4, సెప్టెంబర్ 2010, శనివారం
24, జులై 2010, శనివారం
రాకెట్ లాంచ్...
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
12:56 AM
14
ఆభిప్రాయాలు
13, జులై 2010, మంగళవారం
కమాన్ గుసగుసా...
"ష్.. త్వరగా తినెయ్యాలమ్మా.. లేకపోతే అదిగో.. బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతాడు"
అని అమ్మ గోరుముద్దలు పెడుతూ పిల్లాడిని ఏమార్చుతూ నేర్పుతుంది
తొలి లాలింపు గుసగుస.
కాస్త పెద్దయ్యాకా "నేను చాక్లెట్ తిన్నానని మా నాన్నకు చెప్పకే.. నీకూ
ఒక చాక్లెట్ ఇస్తా", అని.. తోటి స్నేహితుడికి లంచం ఇస్తూ తాయిళం గుసగుస.
"మీ మమ్మీలేదుగా.. పద పార్క్లో ఉయ్యాల ఊగుదాం..", అని పక్కింటబ్బాయిని
లాక్కుపోతూ దొంగాటల గుసగుస.
"ఒరే.. హర్షాగాడి పెన్సిల్ బాక్సూ.. నెమలికన్నూ దాచేసాను చెప్పకండే", అని
అమాయకుడిని ఆటపట్టించే గుసగుస.
పక్కూరోళ్ళ తోటల్లో మామిడికాయలో ఉసిరికాయలో దొంగచాటుగా కోసి..
"ఒరే.. త్వరగా ఉప్పూకారం పొట్లం విప్పరా, మళ్ళీ ఎవరొకరొచ్చేస్తారు..", అనే
దొంగ గుసగుస.
"ఆ అమ్మాయి పళ్ళుచూడు.. అన్నీ పుచ్చుపోయాయి.. హి హీ..", అని
క్లాస్ మేట్ ని ఏడిపిస్తూ చిలిపి గుసగుస.
స్కూలుకెళ్ళే వయసులో ఇలా రకరకాల గుసగుసలు నేర్చుకుని మనతోపాటే
అవీ ఎదుగుతాయి.
"డాడీ పడుకున్నారు.. గొడవచేయకుండా ఆడుకోండి.., లేచాడంటే.. చెబుతాడు మీ
పని", అని ఇంట్లో ఆడుకోనీకుండా నానమ్మో అమ్మమ్మో చేసే వార్నింగ్ గుసగుస..
"ఏ పిల్లలూ ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు..ష్.. సైలెంట్..", అని స్కూల్లో
టీచర్ బెదిరింపు గుసగుస
"నువ్వు ఆ పక్కింటి చైతూతో తిరిగావంటే వీపు పగులుతుంది.. వాడు చెడిందికాక
నిన్నూ చెడగొడతాడు..", అని డాడీ రుసరుసల్తో పక్కఫ్లాటులోకి వినపడకుండా
తిట్టే తిట్ల గుసగుస.
ఇలా గుసగుసలు మొదలుపెట్టి మనకు అలవాటు చేసిన పెద్దోల్లే.. తమ పిల్లల్ని
అదిచెయ్యొద్దూ ఇది చెయ్యొద్దూ అని చెప్పే రిస్ట్రిక్షన్ గుసగుస.
ఇక మూతిమీద మొలిచిన నూనూగుమీసాల అబ్బాయిలూ... వయ్యారాలుపోతూ
అమ్మాయిలూ.. టీనేజ్ వయసులో చేసే చిలిపి గుసగుసలేవేరు..
"క్రికెట్ ఆడదాం రారా.., సిన్మాకెళదాం పదరా..", అని స్నేహితుడు ఫోన్ చేసి
చెప్పే జంప్ గుసగుస.
"శైలూ నావంక చూస్తుందోలేదో చూడరా..", అని పక్కవాడిని గోకి అడిగే
పోకిరీ గుసగుస.
"హే.. ఆ అమ్మాయి డ్రస్ చూడవే.. మా ఇంట్లో అలావేస్తే చంపేస్తారే..",
అని టీషర్ట్ జీన్చ్ వేసుకున్న పక్కమ్మాయిని చూసి చెయ్యడ్డుపెట్టుకుని చేసుకునే
ఈర్ష్యా గుసగుస.
"నిన్ను అంతలా ఇష్టపడుతుంటే.. పాపం ఎందుకు అలా ఎవైడ్ చేస్తావే..",
అని తోటి అమ్మాయి ప్రేమవిషయంలో ఇచ్చే చచ్చుసలహా గుసగుస.
"అబ్బా ఈయన చెప్పిందే చెబుతాడేంటే.., ఈ రోజు.. ఒకే పేజి
చదువుకొచ్చినట్టున్నాడు ", అని హిస్టరీ క్లాసులో మాస్టారు బ్లాక్బోర్టువైపు
తిరగగానే స్టూడంట్స్ చేసుకునే కామెంట్ గుసగుస.
ఇలా చెప్పుకుంటూపోతే.. మాటల్లో ఎనభైశాతం గుసగుసలే ఈ వయసులో...
ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వూలకోసం క్యూలు కట్టి.. అప్పుడే ఇంటర్వూ గదిలోనుండి
వస్తున్నవాడిని చాటుగా పిలిచి.. "ఏమేం అడుగుతున్నారో చెప్తారా కాస్త", అని
అడిగే ఆత్రుత గుసగుస.
"మన సుబ్బారావుగారి అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదంటా.., పాపం లక్షలక్షలు
డొనేషన్సు పోసి చదివించాడాయన... వాడు సరిగ్గా చదవడం మానేసి ఆ బిజినెస్ చేస్తా
ఈ.. బిజినెస్ చేస్తా అని ఎగిరేవాడంటా..ఇప్పుడు వాళ్ళతోటివారందరికీ ఉద్యోగాలు
రావటం చూసి వాడూ ఉద్యోగం వెతుకుతున్నాడంటా..", అని పనిలేని నైబర్ గుసగుస.
ఇవ్వన్నీ నిరుద్యోగ గుసగుసలు కాగా..
కొత్తగా ఉద్యోగంలో జాయినయినవాడిని చూసి.. "చూస్తే చాలా అమాయకుడిలావున్నాడు...
రేపు వీడే మన కొత్త బాస్ అని చెప్పినా చెబుతారు.. అమ్మో జర భద్రం", అని కొలీగ్స్
వణుకు గుసగుస.
"ఎమే.. ఫలానా అమ్మాయి ఈ మధ్యే ఐ.ట్వంటీ కార్ కొందే..., ఎవరికీ
తెలియకుండా ఎమన్నా జీతం పెంచారేమోనే..", అని సహోద్యోగినిల
టైమ్ పాస్ గుసగుస.
ఇవన్నీ చిరుద్యోగ.. ఆఫీసు గుసగుసలు.. ఇప్పుడు వీటిగురించి ఎంత తక్కువచెప్పుకుంటే
అంత ఆరోగ్యం.
"ఆ అబ్బాయి చాలా బాగున్నాడు.. పెళ్ళయినట్టులేదు.. కాస్త వివరం కనుక్కోండి..
మా తమ్ముడుగారి కూతురుకి అయితే చక్కగా సరిపోతాడు.. ", అని ఫ్రెండ్
పెళ్ళికొచ్చి.. చెంగుచెంగునెగురుతున్న కుర్రోడిని చూసి చెప్పుకునే పెద్దరికపు గుసగుస.
"ఏమ్మా.. అబ్బాయి నచ్చాడా..!, పర్వాలేదులే నాతో చెప్పు", అని పెళ్ళిచూపుల్లో
అమ్మాయిని వాళ్ళ మేనత్త అడిగే.. పేరంటాళ్ళ గుసగుస.
"అమ్మాయి.. కాస్త సిగ్గునటించమ్మా.. తలమరీ అంతలా ఎత్తెయ్యకూ..
చూసేవారంతా.. మరీ ఫాస్ట్ ఈ పిల్ల అనుకుంటారమ్మా..", అని పెళ్ళిపీటలమీద
కూర్చున్న పెళ్ళికూతురి చెవిలో అమ్మలక్కల గుసగుస.
శోభనం గదిలో.. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి చెవిలో.. ఏమడగాలో.. ఏంమాట్లాడాలో
తెలియక.. "నువ్వేం చదువుకున్నావు..", అని కంగారు అడిగే కన్ఫ్యూజ్ గుసగుస.
"ఏమే..., పొద్దున భోజనంలో పప్పూ ఆకుకూరతోనే సరిపెట్టారు... మాఇంటికిరండీ..
అన్నిట్లోనూ ముంచి తేల్చేస్తాం అన్నావుకదా!.. ఏదీ.. ముంచటంలేదూ!! తేల్చడంలేదూ!!
సాయంత్రం భోజనంలో ఏంచేస్తున్నారో వెళ్ళి కనుక్కో..", అని కొత్తల్లుడు అత్తవారింటిలో
తన భార్యతో ఎగతాళి గుసగుస.
"ఈసారి కూడా అల్లుడుగారు బిజీగా వుండి రారనుకున్నాం.. పోయినసారి
పండక్కికూడా ఏమీ పెట్టలేదు, బాగోదండీ.. ఏం పెట్టాలంటారు..", అని పండక్కి వచ్చిన
అల్లుడికి సేవలు చేస్తున్న భర్తని తలుపు పక్కకు పిలిచి అడిగే భార్య గౌరవపు గుసగుస.
ఇవ్వన్నీ బాధ్యతా గుసగుసలు.. ఎంతచెప్పినా.. వీటికీ అంతంలేదు..
"ఏవమ్మా.. అంతలా సౌండు చేస్తే.. పిల్లాడు లేచిపోతాడు.. కాస్త నెమ్మదిగా కడగమన్నా
కదా.. వంటసామాను..", అని పనిమనిషి మీద ఎగిరి సౌండు తగ్గించి వాయించే
ఫిడేలు గుసగుస.
"ఏవండీ ఆ కాలింగ్ బెల్ కి కాస్త ఏదన్నా అతికించి పుణ్యంకట్టుకోండి.. అది ఎవడోకడు
నొక్కడం.. వీడు ఉలిక్కిపడిలేచి కేర్ మనటం..", అని ఇంటావిడ.. చిన్న పిల్లాడితో వేగలేక
విసుగు గుసగుస.
"చింటూ చదువుకుంటున్నాడు.. కాస్త ఏమనుకోకుండా టీవీ ఆఫ్ చేస్తారా.. మావయ్యా!",
అని మనవడి చదువుకోసం తాతయ్యకు ఎగిరిపోయిన ఫ్రీడమ్ గుసగుస.
"అమ్మా!.. నీకెన్ని సార్లు చెప్పానే.. నువ్వన్నా చెప్పినమాటవినవేంటే.. అది తిక్కదే..
చెప్పినా వినదు.. నువ్వేందుకు దాన్ని కదుపుతావు..?", అని పక్కగదిలోవున్న పెళ్ళాంకి
వినపడకుండా తల్లికి కొడుకు పీకే క్లాస్ గుసగుస.
"మీ అమ్మానాన్నలతో పడలేకపోతున్నానండీ.., వాళ్ళకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది,
రామా అంటే బూతులావినిపిస్తుంది.., పిల్లాడిని గారాభంతో ఏం చేస్తారో అని భయంగావుంది",
అని భర్తకు భార్య చెప్పే పితూరీ గుసగుస.
ఇవన్నీ సంతాన, కుటుంబ, కలహాల గుసగుసలు.. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోటైపుగుసగుసలు.
"కాసేపు నుంచుంటే కీళ్ళనొప్పులు.. నడిస్తే ఆయాసమమ్మా.. ఏం చెప్పనూ.. మావారికి
చెబితే.. నువ్వేమన్నా ఇంకా పదహారేళ్ళ బాలాకుమారివా, ఈ వయసులో నెప్పులురాక..
యవ్వనం పొడుచుకొస్తుందేంటీ.. అంటారమ్మా...., మా అబ్బాయికి చెబితే..
డాక్టర్ చెప్పినట్టు వాకింగ్ చేస్తే ఇవ్వన్నీ వుండవు.. నాలుగురోజులు నడువు అంటాడమ్మా..
ఇలా.. ఇద్దరూ కస్సున ఇంతెత్తున లేస్తారమ్మా...., అసలు నిడబడితేనే నొప్పులు అని
నేనేవరికి చెప్పుకోనమ్మా..", అని వాకింగ్ కి వచ్చి పార్కులో కుర్చుని పక్కింటావిడకు
బాధలుచెప్పుకుంటున్న బామ్మగారి ఆపసోపాల గుసగుస
"ఇక వయసైపోయింది.. ఈ రోజో రేపో అన్నట్టుంది ఇక ఎప్పుడో హరీ.. అంటాను..",
అని ఖళ్ళూ ఖళ్ళూ దగ్గుతున్న తాతగారు ఇంటికొచ్చిన చుట్టానితో నోటినుండి మాటరాక
చేసే నీరసపు గుసగుస.
ఇవన్నీ. వృద్ధాప్య.. ఆరోగ్య.. అనారోగ్య.. గుసగుసలు..
