్లిక్ చేసుకోవచ్చు.. :-) )

మిగతాది రీల్ కి అతికించిన ఫెవీక్విక్ ఆరి.. బాగా సెట్టయ్యాకా.. :-)

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

బకాసురులు - 1

బురదలో పందిపిల్లలు ఒకదానిమీదొకటి పడి దొర్లినట్టుదొర్లుతూ.., పదిమంది కలిసి ఒకటే అగ్గిపెట్టంత హాస్టల్ గదిలోవుంటూ.., బాగా చదువుకుని కలెక్టర్లయ్యి తిరిగిరండిరా బాబూ.. అని వాళ్ళ బాబులు పంపించిన డబ్బులు.. తింటానికి.. తిరగటానికీ.. షకీలా సినిమాలు చూడటానికే సరిపోక, ఒక్క సిగరెట్టు కొని ఒకడు ఉఫ్ ఉఫ్ మని వూదుతుంటే.. ఆ వచ్చే పొగను సగం సగం షేర్ చేసుకుంటూ పీల్చుతూ. వైన్ షాపుకి ఎదురుగా.., నవరత్నా బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంటు మేడపైనున్నడిగ్రీ కాలేజిలో ఒక ఏడెనిమిదేళ్ళనుండీ.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు ఆ నలుగురు కుర్రాళ్ళు.

దూరదర్శన్ లో వార్తలు రావటానికి.. రెండు నిముషాలముందే వెనక్కు లెక్కపెడుతూ వేసే అంకెల్లాగా.. సెకన్లతో సహా వెనక్కు లెక్కపెడుతూ నాలుగు నిముషాలముందే వెంకటరమణ మెస్ దగ్గర.. దినం బోజనాల్లో మిగిలిపోయిన ఆకులు నాకడానికొచ్చిన కుక్కల్లాగా కాసుక్కుర్చున్నారు. "భోజనం తాయారు.." అని బోర్డు ఎప్పుడు పెడతారా.. (తాయారే... అచ్చుతప్పు కాదు.. అదా హోటల్లో వంటమనిషి పేరు.., బోర్డురాసినోడికి బాగా ఫేవరెట్టు.. అందుకే అలా అభిమానం చూపించుకున్నాడు..) వెళ్ళి దూకేసి ప్లేట్లతోపాటుమింగేద్దామా అని ఒకడి వెనకాలొకళ్ళు నిలబడి.. ఒకడి ప్యాంటు వెనుకజేబులో ఒకడు చేతులు పెట్టుకుని... చూస్తున్నారా కుర్రాళ్ళు. "ఒరే.. ఇంకా బోర్డుపెట్టలేదేంట్రా..., కొంపదీసి తాయారు ఈరోజు సెలవా",అన్నాడు బొండుభద్రంగాడు.


"ఆ సంగతి తరువాత గానీ.. వెనకజేబులోచెయ్యి పెట్టి పర్సుందని వెతుకుతున్నట్టున్నావు.., అసలు జేబేలేదక్కడ.. వున్నది ఈ-మెయిల్ ఇన్ బాక్స్ అన్నవిషయం.. నువ్వింకా కనిపెట్టలేకపోతున్నావు, అలాగే.. మోచేతిదాకా చెయ్యి కిందకు పెట్టి అక్కడ కాస్త గోకరా.., బాబ్బాబు దురదగా వుంది అన్నాడు నల్లశీనుగాడు, జేబులోచేయిపెట్టి వెతుకుతూ.. సి.బి.ఐ ఎంక్వైరీ చేస్తున్నట్టు మొహం పెట్టిన బొండు భద్రంగాడిని.

"ఒరే ఛీ ఎవడిపడితే వాడి ఇన్ బాక్సులో మెయిల్స్ చెక్ చేసేవాడిలాగా కనబడుతున్నానా?, ఛెస్.. ఎధవనా బతుకు, భోజనం అవగానే చెయ్యి డెట్టాల్ సబ్బుతో బాగా కడుక్కోవాలి.., గుప్తుల కాలంలో ఉతికి.. మళ్ళీ ఈ రోజే సర్ఫ్ లో నాన్చినాన్చి జాడించిన కుక్కలోడి షర్ట్ తో ప్రస్తుతానికి సరిపెట్టుకుంటా..", అని ఫ్యాంటుజేబులో చెయ్యితీసేసి ఎదురుగా నిలబడి.. తాయారు బోర్డుకోసమే కళ్ళార్పకుండా కళ్ళల్లో వందకేండిల్స్ బల్బువెలిగించుకుని చూస్తున్న కుక్కల సతీష్ గాడి షర్టుకు చేయితుడుచుకున్నాడు బొండు భద్రం. అలా.. ఒకడి సీక్రేటులు ఒకళ్ళు.. లంచం తీసుకుంటూ పట్టుబడిపోయిన ప్రభుత్వోదోగి కధనం.. మాదాంట్లోనే ఎక్ల్సూసివ్.. అని ఎర్రసర్కిల్ తో హైలేట్ చేసి.., వేసిందే వేసి.. చూపించే టీ.వీ చానల్ లాగా అందరికీ తెలిసిన విషయాలనే స్పెషల్ న్యూసులుగా మార్చి చెప్పేసుకుంటున్నారు.

"ఒరే!!.. ఆపండహే.. మీ ఎదవ గోలా... కడుపులో పందికొక్కులు.. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పేసి గొడవచేసేస్తుంటే... మీగోలేంటెహే..", అని చిరాకుపడుతూ.. బరాక్ ఒబామాలాగా జుట్టున్నా వారం క్రితమే గుండుచేయించుకున్నట్టుండే తలకాయను ఐదువేళ్ళతో బరాబరా గోక్కుంటా.. ఒక పావుకేజీ చుండ్రు రాల్చిన చుండ్రు రాము. అంతలోనే తాయారొచ్చి తయారు బోర్డుపెట్టేసింది.

