బక్రా డాట్ కామ్...


రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
5:44 PM
19
ఆభిప్రాయాలు

హైదరబాద్... మహా నగరం..
ఐదో ఆరో FM రేడియో స్టేషన్లు...
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బహుళజాతి కంపెనీలు...
స్వదేశంలో విదేశీయతకు ఏమాత్రం తీసిపోని షాపింగ్ మాల్స్, డిస్క్ లు.., పబ్‌లు..., బార్లూ...
నిజాం పాలనను గుర్తుచేస్తూ... తీపి గురుతులుగా మిగిలిపోయిన చారిత్రక కట్టడాలు...
ఏ దేశంనుండొచ్చినా సొంతింటి రుచులను ఆస్వాదించగలిగే హోటళ్ళూ... రెస్టరెంట్లూ...
ఎన్నో వింతలూ విశేషాలే కాకుండా... చూస్తుండగానే ఎదిగిపోయిన ఈ నగరంలో...
చూడటానికే అసహ్యమైన విషయాలున్నాయి...
పైకి భూతల స్వర్గంలా కనిపిస్తున్నా... ఇది భూతాల స్వర్గమే..
అదేంటి అలా అనేసాను అనుకుంటున్నారా!!
ఇవి చూడండి మరి... వీటినేమంటారో???
ఉదయం ఏడున్నరకి అలారం మ్రోగగానే మళ్ళీ ఆఫీసా అనుకొనేవాడిని... ఒకప్పుడు.
స్కూల్ కి వెళ్ళే వయసులో అయితే... అమ్మో.. ఈ రోజు లెక్కలమాష్టారు క్లాసు బాబోయ్...
కానీ ఇప్పుడు... లేవగానే ఆఫీసు.. మా మేనేజరు కన్నా ముందుగా గుర్తొచ్చేది...
MCH వారి చెత్త బండి,
ఏ టౌముకి ఆఫీసుకు బయలుదేరినా తప్పని.. చేజింగ్ లా తగులుకుంటుంది నాకు..
హమ్మయ్య సగం దూరం వచ్చేసాం.. ఇక ఈ రోజు అదృష్టం కొద్దీ చెత్తబండి రాలేదు...
అనుకునేంతలోనే... దూరదర్శన్ నాటికలో రామేశం పాత్రలాగా... తెరచాటునుండి..
ఎప్పుడు వద్దామా అన్నట్లు.. చటుక్కున ఊడిపడుతుంది... ప్రక్క సందులోంచి...
హారన్ కొట్టినా వినపడదు... అసలు వాడిలోకమే వాడిది... ఎవరికీ లొంగని మోనార్క్ లా
దూసుకుపోతుంటాడు..
నేను వెనుక హెల్మెట్ తో భంధింపబడి... ముక్కుమూసుకునే వీలులేక పడే అవస్త... ఒకటైతే...
వెనుకున్నవాడు.. కొట్టే హారన్ ఇంకొక అవస్త..., ఈ భాధలు పడలేక పాటలువిందామని
FM ఆన్ చేసి ఇయర్ ఫోన్స్‌లో హాయిగా పాటలు వింటూ కొంత దూరం వెళ్ళగలిగినా...,
"కజ్ రారే.. కజ్ రారే..", పాట కూడా కంపుకొట్టి.. "కచ్ రా రే.. కచ్ రా రే.. తెరె బద్బూ బద్బూ గాడీ...,
... కచ్ రా ", గా మారిపోయింది....
ఇక ట్రాఫిక్ విషయానికొస్తే... చదువుకున్నోడు అంతే.. చదువురానివాడూ అంతే...,
సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోతూ..., ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నే తిడుతుంటే...
ఏమనాలండీ వాళ్ళని...,
అక్కడే గట్టిగా హారన్ కొట్టేవాడొకడు... సిగ్నల్ దగ్గర ఆగి హారన్ కొట్టడం ఏం మాయరోగమో మరి...,
ఆ ప్రక్కనే... సిగ్నల్ వదిలినా వెళ్ళకుండా... దారిలో ఆపేసి సెల్ ఫోన్ మాట్లాడే వాడొకడు...
ఇవన్నీ చూడలేక చూసి ఉండలేక... అక్కడికక్కడే... అపరిచితుడు సినిమాలో రామం క్యారెక్టర్
వేసేద్దాం అనిపిస్తుంది.. కానీ.. టైము చూస్తే... అప్పటికే గంటన్నర లేటు ఆఫీసుకు...,
ప్రతీరోజు లేటుగా వెళితే మా మేనేజరు రెమో క్యారెక్టరు వేస్తాడని భయమేస్తుంటుంది.
ఈ సిగ్నల్స్ దగ్గర బైకు భాధలన్నీ పడలేక... సరదాగా వీకెండ్స్ లో బయటకు వెళ్ళేటప్పుడు..
ఆటోలో పోదామని అనుకున్నామా అంతే సంగతులు...
వాడు కుదిపే కుదుపులకు... ప్రెగ్నంట్ కానివారికి ప్రెగ్నెన్సీ... ప్రెగ్నంట్ అయినవారికి ఫ్రీ డెలివరీ ఖాయం.
ఆటోకి డిజిటల్ మీటరుంటుంది... కానీ తిరగదు.. తిరిగినా మీటరుపై రాడు వాడు..
"అరె ఫో.. మీటరుపై రాకుంటే... ఇంకెందుకు బాబూ మీటర్.. ", అని నాలుగు తిట్లు తిట్టి..
తప్పక.. అటో ఎక్కి వెళ్ళాల్సొస్తుంది..
"సాదా మీటర్.. గవర్నమెంట్ భంధ్ చేషిండు సార్..", అని.. గుట్కా వాసనకొడుతూ
తన స్టోరీ చెప్పుకుపోతుంటాడు.. ఆటోవాడు..,
మరి ఎందుకయ్యా డిజిటల్ మీటర్... ఉపయోంచకుండా దండగ అంటే..
"ఏం చేస్తం సార్.. ఫోలీషోడు చూషినాడంటే... వంద నొక్తడు... అందుకే.. పదేనొందల మీటర్‌ని..
బ్లాక్లొ నాలుగువేలు పెట్టి కొన్నం",
గవర్నమెంట్... లిమిట్ గా మీటర్లిచ్చిండు సార్... పూరా బ్లాక్ నడిషింది..,
మీటర్ పై పోతే మాకేమొస్తది...", అని ఆటోవాడు తనభాధలు చెప్పుకుంటాడు...
ఆటో దిగ్గానే వందనోటు చదివించుకొని...
ఒర్నాయనో YS కష్టాలు YS వి, KCR కష్టాలు KCR వి అన్నమాట..
పాపం ఈ ఆటోవాడికీ ఇన్ని కష్టాలా... అనుకుంటూ... పొల్యూషన్ పొగవల్ల...
మొహంపై రెండంగుళాల మందాన పట్టిన జిడ్డును వదిలించుకోటానికి
ఎన్ని కష్టాలు పడ్డానో నేనెవరకు చెప్పుకోవాలి....
ఇలా బయట అడుగుపెట్టాలంటే... వందనోటున్న నవాబులే ఈ నగరంలో
బ్రతకగలరు.. అనుకుంటే... ఇక సామాన్యుడి పరిస్ధితేంటో...
ఈ గోలంతా పడలేక వీకెండ్ వస్తే ఇంట్లోనుండి కదలాలంటే భయంపుడుతుంది...
వేలెంటైన్స్ డే..., న్యూ ఇయర్ డే... లాంటి.. ఏదైనా స్పెషల్ డే వచ్చిందీ అంటే...
ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయన్న విషయమే గుర్తుండదు జనాలకి..
ఎవడిస్టమొచ్చినట్లు వారు కంగారుగా దూరిపోయి, దూసుకుపోయి.. వెళ్ళిపోవటమే...,
బిర్యాణీ పాయింట్స్ దగ్గర మూగిపోయి కంగారు పడిపోవటం.. ఎక్కడో టీవీచానల్స్ లో పెట్రో ధరలు పెంపు
అని వినగానే... పెట్రోలు పంప్స్ దగ్గర ఎవడి కంగారు వాడిది...
చికెన్ షాపుల దగ్గర కంగారు..., ఆకరికి బార్బర్ షాప్ దగ్గర కూడా త్వరగా వెళ్ళిపోవాలని
ప్రక్కవాడిని తోసుకుని మరీ కంగారు...
ఉల్లి ధర పెరిగే అవకాశం అన్న గాలి వార్తైనా సరే... మూగి మూగి.. పడి చచ్చిపోతుంటారు...,
ఒక క్యూ కడదామనో... పద్దతి పాటిద్దామనో అలోచన ఉండనే ఉండదు.. ఎవడి స్వార్ధం వాడిది...
ఇదే విషయం కొలీగ్స్ మాట్లాడుకునేటప్పుడు వస్తొంటుంది.... మీ కోస్తా, రాయలసీమోల్లే వచ్చి
చెడగొట్టారని... కొందరు.. లేదు మీ తెలంగాణా వాళ్ళే అని.. మరికొందరు... సెటైర్లేసుకుంటుంటారు...,
నువ్వు ఎధవ.. నువ్వు ఎధవ అని ఇద్దరూ ఎధవలైనట్లనిపిస్తుంతొంది...
పబ్లిక్‌లో పబ్లిక్ టాయిలెట్స్ లేక పాపం రోడ్ల ప్రక్కనే కానిచ్చేస్తుంటారు కొందరు...
కొన్ని చోట్ల పబ్లిక్ టాయిలెట్స్.. ఉన్నా పాపం చిన్నప్పటినుండి లేని అలవాటులేని కొత్తగా తెచ్చుకుంటే
దేశమెక్కడ బాగుపడిపోతుందో అని.. ఆ టాయిలెట్ గేటు దగ్గర... చుట్టుప్రక్కలా కానిచ్చే వారు... కొందరు...
"క్లీన్ చేషే కొద్దీ పోస్తనే ఉంటరు... పబ్లిక్, లైట్ తీస్కో", అని.. అనుకుంటుంటారో ఎంటో మరి..
