16, జులై 2011, శనివారం

ప్రతీ డెవలపర్ కీ ఒక రోజు...

ఆఫీసులోకి ఎంటరయ్యి సిస్టమ్ లాగిన్ చేసి.. మెయిల్ బాక్స్ లోకి తొంగిచూడగానే ఒక మెయిల్ నా కోసం ఎదురుచూస్తుంది. అది చదవగానే పొద్దున్నే ఎక్కడలేని బీపీ తన్నుకొచ్చింది.

ఈ మధ్యనే జాయిన్ అయిన కొత్త మేనేజర్ నుండి వచ్చిందా మెయిల్... వేరే ప్రోజక్ట్లో చాలా క్రిటికల్ ఇష్యూలు నడుస్తున్నాయి.. వాటిని చూడటానికి నువ్వు ఆ ప్రాజెక్ట్లోకి కొన్ని రోజులు రావాలి.
అని రాసాడు.  అక్కడవరకూ.. బాగానే వుంది.. కానీ ఆఖరు లైన్లో.. నీకు ప్రస్తుతం పనిఏమిలేదని.. నువ్వు ఖాలీగానే వున్నావని అనుకుంటున్నాను అని రాసివున్నలైనే.. పౌరుషం పొడుచుకొచ్చి.. ఆవేశం తన్నుకొచ్చేలా చేసింది. తన్నుకొస్తున్న ఆవేశాన్ని ఆపుకోలేక.. రెస్ట్ రూమ్లోకి దూరాను.  కోపంతో ఎర్రగా.. ఆర్ నారాయణమూర్తిలా.. అయిపోయిన కళ్ళను నీళ్ళతో కడుక్కున్నాను... కళ్ళకు తగిలిన నీళ్ళూ వేడిగా పొగలుకక్కి చేతిలోపడగానే చెయ్యి కాలిపోయింది. కాలిన చేతుల్ని చన్నీళ్ళతో కడుక్కుని.. ఏ డిషా.. ఏ.. త్రిషా.. అని కోపంతో పేపర్ హోల్డర్ని రెండు పిడిగుద్దులు గుద్దాను.. హోల్డర్ లోంచి రెండుపేపర్లు రాలాయి... వాటితో మెహం తుడుచుకుని.. ఎవరూ చూడలేదు కదా అని అటూ ఇటూ చూసాకా డెస్క్ దగ్గరకొచ్చాను. అదే ఆవేశంతో మెయిల్ కి రిప్లై రాయటం మొదలుపెట్టాను.

నేను పొద్దున్నే నాలుగున్నరకి లేచి..,మొహం కడుక్కోకుండా.. టీ తాగకుండానే ప్రొడక్షన్ సెర్వర్ లో రన్ అవుతున్న ప్రోసెస్ లు మానిటర్ చేస్తాను.. అది అయ్యాకా నాపక్కలో పడుకున్న మా అబ్బాయిని కాస్త పక్కకు నెట్టి.. నా లాప్టాప్ పెట్టుకుని రెండు గంటలు నిద్రపోతాను.. మళ్ళీఎనిమిదింటికి..మళ్ళీ పదింటికి అలా ప్రతీ రెండుగంటలకోసారి లాగిన్ అయ్యి ఏం జరుగుతుందోనని చూస్తుంటాను.. ఏ ఎర్రర్ రాకపోతే.. తాపీగా ఆఫీసుకు పన్నెండింటికి వస్తాను.. వచ్చాకా.. ప్రోసెస్ ఎలా నడిచిందోనని.. ఎన్నో చెక్స్ చెయ్యాల్సొస్తుంది. అసలు నేను ఇలా చెయ్యకపోతే క్లైంట్ బిజిజెస్ కోట్లలో నష్టం వచ్చేస్తుంది..అందుకేనేను ఈ ప్రాజెక్ట్లో చాలా విలువైన వాడని. నేనొక్కరోజు ఇది చూడకపోతే అంతే... అమెరికా మార్కెట్లు టపటపామంటు షాక్కొట్టిన కాకుల్లా పడిపోతాయి. మనకంపెనీకి రెవెన్యూతెచ్చే ప్రోజెక్టుల్లో ఇది అతి పెద్దది, నేనొక్కడినే ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నానన్న విషయంమీకు తెలియదనుకుంటాను.. నా ఒక్కడిద్వారావచ్చే రెవెన్యూ.. మన కంపెనీ అంతా బతకుతున్నట్టే కదా!... అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి.. నేను చెబుతున్నది అబద్దంకాదని అనిపించేలా వుండటానికి.. గూగుల్ లో వెతికి పెద్ద పెద్ద చార్టులు.. గ్రాపులు అన్నీకాపీపేస్ట్ కొట్టి, ప్రింట్ చేస్తే పదిహేనుపేజీలకు తగ్గకుండా వచ్చేలా.. పెద్ద మెయిల్ రాసి సెండ్ బటన్ నొక్కాను.

