5, జూన్ 2011, ఆదివారం

వర్షం...


ఆకాశంలోనుండి చినుకులు చిటపటమంటూ నేలపై రాలటం ఒక అద్బుతం. ఎండవేడికి కొలిమిలా కాగికాగివున్న నేలపై ఆ చినుకులు రాలి.. అప్పుడు వచ్చే మట్టివాసన ఇంకా మహాద్బుతం. పొద్దున్నుండీ ఎండవేడికి తట్టుకోలేక చలిమర గదుల్లో దాక్కుని.. బయట టీ తాగుదామని ఆఫీసునుండి బయటపడ్డ మాకు వర్షం దర్శనమిచ్చి మంచి ఊరటకలిగించింది.

ఒక్కసారిగా వర్షాన్ని చూసి బయటకొచ్చి చినుకుల్లో తడవాలనిపించలేదు.. ఆఫీసు బిల్డింగ్ కింద నిలబడి.. వెళదామా వద్దా అని ఆకాశంవైపు దొంగచూపులు చూస్తున్నప్పుడు.. మేఘంనుండి విడివడి.. గాలిలో జారుడు బల్లమీదజారినట్టు జారుకుంటూ.. నేలను తాకటానికి తహతహలాడుతూ.. వేగంగా దూసుకొస్తున్న ఓ చినుకు. అప్పటిదాకా వర్కుతో వేడెక్కిపోయివున్న నా బుర్రమీద టప్ అని పడి.. పెనంమీద పడిన నీటిబొట్టులాగా బుస్ అని శబ్దంచేస్తూ వేడికి ఆవిరైపోయింది. ఆవిరైపోయిన చినుకు.. నాబుర్రలోవేడిని ఆవిరిచేసేసింది. మెదడు చల్లబడింది.. తనువు జలదరించింది.. నరనరాల్లోకి చలి చేరి పులకరించింది.

ఆహా! ఆకాశంలోంచి నీళ్ళు.. చినుకులుగా రాలటమేమిటి. రాలిన చినుకులు మనల్ని తాకటమేమిటి.. మనసును తనువును చల్లబరచడమేమిటి.. ఇది నిజంగా అద్బుతమే.

కాసేపటికి ఏదోవంకతో మళ్ళీ వర్షంలో తడిచాను. వాతావరణం చల్లబడగానే నాలుకకు ఏదోకటి కారంకారంగా వేడివేడిగా తగిలితే కాస్తబాగున్ననిపించింది. ఆ ఊహ మనసులోకొచ్చేసరికి ఆత్మారాముడు ఆకలి కేకవేసాడు. మావూళ్ళో వర్షంవస్తే చెట్టుకింద తోపుడుబండిపై బజ్జీలేస్తున్న దుకాణం పక్కనే సైకిలు ఆపి. అప్పుడే వేడివేడిగా వేసిన మిరపకాయబజ్జీలు ఎప్పుడు వాయ దింపుతాడా.. పేపరుపైపెట్టిన విస్తరాకుమీద ఎప్పుడేస్తాడా.. పొగలుకక్కుతున్న వాటిని.. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఎప్పుడుతిందామా అని ఎదురుచూడటం గుర్తుకొచ్చింది.

కానీ ఇక్కడ మిరపకాయబజ్జీలు లేవే.. సరేలే అలావెళ్ళి వేడివేడి వడాపావ్ నే మిరపకాయబజ్జీ అనుకుని తినేద్దామని ఆ బండివైపు అడుగేసాను.. అక్కడున్న జాగాలో వేడివేడి పొగలుకక్కుతుంటే బజ్జీ గరమ్ గరమ్ గా వేస్తున్నాడేమో అనుకున్నాను. ఎండాకొండా వానాగీనా ఏదొచ్చినా ఆనందిస్తూ.. ఎప్పుడూ రడీమేడ్ గా జేబులో దొరికే సిగరెట్టుముక్కలెలిగించేసి.. పొగతో రింగులు సృష్టిస్తూ  మూసేసివున్న వడాపావ్ దుకాణంముందు కాల్చి కాల్చి.. చీల్చిచండాడేస్తున్నారు పొగరాయుళ్ళు.

