3, ఆగస్టు 2006, గురువారం

విలన్ మనోగతం

నమస్కారమండీ... నా పేరు తాజ్ బికారి..., అదేంటి!! పేరు అంత ఛండాలంగా ఉందీ అనుకుంటున్నారా.. అది అసలు పేరు కాదులేండి.. నా అసలు పేరు రామ్ పూజారి.. నా మొదటి సినిమా క్యారక్టర్ పేరే అసలు పేరుగా స్ధిరపడిపోయింది.

హిందీ సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారక్టర్లు చేసేవాడిని. నేను మంచి హైటు, కండలు తిరిగిన శరీరం, దొంగకోళ్ళు పట్టే వాడిలా మొహంతో.. విలన్ లా ఉండటం వలన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాన్సులొస్తున్నాయి.

కానీ తెలుగు సినిమాలకి రావటానికి ఎంతో కష్టపడ్డాను... అన్నిరకాల వాహనాలు నడపడం నేర్చుకోవాలి.... చివరికి విమానం.. హెలికాప్టర్ కూడా... !!, అదే హీరోగారికి రాదంటే.. కెమేరా ట్రిక్కో..లేక గ్రాఫిక్కో పెట్టి కానిచ్చేస్తారు షాట్.. మరి మాకలా కాదు.. మీరు చెబితే నమ్మరు. . తెలుగు కష్టపడి నేర్చుకున్నా తెలుసా?, హీరో గారు స్టైలిష్ ఇంగ్లీష్ లో మాట్లాడినా.. మేం మాత్రం తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పాలి... ఎందుకంటే.. మా తెలుగు డైలాగుల్లో విలనిజం పలుకుతుందంట ఏంటో మరది.. !!

జనరల్ గా హీరోని ఎన్నో కష్టాలు పెడతాం అవన్నీ తెరమీదే... తెరవెనుక మా కష్టాలు లైట్ బాయ్ కూడా చూడడు అంటే నమ్మరు.. మీరు నమ్ముతానంటే.. చెబుతా నిజాలు వినండి..



హీరోకి సినిమా సగంలో , గుండెల్లో..! బుల్లెట్ తగిలినా... అదే దెబ్బతో రక్తం కారేలా సినిమా లాస్ట్ వరకూ పోరాడతాడు..లేదా ఎవరొకరు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు.. కొంత సేపటికి బయట రెడ్ బల్బ్ వెలగడం.. ఆపరేషన్ సక్సస్ అంటాడు డాక్టరు.. మళ్ళీ వెంటనే మామీదకి యుద్దానికి పరుగెత్తుకు వస్తాడు... అదే మేమైతే... చిటికెన వేలికి బుల్లెట్ తగిలినా... ఒక్క డైలాగ్ కూడా లేకుండా చంపేస్తారు... మా క్యారెక్టర్ ని. ఒక్కడు కూడా జాలి చూపించి హాస్పిటల్ కి తీసుకువెళ్ళరు.

ఒక్క సినిమాలోనైనా హీరో చచ్చిపోవడం చూసారా?, మా విలన్లని ఎంతమందిని అర్ధాంతరంగా చంపేస్తాడు హీరో... !, మళ్ళీ ఆఖరున హింసంటే నాకు పడదు అని డైలాగులు చెప్పి హీరో మంచివాడైపోతాడు.. ఏదో హింసతోనే మా విలన్లు పుట్టినట్లు!.



హీరోలని వదిలేయండి.. హీరోయిన్లకు కూడా మేమంటే చిన్న చూపే... నలుగురు, ఐదుగురు ఉంటారు హీరోయిన్లు కొన్ని సినిమాల్లో.. అందరూ హీరోగారినే ప్రేమిస్తారు... ఒక్కరు విలన్ని ప్రేమించరు... హీరోగారు నాకన్నా ముసలివాళ్ళయినా మా వంక చూడనే చూడరు.., ఎంత దారుణం..!! అదీ కరెక్టేలేండి..!, మేమెప్పుడూ చిరిగిన, నలిగిపోయిన బట్టలు వేసుకుని వికారంగా వుంటాం.. ఆయనేమో.. చక్కగా ఫైట్ సీన్లలోనైనా, హాస్పిటల్ లో బెడ్ సీన్లలో నైనా కూడా నలగని తెల్ల బట్టలువేసుకుని, రక్తపు మరకలు అద్దుకుని, కాస్ట్లీ ఇంపోర్టెడ్ విగ్గు దరించి స్మార్ట్గ్ గా కనిపిస్తుంటారు.