నేను నాలుగున్నరకి లేవటమేమిటి.., అసలు సపోర్ట్ ఎగ్రిమెంటే రాయకుండా రెండునెలలనుండి ఫ్రీగా చేయించుకుంటున్నాడు క్లైంటు.. అలాంటిది మన కంపెనీకి రెవెన్యూ వచ్చే ప్రాజెక్టులలో ఈ బేవార్స్ ప్రాజెక్ట్ వుంటమేంటి.., ఏదో ఒక వారంరోజులునుండి పనిలేదు కాస్త ఎంజాయ్ చేద్దాం అనేసరికి తగలడతారు.. అందులోకి రా..ఇందులోకి దూరు అని.., ప్రతీ ఒక్కడికీ లోకువే.. కొత్తగా వచ్చినోడి దగ్గరకూడా మనం లోకువైపోతే ఎలాగా.. హిహీ..పిచ్చి మేనేజర్ నమ్మేసుంటాడు.. అని నాలో నేనే.. డెస్క్ కిందకి దూరి నవ్వుకుంటుంటే.. వెనుకెవరో వచ్చినట్టు నీడపడింది. బలవంతంగా నవ్వాపుకుని దగ్గినట్టు నటిస్తూ.. సిపియు.. వైర్లు లూజయితే కదిపినట్టుగా ఏక్టింగ్ చేసి పైకి లేచి చూస్తే కొత్తమేనేజరు నిలబడున్నాడు. హాయ్ అన్నాను.. అలా మీటింగ్ రూమ్లోకి  వెళ్దామా.. మాట్లాడాలి అన్నాడు. సరే పద అని ఇద్దరం మీటింగ్ రూమ్లోకెళ్ళాము.

అవునా! నువ్వు అంత బిజీగావుంటావా.. సారీ.. నాకు తెలిసిన దానిబట్టి అలా రాసాను. వేరే ప్రాజెక్ట్ చాలా క్రిటికల్ స్టేజ్ లో వుంది. క్లైంట్ నుండి చాలా ప్రెజర్ వస్తుంది. డెవలెపర్స్ ఎవరూ దొరకటంలేదు.. అంతా వేరువేరు ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోయారు. షార్ట్ టెర్మ్ కోసం కొత్తవాళ్ళనీ తీసుకోలేం. అవును నువ్వు టీమ్ లీడ్ అంటకదా.. నువ్వొక్కడివే ఆ ప్రాజెక్ట్ చూసుకుంటున్నావంట కదా!  అన్నాడు మేనేజరు.