ఇలా ఇక్కడితో అయిపోలేదండీ ఈ గుసగుసలు...,చక్రంతిరిగినట్టు .. కాలచక్రంతో పాటు ..
అలా తిరుగుతూనే వుంటాయి.. మరళా మొదటినుండి చదవటంమొదలుపెట్టండి మరి..
కమాన్ గుసగుసా..
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
10:20 AM
14
ఆభిప్రాయాలు
4, జులై 2010, ఆదివారం
గిద్దావోళ్ళ గవర్రాజు
గవర్రాజు మీసం మెలెడితే సమిశ్రగూడెం ఊరుజనాలంతా గజగజలాడిపోతారంతే...!!
పరగడుపునే లేచి పందుంపుళ్ళ నోట్లోఎట్టుకుని... పొలంగట్లన్నీ ఓమారు
తిరిగొచ్చేసి... పచ్చికోడిగుడ్లు సితక్కొట్టుకుని నోట్లో ఏసుకుని జుర్రేసి..
ఓ పెద్దలోటాడు పొదుక్కాడి పాలు ఎత్తిందించకుండా గేది కుడిత్తాగినట్టుగా
తాగేసి.. జబ్బమీదేసుకున్న జరీ కండువాతో మూత్తుడుచుకుని.. మళ్ళా
వొన్నమేలకీ కోడిక్కోడీ లాగించేసి... పదిమంది తినే తిండితింటా..
కసరత్తులు చేత్తా.. కండలట్టిన సెరీరంతో.. గొర్రిపోతుమీసాలేసుకుని
సూసినోడికెవడికైనా సరే ఎన్నులోంచి వొనుకుపుట్టేలా ఉంటాడా మనిషి.
ఎపుడో తాతలకాలపు పదెకరాలపొలం పనోల్లనిబెట్టి వెవసాయం చేయిత్తా,
పెట్టుబల్లూ కర్సులూ పోగా మిగిలిన నాలుగింజల ధాన్యం ఇంటెనకాల
పెద్దగాదెలో పోయించేత్తా... అయే ధాన్యం వర్షాకాలమొచ్చేసరికి
బియ్యమాడింతా.. పొలంగట్లమీద కాయగూర్లూ, ఆక్కూర్లూ పండింతా..
ఇంటెనకాలా గెదెల సావిట్లో పాలేర్లన్నెట్టించి రెండు జర్సీ ఆవులూ...
నాలుగు రింగులు తిరిగిన బొబ్బిలి గేదెపెయ్యల్నీమేపిత్తా.. తిండికీ..
వంటకీ.. పాడికీ ఏలోటూరాకండా కాలంగడిపేత్తుంటాడు గవర్రాజు.
సిన్నప్పుడే అమ్మాబాబూ గోదార్లో పడవమునిగిపోయిన పెమాదంలో పోటంతో
కంటికిరెప్పలాగా సూసుకుంటా.. చానా గారంగా పెంచిపెద్దసేసింది ఆళ్ళ నానమ్మ.
ఆ గారంతోనే తినేసి వూరిమీదడి తిరుగుతా.. ఆళ్ళమీదా ఈళ్ళమీదా పందేలుకాత్తా
వుంటాడు గవర్రాజు. డి. ముప్పారం. కోరుమావిడీ.. గోపారం.. కోరుపల్లీ.. పెండేలా..
సుట్టుపక్కలూళ్ళలో ఏడాడికోసారి జరిగే కోడిపందేలు, కర్రసాములు, కుత్తీపోటీలూ..
ఎడ్లపందేలేగాకండా, సీజన్ని బట్టి ఆళ్ళూళ్ళో జనాలందర్నీపోగేసి.. ఎరైటీ..ఎరైటీ పందేలు
కట్టండంలోనూ.. అయి గెలిసి మీసం మెలేసి.. తొడల్సరసడంలోనూ గిద్దావోళ్ళ గవర్రాజుకి
మించినోడు నిడదోలు సుట్టుపక్కలున్న ఊళ్ళలోనేగాదూ.. పచ్చింగోదారిజిల్లాలోనే లేడు..
అని జనాల్లో మాంచిపేరుసంపాయించేడు. పెద్ద గజ్జెనగాడికి తోకలాగా ఎనకే తిరిగే
జనాలుకూడా బాగా గాలికొట్టి వుబ్బేసి గాల్లోకిలేపి గవర్రాజుకి ఫుల్లు సపోర్టింగుగా
వుంటుంటారు.
అదేవూళ్ళో దిబ్మీదున్న రైసుమిల్లు బుల్లెంకడు కొడుకు పెద్దరావుడికీ.. గవర్రాజుకీ
సెనంకూడా పడదూ... వాడెడ్డెం అంటే గవర్రాజు తెడ్డెం అనీ... ఈళ్ళిద్దరూ ఎపుడూ
పందేలుకాసీ.. కొట్టుకుంటా.. పంచాయితీలెడుతుంటారు. ఇద్దరూ బాగా బలిసున్నోళ్ళు
కాటంతో.. ఎవర్నీ ఏమన్లేకా.. సద్దిచెప్పిసి.. సిన్నపిలల్నితిట్టినట్టు ఓ నాలుగు సిలకతిట్లు..
తిట్టీ.. చేతుల్దులుపుకుంటారు వూరి పెసిడెంటు రాంబెమ్మంగారు.
పెద్దరావుడు ఎన్నిమార్లు గవర్రాజు చేతిలో వాడిపోయినా.. కాసినపందెమేగాసీ..
చేద్దురద తీర్చుకుంటుంటాడు గానీ.. తన బుద్దిమాత్రం మార్సుకోడూ...
అలాని... ఇద్దరూ ఒకల్నొదిలొకరు, ఒకరికంటొకరు పడకుండా తిరుగుతారా! అంటే..
అదీలేదూ.., ఎపుడూ.. కొత్తగా బండికట్టిన జోడెద్దుల్లాగా అటుఇటూ లాక్కుంటా పీక్కుంటా
కలిసే తిరుగుతుంటారు.. పందాలేసుకుని కొట్టుకుంటొంటారు.. ఈళ్ళిద్దరి
పందేలగొడవేమోగానీ.. జనాలకు ఈళ్ళమధ్య పందెముందంటేనే.. తానాలు..
వొన్నాలు.. మానేసి తెగెగబడిబోయి.. ఫ్రీగా ఈదిసినమా సూసినట్టు సూసేత్తా..
ఈళ్ళేసేత్తా తెగ సంబరబడిపోతుంటారు.
ఆకాసమంతా మూసేసి ముసురేసేసిని నల్లమేగాలు... అప్పుడుదాకా ఉగ్గబెట్టుక్కూచ్చున్నట్టు
కూర్సుని.. వొక్కసారిగా కుంబరుష్టి కురిపించేసి.. తెల్లబడిపోయేయి. ఎండిపోయున్న నేల
వానసినుకులకి తడిసి తాటిరొట్టికాలుత్తాకి పైనేసిన.. ఎర్రక్కాలిన పిడకముక్కల్లాగా
పొగలుకక్కేత్తావుంది. వానకు తడిసి.. బీటల్దీసేసిన నల్లరేగడ్నేల్లోంచీ.. వత్తున్న
మట్టివాసన.. తడిసిన సన్నజాజిపూల వాసన్తో కలిసీ ముక్కుపుటాలదిరే సువ్వాసనతో
మత్తేక్కిచ్చాంది.. నిద్రగన్నేరు చెట్లమీద వాలిన కాకులు వానదెబ్బకు వొనుకుతా..
కావుకావుమని కల్దిరుగుతా గోల్చేసేత్తున్నాయి. కలుపుతీతకెళ్తున్న జనాలు
వానదెబ్బకి ఎక్కడ జాగావుంటే అక్కడ నక్కేసి సీరకొంగులూ.. కండువాలు తలపై
ఏసేసుకుని ఆ కాకుల్లాగే మునగలాగేసేరు...
గవర్రాజు వర్సానికి గేదెల్చావిడి పాకలో పంచెగ్గట్టి పచ్చగడ్డిమోపులపక్కనేసున్న
చెక్కకుర్సీపై కూర్సుని... లంగకపొగాకు సుట్ట ఎలిగించి పొగొదుల్తావున్నాడు.
ఎండకేగిపోయున్న తాటాకుపాక చూరుమీదనుంచి పడతావున్న వానసినుకులు...
అప్పుడే కొల్లిసత్తిగాడి కాపీహొటల్లో పెట్టిన టీడికాషను రంగులోనూ.. బంగాళాపెంకుటింటి
మీదనుండి పేడగుట్టమీద పడి పచ్చరంగుతోనూ... ఆపక్కనే గుట్టగాపోసిన
ఎర్రకంకరగుట్టమీదనుండి ఎర్రరంగుతోనూ.. వొకసోట కలిసిపోయి..
పంచరంగుల్లో పల్లవేపు పారతా.. పంటకాల్వలో ఎలిపోతున్నాయి.
ఇటికిబట్టీల్లో అడుసుతొక్కే ఎడ్లు కసక్ కసక్మని సౌండుతో తొక్కినట్టు కయ్య తొక్కుకుంటా
కంగారుకంగారుగా వొచ్చిన పాలేరు ఎంకటేసులు.. "బాబయ్యా.. పెద్దరావుడుగోరో..
మళ్ళా ఏతల పందెంగట్టేరండే... ఈ సారి నడుంకాల్వకే.. అదే పన్నెండేతలిత్తానో
కాస్కోమంట్నారండే. నిమ్మకాయలెసి నెగ్గడంగాదూ... మనూళ్ళో గుడ్డి సూరమ్మేత్తానికి
రెడీగావుందే..., ఈపాలి కోడ్గులేస్కోమనో అన్నారండే", అన్జెప్పి తెచ్చిన కోడిగుడ్లట్టని
గవర్రాజుకి చూపించేడు.
"పదరా.. పన్నెండేంటెహే.. పదిటిల్లోనే ఏద్దాం.., ఆడికి ఎన్నిసార్లు నాసేతిలోవోడినా
సిగ్గుండదెదవకీ..", అని ఎగ్గొట్టిన పంచెకొసల్జోడించి బీసముడేసేసి
పెద్దపెద్దంగలేసుకుంటా... పెద్దీదేపు నడిసేడు గవర్రాజు.. ఎనకాలే కోడిగుడ్లట్ట
అట్టుకుని నడిచేడు పాలేరు ఎంకటేసులు.
వూరినడిబొడ్నున్న రాములోరి గుడికాన్నించి.. నడుంకాలవగట్టుకి రమారమి
రెండుకిలోమీటర్లుంటాది. ఆ వూల్లో అంతకు ముందల చానామంది ఇదే పందెంగట్టి
ఓడిపోయేనోళ్ళేగానీ పదేనేతల్లోగూడా నిమ్మకాయగానీ.. నారింజికాయగానీ
ఏతెయ్యలేకపోయేరు... అదే దూరం నిమ్మకాయతో పన్నెండేతల్లో ఏసీ మీసంమెలెసీ
"సెబాష్.. మగాడంటే ఈడేరా..", అనిపించుకున్నోడు గవర్రాజొక్కడే. అసుమంటిది ఇప్పుడు
కోడిగుడ్డుల్తో పదేతల్లో ఎలాఏత్తాడోనని వూరిజనాలంతా పనులుమానేసి నోల్లోదిలేసి
చూత్తంమొదలెట్టేరు.
"బాబయ్యా.. నారింజికాయైతే కాత్తోకూత్తో దొల్లుకుంటా పోతాది.. కోడుగుడ్డేందొల్లుద్దండే..
కాత్త ఆలోసించండే పందెం.., అదీ.. పదేతల్లోఅంటన్నారో సూసుకోండే.. మనపరుపోద్దండే
ఆరిముందో..", అంటా ఎంకటేసులు గవర్రాజు సెవిగొలికేసేడు.
"ఒరే.. దెవాసాలోడా సెవిలో జోరిగలెక్క గొలక్కేహే.. నువ్వే సూద్దువుగానీ ఎలా ఏత్తానో..,
గుడ్డిసూరమ్మేత్తా దంటా ఎగతాళ్జేత్తాడా నన్నూ.., మనమేసే పందెమెలావుంటాదో ఆడికి
సూపించాలియ్యాలా..", అని కసురుకుంటా.. గుడ్డుతీసుకుని ఎంకటేసుల్ని
పక్కకినెట్టేసేడు గవర్రాజు.
ఎనిమిదేతలకే... సూరింగారి దూళ్ళసావిడి దాటేసి... గుబ్బలోళ్ళదిబ్బదగ్గరకొచ్చేసినయ్యి..
ఆడ్నుండి సూత్తే నడుంకాలవ కనుసూపుమేర్లో కనిపిత్తానేవుంటాది...ఇంకారెండేతలంటే
గవర్రాజుఏసేసిలానే వున్నాడని ఎగస్పాట్టీవోళ్ళు గుసగుసలాడేత్తున్నారు.., ఏం
జరుగుద్దోఏంటోనని.. జనాలంతా కంగారడిపోతా ఒకర్నుకరు తొక్కేసుకుంటున్నారు..
కొందరు కుర్రగాళ్ళతే సైకిళ్ళేసుకునిమరీ.. ముందెళ్ళిపోయి.. ఏతకెదురుకాసేత్తున్నారు...
జనాలడావుడీ.. దూరం సూసుకున్న పెద్దరావుడికి సెవటలట్టేసినియ్యి..
"ఒరే తియ్యిరా.. పదేలు.. ఇంకేసూత్తావుగానీ... నాతోనువ్వొక్కపందెంలో గెలువూ
నామీసాలు తీయించుకుంటా..", అని సేలెంజి సేసి... అట్టలోంచి మాంచి వాటమైన డబల్ సొన
గుడ్డోటందుకున్నాడు గవర్రాజు. దున్నపోతు దువ్వినట్టుగా.. తడిసిపోయున్న కంకర్నేలమీద
కాల్దువ్వి.. క్రిక్కెట్టులో బంతేసేటోడు తోంనట్టుగా కోడిగుడ్డు పంచెకొసకేసి రుద్దీ... కిందకంటా
