23, ఫిబ్రవరి 2010, మంగళవారం

వైధ్యోనారాయణో 'హరీ:'..!!ఆ వారమంతా చాలా వర్కు వచ్చింది.. తల తిప్పలేనంత పని...,
"వీకెండ్ ఇక ఎక్కడికీ వెళ్ళేది లేదు...", అనుకుని ఇంట్లోనే పడకేసి..
చక్కగా టీవిలో సినిమాలు చూస్తున్నాను.. ఎపుడూలేనిది..
సడెన్ గా నడుంనొప్పి..రావటం మొదలుపెట్టింది...,
"అబ్బా.. ఏంటీ నొప్పి...", అని కాసేపు బాధపడి తరువాత
పట్టించుకోవటం మానేసాను..., రెండురోజులు అలా టైమ్ పాస్
చేసేసాను...

నొప్పి.. అటుతిరిగి ఇటు తిరిగి... రకరకాల అవతారాలెత్తింది...
నడుం నొప్పి కాస్తా... కడుపునొప్పిగా అనిపించసాగింది...,
ఆఫీసులో ఎవరికి చెప్పినా.. ఇది.. "IT నొప్పే ..IT నొప్పే..",
అనటం మొదలుపెట్టారు..
"ఇదెక్కడి కొత్త నొప్పిరా బాబూ ఎప్పుడూ వినలేదు", అనుకుంటే...,
అప్పుడు వాళ్ళు చేసిన ఎగతాళి అర్ధమైంది...

మంచినీళ్ళు ఎక్కువత్రాగాలి..., అయిదునిమిషాలకొకసారి.. లేచి నడవాలి...,
మషాళా, నూనె వస్తువులు తగ్గించి తినాలి, ఎక్షర్సైజ్ చెయ్యాలి లాంటి...
జనాలు ఇచ్చిన మంచి సలహాల దగ్గర్నుండి...

తూర్పువైపుకు తిరిగి పడుకోవాలి, తూరుపు తిరిగి దణ్ణం పెట్టాలి...,
ముక్కుమూసుకుని... గాలి పీల్చాలి..., నొప్పి వచ్చినప్పుడు..
ఆఫీసైనా ఇళ్ళైనా పట్టించుకోకుండా గట్టిగా నవ్వాలి..
క్రింద పడి.. దొర్లాలి.. లాంటి చావు సలహాలవరకూ
పాటించడం మొదలుపెట్టాను...

మళ్ళీ ఊపిరితీసుకోలేని వర్కు రావటంతో నొప్పి మర్చిపోయాను...
తరువాత వారం ఆఫీసు పనిమీద చెన్నై వెళ్ళాల్సొచ్చింది..
అసలే ఒక్కడినే ఉండాలి... ఈ నొప్పి ఎక్కువైతే ఎవరూ చూసేవాళ్ళుండరు
అని ముందు భయం వేసినా, తరువాత తప్పక వెళ్ళాళ్సొచ్చింది.
ఎక్కడో గాలివార్తలాగా కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఇలానే నొప్పిరావచ్చు
అని తెలిసింది..., అంతే అప్పట్నుండి, అసలు చిన్నగా ఉన్న నొప్పి కాస్త
అనుమానం నొప్పిలా పెద్దగా మారి... బుర్రలోనో కడుపులోను తిరగసాగింది.

చెన్నై ప్రయాణం త్వరత్వరగా ముగించుకుని... హైద్రాబాద్ వచ్చి పడ్డాను...
"కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది", అని అడిగిన మా ఆవిడ మాటలకి
ఏదో ఉందిలే అన్న సమాధానం చెప్పగలిగానంతే.. వెంటనే రడీ అయ్యి ఆఫీసు
మానేసి హాస్పటల్ కి పరుగుతీసాను. అల్ రెడీ మా కొలీగ్స్ హాస్పిటల్స్ పై కాస్త
రీసెర్చ్ చేసి స్టడీ చేసారు...వాళ్ళ సలహా మేరకు అమీర్ పేటలోని మైత్రీవనం
దగ్గర్లో ఉన్న ఒక పేరుమోసిన హాస్పిటల్ కి వెళ్ళాను...

