22, జులై 2011, శుక్రవారం

నేల మాళిగలో...


అన్ని న్యూస్ చానళ్ళలోనూ ఫ్లాస్ న్యూసులొస్తున్నాయి. ఐదవ నేలమాళిగలో అంతులేని ధనరాశులు లభ్యం. పుట్టపర్తిలో నేలమాళిగలున్నట్టు అనుమానం. అన్ని గుళ్ళలో నిధినిక్షేపాలకోసం తవ్వకాలు...పొద్దున్నుండీ.. అదే న్యూసు.  వీళ్ళ డి.వి.డి లు అరిగిపోనూ.. ఎన్ని సార్లు వేసిందే వేస్తారు.. వినివినీ బోర్ కొట్టింది..

తమిళోడు తెలుగు నేర్చుకొచ్చాకా.. మాలికా అనరా.. అంటే.. మాళిగా..అన్నట్టు..ఇంతకీ ఈ నెలమాళిగంటే ఏంటో.., ఏదైతే ఏంటిలే..ఎన్ని దొరికితె ఏంటిలే.. మనకేమన్నా ఇస్తారా చస్తారా.
మ్చె.. దేవుడా.. నాకూ ఒక బంగారునాణేల మూట దొరికినా బాగున్ను..  హోమ్ లోన్ అంతా ఒక్క దెబ్బతో తీర్చేద్దును అనుకుంటూ.. చానల్ మార్చాను. ఏ చానల్ చూసినా ఇదే గోల. ఛా.. ఎఫ్ టీవీ పెడదాం. అని పెట్టానోలేదో.. సైజ్ జీరోనో ఎంటో అంట ఖర్మకాకపోతె ఈ మధ్య అమ్మాయిలంతా ఫేషెంట్లలాగా సన్నగా అయిపోయి.. గెడకర్రలకు గుడ్డలేసినట్టుగా.. కర్రముక్కకు కర్చీఫ్ వేలాడేసినట్టుగా తయారయ్యిన లేడీసు టిక్కుటక్కుమంటా నడుస్తుంటే.. అసలు మజాయే అనిపించలేదు అందుకే మార్చేసి.. అలా అలా చానల్లు మారుస్తూనేవున్నాను.

కరెంటు పోయినట్టుగా చుట్టూ చీకటైపోయింది.. కాసేపు నిశ్శబ్దం. నేనెక్కడున్నానో నాకు అర్దంకావటంలేదు. అటు ఇటూ చూస్తే.. నేను సోఫామీదే వున్నాను.. ఎదురుగా టీ.వీ ఆడుతుంది... అంటే కరెంటుపోలేదన్నమాట..!, మరి ఏమైంది..?, ఏమో నాకు తెలియటంలేదు. ఉన్నది మాఇంట్లోనే.. కాకపోతే.. మొత్తం ఇల్లంతా ఖాలీగావుంది. ఇదేంటి అనుకునేంతలోనే దూరంగా ఏదో మెరుపు. లైటు కాంతిలేకపోయినా చీకట్లో దగదగా మెరిసిపోతున్న నగలు ఒంటినిండా దిగేసుకుని కనిపించింది ఒక మానవాతీత రూపం.

అమ్మో దెయ్యమా..!, చఛా.. దెయ్యం అయ్యిండదు.. లేక ఆ ఎఫ్ టీవీలో అమ్మాయెవరన్నానా?.. అనుకునేంతలో, "ఒరే!, పాపికొండలరావ్", అన్న మాట ఎకో ఎఫెక్టులో వినిపించింది. ఇదేంటిది.. ఈ కొండలరావ్ ఎవరున్నారబ్బా అని అనుకునేంతలో.. "నేనురా!.. నువ్వు పిలిచిన దేవుణ్ని", అని మళ్ళీ ఎకో ఏఫెక్టులో వినిపించింది వాయిస్.

"అయ్యబాబోయ్.. మీరా!.. దేవుడుగారూ.., మా తెలుగుసినిమాల్లో చూపించినట్టుగా స్పెషలెఫెక్టులు లేకుండా మీరు సైలెంటుగా వచ్చి ఇక్కడ కూర్చొంటేనూ.. ఎవరో అనుకున్నా తప్పైపోయింది క్షమించేయండి", అని  చేతిలోవున్న రిమోట్ పక్కనపెట్టేసి.. రెండుచేతులూ జోడించి వేడుకున్నాను..

