23, అక్టోబర్ 2011, ఆదివారం

ఆలోచనా తరంగాలు!


ఈ బుర్ర ఒక మైదానం. అందులోని ఆలోచనలు లేలేత చివురులు.. చిన్నచిన్న మొక్కలు.. మహా వృక్షాలు.. తియ్యని పళ్ళు.. చేదు ఆకులు.. ముళ్ళపొదలు. గడ్డిపరకలు.. కలుపుమొక్కలు.. మెలితిరిగిన వ్రేళ్ళు.

తులసిమొక్కలా.. గంజాయి చెట్లా? ఏం నాటుతావో.. ఎలా నాటుతావో.. ఆ నాటేవి నీడనివ్వాలి.. ఫలాలివ్వాలి.. ఏపుగా ఎదగాలి.. పచ్చగా పండాలి.. ఆకాశాన్నంటాలి.. చుక్కలను తాకాలి.. చందమామను దించి వెండిపూలు పుయ్యాలి.. విరగపూయాలి.. విరగపడి నవ్వాలి.. పండువెన్నెలనివ్వాలి. మదినిండిపోవాలి.. ఆనందం పొంగాలి. పసిపాప  మోముపై చిరునవ్వులవ్వాలి.. సెలయేటి నీటికి కొత్తవన్నెలు తేవాలి. కనువిందు చేయాలి.. వాగులా పారాలి.. దాహాన్ని తీర్చాలి.. వంకలై ఉరకాలి.. వానలా కురవాలి.. మైదానమంతా పచ్చదనం పరుచుకోవాలి. ఏ ఆలోచన కావాలో.. అది నువ్వే తేల్చాలి!.

ముళ్ళ మొక్కలు. అన్నీ ముళ్ళే.. ముళ్ళే ముళ్ళు.. ఆకులన్నీ ముళ్ళే.. కొమ్మలన్నీ ముళ్ళే!.  మెత్తని ఒంటిపైన.. సుతిమెత్తని మేనిపైన.. గుచ్చుకునే ముల్లు.. గట్టిగా హత్తుకుంటూనే.. లోపలికంటూ చొచ్చుకునే ముల్లు.. ఒంటిపైనే గుచ్చుకున్నా! మనసులోతుల్లోకి.. గుండెగూటిలోకి.. నరనరాల్లోకి దూసుకుపోయే ముల్లు. కానీ.. ఆ ముళ్ళక్రిందే వుంటాయి తియ్యని పళ్ళు.. తియతియ్యని పళ్ళు.. నోరూరించే పళ్ళు. అటుపక్కనే వుంటాయి.. అందమైన పువ్వులు.. అందచందాల పువ్వులు. కొన్ని ఆలోచనలూ అంతే.. పైకి ముళ్ళేగానీ.. అవి అందమైన పువ్వులు.. తియ్యనైన పళ్ళు.

అదిగో! ఆ పువ్వుంది చూడు..  చేతితో నలిపేయాలనిపిస్తుంది.. కాలితో తొక్కి చిదిమేయాలనిపిస్తుంది.. నోటితో కొరికి ముక్కలు చేయాలనిపిస్తుంది.. నామరూపాలు లేకుండా చెయ్యాలనిపిస్తుంది.. ఆ కసిలో మునిగి ఆనందించాలనిపిస్తుంది..  వెర్రికేకలేస్తూ వెకిలిగా నవ్వాలనిపిస్తుంది..  ఊహూ..!! కాదు.. కాస్త ఆలోచించు..
ముట్టుకోవాలనిపిస్తుంది.. ముద్దాడాలనిపిస్తుంది.. ఆ సువాసనలను ఆఘ్రాణించాలనిపిస్తుంది.. పూజచేయాలనిపిస్తుంది.. పూజలోవుంచాలనిపిస్తుంది. ఆలోచిస్తే ఇది సాధ్యమే.. ప్రయత్నంతో ఇది సాధ్యమే. ఆలోచనలు మార్చుకోవటం సాధ్యమే.

ఆలోచన ఒక మహావృక్షమవ్వాలి.. ఏపుగా ఎదగాలి.. గుబురుగా పెరగాలి.. ఊడలు వ్రేళ్ళుగా పాతుకుపోవాలి.. ఆ మహావృక్షంలో పక్షలు గూడ్లు కట్టాలి. ఆటలాడాలి.. పాటలుపాడాలి.. కిలకిల నవ్వాలి... చెట్టంతా కళకళలాడాలి.. సేదతీరాలి.  గుడ్లుపెట్టాలి.. సంతతి పెరగాలి.. సంతసమవ్వాలి. అన్నిప్రాణులకు ఆవాసమైనా.. అంతంత భరువులు మోస్తున్నా..ఆ వృక్షం దృఢంగా వుండాలి.. పెనుగాలులకు తట్టుకోవాలి.. ఆలోచనలోనూ అంత బలముండాలి.

చిగురులేసిన చెట్టు ఎదుగుతుంది.. ఆకాశంవైపు ఎగప్రాకుతుంది.. సూర్యుడిని అందుకోవాలనుకుంటుంది.. ఆకులేసి కొమ్మలను అలంకరించుకుంటుంది.. ఎండకు ఎండుతుంది.. వానకు తడుస్తుంది.. చలికి వణుకుతుంది.. ఆకులనే కప్పుకుని నిలబడుతుంది.. అయినా క్షణానికెన్నో ఆకులు రాలుస్తుంది.. రాలిన ఆకులకై కిందకు చూడదు.. వాటిని వాలిపోనీ.. రాలిపోనీ.. వొంగిపోనీ.. రంగుపోనీ.. రంగుపోయి పాలిపోనీ.. వాటికై ఏమాత్రం కృశించదు.. చలించదు.. కొత్త చిగురులతో కొత్త కళ సంతరించుకుంటుంది.. కొత్త ఉత్సాహం మనసంతా నిలుపుకుంటుంది.. ఎప్పటికైనా సూర్యుణ్ని చేరాలన్నట్టు.. తన ప్రయాణం కొనసాగిస్తుంది.. మదిలో నిలవని ఆలోచనని.. పారిపోనీ.. పాలిపోనీ.. రాలిపోనీ.. నిలవనిదానిని చూసి ఆగిపోకు.. రాలినదానిని తిరిగి తీసుకోకు.. ఆశపోనీయకు.. కొత్తదానికోసం వేచిచూడు. వేయి కళ్ళతో ఎదురు చూడు.

