23, జులై 2011, శనివారం

బజ్జొచ్చి.. బ్లాగర్ ని...


బజ్జొచ్చి బ్లాగర్ ని ఎక్కిరించటం అంటే ఇదే.. యువరానర్. ముందొచ్చిన బ్లాగర్ కన్నా వెనుకొచ్చిన బజ్జే వాడి అని నమ్మిన జనాలు..ఇలా మానిటర్లకు అంటుకుపోయి.. వారాలు వారాలు స్నానాలు చేయకుండా ముక్కులుమూసుకుని.. కుళ్ళు కామెంట్లిచ్చుకోవటం నాకేం నచ్చలేదని.. నా కీ బోర్డ్ లో 'కంట్రోల్ కీ' ని నొక్కి వక్కానిస్తూ..ఆవేశాన్ని 'కంట్రోల్' చేసుకుంటున్నాను యవరానర్.

ట్విట్టర్ ని చూసి గూగుల్ అట్లకాడ మైక్రోవేవ్ వోవెన్లో పెట్టి వేడిచేసి వాతపెట్టుకున్న చందాన.. ఒకరిద్దరు ఖాలీగా ఉంటున్న ప్రోగ్రామర్ల చేత పనిచేయించడం కోసం గూగుల్ పన్నిన వ్యూహంలో భాగంగా బజ్జుపుట్టిందనీ..అది తెలియక మన కుర్రాళ్ళు భలేవుందని.. చంకల్లో చేతులుపెట్టుకుని గుద్దుకుని.. ఇలా సగం బగ్గులతో మార్కెట్టుమీదకు వదిలేసిన ఈ బజ్జుని పెంచి పోషించడం.. మన బ్లాగ్ యువతను తప్పుదారిన పట్టించడానికి పక్కదేశాలు పన్నిన కుట్రేనని.. ఇది చాలా చాలా అన్యాయమని.. నేను సవినయంగా కోర్టువారికి మనవి చేసుకుంటున్నాను యువరానర్.

తండ్రి టూర్లలో నడిచినప్పడు కనీసం చెప్పులుకొనుక్కోటానికికూడా డబ్బులు లేక.. ఒక్కసారిగా.. తెరచించుకొని తెరమీదకొచ్చిన మన యువ నేత గగన్ లాగా.. ఓదార్పు వెకేషన్లని.. అందమైన మార్నింగులనీ.. రోబోటిక్ టెక్నాలజీలనీ.. ఈ మధ్య సి.బి.ఐ రైడింగులనీ.. వార్తల్లో సెలబ్రిటీ లెవల్ కి ఎదిగినట్టుగానే.. అతి తక్కువకాలంలోనే ఎదిగిపోయేలా చేసి.. ఎక్కడో బోన్లో నిలబడాల్సిన ఈ బజ్జును ఇలా BMW కార్లలో తిరిగేలా చేసింది ఎవరనీ.. నేను కోర్టువారిని ప్రశ్నిస్తున్నాను యువరానర్.

నడమంత్రపుసిరిలాగా ఎదిగిన ఈ బజ్జు వల్ల.. బ్లాగర్ల్ లో ఎంతో శ్రమకోర్చి రాసిన టపాలకు రెండువందలు మూడువందలు హిట్లున్నా కనీసం రొండుకూడా కామెంట్లు రాలక... నిరాశతో.. నిస్పృహతో.. కొరుక్కోటానికి కూడా గోళ్ళు లేక.. వేళ్ళుకొరుక్కుంటుంటే.. ఆ వేళ్ళు రాయటానికి సహకరించక.. ఖాలీగా వుంటూ.. ఎవరికీ చెప్పుకోలేక... బాధను సోడా కలపని విస్కీలాగా దిగమింగుతున్న మా క్లైంట్ల పొట్టకొట్టడం...ఒక దేశద్రోహం అని..  దీనిని మనం కండకండాలుగా.. ఖండించి.. కేశఖండనం చేయాలని కోరుతున్నాను యువరానర్.
ఈ విషయం మీద ప్రతిపక్షమైన బజ్జును తయారుచేసిన గూగుల్ వారు వచ్చి క్షమాపన కోరి.. బజ్బును త్వరలోనే టుజి-రాజాలాగా.. కనిమొజి-రాణీలాగా..తీహార్ జైలుకు పంపించే  విధంగా కోర్టువారు చర్యలు తీసుకోవాలని ప్రార్దిస్తున్నాను.