ఫ్యాంట్లు జారిపోతున్నా పట్టించుకోకుండా.. పరుగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలు కాసేసుకున్నారు... తరువాత సర్వర్ పట్టుకొచ్చిన ఫ్యాంట్లను దులుపుకుంటూ ఒకరినొకరు చూడకుండా నలుగురూ నాలుగువైపులూ తిరిగి.. ఎవరూచూడటంలేదుకదా.. అని వేసుకుని కుర్చీల్లో కుర్చున్నారు. "ఒరే.. మన హోటల్ కి మరో కొత్తవోనర్ రా", అన్నాడు నల్లశీను. "అయితే కుమ్మేయొచ్చు ఈయాలకూడా", అన్నాడు కుక్కల సతీష్.. ఎప్పటిలాగే నాలుగు ఫుల్ మీల్స్ చెప్పి.. పది ఫుల్ మీల్స్ కి సరిపడా తినేసి.. అరగంటలోనే లోపలున్న తాయారుచేతే ఆరోజుకు బోర్డుతీయించేసారు.

వీళ్ళ నలుగురు దెబ్బకీ తట్టుకోలేక అదే మెస్సు.. సంవత్సరంలో అరడజను ఓనర్ల చేతులు మారింది. ఆ రోజు వీళ్ళ తిండి దెబ్బకు... ఆర్ధిక మాంద్యంలో గిలాగిలాకొట్టేసుకున్న క్రెడిట్ కార్డులమ్మేవాడిలాగా అయిపోయాడు కొత్తగా వచ్చిన మెస్ ఓనరు. రాత్రంతా బొండుభద్రంగాడు దేవతకు నైవేద్యం కోసం పెట్టే ముద్దంత ముద్దలు కలుపుకుని.. మురుక్కాల్వ తూమంతున్న నోట్లోకి తోసేసుకుంటూ.. తింటున్నట్టు.. కలల్లోకి వచ్చేసి నిద్రపట్టకుండా చేసేసాడు. "కాలుమీదకాలేసుకని కూర్చుని టీ.వీ చూస్తున్నవాళ్ళావిడకి.. గాజులేసుకుని.. టీ పట్టుకు వస్తే.., నచ్చలేదని ఆ వేడివేడి టీని.. ఆవిడ ఏంచేసిందో చిన్న బ్రేక్ తరువాత చూడండి", అని టీ.వీలో నూతన్ ప్రసాద్ వాయిస్ లో వస్తున్న ప్రోగ్రాములో తనని.. ఒక్కసారి ఊహించుకున్న మెస్ ఓనర్.. ఇకలాభంలేదని.. ఆ నలుగుర్నీ బయటకు తోలటానికి కొత్తకొత్త టెక్నిక్కులు ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఓ రోజు అన్నంలో మామూలు సున్నం కాకుండా.. నాటు సున్నం కలిపించేసాడు.., అసెంబ్లీలో ప్రతిపక్షంవాడు బండబూతులు తిడుతుంటే.. మైక్ వాయిస్ కట్ చేయించేసి తనకేమీ తెలియదన్నట్లుగా.. రాసుకొచ్చిన సోదిని చదివివినిపిస్తున్న అఖిలపక్షం మంత్రిలాగా.. ఏమీ ఎరగనట్టు భోజనం తినేసి.. తమలపాకూ.. వక్కా నోట్లోవేసుకుని.. నములుతూ.. నోరుతెరిచి చూపిస్తూ.. బయటకొచ్చాడు బొండుభద్రం.., ఎర్రగా పండిపోయున్న.. ఆ నోరును చూసి మూర్చరోగమొచ్చినట్లుగా గిలగిలా కొట్టేసుకున్నాడు మెస్ ఓనర్.

వేరే రోజు కూరల్లో బస్తాడు ఉప్పు, అరబస్తా తినే షోడా కలిపించేసాడు.. అన్ని కూరలూ ఒక పెద్దగిన్నెలో వేసేసుకుని.. గిన్నెనిండా నీళ్ళు కలిపేసుకుని.. ఆవురావురుమంటా తినేసారు. ఆ నలుగురూ.. (రాజేంద్రప్రసాద్ సినిమా కాదు)

ఇక నావల్లకాదని.., "ఈవిడవేరే ఆవిడని.. ప్రేక్షకులకు తెలిసిపోయినా పర్వాలేదు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు స్టోరీ మార్చేసైనా కేరెక్టర్ని మార్చేయ్యాలి..", అని టీ.వీ సీరియల్ వాళ్ళు గట్టినిర్ణయం తీసుకున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుని.. తరువాతరోజు సాంబారులో స్పెషల్ గా ఎండుమిర్చిబదులు బొద్దింకలు వేయించి తాలింపుపెట్టించాడు.. బొద్దింకలుమట్టుకే పక్కకు తీసేసి.. సాంబారు జుర్రేసిన కుర్రోళ్ళు.., "సాంబార్ సూపర్ అంకుల్..", రేపూ ఇలానే చేయించండి అని ఓనర్ దగ్గరకు లొట్టలేస్తా వచ్చాడు నల్లశీను. ఆ భయంకరమైన దృశ్యాలు చూసిన ఓనర్.., భయబ్రాంతులతో.. మెంతులు తిని.. వాంతులుచేసుకుని.. హాస్పిటల్లో జాయినయ్యి.. పిచ్చోడయిపోయి రోడ్డుమీద పడ్డాడు.

కాలగడిచింది.. కట్ చేస్తే... అది రాయలసీమలో ఒక ఏరియా... మళ్ళీ కట్ చేసి హెలీకాప్టర్లోంచి కెమేరా జూమ్ చేస్తే... పాములా వంకరలు తిరిగిన మట్టి రోడ్డు.. చిన్నచిన్న చీమలు ఎర్రమట్టినేలలో రన్నింగ్ రేస్ పెట్టుకుని.. దుమ్ములేపుకుంటా వస్తున్నట్టు హెలీకాప్టర్లోంచి కనిపిస్తున్న.. నాలుగు నల్ల ఇన్నోవాలు ఒక తెల్ల స్కార్పియోని ఫాలో అవుతున్నాయి. దానివెనకే.. మూడు తెల్ల టవేరాలు.. ఒక నల్ల సఫారీనీ వెంటాడుకుంటూ వస్తున్నాయి.., దానివెనకాల.. నాలుగు నల్ల మహీంద్రా గ్జయిలోలని.. ఒక తెల్ల హోండా సి.ఆర్.వి ని వెంటపడుతున్నాయి.