"నేను పిలిస్తే వచ్చారా.. స్వామీ. అవును మీరు తెలుగులో మాట్లాడుతున్నారు.. అంటే మనది ఆంధ్రాయేనా.. ఏవూరు స్వామీ.. ఏ ఏరియా.. తెలంగాణానా.. రాయలసీమా.", అని ఇక్కడ తెలుగుమాట వినగానే అడిగే ప్రశ్నలు అలవాట్లో పొరపాటుగా అడిగేసరికి..దేవుడుగారికి మంటెక్కిపోయింది... "ఆపండ్రా.. ఆపండ్రా..", అని పెదరాయుడు సినిమాలో మోహన్ బాబులా గర్జించారు దేవుడుగారు.

"అయ్ బాబోయ్.. క్షమించేయండి దేవుడుగారు.. మిమ్మల్ని ఎప్పుడుపిలిచానో.. గుర్తురావటంలేదు.. ఎందుకొచ్చారో అదీ మీరే చెప్పేస్తే...", అని నెమ్మదిగా గొనిగినట్టు అడిగాను.

"మూట కావాలని అడిగి మళ్ళీ ఎందుకొచ్చావంటావా... నీ మొర విని అనవసరంగా మిగతా ఎసైన్మెంటులు వదిలేసి వచ్చానుకదరా.. మూటాముళ్ళూ సర్దుకుని వెంటనే వెళ్ళిపోతున్నా", అని ప్రక్కనున్న ల్యాప్ టాపు బ్యాగ్ వేసుకుని లేవబోయారు దేవుడు గారు.

"వద్దు స్వామీ వద్దు మళ్ళీ క్షమించెయ్యండి..", అంటూ.. ఆ ల్యాప్ టాప్ బ్యాగేంటీ..దేవుళ్ళు కూడా ఇది వాడతారా...అని అడుగుదామని నోటిదాకా వచ్చినమాట వెనక్కుమింగేసి. రాక రాక ఇంటికొచ్చారు.. ఏదన్నా తినటానికిపెడదాం.. అని మిగిలిన చికెన్ బిర్యాణీ తీసుకొద్దామనుకున్నాను., అయ్ బాబోయ్.. ఇంకా నయం ఏమన్నావుందా.. అది పెట్టానంటే ఇప్పుడు ఈ హాల్లోనే నన్ను భస్మంచేసేసి... అని నీళ్ళునమిలి..
"మంచినీళ్ళు కావాలా స్వామీ... ప్యూర్ గా ప్యూరిట్ తో ఫిల్టర్ చేసినవి స్వామీ", అన్నాను.

"అక్కర్లేదు.. మూటిస్తాను అనగానే.. నీ మర్యాదలు ఎక్కువైయ్యాయేమిటిరా భక్తా", అంటూ దేవుడుగారు కూర్చున్నారు.

అదేంలేదు స్వామీ.. "చిత్తం మహాప్రభో.. మూట ఎక్కడున్నదో..ఆ చిత్రవిచిత్రమును నాకు చిత్తరువేసి చూపించుడు... ఇప్పుడే.. ఇక్కడే.. పలాయనం చిత్తగించుడి", అని ఏవేవో  పాత పౌరాణిక డైలాగులు ప్రాసలోకొచ్చినవి గుర్తుచేసుకుని చెప్పేసాను.

నా డయలాగు పూర్తికాకుండానే.. దేవుడుగారు లేచి వెళ్ళిపోవటానికి మళ్ళీ ల్యాప్ టాపు బ్యాగు సర్దుకుంటున్నారు.. అదేంటి స్వామీ నేనేదో అర్దం అడగరు కదా అని ఏవేవో డయలాగులు చెప్పాను, ఏమన్నా తప్పుగా అనుంటే.. క్షమించేసి ఆ మూట విషయం చెప్పి వెళ్ళిపొమ్మని కళ్ళనీళ్ళుపెట్టుకున్నాను.