ఫైట్ సీన్లలో మాకష్టం ఎంతుంటుందో తెలుసామీకు?, హీరో సార్ ఇలా చెయ్యి అంటే చాలు పదడుగులదూరం ఎగిరిపడాలి మేము. మేం వందమంది ఆయుధాలతో వున్నా ఒక్కొక్కళ్ళే వెళ్ళాలి..!, మళ్ళీ సార్ కి పొరపాటున చేయి తగిలినా.. ఇండస్ట్రీలో ఉండవ్ అంటారు. అసలు మేమేలేకపోతే.. వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరన్నవిషయం తెలియదు పాపం వాళ్ళకి.

అమ్మో! వచ్చిన కొత్తలో ఐతే..!, తెలయక వందమంది ఒక్కొక్కరే వెళుతున్నా అవేశపడి పైట్ కి వెళ్ళిపోయి తిట్లు తినేవాడిని.. ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం అలవాటయిపోయింది.. మేం వెళతామన్నా డైరెక్టరు సార్ వెళ్ళనివ్వరులేండి!.

హీరో సార్ చేతిలో ఆయుధాలుండవ్.. పొరపాటున మేము ఇచ్చినా తీసుకోరు కూడా.... మేం మాత్రం ఆయిధాల భరువును మోస్తూ.. వెర్రివాళ్ళలాగా కొట్టండిసార్ అన్నట్లు నిలబడి చూస్తుండాలి,.. తప్పదు మరి.

మేం ఎంత ఎగిరి క్రింద పడి నడుములు విరగ్గొట్టుకున్నా.. అది తెరపైన కొన్ని సెకనుల పాటు చూపిస్తారు.. అదే ఆయన పొరపాటుగా ఏదైనా దుమ్మురేగేలా చేస్తే చాలు.., పది కెమేరాలు పెట్టి పదినిముషాలపాటు స్లో మోషన్లో మరీ చూపిస్తారు. జనాలు అంతేలెండి..!!, "అయ్య బాబోయ్! హీరో..నిజంగా చేసాడ్రా", అని చెప్పట్లు కొడతారు... అదే సినిమాలో అటువంటి ఫీట్లు మావి వందలకొద్దీ ఉంటాయ్ . ఒక్కరు నమ్మరు మా టాలెంటుని.

ఈ మధ్య నాకు వెధవ బీపీ ఎక్కవైపోయింది.. హీరోగారు చూస్తే.. నా మీద ఒక అడుగు పొట్టి..మీద ఉమ్ములు పడేలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి తొడలు కొడుతున్నా.. మేమేమో.. కండలుతిరిగి కొట్టగలిగినా.. ఏమీ మాట్లాడకుండా.. మిడిగుడ్లేసుకుని చూస్తూనిలబడాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది.. పొట్టి హీరోని లాగి ఒక్కటివ్వాలని... కానీ తప్పదు కంట్రోల్ చేసుకోవాలి.. అలా కంట్రోల్ చేసుకుని.. ఈ బీపీ నాకు.

డైరెక్టర్ క్లోజప్ షాట్ అన్నాడంటే చాలు మాకు గుండెల్లో రాయి పడ్డట్లే... ఎందుకంటే.. క్లోజప్ లు అంటే ఖచ్ఛితంగా మామీదే వుంటాయి. హీరోగారిపై తీయరు.. తీస్తే ఆయన మొహంపై మడతలు, మేకప్ ట్రిక్కులు తెలిసిపోతాయని!. అందుకు ఆ క్లోజప్ లు అన్నీ మా పై తోసేస్తారు.. ఇంకా బాగారావాలి... ఇంకా బాగా రావాలి... అని చంపుతారు..., హీరో గారు ప్రక్కనుండి చిరాకుపడుతుంటారు.. "ఏక్టింగ్ సరిగా రానివాళ్ళందరినీ ఎక్కడినుండితెస్తారయ్యా", అంటూ అందరిన్నీ తిడుతుంటారు...ఆయనకి బాగోదని అవన్నీ మాపై తీస్తున్నారని తెలియదు పాపం.

