23, అక్టోబర్ 2019, బుధవారం

స్థలం

సన్నాయిమేళాల మోత మోగింది. పనోళ్లు ఆవుని తీసుకొచ్చి మెట్లు ఎక్కించారు. హాలులో గదుల్లో అన్నింటిలోనూ ఆవుని తిప్పారు. ప్రతీ గడప దగ్గరా గుమ్మడికాయ పగిలింది. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు రెపరెపలాడాయి. వేద పండితులు హోమాలు చేశారు.. ఏక కంఠంతో మంత్రాలు చదివారు. వెయ్యికి పైగా విస్తర్లు లేచాయి. అందరికీ దక్షిణ తాంబూలాలు అందాయి, సంభావనలు భారీగా ముట్టాయి. వచ్చిన అతిధులందరూ సంతోషంగా వెనుదిరిగారు. వైభవంగా గృహప్రవేశం ముగిసింది.

ఆ ఊరికి కొత్తగా బదిలీ మీద వచ్చారు ఇంజనీరుగారు. ఆయనకు సుమారు ముప్పైయేళ్ళ వయసు.
ఆయన దర్జాగా కోటువేసుకుని ఆమె భార్య చేయిపట్టుకుని జీపులోంచి దిగారు. ఆయనతోపాటుగా తమ్ముడూ, చెల్లెలూ, వాళ్ళ అమ్మగారు దిగారు. ఆమెకు సుమారు యాభైయేళ్ళ వయసున్నా సన్నగా చలాకీగా ఉందామె. అందరూ చాలా సంబరంగా కొత్త ఇంట్లోకి పరుగులు పెట్టారు.

ఏడేళ్ళుగా మొండిగోడలూ ముళ్ళమొక్కలతో నిండిపోయుండేది ఆ స్థలం. ఇప్పుడు  అక్కడ రెండస్థుల ఇంద్రభవనం కట్టారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనంత అందమయిన ఇల్లు. ఆ ప్రదేశానికి వన్నె తెచ్చేలా రాత్రి విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోయింది. ఆ స్థలానికి ఇప్పుడు వైభవం వచ్చింది.

వసారాలో పొయ్యివెలిగింది, పెరట్లో తులసిమొక్క చిగురులువేసింది. ఇల్లంతా ఎప్పుడూ పండుగ వాతావరణంలా కలకళలాడింది. 
ఇంజనీరుగారి చెల్లెలు ఆ ఊరి కాలేజీలో చేరింది. తమ్ముడు డాక్టర్ గా ఆ ఊర్లోనే హాస్పిటల్ ప్రారంభించాడు. అమ్మగారు పూజలనీ పునస్కారాలనీ వీధిలో అందర్నీ పిలిచి ప్రతిరోజూ పండుగలా జరిపించేది. ఆ వీధికి ఇంజనీరుగారివీధి అని పేరు రావటానికి ఎంతో సమయం పట్టలేదు. 

వసారాలో పొయ్యికి అలుపన్నది లేకుండాపోయింది. రోజుకు ఒక ఇరవై మందికి తక్కువకాకుండా విస్తర్లు లేస్తున్నాయి. తులసిమొక్క వృక్షంలా అల్లుకుపోయి, చుట్టూ పెద్ద పెరటి తోటను సాయం తీసుకొచ్చుకుంది. చిక్కుడు, బెండ, ఆనప, గుమ్మడి, ఇలా ఇంట్లోకి కావాల్సిన కూరలన్నీ అక్కడే పండేవి. పెద్దావిడ పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంజనీరుగారు బయటవూరి పనుల్లో ఎక్కువ మునిగిపోయారు. నెలకొకసారి ఇంటిపట్టున కనిపించేవారు. మిగతారోజుల్లో దేశాలుపట్టుకుని తిరిగేవారు. అలా కాలం గడిచిపోతుంది.

ఒకరోజు ఇంజనీరుగారి చెల్లెలు కాలేజీలో ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుని చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. అన్ని ఊర్లు తిరిగి వెతికించారుగానీ, ఆమె జాడ తెలియరాలేదు. కూతురు మీద బెంగపెట్టుకుని మనోవ్యధతో పెద్దావిడ గదిలోంచి బయటకు రావటం మానేశారు. 

కోడలు కొన్నిరోజులు ఇంటిపనులు చక్కబెట్టింది. ఒకరోజు ఇంజనీరుగారి తమ్ముడు శవంగా మారి రైలుపట్టాల మీద పడున్నాడు. ఎలా జరిగిందో ఏం జరిగిందో ఎవరికీ తెలియరాలేదు. 

కొడుకుపోయిన వార్తవిన్న పెద్దావిడకు పిచ్చిపట్టింది. డాక్టర్లకు చూపించినా లాభంలేకపోయింది. ఆమె గదిలోనుండే కేకలుపెట్టేది. పనివాళ్ళుకూడా ఆ దొడ్లోకి వెళ్ళటానికి భయపడేవారు. కోడలు పుట్టింటికి వెళ్లి మళ్ళీ తిరిగిరాలేదు. 

ఆ ఇంట్లో పూజలు ఆగిపోయాయి. తులసిమొక్కకి నీళ్లు పొసేవాళ్ళే లేక కొండెక్కిపోయి బూజుపట్టింది.  ఇంద్రభవనం కాస్తా పాడుబడిపోయింది. కొన్నాళ్ళకు వాళ్లేటెళ్ళిపోయారో ఎవరికీ తెలీలేదు.

