20, జూన్ 2009, శనివారం

నాన్నమ్మ...ఇంటికి.. ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుతూ ఉంటా."అమ్మా.. మామ ఎలా ఉందే!!",
అని., మామ అంటె మా నాన్నమ్మ..., ఏడుగురు సంతానం మా నానమ్మకి...
నలుగురు మగవాళ్ళు.. ముగ్గురు ఆడపిల్లలూ... అంతా మాఊరిలోనే ఉంటారు...,
మాదొక అరవై కుటుంబాలుండే ఒక చిన్నఊరు... అందులో సగం మా నానమ్మ
కుటుంబం వాళ్ళే కాబట్టి... ఊరంతా మా చుట్టాలే... మా నాన్నగారు మా నానమ్మకి
ఆఖరు సంతానం... నాకు తెలిసినప్పుడు నుండి నానమ్మ మాతొనే ఉంటుంది.
నానమ్మకి మా నాన్న, అమ్మఅంటే.. చాలా ఇష్టం... నేనంటే ఇంకా ఇష్టం..

నా చిన్నప్పటినుండి నన్ను బాగా చూసుకునేది. అమ్మకొట్టినా.. తిట్టినా అడ్డొచ్చి
గారాభంచేసేది, ఇప్పుడంటే వందేళ్ళు దాటిపోయి ఒంగిపోయింది.. పనులేమి
చెయ్యటంలేదు.. కానీ...నా చిన్నప్పుడైతే బోలెడు పనులు చేసేది...
పొద్దున్నే ఆరింటికల్లా అరుగు చివర ఒక పీటవేసుకుని...మజ్జిగ చిలకడం మొదలుపెట్టేది...
నేను నా చిన్నపీట వేసుకుని కూర్చుని... చూస్తూ ఉండేవాడిని..."నెనూ చిలుకుతా",
అని చేతిలోంచి లాక్కుని ప్రయత్నించేవాడిని కానీ.. నాకు కుదిరేది కాదు...,
మజ్జిగ చిలకగా వచ్చిన వెన్నను ముద్దగా చేసి నాకు తినిపించేది..

నాకు వెన్నంటే ఇష్టమేకానీ ఎందుకో తినను.. అని మారాం చేసేవాడిని...
చేతికి అంటిన వెన్నను.. కాళ్ళకు చేతులుకూ బలవంతంగా రాసేది...,
మా నాన్నమ్మచేసే పనులన్నిటినీ దగ్గరగా పరిక్షించేవాడిని..., ప్రశ్నలువేసి
తినేసేవాడిని... ఏమడిగినా విసుక్కోకుండా... చాలా ఓపికగా వివరించి చెప్పేది..,
ఉగాది పండుగ వస్తే వేపకొమ్మలనుండి వేపపువ్వుకోయ్యటం...,
దీపావళికి దీపాలలో వేసేందుకు ఒత్తులు చెయ్యటం...,

ఆడపిల్లలందరికీ గోరింటాకు రుబ్బి.. పంచిపెట్టడం, గోంగూర కాడలకు ఒత్తులు కట్టి
వెలిగించడంలాంటి పద్దతులన్నీ ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యలో అందరికీ
వివరంగా చెప్పేది... అంతేకాదు...మా ఊరందరికీ మానాన్నమ్మ అంటే చాలా గౌరవం.
ఊళ్ళో ఎవరికి పిల్లలు పుట్టినా మామ్మ దగ్గరకు తీసుకొచ్చి చూపించి వెళ్ళేవారు...,
దీవించమని అడిగేవారు... దిష్టి తగలకుండా తలవెంట్రుకలతో చేసిన తాడు..
స్వయంగా దగ్గరుండి చేయించుకుని కట్టి, పిల్లల్ని తీసుకెళ్ళేవారు...

వేసవికాలం వస్తే..., మా చుట్టాలంతా... ఆవకాయ పెట్టే పనుల్లో మునిగిపోయేవారు...
మాకు సెలవులు కావడంతో మేం పరిక్షగా ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తుండే వాళ్ళం...