అంతేలే!!, వానలో గెంతటం కప్పకానందం అయితే.. ఆ వానలో కాగితంపడవలేసి ఆడుకోవటం పిల్లలకానందం. మనకేమో వేడివేడిగా తినటం ఆనందం.  వీళ్ళకు కాల్చిబూడిదచేయటం ఆనందం. ఎవడానందం వాడిది.

ఏదొకటిలే వేడివేడిగా అని.. బాగాటోస్ట్ చేసిన సాండ్విచ్ తిని ఆనందించి.. ఆత్మారాముడ్ని సంతృప్తి పరచాల్సొచ్చింది.

చీకటిపడినా వదలలేదు వర్షం. సందెకాడొచ్చిన చుట్టం.. వర్షం త్వరగా వెళ్ళరని సామెత. అవును మరి సాయంత్రం వచ్చిన చుట్టం ఎలావెళతాడు పాపం. ఇంత రాత్రివేళేం వెళతారులేండి ఇక్కడేవుండండి అని మనమెప్పుడంటామా అని ఎదురుచూస్తుంటాడు. అలా మనం అనగానే మొహమాటపడి.. భోజనానికి కాళ్ళుకడుక్కుంటాడు.

మరి చుట్టం సంగతి సరే సరి.. వర్షం సంగతో..!!, సాయంత్రం వచ్చే వర్షం ఎందుకు త్వరగా వెళ్ళదో నాకు తెలియదుగానీ.. నిజంగా!!, సాయంత్రం కురిసిన వర్షం కాస్త జోరుగానూ హుషారుగానే కురుస్తుంది, పగటివెలుగులో కనిపించడానికి సిగ్గుపడేమో?, రాత్రి చీకటిలో దోబుచులాడటానికేమో? ఏమో.. ఏమోమరి. ఎందుకో ఆ వర్షపుజోరు.

తొమ్మిదయ్యింది.. ఇంకా వర్షం. అసలే రెయిన్ కోట్ పెట్టుకోలేదు.. ఊహించని తొలకరి జల్లుకదా!. ఎలాగా అని ఆలోచించాను. ఏదోలా లాగించేద్దాం అనిపించింది.. బండి స్టార్ట్ చేసాను. చలిగావుంది. వణుకొస్తుంది. అయినా ఆగాలనిపించలేదు. ఆఁ.. తడిచేదాకా అంతేలే.. అనిపించింది. వర్షంలో ఒక్కసారి తడిస్తే చలీవుండదూ వణుకూవుండదు. జుమ్మని బండి లాగించి వర్షంలోకి వచ్చాను. నిట్టనిలువుగా పడుతున్న చినుకులు కాస్త నాకెదురొస్తున్నట్టుగా వంపుతిరిగాయి.

ముత్యాలు గాలిలో ఎగురుతున్నట్టున్నాయి. ఆ ఎగుతున్న ముత్యాలు నన్నుముద్దాడుతున్నట్టున్నాయి. చిన్న చిన్న నీటి ముద్దలు.. అవి పెడుతున్న చల్లచల్లనీటి ముద్దులు. అందమైన ముత్యాలు.. అవిచ్చే చల్లటి ముద్దులు. ఆహా!..మరళా అద్భుతం. మహాద్బుతం.

