19, సెప్టెంబర్ 2010, ఆదివారం

బకాసురులు - 1

బురదలో పందిపిల్లలు ఒకదానిమీదొకటి పడి దొర్లినట్టుదొర్లుతూ.., పదిమంది కలిసి ఒకటే అగ్గిపెట్టంత హాస్టల్ గదిలోవుంటూ.., బాగా చదువుకుని కలెక్టర్లయ్యి తిరిగిరండిరా బాబూ.. అని వాళ్ళ బాబులు పంపించిన డబ్బులు.. తింటానికి.. తిరగటానికీ.. షకీలా సినిమాలు చూడటానికే సరిపోక, ఒక్క సిగరెట్టు కొని ఒకడు ఉఫ్ ఉఫ్ మని వూదుతుంటే.. ఆ వచ్చే పొగను సగం సగం షేర్ చేసుకుంటూ పీల్చుతూ. వైన్ షాపుకి ఎదురుగా.., నవరత్నా బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంటు మేడపైనున్నడిగ్రీ కాలేజిలో ఒక ఏడెనిమిదేళ్ళనుండీ.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు ఆ నలుగురు కుర్రాళ్ళు.

దూరదర్శన్ లో వార్తలు రావటానికి.. రెండు నిముషాలముందే వెనక్కు లెక్కపెడుతూ వేసే అంకెల్లాగా.. సెకన్లతో సహా వెనక్కు లెక్కపెడుతూ నాలుగు నిముషాలముందే వెంకటరమణ మెస్ దగ్గర.. దినం బోజనాల్లో మిగిలిపోయిన ఆకులు నాకడానికొచ్చిన కుక్కల్లాగా కాసుక్కుర్చున్నారు. "భోజనం తాయారు.." అని బోర్డు ఎప్పుడు పెడతారా.. (తాయారే... అచ్చుతప్పు కాదు.. అదా హోటల్లో వంటమనిషి పేరు.., బోర్డురాసినోడికి బాగా ఫేవరెట్టు.. అందుకే అలా అభిమానం చూపించుకున్నాడు..) వెళ్ళి దూకేసి ప్లేట్లతోపాటుమింగేద్దామా అని ఒకడి వెనకాలొకళ్ళు నిలబడి.. ఒకడి ప్యాంటు వెనుకజేబులో ఒకడు చేతులు పెట్టుకుని... చూస్తున్నారా కుర్రాళ్ళు. "ఒరే.. ఇంకా బోర్డుపెట్టలేదేంట్రా..., కొంపదీసి తాయారు ఈరోజు సెలవా",అన్నాడు బొండుభద్రంగాడు.


"ఆ సంగతి తరువాత గానీ.. వెనకజేబులోచెయ్యి పెట్టి పర్సుందని వెతుకుతున్నట్టున్నావు.., అసలు జేబేలేదక్కడ.. వున్నది ఈ-మెయిల్ ఇన్ బాక్స్ అన్నవిషయం.. నువ్వింకా కనిపెట్టలేకపోతున్నావు, అలాగే.. మోచేతిదాకా చెయ్యి కిందకు పెట్టి అక్కడ కాస్త గోకరా.., బాబ్బాబు దురదగా వుంది అన్నాడు నల్లశీనుగాడు, జేబులోచేయిపెట్టి వెతుకుతూ.. సి.బి.ఐ ఎంక్వైరీ చేస్తున్నట్టు మొహం పెట్టిన బొండు భద్రంగాడిని.

