21, సెప్టెంబర్ 2008, ఆదివారం

బక్రా డాట్ కామ్...



ఎవడి బాధలు వాడివి.. ఎవడి టెన్సన్స్ వాడివి...
ఎవడి కోరికలు వాళ్ళవి.. ఎవరి సంపాదన వాళ్ళది.. 
కరెక్టే..కానీ..!!
 
మనం రోజూ ఎంతో మందిని చూస్తూ ఉంటాం... కలుస్తూ ఉంటాం.. 
వింటూ ఉంటాం...అందులో కొన్ని వింత జీవాలుంటాయి... 

కష్టమనేదే లేకుండా... డబ్బులు రావాలి...!!!, డబ్బులు రాలిపోవాలంతే..!!!, 
అనుకునేవాళ్ళూ...

ఫ్రీగా వస్తే... ఏదైనా ఒకే... అనుకునేవాళ్ళూ...

వెనుకా ముందూ అలోచించకుండా... కంగారుపడి పెట్టుబడులు పెట్టేసి 
చేతులు కాల్చుకునేవాళ్ళూ... ఇలా రకరకాల కేటగిరీల్లో... జనాలు...
 
వీళ్ళందరికీ ఒక వెబ్ సైట్ తయారు చెసి రిజిష్టర్ చేసి అవార్డులు రివార్డులు 
ఇస్తే.. ఎలా ఉంటుంది..? అనే ఐడియా వస్తే...,
 
ఆ వెబ్ సైటుకు... ఇప్పటికే.. వెబ్ స్పేస్... సరిపోనంతగా చాలామంది 
రిజిష్టర్ అయ్యుండేవారు కూడా...!!, 

ఈ వెబ్ సైట్లోకి రిజిష్టర్ చెయ్యబోవు... వాళ్ళవివరాలు... ఇలా ఉన్నాయి..
 
నాకు... ఒకడి కింద పనిచేయటం అంటే ఇష్టం ఉండదు... వంగి వంగి సలామ్ లు 
కొట్టడం అసలు పడదు... చక్కగా... వ్యాపారం చేస్కోవటం ఇష్టం... వ్యాపారంలో 
కూడా.. ఎన్నాళ్ళని ఇలా గొడ్డులా చాకిరీ చేస్తాం సార్... అందుకే.. ఈ మధ్య కొత్తగా 
ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు మా ఫ్రండ్సంతా కలిసి... ఒక ముప్పయ్ వేలు పెట్టుబడి 
పెట్టండి... దానికి తగిన విలువైన బంగారం ఇచ్చేస్తారు... మీ డబ్బులు మీకొచ్చినట్లే...
తరువాత ముగ్గుర్ని జాయిన్ చేస్తే చాలు.. మీకు కమీషనే... కమిషన్... ఇక ఇంట్లో 
కూర్చుని... నెలకు.. ముప్పయ్ నుండి నలబైవేలు వస్తాయ్...,
అని చెప్పుకుంటూ పొయాడు.. 

అది చైన్ మార్కెట్ కదా??, అని మీరు అడ్డుతగలగానే.. అనుకున్నారా? 
నేనూ ముందు మీలానే అనుకున్నా...!!, అని.. వంశ వృక్షం బొమ్మ గీసినట్లుగా...
పేపరుపై నాలుగు రకాల బొమ్మలు వేసి... ఇది చైన్ మార్కట్..!! 
ఇదేమో.. నేను చెప్తున్న బిజినెస్..!!!, రెండిటికి తేడా ఏమీ కనిపిచట్లేదు 
కదూ..???, మొదట్లో నాకూ ఇలానే అనిపించింది.. కానీ ఇది చాలా డిఫరెంట్...,
అని మనల్ని కన్వీన్స్ చెయ్యటానికి ట్రై చేస్తాడు...
 
సరే..!!, నాలుగు రోజులు గడిచాయి... పెద్ద పెద్ద అక్షరాలతో న్యూస్.. 
ఫలానా చైన్ మార్కెటింగ్ ఘరాణా మోసం గుట్టురట్టు... 
నలుగురు అరెస్టు.. అని..., ఇక ఆయన ఫొనూ లేదు.. కనపడినా.. 
తలవంచుకుని.. మాట్లాడటమూ మానేసాడు...
సరేలే ఏదో పాపం ఎవడి బుట్టలోనో పడ్డాడు అనుకుందాం.
 
