26, ఆగస్టు 2012, ఆదివారం

బిజీ బజ్జీ...


టైటిల్ చూసి ఇదేదో వెరైటీ వంటకం లాగా వుంది... టపా ప్రత్యేకించి రాసాడంటే ఇంకా వెరైటీ అనుకుని.. గబగబా చదివేసి వండుకుని ట్రైచేస్తే పోలా అని మూకుడ్లూ తపేలాలు పట్టుకొచ్చినట్టున్నారు.. ఏదేమైతేనే స్వాగతం.. సుస్వాగతం.  వేడివేడి.. ఖాళీ మూకుడులో నీళ్ళు జల్లి తుస్సుమనిపించినట్టుగా.. మీ ఆశలు తడిఆశలు చేసినందుకు క్షమించేయండి. ఈ మధ్య అసలు ఖాలీలేక రోజుకు నలభైగంటలుంటే బాగుండు దేవుడా.. నాకు ఇరవైనాలుగుగంటలే ఎందుకిచ్చావ్.. అని జపం చేస్తూ బిజీబజీగా వుండి ఏదొకటి రాద్దామని నా బిజీ షెడ్యూలు నుండి కొంత సమయం బయటకు తీసి రాస్తున్న టపా కదా అని పేరలా పెట్టాను.., అంటే బిజీగా వుండేవాడు అరటికాయ బజ్జీ వేస్తే అది పొడుగు పకోడిలా వచ్చిందన్నట్టు అర్ధంచేసుకోండి పోనీ. అయినా టైటిలేముందండీ దాంట్లో మేటరుండాలిగానీ.. అదే వెతుకుతున్నా, ఏంటని అడక్కండి.. మేటర్.. అదే తట్టడంలేదు ఉండండి..

సరే ఇంతకూ ఏం రాద్దాం.. అని ఆఫీసులో డెస్క్ మీద పడి దొర్లుతూ ఆలోచిస్తుండగా.. వెనకే వచ్చాడు మేనేజరు సాబ్. రారా నా రాజా..!, వచ్చావా.. చక్కగా సెంటుకొట్టుకుని కొత్త పెళ్ళికొడుకు లాగా.., నీ గురించే రాస్తా ఈరోజు అనుకుంటుండగా.."హౌ ఈజ్ ఇట్ గోయింగ్", అని తన ఫేవరెట్ డయలాగు వదిలాడు. నేను నా ఫేవరెట్ డయలాగులు రెండు వదిలి పంపించేసాను.

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు.. అన్నట్టు.. మేనేజరు లేని టీమ్ ఉత్తమ్ టీము.. హాయమ్మో.. టీమే లేని మేనేజరు బలవంత్ రామ్ అని నేనంటాను. బలవంత్ రామ్ నా?.. వాడెవడు  అని అడక్కండి. ప్రాసకోసం అంతే.., ఇక ఆ మేనేజరు.. గడ్డం గీసేవాడికి అడ్డంగా నిలబడ్డట్టు.. సెక్యూరిటీకోసం పెట్టుకున్న గార్డు వచ్చేపోయేవాళ్ళకు కాళ్ళడ్డు పెట్టినట్టు వున్నాడనుకోండి.. ఇంక ఆ టీము కష్టాలు ఎలా వుంటాయో నాలాంటోడు చెబితేనే మీకు కరెక్ట్ గా అర్ధం అవుతుంది.

ఆహా..!, అయితే ఏంటి.. మీ మేనేజరు చంఢశాసనుడా? కళ్ళెర్రచేసి కంటిచూపుతో పనిచేయించుకుంటాడా అని కొందరు ప్రశ్నలేసారు. అందరూ ఒకలా వుండరు కదా!. మెగుడు రోజూ తాగొచ్చి కొడితే ఏడవాలి కానీ చేతకానిమొగుడైతే ఎందుకమ్మా ఏడుపూ అని నిష్టూర్చితే, ఏం చెబుతాం చెప్పండి. ఎవరి కష్టాలు వారివి కాదా!

