10, జనవరి 2007, బుధవారం

రాంగ్ నెంబర్...




ఆఫిసునుండి తిరిగి రూమ్ దగ్గర ఉన్న సందులోకి తిరిగి, నడుస్తూ వస్తున్న దీపక్ జేబులో ఉన్న సెల్ ఫోన్ మ్రోగింది. ఆఫీసులో పని ఎక్కువై అసలే అలసి ఉన్న దీపక్ , ఫోన్ ఎత్తి నీరసంగా "హలో!" అన్నాడు. అవతలి వైపునుండి ఒక ముసలతను గొంతు వినపడింది.. “ఏరా! సతీష్ వచ్చేయరా.. నీకోసం బెంగ పెట్టుకున్నాం రా.. వచ్చేయరా బాబు.. “, అని ఏడుపు గొంతుతో వణుకుతూ అవతలి వ్యక్తి మాట్లాడుతున్నాడు. దీపక్ కి అర్ధంకాలేదు.. అసలే చికాకు ఉన్నాడేమో, కోపంగా తిట్టేద్దాం అనుకున్నాడు.., మళ్ళీ ఎవరో పెద్దాయన గొంతులా ఉంది కదా అని "ఎవరుకావాలండీ.. ఇక్కడ సతీష్ ఎవరూలేరండి", అని గౌరవంగా సమాధానమిచ్చాడు. ఫోన్ కట్ అయ్యింది.

మళ్ళీ రెండు అడుగులు వేసాడో లేదో మళ్ళీ మ్రోగింది. మళ్ళీ అదే గొంతు అదే ఏడుపు.. ఇక్కడ ఎవరూలేరని చెప్పినా ఆయన వినడంలేదు.. అలా నాలుగుసార్లు రిసీవ్ చేసుకుని సహనంతో సమాధానమిచ్చాడు. ఇక ఈసారి వస్తే పెద్దాయనైనా సరే అయిపోయాడు అనుకున్నాడు.
మళ్ళీ మ్రోగింది.

ఈ సారి కాస్త కోపంగా సమాధానమిచ్చాడు.. దానికి అవతలి వ్వక్తి తిట్టడం మొదలుపెట్టాడు.
"ఒరే.. మా సతీష్ ని వదిలిపెట్టు లేకపోతే పోలీస్ కంప్లేంటు ఇస్తాను.. కిడ్నప్ కేసు పెడతా", అని బెదిరించాడు.

"ఇదెక్కడి గోలయ్యా బాబు.. సతీష్ ఎవరూలేరు అంటుంటే. "అని ఫోన్ కట్ చేసేసాడు.
ఇక ఫోన్ మీద పోన్ రావడం మాత్రం ఆగలేదు. చికాకు పడుతూ రూమ్ చేరుకున్నాడు. అప్పటికే టైము పది కావస్తుంది ఫ్రండ్స్ అంతా ఎవరిపనిలో వాళ్ళున్నారు.

అనురాగ్ ఎఫ్ ఎమ్ లో పాటలు వింటున్నాడు. సత్యం, జీవా, అజయ్ టీవిలో న్యూస్ చూస్తున్నారు. శ్రీనివాస్ ఎవరితోనో ఫోన్లో బిజిగా ఉన్నాడు. వీళ్ళంతా తోటి రూమ్ మేట్స్.

అంతా వేరువేరు రాష్ట్రాలనుండి వచ్చినవాళ్ళు. సత్యం, దీపక్ మధ్యప్రదేశ్, అనురాగ్ ది ఉత్ర్తర్ ప్రదేశ్, జీవాది తమిళనాడు, శ్రీనివాస్ ది ఆంధ్రా, కొత్తగా వచ్చిన పాత రూమ్ మేట్ అజయ్ కూడా ఉన్నాడు. వాడిది బీహార్..

సత్యం, శ్రీనివాస్, అనురాగ్, జీవాలు ఒకే కంపేనీలో చేస్తారు, దీపక్, అజయ్ లు వేరు వేరు కంపెనీల్లో చేస్తుంటారు. అందరూ హిందీలో మాట్లాడుకుంటారు.. లేదా ఇంగ్లీష్.

"హే.. కొత్త జాబ్ వచ్చిందట కదా.., ఎక్కడ ఏంటి.. ఎలా ఉన్నావ్", అని దీపక్ అజయ్ ని పలకరించాడు..