అసలు పట్టించుకోరు... MCH వాళ్ళు..., ఆహా... ఏం అనుభంధం వీరిది... సమైఖ్య కుటుంబం...,
అంతేలేండి.. మనుషుల్లోనే సంస్కారాలు లేనప్పుడు... మనుషులు సృష్టించుకున్న కట్టుబాట్లలో సంస్కారమెక్కడొస్తుందీ???,
సాయంత్రం ఆరుదాటకుండానే గ్లాసుమెడలో కట్టుకుని తిరిగే మందుబాబులకి ఉండే స్వేచ్ఛ
ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదేమో..!!
ఏ విషయానికీ క్యూ కట్టని జనం... పబ్లిక్‌లో పబ్లిక్ గా ఒకే ఒక్క చోట క్యూలో నిలబడతారు...
అదే... వైన్ షాపుల ముందు.
అక్కడే నిలబడి... త్రాగి.., తన్నుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుంటే... వచ్చేపోయే జనాలకి..
ఎంటర్టైన్మెంటులా టైమ్ పాసయిపోతుంటుంది... ఈ పబ్లిక్ ఎంటర్టైన్మెంటు కల్పించిన సర్కార్ కి జోహార్లు...
హైద్రాబాద్ వచ్చిన ప్రతి వ్యక్తి ట్యాంక్ బండ్, చార్మినార్ ని చూడలేకపోవచ్చేమో కానీ...
ఈ వింతలూ విడ్డూరాలూ... ఎక్కడైనా ఎంట్రీ ఫీజులేకుండా ఫ్రీగా చూసే అవకాశం ఉంది...
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్...
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
12:31 PM
13
ఆభిప్రాయాలు

నో...., నో... ,నోనో....
అని పెద్ద కేకపెట్ట.. నిద్రలోంచి లేచాడు.. బాలు.. అసలు పేరు బాలసుబ్రమణ్యం...
వృత్తి పరంగా సాఫ్ట్వేర్. ఇంజనీర్...H1B వీసా పై అమెరికా వచ్చాడు...
వచ్చి. నాలుగు నెలలైంది... వీసా ఇచ్చిన కన్సల్టెన్న్సీ ద్వారా.
ఉద్యోగం కోసం వేట సాగించాడు... తనతో వచ్చివారందరికీ జాబ్స్ వచ్చేసాయి..కానీ పాపం బాలూ కు.. ఇంకా రాలేదు... ఇంకా రూపాయి కాసులు.. భయంకరంగా కలలోకి రావటంతో.. నిద్రలోంచి ఉలిక్కి పడి లేచాడు..
బయట విపరీతమైన మంచు వెళ్ళాలంటేనే చలికి వణుకు.. , ఆ వణుకుతోపాటు... ఇంటర్వూ భయం.. అన్ని వణుకులు ఎక్కువయ్యాయి..
అసలు MCA చేసిన తరువాత కూడా జాబ్ కోసం తిరిగినప్పుడే.. ఇంటర్వూ అంటే.. వణికి పోయేవాడు... ఏదో టైము బాగుండి... చిన్న కంపెనీలో జాబ్ కొట్టి... నాలుగేళ్ళు.. పనికి దొరక్కుండా.. నెట్టుకొచ్చి.. ఎనిమిది కంపెనీలు మారాడు... చఛా.. ఏంటో బ్రతుకు.. ప్రతి ఒక్కడికీ లోకువ అయిపోయాను.. అందరూ.. చక్కగా అమెరికా చెక్కేస్తున్నారు..
నేనెందుకు ట్రై చెయ్యకూడదు...అని అనిపించింది..
అప్పట్నుండీ డాలర్లే కల్లోకి రాసాగాయి..., రూపాయి కనపడితే చాలు.. చిరాగ్గా మొహం పెట్టేవాడు...
ఇంకెన్నాళ్ళీ.. మెతుకు.. బాధ.. చక్కగా.. బ్రెడ్ జామ్.. బర్గర్.. తింటూ.., డాలర్స్.. లెక్కపెట్టుకోక.... అనుకునేవాడు..., అందరితోపాటుగా..తనూ.. వీసాకి అప్లై చేసాడు.. లక్కీగా లక్కీడ్రాలో వీసా కొట్టాడు...
ఇక మనోడికి... కాలు భూమి మీదలేదు... కళ్ళలోకి కొత్తగా.. డాలర్.. సింబల్స్.. వచ్చి మెరవసాగాయి..., అమెరికా గురించి.. అక్కడ... అలవాట్లు.. పరిస్ధితులగురించి... అందరికీ ఫోన్ చేసి మరీ.. కనుకున్నాడు..., దానికి తగ్గట్లు... ఇండియాలోనే.. నడుచుకొవటం.. మొదలుపెట్టాడు...
పొద్దున్నే ఆఫీసుకొచ్చేసి... ఆరవగానే.. చంగున లేచి.. ఇంటికి.. బయలుదేరటం మొదలుపెట్టాడు...
ఏంటిరా వెళ్ళిపోతున్నావ్ అంటే.. US లో ఇంతే.. ఇంతే.. అని.. చెప్పేవాడు.. అలా రెండు.. రోజులు చూసి ఓపికపట్టిన ప్రోజెక్టు మేనేజరు.. ఆగలేక.. ఏంటిది అని అడిగేసాడు.. తడబడకుండా.... విషయం చెప్పేసి.. తరువాత రోజు నుండి.. నచ్చిన టైముకురావటం మొదలుపెట్టాడు...
ఏ షాపింగ్ కు వెళ్ళినా.. ఏం చేసినా.. డాలర్స్ తోటి కంపేర్.. చేసి..
ఓస్.. ఇంతేనా.. నాలుగు డాలర్లే.. అని.. పెదవి విరిచి.. కటింగ్స్ ఇవ్వటం చూసి.. తోటి ఉద్యోగులంతా... కాస్త.. చాటుగా నవ్వుకోసాగారు... అయినా మనోడు ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా.. అమెరికా సోది చెప్పడం మాత్రం మానేవాడు కాదు...
ఫ్రోజక్ట్ మేనేజర్.. పిలిచి... వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది.. నువ్వు.. చెయ్యకపోతే.. ఫో.. చేసే వాళ్ళని చెడగొట్టకు.. అని.. అయినా పట్టించుకోకుండా..
వాడితో.. నాకేంటి..బే.. నేను అవుతా.. మేనేజర్.. After 5 years US return...జాగ్రత్త.. వాడేనా ఏంటి... బోడి ప్రాజెక్టు మేనేజర్... అని.. నవ్వుతున్న కొలీగ్స్... దగ్గర.. గొప్పలు చెప్పుకుని కవర్ చేసుకున్నాడు...
ఇంటి దగ్గర నుండి వాళ్ళ నాన్న ఫోన్.. ఏరా బాబూ ఎలా ఉన్నావ్.. ఈ మధ్య అసలు ఫోన్ చెయ్యటంలేదు.. అని...,
"లేదు డాడ్.. నేను చాలా బిజీ" అనేసరికి వాళ్ళ నాన్న షాక్ తిన్నాడు.. "ఏందిరా ఇదీ.. కొత్తగా "నాయనా" అనడం మాని "డాడ్" అని పిలుస్తున్నొవ్.. ఏందో ఈ కొత్త పిలుపో..", అని వాపోయాడు..
అమెరికా వెళ్తున్నా డాడ్... ఇంకొక రెండు నెలల్లో... ఫ్లై అవుతా.. అని.. గొప్పగా చెప్పుకున్నాడు...
"ఒరే.. మరీ ఉద్యోగమూ..??", అని అమాయకంగా అడిగాడు.. బాలు చెప్పింది విని... భయపడ్డాడు.. ఒరే.. అక్కడ నువ్వు ఇమడగలవా??, కష్టమేమోరా.. ఎందుకురా.. సుఖంగా ఉన్న పేణాన్ని.. కష్టాల్లో పెట్టుకుంటావ్..?
ఇక్కడ.. ఈ ముప్పవేలు జీతం సరిపోతుంది కదరా..?, అప్పుడప్పుడు మమ్మల్ని చూడటానికి రావచ్చును కూడా..!!, ఎందుకురా.. ఇక్కడే ఉండిపోవచ్చుగా...? అని బ్రతిమలాడాడు నాయన..
తరువాత అమ్మ మాట్లాడి... కొత్తగా వచ్చిన పెళ్ళి సంభందం గురించి చెప్పింది..., పెళ్ళిచేసుకుని ఇక్కడే ఉండిపో బాబూ అని బ్రతిమలాడింది...
లేదమ్మా ఇంకా సెటిల్ కావాలి... డబ్బులు సంపాదించాలి.. అని మాట దాటేసాడు.. బాలు.. కాదురా బాబూ డబ్బే కావాలంటే.. వాళ్ళకి చాలా ఉంది ఒక్కతే కూతురు.. బాగానే కట్నం ముట్టజెప్పుతార్రా అని.. ఎర చూపి బ్రతిమలాడినా.. మనోడు లొంగలేదు..
"ఛా... డాలర్స్.. గుట్టలు పోసి.... లెక్కపెట్టుకోండిరా అంటుంటే... చీప్ గా.. చిల్లర రూపాయిలుగా పొయ్యి.. లెక్కపెడతా అన్నాడంట.. ఎనకెటికెవడో .. డాలర్ వేల్యూ మీకు తెలియటంలేదమ్మా..., నాకు అక్కడ.. నెలకు అన్ని ఖర్చులు పోగా.. లక్షన్నర మిగులుతుంది తెలుసా??, తిరిగొచ్చి... పెళ్ళిచేసుకుంటే.. డబుల్ కట్నం వస్తుంది.. నీకేం తెలియదులే నా ప్లాన్స్ అన్నీ...నే చూస్కుంటా", అని ఫోన్ కట్ చేసాడు...
$$$$$$$$$$$$$$$$$$$$
మొబైల్ ఫోన్ మోత విని... ఫ్లాష్ బ్యాక్ నుండి.. వెనక్కు వచ్చాడు..., ఆ రోజు శనివారమేమో.. రూమ్మేట్స్.. రూమంతా డిస్కోతెక్ చేసారు... ఫుల్ సౌండుతో ఇంగ్లీష్ పాటలు పెట్టి... డాన్సులు.. పెడబొబ్బలూ... ఒరే ఆపండ్రా బాబూ... ఎదో ఇంటర్వూ కాల్ లా ఉంది... అని బ్రతిమలాడుకుని.. మూలకెళ్ళి ఫోన్ లిప్ట్ చేసాడు..., బాలు కళ్ళలో డాలర్ సింబల్స్ మళ్ళీ మెరిసాయి... రెండు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వూలో సెలక్టయ్యావని.. సోమవారంనుండి.. వచ్చి జాయిన్ అవ్వమని.. కన్సల్టెన్సీవాడు.. కాల్ చేసి చెప్పాడు...