వర్షంలో నేను వెళుతున్నప్పుడు టప్ టప్ అని చినుకుచేసే శబ్దం. ఆగినప్పుడు చెవులు హోరెత్తించేలా.. హోరున శబ్దం. రోడ్డుపైన గుంటలో ఆ చినుకుపడి డుబుక్కున నీటిలోమునిగి అది చేసే సంగీతం. ఆ సంగీతానికి అనువుగా ఆ నీరు తరంగాలుగా కదిలి చేసే నాట్యం. ఆ సంగీతాన్ని వినటానికనినా బైక్ ఇంజను కాసేపు ఆపుచేసాను. నా ముందే ఇంకో బైకొచ్చి ఆగింది. ఆ బైకు వెనకాలవున్న డేంజర్ లైటు ఆ గుంటనీటిలో కుంకుమ జల్లింది. సిగ్నల్ ఇండికేటర్ అప్పుడప్పుడూ వెలుగుతూ పసుపురంగు జల్లుతుంది. సిగ్నల్ పడ్డాకా బైకులన్నీరోడ్డుపై కుంకుమ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వెనుకకు తిరిగి చూసుకున్నాను గానీ కనబడలేదు. నా బైకూ వెనుక కుంకుమ రాస్తున్నట్టేవుంది. భలేగున్నాయి ఈ రంగులు. రాత్రిలో వర్షంతీసుకొచ్చిన రంగులు. ఇదో అద్భుతం.

అన్నీ రెండుగా.. కనిపిస్తున్నాయి. పైనున్నవీదిలైటు రోడ్డుమీదకూడా వెలుగుతుంది. ఎదురుగావస్తున్న కారుకున్న లైటు.. రోడ్డుపై ఇంకో లైటు. రెండూ మీదకి దూసుకొస్తున్నాయి. రోడ్డు అద్దంలా మెరుస్తుంది.  చెత్తాచెదారం అన్నీ మెరుస్తున్నాయి.. మురికినీళ్ళుకూడా తళతళమెరుస్తున్నాయి. ఎటుచూసినా అద్దమే. అంతా అద్దమే. అద్దంమీద బండినడుపుతుంటే జారుతుందేమో అనిపిస్తుంది. పగిలిపోతుందేమోనని అప్పుడప్పుడూ ఆగిపోతున్నాను. కానీ అన్నిబైకులూ దూసుకుపోతున్నాయి. అదిచూసి నేనూమళ్ళీ ముందుకుసాగుతున్నాను.

అద్దంపై చినుకులు.. మసకబారిన అద్దంపై చినుకులు.. ఎటుచూసినా చినుకులు. టైమెంతయ్యిందో చూద్దామంటే నా వాచ్ అద్దంపైనా చినుకులు. ఆ చినుకులతో మసకబారింది.. తుడిచి టైముచూడాలనికూడా అనిపించటంలేదు. ఎంతసేపైనా ఇలానే తడవాలనిపిస్తుంది.

23 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

వావ్!
చాలా బాగా రాసారు శ్రీనివాస్ గారు
మహారాష్ట్రా లో వర్షాలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కాస్త లేట్ గా వచ్చినా రోజూ వర్షం పడుతోంది మాకు కూడా.

Unknown చెప్పారు...

maku 4 days nunchi varshalu... ma pani chedagoduthunay kani enjoying a lot....

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వర్షంలో ఫుల్లుగా తడిపేశారండీ :-) నిజమే ఎంతసేపైనా ఇలానే తడవాలనిపిస్తుంది....

నేస్తం చెప్పారు...

నిజమే వర్షంలో తడిసిన అనుభూతి..... చాలా బాగుంది మీ పోస్ట్

నేస్తం చెప్పారు...

నిజమే వర్షంలో తడిసిన అనుభూతి..... చాలా బాగుంది మీ పోస్ట్

Praveen Mandangi చెప్పారు...

నా అగ్రెగేటర్ http://telugumedia.asiaని రీడిజైన్ చేసినప్పుడు మొదట్లో పెట్టిన బ్లాగుల్లో మీ బ్లాగ్ ఒకటి. కానీ మీరు మీ బ్లాగ్‌లో రెగ్యులర్‌గా వ్రాయడం లేదు. నిన్ననే మీ బ్లాగ్‌లో కొత్త టపా చూశాను, అందుకే.

మంచు చెప్పారు...