కష్టాలు ఎక్కడనుండి మొదలెట్టాలో తెలియటంలేదు. ఎటునుండి మొదలెడితే ఏముందిలే.. కష్టాలేకదా!. కంపెనీ కష్టపడి ఒక సాఫ్వేరు తయారుచేసింది. ఆ సాఫ్వేరు బాగానే అమ్ముడుపోయింది. ఆ వచ్చిన డబ్బుల్తో పీకల్దాకా తాగుతూ.. ఎవడికో ఒక అయిడియా వచ్చినట్టుంది.. దీన్ని విండోస్ లో అప్లికేషన్లాగా తయారుచేస్తే ఎలా వుంటుంది అని. సరే తాగేటైములో వచ్చినవి గుర్తుపెట్టుకోకూడదు మర్చిపోవాలి కదా!.. కానీ వాడు తరువాత రోజు దిగిపోయిన తరువాత కూడా గుర్తుపెట్టుకుని.. నాకిది కావాలని మారాం చేస్తూ మెయిలు కొట్టాడు.
ఒక మీటింగ్ పెట్టుకుని చెప్పుకున్నారు. వావ్ సూపర్.. అన్నారంతా. ఇంకేముంది చేసేద్దాం అంటే చేసేద్దాం అని భుజాలు చరుచుకున్నారు. ఆ చరుపులు చూసి.. ఇంకేముంది వీళ్ళంతా చేసేస్తారేమోలే మనకేంటి అని మనం కూడా చరుచుకున్నాం. సంబరపడినంతసేపు లేదు తరువాత క్షణం నుండే మనకిచ్చేసారు చేసేయ్ అని. ఎలా చెయ్యాలి.. దీనికో పద్దతంటూ ఏడుస్తుంది కదా!, అదేదో చెప్పవా, నేనసలు ఈ ఐ.టీ ఇండస్ట్రీలో కాపీ-పేస్ట్ కొట్టే పిల్లకాకి ఎక్పీరియన్స్ తప్ప ఇలాంటిది చెయ్యలేదు అంటే మేనేజరు మొహం చాటేసాడు.., తెలిసి చెప్పటంలేదేమో బ్రతిమలాడితే లొంగుతాడులే అనుకుంటే, తరువాత అర్ధమయ్యింది మనోడికీ పొట్ట కోస్తే "నో రిజల్ట్స్ ఫౌండ్" అన్న మెసేజ్ తప్ప.. పేగులు కూడా బయటకు రావు అని. అలా అని చెప్పలేక.. నీకు నచ్చినట్టు, నీ ఐడియాలు వడియాల్లాగ వేపించి చెయ్యి.. మేమంతా చూసి నీకు ఎలావుందో చెబుతాం.. ఇది నీకే మంచిది నీ అవిడియాలన్నీ ఇక్కడ ఎండబెట్టుకోవచ్చు కదా! అన్నాడు.

సరే  అని ఎలాగోలా తంటాలు పడి చేద్దాం అనుకుంటే ఎప్పటికి చేసిస్తామో.., ఏమేమి చేసిస్తామో అని కాకుండా ఇంకా ఏమిచెయ్యొచ్చో అని నాలుగైదు తగిలించి.. తారీఖుతో సహా వేసి ప్లాన్ అందరికీ పంపేసాడు . మళ్ళీ ఇదేంటి?, నువ్వుచెయ్యనన్నావ్.. నన్నుచెయ్యమన్నావ్.. ఈడేట్లేంటి..?, అంటే. మరి అప్పటికల్లా అయిపోవాలి అదే కదా ప్లాన్ అంటే. అయినా ఎందుకంత భయపడతావ్.. నీకెందుకు నువ్వు మొదలుపెట్టు నేనున్నాను కదా!, అని భరోసా ఇచ్చాడు కూడా. హు.. అవును.. తాటిపట్టికి ఎదురు దేకితే ఏమవుతుంది చెప్పు.. నీకేమీ కాదు, దేకేది నేను కదా!.. అని ఒక బ్రహ్మానందం ఎక్ష్ప్రెషన్ ఇచ్చానంతే.
సరేలే.. పాపం అనుకున్నాడో ఏమో.. మీటింగ్ కి పదా అని చెయ్యిపట్టుకుని లాక్కుపోయాడు. ఒక్కడికి ఎంత టైము పడుతుంది అన్నాడు. నాకు తెలుసు ఎందుకడుగుతాడో.. తరువాత ఏం చేస్తాడో.. వీడు కొత్తగా ఏమీ చెయ్యలేడు. చెయ్యలేదుకూడా... అందరూ చేసినట్టే చేసాడు. ఏం చేసాడూ అంటే.
ప్రాజెక్ట్ మేనేజర్లు వేసే ప్లాన్ ఎలావుంటుందీ అంటే. ప్రాజెక్టు మొత్తం 160 గంటలు.. అయితే.., రోజుకు ఎనిమిది గంటలు కాబట్టీ.. 160/8 = 20 రోజులు, అంటే.. ఇదే పని నలుగురు పనిచేస్తే.. 20/4 = 5 రోజులు అంతే సింపుల్ అని వైట్ బోర్డ్ మీద పెద్ద పేద్ద భూచక్రాలు.. విష్ణు చక్రాలు.. చిచ్చుబుడ్లు.. కాకరపువ్వొత్తులు గీసి చూపించాడు. అంటే దానర్ధం... ఏంటంటే..

