13, జులై 2010, మంగళవారం

కమాన్ గుసగుసా...


గుస గుస... గుస గుస.. కమాన్ గుసగుసా...

"ష్.. త్వరగా తినెయ్యాలమ్మా.. లేకపోతే అదిగో.. బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతాడు"
అని అమ్మ గోరుముద్దలు పెడుతూ పిల్లాడిని ఏమార్చుతూ నేర్పుతుంది
తొలి లాలింపు గుసగుస.

కాస్త పెద్దయ్యాకా "నేను చాక్లెట్ తిన్నానని మా నాన్నకు చెప్పకే.. నీకూ
ఒక చాక్లెట్ ఇస్తా", అని.. తోటి స్నేహితుడికి లంచం ఇస్తూ తాయిళం గుసగుస.
"మీ మమ్మీలేదుగా.. పద పార్క్లో ఉయ్యాల ఊగుదాం..", అని పక్కింటబ్బాయిని
లాక్కుపోతూ దొంగాటల గుసగుస.

"ఒరే.. హర్షాగాడి పెన్సిల్ బాక్సూ.. నెమలికన్నూ దాచేసాను చెప్పకండే", అని
అమాయకుడిని ఆటపట్టించే గుసగుస.

పక్కూరోళ్ళ తోటల్లో మామిడికాయలో ఉసిరికాయలో దొంగచాటుగా కోసి..
"ఒరే.. త్వరగా ఉప్పూకారం పొట్లం విప్పరా, మళ్ళీ ఎవరొకరొచ్చేస్తారు..", అనే
దొంగ గుసగుస.

"ఆ అమ్మాయి పళ్ళుచూడు.. అన్నీ పుచ్చుపోయాయి.. హి హీ..", అని
క్లాస్ మేట్ ని ఏడిపిస్తూ చిలిపి గుసగుస.

స్కూలుకెళ్ళే వయసులో ఇలా రకరకాల గుసగుసలు నేర్చుకుని మనతోపాటే
అవీ ఎదుగుతాయి.

"డాడీ పడుకున్నారు.. గొడవచేయకుండా ఆడుకోండి.., లేచాడంటే.. చెబుతాడు మీ
పని", అని ఇంట్లో ఆడుకోనీకుండా నానమ్మో అమ్మమ్మో చేసే వార్నింగ్ గుసగుస..
"ఏ పిల్లలూ ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు..ష్.. సైలెంట్..", అని స్కూల్లో
టీచర్ బెదిరింపు గుసగుస

"నువ్వు ఆ పక్కింటి చైతూతో తిరిగావంటే వీపు పగులుతుంది.. వాడు చెడిందికాక
నిన్నూ చెడగొడతాడు..", అని డాడీ రుసరుసల్తో పక్కఫ్లాటులోకి వినపడకుండా
తిట్టే తిట్ల గుసగుస.

ఇలా గుసగుసలు మొదలుపెట్టి మనకు అలవాటు చేసిన పెద్దోల్లే.. తమ పిల్లల్ని
అదిచెయ్యొద్దూ ఇది చెయ్యొద్దూ అని చెప్పే రిస్ట్రిక్షన్ గుసగుస.

ఇక మూతిమీద మొలిచిన నూనూగుమీసాల అబ్బాయిలూ... వయ్యారాలుపోతూ
అమ్మాయిలూ.. టీనేజ్ వయసులో చేసే చిలిపి గుసగుసలేవేరు..

"క్రికెట్ ఆడదాం రారా.., సిన్మాకెళదాం పదరా..", అని స్నేహితుడు ఫోన్ చేసి
చెప్పే జంప్ గుసగుస.

"శైలూ నావంక చూస్తుందోలేదో చూడరా..", అని పక్కవాడిని గోకి అడిగే
పోకిరీ గుసగుస.

"హే.. ఆ అమ్మాయి డ్రస్ చూడవే.. మా ఇంట్లో అలావేస్తే చంపేస్తారే..",
అని టీషర్ట్ జీన్చ్ వేసుకున్న పక్కమ్మాయిని చూసి చెయ్యడ్డుపెట్టుకుని చేసుకునే
ఈర్ష్యా గుసగుస.

"నిన్ను అంతలా ఇష్టపడుతుంటే.. పాపం ఎందుకు అలా ఎవైడ్ చేస్తావే..",
అని తోటి అమ్మాయి ప్రేమవిషయంలో ఇచ్చే చచ్చుసలహా గుసగుస.

"అబ్బా ఈయన చెప్పిందే చెబుతాడేంటే.., ఈ రోజు.. ఒకే పేజి
చదువుకొచ్చినట్టున్నాడు ", అని హిస్టరీ క్లాసులో మాస్టారు బ్లాక్బోర్టువైపు
తిరగగానే స్టూడంట్స్ చేసుకునే కామెంట్ గుసగుస.