దానివెనకే.. నాలుగు ఎర్రలారీలు.. నాలుగు తెల్లలారీలు.. నాలుగు పచ్చలారీలనిండా కత్తులూ.. కటార్లూ.. పట్టుకుని, బఠాణీలు బొంబాయిశెనగలు తింటూవున్న జనాలనేసుకుని.. స్పీడు స్పీడుగా వచ్చేస్తున్నాయి. మధ్యమధ్యలో ధనేల్ ధనేల్ మని బాంబులు.. (లారీల్లో జనాలమధ్యకాదు.. బయట నిజం బాంబులు..) కెమేరా ఇంకా జూమ్ చేస్తే... నల్ల ఇన్నోవాలో కిటికీదగ్గర.. సగం కిందకు దించిన నల్లమిర్రర్ దగ్గర ఎవడో నల్లగావున్నాడు.. కెమేరా కాస్త బ్లర్ ఎడ్జస్ట్ చేసి చూపిస్తే.. వాడే మన నల్లశీనుగాడు.., కెమేరా ఇంకాస్త జూమ్ చేస్తే.. వాడిచేతిలో రాజమౌళిసినిమాలోలాగా.. సినిమాకో రకమైన షేపులో.. వెరైటిగావుండే కత్తిలాంటి.. కొడవలిలాంటి..సుత్తిలాంటి నల్లటి గొడ్డలి. ఇంకా జూమ్ చేస్తే.. నల్లమల అడవిలాగా వాడి చేతిమీదున్నవెంట్రుకలు.. మొత్తం తెరంతా చీకటితో నల్లగా అయిపోయింది... ఇంకా జూమ్ చేస్తే.. ఇంకా నల్లని నలుపు.. ఇంకా ఇంకా ఇంకా జూమ్ చేసిచూస్తే..?, చాలు చాలు.. ఇంకెక్కడికి చేస్తాం.. ఈ కెమేరాలోవున్న జూమింతే...

ఆగండి సార్.. ఆగండి.. ఆగండి.. ఆగగండి....గగం...డిడి. (ఎకో ఎఫెక్టు..)

మీరు మరీనండీ.. ఏదేదో ఊహీంచేసుకుంటున్నారు.. ఏదో చిన్న బడ్జెట్లో కధచెబుదామంటే.. మరీ. ఇంత భారీ క్లైమాక్సా..., కనీసం నాబ్లాగు కుడివైపుకిందనున్న ఏడ్ పైకూడా క్లిక్కుచేయరు మీరు.. అంత పెద్ద బడ్జెట్లో కధ ఎక్కడనుండి రాస్తాం చెప్పండి బాబూ... అందుకే చిన్న బడ్జెట్లోనే కొనసాగిద్దాం.. :-)

కాలం గడిచింది.. ఆ నలుగురు కుర్రాళ్ళకి.. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి.

గిర్ర్ ర్ ర్ మని మ్రోగింది గంట.. (కధలో కాదు బయట)

ఇంటర్వెల్..

బయటకు వెళ్ళి అన్ లిమిటెడ్ గా.. సమోసాలు.. జంతికలూ.. ఏమన్నా దొరుకుతాయోమో తినేసిరండి..

మిగతా కధ తరువాత చెప్పుకుందాం.. :-)

4, సెప్టెంబర్ 2010, శనివారం

గోపాల్రాజు గేదెల బేరం...
సాయంత్రం ఏల.. ఎర్రసెందనం రంగులో నిగనిగలాడిపోతున్న సూరీడు.. ఈ రోజుకు ఇక సెలవన్నట్టు.. టాటా సెబుతా దూరంగా వున్న కొబ్బరిసెట్ల ముసుగులోకి దూరిపోతున్నాడు.. పక్కూళ్ళో వున్న స్పిన్నింగు మిల్లులో సాయత్రం షిప్టులు మారటం కోసం ఏసే సైరెన్ కూతకూడా ఇనబడిపోయింది.., పాలేరు పాపారావు.. మైనంపాటోల్ల పాకలకాన్నిండి తీసిన పాలు క్యాను సైకిలుకట్టుకుని ఎల్తున్నాడు.. 

ఈటిల్లో ఏదన్నా ఒక్కసెనం అటుఇటు అవుతాయేమోగానీ.. సూరయ్యతాత బ్యాచ్ మాత్రం రాయిసెట్టుకిందున్న నాపరాయిబల్లపై టంచనుగా టైముకొచ్చి కూచోటం మాత్రం ఒక్క సెనం కూడా లేటవ్వదు. సూరయ్యతాత... కొత్తోళ్ళ అప్పారావు... మిలట్రీ రంగారావుగారు ముగ్గురూ తలపండిపోయిన పెద్దోళ్ళు... సాయంత్రం అవగానే రాయిసెట్టుకింద పిచ్చాపాటీ మాటలకోసం భోజనాలు కానిచ్చేసి... కొబ్బరీనుపుల్లతో పళ్ళుకుట్టుకుంటా వచ్చేత్తుంటారు.. దారేబోయేవోళ్ళని ప్రశ్నలడిగి బుర్రల్దినేత్తుంటారు. 

ఎవడూ దొరక్కపోతే జాడీ ఆటా.. పులీమేకా ఆడుకుంటా కాలచ్చేపం చేసేత్తుంటారు. ఈళ్ళ నోట్లో నానని ఇషయం అంటూ ఏదీ వుండదు.. పెపంచలోవున్న పెతీదీ ఈళ్ళమాటల్లో టాపిక్కే. సీకటి పడ్డంతో ఎవడో కుర్రోడ్ని కేకేసి.. ఈదిలైట్లేయించేడు సూరయ్యతాత. ఆ ఈది లైట్లకాంతిలో నాపరాయిపై... రుబ్బురోలుకు గంట్లుకొట్టేవోడితో... స్టాండర్డుగా గీయించిన జాడి ఆట గళ్ళలో రాళ్ళు సర్దుతావున్నాడు కొత్తోళ్ళ అప్పారావు. 

