24, జులై 2010, శనివారం

రాకెట్ లాంచ్...


(పూర్తిగా సాఫ్ట్వేర్ కు సంభందించిన సాంకేతిక పదాలతో నిండిన టపా.. 
అర్ధంకాకపోతే నన్నేమడగొద్దుబాబోయ్..)

"అప్ లోడ్ ఫెయుల్యూర్", ని కూడా ఆటోమేట్ చెయ్యాలి అని ముందురోజు జరిగిన 
రాకెట్ మీటింగ్ లో డిస్కషన్ వల్ల ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు.. ఎలా చెయ్యాలబ్బా.. 
అని రాత్రంతా బుర్రబద్దలుకొట్టుకున్నాఒక్క ఆలోచనా రాలేదు. ఎపుడూలేనిది.. 
తరువాత రోజు తెల్లవారుఝామున పదింటికే లేచి.. ఆఫిసుకు బయలుదేరాను.. 
బయటకురాగానే.. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే.. "పొద్దుపొద్దున్నే లేచి ఇలా 
జనాలంతా ఎక్కడికి పోతార్రాబాబు", అని అనుకుంటూనే.. హెల్మెట్ పైనే బుర్రగోక్కుంటూ..  
నా టూవీలర్ ను ఆఫీసురూట్లోకి దూకించాను..  

ఇంకా నిన్నటి రాకెట్ డిష్కషన్ లో మాట్లాడుకున్నవిషయమే ఎలా చెయ్యాలబ్బా అని 
బుర్రలో ఇన్ఫైనేట్ లూప్లో పడి కొట్టుకున్న వైల్ లూప్ లాగా తిరిగి తిరిగి కొట్టుకుంటుంది.. 

అలా కొట్టుకుంటున్న వైల్ లూప్ ని, బ్రేక్ పాయింట్ పెట్టి డిబగ్ చేస్తూ.. బైక్ 
నడుపుతున్నానేమో..., రోడ్డ్ మీదున్న సిగ్నల్ కనబడనేలేదు.. కొత్త టెస్టర్ పొద్దెరగకుండా 
అక్కడా ఇక్కడా క్లిక్ చేసినట్టుగా.. చూసుకోకుండా సిగ్నల్ బ్రేక్ చేసేసి.., బైక్ ముందు బ్రేకు 
వెనకబ్రేకు నొక్కి.. సరిగ్గా.. నల్లకల్లద్దాలు పెట్టుకుని ఉగ్రస్వరూపంతో నిలబడివున్న 
ఆడకానిస్టేబుల్ ముందు ఆపి.. దొరికిపోయాను.. 

"లైసెన్సు తియ్", అందామె.. "నేను దాటింది సిగ్నల్ కదా.. లైసెన్సెందుకబ్బా", అనుకుంటూనే 
తీసి చూపించాను.. "ఇది డూప్లికేట్ కదా.. ఒరిజినల్ చూపించు.. లేకపోతే బండిక్కడపెట్టేసి 
వెళ్ళిపో", అని మరాఠీ ఫ్లేవర్ కలగలిపిన హిందీలో అందామె.., ఇదెక్కడ గోలరా అనుకని..
 "సారీ మేడమ్ ఏదో రాకెట్ టెన్సన్లో సిగ్నల్ బ్రేక్ చేసా", అని అందామనుకున్నా.. 
" రాకెట్..!! ఏంటి?", అని పోలీసోళ్ళ లాంగ్వేజిలే బై డిఫాల్ట్ గా వుండే ఫేక్ నోట్స్ రాకెట్, 
సెక్స్ రాకెట్ లాంటి రాకెట్లనుకుని అపార్ధంచేసుకుంటుందేమోనని.. భయంవేసింది.., 
నా దృష్టిలో రాకెట్ అంటే ఇది అని చెప్పడానికి మళ్ళీ ఓ పెద్ద డాక్యమెంటేషన్ చేసివ్వాలేమో.., 
ఆ గోలంతా ఎందుకులే", అని.. "ఫైనెంత", అన్నాను ఎంతుంది అన్నట్టు పైనుండి కిందకు
ఒక్కసారి చూసిందామె.., వంద తీచి చేతిలోపెట్టి, టి. ఆర్. ఎస్ జెండా రంగులోవున్న 
రశీదొకటి తీసుకుని.. మళ్ళా నా కోడ్ డీబగ్గ్ చేస్తూ ఆఫీసుకు బయలుదేరాను.

ఇంతకూ ఏదో ఆలోచన్లో పడి రాకెట్ అంటే ఎంటో చెప్పలేదు కదా.. అదే చెప్తా... 
చెవుల్లో దూదిలేదా.. దగ్గర్లో ఏది అందుబాటులోవుంటే అది పెట్టుకుని వినండి.. 