మళ్ళీ ఒక పదిహేను రోజులు కాకుండానే... అలాంటిదే మరొకటి... వెబ్ సైట్ ద్వారా 
బంగారు నగలు కొనండి... మరో ముగ్గురి చేత కొనిపించండి... డబ్బులే డబ్బులు 
అంటే... వేలల్లో జనాలు ఎగబడి.. కొని మోసపోయారంట..!!!,

ఓ అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట!!!,
పాపం వాళ్ళంతా టీవీలు చూడరో మరి... తెలిసి కూడా మోసపోతారో తెలియటంలేదు..
 
సిద్ది వినాయకుని మంత్రం... పదకొండు మందికి ఫార్వార్డు చేస్తే..అనుకున్నది నెరవేరి 
తీరుతుంది... నాకు అలానే జరిగింది...!!!, మీరూ చేసి చూడండి...!

అప్పటికే ఆ మెయిల్ లో ఒక పదివేలు ఈ-మెయిల్ ఎడ్రసులుంటాయి.. 
అవన్నీ దోచుకుని... ఏ మార్కెటింగ్ కంపెనీకో అమ్ముకుని... సంపాదించుకునే 
కంపెనీల వ్యూహం ఈ చైన్ మెయిల్స్ అని తెలియని వాళ్ళను... ఏమనుకోవాలి?,

మెయిల్ ఫార్వార్డ్ చేస్తేనే... సిధ్ధివినాయకుడు కరుణిస్తాడా?? ఎ) అవును బి) కాదు 
సి) తెలియదు... వెంటనే...53423 కి  ఎసెమ్మెస్ చెయ్యండి.. బంగారు బహుమతులు 
గెలుచుకోండి.. అని కాంటెస్ట్... పెట్టండి... కుప్పలు కుప్పలుగా వస్తాయి ఎసెమ్మెస్ లు... 
అందులో 60 శాతం.. సి)తెలియదు అనే ఆప్సన్ కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు... 
(మరందుకేనండీ.. వెబ్ సైటు.. కావాలనేది..)
 
ఇలాంటివే మరికొన్ని.. మైక్రో సాప్ట్ మెయిల్ ఇది.. ఒకొక్క ఫార్వార్డ్ కి ఒక డాలర్... 
వెంటనే ఫార్వార్డ్ చెయ్యండి... అనే మెయిల్ రావటం పాపం...
వెంటనే అతనికున్న ఎడ్రస్ బుక్ లో కాంటాక్ట్స్ అన్నిటికీ... ఫార్వార్డ్ కొట్టేవాళ్ళూ..

ఏ!!, మైక్రోసాఫ్ట్ కి పనేమీ ఉండదా? సరదాగా మెయిల్ పంపితే డబ్బులు ఇవ్వటానికి?.

ఒకడైతే మెయిల్ పంపి ఫోను చేసి, మర్చిపోకురో... ట్రై చెయ్యి..., నువ్వు పంపితే..
నీకు పంపించినందుకు నాకొక బోనస్ పాయింటంట.. ఇంకొక మెయిల్ వచ్చింది 
ఇప్పుడే... అని.. గుసగుసలాడుతూ చెప్పాడు...
అతనో సాఫ్ట్వేర్ ఇంజనీరు కూడా..!!!, 

ఆహా!!.. ఈయన్ని.. తప్పని సరిగా రిజిష్టర్ చెయ్యాలి ఆ వెబ్ సైట్లో...

భలే చేసావ్ బాసూ..!!, ఇది ఎలా సాధ్యం.. ఐ కాంట్ బిలీవ్ ఇట్...!!!, అని బాసు.. 
అనగానే... బెలూన్లా ఉబ్బితబ్బిబ్బైపోయి.. పగలు రాత్రి తెలియకుండా... 
పనిచేసేసేవాడొకడు...!!!, జీతాలు ఇంక్రిమెంటు టైము వచ్చాకా తెలిసేది... 
అందరితోపాటు తనూ ఒక బోడి లింగం మావా... అని.

