23, జూన్ 2010, బుధవారం

ఐడియా!!!




రాయుడు.. ఏవరేజి స్టూడెంటు.. ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంటర్వూల్లో నెగ్గలేక
కొన్నాళ్ళు ఖాలీగా తిరిగేసాడు.. కొన్నాళ్ళు మార్కెటింగని అదని ఇదని..
అక్కడా ఇక్కాడా చిన్న చిన్నఉద్యోగాలు చేసినా తృప్తి చెందలేకపోయాడు.
ఫ్రెండ్సందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మంచి మంచి సేలరీతో సెటిల్
అయిపోయారు. అదిచూసి తట్టుకోలేకపోయిన రాయుడు ఎలాగైనా తనూ
సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలి.. అప్పుడుగాని ఐదంకెల సేలరీ రాదు, ఈ దరిద్రాలన్నీ
వదలవు అని.. అమీర్ పేటలో కట్టిన బ్యానర్లన్నీ చదివేసి కనబడ్డ కోర్సులన్నీ
నేర్చేసుకుని.., పేపర్లో పడ్డ ఇంటర్వూలన్నింటికీ ఎటండ్ అవటానికి సిధ్దమైపోయాడు.

ఎక్స్పీరియన్స్ ఎంత అన్న ప్రశ్న దగ్గరకొచ్చేసరికి చెమటలుపట్టేసేవి. చెప్పుకోటానికైతే
మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ వుంది గానీ.. అండర్ వేర్లదగ్గర్నుండి... క్రెడిట్ కార్డులు
అమ్మటం దాకా.. లిప్స్టిక్ దగ్గరనుండి నెయిల్ పాలిష్ దాకా అన్నీ అమ్మిన
అనుభవాలు కలిపి రెండేళ్ళు రావటంతో, ఎవరోచెప్పిన సలహాతో... మొత్తం రెండేళ్ళు
నాన్ ఐ.టి అని.., ఒక సంవత్సరం ఐ.టి ఎక్స్పీరియన్స్ అని రెజ్యూమ్ తయారుచేసి..
ఇంటర్వూలకు వెళ్ళటం మెదలుపెట్టాడు. అతనికి లక్కు కలిసొచ్చి.. ముంబయిలో ఓ
చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. ఎలాగైతే తనకున్న మార్కెటింగ్ స్కిల్స్
ఉపయోగించి జాబ్లో జాయినైపోయాడు. ఏదడిగినా నేర్చుకున్నప్పటి డెఫినిషన్ చెప్పేసి
తెలిసినట్టు కటింగు ఇచ్చేటాలెంటైతే వుందికానీ ఇది చెయ్యి అని ఏదన్నాపనిచ్చేసరికి..
ఒక్క ముక్కకూడా ముందుకు నడవక.. వారాలు వారాలు అలానే వుండిపోయి..
మేనేజరు దగ్గర రోజూ డక్కాముక్కీలు తింటూ కాలం గడిపేస్తున్నాడు.

రాయుడికి అప్పటిదాకా కలిసొచ్చిన లక్కు కాస్తా చంఢశాసన ప్రోజెక్ట్ మేనేజర్
రూపంలో బ్యాడ్ లక్ గా మారిపోయింది. పని ఇచ్చి వెనకేనిలబడి ఏం చేస్తున్నాడో
చూస్తూ. ఎప్పుడన్నా మంచి ఇస్త్రీ షర్ట్ వేసుకొచ్చిన రోజు ఏదన్నా తప్పుదొరికితే...
సినిమా హీరోలా మంచి మంచి డ్రెస్సులు వేసుకురావటం కాదు.. పనితనంలో ఉండాలి..
అని అమ్మాయిల ముందు పరువుతియ్యటాలు, పెద్దగాకేకలుపెట్టి అందరికీ వినపడేలా
గట్టిగా అరుస్తూ మాట్లాడటం లాంటి వేషాలన్నీ వున్నాయి మేనేజరుకు.