మేం చేస్తున్న కొత్తప్రోజెక్టులో.. రోజువారి లావాదేవీలు అన్నీ వేరే డాటాబేస్ లోకి మైగ్రేట్ 
చేసి.. వాటిమీద రిపోర్టింగ్ అప్లికేషను ఒకటి డిజైన్ చెయ్యాలి.. డాటాబేస్ అంటే ఏంటి అని
చాలా మందికి తెలియకపోవచ్చు.. ఒక చిన్న ఉదాహరణిచ్చి వివరించడానికి ప్రయత్నిస్తాను.. 
మన వంట గదిలో నెలకు సరిపడా కావలిసిన పచారి సరుకులు దాచుకోవటానికి 
ఉపయోగిస్తామే.. బీరువానో లేక షెల్ఫో అదే ఒక డాటాబేస్ లాంటిదన్నమాట.., ఈ 
డాటాబేస్ లో టేబుల్స్ అని వుంటాయి.. అంటే డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ 
లాంటివి కాదు.. ఆ షెల్ఫ్ లో వుండే కందిపప్పు డబ్బా ఒక టేబుల్.. ధనియాల డబ్బా 
ఒక టేబుల్.. అలా అన్నమాట.. రోజువారీ కూర వండటంకోసం ఆ టేబుల్ నుండి  కొంత, 
ఈ టేబుల్ నుండి కొంత తీసుకుంటుంటాం అదే ఒక ట్రాన్సాక్షన్.. (లావాదేవీ...), 
నెలాఖరున సరుకులు ఇన్సర్ట్ చేస్తాం, కొన్ని అప్ డేట్ చేస్తాం.. ఇలా చెప్పుకుంటూ 
పోతే డాటాబేస్ గురించి పెద్ద పుస్తకం రాయొచ్చు, దీనికంతంలేదు కాబట్టీ... ఇక్కడ డాటాబేస్ 
అంటే తెలిస్తే చాలు.. (ఇప్పుడు మొత్తం అర్ధమైపోతే.... ఇంతేనా సింపుల్ అని మా జాబ్స్ కి 
కాంపిటేషన్ వచ్చేస్తారంతా). 

ఇక మా ప్రోజెక్ట్ విషయానికొస్తే.. నేనిచ్చిన ఉదాహరణలాగే పచారిసరుకులు అక్కడివి 
ఇక్కడకు మెయ్యటమే కదా.. చిన్నదే అప్లికేషన్ అనుకుని... తాలింపు పెట్టని టమాటా 
పప్పులోకాలేసేసారు మా కంపెనీ వాళ్ళు.  టెండరువేసి పడ్డ పెద్దచేపను చూసి తెగ 
మురిసిపోయారు.. ఇక్కడవరకూ బాగానేవుంది.. "ఇంతకూ మీకేంకావాలి..", అని క్లైంట్ ని
అడిగినప్పటినుండి మొదలయ్యాయి మా సాఫ్ట్వేర్ కష్టాలు.. 

రోజువారి లావాదేవీలు జరిగే డాటాబేస్, అసలు పేరూవూరు లేని డాటాబేస్ అని, 
ఎవడో తలమాసినవాడు తయారుచేసి ప్రీగా ఇచ్చింది వాడుతున్నారు వాళ్ళని తేలింది..
సరే వాడారనుకుందాం.., డేటాబేస్ ఏదైనా కొన్ని స్టాండర్డ్స్ అన్నాఏడుస్తాయికదా.. 
ఏదొక డ్రైవర్ దొరుకుతుందిలే.. (డ్రైవర్ అంటే.. కారుడ్రైవర్.. బస్సుడ్రైవర్ కాదు.., ఎదన్నా 
సాఫ్వ్టేర్ వేరేదానితో ఇంటరాక్ట్ అవటానికి వాడే చిన్న సాఫ్వ్టేర్) ఎలాగోలాగా అందులో 
జరిగేవన్నీ రోజుకోసారి ఒక స్టేజింగ్ డాటాబేస్ లో (ఒక టెంపెరరీ డాటాబేస్) లోకి మైగ్రేట్ 
చేసేద్దాం.. తరువాత అక్కడ కావలిసిన మార్పులుచేర్పులు.. చేసేసి.. ఫైనల్ రిపోర్టింగ్ కోసం 
తయారుచేసుకున్న డాటాబేస్ లోకి చేసేద్దాం అంతే సింపుల్ అని.. ఒక రెండురోజులు 
ఎక్కడికీ కదలకుండా మీటింగ్ రూమ్లోనే కాలకృత్యాలు తీర్చుకుని.., ఒకడిబుర్ర ఒకడుగోక్కుని.. 
నెత్తిమీద మిగిలిన నాలుగువెంట్రుకలు రాలిపోయేదాకా  పెద్దప్లాను గీసుకున్నాం.. ఆ ప్లానుకు 
ఒక మంచి ముహూర్తంచూసి.., పసుపురాసి కుంకుంబొట్లుపెట్టి.. వివరించి క్లైంట్ కి.. 
హరికధా కాలక్షేపం డీటీయస్ లో వినిపిస్తే ఎలావుంటుందో అలా వినిపించాం.