చాలా రోజులతరువాత నన్నొకడు టీమ్ లీడ్ అన్నాడనే సరికి ఆనందం పొంగి పొరలిపోయి మీటింగ్ రూమంతా నిండిపోయింది. కుర్చీతోపాటుగా ఒక్కసారి పైకిలేచి సీలింగ్ కి తగులుకుని కింద పడ్డాను..., కింద పడ్డాకూడా నొప్పి తెలియలేదు. గోవిందరాజుల స్వామి కాళ్ళుమీద కాళ్ళు వేసుకుని పడకున్నట్టు పడుకుని..అవును నేను టీమ్ లీడ్ అన్నాను. సరేలే టీమేలేదు.. లీడ్ అయితే ఏంటి.. సియీవో..అయితే ఏంటట అన్న మేనేజర్ గాడి వెటకారం చూపు చూసి.. కాస్త తేరుకున్నాకా.. ఇక్కడ రెండు ప్రాజెక్టులు విజయవంతంగా 365 రోజులు ఆడించాం.. ఈమధ్యే ఈ ప్రాజెక్ట్ కి టైటానియమ్ బ్రోమియమ్ డిస్క్ ఫంక్షన్లో రాఖీ సావంత్ ని పిలిచీ.... అని చెబుతున్న నాకే కాస్త ఎక్కువైనట్టు అనిపించి టాపిక్ కట్ చేసి చెప్పాను.
ప్రాజెక్ట్ అయిపోవచ్చింది.. ప్రొడక్షన్ సపోర్ట్ లో వుంది. అందుకే ఎవరూ ఇందులోకి రాలేదు. నేనొక్కడినే సింగిల్ హేండుతో.. అని నా షర్ట్ చేతులు పైకి జరిపి.. కండలు చూపించాను..

చాల్లే చూసాం నీకండలు.. ఇక దించు అన్నట్టుగా చూసి... సరే.. పెద్దాయనతో మాట్లాడతా అన్నాడు కొత్త మేనేజరు.

నాకు ప్రాజెక్టుకు పురుడ్లు పోసే మేనేజర్ అదే.. డెలివరీ మేనేజరు.., ఇంకా మనకు ఒక్క డాలర్ కి.. వెయ్యిరూపాయలు పనిచేయించుకునే  క్లైంట్.. వీరితోనే కాంటాక్టు తప్ప... పెద్దాయన్లు.. ముసలాయన్లు ఎవరూతెలియదన్నాను.. ఏదన్నా మాట్లాడాలంటే.. వారితోనే డైరెక్ట్ గా మాట్లాడుతుంటాను అన్నాను. అసలీ పెద్దాయన ఎవడు!, ఆయన్ని ఆ కొత్త ప్రాజెక్ట్లో కి తీసుకోండి ఖాలీగావుండుంటాడు కదా! అన్నాను.

పెద్దాయనంటే సీ.టి.వో అన్నాడు మేనేజరు.. రక్తం వచ్చేలా నాలుక్కరుచుకుని.. తెగిన ముక్క మేనేజరుకి కనపడకుండా నోట్లోనేపెట్టుకుని.. బబుల్ గమ్ములా నములుతూ.. ఆయన ప్రాజెక్ట్ మొదలయినప్పుడు ఇందులో వున్నాడు అంతే ఆయనకుపెద్దగా ఏం తెలియదు.. అప్పుడప్పుడు కొత్త సినిమాలు అమెరికాలో రిలీజ్ అయినప్పుడు గ్రేట్ ఆంధ్రాలోనో.. ఐడియల్ బ్రైన్ లోనో రేటింగ్ చదివి కాల్ చేస్తుంటాడు.. ఇండియాలో టాక్ ఎలావుంది అని అడుగుతుంటాడు. అంతేగానీ ఆయనకు ఈప్రాజక్ట్ అంటే ఫ్రెంచ్ మూవీనే అన్నాను.

అయ్యబాబోయ్ పెద్దాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాడంటే.. వీడు మేనేజ్మెంటుకి బాగా కావలిసిన వ్యక్తి అనుకున్నాడో ఏమో.. భయపడిపోయాడు మేనేజరు.. పట్టిన చెమటలు తుడుచుకుంటూ.. సరే.. ధ్యాంక్యూ అని బయటకు వెళ్ళిపోయాడు.