"ఏడవకు భక్తా.. నీకు మూట ఇవ్వటానికి రాలేదురా, ఆ మూట దొరికే మార్గం ఎక్కడుందో చెప్పటానికే వచ్చానురా.", అని చిరునవ్వునవ్వారు దేవుడు గారు.
"చెప్పండి స్యామీ... అంతకన్నా మహాభాగ్యమా ", అని మిస్ అవకూడదని మొబయిల్లో రికార్డింగ్ చేయటం మొదలుపెట్టి.. కళ్ళుమూసుకుని చాలా ఆశక్తిగావినటం మొదలుపెట్టాను.

"మీ ఇంటిలో నువ్వు నడుస్తుండగా ఎక్కడైతే గల్లుగల్లని గజ్జెల శబ్దం వినిపిస్తుందో.. ఆ తరువాత లక్ష్మీదేవి నవ్వినట్టు వినబడుతుందో అక్కడ తవ్వితే.. ఒక నేలమాళిగ వుంటొంది.. అందులో నీ హోమ్ లోన్ కి సరిపడా సిరులు ఒక మూటగట్టివుంటాయి.. వెతుక్కో పో", అని దేవుడుగారు.. మాయమైపోయారు.

"అయ్యయ్యో.. ఒక్క హోమ్ లోనుకు సరిపడానేవుంటాయా... స్వామీ అనవసరంగా తక్కువే కోరానే..", అని కళ్ళుతెరిచి చూసేటప్పుడుకి.. సోఫాలో నిద్రపోతున్న నాకు మెలుకువ వచ్చేసింది. ఓహో.. ఇదంతా కలా అని అనుకోలేదు.. ఎందుకంటే అది కలే.. లేకపోతే. నేను చేసే ప్రార్ధనలకి దేవుడు రావటమేంటి.

కానీ కలలాగా అనిపించటంలేదు.. ఎక్కడో అదే విషయం మనసులో మెదులుతూనేవుంది. లచ్చిందేవి ఎక్కడ నవ్వుతుందా అని అనుమానంతో  నడుస్తున్నప్పుడు ఆగి ఆగి.. గమనిస్తూనేవున్నాను.
అలా నడుస్తూ.. ఇల్లంతా తిరుగుతూనే వున్నాను.. సోఫాకి డైనింగ్ టేబుల్ కి మధ్యకి వచ్చేసరికి వినిపించింది గల్ గల్ గల్ అని గజ్జెల శబ్దం. ఆ తర్వాతే..హహహహా.. అని నవ్వు.., ఆ.. అదేనవ్వు.. లచ్చిందేవినవ్వు అనుకునేంతలో..మళ్ళీ గజ్జెల శబ్దం..మళ్ళీ నవ్వు.. తరువాత.. "జిలిబిలి పలుకుల. చిలిపిగ పలికిన", అని సితార సినిమాలోని పాట జెమినీ మ్యూజిక్లో వస్తుంది..

ఓహో..ఇది భానుప్రియ నవ్వా..ఇంకాలచ్చిందేవి నవ్వనుకున్నానే అనుకుని కూర్చుందాంలే...అని ఇంకో రెండడుగలు వేసానో లేదో.. కాలికింద టైలు కాస్త టక్ మంది.. మళ్ళీ ఒకడుగు వెనక్కేసి.. మళ్ళీ తొక్కాను..మళ్ళా టక్.. లచ్చిందేవి నవ్వటం అంటే.. భానుప్రియ నవ్వినట్టే నవ్వక్కర్లేదు.. ఏదో శబ్దంవస్తే చాల్లే..ఇక్కడే వుండుంటుంది..అనిఎవరూచూడకుండా.. వెళ్ళి స్క్రూడైవర్ తో చిన్న రంధ్రం చేసి టైలు పైకిలేపేసాను.. టైలు కింద సిమెంట్ లేకుండా ఇసుక దొలిచేకొద్దీ వస్తుంది.. సులువుగా గొయ్యి పడిపోతుంది. అయితే ఇదే.. ఇక్కడె నేలమాళిగుందని నాకు నమ్మకం కుదిరింది. ఎవరికీ తెలియకుండా కార్పట్ కాస్త అటు లాగి.. పైన కప్పేసి ఆ రోజు ఆఫీసుకెళ్ళిపోయాను .