అవునండీ.. అక్షరాలా పదిరోజులు కావాలి.. కంప్లీట్ చెయ్యటానికి.. కష్టం సార్.. అది..!!!,
అని.. సులువుగా ఒక గంటలో ఐపోయే పనికి కూడా.. సోదిచెప్పుకుంటూ....
టైమ్ పాస్.. చేస్తూ...!!!, దొంగచూపులు చూస్తున్న బాస్ కి పనిచేస్తున్నట్లు బోల్తాకొట్టిస్తే.. 
పడి పోయే బాస్ లు కూడా... ఈ కేటగిరీకే చెందుతారులేండి..

యునో.. దిస్ ఈజ్.. వెరీ గుడ్ రెస్టరెంట్.. అండ్ కాఫీ షాప్..., 
ఐ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్... అంటూ...
నార్మల్ ఇంగ్లీష్ కు... పాష్ పాలిస్ పెట్టి మాట్లాడుతూ... 
ఐదురూపాయల టీకి ఐదొందలు చార్జ్ చేస్తే....

వావ్... గ్రేట్ టీ.. యార్.. ఇట్స్ టూ కాస్ట్లీ.. టూ.., 
ధట్స్ వై ఐ లైక్ ఇట్... అని... బిల్లుకట్టే.. వాళ్ళూ...

వర్క్ ఫ్రమ్ హోమ్... రోజుకు ఒకగంట పనిచేయండి చాలు.. 
మేము ఇచ్చింది టైపుచేసి మాకు పంపడమే...!!
అన్న యాడ్ చూసి.. ఎవరికీ తెలియకుండా... దానికి డబ్బులు కట్టి..., 
వాడి పంపిన పనికిరాని డాటాను.. మళ్ళీ మళ్ళీ టైప్ చేసి... తిరిగిపంపి...
 
ఈ రోజు వస్తుంది చెక్కు.. రేపువస్తుంది చెక్కు.. అని ఎదురుచూస్తూ..., 
ఏంట్రా.. ఆలోచిస్తున్నావ్.. అంటే.. అబ్బే ఏంలేదురా!!, 
అని ఈలోకానికి వచ్చి... తడబాటును కవర్ చేసేవాళ్ళూ!!

ఎందుకు బాస్ ఈ ఇంటర్వూ కష్టాలు..? ఒక టూ (లాక్స్ )కట్టు..., 
బ్యాక్ డోర్ ఓపనింగ్స్ ఉన్నాయి!!!, జస్ట్ నువ్వు ఎగ్జామ్ రాయి... 
పేపరు ముందురోజే నీకిస్తా...!!, అని వెనుక గేటు (బ్యాక్ డోర్) నుండి...
పెద్ద కంపెనీలోకి తీసుకెళ్ళి... ఎగ్జామ్ పెడితే...!, 

నిజమేరోయ్... మనకిచ్చిన పేపరే అంతా...!!!, అనుకుని భట్టీపట్టి...
గుర్తుపెట్టుకున్న ఎబిసిడి సిరీస్.. ఐదునిముషాల్లో... రాసేసి... కాలర్ 
ఎగరేసుకుంటూ బయటకొచ్చేసి.. ఎదురుగా ఉన్న ఇరానీ కేఫ్ లో వెయిట్ చేస్తున్నవాడి 
చేతిలో రెండు లక్షలు పెట్టి..., తరువాత రోజు ముందుగేటు నుండి... వెళ్ళి అడిగితే.. 
ఆ పేరుగలవాళ్ళు ఎవరూ లేరు బాబూ???, అన్న సెక్యూరిటీ గార్డు మాటలకు 
పట్టిన చెమటలను... తుడుచుకుంటూ..., 
"వెనుక గేటు ఐ మీన్ బ్యాక్ డోర్ దగ్గరుంటారేమో చూడుబాబూ"... 
అంటే..., "బ్యాక్ డోర్లో ఎందుకుంటాడయ్యా??, అతనేమన్నా దొంగనా?",
అని సెక్యూరిటీ అంటే..!!

అయ్ బాబోయ్ వాడు దొంగా??, అయితే మరి నా రొండు లక్షలూ????..., 
"అమ్మనీ!!!,... రెండు జిరాక్స్ పేపర్లూ..., రెండు కప్పుల ఇరానీ టీ ఖర్చుతో... 
నా రెండు లక్షలూ కొట్టేసాడ్రోయ్", అని మనసులోనే కుమిలిపోయేవాళ్ళూ...