"అవును.. కోలకతాలో వచ్చింది ఇంకొక పదిరోజుల్లో జాయిన్ అవ్వాలి. నా బుక్స్ అవి ఇక్కడ వుండి పోయాయి తీసుకెళ్దామని వచ్చాను. అవును నీ జాబ్ ఎలా? ఉంది", అని అజయ్ అడిగాడు దీపక్ ని.

మొబైల్ వైబ్రేట్ మోడ్ లో పెట్టేసి.. బాత్రూమ్లో దూరి కాస్త ఫ్రెస్ అయ్యి బయటపడ్డాడు దీపక్.

బయటకొచ్చాకా సత్యంతో ఫోన్ గురించి చెప్పాడు. వస్తున్న కాల్స్ ని కట్ చేస్తూ. "అదేంటి నాకివ్వు నేను మాట్లాడతా..", అని సత్యం ఫోన్ లాక్కొని మరీ మాట్లాడాడు..

"చెప్పండి తాతగారు.., ఇక్కడ సతీష్ ఎవరూలేరు", అని నాలా మర్యాదగా చెప్పాడు.
"మీకు కావాల్సిన నెంబరేంటి..", అని అడిగాడు. అవతలి వ్యక్తి తిట్లు ఆపడంలేదు.. "చంపేస్తా మీ ఎడ్రస్ చెప్పు ",అన్నట్లున్నాడు.

సత్యం కి కోపం మొదలయ్యింది. "ఏంటిరా మర్యాదగా చెబుతుంటే.. వినవే.. ఎవడులేడుబే.. నీకు చేతనయ్యింది చేస్కో..బే.. ఇదిగో నా ఎడ్రస్ అని మొత్తం ఎడ్రసంతా వివరంగా చెప్పేసాడు. రాస్కో.. మళ్ళీ కావాలంటే చెప్తా.. ఏ టైముకి వచ్చినా పర్లేదు.. నీకు దమ్ముంటే రా", అని.. తొడ కొట్టి జూనియర్ ఎన్ టి ఆర్ చెప్పినట్టు డైలాగ్స్ చేప్పేసరికి.. దీపక్ కి కాళ్ళు వణికాయి.. ఏంటిరా.. ఇదేమన్నా రెస్టారెంటుకి ఫోన్ చేసి ఆర్డర్ చేప్పుతున్నావనుకున్నావా.. మొత్తం ఎడ్రసు చెప్పేవు.. వాడు ఇప్పుడు పోలీస్ కంప్లేంటు ఇస్తే.. ఏం చేస్తావ్.. బే", అని భయంతో అరిచాడు.

"అందులోనూ ఏదో కిడ్నాప్ అంటున్నాడు.. నాకేదో భయంగా ఉంది", అని గోలపెట్టాడు.
"ఏం జరుగుతుంది ", అని మిగతా వాళ్ళంతా ఒకరూములోకి చేరి చర్చించుకున్నారు. జరిగిందంతా తెలుసుకుని.. సత్యంని తిట్టారు..

అజయ్ టాటా ఇండికామ్ లో పనిచేస్తుంటాడు.. "వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయండి లేకపోతే ట్రేస్ చేసే అవకాశం ఉంది", అని సలహా ఇచ్చాడు.. దీపక్ వణుకుతున్న చేతులతో స్విచ్చాఫ్ చేసేసాడు.

"మొత్తం ఎడ్రసే తెలిసిపోతే ఇక ఫోన్ ట్రేస్ చేయాల్సిన అవసరం ఏముంది బే", అని శ్రీనివాస్ తిట్టాడు అజయ్ ని.. అంతా మళ్ళీ తెల్లమొహం వేసారు.

అందరి మొహాల్లోనూ టెన్సన్ కనపడింది.. జీవాకి ఏమీ అర్దంకాలేదు.. అతనికి హిందీ రాదు.. “వాట్ హేపెన్డ్ మేన్”, అని అడిగాడు. వాడికి ఓపికగా అనురాగ్ అంతా వివరించాడు. “ఓ గాడ్ “,అని నిట్టూర్చాడు జీవా.

అనురాగ్ కి ఒక ఐడియా వచ్చింది. "ఇది కష్టమర్ కేర్ కి పోన్ చేసి చెప్పేద్దాం మనకు ఎదో రాంగ్ కాల్స్ వస్తున్నాయని. ముందుగా మనమే చెబితే కంప్లైంటు ముందు మనదే ఉంటుంది, తరువాత ఏం జరిగినా మనదే పైచేయి అవుతుంది", అని అన్నాడు.