అప్పటిదాకా బ్రాండెడ్ జీన్సులు అవి వేసుకుని మంచి స్టైలిష్ క్రాపుతో
ఉన్నవాడు కాస్తా సాదాసీదాగా మారిపోయి.., రాయుడంటేనే మీసం
అనిపించేలా పెంచిన మీసం కాస్తా ట్రిమ్ చేసి.. తగ్గించాడు.. ఏంచేస్తే
ఎలా ఇరికిస్తాడోనని భయంభయంగా ఆఫీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు
రాయుడు. అలాగైనా ఎదో వంకపెట్టి తిట్టడం మాత్రం మానలేదు మేనేజరు.

కాలేజి రోజుల్లోనూ.., మార్కెటింగ్ చేసిన రోజుల్లోనూ హిందిని బాగా నూరిపోసుకుని
తాగేసిన లాంగ్వేజ్ స్కిల్స్ తో ప్రతీ పని తనే చేసానని చెప్పుకోవటం అలవాటు చేసుకున్నాడు.
ఒక్కోసారి టైముబాగుంటే పూలదండలూ.. లేకపోతే ఎవడోచేసిన తప్పులకు చెప్పుదెబ్బలు
తింటూవుండేవాడు.

అలా కొంతకాలానికి తనకు తెలిసిన తలమాసిన స్ట్రాటజీలన్నీ ఇంప్లిమెంట్ చేసి
ఎలాగైతే తప్పించుకునే విద్య అయితే నేర్చుకోగలిగాడు కానీ.. పని మాత్రం
నేర్చుకోలేకపోయాడు.. మేనేజర్ని మెప్పించలేకపోయాడు. అలా ఒక సంవత్సరం
గడిచేసరికి.. ప్రాజెక్టులో ఒకొక్కడూ వేరే వేరే కంపెనీలకు వెళ్ళిపోవటంతో, కొత్తగా
వచ్చిన టీముకు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియకపోవటంతో మొత్తం
రాయుడినెత్తిమీదే పడిపోయింది. ప్రతీదాంట్లోనూ నువ్వే సీనియర్ వి కదా నువ్వు
చేసి వాళ్ళకు చూపించు అనటం మొదలుపెట్టాడు మేనేజరు. ఎవడు చెయ్యకపోయినా
రాయుడ్నే సెంటర్ చేసి వంకపెట్టి తిట్టేయడంతో కధేంటిరా ఇ.వీ.వీ సినిమాలోలాగా
ఇలా మలుపు తిరిగింది.. అని రాయుడికి పిచ్చెక్కిపోయింది.

ఇన్నాళ్ళూ వాడినెత్తిమీద వీడినెత్తిమీద చేతులుపెట్టేస్తే అయిపోయేది.. ఇప్పుడు
నానెత్తిమీదే మా మేనేజరు బండచేతులు వేసేస్తున్నాడు బాబోయ్ అని తెగ
బాధపడిపోయాడు రాయుడు. ఈ టెన్సన్లన్నిటిని తట్టుకోలేక అరగంటకోసారి కంపెనీ
ఎదుటవున్న టీ బండిదగ్గరకు వెళ్ళి ఒక టీతాగటం.. ఒక సిగరెట్టెలిగించడం ఇలా
తిండిమానేసి టీలు సిగరెట్టులమీద నడిపేస్తూ... రాత్రిళ్ళు సరిగా నిద్రపోకా
మొహంలో రకరకాల మార్పులు తెచ్చుకున్నాడు.

ఫ్రండ్స్ ఎవరికి చెప్పినా అంతేరా బాధలు అలానే ఉంటాయి ఐ.టి ఇండస్ట్రీ అంటే
అనే వాళ్ళేగానీ తను చెప్పేది పూర్తిగా వినేవాడు, సలహా ఇచ్చేవాడు ఎవడూ
కనబడలేదు. ఇక ఉద్యోగం.. జీవితం రెండూ విరక్తి కలిగించేసాయి...
"మరెందుకురా నేను ఐ. టి. లోకి వస్తానన్నప్పుడు ఇవ్వన్నీ ఎవడూ చెప్పలేదు",
అని జనాలపై కసురుకోవటం మొదలెట్టాడు. "వస్తే ఎలాగూ తెలుస్తుంది కదా
మళ్ళా ఇంట్రడక్షన్ ఎందుకులే, అయినా చెబితే ఎవరూ వినరూ.. అనుభవలోకొచ్చాకా
ఏడుస్తారు..", అని అంతా ఏడిపించారు రాయుడ్ని.