బాలూకు చాలా ఆనందంగా ఉంది..., కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు...
పొద్దున్నే 6.30 కి లేచి రడీ అయ్యి.. ట్రైన్ పట్టుకుని.. 8.30 కల్లా ఆఫీస్ లో ఉండాలి... కొత్త కంపెనీ కొత్త ప్రాజెక్ట్ అంటే.. మన ఇండియాలోలా ఒక మూడు నెలలు.. టైమ్ పాస్ చేయొచ్చు అనుకున్నాడు.. కానీ వెళ్ళిన మొదటి రోజే కనీసం ఇంట్రడక్షన్ అయినా లేకుండా పని.. ఇచ్చాడు.. ఒక తెల్లోడు..
ప్రక్కనే కూర్చుని.. చేస్తున్న పని చూడసాగాడు.. ఇక బాలూకు చెమటలు.. బీపీ..., ఆ తెల్లోడు యముడు లా తగిలాడు... ఎనిమిది గంటల్లో కనీసం ఒక అరగంట కూడా బయటకు వెళ్ళడు... ఒక్క ఐదు నిముషాలు టీ.. అదీ అక్కడికే తెచ్చుకుని తాగుతాడు...
ఏదన్నా తప్పు చేస్తే... చాలు.. What hell you are doing?? అని పెద్ద క్లాసు పీకటం మొదలుపెడతాడు..., మనది బానిస బ్రతుకేరా అక్కడ.. అని ఇంతకు ముందు ఫ్రండ్స్ చెప్తుంటే.. వినలేదు..., ఇప్పుడు అర్దమౌతుంది..ఇది.. బానిస బ్రతుకుకంటే ఎక్కువ అనిపించింది బాలూకు..
యముడు.. వెనకే కూర్చుంటే.... అన్నీ తప్పులే.. రోజంతా క్లాసులే..
ఓర్నాయనో... చిన్నప్పుడు.. లెక్కల మాస్టారు.. బోర్డుపై లెక్క ఇచ్చి బెత్తం పట్టుకుని.. వెనుక నిలబడినట్లుంది..
దానికైతే..ఒక గంట ఓపికపడితేనో.. ఓ నాలుగు.. తింటేనో సరిపోయేది... బాబోయ్.. ఇది నరకం.. ఇదేం ఖర్మరా బాబూ.. అనుకున్నాడు బాలు.
రూమ్ లో ఉండి.. చక్కగా నచ్చినవి వండుకు తినేవాడు.. ఆఫీస్‌లో ఆ బ్రెడ్లు, నానా గడ్డి.. తినలేక.. ఒక్క వారం రోజులకే... బాలూ కళ్ళులోపలికి పోయి.. పిచ్చివాడిలా తయారయ్యాడు..., ఈ డాలర్.. మూటలు దేవుడెరుగు.. ఒక నెల ఉండి.. ఎలాగోలా ఇండియా చెక్కేయాలి అనుకున్నాడు...
నెలతరువాత... జీతం చూసుకున్నాడు... 1000 డాలర్సే.. ఎకౌంటులో చూసుకుని... దిమ్మ తిరిగి.. కన్సల్టెన్సీకి ఫోన్ చేసాడు...
ఈ నాలుగునెలలు... తనని.. పోషించినందుకు..., జాబ్ చూపించినందుకు పర్సంటేజ్ క్రింద.. అన్నీ పోగా.. మిగిలింది ఇంతే... ఇంకా.. ఒక సంవత్సరం వరకూ ఈ జీతమే అని వాడు.. చెప్పిన సమాధానం చూసి... నేలపై చతికిల పడ్డాడు....
అతని.. కళ్ళలోంచి డాలర్ సింబల్స్ కూడా.. క్రింద పడ్డాయి...
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
11:56 AM
7
ఆభిప్రాయాలు

రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
1:21 AM
8
ఆభిప్రాయాలు
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే....
కాకితొటి కబురు చాలులే.. రెక్కలుకట్టుకుని వచ్చి వాలనా...
నీ రాకకోసం.. వేచివున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ...
అంటూ.. ఇలాంటి సందేశాలతో రాసుకున్న ప్రెమలేఖలు...
అవి ఇప్పటి కాలంలో లేకపోయినా..
ప్రియునికై వేచి చూచు ప్రియురాళ్ళు..
ప్రియురాలు లేని విరహ వేదనతో వీగిపోయే.. ప్రియుళ్ళు...
ఇవి ఏ కాలంలో అయినా మాములే.. కానీ... ఎదురుచూపులో ఉన్న ఆనందాల్ని...
ఆమెను తాకిన గాలిని తాకినా చాలును.. అన్న కాంప్రమైజ్ లను..పొందటానికి..
ఎన్నో రీతులు.. దారులు ఉన్నాయి... కాలంతో పాటుగా..అవి.. మారుతున్నాయి...
ఇప్పుడు.. ఆకాశరామన్న ఉత్తరాలు.. లేకపోవచ్చు.. కానీ..
ఎసెమ్మెస్ లు.. ఈ మెయిల్లూ... సెల్ ఫోన్లూ... వీడియో చాట్లూ.. ఉన్నాయి..
మాటరానిమౌనమిదీ.. మౌనవీణగానమిదీ... అని.. మౌనంగా పలికే..
మిస్ట్ కాల్స్ ఉన్నాయి... ఒక్క మిస్డ్ కాల్ లో ఎన్నో భావాలు పలుకుతాయి...
నేను నీకోసమే ఆలోచిస్తునారా.. రోమియో... అంటే..
నీ ఆలోచనతోనే ఉన్నారా జూలియట్...అని.
చాటింగ్‌లో స్టేటస్ మెసేజ్ లో కూడా.. ఎన్నో భావాలు.. పలుకుతున్నాయి..
స్టేటస్ లోనే తిట్టుకుంటూ.. మళ్ళీ.. మాట్లాడటం మొదలవగానే..
చాటింగ్ చేసుకుంటూ... అలకలు.. చిలకలు..
కొమ్మకొమ్మకో సన్నాయి రాగాలు కూడా సాధ్యమే..
ఎదురు చూపుల కన్నులకీ.. కాటుక రేఖే.. ఆభరణం
పెదవిదాటని మాటలకీ..మౌనరాగమే.. ఆభరణం..
సుదూర తీరాలు.. ఏడేడు.. సాగరాలు.. అవతల ఉన్నా..
అమె ఎప్పుడు ఆన్ లైన్ కి వస్తుందో...
అతనికి తెలుసు... అతనెక్కడ ఏ క్షణాన ఏంచేస్తుంటాడో...
ఆమెకు తెలుసు.. అంతా.. టెక్నాలజీ మహిమే.. మరి..
మనసులు దూరం అయ్యే కొద్దీ దగ్గరవటం అంటే ఇదేనేమో...
జాబిల్లి కోసం ఆకాశమల్లే... వేచాను నీ రాకకై... అని..
ఎదురుచూపులోనే.. ఆనందం ఉందెమో..
సుమం ప్రతి సుమం సుమం... క్షణం ప్రతిక్షణం క్షణం..అని..
ప్రియురాలు తండ్రి ప్రక్కన ఉన్నా ధైర్యంగా ప్రియుడు ఐ లౌ యు చెప్పగలడు...,
ఈ రోజు మ్యాట్నీ షో కి రడియా.. అని అడగగలడు... ఒక చిన్న ఎసెమ్మెస్ తో...
నువ్వంటేనే.. కోపం వస్తుంది.. అసలు నువ్వు నాతో మాట్లాడకు పో...
అని చెప్పాలనుకుంటే.. ఒక బ్లాంక్ ఎసెమ్మెస్....
వయ్యారిగోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం...
హే.. నేనిప్పుడు గోదారిలో. ప్రయాణం చేస్తున్నా తెలుసా...
ఆ చల్లని గాలి.. గోదారి గల గల ఎంత అందంగా ఉన్నాయో.. చూస్తావా..?!!
ఇదిగో చూడు కాదేది.. అసాధ్యం.. అని ఒక ఎమ్మెమ్మెస్...
చేయిజారిన చందమామను.. అందుకోగలనా..
దూరమైన నా ప్రేమజ్యోతిని చేరుకోగలనా..
నాప్రేమతో తన ప్రేమనే గెలుచుకోగలనా..
నువ్వంటే.. ప్రాణమనీ.. నీతోనే లోకమనీ..
నీ ప్రేమేలేకుంటే.. బ్రతికేది ఏందుకనీ..
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా....
ఇలాంటి ఎవరికీ చెప్పుకోలేని వాటికోసం బ్లాగులున్నాయి...
కన్న కలలిక ఎందుకో... కన్నె కలయిక కోరుకో... అని..
అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి.. ఆర్కుట్ ఉంది...
ఓ ప్రియతమా.. బదులీయిమా.. ఏచోట నీవు వున్నా..
ఈ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా..
అంటూ చెలికి.. డెడికేట్ చేసేందుకు... ఎఫ్ ఎమ్ రేడియో ప్రోగ్రాములున్నాయి...
కాలం మారినా.. ప్రేమ రసం ఒక్కటే... ఎన్ని మారినా... ఎంత మారినా..
ఎక్కడైనా... సరిగంగ స్నానాల ఒణుకు ఒక్కటే... అన్నట్లు..
రూపం మారినా.. ప్రణయమా.. నువ్వు..మారనే లేదు...