"సరే దీపక్ పోను ఇవ్వురా ", అని అడిగాడు శ్రీనివాస్..
"అమ్మో, అది ఆన్ చేస్తే మళ్ళీ కాల్స్ వస్తాయి", అని భయపడ్డాడు ధీపక్.

"సరే శ్రీనివాస్ నీ ఫోన్ ఇవ్వు", అని అనురాగ్ కష్టమర్ కేర్ కి కాల్ చేసాడు.

"హలో మాకు ఎవరో రాంగ్ కాల్స్ చేస్తునారు, బెదిరిస్తున్నారు, కాస్త అది ట్రేస్ చెయ్యగలరా. కంప్లేంట్ రాసుకోండి", అని కాల్ వస్తున్న నెంబరు ఇచ్చాడు. కష్టమర్ కేర్ వాడు ఏదో నెంబరు రాసుకోమన్నట్లున్నాడు పెన్ అన్నట్లు సైగచేసాడు.. పెన్ అందించగా ఏదో ఆరు నెంబర్లు రాసాడు. ఇంకా ఎవో చెప్పినవి కంగారు కంగారుగా ఎక్కించేసాడు పేపర్ పై.

"ఇదిగో ఈ నెంబరుకు మనం మెసేజ్ పంపాలంట. మన నెంబరు, రాంగ్ కాల్ వస్తున్న నెంబరు. పెట్టి పంపిస్తే అది లాగ్ అవుతుందంట. నేను పంపిస్తాను అని మెసేజ్ పంపించాడు.", అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

"సరే కంప్లైంట్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళు నలుగరురైదుగురు వస్తే ఏంటి పరిస్ధితి. ఎలా", అని అన్నాడు జీవా.

"అవును వస్తే రానియ్.. మనం ఆరుగురున్నాం ఆమాత్రం కొట్టలేమా అందరూ రాడ్స్ తీయండ్రా", అని ఎక్సర్ సైజ్ చేసే వెయిట్స్ తీసేసి రాడ్స్ అవీ రడీచేసి మెయిన్ డోర్ ప్రక్కన పెట్టాడు సత్యం.

"ఎందుకైనా మంచిది.. ఇది ముంబయి బే… ఆఫీస్లో తెలిసిన రాహుల్ ఉన్నాడు కదా వాడికి కాస్తా రౌడీ బ్యాక్ గ్రవుండ్ ఉంది. వాడికి పోన్ చెయ్యి. చెబ్దాం. మరీ అవసరం అయితే. వాడు సాయం చేస్తాడు", అని వాడికి కూడా పోన్ చేసేసి వివరంగా చెప్పారు అంతా.

ఇదంతా వింటూ తలపట్టుకుని కూర్చున్నాడు దీపక్. ఏడుపు ఒకటే తక్కువైంది మొహంలో. "అందరూ పల్లేదురా మేమున్నాం కదా భయపడకు.. అయినా ఈ రోజు ఫోన్ ఎవరికైనా ఇచ్చావా.. ఎవరైనా కొత్తవాళ్ళునిన్ను ఫాలో అయ్యారా", అని ప్రశ్నల వర్షం కురిపించారు.. ఆందోళనగా ఆళోచిస్తూ "లేదురా.. ", అని సమాధానం చెప్పాడు, దీపక్.

"సరే పద! రా అనురాగ్.. మనం వెళ్ళి సెక్యూరిటీవాళ్ళకు చెబ్దాం ఎవరైనా వస్తే రానివ్వద్దని. జాగ్రత్తగా ఉండమనీ. తేడా వస్తే పోలీసులకు ఫోన్ చెయమని", అని సత్యం అనురాగ్ ని క్రిందకు తీసుకుపోయాడు.

మళ్ళీ మిగిలినవారంతా "ఏంటి? ఎలా జరిగుంటుంది.. ?", అని విశ్లేషించసాగారు.

పదినిముషాలు గడిచింది.. సత్యం దగ్గరగా వేసి వున్న తలుపును కంగారు గుద్దుకుంటూ వచ్చి రూమ్లో పడ్డాడు. అవేశంగా అనురాగ్ వెనుకనుండి పరుగెత్తి వచ్చాడు లోపలికి.

కంగారు కంగారుగా తలుపులు మూసేసాడు అజయ్.. 'ఏమైందిరా!!!"', అని అంతా అడిగారు.. సత్యం,అనురాగ్ ని.