మాస్టారు.... కొన్ని అనుభవాలు ప్రత్యక్షం గా అనుభవించినదానికన్నా మీ పొస్ట్ లు చదివితేనే ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిన్న మాకు వర్షం పడింది ... దాంట్లొ తడుస్తూ, వేడి వేడి చాయ్ తాగుతూ నేను ఒక పదినిముషాలు ఎంజాయ్ చేసాను కానీ ఈ పొస్ట్లొ ఉన్నన్ని కొణాల్లొ అలొచించలేదు. వర్షం పడినప్పటికన్నా ఈ పొస్ట్ చదువుతున్నప్పుడే ఎక్కువ కిక్ అనిపించింది. ఇది చదివాక మళ్ళీ ఇప్పుడు వర్షం పడితే బాగుండును అనిపిస్తుంది :-)

మంచు చెప్పారు...

ప్రవీణ్ అన్నాయ్... నా బ్లాగ్ కలపలేదా :-(

శ్రీనివాసరాజు చెప్పారు...

@హరేకృష్ణ గారు
మీరే రాష్ట్రంలో వున్నారు??
టపా నచ్చినందుకు సంతోషం.

@అరవింద్
ప్రతిక్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోగలిగితే.. అన్నిట్లోనూ ఆనందంమే :-)

@వేణూ శ్రీకాంత్ గారు
జలుబు చేస్తుంది జాగ్రత్త. నాపేరు కూడా చెబుతానంటున్నారు అసలే. అంతా నన్ను తిట్టుకుంటారు.

@నేస్తం గారు
టపా నచ్చినందుకు సంతోషం. :-)

@ప్రవీణ్ శర్మ గారు
నా బ్లాగు మీ అగ్రిగేటర్ లో పెట్టినందుకు ధన్యవాదములు.
కానీ నేను రాసేవి నెలకు ఒకటి రెండు అంతే. కిందటి నెల కాస్త పనుల్లో పడి రాయలేదు.
ప్రతిరోజు రాస్తే నా బ్లాగే బోరు కొట్టేస్తుంది జనాలకి. :)

@మంచు గారు
చాలా సంతోషం. నిజమైన వర్షానికన్నా నా బ్లాగు మీకు తెలియని అనుభూతినిచ్చినందుకు. మళ్ళీ వర్షం పడకమానదు. గొడుగులూ.. రెయిన్ కోట్లూ పక్కనపడేసి రడీగావుండండి మరి. :-)

మనసు పలికే చెప్పారు...

శ్రీనివాస్ గారూ.. మీ పోస్ట్ చదువుతున్నంత సేపూ నేను కూడా వర్షంలో తడుస్తున్న ఫీలింగ్.. ఆ నీటి ముద్దలు నన్ను కూడా ముద్దాడుతున్న ఫీలింగ్. అద్దంలాంటి ఆ ప్రపంచంలో నేను కూడా ఉన్న ఫీలింగ్. అద్భుతం అంతే.. చాలా చాలా బాగుంది :)

ఆ.సౌమ్య చెప్పారు...

చాలారోజులయింది మీ బ్లాగువైపుకొచ్చి..మీరు రాయడం తగ్గించేసారుగా!
బలే పోస్ట్ అండీ....చదువుతూ ఉంటే మధ్యలో డౌటొచ్చినిది నేనుగానీ వర్షంలో నిలుచున్నానా, నా చుటూ వర్షం పడుతోందా అని...లేదు ఆఫీసు గోడలు, కుర్చీలు,, కంప్యూటర్లు వాటికి అతుక్కుపోయిన జనాలే కనిపించారు. వాళ్ళని అక్కడే వదిలేసి, మళ్ళీ పోస్ట్ లో తలదూర్చి వర్షంలో పూర్తిగా తడిసిపోయాను...అంత బావుంది మీ పోస్ట్!

suresh చెప్పారు...

baagundi sreenugaru..............

శ్రీనివాసరాజు చెప్పారు...

@బికే గారు
మీ కామెంటుకు ధన్యవాదములు

@మనసు పలికే గారు
నీటి ముద్దులు.. అద్దాల అందచందాలు. నచ్చాయన్నమాట!. ధన్యవాదములు :-)

@ఆ.సౌమ్య గారు
ఆఫీసులో జనాలమధ్య వర్షంలో తడిచారా!.. బాగుంది.
ఈ మధ్య కాస్త రాయటం తగ్గినవిషయం నిజమే. మళ్ళీ మొదలుపెట్టాను కదా! ఇక బోర్ కొట్టిస్తా. :-)

@సురేష్ గారు
నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు

ఇందు చెప్పారు...