ఒక గుఱ్ఱాన్ని గంటకు వంద కిలోమీటర్ల వేగంతో స్వారీ చెయ్యాలి. నువ్వు గంటకు ఏభై నడపగలవు.. అయితే నీలాంటోళ్ళను ఒక ఐదుగురిని అదే గుఱ్ఱంపై ఎక్కిస్తా.. ఇక చూడు ఆ గుఱ్ఱం వంద దాటి పరుగెడుతుంది అని.
అయ్యా విన్నారా? ఏ రాయి అయినా ఒకటే పళ్ళూడకొట్టుకోటానికి అంటే.. పావు'రాయి', ఐశ్వర్యా'రాయి'.. కల్పనా'రాయి' కాదు కదా!  పోనీ ఆ ఇచ్చే గుఱ్ఱాలు గట్టివా అంటే.. ఏ ప్రోజెక్టుకూ పనికిరాని పువ్వులనో.. ఓండ్రపెట్టలేని.. గుడ్డిగుఱ్రాలనో మనకు సమర్పిస్తారు. పనిలేనివాడు గుడ్డిగుఱ్ఱానికి పళ్ళుతోమటం అంటే ఇదేనేమో. ఒక తల్లి.. బిడ్డను కనటానికి తొమ్మిదినెలలు ఆగాలయ్యా.. తప్పదు అది సహజం అంటే వినకపోగా.., ఏ మూడునెలల్లో అవదా అంటే?, ఎలా చెప్పేదయ్యా? సగం బ్రెయినుతోనైనా పర్వాలేదా అంటే అదీ కుదరదా?

ఇంకేం చేస్తాం డబ్బులిస్తున్నారు కదా!, చెప్పింది చెయ్యాలి కదా! అని ఎలాగోలా గుడ్డిగుఱ్ఱాలకు ఎండుగడ్డివేసి, గుగ్గిళ్ళు అని నచ్చచెప్పి పని చేసిపెట్టాం.  కొంత వరకూ సక్సెస్ అయ్యినట్టే. ఆ తరువాత అందరికీ నచ్చిందన్నారు. చప్పట్లు కొట్టారు.. ఈలలు వేశారు. లేచి తొడకొట్టమన్నారు.. మీసంలేదురా అంటే పర్లేదు తిప్పమన్నారు, ఇక్కడివరకూ బాగానే వుంది కానీ.. మళ్ళీ కొన్ని మార్పులన్నారు. అలా కొంత కాలం నుండి ఏదొకటి చెప్పుకొస్తున్నారు.., చేయిస్తున్నారు. మేనేజర్ మాత్రం తారీఖులు వేస్తున్నాడు.. మెయిల్ ఫార్వాడ్లు కొడుతున్నాడు. ఏమన్నా అడిగితే ఇంకోక నాలుగు గుడ్డిగుఱ్ఱాలు ఖాలీ అంటున్నాడు. సారీ పళ్ళు తోమితోమీ నా బ్రస్ బ్రిజిల్స్ విజిల్స్.. అన్నాను.

నాదసలే చిట్టి బుర్ర.. స్టీపెన్ హాకింగ్స్ అంత పెద్ద బుర్రకాదు.., మేం పొడిచింది పల్లెటూరి కాలేజీ.. అదికూడా.. పి.జి., అంటే ట్రిపుల్ ఐ.టి, డబుల్ ఐ.టి.., ఐఐఎమ్. ఎమ్మైటీ.. అంత పై చదువులు లేవు. మావన్నీ గూగుల్లో వెతికి పట్టే చావుతెలివితేటలే.. అయినా అంతటోడినైతే ఈ ఐ.టీలో ఎందుకుంటాను.. అందుకే నాకేమన్నా ఐడియా కావాలి.. అదినువ్వే ఇవ్వాలి అనగానే.. ఐ. ఎగ్రీ.. చూద్దాం మీటింగ్ రిక్వెష్ట్ పంపించు అన్నాడు మేనేజరు. అంటే, ఐ ఎగ్రీ అన్నది మీటింగుకా లేక ఇందాక నేను చెప్పుకొచ్చిన లిస్టుకా అని ఆలోచిస్తూ రిక్వెష్టు పెడితే. ఆ రోజు సెలవుపెట్టో నా మెయిల్ డిలీట్ కొట్టో తప్పించుకుంటున్నాడు. మొత్తంమీద ఉన్న గుఱ్ఱాలను దువ్విదువ్వి మా ఐడియాలతో వడియాలు చేసి, వేపించి.. ముందుకు నడిపించాం.