ఇలా చెప్పుకుంటూపోతే.. మాటల్లో ఎనభైశాతం గుసగుసలే ఈ వయసులో...

ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వూలకోసం క్యూలు కట్టి.. అప్పుడే ఇంటర్వూ గదిలోనుండి
వస్తున్నవాడిని చాటుగా పిలిచి.. "ఏమేం అడుగుతున్నారో చెప్తారా కాస్త", అని
అడిగే ఆత్రుత గుసగుస.

"మన సుబ్బారావుగారి అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదంటా.., పాపం లక్షలక్షలు
డొనేషన్సు పోసి చదివించాడాయన... వాడు సరిగ్గా చదవడం మానేసి ఆ బిజినెస్ చేస్తా
ఈ.. బిజినెస్ చేస్తా అని ఎగిరేవాడంటా..ఇప్పుడు వాళ్ళతోటివారందరికీ ఉద్యోగాలు
రావటం చూసి వాడూ ఉద్యోగం వెతుకుతున్నాడంటా..", అని పనిలేని నైబర్ గుసగుస.

ఇవ్వన్నీ నిరుద్యోగ గుసగుసలు కాగా..

కొత్తగా ఉద్యోగంలో జాయినయినవాడిని చూసి.. "చూస్తే చాలా అమాయకుడిలావున్నాడు...
రేపు వీడే మన కొత్త బాస్ అని చెప్పినా చెబుతారు.. అమ్మో జర భద్రం", అని కొలీగ్స్
వణుకు గుసగుస.

"ఎమే.. ఫలానా అమ్మాయి ఈ మధ్యే ఐ.ట్వంటీ కార్ కొందే..., ఎవరికీ
తెలియకుండా ఎమన్నా జీతం పెంచారేమోనే..", అని సహోద్యోగినిల
టైమ్ పాస్ గుసగుస.

ఇవన్నీ చిరుద్యోగ.. ఆఫీసు గుసగుసలు.. ఇప్పుడు వీటిగురించి ఎంత తక్కువచెప్పుకుంటే
అంత ఆరోగ్యం.

"ఆ అబ్బాయి చాలా బాగున్నాడు.. పెళ్ళయినట్టులేదు.. కాస్త వివరం కనుక్కోండి..
మా తమ్ముడుగారి కూతురుకి అయితే చక్కగా సరిపోతాడు.. ", అని ఫ్రెండ్
పెళ్ళికొచ్చి.. చెంగుచెంగునెగురుతున్న కుర్రోడిని చూసి చెప్పుకునే పెద్దరికపు గుసగుస.

"ఏమ్మా.. అబ్బాయి నచ్చాడా..!, పర్వాలేదులే నాతో చెప్పు", అని పెళ్ళిచూపుల్లో
అమ్మాయిని వాళ్ళ మేనత్త అడిగే.. పేరంటాళ్ళ గుసగుస.

"అమ్మాయి.. కాస్త సిగ్గునటించమ్మా.. తలమరీ అంతలా ఎత్తెయ్యకూ..
చూసేవారంతా.. మరీ ఫాస్ట్ ఈ పిల్ల అనుకుంటారమ్మా..", అని పెళ్ళిపీటలమీద
కూర్చున్న పెళ్ళికూతురి చెవిలో అమ్మలక్కల గుసగుస.

శోభనం గదిలో.. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి చెవిలో.. ఏమడగాలో.. ఏంమాట్లాడాలో
తెలియక.. "నువ్వేం చదువుకున్నావు..", అని కంగారు అడిగే కన్ఫ్యూజ్ గుసగుస.

"ఏమే..., పొద్దున భోజనంలో పప్పూ ఆకుకూరతోనే సరిపెట్టారు... మాఇంటికిరండీ..
అన్నిట్లోనూ ముంచి తేల్చేస్తాం అన్నావుకదా!.. ఏదీ.. ముంచటంలేదూ!! తేల్చడంలేదూ!!
సాయంత్రం భోజనంలో ఏంచేస్తున్నారో వెళ్ళి కనుక్కో..", అని కొత్తల్లుడు అత్తవారింటిలో
తన భార్యతో ఎగతాళి గుసగుస.

"ఈసారి కూడా అల్లుడుగారు బిజీగా వుండి రారనుకున్నాం.. పోయినసారి
పండక్కికూడా ఏమీ పెట్టలేదు, బాగోదండీ.. ఏం పెట్టాలంటారు..", అని పండక్కి వచ్చిన
అల్లుడికి సేవలు చేస్తున్న భర్తని తలుపు పక్కకు పిలిచి అడిగే భార్య గౌరవపు గుసగుస.