అక్కడ మా నాన్నమ్మే, ఆవకాయలో... ఏ వస్తువు ఎంత కలపాలో.., ఎలా కలపాలో
దగ్గరుండి చేసేది..., మొత్తం చుట్టాలందరికీ ఆవకాయ పెట్టడం అయ్యేసరికి...
మాకు మా నానమ్మకి ఒక పదిహేనురోజులు కాలయాపన సరిపోయేది...

ఇప్పుడు పరిస్ధితి వేరు...,
మనవలు... మునిమనవలు.. మనవరాళ్ళు అందరి పెళ్ళిళ్ళూ..
చూసిన కళ్ళు కనిపించడం మానేసాయి..., పదిమంది పనులలో వెన్నుదన్నుగా ఉన్న
నానమ్మ... ఒంగిపోయి..నడవలేక మంచానపడింది... వయసుతో పాటు చాదస్తం,
భయం వచ్చాయి...

ఎవరన్నా ఏదైనా తినటానికి పెడితే పొట్లాలు కట్టి దాచిపెడుతుంది...
మా అక్క,అన్నయ్య వాళ్ళ పిల్లలొస్తే..., ప్రక్కన కూర్చోబెట్టుకుని...
దాచిన పొట్లాలుతీసి పెడుతుంది..., ఆ వీధివిషయాలు.. ఈ వీధి విషయాలు
అడుగుతుంది..., వాళ్ళెలా ఉన్నారు.. వీళ్ళేంచేస్తున్నారు...
అని చాదస్తంగా నాలుగైదుసార్లు అడిగేసరికి... పిల్లలు... "ఈ ముసలిదానికి
చెప్పలేక చస్తున్నాం... బుర్రతినేస్తుంది...", అని అంటే..., వాళ్ళ మద్దుమాటలకు
నవ్వేస్తుంది..., కోపమొస్తే... "వెళ్ళు అవతలికి... చెప్తే అరిగిపోతావా!",
అని మాట్లాడటం మానేస్తుంది...

అది చూస్తే నాకు అనిపించేది... మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు..
అడిగే ప్రశ్నలకు పెద్దవాళ్ళు ఓపికగా... సమాధానాలు చెబుతారు..
వయసు పైబడ్డాకా వాళ్ళు చిన్నవాళ్ళయ్యి...,అడిగే ప్రశ్నలకు...
పిల్లలేకాదు..., పెద్దలకే... విసుగుపుట్టిస్తాయి అని...,

వయసు పెరిగి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినవాళ్ళు చిన్నపిల్లలే అవుతారు...
వాళ్ళచేష్టలు.., అలవాట్లు... భయాలు అన్నీ చిన్నపిల్లలకంటే...
ఎక్కువగా అనిపిస్తాయి...

నేను చదువు పూర్తిచేసి.. ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాననుకుంట...
ఒక పదిరోజులు ఇంటికి వెళ్ళాను... కాసేపు అవి ఇవి అడిగింది నానమ్మ...
చెప్పాను ఇలా ఉంటుంది అక్కడ.. నలుగురు కలిసి ఉంటాం..
వంటచేసుకుని తింటాం... అని.., "జాగ్రత్తమ్మా... రాత్రిళ్ళు...
తలుపులు అవి గడియపెట్టుకోవాలి.. దొంగలు అవి వస్తారంట అక్కడ...
టీవీలో చెప్తుంటాడు..", అని అంది.. నేను మనసులో నవ్వుకుని..
"మేం జాగ్రత్తగానే ఉంటాం మామా.. నువ్వేం కంగారుపడకు... నలుగురం క
లిసే ఉంటాం కదా!!, పర్వాలేదు..", అని చెప్పాను...,

మరి నీకు డబ్బులు అవి నాన్న పంపిస్తున్నాడా!, సరిపోతున్నాయా?,
ఒక వందరూపాయలు సరిపోవమ్మా నెలకు??", అని అడిగింది...,
నేను నవ్వుకుని.. "వంద ఎక్కడ సరిపోతాయే... ఒక పదిహేనువందలు దాకా
అవుతాయి నెలకు", అన్నాను...