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
12:01 AM
4
ఆభిప్రాయాలు
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
11:51 PM
6
ఆభిప్రాయాలు

(జాగ్రత్తగా చదవండి... ఇబ్బందికర వాఖ్యాలున్న మాట నిజం...,
ఇందులోని సన్నివేశాలలోని.. పాత్రలూ , పరుష పదాలు..
ఉద్దేశించి రాసినప్పటికీ.. మగాళ్ళు/ఆడాళ్ళు.. అన్నప్పుడు..
అందరినీ ఉద్దేశించినవి కావు... కొందరికే పరిమితం..
అని మనవి.., అందుకే..
నవ్వుతూ చదవండి.... అదే ముఖ్యోద్దేశం...)
----------------------------------------
అంతా ఆడమయం..
జగమంతా.. మగువమయం...
ఎక్కడ చూసినా అడమయం... ఎటువైపు విన్నా.. అదే.. విషయం..
రోజులో సగంపైనే.. సమయం దీనికోసం...చర్చలు...
ఇంతకీ.. మగువకు అంత పెద్దపీట అవసరమంటారా?
(ఎవడు తయారు చేయించుంటాడు.. ఈ పీట అని అడక్కండి..)
ఎవరూ తక్కువ కానే.. కాదు..
ఎవరి మనుగడ వారిది.. విలువల్లో ఇద్దరూ ఒక్కటే..
ఎవరిని తక్కువ చేసినా బ్రతుకు బండి నడవదు..
అవసరం ఉన్న చోట తప్పులేదు.. కానీ..ఈ అనవసరపు..
విషయాలే.. అవసరమా??
టీవీ పెట్టామా..అంతే.. అమ్మాయిలేని ఒక్క యాడ్...ఒక్క సినిమా పాట
ఉండవ్... అయినా షేవింగ్ చేసుకునే రేజర్ యాడ్ కి
అమ్మాయికి సంభందం ఎంటో... నాకిప్పటికీ అర్ధంకాని విషయం..
అదొక్కటే.. మగాళ్ళకోసం అనుకున్నా.. కానీ
ఏ యాడ్ లోనైనా అమ్మాయిదే పై చేయి... సగం సగం బట్టలేసుకుని...
తిప్పుకుంటూ.. (పాపం మగాడు ఈ తిప్పుడు తిప్పలేడు..
లేకపొతే చాన్సివ్వడు...)
కొన్ని యాడ్సయితే... వాటి అర్ధం ఏంటో.. ఎందుకో కూడా తెలియని పరిస్ధితి...
కానీ అమ్మాయుంటుంది.. అందంగా...అంతే..
అసలు వచ్చిన అమ్మాయి.. ఆలోచించనిస్తే కదా!!.. అటుతిరిగి ఇటుతిరిగి
ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది...
ఇవి చూసి..ద్వజమెత్తి.. ఖండించిన మహిళా సంఘాలు... మళ్ళీ..
వాళ్ళే టీవీ నిండా... ష్...
ఏమో.. మగువలో ఉన్నది.. మగాడిలో లేనిది ఏంటో కనుక్కోవాలి..
ఏంటో అది అయస్కాంతమో.. ఎక్కడ దొరుకుతుందో వెతకాలి...
హా.. మరిచా.. ఎందుకూ.. మా ప్రక్కటీము.. హెడ్ ని అడిగితే తెలిసిపోతుంది...
ఎవడేది అడిగినా.. చిరాగ్గా మొహం పెట్టి.. చూసే..అతను..
వాళ్ళ టీములో అమ్మాయికి ఏదన్నా డౌటు రాబోతుందనగానే.. చటుక్కున సీట్లోంచి లేచి..
మే ఐ హెల్ప్ యు.. అంటాడు..., మిగతా మగపురుగులు.. ఏదన్నా చిన్న తప్పుచేసినా..
సునామీలా విరుచుకుపడి పెద్ద రాద్దాంతం చేస్తాడు..
అప్పుడు అనిపిస్తుంటుంది..
ఒరే.. నేను ఎర్రతోలున్న అమ్మాయిలా పుట్టుంటే..
నీకుండేదిరోయ్..., నా హీల్... క్రింద వేసి నలిపేద్దును నిన్ను.. అని...
రోడ్డుమీద వెళుతూనో.. రోడ్డు దాటుతూనో... ఎవడైనా మగాడు పడిపోతే..
ఒక్కడు రాడు... సాయం చేయటానికి... అదే అమ్మాయి అయితే..
ముసలితాత కూడా.. పరుగెత్తుకుని వచ్చి లేపటానికి ట్రై చేస్తాడు..
ఇక.. పక్కింటి.. పంకజం.. ఎదురింటి.. రాజీ కధలు మీకు తెలియనివి కావు..
ఇప్పుటి కాలానికి తగ్గట్టు... కాస్త మోడ్రన్ గా చెప్పుకుంటూ పోతే..
పక్క క్యాబిను.. అమ్మాయి.. వేసుకొచ్చే జీన్స్...ఒక పెద్ద ఇష్యూ..,
మనం చూసామా లేదా అన్నట్లు ఆమె..చూపులు...
మనం పనిలో పడిపోయి ఎక్కడ చూడమో.. అన్నట్లు..
బాధతో మెలికలు తిరిగిపోతూ.. పదే పదే..
అక్కడే తిరగటాలు.. ఏంటో మరి ఈ టార్చర్లు..,
వెబ్ సైటుకు నెంబరాఫ్ హిట్స్ పెర్ డే.. అన్నట్లు ఏమన్నా లెక్కుంటుందో ఎమో..
కృష్ణ కృష్ణా.. (బాబోయ్.. కాదు.. ) రామరామా.....
ఏమిటయ్యా నీ లీలలు..
ఇంతిచెయు వింతలన్నీ చరిత్రలో కధే కదా!!.. అన్నట్లు..
అమ్మాయి..కొంత చేసినా.. అది వింతే...
ఇదంతా.. మగాళ్ళ వీక్ నెస్ అనుకుంటాను.. నోరుతెరిచి చూడటం...
లీనియన్స్ ఇవ్వటం...వల్లే ఈ ఆగడాలు..
ముప్పయ్ మూడు శాతం కావాలి కావాలి.. అని పోరాడారు.. మహిళలు..
ఇప్పుడు.. మగాళ్ళు ఆ ముప్పయ్ మూడు శాతం
తీసుకున్నట్లున్నారనిపిస్తుంది...
స్త్రీ కి.. సమానత్వం... కావాలి..
అడదంటే.. అబల కాదు.. సబల...
మహిళలు.. మహరాణులు.. లాంటి కేప్షన్లు కాస్త పక్కన పెడతా..
వాటిగురించి మనకు ఎక్కువ తెలియదు....
తెలిసినా మాట్లాడలేం.. మాట్లాడనివ్వరు కూడా..
ఆడదంటే.. అలంకారప్రాయంగా మారిపోతుందనే.. బాదొకపక్క..
అయితే..
సరేలే... ఆఫీసునుండి ఇంటికొచ్చేటప్పుడు...
ఆ రోడ్డుప్రక్క.. పెద్ద పెద్ద హోర్టింగ్స్ పై అమ్మాయిల బొమ్మలే.. లేకపోతే
సిగ్నల్ పడ్డప్పుడు.. కాలక్షేపం ఎక్కడిది..?,
అబ్బాయిలవి పెడితే చూస్తామా చస్తామా.. అనికూడా అనిపిస్తుంటుంది...
పోనీ.. జనాల వీక్ నెస్ ఎదో ఏడ్చింది.. అనుకుంటే..
అందరిదీ వీక్ నెస్ అయితే చాలా కష్టంకదా?.
జనాల బుద్దులను మార్చాల్సిన మీడియావాళ్ళ బుద్దులు అసలు బాలేదు..
పేపరు మొదటి పేజీల్లోనే.. సగం బట్టలు వేసుకున్న బొమ్మలు..,
ఇక సినిమా పేజీ... చెప్పనక్కర్లేదు..
అవును..స్పోర్ట్స్ పేజీలో కూడా.. అవే...
కాదేది.. అశ్లీలతకనర్హం... అదే మార్కెటింగ్ ఫండా.. ప్రస్తుతం...
ఒక న్యూస్ పేపర్ యాడ్.. హోర్డింగ్ చూసానీమధ్య...
ప్రతి మగాడు.. వార్త చదవి తీరాలన్నది ముఖ్యోద్దేశమేమో.. కానీ...
ఎక్కడ రాయాలో అక్కడ రాసాడు..., అంటే.. గింటే..
క్రియేటివిటీ.. అంటారు..మరి.
ఇక మీడియాలో పెద్ద భాగమైన టీవివాళ్ళగురించి..
మాట్లాడలేం.... మాట్లాడటమే.. వేస్టు..
ఇక దుస్తులు..
మనకు నచ్చినవి వేసుకోటంలో లేదు తప్పు..
ప్రక్కవాడికి నచ్చేట్లు వేసుకోవటంలోనూ లేదు తప్పు..
నాకంటూ.. ఒక స్టైలుండాలి...,
నేనే అందంగా కనపడాలి అనుకోవడంలోనూ
లేదు తప్పు...
పక్కవాడికి చూపించాలన్నట్లు వేసుకోవటం.. తప్పు..
వాళ్ళకు ఇబ్బంది కలిగించేలా మన దుస్తులుండటం తప్పు..
ఇంకా పచ్చిగా చెప్పాలంటే... అందాలేమన్నా ఉంటే...
వాళ్ళ.. ఆయనకి చూపించుకుంటే.. మంచిది...
పక్కవాడికి పడి పడి..చూపించడం తప్పు..
ఏదేమైనా.. అది... పబ్లిగ్గా.. చూపించటము.. తప్పే...
ఏ ఏం పోయింది.... నన్ను చూడటం వాళ్ళ తప్పు అంటే.. మనమేం చెప్పలేం..
మన వలన ప్రకవాడి జీవితంలో.. మారణహోమాలు జరగక్కర్లేదు..
ఒక్క విలువైన నిముషం వృధా అయితే చాలు...