కూర్సునిలేసి.. ఒక్కిసురు ఇసరటంతో పెద్దనిద్రగన్నేరు సెట్టు పైనుండెళ్ళి..
అవతలున్న ఏపచేట్టుపైనుండి అవతలకెళ్ళి పడి.. తపుక్కుమంటా సితికిపోయింది
కోడిగుడ్డు... జనాలంతా కేరింతలు కొట్టేత్తా.. తొమ్మిదేతల్లోనే ఏసేసిన.. గవర్రాజుని
ఆకాశానికెత్తేసేరు.
పదేలుపోగొట్టుకున్న పెద్దరావుడు ఉడుకుమోత్తనంతో కంగార్లో కాలుతొక్కేసిన
పేటలోకుర్రోడ్ని చావబాదేసేడు. అడ్డడి ఆపిన గవర్రాజు సొక్కాకాలరట్టుకుని..
"ఏతలపందేంగాదురా.. వచ్చే సెనివారం కిష్నాష్టమికి... నీ మీసాలమీద నిమ్మకాయల్ని
నిలబెట్టుసూద్దాం.., ఇదీ అసలు సేలంజింగు.. నా పందెం ఇరవయ్యేలు...,
దమ్మున్నమాగాడివైతే కాయి.. అప్పుడు సూస్కుందాం పెతాపం తస్సాదియ్యా.."
అని కస్సుమంటా పంటచేలో తోకమీదడగేసేసిన తాసుపాము లెక్కలేసేడు పెదరావుడు.
"సరే.. కాయిరా... మీసమ్మీద నిమ్మకాయ నిలబెట్టకపోతే.. నా మీసాలేగీసేత్తానేహే..
ఇదే నా సేలంజీ.. కాస్కో", అని పెద్దరావుడి కాలరట్టుకున్నాడు గవర్రాజు.., సరేలే అదీ
సూద్దాం.. అని కాలరొదిలేసి.. కంగార్కంగారుగా ఎళ్ళిపోయేడు పెద్దరావుడు.
సిర్రెత్తిపోయున్న గవర్రాజు సిమసిమలాడతా ఇంటికిసేరుకున్నాడు... బుజానున్న
కండువా తీసవతలడేసి.. కోపంగా పడక్కుర్సీలో వాలిపోయేడు..
"ఒరే ఎంకటేసులా.. మంగడికి కబురెట్టరా.. ఇయ్యేలనుండీ ఆడేంసేత్తాడో నాకు తెల్దూ..
నా మీసాలకీ సంపంగినూనే రాత్తాడో.. ఏ సన్నాసినూనే రాత్తాడో.. మొత్తం
గట్టిపడిపోవాలా.. పొద్దున్నుంచీ సాయంత్రందాకా ఇక్కడే ఆడికి పనీ అన్జెప్పు..
గాదిలోయి.. నాలుగు బత్తాలు ఆడింటికి తోలూ.. ఈ పందెంలో ఎలాగైనా
నేనే గెలిసి సూపిత్తా నా తడాకా..", అని రోషంతో మీసాలెగరేసేడు గవర్రాజు.
కబురందుకున్న మంగడు సాయంత్రమేలకి రానేవచ్చేడు.. "గవర్రాజుగోరో.. మీరేం
కంగారడకండే.. మీ మీసాలకేసంపగినూనే అక్కర్లేందండే.. దమ్మున్నమీసాలియ్యే...
శాన్సిత్తే.. నిమ్మాకాయలేంటండే.. గొబ్బిరికాయల్నైనా నిలబెట్టెత్తాయండే బాబో..
అయినా నేనున్నానుగదండే..., గంటకోమారు కలబందగుజ్జు రాత్తా దువ్వుతుంటే.
నాలుగురోజుల్లో నా సామిరంగా.. గుర్రపెంటుకుల్లెక్క నిలబడిపోవో..",
అని నాలుగుబత్తాలధాన్యం అందుకున్న సంతోషంలో గవర్రాజుకు గాలికొట్టేసేడు.
ఆయాల్నించీ మంగడుపొద్దుపొడవకముందే రాటం.. గంటగంటకీ కలబందగుజ్జుతో
మీసాలు సవరచేయటం.. ఆఈది కబురూ ఈ ఈదికబురూ సెప్పటంతో.. గవర్రాజు
ఇంటిపట్టునే వుండిపోవాల్సొచ్చింది.. జనాలంతా ఇంటికొచ్చి పలకరించెల్లిపోతా పెదరావుడి
పార్టీ కబుర్లు మోత్తావున్నారు.
నాలుగురోజుల్లో గవర్రాజుమీసంలో సత్తువకొట్టొచ్చినట్టు కనబడిపోతా, మీసం దగాదగా
మెరిసిపోతావుంది..., తోటలో కోసుకొచ్చిన సిన్న పచ్చనిమ్మకాయల్ని మీసాలమీద
నిలబెట్టి... ఓసారి ట్రైలేసి గవర్రాజుకు అద్దంలో సూపించేడు మంగడు.
అది సూసుకుని మురిసిపోయిన గవర్రాజు.. "ఒరే.. మంగా.. నీ బుర్రేబుర్రరా.. అసలు
నువ్విక్కడుండోల్సినోడివి గాదురా.. మీబాబులాగా నువ్వూ రంగమెల్లి అక్కడే తెల్లోల్ల
దగ్గర సెటిలై పోవాల్సిందెహే..", అని మంగడ్ని పొగడ్తల్తో ముంచేసేడు.
"బాబుగారో.. మాకుర్రోడు సేతికందేసేడండే.., మహా పనోడండోయ్ మావోడో...
బొంబాయిలో నేర్సుకొచ్చేడండే పనే..,నాలుగైదేళ్ళు కట్టబడ్డాడండే.. ఆడే అమితాబస్సన్న్
కీ, మిగతా హిందీ ఏక్టర్లకీ.. ఆళ్ళికీ కటింగేసేటోడంటండే.., అక్కడే బొంబాయిలో
షాపెడతానన్నాడండే.. నేనే ససేమిరా.. అని మనూరులాక్కొచ్చి మనపెద్దీదిలో రేపు
షాపెట్టిత్తిన్నానండే... అందరూ తిడుతుండేవోరండే నన్నో.. మీవోడ్నికూడా ఇదే ఇద్యలోకి
లాక్కొత్తునావేంట్రా,సుబ్బరంగా సదివించి ఉద్దోగం సేయించకా.. అనే..,
నేన్నమ్మిందుకటేనండే.. బాబో.., మా తతలగాలం కానీయ్యండీ.. మాకాలంకానీయండీ..
జనాలమీదసేసే యాపారమే యాపారమండే.., అయినా సేతిరుత్తిని
మించినేపారమేముంటాదండే.., మిగతాయి ఈరోజుంటే రేపుంటాయోలేదో తెల్దో....",
అని ఏదాంతం బలుకుతా.. గవర్రాజు మీసాలు దువ్వేడు మంగడు.
"ఇంతకీ ఇయ్యన్నీ ఎందుకుసెబుతున్నానంటేండే.., మీరేమనుకోకండా.. రేపొపాలి
మా వోడు షాపుకొచ్చి గడ్డంసేయించుకోండే.., ఎపుడూలేనిది సవరానికి షాపుకాడికి
రమ్మంటన్నాడేంటా అనుకోమాంకడే బాబో.., మీలాంటోల్ల బేరంతో మొదలయితే..
మావోడు యాపారం మూడుపూలు ఆరుకాయలైపోతాదాని ఆసెండే..", అని
గవర్రాజుని బ్రతిమలాడతా అడిగేడు మంగడు.
*** *** *** ***
ఇంకా ఎలుగురాకండానే.. గాదిక్కట్టిన వరికంకెల్ని పొడుత్తా పిచ్చుకలన్నీ గోలసేసేయటం
మొదలెట్టేసేయి.. కాసేపటికి.. తెల్లారిపోయి.. పెదరావుడు పందెంకట్టిన సెనివారం రోజు రానే
వచ్చింది. అప్పుడికే గవర్రాజుకి నాలుగైదుమార్లు షాపుదగ్గరికి రమ్మని కుర్రాగాళ్ళసేత
కబుంరంపించేసేడు మంగడు. పెళ్ళికి మగపెళ్ళోరు ముత్తాబయిఎళ్ళినట్టు ఎనకో
పదిమందినేసుకుని బయల్దేరేడు గవర్రాజు. షాపుదగ్గరకొచ్చేసరికి కుర్సీ ఏసేసి
కొబ్బరిబొండం కొట్టిచ్చేసి.. కొడుకుసేత దండాలెట్టించేసి మర్యాదసేయించేసేడు మంగడు.
"మీరొత్తం ఎక్కడ ఆలసమయ్యిపోద్దోని మావోడు గొడవండే.. మళ్ళా కాసేపాగితే ముహుర్తం
దాటేత్తే.. అట్టమి గడియలొచ్చేత్తాయనీ తెక్కంగారుపడిపోతున్నాడండే.., నేనోపాలి
ఇంటికెళ్ళొచ్చేత్తానండే.. మీకోసం ఏదో బహుమానం కట్టుంచేడంటండే.. అదొట్టుకొచ్చేత్తానో
మీరు కానియండే.." అని ఇంటేపు లగెత్తాడు మంగడు..., మంగడుకొడుకు..
"రండే.. గవర్రాజుగారో..", అంటా మహారాజా కుర్సీపై కుర్సోపెట్టినట్టు గవర్రాజుని
కుర్సోపెట్టి మెడసుట్టూ తెల్లగుడ్డేసి గెడ్డంసేయటం మొదలెట్టేడు. గవర్రాజుకుడా వొచ్చిన జనం
బయట కుర్సీల్లొకుర్సుని..బల్లేసి ఎట్టిన సితార, ఆంధ్రజోతి.. సినిమాపత్రికల్లో మొకాలెట్టేసి
సదవటంరాపోయినా బొమ్మల్చూసి సొల్లుకార్చేసుకుంటా పెపంచాన్ని మర్సిపోయెరు.
సెవులదిరిపోయేలా పెద్దసౌండుతో హిందీపాటలెట్టేసి.. లైట్లేసేసి..., ఫ్యానేసి పెనుగాల్లో
ప్రేసెంటుకొట్టి..దగదగామెరిసిపోతావున్న కొత్తసామానుజూపిత్తా.. బొంబాయిలో మేమదిసేసేం
ఇదిసేసేం అంటా కబురుల్లోపెట్టేసి.. నైసుగా గెడ్డంగీత్తావుండగా.. జేబులోఅరుత్తావున్నసెల్లు ఫోన్
తీసి.. కాత్త హిందీ పాటలు సౌండు తగ్గించీ.. "ఏప్పుడొత్తున్నారో.. అద్దాల్లేకండా..
షాపోపినింగు అంటే ఎలాగుంటాదీ.., ఇలాజేత్తేఎలాగా", అని ఎవడిమీదో కోప్పడిపోయేడు
మంగడుకొడుకు..
"సూడండే... ఆడేదో గొప్పోడనీ నిడదోల్దాకా ఎళ్ళి ఆడికిత్తే... అద్దాలుసూడండే..
పిట్టింగ్ సేయకుండా వొదిలేసేడు.. ఎప్పుడుఫోనుసేసినా ఇదిగో గెంటలోవొచ్చేత్తానో
అంటాడండే..", అని కిందెట్టేసిన అద్దాలు సూపిత్తా.. మళ్ళా గెడ్డంసేయటంలో మునిగిపోయేడు..
అలా ఐదునిముషాలకోసారి సెల్లుఫోన్లో అరుత్తా.. మళ్ళా గెడ్డంగీత్తా.. అరగంటసేపు కుర్సీలో
కుర్సోబెట్టి అటూ ఇటూ గిరగిరా గానుగుతిప్పినట్టుతిప్పేసి ఇకారంతెప్పించేసేడు గవర్రాజుకి...
అరగంటయ్యాకా.. సల్లగా ఐసుగెడ్డలాగా లాగుతున్నలోషను మొకానికి రాసేసి.. మొకంపైగుడ్డేసి
తుడవటంమొదలెట్టేడు.. మళ్ళా మోగుతున్న సెల్లుఫోను తీసి ముసుగేసేసిన గుడ్డ అలాగుంచేసి..
ఫోనట్టుకుని.. బయటకెళ్ళిపోయేడు.. మంగడుకొడుకు.
సాయత్రమైపోయింది... కిష్నాష్టమికని కట్టిన పెరుగుముంత ఆడ్డంకన్నా.. గవర్రాజు, పెదరావుడు
కట్టిన నిమ్మకాయల పందెం సూట్టాంకోసం గుంపులుగుంపులుగా.. జనాలు రాములోరిగుడిదగ్గర
సేరుకుంటున్నారు... ఎవడిసేతిలోనూ ఓటమంటే ఎరగని గవర్రాజు ఆయేల పందెం వాడిపోయి..
రెండు.. వందనోట్ల కట్టలు పెదరావుడిసేతిలోపెట్టేసి తలదించుకున్నాడు.
సెల్లు ఫోను మాటాడతా.. షాపు బయటకెళ్ళిన మంగడుకొడుకు మళ్ళా ఆవూళ్ళో అడుగెట్టలేదు..
రొండేపులా సమానంగా వొత్తేసి పాతసినిమాలో నాగేసర్రావు మీసంలా సన్నగాకాశీతాడులా
తయారయ్యున్న మీసాన్ని మొత్తం గీయించేసుకుని.. బోడిమూతిని అద్దంలో సూసుకున్న
గవర్రాజు.. ఒక్కసారిగా సల్లబడిపోయేడు..
మీసంతోపాటు పౌరుషంకూడా పోగొట్టుకుని.. ఆఏల్నుండీ.. పందేలు జోలికెళ్ళటమే మానేసేడు..
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
9:57 PM
20
ఆభిప్రాయాలు
23, జూన్ 2010, బుధవారం
ఐడియా!!!