వీడిప్పుడు పెద్దాయనతో మాట్లాడతాడా..అమ్మో వాడు చెప్పేస్తాడుగా నేను ఖాలీగా కండలు నలుపుకోటం తప్ప పనిలేదని.. అయినా సరే.. తగ్గకూడదు.. ఎలాగైనా పోరాడాలి అని నిర్ణయించుకున్నాను.

సాయత్రం నేను త్వరగా ఇంటికి జంపుకొట్టి బాలకృష్ణ సినిమా క్లిప్పింగులు యు.ట్యూబ్లో.. చూస్తూ డయలాగులన్నీ భట్టిపట్టడం మొదలుపెట్టాను. అంత పెద్ద పెద్ద డయలాగులు బాలకృష్ణ ఎలా చెప్పాడో ఏంటో అని ఆశ్చర్యంవేసింది.. నేను చెబుతుంటే.. ఎక్కడి ఎక్కడినుండో గాలొస్తుందిగానీ  మాటలు రావటంలేదు.. నోట్లోంచొస్తున్న ఉమ్మితుపర్లతో ల్యాప్ టాపు స్ర్కీన్ ని కారు అద్దాన్ని వైపర్ అన్ చేస్తే తుడిచినట్టుగా గుడ్డపెట్టి అరనిముషానికోసారి తుడవాల్సొస్తుంది.. సినిమాలో కెమెరామ్యాన్లు ఈ డ్రాప్స్ పడకుండా ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో!, అనిఒక్కసారి ఆశ్చర్యంతో కూడిన ఆలోచన బుర్రలో మెదిలింది... ఏంటింతలా మెదిలింది.. ఆలోచనేనా అని చూస్తే నా తలపై దరువేస్తున్నాడు మా బుడ్డోడు.

కొత్త మేనేజరు.. పెద్దాయనకి, మా పురుడ్ల మేనేజర్ కి అందరికీ ఫోన్లుచేసి.. ఇలా ఇలా, మన కంపెనీ బిల్డింగ్ పిల్లర్స్ ఊగుతుంటే.. శ్రీనినే దాన్ని పట్టుకుని నిలబెట్టాడంటా.. చాలా బిజీ బిజీగా వున్నాడంట, నేను ప్రస్తుతానికి ఏం చెయ్యాలంట అని అడిగినట్లున్నాడు. ఆ
తర్వాత రోజు పొద్దున్నే వచ్చిన మీటింగ్ రిక్వెస్ట్, దానితోపాటుగా మా పురుడ్ల మేనేజర్ దగ్గరనుండి వచ్చిన వేడి వేడి మెయిలు చూడగానే అర్ధం అయిపోయింది.. ఇక ఆ కొత్త ప్రాజెక్ట్ లోకి వెళ్ళకతప్పదేమోనని. అనవసరంగా ల్యాఫ్టాప్ స్క్రీన్ పాడయ్యేలా డయలాగుల బట్టీపట్టానే అవన్నీ వేస్టయిపోతాయా అనిపించాయి.

సరే.. చూద్దాం ఏదో సీన్లో అవి ఉపయోగపడతాయిలే.. అని అనుకుని.. సాయంత్రం మీటింగ్లో మనమసలు దొరక్కూడదూ.. తాడో పేడోతేలిపోవాలి అని రడీగా అన్నిటికి ప్రిపేరయ్యి కూర్చున్నాను. మీటింగ్ మొదలయ్యింది కానీ... కొత్తమేనేజరు భయంతో ఏం తేడాచేసిందో మీటింగ్ కి రాలేదు.. ఇంకేముంది.. నాదే హీరో రోల్..

మా పురుడ్ల మేనేజర్ అడగటం మొదలుపెట్టాడు.. శ్రీని.. నువ్వు ప్రస్తుత ప్రాజెక్టులో చాలా మ్యానువల్ చెక్స్ చేస్తున్నావని చెప్పావంట కదా.. నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా వుంది.. ఆ ప్రాజెక్ట్ మనం చాలా ఆటోమేట్ చేసేసాం.. ఇంకేమి మ్యానువల్ వుంటుంది అన్నాడు.