ఏమనుకున్నా.. తప్పు తప్పే.. తప్పున్నరే.. అంతే....
ఈ సగం దుస్తులు మొదటి ఐడియా.. మగాడిదే.. అయ్యిండాలి..
ఇలాంటి.. ప్రతి.. ఎదవ పనుల వెనుక ఉన్నది. మగ కన్నే..
ఈ.. తప్పంతా.. మగాళ్ళదే..
ఒరే.. మావా... ఆ పొటోబు చూడరా.. ఎధవ..ఎలా తీసాడో... అంటే..
ఆ తీయించుకున్నదాని సిగ్గేడకు పోయిందీ... దానిని బట్టే కదేంటి..
ఆడు.. తీసేది... అన్నట్లు..
మగబుద్ది ప్రకారం ఆడాళ్ళకు కాస్త తప్పుల్లో సగభాగం ఇవ్వాలి కాబట్టీను..
ఈ తప్పుల్లో వాళ్ళదీ.. ఉంటుంది భాగం..
ఇంకా చాలా రాయాలనిపించింది.. కానీ నా బ్లాగ్‌లో అశ్లీలత కు తావులేదని..
ఇక్కడే ఆపేస్తున్నా..
-------------------------------------------
(అక్కలూ.. అన్నయ్యలూ... మరదళ్ళూ.. బావలూ...
ఆడ, మగ ఇద్దరినీ సమానంగానే తిట్టాను.. నన్నేమనకండి.... బాబోయ్..)
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
12:05 AM
8
ఆభిప్రాయాలు

అది.. సిటీకి దగ్గర్లో... రోడ్డుప్రక్కనున్న చెట్టుక్రింద ఒక చీమల రాజ్యం...
కాస్త లోతుగా పరిశీలించి...అక్కడ ఏం జరుగుతుందో... ఒక్కసారి చూద్దాం..
(కెమెరా.. జూమ్ మ్.... లైట్స్ ఆన్...;-) )
(కొన్ని చీమలు గూమిగూడి.. మాట్లాడుకుంటున్నాయి..)
ఒక చీమ: ఎరా.. మన చంటిగాడు కనిపించడంలేదేంటిరా...?
మరో చీమ: వాడికి ఎక్కువైందిరా.... ఈ మధ్య... ఎక్సట్రాలుచేస్తున్నాడు...
జీన్సులు టీషర్టులు వేసి.., పక్క చెట్టు.. ఆడచీమల వెంటపడి...
కటింగులిస్తున్నాడురా... ఎధవ..
మొన్న.. బంజారాహిల్స్.. చీమలన్నీ బైక్ పై వెళుతుంటే..
వెనక కూర్చున్న ఆమెని... కామెంట్ చేసాడంట..
అంతే.. అంతా.. కలిసి.. కుమ్మి వదిలారు... అయినా సిగ్గులేదు.. తరువాత మా
బ్యాచ్ తో చితక్కొట్టేసాను వాళ్ళని అని.. గొప్పులు చెప్పుకుంటున్నాడు తెలుసా?
ఒరే.. బంటిగాడ్రా బాబోయ్.. ఇలాగే వస్తున్నాడురా.. వీడొకడు.. సోదితో చంపేస్తాడు..
బుక్కైపోయాం.. ...
బంటి:( పల్సర్ బైక్.. సడెన్ బ్రేక్ కొట్టి ఆపి..)
హాయ్.. ఎలా ఉన్నారంతా.. నా డ్రస్ ఎలా ఉంది..రా..
మిగతా చీమలు: బాగుందిరా..!!!, ఎక్కడకొన్నావ్.. రా..
బంటి: చిరు అన్న గిఫ్ట్ బే.. తెలియదా??
ఒక చీమ: (కొయ్ రా కొయ్.. వినేవాళ్ళం మేం ఉన్నాం కదా.. అని.. కళ్ళజోడు సర్దుకుంటూ)
చిరు అన్నా?? ఎవరు రా?
మరో చీమ: (వెటకారం బయటకు కనపడనీయకుండా) ఏరా తెలియనట్టు అడుగుతావ్.. ,
మన బంటిగాడు పిచ్చ చిరంజీవి ఫ్యాన్స్ తెలుసా?
మొన్నే... చిరు అన్నతో ఫొటో తీయించుకున్నాడు... అప్పుడు గిఫ్ట్ ఇచ్చుంటాడు అన్న..
మనోడు బాగా క్లోజ్ రా.. అన్నకి..
ఒక చీమ: (ఆశ్చర్యంతో) ఓ.. నిజమా!! నాకు తెలియదురా..
ఒరే.. బంటీ నన్నూ తీసుకెళ్ళరా..చిరు అన్నదగ్గరకు వస్తాను.. ఫ్లీజ్.. రా..
బంటి: (స్టైల్ గా కాలు ఊపుతూ..) ఈ సారి చూస్తాలేరా.. అన్నకి ఖాలీ ఉన్నప్పుడు.. నాకు.. చెప్తాడు..
అప్పుడు తీసుకెళతా..లే.. పో..
ఒక చీమ: (పెంటమీద తిరిగే... గండు చీమ మొహం వీడూను.. వీడికి చిరు పోన్ చేసి చెప్తాడా??
కండచీమ కటింగులన్నీ ఉన్నాయ్ వీడికి..)
సరే.. రా.. మర్చిపోకూడదు.. మరి...
బంటి: మొన్న రావాల్సిందిరా... అన్న.. రక్తదాన శిబిరం దగ్గర నన్ను.. చూస్కోమని చెప్పిండని.. వెళ్ళాను..
నా రక్తం.. కూడా ఇచ్చాను.. తరువాత.. ఐబ్యాంకుకు.. నా కళ్ళు రాసిచ్చేసినా కూడా..
అందుకే.. ఈ షర్ట్ అన్న పేమతో.. గిఫ్టు ఇచ్చిండు..
ఒక చీమ: (ఏంటి.. నీ చీమరక్తమే..??, కళ్ళుకూడా..?? ఇచ్చావా..
ఇనేవోడుంటే.. ఎన్నైనా చెప్తావ్.. బురదలో పడిన.. కరెంటు చీమ మొహమూ నువ్వూను...)
ఓ.. మంచిపని చేసినావ్.. రా.., నాకు తెలిసుంటే నేనూ వద్దునురా..
బంటి: (కళ్ళజోడు.. తీసి తుడుచుకుంటూ..)
సరే నెక్స్ట్ టైమ్ బెటర్ లక్....
నేను పోవాలి.. జూబ్లీ హిల్స్ లో.. పవన్ ది.. షూటింగ్ ఉంది.. కలవాలి...
బై రా..
(బండిని దుమ్మురేగేలా..దూకించి.. వెళ్ళిపోయాడు.. బంటి)
మిగతా చీమలు: హమ్మయ్యా పోయాడ్రా బాబు.. చంపేస్తాడు.. సోది చెప్పి...
ఒక చీమ: ఒరే.. మన శేఖర్ గాడి బ్యాచ్ అంతా హైటెక్ సిటీ ఏరియాలో
సెటిల్ అయిపోయారంట కదా?
మరో చీమ: అవునురా.. వాళ్ళకేంటిరా.. మంచి.. తిండి దొరుకుతుందంట..!!.. పని తక్కువ ఉందంట!!..,
వారానికి ఐదురోజులేనంటరా!!... సాఫ్ట్వేర్.. కదా!! ఎంజాయ్ చేస్తున్నార్రా...
శేఖర్ గాడు.. టీసీయస్ ప్రక్కనే.. ఉంటుండంట.. సెల్ పోన్ కొన్నాడు..
అక్కడే.. విప్రో దగ్గర్లో ఉంటున్న గాళ్ళ్ ఫ్రండుని పట్టాడు..
ఇక ఎప్పుడూ ఫోనులో బిజీరా వాడు.., ఎంత ఉన్నా సరిపోవటంలేదురా ఖర్చులకి అంటున్నాడు..
వాడి స్టైలే మార్చేసిందిరా సాప్ట్వేర్...,
నేనెలాగూ వెళ్ళలేనురా.., అంత పెర్సంటేజ్ లేదు నాకు.. మా తమ్ముడిని తోసేద్దాం అని చుస్తున్నారా.. ఇప్పుడు
కొత్తగా రిఫరెన్సులు అడుగుతున్నారంట..ఫ్రెషర్స్ కి.., శేఖర్ గాడ్ని అడగాలి.. ఈ సారి ఫొన్ చేసినప్పుడు..
ఏవో కన్సల్టెన్నీలు ఉన్నాయంట కూడా అవికూడా తెలుసుకోవాలి...
ఈ సాప్ట్వేర్ వచ్చి.. మన చీమలరాజ్యాన్ని చెడగొట్టేసిందిరా.. ఎక్కడబడితే.. అక్కడ పుట్టలన్నీ ఫుల్..
పోనీలే మంచిది.. మనకు ఎక్కువ కష్టపడకుండా తిండి దొరుకుతుంది...
ఒకప్పుడు.. పప్పన్నం దొరికితే.. ఎంతగొప్పో.. దద్దోజనం, క్షీరాన్నం దొరికిన రోజు పండగే..
ఇప్పుడు.. హాట్ డాగ్.., పీజా.., చికెన్ బర్గర్... విత్ కోక్... లేందే.. తిన్నట్టుండడంలేదంట..
అలా అయిపోయార్రావాళ్ళు.. అందుకే.. ఎంత ఖర్చయినా మా తమ్ముడిని అక్కడికే
తోసేస్తారా..,
ఇక అప్పుచేసైనా మా చెల్లిని.. హై క్లాస్ వాడికే.. ఇచ్చి చేస్తా.., కనీసం.. నాలుగైదు.. గుంపుల్ని..
మెయిన్ టైన్ చేయగలిగేవాడై ఉండాలి..., నాలుగైదు.. చీమల దండులపై దండయాత్రచేసి ఉండాలి..
ఒక చీమ: నువ్వు అలానే కలలుకంటూ ఉండు.. అంత ఏక్టివ్ నెస్ పనికిరాదు.. ఈ కాలంలో.. అలా ఉన్నవాళ్ళ
జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలియటంలేదా??.. మనం చూడటంలేదా??