"ఒరే.. మీ కోడ్ లో బగ్గులు పడా.., మీ మేనేజరు అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేసి
ఆఫీసుకు రమ్మనా..., రాసిన కోడ్ సేవ్ చెయ్యకుండానే.. మీ సిస్టమ్లలన్నీ క్రాష్
ఐపోనూ... రిలీజ్ రోజున మీ వేళ్ళన్నీ కీ బోర్డ్ సందుల్లో దూరిపోయి
గోరుచుట్టులేసెయ్యా.., లాంగ్ వీకెండ్ వస్తున్న రోజుల్లో మీరు బాత్రుంల్లో
వుండగా బయట డోర్ లాక్ పడిపోనూ.. నన్నింత మాటంటార్రా", అని రకరకాల
తిట్లన్నీ తిట్టేసుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడటం మానేసాడు.. రాయుడు.

ఓ రోజు రోజులాగే టీ బండి దగ్గర టీ తాగుతూ సిగరెట్టు వెలిగించి అప్పుడే తాజాగా
మేనేజరు తిట్టిన తిట్లన్నీ ఒక్కసారి రివైండుచేసుకున్నాడు... "వెళ్ళి ఆ టీ
బండిలాంటిదేదన్నాపెట్టుకోవయ్యా.. ఎందుకిలా ఐ.టి లోకొచ్చి మా ప్రాణాలు
తీస్తారు", అన్న తిట్టు పదే పదే ఎకో శబ్ధంలో చెవుల్లో మారుమోగిపోయింది.

"బలిసి కొట్టుకుంటున్న అత్తగారు.. కోడలు జాకెట్టు వేసుకుని తిరిగిందని.. మేం
చేసిచ్చిన పనిని మేకప్ చేసి పైవాడికి చూపించుకుంటూ అన్ని సోకులు
చేస్తున్నోడివి నువ్వే ఈ ఇండస్ట్రీలో లేగా లేంది నేనుంటే తప్పేంటిరా?, ఎప్పుడూ
ఎక్సెల్ షీట్లో తలపెట్టక్కూర్చునే తలమాసినెదవ్వి.. నీకేం తెలుసురా కోడింగ్
అంటే.., ఎప్పుడో పాస్కల్, కోబాల్ ప్రోగ్రాములు చెయ్యటంకాదురా.. లేటెస్ట్
ప్రోగ్రాములు చెయ్యమ్మా.. తెలుస్తుంది. నేను టీ బండి పెట్టుకోటానికైనా
పనికొస్తానేమో కానీ!!.. నువ్వైతే నా దగ్గర... తాగేసిన టీ గ్లాసులు కడగటానికి కూడా
పనికిరాని పనికిమాలినెదవా..", అని రాయుడు తన మేనజరుపై తిట్టుకున్న తిట్లవేడిని
తట్టుకోలేక చేతిలోవున్న టీగ్లాసు భళ్ళున పగిలి ముక్కలైపోయింది.

షర్ట్ పై పడిన టీ మరకలుతుడుచుకుంటుంటే.. మషాళా టీలాంటి ఐడియా ఒకటి తట్టింది..
రాయుడికి.., వెంటనే తన రూమ్మేట్ క్రిష్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి మంచి
ప్లాన్ చేసారిద్దరూ కలిసి..