అంతావిన్నాకా.. మొత్తం సీ షార్ప్ కోర్సంతా నేర్చేసుకుని.. ఇఫ్ స్టేట్మెంటంటే ఏంటని 
అడిగినట్టు.. "అంతా బాగానే వుంది.. మరి ఈ రెండు డేటాబేస్ లూ ఒకచోటవుండవనుకో.... 
ఒకటి అమెరికా.. వేరేది ఆముదాలవలస అనుకో ఏంటి పరిస్థితి అని అడిగాడు.. 
"ఐతే ఏముంది.. ఏదొక కనెక్షన్ వుంటుంది కదా కనీసం ఇంటర్నెట్ కనెక్షన్, దాంతో 
ఈ డాటాబేస్ నుండి ఆ డాటాబేస్ కి కనెక్ట్ అవటమే అంతే!!", అని కష్టమైన పజిల్ ని 
సింపుల్ గా సాల్వ్ చేసినట్టుగా.. చెప్పి సెబాష్ సెబాష్ అని మా మేనేజరు నేనూ.. 
ఒకరి భుజాలొకరు చరుచుకున్నాం.

"లేదు అలాంటిదేమీ వుండదన్నాడు.." క్లైంట్.., ఒక్కసారి షాక్ కొట్టిన బొంత కాకిలాగా 
కరెంటుతీగల మీదనుండి సలసలాకాలుతున్న తారు రోడ్డుమీద పడ్డట్టయ్యింది మా పరిస్థితి. 
"అసలు ఈ రెండు వేరువేరుచోట్లవుంటాయనీ తెలియదు.. పోనీ వున్నాచేసేద్దాం.. అనుకుంటే.. 
కనక్షనే వుండదా.. ఇదెక్కడ కొత్త ట్విస్ట్ రా నాయనా..!!, ఏ కనెక్షనూ లేకపోతే ఎలా..  
రోజువారి లావాదేవీలు ప్రింట్ తీసుకుని.. ఒక పెద్ద పద్దులు పుస్తకంలో రాయమంటాడా
ఏంటి..", అని ఫోన్ మ్యూట్ నొక్కి ఒకడితరువాతొకడు తలలు ఫోనుకేసి కొట్టుకున్నాం. 

"సరే ఇంటర్నెట్ లేదు అనుకున్నాం.. ఇక్కడ జరిగినవి అక్కడకి ఎలా వెళతాయి", అని 
అడిగాడు మా మేనేజరు.. "ఇంటర్నెట్ లేకపోతే ఎలా..?,  వుంటుంది, కానీ.. డాటాబేస్ కి 
కనెక్షన్ ఇవ్వం.. ఒక ఎఫ్. టీ. పి ఫోల్డర్ షేర్ చేస్తామంతే (ఇంటర్నెట్ ద్వారా షేర్ చెయ్యబడే 
ఒక ఫోల్డర్). ఇకదానికిమించి ఏమీ ఇవ్వం.. దీనికి ఎలా చేస్తారో ఆలోచించండి.." అని,
ఇంకొక్క ప్రశ్న అడిగారంటే.. ఒక్కొక్కడి తలా పుచ్చకాయల్లెక్క లేచిపోతాయి.. అని 
ఫ్యాక్షన్ మూవీలో హీరో డైలాగులా, తొడకొట్టి.. మొహంలోమొహం పెట్టి ఉమ్ములు పడేలా 
చెప్పేసాడు క్లైంట్..  సరేలే డాలర్లిస్తున్నాడుగా.. అని సర్దిచెప్పుకుని.. మొహంతుడుచుకుని..  
మళ్ళా మేమంతా అలోచనలో పడ్డాం.., తరువాత రోజు సాయత్రం కంపెనీ సీటివో  
(చీప్ టెక్నికల్ ఆఫీసర్ ;-) )తో విషయ విశ్లేషణా ఫోన్ కాల్ ఒకటి షెడ్యూల్ చేసుకుని.. 
మొత్తం కష్టాలు వివరించి చెప్పాం.., మనవాడే మనవాడే అని మీదెక్కించుకుంటే.. 
షర్టంతా తడిపి కంపుచేసాడన్నట్టుగా.. మా సీటివో మాకే ఎదురొచ్చాడు.

"అవును కష్టమర్ కి ఎలాకావాలో అలానే చెయ్యాలి.. ఇదే దానికి ఎలా చెస్తామో 
అలోచించండి అంటూనే, మీరు ఇది చెబుతుంటే నాకు చిన్నప్పుడు నిక్కర్లేసుకునే టైమ్ 
గుర్తొస్తుంది అన్నాడు.. "ఇదేంట్రాబాబూ.., క్లైంట్ వేసిన కుళ్ళుజోక్ కంపు భరించలేక 
ముక్కులుమూసుకుని పనిచేస్తుంటే.. నీకు నిక్కర్లటైము గుర్తుకురావటమేమిటీ!!..",  
అనుకునేంతలోనే అసలు విషయం చెప్పాడు.. 

ఇలాంటిదే ఒకప్పుడు మేం చేసాం.., అదిక్కడ వర్కవుట్ అవుతుంది అని నా నమ్మకం.. 
అది ఏంటంటే,  ఇక్కడ లావాదేవీలు ఒక ఫైల్ లాగా మార్చి ఆ ఫైల్ ని అక్కడున్న 
ఏఫ్. టీ. పి ఫోల్డర్ లోకి పంపించి.., అక్కడ ఆ ఫైలునుండి డాటాను డాటాబేస్ లోకి 
ఇంపోర్ట్ చేసేయ్యటమే.. సింపుల్ అని నాలుగుముక్కల్లో చెప్పేసి.. నాకు వేరేపనుంది 
ఇది ఆలోచించి ప్లాన్ డిజైన్ చేసి పంపండి అని తప్పించుకు పారిపోయాడు సి.టి.వో.