ఈ పాతవస్తువులను రోడ్డుమీద పడేసే సంస్కృతి పోవాలని మన బ్లాగ్ నేతలను నేనంతగానో వేడుకుంటున్నాను యువరానర్. ముందొచ్చిన సికింద్రాబాదుకన్నా వెనకొచ్చిన హైద్రాబాదే ముద్దన్నది.. వాస్తవమనీ.. ఈ మధ్య వేర్పాటు గొడవల్లో ఎక్కడా కూడా.. ఎవరూ మాకు సికింద్రాబాద్ కావాలని అనకపోవటంతో తేలిపోయింది.. యువరానర్.
ఇది చాలా బాధాకరమైన విషయంగా పరిగణించి మా పాతవైభవం మళ్ళా వచ్చేలా చూసి.. ఎప్పుడూ చెప్పినట్టుగా చట్టం తనపని చేసుకుపోతుందని రికార్డు చేసిన తీర్పు ఇవ్వకుండా... ఈ కేసులో కాస్త కొత్త డయలాగులు రాయించేలా కోర్టు తనవంతు సాయం చేస్తుందన్న ఆశతో వాదిస్తున్నాను యువరానర్.

మొన్న ముంబయిలో బాంబులు పేలిన తరువాత ఎవరూవచ్చి "మేమే బాంబులు పెట్టాం", అని చెప్పకపోవటం వలన.. మన హోం మినిష్టరుగారు ఎవరుపెట్టారో తెలుసుకోలేకపోయారు.. అలాగే.. ఎవరొకరు ముందుకొచ్చి.. బజ్జులోవున్నదేంటి.. బ్లాగర్లో లేనిదేంటిని చెప్పకపోవటం వలన మాకూ ఏమీ తెలియక ఇలా ఓపెన్ గా ఖండించడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నామని మనవి చేసుకుంటున్నాం యువరానర్.

చాలా విషయాలు పరిశీలించాకా తెలిసిందేంటంటే.. కొత్తగా ఏ టెక్నాలజీ వొచ్చినా.. అప్పుడెప్పుడో రాజమండ్రిలో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేసినట్టుగా.. వెబ్ విహారం చేసి.. మన బ్లాగ్ యువత ఎగబడిపోతూ.. ఉర్రూతలూరుతుందని.. తేలింది యువరానర్. అలాంటి విహారమే ఇప్పుడు గూగుల్ ప్లస్సులో చేస్తున్నారని తెలుస్తుంది యువరానర్.

బ్లాగర్ పాతది.. పనికిరానిది  బజ్జుకొత్తదీ..అని ఒకే కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పొద్దని నేను విన్నవించుకుంటున్నాను యువరానర్. పాతది అనే మాటైతే.. కాటుమొహానికి.. మేకప్పేసి.. పౌడర్ పూసి.. మన రాష్ట్ర హోంమంత్రిని చేస్తే.. ఏం మాట్లాడకుండా ఎలా ఒప్పుకున్నారు ఈ జనం అని ప్రశ్నిస్తున్నాను యువరానర్.

రాష్ట్రం మంటల్లో మండిపోతున్నప్పుడు కూడా.. ఫ్రెష్ గా మొహం కడుక్కుని.. మీడియా ముందుకొచ్చి.. "ఎలా జరిగిందో మేం చర్యలు తీసుకుంటాం. ఏం జరుగుతుందో మేం చర్యలు తీసుకుంటాం.. ఏదోలా మేం ప్రయత్నించి చర్యలు తీసుకుంటామని.. "చర్యలు" అనే పదాన్నిఎలా వాడాలో తెలియక ఎదో ఆవిడ మాట్లాడేస్తే..ఎలా ఒప్పుకున్నారు ఈ జనం.. అని అడుగుతున్నాను.  "ఆవిడకే మాట్లాడటం రాదు.. ఇక మనమేం మాట్లాడతాం...", అని వూరుకున్నారుగానీ ఈ జనం.. వేలేత్తి ఎప్పుడూ చూపించలేదు యువరానర్.