ఆయనకన్నీ ఈజీ షాట్సే... కాళ్ళమధ్య, కాళ్ళక్రింద కెమేరాలు పెట్టడం.., వెనుకనుండి సడెన్ గా పైకి క్రిందికి కెమెరా తిప్పి మొహం కనబడనివ్వకుండా.. కాళ్ళదాకా తెచ్చి అప్పుడు మొహం చూపించే షాట్స్ తీసి... ఈ మధ్య టెక్నికల్ డైరెక్టర్స్ అని అనిపించేసుకుంటున్నారు డైరెక్టర్లు కూడా.. , ఏంటి సార్.. అని మా భాదలు డైరక్టర్లతో మొరపెట్టుకున్నాపోనీలేవయ్యా పెద్దాయన అని అంటున్నారు.. ఏంచేస్తాం!!.

ఈ తప్పంతా అసలు మా కూతుర్లది... ఎవడూ దొరకనట్లు ఈ హీరోలవెంట తిరగటం, ప్రేమించడం, మమ్మల్ని విలన్లను చేయడం...అదే లేకపోతే మాకు హీరోలతో గొడవలెందుకు పెట్టుకుంటాం.

హిందీ సినిమాలు వదిలేసి ఇక్కడికి రావడానికి చాలా కారణాలున్నాయి.. మా వాళ్ళు నా చిన్నప్పటి కధలనే పట్టుకుని వేళాడుతుంటారు.. లేదా ఏ తెలుగు కధో, తమిళకధో రీమేక్ చేస్తుంటారు.. అని తెలిసి ఇక్కడి కొచ్చా.. , అక్కడ ఇక్కడా కూడా చాన్సులుంటాయని ఆశతో... అదొక కారణమైతే.. ఇంకొకటి.. మంచి టేలెంటెడ్ టెక్నీషియన్స్ అంతా సౌత్ వాళ్ళే... వాళ్ళు మన టాలెంటుకి పదును పెట్టేస్తారని పరుగెత్తుకుంటూ వచ్చా తెలుగిండస్ట్రీకి.. వచ్చాకా చాలా తెలిసాయి. ఇక్కడ హీరోల డామినేషన్.. మాకు అక్కడ ప్రొడ్యూసర్ల డామినేషన్ అని.

మొన్నెవరో చెప్పుకుంటుంటే విన్నాను..ఎవరో హీరో గారంట కధ చూశాకా.. సంతకాలు పెట్టే సమయంలో.. డాన్సులుంటాయా? అని అడిగారంట.. "లేవు సార్.. అసలుండవ్... హీరోయిన్, మిస్ ఇండియాని తీసుకొస్తున్నాం.., డాన్సునేర్పించి... ఆవిడే చేస్తుంది..డాన్సులన్నీ.. మీరు చుట్టూ చేతులూపుకుంటూ తిరిగితే చాలు", అన్నాకా సంతకం చేసారంట.. అది ఇప్పుడు షూటింగ్.. అందులో కూడా నేనే విలన్.

ఇంకో హీరోగారికి.. కనీసం రెండయినా హీరోయిన్ కో, లేక చెల్లి కేరెక్టర్ కో జడలు వేసే సీన్ కావాలన్నారంట.. అంతే.. కధలో ఇరింకిచేసారు.. అది ప్యామిలీ డ్రామాలేండి !,మా ప్యాక్షన్ విలన్స్ కి చాన్సులుండవులేండి అటువంటి కధలలోకి.

ఇవన్నీ ఏదో కడుపు రగిలి చెప్పేస్తున్నా.. ఇవన్నీ వ్రాయకండి సార్.. ఏదో మొట్టమొదటి సారిగా ఒక విలన్ తో ఇంటర్వుకి వచ్చారని.. అనందంలో నా భాదలు చెప్పుకున్నా.. ఇవి బయట తెలిస్తే నాకు కేరెక్టర్లుండవ్.. అప్పుడు నేను బటానీలు కూడా అమ్ముకోలేను... అందిరికీ తెలిసిన విలన్ ఫేసు కదా??, ఉద్యోగం కూడా దొరకదు..!