"నన్నింతమాటంటాడా.. ఛీ.. ఈ రోజునుండి ఈ అఫీసులో అడుగుపెట్టను", అని
కోపంలో మెడలోవేలాడుతున్న ఐడెంటిటీ కార్ట్ ట్యాగ్ ను అగ్గిపుల్ల తీసి వెలిగించేసాడు.
ట్యాగ్ కాలుకుంటూ మంటలన్నీ మొహంవైపొచ్చేసరికి.. కంగారుగా ట్యాగ్
తీసేసి.. అవతలపడేసి నాలుక్కరుచుకున్నాడు.

"అయ్యబాబోయ్ ఇలా కాల్చేసేంత ఆవేశం వచ్చేసిందేంటి... అసలే
నెలాఖరిరోజులు.. చక్కగా జీతం ఎకౌంటులో పడ్డాకా చెక్కైయొచ్చుకదా?",
అని సగం కాలిన ఐ.డి కార్డు తుడుచుకుంటూ మనసు మార్చుకుని.. ఇచ్చిన
వర్క్ తలచుకుంటూ..ఆఫీసులోకి బయలుదేరాడు.

ఎదురుచూస్తున్న ఫస్ట్ తారీఖు రానే వచ్చింది... బ్యాంక్ ఎకౌంట్లో సేలరీ డిపాజిట్ ఎసెమ్మెస్
చూడగానే కంగారుగా ఆఫీసు బయటకు వచ్చేసాడు.. సెల్ ఫోన్ తీసి డయల్ చేసి రూమ్మేట్
క్రిష్ తో విషయం చెప్పాడు.. ఓ గుడ్.. ఇదే మంచి సమయం.. ఇంక ఆలస్యం ఎందుకు..
ఇచ్చేయ్ అందరికీ షాక్... మీ మేనేజర్ కి స్పెషల్ గా మెయిల్ కూడా పెట్టు.., గూగుల్ లో
వెతికి బాలకృష్ణ మీసం తిప్పుతూ.. తొడకొడుతున్నట్టున్నఇమేజ్ ఎటాచ్ మెంట్ చెయ్యటం
మర్చిపోకు.., నువ్వేం బయపడకు... అంతా మన ప్లాన్ ప్రకారమే నడుస్తుంది..., నేను
నా ప్రాజెక్టుకు కూడా ఇంత మంచి వర్క్ ఫ్లో చార్ట్ తయారుచెయ్యలేదు..., నిన్ననే సాధక
బాధకాలు అని ఒక డాక్యుమెంట్ చేసాను.. అన్నిటికి మనం సిద్దంగానే వున్నాం..
నేను అన్ని ఎరేంజ్మెంట్స్ చేసేసా కూడా... రెపే ముహుర్తంపెడదాం.. అంతా అయ్యాకా
ఫోను చెయ్యి.. అని ముగించాడు క్రిష్...

ప్లాన్ చెసిన ప్రకారం తన సాఫ్ట్వేర్ ఇంజనీరు జాబ్ కి రిజైన్ చేసేసి అందరికి షాక్ ఇచ్చాడు
రాయుడు..., రేపట్నుండి నేను రావటంలేదు.. ఈ క్షణం నుండీ నాకూ ఈ ప్రాజెక్టుకీ ఏమీ
సంబంధంలేదు.. ఏం పీక్కుంటావో పీక్కో అని స్పెషల్ మెయిల్ చూసి మేనేజర్ షాక్ తిని
కూలబడిపోయాడు..

తరువాత రోజు ఎపుడూ ఆఫీసుకు బయలుదేరే సమయానికంటే ఒక గంట ముందుగానే
ఆఫిసుకు బయలుదేరాడు రాయుడు... వెనకే బైక్ పై క్రిష్ కూడా కుర్చున్నాడు.

"మాషాళా చాహా.. అద్రక్చా చాహా.., గరమ్ గరమ్ వడాపావ్... మిళేలా..,
జై శివసేనా.. జై మాహారాష్ట్ర" అని.. మరాఠీలో రాసివుండి.. పూలదండలతో అలంకరించిన
టీబండిని లోకల్ ఎమ్మెల్యేచేత తన ఆఫీసు ఎదురుగానే రిబ్బన్ కటింగ్ చేయించి..
ఓపెన్ చేయించారు రాయుడూ క్రిష్...