చూడగానే మంచి కార్పొరేట్ ఆఫీస్ లా ఉంది.. రిషెప్షన్ లో వివరాలు రాసుకుని...
రెండొందలు.. తీసుకుని... గ్రీన్ ఆపిల్ లోగోతో..., కార్పోరేట్.. బ్రోచర్ లాగా..
పెద్ద ఫైలులాంటి కార్ట్ ఒకటి ఇచ్చారు..., "అబ్బా భలే ఉంది బ్రోచర్...
కలర్స్ బాగున్నాయి ఎక్కడచేయించుంటాడో...", అని ఎడ్రసు వెతకబోతూ..
"ఎంతయ్యింటుందో అడిగేస్తే పోలా", అనుకుని అడగబోతూ..
"ఓహో..!, నేను హాస్పిటల్ కి వచ్చిన ఫేషెంటును కదూ!!",
అనుకుని క్యాసువల్ వార్డుకు వెళ్ళమని రిషెప్షనిస్టు చెప్పగా... అటువైపుగా
అడుగులువేసాను.

క్యాసువల్ వార్డ్ లో ఉన్న డాక్టరు Fresh గా, smart గా కనిపించాడు...
Fresher అయ్యుంటాడులే అనుకున్నాను , "ఏంటండీ మీ ప్రాబ్లమ్",
అని.. టెన్సన్ పడుతూ అడిగాడు.., నొప్పిసంగతి మొత్తం జరిగిన కధంతా...
చెప్పాను.... బెడ్ పై పడుకోమని.. ఊపిరి పీల్చి వదులుతూ ఉండమని..
వెన్నుపై నొక్కుతూ, పరీక్ష చేసాడు..., నొప్పి ఏమీ లేదని చెప్పాను,
"సరే..!, Ortho దగ్గరకు వెళ్ళండి", అని ఎదో రాసిచ్చాడు..
"అదేంటి.. Ortho ఎందుకు..?, నాకు వచ్చింది ఎదో Gastric trouble
లాగా ఉంది.." అన్నాను.. "అదే సార్ ఆయన చూసి చెప్తారు." అని
గాంభీర్యం ప్రదర్శించి చెప్పాడు. "సరేలే", అని Ortho Cabin దగ్గర
వెయిట్ చేసాను.

అరగంట వెయిట్ చెసాకా బెల్ కొట్టి పిలిచారు డాక్టరు సారు...
పేషెంటు ఎవరూ బయటకు రాలేదు..,"ఈ అరగంట ఈయన లోపల ఏం
చేసాడు...??", అని చూస్తే అప్పుడే మాట్లాడి పెట్టిన ఫోనును.. చూస్కుంటూ...
ప్రక్కన ఉన్న స్టెతోస్కోప్ ని... మెడలో వేసుకుని... "కూర్చోండి!,", అని
ఆహ్వానం పలికారు.. "ఓహో.. ఈయనకు కేసులు లేవన్నమాట...
అందుకే ఇక్కడికి పంపారు..", అని మనసులో అనుకున్నా.