"సెక్యూరిటీ వాళ్ళకు చెప్పాం… చెప్పి వస్తుండగా... ఏదో సుమో ఆగింది... అందులో నుండి నలుగురు ఐదుగురు చేతిలో ఎవో రాడ్స్ తో దిగారు.. ఎడ్రస్ వెతుక్కుంటున్నారు.. లా ఉంది.. మేం భయంతో వచ్చేసాం..", అని వగురస్తూ చెప్పాడు సత్యం.

ధీపక్ తో పాటుగా అందరికీ కాళ్ళువణికాయి.. , "అయ్యబాబోయ్ ఇప్పడెలారా..", అని అనుకున్నారంతా.

అంతా నిశ్సబ్ధంగా కూర్చున్నారు. అంతా మెయిన్ డోర్ వైపు చూస్తున్నారు.. ఏ క్షణాన్నైనా కాలింగ్ బెల్ మ్రోగొచ్చు అని.

"చాలా సేపయ్యింది ఇక పడుకుందాం. ఎవడన్నా తలుపు కొడితే అప్పుడే చూద్దాం", అని అంతా సర్దుకుని పడుకున్నారు.

లైట్లన్ని తీసేసారు.

పది నిముషాలు గడిచాయి. ఏ శబ్ధమూ రాలేదు. సడెన్ గా శ్రీనివాస్ లేచి లైటువేసి ఏదో వెతకసాగాడు.. "ఏంటి బాస్ వెతుకుతున్నావ్??", అన్నాడు దీపక్.. "రాడ్స్ అన్నీ దగ్గర్లో ఉన్నాయోలేదో", అని.. అని లైటు తీసేసి పడుకున్నాడు శ్రీనివాస్.

కాసేపటికి.. అనురాగ్ లేచి లైట్లన్నీ వేసి.. 'ఆజ్ కా బక్రా దీపక్ జీ......" అని కేకలు పెట్టాడు. దీపక్ అయోమయంగా చూస్తూ "ఏమైంది?..", అని అడిగాడు..

"ఇదంతా మా ప్లాన్ చేయని నాటకం బే", అని.. అంతా నవ్వుకున్నారు.

ప్రక్క రూమ్లో పడుకుని ఉన్న అజయ్ పరుగుపరుగున వచ్చి.. దీపక్ ని పట్టుకుని.. ఏడిపిస్తూ.. ఆటపట్టించాడు.

(ఇది మా రూమ్లో జరిగిన.. ఒక సంఘటన, ఇందులో శ్రీనివాస్ పాత్రదారిగా నేను నటించగా. మిగతా పేర్లుకల, వాళ్ళు మా రూమ్ మేట్స్.. రిహార్సల్ లేకుండానే నాటకాన్ని రక్తికట్టించారు.)


తరువాత మళ్ళీ ఆన్ చేసిన దీపక్ మొబైల్ కి మిస్ కాల్స్ రాసాగాయి. దీపక్ కంగారుగా "ఎవరిది ఇది మళ్ళీ కొత్త నెంబరు..", అని ఆశ్చర్యపోయాడు.. వాడితో పాటుగా అంతా అశ్చర్యపోయారు. ఈ సమయంలో నాకు ఎవడుచేస్తాడు కాల్, ఇప్పుడు పన్నెండు అయ్యింది అని బిక్కమొహంవేసాడు దీపక్ మా వంక చూస్తూ. తరువాత వచ్చిన ఫోన్ ఎత్తాడు.. "సతీష్ ఉన్నాడా??", అని అవతలి వ్యక్తి అన్నాడంట.. దీపక్ కేకలేస్తూ చెప్పాడు.. "ఎవడో మళ్ళీ సతీష్ అంటున్నాడ్రా..", అని..

మాకెవరకూ వెలగలేదు "ఇదేంటి.. మనకు తెలిసిన వాళ్ళెవరిదీ కాదు కదా నెంబర్", అని..

ప్రక్క రూమ్లో నుండి జీవా నవ్వుతూ వచ్చాడు.. “వేర్ ఈస్ సతీష్ మేన్”, అంటూ.. దీపక్.. తలపట్టుకుని.. మొహం.. తలగడలోదాచేసుకున్నాడు.. మళ్ళీ అంతా పగలబడి నవ్వుకున్నాం.