సరే! సార్.. ధ్యాంక్స్ ఫర్ ఇంటర్వూ..., .. నా షాట్ రడీ అంట..!, నేను వెళుతున్నా మరి...

--------

ఏమయ్యా!, డైరెక్టరు.. క్లోజప్ షాట్ కాదు కదా??,..... హమ్మయ్య.!!!,

ఛీ!, వెధవ బ్రతుకు వీళ్ల తాతకి నేనే విలన్.. వీళ్ళ నాన్నకి ఒకప్పుడు నేనే., ఇప్పుడు మనవడికి.. అంటే.. మూడోతరం.., నిక్కర్లేసుకోక ముందు తెలుసు.. ఈ హీరో... ఎన్ని తరాలు మారినా వాళ్ళు పిడికిళ్ళు బిగించి ఉమ్ములేస్తూ డైలాగులు చెబుతుంటే.. మేం అలా చూస్తూనే ఉండాలి... ఛీ.. జీవితం..!!!,

పద మొదలు పెట్టవయ్యా డైరెక్టరూ.. షాట్ మొదలు పెట్టు.. ఇంకా ఏంటి ఆలస్యం.?

10 కామెంట్‌లు:

Krishh Raem చెప్పారు...

నాకు ఈ ఆర్టికల్ చదవాడానికె పావు గంట పట్టింది , ఇక మీకు రాయడనికి ఎంత టైం పట్టిందో .....

కాస్త లేట్ గా వచ్చినా లేటెస్త్ గా ఉంధి మీ వ్యంగ్యాస్ట్రం ....

శ్రీనివాసరాజు చెప్పారు...

ఐడియా ఎప్పట్నుండో ఉంది మనసులో.. కానీ, నా వన్నీ విమర్శనాత్మకం అవుతున్నాయని భయపడి ఇన్నాళ్ళు వ్రాయలేదు.. కానీ వ్యంగ్యంగా మార్చి వ్రాయటానికి ప్రయత్నంచా.. మీ అభిప్రాయానికి కృతఘ్నతలు... వ్రాయటానికి, టైపు చేయటానికి.. మూడు గంటలు పట్టుండొచ్చు..

spandana చెప్పారు...

శ్రీనివాసరాజు గారూ,
"కృతఘ్నతలు" కాదండి చెప్పాల్సింది కృతజ్ఞతలు. క్రిష్ నొచ్చుకొని వుంటారేమొ! :)
-- ప్రసాద్
http://charasala.wordpress.com

శ్రీనివాసరాజు చెప్పారు...

sorry.. it was a mistake..
Krish.. gaaru.. sorry andi.. typing speedlo mistake aina adi pedda tappe. . mottam meaninge maaripoyindi..nenu cheppindi aa krutagnathalae.

Spandana gaaru. thank you very much.

శ్రీనివాస చెప్పారు...

ఏంటండీ బావగారూ! మీరేనా ఇంటర్వ్యూ చేసింది :)

kiraN చెప్పారు...

ఇంటర్వ్యూ భలే ఉందండి రాజుగారు.. :)

- కిరణ్

Krishh Raem చెప్పారు...

మీరు ఫీల్ , నొచ్చుకొవడం... ఇలాంటి పెద్ద మాటలు అనకండి గురు గారు .....
నా తెలుగు లో అన్ని తప్పులే ....కారణం తెలుగు రాకపొవడం కాదండొయి ... బద్దకం ....
ఇలాంటి పే.....ద్ద ఆర్టికల్స్ నాలంటి వల్లకు నిజంగా inspiration ... ఎనీ వే థాక్యు వెరీ మచ్ ఫర్ థ కన్సర్న్ణ్ i mean కృతజ్ఞతలు :)

చదువరి చెప్పారు...

అదరగొట్టేసారు! గుంపులో మీర్రాసిన జాబు చూసి ఇక్కడికి వచ్చాను. థాంక్స్!

రాధిక చెప్పారు...

adirindi sir.paapam kada veellu.

Unknown చెప్పారు...

శ్రీనివాస్ గారు మీ వ్యంగ్యాస్త్రం చాలా బాగుంది.

Related Posts Plugin for WordPress, Blogger...