అమ్మో..., పదిహేనొందలే...!, అవునులే.. రేట్లు అన్ని పెరిగిపోయాయి
కదా..., అయినా పర్లేదు..., కావాలంటే నాన్నను అడుగు...,
నాన్న అప్పుచేసైనా ఇస్తాడు..., ఉద్యోగం కోసం తప్పదు మరి..., తిండి సరిగా తిను...,
ఆరోగ్యం పాడవుతుంది లేకపోతే...", అని సలహా చెప్పింది..., సరే అన్నాను...

అలా మాట్లాడుతూ... అలవాటు ప్రకారం... ఏడింటికే నిద్రపోయింది...,
నాకూ నిద్రపట్టేసింది..., పదకొండు అయ్యిందనుకుంట.. నన్ను ఎవరో
తట్టిలేపుతున్నట్లు అనిపించి లేచాను..., నానమ్మ నాపక్కగా వచ్చి కూర్చుంది...,
ఒరే... నన్ను చంపేస్తావా??, అని అమాయకంగా అడిగింది..
నిద్రలో ఉన్ననాకు ఆ మాటలు సరిగా అర్ధంకాలేదు... ఏంటే.. అని మళ్ళీ అడిగాను..

నన్ను చంపేయకురా..., మీ నాన్న దగ్గర ఉంటూ... భరువైపోయానురా...,
నీ డబ్బులు తింటూ ఉన్నాను..., నన్ను మీ నాన్న చూస్తున్నందుకు నన్ను చంపేస్తావా!,
అని అమాయకంగా అడిగింది..

నాకు మాటలు రాలేదు.. చాలా బాధకలిగింది... ఏంటి ఇలా ఆలోచిస్తుంది అని...,
ఆమె.. అమాయకత్వాన్ని అర్ధంచేసుకున్నాను...

ఏమీ లేదు మామా... , నువ్వంటే నాకూ ఇష్టమేనే... మా నాన్న బాధ్యతగా నిన్ను
చూస్తున్నారు.. నేనేమి నా డబ్బులతోనిన్ను పోషించడంలేదు కదా!,
అలా ఎందుకు అనుకుంటున్నావు..?, నువ్వు ఎవ్వరికీ భరువుకాదే...,
నీకేదికావాలన్నా అడిగి తిను..., ఎవరూ నిన్ను చూడకపోవటం ఉండదు...,
అలా ఏమీ అనుకోకు... పడుకో.. అని సర్దిచెప్పాను...,మళ్ళీ చిన్నపిల్లలకు సర్దిచెబితే...
చెప్పినమాట వని పడుకున్నట్లు... వెళ్ళి పడుకుంది...

తరువాత రోజు మా అమ్మకు ఈ విషయం చెప్పాను... అవిడ అంతే ఈ మధ్య
ఎదేదో మాట్లాడుతున్నారు.. నువ్వవి పట్టించుకుని ఏమీ అనుకోకు...
నన్ను అలానే అంటున్నారు..., అని ఆరోజు కాస్తవివరంగా ఇద్దరం
మా నానమ్మకి చెప్పాం... అలాంటి అలోచనలు ఏమీ పెట్టుకోకూడదు...,
ఈ వయసులో.. ఏమీ అలోచించకుండా... చక్కగా దేవుణ్ని తలచుకుంటూ...
ప్రార్ధనచేసుకుంటూ,అన్నీ మరచిపోవాలని.. సరే అంది నానమ్మ...


అత్తా కోడళ్ళంటే.. ఇలానే ఉంటారు... పైకొకటి.. లోపలొకటి... మాట్లాడుతూ,
ఎప్పడూ తిట్టుకుంటూ...ఒకరినొకరు.. ధ్వేషించుకుంటూ ఉంటారు..
అనేది నేను సినిమాల్లోనూ, కధల్లోనూ, బయటకూడా చాలా చూసాను...