"ఒరే.. సూరిగా..., గోపాల్రాజు కనిపించేడేంట్రా ఈ రోజా.. రేపాడు ఏల్పూరు సంతలో గేదిని కొంటాడంటా.. నిన్నో టముకేత్తా అందరికీ సెప్పేత్తున్నాడ్రా", అని మిలట్రీ రంగారావుగారు సూరయ్యతాత్తో అన్నాడు. "ఆడేం మేపగలడండే... అయితేగియితే.. పాలెర్నెట్టి మేపిత్తాడేమోనండే.. ", అన్నాడు సూరయ్యతాత. "అదేమాట ఎవడోఅంటే.. పాలేర్నెట్టి మేపింతేనే గేదిని కొనాలా.. అని అరువు దెబ్బలాటెట్టేత్తున్నాడురోయ్.. అది సూసేవుగాదు..., ఆడే మేపుతాడంటా..., అదే కదా మరి అసలు ఇషయం.., బడాయి సెప్పినంత సులువనుకుంటున్నాడు... ఈ గెది దెబ్బతో ఆడి బడాయంతా వదిలిపోవాల్రా...", అని మిలట్రీ రంగారావు కాళ్ళు నాపరాయిబల్లపై సర్దుకుని బాసమటమేత్తా అన్నాడు. 

"హ హ్హ హ్హా.. నిజమేనండే.." అని అంతా పగలబడి నవ్వుకున్నారు.

ఈళ్ళ పిచ్చాపాటీమాటల్లో ఈరోజు మొదట గోపాల్రాజు టాపిక్కు వచ్చిందంటేనే.. గోపాల్రాజు సిన్నా సితకా మనిషిగాదని అర్దమవుతాది.. గోపాల్రాజుగురించి సెప్పుకుంటూ పోతే చానా వుంది.. అందరూ అతను సెప్పే బడాయి కబుర్లు ఇనీ ఇనీ అతనికి.. బడాయి గోపాల్రాజని పేరేట్టేరు. , గోపాల్రాజు ఆవూళ్ళో నాలుగెకరాలున్న ఓ చిన్న రైతు. అందర్లాగాకండా కాస్త ఏసకట్టం మనిషి.. ఏదైనా సరే నేనే సెయ్యగలను.. నేను సేసినట్టు ఎవడూ సెయ్యలేడని సెప్పుకుంటా.. నలుగుర్లో తనకో డిఫరెంట్ స్టైలుండాలని తాపత్రయపడేమడిషి . ఆ తాపత్రయమే తప్ప.. ఎప్పుడూ ఎక్కడోసోట డక్కాముక్కీలు తింటా అందరిముందు నవ్వులపాలవుతుంటాడు గోపాల్రాజు. 

ఓ సిన్న ఉదాహరణ సెబితే గోపాల్రాజు గురించి అర్ధమయిపోద్ది.., ఓ ఏడు..  అందరూ వరి పంటల్లో ఏ ఇత్తనం ఏద్దామాని ఆలోచిత్తున్న సమయంలో... గోపాల్రాజు తన నాలుగెకరాల్లోనూ.. బోబ్బాసి తోటలేసేడు.., అది సూసి వూళ్ళో నవ్వనోడంటేలేడు.. పెతీ ఒక్కడూ ఇంటికెళ్ళిమరీ ఎటకారంచేసి ఏడిపించేరు గోపాల్రాజుని.. కానీ ఆ మనిషెక్కడా తొనక్క బెనక్క కూర్సున్నాడు. 

ఆ మొండి ధ్యైరమేంటో వూళ్ళో ఎవడికీ అర్ధంకాలేదు. బొబ్బాసి కాయలు పళ్ళెటూళ్ళో ఛీ అంటారుగానీ.. సిటీల్లో తులం పదారులెక్క కొనుక్కుపోతుంటారు..., ఆటికి హైద్రాబాదు.. బెంగుళూరు..లాంటి సిటీల్లో మాంచి డిమాండుందని తెల్సుకున్నాడు గోపాల్రాజు. అందుకే ఆ ఏడు పంటేసి ఎలాగైనా తనుసేసందే కరెస్టని వూరి జనాలకు చూపిద్దామనుకున్నాడు. అతననుకున్నట్టుగానే ఆ ఏడు కాయలిరక్కాసేసినియ్యి..., అంతే మనోడు.. గాళ్ళోకితేలిపోయి.. బాడాయిలు సెప్పటంమొదలెట్టేడు.., ఏడిపించినోళ్ళంతా అతని కనబడకుండా పారిపోయేరు.

అలా బడాయిలకుపోయి చివరాఖర్లో పప్పులో కాలేసేసేడు.., పంటదాకా వచ్చి కొనుక్కెళతానన్నోలకివ్వకుండా.. తానే సిటీకి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అని పెద్ద ప్లానేసేసేడు.. తానే దగ్గరుండి.. అంతా లోడుసేయించుకుని.. హైద్రాబాదు.. పెయానం కట్టేడు.., అక్కడ అనుకున్న రేటులేదని.. ఒక వారంరోజులు నాన్చి నాన్చి.. అక్కడే గొడాముల్లో లాటు పెట్టించి.. కొన్నాళ్ళు రేటుకోసం చూసేడు..., అలా నాలుగురోజులుండేసరికి.. కాయలన్నీ ముగ్గిపోటంమొదలెట్టేయి.. ముగ్గినియ్యన్నీ సగంరేటుకే అమ్మేయాల్సొచ్చింది. అక్కడుండానికి ఖర్చులు..., గోడాములకి అద్దెలు కట్టగా.., ముందు వూళ్ళో వచ్చిన బేరానితో పోల్చుకుంటే.. సగానికి సగం లాసయిపోయేడు. 
దీన్ని బట్టే అర్దమవుద్ది గోపాల్రాజు ఎంత డిఫరెంటో.