సాయంత్రం వచ్చి చూసేసరికి నేను చేసిన దానికన్నా రెండింతలుంది గొయ్యి. ఇదేంటబ్బా ఇంట్లో ఎవరికన్నా తెలిసిపోయిందంటావా అని గోతిలో వెతికి చూసేసరికి ఒక కాలువిరగ్గొట్టేసిన ఏనుగుబొమ్మ కనబడింది.. అప్పుడర్దమయ్యింది.. ఈ పని మా బుడ్డోడిదేనని.

పర్లెధు తండ్రికి తగ్గ కొడుకేనని కాస్త గర్వంతో కూడిన చిరునవ్వునవ్వుకుని భుజాలు చరుచుకున్నాను.  ఆ రోజు నేనుకాస్తా.. తరువాత రోజు మావాడు కాస్తా.. అలా ఒక వారం రోజులయ్యేసరికి చెయ్యిదూరేంత కన్నం పడింది నేలకి.. అందులోంచి చూస్తే వెలుగు కనబడుతుంది..ఇదేంటిది నేలలో వెలుగా.. అయితే ఇది నేలమాళిగే..త్వరగా తవ్వేయాలి... అదే న్యూసు మరాఠీ చానళ్ళలో చూపిస్తే.. పక్కింటోడికీ ఈ అయిడియా వస్తే... వాడూ తవ్వేస్తే.. నా మూట నొక్కేస్తే.. అమ్మో.. ఈ రాత్రంతా అదే పనిలోవుండాలి అని కావలసిన సరంజామా అంతా చేసుకోవటం మొదలెట్టాను.

అందరూ పడుకున్న సమయం చూసి... నేను లేచివెళ్ళి.. ముందుగా రడీచేసుకున్న వస్తువులు పట్టుకెళ్ళాను.. మొబైల్లో టార్చ్ లైట్ వేసి.. పనిమొదలుపెట్టాను.. కన్నం పెద్దదిచేస్తూ.. అడ్డుగా వస్తున్న ఇనపరాడ్లను కోస్తూ మనిషిదూరేంత చేసేసరికి తెల్లవారిపోతుంది. నెమ్మదిగా కిందకు దూకి చూసేసరికి ఒక చిన్నగదిలావుంది.. అందులో ఒక చెక్క పెట్టివుంది.. ఆ పెట్టిపై ఒక పెద్ద మూట.. మూట సైజును బట్టి చూస్తే చాలా నాణేలుండేటట్టే అనిపించాయి... మరి పెట్టెలో ఏముందో.., అవన్నీ తరువాతచూడొచ్చు..ముందు మూటవిప్పెయ్యాలి అని మూటను లాగాను.. భరువుగా ధబ్బ్ అని కింద పడింది.. కంగారుకంగారుగా విప్పతున్నాను.. టెన్సన్లో.. చెమటలు పట్టి కారిపోతున్నాయి. సగం.. విప్పాను.. విప్పుతూనేవున్నాను..ఎంత విప్పినా పాతగుడ్డలే వస్తున్నాయి.. ఇంకా లోపలేదోవుంటుందని విప్పుతున్నాను.. మళ్ళీ పాత గడ్డలే..ఆఖరి గుడ్డ చూసేంతవరకూ నమ్మకం కుదరలేదు.. నేననుకున్న నాణేలు అందులో లేవు.. అది పాతగుడ్డలమూటేనని..

అదేంటి!!..మోసం.. దగా..అని దేవుణ్ని మళ్ళీ పిలుద్దామనుకున్నాను.. కానీ దేవుడు చెప్పినట్లే నేలమాళిగ వుంది అంటే మూటావుంటుంది. దొరికిన మూట పాతగుడ్డలమూట అయ్యిందంటే ఇంకా ఇక్కడే ఎక్కడో వుంటాయి చూద్దాం... అనుకుంటుండగా.. పక్కనేవున్న పెట్టి నా దృష్టిలో పడింది. అయితే ఈ పెట్టెలో వున్నాయోమో చూద్దాం అని  పాతగుడ్డలన్నీపక్కకుతోసి..నిలబడేసరికి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి..  కాస్త గోడదగ్గరకు నక్కి ఆ మాటలు వినసాగాను.. కాసేపటికి స్పష్టంగా మనుషుల మాటల్లా వినపడ్డాయి.. కానీ అర్ధం అవటంలేదు..ఏంటివి దేవతలబాషా.. కానీఎక్కడో విన్నట్టుందే..ఆ గొంతుకూడా.. అని అలోచించంగా  చించగా అర్ధం అయ్యింది.. ఆ మాటలు... తెలుగు కాదనీ.. మరాఠీలో వున్నాయని.