ఆ స్థలానికి మళ్ళీ వెనకటి గతే పట్టింది. ఇంటిచుట్టూ ముళ్లమొక్కలు పుట్టుకొచ్చాయి. బిక్కుబిక్కుమంటూ నాచుపట్టిన గొడలతో భవనం వెలవెలబోయింది.

కొన్నాళ్ళకు ఎవరో ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. ఇల్లు బద్దలుగొట్టే బాధ్యత ఒక కాంట్రాక్టరుకిచ్చారు. రెండురోజుల్లో ఆ ఇళ్లుకూలగొట్టి, ముళ్ళమొక్కలు పెకళించి, ఒక ఖాళీ స్థలంలా చదనుచేసిచ్చాడు కాంట్రాక్టర్. అక్కడ మరొక పెద్ద ఇల్లు వెలిసింది. ఒక నడివయసు జంట అక్కడ కాపురమెట్టారు. పెరటివైపు పెద్ద తులసిమొక్కనాటి పూజలు మొదలుపెట్టారు. కాలంగడచినా అది ఇప్పటికీ ఇంజనీరుగారి ఇల్లుగానే అందరికీ పరిచయం.

అతనొక బట్టలు వ్యాపారి. ఊరిలో చిన్న దుకాణం ఒకటి మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నా వాళ్ళకి పిల్లలు కలుగలేదు, పూజలు చేశారు, దానాలు చేశారు. సంతానంకోసం చాలా తాపత్రయపడ్డారు, కానీ సంపద రెట్టింపవుతూనే వస్తుంది. ఒక్క దుకాణంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టాడు. ఊర్లో ఒక నాలుగు దుకాణాలకు యజమాని అయ్యాడు.

కొంతకాలం గడిచింది. అకస్మాత్తుగా ఆ వ్యాపారిని ఏక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది. ఇల్లు బోసిపోయింది. నెమ్మదిగా పాడుబడిపోయింది. 
మళ్ళీ వెనకటి స్థితికి చేరుకుంది. ముళ్ల మొక్కలు పుట్టుకొచ్చాయి.

రెండేళ్లు ఆ ఇల్లు అలాగే ఉంది. ఒకరోజు ఒక స్కూలు టీచరు ఆ స్థలాన్ని కొనుకున్నాడు. ముళ్ళమొక్కలు కొట్టించి అంతా శుభ్రం చేయించాడు. అదే ఇంటికి రంగులు వేయించాడు. తనకు అనువుగా ఇంటిలో మార్పులు చేయించాడు.

కాలం గడుస్తున్న కొద్దీ అతని కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. తన మూడేళ్ళ కూతురికి అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో తల్లడిల్లిపోయాడు. ఆ స్థలానికి ఉన్న పూర్వ చరిత్ర తెలుసుకుని, ఏదో వాస్తు దోషమే ఈ సమస్యలకు కారణం అని తెలుసుకున్నాడు. ఎందరో వాస్తుపండితుల్ని కలిసాడు. సలహాలు తీసుకున్నాడు. వాస్తుశాంతి పూజలు చేయించాడు. ఒక పండితుడు నైరుతి లోపలికి పొడిచింది అందుకే ఈ దోషాలు అని గోడలు బద్దలుకొట్టించి కొత్తగా కట్టించాడు. వేరొక పండితుడు ఈశాన్యంలో ఎత్తు ఎక్కువ ఉంది అని పెద్దగొయ్యి తవ్వించాడు. 

ఇంటిలోనూ స్థలంలోనూ చాలా మార్పులు జరిగాయి. అప్పులు చేసి మరీ పండితులు చెప్పింది చేయించాడు.
కుటుంబ ఆరోగ్యంలో అతనికి ఏమీ మెరుగనిపించలేదు. ఒకరోజు తెల్లవారుజామున లేచి నిద్రమత్తులో ఇంటి బయటకొచ్చాడు. పెరట్లో ఉన్న తులసిమొక్కకి ముళ్ళు రావటం చూసి ఆశ్చర్యపోయాడు. కాసేపు అతనికి ఏమీ అర్ధం కాలేదు.  మతిలేనివాడిలా ఆ స్థలమంతా కలియతిరిగాడు. ఈశాన్యంలో ఉన్న గోతిలో కాలుజారి పడి, తలకు పెద్ద దెబ్బతగిలి ప్రాణం విడిచాడు.

కాలం గడిచింది.. మళ్ళీ ఇల్లు పూర్వ స్థితికి వచ్చింది. 
ఎందరినో పొట్టనపెట్టుకున్న ఆ స్థలం ఆనందంతో ఉప్పొంగినట్టుగా ముళ్లపొదలు పుట్టుకొచ్చాయి. గోడలు నాచుపట్టాయి. 

ఒకరోజు తుప్పుపట్టిన గేటు తీసిన చప్పుడయ్యింది. 
ఇంకా ఎంతమందిని మింగుతుందో తెలియదు. ఆ స్థలం ఆశగా ఎదురుచూస్తుంది, తరువాత ఎవరొస్తున్నారా అన్నట్టు ఎదురుచూస్తుంది. 

1 కామెంట్‌:

Haribabu Chowdary చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Related Posts Plugin for WordPress, Blogger...