ఇక్కడితో ఆగలేదు.. చేస్తున్నకొద్దీ ఇంకా ఏదో తక్కువవుతూనే వస్తుంది.., ఇంకా ఇంకా ఏదో చెయ్యాలంట.., చూడు.. అన్నయ్యా!.. మనం ఒక ప్రొడెక్టు చేస్తున్నాం, ముందు మనం ఎందుకు చేస్తున్నాం ఎవడికోసం చేస్తున్నామో తెలియాలి కదా!, దాంతో మార్కెట్టులోకు వదలాలి కదా! పురుట్లో వున్న బిడ్డ ట్వింకిల్ ట్వికిల్ లిటిల్ స్టార్ చెప్పాలంటే ఎలాగన్నయ్యా!, అంటే అలా కాదు.. ఇంకా ఇంకా ఇంకా అని గొంతెమ్మ కోరికలు కోరాడు.. కోరికలే గుడ్డి గుఱ్ఱాలైతే అన్నట్టుంది మా పరిస్తితి.., మాకు ప్రతిరోజూ వినపడే ఫేవరెట్ డయలాగుల్లో కొన్ని ఇక్కడ - అదేదో తెలియదు కానీ.. అది మిస్సయ్యింది..., నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తురావటంలేదుకానీ.. అలాచేస్తే బాగుంటుంది, ఏంటో చెప్పలేనుగానీ.. ఎదో ఇంకా తక్కవయ్యినట్టుంది. ఇలా కాదుగానీ ఇంకా బాగా చెయ్యొచ్చు. ఇది వాళ్ళుచెప్పేంత వరకూ కాదు.. మనమే ముందు చేసుండాల్సింది.
మీరు సారాంశాలు నన్ను అడక్కండి.. మీరూ మేనేజరు కావాలంటే ఇప్పుడే రాసిపెట్టుకోండి. అర్ధాలు కష్టంకానీ.. ఒకొక్క లైనుకు పెడర్ధాలు తియ్యాలంటే పెద్ద గ్రంధమే రాయచ్చనుకోండి.

ఒరే. అప్పారావో.. నెలకు రెండులక్షలు జీతం తీసుకునేది మెయిల్ ఫార్వాడ్లు కొట్టాడానికా.. సంవత్సరాలు సంవత్సరాలు ఫారిన్లో వున్నది ఫారిన్ స్కాచులు ఎన్నిరకాలో తాగి రీసెర్చులు చేయటానికా?
ఇన్నేళ్ళు  ఆ బయటకూర్చుంటున్న సెక్యూరిటీ గార్డును లోపల కుర్చోపెట్టినా ఏదోకటి నేర్చుకునేవాడే.. నాకు సాయం చేసేవాడే.. అని గట్టిగా అరవాలనిపిస్తుంది.. కానీ అరవలేను.. అరవసినిమా చూసినట్టు రోజూ ఈ సినిమా నేను చూడలేను. నేనిప్పుడే జంపు.. అందామంటే, బయట జాబ్ మార్కెట్టేమో కంపు.
ఇలాంటివాళ్ళందర్నీ ఎవడు ఇంటర్వూ చేసి తీసుకున్నాడో ఏంటో వాడు దొరికితే.. నా సామిరంగా... 
అదేదో సినిమాలో డయలాగు అన్నట్టు.. నరుక్కుంటూ పోతే ఎవరూ మిగలరు.., హు.. ఇలా వెతుక్కుంటూ పోతే ఐటీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయి పీకల్లోతు దాకా పాతుకుపోయిన దిగ్గజాలు చాలామందే లిస్టులోకి రాకుండా మిగలరు.