మా మేనేజరుకు ఇది నచ్చినా.. నాకూ... మా టీమ్ మేట్స్ కి నచ్చలేదు.., "ఫైల్స్ అంటేనే 
పాతపద్దతి..కదా!, అవి పంపించడం.. దాన్నుండి డాటాబేస్లోకి ఇంపోర్ట్ చేయటం అంటే 
చాలా యాతనతో కూడుకున్న పని, ఎన్నో కండీషన్స్ మనం సొంతంగా రాసి హేండిల్ 
చేయాలి.. అసలున్న టైమ్ లైన్స్ అంతంతమాత్రమే, ఆఖరిదాకా వచ్చాకా 
చేతులెత్తెయాల్సొస్తుంది మరి..",  అని మొహంమీద చెప్పేసాం.. "అవును నేను మీతో 
ఏకీభవిస్తాను.. కానీ.. ఇది తప్పవేరే దిక్కులేదు..", అని మేనేజరు  కంటతడిపెట్టుకున్నాడు.., 
ఏం చేస్తాం.. నీతోనే మేమంతా అని... కర్చీఫ్ తో అతని కన్నీళ్ళుతుడుస్తున్న మాకు 
తెలియకుండానే కళ్ళళ్ళో నీళ్ళు గిర్రునతిరిగాయి..

వీకెండ్ లేదు.. వీక్ డే లేదు.. రాత్రీలేదు.. పగలూలేదు అన్నట్టుగా కష్టపడి.. క్లైంట్ కి 
సరిపడే విధంగా పనిచేసిపెట్టే రెండు విండోస్ సర్వీసులు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ.. 
అక్కడి ఫైల్స్ ఇక్కడకు పంపిస్తూ... అన్నికాలాల్లోనూ చక్కగా పనిచేసేవిధంగా.. 
ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి పెట్టాము.. (విండోస్ సర్వీస్ అంటే ఏంలేదండీ.. విండోస్ ఆపరేటింగ్ 
సిస్టమ్లో ఎప్పుడూ గేట్ దగ్గర కాపలావుండే కుక్కలాగా నిరంతరం కాపలాకాస్తూ.. చెప్పినపనిచేసే సర్వీసులన్నమాట.).

ఇంతకూ ఈ ఆర్కిటెక్చర్ ని రాకెట్ అని ఎందుకన్నామంటే... ఆముదాలవలసనుండి వచ్చిన 
లావాదేవీ ఫైల్ ని కట్టగట్టి ఒక పెట్టెలో పెట్టి.. (జిప్ చేసి.. ), దానికి ఎమ్. డి. ఐదు అల్గోరిధమ్ 
ద్వారా ఒక కోడ్ తయారుచేసి (చిన్నప్పుడు వర్షాకాలం చదువుల్లో చదువుకున్నాం.. 
కానీ ఎందుకుపయోగిస్తారో ఇప్పడే తెలిసింది..), కట్టగట్టిన ఫైలును.. కోడ్ ను అవతలివైపు
కుక్కలా ఎదురుచూస్తున్న సర్వీసుకు విసరగానే అది ఎగిరి పట్టుకుని.. డైన్లోడ్ చేసుకుని.. 
మరళా ఎమ్. డి. ఐదు అల్గోరిధమ్ ద్వారా ఒక కోడ్ తయారుచేసి, వచ్చిన కోడ్.. ఇప్పటికోడ్ 
తో సరిచూసి.., సరిగ్గా సరిపోతే.. ఓహో.. బాగానే పంపించాడు అని అనుకుని.. తనపని 
తానుచేసుకుపోతూ అమెరికాలోవున్న డాటాబేస్ లోకి లావాదేవీలు పంపించేస్తుంది.. 
సరిపోలేకపోతే.. ఆముదాలవలసలో వున్న కుక్కకి..., నాకు సరిగ్గా అందలేదని ఒక బిస్కట్ 
ముక్క పడేస్తుంది.. , ఇలా ముందుగా నిర్దేశించిన నూటొక్క విషయాలను పరిగనించుకుని.. 
తనపని తాను చేసుకుపోతాయి ఈ విండోస్ సర్వీసులు.. ఒక్క ముక్క కూడా అర్ధంఅవలేదు 
కదూ.!!,  అందుకే ఈ ప్రాసెస్ అంతటికీ రాకెట్ అని పేరుపెట్టాము.. 