ఊళ్ళో వాళ్ళు... "నువ్వు అచ్చు హీరోలా ఉంటావ్ రా", అని చెప్పి..., 
టీలకు టిఫిన్లకూ డబ్బులకోసం నెత్తిమీద చేతులు పెడుతుంటే..., తెలుసుకోలేక!!, 
పదివేలు కట్టి ఏక్టింగ్ నేర్చుకోండి.. చిరంజీవి పక్కన నటించే అవకాశం 
చేజిక్కించుకోండి అన్న యాడ్ పేపర్లో చదివి..., ఎవరికీ చెప్పకుండా పారిపోయి,
 
టిక్కెట్టు కొనే స్తోమత ఉన్నా!!, గొప్ప గొప్పోళ్ళంతా టికెట్ కొనకుండానే రైలెక్కి.. 
పారిపోయి సినిమా యాక్టర్లయ్యారన్న సెంటిమెంటుని గుర్తుపెట్టుకుని,
టికెట్ కొనకుండా జనరల్ బోగీలో రైలెక్కి..., అదే టికెట్టుకొనని విషయం... 
తన మొదటి సినిమా 350 రోజుల ఫంక్షన్లో చెబుతున్నట్లు... ఊహించుకునే 
సమయంలో TC వచ్చి ఫైన్ వేసి... ఊహల్లోనుండి బయటకులాగినా
బెదరక, హైదరాబాద్ చేరుకుని.. యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి...,

తన కళ్ళముందే... మామూలు చిరంజీవి కాస్తా, డాక్టర్...!!, పద్మభూషణ్...!!, 
ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వ్వవస్ధాపకుడు అయ్యి... సినిమాలకు నేను 
గుడ్ బై అని చెబుతున్నా సరే..., 

"లేదయ్యా!!, మీడియా ముందు అలానే చెబుతారు..., నిన్ననే నేను 
ఫోన్ చేస్తే.. చెప్పిండు కదా!!, నెక్ట్డ్స్ సినిమా... దత్తుగారితో 
ఒప్పుకున్నాడంట.. అందులో తమ్ముడి కేరెక్టరు నీదే..., 

"కంగారుపడతావేంటి... ఇంకొక పదివేలు రేపు తీసుకురా!!, వాళ్ళకు ఎడ్వాన్స్ 
ఇవ్వాలే..." అని చెబుతున్న స్కూలు డైరెక్టర్ మాటలు ఇంకా నమ్మి.. డబ్బులు కట్టే.. 
వాళ్ళూ.. కడుతూ ఉండే వాళ్ళూ...., 

వాళ్ళకి... కేరెక్టర్ ఇవ్వలేంకానీ... కనీసం ఈ వెబ్ సైట్లో స్పెషల్ కేటగిరీ ఇద్దాం...

ఇంటర్నెట్ సెంటర్లో.., సార్.. నా క్రెడిట్ కార్డు.. పనిచేయటంలేదు.. ఒక్కసారి మీదిస్తారా??, 
ఇవిగోండి డబ్బులు ఇచ్చేస్తా... అర్జంటుగా... టికెట్ బుక్ చెయ్యాలి సార్.. అనగానే... 
అడగటమే పాపం అన్నట్లు.. నెంబరు చెప్పేసి, పాస్వార్డ్ కూడా అతనిచేతే.. టైపుచేయించి.., 
చూసారా??, నాదెలా పనిచేసిందో.. అందుకే.. ఈ కార్డుకు మారిపోండి... నేనూ అది వాడి వాడి 
విసుగుపుట్టి ఇది తీసుకున్నా..., అని స్టైలుగా డాబుకొట్టాకా...

సార్.. ఇప్పుడే చిల్లరమార్చి వస్తా... ఒకనిముషం వెయిట్ చేయండి..అని అతను.. 
పది నిముషాల తరువాత.. వచ్చి... పదిరూపాయలు.. ఎక్కువ ఇచ్చి.. పర్లేదు సార్... 
ఉంచండి.. అని బలవంతపెడితే.. తీసుకుని... ఆనందపడిపోయి...
పాపం మంచోడే... అనుకుని సరిపెట్టుకుని....., వారంరోజుల తరువాత వచ్చిన 
క్రెడిట్ కార్డు బిల్లు అక్షరాలా 50వేలు అని చదివి.. షాక్ తిన్నవాళ్ళూ...