మా ఇంట్లో మా అమ్మా.. నానమ్మా... అలాకాదు..., ఒక తల్లీ కూతుల్లా ఉంటారు...
మా అమ్మ ఎప్పుడు మా నానమ్మని గౌరవించేది.. ఆమె మాట వినేది...,
మా నానమ్మకూడా అంతే.. ఎప్పుడూ సాధించేది కాదు... అత్తగారిని నేను చెప్పినట్లు వినాలి
అని అన్నట్లు ప్రవర్తించేది కాదు... , మంచాన పడిన తరువాత కూడా...
మా నానమ్మ చాదస్తం చూసి.. సెలవులకో.. కాళీదొరికినపుడో...
ఊరికి వెళ్ళేవాడిని నాకే.. కాస్త విసుగు పుట్టేది... పోనీలే ఆవిడను ఏమీ అనకు
అని.. మా అమ్మ నాకు చెప్పేది...

మా చిన్నప్పుడు ఎవరినైనా.. నువ్వు అని పిలిస్తే... తప్పు అలా పిలవకూడదు
పెద్దవాళ్ళను.. మీరు అనాలి, అని మా అమ్మచెప్పేది... అలానే నేర్పించింది...,
తరువాత... అందరినీ మీరు అని పిలవటమే నాకు అలవాటయ్యింది...,
మా నాన్నమ్మను అమ్మ గౌరవంగా చూడబట్టే నాకూ పెద్దలను గౌరవించాలి అనే విషయం
బోధపడి ఉంటుంది..., ఇవన్నీ మనకు మనం చేసుకుంటేనే...
మనకూ అలానే జరుగుతుంది!, నేనైనా రేపు అంతే... నా తల్లిదండ్రులను బాగా
చూసుకుంటేనే... నా పిల్లలు కూడా నన్ను చూసేది...?

నాకు ఉద్యోగం లేక... డబ్బులులేని టైములో... నా చేతికి వందో
రెండొందలో ఇచ్చి నానమ్మకు ఇవ్వమనేది... మా అమ్మ, అది చూసి నానమ్మ పొంగిపోయేది...
మా మనవడు నాకు డబ్బులిచ్చాడు అని అదరికీ చెప్పుకునేది...,

అలానే నాకు తెలియకుండా కూడా మా అమ్మ బట్టలు కొని నేను కొన్నట్లుగా
ఇచ్చేది నానమ్మకి... అపుడు అర్ధంఅయ్యేది... వాళ్ళకున్నఅన్యోన్యత...,
మా నాన్నకూడా అంతే... మాకు ఎంత చేసినా... ఆరోగ్యాలు ఎలాగూ నీలా అవ్వవులే...
నీ అరోగ్యం, నీ ఆయుష్షు మంచివి..., అని మా నానమ్మకు ఆరోగ్య విషయంలో
చాలా జాగ్రత్తగా చూసుకున్నారు...

కనిపించడం మానేసిన కళ్ళు.. సూన్యంలో కలిసిపోయాయి...
అందరి బాగోగులు తెలుసుకుంటూ...,అందరి బాగు కోరుకుంటూనే...,
ఎవరికీ భారం కాకుండా... ఎవరిచేత మాట పడకుండా...,
కల్ముషమెరుగని మనసుతో.. ఎలాగైతే... పుట్టిందో.. ఆఖరి క్షణాలలో...
మరలా.. చిన్నపిల్లగా మారి... అలానే ఆనందంగా... నానమ్మ వెళ్ళిపోయింది...

మాలో చిరకాలం ఉండిపోయేలా..., మంచి బుద్దులనూ,సంస్కారాలను... నేర్పి..
మాలో.. అవి తీయని జ్ఞాపకాలుగా విడిచిపెట్టింది...

ఎటువంటివారికైనా తప్పనిది... వృద్దాప్యం... మిగతా జీవితంమంతా ఎంత దర్జాగా...,
ఎంత హొదాతో...అడుగులకు మడుగులెత్తించుకుని.. ఎలా బ్రతికామన్నదానికన్నా..
చివరిక్షణాలలో ఏ బాధలూ తెలియకుండా నా అన్నవాళ్ళ నలుగురి చేతులమీదుగా...
ఆనందంగా వెళ్ళిపోతే.. దానికన్నా జీవితానికి ఇంకేంకావాలి?