చాలా చాలా నచ్చింది నాకు మీ టపా! నాకు వర్షమంటే బోలెడు ఇష్టం! కాని....ఇంతబాగా రాయడం నావల్లైతే కాదు అనుకోండి! అందూకెనేమో మీ టపా బజ్జ్లో చదవగానే....అక్కడ కామెంటా :) కాని ఇక్కదైతే పర్మనెంట్ కదా అని మళ్ళి వచ్చి కామెంటుతున్నా!(ఇది నేస్తం గారి బజ్జ్ చదివాక వెలిగింది నా బుర్రకి)

చాలా బాగుంది...వర్షం...దాని పదాల్లో పెట్టీ మా అందరిమీద మీరు చిలకరించిన వైనం :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఇందు గారు
చాలాచాలా సంతోషం. మీకు టపానచ్చినందుకూ.. రెండుచోట్లా కామెంటాడినందుకూ... :-)
మీ కామెంటు నా బ్లాగుడాటాబేసులో పదిలపర్చబడినది. :-)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

తొలకరి వర్షం లో తడిసి ఆనందం అంతా అనుభవించేశాము. తడిసి ఆనందించడాన్ని ఇంత అందం గా ఆస్వాదించ వచ్చని తెలియ చెప్పినందుకు థాంక్స్.

శ్రీనివాసరాజు చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం గారు
మీరు నవ్వితే నవ్వండి అంటూనే కడుపుబ్బా నవ్విస్తుంటారు కదా!, అలా నవ్వుకునేవాడిలో నేనొకడిని. కాకపోతే కామెంట్లు ఎప్పుడూ ఇవ్వలేదు కానీ సైలెంటు రీడర్ ని.. ఈ వర్షం టపా మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.
మీ కామెంటుకు ధన్యవాదములు.

మధురవాణి చెప్పారు...

అద్భుతం! చినుకులూ, ఆ చినుకుల్లో హాయిగా తడుస్తూ మీతో పాటు మాక్కూడా పంచిన ఈ అనుభూతి.. రెండూ అద్భుతం! :)

కౌటిల్య చెప్పారు...

రాజుగారూ, మీరు కెవ్వంతే! మీరు తడిసి ఆ చినుకుల కబుర్లలో మమ్మల్నికూడా నిండా తడిపేశారు.....మీలో మంచి రచయితేకాక, గొప్ప ప్రకృతి ప్రేమికుడు కూడా ఉన్నాడండీ....మీ భావుకతకి వందలు, వేలు మంగిడీలు..

శ్రీనివాసరాజు చెప్పారు...

@మధురవాణి గారు
నా బ్లాగులో చినుకులను ఆస్వాదించినందుకు ఆనందం..
ఆ చినుకుల్లో తడిసి మైమరచి మీరిచ్చిన కామెంటుకు మహదానందం.

@కౌటల్యగారు
తొలకరి జల్లులో తడిసినందుకు సంతోషం. తడిసినందుకు డాక్టరుగారు ఇంకా క్లాసుల పీకుతారేమో అనుకున్నాం. మీరూ ప్రకృతిప్రేమికులే అయితే.
అయినా ఏ రచయిత కాడులేండి!
శతకోటి మంగిడీలు.

జలతారు వెన్నెల చెప్పారు...

వర్షం అని search చేస్తే మీ టపా వచ్చింది. చాలా బాగుంది మీ టపా!వర్షం లో తడిసిన అనుభూతి కలిగించారు.

శ్రీనివాసరాజు చెప్పారు...

జలతారువెన్నెల గారూ: టపా నచ్చినందుకు సంతోషమండీ. :-)

శ్రీ చెప్పారు...

నిజంగా వర్షంలో తడిపేసారండీ!
చాలా బాగుంది శ్రీనివాసరాజు గారూ!
@శ్రీ

Related Posts Plugin for WordPress, Blogger...