ఆ రామంగారబ్బాయి.. అలాగే.. ఉండేవాడు.. ఏమయ్యింది.. హాలీవుడ్.. వాడెవడోనంట..
మన చీమల జీవితం మీద ఏనిమేషన్ సినిమాకో.. దేనికోసమో రీసెర్చ్ అని వచ్చాడంట..
మనోడి టైం బాగోక.. వాడి కంట పడ్డాడు.. తీసుకుపోయాడు.., మనందరికీ దూరమై పోయాడు..
అలానే ఉంటుంది...
అందుకే.. చక్కగా.. చెప్పింది వినే.. లోకల్.. చీమకు కట్టిపడేయ్..,
మనం చెప్పినట్టు వింటాడు.. దొరికినకాడికి తింటాడు..
మరో చీమ: నేను అంత ఆశేం పడటంలేదుకానీ ఎదో చిన్న ఆశ.. చెల్లిని గొప్పోడికిచ్చి చేద్దామని అంతే...
మనిషిలా.. లక్షలు లక్షలు జీతమూరావాలి... పనీ ఉండకూడదూ...
ఇన్కమ్ టాక్సూ ఉండకుండా.. డబ్బంతా మూటకట్టాలి అనో
పప్పూ... అవకాయన్నం కావాలి... డాలర్సూ కావాలి.. అనో... కోరుకునేంత ఆశకాదులే...
సరే పదలే.. వీళ్ళతో ..మనకెందుకు... మన ఆశలు తీరేవికావుకానీ... మనిషిగా పుట్టినా...
మట్టిలో పురుగులా పుట్టినా... అనుభవించడానికి ... సుడుండాలి దేనికైనా...,
సరేలే.. మనింటి ఓనర్ భార్య టీ పెట్టే టైమైంది..పద.. ఈ రోజు పొద్దున్నే శుప్రభాతం మొదలుపెట్టింది వాళ్ళాయనపై..
పాపం ఏంచేసాడొ తప్పు.. ఆ కోపంలో మనకు పండగే ఈ రోజు..
నాలుగు పంచదారపలుకులు.. ఎక్కువ.. విదుల్చుతుంది.....
ఒక చీమ: అంతేలే.. మనకా పంచదార మీదే.. ఎక్కువ రాసాడు.. మనపేర్లు....
అవే..గతి మనకు... పద..
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
1:41 AM
1 ఆభిప్రాయాలు

దయచేసి కాసెపు ఇక్కడ కూర్చోండి సార్.. అని సీటు చూపించాడు.. సెక్యూరిటీ.. పర్సన్..
సరే.. అని.. కూర్చోటానికి రడీ అవుతూ.. ప్రక్కసీటులో ఉన్న అమ్మాయితో మేడమ్..
ఈ బ్యాగ్ మీదేనా అది కాస్త తీస్తే కూర్చుంటా అని.. రిక్వెస్ట్ చేసాడు.. అతను..
సారీ అండి.. అని గబగబా బ్యాగ్ తీసుకుని.. చిన్న చిరునవ్వు
విసిరింది ఆ అమ్మాయి.. ఆ చిరునవ్వుని చూసి కాసేపు ప్రపంచాన్ని మరచిపోయాడు అతను..
చాలా బాగుంది అమ్మాయి.. ఆ చిరునవ్వుకూడా..
కానీ ఇంటర్వూ టెన్సన్.. తో తను మళ్ళీ మాములు స్థితికి వచ్చేసాడు..
పదినిముషాలు గడిచింది.. కానీ ఆ అమ్మాయి.. పుస్తకంలో తప్ప వేరే ప్రపంచాన్ని చూడటంలేదు..
అతనికి కాస్త నవ్వొచ్చినా.. ఏవండీ.. ఏంటండి అంతలా చదివేస్తున్నారు..
మీరు రాసేది ఏమైనా ఎమ్సెట్ ఎగ్జామా.. ఇంటర్వూ మేడమ్.. అన్నాడు నవ్వుతూ.
నాకు కాస్త టెన్సనండి.. అన్నీ మర్చిపోతా అందుకె చదువుతున్నా అంది..
ఒక చిరునవ్వు నవ్వి.. ఊరుకున్నాడు.
ఇంతలో ఆమెను లోపలికి రమ్మని.. పిలిచారు.. ,
ఆల్ ది బెస్ట్.. బాగా చేయండి అని షేక్ హ్యాండిచ్చాడు.. అతను.
ధ్యాంక్స్ అండి అని నవ్వుతు వెళ్ళిపోయింది.. ఆమె..
ఆలానే చూస్తు ఉండిపోయినతను.. ఉలిక్కిపడి ఈలోకానికొచ్చేసరికి..
ఇతని పేరు గట్టిగా పిలవటం వినపడింది..
గబగబా లేచి.. ఇన్‌షర్ట్ సర్దుకుని.. లోపలికెళ్ళాడు..
ఓగంట గడిచాకా వచ్చాడతను..
అప్పటికే ఇంటర్వూ అయిపోయిన ఆ అమ్మాయి.. రిషెప్సన్ దగ్గర నిలబడి ఉంది..
అతన్ని చూసి.. దగ్గరకు వచ్చి.. ధ్యాంక్సండీ నేను సెలెక్టయ్యాను.. అంది ఆనందంగా..
నిజంగా.. గ్రేట్.. కంగ్రాట్యూలేషన్స్.. నేను కూడా సెలెక్ట్ డ్..
రేపు రమ్మన్నారు ఆఫర్ లెటర్ కోసం..
సరే పదండి ఏదన్నా రెష్టారెంటుకు పోదాం నేను ట్రీటిస్తాను అన్నాడతను..
హుమ్మ్.. తెలియని వాళ్ళతో ఇలా బయటతిరగటం నాకిష్టం ఉండదండీ..
అన్నదామె కాస్త నెమ్మదిగా..
తెలుసుకుందామండి.. బోజనం చేస్తూ మాట్లాడుకుందాం పదండి..
మీకు ఇబ్బందిలేకపోతేనే!!! అన్నాడతను..
ఇద్దరూ దగ్గర్లో ఉన్న రెస్టరెంటుకు చేరుకున్నారు.
రోజులు గడిచాయి.. ఇద్దరూ ఒకే టీమ్ లో కలిసి పనిచేస్తున్నారు..
చాలా దగ్గరగా రోజూ కలిసి తిరగటం వలన..
ఇద్దరి ఇష్టాలు ఒకటయ్యాయి.. ఒకరోజు సాయంత్రం ఆ అమ్మాయి..
అతనికోసం ఎదురుచూస్తూ ఉంది ఆఫిసు బయట.
కాసేపటికి వచ్చినతని.. కూడా కలిసి నడిచింది.. ఇద్దరూ పదినిముషాలు మౌనంగా ఉన్నారు..
సరేలే.. రెండురోజుల్లో వచ్చేస్తావుగా ఎందుకంత డల్ గా ఉంటావ్..కాస్త హుషారుగా వెళ్ళిరా..
చాలా రోజులతరువాత ఇంటికి వెళ్తున్నావుగా.. అన్నాడతను..
ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని చేధిస్తూ
ఏమో.. నాకు ఎదోలా ఉంది.. అని.. దగ్గరకి చేరి.. బుజాలపై తలవాల్చి ఏడ్చెసింది...
ఏంటిరా.. ఎందుకలా ఎమైంది..? అని అడుగుదామనుకున్నవాడు..
ఆ ఊహించని తరుణానికి అతనికి మాటరాలేదు..
నేను నిన్ను.. చాలా ఇష్టపడుతున్నాను.. నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను..
ఆఫిసునుండి ఇంటికివెళ్ళగానె నేనొక ఒంటరిలోకంలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతున్నాను..
ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అన్నట్లు నాకు ప్రతిరోజు తెల్లారుతుంది..
నువ్వు ఒక్క క్షణం నీ సీట్లో లెకపోతే నాకు ఎమీ తోచదు..
మరినాకెందుకిలా ఉందో తెలియదు..
అని తన మొహాన్ని అతని గుండెలచాటు దాచేసుకుంది...
ఆ రెండురోజులూ ఫోన్లో పలకరించుకంటూ.. కాలం గడిపారు..
ప్రతిరోజు ఆమె మోముపై నవ్వుల పువ్వులు పూయిస్తూ..
ఆ పూవుల పరిమళాన్ని ఆనందిస్తూ.. అతనికి.. రోజులు నడుస్తున్నాయి..
ఏదో ఒకరోజు జరిగిన చిన్న సంఘటన వలన ఇద్దరికీ మనస్ఫర్దలుఒచ్చాయి..
అతన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టిందామె.. అతను..
బ్రతిమలాడాడు.. నేనే తప్పుచేయలేదు.. కావాలని అని చెప్పాడు..
తరువాతనుండి మాటలు తక్కువయ్యాయి..
ఇద్దరిమధ్య మౌనమే గెలిచింది అన్నట్లు.. రాజ్యమేలింది... కొన్నిరోజులు..
కానీ.. ఆమె ఎదురు పడే సమయంలో.. అతనికి ప్రాణంపోయినట్లుండేది
ఎదో నవ్వాలన్నట్లు నవ్వే ఆమె నవ్వును తట్టుకోలేకపోయాడతను..
సాయంత్రం.. మనం కలవాలి.. నీతో మాట్లాడాలి అని ఒక సందేశం పంపాడు..
ఇద్దరూ ఒక చోట కలుసుకున్నారు..
చల్లగా వీస్తున్న గాలితో కలిసి వారిద్దరిమధ్యన ఉన్న మౌనం రాగం తీసింది కాసెపు..
ఎందుకిలా నన్ను వేధిస్తున్నావ్.. నేను చేసింది ఏమన్నా అంత తప్పుందా?
ఇంతేనా నన్ను అర్ధంచేసుకున్నది.. అని భాదగా అడిగాడతను..
లేదు.. నువ్వు ఏ తప్పుచేయలేదు.. తప్పు నేనే చేసాను.. అది ఇప్పుడు తెలుసుకున్నాను..
