27, అక్టోబర్ 2019, ఆదివారం

మారోజుల్లో దీపావళి

ఒకప్పుడు దీపావళి అంటే దసరా సెలవుల నుండీ మొదలయ్యేది హడావుడి.

బొగ్గుపొడి, సూరేకారం, గంధకం, ఐదు రెండు ఒకటి పాళ్లలో కొబ్బరి చిప్పలతో చేసిన తక్కెడతో కొలిచి, అంతా కలిపి మందు తయారు చేసేవాళ్లు.

పేక కట్టలో ముక్కల్ని కర్రకు చుట్టి, ట్వైన్ దారంతో లాగి తారాజువ్వల గొట్టాలు చేసి, దానికి జనపనారని, ఉడకబెట్టిన మైదాపిండితో అంటించి చుట్టి ఆరబెట్టి, అవి బాగా ఎండలో ఆరాకా.. ఆ మందు ఆ గొట్టాల్లో కూరేవాళ్ళు. ఎంతగట్టిగా అంటే పైన సుత్తిపెట్టి కొట్టి మరీ కూరితే అదొక రాయిముక్కలాగా ఉండేది. 

దానికి కొబ్బరీనుపుల్ల దారంతో కట్టి, చేతివేలు మీద జువ్వ పెట్టి బ్యాలన్స్ చేసి చూసి, ఒకపక్కకు వొంగిపోతే దాని పుల్ల కాస్త విరిచి బాలన్స్ చేస్తే, తారాజువ్వ రెడీ అయ్యేది.
అవి యాభైకాడికి కట్టకట్టి, కాగితంలో చుట్టి ఒకచోట దాచేవాళ్ళం.. 

ఆ రోజు పని పూర్తయ్యాక, ఒక పది పదిహేను టెస్టింగ్ కోసం జువ్వలు వెలిగించేవారు..

మొండి జువ్వ(పుల్ల కట్టకుండా) వదిలితే, జనాలందరిని ఒక నాలుగు నిముషాల పాటు జుంబా డ్యాన్సు ఆడించేసేది.. 
నెలబారున జువ్వలు వదిలి కాసేపు జువ్వలు పరుగుపందెం జరిగేది.. 

కొన్ని పైకంటా పోయి శభాష్ అనిపించుకుంటే.. కొన్ని పక్కనున్న తాటాకింటిమీద పడి భగ్గుమనేవి, మళ్ళీ నూతులో నీళ్లు తోడి గబగబా మంటలు ఆర్పే పని తగిలేది.

కొన్ని చేతుల్లో చీదేసి కాలిపోతే.. కొన్ని లుంగీల్లో దూరి తొడలు కాల్చేసేవి. కాలినోడిని ఓదార్చి, ఆకుపసరేసి కాసేపుకి మంట తగ్గి మంద అంతా ఇళ్లకుపోయేవారు. ఇది తారాజువ్వ గొడవ!

వెదురుపుల్లని పెన్సిల్ చెక్కినట్టు చెక్కి, కాగితం ముక్కల్ని చిన్నచిన్న స్క్వేర్ లాగా కత్తిరించి, ఆ పుల్లకు చుట్టి చిన్న మితాయిపొట్లంలా చుట్టేవారం, దానికి ఉడకబెట్టిన మైదాపిండిలో అలా వేలుముంచిరాసి లాగి పక్కనడేయటం. అది సీసింద్రి గొట్టం. సోవియట్ అట్టలని మంచి దళసరి కాగితంలో వచ్చేవి. వాటితో గొట్టాలు చేస్తే సిసింద్రీ మొత్తం వెలిగిపోయినా కాగితం కాలేది కాదు. అందుకని ఆ పేపర్లు సంవత్సరం పొడుగునా ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేసి దాచేసేవాళ్ళం.

మళ్ళీ ఆ గొట్టాలు ఎవడెక్కువ చేస్తాడు అని పోటీ. 
నేనైతే గంటకు వంద గొట్టాలు చేసినట్టు గుర్తు. 
అవి ఎండకు బాగా ఆరి,  కదిపితే గలగల శబ్దం వచ్చింది అంటే ఆరిపోయినట్టు, ఇంతకు ముందే జువ్వకు కలిపినట్టు కలుపుకున్న మందుని, కాకపోతే ఈసారి ఐదు రెండు అర పాళ్లు కలిపేవాళ్ళం.