"ఏంటి ప్రోబ్లమ్.!", అని అడిగారు జరిగిన కధ అని వేసి... మొత్తం కధంతా
కాస్త బ్లాకండ్ వైట్లో... టీవి సీరియల్ లో చూపించినట్లు...
బాధలన్నీ ఏకరువు పెట్టి కధంతా చూపించాను...
"ఏం చేస్తుంటారు..", అని అడిగారు.. సారుగారు...
"(బ్రహ్మీ) సాఫ్వేర్ ఇంజనీరు..", అని చెప్పాను.. (నాకేం తెలుసు వృత్తి అడగటం
డయాగ్నసిస్ లో భాగం అనుకుని చెప్పాను.) "సరే అయితే", అని...
నాలుగైదురకాల టెస్టులు రాసేసారు పేపరుపై.., ఇంకా ఏం రాయాలా అని
అలోచిస్తుండగా.. ఫోన్ మోగింది.. "హలో!!, సరే..., ఎవరు తక్కువ కోట్
చేస్తున్నారు?, ఒకే..! క్వాలిటీ ఎలా ఉంటుంది?, హా.. సరే..! అయితే.. తీసేస్కో..
ఆ ఇంటీరియర్స్ విషయం కనుక్కున్నావా?, త్వరగా కావాలి మనకు...
మళ్ళీ కనుక్కున్నాకా చెప్పు...", అని.. ఎవేవో మాట్లాడుతున్నారు..,
నానొప్పి బెంగలో ఉన్నానేమో నాకేం సరిగా అర్ధంకాలేదు.
"part time civil contractor ఎమోలే", అని.. అనుకున్నాను...

ఫోన్ మాట్లాడటం అయిపోయాకా... "సరే ఈ టెస్టులు చేయించుకుని రండి...
చూద్దాం...", అన్నారు.. "పర్వాలేదంటారా??", అని అమాయకపు మొహం
పెట్టి అడిగాను... కనీసం అలా అయినా మెడలో ఉన్న స్టెతోస్కోపుతో చూసైనా
చెప్తాడేమోనని.. "టెస్టులు చేయించుకున్నాకా చెప్పగలమమ్మా ఏంటీ అనేది...",
అని చెప్పారు..., మళ్ళీ సారుగారి..పోన్ మోగింది..., అది వింటూనే నేను రెసెప్సెన్
వైపు నడిచాను..., అక్కడ పేమెంట్ చేసి... "డయగ్నాసిస్ కి వెళ్ళండి..", అంది
రిసెప్సనిస్ట్...
prescription కౌంటరులో చూపించి... "ఎంత!", అని అడిగాను...
"మొత్తం అయిదువేలు అవుతుంది సార్..", అన్నాడు..
"ఏంటీ అయిదువేలా??", అని ఆశ్చర్యపోయాను...
"అవునండీ... ఈ టెస్టుకింత.. ఈ టెస్టుకింత...", అని.. వివరంగా రాసిచ్చాడు..
"అదేంటి.. ఈ టెస్టుకు రెండువేలా?.. ఏంటిది??", అని అడిగాను... ఇది..
urinary infection diagnosis test సార్.. అన్నాడు..
"అదేంటయ్యా.. stethoscope కూడా పెట్టి.. చూడకుండా.., నా చేయి కూడా
పట్టుకుని చెక్ చెయ్యకుండా ఇవేం టెస్టులు..", అని కాస్త సీరియస్ గా అడిగా...

"అంతే సార్.. హాస్పిటల్ కి మంచి బట్టలు వేసుకొస్తే.., మమ్మల్నడిగితే మేమేం
చెబుతాం..", అన్నాడు వెటకారంగా..., ఒక్కసారి నన్ను నేను పైనుండి క్రిందకు...
చూసుకున్నాను...
"సరేలే.. ఆ రెండువేలవి అవి వద్దుకానీ.. ఇందులో రాసిఉన్న ultrasound
చేయించుకుంటాలే..", అని దానికే బిల్ చెయ్యమని చెప్పాను...
ultrasound report వచ్చేవరకూ... రిలీజయిన ప్రోజెక్టుకు
ఏం ఫీడ్ బ్యాక్ వస్తుందో అని టెన్సన్ పడినట్టు.., రిపోర్ట్ లో అన్నీ నార్మల్
అన్నట్లుగా చదివి.. కాస్త చెమటలు తుడుచుకున్నాను...,
"మరి ఏదీ లేకపోతే... ఈ నొప్పేంటబ్బా", అని మరలా అనుమానంతో...
ఆ రిపోర్ట్ తీసుకుని... డాక్టరు సారుగారి దగ్గరకు వెళ్ళాను..
"పేపర్లన్నీ తిరగేసి.. అదేంటి..!, మిగతా రిపోర్టులేవి..?", అని అడిగారు...
"ఇంకా చేయించలేదండి.. ఇదే చేయించాను ముందు.. అవన్నీ మరీ costly గా
ఉన్నాయి, నాకసలే... Mediclaim Card కూడాలేదు..", అని డైరెక్టుగా చెప్పాను..
కాస్త డైట్ కంట్రోల్ చెయ్యండి.. spicyfoods.. oilyfoods తినడం తగ్గించండి",
అని... చెప్పి, ఇంకా ఎవో రాయాలి అన్నట్లు అలోచిస్తుండగా.. బాయ్ వచ్చి..
"సార్.. ఎవరో మిమ్మల్ని కలవాలంట", అని బిజినెస్ కార్టు చూపించాడు..,
లోపలికి పంపించమని చెప్పారు సారుగారు...