అందుకె నన్ను నీకు దూరంగా చేసుకుంటున్నాను.. ఇళ్ళువదలి బయటికొచ్చిన నాకు
మొట్టమొదటిసారిగా పరిచయమైన నువ్వు నా సొంతవాడిలా నాకు అనిపించావు..
నాకు ఒంట్లో బాలేకపోతే నువ్వు తీసుకున్న కేర్.. నా కష్టంలో నువ్వు నాకిచ్చిన సలహాలు..
నాతో పంచుకున్న మంచిచెడులు.. అన్నీ నావాళ్ళతో ఉన్నట్లనిపించింది....
అది దాచుకోలేక నీకు చెప్పాను.. నన్ను క్షమించు..
నువ్వది సీరియస్ గా తీసుకుంటున్నావ్.. అందుకే నీకు దూరంగా ఉండటానికి ట్రైచేస్తున్నా...
మళ్ళీ మనం స్నేహితులుగానే ఉండగలం అనుకుంటే.. నేను నీతో
మాములుగా మాట్లాడగలను.... అని చెప్పిందామె..
అలానే వాళ్ళపలకరింపులు.. కొనసాగాయి.. కొన్నిరోజులు..
ఆమె మాటలు.. చేతలు.. చూస్తు గడుపుతన్నంతసేపూ..
ఒకసారి ప్రేమగా అనుకున్న అతను.. . ఇపుడు.. అది.. ఒట్టి స్నేహమే అని ..
మనసుకు సర్దిచెప్పలెకపోయాడు..
స్నేహానికి కళంకం తెస్తున్నానని అతనికి అనిపించింది.. కష్టమైనా తనతో మాట్లాడకుండా..
తనకి కనపడకుండా.. ఉండటం అలవాటు చేసుకున్నాడు..
కానీ.. ఒక రోజు... ఆమెతో చెప్పాడు.. నేను.. వేరే ఊరు వెళ్ళిపోతున్నాను..
అక్కడే సెటిల్ అవుదామనుకుంటున్నాను..
వేరే జాబ్ వచ్చింది.. అని.. చెప్పాడు..
ఆ రోజు రానే వచ్చింది... అతను ఆమెను వీడి దూరంగా వెళ్ళిపోయాడు...
తరువాత.. ఆమెను కలవలేదు..
ఆమె మనసులోన మౌనం ఇంకా అలానే నిధిలా నిక్షిప్తమై ఉండిపోయింది...
కాలం గడిచింది...
విడిపోయి దూరంగా ఉన్నా జ్ఞపకాలలో, మనసులో ఇంకా ఆమెనే నిలుపుకున్నాడతను..
కానీ.. ఒకరోజు....
అప్పుడే.. వసంతం విరిసి.. కోయిలరాగం మొదలయ్యినట్లు ఆమె గొంతు.. వినపడింది.. ఫోనులొ..
మనసు ఆనందంలో మునిగి ఉప్పెనలా.. ఎగసిపడింది.. కానీ ఆ అనందపుటలలు.. గొంతుదాటి..
బయటకు రాలేకపోయాయి... మాములుమాటలె... అతని గొంతు.. నుండి వచ్చాయి...
ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావని.. కుశలప్రశ్నలు అయ్యాకా... కాసేపు.. మౌనంతో
మూగబోయాయి.. ఇద్దరి... ఫోన్లు...
ఆమెకు.. దుఃఖం ఆగలేదు... ఏడ్చేసింది...
నేను చేసింది తప్పే అని ఇప్పుటికి.. తెలుసుకున్నాను అని అంది..
అతనికి.. మాటలురాలేదు...
కానీ ఒకప్పుడు.. తన గుండెచాటున... తన.. మోమును.. దాచుకుని.. ఆమె ఏడ్చిన సంధర్భమే..
అతనికి గుర్తుకురాసాగింది..
అప్పటి.. ఆ కన్నిటిలో.. తడిసి బరువెక్కి...
ఇన్నాళ్ళూ... మోస్తున్న తన హృదయం ఇంకా బరువుగానే అనిపించింది...
ఇప్పటి.. ఈ కన్నీటి.. అలలు...
బరువెక్కిన ఆ హృదయాన్ని.. కరిగించలేకపోయాయి...
మళ్ళీ మౌనమే.. జయించి రాజ్యమేలింది...
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
1:50 AM
9
ఆభిప్రాయాలు

* ఆరోగ్యం పాడువుతుందిరా ఈ హోటల్ భోజనం.. ఆఫీసులో క్యాంటిన్ భోజనం తినలేకపోతున్నాను..
అనటం పాపం.. అంటాడు.. ఎవడోకడు.... ఐతే ఏముంది.. త్వరగా పెళ్ళిచేసుకో.. కావలిసినవన్నీ వండిపెడుతుంది..
అదొక్కటే మార్గమా.. ఏ మనం వంట చేసుకోలేమా.. వచ్చకా కూడా మనం ఆ అమ్మాయికి..వండిపెట్టకుండా
ఉంటే చాలు.., అయినా పెళ్ళికి.. వంటకి, తిండికి లింకేంటో??..
*ఆఫిసులో పని ఎక్కువైపోయిందిరా.... చస్తున్నా. ఇక వెళతాను అంటే చాలు.. అప్పుడే వెళ్ళి ఏంచేస్తావ్.
పెళ్ళామా పిల్లలా.. అని వెటకారం చేస్తున్నాడురా.. మా మేనేజరు...అని ఎవడితో మొరపెట్టుకున్నా
మరందుకే. పెళ్ళిచేసుకోమనేది.. అని అంటారు.. ఇక్కడ కూడా.. మరి ఏంటో లింకు..
ఏ పెళ్లి కానివాళ్ళు.. కాసేపు.. ఇంటికెళ్ళి..హాయిగా ప్రశాంతంగా ఉండలేరా??,
నచ్చిన హాబీని ఎంజాయ్ చెయ్యలేరా?
*ఏమండీ.. ఇక్కడ టూలెట్ బోర్డ్ ఉంది.. ఇల్లు అద్దెకు ఇస్తారా.. అంటే.. మొదట.. అడికే ప్రశ్న..
బ్యాచ్ లర్స్ ఆ..??
అయితే ఇవ్వమండి.. ప్యామిలీకే..
ఓహో.... మరి.. బ్యాచిలర్స్.. ఫుట్ పాతలపై పడుకోవాలా...?, పెళ్ళికాకముందు అందరూ బ్యాచ్ లర్సే.. కాదా..
ఇక్కడ కూడా లింకుపెట్టేసార్రా బాబు..
* సింగిల్ గా బైక్ పై పాటలు పాడుకుంటు.. హాయిగా వెళుతుంటే.., ఎవడో బేవార్స్ గాడు..
చేయిచాపి.. లిఫ్ట్.. అంటే..ఈ పాటల మూడ్ పోగొట్టుకోలేక.. ఎహే.. నేనివ్వను అని చిరాగ్గా వెళ్ళిపోతే..
ఏ.. అలా ఒక్కడివే ఫొకపోతే.. లిఫ్ట్ ఇవ్వొచ్చుగా..? అని తిడుతున్నాడు..
ఇదెక్కడ గోలరా.... నా బైకుమీద.. నాకు నచ్చిన పాటపాడుకంటూ ఒంటరిగా వెళ్ళే హక్కులేదా.. అంటే..
మరందుకేరా పెళ్ళి.. అని మళ్ళీ లింకు పెట్టేసారు..
*అలాగే సినిమా హాల్లో.. కాస్త అక్కడ కూర్చుంటారా.. లేడిసున్నారు. మీరొక్కరే కదా.. అని బ్రతిమలాడి
చివరిసీటు ఇస్తే.. గాలిఆడక.. చెమటలు తుడుచుకుంటూ. సినిమా చూస్తుంటే.. ప్రక్కవాడు పిచ్చినవ్వు నవ్వి..
మీరు సింగిలేనా.. నేను అంతే.. అందుకే పెళ్ళిచేసుకోమని పెద్దలు చెప్పేది.. లేకపోతే ఇలాగే తోసేస్తారు.. అంటున్నాడు
వెటకారంగా..
ఓహో దీనికీ పెళ్ళికి మళ్ళీ లింకా..
* ఊరెళ్లేటప్పుడు.. చాలా రోజుల ముందు ముందుజాగ్రత్తతో టికెట్ రిజర్వ్ చేసుకుని మిడిల్ బెర్త్ తీసుకుంటే..
బాబూ.. బ్యాచిలరా..!, మేం ఫ్యామిలీ.. కాస్త సైడప్పర్ బెర్తులో ఎడ్జస్ట్ అవుతారా.. అని రిక్వస్ట్...చేస్తే..
పోనీలే అని.. మూటకట్టి.. అటకపైకి ఎక్కించినట్లుగా.. ముడుచుకుని.. పడుకుని జర్నీచేసి.. నడుంపట్టేస్తే..
మరందుకే పెళ్ళిచేసుకోవాలి.. ఎవడూ రిక్వస్ట్ చేయడు.. అంటాడు పక్కోడు..
మళ్ళీ ఇదో లింకు..
*అబ్బా ఎప్పుడూ ఈ రూమ్‌లో బోర్ కొడుతుందిరా.. లైఫ్. పద అలా బయటకుపోదాం ఏ పార్కుకో బీచ్ కో.. లేక
డిస్కోకో.. అంటే.. ఎ.. వెళ్ళి ఏంచేస్తావురా.. బటానీలు తింటూ. అక్కడికొచ్చే... జంటలను చూసి
మనసుపాడుచేసుకుంటూ...
ఆ బటానీలు అమ్మేవాడితో బాతాఖనీ కొట్టడం తప్ప.. ఇక డిస్క్ కి పోవాలంటే.. పక్కన అమ్మాయి కావాలి.. అందుకే
బాబుపెళ్ళిచేసుకో...
ఓరినాయనో.. మళ్ళి అక్కడికే వచ్చార్రా....
*ఇల్లుకొనటానికి హౌసింగ్ లోన్ అప్లై చేస్తున్నారా... ఏదిబాగుంటుందో చెప్పరా తెలిసుంటే...అనగానె పక్కోడు..