చిన్న పుల్ల పెట్టి ఆ మందు ఒకొక్క గొట్టంలోకి కూరటం. మందు మొత్తం కూరాకా అదే పుల్లతో మూతలాగా నొక్కేసి పక్కనడేయటం.
కాళ్ళునెప్పి పుట్టినా లెక్కచేయకుండా, సరదాగా రాత్రంతా కూర్చుని సిసింద్రీలు కూరిన రోజులున్నాయి. 

అన్నెందుకురా అని పెద్దోళ్లు తిట్టినా లెక్కచేయకుండా, వేలల్లో సిసింద్రీలు కూరేవాళ్ళం. 

ఇక సాయంత్రం అయ్యాకా ఆ సిసింద్రీల యుద్ధం జరిగేది. ఒరే వెధవల్లారా, తాటాకిళ్ళ దగ్గరే ఏడుస్తారే, అని ఒకొక్క ఇంట్లో తిట్లు తింటూ, అలా ఊరి బయటకు పోయి.. రెండు గ్రూపులుగా చేరి వెలిగించి అవతల గ్రూపుపైపడేస్తే, అది సర్ర్ మని ఏటో దూరేసేది. మళ్ళీ వాళ్ళు వేసింది సర్ర్మంటూ ఇటువైపు దూరేది. అలా వేసుకుంటూ రాత్రంతా సంబరాలు జరిగేవి. ఇది సిసింద్రీ గొడవ..!

మంచి తాడిచెట్టు ఎక్కి ఒక పదిపదిహేను వాటమైన ఆకులు కొట్టి, ఒక రోజు ఎండలో ఎండబెట్టేవారం.. అకుల్లో ఉన్న పచ్చంతా పోయి, ఆకు కాస్త పసుపు రంగులోకి వచ్చాకా కత్తిరించి, ఈనులు తీసి వరసగా పేర్చేవాళ్ళం.

ఆకు మధ్యలో చిన్న పొట్లం చేసి అందులో చిన్న చెంచాడు పటాస్ పోసి, ముందుగా కత్తిరించుకున్న ఎలక్ట్రిక్ ఒత్తుల్లోంచి ఒక ఒత్తి తీసి అందులో పెట్టు పొట్లం కట్టినట్టు ఆకు అలా దోపి నాలుగైదుసార్లు చుట్టేస్తే టపాకాయ రెడీ అయ్యేది. దాన్ని మేం పెటేబుగాయ అని ముద్దుపేరు పెట్టుకున్నాం. తాటాకుతో చేసాం కాబట్టి తాటాకు పెటేబుగాయ.

ఒక్కటి వెలిగించి వేస్తే, ఊరంతా రీసౌండే.. అంత సౌండ్ వచ్చేది. ఎలక్ట్రిక్ ఒత్తి అంటే జమ్మని అంటుకునేది. చాలావరకూ చేతిలోనే పేలిపోవటం, లేదా విసిరింది కిందపడకుండా గాల్లోనే పేలేది.

అలాగే మతాబు మందు తెచ్చి, మతాబులు.
అదే మందు కుమ్మరి ఇటుకల బట్టి దగ్గర కొన్న మట్టి చిచ్చుబుడ్డిలలో కూరి రాత్రి అయ్యేక వెలిగిస్తే ఒకొక్కటి పదిహేను నిముషాలపాటు కాలేది.

ఇప్పుడు ఈ హడావుడి లేదు. అసలు దీపావళి రోజునే హడావుడి కనబడటంలేదు. ఈరోజుల్లో పిల్లలకు ఇవన్నీ తెలిసే చాన్సు కూడా లేదు అంటే చాలా బాధగా ఉంది.

రైతుకు టపాసులు కొనే స్తోమత లేక.. పొలంలో వానకు పడిపోయిన పంటను చూసుకుంటూ కూర్చున్నాడు.
చేతిలో నాలుగు డబ్బులున్నోడు కొట్లో అమ్మే నాలుగు టపాసులు అంటించి ఏదో కానిచ్చేస్తున్నాడు.

ఇలా ఏ హడావుడి లేని.. గ్రీన్ దీపావళి జరుపుకుంటున్నారు పల్లెల్లో..

2 కామెంట్‌లు:

మోహన చెప్పారు...

బాగున్నాయండి మీ జ్ఞాపకాలు...!!

మోహన చెప్పారు...

బాగున్నాయండి మీ జ్ఞాపకాలు!!

Related Posts Plugin for WordPress, Blogger...