ఎవడో laptop bag లాగా మెడలో వేసుకొచ్చి నాప్రక్కనున్న సీటులో కూర్చున్నాడు...,
ఎవో మెడిసిన్ సేంపుల్స్ చూపించాడు.. ఎదో కొటేషన్ కాగితం కూడా చూపించాడు...
అది చూసి... "నేను కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం... అది ఒక టూ మంత్స్ లో
అయిపోవచ్చు... అది నా ఓన్... అక్కడకూడా మీరే ఇవ్వాలి..", అని సైన్ చేసి తిరిగిచ్చి...
పంపేసాడు.. అప్పుడు అర్ధం అయ్యింది.. ఈయన పార్టైమ్ సివిల్ ఇంనీరు కాదని...
"భలే కనిపెట్టేసానోచ్..!", అని.. కాస్త ఆనందపడ్డాను మనసులో...

మళ్ళీ నారిపోర్ట్ చూసి... "కనీసం ఇవి చేయించండి..", అని ఏవేవో మళ్ళీ రాసిచ్చారు...
(మళ్ళా...చేయి పట్టుకోకుండా.. స్టెతోస్కోపు పెట్టకుండా... ), టెస్టులకు కావాల్సిన
బ్లడ్ సాంపుల్స్ ఇచ్చాను.., చేతికి చిన్న ఇంజక్షన్ ఒకటి.. చేసి..మార్కర్ తో ఒక
సర్కిల్ గీసి... అది తడవకుండా.. ఒక రోజు ఉంచమని చెప్పింది.. నర్స్....,
తరువాత.. రాసిచ్చిన మెడిసిన్స్ కొనుక్కుని ఇంటికి బయలుదేరాను...

అప్పటివరకూ ఒంట్లో బాగాలేదని.. ఎవరికీ తెలినివ్వకుండా దాచాను..
ఇలా వెర్రి వెర్రి టెస్టులు చేస్తుంటే భయం వేసి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను..
ఆయనకు మెడికల్ గా కాస్త తెలియటంతో.. అలా చేతికి వేసి సర్కిల్ చేసేది..
T.B లాంటి ఇన్ఫెక్షన్స్ చెక్ చెయ్యటానికి చేస్తారు... "నీకు కడుపులో నొప్పి అయితే
చెయ్యటం ఏంటి..", అన్నారు.. "ఏమో మరి.. చూద్దాం..", అనుకుని తరువాత రోజు
కూడా పొద్దున్నే బయలుదేరాను రిపోర్ట్ తీసుకోవటానికి..., అవి తీసుకుని మళ్ళీ
సారుగారికి చూపించాను.. అన్నీ నార్మలే...