"ఒరే ఛీ ఎవడిపడితే వాడి ఇన్ బాక్సులో మెయిల్స్ చెక్ చేసేవాడిలాగా కనబడుతున్నానా?, ఛెస్.. ఎధవనా బతుకు, భోజనం అవగానే చెయ్యి డెట్టాల్ సబ్బుతో బాగా కడుక్కోవాలి.., గుప్తుల కాలంలో ఉతికి.. మళ్ళీ ఈ రోజే సర్ఫ్ లో నాన్చినాన్చి జాడించిన కుక్కలోడి షర్ట్ తో ప్రస్తుతానికి సరిపెట్టుకుంటా..", అని ఫ్యాంటుజేబులో చెయ్యితీసేసి ఎదురుగా నిలబడి.. తాయారు బోర్డుకోసమే కళ్ళార్పకుండా కళ్ళల్లో వందకేండిల్స్ బల్బువెలిగించుకుని చూస్తున్న కుక్కల సతీష్ గాడి షర్టుకు చేయితుడుచుకున్నాడు బొండు భద్రం. అలా.. ఒకడి సీక్రేటులు ఒకళ్ళు.. లంచం తీసుకుంటూ పట్టుబడిపోయిన ప్రభుత్వోదోగి కధనం.. మాదాంట్లోనే ఎక్ల్సూసివ్.. అని ఎర్రసర్కిల్ తో హైలేట్ చేసి.., వేసిందే వేసి.. చూపించే టీ.వీ చానల్ లాగా అందరికీ తెలిసిన విషయాలనే స్పెషల్ న్యూసులుగా మార్చి చెప్పేసుకుంటున్నారు.

"ఒరే!!.. ఆపండహే.. మీ ఎదవ గోలా... కడుపులో పందికొక్కులు.. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పేసి గొడవచేసేస్తుంటే... మీగోలేంటెహే..", అని చిరాకుపడుతూ.. బరాక్ ఒబామాలాగా జుట్టున్నా వారం క్రితమే గుండుచేయించుకున్నట్టుండే తలకాయను ఐదువేళ్ళతో బరాబరా గోక్కుంటా.. ఒక పావుకేజీ చుండ్రు రాల్చిన చుండ్రు రాము. అంతలోనే తాయారొచ్చి తయారు బోర్డుపెట్టేసింది.

ఫ్యాంట్లు జారిపోతున్నా పట్టించుకోకుండా.. పరుగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలు కాసేసుకున్నారు... తరువాత సర్వర్ పట్టుకొచ్చిన ఫ్యాంట్లను దులుపుకుంటూ ఒకరినొకరు చూడకుండా నలుగురూ నాలుగువైపులూ తిరిగి.. ఎవరూచూడటంలేదుకదా.. అని వేసుకుని కుర్చీల్లో కుర్చున్నారు. "ఒరే.. మన హోటల్ కి మరో కొత్తవోనర్ రా", అన్నాడు నల్లశీను. "అయితే కుమ్మేయొచ్చు ఈయాలకూడా", అన్నాడు కుక్కల సతీష్.. ఎప్పటిలాగే నాలుగు ఫుల్ మీల్స్ చెప్పి.. పది ఫుల్ మీల్స్ కి సరిపడా తినేసి.. అరగంటలోనే లోపలున్న తాయారుచేతే ఆరోజుకు బోర్డుతీయించేసారు.

వీళ్ళ నలుగురు దెబ్బకీ తట్టుకోలేక అదే మెస్సు.. సంవత్సరంలో అరడజను ఓనర్ల చేతులు మారింది. ఆ రోజు వీళ్ళ తిండి దెబ్బకు... ఆర్ధిక మాంద్యంలో గిలాగిలాకొట్టేసుకున్న క్రెడిట్ కార్డులమ్మేవాడిలాగా అయిపోయాడు కొత్తగా వచ్చిన మెస్ ఓనరు. రాత్రంతా బొండుభద్రంగాడు దేవతకు నైవేద్యం కోసం పెట్టే ముద్దంత ముద్దలు కలుపుకుని.. మురుక్కాల్వ తూమంతున్న నోట్లోకి తోసేసుకుంటూ.. తింటున్నట్టు.. కలల్లోకి వచ్చేసి నిద్రపట్టకుండా చేసేసాడు. "కాలుమీదకాలేసుకని కూర్చుని టీ.వీ చూస్తున్నవాళ్ళావిడకి.. గాజులేసుకుని.. టీ పట్టుకు వస్తే.., నచ్చలేదని ఆ వేడివేడి టీని.. ఆవిడ ఏంచేసిందో చిన్న బ్రేక్ తరువాత చూడండి", అని టీ.వీలో నూతన్ ప్రసాద్ వాయిస్ లో వస్తున్న ప్రోగ్రాములో తనని.. ఒక్కసారి ఊహించుకున్న మెస్ ఓనర్.. ఇకలాభంలేదని.. ఆ నలుగుర్నీ బయటకు తోలటానికి కొత్తకొత్త టెక్నిక్కులు ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఓ రోజు అన్నంలో మామూలు సున్నం కాకుండా.. నాటు సున్నం కలిపించేసాడు.., అసెంబ్లీలో ప్రతిపక్షంవాడు బండబూతులు తిడుతుంటే.. మైక్ వాయిస్ కట్ చేయించేసి తనకేమీ తెలియదన్నట్లుగా.. రాసుకొచ్చిన సోదిని చదివివినిపిస్తున్న అఖిలపక్షం మంత్రిలాగా.. ఏమీ ఎరగనట్టు భోజనం తినేసి.. తమలపాకూ.. వక్కా నోట్లోవేసుకుని.. నములుతూ.. నోరుతెరిచి చూపిస్తూ.. బయటకొచ్చాడు బొండుభద్రం.., ఎర్రగా పండిపోయున్న.. ఆ నోరును చూసి మూర్చరోగమొచ్చినట్లుగా గిలగిలా కొట్టేసుకున్నాడు మెస్ ఓనర్.