ఇవ్వన్నీ బాధ్యతా గుసగుసలు.. ఎంతచెప్పినా.. వీటికీ అంతంలేదు..


"ఏవమ్మా.. అంతలా సౌండు చేస్తే.. పిల్లాడు లేచిపోతాడు.. కాస్త నెమ్మదిగా కడగమన్నా
కదా.. వంటసామాను..", అని పనిమనిషి మీద ఎగిరి సౌండు తగ్గించి వాయించే
ఫిడేలు గుసగుస.

"ఏవండీ ఆ కాలింగ్ బెల్ కి కాస్త ఏదన్నా అతికించి పుణ్యంకట్టుకోండి.. అది ఎవడోకడు
నొక్కడం.. వీడు ఉలిక్కిపడిలేచి కేర్ మనటం..", అని ఇంటావిడ.. చిన్న పిల్లాడితో వేగలేక
విసుగు గుసగుస.

"చింటూ చదువుకుంటున్నాడు.. కాస్త ఏమనుకోకుండా టీవీ ఆఫ్ చేస్తారా.. మావయ్యా!",
అని మనవడి చదువుకోసం తాతయ్యకు ఎగిరిపోయిన ఫ్రీడమ్ గుసగుస.

"అమ్మా!.. నీకెన్ని సార్లు చెప్పానే.. నువ్వన్నా చెప్పినమాటవినవేంటే.. అది తిక్కదే..
చెప్పినా వినదు.. నువ్వేందుకు దాన్ని కదుపుతావు..?", అని పక్కగదిలోవున్న పెళ్ళాంకి
వినపడకుండా తల్లికి కొడుకు పీకే క్లాస్ గుసగుస.

"మీ అమ్మానాన్నలతో పడలేకపోతున్నానండీ.., వాళ్ళకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది,
రామా అంటే బూతులావినిపిస్తుంది.., పిల్లాడిని గారాభంతో ఏం చేస్తారో అని భయంగావుంది",
అని భర్తకు భార్య చెప్పే పితూరీ గుసగుస.

ఇవన్నీ సంతాన, కుటుంబ, కలహాల గుసగుసలు.. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోటైపుగుసగుసలు.

"కాసేపు నుంచుంటే కీళ్ళనొప్పులు.. నడిస్తే ఆయాసమమ్మా.. ఏం చెప్పనూ.. మావారికి
చెబితే.. నువ్వేమన్నా ఇంకా పదహారేళ్ళ బాలాకుమారివా, ఈ వయసులో నెప్పులురాక..
యవ్వనం పొడుచుకొస్తుందేంటీ.. అంటారమ్మా...., మా అబ్బాయికి చెబితే..
డాక్టర్ చెప్పినట్టు వాకింగ్ చేస్తే ఇవ్వన్నీ వుండవు.. నాలుగురోజులు నడువు అంటాడమ్మా..
ఇలా.. ఇద్దరూ కస్సున ఇంతెత్తున లేస్తారమ్మా...., అసలు నిడబడితేనే నొప్పులు అని
నేనేవరికి చెప్పుకోనమ్మా..", అని వాకింగ్ కి వచ్చి పార్కులో కుర్చుని పక్కింటావిడకు
బాధలుచెప్పుకుంటున్న బామ్మగారి ఆపసోపాల గుసగుస

"ఇక వయసైపోయింది.. ఈ రోజో రేపో అన్నట్టుంది ఇక ఎప్పుడో హరీ.. అంటాను..",
అని ఖళ్ళూ ఖళ్ళూ దగ్గుతున్న తాతగారు ఇంటికొచ్చిన చుట్టానితో నోటినుండి మాటరాక
చేసే నీరసపు గుసగుస.

ఇవన్నీ. వృద్ధాప్య.. ఆరోగ్య.. అనారోగ్య.. గుసగుసలు..

ఇలా ఇక్కడితో అయిపోలేదండీ ఈ గుసగుసలు...,చక్రంతిరిగినట్టు .. కాలచక్రంతో పాటు ..
అలా తిరుగుతూనే వుంటాయి.. మరళా మొదటినుండి చదవటంమొదలుపెట్టండి మరి..
కమాన్ గుసగుసా..

14 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

భలే రాసారండి... ఇలాంటి ఐడియాలు ఇలా వస్తాయి మీకు (గుస గుస)

భావన చెప్పారు...