మనమెన్ని అనుకున్నా వాడి కష్టాలు వాడికుంటాయిగా పాపం.. అంటారా!, పొద్దున్నేఒంటిగంటకు ఆఫీసుకొచ్చి మెయిల్సు చెక్ చేసుకుని... ఒంటిగంటన్నరకు ఆఫీసు ప్రహారీ గోడకే అనుకునున్న ఇంటికి భోజనానికెళ్ళొచ్చి.. మళ్ళీ సాయంత్రం నాలుగింటికి ఆఫిసుకొచ్చి రాత్రి ఆరింటికి వెళ్ళాలంటే ఎంత కష్టం. ఈ మధ్య మధ్యలో ఎన్ని పనులు చక్కబెట్టాలి.. ఇంట్లో అంట్లుతోమాలో.. బట్టలుతకాలో.. తెలియదు కానీ.. మేమిచ్చిన మెయిల్సుకి మాత్రం రిప్లైలు ఇవ్వాలి.. కింద సెండ్ ఫ్రమ్ బ్లాక్ బెర్రీ.. బురదలో పడిదొర్లిన బఱ్ఱె.. ఇవన్నీ ఎంత కష్టమో కదా!

కాసే చెట్టుకు రాళ్ళదెబ్బలన్నట్టు.. చేసేవాడికే కొత్త టాస్కులు అంటగడతారు ఈ కార్పొరేటోళ్ళు. నీ అంతటోడు లేడురా అని పైకెక్కించినంతసేపు ఉండదు. కిందకు పడేలోపే కుర్చీలో దబ్బళం పెడతారు. అలా అని రోజుకు ఎన్నిసార్లు పైకెగురుతాం.. దబ్బళం నెప్పులు ఎన్నని భరిస్తాం. దేనికైనా కొంత లిమిట్ వుంటుంది కదా... చెబుతున్నాడు కదా అని ఏదిపడితే అది చేసేస్తే.. "ఒరే కిందకెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తీసుకురారా!", అన్నా అంటాడు. పని చెబితే తప్పించుకు తిరిగే లౌక్యం అన్నా తెలియాలి లేక తలవొంచుకుని పనిచెయ్యగలిగైనా వుండాలి.. అదేమీ లేదా అయితే నాలుక మడతపెట్టి ఇండియన్ ఇంగ్లీషునే.. ఫారిన్ ఇంగ్లీషులాగా మాట్లాడి మాటల-మేకప్పేయాలి..

ఆలోచనలతో.. నల్లరంగు వేసుకున్న వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి..,రిలీజు డేటు రానేవచ్చింది.. ఏమిచ్చామో మాకే తెలియదు అన్నట్టు మేం ఇస్తే... ఏం తీసుకున్నారో వాళ్ళకే తెలియదు అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు.
తరువాతరోజునుండి ఏంటి అంటే ఏముంది. మీటింగు.. అందులో కొత్తగా వచ్చిన విండోస్ 8 కి సపోర్ట్ చేసేలా కొత్త ప్లాన్. మళ్ళీ డేట్లతో సహా మా వాడి మెయిలు. బాగానే వుంది వ్యాపారం. ఇలా చేసుకుంటూపోతే ఏముంది నాకు బిల్ గేట్స్ దర్శనమే కదా!, మైక్రోసాప్ట్ గురించి తెలియనిదేముంది. సంవత్సరానికో కొత్త ఓ.యస్ ప్రోడెక్టు. నెలకో కొత్త ప్యాచ్ రిలీజూ, ప్యాంటు చిరిగింది కదా అని ఇలా ప్యాచీలేసుకుంటూ పోతే కొన్నాళ్ళకు మొత్తం ప్యాంటునిండా ప్యాచిలే కనిపిస్తాయికానీ  క్లాత్ కనపడనట్టు మా బ్రతుకులు కూడా ఒకరోజు ప్యాచ్ బతుకులు అవుతాయి.

ఈ ఇండస్ట్రీ తప్ప ఏదన్నా వెతకాలి.. ఈ ఉద్యోగానికి నామం పెట్టాలి.. ఈ బిజీ లైఫుకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. అని ఆలోచిస్తుంటేనే భయంవేసింది. ఇది వదిలేస్తే ఎవడిస్తాడు ఉద్యోగం.. ఇంతంత జీతాలు?, ఎవడుకడతాడు ఈ ఇ.ఎమ్మైలు.., ఇంకెకక్కడుంటాయి ఈ కుర్చీనరకాలు?  దొరుకుతాయా ఈ నడుంనొప్పులు.., హై బీ.పీలు.., ఏమైపోతారు మనల్నే నమ్ముకున్న కార్పొరేట్ డాక్టర్లూ.. ఇన్సూరెన్స్ కంపెనీలు.. బోసిపోవా హైవే రోడ్లు.. కొత్తకార్లకు వచ్చే బేరాలు.. షాపింగ్ మాల్లు.. సినిమా హాల్లు.. తలచుకుంటేనే చెమటలు పడుతున్నాయి కదా!