వేరే రోజు కూరల్లో బస్తాడు ఉప్పు, అరబస్తా తినే షోడా కలిపించేసాడు.. అన్ని కూరలూ ఒక పెద్దగిన్నెలో వేసేసుకుని.. గిన్నెనిండా నీళ్ళు కలిపేసుకుని.. ఆవురావురుమంటా తినేసారు. ఆ నలుగురూ.. (రాజేంద్రప్రసాద్ సినిమా కాదు)

ఇక నావల్లకాదని.., "ఈవిడవేరే ఆవిడని.. ప్రేక్షకులకు తెలిసిపోయినా పర్వాలేదు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు స్టోరీ మార్చేసైనా కేరెక్టర్ని మార్చేయ్యాలి..", అని టీ.వీ సీరియల్ వాళ్ళు గట్టినిర్ణయం తీసుకున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుని.. తరువాతరోజు సాంబారులో స్పెషల్ గా ఎండుమిర్చిబదులు బొద్దింకలు వేయించి తాలింపుపెట్టించాడు.. బొద్దింకలుమట్టుకే పక్కకు తీసేసి.. సాంబారు జుర్రేసిన కుర్రోళ్ళు.., "సాంబార్ సూపర్ అంకుల్..", రేపూ ఇలానే చేయించండి అని ఓనర్ దగ్గరకు లొట్టలేస్తా వచ్చాడు నల్లశీను. ఆ భయంకరమైన దృశ్యాలు చూసిన ఓనర్.., భయబ్రాంతులతో.. మెంతులు తిని.. వాంతులుచేసుకుని.. హాస్పిటల్లో జాయినయ్యి.. పిచ్చోడయిపోయి రోడ్డుమీద పడ్డాడు.

కాలగడిచింది.. కట్ చేస్తే... అది రాయలసీమలో ఒక ఏరియా... మళ్ళీ కట్ చేసి హెలీకాప్టర్లోంచి కెమేరా జూమ్ చేస్తే... పాములా వంకరలు తిరిగిన మట్టి రోడ్డు.. చిన్నచిన్న చీమలు ఎర్రమట్టినేలలో రన్నింగ్ రేస్ పెట్టుకుని.. దుమ్ములేపుకుంటా వస్తున్నట్టు హెలీకాప్టర్లోంచి కనిపిస్తున్న.. నాలుగు నల్ల ఇన్నోవాలు ఒక తెల్ల స్కార్పియోని ఫాలో అవుతున్నాయి. దానివెనకే.. మూడు తెల్ల టవేరాలు.. ఒక నల్ల సఫారీనీ వెంటాడుకుంటూ వస్తున్నాయి.., దానివెనకాల.. నాలుగు నల్ల మహీంద్రా గ్జయిలోలని.. ఒక తెల్ల హోండా సి.ఆర్.వి ని వెంటపడుతున్నాయి.