చూపించాల్సిన క్రైమ్ అంతా చూపించేసి..., ఆఖరున ప్రేక్షకులకు... మంచి 
చేస్తున్నామనిపించేలా... "అందుకే మరి దురాశ దు:ఖానికి చేటు అంటారు పెద్దలు", 
అని మంచి కంక్లూజన్ ఇచ్చేసి... గుడ్ నైట్ అని చెబుతుంటే.., పెద్దలకు మాత్రమే అన్న 
సర్టిఫికెట్ ఏదీ లేని మన తెలుగు టీవి న్యూస్ చానల్స్ అన్నీ పిల్లలతో కూడా కలిసి కూర్చుని 
చూస్తూ... అవును నిజమే... అని... నోరువదిలేసి.. తరువాత రోజు ఎపిసోడ్ కోసం 
పిల్లలతో కలిసి.. కూర్చుని... ఎదురుచూసే.. ప్రేక్షక జనాలను

ఆ బాబా ఈ బాబా... ఆ స్వామి ఈ స్వామి అని.. టీవిలో వాళ్ళిచ్చే ప్రసంగాలు అన్నీ 
వినేసి...భక్తి పారవశ్యంతో ఊగిపోతూ, ఆయన ఫొటోకి దండ వెయ్యటమే కాదు... 
ఆ కార్యక్రమం వస్తున్నంతసేపు టీవీకి దండవేసి దండం పెట్టి.. హారతులిచ్చేవాళ్ళూ లేకపోలేదు...

సతీసమేతంగా... ఒకరు.., ఇస్త్రీ కూడా నలగని.. మంచి బట్టలుకట్టుకుని... మరొకరు..., 
కాస్ట్లీగా.. కనిపిస్తూ.. ఎక్కడపడితే.. అక్కడ కాస్ట్లీ హోర్డింగులపై ఏడ్స్ వేసుకుంటూ... 
మరొకరు..., తెల్లజుట్టుకు నల్లరంగు వేసుకుని... చక్కగా మేకప్ చేసుకుని..., నేనే ఈ 
లోకానికి వచ్చిన కొత్త అవతారాన్ని.., అని మరొకరు.. ఇలా ఎవరు వస్తే వాళ్ళకే.. 
స్వామీజీలని.. ఫలానా మతం మాది.. అని... పట్ట్టంగట్టి... క్యూలు కడుతుంటే... 
అదే చనువుగా... బాబాలుగా, స్వాములుగా.. చలామణీ అవుతూ... ఆదాయం 
సమకూర్చుకుంటుంటే..,అవి.. సమకూరుస్తూ.. 
పూజిస్తూ తరిస్తున్న... భక్తుల చలవేకదా!!, అందుకే వీళ్ళకొక కొత్త కేటగిరీ ఇద్దాం...

మూడొందల షర్ట్ ను.. మూడువేలు పెట్టి కొనుక్కొని బ్రాండెడ్.. అని మురిసిపోయేవాళ్ళు..

జలుబు అని డాక్టరుదగ్గరకెలితే..., ఏదో.. కొత్త వైరెల్ ఇన్ఫెక్షన్ అని... మొత్తం టెస్టులన్నీ 
చేయించేస్తూ..., డాక్టర్... ఎదో.. కొత్త హాస్పిటల్ కట్టే పనిలో, కొత్త ఫర్నిచర్ ఎంతలో కొనాలో... 
తనముందే ఎవడితోనో ఫోన్లో... ఎందుకు మాట్లాడుతున్నాడో..., అర్ధంకాక..., మధ్యలో 
అడ్డుపడిమరీ... సార్ సీరియస్ అయితే.. ఇంకా అవి చేయించండి సార్.., ఇవి చేయించండి 
అని డాక్టర్ కే సలహాలిచ్చేవాళ్ళూ...

అబ్బో...!!!,ఇలా చెప్పుకుంటూ.. పోతే.. ఈ కధకు శుభం కార్డు పడుదు... 
అందుకే వాళ్ళనే రిజిష్టర్ చేసుకోనిద్దాం..

వెబ్ సైట్ వివలాలు...

www.bakra.com, Please register Its Freeeeeeeeeeee....

మొదటి... పదివేల రిజిష్ట్రేన్లకూ... ఆడవాళ్ళైతే.. ఒక పట్టు చీర... మగవాళ్ళైతే...
ఒక మొబైల్ పోన్ ఉచితం.. త్వరపడండి... 