ఈ రాకెట్ ని డిజైన్ చెయ్యటానికే.. ఇన్ని తిప్పలూ పడింది.... ఆడపోలీసుకు తాంబులం 
సమర్పించుకున్నదీనూ. ఓ రోజు కూరగాయల దుకాణంవాడు.. మీరు సాఫ్వేర్ ఇంజనీరు 
కదా.., అంతంత జీతాలిస్తుంటారు.. అంత పెద్ద పెద్ద బిల్డింగుల్లో.. ఏ.సి రూముల్లో కూర్చుని.. 
మీరసలు ఏం చేస్తుంటారు అనడిగాడు.., నీకు ఏ.టి ఎమ్ లోంచి డబ్బులెలా వస్తున్నాయి..
అవి రాగానే వెంటనే ఎసెమ్మెస్ ఎలా వస్తుంది.., ట్రైన్ టికెట్.. ఇంటర్నెట్లో ఎలా కొనగలుగుతున్నావ్..
ఇంకా కరెంట్ బిల్ కూడా నువ్వు ఇంట్లోనుండి ఎలా కట్టగలుగుతున్నావ్.., ఇలా చెప్పుకుంటే 
చాలా వున్నాయి.. అని అవన్నీ నేనే చేసినట్టుగా కాస్త కటింగిచ్చి.., మేమైతే ఒక రాకెట్లు 
తయారుచేస్తున్నాం అని వాడికర్ధమయేలా కొన్ని ఉదాహరణలతో, స్త్రీలింగానికి  పుంలింగమూ 
పుంలింగానికి స్త్రీలింగమూ కలగలిపిన వచ్చీరాని (బూతు) హిందిలో వివరించాను.. 
(ఇంకా నయం హిందీలో నపుంసక లింగం లేదు.., నా దెబ్బకు వాడు పిచ్చోడయిపోదుడు.. ). 

అప్పట్నుండీ కూరగాయల దుకాణం వాడు నాతో.. "అయ్ బాబోయ్ మీరు ఇంత గొప్పోలండే..", 
అన్నట్టు చూడ్డం.. మాట్లాడటం మొదలుపెట్టాడు..., ఆరోజునుండీ పుచ్చొంకాయలమీద కాస్త  
నా కోసం స్పెషల్ డిస్కౌంటులు ప్రకటించి ఇవ్వటం కూడా మొదలెట్టాడు.., ఇంకేముంది 
అప్పటినుండి మొదలయ్యాయి ఆలోచనలు.., అవును ఇస్రోలో రాకెట్ తయారుచేస్తున్న
వాళ్ళకు మాకూ తేడా ఏముంది? ఏమీలేదే..!!, అని గాల్లో తేలుతూ తిరగటం. అప్పటికే 
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా.. పదోసారి బెస్ట్ సాఫ్ట్వేర్ సైంటిస్ట్ గా అవార్డ్ 
అందుకుంటున్నట్టుగా కలలు ఒక పక్క... మా టీమ్ తో కలిసి.., గీసుకున్న 
ఆర్కిటెక్చర్ ప్రకారం రాకెట్ ఇంప్లిమెంటేషన్ ఇంకొకపక్క.. అబ్బో క్షణం ఖాలీలేదు. అలా 
మూడునెలలు గడిచాయి.. మా రాకెట్ కుడా లాంచింగ్ కి సిధ్ధమయ్యింది..

ఇప్పుడు కొత్త కష్టాలు.. "కర్నేమే నహీ..!, సంజానేమే..", అన్నట్టుగా మీదపడ్డాయి. 
మా కంపెనీలో బండమెదడు టెస్టర్లకు అవి ఎలా పనిచేస్తాయో అంతా వివరించి చెప్పేసరికి..
మానిటర్లో ప్రాణం.. మౌసుదాకా పాక్కొచ్చింది. "మన టెస్టర్సేకే అర్ధంఅవటానికి 
ఇంతటైముపట్టిందంటే.. అసలు క్లైంటుకేమర్ధమవుతుంది?, ఇలాక్కాదు.. ఒక డాక్యుమెంట్
తయారుచేద్దాం.. ", అన్నాడు మేనేజరు. చేద్దాం అన్నాడంటే.. ఇన్డైరెక్టుగా నువ్వుచెయ్యరా 
అనే కదా..!, ఏం చేస్తాం.. డాక్యుమెంటు రాయటం మొదలెట్టాను.. తెలుగులో నేనురాసే
బ్లాగులు అందరికీ నచ్చేస్తున్నాయి.. అదే స్టయిల్లో పడగొట్టేద్దాం తెల్లోల్లని.. అనుకుని 
గొప్ప బిల్డప్ ఇస్తూ.. ఇంగ్లీష్ లో డాక్యుమెంటేషన్ చేసి.. టీమ్ అందరికీ చూపించాను.. 

ఆ డాక్యుమెంటును.. ముప్పైనాలుగు సార్లు రివ్యూ అని చెప్పి.. నేనురాసింది మొత్తం 
బండబూతేనని తేల్చి.. దాని షేపులు మొత్తం మార్చేసి... ఎలాగైతే ఒక ఏభై పేజిల కధల
పుస్తకంలాగా.., దాంతో పాటుగా.. పది పదిహేను వెబ్సైట్లకు లింకులతో  సర్వాంగ 
సుందరంగా డాక్కుమెంటుని తీర్చిదిద్దాము.