దానివెనకే.. నాలుగు ఎర్రలారీలు.. నాలుగు తెల్లలారీలు.. నాలుగు పచ్చలారీలనిండా కత్తులూ.. కటార్లూ.. పట్టుకుని, బఠాణీలు బొంబాయిశెనగలు తింటూవున్న జనాలనేసుకుని.. స్పీడు స్పీడుగా వచ్చేస్తున్నాయి. మధ్యమధ్యలో ధనేల్ ధనేల్ మని బాంబులు.. (లారీల్లో జనాలమధ్యకాదు.. బయట నిజం బాంబులు..) కెమేరా ఇంకా జూమ్ చేస్తే... నల్ల ఇన్నోవాలో కిటికీదగ్గర.. సగం కిందకు దించిన నల్లమిర్రర్ దగ్గర ఎవడో నల్లగావున్నాడు.. కెమేరా కాస్త బ్లర్ ఎడ్జస్ట్ చేసి చూపిస్తే.. వాడే మన నల్లశీనుగాడు.., కెమేరా ఇంకాస్త జూమ్ చేస్తే.. వాడిచేతిలో రాజమౌళిసినిమాలోలాగా.. సినిమాకో రకమైన షేపులో.. వెరైటిగావుండే కత్తిలాంటి.. కొడవలిలాంటి..సుత్తిలాంటి నల్లటి గొడ్డలి. ఇంకా జూమ్ చేస్తే.. నల్లమల అడవిలాగా వాడి చేతిమీదున్నవెంట్రుకలు.. మొత్తం తెరంతా చీకటితో నల్లగా అయిపోయింది... ఇంకా జూమ్ చేస్తే.. ఇంకా నల్లని నలుపు.. ఇంకా ఇంకా ఇంకా జూమ్ చేసిచూస్తే..?, చాలు చాలు.. ఇంకెక్కడికి చేస్తాం.. ఈ కెమేరాలోవున్న జూమింతే...

ఆగండి సార్.. ఆగండి.. ఆగండి.. ఆగగండి....గగం...డిడి. (ఎకో ఎఫెక్టు..)

మీరు మరీనండీ.. ఏదేదో ఊహీంచేసుకుంటున్నారు.. ఏదో చిన్న బడ్జెట్లో కధచెబుదామంటే.. మరీ. ఇంత భారీ క్లైమాక్సా..., కనీసం నాబ్లాగు కుడివైపుకిందనున్న ఏడ్ పైకూడా క్లిక్కుచేయరు మీరు.. అంత పెద్ద బడ్జెట్లో కధ ఎక్కడనుండి రాస్తాం చెప్పండి బాబూ... అందుకే చిన్న బడ్జెట్లోనే కొనసాగిద్దాం.. :-)

కాలం గడిచింది.. ఆ నలుగురు కుర్రాళ్ళకి.. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి.

గిర్ర్ ర్ ర్ మని మ్రోగింది గంట.. (కధలో కాదు బయట)

ఇంటర్వెల్..

బయటకు వెళ్ళి అన్ లిమిటెడ్ గా.. సమోసాలు.. జంతికలూ.. ఏమన్నా దొరుకుతాయోమో తినేసిరండి..

మిగతా కధ తరువాత చెప్పుకుందాం.. :-)

9 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

ఫస్టు కామెంటు నాదేనోచ్!...రాజు గారూ! నేను సమోసాలు తెచ్చుకు తింటూ కూచున్నా...మీరు మిగతా ఆట మొదలెట్టెయ్యాలి మరి!

..nagarjuna.. చెప్పారు...

య్యెవ్....ఇంకెంతసేపయ్యా ఇంటర్వెల్లు. ఎంత లోబడ్జెట్ సినిమా ఐతే, మరీ ఇంత హై-డిలే ఇంటర్వెల్లా. ఈడ మా తిండి తట్టుకోలేక థియేటర్ ఓనరు ఆ మెస్సు ఓనర్లా పిచ్చోడైపోతాండ్లా...

Sravya V చెప్పారు...