తెరవెనుక కధ:
---------

అజయ్ టాటాఇండీకామ్ లో చేస్తాడు అని చెప్పాను కదా!, అతని కి కొత్తగా ఫ్రీ పోన్ ఒకటిచ్చారు. అది దీపక్ కి తెలియదు. ఆ నెంబర్ నుండి సత్యం ఫోన్ చేసి అలా కధమొదలుపెట్టాడు. దాన్ని అనురాగ్ కొనసాగిస్తూ ప్రక్కనే ఉంటూ మిస్ కాల్స్ ఇవ్వసాగారు.

ఇదంతా జరుగుతుండగా. ఫోన్ మాట్లాడటం అయిన నాకు ఏంజరిగిందో తెలియలేదు. సత్యం అనురాగ్ నుండి తెలుసుకున్నాను. కాసేపు నేను కూడా నమ్మేసాను.. అంతలా ఏక్ట్ చేసారు మా వాళ్ళు. నాకు కష్టమర్ కేర్ కి ఫోన్ చేసిన తరువాత అసలు విషయం అర్ధం అయ్యింది. ఎందుకంటే అనురాగ్ ఒక్కసారి డయల్ చేసి హలో అని వెంటనే మాట్లాడటం మొదలు పెట్టగానే అనుమానం వచ్చింది. హచ్ కష్టమర్ కేర్ కి చాలా సార్లు చేసాను ఫోన్ ఎవేవో ఆప్సన్స్ ఉంటాయి అవన్నీ డయల్చేసాకా కాని ఎంతో సేపటికి మాట్లాడలేం. తరువాత అనురాగ్ చేతిలోనుండి నా ఫోన్ తీసుకున్నాకా, డయల్ కాల్ లిస్ట్లో హచ్ కేర్ లేకపోయేసరికి నేను కూడా ఏక్ట్ చేయండం మొదలుపెట్టాను.

జీవాకి కూడా తెలిసిపోయింది ఎలా తెలిసిందో మరి.. కొంతసేపు దీపక్ ని ఓదార్చాడు.. తరువాత వేరే రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక సత్యం, అనురాగ్, అజయ్ లతో కలిసి నేను కూడా దీపక్ ని ఆట పట్టించాం.

అన్నిట్లో హైలైట్ ఏంటంటే, జీవా ఫోన్ చేసి సతీష్ ని అడగటం.

జీవా కొత్తగా రూమ్లోకి రావటం వలన అతని నెంబరు కూడా ఎవరికీ తెలియదు.

మా రూమ్ మేట్సే వేసిన చిన్న ప్లాన్ కాస్తా మంచి నాటకమయ్యింది… అది నచ్చినాకు నా బ్లాగ్ లో ఒక పోస్ట్ అవుతుందని ఇక్కడ రాసాను. ఇది ఏ రామ్ గోపాల్ వర్మకో ఇస్తే మంచి సస్పెన్స్ మూవీయే అవుతుంది…

ఆయనా ఇక్కడే ఉంటాడండోయ్ ఈసారి కలిసినప్పుడు చెప్పాలీ కధ..

టైటిల్.. “రాంగ్ నెంబర్”, కన్ఫామ్ చేద్దామా…?, కేప్సన్ ఉండాలి కాబట్టి.. హుమ్మ్….??,
"తెలిసిన వారి నెంబర్లు ఏడ్ చేసుకోండి…" అని ఇద్దాం.. ఒకే.. ఏక్షన్…

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చక్కగా రక్తి కట్టించారు మీ స్నేహితులు. తెలివైన వారే ఇంకేం సినిమాలు మీరే తియ్యండి.

విహారి
http://vihaari.blogspot.com

Unknown చెప్పారు...

వామ్మో మంచి దోస్తులే ఉన్నరండీ మీకు...
భలేగా ఐడియా వేశారే.

రాధిక చెప్పారు...

caalaa baagundi.practical joke lu caalaa baaguntaayi.paddavaallea paapam bhayapadataaru

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు. ఉత్కంటను భలే రక్తి కట్టించారు.

రానారె చెప్పారు...

:))
భలే రూంమేట్స్!
అలా వుండాలి సందడిగా!!

pushyamikiran చెప్పారు...

హేయ్...చాల బాగుంది...చదివిన నాకె చాల థ్రిల్ల్ అనిపించింది..పాపం దీపక్....మొత్తానికి బాగా ఏంజాయ్ చేసారు అనమాట

అజ్ఞాత చెప్పారు...

chala bagundi Srinivasu Garu !!

Related Posts Plugin for WordPress, Blogger...