ఇది ఫలానా రోజు డెమోఇవ్వాలి.. అంతా రడీఅవ్వండి అన్న మెయిల్ చూడగానే.. మా 
టీమ్ మెంబర్లంతా గాల్లోకి ఇంకోఅడుగెత్తుకు లేచి ఒకరినొకరు చూసుకుని మురిసిపోయాం. 
ఆ ఫలానారోజు పొద్దున్నే రడీ అయ్యి.. "ఈ రోజు కాస్త రావటానికి లేటవుతుందేమో.. 
ఫోన్ చేస్తాలే..", అని మా ఆవిడకు చెప్పి.. మాంచి హుషారుగా.. లిఫ్ట్ కూడా ఎక్కుండా 
మెట్లుదిగి.. ఆఫీసుకు బయలుదేరాను.. నెనువెళ్ళవలసిన రోడ్లన్నీ నిండిపోయున్నాయి.. 
జనాలు యాత్రలకెళుతున్నట్టుగా పొలోమంటూ వెళ్ళిపోతున్నారు.. ఎక్కడచూసినా 
తీర్ధంలాగా.. ఎదో సంబరంలాగా ఇసుకేస్తేరాలని జనం... అయ్ బాబోయ్.. ఇదంతా 
నా రాకెట్ లాంచింగ్ సెలబ్రేషనేనా.. అనుకుని ఒక్కసారి.. మళ్ళీ రాష్ట్రపతి అవార్టు 
గుర్తుకుతెచ్చుకుని నడిరోడ్డులో అడ్డంగా బైకుపెట్టి ఆలోచించేస్తున్ననాకు.. ఎవడో
పెద్దగా హారన్ కొట్టి.. ఈ లోకంలోకొచ్చేలాచేసాడు...

 కొంత దూరం వెళ్ళాకా తెలిసింది అవి మహారాష్ట్రాలో ఏదాడికొకసారి జరిగే ఫాల్కీ 
యాత్ర (దేవుడిని పల్లకీలో వేసుకుని మోసుకుంటూ యాత్రచేపట్టే ఒక పండుగ) అని.. 
అంతే కదా.. ఇంకా నయం.. పొరపాటుపడ్డా.., అని ముక్కుకి కట్టుకున్న కర్చీఫ్ 
వెనుకే ఎవరికీ కనబడకుండా ముసిముసి నవ్వులు నవ్వుకున్నా..

ఒక నాలుగు గంటలుపట్టింది ఆ జనాలనుండి తప్పించుకుని ఆఫీసుచేరుకునే సరికి.. 
సరేలే ఎలాగైతే చేరుకున్నాం అనుకుని సరిపెట్టుకున్నాను. క్లైంట్ కాల్ కన్నా 
ముందుగానే మాకు ఇంటర్నల్ మీటింగని టెస్ట్ డ్రైవ్ లాగా ఒకటి పెట్టుకున్నాం.. 
అంతా ఆత్రుతగా మా టీమ్ మేట్ చెప్పింది వింటున్నారు.. నేను టెన్సన్ టెస్సన్ గా 
అందరివంకా నోరువదిలేసి చూస్తున్నాను, ఎవడన్నా ఏమన్నా లాస్ట్ మినిట్లో 
పేల్చుతాడేమోనని... ఇంతలో మా ఆవిడ దగ్గరనుండి ఫోను వస్తుంది.. కట్ చేసి.. 
నా ఫోన్ మెసేజ్ టెంప్లేట్స్ లో సేవ్ చేసిపెట్టుకున్న.. "నేను మీటింగ్లోవున్నాను.. 
ఎదన్నా ముఖ్యమైనవిషయం అయితే... మెసేజ్ పెట్టు", అన్న మెసేజ్ పంపాను. 
"వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి..", అని రిప్లై ఇచ్చింది మా అవిడ.., 
"ఇక్కడ కంపెనీలు మునిగిపోయేంత టెన్సల్లో మేం చస్తుంటే.. ఇదొక పెద్ద 
ముఖ్యమైనవిషయం మరి..", అని మనసులో అనుకుని ఫోన్ జేబులో పెట్టేసుకుని..
మళ్ళీ నోరు తెరిచి అందరివంకా చూడటంమొదలుపెట్టాను.. 

ఎవడూ మాట్లాడలేదు.. అంతాబాగానేవుందని వూపిరిపీల్చుకున్నాం. ఆమీటింగ్ 
నుండి బయటకురాకుండానే క్లైంట్ మీటింగ్ కి టైమయ్యింది..

ఏ.సీ రూమ్లో మా గుండెదడలే పెద్ద సౌండులావినపడుతున్నాయి.. అంతా నిశ్శబ్దం..., 
మా మేనేజరు మొహంలో కూడా ఆ రోజు కాస్త టెన్సనుకనిపించింది.., అన్లైన్లో 
వాళ్ళకు స్ర్కీన్ చూపిస్తు అంతా వివరించి చెబుతున్నాడు మా టీమ్ మేట్... 
అరగంటైపోయినా ఏమీ మాటలు రావటంలేదు అవతలినుండి.. అసలున్నారా లేదా..
అని మాటిమాటికి కావాలనే ఆపుతున్నాడు... చెప్పేవాడు. నలభై నిముషాల్లో 
మొత్తం అంతా ఉదాహరణలతో సహా వివరించేసాడు మా టీమ్ మేట్..