అదా.. ఈ మధ్య చాలా ఇష్యూలు వచ్చాయి కదా.. అవి రాకుండా ముందు జాగ్రత్తగా చేస్తున్నానంతె.. ఒక వారం నుండి చేస్తున్నా.. ఇంతకు ముందు ఎప్పుడూ అవసరంరాలేదు.. ఇప్పుడూ అవసరంలేదనుకో అని బట్టీబట్టిన బాలకృష్ణ బయటకు రాకుండా కవర్ చేసి తప్పించుకున్నాను.

ఓహో అంతే కదా.. నేనింకా ఏదో అనుకున్నా.. సరే మరి ఆ కొత్త దాంట్లోకి నువ్వు వెళతావా అన్నాడు.

దొరికాడు బాగా అనుకుని.. వెళతాను.. కానీ మళ్ళీ దీంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు.. కాసేపు ఎత్తుకో.. వాడి ముక్కుకారుతుంది వచ్చి తుడువు.. అంటే చాలా కష్టం.. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చాలా క్లిష్టపరిస్థితుల్లోవుంది అంటున్నారు..నీకు తెలిసిందే కదా!
అలాంటప్పుడు రెండిటి మీద కాళ్ళుపెడితే.. రెండూ అటొకటి ఇటొకటి దూరంగా జరిగాయనుకో.. పంగ జారి.. ఏం జరిగినా జరగొచ్చు.. అని నా మనసులోవున్నది చెప్పేసాను.

అవును నిజమే, కానీ మన ప్రొడక్షన్ సపోర్ట్ కాంట్రాక్ట్ సైన్ చెయ్యలేదు తెలిసిందే కదా! నువ్విలా ఫ్రీగా చేసేస్తుంటే వాళ్ళు మన మాట వినటంలేదు. రెండు నెలలనుండి మనం ప్రీగానే చేస్తున్నాం నీకు తెలియనిది కాదు.. అన్నాడు.

అవును ఆ విషయం చెప్పి ఇన్నాళ్ళు కంగారుపెడుతుంది నేనేకదా.. కానీ నువ్వు ఇప్పుడు అవసరం కాబట్టి ఆ వంక చూపిస్తున్నావా అన్నాను నేను.

లేదు లేదు శ్రీని.. ప్రస్తుతానికి అక్కడ కూడా సీరియస్ నెస్ క్రియేట్ చేద్దాం అని వుద్దేశ్యంతో చెబుతున్నా. అందులో ఏదొచ్చినా, అంటే... ఆంజిలీనా జోలీ వచ్చినా అసలు దానిజోలికే వెళ్ళొద్దు. ఏవరొచ్చినా నాకు మెయిల్ కొట్టు. నేను చూసుకుంటాను.. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి నేనేం చెప్పను.. నువ్వు ఆలోచించుకో అన్నాడు పురుడ్ల మేనేజరు.

ఇంక ఆలోచించేదేముంది.. ఇది చెయ్యొద్దు అంటే నేను ఖాలీనే కదా.. ఇంకచేసేదేముందు.. అందులోకే వెళ్ళాలి.. అందుకే నువ్వు పురుడ్లు పోసే పొజిషన్లోవున్నావురా, బాస్ ఎప్పుడూ రైటే మరి.. అనుకున్నాను.

తరువాతరోజు నుండి తప్పలేదు కొత్త ప్రాజెక్టులో పనిచెయ్యటం. ప్రాజెక్టుకన్నాకష్టమైన పని టైముకి ఆఫీసుకెళటం... టైముకు రావటం. తప్పవు మరి.. కష్టాలు డెవలపర్ కి రాకా ఎవరికొస్తాయిలే అనుకుని డయలాగులన్నీ దిగమింగి పనిచేస్తున్నాను.