"ఎంటోమరి ఇంకా చూడాలి.. రాసిచ్చిన ట్యాబ్లట్సే.. వాడి..తరువాత కనపడండి...
అప్పటికీ తగ్గక పోతే.. ఫర్దర్ డయాగ్నసిస్ చేద్దాం", అన్నారు...
"అబ్బా బాగానే వదిలేసారు.. అంటే.. ఏమీ లేదన్నమాటే..", అని.. బయటకొచ్చి..
"ఇప్పటివరకూ ఎంతయ్యిందీ", అని పార్కింగ్ ఏరియాలో నిలబడి.. బండి తీస్తూ
లెక్కపెట్టాను... మొత్తం... మూడున్నరవేలు లెక్కకు వచ్చింది..

డాక్టరు నాకోసం ఎంత సమయం వెచ్చించాడో... (ఫోన్లో సొంత హాస్పిటల్ బేరాలు
తీసివేయగా..) చూస్తే... సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రోజెక్ట్ లీడ్ కన్నా
భారీగా ఉంది సంపాదన.. "హమ్మో... ఇలా అయితే... డాక్టరు చదివినా
బాగుండేదేమో?", అనిపించింది.

రోజులు గడిచాయి.. నొప్పి కాస్త తగ్గింది.., దాని.. గురించి అలోచించడం మానేసాను.
కానీ ఖర్చయిన మూడున్నరవేలు ఇంకా మర్చిపోలేకపోయాను...

ఇంటికి వెళ్ళినప్పుడు.. మా ఊరిలో ఫ్యామిలీ డాక్టరుకు.. ఒకసారి... పెద్ద పెద్ద రిపోర్టులు
చూపించాను.. ఆయన అవి చూసి నవ్వి...., "కొద్దిగా గ్యాస్క్టిక్ ప్రోబ్బమ్ వచ్చింది...
మెడిసిన్స్ అన్నీ మానెయ్... తిండి టైముకు తిని.. డైట్ కంట్రోల్ చెయ్యి...", అని..
చెప్పారు..., "ఇలా ఎక్కడ పడితే అక్కడ చూపించుకోవద్దు... ప్రతీదీ... బిజినెస్ చేసి..
డాక్టర్ వృత్తికే.. చెడ్డపేరు తెస్తున్నారు...", అని నవ్వి ఊరుకున్నారు... తరువాత...
నొప్పి పూర్తిగా తగ్గిపోయింది...కాస్త మనసు కుదుటపడింది...

ఒక సామాన్య మానవుడుకి రోగానికే... ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంటే..
ఇక.. బ్రతికేదేలా? డాక్టర్ వృత్తి.. ఒక వ్యాపారం కావడం చాలా సిగ్గుచేటు...,
ఈ రోజుల్లో మనిషిని చూసి... స్టెతస్కోపుతో పరీక్షచేసి రోగమేమిటో చెప్పే డాక్టర్లు
ఎంతమంది ఉన్నారంటారు?, సిజేరియన్ కాకుండా.. నార్మల్ డెలివరీ వచ్చేలా
చేసే డాక్టర్లు.. ఎంతమంది ఉన్నారంటారు?, ఇలా లెక్కెస్తే...
నూటికి ఒక పదిమంది ఉంటారేమో...
మిగిలిన ఆ తొంబైమందీ!!, వీళ్ళంతా డోనేషన్లు కట్టి డాక్టరుపట్టా
సంపాదించినవారే!

మనం కూడా ఇచ్చిన ప్రతి టెస్టు చేయించుకోనక్కరలేదు..., ఇంటర్నెట్లో
దీనిపై చాలా సమాచారం ఉంది..., గూగుల్ ద్వారా వెతికి.. ఏ టెస్టు
దేనికోసం చేస్తారు.. దాని నార్మల్ వ్యాల్యూస్ ఎంత అని తెలుసుకోవచ్చు.
అలాంటివాటిలో ఇవి కొన్ని...
http://www.wrongdiagnosis.com
http://www.labtestsonline.org
http://www.medicallabtests.com
http://www.ecureme.com/index.asp

బడా కార్పొరేట్... హాస్పిటల్ లోగోలు చూసి వెళ్ళేకన్నా..., చిన్నతెలుసున్న
డాక్టరుసలహాను పాటించడం మంచిది.., హాస్పిటల్ కి వెళ్ళగానే.. మీ వృత్తి..,
మీ దర్జా.. దర్పం.. మీదగ్గరున్న మెడిక్లైమ్ కార్టు చూపించేకన్నా..
ముందు మీకు ఉన్న సమస్యలను వివరించడం మంచిది...