రాయుడు.. ఏవరేజి స్టూడెంటు.. ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంటర్వూల్లో నెగ్గలేక
కొన్నాళ్ళు ఖాలీగా తిరిగేసాడు.. కొన్నాళ్ళు మార్కెటింగని అదని ఇదని..
అక్కడా ఇక్కాడా చిన్న చిన్నఉద్యోగాలు చేసినా తృప్తి చెందలేకపోయాడు.
ఫ్రెండ్సందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మంచి మంచి సేలరీతో సెటిల్
అయిపోయారు. అదిచూసి తట్టుకోలేకపోయిన రాయుడు ఎలాగైనా తనూ
సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలి.. అప్పుడుగాని ఐదంకెల సేలరీ రాదు, ఈ దరిద్రాలన్నీ
వదలవు అని.. అమీర్ పేటలో కట్టిన బ్యానర్లన్నీ చదివేసి కనబడ్డ కోర్సులన్నీ
నేర్చేసుకుని.., పేపర్లో పడ్డ ఇంటర్వూలన్నింటికీ ఎటండ్ అవటానికి సిధ్దమైపోయాడు.
ఎక్స్పీరియన్స్ ఎంత అన్న ప్రశ్న దగ్గరకొచ్చేసరికి చెమటలుపట్టేసేవి. చెప్పుకోటానికైతే
మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ వుంది గానీ.. అండర్ వేర్లదగ్గర్నుండి... క్రెడిట్ కార్డులు
అమ్మటం దాకా.. లిప్స్టిక్ దగ్గరనుండి నెయిల్ పాలిష్ దాకా అన్నీ అమ్మిన
అనుభవాలు కలిపి రెండేళ్ళు రావటంతో, ఎవరోచెప్పిన సలహాతో... మొత్తం రెండేళ్ళు
నాన్ ఐ.టి అని.., ఒక సంవత్సరం ఐ.టి ఎక్స్పీరియన్స్ అని రెజ్యూమ్ తయారుచేసి..
ఇంటర్వూలకు వెళ్ళటం మెదలుపెట్టాడు. అతనికి లక్కు కలిసొచ్చి.. ముంబయిలో ఓ
చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. ఎలాగైతే తనకున్న మార్కెటింగ్ స్కిల్స్
ఉపయోగించి జాబ్లో జాయినైపోయాడు. ఏదడిగినా నేర్చుకున్నప్పటి డెఫినిషన్ చెప్పేసి
తెలిసినట్టు కటింగు ఇచ్చేటాలెంటైతే వుందికానీ ఇది చెయ్యి అని ఏదన్నాపనిచ్చేసరికి..
ఒక్క ముక్కకూడా ముందుకు నడవక.. వారాలు వారాలు అలానే వుండిపోయి..
మేనేజరు దగ్గర రోజూ డక్కాముక్కీలు తింటూ కాలం గడిపేస్తున్నాడు.
రాయుడికి అప్పటిదాకా కలిసొచ్చిన లక్కు కాస్తా చంఢశాసన ప్రోజెక్ట్ మేనేజర్
రూపంలో బ్యాడ్ లక్ గా మారిపోయింది. పని ఇచ్చి వెనకేనిలబడి ఏం చేస్తున్నాడో
చూస్తూ. ఎప్పుడన్నా మంచి ఇస్త్రీ షర్ట్ వేసుకొచ్చిన రోజు ఏదన్నా తప్పుదొరికితే...
సినిమా హీరోలా మంచి మంచి డ్రెస్సులు వేసుకురావటం కాదు.. పనితనంలో ఉండాలి..
అని అమ్మాయిల ముందు పరువుతియ్యటాలు, పెద్దగాకేకలుపెట్టి అందరికీ వినపడేలా
గట్టిగా అరుస్తూ మాట్లాడటం లాంటి వేషాలన్నీ వున్నాయి మేనేజరుకు.
అప్పటిదాకా బ్రాండెడ్ జీన్సులు అవి వేసుకుని మంచి స్టైలిష్ క్రాపుతో
ఉన్నవాడు కాస్తా సాదాసీదాగా మారిపోయి.., రాయుడంటేనే మీసం
అనిపించేలా పెంచిన మీసం కాస్తా ట్రిమ్ చేసి.. తగ్గించాడు.. ఏంచేస్తే
ఎలా ఇరికిస్తాడోనని భయంభయంగా ఆఫీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు
రాయుడు. అలాగైనా ఎదో వంకపెట్టి తిట్టడం మాత్రం మానలేదు మేనేజరు.
కాలేజి రోజుల్లోనూ.., మార్కెటింగ్ చేసిన రోజుల్లోనూ హిందిని బాగా నూరిపోసుకుని
తాగేసిన లాంగ్వేజ్ స్కిల్స్ తో ప్రతీ పని తనే చేసానని చెప్పుకోవటం అలవాటు చేసుకున్నాడు.
ఒక్కోసారి టైముబాగుంటే పూలదండలూ.. లేకపోతే ఎవడోచేసిన తప్పులకు చెప్పుదెబ్బలు
తింటూవుండేవాడు.
అలా కొంతకాలానికి తనకు తెలిసిన తలమాసిన స్ట్రాటజీలన్నీ ఇంప్లిమెంట్ చేసి
ఎలాగైతే తప్పించుకునే విద్య అయితే నేర్చుకోగలిగాడు కానీ.. పని మాత్రం
నేర్చుకోలేకపోయాడు.. మేనేజర్ని మెప్పించలేకపోయాడు. అలా ఒక సంవత్సరం
గడిచేసరికి.. ప్రాజెక్టులో ఒకొక్కడూ వేరే వేరే కంపెనీలకు వెళ్ళిపోవటంతో, కొత్తగా
వచ్చిన టీముకు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియకపోవటంతో మొత్తం
రాయుడినెత్తిమీదే పడిపోయింది. ప్రతీదాంట్లోనూ నువ్వే సీనియర్ వి కదా నువ్వు
చేసి వాళ్ళకు చూపించు అనటం మొదలుపెట్టాడు మేనేజరు. ఎవడు చెయ్యకపోయినా
రాయుడ్నే సెంటర్ చేసి వంకపెట్టి తిట్టేయడంతో కధేంటిరా ఇ.వీ.వీ సినిమాలోలాగా
ఇలా మలుపు తిరిగింది.. అని రాయుడికి పిచ్చెక్కిపోయింది.
ఇన్నాళ్ళూ వాడినెత్తిమీద వీడినెత్తిమీద చేతులుపెట్టేస్తే అయిపోయేది.. ఇప్పుడు
నానెత్తిమీదే మా మేనేజరు బండచేతులు వేసేస్తున్నాడు బాబోయ్ అని తెగ
బాధపడిపోయాడు రాయుడు. ఈ టెన్సన్లన్నిటిని తట్టుకోలేక అరగంటకోసారి కంపెనీ
ఎదుటవున్న టీ బండిదగ్గరకు వెళ్ళి ఒక టీతాగటం.. ఒక సిగరెట్టెలిగించడం ఇలా
తిండిమానేసి టీలు సిగరెట్టులమీద నడిపేస్తూ... రాత్రిళ్ళు సరిగా నిద్రపోకా
మొహంలో రకరకాల మార్పులు తెచ్చుకున్నాడు.
ఫ్రండ్స్ ఎవరికి చెప్పినా అంతేరా బాధలు అలానే ఉంటాయి ఐ.టి ఇండస్ట్రీ అంటే
అనే వాళ్ళేగానీ తను చెప్పేది పూర్తిగా వినేవాడు, సలహా ఇచ్చేవాడు ఎవడూ
కనబడలేదు. ఇక ఉద్యోగం.. జీవితం రెండూ విరక్తి కలిగించేసాయి...
"మరెందుకురా నేను ఐ. టి. లోకి వస్తానన్నప్పుడు ఇవ్వన్నీ ఎవడూ చెప్పలేదు",
అని జనాలపై కసురుకోవటం మొదలెట్టాడు. "వస్తే ఎలాగూ తెలుస్తుంది కదా
మళ్ళా ఇంట్రడక్షన్ ఎందుకులే, అయినా చెబితే ఎవరూ వినరూ.. అనుభవలోకొచ్చాకా
ఏడుస్తారు..", అని అంతా ఏడిపించారు రాయుడ్ని.
"ఒరే.. మీ కోడ్ లో బగ్గులు పడా.., మీ మేనేజరు అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేసి
ఆఫీసుకు రమ్మనా..., రాసిన కోడ్ సేవ్ చెయ్యకుండానే.. మీ సిస్టమ్లలన్నీ క్రాష్
ఐపోనూ... రిలీజ్ రోజున మీ వేళ్ళన్నీ కీ బోర్డ్ సందుల్లో దూరిపోయి
గోరుచుట్టులేసెయ్యా.., లాంగ్ వీకెండ్ వస్తున్న రోజుల్లో మీరు బాత్రుంల్లో
వుండగా బయట డోర్ లాక్ పడిపోనూ.. నన్నింత మాటంటార్రా", అని రకరకాల
తిట్లన్నీ తిట్టేసుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడటం మానేసాడు.. రాయుడు.
ఓ రోజు రోజులాగే టీ బండి దగ్గర టీ తాగుతూ సిగరెట్టు వెలిగించి అప్పుడే తాజాగా
మేనేజరు తిట్టిన తిట్లన్నీ ఒక్కసారి రివైండుచేసుకున్నాడు... "వెళ్ళి ఆ టీ
బండిలాంటిదేదన్నాపెట్టుకోవయ్యా.. ఎందుకిలా ఐ.టి లోకొచ్చి మా ప్రాణాలు
తీస్తారు", అన్న తిట్టు పదే పదే ఎకో శబ్ధంలో చెవుల్లో మారుమోగిపోయింది.
"బలిసి కొట్టుకుంటున్న అత్తగారు.. కోడలు జాకెట్టు వేసుకుని తిరిగిందని.. మేం
చేసిచ్చిన పనిని మేకప్ చేసి పైవాడికి చూపించుకుంటూ అన్ని సోకులు
చేస్తున్నోడివి నువ్వే ఈ ఇండస్ట్రీలో లేగా లేంది నేనుంటే తప్పేంటిరా?, ఎప్పుడూ
ఎక్సెల్ షీట్లో తలపెట్టక్కూర్చునే తలమాసినెదవ్వి.. నీకేం తెలుసురా కోడింగ్
అంటే.., ఎప్పుడో పాస్కల్, కోబాల్ ప్రోగ్రాములు చెయ్యటంకాదురా.. లేటెస్ట్
ప్రోగ్రాములు చెయ్యమ్మా.. తెలుస్తుంది. నేను టీ బండి పెట్టుకోటానికైనా
పనికొస్తానేమో కానీ!!.. నువ్వైతే నా దగ్గర... తాగేసిన టీ గ్లాసులు కడగటానికి కూడా
పనికిరాని పనికిమాలినెదవా..", అని రాయుడు తన మేనజరుపై తిట్టుకున్న తిట్లవేడిని
తట్టుకోలేక చేతిలోవున్న టీగ్లాసు భళ్ళున పగిలి ముక్కలైపోయింది.
షర్ట్ పై పడిన టీ మరకలుతుడుచుకుంటుంటే.. మషాళా టీలాంటి ఐడియా ఒకటి తట్టింది..
రాయుడికి.., వెంటనే తన రూమ్మేట్ క్రిష్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి మంచి
ప్లాన్ చేసారిద్దరూ కలిసి..
"నన్నింతమాటంటాడా.. ఛీ.. ఈ రోజునుండి ఈ అఫీసులో అడుగుపెట్టను", అని
కోపంలో మెడలోవేలాడుతున్న ఐడెంటిటీ కార్ట్ ట్యాగ్ ను అగ్గిపుల్ల తీసి వెలిగించేసాడు.
ట్యాగ్ కాలుకుంటూ మంటలన్నీ మొహంవైపొచ్చేసరికి.. కంగారుగా ట్యాగ్
తీసేసి.. అవతలపడేసి నాలుక్కరుచుకున్నాడు.
"అయ్యబాబోయ్ ఇలా కాల్చేసేంత ఆవేశం వచ్చేసిందేంటి... అసలే
నెలాఖరిరోజులు.. చక్కగా జీతం ఎకౌంటులో పడ్డాకా చెక్కైయొచ్చుకదా?",
అని సగం కాలిన ఐ.డి కార్డు తుడుచుకుంటూ మనసు మార్చుకుని.. ఇచ్చిన
వర్క్ తలచుకుంటూ..ఆఫీసులోకి బయలుదేరాడు.
ఎదురుచూస్తున్న ఫస్ట్ తారీఖు రానే వచ్చింది... బ్యాంక్ ఎకౌంట్లో సేలరీ డిపాజిట్ ఎసెమ్మెస్
చూడగానే కంగారుగా ఆఫీసు బయటకు వచ్చేసాడు.. సెల్ ఫోన్ తీసి డయల్ చేసి రూమ్మేట్
క్రిష్ తో విషయం చెప్పాడు.. ఓ గుడ్.. ఇదే మంచి సమయం.. ఇంక ఆలస్యం ఎందుకు..
ఇచ్చేయ్ అందరికీ షాక్... మీ మేనేజర్ కి స్పెషల్ గా మెయిల్ కూడా పెట్టు.., గూగుల్ లో
వెతికి బాలకృష్ణ మీసం తిప్పుతూ.. తొడకొడుతున్నట్టున్నఇమేజ్ ఎటాచ్ మెంట్ చెయ్యటం
మర్చిపోకు.., నువ్వేం బయపడకు... అంతా మన ప్లాన్ ప్రకారమే నడుస్తుంది..., నేను
నా ప్రాజెక్టుకు కూడా ఇంత మంచి వర్క్ ఫ్లో చార్ట్ తయారుచెయ్యలేదు..., నిన్ననే సాధక
బాధకాలు అని ఒక డాక్యుమెంట్ చేసాను.. అన్నిటికి మనం సిద్దంగానే వున్నాం..
నేను అన్ని ఎరేంజ్మెంట్స్ చేసేసా కూడా... రెపే ముహుర్తంపెడదాం.. అంతా అయ్యాకా
ఫోను చెయ్యి.. అని ముగించాడు క్రిష్...
ప్లాన్ చెసిన ప్రకారం తన సాఫ్ట్వేర్ ఇంజనీరు జాబ్ కి రిజైన్ చేసేసి అందరికి షాక్ ఇచ్చాడు
రాయుడు..., రేపట్నుండి నేను రావటంలేదు.. ఈ క్షణం నుండీ నాకూ ఈ ప్రాజెక్టుకీ ఏమీ
సంబంధంలేదు.. ఏం పీక్కుంటావో పీక్కో అని స్పెషల్ మెయిల్ చూసి మేనేజర్ షాక్ తిని
కూలబడిపోయాడు..
తరువాత రోజు ఎపుడూ ఆఫీసుకు బయలుదేరే సమయానికంటే ఒక గంట ముందుగానే
ఆఫిసుకు బయలుదేరాడు రాయుడు... వెనకే బైక్ పై క్రిష్ కూడా కుర్చున్నాడు.
"మాషాళా చాహా.. అద్రక్చా చాహా.., గరమ్ గరమ్ వడాపావ్... మిళేలా..,
జై శివసేనా.. జై మాహారాష్ట్ర" అని.. మరాఠీలో రాసివుండి.. పూలదండలతో అలంకరించిన
టీబండిని లోకల్ ఎమ్మెల్యేచేత తన ఆఫీసు ఎదురుగానే రిబ్బన్ కటింగ్ చేయించి..
ఓపెన్ చేయించారు రాయుడూ క్రిష్...
ఆ రోజునుండీ రాయుడి వ్యాపారం.. మూడొందలు వడాపావ్ లు.. ఆరొందలు మషాళా
టీలు అన్నట్టుగా...వర్క్ టెన్సన్.. మేనేజర్ హెరేస్మెంటూ.. ఏమీ లేకుండా దర్జాగా..
పోలీసోడికీ..., లోకల్ గూండాలకి, ఎమ్మెల్యేలకీ అమ్యామ్యాలు చదివించుకోగా
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పున్యమా అని పదిలక్షలు పెర్ ఏనమ్ గా ముందుకు సాగింది.
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
10:12 AM
21
ఆభిప్రాయాలు
15, మే 2010, శనివారం
హైకొచ్చిందోయ్ మావా...!!
"భలేమంచి రోజు.. పసందైన రోజు.. లచ్చిందేవి నవ్వే నేటిరోజు..", అని
స్టేటస్ మెసేజ్ పెట్టుకుని గూగుల్ టాక్ లో ఆన్లైన్లో కునుకుతుండగాసత్తిగాడు
"హాయ్', అని పంపించాడు మెసేజ్..