తగులుకుని.. ఒరే.. పిచ్చి బామ్మర్దీ.. ఇల్లు కాదు నువ్వు కొనాల్సింది. .
ఇప్పుడు.. కార్ లోన్ పెట్టి.... ఒక మంచి కారుకొను.
నాలుగు చైనులు.. రెండుచేతులకీ.. బ్రాస్లెట్టు.. ఉంగరాలు.. చేయించుకుని.., సూటేసుకని.. ఖాలీ సూట్‌కేసుతో
అటుఇటూ తిరిగి..హడావుడి చెయ్యి.... ఇక పడతారు..సౌండున్న స్పోన్సర్స్... బ్లాక్ సుమోల్లో దిగి.. ఎగబడతారు..
అందర్ని లైన్లో నిలబెట్టి.. ఎవడికైతే.... బంజారాహిల్స్ లోనో.. హైటెక్ సిటీ ప్రక్కనో ఇల్లు ఉందో చూసి... ఒకే అన్నావంటె..
పిల్లనిచ్చి పెళ్ళిచేయగానే.. అమ్మాయితోపాటు.. కొత్తఫ్లాటు లక్ష్మీదేవిలా.. వస్తుంది.. ఆ అమ్మాయి చదువుకుని
ఉద్యోగం చేస్తుందా..!!, అయితే... ఇంకా నయం.. అప్పుడు హోమ్ లోన్ పెట్టి ఇల్లుకొను.. ఆ అమ్మాయి జీతం నెలనెలా లోన్ కట్టు..
ని జీతంతో కార్ తో పాటు.. ప్యామీలీ మెయిటెన్ చెయ్యి..
అదీ.. పెళ్ళిచేస్కో.. ఒక్కదెబ్బకు రెండు ఇల్లులు.. అని అదో లింకు..
* ఆహా.. వర్షం భలే పడుతుంది.. వాతావరణం చాలా బాగుంది.. ఇప్పుడు బయటకివెళితె.. బాగుంటుంది అంటే..
బాసూ.. నువ్వు బయటకెళ్ళినా, లొపలున్నా, ఆఫిసు ఎగ్గొట్టి.. ఇంటికెళ్ళినా ఒకటే బాసు.. పెళ్ళయ్యిందా ఎమైనానా?? అని వెటకారం.
* నా జుట్టు చూడు ఎంత పలచబడిందో.. ఒక్కసారిగా.. అరెకరం ఖాలీ ఐపోయిందిరా.. అంటె..
పెళ్ళిచేసుకో బాబు.. లేకపోతే.. ఆ ఉన్నది కాస్త పోతుంది.. అంటాడు పక్కోడు..
అదేంటిరా.. మరి పెళ్ళిచేసుకుంటె.. పోయింది వస్తుందా?... లేక.. పెళ్ళయిపోయాకా బట్టతల ఐనా పర్వాలేదా? అంటే చెప్పరు కానీ లింకు మాత్రం పెడతారు..
*అబ్బా ఈ నసగాడు చంపేస్తున్నాడే.. మా డాడి ఉన్నప్పుడే..
ఫోన్ చేస్తాడు.. కుల్లుజోకులేసి.. చావగొడుతున్నాడే.. అని
తని స్నేహితురాలికి చెప్పుకున్న పాపానికి.. ఆ అమ్మాయి ఇచ్చిన సలహా..
అందుకే చెప్పేది. మీ వాళ్ళు తెచ్చిన సంభంధం ఒకే అను.. అ ఆర్కుట్లో సింగిల్ అన్న స్టాటస్ ని.. మ్యారీడ్ అను మార్చు..
వెంటనే అతని మొబైల్.. ఎడ్రస్ లిస్ట్ లోంచి నీ నెంబరు డిలీట్ కొడతాడు.. ఆర్కుట్ స్రాపుబుక్ ఖాలిగా ఉంటుంది కూడా..
అని లింకు పెట్టింది మళ్ళీ... ఫ్రండ్ కాస్త నసపెడితే అదీ పెళ్ళికి లింకే??
*నా ఈ కాస్మోటిక్స్ కే అయిపోతుందే సగం జీతం అంతా.. ఎలా ఖర్చుపెడుతున్నానో నాచేతులమీదుగా అనిపస్తుంది..
అందుకెనే.. త్వరగా పెళ్ళిచేసుకో.. అతని చేతులమీదుగా కొనుక్కోవచ్చు...
అంటే.. అవి కొనుక్కోవడానికి ఇప్పుడు పెళ్ళే చేసుకోవాలా?
*ఏంటమ్మా చెల్లెమ్మా.... మన పద్దూ రోజురోజుకు లావెక్కుతుందీ.. ఇలా ఐతే కష్టం.. రేపు పెళ్ళిచెయ్యాలి.. కాస్త స్వీట్స్..
ఐస్‌క్రీమ్స్ తిననివ్వొద్దు.. కంట్రోల్ లో పెట్టండి.. అలానే.. వంటలు చేయటం ఇంటిపనులు చేసుకోవటంలాంటివి
నేర్పించండి.. కాస్త ఎక్సర్సైజు గా ఉంటుంది కూడా, నాకంటావా ఆ కంట్రోల్ లేకపోయింది.. అందుకె.. ఇప్పుడు కొలెస్ట్రాల్..
డయాబెటిస్.. అని.. పనిలెని మావయ్యలు అమ్మలకు.. చెప్పే చచ్చు సలహాలలో కూడా.. లింకులు ఉంటాయి....
వాళ్ళుమాత్రం.. మెక్కి.. లావెక్కుతారు.. రూలు అందరికీ ఒకటె కాదా??
*ఈ ట్రాఫిక్ రానురాను ఎక్కువైపోతుందే.. పంజాగుట్టనుండి అమీర్ పేట సిగ్నల్ కి రావటానికి.. గంటపట్టింది.. డ్రయివ్
చేయలేక చస్తున్నానే..
అందుకేనే పెళ్ళిచేసుకో.. అతనే డ్రయివ్ చేస్తాడు.. వెనుక కూర్చోబెట్టుకుని.. అంటుంది... ఇది.. మరీనూ...!!!
*పొద్దున్న లేచిందగ్గరనుండి.. గాడిదలా ఆఫీసులో పనిచేస్తుంటే.. ఇంకా అదవలేదు ఇది పెండింగుంది.. అని నసుగుతున్నారే..
అనగానే ఇచ్చే సలహా.. ఎవడన్నా అమెరికా సంభందం పట్టు...నువ్వు ఇంట్లో కూర్చోవడమే.. సాయంత్రానికి డాలర్స్ మూట
పట్టుకొస్తే.. నువ్వు లెక్కపెట్టుకోవటమే.. అని పెళ్ళికి మళ్ళీ..లింకు..
ఇవన్నీ చెబుతున్నారు.. ఇంతకూ.. పెళ్ళికి మన ఆనందాలన్నిటికీ.... అంత లింకు ఉందా అనుకుంటే..
మరి.. ఇవి...
*ఆరోజు కూడా ఇంటర్వూ ఫేయిలయ్యి వచ్చిన అమ్మాయిని.. నిలదీసి.. చెప్పానా.. నీకు.. మగాడిలా ఉద్యోగం వద్దే అని..
పెళ్ళిచేసేస్తే.. నువ్వు మాటవింటావ్..
*వీడు చాలా ఎక్కువచేస్తున్నాడ్రా.. పెళ్ళిచేస్తేనే కాని పిచ్చి కుదరదు.. వీడికి..
*ఎంత జీతమొచ్చినా సరిపోవడంలేదురా.. అంటే. అప్పుడే ఏమయ్యింది.. పెళ్ళయ్యాకా తెలుస్తుంది.. అసలు బాధ..
*ఒరే.. నన్ను లెక్కేయకండిరా.. మీ పార్టీలు.. పాడూ..కానీ.. అసలే పెళ్ళయినవాడిని.. నన్నిలా బ్రతకనీయండిరా..
అంటే.. అంత భయంకరంగా ఉంటుందా... ??
ఎక్కడికెళ్ళినా ప్రశంతతలేదు.. అందరూ చెబుతున్న బోడి సలహాలు.... ఇవి.. చంపేస్తున్నారు..
పోనీ పెళ్ళితో సమస్యలు తీరిపోయాయా..అంటే..
కొత్తగా పెళ్ళయ్యి.. ఒక సంవత్సరం అయిన జంటలను.. ఎవరినైనా.. దయచేసి అడిగే ప్రయత్నం కూడా చెయ్యొద్దు..
పైన విన్నవాటికన్నా భయంకరంగా సమస్యలు ఉంటాయ్.. అని చెబుతారు.. తరువాత మీ ఇష్టం..
ఆనందం అంటే తెలియని వాళ్ళ సెటైర్స్.. సంగతి ఎలా ఉన్నాకానీ..
లైఫ్..ని ఎంజాయ్ చెయ్యడం తెలిస్తే.. నీరో చక్కవర్తిలాగా.. రోమ్ నగరం.. మునిగిపోతున్నా
ఫిడేలువాయించుకుంటూ.. ఆనందించొచ్చు...
మనకున్న ఏదొక హాబీని.. ఎంజాయ్ చేస్తూ.. స్నేహితులతో చెట్టాపట్టావేసుకుని.. హాయిగా నవ్వుకుంటూ
తిరిగేద్దాం..
ఏదో ఎప్పుడో వస్తుందీ.. రాబోతుందీ.. అని.. టైమ్ వేస్ట్ చేసుకునే కంటే.. ఇప్పుడు ఏంచేస్తున్నామో అన్నది ముఖ్యంకాదా?
నెవర్ కాంప్రమైజ్.. లివ్ యువర్ లైఫ్.. అంతే...
----------------------------------------------------------------
(పెళ్ళి ఎప్పుడు బ్రదర్.. అని. గుచ్చి గుచ్చి అడిగి.., పనికిరాని చచ్చుసలహాలిచ్చి..చావగొట్టే.. మహానుభావుల పాదపద్మములకు.. అంకింతం..)
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
11:07 PM
11
ఆభిప్రాయాలు