బాగుందండి ! మీ బడ్జెట్ పెంచటానికి నా వంతు గా ఆ ఏడ్ పైన ఒక పది క్లిక్కు కిక్కాను :)
అల్లాగే ఇక్కడ కొంచెం కంటిన్యుటీ మిస్సందేమో ఒకసారి చూడండి
[ఫ్యాంట్లు జారిపోతున్నా పట్టించుకోకుండా.. పరుగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలు కాసేసుకున్నారు... తరువాత సర్వర్ పట్టుకొచ్చిన ఫ్యాంట్లను దులుపుకుంటూ ఒకరినొకరు చూడకుండా నలుగురూ నాలుగువైపులూ తిరిగి]
[కాలుమీదకాలేసుకని కూర్చుని టీ.వీ చూస్తున్నవాళ్ళావిడకి.. గాజులేసుకుని.. టీ పట్టుకు వస్తే.., నచ్చలేదని ఆ వేడివేడి టీని.. ఆవిడ ఏంచేసిందో చిన్న బ్రేక్ తరువాత చూడండి", అని టీ.వీలో నూతన్ ప్రసాద్ వాయిస్ లో వస్తున్న ప్రోగ్రాములో తనని.. ఒక్కసారి ఊహించుకున్న మెస్ ఓనర్..]

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుంది.రాయలసీమ ఎపిసోడ్ మొత్తాన్ని సినిమా లెవల్లో ఉహిన్చుకున్తూ నాలుగైదు సార్లు చదివుంటానండి .సమొసాలన్నీ అయిపోయాయి తొందరగా............

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు
సమోసాలు కానియ్యండి.. రీలు తెగిపోయిందంట.. చుడుతున్నారు.. అయిపోద్ది.. కాసేపుండండి.. :-)

@నాగార్జున గారు..
ఏందయ్యో.. నాగార్జునా.. కాసేపు ఆగొయ్యో.. బాబూ అతన్ని జర పట్టుకోరాదే.. పోయి.. తెరచించేసి తినేసేలాగున్నాడె.. :-)

@శ్రావ్యా వట్టికూటి గారు
క్లిక్కులు క్లిక్కు క్లిక్కుమనిపించారా.. సంతోషం. ((పైనున్న)నాగార్జున సినిమా కాదు)

కంటిన్యుటీ మిస్సయ్యిందంటారా?? ఓహో.. అలాగా.. ఐ.సి. (కంటిన్యుటీ అంటే ఏంటో మనకు తెలియదని ఆవిడకి తెలియదుగా.. హి హి..).

అంటే మీకర్ధంకాలేదా.. లేక కాస్త సాగదీసినట్టున్నాయా.. నేనిప్పుడు చదివినా నాకు అర్దమవుతున్నాయే.. నారైటింగేకదా.. అందుకేనేమోమరి. వీలుంటే అదేదో వివరంగా రాద్దురూ.. :-)

@రాధిక(నాని) గారు
నచ్చినందుకు సంతోషం.
అలావెళ్ళి పాప్ కార్న్ కూడా కానిచ్చేయండి అన్ లిమిటెడ్ గా.. :-)

Sravya V చెప్పారు...

ఫ్యాంట్లు జారిపోతున్నా పట్టించుకోకుండా.. పరుగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలు కాసేసుకున్నారు... తరువాత సర్వర్ పట్టుకొచ్చిన ఫ్యాంట్లను దులుపుకుంటూ
---
సర్వర్ ఫ్యాంట్లు పట్టుకు రావటమేమిటి అని అర్ధం కాలేదు, ఓహో నిజం గా పడి పొతే సర్వర్ తెచ్చాడా ఒకే ఒకే అర్ధమైంది ఇప్పుడు :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@శ్రావ్యా గారు
:) అర్ధంచేసుకుని చదివినందుకు ధన్యవాదములు

swathi చెప్పారు...

చాలా బాగుంది.

శ్రీనివాసరాజు చెప్పారు...

@స్వాతిగారు
కధ నచ్చినందుకు.. కామెంటిచ్చినందుకు ధన్యవాదములు. వీలుంటే రొండో పార్ట్ చదివి మీ అభిప్రాయం చెప్పండి.

Related Posts Plugin for WordPress, Blogger...