ఇదిలా ఆలోచిస్తుండగా ఒక చిరకాల మిత్రుడి నుండి అకాల-ఫోను కాల్.. మమ్మల్ని మర్చిపోయారు.. ఈ మధ్య అసలు ఫోనుచెయటంలేదు అని. ఏంటో.. ఫోనున్నవాడు ప్రతివాడికీలోకువేనని. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికీ అంతే దూరం కదా!. మరి నీ ఫోను ఎక్కడపెట్టుకున్నావ్.. నువ్వే నాకు చెయ్యొచ్చుకదా? అందామంటే అసలే అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లుంటుందని వదిలేసాను. అందులోనూ చాలాకాలం తరువాత ఫోన్ రీచార్చ్ చేసి ఔట్ గోయింగ్ వాడుతున్నవాడిని డిస్కరేజ్ చెయ్యటం ఎందుకులే అని ఏమీ అనకుండా మాట్లాడాల్సొచ్చింది. మన కష్టాలు కధగాచెబితే భోరున ఏడుస్తాడనుకుంటే.. అంతే మరి పరుగెత్తి పెప్సీ తాగేకంటే..కంటే నిలబడి నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు కదా! అంతా మనం చేసుకున్నదే కదా! అంటాడు.
ఆ సామెతలన్నీ వినటానికి బాగుంటాయిరా పర్సనల్ లోన్ తీర్చలేవురా, కోరుకున్నదే అంటే.. ఏరికోరి ఈ ఇండస్ట్రీలో పడలేదురా బాబూ.. ఏ దిక్కూలేకా.. ఏ లక్కూ పట్టకా.., అసలు మా తాత ఆరోజు అలా చేసుండకపోతేనా.. ఇప్పుడు ఎన్ననుకుని లాభంలే.. ఇలా ఐటి కుడితిలో పడి గిలగిల కొట్టుకుంటున్నాం...
లేనిరోజుల్లో తింటానికి డబ్బులులేవు.. డబ్బులున్నరోజున తింటానికి లేదు.., అని టాపిక్కు కాస్త డైవర్టు చేస్తే.. అయితే నీ వయసు ఎంత.. బ్యాంక్ జాబ్స్ పడ్డాయి రాయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు...
అయ్యా!,  బిజీ 'షెడ్యూల్' లో పడి 'తెగ' నలిగినలిగి కొట్టుకుంటున్నంత మాత్రాన.. 'షెడ్యూల్ తెగ' రిజర్వేషను వర్తించదు తండ్రీ.. నా వయసుకు.. నా రిజర్వేషను క్యాటగిరీకీ గవర్నమెంటు వాళ్ళలెక్కల్లోంచి నేను ఎప్పుడో రిటేరయ్యిపోయాను.. అన్నాను. సరేలే బాధపడకు.. ఇప్పుడేడ్చి ఏం లాభం.. హ్ము.. అని నవ్వలేని నవ్వు.

ఇది రాస్తుంటే వెనుకే వచ్చాడు కొత్త పెళ్ళికొడుకు.. మళ్ళీ "హౌ ఈజ్. ఇట్ గోయింగ్", అంటూ.. సేమ్ ఫేవరెట్ డయలాగుతో. "హా.. ఏంలేదు కోడింగ్", అన్నాను. ఇదేంటిది ఇలా వుంది జిలేబి లాంగ్వేజ్ అన్నాడు.. ఇదా.. మైక్రోసాఫ్ట్ కొత్తప్రొడెక్ట్ వచ్చింది.. మన రీజినల్ లాంగ్వేజీలో కూడా  ప్రోగ్రాములు రాసుకోవచ్చు అదే కాస్త రీసెర్చ్ చేస్తున్నాను అన్నాను.. "వావ్.. వాట్ ఏ గ్రేట్ టెక్నాలజీ", "అది సరేగానీ.. మన ప్రోడెక్ట్ ఐ.ప్యాడ్ కి సఫోర్ట్ చెయ్యగలమా?, ఇప్పుడే కాల్ లో మాట్లాడి వస్తున్నాను. ఎన్నాళ్ళు పట్టొచ్చో కనుక్కోమన్నాడు. ఐ.ప్యాడ్ అంటే ఈ రోజుల్లో సులువే కదా!.. రేపు పొద్దున్నే మీటింగ్ పెట్టుకుని మాట్లాడదాం..", అని చక్కగా వెళ్ళిపోయాడు..., అవునండీ ఐ.ప్యాడ్ ఉపయోగించడం.. అంటే ఈ రోజుల్లో సులువే కదా!, మెయిలు ఫార్వార్డ్ తో ప్రోగ్రాములు రాసే టెక్నాలజీ వస్తే ఇంకా సులువు కదా!. అయ్యా ఇదండీ పరిస్థితి..