ఎనీ క్వస్చన్స్.. అనగానే తెల్లోడు రెస్పాన్స్ అయ్యాడు.. "ఇటీజ్ రియల్లీ ఎక్సెలెంట్...
బట్ బట్.. రైట్ నౌ వు ఆర్ నాట్ గోయింగ్ విత్ టూ సెర్వర్స్....", అన్నాడు..

అంటే ఏంటో మాకెవ్వరికీ అర్ధంకాలేదు.. ఫోన్ మ్యూట్ నొక్కి.. మా మేనేజరు అందరికీ 
వివరించిచెప్పాడు. అప్పుడు తెలిసింది అసలువిషయం.. ప్రస్తుతానికి.. రెండుచోట్ల అంటే 
ఆముదాలవలస, అమెరికా అక్కర్లేదు.. అమెరికాలోవున్నదాన్లోనే రెండు డాటాబేస్లుంటాయి..
అంటే ఏముంది డైరెక్ట్ కనెక్షన్ అన్నాడు.. "మరి ఈ మూడునెలలు కష్టపడి తయారుచేసిన 
రాకెట్...", అన్నాను నేను.., ఇంకేముంది.. అని పైనుండి కిందదాకా చూసాడు మేనేజరు..

"వా.. అని మా టీమ్ అంతా కుర్చీలమీంచి నేలమీదపడి.. గిలగిలా కొట్టేసుకున్నాం.. 
కాసేపటికి తేరుకుని టైముచూస్తే పదవుతుంది.. అమ్మో త్వరగావెళ్ళాలి.. ఈ టైములో కూరగాయలెక్కడదొరుకుతాయి..., ఆ కూరగాయలోడిదగ్గరకెళ్ళి రాకెట్ సంగతితెలిస్తే 
పరువుపోతుంది..  ఛా.. కనీసం మేం చేసిన రాకెట్.. మార్కెట్ కెళ్ళి కూరగాయలుతేవటానికైనా 
ఉపయోగపడుండినా బాగుండేది.. అనుకుని.. పెదవివిరుచుకుంటూ ఆఫీసు బయటపడ్డాను..14 కామెంట్‌లు:

Sravya V చెప్పారు...

భలే రాసారు మీ కసినంతా . నిద్ర తిండి అన్ని మర్చి పోయి పని చేసిన తరవాత తీరిక గా ఇది అవసరం లేదు అని చెప్పితే ఒళ్ళు మండి పోతుంది .
ఇంతకీ మీరు మొత్తం అని టేబుల్స్ ని విండోస్ సర్వీసు తో update చేస్తున్నారా , మీ అప్లికేషను కు అవసరమైన వాటినా ? మేము మా ప్రోడక్ట్ తోపాటు ఇలాంటి ఒక ఇంటర్ఫేసు ఫ్రీ గా క్లైంట్ కి ఇస్తాం వాళ్ళ సాప్ CRM కి డేటా అనుసంధానం చేయటానికి . కాకపోతే అది scheduled service లెండి రోజుకు ఒకసారి పనిచేస్తుంది .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

హ హ.. సూపర్..ఎవడా ఆన్సైట్ మేనేజర్?

భావన చెప్పారు...

హ హ హ ఫైల్స్ లో డేటాబేస్ ను మైగ్రేట్ చేసేద్దామనుకున్నారా ఏంటీ సంగతి? (కళ్ళెగరేస్తున్నా??) అంత చిన్న డేటాబేస్ లా.. అవును డేటాబేస్ తాలింపు డబ్బాలో ధనియాలు ఆవాలు ఐతే మరి ప్రైమరీ కీ లు ఫారెన్ కీలు ఏవిటో? తాలింపు లో చింది పెట్టెలో పడ్డ మాడిన ఆవాల గింజలా? అంత టెన్షన్ పడి మీరు వూ అని గింజుకుని చేసేది ఆ కూరగాయలు కొనుక్కుని వండూకుని తినటానికే కదండి. అది మాత్రం ఇంపార్టెంట్ కాదూ? అందుకే మీ ఆవిడ మెసేజ్ ఇచ్చారు మరి.

శ్రీనివాసరాజు చెప్పారు...

@శ్రావ్య వట్టికూటి గారు.
ఒళ్ళుమండటం ఏంటండీ.. జీవితమే విరక్తికలిగింది.. :-)
మీరు భలేవారండీ.. బాధలన్నీ బ్లాగులో రాసుకుంటే.. ఇన్ని ప్రశ్నలడుగుతారా.., మా మేనేజరు కూడా అడగలేదు ఇన్ని.. :-)
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

@భాస్కర రామి రెడ్డిగారు
పేర్లెందుకులేండి.., క్షవరం ఎలాగూ అయ్యాకా.. :-)
మీ కామెంటుకు ధన్యవాదములు

@భావన గారు
ఏదారిలేకపోతే.. గోదారే రహదారండీ మరి.. ఏం చేస్తాం ఏదొకటి చెయ్యాలికదా.. జీతాలు తీసుకున్నందుకు.
ఏదో ఉదాహరణకి చెప్పాం..., మరీ ఇలాంటి కష్టమైన ప్రశ్నలేస్తే కష్టమసుమండీ.. :-)

మీటింగ్లోకూడా కూరగాయలు ఇంపార్టెంటంటారా!! :-)

మీ కామెంటుకు ధన్యవాదములు..