అప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది... ఆ మాటలు మా కింద ప్లోర్లో వుంటున్న పాటిల్ గారివనీ.

దేవుడా ఎంత పనిచేసావు.. నేను గొయ్యితవ్వింది ఫోర్త్ ఫ్లోర్లోవున్న నా ప్లాటుకా!, వెతుకుతున్నది మరాఠీ వాళ్ళ పాతగుడ్డలా.. చిచిఛీ.. అని తలపట్టుకున్నాను... పట్టుకున్న ఆ తలని గోడకేసి కొట్టుకున్నాను.. నన్ను ఎవరో తట్టినట్టుగా అనిపించి లేచాను.., లేవండి ఆఫీసుకి టైమవుతుందని మా అవిడనన్ను తట్టి లేపింది. ఏంటి మూడో ఫ్లోర్ పాటిల్ గారొచ్చారా అన్నాను.. ఆయనెందుకొస్తారు.. కలగన్నారా..అంది.

ఏంటి ప్లాష్ బ్యాక్లో ఇంకొక ప్ల్యాష్ బ్యాకులాగా.. ఇదీ కలేనా.. అంటే కలలోని కలా! అన్నా.


9 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

హహహహ భలే రాసారండీ....గుంట తవ్వి కింది ఫ్లోర్లోకి వెళ్ళిపోయారనగానే ఫక్కున నవ్వేసాను.

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. నవ్వలేక చచ్చా బాబోయ్...:))))
మీరు టైల్స్ తవ్వుతున్నారు అనగానే నాకు డవుటొచ్చిని;) ఈ కాలంలో ఫ్లాట్లు తప్ప ఇంకేమున్నాయా అని.. మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా, శ్రీనివాస్ గారిది ఇండిపెండెంట్ ఇల్లేమో అని;);)
టపా మాత్రం సూపరు..అద్భుతం...

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఆ.సౌమ్య గారు
అది కలలోనే తవ్వానండి.. లేకపోతే మా మూడో ఫోర్ ఆయనతో నాకీరోజు మీటింగ్ వుండేది. :))

@మనసుపలికే గారు
బాగా నవ్వుకున్నందుకు సంతోషం. నాది ఇండిపెండెంట్ ఇల్లన్నారా! ఏదీ నోరుతెరవండి.. పంచధార పోస్తా.. మీ నోటిచలవవల్ల మరో మూడేళ్ళలో నేను అదికొంటానని అనుకుంటున్నాను. :-)
టపా నచ్చి కామెంటినందుకు ధన్యవాదములు.

Vinay Datta చెప్పారు...

very very nice.

madhuri.

శ్రీనివాసరాజు చెప్పారు...

@మాధురి గారు
టపా నచ్చినందుకు సంతోషం. ఇది చదివి మీ ఫ్లోరింగ్లు తవ్వుకుని పాడుచేసుకుంటే నా భాధ్యత కాదని మనవి. :-)

సుభద్ర చెప్పారు...

ఓహో మొత్తానికి సొరంగం తవ్వేశారన్నమాట!!

సుభద్ర చెప్పారు...

ఓహో మొత్తానికి సొరంగం తవ్వేశారన్నమాట!!

జీడిపప్పు చెప్పారు...

lolll funny, as usual!

శ్రీనివాసరాజు చెప్పారు...

@సుభద్ర గారు
అవునండే.. తవ్వకతప్పలేదండే మరే.. :)

@జీడిపప్పు గారు
నచ్చినందుకు సంతోషం.. ఒక్క కామెంట్లేనా లేక జీడిపప్పేమన్నా ఇస్తారా.. కాస్త పార్సిల్ చేసి పంపిద్దురూ..


చాలా రోజులు తరువాత మళ్ళీ నా బ్లాగుకొస్తున్నా.., మీ కామెంట్లు చూసి నాకు మెలకువొచ్చింది. :)

Related Posts Plugin for WordPress, Blogger...