ఏంటి ఈ టపాకు కూడా క్లైమాక్స్, గొప్ప ఎండింగ్ కోరుకుంటున్నారా!!.. ఎంత దారుణం ఎంత అన్యాయం..., మీరందరూ ఊహించినట్టుగా ఈ ఐ.టి బ్రతుకులకు అంతంలేదు. ప్రపంచ ఐ.టి కార్మికుల్లారా ఏకంకండి. ఛలో అమెరికా!. అలా అటునుండి అటే.. అన్నీ వదిలి.. ఛలో ఆఫ్రికా..

16 కామెంట్‌లు:

Dantuluri Kishore Varma చెప్పారు...

వానచినుకు ఏటవాలు అద్దమ్మీద పడి వేగంగా కిందకి జారిపోయినట్టు, మీ పోస్ట్ చదవడం మొదలు పెడితే పూర్తిచేసిందాకా టైం తెలియడంలేదు. మీ బ్లాగ్ చాలా బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

:)

జలతారు వెన్నెల చెప్పారు...

Hilarious! and at the same time I felt sad, as I can totally relate to every single word you typed as I know how difficult it is to work when your manager is non technical. And PM's LOE estimation గురించి బాగా చెప్పారు.
In a way I can see you are venting out your frustration..but you have written it so well ...I read your post multiple times... Nice work.
జిలేబి లాంగ్వేజ్ లో పోస్ట్ అదిరిందండి.

శ్రీరామ్ చెప్పారు...

Super post :-)

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా రోజుల తర్వాత మీ స్టైలులో మంచి టపా..మానేజర్లకి బానే తలంటారు!

బంతి చెప్పారు...

సూపర్ గా రాసారండి . ఆ ఎస్టిమెషన్స్ ఉన్నాయి చూడండి కేక :))

కౌటిల్య చెప్పారు...

ఈ పోస్ట్ మా బంతికి అందరికన్నా బాగా నచ్చుంటుంది...;)

చివర్లో మాలాంటివాళ్ళకి కూడా అంటినట్టున్నారు...;)

Unknown చెప్పారు...

సూపర్ నవ్వులు టపా నిండా...కానీ పాపం మీ కష్టాలు కాబట్టి ఇక్కడ ఎక్కువ నవ్వను లెండి. :)

Srini చెప్పారు...

ఏంటి శ్రీనివాస్, మీ మేనేజర్ ఇప్పుడు సెక్యూరిటి గార్డా లేక సిలిండర్ ఏనా?
మన సునీల్ అన్నని తీస్కోండి మీ ప్రాజెక్ట్ లోకి..మీ ప్రాబ్లం సాల్వ్డ్.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Excellent!!

__________________________
అదేమీ లేదా అయితే నాలుక మడతపెట్టి ఇండియన్ ఇంగ్లీషునే.. ఫారిన్ ఇంగ్లీషులాగా మాట్లాడి మాటల-మేకప్పేయాలి..
__________________________

Unfortunately, this is the reality.
I came across many such people,
especially who pronounce alphabet
'R' in a very different way!!

శ్రీ చెప్పారు...

చాలాబాగుంది మీరు present చేసిన తీరు.
అభినందనలు శ్రీనివాస రాజు గారూ!
@శ్రీ

శ్రీనివాసరాజు చెప్పారు...

@కిషోర్ వర్మగారు
జాలువారు చినుకుల్లా కొంతసేపటికి మాయమైపోయినట్టు కాకుండా.. మనసులోతుల్లో నాటుకుపోయేలా కూడా రాయటానికి ప్రయత్నిస్తాను. :-)
నా బ్లాగు నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ధన్యవాదములు.