డక్కా ముక్కీలు తినే గోపాల్రాజుకు నాలెడ్జీ లేదని తీసిపారేయక్కర్లేదు.. పెతిరోజూ పేపరుతిరగేసి అక్షరం పొల్లుపోకుండా.. హెడ్డింగు కాన్నించి.. ఆ రోజు తేదీ.. అది ఎక్కడ ప్రింటయ్యింది తో మొదలెట్టి.. అన్నీ సదివేత్తుంటాడు.. దాంతో రాజకీయ వార్తలు.. షేర్ మార్కెట్లు.. అంతర్జాతీయ వార్తలు కాన్నించి దేని గురించి  అడిగినా.. తనకు పూర్తిగా తెలీపోయినా.. సెప్పేత్తుంటాడు.

అలాంటి గోపాల్రాజుకి గెదిని కొని మేపాలని కోరికపుట్టింది.
ఓ మంగళవారం రోజు.. గోపాల్రాజు తన డబడబలాడే చేతక్ బండేసుకుని గేదెలసంతకు బయల్దేరేడు.., ఎక్కడకెళ్ళినాకూడా తోకలాగుండే సుబ్బరాజుని ఎంటేసుకెళ్ళటానికి..   పెద్దకాలవ పక్కన చింతచెట్లముసుగులోవున్న సుబ్బరాజుంటికెళ్ళి కేకేసేడు.. "అప్పుడే బోంచేసి ఆవకాయబద్ద బుగ్గనెట్టుకుని సప్పలిస్తా వచ్చిన సుబ్బరాజు.. "ఏంటి బావా ఏల్పూరా..నువ్వింకా రాలేదేంటాని రడీఅయ్యి సూత్తన్నాను.., సంతలో అయితే మనం మాట్లడలేం బావా.. తణుకులో  పాతొంతెన దగ్గరున్న దూళ్ళబేరగాడి దగ్గరకెళ్తే పనైపోతాది మరి.." అని.. ఎప్పుడూ సలహా సెప్పని సుబ్బరాజు గోపాల్రాజుకి.. సలహా సెప్పేడు.

"ఛెస్.. దూళ్ళబేరగాడికేంతెలుసురా... చేటపెయ్యిని చూపిత్తే... మాంచి సూడిమీదుంది.. పూటకి ఐదులీటర్లుపాలిత్తాది.. కొనెయ్యండంటాడు.., ఆడి కమీషన్ కోసం నోటికేదొత్తే అది సెప్పేత్తాడు.. ఆడ్నినమ్ముకుని.. గొడ్డుపోయిందాన్ని కొనుక్కురావాలా?, మనకామాత్రం తెల్వదేంట్రా..., తెలవకపోతే గెదినెందుకురా మేపటం..", అని గోపాల్రాజు సుబ్బరాజుమీద కస్సుమన్నాడు. "సరేలేబావా.. నువ్వేదంటే అదే.. ఎళ్దాం పదా..", అని సుబ్బరాజు మారుమాట్లాడకుండా గోపాల్రాజు చేతక్ బండెనకాలెక్కేసేడు.

"ఈ రోజెలాగైనా గేద్తోనే తిరిగిరావాల్రా.. అందుకే ఓ ఇరవైఏలు లెక్కట్టుకొత్తున్నాను.. నిన్నే ఎంకడు దగ్గర సీటు పాడేన్రా..", అంటా.. తణుకుపొలాల్నుండి ఏల్పూరుకెళ్ళే అడ్డరూట్లోకి చేతక్ బండిని దూకించేడు గోపాల్రాజు.

సుబ్బరాజు ఊరి బాగోతాలన్నీ పూసగుచ్చినట్టు ఒక్కొక్కటీ సెప్పటం మొదలెట్టేడు... రాత్రి రాయిసెట్టుకింద సూరయ్యతాత బ్యాచ్ ఏమనుకున్నదీ.. ఎలా ఎగతాళిసేసి నవ్వుకున్నదీ.. అంతా శివరాత్రి రోజు జాగారం సెయ్యటానికి ఈసీపీ అద్దెకట్టుకొచ్చి ఆక్కుండా క్యాసెట్టుల మార్సి మార్సి.., తెల్లారేదాకా నాలుగుసినిమాలేసినట్టు... ఎడ్వైడింగులతో సహా సెప్పేసేడు.., అదంతా ఇన్న గోపాల్రాజుకి మంటెత్తిపోయింది.. "మాంచి గేదెను కొనుక్కేళ్ళి ఆళ్ళ నోళ్ళుమూయిత్తాను సూడరా..", అని సుబ్బరాజుతోటి అంటా బండి స్పీడు పెంచేసేడు.. అలా మాటల్లో పడి.. ఏల్పూరు నడీద్దాకా వచ్చేసేరు.

"బావా సికెన్ పకోడి ఏత్తున్నట్టున్నాడు బావా... ఎళ్ళి ఓ దెబ్బేసొద్దామేంటీ", అని ఎనక్కూర్చున్నసుబ్బరాజు.. ముందుకు జరిగి గోపాల్రాజు సెవిలో వూదేడు. 

"ఒరే!, నేనొచ్చినప్పుడే కదరా.. పీకల్దాకా లాగించినట్టున్నావ్.., అవకాయబద్ద సప్పలిత్తా కనిపించేవూ.. అప్పుడే ఏం తింటావ్ రా నాయనా... నీది కడుపా మండపాక మడుగా...", అని సుబ్బరాజుని.. ఎటకారం చేసేడు గోపాల్రాజు. 

"లేదుబావా.. సికెన్ పకోడి వాసన గుమగుమలాడిపోతాంది..., మాంచి టెమ్టింగా వుంటేనూ.., సరేలే.. వత్తా వత్తా ఎల్దాంలే.. నువ్వు మకాంకాడికి పోనియ్యి..", అని మాటతిరగేసేడు సుబ్బరాజు.

గేదెల మకాం కాడికి సేరుకున్నాకా... బండి నిద్రగన్నేరు సెట్టు నీడలో స్టాండేసి.. పాకల్లో కట్టేసిన గేదెల్ని సూడ్డానికి బయల్దేరేరిద్దరూ... 