ఆ రోజునుండీ రాయుడి వ్యాపారం.. మూడొందలు వడాపావ్ లు.. ఆరొందలు మషాళా
టీలు అన్నట్టుగా...వర్క్ టెన్సన్.. మేనేజర్ హెరేస్మెంటూ.. ఏమీ లేకుండా దర్జాగా..
పోలీసోడికీ..., లోకల్ గూండాలకి, ఎమ్మెల్యేలకీ అమ్యామ్యాలు చదివించుకోగా
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పున్యమా అని పదిలక్షలు పెర్ ఏనమ్ గా ముందుకు సాగింది.

21 కామెంట్‌లు:

భావన చెప్పారు...

టూ మచ్ అండి మీరు నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఐతే మరి అమెరికాలోని మా పరిస్తితి ఏంటో ఆ టీ కొట్టూ కు కూడా పనికి రాము గా.. :-(

Unknown చెప్పారు...

Super undi...aa software thitlu aithey highlight !! Keep going..

ఆ.సౌమ్య చెప్పారు...

బాబోయ్ కేక అవిడియా....కాని ఇది చాల నిజమండీ. హైదరాబాదులో ఒక్ ఐటి బిల్డింగు ఎదురుగుండా ఇలాగే ఒక 10-15 కొట్లు ఉన్నాయి. అక్కడ అట్లు పెనం మీద వేసీ వెయ్యగానే జనం లాక్కుని తినేస్తున్నారు. టీ, కాఫీలు మరగకుండానే నోట్లో పోసేసుకుంటున్నారు. చేతికి వచ్చిన డబ్బులు ఆ దుకాణంవాడి చేతిలో పడేసి పరుగో పరుగు. ఆ కొట్లవాళ్ళు ఉదయం 6.00 కి తెరిచి అర్థరాత్రి 12.00 వరకు ఉంచుతున్నారు. అసలు టీ, కాఫీలు పుల్లట్లు, ఇడ్లీ వడలు ఎలా అమ్ముడయిపోతున్నయంటే...నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఆ బిల్డింగులో ఉన్నవాళ్ళకన్నా, బిల్డింగు బయట ఉన్నవాళ్లే ఎక్కువ సంపాదిస్తున్నారేమో అనిపించింది.

ఏమాటకామాటే చెప్పుకోవాలి మీ తిట్లు మాత్రం దిరిపోయాయి. మీ పుణ్యమా అని ఇవాళ నేను కొత్త తిట్లు నేర్చుకున్నాను :)

మంచు చెప్పారు...

సూపరండి ... ఒక ఐడియా జీవితాన్నే మార్చెసింది అన్నమాట...
మన జిల్ల కథరాసి చాలా రొజులయ్యింది.. అర్జెంట్గా ఒక కధ రాసెయ్యలంతే

మంచు చెప్పారు...

భావన గారు.. మాకు ఆస్తాన టాక్సి డ్రైవెర్ ఒకతను వున్నాడు ఇక్కడ.. అతని మేనళ్ళుళ్ళు ఐ టి కంపెనీలొ టీం లీడర్లు గా పనిచెసెవారట... దానికన్న లిక్కర్ షాప్ లొ ఎక్కువ మిగులుతుంది అని ఉద్యొగం మానెసి వెళ్ళిపొయి ఒక షాప్ పెట్టుకున్నరట... ఇక్కడ మనకి టీ షాప్లు బదులు లిక్కర్ షాపులు , గేస్ స్టెషన్స్ , అందులొ గ్రొషరీ షాపులు .. బొల్డు వున్నాయ్...

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

కామెడీగా ఉన్నా వాస్తవానికి దగ్గరగా బావుంది

SATYA చెప్పారు...

శ్రీ శ్రీ గారి తిట్ల పురాణం బాగుంది . తిట్లన్నీ సాఫ్ట్వేర్ వాళ్ళకి నేర్పెస్తున్నారు... బావుందండి... ఇంతకీ మన పడమటి గోదావరి కధలు ఎప్పుడు ??