ఆ ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్టులో ఏమన్నా రావాలి అప్పుడు చూసుకుందాం రా.. వీరరాఘవరెడ్డి నీ పెతాపమూ నా పెతాపమూ అని మర్చిపోకుండా ఆ డయలాగు రడీ రిఫరెన్సుకోసం రాసిపెట్టుకుని ఎదురుచూస్తున్నా.. ఎప్పడూ రెండురోజులకు మించి పనిచేయని ప్రాసెస్  ఏకంగా వారం రోజులు ఏ ప్రాబ్లమూ రాకుండా బాగా పనిచెయ్యటం మొదలుపెట్టింది. వారం రోజులు పనిచేసిందంటే మాటలా.. ఎలాగన్నా దీన్ని ఆపాలి.. ఈ రాత్రికిరాత్రే అమెరికా సెర్వర్లో ప్రాసెసర్ పైన తిరుగుతున్నఫ్యాన్ని ఇండియానుండి చీపురు పుల్ల పెట్టైనా అపేయ్యాలి అని నిర్ణయించుకున్నాను.

తర్వాతరోజు మామూలుగా ఆఫీసుకొచ్చాను. కొత్త ప్రాజెక్ట్ లో ఏం చెయ్యాలి..ఏం చెయ్యాలి.. ఏం చెయ్యాలి.. అని  పుస్తకంలో "ఏం చేయాలి కోటి" రాసుకుంటుండగా.. కమ్యూనిస్టు కార్యకర్తలాగా ఎర్రగా ఇన్ బాక్సులో మెరిసిపోయింది ఒక ఎర్రర్ మెయిల్. అదేంటిరాత్రి చీపురు పుళ్ళ ఎంత వెతికినా దొరక్క ఫ్యానుఆపలేదు కదా.. మరి ఎలా వచ్చిందబ్బా ఈ ఎర్రర్..సరేలే ఎలాగైతే ఏంటిలే.. దొరికింది పో అని..మొత్తం అందరినీ టూ ఎడ్రస్ లో పెట్టి.. భలే భలే అయ్యింది ఇక్కడ..,సంబరాలు..అంబరాలనంటిన సంబరాలు అని సబ్జక్టులో రాసి... మనం ముందుగా నిర్ణయించుకున్నట్టుగానే ఈ ప్రాజెక్టులో పనిచెయ్యటంలేదు అని రాసి మెయిల్ కొట్టాను.

వారం రోజులు గడిచాయి.. ఆ ప్రాజెక్ట్లో చెయ్యివెయ్యలేదు.. నా మానాన నేను కొత్త ప్రాజెక్టులో ఏం చేయాలి కోటి రాసుకుంటూ కాలగడుపుతున్నాను.
ప్రతిరోజూ వస్తున్నఎర్ర ఎర్ర ఎర్రర్ మెయిల్స్ చూస్తూ ఈలేసుకుని ఎగిరి గంతేసుకుంటున్నా..

ఆ వారం రోజులు ఆ క్లైంట్ గాడి ప్రోసెస్ ఆగిపోయేసరికి.. వాడుదిగొచ్చి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను అని చెప్పాడు.. ఆ విషయాలన్నీ సైలెంట్ గా సీ.సీలో వున్న మెయిల్స్ లో చూస్తున్నా. భలేగయ్యింది... భలేగయ్యిందని చంకలు గుద్దుకున్నాను.

ప్రతీ డెవలపర్ కి ఒక రోజు.. అంటే ఇదేరా.. ఒక్కరుగా వస్తారో.. అందరూ కలిసే వస్తారో.. ఎలావచ్చినా వేటుకో పది తలలు తెగిపడతాయి.. లెక్కపెట్టుకోండి.. లెక్కలురాకపోతే.. సిస్టమ్లో క్యాలుకులేటర్ ఉపయోగించుకోండి..రండిరా.. రండి అని ఎగిరి తొడకొట్టుకుంటూ.., కొత్త మేనేజరు, పురుడ్లమేనేజర్ తో మీటింగ్ కోసం మరళా బాలకృష్ణ డయలాగులు ప్రాక్టీస్ చేస్తున్నా...