ఒంటినిండా అముదం రాసేయటంవొళ్ళ నల్లగా.. నిగనిగలాడిపోతావున్నాయి మాంచి రింగులు తిరిగిన సూడి గేదె పెయ్యిలు... ఒక్కొక్కదాన్ని పరీక్షగా సూత్తా.. చేత్తో ఒక్కసారి ఒంటిమీద రాత్తా అప్పుడప్పుడూ ఆ సేయి గోపాల్రాజుకు సూపిత్తున్నాడు సుబ్బరాజు.  గేది సుట్టూ ఓ సారి రౌండేసి... తోకెత్తి సూసి.., కాలి గిట్టమీద మొటికేసి.. తలమీదున్న కొమ్ముల్ని పరీక్షగా సూసి..  అబ్బే అంటా పెదవిరుత్తుం.. మళ్ళా ఏరే గేద్దగ్గిరికెళ్ళటం.. ఇలా మొత్తం ఆ పాకలోవున్న గేదెలన్నిటినీ పరీక్షించేసేరిద్దరూ. 

ఆ పక్క పాకదగ్గర ఈగళ్ళా ముసిరేత్తున్న జనాల్ని చూసి.. "అక్కడేదో వుందిరా.. పదా..", అంటా.. జనాల్ని తోసుకుంటా ఎగిరెగిరి సూసేరిద్దరూ. నల్లగా నిగనిగలాడపోతా సిన్న సైజు ఎనుగంతున్న గేదిని సూసి ఆశ్చర్యపోయేరు.. "భలేగుందిబావా.. ఆ పొదుగుసూడు.. కనీసం పూటకి పదిలీటర్లు తక్కువివ్వదు.., ముర్రాజాతి గేది బావా..", అన్నాడు గోపాల్రాజుతో నోరొదిలేసి గేదొంక సూత్తావున్న సుబ్బరాజు. 

ఇంతలో గోపాల్రాజు ఎనకే నిలబడి పంచె కట్టుకున్న పెద్దాయన.. "పదిహేడేల ఒక్కొందా.." అన్నాడు. "రామారావుగారి పాట.. పదిహేడేల ఒక్కొందా.. ఒక్కొందా.." అని నాలుగుసార్లు సెప్పిందే సెప్పేడు.. ఆ గేదిపక్కనే చిట్టుతాడు పట్టుకుని నిక్కరేసుకున్న పొట్టోడొకడు. అప్పుడర్ధమయ్యింది.. గేదిని ఏలంపాటేత్తున్నారని. 

గోపాల్రాజు.. గేదెను చూడగానే.. ఎంటనే కొనెయ్యాలనిపించింది.. ఇంకేమాలోచించకుండా.. "పందొమ్మిదేలు.." అన్నాడు. అంతా తలల్దిప్పేసి గేదెని చూడ్డం మానేసి.. గోపాల్రాజొంక చూడ్డమొదలెట్టేరు. "మీ పేరేంటండే..", అన్నాడు పాటేసే పొట్టోడు.. "గోపాల్రాజు..", అని సెప్పేడు సుబ్బరాజు. "గోపాల్రాజుగారి పాట.. పందొమ్మిదేలు.. పందొమ్మిదేలు..", అని మళ్ళా నాలుగుసార్లరిచేడు పొట్టోడు. "పందొమ్మిదేల ఐదొందలు...", అన్నాడో మరో తలపాగా సుట్టుకున్న పెద్దాయన.. అంతే జనాల్లో చాలా మంది డ్రాపయిపోయి.. గొనుక్కుంటా.. పాకలోంచి బయటకెళ్ళిపోయేరు. 

ఇరవ్యయ్యేలు అనేద్దామని నోటిదాకా వచ్చిన గోపాల్రాజుని భుజంమీదం సేయేసి ఆపేసేడు పక్కనే నిలబడున్న మీసాలాయన. "ఏండే.. మీకు గేదె కావాలంటే ఇంకా మంచిదుందండే.., నే సూపిత్తాను నచ్చితే కొనుక్కోండే.. దీనికనవసరంగా పెట్టకండే ఇది పద్దేమ్దేలకు మించి సేయదు.. మీరు ఎక్కువెట్టేసేరని మీమీదెక్కువెట్టేసేడు ఆ తలపాగాయన... మీరంత రేటుక్కొంటే లాసయిపోతారు.. తరువాత మీఇష్టం మరి", అని నవ్వుతా గోపాల్రాజొంక సూత్తా సెప్పేడు ఆ మీసాలాయన.. .

గోపాల్రాజు సుబ్బరాజు ఒకరిమొకాలొకరు సూసుకుంటా ఆలోచిత్తావున్నారు.. అలా ఆలోచిత్తావుండగానే.. గేది పదొమ్మిదేల ఐదొందలకి తలపాగా సుట్టుకున్న పెద్దాయన పేర పాటకొట్టేసేరు.

"సరేండే.. మరి ఆ గేదె సూపించండే మాకర్జంటుగా కావాలే..", అని అడిగేడు మీసాలాయన్ని సుబ్బరాజు.  "నా ఎనకే పదండే..." అంటా, పాకలవతలున్న కొబ్బరాకు దడిమద్దెనుండి బయటకుతీసుకెళ్ళి ఒక కుర్రోడి కి పరిచయంచేసేడు మీసాలాయన. 

" పక్కూర్నుండి తోలుకొత్తున్నారండే.. మూడింటికొత్తాదండే గేదె మరి.. అప్పుడుదాకా ఉండగలరండే మరీ..", అన్నాడా కుర్రోడు. 
గోపాల్రాజు సుబ్బరాజొంక ఓసారి చూసి.. "సరే మళ్ళొత్తాం నువ్విక్కడే వుంటావు కదా...", అనడిగి.. చేతక్ బండిదగ్గరకొచ్చి ఆలొచన్లో పడ్డారిద్దరూ.

"బావా.. దీనికన్నా మంచిదంటన్నాడు అదెలాగుంటాదో సూడుమరి.. మనూరేంటి.. మన పక్కూరోళ్ళుకూడా నోళ్ళొదిలేత్తారేమో.. ఇక్కడే ఏదన్నా తలెంటుకులతాడుకొనుక్కుపోదాం బావో.. లేకపోతే దిష్టికొట్టేత్తారంతా..", అన్నాడు పల్లికిలిత్తా సుబ్బరాజు. 