తార చెప్పారు...

బాగున్నది, బహు బాగున్నది.
కొంపదీసి క్లైంటు అమెరికా పోస్టల్ డి. వాడా? లేక వెస్ట్రన్ యూనియన్ వాడా? వాడికే ఇలాంటీ పనికిమాలిన రిక్వైర్మెంట్స్ వుంటాయి
అవును దీనికి మీరు సొంతగా రాయటం యెందుకు? ఒరాకిల్ వాడు, ఇలాంటి పనికిమాలిన వన్నీ రాసి పెట్టుకొని అమ్ముతుంటాడుగా?

శ్రీనివాసరాజు చెప్పారు...

@తార గారు
కాదండీ అంత పెద్దపెద్ద చేపలుకాదు.. పడ్డది పిల్లచేపే.. కానీ మా చిన్నకంపెనీకే అవేపెద్దవిలేండి.

మనకు ఒరాకిల్ ప్రొడక్ట్స్ అజీర్తిచేస్తాయండీ.. మాది మ్రైక్రోసాఫ్ట్ వారి సంస్ధానం మరి.. :-), అయినా మీరెవరూ నేనెవరు ఇవన్నీ నిర్ణయించడానికి.. అంతా పైవాడి(క్లైంట్) దయ..

మీ కామెంటుకు ధన్యవాదములు.

SATYA చెప్పారు...

బాగుంది బ్లాగు ... ప్రోడక్ట్ రిలీజ్ కష్టాలని బాగానే వివరించావ్ .... పోస్ట్ చేస్తున్నప్పుడు అందరికి లింక్ మెయిల్ చేస్తే ..... (ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ).... కొత్త పోస్ట్ వచ్చింది అని తెలుస్తుంది ...

శ్రీనివాసరాజు చెప్పారు...

@సత్య
ఓపికగా చదివి వ్యాఖ్యరాసినందుకు ధన్యవాదములు.
అందరికీ లింక్ మెయిల్ చేయటం అంటే చాలా కష్టమైనపనే. అందులోనూ రిజిష్టర్ చేసుకున్నవాళ్ళెలా వుంటారు?

ఈ క్రింది విధాలుగా మనం కొత్తపోస్ట్ వచ్చినట్టు తెలుసుకోవచ్చుగా?

ఏదైనా అగ్రిగేటర్ ద్వారా
www.koodali.org
www.haaram.com
www.maalika.com

నా గూగుల్ మెయిల్ బజ్ లో (నన్ను ఫాలోఅవుతున్నట్టయితే.. :-) )

నీహారిక చెప్పారు...

రాకెట్ లాంచ్ కంటే పోస్ట్ వ్రాయటానికి కష్టపడిఉంటారేమో!!
బాగా వ్రాశారు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@నిహారిక గారు
అవునండీ.. రాకెట్ తయారుచేయటంకంటే.. దాన్ని ఇలాచేసాం అని చెప్పటమే కష్టమండీ..
టపా నచ్చినందుకు సంతోషం. :-)

swathi చెప్పారు...

very nice blog

శ్రీనివాసరాజు చెప్పారు...

@స్వాతిగారు
మీకు అర్ధమైనందుకు సంతోషం.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పాపం అంత కష్టపడి, టెన్షన్ పడి, జీవిత కాలంలో ఓ ఆరేడు నెలలు అయినా కోల్పోయి చేసిస్తే ఆ పిచ్చనా క్లైంట్ గాడు చావు కబురు చల్లగా చెబుతాడా? ఏం వాడికి ముందు తెలీదా ఆ విషయం...అసలు క్లైంట్లు వాళ్ళ గురించి ఏమనుకుంటారో...ఒక్కొక్కడికి బుర్ర కనీసం అరికాలులో కూడా ఉండదు కుంకలకు...నేను అచ్చంగా ఇలానే తిట్టుకుంటాను(కొన్ని బూతులు ఏడ్ చేసి మరీ) ఇలాంటి అనుభవాల్లో...

మీ డాటాబేస్ explanation సూపరంటే సూపరే మరి...:)

ఏంటండీ బాబు..మీకెంత కచ్చి లేకపోతే మా మీద ఎక్కువ కామెంట్లు రాసేవాళ్ళు అని ఓ లేబుల్ పెట్టి పేర్లను ఉంచారు...:)

శ్రీనివాసరాజు చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు గారు
మాబాగా తిట్టారండీ.. నాపేరు చెప్పి ఇంకోరెండేసి తిట్టండి..

డాటాబేస్ నచ్చినందుకు సంతోషం :)

కామెంటేటర్లమీద ఆ మాత్రం కక్షసాదింపులేకపోతే ఎలాగండీ.. :), మీరు అందులో రెండోవారు.. ప్రస్తుతానికి..

Related Posts Plugin for WordPress, Blogger...