"ఒరేయ్.. సత్తిగా ఎలా వున్నావ్ రా..", అని రిప్లై ఇచ్చానేను.
"బాగానే వున్నారా!, ఏంట్రోయ్ లచ్చిందేవి అంటూ మాంచి హుషారుగా
వున్నావ్ ఏంటి కతా?, ఆన్ సైటు ఆఫర్ ఎమన్నాచేసాడా మీ మేనేజర్",
అన్నాడు.. సత్తి.

"హ హా.., అంతలేదులేరా.. ఈ రోజు నా సేలరీ రివ్యూ వుంది..
రేటింగ్ ఇచ్చి.. హైకు లెటరిస్తాడు మా మేనేజరు.. అందుకే రాత్రినుండి
నిద్రేలేదు ఎటుచూసినా లచ్చిందేవే కల్లోకొస్తుందిరా",అన్నానేను.
"నీ పనే బాగుందిరా.. సంవత్సరం నుండీ ఇదిగో.. అదిగో..
ఎం.డి దుబాయ్ సేట్లకు ఖర్జూరం అమ్ముతున్నాడు... అవి అమ్ముడవగానే
మీ అందరికీ ఎభైశాతం హైకు అని ఎదోవొక సోదిచెప్తా మా హెచ్చార్
ఊరిస్తుందిరా, అసలు మా ఎం.డి ఎప్పుడెప్పుడు ఇండియా వస్తాడా..
అని " వస్తాడు మా ఎం.డి. ఈ రోజు.. రానే వస్తాడు దుబాయ్ ఫ్లైట్లో
ఈ రోజు..., ఖర్చూరమమ్మిన డబ్బుతో.. మోయలేక సూట్కేసు మోస్తూ..
రానే వస్తాడు..", అని అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణ కోసం
ఎదురుచూస్తున్న విజయనిర్మలలా పాట పాడుకుంటూ.. మౌసు
చేత్తోపట్టుకుని, సీలింగ్ కి ఉన్న లైట్లో మా ఎం.డి ఫొటో ఇన్ సెట్లో
ఊహించుకుంటూ.. ఎదురుచూస్తున్నాంరా..", అన్నాడు సత్తిగాడు.