@కష్టేఫలి గారు,
ఆ నవ్వుకర్ధం ఏంటండీ? ఇంకా(కష్టేఫలి..) కష్టాలు పడండి.. ఫలితాలు తరువాత తెలుస్తాయనా? ;-)

@జలతారువెన్నెల గారు,
మీరూ.. మా తాను ముక్కేనన్నమాట.మీరు కామెంట్ తెలుగులో ఇచ్చుంటే బాగుండేది. మేనేజరు నాన్-టెక్నికల్ అన్నారు కదా ఇది మా
కంపెనీలో ఓపెన్ చెయ్యలేను. ;-)

@శ్రీరామ్ గారు,
నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు :-)

@సిరిసిరిమువ్వ గారు,
మేనేజర్లకు మనం ఎక్కడ తలంటగలమండీ. పొద్దున్నే పదిడ్లీ తినివస్తారేమో మన తలలు అంటడానికి. అయినా అందరూ అలా వుండరులేండి.
ఇంతకు ముందు మేనేజరు చాలా మంచివాడు. చాలా టెక్నికల్ తెలిసిన వ్యక్తి. అతన్నుండి చాలా నేర్చుకున్నాం. మేం కష్టపడితే మా పక్కనే కూర్చుని
సాయం చేసేవాడు. అతని దగ్గర పనిచేసినప్పుడు చాలా పని చేసేవాళ్ళంకూడా.

@బంతి గారు,
మీరూ ఈ ఎస్టిమేషన్ బాధితులే అన్నమాట. అవును ఐ.పాడ్ లో ఇది సులువే కదా! ఎప్పటికి అవుతుంది మరి మీ టాస్క్ ;-)

@కౌటిల్యగారు,
మీకు బాగా లౌక్యం ఎక్కువండీ. బంతికి నచ్చింది అన్నారు కానీ మీకు నచ్చింది అని చెప్పలేదు చూసారా!

చివర్లో కార్పొరేట్ డాక్టర్లున్నారు, పౌర్ణమికి అమావాస్యకి రీచార్జ్ చేసేవారున్నారు, ఐ.టి ఎందుకు బాబాయ్.. ని సలహా ఇచ్చినోళ్ళున్నారు.. ఇంకా చాలామందే వున్నారు.
అందులో మీకు అంటుకున్నది ఏది? కాస్త వివరించుడి? :-)

@శేఖర్ గారు,
నవ్వుకుంటారని రాస్తే నవ్వు నాలుగు విధాల చేటని నవ్వటం మానేస్తారా.. ఐ సిన్సియర్లీ అబ్జక్ట్ యువరానర్. :-)
సరదాగా నవ్వుకోసమే రాసాను లేండి ఈ కష్టాలు మాములే కదా!

@శ్రీనివాసరావ్,
బాబూ.. సెక్యూరిటీయే.. ఆ సిలిండర్ అయితే వీడి తలతన్నేవాడు.. అతని గురించి రాయలంటే నా బ్లాగు చాలదు అని వదిలేసా.
సునీల్ లాగా లౌక్యం తెలిసుంటే మంచిదే మరి!, ఈ మధ్య టెస్టర్లతో కత్తి కాంతారావు అయిపోయాడు.. యుద్దాలు చేస్తున్నాడు. ;-)

@వీరుబొట్ల గారు,
అవునండీ అది ఫారిన్ అని అనుకుంటారు వాళ్ళు. మనకు నాలుక మడత కనిపిస్తునే వుంటుంది. ;-)

@శ్రీ గారు,
ధన్యవాదములండీ. నచ్చినందుకు సంతోషం. :-)మనసు పలికే చెప్పారు...

అదేంటో కానీ, మీరు రాసిన ప్రతి లైనూ నా గురించి మా మేనేజరు గురించే రాసినట్లుగా అనిపించింది. ఆఫ్రికా కి నేను రెడీ :))

టపా మాత్రం కేక :D:D

చాతకం చెప్పారు...

Awesome post. Hats off. Yadha raja, tatha praja. Soon it's going to reflect on company.

deepa చెప్పారు...

Officelo vundi..deenni chadivi..navvaleka,navvu aapukoleka...oka software pakshi(nene) ila vilavila laadipoyindi..kevvu..keka:)

భాస్కర్ కె చెప్పారు...

వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...