రాజ్ కుమార్ చెప్పారు...

బలిసి కొట్టుకుంటున్న అత్తగారు.. కోడలు జాకెట్టు వేసుకుని తిరిగిందని..
kevvvvvvvvv........
arupulu...kekalu..... :) :)

హరే కృష్ణ చెప్పారు...

hillarious
సూపర్ పోస్ట్

Rajesh చెప్పారు...

చాల బాగుందండి రాజు గారు. ఇష్టం లేకుండా ఆఫీసు కి వెళ్ళిన ఒక రోజు పొద్దున్న ఆఫీసు లో కూర్చొని చదివా మీ పోస్ట్. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి.....

రాధిక(నాని ) చెప్పారు...

జంద్యాలగారి తిట్లకి ఎదురొచ్చాయండి మీతిట్లు .చాలా బాగుంది

శ్రీనివాసరాజు చెప్పారు...

@ భావన గారు
మీరు అమెరికా అదీ అంటున్నారు.. నా బ్లాగులో మందు కామెంటిచ్చేవారిలో మీరుంటారు కాబట్టీ చెబుతున్నానండోయ్ ఒక ఐడియా..
చక్కగా దోసలూ.., చల్ల పునుకులు.. ఇడ్లీ.. ఆంధ్రా చెట్నీ వ్యాపారం మొదలుపెట్టండి.. ఇక డాలర్లే డాలర్లు.. :-)
నా ఐడియాకు అప్పుడు ఇద్దురులేండి.. కమీషనూ అదీనూ.. మీరు మరీ మెహమాటస్తులు.. :)

@శ్రవణ్ కుమార్ గారు.
తప్పకుండా చదవుతుండండి.. రాస్తుంటాను.. మీ కామెంటుకు ధన్వవాదములు.

@సౌమ్యగారు
అవునండీ ఆ కంగారే వేరొకరి జేబులు నింపుతుంది..

నా తిట్లన్నీ కాఫీ రైటెడండోయ్.. :-)

@మంచు. పల్లకీ గారు
కధనచ్చినందుకు చాలా సంతోషం.
త్వరలోనే రాయబోతున్నా మనజిల్లా కధ.. దుమ్ములేచిపోవాలంతే.. అంతేఅంటే.. అంతే..
మీ అవిడియాలు కూడా బాగున్నాయండోయ్.. అసలే మన రాష్ట్రం లిక్కర్లో ఫస్టొచ్చినా రావొచ్చు.. :-)

@బెల్లంకొండ గారు
వాస్తవాన్నే కాస్త కామేడీకీ దగ్గరగా చేసాను.. లేకపోతే ఈ సీరియస్ లైప్ లో ఇంకా సీరియస్ బ్లాగులెందుకండీ చెప్పండి.. ధన్యవాదములు ఇలానే చదువుతుంటారని ఆశిస్తున్నాను.

@సత్య
బాబూ.. మేం నేర్పేదేమిటి.. మీలాంటివారి ఇస్పిరేషనే మాకు బ్లాగులు రాసుకునే అదృష్టం కలుగుతుంది.. :)
త్వరలోనే విడుదల..

@వేణురామ్ గారు
హ హా హా.. బాగా నచ్చిందన్నమాట..
మీ కేకలు అరుపులకి.. ధన్యవాదములు.. :)

@హరేకృష్ణ గారు
ధన్యవాదములండీ..!

@రాజేష్ గారు
బాగా నవ్వుకున్నందుకు సంతోషంమండీ..

@రాధిక(నాని) గారు
మహానుభావుడు జంధ్యాలగారి కామేడీయే కామెడీలేండి
అది వేరేవాళ్ళతో పోల్చదగ్గది కాదు.
మీ కామెంటుకు పోలికకూ చాలా చాలా ధన్యవాదములు.. :-)

భావన చెప్పారు...