"హ హ. హా.., దుబాయ్ లో ఖర్జూరం అమ్మకమా.. అయితే మీకు
వందశాతం ఇస్తాడు హైకు.. నో డౌట్..", అంటూ నవ్వాను నేను..

"అవును నిజమేరా.. దుబాయ్ లో ఎవడుకొంటాడ్రా.., మరెందుకు
హెచ్చార్ అలా చెప్పింది... హమ్మనీ.. మోసంరోయ్..", అని సత్తిగాడు
ఆలోచనలోపడ్డాడు.

నాకు నవ్వాగలేదు.. గట్టిగా నవ్వేసాను..
పక్కసీటువాడు నావైపుతిరిగి
చూసాడు.. Alt+Tab కొట్టి నా వర్కు చేస్తున్న విండోని ఓపెన్ చేసి
ఏమీ తెలియనట్టు ఎలర్ట్ అయిపోయాను.

ఒన్-ఆన్-ఒన్ డిస్ససన్ ఇంకా ఐదునిముషాలువుంది అని ఔట్ లుక్లో
ఎలర్ట్ వచ్చింది.. ఓహో అయితే కాస్త బికారిమోహంపెట్టుకుని వెళ్ళాలి
అని రెస్ట్ రూమ్లోకి దూరి, నీట్ గా దువ్విన తలనంతా చెదరగొట్టేసి,
ఇన్షర్ట్ ని కాస్త అటూఇటూచేసుకుని మేనేజరుదగ్గరకు దిగాలుగా
బయలుదేరాను..

"హే.. హౌఆర్ యు?", అని పలకరించి.. "ఏంటి అలా వున్నావ్!,
ఏనీ ప్రాబ్లమ్..", అన్నాడు మేనేజర్
"ఏంలేదు.., వర్క్ కాస్తెక్కువుంది".. అన్నానేను
"సరే.. లెట్స్ స్టార్ట్ యువర్ ఎవాల్యుయేషన్", అని లేప్ట్ టాప్ లో ఎక్షెల్
షీట్ ఓపెన్ చేసాడు..., అలా ఒక అరగంట మా మధ్య మెగుడూపెళ్ళాలు
కొట్టుకుంటే బయట తలుపుదగ్గర కెమేరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినట్టుగా
డిస్కషన్ అయ్యాకా. చిరాకు మోహం పెట్టుకుని నా డెస్క్ దగ్గరకొచ్చి కుర్చీలో
కూలబడ్డాను.

సత్తిగాడు చూస్తే అన్ లైన్లోలేడు.. సరే ఎవరున్నారా అనివెతుకుతుంటే
సునీల్ దొరికాడు..
"హాయ్..సునీల్!", అని విషయం అంతా చెప్పాను..
"కంగ్రాట్స్..", అన్నాడు.. స్మైలిలా నవ్వుతూ..
"ఏం కంగ్రాట్స్ నా బొంద.. పదమూడుశాతం తో సరిపెట్టాడు", అన్నాను.
"సరేలేండి ఆల్ రెడీ మీకు ఎక్కువేగా".. అన్నాడు సునీల్.
"ఏం ఎక్కువా.. తలపొగరా!! అన్నానేను..
"హి హి.. అదే..అదే.. కాదు.. సేలరీ" అన్నాడు సునీల్
నాలుక్కరుచుకున్న స్మైలీతో

"నేననుకున్న దానికన్నా రెండుశాతం తగ్గించేసాడు.. ఛా..", అని
ఏడుపుమెహం పెట్టాను.
"రెండు శాతమే కదా.., డోంట్ వర్రీ..", అన్నాడు సునీల్..
"రెండుశాతమేనా!!, అంటే ఎంతో తెలుసా.. అని క్యాల్కులేటర్ ఉపయోగించి..
లెక్కకట్టి.. నెలకు వెయ్యినూటపదహార్లు.., అంటే నా గ్రోసరీ ఖర్చుల్లో
సగం, ఇదే మా ఊర్లో ఎవడిపెళ్ళికి చదివించినా బాగానే పెట్టాడ్రా అనేవారు..,
ఎలా వదులుకుంటాం.. నేనొప్పుకోను..", అని సీరియస్గా మొహం పెట్టాను..

"హుమ్మ్.. అడిగి చూడండి, మీవాడిని.. అడక్కపోతే ఎవరు ఇవ్వరు..
అల్ ద బెస్ట్", అని ఏదో పనుంది మళ్ళా కలుస్తా అని లాగవుట్ అయ్యాడు సునీల్.

ఈలోగా సత్తిగాడు.. ఆన్ లైన్లోకొచ్చాడు.., "వా... అని ఏడుపుమొహంపెట్టి..
ఇన్నాళ్ళు చేసిన వర్కంతా పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటే.. అది చెయ్యిజారి
బురదగుంటలో పడ్డట్టయిపోయిందిరా నా బతుకు.. ఛీ.." అన్నానేను.

"సరేలే.. ఇంతకూ కాయా పండా". అన్నాడు.. సత్తిగాడు.
"టెంకరా.., నేనిక్కడ ఏడుస్తుందెదుకురా.. " అన్నా సీరియస్ గా..

"హ..హా..అనుకున్నా ఈ మేనేజర్లంతా టెంకలే చూపిస్తారు అని..
ఇంతకూ ఎంత", అన్నాడు సత్తి. మొత్తం విషయం చెప్పాను.
"ఎనకటికెవడో పెళ్ళిభోజనం పీకల్దాకా తిని.. ఇచ్చిన ఖిల్లీ వేసుకుంటూ,
అసలు ఈ ఖిల్లీకి పుల్లెవడు గుచ్చమన్నాడు అని నానా రభస రభసచేసాడంట
అలా వుందిరా నీ పనీ.. రెండుశాతమే కదా తగ్గించింది.", అని వెటకారంగా
అన్నాడు సత్తి.