"మందు గేదిని రానియ్యరా.. అప్పుడే నువ్వు తాళ్ళుదాకా ఎల్లిపోతున్నావ్.., పదా.. నీకా సికెన్ పకోడి తినిపిత్తా", అని సుబ్బరాజుని.. బండిమీద నడీదేపు లాక్కుపోయాడు గోపాల్రాజు. 

సికెన్ పకోడి దుకాణం పక్కనే వైన్ షాపు కనబడేసరికి గోపాల్రాజుకు మనసులాగేసింది.. "ఒరే.. పదరా.. నీ సికెన్ తో పాటు ఇదుంటే ఇంకా బాగుంటాది.. పదో పెగ్గేసొద్దాం.. ఇంకా చానా టైముందిలే", అని సుబ్బరాజుని లోపలికి తీసుకుపోయేడు.

మూడింటిదాకా టైమ్ పాస్ చేసేసి.. పీకల్దాకా తాగి.. తినేసి వైన్ షాప్ నుండి బయటపడ్డారిద్దరూ.

పాకలకాడున్న కుర్రోడిని కలిసి ఇవరం అడిగేరు. "దార్లో వత్తా వత్తా నీళ్ళకని చెరువులో దింపేడంటండే గేదినే.. ఆ చెరువులోనే నిద్రోతుందంటండే.. ఇక్కడ దగ్గర్లోనేనండే ఓ కిలోమీటరుంటాదండే.. ఒత్తారేంటి ఎల్దాం", అన్నాడు కుర్రోడు. 

"సరే పదమ్మా ఎల్ధాం.." అన్నాడు గోపాల్రాజు తూలిపోతా బండితీత్తా
కుర్రోడు సైకిలు తీసుకుని తొక్కడం మొదలెట్టేడు గోపాల్రాజు చేతక్ పై కుర్రోడెనకాలే ఫాలో అయిపోయేడు.

"గేది నిద్రరోవటం ఏంటి బావా.., కొంపదీసి రాత్రి సెంకడ్ షో సినిమాగ్గానీ ఎళ్ళిందంటావా..?", అన్నాడు సుబ్బరాజు గోపాల్రాజు సెవిదగ్గరగా వచ్చి సైకిలు తొక్కుతున్న కుర్రోడికి ఇనపడకుండా.

"ఒరే.. నీకు బాగా మందెక్కువైపోయిందిరా..., సెకండ్ షోకెల్తేనే అంతలా  నిద్దరట్టేత్తాదేంట్రా.. ఏ మిడ్ నైట్ షో వో అయ్యింటాది రా..", అన్నాడు గోపాల్రాజు. 

అలా కొంతదూరం ఎళ్ళే సరికి ముందెళ్ళే కుర్రోడు మాయమైపోయేడు.. "ఒరే.. సుబ్బా.. మనముందు కుర్రోడేడ్రా..", అన్నాడు గోపాల్రాజు.

"అదే సూత్తున్నాను బావా.., ఇప్పుడుదాకా ముందేవున్నాడు.. సైకిలు కూడా కనబడటంలేదు.., ఏమైపోయేడంటావ్", అన్నాడు సుబ్బరాజు.

"సరేరా ఇక్కడాగుదాం.. ఆడే వత్తాడు..", అని నాలుగురోడ్ల మద్దెలో గుండ్రంగా కట్టిన సిమ్మెంటు దిమ్మ.. దానిపైన ఇనప గ్రిల్లు వున్నచోట కాళ్ళానుకుని బండాపేడు గోపాల్రాజు.
ఓ అయిదునిమిషాలాగాకా ఎనకనుండి కుర్రోడొచ్చి "ఏంటండే.. ఈ సర్కిలెంబడే మళ్ళా ఎనక్కి తిప్పేసేరు.. మీరింకా నా ఎనకాలే వత్తున్నారనుకుని ఎల్లిపోతున్నానండే, పదండే ఇటెల్లాలి మనం", అని బండి ఎనక్కి తిప్పించి సైకిలక్కేడు కుర్రోడు.

ఎనకాలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు సుబ్బరాజు.. "ఏరా.. ఏంట్రానీలోనువ్వే నవ్వుకుంటున్నావ్", అన్నాడు గోపాల్రాజు.
"కుర్రోడు మందేసేసినట్టున్నాడు.. ఎటు తీసుకెల్తున్నాడో ఆడికే తెల్టంలేదు బావా", అని మళ్ళీ పుసుక్కున నవ్వేడు సుబ్బరాజు.

చెరువుదగ్గరకు చేరుకుని.. నీళ్ళల్లో తేలతావున్న గేదిని చూసి "బావా.. అదిరిపోయిందిది.. పొద్దున్న చూసిన దానికి బాబులాగుంది బావా..", అని బండాపకుండానే కిందకు దూకేసి బ్యాలన్స్ చేసుకుంటా నిలబడతా అన్నాడు సుబ్బరాజు.

బండిదిగిన గోపాల్రాజు చెరువుగట్టునున్న చెట్టుకింద కూర్చున్న ముగ్గురు.. గేది తాళూకోళ్ళతో బేరం మొదలెట్టేడు. ఏవూరు.. ఏంటి.., గేదెన్నాల్లు సూడిది.. లాంటి ఇవరాలన్నీ అడిగి.. ఓ అరగంట బుర్రతినేసి.. "ఇంతకీ ఎంతకిద్దామనుకుంటున్నారో..", అని అసలు ఇషయానికొచ్చేడు.

ముప్పై ఏలుకాన్నుండి మొదలెట్టి ఇరవై ఏడుదాకా నరుక్కొచ్చేడు బేరం.., ఒక్క ఎయ్యిరూపాయలు తగ్గటానికి అవతలోల్లు ససేమిరా అంటున్నారు.. అదిగాదు ఇదిగాదని ఏదో ఓ పెద్ద స్టోరి మొదలెట్టి సెప్పేత్తా.. మరందుకే తగ్గండే అంటా.. ఆళ్ళను మాట్లాడనివ్వటంలేదు గోపాల్రాజు. బుర్రకధలో తందానా అంటే తానే తందనానా.. అన్నట్టు.. మధ్యమధ్యలో ఎంటరవుతా ఉప్పందిత్తన్నాడు సుబ్బరాజు. 