ఆలోచన వెదురులా ఎదగాలి... ఎదురులేనిదవ్వాలి. దమ్మున్నదవ్వాలి.. దుమ్మురేగిపోవాలి. దూసుకుంటూ పోవాలి దూరాల్ని చేరాలి. వేగంగా కదలాలి.. వేగులా మారాలి. సూదల్లే గుచ్చుకోవాలి.. సూటిగా వుండాలి. అవును అలోచనలు సూటిగా వుండాలి.

ఆలోచనా తరంగాలు.. అవి ఆకాశంలో తిరుగాడే తరంగాలు.. స్వేచ్ఛగా విహారించే విహంగాలు..  ఈ బుర్ర అనే మైదానంలోకి వీచిన పవనాలు. నిలువెల్లా ప్రవహించే తరంగాలు..  మససులో అకస్మాత్తుగా కలిగిన భావాలు.. మనసును కదిలించే భావావేశాలు. వెచ్చని మదిలో శీతల కెరటాలు.. గుండె సవ్వడులకు అనుగుణంగా మ్రోగే శ్రవణ కంపనాలు.

అవును ఆలోచనలు తరంగాలే.. ఆలోచనలు ఆకాశానికేగే తరంగాలే.. ధ్యానించే మనసులోకి చొచ్చుకుపోయే తరంగాలే.. ఆ తరంగాలు మనసును తాకి మరళా ఆలోచనలుగా మారే తరంగాలే.

అందుకే మనసు ఎపుడూ మంచినే ధ్యానించాలి.. ఆకాశంలో ఎగురుతున్న ఆ విహంగాన్ని ఆకర్షించాలి. ఆ మంచి ఆలోచనకే అది ఆవాసమివ్వాలి. ఎపుడూ మంచే ఆలోచించాలి. అది మరళా ఆకాశానికెగరాలి.. ప్రతి మదిలోనూ అది వాలిపోవాలి.. ప్రతి మదినీ అది దోచుకోవాలి.
ఆలోచనలు. ఆలోచనా తరంగాలు!

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

WELL SAID.

అజ్ఞాత చెప్పారు...

ఇదేమిటి నాయనా నిన్న సాయంత్రం ఓ అరగంట మాట్లాడేటప్పటికి ఇలా ఫిలాసఫి లోకి వెళ్ళిపోయావేమిటీ .....ఏదో హాయిగా ఉండక, ఇప్పటినుంచీ ఈ వేదాంతం ఎందుకు బాబూ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@బోనగిరి గారు
నచ్చినందుకు సంతోషం. :)

@ఫణిబాబుగారు
పెద్దాళ్ళతో మాట్లాడిమాట్లాడి ఇలా వేదాంతం వస్తుందేమో మరి. అయినా నా మొహానికి వేదాంతమేంటి చెప్పండి.. అసలు సూట్ అవ్వదు.
మీరు వేదాంతం అని చేసిన రాద్దాంతానికి నా బ్లాగులో ఎప్పుడూ రాలే నాలుగు కామెంట్లుకూడా పాయే.. :)

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్తపాళీ గారు
మీ కామెంటుకు ధన్యవాదములు

కౌటిల్య చెప్పారు...

ఏంటో మా రాజుగారు ఈ మధ్య ఏంటేంటో రాస్తున్నారు? కాస్తంత వేదాంత ధోరణిలో పడ్డట్టున్నారు. ఏంటి కథ? బుల్లి రాజు గారు లెఫ్టూ రైటూ ఆడేస్కుంటున్నారా ఏంటి?..;)

మీ బ్లాగు మీ ఇష్టమండీ బాబూ! మళ్ళా హక్కులూ అవీ మాటాడతారేమో!..;)

ఏమైనా మా రాజుగారు గొప్పోరు! ఎన్ని ఆలోచనలో, ఎన్ని మెలికచుట్లో! ఎన్ని మాటల కెరటాలో!

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్య గారు
ఎంతమాట ఎంతమాట..!!, నా బ్లాగు నా ఇష్టం అన్నట్టు ఏదీ రాయనండీ. బ్లాగు నాదైనా చదివేవారికీ.. వారి మనోభావాలకీ ఎక్కువ ప్రాధాన్యం.. అందుకే కదా బ్లాగులో రాసేది. అయినా వేదాంతులు సిద్దాంతులూ అయిన మీకు కూడా ఇది అర్ధం కాలేదంటే కాస్తనేను ఆలోచించుకోవాలి. :)

ప్రయోగాలు చెయ్యటం మాత్రం మానకూడదనేది నా ఉద్ధేశ్యం నేనేదో నాలుగు ముక్కలు నేర్చుకున్నది ఆ ప్రయోగాలవలనే కదా! ఏమంటారు..??

Unknown చెప్పారు...

ఎంత ఏత్తు ఎదిగి పోయరు రాజు గారు. ఏక్కడికో తీసుకు వెళ్ళి పోయారు. ఇదే ఫ్లౌలో సాగితే మెళ్ళగా నవలలు రాసేయోచ్చు.

Related Posts Plugin for WordPress, Blogger...