"ఇక్కడ పనిచెయ్యలేని పంకజానికి ఇరవైశాతం.. దున్నపోతు బాబిగాడికి
ఇరవైశాతం..., నిద్రమోహం నీరజకు ఇరవైశాతం ఇచ్చి, నాకెందుకురా
పదమూడుశాతం.. నేనకుంది పదిహేనే కదా.. అదన్నా ఇవ్వొద్దా.. ",
అన్నానేను ఏడుస్తా..

"నువ్వేచెప్తున్నావుగా వాళ్ళుపనిచేయరని.. అందుకే అంత తక్కువిచ్చారు",
అన్నాడు సత్తి..
"ఒరేయ్.. ఇరవైశాతం అంటే నాకన్నా ఎక్కువరా.. నేనొకటంటే.. నువ్వొకటంటున్నావ్..
సరిగ్గా వినపడటంలేదా,చెవిలో మౌసుగానీ పెట్టుకున్నావా ", అన్నానేను..

లేదు హెడ్ఫోన్స్.. ఈ రోజు వర్క్ లేదు.. అందుకే పాటలువింటున్నా",
అన్నాడు సత్తి.

"ఓహో.. మీకంపెనీలో పాటలైనా వినొచ్చు కదూ.. మాకు ఆ
దౌర్భాగ్యంకూడా ఇవ్వలేదు.. ఛీ నా బతుకు చెడా... పైకి చూసి
ఉమ్మోసుకుంటున్నా", అన్నానేను..

"మొహంపై పడుంటుంది, తుడుచుకో.." అన్నాడు..సత్తి నవ్వుతూ..
"లేదులే పక్క క్యూబికల్ లోకి పోయింది.. అక్కడొకడు ఈ టైములో
నిద్రపోతూవుంటాడు.. ఏంపడినా పట్టించుకోడులే..", అన్నానేను
నాలుక్కరుచుకుంటూ..

"ఒరే.. నువ్వు రెండుశాతానికే ఏడుస్తున్నావ్.. నీ సేలరీ నా సేలరీ
చూసుకుంటే.. చాలా తేడా వుందిరా.. నేనెవడితో చెప్పుకోనూ..
నేనెవడిపై ఉమ్మేయను..", అన్నాడు సత్తి.
"అసలే ఐదున్నరేళ్ళు డెస్క్ కిందకు వచ్చేసాయిరా.. నాదే తక్కువుంది
అనుకుంటుంటే.. నన్నే అడుగుతున్నావా", అన్నానేను.

"ఏమోరా.. నెలక్రితం ఇద్దరుజాయనయ్యారు.. అంతే అన్ సైట్ పోయారు",
అన్నాడు సత్తి..
"మరదే.. చెవిలో మౌసులుపెట్టుక్కుర్చుంటే.. ఊరికే.. ఎవడిస్తాడు ఆన్ సైట్.. ,
వర్కుచెయ్యాలిబాబు", అన్నావెటకారంగా..

"అంతలేదులే.. ఆన్ సైట్ నాకిష్టంలేదులే, అక్కడ ఎక్స్ట్రా డబ్బులేమి ఇవ్వడంట..
దానికోసం ఊపించుకుంటా.. అంతదూరం.. ఇక్కడందర్నీవదిలేసి ఏం వెళతాంలే
అని వద్దనుకున్నా, మంచి ఆఫర్ వస్తే చూడాలి..", అన్నాడు సత్తి..
"యా. యా.. నేనుఅంతే.. మొన్న మావాడు ఆఫర్ చేసాడు.. మా ఆవిడ నన్ను
తీసుకెళ్ళకుండా మీరు వెళితే.. నేను హిమాలయాలకు వెళ్ళిపోతా అని బెదిరించింది..
సరేలే ఇద్దరూ వెళ్ళేవీలున్నప్పుడు వెళ్దాంలే అని ఆఫర్ ని ఎడంకాలితో ఒక్కతన్ను
తన్ని వద్దన్నా", అని చెప్పాను నేను..

సత్తి:(నాకే ఛాన్సూ రాలేదు.. కవరింగులు చేస్తున్నానని వీడు బాగానే కనిపెట్టేసాడు ..
అందుకే రివర్స్ కౌంటరేస్తున్నాడు)
"ఒరే.. నేనూ నీ బడిలోనే చదివానురోయ్.. ఒకే ఇండస్ట్రీ కూడా.., టైపుచేస్తే చెప్పేయగలను
ఏ కంపెనీ కీబోర్డ్ తో టైపుచేసావో.. నాతో పెట్టుకుంటే.. మడతడిపోద్దీ.. చెవిలో తుప్పంతా
కిందడిపోద్దీ.. హోయ్.. " అని టైపుచేసి.. నేను లంచ్ కి వెళ్ళొస్తా అని అన్నానేను..
నవ్వుతూ..

"సరేలేరా.. మళ్ళీ కలుద్దాం", అని నవ్వాడు సత్తి..
start + L బటన్స్ నొక్కి సిస్టమ్ లాక్ చేసి, వీడుకాదు మనబాధలు చెప్పుకోటానికి రైట్ పెర్సన్..
వేరేవాడ్నిపట్టుకోవాలి..అనుకుంటూ.. కేంటిన్ వైపు బయలుదేరాను నేను.
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
1:50 AM
23
ఆభిప్రాయాలు
10, మే 2010, సోమవారం
సాక్షిపత్రికలో నా బ్లాగు
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
12:27 AM
12
ఆభిప్రాయాలు
27, ఏప్రిల్ 2010, మంగళవారం
క్లైంట్ కాల్...