అలాంటి ఈ జనం.. పాతది.. పనికిరానిదీ అని బ్లాగర్ ని నిందించడం ఏమన్నా భావ్యమాఁ.. అని అడుగుతున్నాను యువరానర్.

మొన్న ఇదే విషయం మనం ముఖ్యమంత్రిగారి దాకా తీసుకెళదామని వెళితే ఆయన డిల్లీ వెళ్ళారని తెలిసింది యువరానర్.. సరే కదా అని డిల్లీ దాగా వెళ్ళి గల్లీ గల్లీ తిరిగితే ప్రతీ గల్లీలోనూ మన సీమాంధ్ర.. మన తెలంగాణా ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారుగానీ.. అయన దొరకలేదు.. చేసేదిలేక మళ్ళీ హైద్రాబాదొచ్చేసి.. ఎప్పటికో ఆయన్ని పట్టుకుని ఈ బ్లాగ్ బాధలు విన్నవించుకుంటే.. మేం చెప్పిందంతా విని.. ఆయనకూడా "తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అన్న ఒక్కమాటని మూడు భాషల్లోఖూనీ చేసి చెప్పారుకానీ.. ఇప్పటివరకూ ఏ "చర్యలు" తీసుకోలేకపోయేసరికి.. ఈ "చర్యలు" అన్న పదానికి కొత్తగా ఏమన్నా తెలియని అర్ధాలున్నాయేమోనని అన్ని భాషల నిఘంటువులు తిరగేసుకోవాల్సొచ్చింది యువరానర్.

ఇంకొక్క విషయం నేను కోర్టువారి దృష్టిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను..., అదేంటంటే.. "కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్", "కేక","సూపరో-డూపర్", "గుర్ర్ర్ ర్ ర్", అని బాగా వాడుకలో వున్న సరికొత్త పదాలకు.. పేటెంట్లను సంపాదించి.. అంతర్జాతీయ గుర్తింపువచ్చేలా చేసి.. ఇవి బ్లాగర్లలో కామెంటిచ్చే చోట 'లైక్' బటన్ లాగా వచ్చేలా చేసి.. మౌసుక్లిక్కుచెయ్యకుండానే..కంటిచూపుతో కామెంటిచ్చే టక్నాలజీ తీసుకొస్తే....
బజ్జుల్లో ఇవి వాడుకుని.. "కికికికికికి" అని నవ్వుకుంటున్న వాళ్ళంతా.. బ్లాగ్లుల్లో కూడా "కికికికికి కికికికి కికికికి" అని నవ్వుతూ వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాను యువరానర్.

ఈ విషయాలన్నీ చూస్తూ.. "అమ్మ ఏది చెబితే అదే..", అన్న మన ఫ్రధానమంత్రిగారిలా నోట్లో బెల్లంముక్క పెట్టుకున్నట్టుగా నవ్వుతూ వుండిపోలేక.. అవేశంతో కోర్టుకెక్కాల్సొచ్చిందని నా బాధను వెళ్ళగక్కుతున్నాను యవరానర్.

ఈ పైన పేర్కొన్నవిషయంపై.. వెంటనే తమతమ వివరణ ఇస్తూ కామెంట్లివ్వాలని.. కామెంటివ్వని వారిని.. కోర్టువారు కటినంగా శిక్షించాలని.. ఈ టపాకు కూడా బజ్జులో కామెంటిచ్చినవారిని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటూ.. ఇక్కడితో సెలవుతీసుకోకుండా ఈ పోస్టుకు రెండో భాగంలో ఎవరెవరు దీనికి
బాధ్యత వహించాలో పేరుపేరునా రాస్తుంటాననీ మనవి చేసుకుంటు సెలవు తీసుకుంటున్నాను యువరానర్. జైహింద్.. జై తెలుగు బ్లాగింగ్.

21 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

గూగుల్ ప్లస్‌లోకొచ్చిన తరువాత నేను బజ్ మూసేశాను.

durgeswara చెప్పారు...

రాజుగారూ
అదరగొట్టేశారు కోర్టుని

మీ రచనాశైలి అద్భుతం

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఇంకెక్కడి బజ్ అండీ.. తొందర్లో గూగుల్ వాడే మూసేస్తాడేమోలెండి గూగుల్ ప్లస్ పోస్టులు ఉన్నాయ్ కదా అని..
అన్నట్లు బ్లాగరు కూడా గూగులోడిదే అన్న విషయం మీ వాదనలో విస్మరించనట్లున్నారు :)

Praveen Mandangi చెప్పారు...

గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి బజ్ మెయిల్‌లో కనిపించకుండా సెట్టింగ్ చెయ్యొచ్చు.

సుజాత వేల్పూరి చెప్పారు...

మీ వాదనకు కోర్టు వారు (బెంబేలు పడి) మెచ్చారు యువరానర్! ఇకనుంచి మీ బ్లాగులో రెగ్యులర్ గా కామెంట్లు అందరూ పెట్టాలని మీ పేరున డిక్రీ (అంటే ఏమిటింతకీ? ఏదో కోర్టు పదం కదా అని వాడేశాను) జారీ చేస్తున్నారు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@ప్రవీణ్ శర్మ గారు.
ఈ టపాకు కూడా సంభంధంలేని కామెంటేనా నాయనా.
సెట్టింగులు..గూగుల్ ప్లస్సులు గురించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏడేళ్ళనుండి పడికొట్టుకుంటున్న నాకు చెప్పడం ఏం భావ్యం చెప్పండి సారూ.. నేను కోర్టుకెక్కిందెందుకో.. మీకు అర్దంకాలేదు. అర్దంకాకుండా రాయటంలో నా తప్పూ ఉన్నట్టుందిలేండి. :-)

@దుర్గేశ్వర గారు.
రచనాశైలి గురించి కాదండీ ప్రస్తావన.
బజ్జుల్లో దూరి బ్లాగులను మర్చిపోతున్నవారిగురించి నా వాదన. రాసిన తరువాత కామెంటులేకపోతే.. అసలు రాసినదాంట్లో తప్పుందా ఏంటా.. అని బుర్రబద్దలుకొట్టుకోలేక ఇలా కోర్టుకెక్కానండీ.

@వేణూ శ్రీకాంత్ గారు
బజ్జ్ గూగుల్ దా.. బిల్ గేట్స్ దా అన్నది కాదండీ విషయం. అసలు విషయం మీకర్దమయినా తప్పించుకోటానికి ఏదో కామెంటారే.. అదేనండి అసలు విషయం. :-)

@సుజాత గారు
ఏవేవో పెద్ద పెద్ద లా పదాలు ఈ కొత్తలాయరు దగ్గర ప్రస్తావించి నన్ను బెంబేలు పడేలా చేయకండి. మీరు కాస్త అర్దంచేసుకున్నందుకు సంతోషం. కానీ నా బ్లాగొక్కటే కాదండీ.. అన్ని బ్లాగులనూ ఒకేలా చూసి ఆదరించాలని ఆశ. చూస్తాంగా ఆ బజ్జులో వున్న టైముకంటే ఎంత టైము బ్లాగుల్లోవుంటారో.

SHANKAR.S చెప్పారు...

యువరానర్ డిఫెన్స్ లాయర్ శ్రీనివాస రాజు గారు బజ్జుల మీద తన అకారణ ద్వేషాన్ని చాటుతూ కోర్టు వారిని పక్కదోవ పట్టిస్తున్నారు. ఒక తల్లి బిడ్డలలో (గూగులమ్మ) ఒకడు (బజ్జు) జనాలు మెచ్చి కాస్త పాపులారిటీ తెచ్చుకుంటే ఓర్వలేక దాయాది అయిన "బ్లాగరు" కొత్తగా పుట్టిన తమ తమ్ముడు "ప్లస్" తో కలిపి బజ్జును దెబ్బతీయాలని కుట్రపన్ని ఈ లాయరు గారికి పది కామెంట్లు లంచం ఇచ్చి ఈ కేసు ఒప్పుకునేలా చేశారనడానికి సాక్ష్యాలు ఉన్నాయి యువరానర్. ఇప్పటికే వారాంతాలలో ఈగలు తోలుకుంటున్న బజ్జును కోర్టువారు సహృదయతతో ఆదుకుని బజ్జు సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇవ్వవలసినదిగా కోరుతున్నాం.
వా.బ.సం.సం (వారాంత బజ్జర్ల సంక్షేమ సంఘం)

సుజాత వేల్పూరి చెప్పారు...