22 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

:) బాగుందండి. విషయమేదైనా సరే మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.

శ్రీనివాసరాజు చెప్పారు...

@శిశిర గారు,
టపా మీకు నచ్చినందుకు సంతోషం.
ఇవి సాఫ్ట్వేర్ బతుకు చిత్రాలు.. అందరికీ అర్ధంకావు సాఫ్వేర్ వాళ్ళకు తప్ప.
మీ కామెంటుకు ధన్యవాదములు

శిశిర చెప్పారు...

నాకూ తెలుసండి ఈ సాఫ్ట్వేర్ బతుకు చిత్రాలు. అర్థం చేసుకోగలను.

శ్రీనివాసరాజు చెప్పారు...

@శిశిర గారు,

మీరూ.. బ్రహ్మిణీ సాఫ్వేర్ ఇంజనీర్ ఆ!!.. అందుకే అర్ధం అయ్యింది.. చాలా మంది బ్రహ్మీలకు కూడా అర్ధంకాలేనట్టుంది.. మీవి నావి తప్ప కామెంట్లు లేవుగా.. హి హీ.. :-)

Mauli చెప్పారు...

కమ్యూనిస్టు కార్యకర్తలాగా ఎర్రగా ఇన్ బాక్సులో మెరిసిపోయింది :))

శ్రీనివాసరాజు చెప్పారు...

@మౌళి గారు,
కాస్త నెమ్మదిగా చెప్పండి.. కమ్యూనిస్టులు చూసారంటే నన్ను కుమ్మేయగలరు. :-)

మీ కామెంటుకు ధన్యవాదములు.

స్వామి ( కేశవ ) చెప్పారు...

అందులో ఏదొచ్చినా, అంటే... ఆంజిలీనా జోలీ వచ్చినా అసలు దానిజోలికే వెళ్ళొద్దు. ఏవరొచ్చినా నాకు మెయిల్ కొట్టు. నేను చూసుకుంటాను.. :) :))

పోస్ట్ చాలా బాగుందన్నాయ్..

వాత్సల్య చెప్పారు...

>>పురుడ్లమేనేజర్

:)).

Nice and Funny post.

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హ.. చాలా బాగా చెప్పారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కష్టాలు.. చాలా చాలా బాగుందండి టపా:)))

>>"ఏం చేయాలి కోటి"
>>బట్టీబట్టిన బాలకృష్ణ బయటకు రాకుండా
>>టపటపామంటు షాక్కొట్టిన కాకుల్లా

ఇలా ఇస్తూ పోతే పోస్ట్ అంతా పెట్టాల్సి వస్తుంది..:)) సూపరు అంతే:)

SJ చెప్పారు...

bagundi...

శ్రీనివాసరాజు చెప్పారు...

@స్వామి తమ్ముడూ.
నచ్చినందుకు సంతోషం.
మనలో మనమాట.. టపా నచ్చిందా.. లేక ఏంజిలినా జోలీ నచ్చిందా! :-)

@రిషి గారు
డెలిబరీ మేనేజర్ కి తెలుగర్ధం అదే కదండీ.., కాదా??, అదిగో మీరు నవ్వుతున్నారు.. నన్ను వెటకారం చేస్తున్నారు. వా.. :-)

@మనసుపలికే గారు
మీకు నచ్చినందుకు సంతోషం.
మొత్తం మళ్ళీ పోస్ట్ రాసేయకండి.. నాదినేనే చదువుకోవాలంటే.. నా కోడ్ లో బగ్గ్స్ నేనే వెతుక్కున్నట్టుంటుందేమో. :-)

@సాయి గారు
నచ్చనందుకు సంతోషం.

కామెంటుకు ధన్యవాదములు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చాలా బాగా వ్యక్తపరిచారు శ్రీనీ మన కష్టాలని...చాలా నవ్వించారు కూడా...