బాబ్బాబు ఇలా ఐడియాలు ఎలా వస్తాయో కాస్త గుస గుస గా చెవిలో వెయ్యరు.. మీ సాయం వూరకుంచుకోం మరి. ఆ మంచుపల్లకి గారికి చెప్పకండి మీ గోదారాయనే అని.ఒకే వూరోళ్ళు కాంపిటీషన్ కు వచ్చేస్తారు. ఏదో మేమంటే మీకు దూరం ఏడనో వుంటాం... ఏంది????

హరే కృష్ణ చెప్పారు...

భలే రాసారండీ
చాలా బావుంది

నేస్తం చెప్పారు...

చాలా బాగా రాసారు ( అంతా బాగానే ఉంది బ్లాగుల గురించి ఏమీ రాయాలేదేంటండి (గుసగుసగా ))

satish చెప్పారు...

kshaminchali .. telugu lo post chayyananduku ga .. bagundoy ne gusa gusa :) .. asalu important exams lo gusa gusa marchipoyavu friend :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-)
బాగుంది..

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుందండి గుస గుస

USHA చెప్పారు...

నిజమే ప్రతి ఒక్కరు సగం జీవితాన్ని "గుస గుస " లతోనే గడిపేస్తారు
ఇన్ని గుస గుసల మద్య సుఖ సంతోషాలను వెతుక్కుంటూ గడపటం కూడా
ఒక ఆర్టే అనిపిస్తుంది అందుకే భగవంతుడు మనిషిని సృస్టించాడేమో కూడా
ఎందుకంటె మనిషికే కదా గుస గుస లు చెప్పటం వొచ్చు :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు పల్లకీ & భావన గారు

హమ్మా.. ఆశ.. అప్పడం.. దోశ.. వడా.., అలా ఐడియాలు చెప్పేస్తే ఎలా!!, మావూరోళ్ళైనా.. పక్కూరోళ్ళైనా.. ఎవ్వరికీ చెప్పేది లేదు..

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. :-)
మీకు నచ్చినందుకు సంతోషం

@హరేకృష్ణగారు
నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదములు :)

@నేస్తంగారు & సతీష్ గారు
చెప్పానుగా.. ఇలా చెప్పుకుంటూపోతే.. అంతమేలేదండీ గుసగుసలకీ..
ఒక పది భాగాలు పుస్తకం దీనిమీదే రాసుకుపోయినా.. ఇంకా మిగిలేవుంటాయి.. :-)
మీ కామెంటుకు ధన్యవాదములండీ..

@శేఖర్ పెద్దగోపు గారు
మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదములు

@రాధిక(నాని) గారు
గుసగుసలు నచ్చినందుకు సంతోషం.. :-)

@ఉష గారు
బాగా చెప్పారు.. అవును మనిషికే కదా గుసగుసలొచ్చు.., భలే భలే.. అయితే ఈ గుసగుసల మధ్య ఇక ఆనందాల్ని వెతుకోవచ్చన్నమాట.., కాకపోతే.. ఎవరికీ వినపడకుండా చెయ్యాలండోయ్.. లేకపోతే.. ఆనందం మాట దేవుడెరుగు.. వీపు విమానంమోతే.. :-)

మీ కామెంటుకు ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

చూద్దాం.కార్తీక్కు తో ఎలాటి గుసగుసలు చెప్తావో! ఊరికే పెద్దాళ్ళని ఆడిపోసుకోడం కాదమ్మా! నువ్వూ ఇక్కడే ఉంటావు, మేమూ ఇక్కడే ఉంటాం!

USHA చెప్పారు...

హలో శ్రీనివాస్ గుడ్ మార్నింగ్

అసలు గుస గుస అంటే నే ఎవరికి వినపడకపోవడం కదా :D
కాపోతే మీరన్నట్టు విమానం మోత మోగొద్దు అనుకుంటే మాత్రం ఏదో సామెత లో చెప్పినట్టు
"ఏంట్రా గోల అని అడిగితె ఏముంది కొండమీద కోమటి వాళ్ళు "రహస్యం" చెప్పుకుంటున్నారు"
అన్నట్టవుతాది ఏమంటారు ?

ఉష

priya చెప్పారు...

మీ గుసగుసలు బావున్నాయి....ఎన్ని రకాలో !!!!!!

..nagarjuna.. చెప్పారు...

:) :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఫణిబాబు గారు..
మీరు మరీ నన్ను ఆడిపోసుకోవటం కాకపోతే.. పెద్దాళ్ళానెక్కడాడిపోసుకున్నానండీ.. :)

@ఉష గారు
హ హా... మీ సామెత బాగుంది.. :)

@ప్రియ గారు
గుసగుసలు నచ్చినందుకు.. సంతోషం.. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

@నాగార్జున గారు
మీ డబుల్ నవ్వులకు ధన్యవాదములండీ.. :) :)

Related Posts Plugin for WordPress, Blogger...