శంకర్ గారూ, మీ వాదనలో కూడా నిజం ఉందని కోర్టు విశ్వసిస్తున్నట్టు మొహం పెట్టింది. ఇప్పుడేం చేయాలబ్బా? సరే, కేసు సోమవారానికి వాయిదా వేయడమైనది.

Praveen Mandangi చెప్పారు...

బజ్‌లో లింక్ పెట్టి బ్లాగ్‌లోనే కామెంట్స్ వ్రాయండి అంటే ఎలా వ్రాస్తారు? ప్లస్ ఉండగా మీరింకా బజ్ గురించే వ్రాస్తున్నట్టుంది?

శ్రీనివాసరాజు చెప్పారు...

@SHANKAR.S గారు
నేను మంచినీళ్ళు తాగటానికెళ్ళినప్పుడు క్రిమనల్ లాయర్ లాగా వచ్చి కేసును పక్కదోవపట్టిస్తున్నది మీరే శంకర్ గారూ. ఈ తమ్ముడూ అన్నా అని ఏదో రిలేషన్స్ ఏవో చెప్పి నన్నూ కన్ఫూజ్ చేసేసి తడబడేలా చేస్తున్నారు. ముందొచ్చిన బజ్జుకన్నా వెనుకున్న బ్లాగర్ నే సమర్దించి మంచి చేస్తారనీ.. ఇలాంటి సంఘాలు చాలా చూసామని.. అవి ఇక్కడ చెల్లవని.. నేనూ కోర్టువారిని కోరుతున్నాను.

@సుజాత గారు.
మీరుండండి.. కోర్టువారికి కొత్త సలహాలిచ్చి వాయిదాలు వేయించకండి. అసలే రేపు ఆదివారం.. ఈ కేసు ఇవ్వాలే తేలిపోవాలంతే..

@ప్రవీణ్ శర్మగారు.
బజ్జులోవచ్చిందని అక్కడే చదివేసి కానిచ్చేయటం కాదండీ.. కామెంటు బ్లాగులో ఇస్తే మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది కదా. అని నా వాదని. బజ్జు గూగుల్ ప్లస్సు ఒక సర్కిల్ కే పరిమితమయ్యాయి కదా.

SHANKAR.S చెప్పారు...

" పది కామెంట్లు లంచం ఇచ్చి ఈ కేసు ఒప్పుకునేలా చేశారనడానికి సాక్ష్యాలు ఉన్నాయి"
ఇదిగో పైన కామెంట్లన్నీ లేక్కేసుకోండి.మీ స్పందనలతో కలిపి పదీ ఉన్నాయి. సాచ్చికాలంటే సాచ్చికాలే. మిమ్మల్ని మరింత ప్రలోభ పెట్టడానికి ఇంకా కామెంట్లు ఎరచూపించచ్చు "బ్లాగరు" వారు. :)

శ్రీనివాసరాజు చెప్పారు...

ఎంత చెప్పినా ఈయన అదే పాట పాడుతున్నారంటే.. కచ్చితంగా ఈయన క్రిమినల్ లాయరే యువరానర్. బేరాలేమీలేక ఈ కేసు ఒప్పుకున్నట్టుగా అనుమానాలున్నాయ్. అందుకే ఏదొక సాక్ష్యం చూపించి కేసు తారుమారుచేద్దామనుకుంటున్నారు. ఆయన కామెంటుతో కలిపి పదకొండు కదా.. ఇప్పుడు నాది కలిపితే.. పన్నెండు. తొమ్మిది తరువాత పది.. పది తరువత పదకొండే కదా యువరానర్ వచ్చేది. ఇదెక్కడి సాక్ష్యమూఁ అని నేను అడుగుతున్నాను యువరానర్.

..nagarjuna.. చెప్పారు...

ఇగో పెద్దోళ్లు, ఈ లొల్లి అంత అయిపొయినంక ఎవరు గెలిచిండ్రో జెప్పుండ్రీ. మొత్తం ఒకేసారి జై హింద్ జై _____ అనేస్తం.

శ్రీనివాసరాజు చెప్పారు...