కొన్ని తప్పులు చేస్తే.. నరహంతక పాపం చుట్టుకుంటుంది అంటుంటారు..
మరి ఇలా జబ్బులతో భయపెట్టి... డబ్బులు దండుకుంటూ..
నరహంతంకమే చేస్తున్న డాక్టర్లకు...
ఏపాపం చుట్టుకుంటుందంటారు?

-----------------------------------------
ఎప్పడో రాసిపెట్టుకున్న టపా ఇది.. ఇప్పటికి పోస్టు చెయ్యగలిగాను.

17 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మీరు చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజమండీ! ఈ విషయం అందరికీ ఎప్పటికి అర్థం అవుతుందో! ఎన్ని టెస్ట్ లు చేయించుకుంటే అంత గొప్ప అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారంటే నమ్ముతారా? ఎలాగూ క్లైమ్ చేసుకోవచ్చు కదా అనే దృక్పధం తో ఇలాంటి డాక్టర్లను పరోక్షంగా ప్రోత్సహిసున్నారు. ఇదొక విష వలయం.

అజ్ఞాత చెప్పారు...

ఓ సారి పూణే లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ కి కూడా వెళ్ళి, పోస్ట్ ని అప్డేట్ చెయ్యి బాబూ !

శ్రీనివాసరాజు చెప్పారు...

@మందాకిని గారు
అవునండి.. అలా ప్రోత్సహించబట్టే వీళ్ళిలా తయారయ్యారు. మిగతావారికి/సామాన్యుడికి చాలా ఇబ్బంది కలుగుతుందన్న విషయం ఎవరూ పట్టించుకోవటంలేదు.

మీ కామెంటుకు ధన్యవాదములు..

@ఫణిబాబు గారు
ఆయ్.. అలాగేనండి.. మాటిమాటికి బుట్టలో పడతామనుకున్నారా?, మేం ప.గో.జిల్లావాళ్ళమండీ..

మీ కామెంటుకు ధన్యవాదములు :)

సుజాత వేల్పూరి చెప్పారు...

మైత్రీ వనం దగ్గర్లో ఉన్న పేరు మోసిన హాస్పటల్ కి వెళ్ళారా? అయితే మీ పర్సుకు బాగా "డామేజ్" జరిగి ఉండాలే!

ఇక్కడ పది వేలయ్యేది కాస్తా ..వూరికెళ్ళి మన చిన్నప్పుడు ఇంట్లో అందరికీ అన్ని రోగాలకీ మందిచ్చే
కేవలం MBBS) డాక్టరుంటాడే, ఆయనకు చూపిస్తే రెండొందల్తో తేలిపోతుంది.

Ravi చెప్పారు...

నేనుండేది హైదరాబాదులో అయినా ఏదైనా అనారోగ్యం వస్తే మా స్వంత ఊరు శ్రీకాళహస్తిలో అనుభవమున్న MBBS వైద్యుణ్ణి సంప్రదిస్తున్నాను. మీ లాంటి వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు వినడం ద్వారానే ఇది సాధ్యమైంది సుమా..

శ్రీనివాసరాజు చెప్పారు...

@సుజాత గారు, ఇనగంటి రవిచంద్ర గారు

కొంతమందికి చెప్పేవాళ్ళుంటారు.. దానినిబట్టి నేర్చుకుంటారు.. కొంతమందికి చెప్పేవారు లేక ఏదైనా అనుభవంలోకొస్తేనే కానీ తెలియదు.(మరికొంతమంది చెప్పినా వినిపించుకోరు.. వారు వేరే కేటగిరీలేండి..)

ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరమేకానీ, చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుని భయపడిపోకుండా.., అత్యవసర పరిస్తితులలో తప్ప ఏ డాక్టరుకి పడితే ఆ డాక్టరుకి చూపించకూడదు.. అనే విషయం గ్రహిస్తే చాలు.

మీ కామెంటుకు ధన్యవాదములు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

దొపిడీ దొంగలు తెల్ల కోటు వేసుకొని, మెడలో స్టెతస్కోపు వేసుకొన్న వాళ్ళు చాలా మంది డక్టర్లుగా చెలామణి అవుతున్నారండీ!వాళ్ళ చేతుల్లో పడితే డబ్బు సంగతి అటుంచి మటాషై పోగలరు.అందరూ జాగ్రత్త వహించాలి సుమండీ!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

దొపిడీ దొంగలు తెల్ల కోటు వేసుకొని, మెడలో స్టెతస్కోపు వేసుకొన్న వాళ్ళు చాలా మంది డక్టర్లుగా చెలామణి అవుతున్నారండీ!వాళ్ళ చేతుల్లో పడితే డబ్బు సంగతి అటుంచి మటాషై పోగలరు.అందరూ జాగ్రత్త వహించాలి సుమండీ!

Chari Dingari చెప్పారు...

kaani, meeku kidney stones anipistundi, urine report emochindi

శ్రీనివాసరాజు చెప్పారు...

@డా. నరహరి గారు
అది చేయించలేదు.. దానికే రెండువేలు అడిగింది.. :), అది చేయించి ఉంటే ఆ రెండువేలు కూడా పోయేవేమో.. ఎందుకో ఆలోచించి మంచి పనిచేసాను.

నాకేమీలేదు కానీ.. ఇది జరిగి ఒక సంవత్సరం అవుతుందిలేండి..

Thanks for your comment.

kvsv చెప్పారు...

యెమ్ మాట్లాడుతున్నారు మీరు ?సీజరియన్కాకుండా నార్మల్ డెలివరీ చేసే డాక్టర్లు కావాలా ?మీకు తెలుసా నార్మల్ అయియిపోతుందేమో అన్న గాభరాలో హడావిడిగా ఆపరేషన్ తేటర్ కు పేషెంట్ లను తరలించే డాక్టర్లు యెంతమంది వున్నారో??ఒక్కడంటే ఒక్క డాక్టర్ కూడా ఈ రోజు నిజాయితీ గా వున్నాడు అనే పరిస్థితి లేదు.....యన్ని టెస్ట్లు వ్రాద్దామా ?మెడికల్ షాప్కి యెంత యెక్కువ మందులు వ్రాసి యెంత యెక్కువ కమిషన్ కొట్టేద్దామా అన్న ఆలోచనే యెంతసేపు ...మన బొటి వాళ్ళ దగ్గర సరే వీళ్ళు పేదవాళ్లని కూడా వదలడం లేదు ...

శ్రీనివాసరాజు చెప్పారు...

@kvsv గారు
బాగా చెప్పారు.., లాస్ట్ మూమెంట్ వరకూ నార్మలే అవుతుంది అంటారు.. అలా అంటే అదే హాస్పిటల్ కి తీసుకెళతామని (అదొక బిజినెస్ టాక్టిక్స్), చివరికి వచ్చేసరికి ఏముంది.. బిడ్డ అడ్డంతిరిగేస్తుంది. సిజేరియన్ చెయ్యకపోతే ప్రమాదం..