నానమ్మలు.. అమ్మమ్మలు.. తాతయ్యలూ... వీళ్ళంతా ఒకప్పుడు మనలాంటివాళ్ళే...
పాతతరపు పద్దతులూ..., మంచిచెడులను.. మన రాబోయే తరాలకు పరిచయంచేస్తూ...,
మన వెన్నంటే ఉంటూ.. మనమేలుకోరే... గురువులు...

వాళ్ళు మనకెప్పుడు భారం కారు..., కాకూడదు...!!

12 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

ఎంత బాగా రాసావ్.. అనుకోకుండానే నా కళ్ళు చెమర్చాయి..మీ నాన్నమ్మ తో మాట్లాడినట్టే వుంది

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా బాగా వ్రాసారు. మా నాయనమ్మ, మా అమ్మ కూడా ఇలానే ఉండేవారు. నాకు వాళ్లే కళ్లముందు కనిపించారు.

అజ్ఞాత చెప్పారు...

మిరు వ్రాసినది చాలా బాగుంది.మా ఇంట్లో మా అమ్మగారు తన తొంభై అయిదో ఏట స్వర్గస్థులయ్యారు. ఆఖరి నాలుగు సంవత్సరాలూ, మా దగ్గరే గడిపారు. మా అబ్బాయి కి కూడా వాళ్ళ
మామ్మ గారంటే మీలాగే ఉండేవాడు. మీరు వ్రాసినది చదువుతూంటే, ఆ రోజులే జ్ఞాపకం వచ్చాయి.

పరిమళం చెప్పారు...

మీ నాన్నమ్మ గారి తో మీ అనుభవాలు చాలా బాగా రాశారు .పశ్చిమ గోదావరిలోనే మా చాగల్లు(నేను వాడ్ని అలాగే పిలుస్తానులెండి ) ఉన్నాడు వాడూ వాళ్ల నాన్నమ్మని మామా అనే అంటాడు . పెద్దలు నేర్పిన సంస్కారం నిలబెట్టుకోనేవారు అరుదుగా ఉంటారు .మీరు అభినందనీయులు .

Rajesh చెప్పారు...

Raju.., Superb.., nenu maa nanammani photo loo chodadam tappa real gaa choodaledu.., Kani nee post chadivina taruvaatha.. oka teliyani feeling vachindi. . Very gud one..keep it up..

Chandra చెప్పారు...

Srinivas Raju Garu.
Telugu logilla gurimchi, patha kalapu padhathulu gurinchi chaala baaga rasaaru.. Nanamma gurinchina rasina ee prachurana naaku chaala baaga nachindhi.
Anthe kaakundaa, induloni telugu chaduvuthunte kammaga vundhi.
Thank you.

Usha చెప్పారు...

శ్రీనివాస్
శుభ సాయంత్రం :)

మీ నాన్నమ్మ పోస్ట్ చదివా చిన్న సలహా తప్పుగా అనుకోకపోతే
మీరు ఇలాంటి మంచి విషయాలను తెలుగు లోనే కాకుండా ఇంగ్లీష్ లో కుడా ఐ మీన్ 2 లాంగ్వేజెస్ లోను రాస్తే
తెలుగు లో చదవటం రానివాళ్ళు కూడా చదవటానికి వీలు గా ఉంటుంది ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో కుడా పెద్దవాళ్ళను ఎంత గా ప్రేమ తో చూడాలో
తెలుస్తుంది అనిపిస్తుంది ఈరోజుల్లో కాస్త తెలుగు చదవటం రానివాళ్ళు ఎక్కువయ్యారు కదా :)
అంటే నా ఉద్దేశ్యం కొంతమంది కి నిజంగానే ఇష్టం ఉండదు తెలుగు చదవటం వొచ్చు అని చెప్పుకోవడం
ఇంకొంత మంది అసలు తెలుగు వాళ్ళం అని చెప్పుకోడానికే ఇష్టపడరు ఇంకా తెలుగు అంటే చాలా అసహ్యంగా కుడా ఆలోచిస్తారు తెలుగు వాళ్ళు అయ్యుండి
ఏమంటారు నిజమేనా ?
బట్ కొంతమంది కి ఇష్టం ఉన్నా చిన్నప్పుడు నార్త్ లో పెరిగిన పిల్లలకు తెలుగు సబ్జెక్ట్ స్కూల్ లో ఉండక
చదవలేక పోయిన
వాళ్ళుంటారు కదా
అలాంటి వాళ్లకి ఇలాంటి సందేసాత్మకమైన పోస్ట్ లు చదవాలని ఉండొచ్చు ఏమో కదా చదవలేక బాధ పడొచ్చు అని నా ఉద్దేశ్యము కనుక ఒక్కసారి ఆలోచించండి
తెలుగు మీడియం లో చదివిన మాలాంటి వాళ్ళమే ఈ సొసైటి లో ఇంగ్లీషు ముక్కలకి అలవాటు పడిపోయాము అందుకే మద్యలో చాలా ఇంగ్లీష్ పదాలు వోచ్చేయి దయచేసి ఏమి అనుకోవద్దు
మీరు చాలా రోజులయినట్టుంది బ్లాగు చూడక కొత్త పోస్ట్ లు కనిపించలేదు అందుకే అడిగా