గమనిక: మీరూ ఈ పై ఏదో ఒక కేటగిరీలోకి వస్తే రిజిష్టర్ చేసుకోవచ్చును..., 
లేదా మీ ఫ్రండ్సుని రిజిష్టర్ చేయించవచ్చును..

--------------------------------------------------------------

ఒకొక్కసారి.. ఎంతటి తెలివైన వాళ్ళకైనా తెలియక మోసపోవటం... సహజం.
తెలిసి మోసపోవటం..., కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకోవటం... మూర్ఖత్వం...

జనాలలో ఉన్న వీక్నెస్ లు ఉన్నంత కాలం ఇలాంటి మోసాలు పెరుగుతూనే ఉంటాయి...
వీక్ మైండ్ ని ఎటువంటి మోసపు...ఆలోచనైనా సులువుగా దెబ్బతీస్తుంది...

A strong Mind can never be destroyed by any weapon.


19 కామెంట్‌లు:

సిరిసిరిమువ్వ చెప్పారు...

బాగా చెప్పారు. జనాలలో కష్టపడకుండా కోట్లు సంపాదించాలనే అత్యాశ ఉన్నంతకాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.

అవునూ word verification అవసరం ఉందంటారా?

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇలాంటివి ఎన్ని చదివినా రాబోయే కాలంలో కూడా ఇలాంటివారు ఎందరో కనిపిస్తూనేవుంటారు

krishna rao jallipalli చెప్పారు...

టపా అదిరింది. ప్రస్తుతం జరుగుతున్నా మోసాలు కళ్ళకి కట్టినట్లు చెప్పారు. PITY.. ఏమిటంటే.. పేపర్లలో, టి వి ల్లో అందరూ ఇటువంటి మోసాలు గురించి చదువుతుంటారు వింటుంటారు.. కాని మోసాల భారిన పడుతుంటారు. నిజ్జం గా వీళ్ళంతా మూర్ఖులు, వెధవాయిలు .. ప్రతిరోజూ బాబాల మోసాలు చదువుతారు. కాని... చదివినవారు కూడా, విద్యావంతులు కూడా Q లు కడతారు. అన్ని వదిలాక బావురు మంటారు. మరల కొన్ని రోజుల తరువాత .. మళ్లి మామూలే. ఎవరైనా ఈ బాబాల మోసాల గురించి విడమర్చి చెప్పినా.. వినరు.. పైగా ఎదురు దాడి.. బూతులు. మనం మోసపోతున్నకొద్దీ .. ఈ నా కొడుకులు, బాబాల వేషాలు, యాగాలు, యజ్ఞాలూ, శాంతులు, వీళ్ళ దినం, తద్దినం అంటూ బురిడి కోట్టిస్తుంటారు, బిందెలో బంగారం పెట్టి పూజలు చేస్తీ రెట్టింపు అవుతాయి అని ఒక కాషాయ బట్టలు కట్టుకొని, గడ్డం పెంచి చెప్తీ ఆ నా కొడుకిని ఇట్టే నమ్మేస్తారు. . ఒక కొజ్జా నాకొడుకు, ఒక బ్లాకు టిక్కట్లు అమ్మే నాకొడుకు, ఒక కబ్జా నాకొడుకు, ఒక బ్రోకర్ నా కోడుకు, ఒక డాఫర్ నాకొడుకు ఈ రోజు బాబాల్లాగా ఆంధ్ర దేశం లో వెలిగి పోతున్నారు.. ఇక CHAIN SCHEMES .. వీటిలో మనం చేరి .. మన స్నేహితులను, చుట్టాలను, తెలిసినవారిని చేరుస్తాం.. కమిషన్ దండుకుంటాము.. ఈ మనకి వచ్చే కమిషన్ డబ్బులు .. మన వారివే అనే విషయం మరువకూడదు. అంటీ మనం మనవారినే మోసం చేస్తున్నాము... చేసి... ఈ స్కేములు నడిపే నా కొడుకులను పోషించుతున్నాము. మీ టపా చూసి కొంతమంది అయినా బుద్ది, జ్ఞానం తెచ్చు కొంటారని అనుకుంటున్నారా .. NO NO.. అసంబవం... వరుణ యాగాలు చేస్తీ వర్షాలు పడుతాయి, అగ్ని యాగాలు చేస్తే ఇల్లు తగలబడతాయి.. అని ఇంకా జనాలు నమ్ముతుంటే
... ఎంతైనా మనం ఆశహులం కదా.. ఒక్కరు మారినా సంతషమే.. పండగే.