కామెంటు లు వాటి సమాధానాలు చదివి ఇంకో సారి నవ్వులే నవ్వులు.
@మంచు పల్లకి గారు: అట్లా లాభం లేదండి, నేను మధ్యలో ఒక మూడేళ్ళూ మన శ్రీనివాసరాజు గారి కధ లో హీరో లెక్కనే తిట్టుకుని బయటకు వచ్చి, మళ్ళీ ఇట్టా లాభం లేదు లే పని చేసినా పని చెయ్యక పోయినా కోడ్ ను నమ్ముకుంటే, ఆ పైన మేనేజర్ వుంటాడూ వాడీ ఖర్మ అని వచ్చేసా వుద్యోగం లోకి. ఐనా మీ ఐడియా సూపర్ కాని మన గుజ్జు బాబు లు బాగా పోటీ వచ్చేస్తున్నారు మాస్టారు. న్యూయార్క్ లో డాక్టర్ లు కూడా సైడు బిజినెస్ గా లికర్ షాప్ లు ఓపెన్ చేస్తుంటే మనమేమి చేస్తాము చెప్పండీ. :-(
@రాజు గారు: లాఫం లేదండి.. ఆంధ్రా పునుకులు చట్నీలు డైటీంగ్ కేలరీల లెక్కల్లో కొట్టుకుని పోతున్నాయి.. బాగా బాచిలర్స్ వుండే చోటు పెట్టాలనుకుంటా ఆంధ్రా ఫుడ్. సరే మరి వచ్చెయ్యండీ మరి డాలరుకో బజ్జి అమ్మేసుకుందాము అదేదో సినిమా లో సూర్యకాంతం లా. (కమీషన్ ఎందుకు చెప్పండీ సూపర్ ఐడియా ఇచ్చినందుకు వ్యాపారం లో నే షేర్ తీసుకుందురు.. వూరుకోండి మీరు కూడా వో మొహమాట పడుతున్నారు)... ;-)

శివరంజని చెప్పారు...

kevvvvvvvvv........keka నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చాయండి.....

ramnarsimha చెప్పారు...

*PADAMATI HAASYA RAAGAM*

Is very funny..

Thanq..

శ్రీనివాసరాజు చెప్పారు...

@ శివరంజని గారు
మీ కెవ్వ్ కేకకు నా చెవులు గగ్గోలెత్తిపోయాయి..
మీ నవ్వులకు సంతోషం.. అలానే నవ్వి నవ్వి కేకలు పెడతారని ఆశిస్తున్నాను.. :-)

@రామ్ నరసింహ గారు
హుమ్మ్.. మొత్తం బ్లాగుపేరే మార్చేసారన్నమాట.. బాగుందండీ..
మీకు నచ్చినందుకు సంతోషం. కామెంటుకు ధన్యవాదములు

కొత్త పాళీ చెప్పారు...

భలే

మరువం ఉష చెప్పారు...

ఐ టి వాళ్ల మీద అంతా అనేసుకుని నవ్వేసుకున్నారుగా అంచేత నేను కాస్త పక్కకి వెళ్తాను..ఇది మేము సిడ్నీ వెళ్ళిన కొత్తలో విన్నమాట/నిజంగా జరిగినదేనట. అక్కడ హాండీ మాన్ పనులకి తెగ డిమాండ్. ఓ డాక్టర్ గారు ప్లంబర్ అవసరపడి పిలిచారట. సదరు ప్లంబర్ గారు, పనయ్యక ఇచ్చిన బిల్లుకి డాకటర్ బాబు అదిరిపడి, అమ్మో నా పేషంట్స్ కి నేను గంటకి ఇంత ఎప్పుడూ ఛార్జ్ చేయను అన్నారట. అప్పుడు తాపీగా మన ప్లంబర్ గారూ అన్నారట, "అవును, నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేసినపుడు నేనూ అంతే!" అని. ఇపుడు మన వంతు అన్నమాట. మీల్స్ ఆన్ వీల్స్ నా భావి ప్రణాలిక.

శ్రీనివాసరాజు చెప్పారు...