ఇగో పిల్లకాయి నాగార్జునా.. గెలుపోటములు.. జైహింద్ -------లు తరువాతగానీ.. నువ్విలావొచ్చి ఓ సీటీబజాయించురాదే!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఈ బజ్జుల విషయంలో మీ భాదే నాదీనూ! అందుకే కాస్త ఖాళీ వున్నా నాకు ఈ బజ్జుల జోలికి పోబుద్దికాదు ఎప్పుడో తప్పించి...పైగా ఇందులో అసలు విషయం కన్న కొసరు విషయాలే(చాటింగుల్లాగ..) ఎక్కువగా కొనసాగుతుంటాయండీ...ఎవరినో తప్పుపడదామని నా ఉద్దేశ్యం కాదు గానీ ఎక్కువ శాతం బజ్జులు ఇలానే ఉంటాయి..బహుశా బ్లాగులకన్నా తొందరగా ఇతరులకు స్నేహితులుగా మారే అవకాశం ఈ బజ్జుల్లో ఉండటం వల్ల కాబోలు చాలా మంది ఇష్టపడుతుంటారు...మీ రచనా శైలి చాలా బాగుందండి...

ఆ.సౌమ్య చెప్పారు...

కథ (వాదన) అంతా విన్న భేతాళుడు విక్రమార్కుడి భుజం మీదనుండి మాయమై తిరిగి చెట్టెక్కాడు. :)

మనసు పలికే చెప్పారు...

కెవ్వు కేక.. సూపరు శ్రీనివాస్ గారు.. అద్భుతం తపా నిజంగా.. ఎన్ని సార్లు నవ్వుకున్నానో చదువుతూ..
నావంతుగా, నాకు శిక్ష పడకుండా, బజ్జులో కామెంటు పెట్టకుండా (ఎందుకంటే నేను బజ్జులో చూడలేదు కాబట్టి;)) ఇక్కడే పెట్టేస్తున్నా. టపా మాత్రం నిజంగా సూపరు డూపరు బంపరు:)))

సౌమ్య గారి వ్యాఖ్యకి నాలుగు లైకులు:))))

పద్మవల్లి చెప్పారు...

సూపర్ శ్రీనివాస్ గారు. నేను ఇక్కడే కామెంట్ పెట్టేసాను. బజ్ దాకా రాను (ఈ పోస్ట్ విషయంలో ) :-))

శ్రీనివాసరాజు చెప్పారు...

@శేఖర్ పెద్దగోపుగారు
నేను బజ్జులకు పూర్తివెతిరేకిని కానండీ. అప్పుడప్పుడూ అయినా బ్లాగ్ లలోకి తొంగిచూసి కామెంటివ్వమని అందరినీ వేడుకుంటున్నాను. మనకిచ్చే ప్రోత్సాహం ఈ కామెంట్లేకదండీ. అది ఒక విమర్శైనా, సూచనైనా ఏదైనా కామెంటుంటే తరువాత టపా రాయటానికి ఉత్సాహం వస్తుందండీ.
ఇది అందరూ అర్ధంచేసుకుంటారని ఆశిస్తున్నాను.
మీ కామెంటుకు ధన్యవాదములు.

@ఆ.సౌమ్య గారు
భేతాళుడు కాస్త ఒళ్ళుచేసినట్టున్నాడు.. ఎగిరి చెట్టెక్కాకా విక్రమార్కుని భుజం కాస్త ఊపిరిపీల్చుకుంది. :))

@మనసుపలికే గారు
మీ ఆనందం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.
కెవ్వు-కేక, సూపరు-డూపరు-బంపరు లాంటి బటన్లు బ్లాగర్ లో త్వరగా రావాలని కోరుకుంటూ.
ధన్యవాదములు.

@పద్మవల్లి గారు
'బ్లాగర్' ని ప్రోత్సహించినందుకు సంతోషం. ధన్యవాదములు :))

Geetha Sagiraju చెప్పారు...

అన్నయ్య నీ బజ్ మీద కోపం ఏమో కానీ మొత్తం రాజకీయాన్ని కోర్ట్ కి ఎక్కిన్చేసావ్..... అసలు కేకో కేక దానికి గాను ఇంఫినిటే లైకు లు... :))))))

శ్రీనివాసరాజు చెప్పారు...

@గీతా
నీ ఇన్ఫినిటీ లైకులకు ఇన్ఫినిటీ సంతోషాలు.
తెలుగు భాషలో నాకు నచ్చని పదం 'రాజకీయాలు' :)

Related Posts Plugin for WordPress, Blogger...