సూర్యుడు చెప్పారు...

చాలా బాగుంది

Shiva Bandaru చెప్పారు...

బాగుంది

Bolloju Baba చెప్పారు...

దేవర అనంతం గారి టపా రేంజు లో అదిరిపోయింది.

ఈ లిస్టుకు లాటరీ తగిలిందని చెప్పే మైల్శ్ గురించి కూడా కలుపుకోవాలి
బొల్లొజుబబa

Raj చెప్పారు...

బాగుంది

అజ్ఞాత చెప్పారు...

చాలా చాలా బాగుంది.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Very good post. Please remove word verification to get more comments.

To remove word verification, logon to the blogger and go to "Settings" tab then click on Comments sub tab then select No for the question "Show word verification for comments? "

Purnima చెప్పారు...

Boy.. now that is some serious coverage. Did you leave any kind of such fellows behind.

Loved it! Looking forward for more posts.

I wish tht more than those junk forwards, write-ups like these should appear in our inboxes petty often.

Thanks!
Purnima

Unknown చెప్పారు...

aaa fwd mails tho chachhipotuntaaam andiii
manam fliends lo okaliki vachhindoo chaaalu ika manam chachhame
aa vachhe vaatini shift del chesukuntoo koorchovaaali
oka velaa leply chesaame anukondi
inka meeda padataaaru chooodandii ammmmmmmmmmo

asalu chain mails start chese vallani kottaaali
alaanti vallandariki mee post mail cheyyalani vundi ha h ha ha ha ha

nice posttt :):):):)

అజ్ఞాత చెప్పారు...

>> A strong Mind can never be destroyed by any weapon.

What if its a battle between two strong minds???:p

That's what happening boss!!! Its just merely the brilliance of the culprits winning over the victims....

--Vamsi

ప్రతాప్ చెప్పారు...

అత్యాశ తీరనంత కాలం ఇలాంటి మోసగాళ్ళ వల్ల మోసబోని వారుండరు. దురదృష్టం ఏమిటంటే ఇలాంటి వాళ్ళు "ఎక్కడ పోగొట్టుకొన్నామో అక్కడే వెతుక్కోవాలి" అని మళ్లీ మళ్లీ మోసపోవడం.

RG చెప్పారు...

This might help to get disillusioned about e-mail superstitions

http://www.enidhi.net/2006/07/email-superstition.html

Dileep.M చెప్పారు...

బాగుంది. ఆలోచించేలా ..

అజ్ఞాత చెప్పారు...

నేను వీటిల్లో ఏకేటగిరీలో రానండీ. (బట్టలు మాత్రం) బ్రాండెడ్‌వే కొంటా. కుట్టించుకొనే ఓపికలేక (అదో పెద్ద ప్రోసెస్ కదా) కుట్టినవాటిల్లో బ్రాండులేనివాటితో రిస్కు తీసుకోలేకా...

ఈ బ్యాక్ డోరు ఉద్యోగాల బాధితులు నా సర్కిల్‌లో చాలా మందే వున్నారు.

Welcome back...
చాలా రోజుల తర్వాత... మంచి టపా. Go On...

Unknown చెప్పారు...

హహ...
నిజమే. ఇలాంటి చెత్త ఫార్వర్డులు మనకు రోజులో ఎన్నో.

అన్నట్టు మీ వెబ్‌సైటులో నేను చేర్పించాల్సిన వెధవలు చాలా మందే ఉన్నారు.

Unknown చెప్పారు...

Super....maalli form loki vachharu....naaku telisi naa friends andaru (including me) edo oka category lo khachhitam gaa untam...monne maa vadu edo gold chain business lo money katti..vaadu tapa ethesthey..10K loss ayyadu....intaki aa bakara.com open chesina bakra meerena?

చైతన్య చెప్పారు...

baagundi mee Post... alanti janalani roju entho mandini chusthuntaam...
alanti fwd mails enno vasthuntayi...
janalalo edo oka weekness unnantha kalam ee mosalu jarugutune untaayi...

Happy new year!

Related Posts Plugin for WordPress, Blogger...