హ హా.. బాగా చెప్పారు ఉషగారు.
ఇలాంటిదే ఒక సంఘటన.. మా ఆవిడను ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టరుగారు దగ్గరకు ఎవడో ఎలక్ట్రీషియన్ వచ్చాడు.. నేనివ్వను అంత చార్జ్ చేస్తే ఎలాగా.. అని మా వంక చూసి చెప్పింది..

రెండు ట్యూబులైట్లు మార్చాడంట.. అదీ వీళ్ళుకొనుక్కున్నవే కాస్త ఫిట్ చేసి.. రెండువందల ఏభై ఇవ్వమంటున్నాడు అని.., ఆవిడ మాతో అంది.. వీళ్ళ బిజినెస్సే బాగుంది అని.. నేనన్నాను ఇలాంటివి చాలా బిజినెస్సులు ఉన్నాయిలేండి అని..

ఇక మీల్స్ ఆన్ వీల్స్ బాగుంది.. అయినా నిత్యవసర వస్తువు.. లేదా తిండికి సంభందించిన వ్యాపారం పెడితే లోటేమిటండీ కాసులే కాసులు.. గుఱ్ఱం గుడ్డిదైనా దాణా తప్పదుకదండీ మరి.. :)

Usha చెప్పారు...

శ్రీనివాస్ శుభోదయం

మీ అభిప్రాయం నా బ్లాగు లో రాసినందుకు ముందు ధన్యవాదములు అందుకోండి :)
ఇక (ఇడియా) మీ కెవ్వు కేక చదివాక వెంటనే అభిప్రాయం రాద్దాం అని అనుకున్నా కాపోతే కొద్దిగా బిజి గా ఉంది
సో అందుకే లేట్ గా రాస్తున్నా
ఈరోజు రాద్దాం అని బ్లాగ్ వోపెన్ చేసేసరికి ఇంకో కొత్త పోస్ట్ కనిపించింది
సో ఇక ఆలస్యం చెయ్యకూడదు అని వెంటనే రాసేస్తున్నా
నిజానికి ఈ సాఫ్ట్ వేర్ వాళ్ళ జీవితం ఎలా మారిపోయిందో కళ్ళకి కట్టినట్టు రాసిన మీ కల్పనా చాతుర్యానికి
నాకు సంతోషంగా ఉంది
ఇక మీ " ఐడియా " మాత్రం బావుంది కాపోతే మీ జాబ్ ఏంటో తెలీదు కాని మరీ సాఫ్ట్ వేర్ వాళ్ళని అలా
మార్చెయ్యడం ఎక్కడో చిన్న బాధ గా కూడా అనిపించింది అంటే నా ఉద్దేశ్యం బజ్జి & వడపావ్ వ్యాపారం కామెడి కే అయినా
ఎందుకో కొద్దిగా బాధ కలిగింది అఫకోర్స్ నవ్వుకోడానికి సరదాగా ఉంది

ఉష

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఉష గారు
నేనుబ్లాగు మొదలుపెట్టిన కొత్తలో మొత్తం చాలా తక్కువమంది తెలుగుబ్లాగర్లు వుండేవారు.. నేనేది రాసినా పాపం అందరూ ఏదో కామెంటిచ్చి ప్రోత్సహించేవారు.. వాళ్ళల్లో మీరు కూడా.. :)
అందుకే కామెంటిచ్చి.. ఏం చేస్తున్నారో అని పలకరించా.. కొత్తవాళ్ళొచ్చాకా పాతవాళ్ళని మర్చిపోకూడదుకదండీ.. :)

నేనూ సాఫ్ట్వేర్ వాడిని కాబట్టే అందులోని లోటుపాట్లని రాయగలుగుతున్నానండీ.. నామట్టుకు నాకు.. ఈ ఉద్యోగం కన్నా అవేబెస్టని :)

మీకు నచ్చినందుకు సంతోషం.
ఇంకా పాతస్నేహితులను ఒక్కసారి పలకరించాలి..

Related Posts Plugin for WordPress, Blogger...