ఆలా ఎంత బేరమాడినా ఇరవైఏడువేలకి ఒక్క పావలా కూడా తగ్గేదిలేదని చెప్పేసేరు గేదిగలోళ్ళు. "అబ్బే అంతైతే ఇవ్వలేమండే.. మీరు బాగా ఎక్కువసెప్పేత్తున్నారో.., ఆయనెవరో సెప్పటంతో ఇంతదూరమొచ్చి.. పొద్దున్న సంతలో మాంచి బంగారంలాంటి గేదినొదిలేసొచ్చాం.., మీరేమో అసలు తగ్గటంలేదో..", అని గోపాల్రాజు పదపోదాం అన్నట్టు సుబ్బరాజుకు సైగచేసేడు.

"సరేలేండి ఆఖరుమాట ఎంతిత్తారు చెప్పండే", అన్నాడు గేదిగలోళ్ళలో ఓ పెద్దాయన. "నేను ఇరవై ఐదివ్వగలనండే..", అంతకుమించి ఒక్కరూపాయి మీరి ఎక్కువసెప్పినా.. గేది నాకొద్దండే", అని కరాకండిగా సెప్పేసేడు గోపాల్రాజు.

"సరేలేండి లెక్కిచ్చేసి తీసేసుకోండే", అన్నాడు పెద్దాయన.. గోపాల్రాజు సుబ్బరాజుల మొహాలు ఆనందంతో ఎలిగిపోయాయి.

"ఓ ఐదేలు లెక్క తగ్గిందండే మరి.. రేపట్టుకొచ్చి ఇచ్చేత్తాను మీకు, కావాలంటే ఈ బ్రాస్లెట్టు పెట్టుకోండి మీ దగ్గర", అని.. చేతికున్న బ్రాస్లెట్టు తియ్యబోయేడు గోపాల్రాజు.
అబ్బబ్బే.. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలాగండే.. పర్లేదు పర్లేదు మీ ఎడ్రస్ అదీ సెప్పండే చాలు.. మీరు రేపట్టకొచ్చి ఇచ్చేయండి పర్లేదు", అని ఎడ్రస్ తీసుకుని ఇరవ్వయేలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పెద్దాయన.

"ఇదిగోనండే తాడు.. మువ్వలు.. పైకెక్కేకా గేదిక్కట్టండే.., ఓ అరగంటాగాకా అదే ఎక్కేత్తాదండే గట్టో.. మీరేం కంగారుపడకండే.., రోజూ ఇలా ఓ రొండుగంటలు నిద్రోటం అలవాటండే దానికే, అరగంట తర్వాత ఎక్కాపోతే కాత్త అదిలించండి చాలో", అని చెప్పి ఎల్లిపోయేరు గేదిగలోల్లు.

"అయితే అయిందిగానీ బావా.. మాంచి గేదిని పట్టేసేం.. మనూరోల్లకి తస్తాదియ్యా ఒక్కొక్కడు నోరుపడిపోద్ది.. రేపొక్కడు మాట్టాడడు చూడు.. గేదిని చూసి", అని గోపాల్రాజుని ఉబ్బేసేసేడు సుబ్బరాజు. అలా మాట్లాడుకుంటా గంట గడిచినా గేది కదులూమెదులూ లేదు.. "బావా అదిలించనా ఎళ్ళి", అన్నాడు సుబ్బరాజు.. "అదేవొత్తాదుండ్రా.. పాపం నిద్రోతుంది గదా", అని ఇంకో అరగంట గడిపేడు గోపాల్రాజు.. అయినా గేది కదులూమెదులూ లేకండా అలాగే వుంది. "ఈ సారి తలటుతిప్పేసిందిగానీ ఇంకా పైకెక్కలేదేంటి బావా", అన్నాడు సుబ్బరాజు.

ఎంతచూసినా గట్టెక్కకపోయేసరికి.. "పద బావా అదిలిద్దాం..", అని ప్యాంటు మడతెట్టి చెరువునీట్లో దిగేడు సుబ్బరాజు.. ఎనకే గోపాల్రాజు కూడా నీట్లోకి దిగేడు.. "హయ్ హయ్..", అని గేది పొట్టమీద గుద్దేడు సుబ్బరాజు. "ఒరే ఎధవా... సూడిదిరా.. పొట్టమీదకొట్టకో.. ఎనక్కొట్టు..", అని, ఎనక చేత్తో చిన్న చిన్న దెబ్బలేసేడు గోపాల్రాజు.

"బావా ఎంతకొట్టినా కదలటంలేదు.., పొట్టకిందచేయేసి ఓ పట్టట్టు.. ముందుకు గెంటుదాం.. నీట్లోనే కదా కదిలిపోద్ది.. అప్పుడు మెలుకొవత్తాదేమో.., దీంది మరీ మొద్దునిద్రలాగుందేంటి బావా..", అని ఇద్దరూ చెరోవేపు పొట్టకింద చేయేసి పట్టట్టేరు.

గోపాల్రాజు పట్టిన పెద్ద పట్టుకి.. గేది సుబ్బరాజేపుతిరగబడిపోయే తలనీట్లోకి ఎల్లిపోయి.. నాలుక్కాళ్ళు పైకొచ్చేసినియ్యి.

"అయ్యబాబోయ్ ఇది సచ్చిన గేది బావో..", అని పెద్దకేకేసేడు సుబ్బరాజు. ఆ కెక్కి ఇద్దరికీ మందుదిగిపోయి జరిగిందంతా అప్పుడర్ధమయ్యింది.

ఇదే వార్త ఈళ్ళకన్నా ముందర వూరెళ్ళిపోయి... రాయిసెట్టుకింద మీటింగెట్టిన సూరయ్యతాత బ్యాచ్ నోట్లో ఆడేసింది.

Related Posts Plugin for WordPress, Blogger...