ఇక ఆపరేషన్ అయ్యాకా.. డబ్బులు అన్నీ చేతిలో పడ్డాకా.. ఇక ఆ రూమ్ ఖాలీచేయించడం ఎలాగా.. వేరే పేషెంట్ రడీగా ఉన్నాడు అని ఆలోచన.., క్యూలో ఎవరూ లేకపోతే.. ఆపరేషన్ అయ్యాకా కనీసం పదిరోజులైనా రెస్టు అవసరం, లేకపోతే ఏం పర్వాలేదమ్మా.. రెండురోజుల్లో వెళ్ళిపోవచ్చు.. అని చెప్పడం.

ఇదండీ డాక్టర్ల వ్యవహారం..

మీ కామెంటుకు ధన్యవాదములు

మురళి చెప్పారు...

అచ్చంగా ఇలాంటిదే కాదు కానీ, నాకూ, నా మిత్రులకీ ఇలాంటివే అనుభవాలు ఉన్నాయండీ.. ఇదివరకు డాక్టర్లు పేషెంట్ ని చూడగానే 'మీ ప్రాబ్లం ఏమిటి?' అని అడిగేవాళ్ళు.. ఇప్పుడు 'మీ జాబ్ ఏమిటి?' అని అడుగుతున్నారు.. ఇదొక్కటీ చాలు కదండీ, వైద్యం ఎలా జరుగుతోందో తెలుసుకోడానికి..

అజ్ఞాత చెప్పారు...

ఇందులో మన తప్పూ సగం వుంటుందిలెండి ! మనం హాస్పిటల్ కి ఇచ్చిన విలువ డాక్టర్ కి ఇవ్వం . ఏదో సందులో చిన్న చిన్న ఇరుకు గదుల్లో వుండే హాస్పిటల్ కి వెళ్ళటానికి అసలు ఇష్టపడం ఆ డాక్టర్ కి ఎంత అనుభవం వున్నా సరే! ప్రతీ ఊర్లోనూ నిజాయితీగా వైధ్యం చేసే డాక్టర్ ఒక్కరైనా వుంటారు . కానీ వాళ్ళు మనకోసం కాదనీ , డబ్బులు ఎక్కువ ఖర్చు చెయలేని లేబర్ కోసమనీ మన అభిప్రాయం . సౌకర్యాలకు తగ్గట్టే ఫీజులూ వుంటాయిమరి . ఒకే సినిమాకి ధియేటర్ ని బట్టి టికెట్ ధర మారటంలేదూ

శ్రీనివాసరాజు చెప్పారు...

@మురళిగారు
బాగా చెప్పారు. అన్ని వృత్తుల్లోనూ విలువలు కొరవడ్డాయనే చెప్పాలి.

@లలిత గారు
నిజమేనండి..!, సగం కాదు.. సగంకంటే పైనే మనది తప్పు. మీరన్నట్లు మల్టీప్లెక్స్ ధియేటర్ లో సినిమాకి వెళ్ళి అయ్యో అదే సినిమా చూపించాడే.. కానీ టిక్కెట్టు నాలుగురెట్లు వసూలు చేసాడే అనుకోవటం లాంటిదే ఇది కూడా?

భావన చెప్పారు...

సరే మీరు ఇంతకే బాధ పడుతున్నారు. కో పెమెంట్ లు గా వందలు వందలు కట్టీ... ఇన్స్యూరెన్స్ లు కట్టి కట్టీ..... మళ్ళీ ఆఖరి లో ఇన్స్యూరెన్స్ వాడు ఆయ్ ఎవరినడిగి ఎళ్ళేవు ఈటన్నిటికి, ఈ పదివేలు (డాలర్ లేనండోయ్) కట్టూ అని శ్రీ ముఖం పంపించి వాడి మీద సామ దండో పాయాలు ప్రదర్శించి... మా బాధలేమి చెపుతారు. రోలొచ్చి మద్దెలతో చెప్పి నట్లు వుంది అంటారా.

శ్రీనివాసరాజు చెప్పారు...

@భావన గారు
అక్కడా తప్పలేదన్నమాట ఇబ్బందులు.. :)

Related Posts Plugin for WordPress, Blogger...