శ్రీనివాసరాజు చెప్పారు...

@శేఖర్ గారు
ఒక 'జోగి' కష్టాలు మరో 'జోగి'కే తెలుస్తాయికానీ.. 'భోగి' కి కాదుగా.. :)
కష్టాలను కషాయం తాగినట్టుగా దిగమింగుకుని నవ్వుకున్నందుకు సంతోషం. :)

Geetha Sagiraju చెప్పారు...

డెస్క్ కిందకి దూరి నవ్వుకుంటుంటే.. వెనుకెవరో వచ్చినట్టు నీడపడింది. బలవంతంగా నవ్వాపుకుని దగ్గినట్టు నటిస్తూ.. సిపియు.. వైర్లు లూజయితే కదిపినట్టుగా ఏక్టింగ్ చేసి పైకి లేచి చూస్తే

అసలు ఆ సీన్ చదువు తుంటే నాకు నువ్వు కనిపించేసావ్ అసలు నవ్వ లేక పోయా..

ఫైనల్లీ చాలా చాలా బాగుంది.. :)))))

Mauli చెప్పారు...

ఈ టపా ఎన్నిసార్లు చదివినా మళ్లీ చదవాలనిపిస్తో౦ది అ౦డీ . అది కాక డెవలపర్ కష్టాలు వినడ౦ మాకెప్పుడూ బావు౦టు౦ది కూడాను :-)

No Name చెప్పారు...

మౌళీగారు
భలే చెప్పారు మౌళీగారు, ఇంత తెలివైన మీకు తప్పకుండా నా గోళీల వివరం తెలిసుంటుంది, కొంచెం నా గోళీలెక్కడున్నాయో చెప్పి పెట్టరా? ప్లీజ్‌

శ్రీనివాసరాజు చెప్పారు...

@గీత
టపా నచ్చినందుకు సంతోషం.. అంతే మా డెవలపర్ల్ అంటే అందరికీ వెటకారమే.. ఏం చేస్తాం.. :)

@మౌళీ గారు
మీరు టెస్టర్ అని చెప్పకనే చెప్పారు.. నవ్వుకోండలా నవ్వుకేండి.. మా డెవలపర్ల్ అంటే ఎకసెక్కాలుగా వుందే!

@అగినాత
మీరేంటో మీ గోళీలేంటో అర్దంకాలెదు..
ఖాలీగా కూర్చుని గోళీలాడుకునే వాళ్ళు టెస్టర్లు కదా! ఆ మతలబే అర్దంకాలేదు.. :)

సత్యం శివం సుందరం చెప్పారు...

long long ago
విశ్వనాధ సత్యనారాయణ గారి
"విష్ణుశర్మ English చదువు"
చదివినప్పుడు కడుపుబ్బా నవ్వుకున్నట్లు
గుర్తు మళ్లీ ఇవాళ ఇలా !
ధన్యవాదాలు!!

శ్రీనివాసరాజు చెప్పారు...

@UMEC
మనసారా నవ్వుకున్నందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు.

Ravi చెప్పారు...

apologies first for writing in English my comments as i dont know to post in Telugu.
Enjoyed this post very much while reading.Your humour touch is very timing and classic.Thanks for your post.Keep going

Anu Krishna చెప్పారు...

నమస్కారం,

మీ పోస్ట్లులు చాలా బాగున్నాయి ..ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి గా మీ పోస్ట్ లను అభినందించకుండా ఉండలేక పోతున్నాను ..సాఫ్ట్వేర్ బతుకు చిత్రాలను , లోటుపాట్లను బాగా విసిదీకరించారు...

సెలవు..
అనుకృష్ణా...

శ్రీనివాసరాజు చెప్పారు...

@రవీంద్రగారు, అనుకృష్ణగారు
మీకు నచ్చినందుకు సంతోషం.
కామెంటుకు ధన్యవాదములు
ఇలానే చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. :-)

Related Posts Plugin for WordPress, Blogger...