వుంటా

ఉష :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఉషగారు
మీరన్నదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను..
ఎందుకంటే.. నార్త్ సైడు లేక ఇతరప్రాంతాల్లో చదివినవాళ్ళ గురించి వదిలేయండి.. నాకు తెలిసినవాళ్ళలోనే చాలా మంది తెలుగు చదవటంరానివారున్నారు..

నాకు మొట్టమొదట తెలుగులో రాయాలనిపించినప్పుడు నా కొలీగ్స్ కి నేను బ్లాగులు రాస్తాను అంటే.. ఎదీ ఒకటి చదివి వినిపించు అని అడిగారు. తెలుగు మరి. మీకు అర్ధంకాదు.. అని ఇంగ్లీషులో మార్చి వ్రాసి వాళ్ళకు పంపించడం జరిగింది.., వాళ్ళకు ఒకమాదిరిగా అది నచ్చింది.. కానీ.. నాకు వున్న ఇంగ్లీషు జ్ఞానం తక్కువండీ.. విషయాన్ని చెప్పగలనుగానీ తెలుగులోవున్నంత అందంగా వర్ణించి రాయలేను అని నేను తెలుసుకున్నాను, అందుకే ఆ ప్రయత్నం ఎప్పుడూ చేయలేదండీ..

మీరన్నది నేను ఇలాంటి అందరికీ ఉపయోగపడతాయనుకున్న వాటికి అన్వయించుకుంటె.. అవి ప్రయత్నిస్తాను ఇంగ్లీషులో రాయటానికి.. ఎందుకంటే అందులో విషయమేగా ముఖ్యం వర్ణనకన్నా..

మీ చక్కటి సలహాకు ధన్యవాదములు..

USHA చెప్పారు...

Helo Srinu gdm :)

nenu eng.lo raaste baaguntundi ante eng. language ani kaadu ila eng.typing lo telugu matter ne type chesi pedithe baavuntundi ani ardham ayyindi anukuntaa :)

USHA

Unknown చెప్పారు...

Hi Raju,wonderful, really i had tears in my eyes.Nanamma....i like very much.i had taste of Nanamma's love in my life same as what u said in Nanamma.i went to few years back in my life with Nanamma.i have no words..... to send.its great.

Unknown చెప్పారు...

Hi Raju,wonderful, really i had tears in my eyes.Nanamma....i like very much.i had taste of Nanamma's love in my life same as what u said in Nanamma.i went to few years back in my life with Nanamma.i have no words..... to send.its great.

శ్రీనివాసరాజు చెప్పారు...

@లక్ష్మిగారు
నాన్నమ్మ టపా నచ్చినందుకు చాలా సంతోషం. ఈ టపాకు ఎవరు కామెంటిచ్చినా మళ్ళీ ఒక్కసారి చదువుకుంటాను.. అదే జ్ఞాపకాలలోకి ఒకసారి వెళ్ళొస్తుంటాను.

కామెంటుకు ధన్యవాదములు.

Related Posts Plugin for WordPress, Blogger...