టైము చూస్తే ఆరు అయిపోయింది.. ఇంకొక అరగంటలో క్లైంట్ కాల్..
ఏంచెయ్యాలో పెండింగ్ వర్క్ ఎలా కంప్లీట్ చెయ్యాలో తోచడంలేదు దిలీప్ కి.
"ఛ!, ఆ డేలైట్ సేవింగ్ కూడా ఇప్పుడే మారి తగలడాలా?, లేకపోతే
ఏడున్నరకైనా ఉండేది.. అనుకుంటూనే టెన్సన్ ని కంట్రోల్ చేసుకోటానికి..
డెస్క్ టాప్ పై నాలుగైదుసార్లు రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేసాడు.
సడెన్ గా డెస్క్ మీదవున్న ఫోన్ మోగింది.. డిస్ప్లేలో మేనేజరు రాకేష్
నెంబరు కనబడేసరికి చెమటలు పట్టేసాయి. ఓర్నాయినో వీడిప్పట్నుండే
తగులుకున్నాడేంటి.. స్టేటస్ అంటాడేమో చచ్చాం.. అనుకుంటూనే ఫోన్
తీసి.. "హా.. రాకేష్", అన్నాడు.. "ఏమైంది.. ఎంతవరకూ వచ్చింది
ఆర్ వి రడీ టు గో..", అన్నాడు రాకేష్...
"నో.., నాట్ ఎక్సాట్లీ.., ఇంకా అది పెండింగ్, ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్",
అంటూ రాసిపెట్టుకున్న చిట్టాచదివేసాడు.
"ఓ.. వాట్.. ఇంకా అరగంటకూడాలేదు.., ఇన్ని పెండింగ్ ఐటమ్సా?,
ఇంకొక అప్ డేట్.. ఐయామ్ గోయింగ్ టూ డ్రైవ్ ద కాల్.. అక్కడ
మేనేజర్ లెవల్ అంతా జాయిన్ అవుతున్నారని ఇప్పుడే మెయిల్ వచ్చింది..
అయినా ఇవన్నీ చెయ్యటానికి ఎందుకింత టైమ్.. ఎవరినన్నా ఇన్వాల్వ్
చెయ్యాలికదా!, సరే.. త్వరగాకానియ్", అని ఫోన్ పెట్టేసాడు మేనేజర్
చిరాగ్గా.
బాగా అయ్యింది.. , కాల్ నువ్వు డ్రైవ్ చేస్తే ఇక నాకేంటి టెన్సన్,
నేను చక్కగా నీ పక్కనే కూర్చుని నిద్రపోతా.. అందుకేనా అంతలా
సౌండువచ్చేలా చెమటలు తుడుచుకున్నావ్..
హి హి హీ.. అని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు దిలీప్.
అప్పటి దాకా టెన్సన్ తో తాగిన మంచినీళ్ళు, మెషిన్ టీ కడుపులో
సుడిగుండంలా తిరుగుతూ కలిసిపోయి.. టెన్సన్ ఒక్కసారిగా తగ్గిపోవటంతో
గడబిడైపోయి కడుపులో తేడా మెదలయ్యింది దిలీప్ కి.
హమ్మో ఇప్పుడిదేంటిరా బాబు.. అసలే రెస్ట్ రూమ్ కి వెళ్ళేందుకు
ఐదునిమిషాలు కూడా టైము లేదు.., అని ఓర్చుకోటానికి ట్రైచేసాడు
కానీ వల్లకాలేదు. ఇక రెస్ట్ రూమ్ కి వెళ్ళకతప్పదు అనుకుంటూనే..
నడకపందాల్లో ఆటగాడు నడిచినట్టు అటు పరుగుకాదు.. నడకకాదు
అన్నట్టుగా రెస్ట్ రూమ్ వైపు పరుగుతీసాడు దిలీప్.
రెస్ట్ రూమ్ డోర్ దగ్గర నిలబడివున్న భారీకాయాన్ని చూసి.. అరే భలేవుంది..
కొత్తగా ఏనుగునెప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారబ్బా.. అరే.. సూటేసారు..
టైకూడా కట్టారు.. అని ఆశ్చర్యపోతూనే పరికించి చూడగా అది ఏనుగుకాదు
మేనేజర్ రాకేష్ అని తెలిసి అతని వంక చూసి పిచ్చినవ్వునవ్వాడు దిలీప్.
"ఏంటి ఎక్కడికి.. టైమైంది కాల్ స్టార్ట్ చెద్దాం పద.. తరువాత చూస్కోవచ్చు
ఇవన్నీ", అని వెనక్కు లాక్కుపోయాడు దిలీప్ ని రాకేష్.
"ఇదెక్కడి గోలరా బాబు.. తరువాత చూస్కోటానికి ఇదేమన్నా వీడు ఎసైన్
చేసిన టాస్కా?, నచ్చినప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రస్ అని చేసి, నచ్చనప్పుడు పెండింగ్
అని పెట్టేయటానికి?, ఛీ!! ఎదవబతుకు.. పగవాడిక్కూడా రాకుడదు ఈ కష్టాలు...,
రా అంటూ ప్రకృతి పిలిచినా వెల్లనివ్వటంలేదు ఈ జనాలు..", అని మనసులో
తిట్టుకుంటూ కష్టపడుతూనే లండన్లోకి (మీటింగ్ రూమ్ పేరు) వెళ్ళి తొంగి చూసాడు..
అక్కడ అప్పటికే తిష్టవేసి క్లైంట్ కాల్లో మాట్లాడుతున్నారు వేరేటీమ్ వాళ్ళు.
అందులో ఒకడు ఎవడ్రానువ్వు తొంగి చూస్తున్నావ్ అన్నట్లు దిలీప్ వంక
చూసినవాడికి.., ఎంత టైము పడుతుంది అన్నట్టు.. వాచ్ చూపించి
సైగచేసాడు దిలీప్.. ఇది బుక్ చేసేసాం అన్నట్టు కత్తెర సింబల్లా చేతివేళ్ళు
చూపించాడు లోపలున్నవాడు.
"బుక్డ్ అంట..", అని పాలిపోయిన మొహాన్ని రాకేష్ కి చూపించాడు దిలీప్.
"ఏంటి దిలీప్.!!, మీటింగ్ రూమ్ బుక్ చెయ్యలేదా? అని గట్టిగా కసిరాడు",
రాకేష్..
"సారీ నువ్వు చేసావేమో అని అనుకున్నా", అని బిక్కమొహంవేసాడు దిలీప్.
"సరే బోస్టన్, టోక్యో కాళీ ఉన్నాయేమో చూద్దాం పద.. లేకపోతె న్యూ ఢిల్లీనే
గతి.. ప్రొజెక్టర్ ఉండదు.. ఫోనూ సరిగా వినపడదు.. పద.. పద", అంటూ
కంగారు పెట్టేసాడు.
ఆఖరికి సిడ్నీలో దుకాణంపెట్టి కాల్ స్టార్ట్ చేసారు.. అయ్ బాబోయ్..
పదినిముషాలు లేటు మనం అనుకుంటూనే రాకేష్ నెంబర్ డయల్ చేసాడు.
" వెల్కమ్ టు కాన్ఫరెన్స్", అన్నతరువాత.. "ఏక్సస్ కోడ్ డయలు చేసి
రాకేష్ అండ్ టీమ్, ఇండియా ఆఫ్ షోర్..", అని పేరు చెప్పి.. టెన్సన్ గా
వెయిట్ చేసాడు..
"యు ఆర్ ద ఫస్ట్ కాలర్ ఇన్ ద కాన్ఫరెన్స్.. ప్లీజ్ వెయిట్", అనగానే..
ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు..
"రాకేష్ నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేస్తా", అని కుర్చీలోంచిలేవబోయిన
దిలీప్ ని.."అరరే.. ఉండు.. వాళ్ళు జాయిన్ అయిపోతారు..
రెస్ట్ రూమ్ ఎక్కడుంది.!! అంతదూరం నడిచి నువ్వు వచ్చేసరికి పావుగంట
అవుతుంది..", అని కంగారుపెట్టి కూర్చోబెట్టేసాడు..
ఇంతలోనే. "జాయినింగ్ కాన్ఫరెన్స్ ... సెబాష్టియన్ డెర్క్స్", అని వినపడేసరికి.
"హాయ్.. గుడ్ మార్నింగ్ సెబాష్టియన్.. దిసీజ్ రాకేష్.. హౌ ఆర్ యు?",
అన్నాడు రాకేష్..
"డుయింగ్ గుడ్.." అంటూ, ఇక్కడ క్లైమేట్ ఇలావుంది.. మొన్న వర్షం
పడింది.. అంటూ సెబాష్టియన్ సోది మొదలుపెట్టాడు. "జిహాంగ్ నీడ్ టు జాయిన్
వి విల్ వెయిట్ ఫర్ హిమ్..", అన్నాడు సెబాష్టియన్.
ఈ కొరియావాడు ఇంకా రాలేదేంటి... నాకిక్కడ గట్టుతెగిపోయేలా వుంది
త్వరగా రారా నాయనా అనుకుంటూ ఇబ్బందిపడిపోతూ నెమ్మదిగా
కదులుతూ సర్దుకుని కూర్చున్నాడు దిలీప్.
డబ్బులు ఇస్తున్నారుగా పోనీపాపం వీడిని ఎంటర్టైన్ చేద్దాం అన్నట్టు..
మీ ఫ్యామిలీ ఎక్కడా.. ఓ జర్మనీ ఎన్నిరోజులకొకసారి వెళుతుంటావ్..
నేను వెళదాం అనుకుంటున్నా లాంటి వెధవ సోదంతా సెబాష్టియన్ తో
మాట్లాడటం మొదలుపెట్టాడు రాకేష్..
హమ్మయ్యా ఇదే మంచి సమయం అనుకుని.. నేను వెళ్ళొస్తా అని
సైగ చేసాడు దిలీప్ రాకేష్ కి.
మాట్లాడుతున్నవాడు, జస్ట్ ఏ సెకండ్.. అని ఆపేసి ఫొన్ మ్యూట్
బటన్ నొక్కి, లేదు వచ్చేస్తాడు ఆగు అని మళ్ళా మాట్లాడటం
మొదలుపెట్టాడు.
"హే సెబాష్టియన్, జిహాంగ్ ఈజ్ నాట్ యట్.. ఈజ్ ధేర్ ఎనీ ప్రాబ్బ్లమ్ ఇన్
జాయినింగ్ కాన్ఫరెన్స్..? అని అడిగాడు రాకేష్.. ,
"నో.. హి వెంట్ టు రెస్ట్ రూమ్", అన్నాడు సెబాష్టియన్ మళ్ళా మ్యూట్ నొక్కేసి..
"హ హా.. అయితే వాడిక్కూడా నీలాగే ప్రాబ్లమ్ అక్కడ వుందన్నమాట..",
అని పిచ్చి నవ్వునవ్వాడు రాకేష్ దిలీప్ వంక చూసి..
దిలీప్ కి మండిపోయింది... నామీద నువ్వుజోకులు వేస్తావురా అని
కట్టలు తెంచుకుని వస్తున్న ఆవేశం ఏ గట్లు తెంచేస్తుందోనని ఆపేసుకున్నాడు.
ఇరవైనిముషాలు గడిచాయి, "హే సారీ ఫర్ దలేట్..", అంటూ జాయిన్ అయ్యాడు
జిహాంగ్.. ఈ కొరియావాడికి రాత్రితిన్నకోతి మంచూరియా, కుక్క చౌమిన్
అరగలేనట్టుంది.. ఇరవైనిముషాలు నన్నిక్కడ ముళ్ళపై కూర్చోబెట్టి ఒక
చిన్న సారీ చెబుతాడా.. అని మనసులో అనుకుంటూనే..
"హాయ్", అంటూ పలకరించాడు.
రాకేష్ ఎంజెండా ప్రకారం ఒకొక్క అయిటమ్ మొదలుపెట్టాడు... ఒకటి అయిపోయి
వేరేదాంట్లోకి వెళ్ళే టైములో కొరియావాడు.. ప్రశ్నలుమీద ప్రశ్నలు వేయటంమొదలుపెట్టేసరికి..
దిలీప్ కి బీ.పీ రేజెయ్యిపోయింది. నెనేమో ఇక్కడ తట్టుకోలేక చస్తుంటే..
వీడు చావు ప్రశ్నలేంట్రాబాబు.. అని తలపట్టుకున్నాడు.
మధ్య మధ్యలో సెబాష్టియన్.. "ఐ. డోంట్ నో.. ఐ డోంట్ నో" అంటూనే..
ఎదోకటి చెబుతున్నాడు.. "ఒరే.. నాకు తెలియదు అంటూనే ఎందుకురా
చెబుతావు.. ఈ తెల్లోల్లంతా ఇంతేనేమో..", అని.. గట్టిగా.. నోరునొక్కుకుని..
అరిచినంత పనిచేసాడు దిలీప్.
అలా ముందుగా షెడ్యూల్ చేసిన గంటకన్నా ఇంకొక గంట సాగదీస్తూనే
ఉన్నారు మీటింగ్ ని.. ఇకలాభంలేదు.. అనుకుని.. కాళ్ళదగ్గర ఫోన్ కి కనెక్ట్
అయిన కేబుల్ వైరుని షూకాలితో తన్నడం మెదలుపెట్టాడు.. వాయిస్ బ్రేక్ అవటం
మొదలుపెట్టడంతో రాకేష్.. చిరాగ్గా మొహంపెట్టి.. ఏమయిందో చూడు అన్నట్టు
సైగచేసాడు దిలీప్ కి.
హెల్ప్ డెస్క్ వాళ్ళను పిలుచుకొస్తా వుండు.. అని ఇదే అదనుగా అలా
రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేయొచ్చు అని దిలీప్.. లేచి డోర్ తియ్యబోయాడు..
అక్కర్లేదులే.. ఇప్పుడు బాగానే వుంది అని సైగచేసి కుర్చోబెట్టేసాడు రాకేష్.
"ఒరే.. పాపి.. సహజ ప్రక్రియలను ఆపుతున్న పాపం నీకు ఊరికినే పోదురా..
నీ సహజ ప్రక్రియలన్నీకృత్రిమ ప్రక్రియలైపోనూ..", అని మనసులోనే
బండబూతులు తిట్టుకున్నాడు దిలీప్
రెండుగంటలు దాటి అరగంటైపోయింది.. జరిగే డిస్కషన్స్ చూస్తుంటే
ఇప్పుడప్పుడే ఆగేలా కనబడటంలేదు.. నాతో అవసరంవుందా అంటే లేదు..
ఎందుకురా నన్నాపి పాపంమూటగట్టుకుంటావ్.. అని ఎడవలేక ఎడ్చాడు దిలీప్.
ఇక లాభంలేదు ఇలాఅయితే చాలా కష్టం అనుకుని..
షూలో ఎదో దురదపెడుతుంది అన్నట్లుగా వంగి షూతీసేసి కూర్చున్నాడు..
కాసేపు ఎమీతెలియనట్లు కూర్చుని కాలి వేళ్ళతో ఫోన్ వైరును పట్టుకుని,
సీరియస్ గా రాసేస్తున్నట్టుగా ఏక్ట్ చేసి.. ప్లగ్ లాగేసాడు. కాల్ డిస్కనెక్ట్
అయిపోయింది..
రాకేష్ అది గమనించకుండా... సెబాష్టియన్ అడిగిన ప్రశ్నకు ఎదో చెప్పుకుంటూ
పోతున్నాడు.. అలా ఒక నిమిషం చెప్పేసాకా..
"సెబాష్టియన్.. ఆర్ యు ధేర్..", అని ఆగిచూసేసరికి ఫోను ఉలుకూపలుకూ
లేకపోయేసరికి.. "హలో.., హలో...", "ఛ.. డిస్కనెక్ట్ అయిపోయింది..
కాల్ హెల్ప్ డెస్క్..", అంటూ దిలీప్ పై గట్టిగా అరిచి.. తలపట్టుకున్నాడు..
హమ్మయ్యా భలే చాన్సులే.. అనుకుంటూ రెస్ట్ రూమ్ వైపుకు
పరుగులు తీసాడు దిలీప్.
రచన ::
శ్రీనివాసరాజు
సమయం:
11:33 PM
17
ఆభిప్రాయాలు








